- డా దార్ల వెంకటేశ్వరరావు ,
1.0. ప్రస్తావన :
సమాజం వ్యక్తుల సమూహం. వ్యక్తుల మధ్య వైరుధ్యాలు కనిపిస్తుంటాయి. భారతీయ సమాజంలో వ్యక్తుల మధ్య ఏర్పడే వైరుధ్యాల్లో "కులం" ఒక అనివార్య సందర్భమయిపోయింది. క్రమానుగతి (Hierarchy), వేరుగా ఉండటం (Separation), పరస్పర ఆధారం (Interdependence) వంటి సూత్రాల ఆధారంగా కులం నిర్మితమవుతుంది. ఒకే మూలపురుషుడు కలిగి, ఒకే ఆనువంశిక వృత్తిని పాటిస్తూ, అంతర్వివాహాలు చేసుకుంటూ ఒకే పేరుతో చెలామణి అయ్యే కుటుంబాల లేదా బంధుత్వ సమూహాల స్వాధర్మ్య "కులం" అని సామాజిక శాస్త్ర వేత్తలు నిర్వచించారు. కులం వ్యక్తులకు శుద్ధి (Purity ), అశుద్ధి (Pollution) అనే గుణాన్ని ఆపాదిస్తుంది. తెగ (Tribe)కీ , కులాని (Caste)కీ కొన్ని సమాన లక్షణాల్లో ఉన్నా, "కులం" లో అశుద్ధి, అపవిత్రత వంశ పారంపర్యంగా మారి, అది వారిని శాశ్వతంగా అస్పృశ్యుల్ని చేస్తుంది. అంతే కాకుండా, అస్పృశ్యత అనేది భౌతిక, మానసికపరమైనది. వివిధ పనులు చేయటం వల్ల అది ఏర్పడుతుంది. దాన్ని "సంస్కారాల" రూపంలో తొలంగించుకునే అవకాశం ఉంది. కానీ, మానసికంగా ఏర్పడిన "భావన" మాత్రం అలాగే ఉండిపోయి 'అస్పృశ్యత' కొందరికి "అవమానం"గా పరిణమిస్తుంది. అది జీవితాంతం వెంటాడుతుంది. వంశపారంపర్యంగా వెంటాడుతుంది. కాసుల ప్రతాపరెడ్డిగారు "వెంటాడే అవమానం" పేరుతో ఓ కథ రాశారు. ఒక సామాజిక వాస్తవాన్ని తెలిపేది ఈ కథ. దళితుడికి జరిగే అవమానాన్ని సామాజిక ఉన్నత అంతస్తు (Ascribed Status)లో ఉన్న వాళ్ళు, సామాజిక నిమ్న అంతస్తు (Lowest Social Status) లో ఉన్న వాళ్ళని తమతో సమానంగా చూడటానికి ప్రయత్నిస్తే కలిగే ఆటంకాలను ఈ కథలో వర్ణించారు. దళితులను, దళితేతరులను ఆలోచింపజేసే అనుభూతి ఐక్యత (Unity of Impression) గల కథగా దీన్ని చెప్పుకోవచ్చు.
1.1. కథా సారాంశం :
ప్రశాంత్ రెడ్డి ఓ జర్నలిస్ట్. ఉద్యోగరీత్యా తన భార్యతో పాటు ఊరునుండి వచ్చేసి హైదరాబాదులో నివశిస్తుంటారు. వీళ్ళని చూడ్డానికి ప్రశాంత్ రెడ్డి తల్లి లక్ష్మమ్మ వస్తుంది. ఆ రోజు ఎందుకో తల్లిని తొందరగా తన సొంత ఊరుకి పంపేయాలనుకుంటాడు. అతని అంతరంగం భార్యకే తెలియక అత్తగారిని ఇంకొన్ని రోజులు ఉండమంటుంది. ఆ మాటనే అతన్ని కూడా చెప్పమంటుంది. ఆ మాటని పట్టించుకోకుండా ఆఫీసుకి వెళ్తున్నానీ, ఎండ ముదరకముందే బయలుదేరమనీ తల్లికి చెప్పి ఓ వంద రూపాయలు చేతిలో పెట్టి ఆఫీసుకు వెల్లిపోతాడు. ఆతని తల్లి ఆ ఇంట్లో ఉండటం ఇష్టం లేకనో, ప్రేమ లేకనో కాదు. దానికి ఓ కారణం ఉంది.
