వారం వారం జాషువా సాహిత్యం-5
జాషువా ‘ఆత్మ’ను గుర్తించడంలో భిన్న పార్శ్వాలు
గతవారం జాషువా ‘ఆత్మ’ను గుర్తించడమెలా? అని ఆయన కులం వల్ల పడిన కష్టనష్టాల్ని తన రచనల్లో ఎంతో శక్తివంతంగా వర్ణించారనీ, దానిలో ఆయన జీవితం, తన రచనా లక్ష్యం కనిపిస్తుందని రాశాను. కుల నిర్మూలన తన ఆశయాల్లో ఒకటనీ గుర్తించాలని వ్యాఖ్యానించాను. దీనికి చాలామంది స్పందించారు. ఆయన్ని ఒక కులానికి, ఒక ప్రాంతానికీ కట్టిపడేయడం మంచిదికాదంటూ అభిప్రాయపడ్డారు. నిజానికి ఆయన కూడా అదే కోరుకున్నాడనీ చెప్పాను. ఒక కవి జీవితాంతం వరకు అనేక రచనలు చేస్తాడు. ఆ రచనల్లో ఆ కవి ఆశయాన్ని, రచనల లక్ష్యాన్ని గుర్తించడం కూడా కష్టమే. తాను ఆత్మాశ్రయంగా చెప్పుకున్న అనేకాంశాలలో ఆ కవి ‘ఆత్మ’ కనిపిస్తుంది. కానీ, అదే ఆ కవి ఆత్మగా చెప్పలేం. డా.సి.నారాయణరెడ్డిగారు చమత్కారంగా కప్పిచెప్పేవాడు ‘కవి’ అన్నట్లు, అన్ని విషయాల్నీ కవి ‘విప్పి’ కూడా చెప్పడు.
సాధారణంగా కవి తన జీవితకాల లక్ష్యాన్ని గుర్తించాలంటే సాహిత్య విమర్శకులు కొన్ని పద్ధతులను అనుసరిస్తుంటారు. వాటిలో కవిజీవిత కావ్యసమన్వయ విమర్శ పద్ధతి ఒకటి. కవి వర్ణించిన రచనలను, ఆయన జీవితాన్ని తులనాత్మకంగా విశ్లేషిస్తూ కవి ‘ఆశయాన్ని’ గుర్తించే పద్దతి ఇది. ‘కవి’ అంటేనే సాహిత్యానికి సంబంధించినవాడు కదా. దానిలో రాజకీయాలు ఉండకూడదు. సాహిత్యాన్ని మూల్యాంకనం చేసే ప్రమాణాలతో నిజాయితీగా విశ్లేషించాలి.
మన తెలుగు సాహిత్యాన్ని, ఆ సాహిత్య తత్వాన్ని మూల్యాంకనం చేయడానికి ఉన్న ప్రధానమైన ప్రమాణం భారతీయ ఆలంకారిక సిద్ధాంతాలు. పాశ్చాత్య సాహిత్య విమర్శ పద్ధతులతో అనుశీలించినప్పుడు కవి సామాజిక దృక్పథంలో ‘భావజాలం’ ప్రధానంగా తీసుకోవాలంటారు. అంటే, కవి సాహిత్య దృక్పథంతో పాటు, సామాజిక దృక్పథాన్నీ, ప్రాపంచిక దృక్పథాన్ని పట్టుకునే ప్రయత్నం చేయాలి. ఒక కవి సాహిత్యాన్ని సాహిత్యంగానే పరిశీలిస్తూ ఆ సాహిత్య సౌందర్యాన్నే వివరించడమంటే సామాజిక కోణం అప్రధానమైపోతుంది. అప్రధానంకానట్లుండే పద్ధతిలో సాహిత్యాన్ని సాహిత్యంగా చూస్తున్న కొంతమంది దృష్టిలో ‘సర్వజనశ్రేయస్సు’, ‘విశ్వశ్రేయస్సు’ ‘సంస్కృతి ప్రతిఫలనం’ ‘జాతి చరిత్ర’ వంటి పద్ధతిలో వెళ్ళి పోతుంది. ఇక్కడెవరైనా ప్రశ్నించడం మొదలు పెడితే వాళ్ళకు సాహిత్యాన్ని అధ్యయనం చేసే పద్ధతి వాళ్ళకు తెలియదంటారు. మహాభారతంలో వర్ణాశ్రమ ధర్మం గురించి స్పష్టంగా చెప్పినా, అది ‘విశ్వశ్రేయస్సు’నే ఆకాంక్షిస్తుందంటారు. ఒకవేళ ఆ సాహిత్యంలో ఎవరి సంస్కృతి ప్రతిఫలిస్తుందని ప్రశ్నించినా సమాజాన్ని విభాగాలుగా చూడకూడదంటారు. జాతి చరిత్రలో కొంతమందిని అధములుగా చిత్రిస్తూ, మరికొంతమందిని శ్రేష్ఠులుగా కీర్తిస్తూ ‘జాతిమహోన్నతచరిత్ర’ను చెప్తుంటే ప్రశ్నించనంతకాలం ఆ రచనలన్నీ ఆ జాతి చరిత్రలుగానే కీర్తించబడతాయి. ఇలా ప్రశ్నించడాన్ని సామాజిక దృక్పథం నేర్పింది. ఆ సామాజిక దృక్పథమే భావజాలాన్ని గుర్తించేలా ప్రేరేపించింది. ఆ భావజాలమే ప్రాపంచిక దృక్పథాన్నీ చూడాలనే మార్గాన్ని విస్తరించింది.
గుర్రం జాషువాను రెండు కోణాల్లోనూ అధ్యయనం చేయాలి. భారతీయాలంకారిక సిద్ధాంతాలు తన రచనల్లో లోతుగానే ఉన్నాయి. ఆ ఉండడం దేన్నైనా ధనంజయుడనే ఆలంకారికుడు భావించినట్లు ‘రసవంతం’ చేయడం వరకే పరిమితం కాలేదు. ఒక సాలీడు, ఒక కుక్కపిల్ల, ఒక గిజిగాడు, ఒక గబ్బిలం వంటివన్నీ తన కవితావస్తువులు అయ్యాయి. సాలీడు తన గూడుని అల్లడంలో ఎంతో నైపుణ్యాన్ని ప్రదర్శిస్తుంది. పురుగుల్ని ఆకర్షించడానికి వీలుగా మెరిసేలా సన్నని దారంలా కనిపించీ కనిపించనట్లు అల్లుతుంది. సాలీడు పొట్టలో నూలు తయారు చేసే యంత్రంగానీ, ప్రత్తిని ఒడికే రాట్నంగానీ ఉందేమో. లేకపోతే అంత సన్నని దారంలా రావడమే కాకుండా ఒకేరకమైన పద్ధతిలో ఆ దారం అల్లడం అద్భుతం కదా అంటాడు. బహుశా ఈ రెండూ కాకపోతే ఈశ్వరుడే నీ గర్భంలో ఉండి అలా సౌందర్యవంతమైన గూడుని అల్లేశక్తినిస్తున్నాడేమో అనిపిస్తుందంటాడు కవి. ఇంత ప్రతిభావంతుడైన నిన్ను ప్రపంచమంతా మోసగాడని పిలిస్తుందెందుకని ప్రశ్నిస్తాడు.
పాఠకులకోసం పద్యాన్ని కొద్దిగా ఆ సౌందర్యం చెడిపోకుండా సులభంగా విడదీసి చదువుకుందాం.
నీలో నూలు తయారుజేయు మర గానీ,
ప్రత్తి రాట్నంబు గానీ,
లేదా ఈశ్వరశక్తి
నీ కడుపులోనే లీనమై యుండునో
యేలీలన్ రచియింతువు
ఈ జిలుగు నూలీ పట్టు పుట్టంబులు!
ఓసాలీడా, నిను మోసగాడవని
విశ్వంబేల ఘోషించెడిన్?
సాలీడు తాను బ్రతకడం కోసం తన విధ్యక్తధర్మాన్ని నిర్వర్తించింది. స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ కదా. అదే సాలీడు కూడా చేసిందనేది ఆ సాలీడు తరపున కవివాదన. ఆ తర్వాత ఆ పద్యాన్ని సామాజిక వాస్తవికతలో భాగం చేస్తూ, సాలీడు అంతనైపుణ్యంతో గూడుని కట్టడానికి కారణం దాని గురువులనీ, వాళ్ళంతా కనిపించకుండాపోయారనీ, దానికి కారణం చేనేతవృత్తులకు ఆదరణలేకపోవడమే కారణమంటాడు. అప్పుడే ప్రవేశిస్తున్న వస్త్రాల మిల్లులు, దాని వల్ల ఉపాధి కోల్పోతున్న నేతన్న దుస్థితినీ, పరోక్షంగా గాంధీజీ చరఖా ద్వారా ఇచ్చే సందేశాన్ని గుర్తుచేశాడు కవి. ‘పురుగుల గుంపు వచ్చి నాశనం చేయకుండా వాటిని మోసగించాలనే నెపంతో మెరుపుల వంటి దారాలతో ఎవరికీ కనిపించకుండా కడుపులోనే దాచుకున్న దొంగమగ్గాలపై ఉల్లిపొరలాంటి సన్ననివస్త్రాలను నేసి ఆరబెట్టుకుంటున్నావు. ఎంత తెలివైన మోసగాడివోయ్... నీ సంపదను నువ్వు కాపాడుకోవడానికి వాళ్ళను మాయలో పడేస్తున్నావు. నీ సంపదను దొంగతనం చేయడానికి వచ్చే వాళ్ళను దొంగలనకుండా నిన్ను దొంగవని పిలుస్తుందే’ అనడంలో జాషువా చమత్కారం, భావనాపటిమ అసామాన్యంగా కనిపిస్తుంది. ఒక దోపిడీ స్వభావాన్ని, దాన్ని ఎదుర్కోవడానికి జరిగే ప్రయత్నాన్నీ సాలీడులో కవి అద్భుతమైన రక్షణ వ్యూహంగా వర్ణించాడు.
ఒక చిన్నిపక్షి గిజిగాడు. దీని గురించి కూడా అద్భుతమై పద్యాలను వర్ణించాడు జాషువా. పిచ్చుకనే ‘గిజిగాడు’ అని కూడా అంటారు. పెద్దపెద్ద గాలి వేసేటప్పుడు, తుఫానులు వచ్చినప్పుడు పక్షులు తలదాచుకోవడానికి ఎంతో కష్టపడుతుంటాయి. ఈ పరిస్థితుల్లో కూడా గిజిగాడు కట్టుకునే ‘పిచ్చుకగూళ్ళు’ పాడవకుండా ఉంటాయి. ఊరికి దూరంగా లేదా పాడుపడిన ఇళ్ళ చూరులకు ఈ పిచ్చుక గూళ్ళు కనిపిస్తుంటాయి. సాధారణంగా చెట్లలో పనికిరాని వానిగా తుమ్మచెట్లను భావిస్తుంటారు. పాడుబడిన చేలలో, అడవుల్లో బాగా పెరుగుతాయి. వాటికి ముళ్ళుంటాయి. తినే పండ్లు కాయవు. కాబట్టి వాటిజోలికి ఎవరూ వెళ్ళరు. ఈ మధ్య కాలంలో వ్యాపారస్తులు తప్ప సొంతంగా ఇళ్ళు కట్టుకొనేవాళ్ళెవరూ తుమ్మచెట్టుని తమ గృహనిర్మాణాల్లో ఉపయోగించరు. అందువల్లనే పిచ్చుకలు ఆ చెట్లకే గూళ్ళు కట్టుకుంటాయనీ, అదొక బంగారు రంగులు పూసే చెట్టనీ, వాటిని నిగనిగలాడే బంగారు ఆభరణాలుగా పోలుస్తాడు కవి. తన గృహాన్ని ఎంతో సౌందర్యవంతంగా సహజంగా మెరిసేలా ఉండే తుమ్మచెట్టుని ఎన్నుకోవడంలోనే ఒక చిన్నిపక్షిలోని పెద్దఆలోచనను మనముందుంచాడు కవి. రాత్రీ, పగలూ వేసవి కాలంలో వచ్చే గాడ్పుని తట్టుకుంటూ, వర్షాకాలంలో వచ్చే వానను తట్టుకుంటూ ఎంతో రక్షణతో సంతోషంగా ఒక ఊయలతో కూడిన ఇల్లు నిర్మించిన ఘనత తనది అంటాడు కవి.
“జిలుగుం బంగరు రంగులం
కులుకు మేలైన
చిన్నారి పూగుత్తి సొమ్ములు
కీలించిన తుమ్మగొమ్మలకు,
నీవు నీ సతీరత్న మూ
యెల గీమున్ దగిలించి
రేఁబవలు హాయిందూఁగరా;
గాడ్పు బిడ్డలు
మీ కూడిగ మాచరింప,
గిజిగాఁడా! నీకు దీర్ఘాయువౌ!”
గిజిగాడు గూడుని నిర్మించే నిర్మాణాన్ని ఒక అద్భుతమైన పనిగా వర్ణిస్తాడు కవి. చెట్లకు కట్టే ఇల్లు కాబట్టి తేలిగ్గా ఉండాలనే ఆలోచనలో గిజిగాడొక ఇంజనీరులా కనిపిస్తాడు. ఇంటిలో ఏయే సౌకర్యాలు ఉండాలో తెలుసు. తమ పిల్లలతో పాటు అవసరమైతే తాను, తన భార్య కూడా ఉయ్యాలల్లో ఊగేలా ఆ గూడుని నిర్మించుకోవడంలో గొప్ప ఆలోచన ఉంది. చీకటి పడితే వెలుగుకోసం మిణుగురుపురుగుల్ని తెచ్చి ఒక అంత: పురంలా వెలుగులతో నింపడం గొప్ప వైభవం. ఆ గూడులోని శత్రువులెవరూ రాలేరు. అలాంటి చిన్న దానిలోనే గదులు, వెలుగులు, మంచములు ఉండే ఆ గృహనిర్మాణం మానవులకు కూడా సాధ్యం కాదు కదా అంటాడు.
“తేలిక గడ్డి పోచలను దెచ్చి,
రచించెద వీవు తూఁగుటుయ్యేల గృహంబు,
మానవుల కేరికి సాధ్యముగాదు,
దానిలోజాలరు, లందులో జిలుఁగు శయ్యలు
అంతిపురంబు లొప్పగామేలు భళీ!
పులుంగుటెకిమీడవురా గిజిగాఁడ! నీడజా!”
చివరికి గిజిగాడుని మించిన అందగాడే లేదంటాడు. అలాంటి గృహనిర్మాణం చేయగలిగేమొనగాడు లేడు. నీలాంటి వైభవాన్ని అనుభవించగలిగే దేవతలే లేరంటాడు. నిజంగా నువ్వొకమొనగాడువంటాడు. ఇలా అనేకమైన అల్పవస్తువులుగా భావించి కావ్య వస్తువులుగా తీసుకోనివాటిని తాను కావ్య వస్తువులుగా తీసుకో వడంలో జాషువా ‘అల్పవస్తువు’లో అనల్పతను నిరూపించే ప్రయత్నం చేయడం కూడా ఒక ఆలోచనగా కొనసాగింది. సమాజంలో నిర్లక్ష్యానికి గురికాబడేవారిలోని ప్రతిభను, వారి మానసిక స్థితినీ వర్ణించాడు కవి. అవి కేవలం వస్తువులుగా పురుగులు, జంతువులు, పక్షులు, ఉభయచరాలుగా మాత్రమే తీసుకోకూడదు. వాటిని ఆధారంగా చేసుకొని దీనజనుల ఆర్తిని పలికించాడు జాషువా. జాగ్రతగా పరిశీలిస్తే ఆ రచనలు కొనసాగించిన ‘దృక్పథం’ దాన్ని తెలియజేస్తుంది. అందువల్ల రచనకు సామాజిక ప్రయోజనం కూడా జాషువా రచనల్లో ప్రధానమయ్యిందని గమనించాలి. జాషువా జీవితాన్నీ, దృక్పథాన్నీ కేవలం ఆయన రాసుకున్న ‘నాకథ’ అనే ఆత్మకథాభాగాల్ని మాత్రమే చూస్తే సరిపోదు. ఆయన అనేక సందర్భాల్లో చెప్పిన పద్యాల్లో ఆయన ఆత్మీయ స్పృహ ప్రతిఫలిస్తుంది. ‘నేను’ అనే పేరుతో ఒకచోట రెండు పద్యాలను, మరొకచోట ఆటవెలదితో కలిపిన ఐదు సీసపద్యాలను రాసుకున్నాడు.
‘‘నిఖిలలోకమెట్లు నిర్ణయించిన నాకు
తరుగులేదు, విశ్వనరుడ నేను’’ మకుటంగా ఐదు పద్యాలకు ‘‘నేను’’ ఖండకావ్యంగా వర్ణించుకున్నాడు జాషువా.
‘నేను నివసించడానికి చిన్న ఇల్లుంటే చాలు. సంపాదించేసుకోవాలనే ఆశ తనకు లేదు. భార్యాబిడ్డలకు ఆస్తిపాస్తులు కూడబెట్టి వాళ్ళను పెడత్రోవలో పెట్టాలనుకోను. నేను ఆచరించని నీతులు బోధించను. నాకు రాని రాగాన్ని తీస్తూ పాడను. నాకు సంసారం గడవడానికి సరిపడా ఉంటే చాలు. అంతకు మించి నాకు ఒక్క గవ్వను కూడా అధికంగా కోరుకోను. కులం, మతం అనే గీతలతో కట్టిపడేసే పంజరంలో బంధీకాను. ఈ ప్రపంచం తనను ఎలా భావించినా నాకేమీ తక్కువతనం కలగదు. నేను విశ్వనరుడను’’ అని మొదటి పద్యంలో అన్నాడు కవి. ఆ తర్వాత పద్యంలో తన రచనాలక్ష్యం, తన రచనల ఆశయాన్ని తెలిపే తన ప్రాపంచిక దృక్పథాన్ని వివరించాడు.
‘‘వాస్తవ జ్ఞాన సంపత్తి ఖూనీ చేయు
గాథలు జీర్ణంబుగావు
నాకు ఒక జాతి శ్రేయస్సునకు
సాయ మొనరించు కపట సంస్థలు నాటకములు
నాకు అనుభవంబునకు గిట్టని
నభఃకుసుమ వేదాంతముల్
ప్రబల స్వార్ధములు
నాకు ప్రజల రక్తంబు నాస్వాదించు రాజకీయములు
గుండెలకు భారములు నాకు
సహజమైన ప్రకృతి సౌఖ్యంబు లొక వ్యక్తి
దొంగిలించి మనుట దొసగు నాకు
నిఖిలలోక మెట్లు నిర్ణయించిన నాకు
తరుగులేదు, విశ్వనరుడ నేను.’’
దీనిలో స్పష్టంగా భావవాదాన్ని వ్యతిరేకించాడు జాషువా. అంతేకాదు, ‘విశ్వశ్రేయస్సు’ పేరుతో ‘కొంతమందిశ్రేయస్సు’ని వ్యతిరేకించాడు. అటువంటి వాళ్ళ మాటల్నీ, చేతల్నీ కపటనాటకాలుగా అభివర్ణించాడు. వాటిని జీవితానుభవంలో వాస్తవంగా కనిపించని గగన కుసుమాలుగా కూడా ఆక్షేపించాడు. ఆనాడే సాహిత్యంలో ప్రవేశించిన సాహిత్య రాజకీయాల్ని అసహ్యించుకున్నాడు. అందరికీ చెందవలసిన ప్రకృతిలోని నీరు, గాలి, అగ్నీ, భూమి, ఆకాశం వంటి పంచభూతాలను కొంతమందే స్వాధీనం చేసుకొని శ్రీమంతులు కావడాన్ని తీవ్రంగా త్రిప్పికొట్టడంలో గొప్పమార్క్సిస్టులా కనిపిస్తాడు. వ్యక్తి శ్రేయస్సు కంటే సమాజశ్రేయస్సు ముఖ్యంగా భావిస్తాడు. జాషువా పిరదౌసి కావ్యాన్ని పరిచయం చేస్తూ ఒక అంతర్జాల పత్రికలో ఇలా వ్యాఖ్యానించారొకరు.. ‘‘జాషువా విశ్వనాథలాగా పండితుడు కాడు. దేవులపల్లి, కరుణశ్రీల లాగాపదాల్ని సానబట్టి నునుపుదేర్చి ప్రయోగించేవాడు కాడు. ఆయన పద్యాలు ఎక్కడో తప్ప కదనుతొక్కవు. ఆయన పదశిల్పం తీర్చిదిద్దినట్లు ఉండదు. ఐతే ఆయన మహోన్నత భావుకుడు. అంతరంగంలో రసగంగలు పొంగిపొరలే సహజశిల్పి. కళ్ళు మిరుమిట్లు గొలిపే భావనలు, కల్పనలు, ఊహాశక్తి ఆయన్ని ఆధునికకవులందర్లోను ఒక ప్రత్యేక స్థానంలో నిలబెట్టాయి. ఒక పద్యం తీసుకుంటే దాన్లోని పదాలు,సమాసాలు, ఎత్తుగడలు, శిల్పం ఇవి కాదు మనని విస్మితుల్ని చేసేవి. ఆ పద్యం మొత్తం లోను వ్యాపించిగుప్పుమని గుబాళించే భావనాసౌందర్యం, వినూత్నమైన ఊహాశబలత, స్వచ్చంగా ప్రతిఫలించేనిజాయితీ.’’
జాషువా ఎంత శక్తివంతంగా ఛందోబద్దమైన పద్యాలు రాసినా, నేటికీ ప్రజల నోళ్ళలో నానుతున్నా వాటిలో కదనుతొక్కి ప్రవహించే లక్షణం ఈ వ్యాసకర్తకు కనిపించలేదు. శిల్పనిర్మాణాన్ని తప్పుపట్టాడు. కానీ, అదెక్కడో చెప్పడు. చివరిలో జాషువాలో భావనాసామర్థ్యాన్ని మెచ్చుకున్నట్లు కనిపించేలా వ్యాఖ్యానించాడు. అంటే జాషువాది సాహిత్యం కాదనీ, కొత్త ఊహల్ని ఎవరైనా చేసినా అది భావనాసౌందర్యాన్ని కలిగించవచ్చునని తేల్చిపారేశాడు. మనం నేడు చదువుకుంటున్న ప్రాచీన లేదా సంప్రదాయ పద్య కావ్యాలన్నీ యథాతధంగా చూస్తే ఆ పద్యాల సొగసేమిటో తెలుస్తుంది. ఆ కావ్యాలకు చేసిన పరిష్కరణలు చూస్తే తెలుస్తుంది ఆ ఛందోవైభవమూ, ఆ పదసౌందర్యమూ. అలాంటి పరిష్కరణలెన్ని జరిగాయి జాషువాగారి కావ్యాలకు అని అడిగితే సమాధానం ఉండదు. ఆ వ్యాసంలో రచయిత పేరు లేదు. మరి పత్రికలవారే పెట్టలేదో, ఆయనే పెట్టుకోలేదో మరి. ఇదంతా సాహిత్య రాజకీయం కాకపోతే ఏమిటి? విశ్వనాథ ‘వీరవల్లడు’ గొప్పనవలనడంలోను, దేవులపల్లి ‘అభ్యుదయ సాహిత్య’ నిర్వచనాన్నీ పదేపదే ప్రస్తావించే సాహిత్యవేత్తల్నీ జాగ్రత్తగా చూస్తే సాహిత్య రాజకీయాలే కనిపిస్తాయి. అందుకే గుర్రం జాషువాకు తన సాహిత్యం పట్లా, ఆ రాజకీయాల పట్లా ఒక స్పష్టమైన అవగాహన ఉంది. లేకపోతే చూడండీ పద్యం వచ్చేదే కాదు.
‘‘నా కవితా వధూటి వదనంబు నెగాదిగ జూచి, రూపరే
ఖా కమనీయ వైఖరులుగాంచి ‘భళీ! భళి’ యన్నవాడే ‘మీ
దేకుల’మన్న ప్రశ్న వెలయించి, చివాలున లేచి పోవుచో
బాకున గ్రుమ్మినట్లగును ప్రార్థివ చంద్ర! వచింప సిగ్గగున్”.
కులం వల్ల అవమానపడేవాళ్ళు, తమని కులం పరిధిలోనే చూస్తున్నారనుకునేవాళ్ళు కులాన్ని పట్టించుకోకూడదనే చెప్తారు. నిజంగా మనం కులం ఆధారంగా మన నాయకుల్ని, కవుల్ని గుర్తించడం లేదా? ఇతర కవులకు ఒక్కొక్కరోజుని కేటాయించి జాతీయ దినోత్సవాలను జరుపుతున్నట్లే దళిత నాయకులకు, దళిత కవులకు కూడా స్థానం కల్పించాలి. అలా జరుగుతుందా?
జాషువా పాఠాన్ని కొన్నాళ్ళపాటు ఒక తరగతిలో ఆయన బాల్యస్మృతులను పెట్టారు. అది కూడా ఎలాంటిదో చూడండి. జాషువా చిన్నవయసులో ఉండగా తన పక్కింటి పిల్లవాడి దగ్గర ఉండే కౌజు పక్షిని చూచి ముచ్చటపడి దాన్ని కావాలంటాడు. ఆ విషయాన్ని తన తల్లికి చెప్తాడు. ఆమె దాన్ని అడుగుతుంది. కానీ, వాళ్ళివ్వరు. దాన్ని దొంగతనం చేసి తెచ్చుకుంటాడు. ‘నాకథ’లోని ఈ భాగాన్ని పెట్టారు. ఇక ప్రశ్నలు ఎలా ఉంటాయి? జాషువా దొంగతనం చేసిన పక్షిపేరేంటి? జాషువా తన పక్కింటిలో పక్షిని దొంగతనం చేయడానికి గల కారణమేమిటి? ఇలా ‘జాషువా ఒక దొంగ’ అనే ముద్రను చిన్నపిల్లల్లో గాఢంగా ముద్ర వేయడానికి ఈ పాఠాన్ని చక్కగా ఉపయోగించుకుంటారు. బాల్యచేష్టలు గురించి చెప్పడం కంటే పిల్లల్లో దీనివల్ల జాషువాపై ఎలాంటి అభిప్రాయాన్ని కలిగించాలనుకున్నారు?
భారతీయ సమాజంలో కులం వాస్తవం. మనుష్యుల్ని కులంతో చూడ్డం వాస్తవం. వాళ్లెంత ప్రతిభావంతులైనా కులాన్ని ఆధారం చేసుకోకుండా వ్యాఖ్యానించడం చాలా అరుదైన విషయం. నిత్యం భారతదేశంలో అమ్మాయిల్ని అత్యాచారం చేయడం, హత్యలు చేయడం మనమెన్ని చూడ్డంలేదు? కానీ, కొన్నింటిని మాత్రమే మన మీడియా ‘ప్రపంచం’ దృష్టికి తీసుకొస్తుంది. దీని వెనుక కులం లేదనగలమా? ఎంతో ఘోరంగా కొంతమంది ఉత్తర భారతదేశంలో ‘నిర్భయ్ ’ పైనా (16 డిసెంబర్ 2012) దక్షిణ భారతదేశంలో ‘దిశ’ పైనా (28 డిసెంబరు 2019) జరిగిన అత్యాచారాలు అందరూ ఖండించదగినవే. కానీ, వీటిని ఖండించినంతగా అంతకు ముందూ, తర్వాత జరిగిన, జరుగుతున్న దళిత యువతులు, మహిళలపట్ల ‘ప్రజలకు’ ‘మీడియా’కు సానుభూతి ఎందుకు రాలేదు? వీళ్ళవి ప్రాణాలు కాదా? వీళ్ళవి మానాభిమానాలు లేవా?
జాషువాను ఒక కవిగా గుర్తించడంలోను పైకి ‘విశ్వమానవుడు’ అని చెప్పినా వాళ్ళ వాళ్ల ‘అంతరంగంలో మాత్రమే నిజంగా కనపడు తుంది అసలు రంగు. కానీ దాన్ని అంగీకరించలేరు. తనని అలా చూడ్డం లేదు కాబట్టే,తాను అందుకనే తనను ‘విశ్వనరుడు’గా చూడమని చెప్పాడు జాషువా.
ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు
తెలుగుశాఖ, అధ్యక్షులు,
స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్,
యూనివర్సిటి ఆఫ్ హైదరాబాద్, హైదరాబాద్-500 046
వారం వారం జాషువా సాహిత్యం-3
‘పిరదౌసి’లో కవిత్వ నిర్వచనమే తానైన గుర్రం జాషువ (2)
‘‘నా గ్రంథం చదివే ప్రతీ స్త్రీ, పురుషుడైనా వీరకృత్యాలు చేయుటకు సంసిద్ధులవుతారు. నేటి గృహాఉ ఎండ వానలకు నశించగలవు కాని తుఫాను, వర్షం ఏవీ నేను కట్టిన కావ్యసౌధాన్ని పడగొట్టలేవు. స్వర్గం నాకవిత్వం ముందు శిరస్సు వాల్చింది.’’ అని ఫిరదౌసి తన గ్రంథంలో రాసుకున్నాడు. ఆ కథ నిజంగానే భాషలకు అతీతంగా అందర్నీ ఒక సంవేదనకు గురిచేస్తుంది. ‘షానామా’ (షహనామా) బాహిరీ-తాఖ్ రబ్ అనే పార్సీ వృత్తాల్లో సుమాఏభై వేల పద్యాల్లో రాశాడని చరిత్ర చెబుతుంది. ఫిరదౌసి ‘షానామా’ కావ్యాన్ని రాయడానికి పడిన వేదన మళ్ళీ జాషువా పొందితే తప్ప అంత భావతీవ్రత ‘పిరదౌసి’ కావ్యంలో కనిపించదేమో అనిపిస్తుంది.
తన వంశావళిని కావ్యేతిహాసంగా వర్ణిస్తే, ఒక్కోపద్యానికీ ఒక్కో బంగారునాణాన్ని ఇస్తానని తమకెంతో పవిత్రమైన మక్కామసీదు సాక్షిగా చక్రవర్తి వాగ్దానం చేశాడట. దీన్ని జాషువా ఇలా వర్ణించాడు.
ఒక్కొక్క పద్దియంబున
కొక్కొక్క బంగారు రూక యొసగెదను కవీ!
మక్కా మసీదుతోడని
వక్కాణించెన్ మహాసభా మధ్యమునన్.
ఈ పద్యంలో కవి జాగ్రత్తగా మూడు విషయాల్ని పద్యంలో వచ్చేటట్లు చేశాడు. రాజు బంగారం ఆశచూపడం, దానికి మక్కామసీదు సాక్ష్యం, సభలో ఉన్నవాళ్ళు సాక్ష్యం. వీటని మళ్ళీ ఎలా ధ్వంసం చేశాడో తర్వాత కావ్యంలో మళ్లీ అదే పద్ధతిలో వర్ణిస్తాడు కవి. బంగారానికి బదులు వెండినాణాలు ఇవ్వడం రాజు మాటతప్పడమే. మసీదుపై ప్రమాణం చేసినా దాన్నీ అతడు నిజంగా నమ్మలేదు. బహిరంగంగా ప్రకటించిన వాళ్ల దగ్గరే మళ్ళీ బహిరంగంగా మాటతప్పాడు. దీనిలో సమకాలీన రాజకీయ నాయకుల వాగ్దానాలు, వాటిని నెరవేర్చకుండా అబద్దాలాడ్డం, ఏదొకనెపం వేయడం మనం నిత్యం చూస్తూనే ఉన్నాం. ఈ పద్యంలోని ఈ సత్యమే ప్రాసంగితకమయ్యింది. దీనికంటే కవిపడే తపనను జాషువా వర్ణించిన తీరు అద్భుతం.
మానవేంద్రుని సత్యవాగ్దానమునకు
హృదయగోచరమగుచు వర్ణింపరాని
అద్భుతావేశమంగంబునాక్రమించె
స్వాంతమున తోచె నిసర్గకవిత ’’ అని కవి వర్ణించడంలో కవిత్వం రాసేటప్పుడు కవి ఒక ఆవేశానికి గురయ్యే అనుభవాన్ని ‘హృదయంలో కనిపిస్తుందట, కానీ వర్ణించాలంటే సాధ్యం కావడంలేదనడా’న్ని గమనించాలి. కవి పడే వేదనకిది నిదర్శనం. ఇటువంటి అభిప్రాయాన్నే నండూరి సుబ్బారావు ‘ఎంకి’ మాటున చెప్పాడు. ‘గుండె గొంతుకలోన కొట్లాడుతాదీకూకుండనీదురా కూసింతసేపు’. నిజమైన స్పందన గల కవి ఒక అందమైన వస్తువుని చూసినా, ఒక భయంకరమైన దృశ్యాన్ని చూసినా కవిత్వమవుతాడు. ఇతరులకు కవికీ ఉన్న తేడా అదే. తాను చూసిన, తాను అనుభవించిన ‘అనుభవం’ అక్షరంగా రూపదాల్చేలా చేస్తాడు. శ్రీశ్రీ తన ‘ కవితా! ఓ కవితా!’లో మొత్తం కవిపడే వేదననే వర్ణించాడు. అయితే కవిత్వం సామాన్యులకు అందకుండా దూరంగా ఉన్న స్థితిని చెప్తూనే కవిత్వావేశాన్ని కూడా వర్ణించం ఒక విశేషం. ‘‘నీ ప్రాబల్యంలో/చిరదీక్షా శిక్షా తపస్సమీక్షణలో/నిశ్చల సమాధిలో/స్వర్గద్వారపు తోరణమై వ్రేలిన నా/మస్తిష్కంలో/ఏయే ఘోషలు, భాషలు, దృశ్యాల్ తోచాయో?/నే నేయే చిత్రవిచిత్ర శ్యమంత/రోచిర్నివహం చూశానో!/నా గీతం ఏయే శక్తులలో/ప్రాణస్పందన పొందిందో?’’...అంటూనే మళ్ళీ ఇలా అంటాడు శ్రీశ్రీ. ‘‘మరి నిన్ను స్మరిస్తే/నా కగుపించే దృశ్యాలా?/వినిపించే భాష్యాలా?/అగ్నిసరస్సున వికసించిన వజ్రం!/ఎగిరే లోహశ్యేనం!/ఫిరంగిలో జ్వరం ధ్వనించే మృదంగ నాదం!’’ ఇదంతా కవి కవిత్వమయ్యే పయనమే. శ్రీశ్రీ తన అభ్యుదయకవితాదృక్పథం కూడా దీనిలో వ్యక్తమయ్యేలా వర్ణించాడు. దేవరకొండ బాలగంగాధర్ తిలక్ ‘అమృతం కురిసినరాత్రి’లో కవి కవిత్వమయ్యే మార్గంతోపాటు, కవిత్వమయ్యాక పొందే సంతోషాన్నిలా వర్ణించాడు.‘‘కళ్ళ చివర కాంతి సంగీత గీతాన్ని రచిస్తున్నాడు/ఎర్రని పెదవులమీద తెల్లని నవ్వుల వీణల్ని మీటుతున్నాడు/ఎవరికీ దొరకని రహస్యాల్ని వశపరచుకున్నాడు/జీవితాన్ని ప్రేమించినవాడు జీవించడం తెలిసినవాడు/నవనవాలైన ఊహావర్ణార్ణవాల మీద ఉదయించిన సూర్యుడు.’’ కవి ఆశనూ, ఆశయాన్నీ కలిగించాలంటూనే నూతన ఊహలు ఉండాలంటాడు తిలక్. దీనితో పాటు ‘నవత-కవిత’ అనే కవితలో ‘కవిత్వం ఒక ఆల్కెమీ, దాని రహస్యం కవికే తెలుసు’ అంటూనే, ‘కవిత్వం అంతరాంతర జ్యోతిశ్శీమల్ని బహిర్గతం చెయ్యాల’ని ప్రబోధిస్తాడు. తిలక్ తాను కవిత్వమైన తీరుని తెలుసుకోవాలంటే ‘అదృష్టాధ్వగమనం’ కవితకూడా చూస్తే శ్రీశ్రీ పడిన వేదనలాంటి వేదన కనిపిస్తుంది. ఇలా ఇంచుమించు ప్రతి కవీ తన కవిత్వం బయటకు రావడానికి రకరకాలుగా ప్రసవవేదన పడటం తప్పని సరి. ఫిరదౌసి కవి వేదనతో మమేకమైన జాషువా ఈ పద్యంలో ‘‘అద్భుతావేశమంగంబునాక్రమించె/స్వాంతమున తోచె నిసర్గకవిత ’’ అనడం ద్వారా కవి లోకాన్ని చూడ్డం లేదా స్పందన పొందడం, ఆ స్పందన ఆవేశంగా రూపుదాల్చడం, ఆ రూపం పరిపూర్ణంగా వచ్చేవరకూ లేదా వచ్చిందని భావించేవరకూ వేదనకు గురికావడం, అది ఒకరూపం దాల్చిన తర్వాత ఒక తల్లి ప్రసవవేదన పడుతూ తన బిడ్డను చూసుకోగానే కలిగేటంతటి స్వాంతనను కవి కూడా పొందేవరకు కనిపించే స్పందనను అంతటినీ వర్ణిస్తాడు. అది సహజత్వాన్ని సంతరించుకునేలా ఉండాలి. అప్పుడు మరలా కవి నిజమైన సంతోషాన్ని పొందుతాడు. దీనిలో భారతీయాలంకారికుడు రాజశేఖరుడు ‘కావ్యమీమాంస’లో కవిత్వ సృజనకు సంబంధించిన విషయాలెన్నో ఉన్నాయి. అలంకారశాస్త్రమే అయినా దీనిలో ఒక కావ్యంలా కావ్యపురుషుడు అనే పాత్రను సృష్టించి, కవిత్వం, దానికి సంబంధించిన అనేక అంశాల్ని రాజశేఖరుడు చర్చించాడు. ఆ కావ్య పురుషుడు వేదపురుషుడే అంటాడు రాజశేఖరుడు. కవులకు రాజులకు మధ్య ఉండే సంబంధాలెలా ఉంటాయో కూడా వర్ణించాడు. ‘ప్రజ్ఞా నవనవోన్మేషశాలినీ ప్రతిభా మతా, తదనుప్రాణనాజ్జీవేద్వర్ణనానిపుణః కవిః’ అని భామహుడనే ఆలంకారికుడు ప్రతిభావంతుడైన కవికి ఉండవలసిన భావుకతను వివరించాడు. దీన్నే తిలక్ కూడా తన కవిత్వంలో చెప్పాడు. ఆవేశం కవిత్వానికి అత్యంత ప్రధానమని ఆంగ్ల కవులు కూడా చెప్పారు. వర్డ్స్ వర్త్ ‘లిరికల్ బ్యాలెడ్స్’(1801) కి రాసుకున్న ముందుమాటల్లో మాటల్ని సందర్భంగా ‘పోయెట్రీ ఈస్ ది స్పాంటేనియస్ ఓవర్ ఫ్లూ ఆఫ్ పవర్ పుల్ ఫీలింగ్స్ : ఇట్ టేక్స్ ఆరిజన్ ప్రమ్ ఎమోషన్ రికలెక్టెడ్ ఇన్ ట్రాక్విలిటీ’’ అన్న మాటలు గుర్తుచేసుకోవాలి. జాషువా తాను పైన చెప్పిన పద్యంలో కవిత్వానికి ఆవేశంతోపాటు మరలా అది సహజంగా వెలువడాలనడంలో రాజశేఖరుడు చెప్పిన ‘సమాధ్యవస్థ’ ఉంది. కవిత్వం రాసేటప్పుడు మన చుట్టూ ఉండే అనేకాంశాల వల్ల ‘కవిత్వావేశం’ వస్తుంది. దాన్ని ఆలంకారికుడు భావయిత్రీ-కారయిత్రీ శక్తలు ఉంటాయని చెప్పాడు. ఒకటి కవి భావుకతను, మరొకటి ఆ భావుకతను అక్షరీకరించేది. ఈ రెండింటికి మధ్యా ‘సమాధి’ అనేది ఉంటుంది. దాన్నే వర్డ్స్ వర్త్ ‘ ట్రాక్విలిటీ’ అన్నాడు. జాషువా తన పద్యంలో ఈ పరిణామాన్ని అంతటినీ ఫిరదౌసి కవి పొంది కవిత్వమయ్యాడని వర్ణించాడు. ఫిరదౌసిని చక్రవర్తి కావ్యం రాయమనడం ప్రేరణ. జీవిత అస్తిత్వం. దానికి సిద్ధపడి అనేక చరిత్ర గ్రంథాలు, ఆధారాలు, సాహిత్య విషయాలు అవగాహన చేసుకొని భావుకతకు పయనించడం భావయిత్రీశక్తిని పొందడం. షానామా కావ్యాన్ని అందించడమే కారయిత్రీశక్తి. ఈ రెండింటి మధ్యా ఆవేశాన్ని సహజంగా మార్చుకోవడం నిసర్గకవితగా మారడం. ఫిరదౌసి అలా చేశాడో లేదో గానీ, జాషువా తన కావ్యాన్ని వర్ణించడంలో ఈ పరిణామాలన్నీ స్పష్టంగా కనిపిస్తున్నాయి.
పిరదౌసి కావ్యం కేవలం కవి, కవిత్వం మాత్రమే కాదు, ఆ పద్యాలు నేటి సమాజానికి కూడా ప్రాసంగికంగా కనిపిస్తున్నాయి. ఒక మతం వాళ్ళు మరొక మతాన్ని ధ్వంసం చేస్తే , తర్వాత కాలంలో మళ్లీ అది వ్యతిరేకదిశలో కూడా పనిచేయవచ్చు. కాలం ఒకేలా ఉండదు. గజనీమహ్మద్ హిందూదేవాలయాల్ని ధ్వంసం చేశాడు. దేవాలయాల్లో దాచిన ధనం, బంగారం వంటి వాటికోసం మొదటి ఆలోచన. రెండవ ఆలోచన మతాన్ని , మత విశ్వాసాల్ని నాశనం చేయడం. ఇది సరైంది కాదని జాషువా ఆనాడే ప్రబోధించాడు. దాన్ని ఒక పద్యంలో ఇలా వర్ణించాడు.
భారత క్షోణికల్గు దేవస్ధలములు
చెదరి గజనీ పురాన మసీదులయ్యె
నిప్పటి మసీదు లేరూప మెత్తగలవొ
కాలమెఱుగును,ధారుణీగర్భ మెఱుగు. ఈ మధ్య కాలంలో భారతదేశ వ్యాప్తంగా, ముఖ్యంగా కాశీపట్టణంలో దేవాలయాల పునరుద్ధరణలోను, తాజమహల్ పట్ల వస్తున్న వాదనల్లోనూ ఈ ధోరణులో కనిపిస్తున్నాయి. కవి దార్శనికుడు. ఆలంకారికులు అందుకే ‘కవయ: క్రాంతిదర్శన:’ అన్నారు. అది జాషువా కవిత్వంలో స్పష్టంగా కనిపిస్తుంది.
చాలామంది పరిశీలకులు పిరదౌసి కావ్యాన్ని అంత రసభరితంగా రాయడానికి, ఆయన కూడా అలాంటి జీవితాన్నే జీవించడం ఒక కారణంగా చెప్పారు. దీనిలో కొంత నిజం లేకపోతేదని ఆయన రచనల్ని చదివేవారికి కచ్చితంగా స్పురిస్తుంది. కానీ, కవులంతా ఇలాగే తమ జీవితంతో ముడిపడిన వస్తువు, జీవితం వల్లనే అలా వర్ణించగలిగారనే సిద్ధాంతం సరైందికాదు. సందర్భాన్ని, సన్నివేశాన్ని, వస్తువుని బట్టి కవి వాటిని ఆవాహన చేసుకుంటాడు. అందుకే తన కావ్యంలోని పాత్రలు భిన్న మనస్తత్వాల్ని కలిగి ఉంటాయి. ఒక పాత్ర మంచివాడుగా, మరొకపాత్ర చెడ్డవాడుగా ఉండొచ్చు. అలాంటప్పుడు కేవలం వీళ్ళిద్దరిలో ఒక గుణాన్ని మాత్రమే కవికి ఆపాదించలేం. పోనీ, అన్ని గుణాల్నీ ఆపాదిద్దామనుకున్నా, అది సరైందికాదు. అవి కేవలం ఆలంకారికులు చెప్పిన ‘సహృదయత’తో పలికించే భావాలు. అందుకే జీవుల్లో ఉండే సత్వ, రజో,తమో గుణాలన్నింటినీ నవరసభరితంగా కవి వర్ణించగలుగుతాడు.
చక్రవర్తి మాటతప్పి బంగారు నాణాలకు బదులు వెండినాణాలు పంపాడు. ఏదొకటి పంపితేకవి సంతోషించవచ్చు. కానీ, చక్రవర్తే మాట తప్పితే సామాన్యునిపరిస్థితి ఏమిటి? అందుకనే కవి దాన్ని ఇంత వేదనగా వర్ణించాడు. ఆ స్థితిలో కవి
‘‘ఎన్నో కొండలు గుండెలో
గరఁగిపో యెన్
వార్ధి సంతానముల్
గన్నీరయ్యె
సమస్త లోకము నిరాకారస్ధితిం బొల్చెన్’’ అంటాడు. తాను మోసపోయానని గ్రహించాడు. అటువంటప్పుడు కవి ఎలాంటి స్థితిలో ఉండి ఉంటాడో వర్ణిస్తూ...
ఓ సుల్తాను మహమ్మదూ!
కృతక విద్యుద్ధీపముల్ నమ్మి
యాశాసౌధంబును గట్టికొంటిని’’ అంటాడు.
అంతే కాదు ‘అది నిస్సారంపుటాకాసమైనా సర్వస్వమును దొంగలించి నరకానం గూల్చిపోయెన్’’ అని బాధపడతాడు. అరవైవేల పద్యాలు వర్ణించడానికి తాను పడిన కష్టమంతా కళ్ళెదుట కనిపించింది. ఆ ఆవేదన ఎవరితో చెప్పుకోవాలి.
కృతి యొక బెబ్బులింబలె శరీరపటుత్వము నాపహరింప
,శే షితమగు నస్థిపంజరము
జీవలవంబున నూగులాడగా
బ్రతికితుచచ్చియున్నముది వగ్గు మహమ్మదుగారి ఖడ్గదే
వతకు రుచించునా?
పరిభవ వ్యధ యింతట నంతరించునా? అని బాధపడతాడు. ఇలా ప్రతిపద్యమూ జాషువా ఫిరదౌసిలా మమేకమై వర్ణించాడు.
ఇచ్చకపు మాటలు విన్న చక్రవర్తి కవిని శిక్షించడానికి సైనికులను పంపెంచాడని తెలిసి కూడా దు:ఖితుడయ్యాడు. అప్పుడు ఇలా ఒక పద్యాన్ని వర్ణించాడు.
ముత్యముల కిక్కయైన సముద్రమున
బెక్కుమాఱులు మున్కలు వేసినాడ;
భాగ్యగీనుడ ముత్యమ్ము వడయనైతి
వనధి;నను మ్రింగ నోరు వచ్చినది తుదకు.
జాషువ ఈ ‘ఫిరదౌసి’ కావ్యాన్నెందుకు రాశాడో ఆయనకే తెలియదనీ, ఎన్నో అనౌచిత్యాలు ఉన్నాయనీ, ఈ కావ్యానికి సాహితీలోకంలో పేరెలా వచ్చిందో తెలియదని, కేవలం జాషువ కులం వల్ల పడిన అవమానాలను, ఆయన పేదరికాన్ని దృష్టిలో పెట్టుకొని మాత్రమే ఈ కావ్యాన్ని ప్రశంసించారని విమర్శించిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈ సందర్భంగా జాషువా చెప్పుకున్న మాటలను ఒకసారి గుర్తుచేసుకోవాలి. ఈ కావ్యానికి ‘విజ్ఞప్తి’ పేరుతో వచనంలో ఈ కావ్యనేపథ్యాన్ని చెప్పుకున్నాడు. ఫిరదౌసి చరిత్రను తాను ఒక పత్రికలో చదివాననీ, దాన్ని ఇతివృత్తాన్ని ఒక చిన్న ప్రబంధంగా రాయాలనుకున్నాననీ అన్నాడు. దీన్ని కావ్యంగా వర్ణించే క్రమంలో కొన్ని మార్పులు, చేర్పులు చేశాననీ ప్రకటించాడు. ‘‘పారశీక పండితుల రచనకనుకూలంగా నేను చేసిన మార్పులు మనించమ’’ని వేడుకున్నాడు. ‘‘పిరదౌసి గజనీపట్టణాన్ని విడిచిపెట్టి పారిపోయేటప్పుడు వర్ణించిన కీకారణ్యాలు, సింహం, పులి మొదలైన జంతువులు దేశ నైసర్గిక స్థితి, స్వభావాలకు విపరీతంగా ఉన్నాయని తనకు తెలుసుననీ, కానీ, ఫిరదౌసి కవి మానసిక వ్యథను నిరూపించడానికి కవులు ఉపయోగించుకునే కవిసమయాలకు అనుగుణంగా కల్పితాల్ని చేశానని, ఇది సాహసమే అయినా, ఆ సాహసాన్ని మన్నించమని వేడుకున్నానని’’ అన్నాడు. ఈ సందర్భంగా మనం గుర్తించవలసిందొకటి. చరిత్ర వేరు. కావ్యం వేరు. చరిత్రలో సంఘటనలు, తేదీలు వాస్తవంగా చిత్రించబడటం ఉంటే, కావ్యంలో ఆ నాటి మానవుల మానసిక స్పందనలు, ఆ ఉద్వేగాలు వర్ణితం కావాలి. చరిత్ర ఒక కాలానికి మాత్రమే పరిమితం. కానీ, మానవ హృదయ స్పందనలు శాశ్వతాలు. కవులు తమ అనుభవాలను కూడా వివిధ సందర్భాల్లో వివిధ పాత్రల్లో వర్ణిస్తారు. అలాగని, అవన్నీ ఆ కవి అనుభవాలేనని అనుకోలేం. అలాగని అవి పూర్తిగా అసందర్భాలనీ, అసత్యాలనీ చెప్పలేం. కవులు దార్శనిక సత్యంతో సాహిత్యంలో ఆ అనుభవాన్ని తీసుకొస్తారు. ఆ పనినే జాషువ ‘ఫిరదౌసి’లో చేశాడు. ఫిరదౌసి జీవితం, ఆ చారిత్రక సన్నివేశాలు, ఆ జీవన పరిణామాలను తెలుసుకోవాలంటే ఆ చరిత్రను చదువుకోవాలి. ఆ పారశీక కవుల సంప్రదాయాల్ని తెలుసుకోవాలంటే ఆ సాహిత్య చరిత్రల్ని అధ్యయనం చేయాలి. ఇంకా ఆ కావ్యాల్నే చదవాలి. కానీ, ఆ కవి హృదయం నుండి వచ్చిన వేదనను జాషువ హృదయ స్పందనను తెలుసుకోవాలంటే ఫిరదౌసి కావ్యాన్ని ఆస్వాదించాలి.
-ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు
తెలుగుశాఖ, అధ్యక్షులు,
స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్,
యూనివర్సిటి ఆఫ్ హైదరాబాద్, హైదరాబాద్-500 046