తెలంగాణ
చరిత్ర, సాహిత్య చరిత్రల్లో ఒక చెరిగిపోని సంతకం.
పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో ఒక
కాన్ఫిడెన్సియల్ పనిమీద వెళ్లాను. మూడురోజుల పాటు వెళ్ళాలి. మార్చి, 12 నుండి 14
వరకు ఆ పనిఉంది. సంగిశెట్టి శ్రీనివాస్ ఒక డిగ్రీకళాశాలలో లైబ్రరీలో అసిస్టెంటు
ప్రొఫెసరుగా పనిచేస్తున్నారని తెలుసు. అంతకంటే ముందు ఆయన ఒక చక్కని పరిశోధకుడనీ
తెలుసు. రెండుమూడు సభల్లో నేనూ, ఆయన వేదికలను పంచుకున్న రోజులుకూడా ఉన్నాయి.
తాడినాగమ్మ కథలను ప్రచురించి, నా చేత కూడా మాట్లాడించాడాయన. తెలంగాణా సాహిత్య
చరిత్రను పునర్మూల్యాంకనం చేస్తున్నవారిలో సంగిశెట్టి శ్రీనివాస్, డా.సుంకిరెడ్డి
నారాయణరెడ్డి, కాసుల ప్రతాపరెడ్డి మొదలైన వాళ్ళపట్ల నాకు ఒక గౌరవభావం ఉంది.
నిరంతరం పనిచేస్తున్నారు.
అందుకేవాళ్ళ పట్ల నాకు గౌరవం ఉంది. సంగిశెట్టి
శ్రీనివాస్ సబాల్టర్న దృష్టికోనం నాకింకా బాగా నచ్చుతుంది. తెలుగు కథ గురించి ఆయన
చేసిన పరిశోధన తర్వాతనే నాకు తెలిసినంతవరకు బండారు అచ్చమాంబను విస్తృతంగా
గుర్తుచేసుకోవడం మొదలుపెట్టారు-సాహితీవేత్తలు. ఆయన ఏదైనా ఒక కొత్తపుస్తకం వేస్తే,
దాన్ని ఏదొకలా నాకు అందిస్తుంటారు. విశ్వవిద్యాలయంలో ప్రొఫెసరుగా ఉండడం వల్ల మాకు
చాలా పుస్తకాలు వస్తుంటాయి. అన్నింటినీ వెంటనే చదవలేము, కొన్ని చదవబుద్ధికాదుకూడా!
కానీ, సంగిశెట్టి శ్రీనివాస్ ఏదైనా ఒక పుస్తకం వేస్తేదాన్ని నేను నమ్మకంగా
చదువుతాను. ఆసక్తిగా చదువుతాను. ఇష్టంగా చదువుతాను. సమయం వ్యర్థం కాదని సంతోషిస్తూ
చదువుతాను. 12మార్చి 2018న కలిసి, మరలా నా పనిలో నేను నిమగ్నమైపోయాను.
జానపదకళలుశాఖ, అధ్యక్షుడు డా.గడ్డం వెంకన్నగారు నన్ను ఆహ్వానించగా ఒక
కాన్ఫిడెన్సియల్ వర్క్ పై యూనివర్సిటిలో ఉన్నానను ముందే చెప్పానుగా. ఇద్దరం కలిసి
ఆ పనిచేస్తూమాటల సందర్భంలో సంగిశెట్టి ప్రస్తావన వచ్చింది.
పుస్తకాలివ్వాలనుకుంటున్నారని, భోజనం సమయంలో వస్తానని చెప్పారని డా.వెంకన్న నాతో
అన్నారు. మనదగ్గరకెందుకు మనమే భోజనం అయిన తర్వాత వెళ్దామని, ఆయన దగ్గరకు వెళ్లాం.
ప్రస్తుతం డిప్యుటేషన్ పై పొట్టిశ్రీరాములు తెలుగువిశ్వవిద్యాలయంలో
పనిచేస్తున్నారు-శ్రీనివాస్.
ఎప్పటిలాగా నవ్వుతూ పలకరించారు.
ఆయన టేబుల్ పై ఒక కంప్యూటర్ ఉంది. అది ఆన్ చేసి ఉంది. ఎదురుగా ప్రముఖరచయిత షరీఫ్ కూర్చొన్నారు.
మేము వెళ్ళి పలకరించాం. చాలా సంతోషపడ్డారు. కాసేపు సాహిత్యం, సాహిత్య రాజకీయాలు
మాట్లాడుకున్న తర్వాత, దళితులు, దళితుల్లో మరలా మాదిగల జీవితాల్ని ఆంగ్లేయులు
ఇంగ్లీషులో భద్రపరిచిన ఎమ్మా రొషాంబు క్లౌ (Emma Rauschenbusch Clough; 1859- 1914) ఇంగ్లీషులో రాసిన While Sewing Sandals
Or Tales of a Telugu Pariah Tribe అనే పుస్తకం గురించి చర్చవచ్చింది. దీనితో పాటు వీరి భర్త కూడా
గొప్పరచన ఒకటి చేశారని, వెంటనే తన కంప్యూటర్ ఆర్కైవ్స్ నుండి ఆ పుస్తకాన్ని ఓపెన్
చేసి చూపించాడు శ్రీనివాస్ గారు. నాకు చాలా సంతోషం అనిపించింది. దాన్ని నేను
ఇంతవరకూ చూడలేదు. కానీ, ఎమ్మా రొషాంబు క్లౌ పుస్తకం నాదగ్గరుందని చెప్పాను. దీని
గురించి ఆచార్య గుజ్జర్లమూడి కృపాచారి గారు కూడా తన పరిశోధనలో ప్రస్తావించారనీ
చెప్పాను. ఆయన డిప్యుటేషన్ పై వచ్చినా, తన స్వీయ
కార్యక్రమాలు నెరవేర్చుకోకుండా, తెలంగాణ సాహిత్య రచనకు తనవంతూ కృషిచేస్తున్నాడని
మరోసారి అనుకున్నాను. మాతో మాట్లాడుతూనే, ఆఫీసులో జరుగుతున్న పుస్తకాల టైపింగు
వర్కుకి సంబంధించిన సూచనలు కూడా చేయడం గమనించాను. మాట్లాడుతూ ఒకసారి లేచి, తన
ఎడమవైపు రాక్ లో ఉన్న పుస్తకాల కట్టలను కొన్ని ఇప్పి, కొన్ని తీసుకొచ్చి నాకు
ప్రేమగా బహూకరించాడు. దానిమీద నా పేరు రాయలేదు; కానీ, నేను అడగకుండానే పట్టుకొచ్చి
ఇచ్చాడు. ఎంతోకొంత డబ్బులిద్దామనిపించింది. మరలా బాగుండదనీ అనిపించింది. పుస్తకాలు,
అవీ తెలుగు పుస్తకాలు వేయడం వరకే తప్ప, వాటి ప్రచురుణ ఖర్చుకూడా మరలా ఎంతమందికి
తిరిగివస్తుందో తెలియదు. కానీ, శ్రీనివాస్ గారి పుస్తకాలకు మంచి మార్కెట్
ఉంటుందనుకుంటున్నాను. కాబట్టి, ఆయనకు ఆ ఇబ్బంది ఉండకపోవచ్చు. అయినా ఇవన్నీ ఒక
నిమిషంలో నాలో నేను తర్కించుకొని, వాటిని స్నేహపూర్వకంగానీ తీసుకోవాలనుకున్నాను.
ఆయన సంతకం చేసివ్వమన్నాను. నాగురించి ఆయన రాసిన‘దళితసాహిత్యానికి, చరిత్రకు బలమైన పునాదులు
వేస్తున్న ఆత్మీయ మిత్రులు దార్లకు’ అనే మాటలు నాకు చాలా సంతోషాన్ని కలిగించాయి.
నాకు తెలంగాణ నవలాచరిత్ర
( 1956వరకు), తొలికారు ( తెలంగాణ తొలినాటు ఆధునిక కవిత్వం), ఇందుమతి కవిత్వం,
బొమ్మాహేమాదేవి కథలు, శ్రీవాసుదేవరావు కథలు, భాగ్యనగరవైభవం (దైదవేములపల్లి
దేవేందర్) పుస్తకాలను నాకిచ్చారు.
సంగిశెట్టి పుస్తకం ఏది
వచ్చినా ముందుగా ఆయన సంపాదకీయం లేదా ముందుమాట చదువుతాను. వీటికి రాసిన సంపాదకీయాలు
కూడా ఆయన పట్ల నాకు ఆ గౌవరవాన్ని అలాగే నిలిపాయి. అన్నిపుస్తకాలు
చదవాలనిపిస్తుంది. చదువుతాను. మీతో పంచుకునే ప్రయత్నమూ చేస్తాను.
సంగిశెట్టిశ్రీనివాస్
గారూ... మీకేమివ్వగలను... నాకు కలిగిన భావాల్లో కొన్నింటిని ఒక పద్యంలో పెట్టే
ప్రయత్నం చేశాను.
కం. నవ్యతెలంగాణచరిత
దివ్యమనుచు మనకు చూపె దిమ్మతిరగగన్
సవ్యముగ సంగిశెట్టి యె
నవ్యుఁడతఁడు సత్యశోధన కలిగియుండెన్
దివ్యమనుచు మనకు చూపె దిమ్మతిరగగన్
సవ్యముగ సంగిశెట్టి యె
నవ్యుఁడతఁడు సత్యశోధన కలిగియుండెన్
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి