"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. మీ డిసర్టేషన్ కోసం అంశాన్ని త్వరగా ఎంపిక చేసుకోవాలి

02 January, 2009

విమర్శకుడుగా వల్లంపాటి వెంకట సుబ్బయ్య

--డా//దార్ల వెంకటేశ్వరరావు అసిస్టెంట్ ప్రొఫెసర్, తెలుగు శాఖ, హైదరాబాదు విశ్వవిద్యాలయం, గచ్చిబౌలి, హైదరాబాదు-46, 09989628049, vrdarla@gmail.com
మార్క్సిస్టు విమర్శకులలో వల్లంపాటి వెంకట సుబ్బయ్య ఒకరు. వస్తు శిల్పాలను ప్రధానంగా చేసుకొని విమర్శ కొనసాగించిన మార్క్సిస్టు విమర్శకులలో ఒక విశిష్టత కలిగిన వ్యక్తి. ఈయన 1937 మార్చి 15వ తేదిన చిత్తూరు జిల్లా రొంపిచర్లలో జన్మించారు. ఆంగ్ల సాహిత్యంలో ఎం.ఏ చేసి కొంతకాలం ఆంగ్లోపన్యాసకుడిగా పనిచేశారు. విమర్శ రంగానికి రాకముందు కథలు, నవలలు రాసేవారు. మార్క్సిస్టు సాహిత్యాన్ని బాగా అధ్యయనం చేశారు. పుట్టపర్తి నారాయణచార్యులు గారి ప్రోత్సాహంతో విమర్శ రంగంపై దృష్టి కేంద్రీకరించాలని భావించారు. విశ్వనాథ సత్యనారాయణ గారి "శ్రీమద్రామాయణ కల్పవృక్షం" పై రాసిన ఒక చిరు సమీక్ష ఆయన తొలి విమర్శ రచనగా చెప్పుకోవచ్చు. వల్లంపాటి వెంకట సుబ్బయ్య గారికి ఆంగ్ల, కన్నడ భాషలలో మంచి పరిఙ్ఞానం ఉంది. కన్నడ నుండి తెలుగు, తెలుగు నుండి ఆంగ్ల భాషలలోకి అనువాద రచనలు కూడా చేశారు. అలా ఆయన E.H.Carr రాసిన "What is History" గ్రంథాన్ని "చరిత్ర అంటే ఏమిటి?" (1983) పేరుతో అనువదించారు. అలాగే Gorden Child రాసిన "What happend in History" గ్రంథాన్ని "చరిత్రలో ఏమి జరిగింది?" (1985) పేరుతో అనువదించారు. అలాగే Chris Brazier రాసిన "World History"ని "ప్రపంచ చరిత్ర" (1986), S.G.Sardesai రాసిన "Progress and Conservative in Ancient India" గ్రంథాన్ని "ప్రాచీన భారత దేశంలో ప్రగతి, సంప్రదాయ వాదం" (1998), R.S.Sharma రాసిన "Ancient India" గ్రంథాన్ని "ప్రాచీన భారత దేశ చరిత్ర" (2002), Ralph Fox రాసిన "Novel and the People" గ్రంథాన్ని "నవల- ప్రజలు" (1992), Taslima Nesreen రాసిన "lazza" నవలను తెలుగులో "లజ్జ" పేరుతో అనువదించారు. అలాగే Devanaru Mahadeva కన్నడంలో రాసిన "ఒదలాలా" నవలను "బతుకంతా..." (1994) పేరుతో అనువదించారు. ఇలా అనువాదంలో కూడా వీరి ముద్ర ప్రత్యేకంగా కనిపిస్తుంది. అభ్యుదయ, మార్క్సిస్టు సాహిత్యాలను తెలుగు భాషలోకి అనువదించి అందించిన వల్లంపాటి వారు స్వయంగా కొన్ని విమర్శ గ్రంథాలను కూడా రాశారు. వల్లంపాటి వెంకట సుబ్బయ్య రాసిన విమర్శ గ్రంథాలలో ముఖ్యమైనవి "అనుశీలన" (సాహిత్య వ్యాసాలు 1985), "వల్లంపాటి సాహిత్య వ్యాసాలు" (1997), " నవలా శిల్పం" (1989), " కథా శిల్పం" (1995), "విమర్శ శిల్పం" (2002) ఈ గ్రంథాలను బట్టి ఈయన విమర్శ దృక్పథాన్ని స్పష్టంగా గుర్తించడానికి వీలు కలుగుతుంది. 1997లో తెలుగు విశ్వవిద్యాలయం వారు ఉత్తమ సాహిత్య విమర్శ గ్రంథానికి ఇచ్చే బహుమతిని " కథా శిల్పానికి" ఇచ్చారు. అలాగే, 1999 లో ఈ గ్రంథమే కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతిని పొందింది. తన చివరి కాలంలో స్థానిక చైతన్యంతో రాయలసీమ కవులూ, రచయితలూ, విమర్శకులూ చేసిన సాహిత్య కృషిని విశ్లేషిస్తూ "A Socio Economic Analysis of Modern Telugu Literature in Raayalaseema" పేరుతో పరిశోధన చేశారు. ఆ పరిశోధనను " రాయలసీమలో ఆధునిక సాహిత్యం సామాజిక సాంస్కృతిక విశ్లేషణ" (2006) పేరుతో ఒక గ్రంథంగా ప్రచురించారు. అంతకుముందు M.Litt పట్టా కోసం సీ.ఫెల్ లో "The Role of Inidian Sensibility in the Teaching of English Literature" అనే అంశంపై ఒక సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించారు. అలాగే 1963 లో ప్రాచీన తెలుగు కవుల జీవిత చరిత్రల్ని "నాటి కవులు" అనే పేరుతో చిన్న పుస్తకంగా ప్రచురించారు. సుమారు 70 కథలు, 4 నవలలు రాసి సృజనాత్మక రచయితగా కూడా పేరు తెచ్చుకున్నారు. ఈ విధంగా సృజనాత్మక రచనలు, విమర్శ, పరిశోధన రంగాలలో విశేషమైన కృషి చేసిన వల్లంపాటి వెంకట సుబ్బయ్య అనారోగ్యంతో 2007 జనవరి 2 వ తేదిన హైదరాబాదులో మరణించారు.
 విమర్శకుడికి కూడా దృక్పథం ఉండాలని భావించే విమర్శకులలో వల్లంపాటి వెంకట సుబ్బయ్య ఒకరు. దృక్పథం లేకపోవడమనేది సాహిత్యం పట్ల జీవితం పట్ల సరైన అవగాహన లేకపోవడమేనని ఆయన అభిప్రాయపడ్డారు. సమాజ, రచయిత, కృతి, పాఠక, కేంద్రిత విమర్శ అనే నాలుగు దృక్పథాలుగా ఆయన విమర్శను వింగడించారు. ఈ దృక్పథాలతోనే ఇంచుమించు అన్ని సాహిత్య ధోరణులను అనువర్తన చేయవచ్చునని తన విమర్శ ద్వారా నిరూపించారు. సమాజ కేంద్రిత విమర్శ దృక్పథంతో మార్క్సిస్టు, స్త్రీ వాద, దళిత సాహిత్యాలను అనువర్తించవచ్చునని అన్నారు. రచయిత కేంద్రిత విమర్శ్హ దృక్పథంతో జీవిత చరిత్ర, మనో విశ్లేషణాలను, కృతి కేంద్రిత విమర్శ దృక్పథంలో ప్రక్రియా, ప్రతీక, రూప శైలిశాస్త్ర విమర్శలు చేరతాయని అన్నారు. నాలుగవది అయిన పాఠక కేంద్రిత విమర్శ దృక్పథంతో ఆ రచన పాఠకుడిపై చూపిన ప్రభావాన్ని అంచనా వేయవచ్చునని విశ్లేషించారు. దీనితో పాటు ప్రాచీన, ఆధునిక ప్రక్రియా విమర్శల గురించి తన అభిప్రాయాన్ని స్ఫష్టంగా చెప్పారు. ప్రాచీన విమర్శ నిర్డేశాత్మకం (Prescriptive) ఆధునిక విమర్శ వర్ణనాత్మకం (Descriptive) గాను విశ్లేషణాత్మకం (Analytical) గాను ఉంటుందన్నారు. ఈ భేదాన్ని తెలుసుకున్నప్పుడు ఆధునిక ప్రక్రియా విమర్శలో నవల, కథా సాహిత్య విమర్శకు ఒక ప్రత్యేకత ఉందని దానికి భారతీయ అలంకార సూత్రాలు సరిపోవని స్పష్టం చేశారు. కల్పనా సాహిత్యం మూలాలన్ని పాశ్చాత్య సాహిత్యంతోనే చూడటం సరైన పద్ధతి అవుతుందని అన్నారు. సృజనాత్మక సాహిత్యానికి అవసరమైన కథ, కథా వస్తువు, కథనం, నేపథ్య చిత్రణ, మనస్తత్వ చిత్రణ, దృష్టి కోణం, కంఠస్వరం (Tone), శైలీశాస్త్రం వంటి వన్నీ పాశ్చాత్య సాహిత్య ప్రభావంతోనే చూడాలి తప్ప, ప్రాచీన ఆలంకారిక లక్షణాలతొ అన్వయించటం సరైనది కాదన్నారు. విమర్శలో కాలానుగుణంగా వచ్చే ప్రమాణాలను సహృదయతో స్వీకరించాలని తద్వారా భారతీయ పాశ్చాత్య విమర్శ సూత్రాలను సమన్వయించుకోవాలనేది ఈయన విమర్శలో కనిపించే సమన్వయ దృక్పథం. భారతీయ అలంకార శాస్త్రాన్ని సాహిత్య సిద్ధాతంగా గుర్తించాలి తప్ప పూర్తిగా సాహిత్య విమర్శగా భావించే వీలు లేదని ఈయన అభిప్రాయం. అంతేగాకుండా ఈ భారతీయ సాహిత్య సిద్ధాంతాలు పాలక వర్గాలను తృప్తి పరిచే పద్దతులలో కొన్ని వర్ణాల, వర్గాల ప్రయోజనమే థ్యేయంగా తయారయ్యాయనేది ఈయన విశ్లేషణ. వీటికి అనుగుణంగానే రసం, అలంకారం, ధ్వని, ఔచిత్యం, వక్రోక్తి, వక్రత, రీతి వంటి సిద్ధాంతాలు తయారయ్యాయి. ఇవి రచనా నిర్మాణాన్నికి ఇచ్చినంత ప్రాధాన్యత వస్తువుకి ఇవ్వలేదు. వస్తువుని అన్ని సామాజిక వర్గాల నుండి తీసుకోవాలనే సామాజిక దృక్పథం కూడా వాటిలో లేదు. ఆనాటి పండిత సభల, రాజాస్థానాల కనుసన్నల లోనే భారతీయ ఆలంకారిక సిద్ధాంతాలన్ని రూపొందాయనేది ఈయన అభిప్రాయం. ఈయన విమర్శలో సాహితీ సిద్ధాంతానికి, సాహిత్య విమర్శకు మధ్య స్పష్టమైన విభజన రేఖ కనిపిస్తుంది. భారతీయ ఆలంకారిక శాస్త్రాన్నంతటినీ మార్క్సిస్టు దృక్పథంతోనే అనుశీలించారు. అయితే, అలంకారశాస్త్రంపై ఈయన చేసిన విశ్లేషణ శాస్త్రీయతకు మార్గాన్ని చూపించే విధంగా ఉంది. ' అలంకారశాస్త్రం విడిగా పద్యాలను తీసుకొని వాటిలోని అలంకారాలను, ధ్వనినీ, వక్రోక్తినీ, శ్లేషనీ, చమత్కారాన్నీ వివరించే కార్యక్రమాన్ని మాత్రమే చేసింది తప్ప, కావ్యాన్ని మొత్తం ఒక యూనిట్ గా గ్రహించి విమర్శించలేదు' అని ఒక విశ్లేషణ చేశారు. ఇది చాలా వరకు సమంజసంగానే కనిపిస్తుంది. అలాగే " ప్రతిభా నవ నవోన్మేషశాలిని అంటూనే, సమకాలీన జీవితాన్ని నిరాదరించి, రచయితల ప్రతిభను బహుముఖాలుగా వికసించడానికి ఆలంకారికులు ప్రతిబంధకంగా నిలిచారు" అని వ్యాఖ్యానించారు. కళ ప్రజల కోసం ఉపయోగపడాలనే మార్క్సిస్టు విమర్శ్హ దృక్పథం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. 
ఈయన తన గ్రంథాలకు 'శిల్పం' అని పేరు పెట్టుకున్నంత మాత్రం చేత కళ కళ కోసం అని భావించే కళావాదిగా కాకుండా కళాత్మకమైన సాహిత్యం ప్రజలకు ఉపయోగపడుతూనే కళా విలువలను కాపాడేదై ఉండాలని ఈయన భావించారు. కనుక, శిల్పం వస్తువుకు ఉపయోగపడాలనేది ఈయన దృక్పథం. ఆధునిక సృజనాత్మక సాహిత్యాలలో నవల, కథలు పేర్కొనదగినవి. వీటి గురించి ఈయన లోతైన విమర్శనా గ్రంథాలనే రాశారు. నవల, కథకు కొన్ని సమాన లక్షణాలు ఉన్నా రెండు భిన్న ప్రక్రియలు అన్నారు. ఒక జీవిత పద్ధతిని లేదా పాత్ర జీవితాన్ని ఒక ప్రాంత ప్రజల జీవిత విధానాన్ని నవల చిత్రిస్తుంది. ఒక పాత్ర మీదనో, ఒక సంఘటన మీదనో, ఒక భావం మీదనో ఆధారపడి కథ చిత్రితమవుతుంది. అలాగే నవలిక, స్కెచ్, గల్పిక మధ్య గల ప్రక్రియా పరమైన తేడాలను కూడా విశ్లేషణాత్మకంగా నిరూపించారు. తెలుగు నవలా కథా రచయితలా రచనలలోని వివిధ అంశాలను వివరించేటప్పుడు అనువర్తిత విమర్శ పద్ధతిని పాటించారు. మార్క్సిస్టు దృక్పథం గల ఈయన సంప్రదాయ సాహితీవేత్తల రచనలలోని విశేష అంశాలను కూడా ప్రశంసించారు. అలాంటి వాటిలో "విశ్వనాథ సత్యనారాయణ గారి వేయి  పడగలు'' నవల మీద చేసిన విమర్శ పేర్కొనదగినది. రావిశాస్త్రి, కాళీపట్నం రామారావు, చాసో, కొడవటిగంటి మదురాత్మకం రాజారావు మొదలగు వారి కథలలో గల వస్తు శిల్పాలను కూలంకషంగా చర్చించారు. అంగాంగ సమన్వయాన్ని సాధించలేక పోయిన కథలను విశ్లేషించి అవి అలా తయారవ్వడానికి రచయితలలో శిల్పదృష్టి లోపించడమేనని వ్యాఖ్యానించారు. ఇక్కడ ఈయనలో వస్స్తుశిల్ప సమన్వయ దృష్టి కనిపిస్తుంది. అలాగే ఉన్నవ, విశ్వనాథ, చలం, రావిశాస్త్రి లకు నాలుగు శైలి సాంప్రదాయాలున్నాయని అన్నారు. ఇది పరిశోధనాత్మక దృష్టితో కూడిన విమర్శ. ఈయన నవలా విమర్శ్హలో ' సంసార వృక్షం'పై చేసిన విమర్శ లోతైన చర్చకు అవకాశం ఇచ్చేటట్లుగా ఉంది. మొత్తం మీద వల్లంపాటి సాహిత్య విమర్శలో గుర్తించదగిన కొన్ని అంశాలున్నాయి. 1) నవల, కథలను విమర్శించటంలో అనువర్తిత విమర్శకు అధిక ప్రాధాన్యత నివ్వటం. 2) విమర్శ సూత్రాలను గుర్తించటం వల్ల, వాటిని యువ విమర్శకులకు, సాహిత్యాన్ని అధ్యయనం చేయాలనుకునే వారికి మార్గ దర్శకంగా సాధారణీకరించి చెప్పటం. 3) సామాజ కేంద్రిత విమర్శ దృక్పథమే అయినా, కళావిలువలకు ప్రాధాన్యతను తగ్గించకపోవటం. 4) భారతీయ, పాశ్చాత సిద్ధాంత, విమర్శలను, వస్తు శిల్ప విషయాలను సమన్వయించటంలో సంయమనం పాటించటం. 5) మార్క్సిస్టు సిద్ధాంతానికి సాహిత్యానికి అన్వయించటంలో వక్రభాష్యాలు లేకుండా, మూల సూత్రాలతో సాహిత్య అనువర్తనం జరగవలసిన అవసరం ఉందనటం. 6) స్థానికత, ప్రాంతీయ సాహిత్య విమర్శకు రాయలసీమలో ఆధునిక సాహిత్యం సామాజిక సాంస్కృతిక విశ్లేషణ అనువర్తన ద్వారా పునర్మూలకనం చేయగలిగే మార్గాన్ని సూచించగలగటం. రాయలసీమ సాహిత్యాన్ని గురించి, వారి గ్రంథాల్లో అక్కడక్కడా కొన్ని వ్యాసాలు రాసిన వల్లంపాటి వాటిని ఒక సిద్ధాంతంగా రాయలసీమలో ఆధునిక సాహిత్యం సామాజిక సాంస్కృతిక విశ్లేషణ గ్రంథంలో పొందుపరిచారు. స్థల, కాలాలను అనుసరించి సాహిత్యాన్ని అర్థం చేసుకునే విధానాన్ని గుర్తించడానికి వీలుగా ఒక నమూనాగా దీన్ని తీసుకొనే అవకాశం ఉంది. 7) సాహిత్యానికి విలువ కట్టడమనేది సాహిత్య, సాహిత్యేతర ప్రమాణాలను గ్రహించటంలోనే పరిపూర్ణత, స్వయం సమగ్రత సాధిస్తుందనటం. దీనికి ఒక విధంగా కట్టమంచి వారి కవిత్వ తత్త్వ విచారం వీరికి ఆదర్శంగా నిలిచిందని భావించే వీలుంది. అయితే, కట్టమంచి రామలింగారెడ్డి ప్రబంధాలను ప్రధాన కేంద్రంగా చేసుకున్నారు. వల్లంపాటి వారు రాయలసీమ రచనలను కేంద్రంగా చేసుకున్నారు. 8) అత్యాధునిక విమర్శ ధోరణులైన నవ్య విమర్శ (New Criticism), నిర్మాణవాదం (Structuralism), ఉత్తరాధునికవాదం (Postmodernism), వంటి వాటిలో కొన్ని స్వీకరించవలసిన అంశాలూ ఉన్నాయనేది గుర్తించాలి. అలాగే, నవ్య చారిత్రకవాదులు (Neo-historists), వినిర్మాణవాదులు (Deconstructionists) లో కొన్ని స్వీకరించవలసిన అంశాలు ప్రతిపాదించినప్పటికీ, సాహిత్య వస్తువుకి, చరిత్రకి, రచయిత్రలకు ఉన్న పరస్పర సంబంధాలను తిరస్కరించి, జీవితం కంటే, వాదాలకే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని ప్రచారం చేస్తారనీ, వీటిని విమర్శకుడు లోతుగా గమనించాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. 9) ఈయన విమర్శ ప్రాపంచిక దృక్పథం మీద ఆధారపడి ఉంటుంది. ప్రాపంచిక దృక్పథంలో ఇంద్రియ వాస్తవాలకే ప్రాధాన్యత ఉంటుంది. అతీంద్రియ శక్తులకు, లేదా ప్రభావాలకు దూరంగా ఉండి, భౌతిక సత్యాలకు ప్రాధాన్యత నివ్వటమనేది ముఖ్యమవుతుంది. 10) Aesthetic distance పట్ల రచయిత అప్రమత్రుడై ఉండాలన్నారు. రచన చేయడం ద్వారా రచయితకీ, కథకుడికి (నేరేటర్) మధ్య, రచయితకు కథా వస్తువుకీ మధ్య, రచయితకీ పాత్రలకు మధ్య తగు మాత్రంలోనే ఈ Aesthetic distance ఉండాలి. ఇది పాఠకునికి క్రియాత్మక ఊహాశక్తిని పట్టించ్చేదిగా ఉండాలి. ఈ దూరం ఎక్కువైనా, తక్కువైనా రచన కళగా రూపొందదు. 11) కల్పనా సాహిత్య సిద్ధాంతాన్ని అధ్యయనం చేయడానికి పాశ్చాత్య విమర్శను ఆశ్రయించక తప్పదు. 12) వల్లంపాటి వారి సాహిత్య విమర్శ ప్రాచ్య, పాశ్చాత్య సాహిత్య శాస్త్రాలను అనుసరించి సమన్వయించేలా చేస్తుంది. 13) భారతీయ సాహిత్య సిద్ధాంతాల్లో మౌలికంగా కొన్ని విలువైన సిద్ధాంతాలు ఉన్నాయని చెప్తున్నప్పటికీ, పాఠకుడికి భారతీయేతర సాహిత్య శాస్త్రకారులపైనే ఆసక్తి పుట్టుకొస్తుంది. దీన్ని భారతీయ సాహిత్య సిద్ధాంతాలను, విమర్శను తక్కువ చేసే ఆసక్తిగా కాకుండా, ఙ్ఞానపరిధిని పెంచుకోవలసిన అవసరాన్ని తెలిపేదిగా గుర్తించాలి. 14) ప్లాటో, అరిస్టాటిల్ వంటి వాళ్ళు సాహిత్యం, కళల గురించి చెప్పిన విషయాలు లోతైన ఆలోచనతోనే చెప్పారనే అభిప్రాయం వీరి విమర్శ కలిగించ గలుగుతుంది. 15) అత్యాధునిక సాహిత్య విమర్శ మార్గంలో కొన్ని ధోరణులు ఉన్నా, అవి మార్క్సిజానికి వ్యతిరేకంగా, పెట్టుబడిదారీ సమాజ ఆధిపత్య భావజాలంగా స్పష్టం చేసిన విశ్లేషణ వీరి నిబద్ధతకు, పాండిత్యానికీ నిదర్శనంగా నిలుస్తుంది. సాహిత్య విమర్శకు సాహిత్యేతర ప్రమాణాలు అవసరమని భావించే వారిలో మార్క్సిస్టు విమర్శకులు ప్రముఖంగా కనిపిస్తారు. Inter Disciplinary Method లో సాహిత్య విలువలను నిర్ణయించాలని నమ్ముతారు . సామాజిక శాస్త్రాలను అవసరమైనంత మేరకు ఉపయోగించుకుంటారు. సమాజశాస్త్రం, చరిత్ర, రాజనీతి శాస్త్ర విభాగాలు, తత్త్వశాస్త్ర, మనో విఙ్ఞాన శాస్త్రాల సమన్వయం సాహిత్య విలువల నిర్ణయంలో అవసరమని భావిస్తుంటారు. త్రిపురనేని మధుసూధనరావు, కె.వి.ఆర్., కేతు విశ్వనాథ రెడ్డి, రాచపాళెం చంద్రశేఖర రెడ్డి వంటి వాళ్ళు సాహిత్య విలువల నిర్ణయానికి, సాహిత్యేతర శాస్త్రాల ప్రభావాన్ని చూడాలని భావించారు. ప్రాపంచిక దృక్పథం గురించి వల్లంపాటి లాగానే విస్తృతంగానే ప్రచారం చేశారు. ఈ దృక్పథ ప్రభావం వల్లంపాటి విమర్శలో బలంగా ఉంది. ఇంకా తెలుగు సాహిత్య విమర్శకు అనేక నూతన ఆలోచనలను అందించిన విమర్శకుడుగా వల్లంపాటి వెంకటసుబ్బయ్య గారిని చెప్పుకోవచ్చు.
(ఈవ్యాసం సోమవారం విశాలాంధ్ర (29-12-2008) సాహిత్యానుబంధంలో ప్రచురితమైంది. ఇది సంక్షిప్తం చేసి పత్రికకు పంపిన వ్యాసం. పూర్తి పరిశోధన వ్యాసం " ఆధునిక సాహిత్య విమర్శకులు -ప్రస్థానాలు (2008)" గ్రంథం పుటలు: 234-253 లో ప్రచురణ పొందింది. )

2 comments:

Afsar said...

darla:

It's a very sensible and thought-provoking assessment of Vallampati. Thanks for giving the opportunity to read this.

afsar

vrdarla said...

Dear Afsar garu,
namaste,
thank you for your comment.
yours
Darla