ముక్తపదగ్రస్త పద్యాలు
అమ్మ ఒడిలోన దొరకును నమృత మమత
మమత పంచెడి తల్లియే మనకు దైవ
దైవ చింతన నేర్పును ధన్య బాల్య
దారి చూపించు నట్టిది దార్ల మాట.(1)
చిన్ని ప్రాయాన నేర్చిన చిలుక పలుకు
పలుకు నందున నిండును భావ శుద్ధి
శుద్ధి కలిగిన వెలుగును సుగుణ పథము
దారి చూపించు నట్టిది దార్ల మాట.(2)
బాల్య మందలి ఆటలు పరమ సుఖము
సుఖము నిచ్చును నెప్పుడు సుందరాట
ఆట పాటల నలరించు నంద మెపుడు
దారి చూపించు నట్టిది దార్ల మాట.(3)
వెన్నె లందున వినవచ్చు వింత కథలు
కథలు చెప్పును తాతయ్య కమ్మ గాను
గాన లీనమై నిదురించు ఘనత మమత
దారి చూపించు నట్టిది దార్ల మాట.(4)
..
కమ్మ నైనవి యౌవన కాంతి కలలు
కలలు గనవలె నెప్పుడు కష్ట మెరిగి
మెరుగు పరచును బ్రతుకును మేటి కృషియు
దారి చూపించు నట్టిది దార్ల మాట.(5)
వెలుగు నిచ్చును యౌవన విమల ప్రాయ
ప్రాయ మందలి విలువలె భద్ర సుఖము
సుఖము నిచ్చును లోకాన సుగుణ శీల
దారి చూపించు నట్టిది దార్ల మాట.(6)
సాహ సమ్మున సాగాలి సకల పనులు
పనులు తీరును నిరతము భక్తి తోడ
తోడు నిలుచును నెప్పుడు తోయజాక్షు
దారి చూపించు నట్టిది దార్ల మాట.(7)
ప్రతిభ చూపిన వెలుగును పదును శక్తి
శక్తి తోడను సాధించు సర్వ జయము
జయము నిచ్చును లోకాన జయము నెపుడు
దారి చూపించు నట్టిది దార్ల మాట.(8)
దేశ భక్తియు వెలగాలి దేశ మందు
మందు లాగుట మాన్పురా మంచి గుణము
గుణము లున్నను దొరకురా గొప్ప దారి
దారి చూపించు నట్టిది దార్ల మాట.(9)
సాధనము సేయుముర నీవు సకల విజయ
విజయ మందుము విధులను వీడకుండ
వీడకుండ జూపుము నీదు విక్రమమ్ము
విక్రమమ్మున వెలుగుము వీర పుత్ర!(10)
పట్టు విడువక సాధించు భవ్య జయము
జయము నందుము నీ శక్తి చాటి నేడు
నేడు జూపుము నీలోని నిశ్చలతను
నిశ్చలతతోడ గెలువుము నీవు జగము! (11)
శ్రమను నమ్ముము పొందరా సకల సుఖము
సుఖము కలుగును సత్కర్మ సుగుణమునను
సుగుణమున నీవు వెలుగుము సూర్యుడవుగ
సూర్యుడవు నీవొకడవౌదు సుప్రసిద్ధ! (12)
విద్య నేర్చుము వినయము వెలయునట్లు
అట్లు నేర్చిన విద్యయే అమృత మగును
అమృత మగు నీదు వాక్కులే అవని పైన
పైన నిలుపును నిన్ను నీ ప్రతిభ తోడ! (13)
విరియు పువ్వులు పంచును విమల గంధ
గంధ మట్లుగ నీ కీర్తి గాంచ వలయు
వలయు నీదు సద్గుణములే పరుల కొరకు
పరులకొరకును నిలుచున్న పరమహితము.(14)
మేఘ మడ్డైన సూర్యుడు మెరయు నవల
అవల వెలుగును జూపుము హద్దు మీరి
మీరి కష్టము గెలువుము మేటి వగుచు
వగుచు నిలువుము లోకాన వరద పుత్ర!(15)
విరియు పువ్వులు పంచును విమల గంధి
గంధ మట్లుగ నీ కీర్తి గాంచ వలయు
వలయు నీదు సద్గుణములే పరుల కొరకు
కొరకు నిలిచిన వాడవే గొప్ప మనిషి!(15)
విరియు పువ్వులు పంచును విమల తావి
తావి యట్లుగ నీ కీర్తి తనర వలయు
వలయు నీదు సద్గుణములే పరుల కొరకు
కొరకు నిలిచిన వాడవే గొప్ప మనిషి!(16)
భూమి సహనము జూపును మోయు బరువు
బరువు నైనను ఓర్చుము భయము వీడి
వీడి కడుగును వేయుము విజయ పథము
పథము జూపుము నీవును పరుల కొరకు!(17)
చిన్న చీమయు సాధించు శిఖరములను
శిఖరముల జేర నీవును జేయు తపన
తపనతోడను సాగుము త్వరిత గతిని
గతిని వీడక గెలువుము గమ్య మగను!(18)
నిరత మెప్పుడు పారును నిర్మల నది
నదియు వోలెను సాగుము నమ్మక మున
మునను గడపకు కాలము మోద ముగను
ముగను మందుము జయమును ముచ్చట గను!(19)
భూమి సహనము జూపును మోయు బరువు
బరువు నైనను ఓర్చుము భయము వీడి
వీడి కడుగును వేయుము విజయ పథము
పథము జూపుము నీవును పరుల కొరకు!(20)
తొలగు చీకటి రవిరాక తోడ నెపుడు
ఎపుడు జ్ఞానము వెలుగును నీవు గనుము
గనుము విద్యను నీవు ప్రకాశ మొంద
మొందరా విజయంబును మోద మొనర! (21)
…
9.4.2026
ఏప్రి లొచ్చిన జెప్పాలి వింత వార్త
వార్త విన్నను నవ్వును వసుధ లోన
లోన నింపును నెప్పుడు లేని వింత
దారి చూపించు నట్టిది దార్ల మాట.
యుద్ధ మాగుటనెడివార్త యుక్త రీతి
రీతి మీరగ తగ్గుట రేటు పసిడి
పసిడి ధరలును తగ్గిన పట్టతరమె!
దారి చూపించు నట్టిది దార్ల మాట.
1.4.2026
....
కుటుంబం గొప్పతనం 20.3.2026
‘కలిసిఉంటే కలదు సుఖం’
కం.
విడివిడి పూలను దారము
గడగడ కుచ్చంగ దండ కావును ధరలో
చెడకను కుటుంబ మొకటయి
నడచిన నానంద మొసగు నవనిని దార్లా!
(విడివిడి పూలను దారంతో కలిపి గుచ్చితేనే అది ఒక అందమైన దండగా మారుతుంది. అలాగే, ఒక కుటుంబంలోని సభ్యులందరూ విడిపోకుండా కలిసికట్టుగా ఉంటేనే, ఆ కుటుంబం ఈ లోకంలో ఎంతో ఆనందంగా ఉంటుంది.)
ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు,
యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్
విడిపోక కూడి యున్నను
గడగడ విజయమ్ము లబ్బు గౌరవ మొసగున్
విడువక కలిసున్నప్పుడె
కడు మోదము గల్గు ధరను గాదె నిజమ్మౌ
నదులు వేర్వేరు గలిసిన నబ్ధి యగును
కలసి మెలిసియు నుండగ గల్గు సుఖము
పరుల కీడెన్న కన్వయ భాగ్య మొసగు
నవని సంతస మొనరించు ననఘ దార్ల!
కలిసి మెలిసియు నున్నచో కలుగు సుఖము
విడివి డిగనున్న కష్టముల్ వెంట నాడు
ఒక్క త్రాటిపై నడచిన నుర్వి పైన
కీర్తి వెలుగును ధరలోన గీర్తి దార్ల!
ఒక్కటిగ కూడి యున్నను
చెక్కని విజయమ్ము లబ్బు స్థిరముగ ధరలో
నెక్కడనైనను గెలుచును
మిక్కిలి బలమౌను గదర మేలగు దార్లా!
కష్టసుఖాలనె పంచుచు
ఇష్టముతో సాయపడగ నిలలో నెవరున్
నష్టము పొందరు ఎపుడున్
పుష్టముగా నుండు నెపుడు పొందుగ దార్లా!
సాహిత్య విమర్శ ప్రయోజనాలు పద్యాలు
సరసపువిమర్శయె సృజన సాక్షి నిలుచు
మరువ లేనిది శిల్పపు మర్మ మెపుడు
తరణి వోలెను దోషపు తమము బాపి
నిరత కాంతిని నింపును నీతి తోడ!
మరువ లేనిదియువిమర్శ మర్మ మెపుడు
తరణి వోలెను దోషపు తమము బాపి
నిరత కాంతిని నింపును నీతి తోడ
వరము వోలెను సాహిత్య వన్నె దెచ్చి!
కావ్య రసమును గ్రోలెడి కౌశలమ్ము
నేర్పు చుండును గ్రంథము నిరత మిలను
భావ రాగపు లోతులు పంచు చుండు
తృప్తి నిచ్చును మనసున దీప్తి నింపి!
.....
కావ్య నిర్వచనం - తేటగీతి
1. భావము - భాష:
శబ్ద మర్థంబు రెండును చక్కగాను
గూడి యున్నది కావ్యమై నిలుచు నిలను
భావ రమ్యత కలిగిన భాష యందు
నిరత మమృతంబు కురియును నిజము గాను
2. రసము - ఆనందము:
రసము లొలికెడు రీతిగా రచన జేయ
హృదయ మానంద మొందును నిరత మచట
లోక రీతుల దెల్పుచు శ్లోక మెపుడు
కావ్య మై వెల్గు సత్యము గనగ ధరను.
భావమమృతము గూర్చును భాషయందు
లోకరీతులు దెల్పుచు లోభమెడలి
హృదయమందున ఆనందమబ్బు నచట
సదమలంబుగ శాంతిని సాధనమున!
చీకటిని బాపి రవియును జేరు నవని
వెలుగు నొసగుచు ప్రజలను మేల్కొలుపును
బుద్ధి వెలుగును నింపుచు బుధుడు కవియు
జ్ఞాన కిరణము లొసగును జగతి కెపుడు.
ముజ్జగంబుల వెలుగొందు ముక్తి కీర్తి
ధనము నెంతయునునొసంగు ధన్యమగుచు
లోక రీతుల నెరుగించు లోకమందు
కావ్య మమృత ప్రవాహమై కలుగు నపుడు
కీడు బాపును శుభముల గెలుపు నొసగు
వెంటనే పరమానంద విభవ మిచ్చు
సత్కవిత్వము హితమును సాకుచుండు
రమ్య గుణముల రాశిగా రాజిలుచును.
ప్రియము గొల్పెడు సతి వోలె హితము దెల్పు
లలిత పదముల మార్గమున్ లక్ష్యమగును
కావ్య పఠనాన గలుగును ఘనము లైన
సత్ఫలమ్ములు నెప్పుడు సమ్మతముగ.
కీడు బాపును -శుభముల -గెలుపు నొసగు
వెంట -వెంటనే -పరమాన -వెలుగు నిచ్చు
సత్క -విత్వము -హితమును -సాకు చుండు
రమ్య -గుణముల -రాశిగా -రాజి లుచును.
....ప్రపంచ కవితా దినోత్సవం 2026
విశ్వ శాంతిని కోరుచు విరియు సుమము
ప్రేమ రసమును చిందించు మేఘ మాల
జాతి భేదము లేనిట్టి సాటి మనిషి
కవియె లోకపు అద్దమై కానవచ్చు.
సత్య వాక్కు తోడ సాగును కవితయు
శాంతి మంత్రములను చాటు చుండు
అక్షరాల తోడ నర్చించు లోకాన
మంచి మనుగడకది మారు పేరు.
భావ వీణను మీటెడి పలుకు పాట
గుండె లోతుల తడిపెడి కుంద ధార
అక్ష రమ్ముల కూర్పుతో అద్భుతమ్ము
కవిత నిలుపును లోకాన కాంతి రేఖ.
భావ వీధుల విహరించు పక్షి వోలె
పదములన్నియు పరుగున వచ్చి చేరు
కమ్మనైనట్టి తేనెటల్ కవితలవియె
మనసు రంజింప జేసెడి మధుర సుధలు!
తెలుగు బాసకు వందల వెలుగువమ్మ
తేట గీతిగ సాగెడి తీపి పలుకు
జాతి గౌరవ చిహ్నమై గ్రాలు చుండు
కవిత కన్నను మిన్నయు కాన రాదు!
కష్ట జీవుల కన్నీటి కథల రాసి
న్యాయ మార్గము జూపెడి నాయ కుండు
కవియె లోకపు కన్నుగా కనిపి పించు
సత్య మెపుడును పలుకును చల్ల గాను!
…
అక్షర రూపపు శక్తులు
అక్షయమై వెలుగు నిచ్చు నవనిని మెరిసెన్
పక్షము వహించు సత్యపు
దక్షత గల శబ్ద సంపదను గను దార్లా!
భావన లేనిదె జగతికి
జీవము లేదనెడు మాట సిద్ధము కనగన్
దీవన లోకపు దర్పణ
మై వెలయును నిత్య సత్య మలరగ దార్లా!
భావ వీధి లోన పరవళ్ళు దొక్కుచు
అక్షరాల వెలుగు లవని నిండ
కవిత పుట్టు నపుడు కమనీయ రాగమై
లోక మలర జేయు లోల దార్ల!
మానవత్వ మమత మనసున నింపుచు
మమత పంచు నట్టి మాట కవిత
లోక హితము గోరి లోభము వీడెడి
జ్ఞాన మార్గ మిదియె గనుము దార్ల!
ఊహలందు పుట్టి ఉర్విపై నిలచును
నిత్య సత్య రూప నిలయ మగుచు
కావ్య జగతి లోన కమనీయ భావమై
ముక్తి నిచ్చు నదియె ముదము దార్ల!
నేడు లోక మంత నిండగ కవితయు
గీత మాల లల్లి కీర్తి పరచ
శబ్ద సుధల తోడ సాగును పండుగ
విశ్వ వీణ పైన వినుము దార్ల!
ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు 21.3.2026
....
శ్రీరాముని దయచేతను
నారూఢిగ కొందరైన నౌరాయనఁగా
ధారాళమైన నీతులు
నోరూరగ హాస్యముగను నుడివెద దార్లా
పనియేదొ వచ్చినప్పుడు
వినయముతో భజన జేసి వెన్నను బెట్టున్
పని తీరినంత జూడుము
కనుమరుగై పోవుచుండు గదరా దార్లా!
దండము పనికొక్కటియును
దండము లాభంబు గలుగు తరినిడు సుమ్మీ!
దండము స్వార్థము నిండగ
దండము పెట్టినను నమ్మ దగదుర దార్లా!
ఆడుచు మాటల నెన్నో
వేడుకగా బల్కుచుండ వినగదె సుమ్మీ!
తోడుగ నిలవని బాసలు
జూడగ నర్థాలు వేరు జుమ్మిది దార్లా!
ధనమును గల్గిన వానికి
వినయముతో మ్రొక్కుచుంద్రు వింతగ సుమ్మీ!
గుణమును జూడరు గానీ
గణనము జేతురు ధనమును గదరా దార్లా!
తెలియగ జెప్పెడి గురువును
నలవడ బుధులును నయమును నమ్మగ జెప్పన్
కలయగ నుండెడి చోటున
మెలగుము లేనట్టి చోటు మెట్టకు దార్లా!
మెరిసెడి వేషము నుండగ
ధరలో గొప్పలును జెప్పి తప్పును జేయన్
విరివిగ నగలను వేసిన
నరుడే దొంగగ దొరకుట నవ్వే దార్లా!
కలలో నైనను తెలియదు
బలముగ గొప్పలను జెప్పి భాసిలు సుమ్మీ!
నలువురలోనన్ నడవక
మెలగును దా వేద్యుడనచు మేదిని దార్లా!
మెలగని శిష్యుడు తరగతి
నలవడ బుధులున్న చోట నవ్వుల పాలౌన్
నలమున బోధన చెడును గ
నలవడ దే తీపి చెరకు నష్టము దార్లా!
అప్పును అడిగేటప్పుడు
చెప్పెడు మాటలను వినగ చిత్రము సుమ్మీ!
చప్పున తీర్చగ వలసిన
నప్పుడె ముఖమును మలచును నలగక దార్లా!
చందమామ వంటి చక్కని మోముండు
భాష విన్న నదియు బండబూతు
చక్కదనపుటెరకు జిక్కి చావకుమోయి!
దార్లమాట! వినుము ధన్యచరిత!
పైకి రంగు లేక పసలేక నున్నను
పలుకు లందు చిందు -పరమ సుధలు
గుణము జూసి నీవు గూడరా నేస్తమా!
దార్లమాట! వినుము ధన్యచరిత!
విశ్వమంతమాయ వినుము దార్ల
సెల్ఫి దిగియు వాడు చిత్రాలు వదులును
జ్ఞాని యెపుడు నుండు శాంతముగను
డప్పు మ్రోగినట్లు డాలరు మ్రోగునా?
విశ్వమంతమాయ వినుర దార్ల!
అప్పు చేసి వాడు ఆడంబరము జేయు
సొమ్ము ఉన్నవాడు సోలిపోడు
చింపి చాట మ్రోగు -సిరులున్న మ్రోగునా?
విశ్వమంతమాయ వినుర దార్ల!
పీఠ మెక్కినంత పెద్దన్న లందురు
దిగియె నేని వాడు దిక్కులేని
కుర్చి కున్న విలువ -కూలంగ నుండునా?
విశ్వమంతమాయ వినుర దార్ల!
పనిని చేయకుండ పడకపై నుండును
పనులు చేయువాడు పలుకబోడు
కుక్క మొరిగినట్లు కోయిల మొరుగునా?
విశ్వమంతమాయ వినుర దార్ల!
వేషమంత చూడు వేడుకగానుండు
మనసు విప్పి చెప్ప మాట రాదు
చదువు రాని వాని చందమీ లాగురా
విశ్వమంతమాయ వినుర దార్ల!
విశ్వదాభిరామ వినుర దార్ల
సారము లేని మెప్పులును, సత్యము లేని ప్రశంసలన్ సదా
కోరిన రీతి బల్కుచును, కొల్వును జేసెడి భక్త జాలమున్
నేరుపు తోడ ముచ్చటలు, నిత్యము జేయుచు నున్న వారలన్
దూరము పెట్టవయ్య భువి -దుర్మతి మీరగ దార్ల ధీమణీ!
ఎప్పుడు విందులు చేసిన
నప్పుడు వత్తురు జనంబు లతివేగముగన్
దెప్పగ మద్యం బిచ్చిన
నొప్పుగ మెత్తురు గదయ్య నుర్వినిదార్లా!
....
ఎండ వేడిమి సెగలతో నిండియుండ
తప్త ధరణిపై కురిసెను చల్లనైన
వాన చినుకులు హాయిని వరుస నొసగె
పుడమి పులకించె నిప్పుడు పొలుపు గనెను.
(వేసవి కాలపు ఎండల తీవ్రతతో వాతావరణమంతా వేడి సెగలతో నిండిపోయి ఉన్న సమయంలో, ఎండకు బాగా తపించిపోయిన ఈ భూమిపై చల్లని వాన చినుకులు కురిశాయి. ఆ వర్షపు ధారలు వరుసగా పడుతూ ప్రాణికోటికి ఎంతో హాయిని చేకూర్చాయి. వాన తాకిడికి ఈ నేల తల్లి పులకించిపోయి, ఇప్పుడు కొత్త కళను సంతరించుకుంది.)
తప్త ధర పైన కురిసెను
సప్త గిరుల యందు వరుస చల్లన లొసగెన్
గుప్తముగ నున్న మట్టిని
తృప్తిగ నలరించె వాన దీవన దార్లా!
ఎండవేడికి బాగా తపించిపోయిన ఈ భూమిపై ఆకాశం నుండి అమృతంలా వాన కురిసింది. ఆ చల్లని చినుకులు కొండకోనలన్నింటినీ వరుసగా తడుపుతూ ప్రకృతికి ఎంతో ఉపశమనాన్ని ప్రసాదించాయి. ఓ దార్లా! ఆ వాన అనే దీవెన కురవగానే, అప్పటివరకు నేలలో నిగూఢంగాదాగి ఉన్న కమ్మని మట్టి వాసన వెదజల్లుతూ, అందరి మనసులనూ ఎంతో తృప్తిగా అలరించింది.
మత్తపు టెండలు గూలెను
చిత్తము రంజిల్ల వాన సిరులను గురిసెన్
మొత్తము పుడమిని తడిపెను
హత్తెను మదినినలరించె హాయిని దార్లా
(తీవ్రమైన వేసవి ఎండల సెగలు అగిపోయాయి. మనసు పులకించేలా వాన సిరులను కురిపించింది. ఆ వాన భూమినంతటినీ తడిపివేసింది. ఓ దార్లా! ఆ చల్లదనం మనసును హత్తుకుని, ఎంతో హాయిని కలిగిస్తూ అలరించింది.)
తమ్ముల రమ్మని పిలవగ
కొమ్మల చాటున నలరగ కురిసెను వానల్
నెమ్మిగ నాడిరి హాయిగ
నమ్మగ నలరెను నయముగ నవ్యము దార్లా!
(ఆకాశం నుండి వాన చినుకులు కురవగానే, పిల్లలు తమ తోటి అన్నదమ్ములను (తమ్ముల) ఆడుకోవడానికి రమ్మని ఎంతో ఉత్సాహంగా పిలిచారు. ఆ చినుకుల తాకిడికి తడవకుండా చెట్ల కొమ్మల చాటున దాగుడుమూతలు ఆడుతూ, ప్రకృతి పులకింతను చూసి వారు ఎంతో ఆనందించారు . ఓ దార్లా! ఆ వానలో వారు ఎంతో నెమ్మదిగ, ఎంతో హాయిగా ఆడుకుంటూ ఉంటే... వారి మనసులు కొత్త ఉత్సాహంతో, వర్ణించలేనంత అందంగా వికసించాయి).
....పండుగ నాడు మేనల్లుళ్ళు రాగా…
నూత నాంబర ధారులై నూత్న కాంతి
నొసగు మేనల్లు లందము నొప్పు గాగ
గాంచ కనుల పండువ యాయె గార వమున
నలరు చున్నారు మురిపెము లొలుకు చుండ!
మతం మారితే కులం పోతుందా?
మారిన మతమున గానీ
తీరదు గద కులము జగతి -దృక్పథ మందున్
చేరిన విశ్వాసములే
మీరవు గద పుట్టు గుర్తి -మేలిమి దార్లా!
(భావం: ఓ దార్లా! మతం మారినంత మాత్రాన సమాజం దృష్టిలో కులం మారిపోదు. నమ్మకాలు మారవచ్చు కానీ పుట్టుకతో వచ్చిన గుర్తింపు మారదు.)
మతమును మార్చుకొనగనే
గతి మారదు దళిత జనుల -కానగ భువిలో
సతతము గుర్తింపును తా
మతమే మార్చదుగ నిజము -మహిలో దార్లా!
(భావం: ఓ దార్లా! మతం మార్చుకున్నా దళిత జనుల సామాజిక స్థితిగతులు వెంటనే మారిపోవు. ఈ లోకంలో మతం ఒక్కటే వారి మూల గుర్తింపును మార్చలేదు.)
వేషము భాషయు మారిన
దోషపు కుల తత్వ మెందు -తొలగదు జగతిన్
దోషము మానస మున నిడు
రోషపు హేళనలు పోవు -రూఢిగ దార్లా!
( ఓ దార్లా! వేషభాషలు మారినా సమాజంలో వేళ్లూనుకున్న కులతత్వం అంత సులభంగా పోదు. మనసుల్లో ఉన్న వివక్ష, హేళనలు మతం మారినంత మాత్రాన తొలగవు.)
చట్టము రీతుల జూడగ
గట్టున బడలేరు పేద -గతి గల వారున్
మెట్టును మార్చినతోడనె
నెట్టుకు రాదెపుడు హక్కు -నిఖిలము దార్లా!
పేరును మార్చిన నేమియు
తీరదు కద పుట్టు కులము -దృశ్యము లోనన్
చేరిన గుంపుల లోనన్
మీరవు గద పాత ముద్ర -మేలిమి దార్లా!
(భావం: ఓ దార్లా! పేరు మార్చుకున్నా, కొత్త మతంలో చేరినా సామాజిక దృష్టిలో పుట్టుకతో వచ్చిన కులం అలాగే ఉండిపోతుంది. ఏ గుంపులో చేరినా పాత కులముద్ర వారిని వెంటాడుతూనే ఉంటుంది.)
మారిన దైవము నైనను
తీరదు గద కులపు ముద్ర -దేహానికలన్
చేరిన గుంపుల లోనన్
మీరదు గద పాత ముద్ర -మేలిమి దార్లా!
కొత్తగ చేరిన మతమున
మెత్తగ మాటాడు వారె -మేలిమి జనులన్
హత్తుకు పోనీరట గద
చిత్తము లోపల కులంబు -స్థిరముగ దార్లా!
(భావం: ఓ దార్లా! కొత్తగా చేరిన మతంలో పైకి మెత్తగా మాట్లాడే వారు ఉన్నప్పటికీ, వారు దళితులను తమలో పూర్తిగా కలుపుకోరు. ఎందుకంటే వారి మనసుల్లో కుల వివక్ష ఇంకా స్థిరంగానే ఉంటుంది.)
చదువుల యందున హక్కులు
వదులుకొనగ వలసి వచ్చు -వాస్తవ మవగన్
కదనము చేయక దక్కవు
పదవుల హక్కులు గెలువగ -పావన దార్లా!
కొత్త మతము లోన కూర్మి పెరిగినను
పాత కులము గుర్తి పోదు జగతి
పేరు మారవచ్చు పెంపు మారగవచ్చు
పుట్టు కులము మార బోదు దార్ల!
(ఓ దార్లా! కొత్త మతంలో ప్రేమ, ఆప్యాయతలు పెరిగినప్పటికీ, ఈ లోకంలో పాత కుల గుర్తింపు మాత్రం పోదు. వ్యక్తి పేరు మారవచ్చు, హోదా పెరగవచ్చు కానీ, పుట్టుకతో వచ్చిన కులం మారదు.)
మతము మారవచ్చు మహినుండు కులములు
బయట వేషమంత భ్రమలు తప్ప
లోప లున్న ముద్ర లొకసారి పోవునా?
విశ్వమెంతమాయ వినుర దార్ల!
మతము మారినంత మనుజుడు మారునా?
గుణము మారకున్న కులము పోదు
నీటి రంగు మారి నిలకడ మారునా?
విశ్వమెంతమాయ వినుర దార్ల!
మాల మాదిగంచు మతమును వీడినన్
చర్చి లోన గూడ చదువు వేరు
క్రీస్తు పేరుగాని కీచులాటలుహోరు
విశ్వమెంతమాయ వినుర దార్ల!
క్రీస్తు రక్తమందు కిల్బిషమేలనో?
పేరు మారినంత తీరు మారు?
లోన నున్న కులము లోకాన దాగునా?
విశ్వమెంతమాయ వినుర దార్ల!
మతము మారినంత మమతలు పెరుగునా?
పేరు మార్చుకున్న తీరు మారు?
లోన దాగు కులము లోకాన వీడునా?
విశ్వమెంతమాయ వినుర దార్ల!
కులము బాసి పోవ కొంపలే మారునా?
మతము మారినంత మనుజుడగునె?
నీటి రంగు మారి నిలకడ మారునా?
విశ్వమెంతమాయ వినుర దార్ల!
మతము మారినంత మలినము వదులునా?
మమత పెరిగినంత మతము యేల?
మనుజులందు చూడు మానవతలజాడ
విశ్వమెంతమాయ వినుర దార్ల!
అక్షరమ్ము నేర్చి అజ్ఞానముతరుము
కుటిల బుద్ధి పోయి కులము పోవు
మంచి మనసు కన్న మతమేమిచేయురా!
విశ్వమెంతమాయ వినుర దార్ల!
గుళ్లు చర్చిలంచు గుంజాటనలుయేల?
కులము గోత్రమంచు కొట్టుకొనగ?
మనుషులొకటె యనెడి మమకారముంచరా!
విశ్వమెంతమాయ వినుర దార్ల!
రంగు మార్చినంత రాయి రత్నమగునె?
వేషములను మార్చ వేరు పడునె?
అడగి పోవునెట్లు? అస్పృశ్య భావంబు!
విశ్వమెంతమాయ వినుర దార్ల!
పాలు మార్చినంత పాత్రము మారునా?
మతము మారినంత మనుజుడగునె?
లోన దాగు కులము లోకాన వీడునా?
విశ్వమెంతమాయ వినుర దార్ల!
ముందు మతమునందు హీనముగా జూడ
మతము మారినంత మనుజుడగునె?
పాత ముద్ర పోదు రోతయుకొనసాగు
విశ్వమెంతమాయ వినుర దార్ల!
వందలేండ్లు పడిన వాతలు మాయునా?
మతము మార్చుకున్న మలినమవునె?
అడగి పోవు నౌర అస్పృశ్య భావంబు
విశ్వమెంతమాయ వినుర దార్ల!
గౌరవమ్ము కోరి గడప దాటిన గాని
కులము పేరు నడుగు కుటిల బుద్ధి
మనిషి విలువ కన్న మతమేమి చేయురా?
విశ్వమెంతమాయ వినుర దార్ల!
అన్నమొకటె యైన అవమానమేలనో?
బంతి లోన జూడ పంక్తి వేరు
నీచ బుద్ధి పోని నిలకడ మతమేల?
విశ్వమెంతమాయ వినుర దార్ల!
నీరు ఒకటె యైన నిమ్న జాతికి వేరు
బావి నందు జూడ బాట వేరు
అంటరాని భావ మడగిపోగలుగునా?
విశ్వమెంతమాయ వినుర దార్ల!
చదువు నేర్చినంత సంస్కార మబ్బునా
కొలువు లోన గూడ కులము అడుగు
ముద్ర చెరిగి పోదు మునుపటి రోతయే!
విశ్వమెంతమాయ వినుర దార్ల!
వందలేండ్లు పడిన వంచనలచరిత్ర
మతము మారినంత మాయునొక్కొ?
మనసు మారకున్న మతము వ్యర్థము సుమీ!
విశ్వమెంతమాయ వినుర దార్ల!
మానవత్వ మెరిగి మనుగడ సాగించు
మతము కన్న మిన్న మమత జూడు
అందరొకటె యనెడి ఆశయే మేలురా
విశ్వమెంతమాయ వినుర దార్ల!
పదవి వచ్చినంత పాత కులము పోవు?
ఓటు వేయు వేళ ఒకటి యగును
గెలిచినంత గూడ గెలువదు కులమురా
విశ్వమెంతమాయ వినుర దార్ల!
పసిడి వన్నె జూడ పరమత మొకటైన
పాత ముద్ర తోనె పలుకు కులము
ఇత్తడనుచు నెంచు ఇల లోని లోకము
విశ్వమెంతమాయ వినుర దార్ల!
గుడిని వదిలి వెళ్ళి గుమ్మము మార్చిన
బంతి లోన జూడ పంక్తి వేరు
అంటరాని తనము ఆగిపోవుటయెట్లు?
విశ్వమెంతమాయ వినుర దార్ల!
అందరొకటె యనగ అందమైనదిమాట
లోన జూడ కులము లోతులుండు
మతము మారు గాని పాతముద్రలుపోవు?
విశ్వమెంతమాయ వినుర దార్ల!
ముక్తపదగ్రస్తమిప్పుడుముదముతోడ
కూర్చుచుండగా శ్రద్ధగా కోర్కెమీర
కంటి నాచార్య దార్ల మీ కవనమందు
సాగు చుండాలి సత్కవుల్ స్వాగతింప
గోవిందు గోవర్ధన్, 1.4.2026
ముక్తపదగ్రస్తములతోడ మోదమలర కూర్చుచున్నారుపద్యాలుకోర్కెమీర నరసికవిపండితులునెల్లరాదరమున స్వాగతించగనత్యంత సంతసమున
గోవిందు గోవర్ధన్, 9.4.2026
అంకురార్పణ - ఆటవెలది శతకం
పద్యమిలాంటి లక్షణాలతో ఉండాలని చెప్పినంత సులువు కాదు పద్యం రాయడం. అలాగే పద్యం రాసినంత సులువు కాదు లక్షణ సమన్వయం చేయడం. ఈ రెండింటినీ మించి కవిత్వం కూడిన పద్యం రాయడం, పద్యంలోని కవిత్వాన్ని
గురువు లఘువుఁజేసి కుంచించి కుంచించి
లఘువు గురువుఁ జేసి లాఁగిలాఁగి
కవితఁ జెప్పునట్టి కవిగులామునుబట్టి,
ముక్కుఁగోయ వలయుఁ ద్రొక్కిపట్టి... అని ‘కావ్యాలంకార సంగ్రహం’ పాఠంగా చెప్పేటప్పుడు కేవలం ఛందస్సు సరిపోతే అది పద్యం కాదని మా విద్యార్థులకు చెప్పడం నాకు తెలుసు. ఆ పద్యాన్ని ఇలా రాశాను కూడా!
కం.
ప్రాసల కోసము పదముల
కోసియు నతికించు కవిని కొట్టగ వలయున్
భాసించు భావమున్నను
దోషములే లేని కవిత దొరకుట మేలే!
దీన్నే ఆటవెలది, తేటగీతులలో చెప్తే ఎలా ఉంటుందని ప్రయత్నించానిలా.
అర్థముట్టిపడగ నమరిన కవితయే
సార్థకముగ నిలుచు జగతి యందు
గణము కోసమచట గాడిద యరుపులు
కూయనేల నోరు నొప్పి పుట్ట!
గణము లఘువని లాగియు కంఠమెత్తి
గురువు కావని నొక్కియు గోల చేయు
కవిని గన్నను జాలము కలుగు నెపుడు
ముక్కు కోయుటె మేలౌను ముదము తోడ!
యతిని గూర్చు కొరకు యాతన పడనేల?
ప్రాస కొరకు పదము జేసితెగడ?
నడక లేని కవిత నవ్వుల పాలౌను
కవిని ద్రొక్కి పట్ట గడగ వలయు!
చిన్నప్పుడు నాలు పాదాల్లా శబచదాలను పేర్చి
అనుకునేవాడిని. తర్వాత పాఠశాల నుండి కళాశాలకు వచ్చే సరికి పద్యానికి సంబంధించిన అనేక అంశాలు నేర్చుకున్నాను. తగినంత శబ్దజ్ఞానం, దాన్ని వాడుకనే నిత్యం మనం చూసే, ఆలోచించే భావాలకు, సామాజిక స్పృహకు అక్షర రూపం ఇవ్వాలనే తపనతో మొదలైన ప్రయాణమే పద్య సాధన.
కళ్ళతో జూచు నదియెల్ల గాదు నిజము
చెవుల విన్నది నమ్మిన జేటు దెచ్చు
నెండ మావుల నీరని నెంచ నగునె?
దారి చూపించు నట్టిది దార్ల మాట
నిక్క మొకచోట బలుకగ నిడుము లెంచు
పాము నడుమని నున్నట్లు భయము గొల్పు
వివర ముగజెప్ప నాపదల్ వెన్నె నంటు
దారి చూపించు నట్టిది దార్ల మాట
సంభాషణ దార్ల మాట తేటగీతి
1. పద్యం:
మంచి మాటలు పల్కగ మనసు విరియు
తేనె చినుకుల మాదిరి తృప్తి నొసగు
విమల విజ్ఞాన గోష్ఠియే విందు నిచ్చురా
దారి చూపించు నట్టిది దార్ల మాట.
2. పద్యం:
కఠిన భాషణ మేనాడు గెలుపు నిడదు
మృదువు పల్కే ప్రశాంతుని మేలు చేయు
సమ్మతము నొందు గోష్ఠియే సంతోషమిడు
దారి చూపించు నట్టిది దార్ల మాట.
3. పద్యం:
మలిన చిత్తము వీడగ వెలుగు వచ్చు
సత్య వాక్యము జగతికి సారమౌను
ముచ్చటైనట్టి చర్చలే మోదమిచ్చు
దారి చూపించు నట్టిది దార్ల మాట.
4. పద్యం:
పూల గంధము గాలికి పొందు నట్లు
మంచి మాటలు లోకాన మహిమ నింపు
కలత బాపెడి పలుకులే కల్ప తరువు
దారి చూపించు నట్టిది దార్ల మాట.
5. పద్యం:
చెలిమి తోడుత విజ్ఞాన సిద్ధి కలుగు
తర్క హీనపు మాటలు తగవు తెచ్చు
సహజ శైలిని పల్కుటే సార్థకమ్ము
దారి చూపించు నట్టిది దార్ల మాట.
తెలుగు బాసమ్మ తీయని తేనె లొలుకు
అమ్మ నుడి ఇది మనకెంతొ ఆప్త మగును
భావ వ్యక్తీక రణమున పరము మిన్న
నేర్చు కోవాలి మనమున నిత్య మెపుడు
....
రెక్కల కష్టము జేయుచు
దిక్కగుచును నైదుగురిని దీర్ఘాయువుగా
చక్కగ జదివించె నిలన్
అక్కజ ముగదార్ల అబ్బయి ఘనుడగునిలన్
చదువక పోయిన నమ్మగ
చదువుల నిలయములు జేసి చాటెను గరిమన్
ఐదుగురి బిడ్డలన్ గని
హృదయము మురియంగ దార్ల అబ్బాయినిలన్
అక్షర రూపిణి మహిళా!
శిక్షణతో జగతి గెలుచు శిల్పివి నీవే!
దక్షతతో సాగగదే!
వీక్షణలో కాంతి నింపి వెలుగుము దార్లా!
అజ్ఞా(త)
నేనేమి రాయాలో
నువ్వు చెప్పడమేంటో
నేనేమి మాట్లాడాలో
నువ్వు శాసించడమేంటో
నేనేమి కట్టుకోవాలో
నువ్వు సూచించడమేంటో...
నేను ఆకలితో నకనకలాడినప్పుడు
నువ్వో మెతుకు విదిల్చావా?
నేను ఎండిన గొంతుతో
ఆశతో చూస్తున్నప్పుడో నీటి చుక్కవయ్యావా?
నేను చిక్కి శల్యమై
మానాభిమానాల్ని దాచుకోవాలని
సిగ్గుతో తలదించుకొన్నప్పుడు
నువ్వో సిగ్గు బిల్లవయ్యావా?
ఇప్పుడు
నేనెలా ఉండాలో
నువ్వెలా చెప్తావ్?
ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు
31.3.2026
ఆకలిని తీర్చ, దాహము నణప లేక,
సిగ్గు బిళ్ళవు గాకను, చిక్కి నపుడు
సాయ మందక, నేడేల శాసనముల
జేయ జూచెదు? నీవేల జెప్ప తగును?
(నా ప్రాథమిక అవసరాలైన ఆకలిని, కనీసం దాహాన్ని గానీ తీర్చలేకపోయావు. నేను కష్టాల్లో ఉన్నప్పుడు అండగా నిలబడి సాయం చేయలేని నువ్వు, ఈరోజు నా పై శాసనాలు (చట్టాలు) చేయడానికి నీకే అర్హత ఉంది? )
బాబు నిద్ర.. తండ్రి అనుభూతి పద్యాలు
నిదుర వదుల లేక నిమురుచు ముసుగును
దొర్లు చుండు సుతుడు దుడుకు తోడ
లేవ వయ్య యనుచు లేత ముద్దుల నిడ
హాయి నిండె నెదను అమృత ముగను!
నిదురను వదులుము నాన్నా
పదిలముగా బడికి వేళ పరగుచు నలరన్
ముదమున లేవగ వేడెడు
పదముల తండ్రియు మురియును భక్తియు నొందన్!
కనుల విప్పవే కన్నయ్య కమల నాభ!
నొనరఁగన్ వేకువయ్యెను నుర్వి యందు
అలరి ముద్దులు పెట్టియు నలరు తోడ
నెనరు తోడ లేపగఁ దండ్రి కెంతొ హాయి!
చంద్ర కిరణాల చల్లని చాయ లందు
కలువ వికసించు రీతిగ కనుల విందు
ఎడమ చేతిపై సుతుడును నిదుర బోవ
కుడి కరమ్మున నిమురగా కుదురు మనసు!
చందనంబును బూసిన చందమునను
మెడను ముత్యాల సరులును మెరిసినట్లు
కొడుకు తాకగ వెన్నెల కురిసినట్లు
తన్మయత్వము నొందెడి తండ్రి హాయి!
ఎండ వేడి యందు నెసగు నీడను బోలె
సుతుని తాకిడియును సుఖము నిడును
మేను పులకరించె మెల్లగ నిమురగా
హాయి నిండె నాత్మ నలరు నపుడు!
చందమామఁ జూడ జలజంబు వికసించు
తనయుఁ జూడఁ దండ్రి తనివి నొందు
ననలు గురియు నట్టి నవ్య మౌ స్పర్శయు
మనసు నందు నించు మధుర శాంతి!
చందనము కన్న శీతల
మందెడు వెన్నెలల కన్న నల ముత్యములన్
బొందెడి హాయిని మించును
నందను స్పర్శయును నమృత నవ్యము నగుచున్!
ముత్యముల సరుల్ మేనున మురిప మిడగ
మలయ జంబును జలువను మెండు గొలుప
తనయు గౌగిలి నొసగును తండ్రి కెపుడు
నొనరఁగన్ మించు నమృతంపు నడక నపుడు!
ఎండ మండుచు నున్నట్టి యెడరి యందు
ఎదురు పడునట్టి చల్లని యెసరు వలెను
కొడుకు తాకిన యంతనే కుదురు మనసు
నెనరు పొంగును నమృతంపు నిలయ మగుచు!
ఎండ మండుచు నున్నట్టి యడవి యందు
ఎదురు పడునట్టి చల్లని యెసరు గాలి
కొడుకు తాకిన యంతనే కుదురు మనసు
నెనరు పొంగును నమృతంపు నిలయ మగుచు!
ఎడమ తొడపైనఁ గూర్చుండి యెనరు తోడ
నొనరఁగన్ జేయు స్నానమ్ము నొప్పు మీర
కన్న తండ్రికిఁ జెప్పును గమ్మ కబురు
విన్నవించును దనదైన వింత గోడు!
టబ్బు నీటి యందు డబ్బని కొట్టుచున్
స్నాన మాడె నపుడు సరద మీర
చిన్ని కరము లెత్తి చిమ్మగా నీళ్ళను
హాయి నిండె నెదను అమృత ముగను!
బడికిఁ దండ్రియుఁ దనయునిఁ బంపి నపుడు
బరువు లేనట్టి ముచ్చట్లు పరగు చుండు
నవ్వు లొలుకుచు ముద్దుగ నడక సాగ
నెనరు పొంగును నాత్మలో నిచ్చలుగను!
బడిని విడిచి వచ్చి తండ్రిని జూడగన్
వింత కబురు లెన్నొ వెడలు చుండు
గురువు చెప్పినట్టి గొప్ప పాఠము లంచు
హాయి నింపు నెదను అమృత ముగను
అన్నం తినపించేటప్పుడు.
బువ్వ తినవయ్య యని తండ్రి బుజ్జగించ
నవ్వు లొలుకుచు నాతడు నటన సేయు
ముద్దు లొలుకుచు మెతుకును నోట నుంచ
నెనరు పొంగును నమృతంపు నిలయ మగుచు!
బట్టలను వేయఁ బ్రతిమాలఁ బాలుఁ డపుడు
బడబడగ నేడ్చు నల్లరి బాలుఁ డచట
పాదముల షూను తొడుగగఁ బరుగు తీయు
నొనరఁగన్ మించు నమృతంపు నోము వలెను!
ముక్త సరులును వెన్నెల మురిపమొంది
హృదయమందున జలువను హేల నింప
కొడుకు గౌగిలి నొసగును గొప్ప హాయి
నొనరఁగన్ మించు నమృతంపు నడక నపుడు!
చల్లగ నీడలో నలుగ చాల్పున బిడ్డడు నిద్దుర బోవగన్
మెల్లగ శ్రీనివా సుడును మేలగు నమ్మక ముంచగ నిచ్చలున్
అల్లన తండ్రియున్ సుతుని ఆసగ ప్రేమను నిమురగా నైదగన్
ఉల్లము నిండెన మ్మసుతు ఉన్నత ప్రేమను జూడగా నొప్పెడిన్!
నిద్రపుచ్చడం:
చందమామ కథలు సరదాగ జెప్పుచు
గుండె పైన సుతునిఁ గూర్చు కొనియు
ముగియ కుండ కథయు ముద్దుగ నిదురించె
వింత శాంతి నిండె వెన్నెల యన!
కమ్మని కథలను జెప్పగ
నమ్మకమున నిద్ర పోవు నందను జూడన్
చిమ్మేను ప్రేమ వెల్లువ
కమ్మని నిదురందుఁ దండ్రి కౌగిలి నలరన్!
చేరి పడకపైఁ జెప్పెడు చిత్ర కథలు
హృదయమందున నొలికించు నింపు సొంపు
కన్ను లొలుకుచు నిదురను గాంచు నపుడు
నొనరఁగన్ మించు నమృతంపు నవ్య ధార!
ఏవం వాదిని
దేవర్షౌ పార్శ్వే పితురధోముఖీ
లీలా కమల
పత్రాణి గణయామాస పార్వతీ.
(ఈ శ్లోకానికి తాత్పర్యం:
"దేవర్షి అయిన అంగీరసుడు (శివునితో పార్వతి వివాహం గురించి) తండ్రి అయిన హిమవంతునితో మాట్లాడుతుండగా, ఆయన పక్కనే ఉన్న పార్వతీదేవి సిగ్గుతో తలవంచుకుని, తన చేతిలోని విలాస కమలదళాలను (లీలా కమల పత్రాణి) లెక్కిస్తున్నట్లుగా నటించింది.")
వదనమును వంచి పార్వతి వనరుహముల
వరుసగా రేకు లెక్కించె వనజ నేత్రి
వర మునీంద్రుడు పెండ్లిపై వలుకు చుండ
వనజ గర్భుని కూతురు వనరి నట్లు.
….
ముస్లిము సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు
సీ.
నెలరోజు నిరతము నిష్ఠతో నుపవాస
అల్లాను స్మరియించు నాత్మలార!
పేదసాదల నాదరించి వస్త్రములిచ్చి
ఫిత్రాను పంచెడు పెద్దలార!
కరుణామయుడు చూపు కర్మమార్గమునందు
నడచుచు వెలిగెడు నవఘులార!
దేశప్రజలకెల్ల దివ్యసంతోషాలు
ఆయురారోగ్యము లందజేయ
తే.గీ.
వేడుకొనుచుంటి నల్లాను వినయముగను
సకల శుభములు కలుగుగా సర్వులకును
ప్రేమ మీరగ తెలుపుదు ప్రార్థనమున
ముస్లిములకును ముదమున మొక్కులివియె!
ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు
21.3.2026
...
వ్యాస్యతు, ఆస్యతు, గౌతమతు, వ్యాళేంద్రతు యస్య నాస్తి సాహిత్యం | తం ప్రతి సంప్రతి కం ప్రతి శిరో మమ, శిరశ్చ న పురశ్చ ||
(గమనిక: ఇందులో పదాలను విడదీస్తే వచ్చే అర్థం చాలా చమత్కారంగా ఉంటుంది.)
శ్లోకార్థం & చమత్కారం:
సాహిత్య జ్ఞానం (రసజ్ఞత) లేని ఒక వ్యక్తి తన ముందు కూర్చున్నప్పుడు, కవి లేదా పండితుడు పడే వేదన ఇందులో కనిపిస్తుంది.
వ్యాస్యతు (వ్యాస్యతి): నోరు తెరిచి ఆవలించడం (ఆవులించేవాడు).
ఆస్యతు (ఆస్తే): కేవలం కూర్చుని ఉండడం (జడ పదార్థంలా కూర్చునేవాడు).
గౌతమతు (గౌః + తమః): ఆవు కంటే ఎక్కువ అజ్ఞానంలో మునిగినవాడు (మూర్ఖుడు).
వ్యాళేంద్రతు (వ్యాళేంద్రః): పాము లాంటి వాడు (వినడమే తప్ప, ప్రతిస్పందించని వాడు).
రెండవ పాదం అర్థం: "తం ప్రతి సంప్రతి కం ప్రతి శిరో మమ, శిరశ్చ న పురశ్చ" సాహిత్యం లేని ఆ వ్యక్తి ముందు ఇప్పుడు నా తల దేని కోసం? నా తల ఉంది కానీ, అతని ముందు అది తల కాదు (అంటే నా పాండిత్యం అతనికి అర్థం కాదు), అతని ముందు నేను తల వంచడం గానీ, తల ఊపడం గానీ వ్యర్థం!
వ్యాస్యతున్ వ్యాళ వ్యాళేంద్ర వ్యాఘ్ర మనగ
సాహితీ రస గంధంబు చాల లేని
వాని ముందర నిపుడు నా వదన మెందు?
వనరి నట్లుగ నదియును వ్యర్థ మగును
(సాహిత్యం తెలియని వాడు ఆవలించేవాడు (వ్యాస్యతు), పాము వంటివాడు (వ్యాళేంద్ర), లేదా అడవి మృగం (వ్యాఘ్రం) వంటివాడు. అటువంటి రసజ్ఞత లేని వాని ముందు నా ముఖము (వదనము) చూపడం లేదా నా పాండిత్యం ప్రదర్శించడం వ్యర్థం.)
......
కం.
రాతిగ నుండెడి నాతియు
ప్రీతిగ జదివెను బొలుపుగ భీతియు లేకన్
నీతిగ జైతన్యముతో
ఖ్యాతిని బొందెను మెరిసెను గరిమగ జగతిన్
(రాతిబొమ్మలా ఇంట్లోనే ఉన్న ఆ ఇల్లాలు, ఏమాత్రం భయం లేకుండా ఎంతో అందంగా (చక్కగా) చదువుకుంది. తనలోని నీతి, చైతన్యములతో ప్రపంచ ఖ్యాతిని పొంది, ఈ జగత్తులో గొప్ప గౌరవంతో మెరిసింది.)
….
తే.గీ.
రాతి బొమ్మగ నుండెడి నాతి యింట
చదువు నేర్చెను విజ్ఞాన జ్యోతి వోలె
చాటె చైతన్య మున ధర చారు ఖ్యాతి
విచ్చు పూవున తావియు వెలుగు రీతి
(ఒకప్పుడు ఇంటికే పరిమితమై రాతిబొమ్మలా నిశ్చలంగా ఉన్న నాతి (స్త్రీ), విద్యను అభ్యసించి విజ్ఞాన జ్యోతిలా వెలిగింది. విచ్చుకున్న పువ్వు నుండి సువాసన లోకమంతా ఎలా వ్యాపిస్తుందో, అలాగే ఆమె తన చైతన్యంతో ప్రపంచవ్యాప్తమైన ఖ్యాతిని పొందింది.)
…
విముక్తి
ఎవరిచేతిలోనో బందీ అయిన
ఓరాతి విత్తనం
మట్టి పొరల మౌనాన్ని ఛేదించింది
తొలి అక్షరం స్పర్శించగానే
చీకటి గుహలో వెలుగుకిరణం
తాకగానే నాతిలో జీవ చైతన్యం!
రెక్కలు తొడిగిన భావం
లోకానికిప్పుడు ఓ విజ్ఞానపు జ్యోతి
ఇప్పుడు
కదలిక లేని రాయి కాదు
చైతన్యం లేని విత్తనం కాదు
చీకటిలోనే మగ్గిపోయే గబ్బిలం కాదు
నిశ్చలత్వాన్ని నిరసిస్తూ...
విశ్వపు వినీలాకాశంలో
ప్రకాశిస్తున్న ప్రపంచ ఖ్యాతి!
ఆ అడుగు
ఒక శిల... శిల్పమై
తనను తాను చెక్కుకున్న అద్భుతం!
దార్ల వెంకటేశ్వరరావు
9.4.2026
దార్ల మంజుశ్రీల వివాహవార్షికోత్సవం (18 ఆగష్టు 2018)
మాయ, వేంకటేశు మాయింటపండగై
వైష్ణవీయునృత్యమైయ్యెనయ్య
మురళిమోహనంబుమురిపించెనెంతనో
దార్లయిల్లె కళల ధరణియయ్యె
చంద్రమౌళిమానసంబంతచల్లన
మురళిమోహనుండుముచ్చటవగ
మెల్లనైనజల్లుఅల్లూరిమస్తాను
దార్లయిల్లుకళలధరణియయ్యె
పారవశ్యమయ్యె పసిపిల్లవోలెను
పుష్ప గుచ్చమౌను పుష్పిణమ్మ
కృష్ణవేణిరుచులమృష్టాన్నమొడ్డిం
దార్లయిల్లుకళలధరణియయ్యె
శ్రీధరుడుసునీలు చిరునవ్వులందించు
యెక్కుడైననేమి చక్కగొచ్చి
పాటలుండుమడుగుబడిగేఉమేశుడు
దార్లయిల్లుకళలధరణియయ్యె
చిలుకుకొనగవెన్న శ్రీపతి మారుతి
పెదవినుండుజోకుపెద్దమనిషి
రాజసంబునుండు రామప్రసాదుడై
దార్ల యిల్లు కళల ధరణి యయ్యె
సహృదయసాహితీవేత్త'బేతవోలు'
ప్రాకృతంబునందుపాండిత్యచరితుఁడు
సంస్కృతాంధ్రపద్య సవ్యసాచి
వెలుగుచున్నతెలుగుబేతవోలునిలుచు
వీరిపలుకులెల్ల విలువనుండు!
సంప్రదాయియైన సహృదయసాహితీ
వేత్త, ఆధునికత నేర్పునెరుగు
నవ్యదృష్టికలిగినట్టిదివ్యుడతడు
పేరుతెలుసుమనకు 'బేతవోలు'!
మేత కూతలవ్రాతలు మేలునిచ్చు
విశ్వవిద్యాలయమునందు వీటినెపుడు
మురిపెమునచూచుకొనుమని మురిసిపోయి
చెప్పుచుండెమరువకని చెలిమి కలిగి!
నిత్యసాహిత్యపరిశీలనిష్టపడుచు
నిత్యసాహిత్యపఠనంబుకృత్యమైన
కులమతప్రాంతములతడికుండవయ్య
మెచ్చుకొను 'బేతవోలు' యే మేలుయనుచు!
-దార్ల వెంకటేశ్వరరావు,
హైదరాబాదు
(ఆచార్య బేతవోలు రామబ్రహ్మం గార్కి తెలుగు సాహిత్యవిభాగంలో భారత రాష్ట్రపతి పురస్కారాన్ని ప్రకటించిన సందర్భంగా శుభాకాంక్షలతో... ఆచార్య దార్ల వేంకటేశ్వరరావు, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్)
జాతిపిత గాంధీజీ
పోరు బందరు నగరంబు పొంగు నెపుఁడు
జగమునకుతన నామంబు జపము చేయు
నట్లు తెలిపిన బాపూజి నఁడిచి నట్టి
నేల సారంబు తనదని నేటినిజము
తల్లి పుతలిబాయ్ పుణ్యంబు, తండ్రి కరము
చందు ధైర్యంబు పెనవేయ చరితలన్ని
యు చదివె భగవద్గీతను, యోగ విద్య,
తర్క మున్యాయ శాస్త్రంబు తరువుగాను!
విద్యనభ్యసింప విధిగాను లండను
పోయినప్పటికిని, పోడు! మద్య
మాంస భోజ నాది హింసరుచులనేమి
ముట్టబోడు! గాంధి మునియవోలె!
సత్యము తనదగు కృత్యము
నిత్యము దానిని కొలుచెను నిజదైవముగా
మృత్యవు వచ్చిన వీడఁడు
సత్యహరిశ్చంద్రుఁబోలు సతతము గాంధీ!
దక్షిణాఫ్రికా దేశంబు ధరణి నందు
భార తీయులు, కార్మికు లరుదు కాగ
వారి నందరూ బెదిరించి వారి కంద
రికిని ప్రత్యేక ముగనుంచె రిపులవోలె!
చట్టము భారత కార్మిక
చుట్టమగుటకెట్టివియునుఁ జూపఁగవలెనో
యట్టివి సాక్ష్యంబులనే
పట్టుద లనుచూ పుచుండె బాధలుమాపన్
న్యాయ మైన వాద నలనిరి ప్రతివారు
గాంధి చర్యలన్ని కథలు కథలు
గాను చెప్పు కొనుచు కదిలివదిలినారు
పిరికి తనమను చలి పారి ద్రోలె!
భారతమిచ్చిన భవ్యసీమ
నదులన్నిచల్లన హృదులన్నిచల్లన
సశ్యరమతిరుగు శాంతిసీమ
తీయని కొబ్బరి, తినగల ఫలములు
పాడిపంటలనిచ్చు భాగ్యసీమ
దేవాలయంబులు, దివ్యాలయంబులు
జాతి, మతంబుల జనుల సీమ
అట్టి గోదావరిప్రాంతమందునుండు
కోటి సోయగంబులసీమ కోనసీమ
అందు చెయ్యేరు అగ్రహారంబు నందు
దార్ల అబ్బాయి జన్మించె ధార్మికుండు
సీసము:
ఆశ్రయించినవారినాదరించెనతడు
కల్మషంబెరుగనికరుణమూర్తి
తగువులు పడకుండదారినుంచెనతడు
ధర్మదేవతవంటి ధర్మ మూర్తి
ఆత్మ గౌరవమన్న నాతడే చూపించె
అంబేద్కరునికాతడానుయాయి
ఊరెల్లరును తన యూపిరగానెంచు తనకందరొకటను ధన్యశీలి
తే.గీ:
గ్రామ పెద్దగానున్న నిగర్వియతడు
సంఘసంస్కరణకు తొలి సమరశీలి
అగ్రహారప్రజలకయ్యెనాప్తుడతడు
అతడె దార్లఅబ్బాయియే ధరణినందు! -
నువ్వు నిన్నువిడిచి మేము నుండలేదు
విత్తు నుండియే మొలుచును కొత్త మొక్క
జన్మ జన్మల బంధమీజన్మ నిజము !
చిన్నప్పటియాస్మృతులను
మిన్నగనే వర్ధంతులు
యెన్నడునూజరుపుచుందు
నాన్నొక నిజమైనవరము
నాన్నొక కరుణా హృదయుడు
నాన్నొక నిలువెత్తుసాక్షి
మిన్నున మెరియుచుమురిసిన మీనామమునే
సన్నుతిచేయుచునుండును
యెన్నడు పసిడిపతకంబుయెందరిమదినో!
అందరిమన్నలను పొందమనుచుందువుగా!
పొందుగను పసిడి పతకము
నందుకొనునునీదునామమంజలిగొనుమా!
శరణాగతులను విడువఁడు సామాన్యుండా?
సరితూగరెవ్వరు దయకు
సురతుఁడు లంకయ్యనునది సుజనుని నామమ్ !
సంఘసంస్కర్త, సరసుడు, సమరశీల
దేశభక్తిని స్మరియించె తెలుగు శాఖ
కేంద్ర విశ్వవిద్యాలయ కేంద్రమందు!
17 జూన్ 2018
తలచి మండువా లోగిళ్ళ తలుపు తడితి
ఆత్మపరమాత్మవేదననందుకొనుచు
తత్వవిద్వత్తువర్షించి తడిసిపోతి!
కందం
అందంబుగపద్యాలను
వందలకొలదిగనెవ్రాసివైభవమొప్పన్
అందరిమెప్పందుచుగో
విందునిపేరేలనయ్యపెంపుగచెప్పన్
-గోవిందుని గోవర్ధన్
నాసంతోషముగా మీ
'కాసింతపరిమళపద్యకవనముతాకెన్
వాసంతుడుగోవర్ధన్
'మీసం కల్పబ లముబలమిచ్చినద'నియెన్
-దార్ల
(పద్య సంభాషణ)
భక్షకులమది తెలుసుకొని బాలిక లెవరూ
రక్షణలేదనియనుచూ
శిక్షలు వేయమనడగరు శిశువులు దార్లా!
ఆచార్యవిశేషణంబునటకెక్కించెన్
ఆచార్య కలముపేరట
ఆచారముగాబిరుదులనందకుదార్లా!
అన్యంబగునదియునేమియాశించకనే
పుణ్యంబగుతీర్ధంబుల్
గణ్యంబునవన్నిచూడగలవంటివిగా!
ఇచ్చటి మార్కండుఁడయ్యె ఇచ్చటనేమీ
యెచ్చటచూచిన శివుఁడే
ముచ్చటగొలుపగనులింగముద్రనతండే!
ముదము గాను దార్ల, మురళి, మంజు
చంద్ర మౌళి కూడ సంతసమ్మునచేరి
కాశి పయనమునకు కదలినాము!
మంజుతోకలిసిబ్యాగునందునుంచి
ముడిని వేయ బహ్మతరమ్ము ముడిని విప్ప
ఎక్కినాము దానా యెక్సు ప్రెస్సురైలు
జీడి పప్పు కాస్త జీల కర్ర
వేరు శనగ మొదలు వేయవలసినంత
పుష్కలంబు రుచియె పులియ హోర !
కచుడేవచ్చిన వదలను కమ్మనియమృతమ్
రుచులే చెప్ఫుచు మంజుకి
శుచిగానున్నపు లిహోర సుష్టుగ తింటిన్
రావద్దురదాని నుండు రాక్షస మూకల్
రావచ్చునురా సీటును
పోవచ్చునదేను సీటు పోరుసలపగన్
జగడా లాడుచు భక్తులు
పగవారునువోలెకాశి పయనముసాగన్
జంగా ధన్యంబుజన్మ జన్మతరింపన్
జంగాలస్వాములనూ
గంగాదేవి వెలుగుల సొగసునూ చూఁడన్
మూసీ మూయగకనులను
తీసే వచ్చును తలుపులు తిప్పుచునెవరో!
కోరి కొలువగ గణపతిని కోరితి మొదటన్
హారతినందితినది కను
లారగ దర్శించి నిన్ను అమ్మను వేడన్
కొలవగ ప్రమథగ ణపతిని కోరికమీరన్
పిలిచితిమయ్యానిన్నే
పిలిచినతోడనుపలికెడి ప్రియవరదుడవే!
రా! కావుమురా! వరాలరాశివి కదరా!
నాకేమియు కావలెరా?
నీకే తెలియును మరలను నిన్నడగనురా!
అమ్మ అన్న పూర్ణ ఆగ్ర హమ్ము
తెలిసె, తెలిసె నిచటె తెలియంగ తపమన్న
కోపతాపములనుమాపుటనియు!
యెప్పుడుపోవునొతెలియదుయెవ్వరుచెప్పున్
చెప్పుదురందరుగొప్పలు
తిప్పులు తప్పవు మొబైలు తీరులు దార్లా!
వెచ్చని భాగ్యనగరమ్మ! వెలుగులతల్లీ!
మెచ్చితినమ్మాకాశీ!
స్వచ్చతనిచ్చుచు మనసుకి శాంతినికూర్చెన్
మారాకనుకోరిమీరు మాతోనూ క
ళ్ళారాకాశీచూపిం
చారే! మరువము సునీత! చరితనుయెపుడూ!
యాగము నాకొరకుఁ జరుపనాశించకలే!
రాగమున పిలిచి చండీ
యాగము కలనిజము కాగ యాగముచేసెన్
కోరామాయాగము? నినుకోరనులేదే!
మారాత చూడలేదా?
నోరారాతమ్ముడనుచునోదార్చితిరే!
జల్దీగానాగపూరుజంక్షనునందున్
హెల్దీగాకనపడగా
చల్దీఫుడ్డును భుజించు చవటెవడుండున్
హై! హై హిందీ పలుకులు! హై ఆలూ కూ
రా! హై భక్తీ! ముక్తీ
హై! హై వీధులు యిరుకులు! హై కాశీమే!
చిక్కిన దెల్లను తినునొక చిరుతవరాహమ్
కుక్కనుమించగకుక్కుచు
కక్కుటకరగక మొరుగుచు కంపునినింపున్
భేద భావంబు కానని గాథ లెన్ని
విన్న డోకన్నడోగాని వినగ వినగ
అదియె వారణాసినహరిశ్చంద్ర ఘాటు
ప్రాధాన్యతనిచ్చి కవుల పండితులను తా
నాదరము జూచి మమతా
మాధుర్యమొసంగిబ్రోచు మంజుల హృదితోన్
మధుర కవి మల్లవరపు జాన్ మధుర పద్య
కవన భావ సౌరభ్య వైభవము గాంచి
మెచ్చి మెండు సమీక్షల నిచ్చి కవుల
మనసు దోచుకున్నారు నమ్మకముగలుగ!
- మల్లవరపు రాజేశ్వరరావు22-10-2009
అవ్యవహితముగ విమర్శ అధ్యాపనచే
సవ్యముగతీర్చిదిద్దెడి
మీవ్యవహృతికై' విమర్శ' మెరుపిచ్చెద'భా'!
(మా విద్యార్థి గంగిశెట్టి లక్ష్మీ నారాయణ ఒక పుస్తకాన్ని నాకు బహూకరిస్తూ రాసిన పద్యం.
భావం: నిత్యం మా పై కరుణను ప్రసరించే మీరు, విమర్శ పాఠాలను నవ్యమైన పద్ధతిలో బోధిస్తారు. మీరు నిరంతరం చదివే విమర్శ అధ్యయన విలక్షణతకు సంతసించి, ఈ గ్రంథం మీకు మరింత మెరుపునిస్తుందని ఆశిస్తూ 'ఆంధ్ర సాహిత్య విమర్శ- ఆంగ్ల ప్రభావం' అనే గ్రంథాన్ని మీకు సమర్పిస్తున్నాను.... మిత్రమా ధన్యావాదాలు)
ఆ పఠనదీక్ష ఆ పాఠమాలపించు
రీతియంతయునూతనరీతియగుచు
సంతసమునిచ్చు వేంకటేశ్వరుని సాక్షి!
-దువ్వ రత్నాకర్
ఆ చిరునగవు, ఆ మృదు భాషణంబు
ఆ పఠనదీక్ష ఆ పాఠమాలపించు
రీతియంతయునూతనరీతియగుచు
సంతసము దార్ల వేంకటేశ్వరుని యుక్తి
-దువ్వ రత్నాకర్ ( పరిశోధక విద్యార్థి, ఆంధ్ర విశ్వవిద్యాలయం, విశాఖపట్టణం) ఇతడు మా సెంట్రల్ యూనివర్సిటిలో ఎం.ఏ. తెలుగు చదివాడు.
తీరుగనేవెలుగుచుండుదినకరుభంగిన్
పోరలు నిలిపిరి దార్లను
కూరిమితోదారిచూపు గురువరుడనుచున్.
( మా విద్యార్థి డా.సుమన్ పంపిన ఫోటో చూసి, మా మిత్రుడు తెలుగు అధ్యాపకుడు గోవిందుని గోవర్ధన్, తెలుగు అధ్యాపకుడు, డిగ్రీకళాశాల, మహబూబ్ నగర్ వర్ణించిన పద్యం... ఇద్దరికీ ధన్యవాదాలు)
గతజన్మల బంధమదియె కనపడసాగెన్
పతితోఫోజులనిచ్చిన
సతినీపతినీ కలుపుట సరదా స్వాతీ!
శేష పాన్పుపైనుండువిశేషరీతి
దార్ల దాంపత్య దృశ్యమే ధరణి నుండె
కురిసెనే స్వాతి చినుకులు కూర్మి కలిగి!
పడవ మీద 'దార్ల' పవ్వళించె
పాదసేవచేయ పతిసేవ కేతెంచె
సతియ దృశ్యమైన సాక్ష్యమిదియె
ప్రభాత హృదయ హృద్యం.
ఈ కథ ...బాల్యాన్ని , బలపాన్ని ,
తలపులను , పలకలను , వలపల గిలకలను గుర్తుకు తేగా .....
మది మనోహర సరోవర మానస సంచారం అమ్మ చెట్టు -
ఊహల్లో తేలించి , ఉర్రూతలూగించి ,
బాల్యాన్ని ఉట్టిపడేసేలా,
ఆబాలగోపాలాన్ని కట్టిపడేసేలా ఉన్నదే !
ఈ అమ్మచెట్టు - ఊడలు సాచిన పిల్లల మఱ్రిలా శైశవ గీతికలలో నాటుకుపోయెనే..
మతులు , స్మృతులు ,
స్మరణలు , స్పురణలు ఎన్నో .... ఎన్నెన్నో....
-గురవయ్య, MA telugu
(మావిద్యార్ధి స్పందన... ధన్యవాదాలు మిత్రమా)

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి