"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL-502: Techniques of writing a Dissertation క్లాసులు సోమ, మంగళ, గురు, శుక్రవారం మధ్యాహ్నం 12.00 గంటల నుండి 1.00 వరకు డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ భవనంలో జరుగుతాయి.

07 జులై, 2009

వివక్ష ధిక్కార స్వరమే ప్రాంతీయ అస్తిత్వ సాహిత్యం

- డా// దార్ల వెంకటేశ్వరరావు

మన నేల ఒకటే

మన జాతి ఒకటే

అయితే

బతుకులొక్క తీర్గ

ఎందుకు లెవ్వురా అయ్య’’''అంటూ తెలుగు కవిత్వం నేడు ప్రాంతీయ అస్తిత్వ చైతన్యంతో ముందుకొస్తుంది. "ప్రాంతీయ' భావనను శాస్త్రీయంగా అవగాహన చేసుకోలేని వాళ్ళు లేదా ఇష్టపడని వాళ్ళు దాన్ని ఒక "వేర్పాటు వాదం' గానే పరిగణిస్తుంటారు.

"ప్రాంతీయ' భావన అనేది నిజానికి తమకు జరిగే వివక్షను గుర్తించి దాన్ని కొనసాగించడం సరైంది కాదని చెప్పడానికి ప్రశ్నించడం, నిరసించడం, ధిక్కరించడం, చివరికి స్వీయ అస్తిత్త్వాన్ని కోరుకోవడం వంటి రూపాల్ని తీసుకొంటుంది. ఇలాంటి ప్రాంతీయ భావన ప్రపంచ వ్యాప్తంగా ఉంటుంది.

ఒక ప్రాంతంలో పుట్టి, పెరిగి, భౌగోళిక ప్రాంతాన్నే నమ్ముకుని జీవిస్తున్న ప్రజలపై, ప్రాంతానికి వివిధ కారణాల వల్ల వలస వచ్చి, క్రమేపీ అక్కడే స్థిర నివాసం ఏర్పరుచుకున్న వాళ్ళు స్థానికులపై ఆధిపత్యం చెలాయించడంతో "స్థానీయ' భావన నుండి " ప్రాంతీయ' భావన పుట్టుకొస్తుంది. అది ఉద్యమ రూపం పొందిన తర్వాత "ప్రాంతీయ వాదం'గా తీవ్రమవుతుంది. దీన్ని ఒక ప్రాంతంలోని ప్రజలు ఏవో కొన్ని కారణాల రీత్యా తమ కంటూ ఒక ప్రత్యేక అస్తిత్వాన్ని, గుర్తింపుని కోరుకుంటే అటువంటి ఆకాంక్షను ప్రాంతీయ వాదం అంటారు' అని సామాజిక శాస్త్రవేత్తలు నిర్వచించారు. సామాజిక సమస్యల్ని తీసుకొని రాసే సాహిత్యాన్ని ప్రాంతీయ అస్తిత్వ సాహిత్యం అంటారు.

"స్థానీయ' భావన కంటే ముందే కుటుంబం నుండి మొదలయ్యే గుర్తింపు కోసం పడే సంఘర్షణ, వ్యష్ఠి నుండి సమష్ఠికి పరిణామం చెంది రకరకాల అస్తిత్త్వాల కోసం పడే వేదన, తపన, ఘర్షణలన్నీ అస్తిత్త్వ ఉద్యమాలుగా బయటపడుతుంటాయి. అందుకనే ప్రాంతీయ వాదం, ప్రాంతీయ అస్తిత్వ ఉద్యమం వంటి పారిభాషిక పదాల్లో లోతైన తాత్త్వికత ఉంది. దీన్ని జాగ్రత్తగా గమనిస్తే అంతర్భాగంగా ఒక వాదం కొనసాగుతూనే, బయట మరో ముఖ్యమని భావించే వాదం సమష్ఠిగా బహిర్గతమవుతుంటుంది. దీన్ని తెలుగు సాహిత్యంలోనే గమనించినా చాలా స్పష్టంగా వివరించుకొనే అవకాశం ఉంది.

మొదట్లో ఒక ప్రాంత జీవన స్థితిగతుల్ని ప్రతిఫలించే దిశగా తెలుగులో ప్రాంతీయ సాహిత్యం వచ్చింది. దానిలో అస్తిత్వ చైతన్య ధోరణి ఉందని చెప్పలేం. కానీ, ప్రాంతీయ వేదనలు ఉన్నాయని మాత్రం చెప్పగలం. ఒక సామాజిక చైతన్యంతో వచ్చే సాహిత్యం అస్తిత్వ సాహిత్యం.తెలుగులో చాసో తీసుకొచ్చిన " కళింగాంధ్ర కథలు' సంకలనం తొలిసారిగా ఒక ప్రాంత ప్రజల ఆకాంక్షల్ని ఒక చోటికి తెచ్చిందని విమర్శకులన్నారు. తర్వాత "సీమ కథలు' వచ్చాయి. అంతకు ముందు తెలంగాణ ప్రాంతంలో గోల్కొండ కవుల ప్రత్యేక సంచిక' వచ్చింది.

తెలుగు భాష మాట్లాడే వాళ్ళంతా స్వాతంత్ర్యానంతరం రెండు కారణాలతో ప్రాంతీయ స్పృహను ప్రదర్శించారు. అవి ప్రత్యేక భాష, ప్రత్యేక భౌగోళిక ప్రాంతాన్ని ఒక ఆధారంగా చేసుకొనిన ప్రత్యేక రాష్ట్రంగా మారాలని కోరుకోవడంగా చెప్పుకోవచ్చు. దాశరధి, సోమసుందర్, ఆరుద్ర వంటి వాళ్ళంతా రాసిన సాహిత్యంలో ప్రాంతీయ స్పృహ బలంగానే కనిపిస్తుంది. అందుకనే

"కోటి తమ్ములకడ రెండు కోట్ల తెల్గు

టన్నలను గూర్చి వృత్తాంమందజేసి

మూడుకోటుల నొక్కటే ముడిబిగించి

పాడినాను మహాంధ్ర సౌభాగ్య గీతి'అని తెలంగాణ ప్రాంతం నుండీ ఆనాడు తెలుగు వాళ్ళంతా ఏకం కావాలనే ఆశను వ్యక్తంచేశారు. పాలకులపై ఉండే సహజ వ్యతిరేకతతో పాటు, సాంస్కృతిక ఆధిపత్య నిరాకరణ అప్పటికి నిజాము ఒక పిశాచంగా భావించడం ఒక ప్రధాన కారణం. అదే నిజామ్వంశ పాలను ఇప్పుడు కొంతమంది ప్రశంసిస్తున్నారు. నేటికి ప్రాంతీయ వాదం తీవ్రస్థాయికి చేరుకోవడమే దీనికి ముఖ్యకారణం కావచ్చు. అందుకనే నేడు కవుల గళాల్లో ప్రత్యేక అస్తిత్వ స్వర తీవ్రత పెరిగింది.

ప్రాంతీయ వాదం కొంతమంది సృష్టి వల్లనో, కొంతమంది స్వలాభం కోసమో వస్తే అదిఅనేక సంవత్సరాల పాటు ఉద్యమంగా కొనసాగలేదు. నాయకులు మారవచ్చు. నాయకత్వం మోసం కూడా చేయవచ్చు. అయినా ప్రజల కాంక్ష మరో నాయకుడితోనైనా ముందుకెళ్తుంది. అదిప్పటికే తెలంగాణలో జరుగుతూనే ఉంది. అనేక అనుభవాల్ని మూటకట్టుకొని ముందుకెళ్తుంది. దాన్ని కవులు ఇలా వర్ణిస్తున్నారు.

''మా కెవ్వల సొమ్ము అక్కర్లేదు

మాయి మాకు దక్కితే సాలు

మా ఆరాటంలో అలజడి ఉన్నది

అన్నాలమై పోయిన మొత్తుకోలున్నది

బొండిగల నిండా బాధలున్నాయి

నడిమిట్ల పెత్తనం దొరికిచ్చుకొని చెలాయించేటోల్లకాడ

అనిగి మనిగి పడ్డది సాలు

మాకు సోయి లేదనుకోకండ్రి

అనుభవాలు మాకు అన్నినేర్పినయి''అని అనుభవాలతోనే కవులు కూడా ఉద్యమంలో భాగస్వాములవుతున్నారు. ఇది ప్రస్తుతం తెలంగాణ ప్రాంతంలోనే తీవ్రస్థాయిలో కనిపిస్తుంది. అందువల్ల ప్రాంతీయ అస్తిత్వ సాహిత్యం అనగానే తెలంగాణ సాహిత్యం అనే స్థితికి చేరుకుంది.

సర్వసాధారణంగా అస్తిత్వ సాహిత్య స్వరూప స్వభావాల్లో కొన్ని ముఖ్యాంశాలను గమనించవచ్చు. తమను నిర్లక్ష్యానికి గురిచేయడాన్ని గుర్తుచేస్తారు. దాన్ని సరిచేసుకోలేదనిపించినప్పుడు ప్రశ్నిస్తారు. అప్పటికీ మార్పు కనిపించనప్పుడు నిరసిస్తారు. పాలకుల నిర్లక్ష్యం వల్ల ప్రతిదాన్నీ ధిక్కరించడం మొదలవుతుంది. దీనితో అన్నీ దాని కేంద్రంగానే చూస్తారు.

ప్రస్తుతం తెలంగాణ సాహిత్య కారులు ఆది కావ్యాన్ని, ఆదికవిని పునర్మూల్యల్యాంకనం చేస్తున్నారు. ఆది కావ్యంగా మహాభారతాన్నీ, ఆది కవిగా నన్నయను అంగీకరించట్లేదు. కవుల ప్రాంతాల్ని గుర్తించి సాంస్కృతిక వారసత్వాన్ని పునర్నిర్వచిస్తున్నారు. తెలంగాణ ప్రాంతీయ అస్తిత్వం ప్రాంతకవులు ప్రచురించే కవితా సంకలనాల పేర్ల తో సహా ప్రతిబింబిస్తుంది. ప్రాంత కవులు సమష్ఠి గొంతుల్ని వినిపించేటట్లు అన్నట్లు పొంగిలి, మత్తడి కవితా సంకలనాలను, "తెలంగాణ తొలితరం కథల సంకలనంతీసుకొని రావడంతో పాటు గోల్కొండ కవుల ప్రత్యేక సంచిక' ను పునర్ముద్రించడం వంటి వన్నీ జరుగుతున్నాయి. మరో వైపు వివిధ కవితా సంకలనాలకు, సంపుటులకు రాస్తున్న ముందుమాటలు, ముద్దెర, ఇరుసు, ఇతివృత్తం వంటి విమర్శ పుస్తకాలు విస్తృతంగానే వస్తున్నాయి.

సాధారణంగా ప్రాంతీయ వాదం తీవ్రమవుతున్నప్పుడు సాహిత్యంలో కొన్నిప్రత్యేక అంశాలు కనిపిస్తుంటాయి.

*అన్నింటినీ పునర్మూల్యాంకనం చేస్తారు.

*తమ స్థితిని తలచుకొంటూ యా చారిత్రక, అర్ధిక, రాజకీయ కారణాల్ని అన్వేషిస్తుంటారు

*తమ అభివృద్ధికి ఇతర ప్రాంతాల వాళ్ళే ఆటంకమనే ఆరోపణలు చేసి, అవి నిజమని నిరూపించే ప్రయత్నంలో కొన్ని సాక్ష్యాధారాల్ని చూపిస్తుంటారు.

* తమ సాంస్కృతిక ఔన్నత్యాన్ని చాటే ప్రయత్నంలోఅప్పటికున్న ప్రమాణాలను తిరస్కరిస్తూనే కొత్త

ప్రమాణాల్ని తయారు చేస్తుంటారు.

*దైనందిన జీవితంలోని అనేక అంశాల్ని సాహిత్యీకరిస్తూ కొత్త సూత్రీకరణల్ని అందిస్తుంటారు. ప్రత్యక్షంగానో, పరోక్షంగానో తమ ప్రాంత రచయితలు కూడా ఇతర ప్రాంతాల వాళ్ళ ప్రభావం

వల్ల స్వీయ అస్తిత్వాన్ని కోల్పోతున్నారని ఆవేదన చెందుతుంటారు

అందుకే ఇప్పుడు తెలంగాణ కవులు

"ఇప్పుడు

నాకు నా నేల కావాలి

నాకు నా గాలి కావాలి

నాకు నా నీరు కావాలి

నాకు నా ఊరు కావాలి'' అని స్పష్టంగా నినదిస్తున్నారు. ఇలా నినదించడానికి కావలసినంత నేపథ్యాన్ని చూపిస్తున్నారు. వలస ఆధిపత్యం, సాంస్కృతికంగా జరుగుతున్న అవమానాల్ని, రాజకీయంగా జరుగుతున్న కుట్రల్నీ తీవ్రంగానే సాహిత్యీకరిస్తున్నారు. ఇది తెలుగులో రాయలసీమ, కళింగాంధ్ర ప్రాంతాల పరంగానూ కొనసాగుతున్నా, తెలంగాణ ప్రాంతంలో చైతన్యం ""ప్రాంతీయ అస్తిత్త్వ ఉద్యమం'' గా పరిణామం చెందింది. అందులో భాగంగానే తమ ప్రత్యేక అస్తిత్త్వాన్ని నిరూపించుకొనేదిశగా ప్రత్యేక ప్రింట్, ఎలక్ట్రానిక్మీడియాలను సిద్ధం చేసుకుంటున్నారు. ముద్రణలో కనిపిస్తున్న కొన్ని సాహిత్యం పుస్తకాలను గమనిస్తే తెలంగాణ ప్రాంతంలోని జిల్లాలను ఆంధ్రప్రదేశ్రాష్ట్రంలో భాగంగా గుర్తించ నిరాకరించే ఉద్దేశం కనిపిస్తుంది. రాష్ట్రాన్ని తెలిపే చోట "" తెలంగాణ '' రాసుకోవడాన్ని ప్రాంతీయ అస్తిత్త్వ ఉద్యమంలో భాగంగానే గుర్తించాలనిపిస్తుంది.

"ప్రాంతం' ఒక సామాజిక వ్యవస్థకు సమష్ఠి రూపం. సామాజిక ప్రయోజనాల కోసం ప్రత్యేక ప్రతిపత్తిని కోరుకోవడం, లేదా ప్రత్యేక దేశంగా, రాష్ట్రంగా, జిల్లాగా, మండలంగా జనసమూహం విడిపోవడం ద్వారా తమ ప్రయోజనాలు నెరవేరతాయని ఆశిస్తుంటారు. ఇది కొన్ని సార్లు ఒకే ప్రాంతంలో కూడా మళ్ళీ మళ్ళీ విడిగా ఉండాలనే ప్రత్యేక వాదాన్ని కొంత మంది ఉప-ప్రాంతీయ వాదం అంటున్నారు.

ఆసియా ఖండంలో భారతదేశం పరంగా చూసినపపుడు ఉప ఖండంగా పిలవబడుతూనే ప్రధాన ఖండంలో భాగంగా ఉంటుంది. అలాగే భారతదేశంలో వివిధ రాష్ట్రాలుగా విడిపోవడాన్ని కొంత మంది ప్రాంతీయ వాదంగానూ, మరి కొంతమంది భారత ఉప ప్రాంతీయ వాదం అనీ పిలుస్తున్నారు.

ఒకే రాష్ట్రం కూడా రెండు లేదా అంత కంటే ఎక్కువగా ప్రత్యేక రాష్ట్రాలుగా ఉండాలనుకోవడాన్ని కొంతమంది ఉప ప్రాంతీయ వాదం గానూ, మరికొంతమంది ప్రాంతీయ వాదంగానూ పిలుస్తున్నారు. ఇక్కడ ఉప విభాగాల ప్రస్తావన చాలా అవసరం. ఎందుకంటే, తెలుగు సాహిత్యంలోనూ ప్రాంతీయ వాదంలో కనిపించే భావనలతోనే అనేక విభజనల రూపంలో కనిపిస్తుంది.

సామాజిక సమస్యలే సాహిత్యంలోనూ ప్రతిఫలించాలని కోరుకోవడం సహజం. అలా అన్ని సమస్యలు, అన్ని ప్రాంతాల, వర్గాల, కులాల వారి ఆకాంక్షలు సాహిత్యంలో కనిపించనప్పుడు అస్తిత్త్వం కోసం వెతుకులాట మొదలవుతుంది. సాహిత్యం పునర్మూల్యాంకనానికి గురవుతుంది. కాల పరిస్థితులను కూడా పరిగణించకుండా తమ తమ మానసిక స్పందనల్ని వ్యక్తీకరిస్తుంటారు. తమని గౌరవ ప్రదంగా చిత్రించిన సాహిత్యం గురించి మాట్లాడరు. ఒక వేళ ప్రయత్న పూర్వకంగానో, అప్రయత్న పూర్వకంగానో వర్గాల్ని మాత్రం అవమానించినట్లు అనుమానించినా, నాటి సామాజిక పరిస్థితుల్ని కూడా పరిగణించకుండా తీవ్రంగా నిరసిస్తుంటారు. అప్పటి వరకూ ఉన్న నిర్ణయాల్నీ పరీక్షలకు పెడుతుంటారు.

ప్రతి సమస్యనీ ప్రాంతంతో ముడిపెట్టి చూడడం ప్రాంతీయ అస్తిత్వ సాహిత్యంలో మరో ముఖ్యాంశం. కులం, మతం వంటి సమస్యలు తమని వెంటాడుతున్నప్పుటికీ, అవి ప్రాంతంతో ముడిపడినప్పుడు సమస్యల పరిష్కారం ద్వితీయమే అవుతుంది. తెలంగాణ ప్రాంతంలోని ముస్లిం వాదం ప్రాంతీయ వాద అస్తిత్వంతో ముడిపడి కొనసాగుతుంది. దళిత సాహిత్యంలో కనిపించే వర్గీకరణ విషయంలోనూ ప్రాంతీయ వాద ఉద్యమ ప్రభావం ఉన్నప్పటికీ, దానికింకా అంత తీవ్రత లేదు. కుల, మత అస్తిత్వ ఆరాటం తెలంగాణ ప్రాంతీయ అస్తిత్వ వాదానికి ఉప

ప్రాంతీయవాదంగా మారలేదు. రాష్ట్రంలోని మిగతాప్రాంతాలైన రాయలసీమ, కళింగాంధ్ర, మధ్యాంధ్రలలో ఉన్న మాదిగలు వర్గీకరణ ఉద్యమాన్ని దళితుల సమానత్వాన్ని ఆకాంక్షించే దిశగానే కొనసాగిస్తున్నారు.

కళింగాంధ్ర ప్రాంతంలోనూ ప్రాంతీయవాద సూచనలు కనిపిస్తున్నా, అవి ప్రపంచీకరణలో భాగంగానే అత్యధిక మంది రచయితలు చూస్తున్నారు. కరువు, మూడవిశ్వాసాలు వంటి విషయాల్లో స్పందించే రాయల సీమ, కళింగాంధ్ర రచయితలు తమ సాంస్కృతిక అంశాల పట్ల దృష్టి కేంద్రీకరించవలసిన అవసరం ఉంది. ఒకప్పుడు సినిమాల్లో, టి.వి.సీరియల్స్లో బపూన్, పనిమనిషి, విలన్ పాత్రల్లో వేష, భాషల్ని కించపరిచే దృశ్యాలు మధ్య కాలంలో ఎక్కువయ్యాయి. తెలంగాణ సాహితీ వేత్తల చైతన్యం ప్రాంతం వారి సాంస్కృతిక అంశాలను కించపరిచే చర్యలకు చాలా వరకూ అడ్డుకట్టవేసింది. వ్యాపార స్వభావులు తమకి అనుకూలంగా ఉన్న వాటిని సొమ్ము చేసుకోవడం సర్వసాధారణం. దాన్ని సాహితీవేత్తలు గుర్తించి వివిధ ప్రక్రియల రూపంలో సృజనీకరించి తమ మనోభావాల్ని వ్యక్తీకరించాలి. తూరుపు ( కళింగాంధ్ర కవిత్వం), రాయలసీమ కవులు ""వొరువు' కవితాసంకలనం వంటివి ఇప్పుడిప్పుడే వస్తున్నాయి.

ప్రాంతీయ అస్తిత్వవాదం కంటే ప్రపంచీకరణ ప్రభావం వల్ల చిన్నాభిన్నమైపోతున్న జీవన వ్యధార్థ జీవిత దృశ్యాలను స్థానీయ కోణంతో వ్యక్తీకరిస్తున్నారు. ఒక భావజాలం గల వాళ్ళే ఇలా ప్రపంచీకరణను వ్యతిరేకిస్తూ సాహిత్యాన్ని సృష్టిస్తున్నారనే వాదన కూడా వినిపిస్తుంది. అదే భావజాలం ఉన్న వాళ్ళు కూడా ప్రాంతీయ అస్తిత్వసాహిత్యాన్ని రాస్తూనే దాన్ని "వేర్పాటువాదం' గా కాకుండా ప్రపంచ వ్యాప్తంగా అలాంటి సమస్యల్ని పరిష్కరించడానికి పాలనలో జరుగుతున్న నిర్లక్ష్యాన్ని నిరంతరం తూర్పారపడుతూ, ప్రజల్ని నిత్యజాగృతుల్ని చేయగలగడం ద్వారానే ప్రాంతీయ సమస్యల శాశ్వత పరిష్కారాలు సాధ్యమన్నట్లు కూడా రాస్తున్నారు. నిజానికి దీన్ని కూడా ప్రాంతీయ అస్తిత్వ వాదంలో మరో పార్శ్వంగానే గుర్తించేవీలుంది. లేకపోతే తమ మాతృత్వ, పితృత్వంలో , కుటుంబంలో కోల్పోతున్న ఆత్మీయానురాగాలను గుర్తుచేసుకోలేరు. తమ గ్రామం, తమ సాంస్కృతిక వారసత్వాలను, తమ గ్రామీణ సమస్యలతో ముడిపెట్టి చూడ్డంలోనూ అస్తిత్వకోణం ఉన్నా అది స్థానీయమే అవుతుంది. ఇలా ప్రాంతీయ వాద అస్తిత్వ సాహిత్యం తెలుగులో పోరాటాల గడ్డ తెలంగాణ లోనే వివిధ ప్రక్రియల్లో విస్తరిస్తూ సాహిత్యానికి కొత్త దిశానిర్దేశం చేస్తుంది. అలాంటి చైతన్యంతో ముందుకెళ్తున్న రచయితలే సాహిత్యానికి నిజమైన జవజీవాల్ని అందించిన వాళ్ళవుతారు.

#అసిస్టెంటు ప్రొఫెసర్,

సెంట్రల్యూనివర్సిటి,

గచ్చిబౌలి, హైదరాబాదు -500 046

ఫోను: 9989628049

vrdarla@gmail.com

కామెంట్‌లు లేవు: