"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., Ph.D., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL 801 Research Methodology ఉదయం11.00 నుండి12.00 గంటల వరకు, TL-426: Indian Literature క్లాసులు మధ్యాహ్నం 2.00 గంటల నుండి 3.00 గంటల వరకు జరుగుతాయి.

వ్యాసాలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
వ్యాసాలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

31 డిసెంబర్, 2025

డా. వూటుకూరి వరప్రసాద్ గారి వ్యాస సంపుటి 'భిన్న స్వరాలు'

 


డా. వూటుకూరి వరప్రసాద్ గారు మంచి కవి, విమర్శకులు. అంతకుమించి ఉత్తమ ఉపాధ్యాయులు, వీటన్నింటికీ మించి దైవ భక్తులు. మనిషిని ప్రేమిస్తారు. ఆయనతో కాసేపు మాట్లాడితే మనసంతా హాయిగా ఉంటుంది. దానికి కారణం ఆయన మాటల్లోని స్వచ్ఛత. ఆయన కవిత్వం చదివినా, ఆయన వ్యాసాలు చదివినా అంతే ఆనందాన్నీ, విజ్ఞానాన్నీ కలిగిస్తాయి. ఆయన అప్పుడప్పుడు రాసిన కొన్ని వ్యాసాలను ఒక పుస్తకంగా ప్రచురిస్తున్నారు. కవులు, సాహితీవేత్తలు, వైద్యులు, వివిధ రంగాలలో పనిచేసిన గొప్ప వాళ్ళలో కొంతమంది గురించి ఒక్కొక్క వ్యాసంగా రాసి ఆ వ్యాసాల సంపుటిని ఒక పుస్తకంగా ప్రచురిస్తున్నారు.

_______________

తెలుగు భాషా సాహిత్యాలకు ఎనలేని కృషిచేసిన సి.పి.బ్రౌన్ కృషిని తన వ్యాసంలో కొండను అద్దంలో చూపించినట్లుగా అద్భుతంగా వివరించారు. సి.పి.బ్రౌన్ గురించి బంగోరె, ఆచార్య కొత్తపల్లి వీరభద్రరావు, డా॥ జానమద్ది హనుమచ్చాస్త్రి, డా॥ జోలెపాలెం మంగమ్మ, వి. చెంచయ్య మొదలైన వారు వివిధ గ్రంథాలు రచించారు. ఆ గ్రంథాల్లో సారాంశాన్ని, అది కూడా తెలుగు భాషా సాహిత్యాలకు చేసిన సేవను ఒక్క వ్యాసంలో అందించడం అభినందించతగ్గ విషయం.
______________

అలాగే ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతలు పొందిన క్యాన్సర్ వైద్యులు డా. నోరి దత్తాత్రేయుడు, సాఫ్ట్వేర్ రంగంలో దిగ్గజం సత్య నాదెండ్ల గురించి రాసిన వ్యాసాలు గొప్ప స్ఫూర్తిని కలిగిస్తాయి. వాళ్లు మన తెలుగు వాళ్ళు కావడం మనం మరింత గర్వించదగిన అంశాలని గుర్తుచేస్తాయి. సాంకేతిక యుగంలో ప్రపంచ గమనాన్ని మార్చిన మైక్రోసాఫ్ట్ వంటి అగ్రశ్రేణి సంస్థకు సీఈఓగా పనిచేసిన తెలుగువాడు సత్య నాదెళ్ళ జీవిత గాథను, నాయకత్వ లక్షణాలను ఈ వ్యాసం పరిచయం చేస్తుంది. వైఫల్యాల నుంచే విజయాలను సాధించాలనే ఆయన స్ఫూర్తిదాయక సిద్ధాంతం, మైక్రోసాఫ్ట్‌ను తిరిగి లాభాల బాట పట్టించడంలో ఆయన చూపిన అసాధారణ సామర్థ్యం ఇందులో విశ్లేషించారు.

భారతదేశానికి తొలి నోబెల్ తెచ్చిన రవీంద్రనాథ్ ఠాగూర్, జ్ఞానపీఠ పురస్కార గ్రహీత డాక్టర్ సి.నారాయణరెడ్డి గార్ల సాహిత్యంపై విలువైన అభిప్రాయాలను వ్యక్తీకరించారు.

దళిత, క్రైస్తవ సాహిత్యంపై పరిశోధన చేసిన డాక్టర్ వరప్రసాద్ ఆ సాహిత్యంలో కృషి చేసినటువంటి వ్యక్తుల గురించి రాసిన వ్యాసాలు ఎంతో ప్రామాణికంగా కనిపిస్తున్నాయి. రెవరెండ్ విలియం డాసన్, పురుషోత్తమ చౌదరి చేసిన క్రైస్తవ సాహిత్య సేవను అద్భుతంగా ఆవిష్కరించారు. సంకీర్తనా వాఙ్మయంలో అన్నమాచార్యులు, క్షేత్రయ్య, త్యాగయ్య వంటి భక్త కవులు తమదైన ముద్ర వేశారు. వారి కోవకు చెందిన, తెలుగులో తొలి క్రైస్తవ వాగ్గేయ కారుడు, కవి సార్వభౌముడు పురుషోత్తమ చౌదరి. తెలుగులో తొలి విదేశీ వాగ్గేయకారుడు రెవరెండ్. విలియం డాసన్ (1816-1875) జీవితం, ఆయన అందించిన విశేష సేవలను పరిచయం చేసే వ్యాసం ఉంది.

లండన్ మిషనరీ సొసైటీ తరపున విశాఖపట్నానికి వచ్చి, తెలుగు నేలపై స్థిరపడిన ఈ భక్తుడు, తెలుగు క్రైస్తవ కీర్తనల వాఙ్మయానికి గొప్ప పునాది వేశారు. తెలుగు భాషను అభ్యసించి, వందలాది కీర్తనలు రచించడంతో పాటు, వాటిని క్రోడీకరించి ముద్రించడం ద్వారా స్థానిక భక్తి సంప్రదాయానికి నూతన ఒరవడిని అందించారు. తెలుగు సాహిత్యానికి, భక్తి సంగీతానికి ఒక విదేశీయుడు అందించిన ఈ అమూల్యమైన సేవ గురించి ఈ వ్యాసం విశ్లేషిస్తుంది.

ఆధ్యాత్మిక రంగంలో తనదైన ప్రత్యేక ముద్రతో పాటు దళితులకు ప్రత్యేక ఆధ్యాత్మిక మార్గాన్ని సూచించిన సంత్ రవిదాస్ గురించి రాసిన వ్యాసం ప్రత్యామ్నాయ మత జీవన విధానాన్ని తెలియజేస్తుంది. హిందూ సమాజంలో అంతర్భాగంగా కనిపిస్తూనే సంత్ రవిదాస్ ప్రబోధించిన అంశాల యొక్క విలువను ఎంతో లోతుగా విశ్లేషించారు. ప్రాచీన భారతీయ సమాజంలో పాతుకుపోయిన కులాధిక్యతను, అసమానతలను ప్రశ్నించి, దైవం ముందు అందరూ సమానులే అని ప్రబోధించిన ఆ మహనీయుని జీవితం, భక్తి తాత్విక భావజాలాన్ని వివరిస్తుంది. మనిషి పుట్టుక కన్నా మంచి సంకల్పం, పవిత్రమైన కర్మలే గొప్పవని చాటిచెప్పిన ఆయన బోధనలు, నాటి సామాజిక జీవనంలో వెనకబాటుతనంతో మగ్గుతున్న ప్రజలకు గొప్ప మార్గదర్శిగా నిలిచాయి.

ఎంత తవ్వినా తరగని బంగారు గని లాంటి వాడు వేమన. ఆయన సామాజిక దృక్పథాన్ని పునర్ మూల్యాంకన దృష్టితో వరప్రసాద్ గారు చక్కగా వ్యాఖ్యానించారు. తెలుగు సాహితీ చరిత్రలో ఇతిహాసాల అనువాదాలు, పురాణాల ఆధారిత ప్రబంధాల ధోరణి కొనసాగుతున్న రోజుల్లో, వర్తమాన సామాజిక జీవన స్థితిగతులకు అద్దం పడుతూ రచనలు చేసిన తొలి సామాజిక కవి వేమన. 17వ శతాబ్దానికి చెందిన ఈ కవి, నాటి పాలకుల కుటిల నీతిని, మతాల సంఘర్షణను, మూఢత్వాన్ని, కుల మత భేదాలను ప్రశ్నించిన సామాజికాంశాలను ఈ వ్యాసం వివరిస్తుంది.

బోయి భీమన్నగారు అంబేద్కర్ మార్గాన్ని అనుసరిస్తూనే, వర్గ దృక్పథాన్ని కూడా ఎలా సమన్వయించుకోవాలో చెప్పడంలో ఎంతో నిష్ణాతులు. దాన్ని ‘కూలి-రాజు’ నాటకం ద్వారా ఎలా అన్వయించుకోవాలో వరప్రసాద్ గారు చక్కగా విశ్లేషించారు.

తెలుగు సాహిత్యంలో సంజీవ్ దేవ్ గొప్ప సౌందర్య అన్వేషకుడు. ఆయనను పరిచయం చేసిన వ్యాసం ఎంతో విలువైంది. ప్రకృతిని గురువుగా, దైవంగా, ఆప్తమిత్రుడిగా భావించి, “ప్రకృతిని ప్రేమించగలిగితే ప్రశాంత జీవనం సాధ్యమౌతుంది” అని ప్రకటించిన కళాతత్వవేత్త డాక్టర్ సంజీవ్ దేవ్. చిత్రకళా విమర్శకుడిగా, చిత్రకారుడిగా, తాత్వికుడిగా బహుముఖ ప్రజ్ఞను ప్రదర్శించిన ఆయన, మానవాళి క్షేమం కోసం తన ఆలోచనలను, ఆవిష్కరణలను ప్రజలందరికీ చేరువయ్యేలా చేయడానికి ప్రయత్నించారు.

నంబూరి పరిపూర్ణ గారి జీవితంలో పాటించిన అనేక ఆదర్శాలను వివరించిన వ్యాసం ఎంతోమందికి స్ఫూర్తిదాయకం. నంబూరి పరిపూర్ణ కథల్లోని ప్రగతిశీల భావాలు మూడు ముఖ్య అంశాలుగా కనిపిస్తాయి: 1.సామాజిక అసమానతలపై ప్రశ్నించడం…ఆమె రచనల్లో కులమత బేధాలు, బీద, గొప్ప తారతమ్యాలు, కర్మ సిద్ధాంతం వంటి సాంఘిక, మత సంబంధమైన ఆలోచనలపై చర్చ జరిపారు. 2.ఆధిపత్య ధోరణి ఖండించడం… కులాంతర వివాహం చేసుకున్న దంపతుల మధ్య అగ్రకులస్తుడైన భర్త (భూషణం) ప్రదర్శించే ఆధిపత్య ధోరణి, పనిచేయనితనాన్ని సమర్థించుకునే స్వభావాన్ని స్పష్టంగా చిత్రించారు, ఆర్థిక సంబంధాలు లేని మానవ సంబంధాలు నిలబడటం కష్టమని సూచించారు. 3.స్త్రీ సాధికారత ప్రేరేపించడం…‘లచ్చుప్ప’ పాత్ర ద్వారా, భర్త అన్యాయం చేసినా అధైర్యపడకుండా, వ్యక్తిగత ప్రేమ కంటే ప్రజాసేవకు, గ్రామాభివృద్ధికి ప్రాధాన్యతనిచ్చి, సర్పంచ్‌ గా ఎదిగిన శ్రమశక్తి మరియు స్త్రీ మూర్తి రూపాన్ని ఆవిష్కరించారు.

దళిత సాహిత్యంపై వరప్రసాద్ రాసిన వ్యాసంలో పురుషులు, స్త్రీలు రాసిన దళిత సాహిత్యాన్ని విశ్లేషించారు. తెలుగు రచయిత్రులు తమ స్వేచ్ఛాయుత భావజాలాన్ని కవిత్వం, కథల ద్వారా సమాజంలో పంచుకున్న తీరును వివరిస్తూ, ఈ సంకలనంలో ‘దళితవాద దృక్పథం’ పై దీన్ని ఒక ప్రత్యేక వ్యాసంగా చెప్పుకోవచ్చు. కుల, లింగ వివక్షల కారణంగా దళిత స్త్రీలు ఎదుర్కొంటున్న అణచివేత, అదనపు కష్టాల వంటి సంక్లిష్ట సమస్యలను రచయిత్రులు తమ సృజనాత్మక రచనల్లో బలంగా ప్రశ్నించిన విధానం ఇందులో విశ్లేషించబడింది.

హర్షవర్థన్ గారి నానీలను విశ్లేషిస్తూ సమాజంలో ఉన్న సమస్యలను కవిత్వం చేసిన కవిగా అభివర్ణించారు. నా (ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు) ‘నెమలికన్నులు’ కవిత్వం గురించి ఒక చక్కని విశ్లేషణాత్మక వ్యాసం రాశారు. మరోవైపు, కృష్ణానదీ తీరాన వెలసిల్లిన ధాన్యకటకం (అమరావతి) తెలుగు రాజులైన శాతవాహనుల రాజధానిగా ప్రసిద్ధి చెందింది. బౌద్ధ, జైన, శైవ, వైష్ణవ, ముస్లిం, క్రైస్తవ సంప్రదాయ సంస్కృతుల ప్రభావాలను తనలో నింపుకుని ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక రాజధానిగా నిలిచిన అమరావతి, నవ్యాంధ్ర రాష్ట్ర రాజధానిగా ఎంపిక కావడంతో పాటు, దాని చారిత్రక వైభవాన్ని గుర్తుచేస్తుంది. మొత్తం మీద వ్యక్తుల కేంద్రంగా కొనసాగిన ఈ పుస్తకం కొంతమంది వ్యక్తిత్వాలు పదిమందికి ఆదర్శనీయం అవుతాయో తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది.ఈ పుస్తకంలో కనిపించే ఏకసూత్రత అదే.

మొత్తం మీద డా.వూటుకూరి వరప్రసాద్ గారి ఆలోచనా తత్వాన్ని ఈ విధంగా క్రోడీకరించవచ్చుననుకుంటున్నాను.

వ్యక్తిత్వ ప్రేరణ (Inspiration through Individuals): తెలుగు భాషా సాహిత్యాలకు కృషిచేసిన సి.పి.బ్రౌన్, క్యాన్సర్ వైద్యులు డా. నోరి దత్తాత్రేయుడు, సాఫ్ట్‌వేర్ దిగ్గజం సత్య నాదెండ్ల వంటి గొప్ప వ్యక్తుల జీవితాలు, వారి విజయ గాథలు పదిమందికి ఆదర్శం కావాలని ఆయన బలంగా విశ్వసించారు.
_____________

సామాజిక, తాత్విక పునర్ మూల్యాంకనం (Socio-Philosophical Re-assessment): ఆయన రచనలు వేమన, సంత్ రవిదాస్, బోయి భీమన్న వంటి మహనీయుల సామాజిక దృక్పథాన్ని, భక్తి తాత్విక భావజాలాన్ని లోతుగా విశ్లేషించడం ద్వారా ప్రత్యామ్నాయ మత-సామాజిక జీవన విధానాలను మరియు సాహిత్య విమర్శకు ప్రాధాన్యతనిచ్చారు.
_______________

ప్రగతిశీల దృక్పథం (Progressive Outlook): దళిత మరియు క్రైస్తవ సాహిత్యం పట్ల ఆయనకున్న పరిశోధనాత్మక దృష్టి, అలాగే కుల, లింగ వివక్షలు వంటి సంక్లిష్ట సామాజిక సమస్యలను రచయిత్రులు ప్రశ్నించిన తీరును విశ్లేషించడం, ఆయనలోని ప్రగతిశీల భావజాలాన్ని ప్రతిబింబిస్తుంది.

సాహిత్య సమన్వయం (Literary Synthesis): ప్రపంచ గమనాన్ని మార్చిన ఆధునిక సాంకేతికత నాయకుల (సత్య నాదెండ్ల) స్ఫూర్తి, వేదనాత్మక దళిత కవిత్వం (దార్ల వెంకటేశ్వరరావు గారి ‘నెమలికన్నులు’) మరియు ప్రాచీన భక్తి కీర్తనల వాఙ్మయాన్ని (విలియం డాసన్, పురుషోత్తమ చౌదరి) ఒకే వేదికపైకి తీసుకురావడం ద్వారా గతం-వర్తమానం-భవిష్యత్తుల మధ్య చైతన్య స్ఫూర్తిని నింపాలని ఆకాంక్షించారు.

ఈ వ్యాసాల ద్వారా డా.వూటుకూరి వరప్రసాద్ గారిలోని విమర్శతత్వం, లోతైన తాత్వికతను మనం చూడగలుగుతాం. మంచి వ్యాసాలను అందించిన రచయితకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

- ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు , తెలుగు శాఖ పూర్వ అధ్యక్షులు, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, హైదరాబాద్ 

( ఈ వ్యాసం సృజన క్రాంతి దినపత్రిక, ఆదివారం 28.12.2025 వ తేదీన ప్రచురితమైంది)

30 సెప్టెంబర్, 2021

గుర్రం జాషువా ( రాయలసీమ జాగృతి ప్రత్యేక సంచిక సెప్టెంబర్ 2021)

విశ్వమానవ కవి గుర్రం జాషువా పేరుతో ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు రాసిన వ్యాసం రాయలసీమ జాగృతి మాసపత్రిక సెప్టెంబరు 2021 ప్రత్యేక సంచికలో ప్రచురించారు. 








17 డిసెంబర్, 2016

ప్రసిద్ధ పంజాబీ రచయిత నిందర్ ఘుగైణ్వి తో దార్ల

ప్రసిద్ధ పంజాబీ రచయిత నిందర్  ఘుగైణ్వి, ఉర్దూ జాతీయ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ పఠాన్ ఖాన్ గార్లతో డా.దార్ల వెంకటేశ్వరరావు
నిందర్  ఘుగైణ్వి రాసిన ఆత్మకథను తెలుగులోకి  ప్రొఫెసర్ పఠాన్ ఖాన్ అనువదించారు. దీనికి నేను ముందుమాట రాశాను.
ఆ ముందుమాటను ఇక్కడ చదవవచ్చు.

పంజాబ్‌ లో ప్రసిద్ధ పాత్రికేయుడు, ఆకాశవాణి న్యూస్‌ రీడర్‌, రచయిత నిందర్‌ ఘుగైణ్వి (Ninder Ghugianvi) తన 20 వ యేట ప్రభుత్వ ఉద్యోగంలో పనిచేసినప్పుడు పొందిన అనుభవాలను గుదిగుచ్చి మాత భాషలో రాసిన ఆత్మకథ పేరు ‘‘మై సాన్‌ జడ్జి ద ఆర్డర్లి’’. ఆంగ్లంలో ఇది ‘‘I was a servant to a Judgeµµ పేరుతో అనువాదం అయ్యింది. ఉర్దూ, హిందీ భాషల్లో కూడా వెలువడి అనేక ప్రచురణలు పొందిన ఈ ఆత్మకథ పంజాబ్‌ విశ్వవిద్యాలయం, పాటియాలలో పాఠ్యాంశంగా కూడా ఉంది. పంజాబ్‌ లోని ప్రసిద్ధ వారపత్రికల్లో ధారావాహికంగా ప్రచురితమైన ఈ ఆత్మకథ ఆకాశవాణి, లండన్‌ లో కూడా ప్రసారమైంది. న్యాయమూర్తి దగ్గర పనిచేసే ఒక సేవకుడు సమాజంలో గొప్ప రచయితగా, ఏక్‌ తార (తంబూరా) వాయిస్తూ వాగ్గేయకారుడిగా పేరు ప్రఖ్యాతులు పొందడాన్ని సహించలేని 'గొప్ప' వ్యక్తుల మానవ స్వభావాన్ని, సమాజానికి కనిపించని హింసా స్వరూపాన్ని ఈ ఆత్మకథ మన ముందుంచుతుంది. తన పై అధికారులెంతగా అణచిపెట్టాలనుకున్నా  నిందర్‌ ఘుగైణ్విని భారత ప్రభుత్వం గుర్తించడంతో పాటుకెనడా ప్రధానమంత్రి 2001లో సాహిత్య పురస్కారంతో కూడా సత్కరించారు. సుమారు 35 పుస్తకాలను రాసిన నిందర్‌ ఘుగైణ్వి అమెరికా, లండన్‌ మొదలైన దేశాల్లో పర్యటించి తన కళా ప్రదర్శనలతో అంతర్జాతీయ కళాకారుడిగా గుర్తింపుపొందాడు. 2005లో లండన్‌ పార్లమెంటు సభ్యుల ముందు  తన తంబూరాతో పాడి శభాష్‌ అనిపించుకున్నాడు. అణచేకొద్దే పైకొచ్చే చైతన్యవంతమైన ఆ కళాతృష్ణ పొందిన మానసిక స్థితిని తెలుసుకోవడానికి మనమంతా ఈ ఆత్మకథను చదవాలి.  అంత స్ఫూర్తిదాయకమైన ఈ ఆత్మకథను ఇప్పుడు ప్రముఖ రచయిత, అనువాదకుడు, మౌలానా ఆజాద్‌ జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయంలో  హిందీ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌  డాపఠాన్‌ రహీమ్‌ ఖాన్‌ గారు  ''నేను జడ్జిగారి సేవకుడ్ని'' పేరుతో తెలుగులోకి అనువదించారు.

            ''నేను జడ్జిగారి సేవకుడ్ని'' అనే ఈ ఆత్మకథ చదువుతుంటే తెలుగులో పోలీసు ఉన్నతాధికారుల ఇళ్ళల్లో పనిచేసే చిరు పోలీసు ఉద్యోగుల జీవితంలోని చీకటికోణాలను చిత్రించిన 'ఖాకీబతుకులు' నవల గుర్తొస్తుంది. జి.మోహనరావు అనే ఒక కానిస్టేబుల్‌ ('స్ఫార్టకస్‌' కలం పేరుతో )1980-82లో ఆత్మకథాత్మక నవల  ''ఖాకీబతుకులు'' ను రాశారు. పోలీసు కుటుంబాల్లో ఆర్డర్లీ వ్యవస్థ ఎలా ఉంటుందో తెలుగు సమాజానికి ఈ నవల ద్వారా చాలా వరకు స్ఫష్టమైయ్యింది. ఆ రచన వెలువడిన  తర్వాత ఆ రచయిత అనేక ఇబ్బందులకు గురయ్యాడని వార్తలు వచ్చాయి.  ఆత్మకథ రచన కత్తిమీద సాములాంటిది. పేర్లు, సంవత్సరాలు రాసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. వాస్తవాన్ని మాత్రమే రాసినప్పటికీ, ఆ వాస్తవం సమాజంలో తీవ్రమైన శాంతిభద్రతల భంగానికి కారణం కాకూడదు. దాన్ని కళాత్మకం చేసి ప్రతీకాత్మకంగానో, వ్యంగ్యంగానో చెప్తూనే దాన్ని పాఠకులకు స్ఫురింపజేయాలి. వైయక్తికమైన రాగద్వేషాలకు ఆత్మకథలు వాహికలుగా మారకూడదు. వైయక్తిక సమస్యల్ని వ్యవస్థీకృత త సమస్యగా సాధారణీకరించి చూపగలిగినప్పుడు దానికి విలువ ఏర్పడుతుంది. ఈ పనే నిందర్‌ ఘుగైణ్వి రచనలో కనిపిస్తుంది. ఆర్డర్లీ వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్న  కొంతమంది భారతీయ న్యాయమూర్తుల భౌతిక, మానసిక స్వరూప స్వభావాల్ని రచయిత వర్ణించే ప్రయత్నం చేశాడు. ఇది కేవలం న్యాయమూర్తుల ఇళ్ళల్లోనే కాదు, కింది ఉద్యోగులను పనిచేయించుకోవడానికి అవకాశం ఉన్న అనేకమంది ఉన్నతాధికారుల ఇళ్ళల్లోనూ కనిపిస్తుంది. వివక్ష ఏరూపంలో ఉన్నా, దానికి అనేక కోణాలుంటాయి.  దీన్ని వాస్తవికంగా వర్ణిస్తూనే, తాత్త్వికంగా కథాకథన శైలిలో చక్కగా చెప్పాడు నిందర్‌ ఘుగైణ్వి.
            ప్రతివ్యక్తి తన ప్రమేయం లేకుండానే తానెదొక వర్గం, కులం, మతంలో పుడతాడు. తాను పుట్టక ముందే తన అస్తిత్వం నిర్ణయమవుతున్న సమాజంలో తన ప్రత్యేక అస్తిత్వం నిలుపుకోవడానికి నిరంతరం ఘర్షణకు గురికావాల్సిందే. అదే పరిస్థితి నిందర్‌ ఘుగైణ్వి కీ ఎదురైంది. తానొక నిరుపేద కుటుంబంలో పుట్టాడు. తనకు చిన్ననాటి నుండే కళల పట్ల ఆసక్తి. మరొక వైపు తన కుటుంబంలో ఎవ్వరూ ప్రభుత్వోద్యోగిగా లేరు. తన కుటుంబం ఆర్ధికంగా నిలబడాలంటే, తన కుటుంబంలోను ఒక ప్రభుత్వోద్యోగి ఉన్నాడనే తన తల్లిదండ్రుల కల నెరవేరాలంటే మార్గాల్ని అన్వేషించకతప్పదు. నిందర్‌ ఘుగైణ్వి కూడా అలాగే ప్రయత్నించాడు. ఒక జడ్జిగారి గుమస్తా దగ్గర చేరాడు. నెమ్మదిగా జడ్జిగారికి దగ్గరయ్యాడు. ముద్దాయిల్ని కోర్టు కేసులు విచారించేటప్పుడు వారిని పిలిచే ఉద్యోగ ప్రకటవచ్చింది. దానికి దరఖాస్తుచేశాడు. ఇంటర్వ్యూలో ఉద్యోగానికి సంబంధం లేని ప్రశ్నల్ని, ఇంటి వంటపని, తోటపని, వ్యవసాయపని, ఇంటి పనిమనిషి చేసే పనులన్నీ అడిగారు. అవన్నీ వచ్చన్నాడు. ఉద్యోగిగా ఎంపికయ్యాడు. తాను, తన కుటుంబం ప్రభుత్వోద్యోగిగా మారిన ఆనందాన్ని అనుభవించాలనుకున్నారు. తన ఉద్యోగ విధులన్నీ జడ్జిగారి ఇంటి దగ్గరేనని, జడ్జిగార్లు మారినప్పుడల్లా ఆ పనులు, వాటిని చేయించే వాళ్ళ మనస్తత్వాలు ఒక్కొక్కటి గమనించాడు. తనలో నిగూఢంగా ఉన్న కళాతష్ణ తీరట్లేదు. దాన్నెలాగోలా తీర్చుకోవాలి. దాన్ని గుర్తించి ప్రోత్సహించిన వాళ్ళు కొంతమందైతే, మరికొంతమంది ఆ కళాతృష్ణను ఎలా అణచివేయాలో ఆలోచించేవారు. ఆ కళ సమాజంలో అతనికి అదనపు గౌరవాన్ని తెస్తున్నందుకు సహించలేని ఉన్నతాధికారుల మానసిక స్వభావాన్ని, వారి ప్రవర్తననీ కళ్ళకు కట్టినట్లు వర్ణించాడు రచయిత.
            తానొక ''న్యాయమూర్తి''గా సమాజంలో గౌరవమర్యాదలున్నా, ఇంటిలో పనిమనుషుల్ని వేధించడంలోను, ''న్యాయమైన'' తీర్పు ఇవ్వడం కోసం తాను రకరకాలుగా  పొందే బహుమతులు, సమర్పణలు మొదలైనవి ఎలా ఉంటాయో పాఠకులకు దర్శింపజేశాడు రచయిత. సందర్ఛోచితంగా తన పాటల్ని ఈ ఆత్మకథలో ప్రస్తావించి తాను చెప్పబోయే అంశానికి తాత్వికతను అద్దే ప్రయత్నం చేశాడు. జడ్జిగారు ఒక్కొక్కప్పుడు తనలో తాను పొందే మానసిక సంఘర్షణను ఎవరికీ చెప్పుకోలేక, తన కింది  ఉద్యోగులపై ఎలా తీర్చుకుంటుంటాడో చాలా సందరాÄ్భల్లో వర్ణించాడు రచయిత. మాక్సిమ్‌ గోర్కీ రాసిన ‘‘అమ్మ’’ నవలలో పొద్దస్తమాను ఫ్యాక్టరీలో పనిచేసి, యజమాని తిట్టిన తిట్లు తిని, పై అధికారులనేమీ అనలేక ఇంటికొచ్చిన ఒక కార్మికుడు తన భార్యను, కొడుకునీ, ఇంటి ప్రక్కల వాళ్ళనీ ఎలా తిడుతుంటాడో వర్ణించిన చక్కని సన్నివేశం మనకి ఈ ఆత్మకథలో జడ్జిగారు తాగి తన పనిమనిషుల్ని తిట్టేటప్పుడు  స్ఫురిస్తుంది. తన కుటుంబం ఒకచోట, తానొక చోట నివసిస్తూ ఉద్యోగం చేసే జడ్జిగారి పిసినారితనాన్ని, తన కుటుంబం పట్ల ప్రదర్శించే అనురాగాన్ని, దాన్ని నిరంతరం పొందలేని ఎడబాటుకి పడుతున్న సంఘర్షణనీ ముప్పేటలా రచయిత చక్కగా వర్ణించాడు. తన మనసు బాగాలేనప్పుడల్లా తిడుతూనే మరలా తంబూరా తెచ్చి పాటపాడమని, ఆ పాట వింటూ ఆనందించేవాడు. తన మనసు బాగాలేనప్పుడల్లా, తన పనివెంటనే కానప్పుడు గానీ ఆ కళాకారుడైన పనిమనిషిని పిలిచి, ఆతనిలో దాగున్న కళాకారుని వల్లే ఆ పని చేయలేదని ఎత్తిపొడవడం, దాన్ని చూసి కళాకారుడు నవ్వుకోవడంలో ఒక గొప్పతాత్వికత ఉంది. జడ్జిగారు బదిలీ అయి మరొక చోటుకి వెళ్ళేటప్పుడు మరలా ఆ కళాకారుడ్ని దగ్గరకు పిలిచి తన హదయానికి హత్తుకొని ఏడ్చినప్పుడు దాన్ని చక్కగా వ్యక్తం చేశాడు రచయిత. ఈ ఆత్మకథలో పనిమనిషిగా ఉన్న ఆ గొప్పకళాకారుడు తన విధుల్ని నిర్వర్తిస్తూనే ఆ ఉద్యోగం మానేద్దామనుకుంటే, తన కుటుంబం అనుభవిస్తున్న పేదరికం గుర్తుకొచ్చేది. మరి తాను ఆత్మవంచన చేసుకొని, ఆత్మగౌరవాన్ని కోల్పోయి ఆ పనిమనిషిగానే జీవించాడా? ఏమిచేశాడు? ఇవన్నీ ఆత్మకథ పూర్తిగా చదివితేనే తెలుస్తాయి.
            ఇదొక అనువాద గ్రంథంలా అనిపించదు. సుమారు తొంభైశాతం వరకూ తెలుగుదనం పరిమళించేలా ఈ గ్రంథాన్ని రచయిత డాపఠాన్‌ రహీమ్‌ ఖాన్‌ మనకి అందించారు. తెలుగు సాహిత్యాన్ని మరింత సుసంపన్నం చేయడానికి ఈ ఆత్మకథ ఎంతగానో దోహదపడుతుంది. అందుకు కృషి చేసిన రచయితను అభినందిస్తూ, తెలుగు పాఠకుల్ని ఈ ఆత్మకథను చదవమని సాహితీ ప్రియులందర్నీ ఆహ్వానిస్తున్నాను.
డా॥దార్ల వెంకటేశ్వరరావు
అసోసియేట్‌ ప్రొఫెసర్‌,
 తెలుగుశాఖ, యూనివర్సిటి ఆఫ్‌ హైదరాబాద్‌,హైదరాబాదు.


19 జులై, 2011

మన సాహిత్య పరిశోధనలు - మన పర్యవేక్షకులు

surya literary page 18 -7-2011
తెలుగులో ఏదైనా ఒక కొత్తపుస్తకం వచ్చిందంటే దానిపై ఏడాది తిరక్కముందే ఏదొక విశ్వవిద్యాలయంలో పరిశోధన జరిగిపోతుందనే మాటల్ని వింటున్నాం.అంతేకాదు, విశ్వవిద్యాలయాల్లో పనిచేసే ప్రొఫెసర్స్‌ని లేదా పర్యవేక్షణార్హత ఉన్న డిగ్రీ అధ్యాపకుల్ని గాని ఆ గ్రంథావిష్కరణకు పిలిస్తే, సభలోనే హామీ కూడా దొరకవచ్చనేవ్యంగ్యబాణాలూ ఈ మధ్యనే కాదు, అంతకు ముందు నుంచే వినబడుతున్నాయి.నిజానికి చాలా సందర్భాల్లో అలా జరగడం కూడా చూస్తూనే ఉన్నాం.
కొన్ని పుస్తకాల విషయంలో పరిశోధన జరగవలసిన అవసరం ఉన్నా,  కనీసం ఆ కవితా/ కథా సంకలనం/నవలపై ఏ పత్రికలోనైనా సమీక్షలుగాని, వ్యాసాలుగాని వచ్చాయో లేదో పరిశోధకులు/ పర్యవేక్షకులుగమనిస్తున్నారో లేదో ఆధారగ్రంథాలే చెప్తున్నాయి. చాలా మంది వాటిని చూడ్డంలేదు.అలాంటప్పుడు, అసలు ఆ పరిశోధనాంశంపై పరిశోధకుడికి ఆసక్తి ఉందా? లేకపోతే పర్యవేక్షకుడు సూచించడం వల్లే దానిపై పరిశోధన చేస్తున్నాడో అనే అనుమానాలు కలగకమానవు.ఎలా చేసినా, అలాంటి పరిస్థితుల్లో వచ్చిన ఆ పరిశోధన ఆశయం ఎవరిదై ఉంటుంది? పరిశోధన డిగ్రీ పొంది, ఒకవేళ ముద్రణ జరిగి బయటకొచ్చినా, రాకున్నా, దానిపై చర్చజరిగినప్పుడు ఆ పరిశోధనలో కనుగొన్న లేదా ప్రతిపాదించిన లేదా సమన్వయించిన లేదా సేకరించిన అంశాలకు బాధ్యులెవరు? ఇవన్నీ చర్చనీయాంశాలు.
సృజనాత్మక రచయితల్లో చాలా మందికి ఒకప్రాపంచిక దృక్పథం ఉన్నట్లే, విమర్శకులకూ ఒక దృక్పథం ఉంటుంది.అలాంటిదే పరిశోధన చేయించే పర్యవేక్షకుల్లోను, పరిశోధకుల్లోను కనిపిస్తుంది.చాలా మంది ప్రాచీనసాహిత్యమో, ఆధునిక సాహిత్యమో ఇలా రకరకాల ప్రత్యేకాంశాల్లో మాత్రమే పరిశోధనలు చేయించేవారు, చేసేవాళ్ళూ ఉన్నారు.ఆ విభాగంలో మాత్రమే తమకు అవగాహన ఉండటం దీనికి ఒక ప్రధాన కారణం.ఒకవేళ ఆ విభాగంలో అవగాహన ఉన్నా, ఆ అంశాల పట్ల వ్యక్తిగతంగా తమకి ఇష్టం లేకపోవడం వల్ల కూడా దానిలో పరిశోధన చేయించరు.కేవలం ఈ అంశాలే పరిశోధన చేయించడానికి లేదా చేయడానికి కారణాలు కాని సందర్భాలు కూడా ఉండొచ్చు. భావజాలం నచ్చినా, ఆ పరిశోధకుడు/పర్యవేక్షకుడుకి ఆ అంశం నచ్చనప్పుడు తమ ఆసక్తుల్ని చంపుకుంటుంటారు.
తమ కులస్థుడైతేనో, తనప్రాంతానికి చెందినవాళ్ళైతేనో కూడా పరిశోధనలు చేయించడమో, చేయడమో జరుగుతుంటుంది.ఇప్పటి వరకు జరిగిన పరిశోధకుల్ని, పర్యవేక్షకుల్ని వారి వారి కులాల్ని గమనిస్తే, వారిరువురూ అత్యధికులు ఒకేకులానికి చెందినవాళ్లై ఉంటారు.ఇలాంటి కారణాలే తొలి, మలితరం పరిశోధకుల్లో అత్యధికంగా కనిపిస్తున్నాయి.విశ్వవిద్యాలయాల్లో జరిగిన పరిశోధనల్ని ఈ దృష్టితో పరిశీలిస్తే, ఈ విషయం స్ఫష్టమౌతుంది.
చాలా మంది పరిశోధనలు గురించి మాట్లాడినప్పుడల్లా,‘‘గతకాలము మేలు, వచ్చుకాలముకంటెన్‌’’ అన్నట్లు వ్యాఖ్యానిస్తుంటారు.నిజానికి నేడూ విలువైన పరిశోధనలన్నో జరుగుతున్నాయి.అయితే, నాటి తెలుగు భాషా, సాహిత్యాలపై జరిగే పరిశోధనలకీ, జరిగిన తీరుతెన్నులకీ ఎంతో వ్యత్యాసం ఉంది.
తొలితరం పరిశోధకులకు పరిశోధనాంశాలు విరివిగా ఉండటం వల్ల అప్పట్లో పెద్ద సమస్య ఉండేది కాదు. కేవలం కొన్ని వర్గాల వాళ్ళకే పరిశోధనావకాశాలు లభించేవి.వీళ్ళు ఒకపైపు పరిశోధనలు చేస్తూనే, తమ గురువుల సిఫారసుతో ఉద్యోగాల్లో చేరుతుంటే, మరొక సామాజిక వర్గానికి చదువుకోవడానికే అవకాశం లభించేది కాదు.ఆర్ధిక పరిస్థితులతో పాటు అనేక సామాజికాంశాలు పరిశోధనకు ఆటంకంగా నిలిచేవి. అవన్నీ జయించినా, పరిశోధన చేయాలకునేసరికి అనేక పరీక్షలకు గురవ్వాలి. కులం ప్రధాన అడ్డంకిగా నిలిచేది. తర్వాత పర్యవేక్షకులు సూచించిన అంశాన్నే చేయాలి.
నేటి పరిస్థితి అలాంటిది కాదు. విశ్వవిద్యాలయాల సంఖ్యతోపాటు, పరిశోధనలు చేసేవారి సంఖ్య పెరిగింది.నేడు చదువుకోవడం అందరికీ ఉన్న ఒక హక్కుగా మారి,విశ్వవిద్యాలయాల్లో ప్రజాస్వామిక వాతావరణం ప్రవేశించాక, తెలుగు భాషా సాహిత్యాలపై పరిశోధన చేసేవారిలో అత్యధికులు అట్టడుగు సామాజికవర్గాల వాళ్ళే కావడం జరుగుతోంది.కానీ,తొలితరంలో పరిశోధనలు చేసిన వారికున్నన్ని ఉపాధి అవకాశాలు నేడున్నాయని చెప్పలేం.చాలామంది డాక్టరేట్‌ చేసిన వాళ్ళుకు తన పరిశోధన ఉపయోగపడుతుందనే హామీలేని పరిస్థితి కనిపిస్తోంది.దీనికి కారణం, తమకి అవార్డులు ఇచ్చేవారిపైనో, ఇప్పించేవారి రచనలపైనో, తమకి ఉపయోగపడతారనుకొనేవారి ప్రభావంతోనో ఏదొక పరిశోధన చేయించేయడమే తప్ప, పరిశోధకుడి భవిష్యత్తు గురించి ఆలోచించని పర్యవేక్షకులు కూడా ఉన్నారు.
ఒక విద్యార్థి వామపక్ష ఉద్యమాల పట్ల అభిమానం ఉన్నవాడు. పరిశోధనకోసం వస్తే, ఒక గైడ్‌ ఆర్‌ఎస్‌ఎస్‌ భావజాలమున్న వారి రచనల పై పరిశోధన చేయించి సందర్భం ఉంది.అతని ఉద్యోగానికి డిగ్రీ కావాలి. అందువల్ల నోరు మూసుకొని ఆ పరిశోధన చేయాల్సివచ్చిందని వాపోయిన పరిస్థితి.దాన్నిప్పటికీ చెప్పుకోలేడు.ఇలాంటప్పుడు ఆ పరిశోధన ఆసక్తి ఎవరిదని చెప్పాలి? ఇలాంటి ఉదాహరణలెన్నో ఉన్నాయి. ఇటువంటివన్నీ పరిశీలించినప్పుడు, పరిశోధన అంశాన్ని సూచించడంలోను, చేయించడంలోను పర్యవేక్షకుడి పాత్ర ఎంతగానో ఉండటం వల్ల, భాషా సాహిత్య పరిశోధనల్లోపర్యవేక్షకుడి దృక్పథం కనిపించక తప్పదు.
 తన దగ్గర ‘‘ఇన్ని’’ పరిశోధనలు పూర్తయ్యాయనో, తమ పదోన్నతులకు ఆ సంఖ్యను ఉపయోగించుకోవడానికో మాత్రమే పర్యవేక్షణ చేయించేవాళ్ళనెలా చూడాలనే ప్రశ్న కూడా వస్తుంది. కొంతమంది తమ దగ్గర జరుగుతున్న పరిశోధనల శీర్షికలు కూడా తెలియని పర్యవేక్షకులున్నారు.ఇలాంటప్పుడు రెండు రకాలుగా పరిశోధన జరిగే అవకాశం ఉంది. పరిశోధకుడికి స్వేచ్ఛ ఉంటుంది.అందువల్ల తన భావాల్ని స్వేచ్ఛగా వ్యక్తీకరించుకోవచ్చు.ఒక్కోసారి, పర్యవేక్షకుడు నామమాత్రమైనా, మరో మార్గదర్శిగాని లేదా అనేకమంది అభిప్రాయాల వల్ల మంచి పరిశోధన వచ్చే అవకాశం ఉంది. ఇలాంటప్పుడు దురదృష్టం ఏమిటంటే, ఆ పరిశోధనకి సంతకం పెట్టడం తప్ప ఏమీ తెలియకపోయినా పర్యవేక్షకుడికీ పేరొస్తుంది.ఒకవేళ పర్యవేక్షకుడు ఎంత చెప్పినా అవగాహన చేసుకోకుండా తన ఇష్టం వచ్చినట్లు రాసేసి, రకరకాల ఒత్తుళ్ళకు గురిచేసి పరిశోధనని పూర్తి చేయించేసుకొనే వాళ్ళు కూడా ఉంటారు.అటువంటప్పుడూ పర్యవేక్షకుడే మాటలు పడాల్సిన పరిస్థితి వస్తుంది. ఏది ఏమైనా పరిశోధనలో కనిపించీ, కనిపించని ప్రేరకుడు పర్యవేక్షకుడే. పరిశోధన చూస్తే పర్యవేక్షకుడి దృక్పథం, భావజాలం కనిపిస్తుంటాయి. అలాగనీ అన్ని పరిశోధనలు అలాగే జరుగుతున్నాయనీ చెప్పలేం.

-Dr.Darla Venkateswara Rao,
Assistant Professor, 
Dept .of Telugu, 
University of Hyderabad, (Central University), 
Gachibowli, Hyderabad-500 046 
e-mail: vrdarla@gmail.com 
Ph: 040-23133563 (O), Mobile: 09989628049,

 

26 అక్టోబర్, 2010

డయాస్పోరా సాహిత్య గమ్యమేంటి?



‘‘ పవిత్ర తెలుగు దేశాన్ని వదిలేసి అమెరికాలోనూ, ఇతర దేశాల్లోనూ పూర్వం జ్యూయిష్‌ వాళ్ళలా పరాయిదేశాల్లో సెటిల్‌ అయిపోయిన తెలుగు వాళ్ళ’’నే తెలుగు డయాస్పోరా ప్రజలు అనే కొంతమంది భావిస్తున్నారు. ఇంచుమించు ఇలాంటిదే నిఘంటువుల్లో ఒక వివరణ కనిపిస్తుంది. పరాయిదేశాలకు పారిపోయి అక్కడే  సెటిల్‌ అయిన వాళ్ళనే అర్థంలో కాకుండా, విద్య, ఉద్యోగ, వివాహాది కారణాల వల్ల ఆ యా రాష్ట్రాలు, దేశాల్లో ఉండే వాళ్ళనేది నిఘంటువు ఇచ్చే రెండవ వివరణ.  డయాస్పోరా సాహిత్యంపై రాస్తున్న వేలూరి వెంకటేశ్వరరావు లాంటి వాళ్ళు దీన్నే సమర్థిస్తున్నారు.
ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతంలో అనేక యేళ్ళ పాటు గానీ, శాశ్వతంగా గాని నివసించేవాళ్ళు, తాము పుట్టి పెరిగిన ప్రాంతం మారడం ద్వారా కలిగిన తమ జీవితానుభవాల్ని ఏదొక ప్రక్రియలో రాస్తే దాన్ని డయాస్పోరా సాహిత్యం అంటారు.  దీన్నే ‘‘వలసవాద సాహిత్యం’’, ‘‘వలసాంధ్రసాహిత్యం’’, ‘‘ప్రాంతేతర ఆంధ్ర సాహిత్యంఅని కూడా పిలుస్తున్నారు.
డయాస్పోరా సాహిత్యం స్వరూప స్వభావాల పట్ల భిన్నాభిప్రాయాలు కూడా ఉన్నాయి. ‘‘20 వ శతాబ్దంలో అమెరికా తెలుగు కథానిక’’ గురించి రాసిన ఒక వ్యాసంలో వేలూరి వెంకటేశ్వరరావు డయాస్పోరా లో చిన్న  d             (diaspora)  గమనించమన్నారు.   ‘‘ అమెరికా నుంచి వచ్చిన ప్రతి రచనా డయాస్పోరా రచనగా భావించడం గాని మొదలైయ్యిందా ?’’ అని అనుమానించానన్నారు. దీనికి సమాధానమా అన్నట్లు జంపాల చౌదరి ఇచ్చిన వివరణ ఉటంకించారు. ‘‘కొన్ని కథలలో కథాస్థలం మాత్రమే అమెరికా, వస్తువు, పాత్రలు, చిత్రీకరణ మొత్తం ఇండియా నుంచే. కథాస్థలాన్ని హ్యూస్టన్‌ బదులు హైదరాబాదు, చికాగో బదులు శ్రీకాకుళం చేసి కథల్ని పెద్దమార్పులు లేకుండా తిరగవ్రాస్తే, పాఠకులకు పెద్ద తేడా ఏమీ తెలియదు. వీటిని డయాస్పోరా కథలు అనలే’’ మన్నారు. అంటే ప్రాంతం మారినా, ఆ ప్రాంతంలో వాళ్ళ అనుభవాల్ని అవసరమైతే రెండు ప్రాంతాలతోను మిళితం చేసి రాసినా, అక్కడి జీవితానుభవమే వ్యక్తమయ్యే సాహిత్యం డయాస్పోరా సాహిత్యమవుతుంది. 
డయాస్పోరా రచయితలు గతాన్ని తలచుకుని, వర్తమానస్థితిగతులను సమీక్షించుకోవడానికి ప్రయత్నిస్తారు. ఒంటరితనం నుండి సామూహిక జీవనం వైపు పయనించాలనే ఆకాంక్షను వ్యక్తం చేస్తుంటారు.తమ సంస్కృతే గొప్పదనుకున్న వాళ్ళు కూడా అనివార్యంగా ఇతరుల సంస్కృతుల్ని అంగీకరించక తప్పని పరిస్థితి ఎదురవుతుంది. మరి కొంతమంది వాటితో మమేకమవుతారు. భాషకు అధిక ప్రాధాన్యాన్నిస్తారు. దీన్లో భాగంగానే తమ మాతృభాష మాట్లాడడం, చదవడం, రాయడం చేస్తుంటారు. దాని ద్వారా తమ ప్రత్యేకతను కాపాడాలనుకుంటారు. ఇంతవరకూ బాగానే ఉంది. కానీ వీళ్ళ  సాహిత్య గమ్యం విచిత్రమైన మలుపులు తిరుగుతుంది.  
డయాస్పోరాసాహిత్యం మొదట్లో కుల, మత వస్తువుల్ని స్వీకరించకపోయినా, ఆ యా వర్గాల వారే కలిసి సాహిత్యసంస్థలు ప్రారంభించడంలో తమ వాళ్ళు కలవడానికో వేదికగా చేసుకుని సాహిత్యాన్ని, కళల్ని వినోదం కోసం ఉపయోగించుకుంటుంటారు. పైకి మాత్రం విలువల సాహిత్యంగా, తమ వారసత్వ సంపదగా చెప్పే ప్రయత్నం చేస్తుంటారు. అందుకనే వీళ్ళు నిర్వహించే సాహిత్య సమావేశాల్లో అవధానాలకీ, ప్రయోగవాదాలకీ, చిత్రకవిత్వానికీ, పద్యకవిత్వానికీ ప్రాధాన్యానిస్తుంటారు. పైకి సాహిత్యసేవగా కనిపిస్తున్నా, ఆ సమావేశాల్లో ప్రకటించే సాహిత్యంలో సమకాలీన సమాజం అంతగా ప్రతిఫలించదు. 
సామూహికంగా మారాలనే ఆసక్తితో డయాస్పోరాసాహిత్యం మొదలైనా, మళ్ళీ తమకు తెలియకుండానే చిన్న చిన్న గ్రూపులుగా విడిపోయే లక్షణాల్ని సంతరించుకుంటుంది. సామూహిక ప్రయాణం బహిర్రూపమైనా, దాని అంతర్రూపం మళ్ళీ విభజన వైపే పోతుండడం జరుగుతుంది. అంటే అక్కడ కూడా మళ్ళీ ‘‘తమ’’ వాళ్ళ ప్రాబల్యం పెరిగేసరికి తామేమి కోల్పోయామో, దేనికోసం తపిస్తున్నామో దానికోసం ఉమ్మడిగా ఒకే వేదిక పైకి వస్తున్నామనుకున్న వాళ్ళంతా తమ నిజ స్వరూపాల్ని ప్రదర్శించుకోవడం మొదలుపెడతారన్నమాట! అప్పుడు డయాస్పోరాసాహిత్యం యావత్తు సాహిత్యానికి గానీ, ప్రత్యేకంగా పోనీ తెలుగు సాహిత్యానికి గాని ఇచ్చే నూతనవిలువలేమైనా ఉన్నాయా అనే సందేహం అందర్నీ వెంటాడే ప్రమాదం ఉంది.
అమెరికా సాహిత్య సభల్లో పాల్గోవడానికి వెళ్ళి చూసొచ్చి , అక్కడ మన తెలుగు వాళ్ళ గ్రూపుల గురించి ఎండ్లూరి సుధాకర్‌  ఇలా రాశారు. ‘‘ ఆంధ్రా తెలంగాణా/ ఫీలింగ్‌ఫ్యాన్సు/ అమెరికాలోనూ/ పసిగట్టాను ఈ డిఫరెన్సు/ చెప్పాలంటే/ చాలా వుంది రిఫరెన్సు.... ఇందులోంచి/ బయటపడకపోతే/ ప్రవాసాంధ్ర పరిస్థితి/ కోరలు చాచిన గాడ్జిల్లా...!’’
ఇటువంటి పరిస్థితుల్లో డయాస్పోరాసాహిత్యం నూతన విలువల్నిప్రతిపాదించి మానవుణ్ని మహోన్నతంగా మార్చగలుగుతుందని నమ్మగలమా? మేమెక్కడున్నా, తెలుగువాళ్ళగానే ఉంటామంటే దీని గురించి చర్చించాల్సిన అవసరమే లేదనుకుంటాను.
కానీ దీనికి భిన్నమైన ప్రకటనలు కూడా కొన్ని కనిపిస్తున్నాయి.  అమెరికాలోని తెలుగు డయాస్పోరా వాళ్ళ ఆధ్వర్యంలోనే నడుస్తున్న ఒక ఆన్‌లైన్‌ తెలుగు మాసపత్రిక కుల, మత, వర్గ ధోరణులకు దూరంగా ఉండే విధంగా పత్రికను నడపాలనే ఆశయం ఉందన్నారు. చాలా సంతోషం కలిగించి ప్రకటనే. నిజానికి ఇలాంటి ప్రకటనలకు కట్టుబడి సాహిత్య పత్రికలు వస్తే, ఉత్తమసాహిత్యం వస్తుందనిపిస్తుంది. ఉత్తమ సంస్కారం అలవడుతుంది. కానీ, అది ఊహాత్మక జీవితానికి సంబంధించినదై ఉండకూడదు. కాల్పనిక సాహిత్యం కోసం అంత శ్రమకోర్చి పత్రికను నడపాల్సిన పనిలేదు. తమ అనుభవాల్ని అందరితో పంచుకోవడానికి దాన్నొక వేదికగా ఉపయోగించుకుంటున్నారు. అంటే అక్కడ జరుగుతున్న తెలుగు వారి జీనవ విధానాన్ని ప్రకటించడం జరుగుతుంది. దానితో పాటు వాళ్ళ అనుభవాల్ని, అనుభూతుల్ని ప్రకటించాలి. అలా ప్రకటించలేనప్పుడు ఆ సాహిత్యం ఆనందాన్ని కలిగించలేదు.
 అదే పత్రికలో వచ్చిన రచనల్లో దాన్ని పాటించగలిగారా అని నేడొకసారి వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రబంధ సాహిత్యం, ప్రాచీన సాహిత్యం పేరుతో మళ్ళీ మనమెటువైపు పోతున్నామని ప్రశ్నించుకోవాలి. ఇక్కడ ఒకటి గమనించాలి. ప్రాచీన సాహిత్యాన్ని నిరాకరించమని కాదు, గానీ, ఆధునిక సాహిత్యంలో వస్తున్న అన్ని ధోరణుల్నీ ఆదరించగలగాలి. దళిత, ముస్లిం సాహిత్యాల్ని కూడా ఆహ్వానించగలగాలి. వీటిని కుల, మత చట్రాల్లో ఇరికించే ప్రయత్నం సరైంది కాదు. అక్కడున్న తెలుగు వాళ్ళంతా ఒకే రకమైన సాంస్కృతిక జీవనాన్ని కలిగున్నారా? వాటికెందుకు ప్రాధాన్యాన్నివ్వలేకపోతున్నారు?
ఆ మధ్య కాలంలో మరో ఆన్‌లైన్‌ తెలుగు పత్రిక పద్యాల్లోనే ఉగాది కవిత్వాన్ని రాయాలని, దాన్నే తూ.చ. తప్పకుండా పాటించాలని ప్రయత్నించింది. దాన్లో పాల్గొన్న పద్యకవుల్లో నేటి కాలపు కవిత్వం రాసేవాళ్ళు వేళ్ళ మీద లెక్కించదగిన వాళ్ళు కూడా లేరు. ఇంకా చెప్పాలంటే ప్రముఖ పద్యకవులు దానిలో భాగస్వామ్యం కాలేకపోయారు. అయినా తెలుగు భాష, సంస్కృతుల పేరుతో ఏ మత సంస్కృతిని పునరుద్దరిస్తున్నామో సమీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. సందర్భం మరొకటైనా డయాస్పోరా సాహిత్యాన్ని ఒక తరానికి చెందిన సాహిత్యంగా కాకుండా భిన్నతరాలుగా చూడాలంటూ, ఒక తరం వాళ్ళ డయాస్పోరా సాహిత్య సంస్కృతిని అఫ్సర్‌ ఇలా వ్యాఖ్యానించారు.‘‘ కొత్త దేశంలో తాము ఎదుర్కొంటున్న ప్రతి స్థితినీ స్వదేశంలో పరిస్థితితో బేరీజు వేసుకోవడం మాత్రమే కాకుండా, ఆ పరిస్థితి వొకే సాంస్కృతిక విలువ వున్నట్టు భావించుకునే వాళ్ళు. కొన్ని కథల్లో ఇక్కడి ప్రతి సన్నివేశాన్నీ అర్ధం చేసుకోవడానికి దాన్ని సనాతన హిందూధర్మంతో పోల్చుకోవడం కనిపిస్తుంది’’  కాబట్టి డయాస్పోరా సాహిత్యం ప్రతిఫలించే సంస్కృతిని ఒకే సంస్కృతిగా చెప్పలేం.
తమవి కాని జీవితానుభవాలు తమ సాహిత్యంలో లేనప్పుడు జీవితాన్నీ జీవించలేక, జీవితంలో ఎదురయ్యే సుఖదు:ఖాల్నీ సాహిత్యీకరించలేనప్పుడు జీవితం యాంత్రికం కాకపోతే ఏమవుతుంది? అందుకే పరభాష పట్ల వ్యతిరేకత, మాతృభాష పట్ల మమకారానికి కారణమవుతుంది. మరి వాళ్ళే మళ్ళీ ఎప్పుడైనా తమ ప్రాంతంలోకి వచ్చినప్పుడు తమ మాతృభాషలోనే మాట్లాడుతున్నారా? తమ సాహిత్యంలోని విషయాలే ఉదహరిస్తున్నారా? తమకు తెలిసిన భాషతో ఆధిక్యాన్నిక్కడ ప్రదర్శించకుండా ఉండగలుగుతున్నారా? ఒకసారి ఆలోచించాలి. ఇక్కడ నుండి వెళ్ళిన మార్క్సిస్టులు కూడా దృక్పథమేమైనా అన్నమాచార్యుల కీర్తనల్ని, మన ప్రబంధసాహిత్నాన్నీ విశ్వవిద్యాలయాల్లో బోధిస్తూ, వాటిపైనే రచనలు చేస్తున్నారు. దీన్ని డయాస్పోరా సాహిత్యం అనవచ్చా అనేదీ ఆలోచించవలసిందే. ఇతర ప్రాంతాల వారికి బోధించే సాహిత్యంలో నిజంగా ఈ సమాజాన్ని చూపిస్తున్నారా? డయాస్పోరాసాహిత్యంలో ఇది కూడా భాగమనే వాళ్ళు, కాదనే వాళ్ళూ ఉన్నారు.
 ఏది ఏమైనా డయాస్పోరా సాహిత్యసృష్టి కర్తలు తమ నేల విడిచి, పరనేలపై ఉన్నా, తమ మూలాలతోనే ఒక నూతన ధోరణికి మార్గం వేయగలిగితే బాగుంటుంది. డయాస్పోరా సాహిత్యం ముసుగులో వాస్తవాల్ని విస్మరించి, అందరి సంస్కృతి పేరుతో కొందరి సంస్కృతిని రుద్దే ప్రయత్నం చేయకపోతే సాహిత్యం ద్వారా నిజమైన మానవీయ విలువల్ని అందించగలిగే వీలుకలుగుతుంది. అది ఎలాంటిదంటే, గాంధీ దక్షిణాప్రికా వెళ్ళి వచ్చిన తర్వాతనే తెలిసిన కుల వివక్ష లాంటిది.
కనీసం సంస్కరణ రూపంలో దాన్ని నిరసించడానికైనా (తమ ఉద్యమం ద్వారా కూడా) అవకాశం కలిగించారు. ఫస్టుక్లాసు ప్రయాణంలో ఆంగ్ల దొరలతో సమానంగా పయనించకుండా బయటకు గెంటేయడమనే వివక్షలోని వికృత రూపాన్ని కొద్దిగా చవిచూస్తేనే అంత బాధ కలిగి కాస్త సంస్కరణకు వీలుకల్పించారు. అది కూడా భారతీయ కుల వివక్షకు ఎంతో ఊరటనిచ్చింది. మన దేశానికి చెందిన వాళ్ళకెలాంటి అవమానం జరిగినా మనవాళ్ళు ముక్తకంఠంతో ఖండిస్తారు. కానీ, దళితులకు జరిగే అవమానాలకు ఇక్కడ వాళ్ళూ పట్టించుకోరు, అక్కడ వాళ్ళూ పట్టించుకోరు. ఇలాంటి స్థితిని తుల్లిమల్లి విల్సన్ సుధాకర్ ఇలా రాసారు. అంకుల్ శ్యామ్ విమానా శ్రయాల్లో/ వివక్ష కుక్కవేషం కట్టి/  జాతికి బూట్లు మేజోళ్ళూ  ఊడదీస్తున్నప్పుడు/ ఒక్కపెట్టున నిరసించిన దేశం/ దేవాలయాలూ ఊరిభావుల దగ్గర/ దళితుల్ని తరిమికొడుతున్నప్పుడు/ నల్లపూసవుతుందెందుకో"
అందుకనే ఇప్పుడు డయాస్పోరా సాహిత్యవేత్తలు కూడా వివక్షల్లోని భిన్న కోణాల్ని రాయగలగాలి. ఆ ప్రాంతంలో వాళ్ళు నిజంగా ఎదుర్కొంటున్న వాస్తవపరిస్థితుల్ని సాహిత్యీకరించాలి. సాహిత్యం నిజంగా మానవీయ విలుల పతాకాన్ని ఎగురవేయగలిగే స్పూర్తిని రగిల్చగలగాలి.
 - డా దార్ల వెంకటేశ్వరరావు