ఆ సాయంత్రం భోజనానికి ప్రశాంత్ రెడ్డి ఇంటికి వస్తానని రాహుల్ చెపుతాడు. రాహుల్ది అతని ఊరే. వాళ్ళిద్దరూ ఒకే బడిలో చదువుకున్నారు. ఊరవతల గుట్టల్లో గంటలు గంటలు కూర్చొని మాట్లాడుకునే వారు. "ఎల్లయ్య" అనే పేరుని "రాహుల్" గా మార్చుకుంటాడు. బాగా చదువుకొని హైదరాబాదులోనే ఓ ఉద్యమంలో పనిచేస్తూ, ఈ మధ్యకాలంలో తనకి మళ్ళీ దగ్గరవుతాడు. అతడిని ప్రశాంత్ రెడ్డి ఎన్నోసార్లు భోజనానికి పిలిచేవాడు. రాహుల్ మాత్రం తర్వాత వస్తాననేవాడు. అలాంటి రాహుల్ ఆ రోజు భోజనానికి రావడానికి అంగీకరిస్తాడు. అతని తల్లిగానీ, తండ్రిగానీ ప్రశాంత్ రెడ్డికి ఎదురయితే "దండాలు దొరా" అని కాలు మొక్కుతుంటారు.
ప్రశాంత్ రెడ్డి తన భార్య వీణతో మాట్లాడేటప్పుడు , అప్పుడప్పుడూ రాహుల్ ప్రస్తావన వస్తుండేది. ఆమెకి కూడా రాహుల్ పట్ల జాలీ, సానుభూతి ఏర్పడిందని అతనికి అనిపించేది. ఆ ధైర్యంతోనే రాహుల్‌ని భోజనానికి రమ్మని పిలిచేవాడు. ఆ రోజు రాహుల్ వచ్చేటపటికి తల్లి తన ఇంటి దగ్గర లేకపోతే చాలనుకుంటాడు ప్రశాంత్ రెడ్డి. భార్య తనని అర్థం చేసుకుంటుందనుకుంటాడు. కానీ, "నీకు బుద్ధి లేదు కాబట్టే మాదిగోడికి మంచంలో తిండి పెడతానంటున్నావు" అంటుంది వీణ. "అడ్డమైన వాళ్ళకీ వండి పెట్టనంటుంది. వండి పెడితే ఊరుకోనంటుంది".
ఇప్పుడేం చేయాలి? తన భార్యతో ఘర్షణ తప్పదా? తప్పలేదు. రాహుల్ వచ్చే టైమవుతుంది. రాత్రి ఏడున్నర తర్వాత వస్తాడు రాహుల్ . వచ్చీ రాగానే "అక్క" కనిపించటం లేదేమిటని అడుగుతాడు. "జ్వరం వచ్చింది. పడుకుంది." అని ప్రశాంత్ రెడ్డి సమాధానం చెప్తాడు. "అయ్యో డాక్టర్‌కి చూపించావా" అంటాడు రాహుల్. తలూపి, ఆ తర్వాత కాసేపటికి "హోటల్ కెళ్దాం పద" అంటాడు ప్రశాంత్ రెడ్డి. "చెప్పటం మరిచాను దారిలో పాత ఫ్రెండ్ ఒకతను కలిసి బలవంతంగా వాళ్ళింటికి తీసుకెళ్ళాడు. భోజనం చేసిందాకా ఊరుకోలేదు. అందుకే రావటం ఆలస్యమయింది" అని రాహుల్ సమాధానమిస్తాడు. ప్రశాంత్ రెడ్డికి ఏమి మాట్లాడాలో పాలుపోదు. "సారీ" అని మాత్రం అనగలుగుతాడు. రాహుల్ చేతిని దగ్గరగా తీసుకొని ప్రేమగా నొక్కుతాడు. "ఎందుకింత ఇదయి పోతావు, మరోసారి తప్పకుండా "అక్క" చేతి వంట తింటా కదా!" అంటూ, తనకేమీ జరగనట్లే కాసేపు ఉండి, బయలుదేరతాడు. అతనితో పాటు బయటిదాకా వచ్చి సాగనంపేస్తూ, రాహుల్ ఓ వ్యాసంలో రాసిన వాక్యాల్ని గుర్తుచేసుకుంటూ, అతను వెళ్ళే దారిని చూస్తూ నిలబడిపోతాడు ప్రశాంత్ రెడ్డి.
దీన్ని కింది విధంగా విశ్లేషించుకునే అవకాశం ఉంది.
1.2. దళిత వాస్తవిక జీవిత చిత్రణ :
"అంటరానితనం, సాంఘిక అణచివేత, ఆర్థిక పీడన, రాజకీయ అణచివేత, మనుషులుగా పరిగణింప బడకపోవటం, పశువులకన్నా హీనంగా చూడబడటాన్ని 'దళిత వాస్తవికత' " అని డా.ఎస్వీ. సత్యనారాయణగారి అభిప్రాయం. కట్టుబాట్లు, నమ్మకాలు వంటివి దళితేతరుల జీవిత వాస్తవికతగా ఆయనే వివరించారు. వల్లంపాటి వెంకట సుబ్బయ్యగారు కథకు 'జీవితం ముడి సరుకు' అవుతుందని అంటారు. కథా వస్తువు రచయిత జీవితంలోనుంచి కానీ లేదా రచయితకు తెలిసిన ఇతరుల జీవితంలోనుంచి కానీ పుట్టవచ్చు (పు : 21 : కథా శిల్పం - 2000) అనీ, "కథలోని జీవితానికి ప్రాతినిథ్యం వహించగల పాత్రలని అదే జీవితానికి ప్రాతినిథ్యం వహించగలిగిన సంఘటనల్లో పెట్టి వాటి అంతరంగ, బహిరంగ జీవితాలనూ వాటి మధ్య ఉన్నసంబంధాన్నీ లేదా వైరుధ్యాన్నీ చిత్రించుటమే వాస్తవిక కథనం" (పు : 54) అవుతుందన్నారు. అలాగే " పాత్ర మానసిక జీవితానికీ, భౌతిక జీవితానికీ మధ్య ఉన్న సంబంధాన్నీ లేదా వైరుధ్యాన్నీ చిత్రించుటమే నిజమైన వాస్తవికతా వాదం అవుతుందని" (కథాశిల్పం : పు : 54) చెప్పారు.
ఈ అభిప్రాయాలతో పరిశీలించినా, "వెంటాడే అవమానం" వాస్తవిక దళిత జీవితం ప్రతిఫలించే కథే అవుతుంది. మారుతున్న సామజిక పరిస్థితులు, విద్యాఉద్యోగ అవసరాల వల్ల దళిత, దళితేతరుల మధ్య సంబంధాలు తప్పనిసరవుతున్నాయి. అయితే, ఈ బంధం అవసరార్థం ఏర్పడుతున్నా, యాంత్రిక మానవ సంబంధాలుగా కొనసాగుతున్నాయి. అంతే తప్ప భౌతిక , మానసిక అంతరాల్లో భేదాలు తొలగించుకుని కలిసి పోయే మానవ సంబంధాలు కాలేకపోతున్నాయి. దీని వల్ల దళితుల పట్ల జాలీ, సానుభూతీ, అర్థం చేసుకునే పరిస్థితి ఒక వ్యక్తికి కలిగినా, ఆ వ్యక్తికి కుటుంబంతో, సంఘంతో, సమాజంతో కొనసాగవలసిన పటిష్ట బంధానికి ఆటంకాలుగానే ఉనాయి. ఈ విషయాలను కథలో సృజనీకరించి వాస్తవికతను ప్రతిబింబించేటట్లు రాశారు. అందుకనే " వెంటాడే అవమానం" కథలో దళిత, దళితేతరుల మధ్య ఉండే సంబంధాలను కథలో పాత్రల మధ్య ఉండే గాఢతను పరిశీలిస్తే "అనుభూతి ఐక్యత" (Unity of Impression) అనే గొప్ప కథకుండే లక్షణం కనిపిస్తుంది. అంతే కాదు, కథా విమర్శకులు ఆశించినట్లు కథలో సంఘర్షణ ఉంది. " ఇద్దరు వ్యక్తుల మధ్య, ఒకే వ్యక్తిలోని రెండు వ్యక్తుల మధ్యా, రెండు భావాల మధ్యా, రెండు వర్గాల మధ్యా, రెండు సిద్ధాంతాల మధ్యా, రెండు జీవిత దృక్పథాల మధ్యా ..." ఇలా ఎన్నింటి మధ్యనైనా సంఘర్షణ ఉండాలని విమర్శకులు అంటుంటారు (కథాశిల్పం - 2005 : 15). ఈ కథలో కింది విధంగా ఆ సంఘర్షణను వింగడించుకోవచ్చు.
1. దళితులు - దళితేతరుల మధ్య సాంఘిక అసమానతల వల్ల సంఘర్షణ.
2. కలిసి మెలిసి జీవించే విషయంలో సాంస్కృతిక సంఘర్షణ.
3. దళితులు - దళితేతరలు కలిసి మెలిసి జీవిస్తే భౌతిక, భావనావాద సిద్ధాంతాల్లో వారు దేన్ని అనుసరించి జీవించటంలో నిర్ణయించుకునే సంఘర్షణ.
పై మూడింటిలో మొదటిది సాంఘిక, ఆర్థిక కోణాలకు చెందిన సంఘర్షణ. మిగిలిన రెండు అన్ని వర్గాలూ కలిసి మెలిసి బతకటంలో కలిగే సంఘర్షణ ఈ కథలో ప్రశాంత్ రెడ్డికి - కుటుంబంలో తల్లి, భార్యకి మధ్య సైద్ధాంతిక, సాంస్కృతిక ఘర్షణ కనిపిస్తుంది. అది వీణ - ప్రశాంత్ రెడ్డిల సంభాషణల్లో వ్యక్తమయింది. దీనివల్ల "వీణ"లో భావవాదం, గతానుభవాల వల్ల వచ్చింది. రాహుల్ జీవితంలో భౌతికవాదం కనిపించటానికీ గతానుభవాలే కారణమవుతున్నా, పూర్తిగా "భౌతికవాది"గా కనిపించకపోయినా, కత్తి పద్మారావు వంటి వారు అంబేడ్కర్ ఆలోచనా విధానంగా ప్రచారం చేస్తున్న "ప్రత్యామ్నాయ సంస్కృతి" లో భాగంగానే హిందూ కుల సమాజంలో కనిపించే పేరు "ఎల్లయ్య"ను తల్లితండ్రులు పెడితే, అతడు రాహుల్ అని మార్చుకుంటాడు. రాహుల్ అనేది అంబేడ్కర్ నమ్మిన భౌద్దిజానికి సంబంధించింది. కుల నిర్మూలనకు భౌద్ధ దీక్షను తీసుకుంటాడు డా.బి.ఆర్. అంబేడ్కర్. ఇవన్నీ దళితుల ప్రత్యామ్నాయ సంస్కృతికి జరిగే ప్రయత్నాల్లో కొన్ని. "సాధారణంగా నిత్య జీవితానికి పాత్ర ఎంత దగ్గరగా ఉంటే అంతం నమ్మకం కలుగుతుంది. మార్పు లేకుండా ఉండటం (Constitastincy) కథలోని పాత్రలకు ఉండవలసిన మొదటి లక్షణం" (కథాశిల్పం : పు :28). ఈ కథలో ప్రశాంత్ రెడ్డి - వీణ పాత్రలు నిత్య జీవితానికి దగ్గరలో ఉన్నాయి. సంఘర్షణ కూడా దగ్గరగానే ఉంది.
ఈ కథలో ప్రశాంత్ రెడ్డికి భయపడో, సర్ది చెప్పటం వల్లనో తన భార్య "వీణ" మనస్తత్వం మారిపోతే కథలో సంఘర్షణ బయటకు రాదు. అప్పుడు కథ పేలవం అయిపోతుంది. "వీణ" మారలేదు. చివరకు ఒకే సైద్ధాంతిక దృక్పథానికి కట్టుబడి ఉండటం వల్లనే, కథలో రచయిత చెప్పదలచిన "సమస్య" పట్ల, పరిష్కారం పట్ల పాఠకుడు లోతుగా ఆలోచిస్తాడు. ఇదే కథకు ప్రాణం వంటిది. కథలో సాధరణంగా ఒక నేపథ్యం చిత్రితమవుతుంది. స్థలం (Place ), కాలాల (Time) చిత్రణే కథాసాహిత్యంలో నేపథ్య (Setting) చిత్రణ ( కథాశిల్పం : పు : 34) అవుతుంది. దీన్ని బట్టే రచయిత చిత్రించవలసిన "సమస్య" తీవ్రత అర్థమవుతుంది.
1.3. కథా నేపథ్య చిత్రణ - సమయ తీవ్రత :
ఒకరోజులో ఈ కథ జరిగినట్లుగా రచయిత వర్ణించారు. ఒక్కరోజులో కులనిర్మూలన, అస్పృశ్యతా నిర్మూలన అనే జరిగేవి కాదు. పొద్దున్నే ప్రశాంత్ రెడ్డి స్నానం చేయడానికి వెళ్తుండగా ప్రారంభమైన కథ రాత్రికి ముగిసింది. కథలో పగలు అంతా ఉన్నది తానూ, తన భార్య. చీకటిలో వచ్చి, చీకటిలోనే ఒంటరిగా కలిసిపోయినవాడు రాహుల్. తాను అనుభవిస్తున్న వెలుగుని, తన తోటివారికి పంచాలనో, ఆదుకోవాలనో ఆశించటంవల్లనే "రాహుల్"తో కాసేపయినా చీకటిలో ప్రశాంత్ రెడ్డి నిలబడ్డాడు. వెలుతురు కోసం చీకటిలో కలిసిన వాడికోసం చూస్తూ నిలబడ్డాడు. ఈ కథలో వెలుతురు ఉండగా కనిపించిన పాత్రలు మూడు. చీకటిలో వచ్చి చీకటిలోనే వెళ్ళిపోయిన పాత్ర ఒకటి. మూడింటిలో ఒక వర్గం, ఒంటరివాడి తోడు కావాలంటే, తాను తన వ్యవస్థ నుండి బయటకు వచ్చేయాలి. అప్పుడూ రెండు వేరు వేరు సమాజలవుతాయి తప్ప మూడు + ఒకటి = నాలుగు (3+1=4) పాత్రలూ కలిసిన సమాజం కాదు. రాహుల్‌లో ఆశావాదంగా "అక్క చేతివంట తప్పకుండా మరోసారి తింటానని" అనుకుంటూనే, తాత్కాలికంగా అవమానం వెంటాడినా దాన్ని జయించి, అందరిలో కలిసే రోజు వస్తుందనే ఆకాంక్ష కనిపిస్తుంది. దానికి ఏమీ చేయాలని ప్రశాంత్ రెడ్డి ఆలోచించటమే ప్రశాంత్ రెడ్డి మనసులో రాహు రాసిన వ్యాసంలో వాక్యాల్ని గుర్తు చేసుకుంటూ నిలబడటం. కనుక నాలుగు వర్ణాల వాళ్ళు కలిసి మెలిసి బతకడం ఎలాగో పాత్రానుగుణంగా, సంఘర్షణాత్మక సన్నివేశాలతో ఈ కథ నిర్మిత మయిందని స్పష్టమవుతుంది.
1.4. సమస్య తీవ్రతకు కారణం - అస్పృశ్యత :
భారతదేశంలో కులం అస్పృశ్యతలో అంతర్భాగమయిపోయింది. అస్పృశ్యత అనేది భౌతిక, మానసికమైన మైల (Imupurity) వల్ల ప్రపంచ దేశాల్లో ఉందని "అస్పృశ్యులెవరు?" అనే గ్రంథంలో డా. బి.ఆర్. అంబేడ్కర్ పరిశోధనాత్మకంగా చర్చించారు. "అశుచి, మైల, కళంకం, అపవిత్ర్త, అంటు, అపరిశుభ్రత, మురికి అనే భావాలు అస్పృశ్యతకు దారి తీస్తాయనీ, ఈ కళంకం నుండి తప్పించుకుని బయట పడే మార్గాలు కూడా ఈ భావనలో ఇమిడి ఉంటుందని" డా. బి.ఆర్. అంబేడ్కర్ భావించారు (అస్పృశ్యులెవరు? 1992 : 235) "ఆదిమ సమాజం కేవలం మైల (Pulltion) పడడం అనే భావన పట్ల నమ్మకం కలిగి ఉండటమే కాదు, నిర్దిష్టమైన కర్మకాండలు, ఆచార వ్యవహారాలు అనుసరించే ఒక జీవన విధానం ఆవిర్భావానికి కూడా ఈ అస్పృశ్యత అనే భావన దారి తీసింది. "వస్తువుల్ని తాకడం ద్వారా ద్వారా సంక్రమించే "మైల" విషయానికొస్తే, ఆదిమ మానవుడు కొన్ని వస్తువుల్ని పవిత్రమైనవిగా, మరికొన్ని అపవిత్రమైనవిగా పరిగణించటం అలవర్చుకున్నాడు. పవిత్రత అనే భావన కేవలం వస్తువులకు మాత్రమే తప్పనిసరిగా పరిమితం కానక్కరలేదు. కొన్ని తరగతుల మనుషులు కూడా పవిత్రులుగా పవిత్రులుగా పరిగణించబడ్డారు" (పు: 237).
పొలినేషియన్ తెగల్లో, 'ఉగాండా' దేవాలయంలో, దక్షిణాప్రికాలో, న్యూజిలాండ్‌లో, ఈజిప్టు గ్రీకు రోమన్‌లలో కూడా మైలపడటం అనే భావన ఉన్నట్లు అంబేడ్కర్ వివరించారు. ఈ మైల భౌతికమైనదిగానూ, భావనాత్మకం (నమ్మకం) గానూ ఉంటుందని మనువు చెప్పిన ఆంశాన్నీ అంబేడ్కర్ పేర్కొన్నారు (పు : 243). అయితే మైల నుండి కొంతమంది మాత్రమే సంస్కారాల రూపంలో తొలగించుకోవచ్చు అనే నిబంధనలను భారతదేశంలో పటిష్టంగా అమలు చేశారు. మరికొంత మందికి మాత్రం సంస్కారాల రూపంలో కూడా అపవిత్రతను తొలగించుకునే అవకాశమే లేకుండా చేశారు.
హిందువులు పాటించే మరొక రకమైన అస్పృశ్యత ఉన్నది. ఇది కొన్ని జాతులకు వంశపారంపర్యంగా సంక్రమిస్తున్నది. ఇది కొన్ని జాతులకు వంశ పారంపర్యంగా సంక్రమిస్తుంది. 1935 భారత ప్రభుత్వ చట్టం జారీ చేసిన ప్రభుత్వ ఉత్తర్వుల్లోనే 9 భాగాలుగా విభజించి, మైల పడే కులాల వాళ్ళుగా 50 నుండి 60 మిలియన్ల ప్రజలు ఉన్నారనీ, సుమారు 429 అస్పృశ్య కులాలు ప్రభావితమవుతున్నాయనీ అంబేడ్కర్ సోదాహరణంగా నిరూపించారు (పు : 245, 246, 256).
పై వివరణలన్నీ అస్పృశ్యత అనేక దేశాల్లో ఉన్నా, భారత దేశంలో అస్పృశ్యత కులంతో మిళితమైందనీ స్పష్టమవుతుంది. అంతే కాకుండా భౌతిక, మానసిక భావనగా ఇది గాఢమైన ముద్రను వేస్తుంది. కనుకనే, "వెంటాడే అవమానం" కథలో ఊరికి తల్లిని త్వరగా పంపేయటం, తల్లి ఉంటే ఊరిలోనూ తెలిసిపోతుందనీ ప్రశాంత్ రెడ్డి భయపడటం, తన భార్యలో ఆ భావాలు స్పష్టంగా ప్రకటితం కావడం అనే నేపథ్య చిత్రణ కథలో సమస్య తీవ్రతను బాగా చూపగలిగింది. ప్రశాంత్ రెడ్డి స్నానానికి వెళ్ళటం, దళితుల్లో కలిసి పోవాలనుకోవటం, దళితులను తమతో కలిసిపోవమనటానికో, సంస్కరణగానో తరతరాల అస్పృశ్యతను సంస్కరించే ప్రయత్నాన్ని చేశారు రచయిత. అలాగే ప్రశాంత్ రెడ్డి భార్య అంట్లు తోమడం, కడగటంలో కూడా ఆమెలో భౌతికంగా, మానసికంగా రావలిసిన మార్పుని ప్రతీకాత్మకంగా పాత్ర వర్ణన, సన్నివేశ కల్పనలలో సృజనీకరించారు. కథలోని సమస్య సంఘర్షణకు పరిష్కారాన్ని తప్పకుండా చూపించాలనిగానీ లేదా చూపించకూడదని గానీ వాదించటం మొరటువాదంగా విమర్శకులు భావిస్తున్నారు. పరిష్కారం అనేది కథలోనించే సహజంగా రూపొందాలి. పరిష్కారాన్ని బలవంతగా కథ మీద రుద్దటం శిల్ప పరంగా బాధ్యతా రాహిత్యం మాత్రమే అని కథా విమర్శకులు (కథా శిల్పం: పు : 16) చెప్పారు. అయితే, కథలో ముగింపు విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ విషయాన్నే కథాశిల్పం రాసిన విమర్శకుడు వివరిస్తూ " కథ రాయటం పూర్తి చేశాక ప్రారంభాన్నీ, ముగింపునీ తీసేయాలని అంటే వాటిని అదృశ్యంగా ఉంచాలని వాటిని పాఠకుని ఊహా శక్తికి పదును పెట్టాలని" అన్నారు. దీనికి వెంటాడిన అవమానం కథ సరిగ్గా అతుకుతుంది.
1.5. కథకుడిచ్చిన పరిష్కారం:
"వెంటాడిన అవమానం" కథలో పరిష్కారాన్ని ఎక్కడా వాచ్యంగా చెప్పలేదు. అయితే దాన్ని suggestive గా పరిష్కారాన్ని స్ఫురింపజేసి మంచి నైపుణ్యంతో ముగించారు. పాఠుకుని ఊహా శక్తిని బట్టే పరిష్కరాలు వెలువడాలని ఆకాంక్షించారు. అస్పృశ్యతగా పరిణమించి వ్యక్తుల మధ్య భౌతిక, మానసిక అంతరాలకు కారణమవుతున్న ఈ సమస్యను పరిష్కరించుకోవటం దళిత - దళితేతరుల మధ్యే ఉంది. అది ప్రత్యామ్నాయ సంస్కృతి వలన సాధ్యమా? సాంస్కృతికీకరణా వలన సాధ్యమా? లేక ఆ రెండింటినీ మించిన ఉదాత్త జీవన విధానమా? అనేది "అందరూ కలిసి మెలిసి ఉండే ఆలోచనగా" దళిత - దళితేతర మేధావులు చేయగలగాలి. అది భావ, భౌతిక వాదుల కలయికతో ఏర్పడేదై ఉండాలి. అస్పృశ్యత అనే భావన తొలగిపోయిన తర్వాత భావ భౌతిక వాదాల సంఘర్షణలో ఏదో ఒకటి లేదా ఒక కొత్త శక్తి పుట్టుకొచ్చి మానవులందరినీ కలిసి మెలిసేటట్లు చేయగలుగుతుంది.
1.6. ముగింపు :
"వెంటాడిన అవమానం" కథలో రచయిత కాసుల ప్రతాప రెడ్డి తరతరాలుగా ఉన్న అనేక రకాలైన అస్పృశ్యతలకు సంబంధించిన భౌతిక, మానసిక భావనలను స్పృశించారు. అలాంటి అస్పృశ్యత కొన్ని వందల సంవత్సరాలుగా కులంలో కలిసిపోయింది. అంబేడ్కర్ కూడా భౌతిక, భావవాదాల కలయికగా అస్పృశ్య భావనను చూడగలిగి, భౌతిక దృష్టి వైపు పయనించమనే ఆలోచనను అందించారు. భావవాదం, అదీ భారదేశంలో మతం, కర్మకాండలు, విశ్వాసాలతో ముడి పడి ఉండటం వల్ల ఆ వాదాన్ని నమ్మే, ఆచరించే, ప్రోత్సహించేవాళ్ళ సంఖ్య అధికంగానే ఉంటుంది. అందువల్లనే భావవాదం మాసిపోవడమో, నశించడమో, రూపుమాపటమో సులభమైన మార్గమైతే అంత దగ్గరలో లేదు. శాస్త్ర సాంకేతిక రంగాలు బాగా అభివృద్ధి చెందాలి. శాస్త్రీయ దృక్పథం అలవడాలి. సాంఘికీకరణ ప్రక్రియలు శాస్త్రీయ కోణంలో అమలు జరగాలి. అంతే కాదు, నేటికీ సమాజంలో శాస్త్రీయంగా ఋజువుకానివి ఎన్నో ఉన్నాయి. శాస్త్రానికి అందని వాటిని శాస్త్రీయంగా నిరూపించటానికి కేవలం ఇప్పుడున్న పరిశోధనల మీదనే ఆధారపడితే సరిపోదు. కానీ, శాస్త్రీయ దృక్పథం ఏర్పడాలని మాత్రం "వెంటాడిన అవమానం" కథ ప్రబోధిస్తుంది. దళిత వాస్తవిక జీవితాన్ని విశదీకరిస్తుంది.
1 కామెంట్:
మీ టపా చాలా బావుంది. ఇంత scientificగా రచయిత భావాలనూ, intentionsనీ విశ్లేషించారు. టపా informativeగా రాసారు.
కధ గురించి చదువుతుంటే ఇలాంటి సంఘర్షణలు చాలా సార్లు అనుభవించినట్లనిపించింది. అది కేవలం ఈ contextలోనే కాదు. నలుగురికీ ఆమోదయొగ్యమైనదానిని ఎప్పుడు ఎదిరించినా ఇలాంటి సంఘర్షణలు అనుభవిస్తారనుకుంటా.
m.Ganga Bhavani.
కామెంట్‌ను పోస్ట్ చేయండి