"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., Ph.D., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL 801 Research Methodology ఉదయం11.00 నుండి12.00 గంటల వరకు, TL-426: Indian Literature క్లాసులు మధ్యాహ్నం 2.00 గంటల నుండి 3.00 గంటల వరకు జరుగుతాయి.

అభిప్రాయాలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
అభిప్రాయాలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

10 మార్చి, 2025

అర్థ శతాబ్దపు ఆంధ్ర కవిత్వం' గ్రంథంపై ఆచార్య దార్ల ప్రసంగం

 

సామాజిక వాస్తవికతవైపే 

ఆధునిక తెలుగు సాహిత్య పయనం

జనం ప్రతిధ్వని దినపత్రిక, 10.3.2025 సౌజన్యంతో 

తెలుగు లోకం దినపత్రిక, 10.3.2025 సౌజన్యంతో 









నవతెలంగాణ దినపత్రిక, 10.3.2025 సౌజన్యంతో 



అర్థ శతాబ్దపు ఆంధ్ర కవిత్వం ప్రగతిశీల మార్గంలో నడిచిందని, 1910 నుండి 1960 వరకు మధ్యలో కొంతమంది కవులు సంప్రదాయ పద్యకవిత్వాన్ని అనుసరించినా గురజాడ, కృష్ణశాస్త్రి, కాళోజీ, దాశరథి, శ్రీశ్రీ వంటి వారంతా సామాజిక వాస్తవికతను ప్రతిబింబించే రచనలే చేశారని శ్రీపాద గోపాలకృష్ణమూర్తి తన గ్రంథంలో వివరించారని హెచ్ సి యు తెలుగు శాఖ పూర్వ అధ్యక్షులు ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. ఆంధ్ర ప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం వారు అంతర్జాలం ద్వారా ఆదివారం నాడు ఏర్పాటు చేసిన సమావేశంలో ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు ప్రత్యేక ప్రసంగం చేశారు. ఈ సమావేశానికి అరసం రాష్ట్ర అధ్యక్షులు ఆచార్య రాచపాళెం చంద్రశేఖర రెడ్డి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అరసం నిర్వహిస్తున్న ప్రసంగాల్లో భాగంగా డాక్టర్ శ్రీపాద కృష్ణమూర్తిగారి అర్థ శతాబ్దపు ఆంధ్ర కవిత్వంపై ఈ ప్రసంగాన్ని ఏర్పాటు చేశామని, మా తరువాతి తరంలో ఆచార్య దార్ల ప్రముఖ విమర్శకులనీ, విస్తృతమైన అధ్యయనం చేసే సాహితీవేత్త అనీ, ఆయన తెలుగు సాహిత్య విమర్శకులలో శ్రీపాద కృష్ణమూర్తి విమర్శగురించి మాట్లాడతారని అన్నారు. ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ తెలుగులో భారతీయ ఆలంకారిక సిద్ధాంతాలు, సాహిత్య విమర్శ సూత్రాలతో తన రచన కొనసాగుతుందని, లండన్లో చదివారనీ, ఫిజిక్స్ లో డాక్టరేట్ సాధించారనీ, ఆయన లోతైన సాహిత్య విమర్శను చేశారని, ఆధారం లేకుండా ఏ ప్రకటననూ చేయరని ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు సోదాహరణంగా వివరించారు. తెలుగులో ఆధునికతా, నవ్య కవిత్వం అనేది ఒక్కసారిగా, ఒక వ్యక్తి పరంగా రాలేదని, భారత జాతీయ ఉద్యమం సంస్కరణ ఉద్యమం వంటి వాటి ప్రభావాలు భారతీయ దేశంలో ఆధునికతకు కారణమయ్యాయని, అదే తెలుగు సాహిత్యంలో కూడా ప్రతిబింబించిందని శ్రీపాద కృష్ణమూర్తి తన గ్రంథంలో నిరూపించారని ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు విశ్లేషించారు. అనేకమంది ఈ సమావేశంలో అరసం రాష్ట్ర సభ్యులు ఆనంద్, డా. శివప్రసాద్, రచయితలు, రచయిత్రులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. 






14 నవంబర్, 2024

పద్యపారిజాతాలు పరిమళింప చేసిన పూలతోట ‘దార్లమాట’

 పద్యపారిజాతాలు

 పరిమళింప చేసిన పూలతోట ‘దార్లమాట’

డా. పి. విజయకుమార్

వైస్ ప్రిన్సిపాల్ & తెలుగుశాఖాధ్యక్షులు ఎస్.ఎమ్.ఎల్. ప్రభుత్వ కళాశాల ఎమ్మిగనూరు, కర్నూలు జిల్లా.


పద్యవిద్యను సుజన హృద్యంబుగా చేయడానికి మాటలను పూలతోటగా మలచిన పద్యతోటమాలి దార్ల వెంకటేశ్వరరావు, శతకసాహిత్యవికాసంలో భాగంగా కొత్త దారిలో వెళ్లి పద్యపూలతోట పూయించిన శతకకారుడు దార్ల. 'దార్లమాట' శతకం ఆధునిక యువకవులకు పద్యం పట్ల అభిమానాన్ని పెంచిందనవచ్చు. పద్యం ఎంత హృద్యంగా చెప్పవచ్చో, ఆధునిక వ్యవహారంలో మనస్సుకు హత్తుకునేటట్లు ఎలా రాయవచ్చో 'దార్లమాట' శతకం ఒక మార్గదర్శిగా భావించవచ్చు. ఈ పద్యాలను పరిశీలిస్తే నవతరానికి పద్యం పట్ల ప్రోత్సాహాన్ని పెంచే విధంగా ఉన్నాయి. నిష్కల్మషంగా, ముక్కుసూటిగా, హుందాగా ప్రవర్తించే దార్ల వ్యక్తిత్వం ప్రతి పద్యంలో పరిమళించింది. శక్తి, ముక్తి కలగడానికి శతకం ఒకటే చాలు అంటూ 'శతక' సాహిత్యవిశిష్టతను తెలియజేసిన విశిష్ఠుడు దార్ల,

‘’త్రాగి కారు నడుప తప్పయినప్పుడు 

ఓటు వేయునపుడు నోటు నిచ్చి 

తనకు వేయుమనుట తప్పుకాదందురా 

దార్ల పూలతోట దార్ల మాట’’

మద్యం తాగి కారు నడిపితే తనకే కాక ఇతర ప్రయాణికులకు పెనుప్రమాదం కల్గుతుంది. ప్రజాస్వామ్య పతాక ఓటును నోటుతో కొని తనకే ఓటు వేయమనడం తప్పుకాదా! అని ప్రశ్నిస్తూ హెచ్చరించడం పై పద్యంలో ప్రతిధ్వనించింది. సామాజిక కర్తవ్యబోధ ప్రధానంగా దార్ల ప్రతి పల్కులో ప్రస్ఫుటమవుతుంది.

అమ్మ యనెడు మాట అమృతంబు కురిపించు

అయ్య యనెడు మాట హాయి నిచ్చు 

మమ్మి డాడి యనెడు మాటలింకేరా 

దారిపూలతోట దార్లమాట

మాతృభాషను మాతృమూర్తి కంటె అమితంగా ప్రేమించే అమృతమూర్తి దార్ల, వేణియనాద వినోదంలా వీనులవిందైన అమృతభాష మన మాతృభాష, కాని నేడు అమృతవాక్కులైన, ఆత్మీయ వారధులైన అమ్మ, అయ్యలను వదలి మమ్మి, డాడీల సంస్కృతి పట్ల ఆవేదన వ్యక్తం చేయడం కనిపిస్తుంది.తి నకలిగిన నాడు తిండిదొరకని పరిస్థితి, తినడానికి ఉన్ననాడు తినలేని అనారోగ్యస్థితి. శివుడు బిచ్చమెత్తి ఆనాడే తిండి విలువ చెప్పాడంటాడు. పుణ్యఫలాలనిచ్చే పుణ్యభూమి రాయలసీమ అని, ఆ నేలలోనే తిరుమలలో శ్రీనివాసుడు, కాణిపాకంలో గణపతి సిరులు కురిపిస్తున్నారని నేలమహిమను కొనియాడాడు. లేపాక్షి బసవన్న లేచివచ్చునేమో అన్న విధంగా తరచిచూస్తే లేపాక్షిలో అద్భుతాలు కనిపిస్తాయి. లేపాక్షిలో వ్రేలాడే 'శిల' లాంటి అద్భుతాలను గూర్చి వ్యక్తం చేశాడు. రాయలసీమ కేవలం కరువునేల కాదు కళలకు పుట్టినిల్లంటాడు. బంగారు, వజ్రాలకు నెలవైన వనరులున్న ప్రాంతంగా అభివర్ణించాడు. ప్రత్యేకంగా చెప్పుకునే 'రాగి సంకటి' రుచి రాయలసీమదే అని గుర్తు చేస్తాడు. రాయలసీమ రాళ్ళసీమకాదు. రతనాలసీమ అని, తత్త్వజ్ఞాని ఊటలూరు పోతులూరి, రాజ్యమేలిన రాయలు, రాయలసీమ వారే అని రాయలసీమరాజసాన్ని వ్యక్తం చేశాడు.

సమకాలీన విషయాలను పద్యంలో అక్షరబద్ధం చేయగల నేర్పరి, కూర్పరి దార్ల, గుప్తనిధులు, ఘనులను గుర్తించగలిగినది గూగులమ్మ మాత్రమేనని ఇలాంటి పెద్ద మనుషులు మనసువిప్పి నిజం చెప్పరని, గూగుల్ని నిజం చెప్పే తల్లిగా గూగులమ్మగా పరిగణించి వాస్తవిక కోణాన్ని ఆవిష్కరించారు. ఈనాడు ప్రజలు వయసు పెరిగేకొద్ది అనారోగ్యం పాలవుతున్నారని, నిద్రలేచిన దగ్గర నుండి నిద్రపోయేంత వరకు మాత్రలు మింగుతూనే ఉంటున్నారని, మాత్రలతోనే బొజ్జనిండుతుందని వ్యంగ్య ధోరణిలో ప్రస్తుత జీవన స్థితిగతులను వ్యక్తం చేశారు. అవసానదశలో వరాలు వద్దు షుగర్ మానితే చాలు అని ప్రాధేయపడుతుంటారని, మనలను చంపేసఖి 'మధుమోహనాంగిరా' అని వ్యంగ్యంగా షుగర్ వ్యాధితో ఇబ్బంది పడుతున్న వైనాన్ని ఏకరవు పెట్టాడు. ‘మృత్యువు' అంటేనే మనిషి అనునిత్యం భయపడతాడని మనిషి ఏనాడైనా మరణించక తప్పదు కాని ముందే మనిషి ఏనాడైనా చనిపోతానని తెలిస్తే ముందుగానే నరకాన్ని అనుభవిస్తారంటాడు. మనిషికి 'కరుణ' సహజలక్షణంగా ఉండాలి. కాని, కార్పోరేట్'లో 'కరుణ' అనే మాట తరచిచూసిన కనపడదని వాపోతాడు.

ఇంటివద్ద చూడు ఇల్లాలి ముచ్చట్లు 

ఇంటిచుట్టు కట్టు ఇంకు గుంత 

ఇంటి పొదుపు తెలుపు ఇంకుడు గుంతలే 

దారి పూలతోట దార్ల మాట

ఇంకుడు గుంతల విశిష్టతను చాకచక్యంగా తేటతెల్లం చేశాడు, రాయలసీమ నీకు నీళ్ల విలువ తెలుపుతుంది.

కోనసీమ నీకు కోరినంత ఇస్తుంది. "తెచ్చిపంచునెపుడదే భాగ్యనగరము" అంటాడు.

"విత్తనమును బట్టి వికసించు బుద్ధులు 

మట్టి యొక్కటైన మానువేరు 

మనుషులంత యొకటి మర్మంబువేరయా

దారి పూలతోట దార్ల మాట"

 అంటాడు. మనుషుల్లోని మర్మం గురించి సూటిగానే ఆవిష్కరించిన తత్త్వం దార్ల వేంకటేశ్వరరావుది, మనకు తెలియకుండానే మన పేరు ప్రచురిస్తున్న వైనం సమాజంలో కనిపిస్తుంది. ఆ వివరాలను పరిశీలిస్తే విస్తుపోయే పరిస్థితి ఉందని వాపోతారు.

కులము, మతములన్ని కుత్సితబుద్ధులు

 కలపవలయుగాని కలహమేల 

మంచికన్న మించు మానవత్వము లేదు

దారి పూలతోట దార్ల 

మంచి గంధంలాగే పరిమళించే మానవత్వం దార్ల వెంకటేశ్వరరావుకి సహజ అలంకారం, కులం, మతం పేరుతో కుత్సితబుద్ధుల్లాగా కొందరు వ్యవహరిస్తున్నారని, నిత్యం కలహాలతో విభేదించుకుంటున్నారని 'మంచి' కంటే మించిన మానవత్వమే లేదంటారు. మతం అంటే హితం, మంచి అనే భావన వెలిబుచ్చారు.కలిమిలేములన్ని కష్టసుఖాల్లాంటివని, కుటుంబాలలో రక్తబంధానికి సాటి మరేది లేదని ఆ విలువలు కాపాడుకోవాలని హితవు పలికాడు.

‘’ప్రక్కనున్న వారి పలుకుల కన్నను

ప్రొద్దుపోక చేయు ఫోనుముద్దు 

దగ్గరున్న నేమి దౌర్భాగ్యమిద్దిరా 

దారిపూలతోట దార్లమాట”

ప్రస్తుతం ఇల్లల్లో వింత పరిస్థితులు దర్శనమిస్తున్నాయి. ప్రక్కనున్న వారి పలుకులకన్నా ప్రొద్దుపోక చేసే ఫోను ముద్దుగా భావిస్తున్న దౌర్భాగ్యపరిస్థితులను దుయ్యబట్టాడు.

"శిలను చెక్కి శిల్పి శిల్పముగ మలుచు 

కఠినహృదయమైన కరుగునట్లు 

సహృదయతను నింపు సాహిత్య పఠనంబు

దారిపూలతోట దార్లమాట”

శిల్పి శిలను శిల్పంగా మలుస్తాడు. సాహిత్య పఠనం కఠిన హృదయాన్ని కరిగించి సహృదయతను నింపుతుందని, సత్త్వగుణం నేర్పుతుందని, సాహిత్య పఠనం యొక్క ఆవశ్యకతను, పరమార్థాన్ని నొక్కి వక్కాణించాడు.

'రచన' ఎవరిదైనా ఉన్నతంగా ఉంటే కీర్తించగలం, కాని మనవాడే కాబట్టి, మనసు చంపుకొని పొగడలేమని, మంచి రచన మనసులో చిరస్థాయిగా నిలిచిపోతుందని, అటువంటి రచనలను మరచిపోలేమంటాడు. సమాజంలో తెల్లదొరలు పోయి నల్లదొరలు వచ్చారని, మనిషి మనసు ముందు మారాలని హితవు పలికాడు.

జీవితం నీటిబుడగలాంటిదంటాడు. ఉన్నవాటి విలువ ఉన్నప్పుడు ఎరుగరు. లేనినాడే దాని విలువ తెలుస్తుంది. తిండిలేనినాడే తిండి విలువ తెలుస్తుంది. అరగనపుడే ఆరోగ్యం విలువ తెలుస్తుందంటాడు. మహనీయుడు ఎక్కడున్నా మంచి పుష్పంవలే పరిమళిస్తాడంటాడు. ఏదీ శాశ్వతం కాదు ఊపిరున్న వరకు సంతోషంగా ఉండమంటాడు. ఉన్నంతలో ఉన్నంతకాలం ఆనందంగా జీవించడమే ఉత్తమ జీవనధర్మం అని ప్రబోధిస్తాడు.. ఇలా సమకాలీన సమాజంలో ఎన్నో పార్శ్వాలను తన అనుభవాలతో వివేచించి పద్యపారిజాతాలను పరిమళింపజేసి కొత్తదారి వేసిన దీర్ఘదర్శి దార్శనికుడు దార్ల.

***







21 ఏప్రిల్, 2018

ఉన్నత విద్యాశిఖరం...హెచ్ సీయూ ( ఆంధ్రజ్యోతి, 20 ఏప్రిల్ 2018)

నిన్న (20 ఏప్రిల్ 2018) ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఒక పూర్తి పేజి, మెయిన్ ఎడిషన్ లో యూనివర్సిటి ఆఫ్ హైదరాబాదు గురించి విశ్లేషణాత్మకమైన వ్యాసాన్ని ప్రచురించారు. దానిలో నా అభిప్రాయాన్ని కూడా నా ఫోటోతో సహా ప్రచురించారు.థాంక్యూ ఆంధ్రజ్యోతి!

17 మార్చి, 2018

కొత్త ఆశలకు ప్రతీక ఉగాది - ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు

కొత్త ఆశలకు ఉగాది ప్రతీకగా నిలుస్తుందని హైదరాబాదు సెంట్రల్ యూనివర్సి తెలుగుశాఖలో ఆచార్యుడు, డిప్యూటీ డీన్, స్టూడెంట్స్ వెల్ఫేర్ ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు అన్నారు. శుక్రవారం ( 16  మార్చి 2018) సాయంత్రం హైదరాబాదు, చందానగర్ లోని శ్రీవేంకటేశ్వరరస్వామి దేవాలయ ప్రాంగణంలో జరిగిన ఉగాది కవిసమ్మేళనానికి ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేశారు.సుమారు 50 మంది కవులు తమ కవితలను వినిపించారు. ఈ కవిసమ్మేళనాన్ని ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్, గోల్కొండ సాహితీ సమితి సంయుక్తంగా నిర్వహించింది. ఈ సందర్భంగా ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఉగాదికి మన తెలుగు వాళ్ళంతా కొత్త ఉత్సాహంతో పండుగను జరుపుకుంటారనీ, ఈ సందర్భంగా ఉగాది విశిష్టతను వివరించారు. ఉగాదిని పంచవిధుల సమన్వితంగా చేస్తుండటం మన సంప్రదాయం అన్నారు.  తైలాభ్యంగనం, (2) నూతన సంవత్సర స్తోత్రం, (3) ఉగాడి పచ్చడి సేవనం, (4) పూర్ణ కుంభదానం, (5) పంచాంగ శ్రవణం అనే అయిదు విధులను నిర్వర్తించడం ఆచారంగా వస్తుందని, అయితే వీటిలో ఉగాది పచ్చడి తినడం, పంచాంగ శ్రవణం మాత్రం బాగా ఆచరిస్తున్నారని వివరించారు. వీటితో పాటు ఉగాది అనగానే కవిసమ్మేళనాలు జరుగుతుంటాయని చెప్పారు. కవులు పద్యం, వచనం, గేయం ఏ రూపంలో నైనా రాస్తూ, వాటిని ఉగాది నాడు ఆలపించడం ఒక సంప్రదాయంగా వస్తుందన్నారు. సమాజంలో భిన్నాభిప్రాయాలు ఉంటాయి.
1)

అవి భావజాలాల రూపంలో వ్యక్తమవుతుంటాయి. వారి దృష్టి కోణం, వారి అనుభవం, వారి జ్ఞానపరిధులను బట్టి ఆ దృక్పథాలు వెలువడుతుంటాయి. కవిత్వం, వచనమైనా, పద్యమైనా దానిలో కవిత్వం ముఖ్యం. అంతే తప్ప ఆ రూపం ప్రధానం కాదని ఉద్భోధించారు. పద్యం రాయడానికి పాండిత్యం లేదా కనీసావగాహన అవసరమవుతంది. ఛందస్సు, వ్యాకరణం, అలంకారశాస్త్ర పరిచయం అవసరమవుతుంది. వచనంలోనూ ఇవి ఉన్నా, పద్యంతో పోలిస్తే, కొంత స్వేచ్ఛ ఉంటుంది. అందువల్ల వచన కవిత్వాన్ని రాసేవాళ్ళు అధిక సంఖ్యలో కనిపిస్తారు. దేనికైనా సాధన అవసరమైనా, పద్యానికి పాండిత్యం కూడా అవసరం అవుతుందన్నారు. దేన్నీ తక్కువగా చూడకూడదన్నారు. పద్యం, వచనంలాగే  కవిత్వానికి సామాజిక ప్రయోజనం ఉండాలని వాదించినవాళ్ళున్నారు. నిజానికి కవి మృదు స్వభావుడు, కరుణాంతరంగుడు అయినప్పుడు మానవత్వం, దైవత్వం అతనిలో నిలువెత్తుగా కనిపిస్తుంటాయి. అప్పుడు అతడు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సామాజిక ప్రయోజనాన్నే ఆశించేలా కవిత్వాన్ని రాస్తాడని, అయినా, అపారమైన కావ్య సంసారంలో తనకు స్వేచ్ఛ ఉంటుంది. అందువల్ల ప్రజల ప్రయోజనాలను దృష్టి పెట్టుకోవాల
ని కవులను ఉద్భోధించారు. ఈ కార్యమంలో పాల్గొని, కవిత్వం చదివిన, ప్రసంగాలు చేసిన వారందరినీ ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు సత్కరించారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన ప్రెండ్స్ అసోసియేషన్  అధ్యక్షుడు శ్రీ తాడిబోయిన రామస్వామి యాదవ్, షణికుమార్, రామకృష్ణంరాజు, ఛంద్రప్రకాశ్ రెడ్డి, గంగా మనోహర్ రెడ్డి, అంజయ్య అవధాని, అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.  సభలో పాల్గొని కవిత్వం చదివిని అందరికీ దుశ్వాలువా, మెమెంటో, పుష్ఫగుచ్చం, శ్రేవేంకటేశ్వర ప్రసాదం వంటివాటితో ఘనంగా సత్కరించారు.






14 మార్చి, 2018

తెలంగాణ చరిత్ర, సాహిత్య చరిత్రల్లో ఒక చెరిగిపోని సంతకం‘సంగిశెట్టి శ్రీనివాస్’


తెలంగాణ చరిత్ర, సాహిత్య చరిత్రల్లో ఒక చెరిగిపోని సంతకం.
పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో ఒక కాన్ఫిడెన్సియల్ పనిమీద వెళ్లాను. మూడురోజుల పాటు వెళ్ళాలి. మార్చి, 12 నుండి 14 వరకు ఆ పనిఉంది. సంగిశెట్టి శ్రీనివాస్ ఒక డిగ్రీకళాశాలలో లైబ్రరీలో అసిస్టెంటు ప్రొఫెసరుగా పనిచేస్తున్నారని తెలుసు. అంతకంటే ముందు ఆయన ఒక చక్కని పరిశోధకుడనీ తెలుసు. రెండుమూడు సభల్లో నేనూ, ఆయన వేదికలను పంచుకున్న రోజులుకూడా ఉన్నాయి. తాడినాగమ్మ కథలను ప్రచురించి, నా చేత కూడా మాట్లాడించాడాయన. తెలంగాణా సాహిత్య చరిత్రను పునర్మూల్యాంకనం చేస్తున్నవారిలో సంగిశెట్టి శ్రీనివాస్, డా.సుంకిరెడ్డి నారాయణరెడ్డి, కాసుల ప్రతాపరెడ్డి మొదలైన వాళ్ళపట్ల నాకు ఒక గౌరవభావం ఉంది. నిరంతరం పనిచేస్తున్నారు.
అందుకేవాళ్ళ పట్ల నాకు గౌరవం ఉంది. సంగిశెట్టి శ్రీనివాస్ సబాల్టర్న దృష్టికోనం నాకింకా బాగా నచ్చుతుంది. తెలుగు కథ గురించి ఆయన చేసిన పరిశోధన తర్వాతనే నాకు తెలిసినంతవరకు బండారు అచ్చమాంబను విస్తృతంగా గుర్తుచేసుకోవడం మొదలుపెట్టారు-సాహితీవేత్తలు. ఆయన ఏదైనా ఒక కొత్తపుస్తకం వేస్తే, దాన్ని ఏదొకలా నాకు అందిస్తుంటారు. విశ్వవిద్యాలయంలో ప్రొఫెసరుగా ఉండడం వల్ల మాకు చాలా పుస్తకాలు వస్తుంటాయి. అన్నింటినీ వెంటనే చదవలేము, కొన్ని చదవబుద్ధికాదుకూడా! కానీ, సంగిశెట్టి శ్రీనివాస్ ఏదైనా ఒక పుస్తకం వేస్తేదాన్ని నేను నమ్మకంగా చదువుతాను. ఆసక్తిగా చదువుతాను. ఇష్టంగా చదువుతాను. సమయం వ్యర్థం కాదని సంతోషిస్తూ చదువుతాను. 12మార్చి 2018న కలిసి, మరలా నా పనిలో నేను నిమగ్నమైపోయాను. జానపదకళలుశాఖ, అధ్యక్షుడు డా.గడ్డం వెంకన్నగారు నన్ను ఆహ్వానించగా ఒక కాన్ఫిడెన్సియల్ వర్క్ పై యూనివర్సిటిలో ఉన్నానను ముందే చెప్పానుగా. ఇద్దరం కలిసి ఆ పనిచేస్తూమాటల సందర్భంలో సంగిశెట్టి ప్రస్తావన వచ్చింది. పుస్తకాలివ్వాలనుకుంటున్నారని, భోజనం సమయంలో వస్తానని చెప్పారని డా.వెంకన్న నాతో అన్నారు. మనదగ్గరకెందుకు మనమే భోజనం అయిన తర్వాత వెళ్దామని, ఆయన దగ్గరకు వెళ్లాం. ప్రస్తుతం డిప్యుటేషన్ పై పొట్టిశ్రీరాములు తెలుగువిశ్వవిద్యాలయంలో పనిచేస్తున్నారు-శ్రీనివాస్.
ఎప్పటిలాగా నవ్వుతూ పలకరించారు. ఆయన టేబుల్ పై ఒక కంప్యూటర్ ఉంది. అది ఆన్ చేసి ఉంది. ఎదురుగా ప్రముఖరచయిత షరీఫ్ కూర్చొన్నారు. మేము వెళ్ళి పలకరించాం. చాలా సంతోషపడ్డారు. కాసేపు సాహిత్యం, సాహిత్య రాజకీయాలు మాట్లాడుకున్న తర్వాత, దళితులు, దళితుల్లో మరలా మాదిగల జీవితాల్ని ఆంగ్లేయులు ఇంగ్లీషులో భద్రపరిచిన  ఎమ్మా రొషాంబు క్లౌ (Emma Rauschenbusch Clough; 1859- 1914) ఇంగ్లీషులో రాసిన While Sewing Sandals Or Tales of a Telugu Pariah Tribe అనే పుస్తకం గురించి చర్చవచ్చింది. దీనితో పాటు వీరి భర్త కూడా గొప్పరచన ఒకటి చేశారని, వెంటనే తన కంప్యూటర్ ఆర్కైవ్స్ నుండి ఆ పుస్తకాన్ని ఓపెన్ చేసి చూపించాడు శ్రీనివాస్ గారు. నాకు చాలా సంతోషం అనిపించింది. దాన్ని నేను ఇంతవరకూ చూడలేదు. కానీ, ఎమ్మా రొషాంబు క్లౌ పుస్తకం నాదగ్గరుందని చెప్పాను. దీని గురించి ఆచార్య గుజ్జర్లమూడి కృపాచారి గారు కూడా తన పరిశోధనలో ప్రస్తావించారనీ చెప్పాను. ఆయన డిప్యుటేషన్ పై వచ్చినా, తన స్వీయ కార్యక్రమాలు నెరవేర్చుకోకుండా, తెలంగాణ సాహిత్య రచనకు తనవంతూ కృషిచేస్తున్నాడని మరోసారి అనుకున్నాను. మాతో మాట్లాడుతూనే, ఆఫీసులో జరుగుతున్న పుస్తకాల టైపింగు వర్కుకి సంబంధించిన సూచనలు కూడా చేయడం గమనించాను. మాట్లాడుతూ ఒకసారి లేచి, తన ఎడమవైపు రాక్ లో ఉన్న పుస్తకాల కట్టలను కొన్ని ఇప్పి, కొన్ని తీసుకొచ్చి నాకు ప్రేమగా బహూకరించాడు. దానిమీద నా పేరు రాయలేదు; కానీ, నేను అడగకుండానే పట్టుకొచ్చి ఇచ్చాడు. ఎంతోకొంత డబ్బులిద్దామనిపించింది. మరలా బాగుండదనీ అనిపించింది. పుస్తకాలు, అవీ తెలుగు పుస్తకాలు వేయడం వరకే తప్ప, వాటి ప్రచురుణ ఖర్చుకూడా మరలా ఎంతమందికి తిరిగివస్తుందో తెలియదు. కానీ, శ్రీనివాస్ గారి పుస్తకాలకు మంచి మార్కెట్ ఉంటుందనుకుంటున్నాను. కాబట్టి, ఆయనకు ఆ ఇబ్బంది ఉండకపోవచ్చు. అయినా ఇవన్నీ ఒక నిమిషంలో నాలో నేను తర్కించుకొని, వాటిని స్నేహపూర్వకంగానీ తీసుకోవాలనుకున్నాను. ఆయన సంతకం చేసివ్వమన్నాను. నాగురించి ఆయన రాసిన‘దళితసాహిత్యానికి, చరిత్రకు బలమైన పునాదులు వేస్తున్న ఆత్మీయ మిత్రులు దార్లకు’ అనే  మాటలు నాకు చాలా సంతోషాన్ని కలిగించాయి.

నాకు తెలంగాణ నవలాచరిత్ర ( 1956వరకు), తొలికారు ( తెలంగాణ తొలినాటు ఆధునిక కవిత్వం), ఇందుమతి కవిత్వం, బొమ్మాహేమాదేవి కథలు, శ్రీవాసుదేవరావు కథలు, భాగ్యనగరవైభవం (దైదవేములపల్లి దేవేందర్) పుస్తకాలను నాకిచ్చారు.
సంగిశెట్టి పుస్తకం ఏది వచ్చినా ముందుగా ఆయన సంపాదకీయం లేదా ముందుమాట చదువుతాను. వీటికి రాసిన సంపాదకీయాలు కూడా ఆయన పట్ల నాకు ఆ గౌవరవాన్ని అలాగే నిలిపాయి. అన్నిపుస్తకాలు చదవాలనిపిస్తుంది. చదువుతాను. మీతో పంచుకునే ప్రయత్నమూ చేస్తాను.
సంగిశెట్టిశ్రీనివాస్ గారూ... మీకేమివ్వగలను... నాకు కలిగిన భావాల్లో కొన్నింటిని ఒక పద్యంలో పెట్టే ప్రయత్నం చేశాను.
కం. నవ్యతెలంగాణచరిత
దివ్యమనుచు మనకు చూపె దిమ్మతిరగగన్ 
వ్యముగ సంగిశెట్టి యె
వ్యుఁడతఁడు సత్యశోధ కలిగియుండెన్

14 అక్టోబర్, 2015

ఈరోజు ‘‘పరిశోధన పత్రరచన:మెళకువలు’’ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్

హైదరాబాదు విశ్వవిద్యాలయం, తెలుగుశాఖ విద్యార్థినీ విద్యార్థులు ఏర్పాటు చేసుకొని విజయవంతంగా నిర్వహిస్తున్న ‘అధ్యయనం’ (తెలుగు కళా సాంస్కృతిక సాహిత్య చర్చావేదిక) వారు ఈ రోజు సాయంత్రం నాలుగు గంటలకు ‘పరిశోధన పత్రరచన:మెళకువలు’’ అనే అంశంపై ప్రసంగాన్ని ఏర్పాటు చేశారు. ఈ ప్రసంగం డా.బి.ఆర్. అంబేద్కర్ ఆడిటోరియంలో జరుగుతుంది. దీన్ని పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ పద్ధతిలో వివరించాలనుకుంటున్నాను.   

19 జులై, 2015

ముస్లిం సాహిత్య వాదానికి ఒక బలమైన అభివ్యక్తి 'స్కైబాబా'

-డా. దార్ల వెంకటేశ్వరరావు
అసోసియేట్‌ ప్రొఫెసర్‌, తెలుగుశాఖ,
 సెంట్రల్‌ యూనివర్సిటి, హైదరాబాద్‌-500 046,

             (సెంటర్‌ ఫర్‌ కంపారిటివ్‌ లిటరేచర్‌, సెంట్రల్‌ యూనివర్సిటీ మరియు ఇండస్‌ పబ్లికేషన్స్‌ అండ్‌ స్కైబాబా మిత్రుల సంయుక్త ఆధ్వర్యంలో ‘‘Exploring Texts & Works of Skybaaba’’ అనే అంశంపై సెంట్రల్‌ యూనివర్సిటీ, స్కూల్‌ ఆఫ్‌ హ్యుమానిటీస్‌ ఆడిటోరియంలో  రెండు రోజుల (27-28, ఆగస్టు, 2015) పాటు జరిగిన జాతీయ సదస్సులో ఒక సమావేశానికి అధ్యక్షత వహించాను. దీనిలో ప్రారంభంలోను, ముగింపులోను మాట్లాడిన, మాట్లాడాలనుకున్న భావాలను మీకు అందిస్తున్నాను.) 
*** 
            తెలుగులో ముస్లిం సాహిత్య వాదాన్ని బలంగా ముందుకు తీసుకొచ్చిన వారిలో ఎస్‌.కె.యూసఫ్‌ బాబా (స్కై బాబా') ప్రముఖుడు. మనం సమకాలీన సాహిత్యం గురించి చదువుకుంటున్నప్పుడు, మాట్లాడుకుంటున్నప్పుడు ఆ సాహిత్యంలో ఒక ప్రధాన ధోరణికి కారణమైన రచయితలను విద్యార్థినీ విద్యార్థులకు పరిచయం చేసే విధంగా ఈ సదస్సుని రూపకల్పన చేసిన సెంటర్‌ ఫర్‌ కంపారిటివ్‌ లిటరేచర్‌, ఇండస్‌ పబ్లికేషన్స్‌ అండ్‌ స్కైబాబా మిత్రులను అభినందిస్తున్నాను. ఈ సమావేశానికి నన్ను అధ్యక్షత వహించమనడాన్ని నాకిచ్చిన గౌరవంగా భావిస్తున్నాను.
            సాహిత్యం సమాజానికి ప్రతిబింబమంటుంటారు. నిజంగా ఇంతవరకూ అలా జరిగిందా అని లోతుగా పరిశీలిస్తే అది సమాజంలోని కొన్ని వర్గాల గురించి మాత్రమే ప్రతిబింబితమయ్యిందని తెలుస్తుంది. దీనిక్కారణాలనేకం ఉన్నాయి.  సాహిత్యమనేది  చాలారోజుల వరకూ కొంతమంది సొత్తుగానే  పరిగణింపబడింది. వాళ్ళు రాసిందే సాహిత్యంగా, వాళ్ళు చెప్పిందే సాహిత్యమయ్యింది. శాస్త్ర, సాంకేతికరంగాల్లో వచ్చిన విప్లవాత్మక మార్పులు సాహిత్య పరిధుల్ని కూడా విస్తరిల్లేలా చేశాయి. సమాజంలో జరుగుతున్నదాన్ని ఆధిపత్య వర్గాలెంతగా ఆపాలని ప్రయత్నిస్తున్నా, కొన్ని నిజాలైనా బయటకొస్తున్నాయి. ఆ నిజాలు ఆలోచించేవాళ్ళని నిద్రలేకుండా చేస్తున్నాయి. అలా నిద్రలేనిరాత్రుల నుండి ఉవ్వెత్తుగా ఉరికిపడుతున్న సాహిత్యాన్నిప్పుడు మనం దళిత, ముస్లిం, తెలంగాణా సాహిత్యాలుగా పిలుచుకుంటున్నాం. అలా వచ్చిన వాటిలో తక్కువ సమయంలోనే ఎక్కువ చర్చలకు కారణమైన సాహిత్యం ముస్లిం సాహిత్యం. ఈ ముస్లిం సాహిత్యాన్ని రాస్తున్నవారిలో స్కైబాబాది బలమైన అభివ్యక్తి.
            సూటిగా, స్పష్టంగా, చెప్పాల్సిందేదో చెప్తూనే శాశ్వతమైన ముద్రవేసేలా అక్షరాల్ని సంధించే సాహిత్య విద్య తెలిసవాడు స్కైబాబా. తన జీవితం, తన చుట్టూ ఉండే సమాజం ఈ రచయితకింత స్ఫష్టతనిచ్చిందేమో అనిపిస్తుంది. తాను జర్నలిస్టుగా పనిచేయడం వల్ల కూడా జీవిత లోతుల్లోని చీకటి కోణాల్ని చూడగలిగే దష్టి ఏర్పడిందనుకుంటున్నాను. ఇవే వస్తువులై కవిత్వం, కథలుగా ఈయన కలం నుండి వెలువడ్డాయి.
            ముస్లిం సాహిత్యాన్ని, తెలంగాణ ఉద్యమాన్ని అవగాహన చేసుకోవడానికి నేను  స్కైబాబాను ఎంతో నమ్మకంతో చదువుతాను. ఆచరణాత్మకమైన ఆలోచనలతో పాటు, సాహిత్యంలో ఉండాల్సిన సంవేదనలు ఈ సాహిత్యంలో కనిపించడమే నేను స్కైబాబాను అంతనమ్మకంగా చదవడానికి ఒక ప్రధాన కారణం. వ్యక్తిగా తన స్వీయానుభూతులను అందిస్తూనే, పీడితవర్గంగా ఉంటున్న ముస్లిములను వ్యవస్థీకతంగా పనిచేసేలా ప్రేరేపించడాన్ని ఈయన సాహిత్య కార్యాచరణలో గమనించాను. అందుకే ఈయన సాహిత్యాన్ని, జీవితాన్ని మూడు పాయలుగా అర్థం చేసుకోవచ్చనుకుంటున్నాను. వ్యక్తిగా స్కైబాబా చాలా సున్నితమైన స్వభావాన్ని కలిగి ఉండటం వల్ల సమాజంలో వెంటనే స్పందించే గుణాన్ని అలవర్చుకున్నాడు. అందువల్లనే ఆ స్పందనని కవిత్వం, కథ, వ్యాసం, ప్రసంగం వంటి రూపాల్లో త్వరగా వ్యక్తీకరించేప్రయత్నం చేస్తాడు. అలాంటప్పుడు కొంతమందితో పేచీలకు కూడా గురవుతుంటాడు. శత్రు వర్గాన్ని కూడా తన చుట్టూ తానే తయారు చేసుకుంటున్నాడనిపిస్తుంది. హిందుత్వ వాదుల్నుండే కాకుండా తన ముస్లిం వర్గం నుండి కూడా ఈ శత్రుత్వం పెరుగుతుంటుంది. అదే అప్పుడప్పుడూ పత్రికల్లో స్కైబాబాని అంత తీవ్రంగా విమర్శించేలా చేస్తుందనుకుంటున్నాను.
            స్కైబాబా తాను స్పందించడమే కాకుండా తనకు తెలిసిన మార్గాలన్నింటినీ అన్వేషిస్తూ తన ఆలోచనలకు దగ్గరగా   ఉండేవాళ్లందరినీ ఒకేవేదికపైకి తెచ్చేందుకు కూడా క షిచేస్తాడు. కరపత్రం నుండి కవిత్వం, కథల వరకు తాను రాయడమే కాకుండా అలాంటి వాటిని రాయించేలా ప్రేరేపిస్తాడుబీ రాసిన వాటిని పుస్తకాలుగా తీసుకొస్తాడు. అన్ని పుస్తకాల్ని ప్రచురించడానికి తానేమీ ధనవంతుడు కాకపోయినా వాటిని ప్రచురించడానికి సహకరించే భావసారూప్యం గల వాళ్లని ఒప్పిస్తాడు. లేకపోతే 39 మంది కథకులతో 52 కథల ముస్లిం కథల సంకలనం 'వతన్‌' (2004) గానీ, 'అలావా' ముస్లిం సంస్క తి కవిత్వం (2006) వచ్చి ఉండేవే కాదు. తెలంగాణ ఉద్యమానికి ఊపిరులూదిన దిమ్మిస, జాగో జగావో మొదలైన పుస్తకాల్ని  సింగిడి ద్వారా కలెక్టివ్‌ వర్క్‌ గా తీసుకొచ్చాడు. వ్యక్తిగతంగా ఆయన తన కథల్ని 'ఆధూరె', బేచారె (2015) పేర్లతోను, కవిత్వాన్ని జగ్‌నే కీ రాత్‌  పేరుతోను ప్రచురించాడు. వీటితో పాటు మరికొన్ని రచనలు వచ్చాయి. వీటిని చూస్తే ఇంత చిన్నవయసులో అన్ని రచనలెలా చేశాడనీ, అన్ని గ్రంథాలనెలా ప్రచురించాడనీ అనుకుంటారు.  స్కైబాబా కవితలు పత్రికల్లో వచ్చినప్పుడే సంచలనం సష్టించాయి. ముస్లిం సాహిత్యంలో తప్పకుండా ప్రస్తావించాల్సిన కవితల్లో ఒక్క కవితాఖండికగానైనా స్కైబాబా కవితను తీసుకోవడమే ఈయన కవిత్వం తెలుగుసాహిత్యంలో కలిగించిన ప్రభావాన్ని స్పష్టం చేస్తుంది.          

            ఇక, ఈయన మరికొంతమందితో కలిసిసంపాదకుడిగా తీసుకొచ్చిన 'ముల్కీ', 'జఖ్మీ ఆవాజ్‌' వ్యాస సంకలనాలు దళితులు, ముస్లిములు ఈ దేశంలో ఎదుర్కొంటున్న భావజాలపరమైన దాడులతో పాటు, భౌతిక దాడుల్ని కూడా వివరిస్తూ, భవిష్యత్తులో వీళ్ళుకలిసి పయనించాల్సిన అవసరాన్ని ఎలుగెత్తి చాటే గ్రంథాలు.  మూడో కోణంలో స్కైబాబాని చూస్తే సమకాలీన సమాజాన్ని, సాహిత్యాన్ని గుర్తిస్తూనే దార్శినిక స్వభావాన్ని కలిగుంటాడు. ఇక్కడున్న దార్శనికుడే నేడిక్కడ జాతీయ సదస్సుని నిర్వహించేలా ప్రేరేపించాడనుకుంటున్నాను. 

17 అక్టోబర్, 2014

జాతీయకవి కువెంపు జీవితం-రచనలు‘ పై జాతీయ సదస్సు రేపు, ఎల్లుండ( 18, 19 అక్టోబరు 2014)

రాష్ట్రకవి కువెంపు ప్రతిష్ఠాన,(రి) కుప్పళి (కర్నాటక) పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాదు- కన్నడ విశ్వవిద్యాలయం, హంపిల సంయుక్త ఆధ్వర్యంలో  రేపు, ఎల్లుండ( 18, 19 అక్టోబరు 2014) జాతీయకవి కువెంపు జీవితం-రచనలు‘ పై జాతీయ సదస్సు నిర్వహిస్తున్నారు.  ఈ  సదస్సు హైదరాబాదులోని పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం శ్రీ నందమూరి తారకరామారావు వేదికలో నిర్వహిస్తున్నారు.   సదస్సుకి సంబంధించిన ఆహ్వాన పత్రాన్ని కిందప్రచురిస్తున్నాను.




08 అక్టోబర్, 2014

‘‘మల్లవరపు శతకం’’ రసావిష్కారసామాజిక దర్శన కవిత్వం - దార్ల వెంకటేశ్వరరావు

మల్లవరపు రాజేశ్వరరావు
మల్లవరపు రాజేశ్వరరావు ప్రముఖ పద్యకవి, తెలుగు ఉపాధ్యాయుడు. 17.12.1949 లో ప్రకాశం జిల్లాలో జన్మించారు. ఈయన మల్లవరపు జాన్ కవి కుమారుడు.
రచనలు

ఈయన కలం నుండి పద్యకావ్యాలు, శతకాలు, కవితా ఖండికలు వెలువడ్డాయి. వీటిలో జీవనది కవితాఖండిక వీరికి ఎంతో పేరుతెచ్చింది. ముంతాజ్ మహల్ పద్యకావ్యం అనేకమంది సాహితీవేత్తల ప్రశంసలు అందుకుంది. భక్తయోబు, అనాథ గంగ, ఎయిడ్స్ మహమ్మారి, బాలగేయాలు, హన్నా, కాళింది, రజయ ప్రణయం, ఎస్తేరు రాణి మొదలైన రచనలు చేశారు. ఈయన రాసిన జీవనది కావ్యంపై తెలుగుశాఖ, హైదరాబాదు విశ్వవిద్యాలయంలో ఎం.ఫిల్ పరిశోధన చేశారు. ఈయన ఇటీవల రాసిన మల్లవరపు శతకంసాహిత్య విలువలతో పాటు, సమకాలీన సమస్యల్ని ప్రతిబింబించిందని ప్రముఖ విమర్శకుడు డా.దార్ల వెంకటేశ్వరరావు ఒక పరిశోధన వ్యాసంలో పేర్కొన్నారు. ఆ వ్యాసాన్ని ఇక్కడ ప్రచురిస్తున్నాను.
ఆటవెలది మనసు నలరించు చుండు

                పాటవోలె నద్ది పరుగుదీయు

                నీతిసూక్తులకు నిండైన పద్యంబు

             మల్లవరపు మాట మల్లెమూటఅంటూ  మృదువైనశబ్దాలతో, పదునైన భావాల్ని మధురమైన కవిత్వంగా అందిస్తున్న కవి మల్లవరపు రాజేశ్వరరావుగారు. తెలుగు సాహిత్య చరిత్రలో ఇప్పటికే తనకంటూ ఒకస్థానాన్ని పదిలపర్చుకున్న ఈయన పద్యకవిగా ఎంతగానో ప్రసిద్ధులు. పద్యాన్ని రాయడంతోపాటు దాన్ని భావ, రాగయుక్తంగా ఆలపించడంలో కూడా తనదైన ఒక ప్రత్యేక ముద్రను సొంతంచేసుకున్న కవి. మల్లవరపు జాన్‌ కవిగారి వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని పోతనలోని మాధుర్యాన్ని, కరుణశ్రీలోని మృదుత్వాన్ని, వేమనలోని వస్త్వలంకారాలతో  సత్యాన్ని సామాన్యులకు కూడా అందించగల నేర్పునీ, జాషువాలోని సామాజిక స్పందన్నీ ఏకోన్ముఖంగా మనకి అందించగల కళానైపుణ్యమీయన కవిత్వంలో కనిపిస్తుంది.ఈయన కుమారులు సుధాకరరావు, ప్రభాకరరావులు కూడా బలమైన వ్యక్తీకరణతో వచనకవిత్వాన్ని దీప్తిమంతం చేస్తున్నారు. అందుకనే కవిత్వ విద్యను తన వారసులకు కూడా అందించి సాహిత్యంలో ‘‘మల్లవరపు కవులు’’ అనే ఒక అధ్యాయానికి కావాల్సినంత కృషిని చేశారని అనగలుగుతున్నాను.
             రాజేశ్వరరావుగారు వృత్తిరీత్యా తెలుగు పండితులుగా పనిచేశారు. కానీ, కవిగా బాలలకోసం బాలగేయాలు, నాటికలు వంటి వివిధ ప్రక్రియల్లో రచనలు చేసి వారిలో సాహిత్యాభిలాషను, నైతికవిలువల్ని పెంపొందించే ప్రయత్నం చేశారు. ఈయన రాసిన అనేక ఖండకావ్యాలనిండా కండగల కవిత్వం, సమకాలీన వస్తువు, దాన్ని కవిత్వం చేయగలిన నేర్పు కనిపిస్తుంది. 

              మనం ప్రస్తుతం చదువుతున్న ‘‘మల్లవరపు శతకం’’ కూడా ఆ కోవలేనే ఒక సామాజిక బాధ్యతగల కవిగానే ఈయన కలం నుండి వెలువడిరది. శతక ప్రక్రియా రచనలో కవికి వస్తుస్వీకరణలో స్వేచ్ఛ ఉంటుంది. ఆ వస్తువుని మూడు పాదాల్లోనే చెప్పమనే నిబంధనల సంకెళ్ళుకూడా ఉంటాయి. ఒకపాదం మకుటం కావడం ఒకవిధంగా నాల్గోపాదం గురించి ఆలోచించవలసిన అవసరం లేకపోయినా, ఆ మకుటంలో చెప్పిన భావాన్ని పై మూడు పాదాలు అర్థవంతం చేస్తున్నట్లున్నప్పుడే శతకరచనలో కవిత్వం అలరిస్తుంది. వీటితో పాటు తాను ఎన్నుకునే ఛందస్సు, భాష, తీసుకొనే ఉపమానాలు కవిత్వ లక్ష్యాన్ని చెప్పకనే చెప్తుంటాయి.
                నీతిని బోధించే శతకాల్లో సుమతీశతకం నేటికీ అగ్రస్థానంలోనే నిలుస్తుంది.దీనిలోనూ కొన్ని పద్యాలు కొన్ని కులాల్ని కించపరిచేలా ఉన్నాయి. వాటిని గమనించిన పండితులు తమ  శక్తిసామర్థ్యాలతో పరిష్కరణలు చేశారు. అయినప్పటికీ వాటిని మూలంలో కూడా బహుశా ఆ పద్యాలు అలాగే ఉన్నాయనుకుని చదివేవాళ్ళున్నారు. దీనితో పాటు కుమార, కుమారీ శతకాలు వచ్చినా వీటి లక్ష్యం, పరిధి నీతిశతకానికున్నంత విస్తృతమైంది కాదు. తర్వాత భక్తి, అధిక్షేప, హాస్య శతకాలెన్ని వచ్చినా వేమనపద్యాలుకున్నంత ప్రాచుర్యం వేటికీ దక్కలేదనిపిస్తుంది. వేమనపద్యాలు వేలాదిగా లభిస్తున్నాయి.ఇవన్నీ నిజంగా వేమనే చెప్పి ఉంటాడా? అనీ కొంతమంది పరిశోధకులు అనుమానాల్ని వ్యక్తం చేశారు. సమాజంలో జరుగుతున్న పెడధోరణుల్ని ఆకర్షణీయంగా చెప్పడానికీ, చెప్పిన దానికి ప్రామాణికత్వాన్ని కలిగించడానికీ వేమన మకుటాన్ని ఉపయోగించుకొని పద్యాలు రాసినవాళ్ళున్నారు. తాము చెప్తే వింటారనుకున్నప్పుడు కొంతమంది సమకాలీన విషయాల్ని తాము సృష్టించుకున్న మకుటాలతోనే శతకాలను రాసినవాళ్ళున్నారు. అందువల్ల శతకానికి ఆత్మీయతాముద్ర అనే లక్షణం కూడా వచ్చి చేరింది. మల్లవరపు రాజేశ్వరరావుగారు తన ఆత్మీయతాముద్రతోనే సమకాలీన సామాజిక విషయాల్ని రసవంతంగా వర్ణించారు.
                తల్లిదండ్రులు, గురువులు, కవులు, సామాజిక సంస్కరణవాదులు, దేశభక్తులు, దార్శనికులతో పాటు, కుల,మత,వర్ణాది విషయాల్ని ఈశతకంలో వర్ణించారు కవి. పండితపామరజనరంజకంగా చెప్పాలకున్నప్పుడు చెప్పేవిధానం కూడా ముఖ్యమే. నీతిని చెప్పేటప్పుడు సాధారణంగా ఆటవెలది, తేటగీతి పద్యాల్లో వర్ణిస్తుంటారు కవులు. ఏ విషయాన్ని ఏ వృత్తంలో వర్ణిస్తే ఔచిత్యంగా ఉంటుందో లాక్షణికులు చెప్పారు. క్షేమేంద్రుడు తన సువృత్తతిలకమ్‌లో ఈ లక్షణాల్ని ఎంతో వివరంగా చర్చించాడు.లాక్షణికులు చెప్పినవి పాటించేవాళ్ళు కొంతమందైతే, వాటిని పాటిస్తూనే మరికొన్ని ప్రయోగాలు చేసేవాళ్ళు మరికొంతమంది.వీటినేమీ పట్టించుకోకుండా తాము పట్టిన కుందేలుకి మూడేకాళ్ళనే పద్ధతిలో రాసుకుంటూ పోయేవాళ్ళూ ఉన్నారు. వీళ్ళలో పూర్వకవుల, లాక్షణికుల సంప్రదాయాల్ని పాటిస్తూనే నూతనప్రయోగాలు చేసేవాళ్ళ వల్ల కవిత్వం కొత్తపుంతలు తొక్కగలుగుతుంది. రాజేశ్వరరావుగారి మల్లవరపు శతకం ఈ విభాగంలోకే చేరుతుందనిపిస్తుంది.నీతిని, అధిక్షేపాన్ని వర్ణించేందుకు ఆటవెలది, కందపద్యాలు చాలా అనువుగా ఉంటాయి. కవి ఆటవెలదిని ఎన్నుకున్నారు. ఇది పూర్వలాక్షణిక సంప్రదాయానుసరణ.  భాషాశైలిలో కొన్ని ప్రయోగాలున్నాయి. ఇది ఆధునికకవిత్వవికాసానికి, ప్రయోగానికి చెందిన మార్గం.
                ‘‘ఆటవెలది నాట్యమాడిరచు నేర్పరి

                అలతి పదములందు అంత్య ప్రాస

                మధురభావములకు  మల్లెమాలయె సాటి

                మల్లవరపు మాట మల్లెమూట’’

                ‘‘లలితపదములన్ని లాలిత్యముగ గూర్చి

                నడకసోయగములు నాట్యమాడ

                జగతికంకితంబుజంధ్యాలపద్యాలు

            మల్లవరపు మాట మల్లెమూట ’’ అని సహజకవిగా పేర్గాంచిన మల్లెమాలకవిత్వాన్నీ, ‘కరుణశ్రీపేరుతో ప్రఖ్యాతిగాంచిన జంధ్యాల పాపయ్యశాస్త్రిగారి కవిత్వాన్ని ప్రస్తావించారు రాజేశ్వరరావుగారు. మరోచోట పోతన, జాషువా కవిత్వంలోని మాధుర్యాన్నీ గుర్తుచేసుకున్నారు. ఇవన్నీ ఛందస్సు, వృత్తాల ఎంపికతోపాటు, భావసౌకుమార్యాన్నీ, లాక్షణికుల సూత్రాల్నీ తన పూర్వీకులనుండి అనుసరించిన సంప్రదాయక లక్షణాలుగా భావించే అంశాలు. గతమంతా కొట్టిపారేయలేమనే సూచనకు నిదర్శనాలు. ఇన్స్సెక్టరయ్యలు, రిజరువేషనులు, హస్తిపురపురేడు, కాంటరాక్టరు, జాష్వ మొదలైన పదాలు ఛందస్సుకోసం కొన్ని, సహజత్వం కోసం మరికొన్నింటినీ ప్రయోగించారుకవి. ఈ శతకంలో ప్రతిపద్యమూ మధురమైన భావాన్ని అందిస్తుంది. స్పందనతో పాటు సందేశాన్నీ ఇస్తుంది. సమకాలీనతను  గుర్తిస్తూనే భవిష్యత్తుకి మార్గాన్ని వేస్తుంది. గతవైభవాన్ని స్మరిస్తూనే మంచిని స్వీకరించమంటుంది.
                ‘‘ఒంటిమీద గుడ్డ నుండనీయరు నటీ

                మణుల నటన భంగిమలను గాంచ

                సిగ్గునెఱుగనట్టి చిన్నారులైనారు

                మల్లవరపు మాట మల్లెమూట’’ అనడంలో  కవి తన చక్కని అధిక్షేపంతో పాఠకుణ్ణి ఆనందింపజేస్తూనే, ఆలోచించమంటారు. సినిమాల్లో ఒకప్పటి క్యాబరేడాన్స్‌ నుండి రకరకాల పాత్రలవరకూ అనీ నేటి సినీ హీరోయిన్సే పోషించేతీరుని ఛమత్కారంగా మనముందుంచారు కవి.
                ‘‘మతములన్నియు జనుల హితమునే కూర్చును

                 సతము వాని నమ్మి సాగువారి

                బ్రతుకులందు శాంతి భావాలు వెలుగొందు

            మల్లవరపు మాట మల్లెమూటఅని రాశారు కవి.ఈ సందర్భంలో కొంతమంది పాఠకులకు గురజాడ వారు ప్రవచించిన ‘‘మతములన్నియు మాసిపోవును/జ్ఞానమొక్కటి నిలిచివెలుగును’’ అనేది గుర్తుకొస్తుంది. మతం అంటే ఒక జీవనవిధానం. ప్రతి మానవుడు ఏదొక జీవనవిధానానికి లోబడే బతుకుతుంటాడు. కానీ, అది మౌఢ్యం కానంతవరకు, ఇతరులకు ఇబ్బందిని కలిగించనంతవరకు ఆ మనిషి ఏ మతాన్నిఆచరించినా ఫర్వాలేదు. అప్పుడు మతం మానవాళిని జాగృతం చేసే దిశానిర్దేశమవుతుందని భావిస్తున్నారనిపిస్తుంది.ఈ దృష్టితో చూసినప్పుడు హేతువాదిగా జీవించడం కూడా ఒక జీవనవిధానమే.మన జీవనవిధానం ఇతరులకు బాధకలిగించనంతవరకూ అది హితమునే కోరుతుంది. మన జీవనవిధానం ఇతరులకు హాని కలిగించకుండా ఉండటంతో పాటు, ఇతరుల జీవనవిధానం మనకీ ఆటంకంగా మారనంతవరకూ ఎవరికెలాంటి ఇబ్బందీ ఉండదు. మనం స్వేచ్ఛగా, సంతోషంగా, సుఖంగా ఉండాలనుకోవడం ఎంతముఖ్యమో, ఇవన్నీ ఇతరులకు నష్టదాయకంగా, కష్టదాయకంగా మారుతున్నప్పుడు శాంతిప్రశ్నార్థకమవుతుంది. యుద్ధానంతర శాంతికంటే, యుద్ధమేలేని శాంతిగొప్పదికదా!
         శతకమంతా నేనే వివరించుకుంటూ పోతే పాఠకుడేమి చదువుతాడు. శతకమంతా చదివిన తర్వాత కవిగారే తల్లిగొప్పతనాన్నివర్ణిస్తూ చెప్పిన పద్యంతో దీన్ని ముగించాలనిపిస్తుంది.కవిత్వమొక తీరని దాహమన్నాడు శ్రీశ్రీ. సమాజంలో జీవిస్తున్న బాధ్యతాయుతమైన కవిగానీ, కళాకారుడు గానీ తన చుట్టూ జరుగుతున్నవాటికి స్పందించడంలో కళాత్మకతఉంటుంది. అది బయటకొచ్చేవరకు పురిటినొప్పులుభరించాల్సిందేనన్నట్లుంటుంది. కొన్నిసార్లు గుండెగొంతులో కొట్లాడుతూనే ఉంటుంది. నిలబడనీయదు. అందరిలో ఉన్నా ఒంటిరిని చేస్తుంది. ఒంటరిగా ఉన్న సమూహాన్నీ చేస్తుంది. అది బయటకొచ్చినతర్వాత కవి గొప్ప రిలీఫ్‌ పొందుతాడు. తన సృష్టినితనివితీరా చూసుకొని మురిసిపోతాడు. ఇక్కడ కవి పిల్లల్ని కనే ముందు తల్లిపడే కష్టంలాంటిదాన్నే అనుభవిస్తాడు. కవి మల్లవరపు రాజేశ్వరరావుగారు అటువంటి తల్లిగురించెలా వర్ణించారో చూడండి. చెప్పకనే తల్లినీ, తల్లిలాంటి కవి తీయనిబాధనీ అద్భుతంగా మనకందించారు.
                ‘‘కనెడివేళ తల్లి కష్టంబు పడునెంతొ

                కాన్పులైన పిదప కలత మరచు

                హత్తుకొనును బిడ్డ పొత్తిళ్ళలో నుంచి

                మల్లవరపు మాట మల్లెమూట’’
            ఈ శతకం మల్లవరపు రాజేశ్వరరావుగారిలోని కవిత్వకళను, సామాజిక సమస్యల్ని రసావిష్కరణ చేయగల నైపుణ్యాన్ని, వారి భావుకతనీ పట్టిచూపుతుంది. ఆయన కలం నుండి ఒక సంపూర్ణ కావ్యం కోసం పాఠకుడు ఎదురుచూసేలా చేస్తుంది.                             
ªªªªªªªªªªªªªªªªªªªªªªªªªªªªªªª
డా॥దార్ల వెంకటేశ్వరరావు, అసిస్టెంటు ప్రొఫెసరు, తెలుగు శాఖ, హైదరాబాదు విశ్వవిద్యాలయం, హైదరాబాదు. 
...................
( మల్లవరపు రాజేశ్వరరావు గారి ‘‘మల్లవరపు శతకం’’ పుస్తకానికి నేను  రాసిన ముందుమాట)