"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL-502: Techniques of writing a Dissertation క్లాసులు సోమ, మంగళ, గురు, శుక్రవారం మధ్యాహ్నం 12.00 గంటల నుండి 1.00 వరకు డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ భవనంలో జరుగుతాయి.

పత్రికలు  దార్ల లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
పత్రికలు  దార్ల లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

23 జులై, 2021

‘దాశరథి స్ఫూర్తి నేటికీ అవసరమే’ దాశరథి జయంతి సభలోవక్తలు ( 22.7.2021)

 

సాక్షి దినపత్రిక, హైదరాబాద్, 23.7.2021 వారి సౌజన్యంతో... 

తెలంగాణాలో నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా కలాన్ని, గళాన్ని అందించిన మహాకవి దాశరథి కృష్ణమాచార్యులు అని హెచ్ సి యు మానవీయ శాస్త్రాల విభాగం డీన్ ఆచార్య వి. కృష్ణ అన్నారు. గురువారం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ తెలుగు శాఖలో దాశరథి కృష్ణమాచార్యుల జయంతి సభ జరిగింది. ఈ కార్యక్రమంలో ఆచార్య వి. కృష్ణ  ముఖ్య అతిథిగా విచ్చేసి దాశరథి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మొదటి నుండి పోరాట స్ఫూర్తితో సాహిత్యాన్ని వెలువరించిన గొప్ప కవి దాశరథి అనీ, ఆ పోరాట స్ఫూర్తిని నేటికీ ఉద్యమకారులు అందుకోవలసిన అవసరం కనిపిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు.  తెలుగు శాఖ అధ్యక్షుడు ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు అధ్యక్షత జరిగిన ఈ సమావేశంలో తెలంగాణ సాహిత్య వారసత్వాన్ని నిలిపిన దాశరథి గురించి పలువురు వక్తలు మాట్లాడారు. హెచ్ సి యు అధ్యాపక సంఘం అధ్యక్షుడు ఆచార్య పిల్లలమర్రి రాములు మాట్లాడుతూ దాశరథి బహుముఖ ప్రజ్ఞావంతుడనీ, ఒకవైపు పోరాట గీతాలు రచించినా, తదనంతర కాలంలో ఉత్తమమైన సినిమా పాటలు, విలువైన విమర్శనా వ్యాసాలను వెలువరించారనీ, గాలిబ్ గీతాల ద్వారా ఉర్దూసాహిత్య మాధుర్యాన్ని అందించారని అన్నారు. ఆచార్య జి.అరుణకుమారి, ఆచార్య పమ్మి పవన్ కుమార్, డా.డి.విజయకుమారి తదితరులు  మాట్లాడుతూ దాశరథి గారి సాహిత్య వైశిష్ట్యాన్ని, ఆయన ఉద్యమ స్ఫూర్తిని వివరించారు.


ఆంధ్రప్రభ దినపత్రిక, హైదరాబాద్, 23.7.2021 వారి సౌజన్యంతో... 

ఈనాడు  దినపత్రిక, హైదరాబాద్, 23.7.2021 వారి సౌజన్యంతో... 

 

నమస్తేతెలంగాణ దినపత్రిక, హైదరాబాద్, 23.7.2021 వారి సౌజన్యంతో... 


01 సెప్టెంబర్, 2020

ఒక కవిసమ్మేళనం... ఒక మధురమైన సన్నివేశం ( తెనాలి అంతర్జాల కవిసమ్మేళనం, 31.8.2020)

 31.8.2020, సాయంత్రం 5 గంటలు

ఒక కవిసమ్మేళనం... నాకుఎదురైన ఒక మధురమైన సన్నివేశం గురించి రాయాలనిపించింది.

నాకు గురు తుల్యులు, ఎం.ఏ., చదువుకుంటున్న నాటి నుండి నేటివరకు  నన్ను ఒక కుటుంబసభ్యుడిగా ఆదరిస్తూ, నాకొక గార్డియన్ లా వ్యవహరించే  ఆచార్య గుజ్జర్లమూడి కృపాచారి గారి ఆహ్వానం మేరకు తెనాలి లోని ప్రసిద్ధి సాహిత్య, సాంస్కృతిక సంస్థ ‘శారదా సాహితీ సేవాసమితి’ ఆధ్వర్యంలో సోమవారం జరిగిన  అంతర్జాల కవిసమ్మేళనానికి నన్ను అతిథిగా పాల్గొనమని  ఆహ్వానించారు.  నా విద్యార్థులకు ఆన్ లైన్ క్లాసులు 5 గంటల వరకు ఉంటాయన్నాను. అయితే, 5 గంటల తర్వాతే పెడతానన్నారు. అందువల్ల ఈ కవి సమ్మేళనం పాల్గొన్నాను. నా పాత్ర ఏమిటో చెప్పలేదు. కానీ, కవి సమ్మేలనంలో చదువుతున్న కొన్ని కవితలను నిర్వాహకులు నన్ను  విశ్లేషించమన్నారు.

ప్రపంచం ఎదుర్కొంటున్న కరోనా గురించి చాలామంది కవితలు చదివారు. దాన్ని ఒక నిశ్శబ్ద తృతీయ ప్రపంచ సంగ్రామం గా అభివర్ణించారు. మరికొంతమంది కరోనాను అనేక పార్శ్వాల్లో చూడవలసి ఉందని రాశారు.  మనలో ఉన్న అహంభావం పోయేలా మనం సాటి మనుషులతో వ్యవహరించవలసిన మానవ సంబంధాలను కరోనా తెలిపిందని కొంతమంది కవులు వర్ణించారు. పాంచభౌతిక జీవితం పంచభూతాలతో ఉన్న సంబంధాన్ని తెలియజేసిందని తాత్వికంగా కూడా కొంతమంది కవిత్వం రాశారు. కరువు సమయంలో మనుషులు ఎదుర్కొన్న ఇబ్బందులను ఆ సమయంలో కొంతమంది చూపిన సహకారాన్ని కూడా కొంతమంది కవులు వర్ణించారు. కొంతమంది కవులు కరోనాకు ముందు ఈ ప్రకృతితో మానవుడు ఎంత సంతోషంగా తన ఆనందాన్ని పెనవేసుకుని జీవించేవాడో, అది కోల్పోయిన తర్వాత గాని దాని విలువ తెలుసుకోలేకపోయారని మరలా అటువంటి చక్కని వాతావరణం సమాజంలో ఎప్పుడొస్తుందోనని ప్రజలంతా ఎదురుచూస్తున్నారని వర్ణించారు. 

ఇంకొంత మంది కవులు మాతృభాష తెలుగులోని ఔన్నత్యాన్ని కీర్తిస్తూ వివిధ పార్శ్వాల్లో కవిత్వాన్ని చదివారు. కొంతమంది అకారాది క్రమంలో తెలుగు పదాలను కూర్చుకుంటూ తెలుగు భాషకు గల  సౌందర్యాన్ని ఆ శక్తిని వివరించే లా కవిత్వాన్ని చదివి వినిపించారు. 
సమాజంలో కొంతమంది తమ ఊరూ, పేరూ ఆశించకుండా పనిచేస్తుంటారని శ్రామికుల ఔన్నత్యాన్ని, నిష్కల్మషతను వర్ణించారు. నిజానికి వాళ్ళెవరో కానీ వాళ్ళ వల్లే మనం సుఖసంతోషాలతో జీవిస్తున్నామనీ, దేశం సస్యశ్యామలమై, ప్రజలంతా పాడిపంటలను అనుభవిస్తున్నారని, వాళ్ళవల్లనే దేశం అభివృద్ధి పథంలో పయనిస్తుందని, అయినప్పటికీ వాళ్లని మనం విస్మరించడం జరుగుతోందని ధ్వనిమయంగా శ్రామికుల గొప్పతనాన్ని తెలియజేస్తూ కవిత చదివారు. 

ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు చేస్తున్న వివిధ కవితలకు తనదైన విశ్లేషణ చేయడం బాగుందని,  శ్రోతలు, కవులు బాగా ఆనందిస్తున్నారని   మధ్య మధ్యలో ఆచార్య కృపాచారి గారు నాలో కొత్త ఉత్సాహాన్ని నింపేవారు. 

నన్ను కూడా ఒక కవిత చదవమన్నారు. గతంలో రాసుకున్న నా కవిత   నాలో నీలో - నాన్న చదివి వినిపించాను. తండ్రి ప్రాధాన్యాన్ని వివరించే ఆ కవితను ప్రజెంటేషన్ ద్వారా చదివి వినిపించాను.  ప్రతి ఒక్కరికి తల్లిదండ్రుల నిజమైన విలువ పిల్లలు పుట్టినప్పుడు తెలుస్తుందని వాళ్లను పెంచడంలో, సుఖసంతోషాలతో పాలుపంచుకోవడంలో ఉన్న ఆనందం మరలా తన తల్లిదండ్రులను గుర్తు చేసేలా ఉంటుందని ఆ కవిత సారాంశం. ఆ కవితను మరోసారి ఇక్కడ పెడుతున్నాను.

నువ్వు భయాన్నవతలకు విసరేసి

విశ్వాసాన్నంతా పరుచుకొని

నా యెదపై అలా గంతులేస్తుంటే
నీ గొంతు
 పలికే కేరింతలన్నీ 
మా నాన్న కళ్ళ నుండి రాలిపడుతున్న
 

ఆనందభాష్పాలనిపిస్తున్నాయి
నువ్వు నా భుజమ్మీద నిలబడి
నీ రెండు
  చేతుల్నీ ఆకాశం వైపు చూపిస్తున్నప్పుడల్లా
మళ్ళీ మా నాన్న చేతుల్నే ప్రే

మగా తాకుతున్నట్లనిపిస్తుంది
నువ్వు నా ఒడిలో గువ్వలా ఒదిగిపోతున్నప్పుడల్లా
మా నాన్న మా కోసమెలాకరిగిపోయాడోనంటూ
గుండె మరింత గట్టిగా కొట్టుకుంటున్నట్లనిపిస్తుంది
నువ్వు నా చుట్టూ అలా ఆడుకుంటుంటే
మా నాన్నే నాతో ఆడుకుంటున్నట్లనిపిస్తుంది
నాన్నా!
నువ్వు నాకో ఆత్మవిశ్వాసపు ఆకాశం
నువ్వు నాకో నిత్య పరిమళాల ఆనందపు జల్లు
నువ్వు నాకో రంగురంగుల ఇంద్రధనస్సు
నీలోని నేనే
నాలోని నువ్వు
నీతో మళ్ళీ ఆడుకోవడమంటే
నవ్వుల పూదోటలో విహరించడమే!

-ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, 

 దీనితో పాటు తెలుగు భాష ఔన్నత్యాన్ని చాలామంది కవులు కవిత్వం ద్వారా వినిపించారని చెబుతూ,  సౌత్ ఆఫ్రికా తెలుగు సమాఖ్య వారు 29వ తేదీ ఆగస్టు 20 20 న అంతర్జాలం ద్వారా జరిగిన ఒక సమావేశంలో నేను ప్రసంగిస్తూ ఒక పద్యం చెప్పానని ఆ పద్యాన్ని ఈ సందర్భంగా చదివి వినిపించాను.

అమ్మమాటవోలె అమృతంబు కురిపించె

గగన గంగవోలె కవనమయ్యె

తెలుగు భాష భువిని వెలుగించు చుండెరా

దారి పూల తోట దార్ల మాట!

నాగురించి కవిసమ్మేళనంలో ప్రసంగించిన వక్త

ఈ కవిసమ్మేళనంలో ఒకాయన (ఆయన పేరు తెలుసుకొని మరలా అప్ డేట్ చేస్తాను) కవి సమ్మేళనంలో నేను కవిత చదవడం కోసం కాదు, మీరు అనుమతిస్తే ఆచార్య దార్ల వారి గురించి మాట్లాడాని అన్నారు. అనుకోకుండా ఇదేమిట్రాబాబూ... నా గురించి ఆయన ఏమి మాట్లాడతారో అనే ఆందోళన మనసులో ఉన్నా, దేన్నైనా ఎదుర్కోవడానికి సిద్ధమయ్యాను. సభను నిర్వహిస్తున్న ఆచార్య కృపాచారి గారు, తదితరులు ఆయనకి అనుమతిచ్చారు. ‘ వెంకటేశ్వరరావుగారు నమస్కారం, నేను ఎవరో తెలుసా... నా పేరు..’’ చెప్పారు...కానీ నా మనసంతా ఏదో ఆందోళనలో సరిగ్గా వినిపించుకోలేకపోయాను. అప్రయత్నంగా నమస్కరించాను. తర్వాత ఆయన మాట్లాడుతూ  ‘‘మాది తూర్పుగోదావరి జిల్లా’’ అన్నారు. హమ్మయ్య అనిపించింది. అంతే కాదు, మాది  ‘‘చెయ్యేరు’’ అన్నారు. ‘అవునండి...నాది ఆ పక్కనే చెయ్యేరు అగ్రహారం ’ అనే మాట అప్రయత్నంగా జారిపడిది. ఆయన మాటతో నాకు మరింత రిలీఫ్ అనిపించింది. మీరు నాకు బాగా తెలుసు అన్నారు. ఇక శ్రోతల్ని ఉద్దేశించి మాట్లాడారు.                 ‘‘ ఆచార్య దార్ల వెంకటేశ్వరరావుగారు, మా తూర్పుగోదావరి జిల్లా గర్వించే ఆణిముత్యం. ఆయన ఎంతో ఆత్మవిశ్వాసంతో ముందుకెళతారు. ఒక చిన్న గ్రామం నుండి నేడు హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీలో ఫ్రొఫెసర్ గా ఉండి, ఆయన మా తూర్పుగోదావరి జిల్లాకే గొప్ప పేరు తెచ్చారు. ఆయన్ని చూసి మాకెంతో గర్వంగా అనిపిస్తుంది. ఆయన మాకెంతోమందికి ఆదర్శప్రాయం. ఆయన ఈ స్థితికి రావడానికి ఎంత కష్టపడ్డారో నాకు కూడా తెలుసు. ఆయన ఆత్మ విశ్వాసమే ఆయన్ని ఇలా నిలదొక్కుకునేలా చేసింది.’’

...ఇలా ఆయన ప్రశంసలు కురిపిస్తుంటే నాకు తెలియకుండా ఆనందభాష్పాలు రాపిపోయాయి.,

ఇది నిజంగా నా జీవితంలో అనూహ్యంగా ఎదురైన ఒక మధురమైన సన్నివేశం.

ఆ మాటలకు ధన్యవాదాలు తెలియజేసి, నేనిలా ఉండడానికి ఆచార్య కృపాచారిగారు లాంటి వారు ఎంతోమంది కారణమని, జీవితంలో క్రమశిక్షణ, వినయం, నిరంతరం శ్రమించడం పెద్దవాళ్లనుండి నేర్చుకున్నానని, మీ లాంటి సహృదయుల తోడ్పాటే నన్ను ఈ స్థితిలో ఉంచిందని కృతజ్ఞతలు చెప్తూ గొప్ప రిలీఫ్ గా ఫీలయ్యాను.

ఈ కవి సమ్మేళనంలో మైసూరు విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్ రామనాథం నాయుడుగారు, శ్రీ హనుమంతరావుగారు, డా. జ్యోతి స్వరూపరాణి గారు, బేబి రత్నకుమారిగారు, గోపాల కృష్ణమూర్తిగారు, రఘునారాయణగారు, సత్యనారాయణగారు, శంకరాచారి గారు, లలితానంద ప్రసాద్ గారు, ఫణీంద్రగారు,ఆలూరి విల్సన్ గారు తదితరులు పాల్గొని మంచి కవిత్వం చదివారు.

కరోనా సమయంలో, ఇంటికే పరిమితమైనా, తమ భావాలు ఏదొకలా విస్తరిస్తున్న కవులను, సాహితీ వేత్తలను అభినందిస్తున్నాను.

-ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, 1.9.2020

 

 

01 మే, 2020

నిబద్ధతకు నిజమైన చిరునామా శ్రీ వేల్పూరి కామేశ్వరరావు గారు ( రైలుశక్తి మాసపత్రిక, మే, 2020 ప్రత్యేక సంచిక సౌజన్యంతో...)


నిబద్ధతకు నిజమైన చిరునామా
శ్రీ వేల్పూరి కామేశ్వరరావు గారు

అవును...ఈ మాట నేనే కాదు, ఆయనతో పరిచయం ఉన్నవాళ్ళంతా చెప్పేమాటనుకుంటాను. ఆయన చాలా కాలం పాటు రైల్వేలో పనిచేశారు. అందువల్లనేనేమో రైల్వే కార్మికుల గురించి ఆయన సాధికారికంగా రాయగలుగుతున్నారనుకుంటాను. ఆయన ఫేసుబుక్కులో రాసిన రచనల్ని ‘అగ్నిగోళం’ పేరుతో ప్రచురించారు. దాన్ని చదివిన తర్వాత ఆ పుస్తకం, దానితో పాటు ఆయన పట్ల నాగున్న కొన్ని అభిప్రాయాల్ని మీతో పంచుకోవాలనిపించింది.

 శ్రీ వేల్పూరి కామేశ్వరరావుగారు సంపాదకుడిగా వ్యవహరిస్తూ, ఆయనే స్వయంగా ప్రచురిస్తున్న ‘రైలుశక్తి’ మాసపత్రిక చిన్నదే కావచ్చు. కానీ, ఆ పత్రికలోని ప్రతి అక్షరం ఆయన అనుభవంతో చెప్తున్నట్లుంటుంది. అందువల్ల ఆయన పట్టుకొచ్చి ఇచ్చిన వెంటనే మొదటి నుండి చివరివరకూ చదవకుండా వదలబుద్ధికాదు. ఆ పత్రికలో ఒక కవిత వేస్తుంటారు. అది ఆయనదే కానక్కర్లేదు. సామాజిక స్ఫృహకలిగిన, సమకాలీన అంశానికి సంబంధించిన, ఒక అభ్యుదయ ఆకాంక్షను రగించిన వస్తువేదైనా ఉంటే, దాన్ని ఆ పత్రికలో ప్రచురిస్తుంటారు. ఆ కవితలు నిజంగా నిప్పుల వర్షం కురుస్తున్నట్లుంటాయి. ఆయన రాసే కవిత్వం కూడా అలాగే ఉంటుంది. ఆయన గతంలో ప్రచురించిన ‘జిజ్ఞాస తరంగాలు‘ గ్రంథంలో తాను రాసిన వ్యాసాలతో పాటు, కొన్ని కవితల్ని కూడా ప్రచురించారు.
 ఇదిలా ఉండగా ఈ మధ్య సోషల్ మీడియా ప్రాధాన్యం బాగా పెరిగింది. పత్రికల్లో రాస్తే, వాటికి వచ్చే స్పందన ఎలా ఉంటుందో తెలియడం వెంటనే సాధ్యమైయ్యే అవకాశం తక్కువ. సోషల్ మీడియా- ఫేసుబుక్, వాట్సాప్, ట్విట్టర్, బ్లాగు... ఇలా రకరకాల రూపంలో సోషల్ మీడియాలో వెంటవెంటనే పాఠకుల స్పందనలు బహిర్గతమౌతున్నాయి. శ్రీ వేల్పూరి కామేశ్వరరావుగారు ఒక భారతీయ పౌరుడిగా, ఒక పార్టీ అధ్యక్షుడిగా, ఒక బాధ్యత కలిగిన రచయితగా, సామాజిక కార్యకర్తగా తన అభిప్రాయాల్ని స్వేచ్ఛగా ‘ఫేసుబుక్’లో రాస్తుంటారు. వాటిని అలాగే వదిలేయకుండా, వాటిని ఒక పుస్తకరూపంలో తీసుకొచ్చారు. అందుకు ముందుగా ఆయన్ని అభినందిస్తున్నాను. ఆ పుస్తకానికి పెట్టిన‘అగ్నిగోళాలు’’ అనే పేరులాగే, దానిలో ఆయన ఆలోచనల్లోని వేడినీ, వాడినీ, ఆయన గుండె కొట్టుకునే సామాజిక బాధ్యతనూ, ఏమీ చేయలేకపోతున్న నిస్సహాయతలో నుండి వెలువడిన విమర్శనా వాడినీ ప్రదర్శించారనిపించింది. దీన్ని సెప్టెంబర్,2019లో ప్రచురించారు. ప్రతి నెలా రైలుశక్తి పత్రికను ఇంటికి తీసుకొచ్చి ఇచ్చే క్రమంలోనే ఈ పుస్తకాన్నీ నాకిచ్చి, నా అభిప్రాయాన్ని చెప్పమన్నారు. పత్రికను చదివినంత వేగంగా, దానిపై నా అభిప్రాయాల్ని చెప్పలేకపోయాను. నాకు కొన్ని పరిమితులున్నాయి. ఆయన విమర్శించినంత  ‘వేడిగా’ నేను చెప్పలేను. వ్యక్తిగతంగా కొంతమందిని పేరు పెట్టి నిందించడాన్ని నేను అంగీకరించలేను. అంతే కాదు, కొన్ని భావాలతో అంగీకరించలేననీ భావిస్తున్నాను.  కానీ, ఆయన అంత ‘వేడిగా’ చెప్పడంలో ఆయన ఆవేదనను అర్థంచేసుకోవాల్సిన అవసరం ఉందనిపించింది. ఈ పుస్తకం చదివిన తర్వాత కామేశ్వరరావు గారికి ఉన్న భావజాలం, వివిధ భావజాలాల పట్ల ఆయన పడుతున్న సంఘర్షణను అర్థం చేసుకునే ప్రయత్నం చేయవచ్చు.

