"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL-502: Techniques of writing a Dissertation క్లాసులు సోమ, మంగళ, గురు, శుక్రవారం మధ్యాహ్నం 12.00 గంటల నుండి 1.00 వరకు డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ భవనంలో జరుగుతాయి.

10 అక్టోబర్, 2008

జాషువా సాహిత్య దృక్పథం







ముందుగా మీ అందరికీ శుభాకాంక్షలు. వేదికపై ఆశీసులైన ముఖ్య అతిథి, తెలుగుశాఖ అధ్యక్షులు, ప్రతి పదాన్నీ రసగుళికగా చేయగలిగే గొప్ప వక్త, మహాపండితుడు ఆచార్య బేతవోలు రామబ్రహ్మం గార్కి, సభాధ్యక్షులు ఆచార్య జి. అరుణ కుమారి గార్కి నా నమస్కారాలు.
ఇప్పుడిక్కడ నేను మీరు అనుకోని అతిథిని!
కనుల పండుగా జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని చూడాలని వచ్చాను.
ఏవరేమి మాట్లాడతారో విందామని వచ్చాను.
డా// బి.ఆర్. అంబేద్కర్, మహాకవి గుర్రం జాషువాల జయంతులు, వర్ధంతులు సందర్భంగా మనకి దగ్గర్లో సభలు, సమావేశాలు జరుగుతుంటే, వాటిలో పాల్గోకుండా ఉండలేరు -నిజమైన దళితులు! అలాగే నేనూ పాల్గోవాలని వచ్చాను.
నన్ను వేదికపైకి పిలిచారు. అదీ ఓ ముఖ్య అతిథి అనీ సంభోధించి మరీ పిలిచారు.
చాలా కృతఙ్ఞతలు.
వేదిక ముందు ఆశీసులైన ప్రపంచ ప్రసిద్ధ భాషా శాస్త్రవేత్త ఆచార్య పరిమి రామానరసింహం గార్కి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను.
అలాగే డా// పిల్లలమర్రి రాములు గార్కి నమస్కారాలు తెలియజేస్తున్నాను
ఇక్కడికొచ్చిన ప్రతి ఒక్కరూ, ముఖ్యంగా వేదిక ముందు కూర్చొన్న సోషయాలజీ లెక్చరర్ డా// నాగరాజు, పరిశోధక విద్యార్థి శివాజీ, అలాగే అంబేద్కర్ అసోషియేషన్ అధ్యక్షుడు ధనరాజ్, ఆ కార్య వర్గ సభ్యులు హరిబాబు, గౌరీశ్వరరావు, మాణిక్యరావు వీళ్ళందరికీ కూడా నా అభినందనలు తెలుపుతున్నాను.
మన క్యాంపస్ లో  Dr.B.R.Ambedkar Students Association దళితుల గురించీ, దళిత సాహిత్యం గురించీ చేస్తున్న కృషి అసామాన్యమైంది. ఇక్కడ కనిపిస్తున్న Bannerలో కూడా ఒకవైపు డా// బి. ఆర్. అంబేద్కర్, మరొక వైపు మహాత్మా జ్యోతీ బాపులేల చిత్రాల్ని పెట్టారు.
బహుశా... అది రాబోతున్నమన దళిత, బహుజనుల రాజ్యానికి ఆశావాద చిహ్నాలనిపిస్తుంది. మీరు  ప్రతీకాత్మంగా ఆలోచించి చిత్రాన్ని రూపొందించినందుకు మరోసారి నా అభినందనలు.
కళాత్మక మేథావి :డా// బి. ఆర్. అంబేద్కర్, మహాత్మా జ్యోతీ బాపులేలు ప్రపంచం గర్వించదగిన గొప్ప మేధావులు.
వారు దళిత తాత్త్వికతను సామాజిక, రాజకీయ సిద్ధాంతాల్నిరూపొందించిన మహానుభావులు.
ఆ సిద్ధాంతాల్ని కళాత్మక అభివ్యక్తితో తెలుగులో సాహిత్యంగా అందించిన గొప్ప మహాకవి గుర్రం జాషువా!
దళితుల విషయమే ప్రధానమనుకొనే వాళ్ళు Direct గా అంబేద్కర్, జ్యోతీ బాపూలేల రచనల్నే చదువుకోవచ్చు.
అలా కాకుండా విషయంతో పాటు, ఆనాటి సమాజాన్ని కూడా "రసభరితం" గా అవగాహన చేసుకోవాలనుకున్నప్పుడు కచ్చితంగా జాషువా రచనల్ని చదవాలి.
మనం వ్యాకరణ సూత్రాలో "ఓరీ! ఓసీ మైత్రియందున్ గలవు" అంటూ చెప్పుకుంటుంటాం. మనకి బాగా తెలిసిన వాళ్ళనీ, దగ్గరైన వాళ్ళనీ, ఆత్మీయుల్నీ ఏక వచనంతోనే సంబోధిస్తుంటాం. దానిలో చాలా దగ్గరతనం కనిపిస్తుంటుంది. అందుకనే జాషువాని కూడా "జాషువా రాశారు, చెప్పారు" అని పిలవడం కంటే, "జాషువా రాశాడు, జాషువా చెప్పాడు..." అని సంబోధించుకోవటం వల్ల మనకి జాషువా మరింతగా దగ్గర వాడవుతాడేమో!
అందుకని " జాషువా మన కోసం రాశా'డు' " అనే పిలుచుకుందాం!
జీవితం సంఘర్షణ మయం:
గుర్రం జాషువా జీవితం, ఆయన రచనల నిండా సంఘర్షణ ఉంది. అదే ఆయన రచల్లోనూ నిండిపోయి కనిపిస్తుంది.
జాషువాకి ఆ సంఘర్షణ తన తండ్రి నుండే సంక్రమించిందేమో!
జాషువా తండ్రి ఒక యాదవ కులానికి చెందిన వాడు. తల్లి అప్పటికే ఎంతో నిరాదరణకు గురవుతున్న, సమాజంలో అట్టడుగు వర్గంలో జీవిస్తున్న మాదిగ కుటుంబానికి చెందినామె. ఆమెను ప్రేమించాడు. ఆ ప్రేమ కోసం తనకున్న సామాజిక హోదాని కూడా వదులుకున్నాడు జాషువా తండ్రి వీరయ్య.
ఇప్పటికీ ఒకే కులంలోనే భిన్న ఉపకులాల మధ్య కూడా పెళ్ళిళ్ళు జరగడం గగనమై పోతోంది.
అలాంటిది 1895కి ముందే జాషువా తండ్రి వీరయ్య, ఒక మాదిగమ్మాయిని పెళ్ళి చేసుకోవడమంటే ఎంత సంఘర్షణో ఆలోచించండి.
అదే సంఘర్షణ,
అలాంటి సంఘర్షణనే జాషువా కూడా అనుభవించాడు.
ఆ మార్గంలోనే నడిచాడు.
తన తండ్రి లాగానే తానూ ఓ మాదిగ అమ్మాయి 'ని వివాహం చేసుకున్నాడు.
ఆమె పేరు మేరీ
సాధారణంగా సమాజంలో గౌరవ మర్యాదలకు అవకాశం ఉన్న వైపుకే ఎవరైనా వెళ్ళి పోతుంటారు. అలాంటి పరిస్థితుల్లో జాషువా, తన తండ్రి లాగే సాంఘిక హోదాను కూడా వదిలేసి, కింది వర్ణమైన మాదిగ వ్యక్తిగానే జీవించాలనుకున్నాడంటే అది సామాన్యమైన విషయమా?
ఎందుకు అలా జరిగింది?
 కారణం ఉందేమో
 చాలా మంది శ్రీ కృష్ణుణ్ణి అవతార పురుషుడంటారు.
ఆ మహాను భావుడు యాదవ వంశంలోనే పుట్టాడు. ఆ వంశంలో తండ్రీ వీరయ్యకీ పవిత్రమైన అరుంధతీ దేవి వంశంలోని తల్లీ ఇద్దరూ కలిసి ఈ దళిత జాతి సముద్దరణకీ, ఈ దళిత జాతి చైతన్యానికీ, ఈ దళిత జాతిని మేల్కోలిపే రచనల్ని అందించడానికీ ఒక మహా పురుషుణ్ణి, ఒక యుగ పురుషుణ్ణీ అందించడానికే ఆ కులాంతర వివాహం దోహదపడిందేమో!
నిజంగానే "జాషువా" దళితులకీ, దళిత సాహిత్యానికీ మహా పురుషుడయ్యాడు.
 ఒక యుగకర్తయ్యాడు.
ఒక యుగ పురుషుడయ్యాడు.
దళితుడుగా జీవిస్తూనే
దళితుడుగా తన ఆర్తిని పలికిస్తూనే
విశ్వనరుడిగా మారాడు.
‘‘కులమతాలు గీచుకొన్న గీతల జొచ్చి
పంజరాన గట్టువడను నేను
నిఖిలలోకమెట్లు నిర్ణయించిన, నాకు 
తరుగులేదు, విశ్వనరుడనేను’’ అని  అనగలిగాడు.
కాబట్టి, యాదవ వంశంలో జన్మించిన శ్రీ కృష్ణుని అంశ, అరుంధతీ దేవి అంశా కలిపి పుట్టిన దళిత అవతార పురుషుడు మహాకవి గుర్రం జాషువా అంటే బాగంటుందేమో! అయితే అవతార పురుషుల్ని నమ్మడం!
నమ్మక పోవటం కాసేపు పక్కన పెడదాం! ఒక చమత్కారం కోసమే అనుకుందాం పోని.
జాషువా 1895 సెప్టెంబరు 28న జన్మించాడు.
1971 జులై 24న మరణించాడు.
1895 నుండి 1971 వరకూ అలాగే ప్రపంచంలో భారతదేశంలో అనేక చారిత్రక సంఘటనలు జరిగాయి. ఆంధ్రప్రదేశ్‌లోనూ అనేక సంఘటనలు జరిగాయి.
వీటన్నింటినీ దళిత దృష్టితో చూడాలంటే
ఆ కాలంలో దళితులు ఎలాంటి సంఘర్షణను ఎదుర్కున్నారో తెలియాలంటే,
నిజమైన చారిత్రక సాహిత్య దర్పణం  గుర్రం జాషువా సాహిత్యమే!
విస్మరించిన చారిత్రక ఆనవాళ్ళెన్నో జాషువా సాహిత్యంలో కనిపిస్తాయి.
దళితుల పట్ల ఆనాడు పాఠాలు బోధించే గురువులెలా ఉండేవారో తన ఆత్మకథలో ఇలా చెప్పుకున్నాడు జాషువా.
‘‘అప్పటి పంతులయ్యలు భయంకరులచ్చము విద్యగాకయే
తప్పొనరించినన్ దనువు దద్దురు లెత్తగ మోది నెత్తికిన్
బొప్పులు భిక్షపెట్టు పరిపూర్ణ దయాకరులమ్మ తద్గురుల్

జెప్పిన విద్యతోడ నిలిచెన్ భయ బీజము లక్షరంబులై’’ (నాకథ –ప్రథమ భాగం: 213, విశాలాంధ్ర ప్రచురణ ప్రతి)
ఒకవైపు బ్రిటిష్ పాలన, ఆ ప్రభావాలు,
మరోవైపు విడిపోతున్న రాజరికం
వీటి మధ్య సంఘర్షణలు జరుగుతున్న కాలం.
ఈ కాలంలో జాషువా పుట్టాడు.
ఆ సంఘర్షణే జాషువాలో పుట్టింది!
ఆధునికత వైపు భారతదేశం పయనించే సమయంలో,
ఆధునికతను వ్యతిరేకించే సందిగ్ధ సమయంలో జాషువా పుట్టాడు.
ఈ విభిన్నతే జాషువాలోనూ కనిపిస్తుంది.
తన ఆత్మకథ‘‘నాకథ’’ మూడు భాగాల్లోను ఈ వ్యధ కనిపిస్తుంది
కుల వివక్షకు జాషువా అంతర్గత పరిష్కారాన్ని ఆశించేవాడు. అందుకే  చిన్నతనంలోనే ఇలా ప్రశ్నించాడు.
‘‘సోదరులము మనమనుచుం
బాదిరులందరకు నేర్పి బ్రదుకున నెడమై
పోదిరిదేమి ధర్మం? బని

వాదించితి పెక్కుమార్లు భయరహితుడనై’’ (నాకథ –ప్రథమ భాగం: 209)

జాషువా రచనలు చేయడం మొదలు పెట్టే నాటికి జాతీయోద్యమం ఊపందుకుంది.
 ఆంగ్ల ప్రభావం...
 ఆంగ్ల విద్యా ..
భారతదేశమంతా విస్తరింపబడుతుంది.
ఇలాంటి పరిస్థితుల్లో
కులం, మతం ప్రాంతీయతల వల్ల నలిగిపోతున్న భారతీయ సమాజంలో,
సహజంగానే దళితులు ఆంగ్ల విద్యా, ఆంగ్ల పాలనా ప్రభావంతో క్రైస్తవ మతంలోకి వెళ్ళిపోవడం,
దానికి అనుగుణమైన సాహిత్యాన్నే ఆదరించటం,
దాన్నే రాయడం,
దాన్నే ప్రచారం చేయడం జరుగుతుంది.
కానీ, దీనికి భిన్నంగా జాషువా జీవితం, రచనలు కనిపిస్తాయి.
ఇక్కడే జాషువా వ్యక్తిత్వాన్ని లోతుగా పరిశీలించాలి.
ఇక్కడే జాషువా దేశీయతను పట్టుకోవాలి.

సంస్కరణాభిలాషి:తన తొలి రచనే, భారతీయ తొలి కావ్యం రామాయణం లాగే, రామాయణంలోని అంశాన్నే తీసుకొని రచనా వ్యాసంగాన్ని ప్రారంభించాడు జాషువా. కంకంటి పాపరాజు రాసిన ‘ఉత్తర రామాయణం’లో కుశలవుల కథను తీసుకొని కుశలవోపాఖ్యానాన్ని ఒక నవలగా రాశాడు.
దురదృష్టమో, అదృష్టమో ఆ నవల ప్రస్తుతం ఇంకా దొరకలేదు.
అంటే, జాషువా భారతీయ సంప్రదాయంతోనే తన రచనల్ని రాయాలనుకున్నాడు.
తన జాతి భారత జాతి,
తన దళిత జాతి నలిగిపోతున్నదీ భారత జాతిలోనే!
తన జాతి కలిసి మెలిసి జీవించవలసిందీ భారత జాతిలోనే!
అందువల్ల, తన జాతి సొతైన పురాణేతిహాస, సాంస్కృతిక విషయాలపైనే తన దృష్టిని కేంద్రీకరించాడు.
తన జాతి కింది వర్ణంగా, హీనంగా ఉండిపోవడానికి కారణమైన హిందూ మత సాహిత్యాన్ని అంతా చదివాడు.
దానితోనే సమాధానం చెప్పాలనుకున్నాడు.
సంస్కృతంలోని "మేఘసందేశం" కావ్యాన్ని చదివాడు.
అదే పద్ధతిలో ఒక Alternative Literatureని సృష్టించాడు.
అదే "గబ్బిలం" మహా కావ్యం.
కాళిదాసు సంస్కృతంలో శ్లోకంలో రాసినా
 అదే సంప్రదాయానికి చెందిన తెలుగు ఛందో పద్యంలోనే 'గబ్బిలం' కావ్యాన్ని రాశాడు జాషువా.
"గబ్బిలం" లోని నాయకుడు జీవితాంతం శాపాన్ని అనుభవిస్తున్నదళితుడు.
'మేఘసందేశం' లో ఒక ఏడాది పాటు మాత్రమే శాపానికి గురైన యక్షుడు.
యక్షుడుకి శాప విముక్తి ఉంది.
ఈ దళితుడికి కుల విముక్తి ఉందా?
ఇది "గబ్బిలం"లో సనాతనులకి జాషువా వేసిన సూటైన ప్రశ్న!
తన కవిత్వాన్ని గుర్తించని సనాతన పండితుల గురించి ఒక సందర్భంలో ఇలా వర్ణించాడు కవి
‘‘గవ్వకు సాటిరాని పలుగాకుల మూకల సూయచేత న
న్నెవ్విధి దూరినన్ నను వరించిన శారద లేచిపోవునే
యివ్వసుధాస్థలింబొడమరే రసలుబ్దులు, ఘంటమూనెదన్

రవ్వలు రాల్చెదన్ గరగరల్ సవరించెద నాంధ్రవాణికిన్’’
దళితుని జీవితంలో జరిగే సంఘర్షణలన్నీ
 దళితుని జీవితంలో ఎదుర్కొనే అవమానాలెన్నింటినో రసభరితంగా పలికించగలిగాడు "గబ్బిలం"లో జాషువా!
జాషువా సుమారు 36 రచనలు చేసినా, వాటిలో "గబ్బిలమే" గొప్పగా నిలిచిపోవడానికి కారణం?
 ఆయనలోని సంఘర్షణ
 ఆ హేతువాదం
 ఆ సంస్కరణాభిలాష
 సమస్యను సావధానంగా పరిష్కరించుకోవాలనే ఆకాంక్ష
 అన్నింటితో పాటూ  దేశ భక్తీ.....
భారతదేశం విదేశీయుల నుండి విముక్తి కావాలని ఆకాంక్షించాడు జాషువా
‘‘చక్కగ శైశవంబు దిగజారి, ప్రపంచము కొద్దికొద్దిగా
దృక్కుల కెక్కువేళ గురుతించిన మా పరదాస్య ముద్రచే
ముక్కలు ముక్కలై చెదరిపోయిన గుండెలు వెచ్చ నూరువుల్

గ్రక్కని రోజు లేదు నగరంబుల రాణి ! యబద్దమేటికిన్! ’’(గబ్బిలం)
ఇలా ఎన్నో అంశాలు ఆ కావ్యాన్ని చిరస్మరణీయం చేశాయి.
జాషువా రచనల్లో ప్రతి రచనా ఒక రస గుళికే.
ప్రతి కావ్యం కండగల కావ్యమే. ఖండకావ్యమే
ఆయన రాసిన వస్తువుతో మమేక్యం కాగలిగినవాళ్ళకి.
ఆయన రాసిన "ఖండ కావ్యాలన్నీ, మంచి కండ కావ్యాలే" అంటే కవిత్వమనే కండగల కావ్యాలు!
 అందుకనే ఆయనే రాసుకున్నట్లు....
‘’రాజు మరణించె నొకతార రాలిపోయె
కవియు మరణించె నొకతార గగనమేగె
రాజు జీవించు రాతి విగ్రహములందు
సుకవి జీవించు ప్రజల నాల్కల యందు’’ ...
ఇలా "మేఘ సందేశం" ప్రభావంతోనే రాసినా
ఆ కావ్యానికి Alternative long Poem వంటి "గబ్బిలం" Symbolism తో దళిత సమస్యను వర్ణించాడు జషువా. ఇలాంటి మరో గొప్ప కావ్యమే ఫిరదౌసి కూడా!

దళిత ఆత్మాశ్రయాభివ్యక్తి:
ఒక పారశీక కవి ఫిరదౌసి. చక్రవర్తి ఘజనీ మహ్మదు అతణ్ణి పిలిచి కావ్యం ఒకటి రాయమంటాడు.
తన వంశం శాశ్వత కీర్తితో వర్ధిల్లాలనీ,
అలారాస్తే ఒక్కొక్క పద్యానికీ ఒక్కొక్క బంగారు నాణెం ఇస్తాననీ ప్రకటిస్తాడు.
ముప్పై ఏండ్లు కష్టపడి "షానామా" అనే కావ్యాన్ని రాసాడు.
రాజుగారి దగ్గరకు పట్టికెళ్తాడు.
అప్పటికే ఆస్థాన పండితులు చెప్పుడు మాటలకు లొంగిపోతాడు.
 రాజు మాట తప్పుతాడు.
బంగారు నాణాలకు బదులు వెండి నాణాలు తీసుకెళ్ళమంటాడు.
ఆ నాణెం బంగారందా, వెండిదా అనేదికాదక్కడ!
రాజే మాట తప్పితే, ఆ రాజు గురించి గొప్పగా కావ్యం రాశాడు కవి.
 ఇప్పుడు ఈ నాణాలు తీసుకుంటే తాను ఆత్మవంచన చేసుకున్నట్లు కాదా? అని ప్రశ్నించుకుంటాడు కవి.
ఆత్మ గౌరవం కోసం ఆ రాజు ఇచ్చే నాణాల్ని తిరస్కరిస్తాడు.
"హాయిగ నీయశస్సు వెలయంగల చక్కని మేడగట్టి దీ
ర్ఘాయువు బోసినాడను త్వదన్వయవల్లికి వట్టిచేతులన్
బోయెద నంధకారమున మున్గి సుఖంబుల బ్రొద్దుగ్రుంకె రా
జా! యిక దాండవించెద భయంకరఖేదతమాలవాటికన్."
అని వెళ్ళిపోతాడు. ఆ సందర్భాన్ని, ఆ చారిత్రక సన్నివేశాన్ని వర్ణించిన కావ్యమే "ఫిరదౌసి".
ఫిరదౌసి సమాధి ఇప్పటికీ ఉంది.
ఇదిగో దాని ఫోటో te.wikipedia లో ఉంది.
Print తీసుకున్నాను చూడండి.
మనం ఫిరదౌసి సమాధి చూస్తే "ఫిరదౌసి" గుర్తుకొస్తాడో లేదో గానీ
 జాషువా గుర్తొస్తాడు.
"షానామా" కావ్యం గానీ, ఘజనీ మహ్మదు గాన్ని గుర్తున్నా, గుర్తు లేకపోయినా
జాషువా మాత్రం వెంటనే గుర్తుకొస్తాడు.
జాషువా కవిత్వం కోసం పడినవేదన గుర్తుకొస్తుంది.
 జాషువా పొందిన అవమానాలు స్మరణకొస్తాయి.
అలా గుర్తుండి పోవడానికి కారణం జాషువా తన కవిత్వంలో్ ఆయన జీవితాన్ని ఒలికించాడు.
దళిత జీవితాన్ని పలికించాడు.
తన రచనల్ని నిజమైన దళిత జీవిత వ్యథల్లో ముంచిన కలంతో లిఖించాడు.
తన తండ్రి జీవితంలోనూ సంఘర్షణ ఉన్నా
 అది వ్యక్తిగతంగానే కనిపిస్తుంది.
అలాంటి సంఘర్షణనే తానూ వారసత్వంగా పొందినా
 తన సంఘర్షణ వ్యక్తిగతం కాదు, వ్యవస్థ కోసం పడిన సంఘర్షణ.
ఒక నూతన వ్యవస్థ కోసం పడిన సంఘర్షణ.
అలా క్రైస్తవ మతంతోనూ సంఘర్షణ పడి సరిగ్గా అర్థం చేసుకోని వాళ్ళు కొంత మంది జాషువా రచనల నిండా హిందూ మత భావజాలం, హిందూ మత పాత్ర్రలు ఉంటున్నాయని,
ఆతన్ని ఉద్యోగాన్నుండే తొలగించారు.
అయినా, జాషువా బెదిరిపోలేదు.
తన కవితా దృక్పథాన్ని విడిచి పెట్టలేదు.
తన మార్గమేదో తాను ఏర్పరుచుకున్నాడు.
తన భావజాలంలోని అంతరార్థాన్ని అర్థం చేసుకొనే రోజులొస్తాయనీ అనుకున్నాడు.
ఆయన ఆశలు ఫలించాయనిపిస్తుందిప్పుడు!
రాష్ట్రంలో అనేక చోట్ల జాషువా జయంతి, వర్ధంతుల సందర్భంగా దళితుల గురించీ, దళిత సాహిత్యం గురించీ చర్చిస్తున్నారు.
తమని తిట్టినా, హిందువులు కూడా జాషువా కవిత్వాన్ని మెచ్చుకోక తప్పలేదు.
దళితుల గురించీ, దళితుల జీవితాలలోన అనేక చీకటి కోణాల గురించీ ఆలోచించక తప్పలేదు.
కవిత్వం, అదీ పద్య కవిత్వం రాయడంలో దళితులూ ఏ విధంగానూ తీసిపోరని నిరూపించగలిగాడు.
అందుకే, హిందువులతో సంప్రదాయ వాదులతో సంఘర్షణ పడుతూనే వ్యక్తిగా జీవితాన్నెంతో కోల్పోయినా, వ్యవస్థ కోసం ఆ బాధలన్ని అనుభవించి, దళితులకి ఎంతో స్ఫూర్తినిచ్చాడు.
ఉద్యోగం కోల్పోయినప్పుడు, రాజమండ్రి పరిసరాల్లో మూకీ చిత్రాలకు Dubbing గా పనిచేశాడు.
 ఆ సినిమాల ప్రదర్శనలప్పుడు కూడా జాషువాని దళితుడిగా భావించి వివక్ష చూపడాన్నిసహించలేక పోయాడు. అప్పుడు వాళ్ళతోనూ సంఘర్షణ తప్పలేదు.
ఆత్మగౌరవాన్ని కోల్పోలేదు.
అదే జాషువాని ఆదర్శనీయుణ్ణి చేసింది.
ఆ స్ఫూర్తే దళితులకి అతడొక అవతార పురుషుడని కీర్తించేలా చేసింది.
హిందూ, క్రైస్తవ మత సంఘర్షణ:
ఆనాటి సమాజంలో
హిందూ మతం కొన్ని వర్గాల వాళ్ళని
కుల, వృత్తుల పేర్లతో అణచివేసి,
అవమానించిన పరిస్థితుల్లో
 క్రైస్తవం దళితుల్ని, నిర్భాగ్యుల్ని దగ్గరకు చేర దీసింది.
కానీ, క్రైస్తవ భావాల్నే నమ్మేటట్టు చేసేందుకు
నాటి పాలకులు, మతాధికారులు తీవ్రంగానే ప్రయత్నించేవారు.
ఒకం మతం లేదా ఒక వర్గం
 మరొక మతం లేదా మరొక వర్గంపై పెత్తనాన్ని, లేదా ఆధిపత్యాన్ని చెలాయిస్తుందంటే,
ఆ ఆధిపత్యాన్నెలా ఆపేయ్యాలో మరొక వర్గం తీవ్రంగా ఆలోచించడం కూడా జరుగుతుంటుంది.
దీన్నే చర్యకు ప్రతిచర్య అంటారు.
ఆంగ్లంలో  Action కి Reaction  తప్పదంటారు.
దీనికి క్రైస్తవ మతమేమీ అతీతం కాదు.
అందుకే జాషువా హిందూ భావాలతో లేదా హిందూ భావజాలంతో కూడిన సాహిత్యాన్ని రాస్తుంటే సహించలేకపోయింది.
జాషువా చేసే ఉపాధ్యాయుడి ఉద్యోగం ఊడగొట్టింది.
ఇక్కడ మనం ఒకటి గుర్తించాలి.
అప్పటికే ఆంగ్ల పాలకుల ప్రభావంతో క్రైస్తవం మన దేశంలోకి వచ్చేసింది.
కానీ, అప్పటికే హిందూ మతం వేళ్ళుని కొని ఉంది.
మతాన్నే ప్రత్యక్షంగా ప్రచారం చేస్తే  తీవ్ర వ్యతిరేకత వస్తుంది.
కనుక మతం పేరుతో కాకుండా పేదరికం పేరుతో క్రిస్టియానిటి Enter అయ్యింది.
ఆ పేదరికానికి కారణం హిందూమత ఆచార, వ్యవహారాల్లో ఉందని గ్రహించగలిగింది.
ముస్లిం పాలకులూ ఇలాంటి మార్గాన్నే ఎన్నుకున్నా,
 వాళ్ళలోని బలవంతపు మార్పిడి  క్రైస్తవంలో లేదు.
ప్రేమ, మానవతా విలువలు,
ఆర్థిక సహాయం పేరుతో
కింది వర్గాల్నీ, కింది వర్ణాల్నీ చేరదీసింది.
ఎప్పుడైతే తమ జీవితాలో వెలుగులివ్వడానికి
 ఆంగ్ల పాలకులు ప్రయత్నిస్తున్నారో,
వాళ్ళు అనుసరించే మతాన్ని పీడితులు కూడా ఆచరిస్తారు.
అలా అత్యధికులైన దళితులు 'క్రైస్తవం' లోకి వలస వెళ్ళిపోయారు.
ఆంగ్ల పాలకుల స్థానంలో క్రైస్తవ మతాధికారులు ఆధిపత్యం చెలాయించే స్థితిలో కొచ్చారు.
సహజంగానే హేతువాద భావాలున్న జాషువా,
ప్రతి విషయాన్ని ప్రశ్నించే స్వభావమున్నా జాషువా,
క్రైస్తవంలో తాను కోల్పోతున్న స్వేచ్ఛను గుర్తించగలిగాడు.
తానేదో ఏదో పరాయీకరణానికీ గురవుతున్నట్లు గ్రహించాడు.
తనలో మానసిక సంఘర్షణ ఎక్కువయ్యింది.
ఇక్మడ మనం గుర్తించాల్సిందికొక్కటేమిటంటే
 క్రైస్తవ రచనల్లో సృజనాత్మకతకు పెద్దగా స్వేచ్ఛ ఉండదు.
కథను మార్చడానికి వీల్లేదు.
 పాత్ర పేరు కూడా మార్చడానికి లేదు,
చివరికి ప్రాంతాన్ని అలాగే చెప్పాలి.
 అప్పుడది క్రైస్తవ సాహిత్యం ఎలా అవుతుంది?
మత సాహిత్యమే అవుతుందనుకున్నాడేమే!
 Basic గా జాషువాలో కళాతృష్ణ ఉంది.
ఆ కళా తృష్ణ క్రైస్తవంలో తీరే అవకాశం లేదు.
తమ జాతి వ్యధల్ని, గాథల్ని సృజనీకరించాలంటే కల్పిత పాత్రలు సృష్టించక తప్పదు.
కల్పితమైన ఇతివృత్తాల్ని ఎన్నుకోవాలి.
ప్రాంతాల్ని కూడా మార్చాల్సి ఉంటుంది.
వ్యక్తుల పేర్లు, వస్తువుల పరిధులు విస్తరించక తప్పదు.
అప్పుడు మాత్రమే సత్యాన్ని భోధించగలుగుతాం.
రచయిత సత్యం వైపు ఉంటాడు.
ఆ స్వేచ్ఛ సంప్రదాయంగా కొనసాగే భారతీయ సాహిత్యంలో లభిస్తుందనుకున్నాడు జాషువా.
రామాయణ, భారత, భాగవతాల్లో పాత్రల్ని కలిపినా
 తొలగించినా, కథల్నే మార్చినా,
సమకాలీన జీవిత ఇతివృత్తాల్నే కథలుగా మార్చినా
అదొక కళగా స్వీకరించగల విశాల హృదయం సంప్రదాయ సాహిత్యంలో ఉంది.
అంతర్గతంగా ప్రవహించేది హిందూ భావజాలమే అయినా
భారతీయ సాహిత్యంలో కవికి స్వేచ్ఛ కనిపిస్తుంది.
 దీన్ని గుర్తించగలిగాడు జాషువా.
 తన భావాల్ని సమర్ధవంతంగా వ్యక్తీకరించే అవకాశం
భారతీయ సంప్రదాయ సాహిత్యంలోనే ఉందనుకున్నాడు.
తన భావుకతను వెల్లడించగలిగే వీలుకూడా ఈ సాహిత్యంలోనే ఉందని భావించాడు.
ఉదాత్తమైన కళాసృష్టి:
అంతకు ముందు నిరాదరణకు గురైన గబ్బిలం, సాలీడు, గిజిగాడు వంటి వాటికి కూడా తన రచనల్లో ప్రాధాన్యమివ్వగలిగాడు జాషువా.
 వాటిలోనూ ఉదాత్తతను చూపగలిగాడు.
వాటిలోనే ఉదాత్తతను చూడగలిగినప్పుడు మానవుడిలో,
అదీ దళితుడిలో ఉన్న ఉత్తమ గుణాల్ని చూడలేమా?
అని తేట తెల్లం చేయగలిగాడు.
జాషువాలో అపూర్వమైన ప్రతిభ ఉంది.
జంటకవిత్వం రాయాలనుకున్నాడు.
నాపేరు ముందు నిల్పం
బాపందియేమొ జాషువా పిచ్చులగున్
నాపేరు చివర నిల్పిన

శాపంబిడినట్లు పిచ్చ జాష్వాలయ్యెన్  (నాకథ –ప్రథమ భాగం: 236)
అంతే అవధానం కంటే తానే స్వేచ్ఛగా రాయాలనుకున్నాడు. 
తనలో అద్భుతమైన భావుకత ఉన్నప్పుడు దాన్నెలాగైనా ప్రదర్శించొచ్చు.
అదే చేశాడు జాషువాజ
ఆయన రాసిన ప్రతి ఖండికలోనూ ఆ భావుకతను చూడవచ్చు.
 దాన్నే ఆ రచనల్లో పెట్టాడు.
సాలీడు పేరుతో ఆరో, ఏడు పద్యాలు రాశాడు.
లోకమంతా "సాలీడు"ని మోసపు పురుగని అంటుంది.
చిన్నచిన్న పురుగులన్నింటినీ "సాలీగూడు" అల్లి చంపేస్తుందంటారు.
కానీ, జాషువా మరో రకంగా చూపగలిగాడు.
సహజంగానే ప్రతిజీవికి బతుకు కోసం పోరాటం తప్పదు.
దీన్నే మనుగడ కోసం పోరాటం అంటారు.
 ఇది 'మత్స్య న్యాయం' లాంటిది కాదు.
'సాలీడు' కూడా అలాగే తన పొట్ట పోషించుకోవడం కోసమే పోరాటం చేస్తుంది.
తన తెలివితేటలతో జీవిస్తుంది.
ఇంకా చెప్పాలంటే తాను రక్షణ కోసం గూడు కట్టుకుంటుంది తప్ప, అందులో పడి చావమనడం లేదు.
సాధారణంగా పక్షులు, పెద్ద క్రిమి కీటకాదులు తన గూడుని నాశనం చేస్తుంటాయి.
అయినా, మళ్ళీ మళ్ళీ శ్రమించి తాను జీవించడానికో గూడు కట్టుకుంటుంది.
మెరుపు దారాలతో మరే ఆ గూడుని కట్టుకుంటుంది.
అలాంటి దారాన్ని సృష్టించగల శక్తి దానికే ఉంది.
అదొక అద్భుతం.
అది ప్రకృతి ప్రసాదించిన వరం.
దానితో గూడు అల్లుకుని
దాని దగ్గరకు ఎవరూ రాకూడదని ఆశపడుతుంది.
క్రిమికీటకాలేవీ మెరుపుల్నీ చూసి భయపడకపోగా
రంగుల హరివిల్లులా మెరుస్తున్న గూడుని చూడ్డానికొచ్చి,
 కొన్ని పురుగులు ఆ గూడునే నాశనం చేస్తాయి.
 కొన్ని అందులో పడి ప్రాణం కోల్పోతాయి.
వాటినే తన ఆహారంగా సాలీళ్ళు స్వీకరిస్తాయి.
అలాంటప్పుడు తానేవిధంగా ఇతరుల్ని భక్షిస్తుందో,
ఇతర్లు శిక్షిస్తుందో,
ఇతర్లు తననెందుకు విషప్పురుగుగా భావిస్తారో అర్ధంకాదని
సాలీడు ఆవేదన చెందుతుందని చమత్కరిస్తాడు కవి.
ఆ సాలీడు అంత అందమైన
 అంత సన్నని నూలు దారాల్ని అల్లగలగడం వెనుకున్న నైపుణ్యాన్ని
 గొప్పగా వర్ణిస్తాడు జాషువా.
ఆ ప్రతిభకు అబ్బురపడిపోతాడు.
దాన్ని అంత గొప్ప ప్రతిభతోను వర్ణించి మనల్ని అందర్నీ అబ్బురపరుస్తాడు
ఉదాహరణికి ఓ రెండు పద్యాలు చూద్దాం...
"నీలో నూలు తయారు చేయు మరగానీ ప్రత్తి రాట్నంబుగా
నీ,వేదీశ్వర శక్తి నీ కడుపు లోనే లీనమై యుండునో
యే లీలన్ రచయింతు వీ జిలుగు నూలీపట్టు పుట్టంబులో
సాలీడా!నిను మోసగాడవని విశ్వంబేల ఘోషించెడిన్?--- "

"ఢక్కా మల్లు పసందు నేతపని వాండ్రా, నీయుపాధ్యాయులి
ప్డొక్కడున్ గనరాడు దాగుకొనినారో నీదు గర్భంబు నం
దిక్కాలంబున నిన్నుమించు పనివాడే లేడు; దుర్వృత్తికిన్
దిక్కై, నీ యసమాన కౌశలము వ్యర్థీభూతమై పోయెడిన్".
సాలీడులోని నైపుణ్యాన్ని అంతకుముందెవ్వరు ఇంత గొప్పగా గుర్తించగలిగారా?
 చక్కని భావుకత ఈ పద్యాల్లో ఉంది.
కళాత్మకత ఉంది.
కవి వర్ణనా సామర్థ్యం అనన్య సామాన్యంగా కనిపిస్తుంది.
అంత చక్కని, సన్నని దారం,
అందమైన మెరుపుల దారం
నీ పొట్టలో రావడానికి కారణమేంటి? అని అడగటంలో
కవి హేతువుని అన్వేషించడం కనిపిస్తుంది.
దానికో ఓ సమాధానాన్నీ కవే ఊహిస్తాడు.
ఆ ఊహలో గొప్ప ఉదాత్తత ఉంది.
ఎంతో ప్రతిభావంతులైన గురువులు నీ పొట్టలో ఉండటమే దానికి కారణమెమో అంటాడు.
అంతకు ముందు
ఈశ్వర శక్తి నీ కడుపులో లీనమై ఉందేమో అంటూనే,
అది దైవశక్తి కాదు, మానవీయమైన శక్తీ అనీ,
అదీ గురువుల దగ్గర నేర్చుకుంటే వచ్చేదనే సృహనే కల్గిస్తాడు జాషువా.
అతీంద్రియ భావాల కంటే, మానవీయ ప్రతిభకే ప్రాధాన్యతనిచ్చాడిక్కడ!
అక్కడ వరకే చెప్తే గొప్ప కవితాఖండిక అయ్యేది కాదేమో!...
దాన్ని సమకాలీన నేతవృత్తుల స్థితిగతులతో పోల్చాడు జాషువా!
దీనిలో కవి పీడిత పక్షాన్నే నిలబడ్డాడు.
కళ కళ కోసమే అనే వాదం సరైంది కాదని నమ్ముతూనే
కళ ప్రజలకోసమే అనే వాదాన్ని బలపరుస్తున్నాడు జాషువా!
ఇక్కడే జాషువా గొప్ప ప్రతిభావంతుడని,
వ్యక్తి కోసం కాకుండా వ్యవస్థ కోసమే
తన కవిత్వాన్ని ఆయుధంగా ఉపయోగించాడని స్పష్టమవుతుంది.
అందుకే జాషువా మహాకవిగా నిలవగలిగాడు.
ఇన్ని రకాలుగా జాషువా అనేక రచనలు చేసినా,
 ఆయన రచనల్ని అర్థం చేసుకోవడంలో
కొంత అయోమయం కూడా కనిపిస్తుందని చాలా మంది విమర్శకులు అభిప్రాయ పడుతున్నారు.
సమకాలీన సంఘర్షణ ప్రతి ఫలనం:

జాషువా జీవితకాలంలోనే గాంధీ సంస్కరణ వాదం,
మరోవైపు అంబేద్కరిజమ్ వీటి మధ్య తీవ్రమైన సంఘర్షణ కొనసాగుతోంది.
ఇక్కడ జాషువా ఏ వాదాన్ని సమర్ధించాడు?
దేనివైపు మొగ్గాడని అనేది కూడా చూడాల్సి ఉంది.
గాంధీ భారత జాతీయోద్యమ కాలంలో నిర్వహించిన పాత్ర సామన్యమైంది కాదు.
గాంధీ ప్రభావంతో అన్ని వర్ణాల, వర్గాల ప్రజలూ కింది వర్ణాల పట్ల సానుభూతిని ప్రకటించారు.
అదొక ఉద్యమ ప్రాయంగా జరిగింది.
గాంధీ సంస్కరణల్లోని కార్యాచరణను అనుమానించే అవకాశం ఉన్నా,
కనీసం ఆ మాత్రమైనా దళితులకు ఊరట లభించవలసిన అవసరమే
 ఆ కాలానికి తగిందని జాషువా భావించాడు.
గాంధీ సంస్కరణను తన రచనల్లో అనుసరించాడు.
అలాగని అంబేద్కర్ భావాలకి వ్యతిరేకి మాత్రం కాదు.
నిజానికి ఇదొక సంఘర్షణే.
ఆ సంఘర్షణే జాషువా రచనల్లోనూ కనిపిస్తుంది.
అదే కాదు, జాషువాని అర్థం చేసుకోవడం కూడా అంత సులువేమీ కాదు.
అసలు జాషువా, ఆయన రచనల్నీ ఎలా అర్థం చేసుకోవాలి?
హిందూ పురాణీతిహాసాల్ని బాగా చదువుకున్నాడు.
డా// అంబేద్కర్ కూడా అంతే!
హిందూ మత గ్రంథాలతో సహా అన్నింటినీ...
ఓ విధంగా చెప్పాలంటే అంబేద్కర్ ఔపోసన పట్టాడు.
డా// అంబేద్కర్ రాసిన "కుల నిర్మూలన",
"అస్పృశ్యులెవరు?",
 " హిందూ మతంలో చిక్కుముడులు" వంటి గ్రంథాల్ని చూస్తే,
 అంబేద్కర్ కి వేదాలు, పురాణాల పట్ల ఉన్న సాధికారికత అర్థమవుతుంది.
హిందూ మత భావాల్ని విమర్శించాలన్నా,
వాటి గురించి మాట్లాడాలన్నా,
 ముందుగా వాటిని బాగా చదవాలి.
చదివిన దాన్ని అర్థం చేసుకోవాలి.
అర్థం చేసుకున్న దాన్ని తనదైన దృక్పథంతో వ్యాఖ్యానించగలగాలి
 అప్పుడే వాటి గురించి మాట్లాడే హక్కు ఉంటుందేమో.
లేకపోతే, వాటి గురించి మాట్లాడే హక్కు ఉందా? అనిపిస్తుంది.
జాషువా, డా// అంబేద్కర్ లాగే హిందూ మత గ్రంథాల్ని బాగా చదువుకున్నాడు.
హిందూ భావాల్ని,
హిందూ భావజాలాన్ని
హైందవ ఇతివృత్తాల తోనే ఒక Alternative Cultureని Create చేశాడు.
తన రచనల్లో భగవంతుడి గురించి చెప్తున్నట్లే ఉంటుంది.
కానీ, తన రచనల్లో భగవంతుడి అస్తిత్వాన్నే ప్రశ్నిస్తాడు.
అలాంటప్పుడు జాషువాని హేతువాది అందామా?
మానవత్వానికీ పట్టం కడుతున్నాడు! కనుక, మానవతా వాది అందామా?
"క్రీస్తు చరిత్ర" వంటి ప్రబంధాల్నీ రాశాడు.
 తనది క్రైస్తవుడి పేరే!
అందువల్ల క్రైస్తవుడని అందామా?
అయితే, క్రైస్తవులే ఎందుకు ఆయన ఉద్యోగాన్ని ఊడగొట్టారు?.
ఇవన్నీ జాషువా జీవితంలో,
జాషువా రచనల్లో కనిపించే సంఘర్షణలు.
బహుశా నా అవగాహనలో ఇవన్నీ సమాజంలో ఉన్న సంఘర్షణలు.
అవే జాషువా రచనల్లోనూ ప్రతిఫలించాయనిపిస్తుంది.
ఇలాంటి సందిగ్దత వల్లే విమర్శకులు జాషువాని భిన్న దృక్పథాలతో అర్థం చేసుకొనే అవకాశం ఏర్పడింది.
జాషువాని ఎన్ని రకాలుగా అర్థం చేసుకున్నా,
 తాను విశ్వనరుణ్ణని జాషువాయే చెప్పుకున్నా!
 జాషువాని దళితులే ఎందుకు పట్టించుకుంటున్నారు?.
మరి అందరివాడైతే అన్ని వర్గాల వాళ్ళూ ఎందుకు పట్టించుకోవట్లేదు?
ఆలోచించాల్సి ఉంది.
అందుకే ఒకటి గుర్తించాలి.
"రాజు మరణించెనొక తార రాలిపోయె
సుకవి మరణించెనొక తార గగనమెక్కె
రాజు జీవించు రాతి విగ్రహములయందు
సుకవి జీవించు ప్రజల నాల్కలయందు"

 జాషువా సంప్రదాయ రూపం పద్యంలోనే,
హిందూ పురాణేతిహాసాల్నే తీసుకుని రాసినా,
 దళిత కవి నెక్కడ పెట్టాలో కరడు గట్టిన హిందువులకు తెలుసు.
కొంతమంది పైకి హత్తుకున్నట్టు హృదయానికి హత్తు కున్నా,
 తమ చేతులకి తమకి కావల్సినవి తగులు తున్నాయో లేదో వెతుకుతుంటారు.
అవేంటో మీకు మరీ వివరించి చెప్పక్కర్లేదనుకుంటాను.
 అది నాస్వీయానుభవం!
జాషువా విషయంలోనూ అలాగే జరుగుతుంది.
అది తెలుసు కాబట్టే
దళితులే జాషువాని పట్టించుకొంటున్నారు.
దళితులు పట్టించుకుంటున్నారు కనుక, అనివార్య పరిస్థితుల్లో జాషువానీ అందరూ పట్టించుకున్నట్లు నటిస్తున్నారు.
అందుకే దళితులకి డా// అంబేద్కర్, జాషువా జయంతులు, వర్థంతులన్నీ పండుగలే .
అలాంటి ఈ పండుగలో పాల్గొని
 నాలుగు చిలుక పలుకుల్ని పలకడానికి
 నాకు అవకాశం కలిగించిన అంబేద్కర్ స్టూడెంట్స్ యూనియన్,
అలాగే మిగతా వాళ్ళందరికీ కృతఙ్ఞతలు తెలియజేస్తున్నాను.
థాంక్యూ!

( 30/09/2008 తేదీన హైదరాబాదు విశ్వవిద్యాలయంలో డా// బి.ఆర్.అంబేద్కర్ స్టూడెంట్స్ యూనియన్‌ ఆధ్వర్యంలో జరిగిన జాషువా 113 వ జయంతి సందర్భంగా జరిగిన సాహితీ సమావేశంలో 'జాషువా సాహిత్య దృక్పథం' గురించి డా// దార్ల వెంకటేశ్వరరావు గారు చేసిన ప్రసంగంలోని కొన్ని ముఖ్యాంశాలు)

4 కామెంట్‌లు:

mahender చెప్పారు...

సార్ నమస్కారం,నేను మహెందర్ ని.మీరు జాషువా జయంతి సభలో చాలా బాగా మాట్లాడారు.సమకాలిన సమాజంలో జాషువా సంఘర్షణని చక్కగా తెలిపారు.

mahender చెప్పారు...

సార్ నమస్కారం,నేను మహెందర్ ని.మీరు జాషువా జయంతి సభలో చాలా బాగా మాట్లాడారు.సమకాలిన సమాజంలో జాషువా సంఘర్షణని చక్కగా తెలిపారు.

పాఠకుడు...! చెప్పారు...

sir, mee rachana jashua gari gurinchi chadivina taruvatha nenu mee rachana saili ki abhimaninai poyanu . amshanni antha lothuga vishlesichi rasina mee vishleshana chala aakattukunnadi nenu vishwa narudni ani bhuvana bhonantharalalu vinipinchetluga gothetti cheppina Jashua garu yadava thandri ki puttadu ane vishayam mee rachana lo ne thelusukunnanu , kani mana dalithulalone thanu dalithudini ani cheppe dhairyam leni entho mandi vunna ee rojulalo thanu poorthiga dalithudu kaka poyina dalithudine ani prakatinchukunna jashua garente nijanga naaku aayana patla gouravam marintha perigindi mana dalitha jaathi aayanaku eppatiki runapade vuntundi. namaskaramulatho.

PERURU ZPH SCHOOL చెప్పారు...

హాయ్ సర్ నేను మీ ముమ్మిడీ వరపు వెంకటేశ్వర రావు .జాషువా గురించి చాలా విషయాలు తెలిపారు.ఎలవున్నారు .నా no 9490480053