"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL-502: Techniques of writing a Dissertation క్లాసులు సోమ, మంగళ, గురు, శుక్రవారం మధ్యాహ్నం 12.00 గంటల నుండి 1.00 వరకు డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ భవనంలో జరుగుతాయి.

12 జులై, 2009

పంచమం నవలలో దళిత ఉద్యమం

పంచమం నవల గురించి మాట్లాడుతున్న డా. దార్ల వెంకటేశ్వరరావు

-డా//దార్ల వెంకటేశ్వరరావు

Lecturer,Department of Telugu,

Univerisity of Hyderabad

Hyderabad-500 046


తెలుగు సాహిత్యంలో కుల అస్తిత్త్వ ఉద్యమాల నేపథ్యంతో దళిత ఉద్యమం, దాన్ని ఆధారంగా చేసుకొని సాహిత్యం విస్తృతంగానే వచ్చింది. అది అనేక ప్రక్రియలుగా విస్తరించింది. నవలా ప్రక్రియలోనూ తన దైన ప్రత్యేకతను చాటుకుంది. 1872 లో వచ్చిన నరహరి గోపాలకృష్ణమ శెట్టి రచించిన శ్రీరంగరాజ చరిత్రము ( సోనాబాయి పరిణయము), 1878లో పుస్తకరూపంలో వచ్చిన కందుకూరి వీరేశలింగం రచించిన శ్రీ రాజశేఖర చరిత్రము ( వివేక చంద్రిక) నవలల్లో కూడా కుల ప్రస్తావన కనిపిస్తుంది. వీటిలో ఒక దాన్ని తొలి తెలుగు నవల అని సాహితీ వేత్తలు గుర్తిస్తున్నారు. దీన్ని బట్టి తొలి తెలుగు నవలలోనూ కుల సమస్య చిత్రితమైంది. అయితే అది అస్పృశ్యత రూపంలో కనిపించింది.

”తెలుగులో సాంఘిక నవలగా భావించబడుతున్న కందుకూరి వీరేశలింగం గారి ‘రాజశేఖర చరిత్రము (1878 )’ లో కథా నాయకుడు అస్పృశ్యుడు ఇచ్చిన నీళ్ళు తాగడానికి ఇష్టపడడు. కానీ, నరహరి గోపాలకృష్టమ శెట్టి రాసిన ‘సోనాబాయీ పరిణయం’ పేరు గల ‘ శ్రీ రంగ రాజ చరిత్రము’ (1872) లో ఒక గిరిజన కుటుంబం లో పెరిగన క్షత్రియ యువతి కథ కనిపిస్తుంది. తొలిసారిగా మాల - మాదిగల సమస్యలను సానుభూతితో వర్ణించిన నవల తల్లాప్రగడ సూర్యనారాయణగారి హేలావతి (1910). ఆ తర్వాత మాల - మాదిగల గురించి రాసిన నవలలు చాలా వచ్చాయి. వాటిలో వేంకట పార్వతీశ్వర కవుల ' మాతృమందిరం ( 1918 ); ఉన్నవ లక్ష్మీ నారాయణ ' మాలపల్లి ( 1921 - 22 ) వేలూరి శివరామ శాస్త్రి ' ఓబయ్య (1920); రంగనాయకమ్మ ' బలిపీఠం (1962) ముఖ్యమైనవి. ఇంకా నైమిశారణ్యం, రథచక్రాలు, కొ్ల్లాయిగట్టితేనేమి, ఓనమాలు మొదలైన నవలల్లోనూ మాల - మాదిగల పట్ల సానుభూతి కనిపిస్తుంది. అక్కినేని కుటుంబరావు సొరాజ్జెం ( 1981 ); ఓల్గా ఆకాశంలో సగం ( 1990); నవలలో మార్క్సిస్ట్ దృక్పథంతో కూడిన మాల - మాదిగల జీవితం కనిపిస్తుంది.
తెలుగులో 1980 తర్వాత మాత్రమే చైతన్యవంతమైన మాల - మాదిగల గురించి రాసిన నవలలు కనిపిస్తాయి. స్పార్టకస్ కలం పేరుతో జి. రామమోహన్‌రావు ' ఖాకీ బతుకులు ( 1980 - 82 ); బోయి జంగయ్య “జాతర” ( 1997 ), సదానంద శారద ' మంచి నీళ్ళ బావి ( 1992 ); కాలువ మల్లయ్య గద్దలాడు తండాయి ( 1996 ), నీ బాంచెన్‌కాల్మొక్తా ( 1987 ), సాంబయ్య చదువు, బతుకు పుస్తకం ; చిలుకూరి దేవపుత్ర ' పంచమం ( 1998 ); సన్నపురడ్డి వెంకటరామిరెడ్డి’ కాడి ( 1998); పి. నాసరయ్య ‘మాదిగ పల్లె ( 1998); జి. కళ్యాణరావు’ అంటరాని వసంతం ( 2000); వేముల ఎల్లయ్య ‘కక్క (2000), సిద్ధి ( 2006); పినాక పాణి ‘నిప్పులవాగు ( 2001 ); గోపరాజు నాగే్శ్వరరావు ‘దండెం మీద చిలుకలు ( 2001 ); “మరోమార్పు” (2002 ); కేశవరెడ్డి ‘రావుడుండాడు రాజ్జెముండాది ; శాంతి నారాయణ ‘పెన్నేటి మలుపులు మొదలైన నవలలో మాల - మాదిగల జీవితం చైతన్యవంతంగా కనిపిస్తుంది. అయితే వీటిలో కక్క, సిద్ధి, మాదిగ పల్లె నవలల్లో మాదిగ జీవితం, సంస్కృతి ఎక్కువగా ప్రతిఫలించాయి.” (దార్ల వెంకటేశ్వరరావు: తెలుగు సాహిత్యం - మాదిగ జీవిత ప్రతిఫలనం , 2008-42,43). అలా వచ్చిన దళిత నవలల్లో పంచమం ఒకటి . దీన్ని చిలుకూరి దేవపుత్ర రాశారు. ఇది అమెరికన్ తెలుగు అసోసియేషన్ ( ఆటా) 1998 లో నిర్వహించిన నవలల పోటీల్లో బహుమతి పొందింది. ఈ నవలను పోటీల కోసం రాశారా? రాసిన దాన్ని పోటీకి పంపారా? అనే విషయాన్ని పక్కకు పెట్టి దీనిలో ప్రతిఫలించిన దళిత ఉద్యమాన్ని విశ్లేషించే ప్రయత్నం చేస్తాను. ఈ నవల గురించి చర్చించే ముందు కొంత మంది విమర్శకుల అంచెనాలనైనా గమనించడం అవసరం అనుకుంటున్నాను.





ఈ నవలపై సమీక్ష వ్యాసాన్ని రాస్తూ ఎన్. వేణుగోపాల్ ఇలా అన్నారు. “ నూట ఇరవైఏళ్ళ తెలుగు నవలా చరిత్రలో వస్తు వైవిధ్యంలో, సంక్లిష్ట సామాజిక సంచలనాలకు అద్దం పట్టడంలో, వ్యక్తి జీవితానికీ సమాజ జీవితానికీ మధ్య ఉన్న సంబంధాన్న సరిగ్గా వ్యక్తీకరించడంలో పంచమం అగ్రస్థానంలో నిలుస్తుంది.
“ నిజానికి పంచమం నవల ఇతివృత్తం గా దేవపుత్ర ఎంచుకున్న వస్తువు చాలా మామూలుగా కనిపిస్తుంది. ఒక దళిత యువకుడి జీవితంలో ఇంటర్మీడియెట్ రిజల్ట్స్ వచ్చినప్పటి నుంచి అతను ఎ.పి.పి.ఎస్.సి. గ్రూప్ వన్ పరీక్ష పాసై ఆర్.డి.వో. అయి తన గ్రామానికీ, తన కులం లాంటి అణగారిన కులాలకీ మేలు చేయాలనుకుని భూస్వాముల కుట్రల్లో ఉద్యోగం పోగొట్టుకునే దాకా కథ సాగుతుంది. సరిగ్గా దీనికి సమాంతరంగా నవలా ప్రారంభంలో భూస్వాముల నుంచి స్వాధీనం చేసుకున్న మిగులు భూమిని పంపిణీ చేస్తామనే ప్రకటన నుంచి ముగింపులో ఆ భూమిని వెనక్కి తీసుకుని భూస్వామికి అప్పజెపుతున్నామనే ప్రకటన దాకా సాగుతుంది కథ.
“ ఈ రెండు సమాంతర ప్రారంభాలకీ, ముగింపులకూ మధ్య 1990 ల తొలి రోజుల నుంచి అయిదారేళ్ళ పాటు తెలుగు సీమ లో జరిగిన ఘటనలన్నింటి ప్రతిఫలనాలూ ఉంటాయి
.
( ఎన్. వేణుగోపాల్, సమగ్ర దృష్టే పంచమం స్వరం బలం, (వ్యాసం) ఆంధ్రప్రభ,15-5-2000)
వేణుగోపాల్ గారి అభిప్రాయాల ప్రకారం ఇది ఆంధ్రప్రదేశ్ లో జరిగిన దళిత ఉద్యమాన్ని ప్రతిఫలించిన నవల. అది కూడా 1990 ల తర్వాత వచ్చిన తెలుగు దళిత ఉద్యమాలను గుర్తించే దిశగా సాగిందని అర్థమవుతుంది. అంటే, 1985 జూలై 16న జరిగిన కారంచేడులో మాదిగలపై జరిగిన హత్యాకాండను ఈ నవల ప్రతిఫలించడం లేదని ఆ అభిప్రాయాన్ని బట్టి స్పష్టమవుతుంది.
కారంచేడు సంఘటన తొలి నాటి పరిస్థితులను పంచమం నవల వర్ణించకపోయినా, ఆ సంఘటనతో దళితమహాసభ ఏర్పడటం, దానిపై దళితులు జిల్లా, రాష్ట్ర కోర్టుల చుట్టూ తిరగడంలో మాదిగలనే కాకుండా యావత్తు దళితులను సాధ్యమైనంత ఐక్య ఉద్యమంగా చేయగలిగింది. అది చుండూరు దళిత హత్యాకాండ నాటికి బలమైన దళిత ఉద్యమంగా మారింది. చుండూరు సంఘటన 1991 ఆగష్టు 6 వ తేదీన జరిగింది. కారంచేడులో మాదిగలపైనా, చుండూరులో మాలలపైనా మారణకాండ జరిగింది. రెండు సంఘటనల్లోనూ హత్యకావింపబడిన వాళ్ళు మాదిగలా? మాలలా? అని చూడకుండా తామంతా దళితులుగానే భావించి, ఉమ్మడిగానే దళితులు తమ పోరాటాలను సాగించారు. వీటిని నవలలో ప్రత్యక్షంగా కాకపోయినా, పరోక్షంగా సూచించారు.
హైదరాబాదు బుక్ ట్రష్ట్ వాళ్ళు 2009 లో ముద్రించిన పంచమం నవలలో వేణుగోపాల్ గారి వ్యాసాన్ని ప్రచురించారు. మొదటి ముద్రణను బహుమతి ఇచ్చిన ఆటా వాళ్ళే 1998 లోనే ప్రచురించారు. హైదరాబాదు బుక్ ట్రష్ట్ వాళ్ళు ప్రచురించిన నవలలో రచయిత “ మీతో కాసేపు..” అంటూ తన అంగీకారాన్ని కూడా తెలిపారు. అంటే రచయితా, ముద్రణా సంస్థ వాళ్ళూ కూడా ఈ నవల 1990 తర్వాత వచ్చిన దళిత ఉద్యమాన్ని చిత్రించిన నవలగానే అంగీకరిస్తున్నట్లుగానే భావించాలా? అలా అయితే, ముఖచిత్రంపై “ ఉద్యమాల నేపథ్యంలో తొలి దళిత నవల “ అని ప్రకటించుకోవడం సరైందే అవుతుందా? ఆలోచించవలసిందే!
ఆచార్య రాచపాళెం చంద్ర శేఖర రెడ్డి, డా//కె, లక్ష్మీనారాయణ గార్ల సంకలనం, సంపాదకత్వంలో ”1980 తర్వాత తెలుగు దళిత నవల” పేరుతో వచ్చిన వ్యాససంకలనం (2003) లో కూడా “ పాతికేళ్ళ దళిత జీవిత దృశ్యం” పేరుతో పంచమం నవలపై డా// కె.లక్ష్మీనారాయణ రాసిన వ్యాసం ( పుటలు : 47-54) ఉంది. ఇంకా దీనిపై ముందుమాటలో సంపాదకుల వ్యాఖ్యలు కూడా ఉన్నాయి. ఈ పుస్తకానికి “నేపథ్యం” పేరుతో రాసిన సంపాదకీయంలో ఈ నవల గురించి రాస్తూ…”ఇది 1975- 1998 వరకూ ఆంధ్రప్రదేశ్ లో దళిత ఉద్యమాల చారిత్రక నేపథ్యంగా వచ్చిన నవల. గత శతాబ్ది ఎనిమిదో దశకానికి ముందట భూ సంస్కరణలు మొదలుకొని కొత్త ఉత్పత్తి సంబంధాలు, చుండూరు, కారంచేడు సంఘటనలు, నక్సలిజం విజృంభణ, దళిత యువత ఉద్యమించడం, దళితులు సంపన్న వర్గాలుగా కుల వివక్షకు గురై, అగ్ర వర్ణాల చేతుల్లో కీలుబొమ్మలు కావడం, దండోరా, మాల మహానాడు, రిజర్వేషన్ల వర్గీకరణ లాంటి రెండు దశాబ్దాల చారిత్రక సంఘటనలను రికార్డు చేసిన నవల” అని అంచెనా వేశారు.
డా// కె.లక్ష్మీనారాయణ రాసిన వ్యాసంలోనే ఇంకా ఇలా వ్యాఖ్యానించారు. “ పంచమం దళిత ఉద్యమ ప్రభావంతో వచ్చిన నవల. చిలుకూరి దేవపుత్ర తన ఉద్యోగ జీవితంలో చవిచూసిన యధార్థ సంఘటనకు, తన ఉద్యోగం చేస్తున్న రెవెన్యూ వ్యవస్థలోని అధికారుల లంచగొండితనాన్ని, నడుస్తున్న దళిత ఉద్యమాలనూ జోడించి రాసిన నవల ఇది. ….
“ఆంధ్ర దేశంలో ప్రభుత్వం భూసంస్కరణలను ప్రవేశపెట్టడం, గ్రామాలలో మిగులు భూములు పంపిణీ, దళితులు, వెనుకబడిన తరగతుల వారు భూములు పొందడం, గ్రామాల్లో భూస్వాములు తమ భూములను అధికార పలుకుబడితో రీకన్వే చేయించుకోవడం, రెవెన్యూ శాఖ అవినీతి, కొత్త ఉత్పత్తి సంబంధాలు, దళితులు భూస్వాముల మధ్య అంతరాలు, భూస్వాముల దౌర్జన్యాలు, లైంగిక వేధింపులు కారంచేడు, చుండూరు లాంటి సంఘటనలు, దళిత యువత ఉద్యమించడం, నక్సలిజం విజృంభణ, 1989 శాసన సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, కోనేరు రంగారావు ఉపముఖ్యమంత్రి కావడం, దళితులు ఉన్నత పదవుల్లో ఎన్నిక కావడం, సవర్ణుల చేతుల్లో కీలు బొమ్మ కావడం, సంపన్నవర్గంలో చేరిపోవడం, డా.బి,ఆర్,అంబేద్కర్, బాబూ జగజ్జీవన్ రామ్ ల జయంతులు వర్థంతులు జరపడం, రాష్ట్రంలో బహుజన సమాజ్ వాది పార్టీ ఎన్నికల్లో దిగడం ఓటమి చెందడం, పౌరహక్కుల సంఘాలు , సమకాలీన ఉద్యమాలు బలోపేతం కావడం, చలపతి విజయవర్థనరావుల ఉరిశిక్ష కేసు, భారతీయ జనతా పార్టీ బలపడటం, దండోరా, మాల మహానాడులు ఏర్పడడం, లాకప్ మరణాలు వంటి రెండున్నర దశాభ్దాల సంఘటనల నేపథ్యంగా
” ఈ నవల నడిచిందని కూడా లోతుగా విశ్లేషించారు.
ఈ అభిప్రాయాల్లోని ఒక అభిప్రాయాన్ని ఇంచుమించు యథా తధంగా తీసుకొని కూడా, అనేక మందికి చెప్పిన కృతఙ్ఞతల్లో నైనా ఎక్కడా ఆ విషయాన్ని పేర్కొనక పోవడం గమనించవలసి ఉంది. పోనీ, ఈ అభిప్రాయం, రచయిత లేదా ప్రచురణ కర్తలో రాశారని అనుకుందాం. ఈనవలపై వచ్చిన అన్ని సమీక్షలు లేదా వ్యాసాలను, పరిశోధనలను రచయిత గానీ, దాన్ని మరలా మరలా ప్రచురించే ప్రచురణ కర్తలు గానీ చూడాలనేమీ లేదుకదా! అని కూడా కాసేపు అనుకుందాం. అలాంటప్పుడు పంచమం నవల కంటే ముందు దళిత సమస్యలను, ఉద్యమాలను వర్ణిస్తూ అనేక నవలలు వచ్చాయి. వాటి గురించి కూడా రచయిత, ప్రచురణ కర్తలకు తెలియదని అనుకోగలమా? మరి తెలిసి కూడా పంచమం నవల ముఖచిత్రం పై రాసుకున్న ప్రకటన సమంజసమైనది అవుతుందా? పోనీ ఆ ప్రకటనను సమర్థస్తూ ఎక్కడైనా ఆ పుస్తకంలో గానీ, తర్వాత గానీ ఒక వ్యాసమైనా రాశారా? ఒక వేళ నిజంగా వేణుగోపాల్ గారి అభిప్రాయాన్నే స్థిరీకరించుకున్నా, 1990 తర్వాత సంఘటనలను వర్ణించినట్లైతే “ఉద్యమాల నేపథ్యంలో తొలి దళిత నవల” ఎలా అవుతుంది?
అంతేకాకుండా రచయిత తన ముందుమాటలో ఈ నవల రాయడానికి గల నేపథ్యాన్ని చెప్పుకున్నారు. పంచమం నవల రాయడానికి చిన్న సంఘటన మాత్రమే ప్రేరణ అని రాసుకున్నారు. రచయిత ఉద్యోగ రీత్యా మండల రెవెన్యూ ఇన్సెక్టర్ గా పని చేశారు.అప్పుడు ఒక సంఘటన జరిగింది. ల్యాండ్ సీలింగ్ కింది ప్రభుత్వం తీసుకుని దళితులకు, వెనుకబడిన తరగతుల వాళ్లకు పంచుతుంది. తర్వాత భూమి కోల్పోయిన భూస్వామి తన పలుకు బడితో తన భూమిని తనకు వచ్చేటట్లు రీకన్వే చేయించుకొంటాడు. ఆ సందర్భంలో వచ్చినట్లే వచ్చిన భూమి ని మళ్ళీ ప్రభుత్వం స్వాధీనం చేసుకొని, అసలు యజమానికి ఇచ్చేయాలని దండోరా వేయిస్తుంది. అలా దండోరా వేసే వ్యక్తి కి కూడా ఆ భూమిని కోల్పోవలసి వస్తుంది, అది తాను నిజంగా చూసిన, చలించి పోయిన సంఘటనగా రచయిత చెప్పారు. అలా వచ్చినట్లే వచ్చిన భూమి, తానెంతో పంట పండించుకోవాలనీ, తానూ ఎంతో కొంత భూమికి యజమానిని అయ్యానని ఆశ పడి , ఆ బంజరునంతా బాగు చేసి, విడదీయరాని అనుబంధాన్ని పెనవేసుకున్న వెట్టి వాని దుఃఖం, మానసిక స్థితికి కదిలిపోయి ఈ నవలను రాశానని చెప్పుకున్నారు.
వీటన్నింటినీ పరిశీలించినప్పుడు, ఈ నవలలో దళిత ఉద్యమానికి సంబంధించిన అనేక కోణాలు ఉన్నాయి. మాదిగ యువకుడిని ఈడిగ పద్మ ఇష్టపడి పెళ్ళి చేసుకోమని చేప్పినా, అది అంత సులువుగా జరగదని చెప్తాడు. అయినా మనసు పొరల్లో ఆమె పై ప్రేమ ఉంటుంది. అలాగే బ్రాహ్మణ యువతి , తెలివైనదీ, కలివిడి గలదీ, కుల పట్టింపులు లేని విద్య పట్ల కూడా కాస్తంత మనసు పారేసుకున్న పరిస్థితి కూడా ఉంది. అయినా, సమాజంలో ఒక మాదిగ యువకుడికి కావలసిన అత్యంత ముఖ్యమైనది ఉద్యోగంగానే భావించాడు. ఆర్.డి.ఓ అయ్యాడు. కానీ, పరిస్ఠితులు సహకరించేలా లేవు. మరొక వైపు మాల వర్గానికి చెందిన సురేష్ స్వచ్చంద సంస్థలో పనిచేస్తూనే గ్రామంలోని దళితులను చైతన్యవంతం చేయడానికి ప్రయత్నించాడు, వివక్షను తాను పనిచేస్తున్న సంస్థలో ఉన్నా సహించలేని వ్యక్తిత్తం గల వానిగా సురేష్ కనిపిస్తాడు. చివరికి తిరుగుబాటు ద్వారానే తాను అనుకున్నది సాధించవచ్చని రహస్యోధ్యమంలోకి వెళ్ళిపోతాడు.
వెనుకబడిన తరగతుల్లో చాకలి ఓబన్న, ఒక గ్రామ పెత్తందారీ కమ్మ కులస్థుల అమ్మాయి రుక్మిణి ని ప్రేమించి దొంగ చాటుగా పెళ్ళిచేసుకుంటారు. ఆ ఊరు విడిచి పారిపోతారు. అది తెలిసి అమ్మాయి తరపువాళ్ళు అమ్మాయికి ఏమాత్రం హాని జరగకుండానే, ఆ అబ్బాయిని హత్య చేయిస్తారు.
చాకలి ఓబన్న హత్య గురించి రెడ్డి కులస్థుడైన పురుషోత్తం హక్కుల సమితి వాళ్ళతో కలిసి పోరాడి కేసు కట్టించి, శవాన్ని రప్పించి, పోలీసుల చేత కేసు రాయించగలుగుతాడు. కానీ, హత్యకు మూల కారమైన వాళ్ళు కాకుండా , సాధనంగా ఉపయోగపడిన వాళ్ళని తమ పలుకుబడితొ దానిలో ఇరికిస్తారు,
చివరికి మాదిగ యువకుడు ఉన్నత చదువులు చదివి తన విధులు సక్రమంగా నిర్వహించాలని ప్రయత్నించినా, గ్రామ పెత్తందార్లు అడ్డంకులు కలిగించడమే కాకుండా అక్రమంగా అవినీతి కేసులో ఇరికించి ఉద్యోగం లో ఉండకుండా సస్పెండ్ చేయిస్తారు.
ఒక వైపు దళితులు రాజ్యాంగం ద్వారా వచ్చిన హక్కులను పొందుతూ ఉన్నత చదువులు చదివి ఉద్యోగాలు సాధించినా, భూమి, రాజకీయాధికారం లేకపోవడంతో ఆ ఉద్యోగాలు కూడా చేయలేని పరిస్థితి కనిపిస్తుందని ప్రజాస్వామ్యంలో కనిపించని ఒక వర్గ స్వభావాన్ని గుర్తించవలసి ఉందని చెప్తాడు రచయిత,
నవలలో సమకాలీన దళితుల పీడనలో బ్రాహ్మణలు సహృదయంతోనే మెలుగుతున్న స్థితిని కృష్ణ శాస్త్రి, విద్య, వాళ్ళ కుటుంబంలో శివయ్యకు గల సంబంధాల ద్వారా రచయిత సూచనామాత్రంగా చెప్పగలిగారు.
దళితులను పీడించే కుల, వర్గ స్వభావాల్లో వచ్చిన మార్పులు ఈ నవలలో వాస్తవిక దృష్టితోనే పట్టుకోగలిగారు. కారంచేడు, చుండూరు తదితర సంఘటనలకు కారకులెవరో, ఏకులస్థులో గుర్తించవలసి ఉంది. ప్రతి దానీకీ బ్రాహ్మణులనే లక్ష్యం చేసి బ్రాహ్మణత్వ వంటి పదాలను ప్రయోగించేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవలసిన అవసరాన్ని ఈ నవల తెలియ చెప్తుంది. మాల- మాదిగల వర్గీకరణ సమస్యను కూడా చర్చించింది,
దళిత ఉద్యమం కేవలం ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే రాలేదు. అది మొత్తం భారత దేశ వ్యాప్తంగా కనిపిస్తుంది. అది ఒక్కసారిగా కూడా ఎగిసిపడిరాలేదు. అస్పృశ్యత, అణచివేత, వాటిని తరతరాలుగా అనుభవిస్తున్న కులాల వారి నిరసనలు, తిరుగుబాట్ల బాటలో తమనీ మానవులుగా గుర్తించమని కోరే చారిత్రక సందర్భాలన్నీ దళిత ఉద్యమ ప్రారంభాన్నే తెలుపుతున్నాయి. కానీ, ఒక చారిత్రక క్రమంలో చూసినప్పుడు మాత్రం భారతదేశంలో బ్రిటీషు వాళ్ళు ప్రవేశించిన తర్వాత దశ, మతాంతరీకరణ దశగా, ఈ రెండింటి కంటే ముందు దశ, తర్వాత స్వాత్రంత్ర్యానంతరం ఏక కాలంలో సాగిన గాంధీ సంస్కరణోద్యమ, అంబేద్కర్ కులనిర్మూలన దశలుగా దళిత ఉద్యమం వివిధ పరిణామాల్లో కనిపిస్తుంది. దీని తర్వాత వచ్చిన ఆత్మగౌరవ పోరాటాలు, కుల అస్తిత్త్వ ఉద్యమాలుగా దళిత ఉద్యమం వికాసం చెందింది. అందుకనే సామాజిక ఉద్యమాల పై పరిశోధన చేసిన వాళ్ళు దళిత ఉద్యమ చరిత్రను పరిగణనలోకి తీసుకొనేటప్పుడు ఇవన్నీ దృష్టిలో పెట్టుకోవాలని అంటున్నారు. ఈ నేపథ్యంతో చిలుకూరి దేవపుత్ర పంచమం నవలను చూసినప్పుడు తారీఖులు స్పష్టంగా కనిపించకపోయినా, భారతదేశంలో జరిగిన అనేక దళిత ఉద్యమ రూపాలను కూడా ప్రతిఫలించిందని చెప్పవచ్చు.
మొత్తం మీద సమకాలీన దళిత ఉద్యమాన్ని వాస్తవిక దృష్టితో విశ్లేషించింది. దళిత ఉద్యమాన్ని వర్ణించిన నవలగా చెప్పుకోవడంలో ఎలాంటి ఇబ్బందీ ఉండదు, కానీ తొలి దళిత ఉద్యమ నవల అనడం సమంజసం కాదని దళిత నవలలను పరిశీలించిన వారికి తెలుస్తుంది.

ఆధార గ్రంథాలు:
చంద్రశేఖరరెడ్డి, రాచపాళెం, కె.లక్ష్మీనారాయణ, (సంపాదకులు), 1980 తర్వాత తెలుగు దళిత నవల, రమా పబ్లికేషన్స్, అనంతపురం, 2003.
వేణుగోపాల్, ఎన్. సమగ్ర దృష్టే పంచమం స్వరం బలం, (వ్యాసం) ఆంధ్రప్రభ,15-5-2000), పంచమం నవల పునర్ముద్రణ ( 2009) నుండి స్వీకరణ.
వెంకటేశ్వరరావు, దార్ల, తెలుగు సాహిత్యం - మాదిగ జీవిత ప్రతిఫలనం ( వ్యాసం), తెలుగు వైఙ్ఞానిక త్రైమాసిక పత్రిక, సంపుటి: 37, సంచిక: 4, అక్టోబర్ – డిసెంబర్ 2008, పుటలు: 32-46. తెలుగు అకాడమి, హైదరాబాదు,

Abraham,C.E.,The Rise and Growth of Christianity in India, The Cultural Heritage of India, Culcutta, 1956.
Ambedkar B.R. Annihilation of Caste, Vol.I ( ed) Govt. of Maharashtra, Bombay, 1979.
Ambedkar B.R. The Untouchables, Vol.7, Govt. of Maharashtra, Bombay,1990.

Agrawal,C.B. The Harijans in Rebellion,Taraporwala,Bombay, 1934.
Krishnasagar, R.K. The Movement in India and Its Leaders(1857-1956), MD Publications PVT Limited, New Delhi, 1994.
Shah, Ghanashyam , Social Movements in India, Sage Publications, New Delhi, 1990.
Singh.T.R. The Madiga,Department of Anthropology, University of Lucknow, Lucknow, 1969.
( ఈ వ్యాసం విశాలాంధ్ర సాహిత్యానుబంధం లో ప్రచురితమైంది.)

3 కామెంట్‌లు:

R BALIREDDY చెప్పారు...

sir manchi parishodanatmaka vyasam andincharu. alage paleru natakam, kotthagabbilamlalu sambandinchina vyasalu unte dayachesi post cheyamani prardisthunnanu.

Unknown చెప్పారు...

ఏ కమ్మకుల స్త్రీ మాదిగవాడిని ప్రేమిస్తుంది? ఒక కులంవాళ్ళని నిందించటానికి ఒక కులంవాళ్ళని మెప్పు చేయటానికి రాసిన కధలాగుంది. కుల పక్షపాతం వుండవచ్చునేమోగాని ఏ కులాన్ని ద్వేషించరాదు. కులాలు పోతే రిజర్వేక్షన్లు కూడా పోతాయికదా, అటు రిజర్వేక్షన్లూ కావాలంటారు, ఇటు కులాలు పోవాలీ అంటారు. దళితవాదుల ద్వందప్రమాణాలు.

Sampath. moluguri చెప్పారు...

గ్రేట్ నవల