 ‘అగ్నిగోళాలు’ పుస్తకంలో ప్రకటించిన భావాల్ని గమనిస్తే, ప్రజాస్వామ్యం పట్ల ఆయనకెంతో నమ్మకం ఉందని తెలుస్తుంది. కానీ, దాన్ని రాజకీయ పార్టీలు దుర్వినియోగం చేస్తున్నాయని ఆవేదన చెందుతారు. దేశ స్వాతంత్ర్యం కోసం, ప్రజాస్వామ్యం కోసం పాటుపడిన వారి పేరు చెప్పినంతగా, ఆచరణలో వారి ఆశయాల్ని నెరవేర్చలేకపోతున్నారని ఆయన ఆవేదన చెందుతారు. ‘స్వాతంత్ర్య దినోత్సవం కోసం’ (పుట:17),  దేశం కోసం ప్రేమలత పోరాటం (పుట:26), ప్రజాస్వామ్యం కోసం  భరతమాత తపన (పుట: 33), అపహాస్యం పాలవుతున్న ప్రజాస్వామ్యం (పుట: 35), అప్రజాస్వామిక పార్టీలకు, శక్తులకు వ్యతిరేకంగా పోరాడాలి (పుట:97) మొదలైన వ్యాసాలన్నీ ఆయన ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పడే ఆవేదనను తెలియజేస్తున్నాయి. ఆ ఆవేదన ఆవేశంగా మారిన వ్యాసాలు కొంతమంది పాఠకుల్ని ఆలోచన కంటే ఆవేశాన్ని కల్గించేలా ఉన్నాయి. కానీ, ఆలోచనాత్మక ప్రణాళిక తనకుందని నిరూపించేవిషయాలు ‘ఇండియన్ లేబర్ పార్టీ తీర్మానాలు’ (పుటలు:67-68) చదివితే తెలుస్తుంది.
తన జీవితంలో సాధించిన వాటిని చూసి, నాడు ఉద్యమాలు చేస్తే మంచి ఫలితాలు వచ్చేవని, కానీ నేడు ఆ పరిస్థితి కనిపించడంలేదనే అసంతృప్తీ తన రచనల్లో తీవ్రతకు ఒక కారణమేమో అనిపిస్తుంది.
‘స్కూలు కోసం ఆందోళన’ పేరుతో రాసిన అనుభవాత్మక ఉద్యమాన్ని (పుట:13),  మా దుద్దుకూరు స్కూలు (పుట: ), మా టీచర్సుకు నమస్సులు (పుట: 50), ఐలయ్యగారికి సంఘీభావంగా... (పుట: 80)  మొదలైనవన్నీ ఆత్మాశ్రయ పద్ధతిలో రాసిన వ్యాసాలు.  ముఖ్యంగా 1987లో  కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు కోసం జరిగిన ఉద్యమాల్లో తాను సస్పెన్షన్ కి గురైనా, ఆ ఉద్యమం ఫలితం ఇచ్చిందనే సంతృప్తి ఒక మధురమైన జ్ఞాపకంగా నెమరువేసుకుంటారాయన.  ఆ దుద్దుకూరు ఆచార్య రంగా జిల్లా పరిషత్ స్కూలు హెడ్మాస్టర్ కి తన ‘జిజ్ఞాసతరంగాలు’ పుస్తకం ఇచ్చినప్పుడు, ఆ హెడ్మాస్టర్ కళ్ళల్లో వెలిగిన వెలుగో, తానింత వాడినయ్యానని గురువుగార్కి చెప్పినట్లయ్యిందో గానీ అదొక మరిచిపోలేని అనుభూతిగా భావిస్తారాయన.  
కామేశ్వరరావుగారితో మాట్లాడినా, ఆయన రచనలు చదివినా వాటన్నింటిలోనూ మార్క్సిజం పట్ల ప్రేమా, అంబేద్కరిజం ప్రదర్శించే వాస్తవికత పట్ల ఆత్మీయతా, బహుజనులు, శ్రామికుల పట్ల తాదాత్మ్యం మనం గమనించగలుగుతాం. కుహనా మార్క్సిస్టుల పట్ల వ్యతిరేకత ఉందే తప్ప, కారల్ మార్స్క్ సిద్ధాంతాల పట్ల ఆయనకు వ్యతిరేకత కనిపించదు. ఆయన భౌతికవాదిగా కనిపిస్తారు. అయినా, పోతులూరి వీరబ్రహ్మంగారి తత్త్వాల్లోని కొన్ని విషయాల పట్ల సానుకూలమైన ఆలోచనా దృక్పథాన్ని ప్రదర్శిస్తారు. ఆనాడే వీరబ్రహ్మంగారి బోధనల్లో సమానత్వ భావనలు ఉన్నాయంటారు. ఆయనకున్న ప్రాపంచిక దృక్పథం, సమకాలీన రాజకీయాలు, వాటి ఆచరణ మొదలైన అంశాలతో పాటు, ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశపెట్టిన ఆంగ్లమాధ్యమం పేదలకెంతగానో సహకరించే చర్య అని దాన్ని  సమర్థించడం వంటి వన్నీ తెలియాలంటే MAP TV కి ఇచ్చిన ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూని వినాలి. కుండబద్దలు కొట్టినల్లు తన అభిప్రాయాల్ని ఆ ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. తన జీవితం, విద్యాభ్యాసం, ఉద్యమం, ఉద్యోగం, ప్రస్తుతం పనిచేస్తున్న రాజకీయ పార్టీ అనుభవాలు వంటివెన్నో దీనిలో చెప్పారు.
ఇంత పటిష్టమైన సైద్ధాంతిక అవగాహన ఉన్న కామేశ్వరరావుగారు, సైద్ధాంతికత కోసం తాను చేసినవాటిని దాచేసి రాయకుండా, తాను చేసిందాన్ని చేసినట్లు  సెప్టెంబరు, 19 వతేదీ, 2015న ‘‘ మా అమ్మకోసం’’ (పుట: 15-16) అని రాసిన ఒక జ్ఞాపకాన్ని చదివి తీరాల్సిందే. తన తల్లి ఆంజనేయస్వామినీ, వీరబ్రహ్మేంద్రస్వామినీ మ్రొక్కే వారట. ‘‘బహుశ మా అమ్మ తను చనిపోయిన, నా చుట్టూ ఎల్లప్పుడు ఉంటూ  కాపాడుతుందని అనిపిస్తోంది’’ అని రాసుకున్నారు. తన అభివృద్ధికి తన అమ్మగారెంత విడదీయనంతగా కలిసిపోయారో చెప్పడమే దీని ఆంతర్యం కావచ్చు. అంతే కాదు, తన కుమార్తె రూపంలో పుట్టిందేమోనంటారాయన. ఇక్కడ ఆయన కర్మసిద్ధాంతాన్ని నమ్ముతున్నారనిపిస్తుంది. కానీ, తన తల్లిపట్ల తనకున్న తాదాత్మభావాన్నిలా వ్యక్తం చేశారు. ఎంతో నిజాయితీగా, ఆత్మీయంగా రాసుకున్న ఈ రైటప్ నాకెంతో నచ్చింది. బహుశా మీకూ నచ్చవచ్చు. చదవండి.

ఇక, ముగించే ముందు రెండు విషయాలు చెప్పాలనుకుంటున్నాను. ఆయనకు పెత్తందారులు, భూస్వాములు, పాలకుల పట్ల ఎంతో వ్యతిరేకత ఉన్నట్లు అనిపించడానికి కారణం, బహుశా వాళ్ళలో కొంతమంది చేసే పనులు. ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల్ని తమ రాజకీయాలకు వాడుకోవడాన్ని నిరసించడం ఆ విషయాన్నే తెలుపుతుందనుకుంటున్నాను. మరో విషయం- తన భావాల్ని, అవీ కెరటాల్లా ఉరికొచ్చే భావాల్ని అంతే ఉద్వేగంతో కవిత్వీకరించడం, వాటిని ఈ పుస్తకంలో అక్కడక్కడా ప్రచురించడం పాఠకులెవరూ విస్మరించలేరు. ఈయన కవిత్వంలో ఆవేశం ఉంటుంది. ఆ ఆవేశం కేవలం ఆవేశం కాదు, అది ధర్మాగ్రహం అని ఆలోచిస్తే తెలుస్తుంది. దాన్ని వ్యక్తీకరించడంలో సౌందర్యానికంటే, సూటితనానికే అధిక ప్రాధాన్యానిస్తారు. కొన్ని పదాల్ని వాడ్డంలో కట్టలు తెంచుకున్న ఆవేశం కొంతమంది పాఠకుల్ని ఇబ్బందుల్లో పడేస్తుంది. దానివల్ల ప్రవక్తలా చెప్పిన మంచి వాక్యాలు కూడా ఆ పదాల వల్ల మరుగున పడే అవకాశం ఉందేమననిపిస్తుంది. MAP TVలో ప్రసారమైన ఇంటర్వ్యూలో ఆయన నోటి నుండి చదివే కవిత్వాన్ని వెంటే, వినేవాళ్ళు కూడా ఆయన్నే సమర్థిస్తారేమోనని కూడా అనిపిస్తుంది. 15 వచన కవితలు, ఒక పాట దీనిలో ఉన్నాయి. చివరిలో ఆయన రాసిన కవిత్వపంక్తులు శాశ్వతంగా నిలిచిపోయే ప్రవక్త వచనల్లా ఉన్నాయి. వీటితో పాటు శ్రీశ్రీ, శివసాగర్ తదితరులను ప్రస్తావిస్తూ రాసిన వ్యాసాల్లో ఆయన సాహిత్యాభిరుచి కనిపిస్తుంది.
‘‘గోడమీద ప్రపంచపటం
చూసినప్పుడల్లా
నాకు శ్రమజీవుల కన్నీళ్ళే
మహాసముద్రాలుగా కనిపిస్తాయి’’ అని ముగింపులో కొన్ని కవితాపంక్తుల్ని రాసిన ఆయన తన ‘అగ్నిగోళాలు’ గ్రంథాన్ని శ్రామికులకే అంకితం చేశారు. సాధారణంగా మన తెలుగు సమాజంలో ఉగాది వస్తుందంటే ముందే కోయిల కూసినట్లు కవులు తమ సాంస్కృతిక ఔన్నత్యాన్ని  కీర్తిస్తూ కవిత్వమైపోతుంటారు. ఆచరణలో ఆ సంస్కృతిని దగ్గరుండి చూసేవాళ్ళకి వాళ్ళలో ఉండే హిపోక్రసీ తెలిసి ఎంతో చిరాకనిపిస్తుంది. తమ కీర్తి కండూతి కోసం కవిత్వం రాయడం కంటే మానేయడమే మంచిది. కామేశ్వరరావు గారు ఉగాది కవికాదు, కామేశ్వరరావుగారు ఒక్క మాటలో చెప్పాలంటే పండుగలకు మాత్రమే స్పందించే కవికాదు. అందుకే ఉగాది వస్తుంటే, అందరూ కవిత్వం రాస్తున్నా, ‘‘నాకు రాయాలని ఉండదు’’ అంటారు. ఒకవేళ రాద్దామనుకుంటే ఆత్మహత్యల ఘోషలు, హంతకుల హత్యలు...’’ (పుట:24) కళ్ళముందుకొస్తాయంటాడాయన. వాటినన్నింటినీ కప్పిపుచ్చుకొని తమ గొప్పతనాన్ని పొగుడుకోవడం ఒక హిపోక్రసీ అవుతుందని భావిస్తాడాయన.
సమాజంలో సినిమా చూపే ప్రభావం సామాన్యమైంది కాదు. కానీ, దాన్ని తీసే దర్శకులు, మాటలు, పాటలు రాసే రచయితలు బాధ్యత లేకుండా వ్యవహరిస్తుంటే, వాటి ప్రభావం పడిన పిల్లలెలా తయారౌతారని మరో కవితలో వాళ్ళని ‘సినీ క్రిమినల్స్ గా అభివర్ణిస్తూ, ప్రశ్నిస్తాడాయన. అలాగే, మనుధర్మశాస్త్రం ప్రభావం కూడా సామాన్యమైందికాదు. అది తరతరాలుగా నరనరాల్లో ఇంకిపోయింది. అది చివరికి చారిత్రక, గతితార్కిక  భౌతికవాదాన్ని కూడా మింగేసేస్థితికొచ్చిందని ‘వివేక్ కిసంతాపం’లో బాధపడతాడాయన. తాను చేస్తున్న పనికి ‘చెట్లు ఆనందంతో పులకించిపోతున్నాయి’ అని ప్రారంభం చూసి అద్భుతమైన కవిత్వం కదా అనిపిస్తుంది. కానీ, తర్వాత నినాదప్రాయమైపోయింది. జీవితమంటే ఒక సంఘర్షణ అని గుర్తించాలి. సంఘర్షణ  అభివృద్ధికి మూలమని చెప్తూ, జీవితంమంటే పూలపాన్పులా ఉండదంటాడాయన. చిన్నచిన్న కారణాలకే చనిపోయే వాళ్ళను చూసిన చలించిపోయిన ఈ కవి బ్రతుకుని ఒక పోరాటంగా భావించాలనీ, బ్రతకడానికి రకరకాల పనులున్నాయని, డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనేదేమిటో తెలుసుకుంటే ఎలాగైనా బ్రతకవచ్చునంటారాయన. అందుకోసమే దీన్ని రాస్తే ఏముంది? ఒక వేళ చనిపోవాల్సివస్తే, భగత్ సింగ్, రాజగురు, సుఖ్ దేవ్ వంటి త్యాగాలు చేసి చనిపోవాలని ప్రబోధిస్తాడాయన. ప్రతి మనిషి పుట్టుకకు ఒక కార్యకారణ సంబంధం ఉందని గుర్తించమనే గొప్ప ప్రబోధాత్మక కవితనొకటి రాశారు.  ఇలా కవిత్వంలో తన అంతరంగాన్నీ, ఆత్మస్థైర్యాన్నీ, పోరాటపటిమనీ అభివ్యక్తీకరించిన కామేశ్వరరావుగారి మరొక్క కవితను పరిచయం చేస్తూ దీన్ని ముగిస్తాను. కామేశ్వరరావుగారు ‘‘చైతన్యమూర్తి’’ అనే పేరుతో ఒక కవితను రాశారు. దానిలో తన దృక్పథం, తన తాత్త్వికతను వెల్లడించారు.

‘‘నేను
నా బొటను వ్రేలు కోల్పోయిన ఏకలవ్యుడిని
తలకాయ తీయబడిన శంబూకుడ్ని
దొంగదెబ్బతో చంపబడిన వాలిని
ముక్కు చెవులు కోల్పోయిన శూర్పణకను
చదువుకు దూరంగా నెట్టబడిన బహుజనుడ్ని...’’ ఇలా కృత యుగం నుండి కలియుగం అని చెప్పుకునే నేటివరకూ జరిగిన దుర్మార్గాల్నీ, కుట్రల్నీ, కుతంత్రాల్నీ కవిత్వంగా మార్చి, యుగయుగాలుగా అణచివేతకు గురైన వారి స్వరాన్నవుతానని ప్రకటిస్తారాయన. తమపై కొనసాగుతున్న అధర్మాన్ని ప్రశ్నిస్తే, తమపై జరుగుతున్న అణచివేతలను ఎదుర్కోవడం కోసం తిరగబడితే, అటువంటి వాళ్ళను విప్లవకారులుగా, ఉగ్రవాదులుగా భావిస్తున్నారనీ చెప్తూ...
‘‘మీ ఆధిపత్య కళ్ళకి
నేనొక ఉగ్రవాదిని
అవును నేనొక ఉగ్రవాదిని’’ అని అంగీకరించైనా తమ హక్కుల్ని సాధించుకోవడానికి తమ మార్గాల్ని వీడని వాళ్ళతోనే తన పయనమని ప్రకటిస్తాడాయన. తమ ఆవేదన సరిగ్గా అర్థం చేసుకుంటే తానెవరో తెలుసుకోగలుగుతారంటూ...
‘‘కానీ, నేనొక మార్పుని
మావి కన్నీళ్ళు కావు
తుపాకీ గుండ్లు
మావి ఆవేదనలు కావు
అణుబాంబులు’’ అని మీకు స్పష్టమవుతుందంటాడాయన. ఈ కవిత ‘నేను’’ అని ప్రారంభమౌతుంది. ఈ నేను ఒక కోణంలో కామేశ్వరరావుగారు. అంటే ఆయన తాత్త్విక దృక్పథం. రెండోది ‘‘నేను’’ అంటే భారతదేశంలో తరతరాలుగా అణచివేతకు గురౌతున్న కుల, వర్గ, లింగ పీడితులందరికీ ప్రాతినిథ్యం వహించడం. తనకు గౌతమబుద్ధుడు, పోతులూరి  వీరబ్రహ్మం, కారల్ మార్క్స్, జ్యోతిరావు ఫూలే,  సావిత్రిబాయి ఫూలే,  భగత్ సింగ్, రాజగురు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మొదలైనవారి తాత్త్విక చింతన పట్ల స్పష్టత ఉందని ఈ కవిత, ఈ వ్యాసాలన్నీ తెలుపుతాయి. శ్రీ వేల్పూరి కామేశ్వరరావు గారు తానేది మాట్లాడతారో, అదే రాస్తారు. తానేది రాస్తారో, అదే ఆచరణలో చూపిస్తారు. తానే సిద్ధాంతాన్ని నమ్ముతారో, అదే సిద్ధాంతం కోసం నిబద్ధతతో జీవిస్తున్నారు. అందుకే ఆయన రాసిన ఈ గ్రంథాన్ని చదవాలనిపించింది. చదివిన కొన్ని అంశాల్ని మీతో పంచుకోవాలనిపించింది. ఎవరైనా తాను సోషల్ మీడియాలో రాసినవి కూడా ఏదో ఉబుసుపోక రాయరనీ, రాసినవాటిని ఒకచోట ఇలా భద్రం చేసుకుంటే ఏ యే సమయాల్లో మనమెలా ప్రవర్తించామో, ఎలా మన ఆలోచనలు కొనసాగాయో తెలియడానికి పుస్తకరూపంలో వస్తే అవి భవిష్యత్తులో ఎంతో ఉపయోగం.  
 ఈ కాలానికి కావల్సిన మనిషి వేల్పూరి కామేశ్వరరావుగారు.
ఆయనకు నమస్కరిస్తున్నాను. 
-        ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, ప్రొఫెసర్, తెలుగు శాఖ, సెంట్రల్ యూనివర్సిటి, హైదరాబాదు. 4.4.2020

( ఈ వ్యాసాన్ని ‘రైలుశక్తి’ మే, 2020 ప్రత్యేక సంచిక ( సంపుటి.20, సంచిక.5.), పుట: 32-38) సంపాదకులకు నా ప్రత్యేక ధన్యవాదాలు)

20 ఫిబ్రవరి, 2020

అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం


 మాతృభాషలతోనే జాతి ఆత్మగౌరవం

మాతృభాషలతోనే జాతి ఆత్మగౌరవం నిండి ఉందని,  మాతృభాషను కాపాడుకోవడం వల్లనే ఆ జాతి సాంస్కృతిక వారసత్వం నిలబడుతుందన ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు వ్యాఖ్యానించారు. గురువారం ( 20.02.2020) సాయంత్రం మాదాపూర్ ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం అవగాహనా కార్యక్రమంలో సెంట్రల్ యూనివర్సిటీ స్టూడెంట్స్ వెల్ఫేర్ డిప్యూటీ డీన్ ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు
. ప్రపంచ వ్యాప్తంగా కొన్ని భాషలు అంతరించిపోయే ప్రమాదముందని యునెస్కో ప్రకటించిందని, దానివల్ల కొన్ని జాతుల చరిత్ర, సంస్కృతి అంతరించిపోయే ప్రమాదం ఉంటుందని  ఆయన వివరించారు. మాతృ భాషలను కాపాడుకోవడం కోసం ప్రాణాలర్పించిన బంగ్లాదేశ్ ప్రజలు త్యాగాల్ని, ఆ చరిత్రను సోదాహరణంగా వివరించారు. ఉపాధి అవకాశాల కోసం ఇంగ్లీష్, ఇతర భాషలను కూడా నేర్చుకోవాలని, కానీ మాతృ భాషను విస్మరించకూడదన్నారు.
భారతదేశంలో త్రిభాషా సూత్రాన్ని పాటించాలన్నారు. సభకు అధ్యక్షత వహించిన ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ మాట్లాడుతూ అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం ప్రాధాన్యాన్ని వివరించారు. అభివృద్ధి చెందిన దేశాల్లో శాస్త్ర, సాంకేతిక రంగాల్లోనే మాతృభాషను బోధిస్తున్నారని అన్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎం.బసవలింగం మాట్లాడుతూ మాతృభాషలను విస్మరించకుండా ఇతర భాషలను కూడా నేర్చుకోవాలని ఉద్బోధించారు.
సమావేశంలో ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు శివరామకృష్ణ, దిలీప్, తెలుగు అధ్యాపకుడు జి.కృష్ణయ్య, ఉపాధ్యాయులు శ్రీనివాసరావు, మధుసూదన్ రెడ్డి, మల్లికార్జున్, కృష్ణ, శ్రీమతి ఆర్.మంగ, కె.ఎం.లక్ష్మి తదితర అధ్యాపకులు, పెద్దసంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.



23 అక్టోబర్, 2019

'సాహిత్యానికి స్ఫూర్తినిచ్చిన సాహితీవేత్త శేషేంద్ర శర్మ

ఈనాడు సౌజన్యంతో

నమస్తే తెలంగాణ సౌజన్యంతో

సాక్షి సౌజన్యంతో
'

సమకాలీన తెలుగు ఆధునిక సాహిత్యానికి కొన్ని ప్రమాణాలను నిర్దేశించి, సాహిత్యానికి ఒక దిశానిర్దేశం చేసి స్ఫూర్తినిచ్చిన కవి, విమర్శకుడు, సాహిత్య తాత్త్విక వేత్త గుంటూరు శేషేంద్ర శర్మ అని సెంట్రల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఆచార్య అప్పారావు పొదిలె అన్నారు. స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్, తెలుగు శాఖ ఆధ్వర్యంలో 'గుంటూరు శేషేంద్ర శర్మ రచనలు-సమాలోచన' అనే అంశంపై ఒక రోజు జాతీయ సదస్సుకి ఆచార్య అప్పారావు అధ్యక్షత వహించి, మాట్లాడారు. సదస్సుని ప్రారంభించిన స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ డీన్ ఆచార్య ఎస్.శరత్ జ్యోత్స్నారాణి మాట్లాడుతూ నిన్న స్మారకోపన్యాసంలో  శేషేంద్ర శర్మ సాహిత్యంలోని  మౌలికాంశాలను తెలుసుకున్నామని, నేడు ఆయన జీవితం, రచనలన్నింటినీ నిష్ణాతులైన ఆచార్యులు  లోతుగా విశ్లేషిస్తారని, దానివల్ల పరిశోధకులకు, విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఆమె అన్నారు. సదస్సు సమన్వయకర్త ఆచార్య పిల్లలమర్రి రాములు సదస్సు లక్ష్యాన్ని వివరించగా, ఆచార్య స్వాగతం పలికారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న కేంద్ర సాహిత్య అకాడమీ కార్యదర్శి డా.శ్రీనివాసరావు మాట్లాడుతూ శేషేంద్ర శర్మ సాహిత్యం భారతీయ ఆత్మను ఆవిష్కరిస్తుందనీ, భారతీయ సంస్కృతి ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటుతుందని వ్యాఖ్యానించారు. పాశ్చాత్య సాహిత్యాన్ని అధ్యయనం చేసి, భారతీయ, పాశ్చాత్య సాహిత్య సమన్వయాన్ని తెలుగు సాహిత్యంలో చూపించారని పేర్కొన్నారు. 70, 80 దశాబ్దాల్లో తనదైన ముద్ర వేసిన శేషేంద్ర శర్మ సాహిత్యం తెలుగు సాహిత్యం విలువను మరింత పెంచిందన్నారు. కీలకీపన్యాసం చేసిన ప్రసిద్ధ సాహితీవేత్త ఆచార్య ఆర్వీయస్ సుందరం మాట్లాడుతూ తెలుగు సాహిత్యంలో కందుకూరి వీరేశలింగం, విశ్వనాథ సత్యనారాయణ లో తర్వాత నిజమైన బహుముఖ ప్రజ్ఞాశాలి అని అన్నారు. విశ్వవిద్యాలయంలో పనిచేసేవారికి సృజన, పరిశోధన శక్తి అనే మూడు పనులుండాలి. అలాంటి స్వభావం కలిగిన విశ్వవిద్యాలయేతర సాహితీవేత్త శేషేంద్ర శర్మ అని ఆయన అభివర్ణించారు.  శేషేంద్ర శర్మ గారు
ప్రాయోగికాత్మక విమర్శకులన్నారు.  
తర్వాత జరిగిన సమావేశంలో ఆచార్య తుమ్మల రామకృష్ణ, ఆచార్య గౌరీశంకర్, ఆచార్య పిల్లలమర్రి రాములు, ఆచార్య ఎండ్లూరి సుధాకర్ , ఆచార్య నీ.సుబ్బాచారి,  జి.అరుణకుమార్ , డా.తరపట్ల సత్యనారాయణ, డా.ఎన్.ఈశ్వరెడ్డి, పగిడిపల్లి వెంకటేశ్వర్లు,   ఆచార్య ఎం.గోనానాయక్ తదితరులు వివిధ  అంశాలపై పత్రాలను సమర్పించారు. సమాపనోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రొ.వైస్ ఛాన్సలర్ ఆచార్య బి.రాజశేఖర్ గుంటూరు శేషేంద్ర శర్మ సాహిత్య విశిష్టత ను వివరించారు. శేషేంద్ర శర్మ సతీమణి శ్రీమతి ఇందిరా ధనరాజ్ గిర్ విశిష్ట అతిథిగా పాల్గొన్నారు.  ఈ సదస్సులో సుమారు పన్నెండు మంది పత్రాలను సమర్పించారు. వీటిని పుస్తక రూపంలో తీసుకొస్తామని నిర్వాహకులు ప్రకటించారు.




మాట్లాడుతున్న వైస్ ఛాన్సలర్ ఆచార్య అప్పారావు పొదిలె

మాట్లాడుతున్న సెంట్రల్ సాహిత్య అకాడమీ కార్యదర్శి డా.కె.శ్రీనివాసరావు

జ్యోతి ప్రజ్వనం చేస్తున్న అతిథులు

సమాపనోత్సవానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన యూనివర్సిటి ఆఫ్ హైదరాబాదు ప్రొ.వైస్.ఛాన్సలర్ ఆచార్య బెల్లంకొండ రాజశేఖర్

మాట్లాడుతున్న  యూనివర్సిటి ఆఫ్ హైదరాబాదు ప్రొ.వైస్.ఛాన్సలర్ ఆచార్య బెల్లంకొండ రాజశేఖర్

07 సెప్టెంబర్, 2019

డా. అంబేద్కర్ జాతీయ పురస్కార గ్రహీత ఆచార్య ‘దార్ల’తో ఇంటర్వ్యూ (భూమిపుత్ర’ దినపత్రికలో 7 సెప్టెంబరు 2019)


డా. అంబేద్కర్ జాతీయ పురస్కార గ్రహీత
 ఆచార్య ‘దార్ల’తో ఇంటర్వ్యూ

శ్రీహరి మూర్తి (శ్రీహరి): భారతీయ దళిత సార్వత్రిక విశ్వవిద్యాలయం వారు ప్రదానం చేసిన ‘డా.అంబేద్కర్  జాతీయ పురస్కారం’ స్వీకరించిన సందర్భంగా మీకు నా శుభాకాంక్షలు. ఇంతకు ముందు అందుకున్న పురస్కారాల కన్నా దీన్ని అందుకోవడం పట్ల  ఏమైనా ప్రత్యేకత ఉన్నట్లు భావిస్తున్నారా?
ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు (దార్ల): మీ శుభాకాంక్షలను నా ధన్యవాదాలు. నిజానికి ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థల నుండి నేను కొన్ని పురస్కారాలను స్వీకరించినా, ఇది నా కుటుంబం అందిస్తున్న పురస్కారంగా భావిస్తున్నాను. నేనెంతో ఇష్టపడే గొప్పమేధామి డా.బి.ఆర్ . అంబేద్కర్ పేరు మీదుగా  ఈ పురస్కారం నాకు రావడం నా జాతికి చేస్తున్న సేవను గుర్తించడంగా అనుకుంటున్నాను. దళిత, గిరిజన, మైనారిటీ ముస్లిమ్, అణగారిన వర్గాల ప్రజల గురించి ఆలోచించేవీరిని గుర్తించేవాళ్ళుంటారని చెప్పడానికి నిదర్శనంగా భావిస్తున్నాను. నాతో పాటు మరో ఏడుగురు ఈ యేడాది ఈ జాతీయ పురస్కారాలను అందుకున్నారు. వారు కూడా వివిధ రంగాల్లో విశేషమైన కృషిని చేస్తున్న వారే కావడం నాకు మరింత సంతోషాన్నిచ్చింది.
శ్రీహరిమూర్తి:  ఈ పురస్కారాన్ని ప్రదానం చేసిన భారతీయ దళిత సార్వత్రిక విశ్వవిద్యాలయం, దాని లక్ష్యాల గురించి కొంచెం వివరిస్తారా?
దార్ల: భారతీయ సార్వత్రిక దళిత విశ్వవిద్యాలయాన్ని 1986లో స్థాపించారు. CARDS – Community and Rural Development Society గుంటూరు వారి ఆధ్వర్యంలో ఈ విశ్వవిద్యాలయం నడుస్తుంది. CARDS డైరెక్టర్ గా డా.ఎం. స్వర్ణలతా దేవి, విశ్వవిద్యాలయం వైస్ –ఛాన్సలర్ గా ఆచార్య గుజ్జర్లమూడి కృపాచారి, వివిధ రంగాల్లో ప్రఖ్యాతులైన వారు ఈ సంస్థ యాజమాన్య సభ్యులుగా ఉన్నారు. దేశ, విదేశాల్లో  దళితులు, గిరిజనులు, పీడితుల జీవన విధానాన్ని మెరుగుపర్చడం కోసం ఈ సంస్థ, ఈ విశ్వవిద్యాలయాలు కృషిచేస్తున్నాయి. దళితుల ఆత్మగౌరవాన్ని నిలబెట్టడం, ఆత్మవిశ్వాసాన్ని పెంచడం ఈ విశ్వవిద్యాలయం ప్రధాన లక్ష్యాల్లో ఒకటి.
శ్రీహరిమూర్తి:  భారతీయ దళిత సార్వత్రిక విశ్వవిద్యాలయం వారు డా.అంబేద్కర్ భావజాలం ప్రచారానికి ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు?
దార్ల: డా.బి.ఆర్. అంబేద్కర్ రచనలను, ప్రసంగాలను, ఆయన దార్శనికతను వ్యాప్తిచేయడం, ఆయన రచనలపై పరిశోధనలు చేయడం, ప్రచారం చేయడం, తద్వారా దళితుల ఆత్మగౌరవాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే ప్రయత్నం చేస్తుంది.  ఈ విశ్వవిద్యాలయం ఇతర సాధారణ విశ్వవిద్యాలయాల మాదిరిగా డిగ్రీలను ప్రదానం చేయదు. అనివార్యకారణాల వల్ల అర్థాంతరంగా చదువు ఆపేసిన దళితులు, గిరిజనులు,పీడిత వర్గాలకు చెందిన వీరిని గుర్తించి మరలా చదువుపట్ల ఆసక్తికి కలిగించి, ఆర్థికంగా కూడా సహాయం చేసి, వీరిని విద్యావంతులను చేస్తుంది. దీనికోసం విద్యావంతులైన దళితులను, స్వచ్ఛందంగా సేవచేసే వీరి సహకారాన్ని తీసుకుంటుంది. అటువంటి వీరిని గుర్తించి ప్రతి యేడాదీ జాతీయ, అంతర్జాతీయస్థాయిలో డా.అంబేద్కర్ పురస్కారాలను ప్రదానం చేస్తుంది.  
శ్రీహరిమూర్తి:  మీకు ఏ రంగంలో ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు?
దార్ల: నాకు ‘పరిశోధన-ప్రచురణ’ రంగాల్లో దళితులకు, దళిత సాహిత్యానికి చేస్తున్న కృషికి గాను ఈ పురస్కారాన్ని ఇచ్చారు.
శ్రీహరిమూర్తి: అయితే, మీరు దళితులకు, దళిత సాహిత్యానికి  చేస్తున్న కృషిని కొద్దిగా వివరిస్తారా?
దార్ల:  నాకు ఊహ తెలిసిన నాటి నుండే అంబేద్కర్ జయంతి, వర్థంతి కార్యక్రమాల్లో పాల్గొని, ప్రసంగించేవాణ్ణి. ఆ సందర్భంగా కొన్ని కవితలు రాసి, చదివి వినిపించేవాణ్ణి, తర్వాత కాలంలో కవితలతో పాటు దళితుల్ని ఆలోచింపజేసే వ్యాసాల్ని రాసేవాణ్ణి. నాకు సాధ్యమైనంత వరకు వివిధ  సమావేశాల్లో, సదస్సుల్లో దళితుల గురించి మాట్లాడ్డం, దళిత సాహిత్యానికి సంబంధించిన పరిశోధన పత్రాలను సమర్పించడం వంటి పనులు చేస్తున్నాను.  దీనితో పాటు కవిత్వాన్ని రాస్తున్నాను. దళిత చైతన్యాన్ని నింపే విశ్లేషణాత్మక వ్యాసాల్ని, పుస్తకాలుగా ప్రచురిస్తున్నాను. వాటిని పత్రికల్లోను, ఇంటర్నెట్ లోను అందరికీ అందుబాటులో ఉంచుతున్నాను.
శ్రీహరిమూర్తి: మీరు దేశంలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన యూనివర్సిటి ఆఫ్ హైదరాబాద్ లో ఫ్రొఫెసర్ గా పనిచేస్తున్నారు. మీ పరిధిలో దళిత చైతన్యాన్నెలా పెంపొందిస్తునారు?
దార్ల:  నేను వృత్తి రీత్యా ఒక విశ్వవిద్యాలయంలో అధ్యాపకుడిగా పనిచేస్తుండడం వల్ల, నా దగ్గర పరిశోధన చేయడానికి వివిధ భావజాలాలున్న పరిశోధకులు వస్తుంటారు. వారి అభిరుచుల మేరకే పరిశోధనలు చేయిస్తున్నా, సమకాలీన సాహిత్యానికి సంబంధించిన దళిత సాహిత్యంపై అనేకమంది ఆసక్తితో పరిశోధనలు చేస్తున్నారు.  దళితులపై ఆసక్తితో, నిజాయితీగా పరిశోధన చేసేవాళ్ళకు మాత్రమే దళిత సాహిత్యంపై పరిశోధన చేయిస్తున్నాను. మరో విశేషమేమిటంటే, విశ్వవిద్యాలయంలో ఎం.ఏ.స్థాయిలోనే ఒక ఐచ్చికాంశం (Optional Course)గా చదువుకునేలా ‘దళిత సాహిత్యా’న్ని 2005 నుండీ  ఒక కోర్సుగా కూడా ప్రవేశపెట్టాను. దాని తర్వాత దళిత, గిరిజన సాహిత్యాలపై అనేకమంది విస్తృతంగా పరిశోధనలు చేయడానికి ముందుకొస్తున్నారు. 
శ్రీహరిమూర్తి:  దళితులు, గిరిజనులను  చైతన్య పరచడానికి ఎలాంటి ప్రణాళిక ఉండాలని మీరు భావిస్తున్నారు?
దార్ల:  దళితునిగా ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఒక మాదిగ కులంలో జన్మించిన నాకు- ఆ జీవితమెలా ఉంటుందో ప్రత్యక్షంగా తెలుసు. సమాజంలో దళితులనుభవిస్తున్న అవమానాలు తెలుసు. ఈ అవమానాలకు కారణాల్ని అన్వేషించి, వాటి నిజానిజాల్ని ప్రజలకు తెలియజెప్పినప్పుడు మాత్రమే దళితుల్లో ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవం కలుగుతాయని నేను పరిపూర్ణంగా నమ్ముతాను. అందువల్ల దళితుల జీవితాల్లో ప్రగతిశీలమైన మార్పు రావాలంటే ముందుగా దళితులకు, తర్వాత ఇతరులకు ఆ వాస్తవాలు తెలియాలి. అవి వివిధ కార్యక్రమాలు, ప్రసంగాలు, రచనల ద్వారా సాధ్యమవుతుందనుకుంటున్నాను.
శ్రీహరిమూర్తి:  దీనికెలాంటి కార్యక్రమాలు అవసరమనుకుంటున్నారు?
దార్ల:   ముందుగా మనం పుట్టి పెరిగిన గ్రామం నుండే దళితుల్ని చైతన్యపరిచే కార్యక్రమాలు ప్రారంభం కావాలి. దళితుల కోసమే తన జీవితాన్ని త్యాగం చేసిన వీరి జీవితాలు ముందుగా వీరికి తెలియాలి. దళితులు, గిరిజనులు  డా.బి.ఆర్.అంబేద్కర్, బాబూ జగజ్జీవన్ రామ్ , కొమరం భీమ్ మొదలైన వారి జయంతులు, వర్ధంతులు  చేయడం ద్వారా దళితులు, గిరిజనులను ఒకచోటకు చేర్చగలుగుతాం. అందువల్ల గ్రామ/గూడెం స్థాయి నుండే దళితుల కోసం కృషిచేసిన నాయకుల విగ్రహాలను ఏర్పాటు చేసుకొని, ఆ మహాత్ముల జయంతి, వర్ధంతులను జరుపుతూ, ఆ సందర్భంగా దళితులు, గిరిజనులు ముందు కలిసేలా చేయగలగాలి. తమకొక సాంస్కృతిక వారసత్వం ఉందనే విషయాన్ని తెలియజేయాలి. వీరి ఆచార వ్యవహారాల్లోని ఔచిత్యాన్ని, వాస్తవికతను, ఆచరణను, వాటి వెనుకున్న కార్యకారణాల్ని వివరించగలగాలి. అప్పుడు మాత్రమే తమ నాయకుల పట్ల గౌరవం ఏర్పడుతుంది. తమకున్న సంస్కృతిపట్ల సదభిప్రాయం ఏర్పడుతుంది. అవి తెలియజేయగలిగినప్పుడు మాత్రమే వీరిలో ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవం పెరుగుతాయి. తమ మూలాలు గట్టివని నమ్మినప్పుడే వాటి గురించి వీరు ఆలోచిస్తారు. వాటి గురించి ప్రచారం చేస్తారు. అవీవీరిని ఏకం చేస్తాయి. అవే వవీరిని సమైక్యపరుస్తాయి. అవే వీరిని బలవంతులుగా మారుస్తాయి. అవే వీరిని ప్రధాన జీవనస్రవంతిలోకి తీసుకొస్తాయి. అవే తమ లక్ష్యాలను సాధించేలా చేస్తాయి.
శ్రీహరిమూర్తి:  సాధారణంగా దళితులు, గిరిజనులు భౌతికవాద దృక్పథాన్ని కలిగి ఉంటారు కదా, మరి వీరు విగ్రహాల్ని నిర్మించడాన్ని ఎలా అవగాహన చేసుకోవాలి?
దార్ల:   నిజమే నండీ.. మంచి ప్రశ్న. అయితే, దళిత, గిరిజనుల్లో విద్యావంతులైన వారు అత్యధిక శాతం భౌతిక వాదులై ఉంటారు. కాబట్టి, వీరు విగ్రహారాధనను వ్యతిరేకిస్తారు. కానీ, చారిత్రక వ్యక్తుల విగ్రహనిర్మాణాలను వ్యతిరేకించరు. తమ చారిత్రక విశేషాల్ని భద్రపరుచుకునే ఒక అంశంగానే భావిస్తారు.  అంతేకాదు, విగ్రహాల్ని ఏర్పాటు చేసుకున్నా, వాటిని పూజించమని చెప్పరు. తమ సాంస్కృతిక వారసత్వానికి ఒక రూపాన్నిచ్చి, ఆ వారసత్వాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తారు. విగ్రహారాధనకు, తమ నాయకుల విగ్రహాలను నిర్మించుకోవడానికి మధ్య ఈ భేదాన్ని గుర్తించాలి.
శ్రీహరిమూర్తి:  దళితులు, గిరిజనుల చరిత్రలు, వారి వారసత్వం, సంస్కృతి మొదలైన వాటి విషయంలో ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నారు?
దార్ల:   పురాణేతిహాసాల్లో దళితులు, గిరిజనుల పట్ల గల కథలను శాస్త్రీయమైన, చారిత్రక దృష్టితో అధ్యయనం చేస్తూ పునర్మూల్యాంకనం చేసుకోవాల్సిన అవసరముంది. ఒకానొక చారిత్రక పరిస్థితుల్లో విజేతలై వారు తమగురించి గొప్పగా రాసుకున్నారు కొంతమంది చరిత్రకారుల అభిప్రాయం. అటువంటప్పుడు ఆధిపత్య కులాలు లేదా వర్గాలు మిగతావాళ్ళను తక్కువగా, అవమానకరంగా, క్రూరంగా వర్ణించి, వాటినే ప్రచారం చేస్తారు. వాటిని మేధావులు జాగ్రత్తగా పరిశీలించి, పునర్ వ్యాఖ్యానం చేసి చెప్పాలి. లేకపోతే దళితేతరులు లేదా ఆధిపత్య, అగ్రవర్ణ స్వభావంతో రాసిన చరిత్రలు, సాంస్కృతిక వారసత్వాలనే  దళిత, గిరిజనులు తమ వారసత్వాలుగా భ్రమపడి, తమకు సరైన చరిత్ర, సంస్కృతీ లేవనుకుంటారు. అందుకనే, రామాయణ, భారత, భాగవత, ప్రబంధాల్లో గల సంస్కృతిని పునర్వ్యాఖ్యానం చేయవలసిన అవసరం ఉంది. రామాయణంలో వాలి-సుగ్రీవుల కథ, జాంబవుడు మొదలైన కథలను లోతుగా పరిశీలించాలి. ఈ కథలు నాడు గిరిజనులు, దళితులని పిలవబడకపోయినా, ఆ జాతుల బలాన్నీ, తెలివినీ తెలియజేసే పాత్రలు. ఆ చారిత్రక పరిస్థితుల్ని అధ్యయనం చేసి, వాస్తవిక దృష్టితో  పునర్వ్యాఖ్యానించగలగాలి.
శ్రీహరిమూర్తి:  నేటి వరకూ అలాంటి ఆలోచనలతో తమ చరిత్ర, సంస్కృతులను పునర్వ్యాఖ్యానించిన వారు దళిత, గిరిజనుల్లో ఉన్న ప్రముఖుల్ని చెప్పండి?
దార్ల:   డా.బి.ఆర్.అంబేద్కర్ తన వాదనలకు వేదాలు, పురాణేతిహాసాల్ని, భారతీయ సాహిత్యాన్నే ప్రధాన ఆయుధంగా వాడుకున్నారు. డా.బి.ఆర్.అంబేద్కర్ రచనలన్నీ ప్రతి దళిత, గిరిజనుల ఇళ్ళల్లో మాత్రమే కాదు, ప్రతి మహిళా కూడా కొని తమ గ్రంథాలయాల్లో పెట్టుకొని చదవాలి. హిందువులకు వేదాలెంత పవిత్రమైనవో, దళిత, గిరిజనులకు ఈ రచనలు అంత విలువైనవిగా భావించాలి. జ్యోతి రావుబా పూలే రచనలు కూడా గొప్ప చైతన్యాన్ని కలిగిస్తాయి. ఇంకా చాలామంది ఈ దిశగా కృషిచేసినవారున్నా, నేటి అవసరాల రీత్యా చదువుకున్న ప్రతి దళితుడూ ఈ దిశగా తమ వంతు కృషి చేయాలి.
శ్రీహరిమూర్తి:  ఈ దృష్టితో మీరు రాసిన ముఖ్యమైన గ్రంథాల్ని చెప్తారా?
దార్ల:   నేను కేవలం రచనలన్నింటినీ ఇదే దృష్టితో రాసానని చెప్పలేను; కానీ, నేను రాసిన రచనలు అత్యధిక శాతం పునర్మూల్యాంకన దృక్పథంతోనే రాశాను. వీచిక, పునర్మూల్యాంకనం, దళితసాహిత్యం-మాదిగదృక్పథం, బహుజన సాహిత్య దృక్పథం, ఒక మాదిగ స్మృతి –నాగప్పగారిసుందర్ రాజు పరిచయం, దళితతాత్త్వికుడు, నెమలికన్నులు(కవిత్వం) మొదలైనవన్నింటిలోను ఈ దృక్పథం కనిపిస్తుంది.
శ్రీహరిమూర్తి: ఇలాంటి దృక్పథంతో పుస్తకాలు, వ్యాసాలు రాసిన మీకు డా.అంబేద్కర్ జాతీయ పురస్కారమే కాకుండా మీకు వచ్చిన మిగతా పురస్కారాల గురించి వివరిస్తారా?
దార్ల: మనం రాసే వాటిలో శాస్త్రీయదృక్పథం ఉన్నప్పుడు, సమస్యను  వివరించడంలో మన ‘టోన్’ ని బట్టి కూడా ఇతరులు కూడా స్వీకరించి, దాన్ని అంగీకరిస్తారు. కేవలం ఒకటి, రెండు రచనల్ని చదివినంత మాత్రం చేత ఒక స్థిరమైన లేదా సదభిప్రాయానికి రావడం అంత సులభం కాదు. నా రచనల్ని, నా పరిశోధన పత్రాల్ని చదివి, విని కూడా నన్ను దళిత,గిరిజన, బహుజనులే కాకుండా, ఇతర వర్గాలు, కులాల వాళ్ళు  కూడా సహృదయంతో నా వాదనల్ని విన్నారు; నా వాదనల్ని చర్చించారు.అందుకనే వివిధ దళిత, గరిజనేతర సంస్థలు కూడా నాకు వివిధ పురస్కారాలను ఇచ్చి, సన్మానించారు.  అలా అంగీకరించడం వల్లనో, నా కృషిని గుర్తించడం వల్లనో నాకు పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారు తెలుగు సాహిత్య విమర్శ రంగంలో ‘కీర్తి’ పురస్కారాన్ని ( 2012 ), సాహిత్య రంగంలో కృషిచేసే వారికిచ్చే ఉత్తమ సాహిత్య విమర్శకుడు పురస్కారం (2012) తో మానస ఆర్ట్ థియేటర్స్, హైదరాబాదు వారు త్యాగరాయ గానసభ, (2012)లో సత్కరించారు. 2016లో బహుజన సాహిత్య వేదిక, ఆంధ్రప్రదేశ్ వారు రాష్ట్రస్థాయిలో మల్లవరపు జాన్ కవి స్మారక పరిశోధక పురస్కారంతో సన్మానించారు. విహంగ అంతర్జాల పత్రిక పురస్కారాన్ని(2017) ఇచ్చి సత్కరించారు. వీటన్నింటికంటే ముందు దళితసాహిత్యంపై చేసిన సేవకు గుర్తింపుగా భారతీయ దళిత సాహిత్య అకాడమీ (న్యూఢిల్లీ) వారి డా.బి.ఆర్. అంబేద్కర్ ఫెలోషిప్ పురస్కారం(2007)తో సత్కరించారు. 2016లో బహుజన సాహిత్య వేదిక, ఆంధ్రప్రదేశ్ వారు రాష్ట్రస్థాయిలో మల్లవరపు జాన్ కవి స్మారక పరిశోధక పురస్కారంతో సన్మానించారు. ఇటీవలే (2019, అక్టోబరులో) ప్రముఖ బహుజన తాత్త్వికుడు బి.యస్.రాములు ప్రతిభా పురస్కారాన్నిచ్చి సత్కరించారు.
శ్రీహరిమూర్తి: మీరు పనిచేసే సెంట్రల్ యూనివర్సిటి నుండి మీరు అందుకున్న అవార్డులు, రివార్డులు గురించి కూడా చెప్పండి?
దార్ల: నేను హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటిలో ఎం.ఏ. తెలుగు చదువుకోవడానికి అడుగుపెట్టాను. ఎం.ఏ., అత్యధిక మార్కులు రావడం వల్ల మెరిట్ స్కాలర్ షిఫ్ కి ఎంపికయ్యాను. తర్వాత యూజిసి వారి జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్, సీనియర్ రీసెర్చ్ ఫెలో షిఫ్ పొందుతూ  ఇదే యూనివర్సిటిలో ఎం.ఫిల్., పిహెచ్.డి. పూర్తిచేశాను.  ఇంకా డాక్టరేట్ పూర్తి కాకుండానే రెండు ఉద్యోగాలు వచ్చాయి. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో లెక్చరర్ గా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ నిర్వహించిన పోటీపరీక్షల్లో ఉత్తీర్ణుడనై, ఇంటర్వ్యూలో విజయం సాధించి, ఎంపికైయ్యాను. అదే సంవత్సరం రోజుల తేడాలో ఎయిడెడ్ కళాశాలలో యూజిసి స్కేలుతో డిగ్రీలెక్చరర్ గా సెలక్ట్ అయ్యాను. మూడేళ్లు పనిచేసిన తర్వాత యూనివర్సిటిలో లెక్చరర్స్ నోటిఫికేషన్ పడింది. దరఖాస్తు చేసి, ఆ ఉద్యోగం పొందాను. ఎంతో నిజాయితీగా నాకు ఆ ఉద్యోగం వచ్చింది. నాకు పాఠం చెప్పిన గురువుల దగ్గరే నేను కూడా ఒక కొలీగ్ గా పనిచేయడం నేను మా యూనివర్సిటీలో పొందిన అతి గొప్ప అవార్డుగా, రివార్డుగా భావిస్తాను. ప్రస్తుతం ప్రొఫెసర్ గా ఉన్నాను. దీనితో పాటు అదనంగా డిప్యూటి డీన్, స్టూడెంట్స్ వెల్ఫేర్ గా పనిచేస్తున్నాను. బోధన, పరిశోధన రంగాల్లో చేసిన సేవను గుర్తిస్తూ యూనివర్సిటీ ఇచ్చే అత్యున్నత పురస్కారం ‘ఛాన్సలర్స్ అవార్డు’ పొందగలిగాను. దీన్ని 45 సంవత్సరాల లోపులో ఉన్న అధ్యాపకుల పనితీరుని గమనించి,  యూనివర్సిటి స్నాతకోత్సవంలో ఒక లక్షరూపాయల పరిశోధన స్పెషల్ గ్రాంటుతో సత్కరిస్తారు.
శ్రీహరిమూర్తి: దేశంలో అత్యున్నత స్థాయి విశ్వవిద్యాలయాల్లో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటి ఒకటి కదా! దీనిలో చదువుకోవాలనే ఆలోచన ఎలా వచ్చింది? మీ కుటుంబ నేపథ్యం ఏమిటి?
దార్ల: నిజమే, ఇటీవలే ప్రపంచంలో అత్యున్నత ఉన్నత విద్యాసంస్థల్లో ఒకటిగా గుర్తింపు పొందిన సెంట్రల్ యూనివర్సిటీ మాది. నేను డిగ్రీలో చదువుకొనేటప్పుడు దీని గొప్పతనం గురించి నాకు తెలియదు. నాకు చిన్నప్పటి నుండే ప్రతి రోజూ ఇంటి దగ్గరైనా, స్కూలులోనైనా, కళాశాలలోనైనా గ్రంథాలయానికి వెళ్లడం అలవాటు. రోజూ ఏదొకటి చదవకపోతే నాకేమీ తోచదు. మాది మేజర్ గ్రామపంచాయితీ. మా పేటకీ, గ్రామ పంచాయితీకీ కనీసం రెండు కిలోమీటర్ల దూరం ఉంటుంది. అయినా, రోజూ సాయంత్రమో, ఖాళీ దొరికినప్పుడో అక్కడికి వెళ్ళేవాడిని. అక్కడ పత్రికలు చదివేవాణ్ణి. అప్పటి నుండి పత్రికలు చదివే అలవాటువల్ల కళాశాలలో డిగ్రీఫైనల్ ఇయిర్ చదివేటప్పుడు కూడా పత్రికలో యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాదు ప్రవేశప్రకటన చూశాను. దానిలో తెలుగు ఎం.ఏ., ఎంట్రన్స్ ద్వారా ప్రవేశాలుంటాయని చదివి, దరఖాస్తు చేశాను. ఎం.ఏ., లో చేరడినికి నెనెన్ని రోజులు కూలిపని చేసి కష్టపడ్డానో గుర్తుకొస్తే కన్నీళ్ళొస్తున్నాయి. ఒక నూట ఇరవై ఐదురూపాయల సూటుకేసు కొనుక్కొని, రెండు జతల బట్టలతో, రబ్బరు చెప్పులతో, జనరల్ బోగీలో టికెట్ కొనుక్కొని హైదరాబాదు వచ్చాను. కేవలం అడ్మిషన్ కి మాత్రమే నా దగ్గరున్న డబ్బులు సరిపోయాయి. హాస్టలు ఉచితంగా ఇస్తారనుకున్నాను. దానికి డిపాజిట్ చేయాలనీ, స్కాలర్ షిఫ్పుగా ఇచ్చే కొద్ది డబ్బులకీ, మరికొంత జమ చేస్తే గాని నెలనెలా మెస్ బిల్లు చెల్లించాలని కూడా తెలియదు. ఆ స్థితిలో నాకు యూనివర్సిటిలో చదువుకుంటున్న రాయలసీమకు చెందిన వీరాస్వామి అనే విద్యార్థి హాస్టలు ఫీజు కట్టాడు. దాన్ని మరలా కట్టడానికి నేను ఎన్నాళ్ళో కష్టపడాల్సివచ్చింది. అది అప్పటి మా ఆర్థిక పరిస్థితి.
                నిజానికి, మాది చాలా నిరుపేద కుటుంబం.  మేము నలుగురు అన్నదమ్ములు, ఒక చెల్లి. మా తల్లి దండ్రులు ప్రతిరోజూ కూలిపనికి వెళితే గాని మా కుటుంబం గడిచేది కాదు. మా తల్లిదండ్రులు నిరక్షరాస్యులైనప్పటికీ, మిమ్మల్ని తమ కష్టంతో చదివించేవారు. సెలవులు వచ్చినప్పుడల్లా మేము కూడా కూలిపనికి వెళ్ళేవాళ్ళం. నేను కూడా డిగ్రీవరకూ మా గ్రామంలోను, పరిసరగ్రామాల్లోను కూలిపనిచేశాను. మాకున్న ఒకటో రెండో గేదెల్ని మేపుకొచ్చేవాణ్ణి. మాకు తాతల నాటి ఆస్తులేమీ లేవు. నిరంతరం కష్టపడే మా నాన్న మా కోసం అనేక పనులు చేసేవాడు. కేవలం కూలిపనిమాత్రమే కాదు, చెట్లు ఎక్కి కొబ్బరి కాయలు తీసేవాడు. తాటికల్లు గీసేవాడు. చేపలు పట్టేవాడు. ఇతరుల పొలాల్ని శిస్తుకి తీసుకొని పంటపండించేవాడు. మేము కూడా ఆ పనులన్నింటిలోనూ భాగస్వాములయ్యేవాళ్ళం. మాకు గ్రామం కూడా ఎంతో సహకరించేది.
శ్రీహరిమూర్తి: ఇంత పేదరికంలో ఉండి కూడా డాక్టరేట్ పూర్తి చేయడానికి మీకెలా సాధ్యమైంది?
దార్ల: మేము ఆర్థికంగా పేదవాళ్ళం కావచ్చు; మేము అస్ఫృశ్యకులంలో పుట్టొచ్చు. కానీ ఉన్నతస్థితికి చేరాలనే ఆలోచనలో పేదవాళ్లం కాదు. పేదరికానికి అనేక కారణాలున్నా, తల్లిదండ్రులు ఆలోచనలు, వారి క్రమశిక్షణ, పొదుపు పిల్లల్లో కూడా కలిగేలా ప్రేరణనివ్వాలి. అలా మా తల్లిదండ్రులు మిమ్మల్ని పెంచారు. వాళ్ళ కష్టాల్ని దగ్గరుండి చూసేలా చేసి, ఈ కష్టాల్ని అధిగమించాలంటే నిరంతరం కష్టపడాలని, చెడువ్యసనాలకు దూరంగా ఉండాలని ప్రబోధించేవారు. మనం పుట్టిందే కులంలో నైనా అన్ని కులాల వారి ప్రేమా పొందేలా జీవించడమెలాగో నేర్పించారు. ప్రతి పైసా జాగ్రత్తగా అవసరాలకు ఉపయోగించుకోవడమెలాగో నేర్పించారు. అందువల్ల గ్రామంలో పెద్దలు,  పాఠశాల్లో చదువుకొనేటప్పుడు మాస్టార్లు మాకు కొన్ని అవకాశాల్ని వివరించేవారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను సద్వినియోగం చేసుకోవాలనేవారు. ప్రభుత్వం ఉచితంగా విద్యను అందించడమే కాకుండా, స్కాలర్ షిఫ్ లను కూడా అందించడమనేది డా.బి.ఆర్.అంబేద్కర్, మరికొంతమంది పోరాటాల ఫలితం. వాటిని సద్వినియోగం చేసుకుంటూ నేనీ స్థితికొచ్చాను. 
శ్రీహరిమూర్తి: పేదరికాన్ని అలా జయించిన మీరు, కులం వల్ల వచ్చే అవమానాల్ని ఏమైనా ఎదుర్కొన్నారా? ఎదుర్కుంటే,  ఏ వయసు నుండి వాటిని గుర్తించగలిగారు?
దార్ల: నిజానికి నాకు కులం వల్ల ఎదురయ్యే అవమానాలు చిన్నవయసులో తెలియలేదు. అలాగని కులం వల్ల అవమానాలు లేవని కాదు. మిమ్మల్ని దూరంగా పెడుతున్నా, నాకు అది తెలియనితనం వల్ల అది అవమానంగా నాకు అనిపించేది కాదు.  మా కులం కాని వాళ్ళ పెళ్ళిళ్లు జరిగినప్పుడు మిమ్మల్ని కూడా భోజనాలకు పిలిచి,  మాకు దూరంగా కూర్చోబెట్టి పెట్టేవారు. అది నాకు మా కులస్థులందరికీ మామూలే అన్నట్లుండేది. ఆ రోజుల్లో అన్నం దొరకడమే చాలనుకునే పరిస్థితి ఒక కారణం కావచ్చు. అందువల్ల మాకు ఎక్కడ పెడుతున్నారనేది ఆ వయసులో గమనించలేకపోయేవాణ్ణి. పాఠశాలకు వెళ్ళి చదువుకునే క్రమంలో నా కులస్థుల సహవాసం వల్ల, వాళ్ళు చెప్పే మాటల వల్ల నాకు అంటరానితనం అంటే ఏమిటో తెలియడం మొదలైంది. పాఠశాలల్లో నిర్వహించే డా.బి.ఆర్.అంబేద్కర్ జయంతులు, వర్థంతుల సందర్భంగా చదువుకున్న మా పెద్దవాళ్లు వచ్చి మాట్లాడే మాటల వల్ల ఆత్మగౌరవం అంటే ఏమిటో అవగతం కావడం ప్రారంభమైంది. అలా దూరంగా, అందరిలో కలవనివ్వకుండా భోజనమెందుకు పెడుతున్నారో తెలియడం ప్రారంభమైంది.  క్రమేపీ అలా పెట్టే వాటిని తినకూడదని తెలిసింది. ఆ మాత్రం భోజనాన్ని కూలి పనిచేసుకొనైనా సంపాదించుకోవచ్చనే ఆలోచన వచ్చింది. అంబేద్కరిజమే నాలో కొత్త ఆలోచనల్ని, ఆత్మగౌరవాన్ని  ఇచ్చింది.
శ్రీహరిమూర్తి: అనేక విషయాలు చెప్పారు. ధన్యవాదాలు చివరిగా మా జాగృతి, భూమిపుత్ర పత్రకల పట్ల మీ అభిప్రాయం?
నిజానికి ఇంత పోటీ ప్రపంచంలో చిన్నపత్రికల్ని నడపడం సాహసంతో కూడిన పని. మీరు ప్రచురిస్తున్న రాయలసీమ జాగృతి మాసపత్రిక చూస్తున్నాను. దానిలో మీరు ప్రకృతి సమతుల్యత కోసం అత్యధికంగా దృష్టిపెడుతున్నారు. అలాగే, రాయలసీమ చరిత్ర, సంస్కృతి, రాజకీయ, సాహిత్య విషయాలపట్ల లోతైన వ్యాసాల్ని ప్రచురిస్తున్నారు. ఇవి మిగతా పత్రికలకంటే భిన్నంగా ఉండి పత్రిక ప్రత్యేకతను నిలుపుతున్నాయి. కేవలం రాయలసీమకే పరిమితం కాకుండా, మిగతా ప్రాంతాలు, మిగతా విషయాల పట్ల ప్రాధాన్యాన్ని బట్టి ప్రచురించడం మీ జాతి సమైక్యతకు నిదర్శనం. అలాగే, భూమిపుత్ర పత్రిక ప్రతిదినం చదువుతున్నాను. తాజా రాజకీయ వార్తలు, విశ్లేషణలతో పాటు, పాత్రికేయ విలువల్ని పాటించడం నాకు ఎంతగానో నచ్చింది. అందుకే మీ పత్రికలో నేను కూడా ఏదైనా ఒక మంచి శీర్షికను నిర్వహిస్తూ రెగ్యులర్ గా రాయాలనే ఆలోచనకూడా ఉంది. నన్ను మీరు ఇంటర్వ్యూ చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను.

(అనంతపురం నుండి వెలువడుతున్న ‘భూమిపుత్ర’ దినపత్రికలో 7 సెప్టెంబరు 2019 వతేదీన ఒకపూర్తి పేజీని నా ఇంటర్వ్యూ ప్రచురించింది. ఆ పత్రిక సౌజన్యంతో ఇక్కడ దాన్ని పునర్ముద్రిస్తున్నాను. ... ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు)