"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., Ph.D., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL 801 Research Methodology ఉదయం11.00 నుండి12.00 గంటల వరకు, TL-426: Indian Literature క్లాసులు మధ్యాహ్నం 2.00 గంటల నుండి 3.00 గంటల వరకు జరుగుతాయి.

దార్లమాట శతకం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
దార్లమాట శతకం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

30 మార్చి, 2026

దార్ల మాట తేటగీతి శతకం ముందుమాట గోవర్థన్

 సహృదయ స్పందన 


    ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు గారు  వ్రాసిన తన శతకాన్ని పరిశీలించండి అని  పిడిఎఫ్  పంపించడం నాపై చూపిస్తున్న అభిమానానికి నిదర్శనం. 

     వీరువ్రాసిన తేటగీతి పద్యాలను దార్ల మాట శతకముగా సమాజానికి అందించ దలచి.ఈ పద్యాలను ఒకసారి పరిశీలించాలని సూచించడం నేనొక అదృష్టం గా భావించాను. 

     ఈ విధంగా భావించడానికి కారణం  లేకపోలేదు.  ఏకవియైనా కవితలు,లేదా పద్యాలను వ్రాసేక్రమమంలో సహజంగా దొర్లే చిన్న చిన్న దోషాలను అంతగా గమనించరు. వచన కవిత్వానికి పద్యం మాదిరి సూత్రాలు, యతి ప్రాసలు ఉండవు కాబట్టి పెద్దగా ఇబ్బందేమీ ఉండదు.పద్యంలో మాత్రం నియమాలను తప్పకుండా పాటించి తీరాలి.

         నేను పద్యరచన పై ఉన్న కుతూహలం తో ప్రతిరోజూ వీలైనప్పుడల్లా కనీసం ఒకపద్యమైనా వ్రాయ కుండా ఉండలేననే విషయం అతిశయోక్తి ఏమాత్రం కాదు. పద్య రచన చేస్తున్నప్పుడు ఊహాలోకంలో తేలియాడుతూ భావంపై దృష్టి పెట్టడం వలన కొన్ని సందర్భాల్లో యతి,ప్రాస గణాలను అంతగా గమనించకుండా పద్యం ముందుకు కదులుతుంది. ఈవిషయం పద్యకవులకు అనుభవైకవేద్యమే. ఆచార్య దార్ల వారు వ్రాసిన తేటగీతి పద్యాలు పిడిఎఫ్ చేసి  పంపించారు.పద్యంపై ఉన్న ఆసక్తితో ప్రతి పద్యాన్ని పరిశీలిస్తూ నా దృష్టికి వచ్చిన మెరికెల లాంటి చిన్న చిన్న దోషాలను ఆచార్య దార్ల వారి దృష్టికి తెచ్చి  వారి భావములో ఏమాత్రం  మార్పులేకుండా అక్కడక్కడ ఒకటి రెండు పదాలు మాత్రమే మార్పులు చేర్పులు చేసి పద్యాలన్నింటిని  తుదిరూపం వచ్చేవిధంగా ప్రయత్నం చేశాము.

      ఈవిధంగా పరిశీలించే అవకాశం దొరకడం నేను అదృష్టంగా భావిస్తున్నాను.

    శతకములో  సామాజికాంశాలు చాలా ఉన్నాయి. ఆధునిక సమాజం లో కొనసాగుతున్న  కొంతమంది జీవన విధానంలో ఉన్న లోటుపాట్లను ఎత్తిచూపారు. యువత  ప్రవర్తనను, సోమరితనాన్ని  ఎత్తి చూపిస్తూ కలిగే దుష్ఫలితాలను  ముందుంచారు. కొంత మంది క్రమశిక్షణ రహితంగా, మెలగడం, తల్లి తండ్రి, గురువు, దైవం అనే భావాలను గాలికివదిలేసి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు.  వీటిన్నింటికి పద్యాలలో చొప్పించారు. ధనాన్ని సంపాదించడం కొరకు నీతి, నియమాలు, ధర్మాధర్మాల పట్టింపు ఏమాత్రం లేదు. ప్రజలు కొనుగోలు చేసే ప్రతి వస్తువు, ఆహార పదార్థాలన్నియు కల్తీమయమే. ఈ కల్తీ చేయడం వలన కొనుగోలు దారులు గమనిస్తే వ్యాపారం కుంటుపడుతుందని సూచించారు సామ్రాజ్య విస్తరణ పేరుతో యుద్దాలు చేయడం దుర్మార్గం. ప్రజలంతా శాంతి సౌభాగ్యాలతో విలసిల్లడానికి పరిపాలకులు  తగిన చర్యలు, ప్రణాళికలు ఏర్పరచుకుని ముందుకుసాగాలి. బుద్దం శరణం గచ్చామి అంటూ దుఃఖానికి కారణమైన అత్యాశ, కోరికలు అనే పుట్టలో నుండి బయటపడాలని గౌతమి బుద్దుని ధర్మపథాన్ని సూచించారు.

     ఈవిధంగా సమసమాజ స్థాపనకై కులమతాలకు అతీతంగా పరిపాలన ఉండాలని  యుద్దాలు విరమించాలని ఆకాంక్షించారు

     కవి మిత్రులు పుస్తకావిష్కరణ  సందర్భంగా అభిమానంతో అందించే  పుస్తకాలను చిరునవ్వులొలికిస్తూ అందుకుంటారు. ఆ తరువాత    మొహమాటానికి రెండు మూడు పద్యాలు చదివి  పుస్తకాన్ని ఏమూలకో విసిరేసి ఎప్పుడైనా కవిమిత్రుడు తారస పడినప్పుడు చాలాబాగుంది అంటూ ముఖస్తుతి చేయడం గమనిస్తుంటాము. ఆ పుస్తకం ఇంట్లో ఏ సెల్ఫ్ లోనో లేక టేబుల్ పడేయడమేతప్ప పూర్తిగా చదివేవారు చాలా తక్కువ. ఈ దార్ల మాట శతకం నేను పూర్తిగా చదివే అవకాశం లభించింది.  పద్యాలన్నింటిని తీరిక ఉన్నప్పుడల్లా క్షుణ్ణంగా పరిశీలిస్తూ నాకు అప్పచెప్పిన బాధ్యతను శక్తి కొలది నెరవేర్చానని చెప్పగలుగుతున్నాను.

   ఈ శతకాన్ని సాహితీప్రియులు చదివి తప్పకుండా తమలో ఉన్న మంచిచెడులు బేరీజు వేసుకుని  తప్పకుండా మార్పు కోరుకుంటారని  ఆశిస్తున్నాను ఇలాంటి సామాజిక చైతన్యం కలిగించే మరికొన్ని రచనలను సమాజానికి అందించడానికి వీరి కలానికి మరింత పదును పెట్టాలని ఆకాంక్షిస్తున్నాను.


                    జి.గోవర్ధన్

                  ‌‌.        తెలుగు లెక్చరర్ 

             ఎం.వి.ఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల 

          మహబూబ్ నగర్ 

       చరవాణి:-8106384812


తేదీ 

22/02/26

ఆదివారం


31 జనవరి, 2026

దార్ల మాట నీతి శతకం పై ఒక అభిప్రాయం



ఈ శతకం చాలా బాగుంది సార్. అత్యంత సరళమైన పదాలను పాఠకుల కోసం అందించారు. భావం కరిగి భాష్యమైనట్టు, అక్షరాలు కదలి జీవిత బాటైనట్టు ఉంది. ఈ పద్యాలు సమాజంలోని ప్రతి వ్యక్తి చదవవలిసిన అవసరం ఉంది. సమయపాలన, క్రమశిక్షణ,క్షమ,ఓర్పు,మాట పొదుపు.. ఇలా మంచి గుణాలను, మంచి విషయాలను ప్రతిపాదిస్తూ రాశారు.

నిప్పు తననుతా దహించు నిశ్చయముగ 

ప్రక్క నున్నవి గాల్చును వరుస తోడ 

కోపమున్నచో బుద్ధియు కుంటు పడును 

దారిచూపించునట్టిది దార్లమాట         

                                                             పద్యం-(26)

ఇక్కడ దహించే నిప్పుని ఉపమానంగా చేసుకుని, కోపం తనను ఎంతలా దహిస్తుందనే విషయాన్ని పోల్చుతూ చెప్పారు. చదివే పాఠకుడికి భావస్ఫురణ వెంటనే వస్తుంది.

కఠిన వాక్కులు పల్కిన కలుగు కీడు 

మెత్తని మాటలు పల్కిన మేలు కలుగు 

పూల బాటగ మార్చును బ్రతుకు నంత 

దారి చూపించునట్టిది దార్లమాట.

                                                  పద్యం-(32)

ఇక్కడ వాక్పారుష్యం గురించి చెప్పారు. ఒక మాట వల్ల వచ్చే అనర్థాలు,లాభాల గురించి వివరించారు. ప్రస్తుత సమాజంలో సంభాషణ సామర్థ్యం లేకపోతే,మాట పొదుపు లేనట్లైతే కీడు కలుగుతుంది. అనే విషయాన్ని సున్నితంగా మృదువైన పదాలు వాడారు.

చేయి జారిన నీరును చేర్చ వశమె 

గడచి పోయిన కాలము కలుగు నొక్కొ 

సమయ ముండగ పనులను సలుప

వలయు 

దారి చూపించునట్టిది దార్లమాట.

                                                పద్యం-(35)

చేయి జారిన నీరు, గడిచిన కాలం వెనక్కి తీసుకురాగలమా. చక్కటి పోలికతో సమయం విలువను తెలియజేశారు. ప్రతీ క్షణం విలువైనదే నీటి బిందువులా అంటూ చెప్పారు.

- కోట విజయ్ కుమార్, ఎం.ఏ. తెలుగు , యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, 31.1.2026

ఇలా చాలా మంచి పద్యాలు ఉన్నాయ్. నాకు నచ్చిన పద్యాలను నేను ప్రస్తావించాను. పాఠకుల కోసం, విద్యార్థుల కోసం ఈ పుస్తకాన్ని ఆన్లైన్ లో 

ఈ-బుక్ గా అందించిన గురువుగారు ఆచార్య దార్ల వెంకటేశ్వరరావుగారికి చాలా ధన్యవాదాలు.

10 ఫిబ్రవరి, 2025

దార్లమాట శతకంపై మరికొన్ని అభిప్రాయాలు

 సాహిత్యం ఏదైనా కవి ప్రతిభ చూపించాల్సింది కేవలం హృదయానందమే కాదు! తాను సమాజంలో చూస్తున్న అవకతవకలను ఎత్తి చూపే వాడే కవి. ఏదో రూపేన చురకలు చమక్కుమనిపిస్తూనే ఉంటాడు రచయిత. ఎందుకంటే సమాజాన్ని సరైన తోవలో నడిపించాల్సిన బాధ్యత కవుల పైన రచయితలపైన ఉంటుంది. ఇక్కడ కవి, రచయితయే కాకుండా ఆచార్యులు కూడా! వీరిపై ఇంకా ఎక్కువ బాధ్యత ఉంటుంది. అందుకేనేమో ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు గారు రాసిన 'దార్ల మాట శతకం'లో స్పృశించని అంశం లేదు. నేను కూడా 'శతక సాంప్రదాయంలో దార్ల మాట శతకం' అనే శీర్షికతో రాశాను. ఈ వ్యాసం మూసి పత్రికలో అచ్చయింది. అనిల్ కుమార్ దారివేముల గారు కూడా చాలా బాగా విశ్లేషించి రాశారు. అసలు ఫిబ్రవరి 21 ఎందుకు మాతృభాషా దినోత్సవం గా జరుపుకుంటున్నామనేది చాలామందికి తెలియదు.! తొలి పద్యమే మాతృభాషను గూర్చి ఎత్తుకోవడంలోనే తెలుగు భాషాభిమాని అని బోధపడుతుంది. మాతృభాష దినోత్సవం ఇతివృత్తం వివరించడం బాగుంది. దార్ల వెంకటేశ్వరరావు గారు అందమైన ఆటవెలది పద్యాలతో మా హృదయాలను హత్తుకోవడంతోపాటు సమ సమాజ తీరుతెన్నులును ఎత్తి చూపారు. అంటే ఆయనకి సమాజంపై ఉన్న బాధ్యతను మర్చిపోలేదని మనకి అర్థమవుతుంది. రక్తసంబంధాల గురించి, ఆరోగ్యం, నేడు స్త్రీలపై జరిగే అఘాయిత్యాల గురించి ఒకటేమిటి చాలా అంశాలను గూర్చి కవి చర్చించారన్నది బాగుంది. వామనావతారంలా కనిపించే పద్యం అనే మూడు పాదాలలో(మకుటం మినహా) విశ్వ భావాన్ని (బాధలను) చూపారు. ఈ వ్యాసంలో ఆఖరి పద్యం 'కవిత పద్యమైన కమనీయ భావంబు' అనే పద్యం గురించి చెబుతూ ఏ ప్రక్రియలో రాశామన్నది ముఖ్యం కాదంటారు . జాషువా కవి పద్యంలో రాసినప్పటికీ సమాజంలో వేళ్లూనుకున్న కుల వ్యవస్థ నుంచి స్త్రీ గొప్పతనం వరకు చాలా విషయాలను చర్చించారని తెలిసిందే ! సమకాలీన సమాజ పరిస్థితులను, విశ్వ భావనను గురించి చర్చించి విశ్వనరుడయ్యాడని ప్రతి సాహిత్య విద్యార్థులకు విదితమే! అదేవిధంగా దార్ల వెంకటేశ్వరరావు గారు కూడా కుల వివక్ష, ఓటుకి నోటు, నోట్ల రద్దు వలన ప్రజల ఇక్కట్లు వంటి అనేక విషయాలను ఎత్తిచూపారు. అని అనిల్ కుమార్ గారు వీరిద్దరికీ మద్య సారూప్యం చూపించడం చాలా బాగుంది. దార్ల మాట శతకానికి మీదైన విశ్లేషణ పూర్వక వ్యాసాన్ని అందించినందుకుఅభినందనలు..💐💐


                వేపాడ మమత 


              పరిశోధక విద్యార్థిని 


          ఆంధ్ర విశ్వ కళాపరిషత్,


విశాఖపట్నం,10.2.2025

......,.......


 హృదయపూర్వకపూల బాట - పరిమళాల మూట 


ప్రియ మిత్రుడు దార్ల వెంకటేశ్వర రావు జీవితాన్ని,  సమాజాన్ని మధించి,  మధించి తీసిన సార రూప అమృత బిందువులే ఈ  ఆటవెలది పద్యాల సమాహార రూప దార్ల మాట శతకం. దార్ల హృదయాంతరాళమున రూపుదిద్దుకున్న శుక్తిముక్తాఫలముల హారమిది. 

నేటి సమాజానికి కనువిప్పు కలిగించే అంశాలలో కొన్నింటిని తెలివిగా ఒడిసి పట్టి మాతృభాష ప్రాధాన్యత,  సత్వగుణ విశిష్టత,  రాయలసీమౌన్నత్యం వంటి అంశాలను ఉటంకించిన అనిల్ కుమార్ చాలా సునిశితంగా అవగతం చేసుకొని,  చాలా చక్కగా వివరించడం అభినందనీయం. 


_ డా.జి.శ్రీనివాస రావు 

అసోసియేట్ ప్రొఫెసర్ 

తెలుగు శాఖ 

తారా ప్రభుత్వ కళాశాల, 

సంగారెడ్డి


......

[09/02, 10:26 am] Dr.Vijaya Kumar HCU విజయ్: పదాలతో పద్య పారిజాతాలు పరిమళింపజేసిన పూలతోట దార్ల మాట శతకం. 'మానవత్వ విలువల మూట- దార్ల మాట' అన్న శీర్షికతో ఆచార్య దార్ల వేంకటేశ్వరరావు గారి దార్శనికతను, మానవీయతను, అక్షర తోటలో విరబూయించిన దారి వేముల అనిల్ కుమార్ గారికి శుభాభినందనలు🌹🌹🌹.

  డా. పి విజయకుమార్ 

 అసోసియేట్ ప్రొఫెసర్,

 కేంద్రీయ విశ్వవిద్యాలయం, హైదరాబాద్.

......

భారతదేశ ఉద్యమం, తూర్పు పాకిస్తాన్, ఉర్దూ భాష వంటి వాటిని గురించి కూడా ఈ శతకంలో ఉందనేది తెలిశాక మీ పుస్తకం తప్పకుండా చదవాలనిపిస్తుంది సార్👏👏👏👏.. మృదుల, తెలుగు అధ్యాపకులు, ఇబ్రహీంపట్నం

.....

[09/02, 10:03 am] Darla Venkateswara Rao: ప్రముఖ సాహిత్య విమర్షకులు తమ్ముడు దారివేముల అనిల్ కు ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు గారికి ,సృజన సహిత్యం ,సాహిత్యపేజీ బాధ్యులు కొమ్మవరపు విల్సన్ రావుగారికి హృదయపూర్వక అభినందనలు. దుగ్గినపల్లిఎజ్రా శాస్త్రి, కవి, రచయిత.

[09/02, 10:11 am] Darla Venkateswara Rao: వ్యాసం చాలా బాగుంది అభినందనలు sir. డా.బద్దిపూడి జయరావు, కవి, రచయిత.

.......


చాలా బావుంది సర్ వ్యాసం 

అతిశయోక్తి లేకుండా simple గా చెప్పాలనుకున్న అంశాన్ని సూటిగా చెప్పారు..వివరించిన అన్నిటికీ పూర్వ చరిత్ర కొంత జోడించి చెప్పటం వల్ల మీ పద్యాల భావం లోతుగా అర్థం చేసుకోగలిగే అవకాశం ఎక్కువగా ఉంది. డా.మృణాళిని, తెలుగు ఉపాధ్యాయిని. సికింద్రాబాద్.

.....

సార్ మకుటం అద్భుతంగా ఉంది పద్యాలు సహజంగా సరళ సుందరంగా పామర్రులకు అర్థమయ్యే రీతిగా బాగా రాశారు లోకాభిరామం కొన్ని చమత్కారాలు కొన్ని విడుపులు మనసు చూరగొంటాయి మోహనాంగిరా పద్యం చాలా బాగుంది. ఏరులన్ని పారు పద్యకూడా చాలా బాగుంది. భూతం ముత్యాలు, ఉపాధ్యాయుడు.

...

*గురువు గారు నమస్కారం🌹🙏🏻మానవీయ విలువలపై దారి పూల బాట దార్లమాట పుస్తకంపై చాలా చక్కని విశ్లేషణాత్మకమైన వ్యాసం రాశారు.* 

*వారికి నా హృదయపూర్వక అభినందనలు.* 

*ఏరులన్నియు పారి ఎచట కలియును ?*

*సాగరమును చేరి శాంతి నొందు*

*మానవుండు మరలా మట్టి నటులే చేరు*👌🏻🙏🏻 డా.పి.ముకుందరావు, అసిస్టెంట్ ప్రొఫెసర్, శ్రీకాకుళం

.....

శుభోదయం మిత్రమా.

మానవ నైజాన్ని సామాజిక తత్వాన్ని అద్భుతంగా వ్యక్తపరిచాయి మీ పద్యాలు. ఇవి నేటి సమాజానికి అవుతాయి పాఠాలు. వ్యాసం కూడా బాగా రాశాడు మిత్రమా. శుభాభినందనలు.... ఆచార్య ఎన్. ఈశ్వరరెడ్డి, యోగివేమన విశ్వవిద్యాలయం, కడప







మానవత్వ విలువల మూట దార్ల మాట శతకం - (అనిల్ కుమార్ దారివేముల, 9.2.2025 సృజనక్రాంతి దినపత్రిక సౌజన్యంతో)


 మానవత్వ విలువల మూట దార్ల మాట శతకం



మనిషి అనుభవాలను, భావోద్వేగాలను మరియు సమాజాన్ని ప్రతిబింబిస్తుంది కనుకనే సాహిత్యం నిత్య నూతనంగా ఉంటుంది. మనుషుల ఆలోచనలు, జీవన విధానం మరియు సమాజం కాలానుగుణంగా ఎప్పటికప్పుడు మారుతుంది. ప్రతి కాలంలో సాహిత్యం సమకాలీన జీవనశైలిని, సమస్యలను ప్రతిబింబిస్తుంది. కవులు, రచయితలు తమ భావజాలాన్ని, అనుభవాలను సమకాలీనతతో ముడిపెట్టి మానవతా పరిమళాలను పాఠకులు ఆస్వాదించేలా చేసుకునేలా తన పద్యాల్ని వ్యక్తీ కరిస్తారు. 

   కాలానుగుణంగా తెలుగు సాహిత్యంలో అనేక ప్రక్రియలు పురుడు పోసుకున్నప్పటికీ పద్య ప్రక్రియ మాత్రం ప్రత్యేకమైనదని, నిత్య నూతనమైనదని చెప్పవచ్చు. కవులు, రచయితలు రకరకాల ప్రక్రియలలో రచనలు చేసినప్పటికీ పద్య ప్రక్రియలో రచన చేయాలన్న జిజ్ఞాస ఎక్కువమందిలో ఉంటుంది. అలాంటి ప్రత్యేకమైన ఆసక్తితో ఆటవెలది ఛందస్సులో సమకాలీన సమాజాన్ని ప్రతిబింబిస్తూ శతక సాహిత్యాన్ని రాసిన వారిలో ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు ఒకరు.

  “దారి పూల తోట దార్ల మాట” అనే మకుటంతో 165 పద్యాలతో దార్ల మాట శతకాన్ని రచించి, గణేష్ దినపత్రిక సంపాదకులు శ్రీ కొత్తూరు సత్యనారాయణ గుప్తకు అంకితమిచ్చారు.ఈ శతకంలో తెలుగు భాష ప్రాధాన్యాన్ని, సమకాలీన సామాజిక వాస్తవికతను ప్రతిఫలించే విధంగా అనేక పద్యాలు వర్ణించారు కవి. వాటిలో కొన్నింటిని ఈ వ్యాసంలో విశ్లేషించాలనుకుంటున్నాను.


   అవసరమైనప్పుడు ఇతర భాషలు మాట్లాడవచ్చు కానీ మాతృభాషను మర్చిపోరాదని, మాతృభాష అమ్మ మాటలా అమృతంలా ఉంటుందని, తెలుగు భాష ప్రపంచం నలుమూలల వ్యాపించిందని తెలుగు భాష గొప్పతనాన్ని కొనియాడారు. 


మాతృభాష కొరకు మరణించి వీరులు

మాతృభాష మహిమ మనకు తెలిపె

మాతృభాష నెపుడు మరువకు సోదరా!

దారి పూలతోట దార్ల మాట’’ అని హితవు పలికారు. దీనిలో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ నేపథ్యాన్ని కూడా గుర్తుచేస్తున్నారు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటికి  పాకిస్థాన్ రెండు భాగాలుగా ఉండేది. పశ్చిమ పాకిస్థాన్, తూర్పు పాకిస్థాన్ లుగా ఉండేది.  పశ్చిమ పాకిస్థాన్ లో ఉర్దూ, తూర్పు పాకిస్థాన్ లో బెంగాలీ భాషలను ప్రజలు అత్యధికంగా మాట్లాడేవారు. కానీ రెండు చోట్లా ఉర్దూనే అధికార భాషగా ప్రకటించారు. తూర్పు పాకిస్థాన్ ప్రజలు తమ బెంగాలీ భాషను కనీసం రెండు జాతీయ భాషగానైనా ప్రకటించాలని కోరారు. పాకిస్థాన్ ప్రభుత్వం అంగీకరించలేదు. దానితో ఢాకా విశ్వవిద్యాలయంలో తమ మాతృభాష బెంగాలీ కోసం ఉద్యమాలు చేస్తుండగా, ప్రభుత్వం కాల్పులు జరిపింది. ఆ కాల్పుల్లో నలుగురు మరణించగా, అనేకమంది గాయపడ్డారు. ఉద్యమ ఉధృతిని గమనించి బెంగాలీ భాషను తమ రాజ్యాంగంలో ఒక జాతీయ భాషగా గుర్తించింది. ఈ ఉద్యమాన్ని ఆధారంగా చేసుకునే యునెస్కో ప్రతి యేడాది ఫిబ్రవరి 21 వ తేదీన అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని ప్రకటించింది. ఇంత నేపథ్యమున్న మాతృభాషను మరిచిపోవద్దని అంటున్నాడుకవి. అయితే ప్రపంచవ్యాప్తంగా వస్తున్న మార్పులను అనుసరించి ఆంగ్ల భాష నేర్చుకోవాల్సిన అవసరాన్ని చెబుతూ ఆంగ్ల భాష మంచినీరు వంటిదని, తెలుగు భాష తేనె వంటిదని తెలుపుతూ మంచినీళ్లతోనే మనకు దాహం తీరుతుందని చెబుతూ నేటి సమాజంలో ఆంగ్ల భాష ప్రాముఖ్యతను కూడా మరొక పద్యంలో తెలిపారు.


మనిషి మనుగడకు సహజవాయువు ఎంత అవసరమో నీరు కూడా అంతే అవసరమని, నీటిని వృధా చేయకుండా ఇంకుడు గుంటల ద్వారా పరిరక్షించు కోవాలని తెలిపారు. మన దైనందిన జీవితంలో నిద్ర లేచింది మొదలు పడుకునే వరకు నీటిని వాడటంతోపాటు, నీటిని వృధా చేయవద్దని తెలుపుతూ ఒక పద్యంలో వర్ణించారు.

గడ్డమెపుడు గీయ నడ్డదిడ్డంబుగాను

వ్యర్థముగను నీళ్లు వదులు చుంద్రు

కొద్ది నీళ్ళె కోట్ల గొంతు తడిపె చూడు” అని నీటి ఎద్దడి వల్ల కొన్ని ప్రాంతాల్లో తాగడానికి నీళ్లు కూడా ఉండవు. నీరు పుష్కలంగా దొరికే వాళ్ళు నీటిని అనవసరంగా వృధా చేయవద్దని కవి ప్రబోధించారు. కొన్ని నీళ్ళేఅనుకుంటారు. కానీ ఇలా చిన్న చిన్న పనుల్లో చేసే నీటి వృధాసామాన్యమైందికాదు.


మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే. ఈ నాగరిక రోజుల్లో కుటుంబ బంధాలు, అనుబంధాలను గురించి అమ్మానాన్న, అక్క, చెల్లి ,తమ్ముడు…ఇలా రక్తసంబంధాల మధ్య ఆర్థిక సంబంధాలే కంటే, మమతానుబంధాలకు అత్యధిక ప్రాధాన్యం ఉంటే ఆ ఇల్లు ఎంతో చక్కగా ఉంటుందని తెలుపుతూ…

కలిమి లేములన్ని కష్ట సుఖములట్లు

తల్లి దండ్రి యన్న దమ్ములుంద్రు

రక్త బంధ మదియె రాదేదియును సాటి” రక్తసంబంధం యొక్క గొప్పతనాన్ని, ఆవశ్యకతను నొక్కి చెప్పారు. జన్మనిచ్చిన తల్లిదండ్రులను ఆదరించాలని, వారి నుండి అన్నీ దక్కిన తర్వాత విడిచి పెట్టే లోకి రీతిని తప్పు పట్టారు.

ఎంతటి వారి కైనా మరణం తప్పదని మట్టి నుండి పుట్టిన మనిషి మట్టిలోకి చేరిపోతాడనే తాత్విక స్పర్శను వివరిస్తూ…

ఏరులన్ని పారి ఎచ్చట కలియును?

సాగరమున చేరి శాంతి నొందు

మానవుండు మరల మట్టి నటులె చేరు” అని దార్ల కవి పలికారు. ఈలోకంలో మానవుని జీవితమెంతబుద్భధప్రాయమో గుర్తు చేస్తూ, ఈ లోకంలో ఉన్నంతవరకు అందరూ సుఖసంతోషాలతో జీవించాలని ప్రబోధిస్తున్నాడు.


విలువ గురించి తెలియజేస్తూ వ్యక్తులు గాని, వస్తువులు గాని అవి ఉన్నప్పుడు వాటి విలువ తెలియదని, అవి లేనప్పుడే వాటి విలువ తెలుస్తుందని, తినడానికి తిండి లేనివాడికి భోజనం విలువ తెలుస్తుందని, అరగని వాడికి ఆరోగ్యం విలువ తెలుస్తుందని చక్కని సామ్యాన్ని ప్రబోధించారు. నేటి నాగరిక జీవనంలో ఆరోగ్యం కోసం తినే తిండి కంటే మింగే మాత్రలే ఎక్కువ ఉన్నాయని, చక్కెర వ్యాధి ముదిరిన తర్వాత మనిషి తీసుకునే చికిత్స గురించి చెప్తూ…

తినక ముందు నొకటి తిన్న ప్పుడొక్కటి

పొడుచుకొనవలయును జడుచుకొనక

మనల జంపు సఖియె మధుమోహనాంగిరా" అని ఆ బాధలు వర్ణనాతీతమని పలికారు. నేడు పరిశోధనలు ఎన్ని జరుగుతున్నా, కొన్ని వ్యాధులను శాశ్వతంగా నయం చేయలేని స్థితిని వివరిస్తున్నారు. 


సాహిత్య పఠనం మనిషిలో సహృదయతను నింపుతూ మనిషిని సంస్కరిస్తుందని సాహిత్య ప్రయోజనాన్ని చెప్తారు. పాఠకులు మంచి రచనను మరువలేరని అంటారు. దీన్నిలా వర్ణిస్తూ…

‘’కలిమి లేములన్ని కావడికుండలు

ఒడిదుడుకులు తెలిపి ఓర్పు నిచ్చి

సత్వ గుణము నేర్పు సాహిత్యపఠనంబు” అని సాహిత్యపఠనం యొక్క ఆవశ్యకతను దార్ల కవి తెలియజేశారు.

రాయలసీమ సాహిత్యానికి, కళలకు మరియు ఆధ్యాత్మికతకు పుట్టినిల్లని తిరుపతిలో శ్రీ వేంకటేశ్వర స్వామి, కాణిపాకం లో గణపతి సిరులు కురిపిస్తున్నారని, లేపాక్షి బసవన్నను చూడడానికి దేశ విదేశాల నుండి భక్తులు తరలి వస్తారని, అందువల్ల అది  కరువు నేల కాదు  కళలకు పుట్టినిల్లని అభివర్ణిస్తూ…

ఊటలూరు పోతులూరి తత్వ జ్ఞాని,

రాజ్య మేలినట్టి రాయలుండె

రాళ్ల సీమ కాదు రతనాలసీమ రా” అని రాయలసీమ గొప్పతనాన్ని ప్రశంసించారు కవి.

మారుతున్న కాలానుగుణంగా అన్ని రంగాలలో కార్పొరేట్ సెక్టార్ వ్యాప్తి చెందిందని దయాదాక్షిణ్యాలు ఈ రంగంలో ఉండట్లేదని వాపోతూ…

సంతకంబు పెట్టు సర్జరీకనుచుండు

కథల కథల గుట్ట కార్పొరేటు 

జబ్బు మాట కన్న డబ్బుదే మాటరా” అన్నారు. ఈ పద్యంలో కార్పొరేట్ వైద్యాన్ని గురించి ఎంతో వాస్తవికంగా వర్ణించారు కవి.


తెలుగు సాహిత్యంలో విశ్వకవి గుర్రం జాషువా ప్రభావం సామాన్యమైందికాదు. ఆయన కాలంనాటి వాళ్ళను మాత్రమే కాకుండా తరువాత అనేక తరాల వాళ్ళను కూడా ఆయన ప్రభావితం చేస్తున్నాడు. ఆయన రచించిన సాహిత్య  విశిష్టత అంత గొప్పది. జాషువా సాహిత్యాన్ని గురించి వర్ణిస్తూ…

కవిత పద్యమైన కమనీయ భావంబు

వస్తువేది యన్న, వాస్తవమ్ము

జాతి మేలుకొలుపు జాషువా కవనంబు” అని జాషువా పద్యంలోని సమకాలీన సామాజిక వాస్తవికతను ఈ పద్యంలో దార్ల కవి వర్ణించారు. సాహిత్యంలో రూపం ప్రధానమా? సారం ప్రధానమా అని ఒక చర్చ విస్తృతంగా జరిగింది. ఛందోబద్ధమైన పద్యంలోనే  తన సాహిత్యాన్ని అత్యధికంగా రచించినప్పటికీ సారంలో చూస్తే సామాజిక వాస్తవికతే జాషువా సాహిత్యానికి ఆత్మ.

ఇంతే కాకుండా, నాగరిక జీవనాన్ని, కుల జాడ్యాన్ని, స్త్రీ గొప్పతనాన్ని, సమాజంలో రోజు రోజుకీ మరింతగా వ్యాపిస్తున్న కులాన్నీ, ఆ వివక్షతను కొన్ని పద్యాల్లో వర్ణించారు. సమకాలీన నాగరిక జీవన విధానాన్ని, కనిపించి కనిపించని సామాజిక పొరలలో ఓటుకు నోటు, నోట్ల రద్దు నాటి అవస్థలు, నల్లధనం, లోనుల పేరుతో బడా బాబుల బ్యాంక్ దోపిడిలు, ఎన్నికల సమయంలో హడావిడి వంటి అనేక సామాజిక అంశాలను కవి ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు తన పద్యాలలో ప్రస్తావించి ప్రశ్నించారు. తాను ఛందోబద్ధమైన పద్యంలోనే  రచన చేస్తున్నప్పటికీ ఆధునిక వచన కవిత్వం కంటే సరళ సుందరంగా పద్యాలు కొనసాగడం ఈ కవి రచనాశైలిలోని విశిష్టత. తన పద్యంలో అలవోకగా ఇంగ్లీషు పదాలు కూడా కలిసిపోయి, నిత్య వ్యవహారంలో కనిపించే తెలుగు భాషా సౌందర్యాన్ని తనపద్యంలో నిక్షిప్తం చేశారు కవి. దార్ల మాట శతకం నిండా మన చుట్టూ ఉండే అనేక సమస్యలతోపాటు, మన మానసిక సంఘర్షణలు పద్య రూపంలో కనిపిస్తాయి. కవి సామాజిక ప్రయోజనాన్ని కూడా తన రచనలో చూపించాలని అనుకున్నప్పుడు  ఏ రూపంలో రచనను కొనసాగించి నా, దానిలోనూ తన దృక్పథాన్ని ప్రదర్శించవచ్చు. ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు సాహిత్య విమర్శకుడిగా, పరిశోధకుడిగా ప్రసిద్ధి. ఆ తర్వాత వచన కవిగా కూడా అనేక కవితలు రచించారు. కానీ ఆధునిక కాలంలో పద్యాన్ని కూడా ఇంత సరళంగా రాయడం ఈ శతకంలో కనిపించే ప్రత్యేకత. ఒకవైపు పరిశోధన, సాహిత్య విమర్శను విస్తృతంగా రాస్తూనే, మరొకవైపు వచనకవిత్వంతో పాటు పద్యాన్ని కూడా రాయడం అభినందనీయం. ఇలాంటి సామాజిక ప్రయోజనం కలిగే మరెన్నో రచనలు ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు కలం నుండి జాలువారాలని ఆశిస్తూ.....


అనిల్ కుమార్ దారివేముల

మాచర్ల, పల్నాడు జిల్లా,

ఫోన్: 9951244718.


14 నవంబర్, 2024

పద్యపారిజాతాలు పరిమళింప చేసిన పూలతోట ‘దార్లమాట’

 పద్యపారిజాతాలు

 పరిమళింప చేసిన పూలతోట ‘దార్లమాట’

డా. పి. విజయకుమార్

వైస్ ప్రిన్సిపాల్ & తెలుగుశాఖాధ్యక్షులు ఎస్.ఎమ్.ఎల్. ప్రభుత్వ కళాశాల ఎమ్మిగనూరు, కర్నూలు జిల్లా.


పద్యవిద్యను సుజన హృద్యంబుగా చేయడానికి మాటలను పూలతోటగా మలచిన పద్యతోటమాలి దార్ల వెంకటేశ్వరరావు, శతకసాహిత్యవికాసంలో భాగంగా కొత్త దారిలో వెళ్లి పద్యపూలతోట పూయించిన శతకకారుడు దార్ల. 'దార్లమాట' శతకం ఆధునిక యువకవులకు పద్యం పట్ల అభిమానాన్ని పెంచిందనవచ్చు. పద్యం ఎంత హృద్యంగా చెప్పవచ్చో, ఆధునిక వ్యవహారంలో మనస్సుకు హత్తుకునేటట్లు ఎలా రాయవచ్చో 'దార్లమాట' శతకం ఒక మార్గదర్శిగా భావించవచ్చు. ఈ పద్యాలను పరిశీలిస్తే నవతరానికి పద్యం పట్ల ప్రోత్సాహాన్ని పెంచే విధంగా ఉన్నాయి. నిష్కల్మషంగా, ముక్కుసూటిగా, హుందాగా ప్రవర్తించే దార్ల వ్యక్తిత్వం ప్రతి పద్యంలో పరిమళించింది. శక్తి, ముక్తి కలగడానికి శతకం ఒకటే చాలు అంటూ 'శతక' సాహిత్యవిశిష్టతను తెలియజేసిన విశిష్ఠుడు దార్ల,

‘’త్రాగి కారు నడుప తప్పయినప్పుడు 

ఓటు వేయునపుడు నోటు నిచ్చి 

తనకు వేయుమనుట తప్పుకాదందురా 

దార్ల పూలతోట దార్ల మాట’’

మద్యం తాగి కారు నడిపితే తనకే కాక ఇతర ప్రయాణికులకు పెనుప్రమాదం కల్గుతుంది. ప్రజాస్వామ్య పతాక ఓటును నోటుతో కొని తనకే ఓటు వేయమనడం తప్పుకాదా! అని ప్రశ్నిస్తూ హెచ్చరించడం పై పద్యంలో ప్రతిధ్వనించింది. సామాజిక కర్తవ్యబోధ ప్రధానంగా దార్ల ప్రతి పల్కులో ప్రస్ఫుటమవుతుంది.

అమ్మ యనెడు మాట అమృతంబు కురిపించు

అయ్య యనెడు మాట హాయి నిచ్చు 

మమ్మి డాడి యనెడు మాటలింకేరా 

దారిపూలతోట దార్లమాట

మాతృభాషను మాతృమూర్తి కంటె అమితంగా ప్రేమించే అమృతమూర్తి దార్ల, వేణియనాద వినోదంలా వీనులవిందైన అమృతభాష మన మాతృభాష, కాని నేడు అమృతవాక్కులైన, ఆత్మీయ వారధులైన అమ్మ, అయ్యలను వదలి మమ్మి, డాడీల సంస్కృతి పట్ల ఆవేదన వ్యక్తం చేయడం కనిపిస్తుంది.తి నకలిగిన నాడు తిండిదొరకని పరిస్థితి, తినడానికి ఉన్ననాడు తినలేని అనారోగ్యస్థితి. శివుడు బిచ్చమెత్తి ఆనాడే తిండి విలువ చెప్పాడంటాడు. పుణ్యఫలాలనిచ్చే పుణ్యభూమి రాయలసీమ అని, ఆ నేలలోనే తిరుమలలో శ్రీనివాసుడు, కాణిపాకంలో గణపతి సిరులు కురిపిస్తున్నారని నేలమహిమను కొనియాడాడు. లేపాక్షి బసవన్న లేచివచ్చునేమో అన్న విధంగా తరచిచూస్తే లేపాక్షిలో అద్భుతాలు కనిపిస్తాయి. లేపాక్షిలో వ్రేలాడే 'శిల' లాంటి అద్భుతాలను గూర్చి వ్యక్తం చేశాడు. రాయలసీమ కేవలం కరువునేల కాదు కళలకు పుట్టినిల్లంటాడు. బంగారు, వజ్రాలకు నెలవైన వనరులున్న ప్రాంతంగా అభివర్ణించాడు. ప్రత్యేకంగా చెప్పుకునే 'రాగి సంకటి' రుచి రాయలసీమదే అని గుర్తు చేస్తాడు. రాయలసీమ రాళ్ళసీమకాదు. రతనాలసీమ అని, తత్త్వజ్ఞాని ఊటలూరు పోతులూరి, రాజ్యమేలిన రాయలు, రాయలసీమ వారే అని రాయలసీమరాజసాన్ని వ్యక్తం చేశాడు.

సమకాలీన విషయాలను పద్యంలో అక్షరబద్ధం చేయగల నేర్పరి, కూర్పరి దార్ల, గుప్తనిధులు, ఘనులను గుర్తించగలిగినది గూగులమ్మ మాత్రమేనని ఇలాంటి పెద్ద మనుషులు మనసువిప్పి నిజం చెప్పరని, గూగుల్ని నిజం చెప్పే తల్లిగా గూగులమ్మగా పరిగణించి వాస్తవిక కోణాన్ని ఆవిష్కరించారు. ఈనాడు ప్రజలు వయసు పెరిగేకొద్ది అనారోగ్యం పాలవుతున్నారని, నిద్రలేచిన దగ్గర నుండి నిద్రపోయేంత వరకు మాత్రలు మింగుతూనే ఉంటున్నారని, మాత్రలతోనే బొజ్జనిండుతుందని వ్యంగ్య ధోరణిలో ప్రస్తుత జీవన స్థితిగతులను వ్యక్తం చేశారు. అవసానదశలో వరాలు వద్దు షుగర్ మానితే చాలు అని ప్రాధేయపడుతుంటారని, మనలను చంపేసఖి 'మధుమోహనాంగిరా' అని వ్యంగ్యంగా షుగర్ వ్యాధితో ఇబ్బంది పడుతున్న వైనాన్ని ఏకరవు పెట్టాడు. ‘మృత్యువు' అంటేనే మనిషి అనునిత్యం భయపడతాడని మనిషి ఏనాడైనా మరణించక తప్పదు కాని ముందే మనిషి ఏనాడైనా చనిపోతానని తెలిస్తే ముందుగానే నరకాన్ని అనుభవిస్తారంటాడు. మనిషికి 'కరుణ' సహజలక్షణంగా ఉండాలి. కాని, కార్పోరేట్'లో 'కరుణ' అనే మాట తరచిచూసిన కనపడదని వాపోతాడు.

ఇంటివద్ద చూడు ఇల్లాలి ముచ్చట్లు 

ఇంటిచుట్టు కట్టు ఇంకు గుంత 

ఇంటి పొదుపు తెలుపు ఇంకుడు గుంతలే 

దారి పూలతోట దార్ల మాట

ఇంకుడు గుంతల విశిష్టతను చాకచక్యంగా తేటతెల్లం చేశాడు, రాయలసీమ నీకు నీళ్ల విలువ తెలుపుతుంది.

కోనసీమ నీకు కోరినంత ఇస్తుంది. "తెచ్చిపంచునెపుడదే భాగ్యనగరము" అంటాడు.

"విత్తనమును బట్టి వికసించు బుద్ధులు 

మట్టి యొక్కటైన మానువేరు 

మనుషులంత యొకటి మర్మంబువేరయా

దారి పూలతోట దార్ల మాట"

 అంటాడు. మనుషుల్లోని మర్మం గురించి సూటిగానే ఆవిష్కరించిన తత్త్వం దార్ల వేంకటేశ్వరరావుది, మనకు తెలియకుండానే మన పేరు ప్రచురిస్తున్న వైనం సమాజంలో కనిపిస్తుంది. ఆ వివరాలను పరిశీలిస్తే విస్తుపోయే పరిస్థితి ఉందని వాపోతారు.

కులము, మతములన్ని కుత్సితబుద్ధులు

 కలపవలయుగాని కలహమేల 

మంచికన్న మించు మానవత్వము లేదు

దారి పూలతోట దార్ల 

మంచి గంధంలాగే పరిమళించే మానవత్వం దార్ల వెంకటేశ్వరరావుకి సహజ అలంకారం, కులం, మతం పేరుతో కుత్సితబుద్ధుల్లాగా కొందరు వ్యవహరిస్తున్నారని, నిత్యం కలహాలతో విభేదించుకుంటున్నారని 'మంచి' కంటే మించిన మానవత్వమే లేదంటారు. మతం అంటే హితం, మంచి అనే భావన వెలిబుచ్చారు.కలిమిలేములన్ని కష్టసుఖాల్లాంటివని, కుటుంబాలలో రక్తబంధానికి సాటి మరేది లేదని ఆ విలువలు కాపాడుకోవాలని హితవు పలికాడు.

‘’ప్రక్కనున్న వారి పలుకుల కన్నను

ప్రొద్దుపోక చేయు ఫోనుముద్దు 

దగ్గరున్న నేమి దౌర్భాగ్యమిద్దిరా 

దారిపూలతోట దార్లమాట”

ప్రస్తుతం ఇల్లల్లో వింత పరిస్థితులు దర్శనమిస్తున్నాయి. ప్రక్కనున్న వారి పలుకులకన్నా ప్రొద్దుపోక చేసే ఫోను ముద్దుగా భావిస్తున్న దౌర్భాగ్యపరిస్థితులను దుయ్యబట్టాడు.

"శిలను చెక్కి శిల్పి శిల్పముగ మలుచు 

కఠినహృదయమైన కరుగునట్లు 

సహృదయతను నింపు సాహిత్య పఠనంబు

దారిపూలతోట దార్లమాట”

శిల్పి శిలను శిల్పంగా మలుస్తాడు. సాహిత్య పఠనం కఠిన హృదయాన్ని కరిగించి సహృదయతను నింపుతుందని, సత్త్వగుణం నేర్పుతుందని, సాహిత్య పఠనం యొక్క ఆవశ్యకతను, పరమార్థాన్ని నొక్కి వక్కాణించాడు.

'రచన' ఎవరిదైనా ఉన్నతంగా ఉంటే కీర్తించగలం, కాని మనవాడే కాబట్టి, మనసు చంపుకొని పొగడలేమని, మంచి రచన మనసులో చిరస్థాయిగా నిలిచిపోతుందని, అటువంటి రచనలను మరచిపోలేమంటాడు. సమాజంలో తెల్లదొరలు పోయి నల్లదొరలు వచ్చారని, మనిషి మనసు ముందు మారాలని హితవు పలికాడు.

జీవితం నీటిబుడగలాంటిదంటాడు. ఉన్నవాటి విలువ ఉన్నప్పుడు ఎరుగరు. లేనినాడే దాని విలువ తెలుస్తుంది. తిండిలేనినాడే తిండి విలువ తెలుస్తుంది. అరగనపుడే ఆరోగ్యం విలువ తెలుస్తుందంటాడు. మహనీయుడు ఎక్కడున్నా మంచి పుష్పంవలే పరిమళిస్తాడంటాడు. ఏదీ శాశ్వతం కాదు ఊపిరున్న వరకు సంతోషంగా ఉండమంటాడు. ఉన్నంతలో ఉన్నంతకాలం ఆనందంగా జీవించడమే ఉత్తమ జీవనధర్మం అని ప్రబోధిస్తాడు.. ఇలా సమకాలీన సమాజంలో ఎన్నో పార్శ్వాలను తన అనుభవాలతో వివేచించి పద్యపారిజాతాలను పరిమళింపజేసి కొత్తదారి వేసిన దీర్ఘదర్శి దార్శనికుడు దార్ల.

***







21 జనవరి, 2022

దార్ల మాట శతకం పై డా.మంగళగిరి శ్రీనివాస్ వ్యాసం

 దార్లమాట శతకం  అంతరంగం

(పుస్తక సమీక్ష)


డా.మంగళగిరి శ్రీనివాసులు,

సహాయ ఆచార్యులు(సి),

పీ.జీ.సెంటర్, గద్వాల,

తెలుగు శాఖ,

పాలమూరు విశ్వవిద్యాలయం,

9491388662.


పుస్తక ముఖచిత్రం నీలివర్ణ పరదాఛాయన  శశకరూపం కల్గిన చిన్నసైకిల్ పై సవారి చేస్తూ ముద్దులొలికే ముసి ముసి నవ్వుల చిరంజీవి, డాక్టర్ ఎం.మంజుశ్రీ, ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు దంపతుల గరాల పట్టి పుత్రరత్నం శ్రీనివాసరావు ముఖచిత్రం చూడగానే ఆనందం, సంతోషం, అనురాగం, ఆప్యాయతలు కనిపిస్తున్నాయి.లోకంలోని ఏ తల్లిదండ్రులకైనా ఆస్తి అంతస్తులకన్న పేగుతెంచుకు పుట్టిన పిల్లలపై ఉండే ఆప్యాయత ఆనంతం.

దార్ల దంపతులకు

పుత్రుడు శ్రీనివాసరావుపై ఉన్న వాత్సల్యాన్ని  ముఖచిత్రం తెలియపరుస్తున్నది.


దార్లను కని పెంచి సమాజానికి పరిచయం చేసిన  తల్లిదండ్రులు కీ. శే. దార్ల 

అబ్బాయి(శ్రీలంకయ్య),శ్రీమతి పెద నాగమ్మల ఆశీర్వాద మహిమచే మట్టిలో మాణిక్యం అను మాటను నిజం చేయ 

చిన్నతనంలోనే తెలుగు పై అభిమానంతో ఆతుకూరి లక్ష్మణరావు వద్ద శిష్యరికం చేసి చందస్సులో పద్యాలు వ్రాయాలని మదిలో బీజావాపనం చేసుకుని చిన్న చిన్నగా పద్యాలు రాస్తూవచ్చారు. అలా రాసివుంచిన పద్యాలతో శతకంగా ప్రచురించాలి అనేది సంకల్పం. అట్టి సంకల్పానికి చేదోడుగా మిత్రుడు గోవిందుని గోవర్ధన్ సహకరించగా పద్య సాధనలో చాతుర్యం నింపిన శంకరాభరణం బ్లాగు, వాట్సాప్ సమూహాల నిర్వాహకుడు కందిశంకరయ్య  ప్రోత్సాహం వీరికి కొండంత అండ. దార్ల

రాసిన పద్యాల ప్రతిభను గుర్తించి మొచ్చుకోలులు అందించిన ఆచార్య రేమిళ్ల వేంకట రామకృష్ణ శాస్త్రి, మల్లవరపు జాన్ కవుల సహృదయుల ప్రేమలు వెన్నంటి నిలిచాయి.


దార్లమాట శతకం కృతికర్త ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, దార్లమాట శతకం కృతిభర్త కొత్తూరు సత్యనారాయణ గుప్త  ఈ ఇరువురు కూడా అసామాన్య సాహిత్య సంపన్నులు, సాహిత్య సేవకులు, నిర్విరామ కృషివలులు కావడం విశేషం. ఇరువురి మార్గాలు వేరు వేరు ఒకరేమో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, తెలుగు శాఖ అధ్యక్షులు, ఆచార్యులు,సాహిత్య పరిశోధకులు,అన్నింటికి మించి శిష్యులకు ప్రేమతో పాఠాలు బోధించే గురువులు దార్ల వెంకటేశ్వర రావు.  మరొకరు సంపాదకులు,సమాజ సేవకులు,సాహిత్య సేవకులు, అయినప్పటికీ సాహిత్యవృక్షం నీడన కొలువైన వ్యక్తులు కృతిభర్త  కొత్తూరు సత్యనారాయణ గణేష్ దినపత్రికకు సంపాదకులు. ఈ పత్రిక కర్నూల్ నుంచి వెలువరిస్తున్నారు.ఇందులో ఎంతో మంది కవులను ప్రోత్సహిస్తూ వారు పంపిన కవితలను పద్యాలను సాహిత్య అంశాలను ప్రతిదినము ఒక పేజీని  వీలునుబట్టి  ఆ పత్రికలో కవులను రచయితలను ప్రోత్సహిస్తున్న దారిలో దార్ల వెంకటేశ్వరరావుకి కొత్తూరు సత్యనారాయణగారితో పరిచయం ఏర్పడింది.దార్ల గణేశ పత్రికకు తరుచుగా కవితలు పద్యాలు పంపుతూ ఉండేవారు వాటిని గణేష్ పత్రికలో అచ్చు వేస్తూ ఉండేవారు. కొత్తూరు సత్యనారాయణ గుప్త చేస్తున్న సేవలను గుర్తించి దార్ల వారు ఈ గ్రంథాన్ని అంకితమిచ్చారు.


ఇట్టి గ్రంథానికి *పూలు పరచిన 'దార్ల'లో  శీర్షికన కంది శంకరయ్య అభినందించారు.

"స్వాగతం" శీర్షికతో ఆచార్య ఎస్ శరత్ జోత్స్నరాణి, డీన్, స్కూల్ ఆఫ్ హ్యుమానిటిస్, వారు ముందుమాటను రాసారు. దార్ల పద్యాలను కొనియాడుతూ ఆచార్య పిల్లలమర్రి రాములు "విలక్షణ రసహృదయుడు దార్ల" పేరిట అభినందనలు తెలిపారు.

ఇకపోగా ఆచార్య విస్తాలి  శంకర్  రావు తెలుగు శాఖ అధ్యక్షులు  మద్రాసు విశ్వవిద్యాలయం వారు సమకాలీన జీవితాలకు దర్పణం దార్లమాట శతకం శీర్షికన పరిపూర్ణ సద్విమర్శన రూపంలో కవి గురించి, కుటుంబ నేపథ్యం గూర్చి, వీరి సాహిత్యం గూర్చి తెలుపుతూ దార్లమాట శతకంలోని పద్యాలతో సమన్వయం చేస్తూ  పుస్తకం గూర్చి చక్కగా  పరిచయం చేసిన ఆచార్య విస్తాలి  శంకర్  రావు తెలుగు శాఖ అధ్యక్షులు మద్రాస్ వారి ఆశీర్వాదం శుభసూచకం.

దార్ల వారిపై మక్కువను తెలుపుతూ మల్లవరపు రాజేశ్వరరావు రెండు పద్యాలను రాశారు.

మిత్ర వాత్సల్యం పేరిట గోవిందుని గోవర్ధన్,

తెలుగు ఉపన్యాసకులు, పాలెం, వారు మిత్ర వాత్సల్యంతో తొమ్మిది పద్యాలలో వారి గొప్పతనాన్ని తెలియపరిచారు.

ఇక కొత్తూరు సత్యనారాయణ గుప్త (కృతిభర్త),

ఏమని వ్రాయాలి? అను శీర్షికతో ఆత్మీయ పలుకులు పలుకుతూ కృతికర్తతో ఏర్పడిన  పరిచయం తెలియపరుస్తూనే    వారి కుటుంబీకులకు ధన్యవాద వందనాలు తెలిపారు.


దార్ల వెంకటేశ్వరరావు "నా పద్య కవిత్వం నేపథ్యం" శీర్షికతో వారి జీవిత విషయాలను, శతకం రాయడానికి పూనుకున్న స్థితిగతులు అన్నీ కూడా ఇక్కడ తెలియజెప్పారు దార్ల. గ్రంథ రూపం రావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరుపేరునా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలిపారు.


శతకానికి ఉండవలసిన లక్షణాలలో ప్రాథమికంగా సంఖ్యా నియమం, మకుట నియమం, వృత్తి నియమం, భాషా నియమం ప్రధానమైనవి వీటిని బట్టి చూస్తే దార్ల మాట శతకంలో పై చెప్పిన విషయ అంశాలన్నీ సంపూర్ణంగా ఉపయోగించారు. సంఖ్యా నియమము ప్రకారము వందకు పైగా పద్యాల వినియోగంలో 165 పద్యాలను తీసుకున్నారు. మకుట విషయంలో దారి పూల తోట దార్ల మాట అను మకుటం తీసుకున్నారు. అన్ని పద్యాలకు కూడా 4వ పదంలో ఇదే మకుటం ఉంటుంది. ఇది  దార్ల వెంకటేశ్వర రావు నామముద్ర తెలియజెప్పును.

వృత్తి నియమం ప్రకారం ఆటవెలది పద్యాలను తీసుకున్నారు.భాషా నియమం విషయంలో అలతి అలతి మాటలతో   సరళమైన పదాలతో పద్యాలను రచించారు.ఇందులోని పద్యాలు అన్నీ విశ్లేషించడం సాధ్యం కాని పని అయినా మచ్చుకు కొన్ని దార్లమాట శతకంలోని  పద్యాల విశ్లేషణలు...


శ్రీ గణపతి దేవ శివపార్వతీ పుత్ర

నీదు దయను పొంది నిన్ను తలతు

పద్య విద్య సుజన హృద్యంబు చేయరా

దారి పూల తోట దార్ల మాట


అను పద్యముతో విఘ్నములు తొలగించే గణపతిని,శివపార్వతులకు స్తుతిస్తూ మీ దయవల్ల నాకు పద్య కవిత్వ విద్యను అందించగలరని ప్రార్థిస్తూ శతకమును ప్రారంభించారు దార్ల వారు.


కరవు నేల కాదు కళలకు పుట్టినిల్లు

వనరులుండె  స్వర్ణ వజ్ర ఖనులు

రాగి సంగటి రుచి రాయలసీమదే

దారి పూల తోట దార్ల మాట


రాయలసీమ ప్రాంతంలో ఓరి నాయనా ....అను ఒక సినిమా పాటలో కరువు గూర్చి విన్నా... డివిఆర్ పద్యంలో కళలకు పుట్టినిల్లని,గనులు, వజ్రాలు, బంగారం వనరులు ఉన్న నేలని , మంచి బలన్నిచే రాగుల సంగటి రాయలసీమ వారిదే అన్నట్లు రాయలసీమ గొప్పతనాన్ని ఈ పద్యంలో తెలిపారు డివిఆర్.


విత్తనమును బట్టి వికసించు బుద్ధులు

మట్టి యొక్కటైన మాను వేరు

మనుషులంత యొకటి మర్మంబు వేరయా

దారి పూల తోట దార్ల మాట


విత్తనమును బట్టి మొలకలు పేరుగుతుంటాయి.

మొలక మొలిచే మట్టి మాత్రం అన్ని మొలకలను ఒక్కటే. అయినప్పటికీ మొక్కలు ఎదుగుదల వేరు వేరు ఉంటుందని దీని సమన్వయం మానవులంతా ఒకటే అయిన వారి వారి మర్మాంబులు వేరు వేరుగా ఉంటాయని మనిషి ప్రవర్తనను ఈ పద్యంలో తెలిపారు డివిఆర్.


అవసరంబు మేర యన్యభాషనయిన

మాటలాడవలయు మరువవద్దు

మాతృభాష యేను మనకు జీవనమగు

దారి పూల తోట దార్ల మాట


అవసరానికి అన్యభాషలు మాట్లాడు కానీ మాతృభాషనూ ఎప్పుడూ మర్చిపోవద్దు అదియే మనకు జీవితాన్ని అందిస్తుందని మాతృభాషను గొప్పతనం ఈ పద్యంలో తెలిపారు డివిఆర్.


దళితుడెంత యున్నత పదవి నుండిన

కులము కర్మ యనుచు కూర్మి లేదు

భరత భూమి నందు భాగ్యంబు చూడరా

దారి పూల తోట దార్ల మాట


దళితుడు ఎంత ఉన్నత పదవిని అధిరోహించిన వారితో   కలసిమెలసి ఉండరు. కారణం వాడు దళితుడిగా పుట్టడం అది వాడి కర్మ. భరత భూమిలో ఈవిదంగా చూడరా అని ప్రశ్నించారు. దీనికి సమాధానంగా మనం అందరం సమానం అనే భావనతో ఉండాలని గ్రహించాలంటాడు డివిఆర్.


చదువు కన్న మిన్న సంస్కారమున్నచో

చక్కగున్న యెడల చదువు లేల?

నోరు మంచి గున్న ఊరికేముందిరా!

దారి పూల తోట దార్ల మాట


చదువున్న చదువు లేకున్నా సంస్కారంతో వుండడం మిన్న. సంస్కారంతో కూడిన మాటలు మాట్లాడితే ఏ ఊరు అయితేనేం ఎక్కడైనా మంచిగా జీవించగల్గుతాము అంటారు 

డివిఆర్.


ఈ విధంగా దార్ల వెంకటేశ్వర రావు ఎన్నో  సన్నివేశాలు, సమస్యలు,సంఘటనలు, వాటిని తీసుకుంటూ  తెలుగు భాషా గొప్పతనం గూర్చి, అమ్మ గూర్చి, రాజకీయ నాయకుల గూర్చి, ఓటు ప్రాధాన్యతను గూర్చి, నీటిని గూర్చి, ఊరిని గూర్చి, నల్లధనం గూర్చి, ప్రకృతిని గూర్చి ఇది అది అని లేకుండా సందర్భోచితంగా మనసుకు తట్టి మది అంతరంగం నుండి మదించగా వచ్చిన మంచి పద్యాలను వెలువరించి తన మేధో జ్ఞాన బండారాన్ని మన చేతిలో పెట్టిన పుస్తకం దార్లమాట శతకం.ఇందులో ఒక్కొక్క పద్యం ఒక్కొక్క భావాన్ని మనకు తెలియపరుస్తూ ఈనాటి నిజజీవితంతో  ముడిపడిన విధానాన్ని అభిప్రాయాలను వ్యక్తం చేసినట్లు శతకంలో చెప్పిన గొప్ప దార్శనికుడు దార్ల వెంకటేశ్వరరావు. 

ఇట్టి మంచి పుస్తకం వెలువరించిన దార్ల వెంకటేశ్వర రావు గారికి నమస్సులతో అభినందన  శుభాకాంక్షలు.

గువ్వల చెన్న శతకంలో  పద్యం గొప్పతనం గూర్చి ఒక పద్యం.


గుడి కూలును, నుయి పూడును

వడి నీళ్ళం జెఱువు తెగును, వనమును ఖిలమో

చెడనిది పద్యము సుమ్మీ

కుడి యెడమల కీర్తి గన్న గువ్వల చెన్నా


గుడి కూలిపోతుంది, మంచి నీటి బావి పూడిపోతుంది, వేగంగా వచ్చే నీటి వేగానికి చెరువు తెగిపోతుంది, వనము కాళిపోతుంది ,కానీ ఎప్పటికి నశించిపోనిది పద్యం మాత్రమే అనే  భావన్నీ బట్టి దార్ల వెంకటేశ్వర రావు వెలువరించిన దార్లమాట శతకం ధరణి యందు మంచి గుర్తింపు పొందుతుంది.......

02 డిసెంబర్, 2021

సమకాలీన సమాజ దర్పణం 'దార్ల మాట శతకం'. డాక్టర్ జడా సుబ్బారావు (సాహిత్య ప్రస్థానం, సెప్టెంబరు, 2021 సౌజన్యంతో)

 

(సమకాలీన సమాజ దర్పణం 'దార్ల మాట శతకం' పేరుతో ప్రముఖ కవి, కథకుడు, పరిశోధకుడు డాక్టర్ జడా సుబ్బారావు గారు, సాహిత్య ప్రస్థానం, సెప్టెంబరు, 2021  సంచికలో ఒక విశ్లేషణాత్మకమైన వ్యాసాన్ని రాశారు. దీన్ని రాసిన డా. జడా సుబ్బారావుగార్కి, దీన్ని ప్రచురించిన సాహిత్య ప్రస్థానం మాసపత్రిక సంపాదకవర్గానికి నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ పత్రిక సౌజన్యంతో నా బ్లాగులో పునర్ముద్రిస్తున్నాను... ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు)






(సాహిత్య ప్రస్థానం, సెప్టెంబరు, 2021 సౌజన్యంతో)














12 జులై, 2021

దార్ల మాట శతకాన్ని ఆవిష్కరించిన ఆంధ్రప్రదేశ్ హోమ్ మినిష్టర్ శ్రీమతి ఎం. సుచరితగారు

 హైదరాబాదు విశ్వవిద్యాలయం తెలుగు శాఖాధ్యక్షులైన ఆచార్య దార్ల వెంకటేశ్వర రావు గారిచే విరచితమైన "దార్లమాట"శతకాన్ని ఆంధ్రప్రదేశ్ హోం శాఖామంత్రి గారైన శ్రీమతి మేకతోటి సుచరిత గారు, తెలంగాణ రాష్ట్ర ఐ. ఆర్.యస్. శ్రీ మేకతోటి దయాసాగర్ గారి చేతుల మీదగా ఈ రోజు అనగా 11-07-2021 న, హోంమంత్రి క్యాంపు కార్యాలయం, గుంటూరులో ఆవిష్కరించారు.

ఆంధ్రప్రదేశ్ హోమ్ మినిష్టర్ శ్రీమతి మేకతోటి సుచిరిత గార్ని పుష్పగుచ్చంతో ఆహ్వానిస్తున్న దృశ్యం.







దార్ల మాట శతకాన్ని ఆవిష్కరిస్తున్న ఆంధ్రప్రదేశ్ మోమ్ మినిష్టర్ గౌరవనీయులు శ్రీమతి మేకతోటి సుచరితగారు, మద్రాసు విశ్వవిద్యాలయం తెలుగు శాఖ అధ్యక్షులు ఆచార్య విస్తాలి శంకరరావు తదితరులు ఈ చిత్రంలో ఉన్నారు.






 ఈ కార్యక్రమంలో అనేకమంది అధ్యాపకులు, టీచర్లు, అనేకమంది సాహిత్యాభిలాషులు పాల్గొన్నారు.

 సభాధ్యాక్షులైన VSR & NVR  కళాశాల తెలుగు శాఖాదక్షులైన శ్రీమతి కె. వి. పద్మావతి గారు "దార్లమాట" శతకాన్ని పరిచయం చేసి వేదిక మీదకు ఆహ్వానితులను ఆహ్వానించారు. 

ముందుగా స్టేట్ అకడమిక్ కో-ఆర్డినేటర్ శ్రీమతి రాయబారం శోభారాణి గారు ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు గారు రచించిన "దార్లమాట" శతకాన్ని సభికులకు సవివరంగా వివరించారు.

అనంతరం  సుచరితమ్మ గారు మాట్లాడుతూ "సమకాలీన సమాజంలో కనిపిస్తున్న వివిధ అంశాలను సరళమైన పదాలతో పద్యాల్లో శతకగుచ్ఛంగా సాహిత్య లోకానికి అందిస్తున్నందుకు ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు గారిని మనసారా ఆశీర్వదిస్తున్నాను అన్నారు. 

తదనంతరం మద్రాసు విశ్వవిద్యాలయం తెలుగు శాఖాధ్యక్షులైన ఆచార్య విస్తాలి శంకర రావు గారు మాట్లాడుతూ... "పద్యం రాయాలంటే, అందులోను శతక పద్యం

రాయడమంటే కత్తిమీద సామే. ఎలా అంటే పరిధి తక్కువ, స్పష్టత ఎక్కువ,

అంకుశం లాంటి సూటిదనం, విశేషమైన భాషా పరిజ్ఞానం, సందర్భోచిత

చమత్కారం. అన్నింటికీ మించి సమస్య పట్ల పరిపూర్ణ అవగాహన ఇవన్నీ

సమృద్ధిగా ఉంటేనే శతక పద్యం పాఠకులకు హత్తుకుంటుంది. ఈ 'దారి

పూలతోట దార్లమాట' అనే దార్ల మాట శతకం చదివిన తరువాత ఈ లక్షణాలన్నీ

ఆచార్య దార్లలో పుష్కలంగా ఉన్నాయని తెలిసింది. ఈ శతక ప్రక్రియ అనేది

పాతదే అయినా అందులోని అంశం సమకాలీన సమాజం లోనిది. ప్రక్రియ

ఏదైనా సమకాలీన సమాజానికి దర్పణంగా నిలువగలిగితేనే ఆ ప్రక్రియ ప్రజల

హృదయాలలో శాశ్వతమైన స్థానం దక్కించుకుంటుంది. అందుకు చక్కని

నిదర్శనం ఈ 'దారి పూలతోట దార్లమాట' శతకమే... అన్నారు.

తదనంతరం DACTA ప్రధాన కార్యదర్శి,  SS&N కళాశాల తెలుగుశాఖాధ్యక్షులు ఆచార్యులు శ్రీ కాకాని సుధాకర్ గారు మాట్లాడుతూ... నా ప్రియమైన తమ్ముడు దార్ల వెంకటేశ్వరరావు గారు సమకాలీన విమర్శ రచనలో తనదైన వాదంతో సాహితీ ప్రియుల అభిమానాన్ని పొందారు. ఇప్పుడు పద్య రచనతో తన ప్రతిభను చాటుకుంటున్నందుకు ఆనందంగా ఉందన్నారు.

అనంతరం ఈ కార్యక్రమ నిర్వాహకులు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ యస్.సి., యస్.టి. ఉద్యోగ సంఘాల ప్రతినిధి (JAC) డాక్టర్. చుక్కా నాగభూషణం గారు మాట్లాడుతూ... దార్ల అంటే ఒక గొప్ప కవి. ఒక మంచి విమర్శకుడు. లోతైన విశ్లేషణలు చేయగలిగిన విశ్లేషకుడు. విద్యార్థులకు మార్గదర్శకంగా నిలుస్తూ వారిని నిరంతరం చైతన్య పరుస్తూ వారిని ఉన్నతులుగా తీర్చిదిద్దటం అనేవి వీరి సహజ గుణాలుగా చెప్పవచ్చునని కొనియాడారు.

తదనంతరం యస్.జి.వి. ఓరియంటల్ కళాశాల తెలుగు శాఖాధ్యక్షులు శ్రీమతి పిల్లి ఉషారాణి గారి వందన సమర్పణతో "దార్లమాట" శతకము పుస్తక  ఆవిష్కరణ కార్యక్రమము విజయవంతంగా ముగిసింది.

ఈ కార్యక్రమంలో టి. అశోక్ గారు (DRDA), డా. సి. బాలకృష్ణ, డా. బండారు విజయ్ కుమార్, కిరణ్ గారు (జే.సీ. పి.ఎ.) అనేక మంది అధ్యాపకులు, పరిశోధక విద్యార్థులు  పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు...

కార్యక్రమానంతరం కె.వి. పద్మావతి గారు అతిధులందరికీ ఆత్మీయ విందును ఏర్పాటు చేశారు...