"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. మీ డిసర్టేషన్ కోసం అంశాన్ని త్వరగా ఎంపిక చేసుకోవాలి

01 July, 2008

మనసున మనసై నవల - విశ్లేషణ


“మనసున మనసై” నవల: మధ్యతరగతి ఉద్యోగిని మానసిక సంఘర్షణ

-డా.దార్ల వెంకటేశ్వరరావు

1.0 ప్రస్తావన

అమ్మాయిలకు ఉన్నతవిద్య అవసరమా? ఏ వయసులో పెళ్ళిజరిగితే బాగుంటుంది? ఆర్థిక స్వాతంత్ర్యం స్త్రీలకెంత వరకూ ప్రయోజనకరం? ఆశయాలకూ, ఆచరణకూ పొంతన కనిపిస్తుందా? జీవితంలో సర్దుబాటు తప్పదా? అయితే, అది ఎలాంటి సర్దుబాటైతే బాగుంటుంది? సర్దుబాటు స్త్రీ, పురుషుల్లో ఇద్దరికీ ఉండాలా? లేక ఒక్కరికే ఉండాలా? మొదలైన ప్రశ్నలు – వాటికి సమాధానాలు డి. కామేశ్వరి గారు రాసిన ‘ మనసున మనసై ‘ నవలలో చాలా వరకు కనిపిస్తాయి. ఆ సమస్యలను నవల లోతుగా చర్చిస్తుంది.
‘వార్త’ దినపత్రిక ధారావాహికంగా ప్రచురించిన ‘మనసున మనసై ‘నవల పుస్తకరూపంలో వచ్చింది. “ఇది వరకటి తరాల స్త్రీలయితే తమ అదృష్టం యింతేనని సరిపెట్టుకుని భర్త తిడితే బాధపడి, భర్త ఆదరించిన నాడు పొంగిపోయి కష్టమైనా, ఇష్టమైనా అదే జీవితం అనుకొని బతికేది. ఇప్పటి యువతరానికి ఆర్థిక స్వాతంత్ర్యం వచ్చాక, స్వాభిమానం, ఆత్మాభిమానం, ఆభిజాత్యం ఎక్కువపాలై, మేమెందుకు సర్దుకొని బతకాలి అన్న ధోరణి తలెత్తాక దాంపత్యంలో సర్దుబాటు ధోరణి తగ్గిపోయి కాపురంలో మనస్పర్ధలు తలెత్తసాగాయి. జీవితం అంటేనే సర్దుబాటు, మేరేజీ యీజ్ నధింగ్ బట్ ఎడ్జస్ట్ మెంట్” అని గుర్తించమంటూ రచయిత్రి రాసుకున్న “ముందుమాట”లో అన్నారు.
“ఒక నెగిటివ్ క్యారెక్టర్ ద్వారా, పాజిటివ్ థింకింగ్ కి బాటవేశారు రచయిత్రి. ఆధునిక యువతి ఎలా ఆలోచించకూడదో, ప్రతీదీ వ్యతిరేక దృక్పథంలో ఎలా చూడకూడదో చెప్పారు. మనిషి ఎలా బ్రతకాలో, ఎంత ఆదర్శవంతంగా జీవించాలో చాలామంది చెబుతుంటారు. కానీ, ఎలా ప్రవర్తించకూడదో పాఠకులను పూర్తిగా కన్విన్స్ చెయ్యగల బహుకొద్ది మంది రచయితలో ఈమె ఒకరు. విద్య, ఉద్యోగం, ఆర్థిక స్వాతంత్ర్యం ఆధునిక స్త్రీని బాధ్యతాయుతమైన వ్యక్తిగా తీర్చిదిద్దాలే గాని , తలబిరుసుతనానికి తావివ్వకూడదు” అని వ్యాఖ్యానించారు ఈ నవలకి అభిప్రాయం రాసిన మాలతీచందూర్.
“ఆలోచింప చేసే అలజడి చిత్రణ” పేరుతో ఈ నవలకి అభిప్రాయం రాసిన కేతు విశ్వనాథరెడ్డి గారు “స్త్రీ పురుష సంబంధాల మధ్య వస్తున్న వాంఛనీయ, అవాంఛనీయ సనాతన, ఆధునిక, శుభ, అశుభ పరిణామాలని అంతోయింతో పట్టించుకొన్న” రచనగా పేర్కొని “సమష్ఠి కుంటుంబాలు విచ్ఛిన్నమవుతున్నాయి, …తరాల మధ్య అంతరం పెరిగింది. ఆర్థిక స్థితిగతులు సమతుల్యాన్ని కోల్పోతున్నాయి. పెళ్ళికాని, అయిన ఉద్యోగినులు రకరకాల సమస్యలను ఎదుర్కొంటున్నారు – అమ్మానాన్నలు, అత్తామామలు, బంధువులు, స్నేహితులు, సాంస్కృతిక వారసత్వం, అధికారం ప్రత్యక్షంగానో, పరోక్షంగానో మహిళల జీవితం మీద ప్రభావం చూపుతుంది మతం, కట్నం, అందచందాలు, హోదాలు, వినియోగదారీ సంస్కృతీ, వ్యక్తిత్వాలను తారుమారు చేస్తున్నాయి. మానవసంబంధాల మధ్య అసహనం, అలజడి, ఆందోళన పెరిగిపోయాయి. పెంపకం, పెళ్ళి, ప్రేమ, దాపత్యం, సర్వస్వం ‘నిర్వహణశాస్త్ర’ పరిధిలోకి వచ్చేశాయి. ‘మనసున మనసై ‘నవల నిర్వహణ శాస్త్ర దృష్టినుంచి పరిశీలించ దగ్గ నవల” అని వ్యాఖ్యానించారు. అయితే, వీరి అభిప్రాయంలో ఒక చర్చనీయాంశాన్ని కూడా పెట్టారు అది “జీవితంలో అపజయాలు వ్యక్తిత్వాన్ని నిర్ణయించవు . ఏ శక్తులతో పోరాడాలో తెలిసి పోరాడగలగాలి. లేదా గాలివాటుగాకాక, నచ్చిన సామాజిక జీవితంలో సేవలో శాంతిని వెతుక్కోవాలి జయంతిలాగ. ఇదీ యాదృచ్చికమేనా?” అని నవల ముగింపుని చర్చనీయాంశం చేసే చక్కని వ్యాఖ్యను కేతువిశ్వనాథరెడ్డి గారు పాఠకుల ముందుంచారు.
ఇది నవలా రచయిత్రి తన రచనను ముంగించడంలోగల ఆంతర్యాన్ని తడిమి చూడగలిగిన వ్యాఖ్య. ఇదంతా చర్చించుకునే ముందు నవల కథా సారాంశాన్ని తెలుసుకుంటే బాగుంటుంది.

1.2 నవలా సారాంశం

పద్మావతి – వెంకటేశ్వరరావులకు వాసంతి, జయంతి, దమయంతి అనే ముగ్గురు కూతుళ్ళు, ఒక కొడుకు ఉన్నారు. అప్పటికే తల్లిదండ్రులు వాసంతికి పెళ్ళి చేసి, జయంతికి పెళ్ళిచేయాలనే ఆత్రుతతో ఉన్నారు. గోపాలకృష్ణ అనే బ్యాంకు ఉద్యోగిని చూస్తారు. అతను జయంతిని చూడ్డానికి వస్తాడు. నల్లగా, బట్టతలతో ఉన్న అతను జయంతికి నచ్చడు, ఆ విషయాన్ని అతనింకా బయటకి వెళ్ళకుండానే అతని గురించి వ్యాఖ్యానిస్తుంది జయంతి. అదే సమయంలో ‘జాతక చక్రం’ తీసికెళదామని తిరిగి వచ్చిన గోపాలకృష్ణ అది వినడం, చిన్నబుచ్చుకొని వెళ్ళిపోవడం జరుగుతుంది. జరిగిన సంఘటనకు మనస్తాపానికి గురైన గోపాలకృష్ణ, ఒకరోజు జయంతి ఆఫీసుకు వెళ్ళి ఒక గిఫ్టు బాక్స్ ఇస్తాడు, దానిలో ఒక అద్దం పెట్టి, ఆమె అందాన్ని చూసుకోమని వేళాకోళం చేస్తాడు. ఆ చర్య జయంతిని తనని అవమానించినట్లు ఫీలవుతుంది. ఆ విషయం ఇంటిలో చెబితే, అలా చేసేముందు గోపాలకృష్ణ తమతో సంప్రదించే చేశాడనీ, పైగా, అతడు, తన చెల్లెలు దమయంతిని చేసుకోబోతున్నాడని తెలుస్తుంది. ఈ పెళ్ళేగనుక జరిగితే ఇంట్లో తాను ఆతని ముందు చిన్నబోయినట్లు ఉండవలసి వస్తుందనిఆ పెళ్ళి చేయవద్దనీ, ఒకవేళ చేస్తే, తాను ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతానని బెదిరిస్తుంది.
గోపాలకృష్ణను దమయంతికిచ్చి పెళ్ళిచేయడం జరుగుతుందనీ, ఇష్టం లేకపోతే వెళ్ళిపో వచ్చుననీ కుంటుంబ సభ్యులంతా జయంతికి చెబుతారు. దానితో తన ఫ్రెండ్ ఉషారాణి ఉంటున్న అద్దెగదిలోకొచ్చి కొన్నాళ్ళు ఉంటానని, జరిగినదంతా వివరిస్తుంది. వివరిస్తూనే కొన్నాళ్ళే కాదు ఇష్టమైతే తనతో పాటు అద్దె చెల్లిస్తూ, పనులు పంచుకొని చేసుకొంటూ ఉండవచ్చని ఆమె చెబుతుంది. ఆ ఒప్పందం బాగుందని అలాగే కొనసాగుతుండగా, ఉషారాణికి వివాహమై వెళ్ళిపోతుంది. జయంతి ఒంటరిగా మిగిలిపోతుంది. జీవితం నిస్సారంగా మారిపొతుంది. ఒకసారి జయంతికి తీవ్రంగా జ్వరం వస్తుంది. ఆఫీసుకి కూడా వెళ్ళలేక, మూసిన తలుపులు కూడా తెరవలేని పరిస్థితుల్లో గోపాలకృష్ణ, వాళ్ళ కుంటుంబం వాళ్ళే ఆమెను తీసికెళ్ళవలసి వస్తుంది.
ఈలోగా తాను పనిచేసే బ్యాంకులో తనకులానికే చెందిన దివాకర్ మేనేజర్ గా వస్తాడు. జయంతి వివిధ పనుల వంకతో దివాకర్ తో చనువుగా ఉంటుంది. అతనికింకా పెళ్ళికాక పోవడం, ఎర్రగా, ఎత్తుగా ఉండి తన కలల రాకుమారుడిలో కొన్ని లక్షణాలైనా ఉండటంతో, అతడిని ఇష్టపడుతుంది. కానీ, అతడు ఉత్తర భారతదేశంలో ప్రసిద్ధ వ్యాపారి కూతురు మనీషా వెంటపడి, వివాహానికి ప్రయత్నించి విఫలమయినవాడు. అప్పటికే జయంతిని చేసుకోమని జయంతి తరపున గోపాలకృష్ణ దివాకర్ ని అడుగుతాడు. దివాకర్ ఆ పెళ్ళికి అంగీకరించడు. మనీషాతో పెళ్ళి జరగలేదు గనుక, జయంతిని చేసుకోవాలని గోపాలకృష్ణ మళ్ళీ దివాకర్‌ కి చెప్పి అంగీకరించేలా చేస్తాడు. కానీ , జయంతి దివాకర్ని తిరస్కరిస్తుంది. దివాకర్ గోపాలకృష్ణ మిత్రుడు కావడం, ఒకసారి తానే అడిగితే అంగీకరించక ధనవంతుల సంబంధం పోయినందుకే తనని చేసుకోవడానికి అంగీకరించాడని భావిస్తుంది.
ఇదిలా ఉండగా, గోపాలకృష్ణ చేసుకున్న దమయంతి చాలా అదృష్టవంతురాలని జయంతి, ఆ కుటుంబం కూడా భావిస్తుంది. గతంలో గోపాలకృష్ణ, జయంతిని అవమానించిన చర్యకు, ఇప్పుడు ఏదొకలా సాయం చేసి, మంచి వాడనిపించు కోవాలని అతడు ప్రయత్నిస్తుంటాడు. ఆమెని వివిధ సందర్భాలలో “వదినగారూ!” అంటూ పలకరిస్తూ, సంభాషణలో పెట్టాలని ప్రయత్నిస్తుంటాడు. ఆమె మొదట ఇష్టపడదు కానీ, దమయంతిని ప్రేమగా చూసుకోవడం, తన గురించి దివాకర్ తో సంప్రదించటం వంటివన్నీ మళ్ళీ జయంతిలో గోపాలకృష్ణ పట్ల సదభిప్రాయాన్ని కలిగిస్తాయి. ఈలోగా ఇంట్లో వాళ్ళ పోరు పడలేకనో, లేక పెళ్ళి చేసుకోవడానికి తగిన అర్హతులున్న వాడు దొరకక పోవడం వల్లనో శేషగిరిని వివాహంచేసుకుంటుంది. శేషగిరి, జయంతి కంటే పెద్ద ఉద్యోగి. ఎత్తుగా, ఎర్రగా ఉంటాడు. ఈ లక్షణాలకు తోడు తనని దివాకర్ తిరస్కరించడం వల్ల కూడా శేషగిరిని పెండ్లి చేసుకోవాలనుకుంటుంది. కానీ, శేషగిరికి తల్లిని చూసుకోవడం చెల్లెలు పెళ్ళి చేయవలసిన బాధ్యతలు ఉన్నాయి. పెళ్ళికి ముందే చెప్పినా, పెళ్ళి అయిన మర్నాడేనుండే ఇద్దరి మధ్యా ఆర్థికపరమైన తగాదాలు మొదలై చిలికి చిలికి గాలివానై, ఆ పెళ్ళి మూన్నాళ్ళ ముచ్చటగానే మిగిలిపోతుంది. తల్లిని, కూతురుని, తమ్ముడిని చూసుకోవాలని, ప్రతిపైసా లెక్కప్రకారం ఖర్చుచేయాలనే మనస్తత్త్వం శేషగిరిదైతే, ఇంటి దగ్గర కాకుండా హోటల్లో హానీమూన్ జరగాలనీ, అవసరమైతే దానికి తన డబ్బే ఖర్చు చేస్తాననడం జయంతి వంతయ్యింది. రోజూ ఆఫీసుకెళ్ళి వచ్చి వంట చెయ్యడం కుదరదు. జీతం తెస్తున్నాను కనుక, భోజనం చేసే హక్కు తనకుంది. అందువల్లే తింటున్నానని తినేసి, తిన్న కంచం కూడా కడగని జయంతి పట్ల అత్తగారు, శేషగిరి కూడా ఇబ్బందిగా ఫీలవుతారు. చివరికి వేరే కాపురం పెట్టాలని జయంతి భావిస్తుంది. శేషగిరికి విడాకులిచ్చే ముందు జయంతి తల్లిదండ్రులకు చెబుతుంది. గోపాలకృష్ణ వచ్చి సర్దిచెప్పే ప్రయత్నం చేస్తాడు, అయినా జయంతి ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో జయంతి శేషగిరిలకు విడాకులు తప్పలేదు. శేషగిరి మళ్ళీ ఇంటర్ చదివి మానేసిన అమ్మాయిని పెళ్ళిచేసుకుంటాడు.
ఇంతలో నాటకీయంగా దమయంతి పిల్లలు జయంతికి మాలిమవుతారు. ముందు శేషగిరి మీద కోపంతో అప్పుడు జయంతి అబార్షన్ చేయించుకొంది. భవిష్యత్తులో పిల్లలు కలగరని తెలిసిన జయంతికి ఈ పిల్లలు దగ్గరవడంతో వారి పట్ల ప్రేమ మరింత పెరుగుతుంది. ఒకరోజు ఏదో పని మీద బయటికి వెళ్ళిన దమయంతి హఠాత్తుగా ఏక్సిడెంట్లో చనిపోతుంది. గోపాలకృష్ణ మాత్రమే కాకూండా, అత్తామామలు, కుటుంబం అంతా సొంతబిడ్డను కోల్పోయినంతగా బాధపడతారు. ఆ ఆత్మీయతానురాగాలు అర్ధమయిన జయంతి మళ్ళీ పెళ్ళిచేసుకోవాలను కొన్నా, మళ్ళీ ఎలాంటివాడు భర్తగా వస్తాడోనని అనుమానిస్తుంది. దగ్గరుండి గోపాలకృష్ణ ప్రవర్తనను గమనించడం వల్ల, అతన్ని చేసుకొంటే బాగుంటుందని భావించి, అతనికి తన అభిప్రాయాన్ని చెబుతుంది. కానీ, దమయంతికి తప్ప మరెవరికీ తన హృదయంలో, తన జీవితంలో స్థానం లేదని సున్నితంగా తిరస్కరిస్తాడు గోపాలకృష్ణ. జయంతి ఉద్యోగం మానేసి మానసిక ప్రశాంతత కోసం నర్సరీ పెడుతుంది. తన పిల్లలను ఆ నర్సరిలో ఉంచడానికి గోపాలకృష్ణ అంగీకరిస్తాడు. జీవితంలో ఆర్థిక విలువలే అన్నింటినీ నిర్ణయించలేవనీ, మనసుని అర్థంచేసుకొని జీవించే జీవితానికి తోడు ఒకరుండాలని జయంతి అనుకొంటూ నర్సరీ లోనే మిగిలిపోవడంతో నవల ముగుస్తుంది.
కథనిలా ముగించడంలో రచయిత్రి ఆశించిందేమిటినిపిస్తుంది. వ్యాస ప్రారంభంలో వచ్చిన ప్రశ్నలే వస్తాయి. మరి, ఇలా కథా కథనాన్ని నడిపిన రచయిత్రి రచనా స్వభావం ఏమిటి?

1.3 రచయిత్రి పరిచయం

రచనకు ఏదొక సామాజిక ప్రయోజనం ఉండాలనే ఆశయంతో రాస్తున్నట్లు చెప్పకొంటున్న శ్రీమతి దూర్వాసుల కామేశ్వరి, ‘ డి. కామేశ్వరి ‘ గా ప్రసిద్ధి. 1935 ఆగస్టు 22 న కాకినాడలో పుట్టి, మెట్రిక్యులేషన్ వరకూ చదివారు. పెళైన తర్వాత 1952 నుండి 1984 వరకూ భర్త చేస్తున్న ఉద్యోగప్రాంతం ఒరిస్సాలోనే ఉన్నారు. 1962 లో అంటే 27 వ యేట రచనా వ్యాసాంగాన్ని ప్రారంభించి ఒక దశాబ్దం గడవకుండానే, ” కథేశ్వరి ” గా కీర్తింపబడ్డారు. ఆమె సుమారు 250 కథలు, 20 నవలలు రాశారు. ” కొత్తమలుపు ‘ నవల ” న్యాయంకావాలి ” సినిమాగా రూపొందింది. వీరి కథలు, నవలలు కన్నడ, తమిళ, హిందీ భాషలలో అనువాదమయ్యాయి.
ఒక ఇంటర్వ్యూలో రచయిత-వ్యక్తిత్వం గురించి ఆమె తన అభిప్రాయాన్ని చెబుతూ – “సమాజంలో సంఘటలను తన రచనా సామర్ధ్యంతో పాఠకుల ముందుంచడం వరకే రచయిత బాధ్యత. చెప్పిందల్లా రచయిత ఆచరించాలని, రాసిందల్లా చేసి తీరాలని లేదు – నేను నా రచనలతో సామాజిక చైతన్యాన్ని, సాంఘిక విప్లవాన్ని సృష్టిస్తానని ఎన్నడూ అనుకోలేదు. రచనతో సాంఘిక విప్లవాలు వచ్చేస్తాయని నేను నమ్మను కానీ, ఆ రచన ఏదో ఒక సామాజిక ప్రయోజనం కలగడానికి ఉపయోగపడుతుందని నేను నమ్ముతాను” అని అన్నారు. ఈ అభిప్రాయాలలో వైరుధ్యం కనిపిస్తున్నా, అవే వాస్తవాలనుకోవడానికీ లేదు. అలాగే వాస్తవం కాదనీ చెప్పలేం. అంటే రచనలన్నీ సాంఘిక విప్లవాలు సృష్టించకపోవచ్చు. రచనలు సాంఘిక విప్లవాలకు ప్రత్యక్షంగా దోహదం చేయక పోయినా, పరోక్షంగానైనా కొన్ని రచనలు అలాంటి ప్రభావాన్ని చూపాయని చరిత్ర నిరూపిస్తునే ఉంది. అయితే, ఆ రచనలో ఉండే వస్తు, శిల్పాలను బట్టి ఆ ప్రభావమనేది ఆధారపడి ఉంటుంది. ఆ రచన ఉత్పత్తి చేసిన వారిని బట్టీ, ఉత్పత్తి శక్తులను బట్టీ కుడా ఆ ప్రభావం ఉండవచ్చు. రచయిత్రి ఒక రచన వల్లనే విప్లవాలు వచ్చేస్తాయని భావించకపోయినా రచన వల్ల ప్రభావం అయినా కలగాలనే ఆకాంక్ష లేకపోతే “తరతరాలుగా వస్తున్న పురుషాహంకారం పూర్తిగా వదలడానికి యింకా కొన్ని తరాలు పట్టవచ్చు. భార్య అంటే జీవిత భాగస్వామిగా ప్రేమ, అనురాగం సానుభూతి పంచియిచ్చే భర్తలను ముందు తరంలో మనం చూడవచ్చు” అని ఎలా ఆశించగలరు?. ఈ మార్పులు కేవలం రచనలు రాసి ఊరుకొంటే వచ్చేస్తాయని భావించడం సరికాదనే స్పృహ రచయిత్రి అభిప్రాయంలోనే కనిపిస్తుంది.
ఉద్యమాలు అనేవి రచనా పరంగానే కాకూండా, క్రియాత్మకంగా కూడా జరగవలసి ఉంది. ఇక, రచయిత్రి నవల ద్వారా చెప్పదలచిన అంశాలను విశ్లేషించుకుంటే స్త్రీ సమస్యలని అర్థం చేసుకోవలసిన అవసరం పురుషులకీ, అలాగే పురుషుల్లో తరతరాలుగా పేరుకుపోయిన ‘అహంకారం’ కూడా అర్థంచేసుకుని స్త్రీ సర్దుబాటు చేసుకొంటూ, క్రమక్రమంగా మార్పుని సాధించడం మంచిదనే సందేశం కనిపిస్తుంది. ఆశయాలు ఆచరణలోకి వచ్చేటప్పటికి కొన్ని జీవితాలు సంఘర్షణలతో కూరుకుపోవలసిన పరిస్థితి ఏర్పడి, మానసికంగా, శారీరకంగా అశాంతికి కారణమై, ఏకాకిగా మిగిలిపోయే ప్రమాదాన్ని గుర్తించమంటున్నారు రచయిత్రి. వీటిని ‘జయంతి’ పాత్ర ద్వారా దృష్టిని కేంద్రీకరించి, వివరించే ప్రయత్నం చేశారు. కొంత మంది రచయితలు/రచయిత్రులు తమ నవలలలో పాత్రలను తమ తమ ఆశయాల సాధనకు అనుగుణంగా మార్చుకొంటూ ఉంటారు. అలాంటప్పుడు పాత్రలను చిత్రించడంలో ఏ మాత్రం రాజీపడరు. జయంతి పాత్రను చిత్రించడంలో రచయిత్రి ఆశయ ప్రతిఫలనం కనిపిస్తుంది.

1.4 నవలలో స్త్రీవాద దృక్పథం

సమాజంలో స్త్రీ నైతిక, ఆర్థిక, రాజకీయ రంగాలలో మౌలికమైన మార్పులను ఆశించడం, వ్యక్తిగత అనుభవాలతో కలిగిన అవగాహనతో పరిష్కారాలని సాధించడం, జీవితాన్ని అర్థం చేసుకోవడానకకి అనేక కోణాలను సూచించడం స్త్రీవాద ఉద్యమంలో కనిపించే కొని ప్రధాన లక్ష్యాలు. పురుషులతో పాటు స్త్రీలకు సమానహక్కులు కోరుకోవటం వీటిలోనూ మరింత స్పష్టంగా చెప్పుకోవాలంటే స్త్రీ చదువు, స్వతంత్ర ఆలోచన, గర్భనియంత్రణ నిర్ణయాధికారం, వివాహం, కుటుంబం, పిల్లలు, పురుషాధిపత్యం, ఇంటి చాకిరీ స్వభావం, పితృస్వామ్యం, మాతృస్వామ్యం పట్ల అవగాహన, శ్రమకు విలువకట్టడం, లైంగికత్వంలో విచక్షణ, మాతృత్వానికీ, పిల్లలను కనడానికీ మధ్య తేడాని గుర్తించడం, స్త్రీలు సున్నితంగా లలితమైన పదాలతో, మర్యాదా రేఖలను అతిక్రమించకుండా రాయాలనడంలోకనిపించే జెండర్ విధానాన్ని గుర్తించడం, ఆలోచనలతో పాటు తిరుగుబాటు తత్త్వాన్ని పెంపొందించడం, తద్వారా స్వేచ్ఛా జీవితాన్ని స్త్రీ అనుభవించగలిగే అవగాహనను కలిగించడం వంటివన్నీ తెలిసి విమర్శించమనడం కూడా స్త్రీవాద దృక్పథంలో కనిపిస్తుంది. వీటిలో ప్రాధాన్యతను వహించే లక్ష్యాలు, స్వభావాన్ని బట్టే లిబరల్ రాడికల్ ఫెమినిజం వంటి విభజనలు వస్తున్నాయి. చాలా వరకూ ఈ అంశాలను ‘మనసున మనసై’ నవలలో తనదైన దృక్పథంతో చెప్పించే ప్రయత్నం చేశారు రచయిత్రి!
1.4.1 సమాన హక్కులు – బాధ్యతలు
స్త్రీ పురుష సమాన హక్కులు అనేవి ఒకరిస్తే వచ్చేవికాదు. పొందడం ద్వారా మాత్రమే వస్తాయి. అయితే పొందడంలో ఒకవైపునుంచి ఆటంకాలు ఎదురవుతాయి. ‘ఆటంకాలను’ అధిగమించినప్పుడే సాధించగలగడం సాధ్యమవుతుంది లేకపోతే హక్కులు కొందరి దగ్గర ఉన్నవి మరికొందరికివ్వడమే అవుతుంది. కానీ తరతరాలుగా కొందరే అనుభవించడం వల్ల ఆటంకాలని అధిగమించి సాధించడం అనేది హక్కులని పొందడంగా, సాధించుకోవడంగా, కొందరి దగ్గరే కేంద్రీకృతం అయిపోవడంలో ఆశ్చర్యం కూడా లేదు. హక్కులు మగవాళ్ళ దగ్గరే ఉండిపోవడం, అవి తమకీ కావాలని కోరుకోవడం, పోరాడడం, లాక్కోవడం అనేవి క్రమానుగ్రతంగా జరగవలసినవే! ‘జయంతి’ పాత్రను చిత్రించడం లో రచయిత్రి ఈ పరిణామాలు కొంతవరకకు చిత్రించారు, స్పర్శించగలిగారు. జయంతిని పెంచడంలో, చదివించడంలో, ఉద్యోగం చేయడంలో వచ్చిన జీతాన్ని తానే ఖర్చు పెట్టుకోవడంలో ఎక్కడా వివక్షను ప్రదర్శించలేదు. పైగా చదువుకొన్నప్పుడు గానీ, ఉద్యోగం చేసేటప్పుడు గానీ స్వతంత్రంగా ఓ పెళ్ళి కొడుకుని చూసుకోలేక పోయినట్లు కూడా చిత్రించారు. 32 యేండ్ల వరకూ పెళ్ళిచేయకపోవడానికి అవకాశం ఇవ్వడంలో తొందరగా పెళ్ళి చేసి పంపేయ లేదనీ తెలుస్తుంది. అయినా, ఆమె పెళ్లి చేసుకోవడానికి స్వాతంత్ర్య నిర్ణయాలు తీసుకోలేదు. జీవితం పట్ల ఆమె అవగాహనా రాహిత్యమనే దానికి కారణమని అర్థమవుతుంది. ఈ అవగాహన అనేది తన జీవితం పట్ల తాను చదివిన చదువులు అందించిన అవగాహనగానే తెలుస్తుంది. దమయంతిని పోలుస్తూ జయంతిని ఎత్తి పొడుస్తూ తల్లి అంటున్న మాటల్లో ఇలాంటి స్వభావం వ్యక్తమయ్యింది. ఇంగిత జ్ఞానం, తెలివి వుంది కనుక దమయంతి తన అర్హత తాను తెలుసుకుని ఈ సంబంధం చేసుకుంటానంది. అతనూ సంతోషంగా ఒప్పుకున్నాడు. దానికి తల్లిదండ్రి పడే కష్టం తెలుసు మంచీ చెడ్డా తెల్సింది కనుక పెద్దకోరికలు పెట్టుకుని విర్రవీగడం లేదు” (పు: 11) ఇక్కడ దమయంతి కంటే జయంతికి జీవితావగాహన లేదనీ స్పృహ కలుగుతుంది!
ఇరవై ఎనిమిదేళ్ళ వయసు వచ్చినప్పటి నుండీ జయంతికి పెళ్ళి చేయాలని ప్రయత్నించి, చివరికి ముప్ఫై రెండు యేళ్ళనాటికి పెళ్ళి చేయగలిగారు. దాన్ని ఆమె నిలబెట్టుకోలేక పోయింది. పోనీ, మంచి సంబంధం తాము చేయలేదనడానికీ అవకాశం ఇవ్వకుండా, పెళ్ళి చేసుకోవడంలో జయంతికీ స్వతంత్ర్య నిర్ణయానికి అవకాశామిచ్చినట్లు తల్లి మరొక సందర్భంలో అన్నమాటలే నిదర్శనం. “నీ ఇష్టం వచ్చిన వాళ్ళని నీవు వెతుక్కో”మనే తండ్రి అభిప్రాయాన్ని తల్లి నోటితో చెప్పించారు రచయిత. వీటన్నింటిలోనూ “స్వేచ్ఛ” ను అనుభవించడంలో జయంతికి ఏ మాత్రం లోపం జరగలేదు. స్వేచ్చ ఆమె జీవితంలో వాస్తవ జీవితావగాహన కలిగించ లేకపోయిందనీ, తల్లి తండ్రులు మాట వినకుండా స్వతంత్ర నిర్ణయం తీసుకొని విడాకులిచ్చి, అబార్షన్ చేయించు కోవడం వల్లనే ఒంటరిగా మిగిలిపోవలసి వచ్చిందని, దానికంతటికీ సర్దుబాటు లేకపోవడం ప్రధాన కారణమనీ రచయిత్రి సూచించినట్లయ్యింది.
1.4.2 స్త్రీ ఉన్నతవిద్య – తదనంతర పరిణామాలు
స్త్రీ ఉన్నత విద్య చదివినా, అవి కొన్ని తరగతులలో, ముఖ్యంగా మధ్యతరగతి స్త్రీలలో స్త్రీ పురుషుల మధ్య కలిగించే ఘర్షణలు ఎలా ఉంటాయో ‘జయంతి’ పాత్రలో శేషగిరిని చేసుకోవడాన్ని బట్టి చిత్రించే ప్రయత్నం చేశారు. శేషగిరి ఎత్తుగా, కొంచెం రంగు కలిగి ఉండి, ఉన్నత చదువు, జీతం, హోదాలు ఉండటం వల్ల జయంతి పెళ్ళిచేసుకున్నా వివాహానంతరం తన కలలు కల్లలై పోయిన స్థితిని చిత్రించారు. రచనా దృక్కోణం మగ పాత్రను సమర్ధించే ధోరణిలోనే కొంత వరకూ సాగింది. శేషగిరి సర్దుకుందామనుకొన్నా, జయంతి సర్ధుబాటు చేసుకోలేనట్లు చిత్రితమయ్యింది. జయంతికి వివాహం అయిన తర్వాత, హానీమూన్ వెళ్ళాలనే కోరిక ఉండటం, దాన్ని తీర్చుకోవడంలో ఆధిపత్యాన్ని చెలాయించేటట్లు వర్ణితమయ్యింది తప్ప, ఎక్కడా శేషగిరి మాటలని పట్టించుకొన్నట్లులేదు. ‘జండర్ విధానం’ కొంత ఉన్నా జయంతి సున్నితంగా తన కోరికను చెప్పడమనేది కాదిక్కడ!
శేషగిరి చేత సున్నితంగా చెప్పించడామే కాకుండా, గిఫ్టులు తన కుటుంబం వారికే కొనడం, అత్తగారి వైపు వారికెవరికీ కొనక పోవడం వంటివి చేసినట్లు రచయిత్రి వర్ణించడం లోని ఆంతర్యం కొంత సందేహాస్పదమే అవుతుంది. కానీ, శేషగిరి ఏ పనీ చేయకుండా, జయంతి చేత వంట పనులు బలవంతంగా చేయాలని చూడడంలో సమాజంలో మానసికంగా స్థిరపడి పోయిన భావనను చిత్రించగలిగారనుకోవచ్చు. పైగా, ఆధిక్యతను ప్రశ్నించినట్లయితే, వర్తమాన సమాజ పురుషాంకారానికి ప్రతీకగా శేషగిరి రెండవ వివాహం కనిపిస్తుంది. అదీ ఉన్నత చదువు చదవని, ఇంటర్ చదివి మానేసిన, ఉద్యోగం చేయని అమ్మాయిని చేసుకోవడంలో ఆ కోణం కనిపిస్తుంది. సర్దుబాటు లేని జయంతి వివాహాన్ని స్వేచ్ఛకు ఆటంకంగా మార్చుకొంటే, అదే మధ్య తరగతికి చెందిన దమయంతి సర్దుబాటు చేసుకోవడం వల్ల జీవితాన్ని ఆనందమయం చేసుకొంది. గోపాలకృష్ణలో బాహ్య ఆకర్షణ కంటే ఆంతరంగిక సౌందర్యం ఉండటం కూడా కారణమయ్యింది. ‘జయంతి, శేషగిరి’ ల మధ్య కొరవడిన సర్దుబాటు, ‘దమయంతి – గోపాలకృష్ణ’ ల మధ్య పరస్పరం కలిగి ఉండటం వల్ల, దమయంతి హాఠాత్తుగా చనిపోయినా, మళ్ళీ పెళ్ళి చేసుకోవడానికి కూడా మనస్కరించని స్థితికి గోపాలకృష్ణ చేరుకో గలిగాడు.
1.4.3 గర్భ నియంత్రణ -మాతృత్వపు విలువలు
గర్భ నియంత్రణ, మాతృత్వం గురించీ స్త్రీ వాదులకున్న అభిప్రాయాలను రచయిత్రి జయంతి పాత్రను ఆసరాగా చేసుకొని చర్చించే ప్రయత్నంచేశారు. శేషగిరిని చేసుకొని, ‘సుఖపడని’ జయంతి, ఆతని వల్ల వచ్చిన గర్భాన్ని తీయించేసుకొంది. ఇక పిల్లలు పుట్టరని తెలిసి చాలా బాధ పడింది. రెండవపెళ్ళి చేసుకోవడానికిష్టపడే పరిస్థితి ఎలాగూ లేదు. మళ్ళీ ఎటువంటి వాడు భర్తగా వస్తాడో, దానికంటే పెళ్ళి చేసుకోకుండా అలాగే ఉండిపోవడం మంచిదనుకుంది. కానీ, జీవితాన్ని దగ్గరగా పరిశీలించడం వల్ల తన చెల్లి దమయంతి చనిపోవడంతో గోపాలకృష్ణను చేసుకోవాలనుకుంది. కానీ, అతను అంగీకరించలేదు. పిల్లలను మాత్రం ఆమె నర్సరీలో డబ్బు చెల్లించి ఉంచడానికి అంగీకరించాడు. ఉద్యోగం మానేసి నర్సరీ పెట్టింది. పిల్లల పట్ల ఉండే మమకారం తీర్చుకోవడానికి ఇదో మార్గంగా చేసుకొంది. కేతు విశ్వనాథరెడ్డి గారు వ్యాఖ్యానించినట్లు జయంతి జీవిత వైఫల్యం నుండి యాదృచ్చికంగా ‘సేవ’ పుట్టుకొచ్చిందా! చైల్డ్ నర్సరీ పెట్టడంలో ఒంటరితనాన్ని పోగోట్టుకోవాలను కోవడమే కారణమా, లేక దివాకర్ని ఇష్టపడినా, అతడు మొదటి ఇష్టపడి, తనకంటే ఆర్ధికంగానూ, శారీరకంగానూ అందమైన గొప్ప సంబంధం రావడంతో మనీషాని పెళ్ళి చేసుకోవాలని భంగపడి, మళ్ళీ జయంతిని పెళ్ళిచేసుకోవాలని అనుకోవడం, దాన్ని ఆత్మగౌరవానికి భంగకరంగా భావించి తిరస్కరించడంలో జయంతి పాత్రలో అంతర్లీనంగా స్త్రీవాద భావాలున్నాయి,
ఒంటరిగా మిగిలిందను కోవడంలో కూడా కొన్ని సమస్యలున్నాయి. ‘పిల్లలను కనడం’ వేరు మాతృత్వాన్ని అనుభవించడం వేరువేరుగా స్త్రీవాదులు భావిస్తున్నారా? ఈ నేపథ్యాన్ని దీనికి అనువర్తించుకొంటే ఒంటరితనం పోవడానికో, పిల్లలు పుట్టలేదు కనుక మాతృత్వానికి అవకాశం లేక ‘మాతృత్వ భావం’ తో జీవించడానికి నిర్ణయించిందను కోవడమో సరికాదనే అవకాశం కూడా ఉంది. కానీ, స్త్రీ వాదులు భావించినట్లు “మాతృత్వాన్ని నిజంగా ప్రకృతి ప్రసాదించిన వరంగానో, అద్భుతమైన స్వభావంగానో చూడాలనుకుంటే, అది స్త్రీలకు పునరుత్పత్తి స్వేచ్చ వున్నప్పుడే జరుగుతుంది. పిల్లలని కనటం, మాతృత్వం ఒకటి కాదు ” అనే భావనతో చెప్పిన సందర్భంగా కాకుండా నవలలో “జీవితంలోనే కోల్పోయిన ఆనందం ఈ పసిమొగ్గల్లో వెతుక్కోవాలనే నా తాపత్రయం” అని (పుట: 195) అనడమే కాకుండా, “నిన్ను నిన్నుగా ప్రేమించుటకు, నీ కోసమే కన్నీరు నింపుటకు నేనున్నానని నిండుగా పలికే తోడొకరుండిన అదే భాగ్యమూ… అదే స్వర్గమూ…. “తాను ఆ భాగ్యానికి నోచుకోలేదు. ఈ జన్మలో – కన్నీటి పొరల మధ్యనుంచి గోపాలకృష్ణ కనుమరుగయ్యే వరకు చూసింది ” అని ముగించడం వల్ల, నిరాశా, నిస్పృహలనుండి, ఒంటరితనం పోగొట్టుకోవాలను కోవడం ఆ నేపథ్యం నుండి చైల్డ్ నర్సరీ ఏర్పర్చడం స్త్రీ వాదానికి బలమైన సమర్ధనిచ్చే ముగింపు ఎలా అవుతుందో ఆలోచించ వలసిందే!.
1.4.4 ఆర్థిక సంఘర్షణలు – సర్థుబాటు మనస్తత్త్వం
ఈ నవలలో దివాకర్, మనిషా పట్ల పెంచుకొనే ఆకర్షణలో ఆర్థిక కోణమే ప్రాధ్యానత వహించింది. జయంతి, దివాకర్ పట్ల ఆకర్షణ పెంచుకోవటంలో ఆర్ధిక కోణంతో పాటు, మానసిక అనుభూతులు, కలలు ఆశలు వ్యక్తమయ్యాయి. మనీషా, దివాకర్ని తిరస్కరించడంలో ఉన్నత వర్గం ( తరగతి )లో కనిపించని సమస్యలు మధ్యతరగతిలో కనిపించాయి. ఉషారాణి అమెరికా సంబంధాన్ని చేసుకున్నా, సర్దుబాటు తప్పలేదని తెలుస్తుంది.
మనోవిజ్ఞాన శాస్త్రంలో సర్దుబాటునే, ‘ఆనుగుణ్యత’ సిధ్దాంతం అంటారు. కొన్ని సర్దుబాటులు సమాజానికి అవసరమయితే, మరికొన్ని సర్దుబాటులు అభివృద్ధి నిరోధకాలవుతుంటాయని సైకాలజీ చెబుతుంది. ఆ సర్దుబాటు అనేది సమన్వయం కూడా సాధించవలసి ఉంటుంది. దీన్ని స్త్రీవాదానికి అనువర్తించే ప్రయత్నం ‘మనసున మనసై’ నవలలో కనిపిస్తుంది. అవసరమైన సర్దుబాటుని గోపాలకృష్ణ – దమయంతి పాత్రల్లోనూ, ఉండకూడని సర్దుబాటుని శేషగిరి – జయంతి పాత్రల్లోనూ చిత్రించారు. అయితే ‘జయంతి’ పాత్రలో రెండు కోణాలు పెట్టి అవసరమైన సర్దుబాటు కుటుంబ అవిచ్చిన్నతను కాపాడుతుందనీ, అనవసరమైన సర్దుబాటు స్త్రీలో ఆర్ధికపరమైన శక్తి సామర్ధ్యాలతో పాటు, ఆత్మ గౌరవాన్ని పెంపొందించు కోడానికి తోడ్పడుతుందనే స్పృహ కలిగించారు.
అన్నింటినీ సర్దుకుపోవడం కూడా మంచిదికాదు. అవసరమైతే సంఘర్షణ పడినా, ఆ సంఘర్షణలోనూ ఆనందం ఉంటుంది. సంఘర్షణ వల్ల వెంటనే ఫలితాలు రాకపోవచ్చు కానీ, భవిష్యత్తు తరాలు స్వేచ్చగా, ఆత్మగౌరవంతో సుఖ సంతోషాలతో అన్ని వర్గాల వారూ జీవించడానికి కొన్ని సంఘర్షణలు కూడా తప్పవు. ‘సంఘర్షణ’ వల్ల కొన్ని జీవితాలు అశాంతికీ, ఒంటరి తనానికీ కూడా గురై, త్యాగాలకు సిద్ధం కావలసి వస్తుంది. వీటి నేపథ్యంగానే స్త్రీ ఉన్నత చదువు, వివాహ వయస్సు, కుటుంబం, లైంగికత్వం, ఆర్ధిక స్వాతంత్ర్యం, ఉద్యోగ నిర్వహణ వంటి అంశాలు ప్రాధాన్యతను వహిస్తుంటాయి. ఇలాగే నవలలో వివిధ పాత్రలు ఒదిగిపోయాయి.
నవల చదువుతున్నపుడు కొన్ని అక్షర దోషాలు పఠితకు ఇబ్బందిని కలిగిస్తాయి. రచయిత్రి కొన్ని పాత్రల పేర్లని మార్చేశారు. శేషగిరి చెల్లెలు, తమ్ముడు పేర్లు అమాంతంగా మారిపోయాయి. ‘శశి’ అని (పుట: 108, 109 ) ‘శాంతి’ అనీ (పుట: 116,119) మార్చేశారు. సాంకేతికంగా కలిగిన ముద్రణా దోషాల వల్ల వాక్యాలు మళ్ళీ మళ్ళీ ముద్రితమయ్యాయి.

1.5 నవలలో రచనాశైలి

రచయిత్రి శైలి విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకొంటే బాగుండునేమో! “లొంగదీసుకోవడం”, “కొంగుని కట్టేసుకోవాలనుకోవడం” వంటి పదాలను ఎక్కువగా ప్రయోగించారు. తెలుగు పలుకుబడి, జాతీయాల ప్రయోగాలతో సహజత్వం కోసం అలాంటి శైలి పాటించినా, సమయం, సందర్భం కూడా ముఖ్యం కదా!
ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశం అందులోనూ, కొన్ని సాంస్కృతిక విషయాలను పదేపదే ప్రస్తావించడం, తెలుగువాళ్ళు పొడవుగా ఉండరు. ఎర్రగా ఉండరు, అందంగా ఉండరు. ఇలాంటి ప్రకకటనలు రచయిత్రి అవగాహనను ఆనుమానించే విధంగా ఉంటాయి. ఇవి ‘జయంతి’ మనస్తత్వంగా చెప్పినా బాగుండేది. ఆలోచనల వల్ల రచనాశైలిలో రచయిత్రి ఆత్మాశ్రయత్వ గుణం తొంగి చూస్తుంది. సౌందర్య దృష్టితో చూసినపుడు సౌందర్యమనేది వస్తువులో ఉంటుందా? వస్తువుని చూసే వారిలో ఉంటుందా? అనేది పెద్ద చర్చనీయాంశం.
సౌందర్యం ఉభయగతమైనా వస్తువుని బట్టి కూడా ప్రధానంగానే ఉండవచ్చు. పైగా ‘సౌందర్యాన్ని’ నిర్వచించడంలో కులం, ప్రాంతం, భోగోళిక పరిస్థితులను కూడాపరిగణనలోకి తీసుకోవలసి వస్తుంది. అప్పుడే ఒక్కో అంశానికి ఒక్కోరకమైన సౌందర్య భావన వ్యక్తమవుతుంది. తమ సంస్కృతి మాత్రమే గొప్పదని భావించే “సాంస్కృతిక స్వవర్గవాదం” గురించీ, అన్ని సంస్కృతులూ ఆయా పరిస్థితులను బట్టి గొప్పవని భావిస్తూ, గౌరవించే “సాంస్కృతిక సాపేక్ష వాదాన్ని” కూడా ఈ నవలలో అధ్యయనం చేసే అవకాశం ఉంది. ఒక కులానికే కట్టిపడేసి పరిశీలించే పరిమితినికూడా రచయిత్ర నవలకు కల్పించారు. ‘బ్రహ్మణ కులా’నికి చెందిన అని సూచించడం వల్ల రచయిత్రి బ్రాహ్మణ మధ్యతరగతి కులానికి (వర్గానికి) చెందిన వారి జీవితాల్లో, అదీ చదువుకొన్న, మళ్ళీ భార్య భర్తలిద్దరూ చదువుకొని ఉద్యోగం చేసే వారికే పరిమితం చేస్తున్నారేమో అనే అనుమానానికి కూడా అవకాశం కల్పించేటట్లు నవలా రచన సాగింది. దీని వల్ల ‘వస్తువు’ ని ‘ఇతివృత్తం’ గా మార్చడంలో కొంత నైపుణ్యాన్ని సాధించలేని లోపం కనిపిస్తుంది. కొన్ని పరిమితులకు లోబడినా, చదువుకొన్న మధ్యతరగతి ఉద్యోగిని జీవిత సంఘర్షణను సమర్థవంతంగానే నవలలో ప్రతిఫలించగలిగారు.

1.6 ముగింపు

ఒక వాస్తవాన్ని కళాత్మక అభివ్యక్తిలో విస్తృతంగా చర్చించే అవకాశాన్ని కల్పించే నవలా ప్రక్రియలో ‘మనసున మనసై’ రాశారు. మిగిలిన ప్రక్రియల్లో ఈ విషయాన్ని ఇలా చర్చించే, ఆలోచింపజేసే అవకాశం లేదా? అని ప్రశ్నించుకుంటే, ‘కథ’ లో సమస్యలని సంభాషణగానో, వర్ణనగానో సూచించేసి, ముందుకి వెళ్ళి పోవడం జరగవచ్చు. కవిత్వంలో స్పందనకి ఉన్నంత ప్రాధాన్యత చర్చకి ఉండదనలేం కానీ, దాన్నే ‘విశ్లేషణ’ పదంతో చెప్పుకున్నా, నవలకి ఉన్నంత విస్తృత పరిథి లేదనే చెప్పుకోవచ్చు. ‘నాటకం’ లో కూడా కొంత వివరంగా చర్చించే అవకాశం ఉన్నా, ‘నవల’ లో ఉండే సౌలభ్యం దానికి లేదు. కనుక, ఉద్యోగినైనా మధ్యతరగతి స్త్రీ పొందే కష్టాలను నవలలో రచయిత్రి బాగా చర్చించ గలిగారు.
ముఖచిత్రం కూడా రచయిత్రి ఉద్దేశించిన భావాన్ని వ్యక్తం చేసేటట్లుగానే ఉంది. బాలి ఆ ముఖ చిత్రాన్ని అర్థవంతంగా గీశారు. ఒక చెట్టు పచ్చని ఆకులతో నిండి, దాన్ని బలమైన కాండంతో చిత్రించారు. దాని కింది ఇద్దరు (ఒక పురుషుడు + ఒక స్త్రీ) కూర్చొని ఉంటారు. అక్కడ కూడా పురుషుని శిరస్సు ఎత్తుగా ఉండి, స్త్రీ చిత్రం, ఆ పురుషునికి దిగువుగా కూర్చొని, అన్యోన్యంగా ఉన్నట్లుంటుంది. ఇది ఒక చక్కని ప్రతీకాత్మక చిత్రం. సంసారమనే (వివాహం) వృక్షం బలంగా ఉండాలంటే, స్త్రీ పురుషుల మధ్య అన్యోన్యత ఉండాలి. రచయిత్రి అన్యోన్యత కాలమాన పరిస్థితులను బట్టి ఆనుగుణ్యత (సర్దుబాటు) పై ఆధారపడి ఉంటుంది. సమకాలిన పరిస్థితులు పరిశీలించినట్లయితే, ఇంకా పురుషుని ఆధిక్యత కొనసాగుతూనే ఉంది. స్త్రీ అణకువతో, అనుగుణ్యతో నడుచుకొంటూనే ఉండటం చాలావరకూ కనిపిస్తుంది. అలా కాకపోతే ‘సంసారం’ (వివాహం) అనే వక్షం కల్పించే ఆహ్లాదకరమైన ఛాయల్లో జీవించలేరని, దానికి ‘జయంతి’ పాత్రే నిదర్శనమనే రచయిత్రి చెప్పిన సందేశాన్ని చక్కగా వ్యక్తీకరించగలిగింది. ఈ నవలలో రచయిత్రి చెపినట్లు పాత్రలు నడవడటం, తన ఆశయానికి అనుగుణంగా మలచుకోవడం వల్ల ‘రచయిత్రి’ ‘సమకాలిన వాస్తవాన్ని’ గుర్తెరిగి మసలుకోమనే సందేశం ఉంది ‘జయంతి’ పాత్రను సంఘర్షణాత్మక పాత్రగా చిత్రించినా, ‘దృష్టికోణం’ వల్ల ‘పాత్రచిత్రణ’ లో ‘వాస్తవాన్ని’ కల్పించేటప్పుడు ఆదర్శాల వైపు పయనింపజేసి, ఆ ఆదర్శాన్నింకా అందుకో లేని సమాజం లోనే నివసించడం వల్ల వైఫల్యాలు చెంది ఆమె ఒంటరిగా మిగిలినట్లు చేరిస్తే ఇది స్త్రీ చైతాన్యాన్ని మరింత పెంచగలిగేదేమో!
ఏది ఏమైనా తెలుగులో స్త్రీవాదం ఎదురుకుంటున్న ఆటుపోట్లను అవగాహన చేసుకోవడానికీ నవల ఎంతగానో సహకరిస్తుంది.
(నా వ్యాసాన్ని ప్రచురించిన ఈమాట వారికి కృతజ్ఞతలతో, ఆ పత్రిక వారి సౌజన్యంతో నా బ్లాగులో దీన్ని పునర్ముద్రిస్తున్నాను. )

No comments: