"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., Ph.D., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL 801 Research Methodology ఉదయం11.00 నుండి12.00 గంటల వరకు, TL-426: Indian Literature క్లాసులు మధ్యాహ్నం 2.00 గంటల నుండి 3.00 గంటల వరకు జరుగుతాయి.

దార్ల లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
దార్ల లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

22 సెప్టెంబర్, 2026

బరువెక్కిన కవిత!

 బరువెక్కిన కవిత!




కవిత రాయాలని

కలం పట్టుకున్నాను

కరెంటు పోయిన ఇంట్లో

టార్చిలైటు కోసం వెతుకుతున్న

మనిషిలా

భావం కోసం వెతుకుతున్నాను!


తెల్లకాగితం

ఎండిపోయిన చెరువులా

నా ముందుంది!


ఒక్క పదం కోసం

నిఘంటువును తెరిచాను

అది కూడా

నన్ను చూసి

మౌనవ్రతం పట్టిన మునిలా

నిశ్శబ్దంగా మారిపోయింది!


ఆలోచన

బస్సు కోసం ఎదురుచూస్తున్న

ప్రయాణికుడిలా

ఎప్పటికీ రాలేదు!


ఉపమానం కోసం

ఆకాశం వైపు చూశాను

ఆకాశం

నా వైపు చూసి

“నన్నెందుకు లాగుతున్నావ్?”

అన్నట్టు మబ్బు కమ్ముకుంది!


రూపకం కోసం

చంద్రుణ్ణి వెతికాను

అతను కూడా

ఇప్పటికే

ఎన్ని కవితల్లోనో

ఉద్యోగం చేశానంటూ అలసిపోయి

ముఖం దాచుకున్నాడు!


“నిశ్శబ్దం” రాయబోతే

నిశ్శబ్దమే

గొంతు చించుకుని

నా గదినిండా అరుస్తోంది!


“వేదన” రాయబోతే

పక్కింటి కుక్క

రెండుసార్లు మొరిగింది

అది కూడా

ఆ కవితకంటే

సహజంగా ఉంది!


కలం కదలడం లేదు

పాడైపోయిన ఎద్దుబండిలా

మొదటి పాదం దగ్గరే

చక్రం ఇరుక్కుపోయింది!


చివరికి

రెండు పాదాలు రాశాను

ఛందోబంధోబస్తులనూ

పాండిత్యపరిభాషనూ 

పరవశించి పరచగలిగాను


“రేయి బరువైంది,

నా గుండె భారమైంది!”


చదివి చూసాను

రేయికేం తెలియదు,

గుండెకేం తెలియదు,

బరువంతా

కవిత మీదే పడింది!


అయినా

ఓళశీర్షిక పెట్టేశాను


“అంతరాంతరాల అనంత అంధకారంలో

అస్తిత్వపు ఆత్మవేదన!”

చిన్నదా 

పెద్దదా కాదు

సమాసప్రయోగం

అర్థం కోసమే 

అర్రులు చాచేలా ఉండాలంతే!



కింద

నా పేరు పెట్టగానే

కవిత పూర్తయింది!


కవిత్వం పుట్టిందో

శీర్షికే కవిని పుట్టించిందో

నాకింకా అర్థం కాలేదు!

దార్ల వెంకటేశ్వరరావు 22.9.2026


20 సెప్టెంబర్, 2026

దార్ల మాట తేటగీతి శతకంపై దాసరి శ్రీనివాస్ వ్యాసం

 “సమకాలీన సామాజిక దార్శనికతకు గీటురాయిగా 

-‘దార్ల మాట’ తేటగీతి శతకం”


నినాదం దినపత్రిక సాహిత్య అనుబంధం 'సాహితీ లహరి' 20.9.2026 సౌజన్యంతో 

- శ్రీనివాస్ దాసరి

పరిశోధక విద్యార్థి, తెలుగు విభాగం

యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్

         ఫోన్ : 7702665815



శ్రీలనందింప నెప్పుడు చేర దీయు 

విఘ్న రాజును వేడుదు విశ్వసించి 

మంచి పద్యము లనిడుదు మనసు నిలిపి

దారి చూపించు నట్టిది దార్ల మాట!” ( పద్యం -1)

శతకం ప్రారంభ పద్యంలోనే కవి విఘ్నేశ్వరుడిని ప్రార్థిస్తూ తన రచనకు విఘ్నాలు తొలగించాలని కోరుతున్నాడు. మంచి పద్యం చదివినపుడు ఆనందంతో పాటు, అది మనిషి ఆలోచనకు దిశను చూపాలి, జీవితానికి వెలుగునివ్వాలి, సమాజాన్ని మంచివైపు నడిపించాలి. ఈ భావననే ‘దార్ల మాట’ తేటగీతి శతకానికి కవి ఆత్మగా నిలిపారు. “దారి చూపించు నట్టిది దార్ల మాట!” అనే మకుటం ద్వారా కవి తన పద్యాలను జీవన మార్గదర్శక సూత్రాలుగా మలిచారు. 

తెలుగు సాహిత్య ప్రక్రియల్లో శతకానికి విశిష్టమైన స్థానం ఉంది. సామాన్య పాఠకుడికి సైతం సులభంగా అర్థమయ్యే పద్యరూపంలో వ్యక్తి సంస్కారం నుంచి సామాజిక బాధ్యత వరకు, కుటుంబ విలువల నుంచి మానవీయత వరకు, విద్య నుంచి పర్యావరణ స్పృహ వరకు అనేక అంశాలను వ్యక్తీకరించే సామర్థ్యం శతక ప్రక్రియకు ఉంది.

వేమన, బద్దెన వంటి శతకకవులు తమ కాలంలోని సామాజిక జీవితాన్ని, మానవ ప్రవర్తనను, నైతిక విలువలను పద్యరూపంలో ప్రజలకు అందించారు. అదే సంప్రదాయాన్ని సమకాలీన జీవన సమస్యలతో అనుసంధానిస్తూ సరళమైన తేటగీతి పద్యాల్లో ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు రచించిన ‘దార్ల మాట’ తేటగీతి శతకం ఆధునిక తెలుగు శతక సాహిత్యంలో గమనించదగిన ఒక మంచి శతకంగా నిలుస్తుంది. 

ఈ శతకాన్ని గురించి డా. బండారు విజయ్ కుమార్ గారు తన ముందు మాటలో చేసిన వ్యాఖ్యలో “సాహిత్యం సమాజానికి దర్పణం అంటారు. కానీ, ఆ దర్పణంలో కనిపించే రుగ్మతలకు సరైన చికిత్సను అందించేది ‘శతక సాహిత్యం’” అనే వాక్యం ఈ శతకం స్వభావాన్ని స్పష్టంగా తెలియజేస్తుంది. కవి సమాజంలోని సమస్యలను వాటి విలువల ఆధారిత పరిష్కార మార్గాలను కూడా సూచించారు. అదే కారణంగా ‘దార్ల మాట’ను సమకాలీన సమాజాన్ని సంస్కరించాలనే తపనతో రూపొందిన శతకంగా చూడవచ్చు.

కవి స్వయంగా తన ప్రస్తావనలో ఈ పద్యాలకు మూలబిందువులుగా “నా జీవిత ప్రయాణంలో నేను చూసిన మనుషులు, నేను పొందిన వివిధ అనుభవాలు, నా అక్షరానికి ఊపిరి పోసిన నా తల్లిదండ్రులు శ్రీమతి పెదనాగమ్మ, శ్రీలంకయ్య గార్ల జ్ఞాపకాలు” ఉన్నాయని పేర్కొన్నారు. అందువల్ల ఈ శతకంలోని భావాలు కేవలం ఊహాజనితమైనవి కాకుండా కవి జీవితానుభవాలు, సామాజిక పరిశీలన, కుటుంబ విలువలు, సమకాలీన పరిణామాల నుంచి పుట్టినవిగా తెలుస్తాయి.

దార్ల మాట’ శతకం – ఆవిర్భావ నేపథ్యం

‘దార్ల మాట’ శతక రచనకు ఒక ప్రత్యేకమైన నేపథ్యం ఉంది. కవి ప్రస్తావనలో చెప్పినట్లు, 2021 జూన్‌లో ‘దారి పూల తోట దార్ల మాట’ పేరుతో ఆటవెలది ఛందస్సులో ఒక శతకాన్ని రచించారు.

‘కంది శంకరయ్య’ గారు పరిచయం చేసిన పద్యరచనా వాతావరణం ద్వారా పద్యరచనపై ఆసక్తి పెరిగి, అనేక పద్యాలను రచించే అలవాటు ఏర్పడింది. ఆ అనుభవం క్రమంగా విస్తరించి తేటగీతి ఛందస్సులో ‘దార్ల మాట’ శతక రూపాన్ని సంతరించుకుంది.

ఈ నేపథ్యంలో ఆచార్య ఎన్. ఈశ్వరరెడ్డి గారు తన ముందుమాటలో చేసిన వ్యాఖ్య విశేషమైనది. ఆయన “జీవన విలువలను, నైతిక సందేశాలను, సామాజిక బాధ్యతలను సరళమైన పద్యరూపంలో ప్రజల హృదయాల్లో నాటే శక్తి శతకాలకు ఉంది” అని పేర్కొంటూ, ‘దార్ల మాట’ను “తేటగీతి ఛందస్సులో ఆధునిక భావజాలాన్ని సమన్వయ పరుచుకున్న సార్థక కృతి” గా అభివర్ణించారు.  

ఈ శతకంలో సంప్రదాయ శతక లక్షణాలు ఉన్నప్పటికీ, దాని వస్తువు మాత్రం ఆధునిక సమాజం. కుటుంబ వ్యవస్థలో మార్పులు, మానవ సంబంధాల్లో తగ్గుతున్న ఆత్మీయత, పర్యావరణ సమస్యలు, సాంకేతికత దుష్ప్రభావాలు, మద్యపానం, రహదారి భద్రత, సమయపాలన, విద్య, మాతృభాష, కులమత భేదాలు, శాంతి, మానవత్వం వంటి అనేక అంశాలు ఇందులో చోటు చేసుకున్నాయి.

మకుటం – శతకానికి మార్గదర్శక తాత్వికత

శతకానికి మకుటం అత్యంత ప్రధానమైన అంశం. ‘దార్ల మాట’ శతకానికి “దారి చూపించు నట్టిది దార్ల మాట!” అనే మకుటాన్ని కవి ఎంచుకున్నారు. ఈ మకుటం ప్రతి పద్యంలోని భావాన్ని ఒక నిర్దిష్ట నైతిక దిశలోకి తీసుకువెళ్తుంది.

డా.బండారు విజయ్ కుమార్ గారు దీనిని విశ్లేషిస్తూ..“శతకానికి ప్రాణం ‘మకుటం’. పద్యం ఏ విషయాన్ని చెప్పినా, అంతిమంగా మకుటం ఆ పద్యం యొక్క తాత్వికతను నిర్దేశిస్తుంది.” అని పేర్కొన్నారు. అదే సందర్భంలో “గందరగోళంలో ఉన్న నేటి సమాజానికి ఒక ‘మార్గదర్శనం’ గా ‘దార్ల మాట’ మకుటాన్ని ఆయన అభివర్ణించిన విషయం వాస్తవం.ఈ మకుటం వల్ల ప్రతి పద్యం ఒక సూచనగా, ఒక హెచ్చరికగా, ఒక నైతిక సందేశంగా మారుతుంది. కుటుంబం గురించి చెప్పినా, పర్యావరణం గురించి చెప్పినా, విద్య గురించి చెప్పినా, మానవత్వం గురించి చెప్పినా చివరికి “దారి చూపించు నట్టిది దార్ల మాట!” అనే పునరుక్తి ఆ భావాన్ని పాఠకుడి మనసులో బలంగా నిలుపుతుంది.

తేటగీతి ఛందస్సు – భావప్రకటనకు అనుకూలమైన రూపం

‘దార్ల మాట’ శతకానికి కవి తేటగీతి ఛందస్సును ఎంచుకున్నారు. దీనికి సామాజిక ప్రయోజనం కూడా ఉందని డా. బండారు విజయ్ కుమార్ అభిప్రాయపడ్డారు. ఆయన మాటల్లో...‘తేట’ అంటే స్వచ్ఛమైనది, స్పష్టమైనది అని అర్థం. ‘గీతి’ అంటే గానం చేయదగినది.” అలాగే, “సంక్లిష్టమైన సమాసాలు లేకుండా, పండితులకే కాకుండా పామరులకు, విద్యార్థులకు కూడా సూటిగా అర్థమయ్యే రీతిలో, ఒక పారుతున్న ఏరులాగా భావం సాగిపోవడానికి తేటగీతి అత్యంత అనుకూలమైన ఛందస్సు.” అని వివరించారు.ఈ లక్షణం ‘దార్ల మాట’ పద్యాల్లో స్పష్టంగా కనిపిస్తుంది. కవి సంక్లిష్టమైన తాత్విక భావాలను కూడా సూటిగా, సామాన్యుడికి అర్థమయ్యే భాషలో వ్యక్తీకరిస్తారు. అందువల్ల ఛందస్సు కేవలం పద్య నిర్మాణానికి సంబంధించిన అంశంగా కాకుండా, కవి సామాజిక ప్రయోజన దృష్టిలో భాగంగా మారింది.

‘దార్ల మాట’ శతకంలోని మరొక ముఖ్య లక్షణం భాష. పాండిత్య ప్రదర్శన కంటే భావవ్యక్తీకరణకు కవి ప్రాధాన్యం ఇచ్చారు. సామాన్య పాఠకుడికి అర్థమయ్యే పదజాలంతో నీతి, ధర్మం, సామాజిక సమస్యలను వ్యక్తీకరించారు.“క్లిష్టమైన వృత్త పద్యాల జోలికి వెళ్లకుండా, సామాన్యుడి గుండెకు హత్తుకునేలా చెప్పడానికి ఈ తేటగీతిని ఎంచుకోవడం ఆయనలోని సామాజిక స్పృహకు నిదర్శనం.” ఈ సరళత వల్ల శతకంలోని సందేశం పాఠకుడికి నేరుగా చేరుతుంది. ముఖ్యంగా విద్యార్థులు, సామాన్య పాఠకులు, సామాజిక విలువలపై ఆలోచించేవారికి ఈ పద్యాలు సులభంగా చేరువయ్యే అవకాశం ఉంది.

కన్న తల్లిని తండ్రిని గౌర వించి

భక్తి తోడను సేవలు సలుపు వాడు

ముక్తి మార్గము నందున మునిగి యుండు

దారి చూపించు నట్టిది దార్ల మాట!” (దార్లమాట శతకం. పద్యం - 3 )

ఈ పద్యంలో తల్లిదండ్రులను గౌరవించి, భక్తితో సేవ చేయడం మనిషి జీవితంలో అత్యంత ముఖ్యమైన ధర్మమని కవి చెబుతున్నాడు. తల్లిదండ్రుల సేవను “ముక్తి మార్గం”తో సమానంగా చూపడం ద్వారా వారి పట్ల ఉండాల్సిన కృతజ్ఞతను బలంగా వ్యక్తీకరించాడు. కుటుంబ విలువలను కాపాడుకోవడం, తల్లిదండ్రుల పట్ల బాధ్యతగా ఉండడం అనే సందేశం ఇందులో ప్రధానంగా కనిపిస్తుంది. వ్యక్తి నైతిక జీవితానికి కుటుంబం మొదటి పాఠశాల అనే భావన ఈ పద్యంలో అంతర్లీనంగా ఉంది.

పెద్ద నాగమ్మ మాతృత్వ ప్రేమ పంచి

ఆదరమ్మను దీవెన లందజేసి

నమ్మకమ్మను నీడలో నడుపు చుండు

దారి చూపించు నట్టిది దార్ల మాట!” (పద్యం: 4)

ఇక్కడ కవి “పెద్ద నాగమ్మ” ద్వారా మాతృత్వంలోని ప్రేమ, ఆదరణ, దీవెన, నమ్మకం వంటి లక్షణాలను ప్రతిబింబించాడు. తల్లి పిల్లలకు కేవలం ప్రేమనే కాకుండా భద్రత, ధైర్యం, నమ్మకం కూడా అందిస్తుందని చెబుతున్నాడు. “నీడలో నడుపు” అనే భావన తల్లి ఇచ్చే రక్షణకు ప్రతీకగా నిలుస్తుంది. మాతృత్వాన్ని జీవితానికి దారి చూపించే శక్తిగా కవి అభివర్ణించడం ఈ పద్యంలోని ప్రధాన విశేషం.

శంకరయ్యను సద్భక్తి స్మరణ జేతు

ఛంద మర్మము లెరిగించి చక్కదిద్ది

పద్య విద్యను నేర్పించె పట్టు బట్టి

దారి చూపించు నట్టిది దార్ల మాట!” (పద్యం: 6)

ఈ పద్యంలో కవి తనకు పద్య రచన, ఛందస్సు నేర్పిన శంకరయ్య గురువును స్మరిస్తున్నాడు. “ఛంద మర్మము లెరిగించి” అనే మాట ద్వారా కవిత్వంలోని సాంకేతికతను గురువు నేర్పిన విషయాన్ని తెలియజేస్తున్నాడు. గురువు శిష్యునిలోని ప్రతిభను గుర్తించి, దానిని మెరుగుపరచి సరైన దిశలో నడిపిస్తాడనే భావన కనిపిస్తుంది. కవి తన సాహిత్య వ్యక్తిత్వ నిర్మాణంలో గురువు పాత్రను కృతజ్ఞతతో గుర్తుచేసిన పద్యంగా దీన్ని చూడవచ్చు.

జ్ఞాన దీపము వెలిగించి మాన సమున

అజ్ఞ మనుజుని విజ్ఞుగా నవని జేయు

గురుని కన్నను దైవము వేరె లేదు

దారి చూపించు నట్టిది దార్ల మాట!” (పద్యం: 7 )

“జ్ఞాన దీపము” అనే రూపకం ద్వారా గురువు అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించే వ్యక్తిగా కవి చిత్రించాడు. అజ్ఞానిగా ఉన్న మనిషిని విజ్ఞానవంతునిగా తీర్చిదిద్దే శక్తి గురువుకు ఉందని చెబుతున్నాడు. అందుకే “గురుని కన్నను దైవము వేరె లేదు” అని గురువును అత్యున్నత స్థానంలో నిలిపాడు. ఈ పద్యం విద్య, జ్ఞానం, గురుభక్తి అనే మూడు విలువలను సమన్వయపరుస్తుంది.

పాత పద్యాలు చదువగా పరవశమున

అనుభవజ్ఞుల సూచన లందు కొనిన

ధర్మ మార్గాన జీవికల్ ధన్య మగును

దారి చూపించు నట్టిది దార్ల మాట!” పద్యం:117

పూర్వకాల పద్యాలను చదవడం ద్వారా అనుభవజ్ఞుల ఆలోచనలు, జీవన సూత్రాలు తెలుసుకోవచ్చని కవి చెబుతున్నాడు. పాత సాహిత్యాన్ని కేవలం గతానికి సంబంధించినదిగా కాకుండా ప్రస్తుత జీవితానికి మార్గదర్శకంగా చూడటం ఈ పద్యంలో కనిపిస్తుంది. ధర్మమార్గంలో జీవించినప్పుడే జీవితం సార్థకమవుతుందని కవి భావిస్తున్నాడు. సంప్రదాయ సాహిత్యంలోని మంచిని స్వీకరించి, ఆధునిక జీవితంలో ఆచరించాలనే సందేశం ఇందులో ఉంది.

కత్తి పట్టక శాంతికై కలయ జూచి

మౌన వ్రతమున సాధించి మాన వాళి

కంద జేసెను బుద్ధుడు నంద ముగను

దారి చూపించు నట్టిది దార్ల మాట!” (పద్యం 122)

బుద్ధుని శాంతి మార్గాన్ని కవి ఆధునిక ప్రపంచానికి సూచిస్తున్నారు. హింసకు బదులుగా శాంతి, ఆత్మనిగ్రహం, మానవత్వం అవసరమని భావిస్తున్నారు.

ఈ అంశాన్ని ప్రముఖ పద్యకవి, తెలుగు అధ్యాపకులు గోవిందు. గోవర్ధన్ గారు తన సహృదయ స్పందనలో పేర్కొన్న “సామ్రాజ్య విస్తరణ పేరుతో యుద్ధాలు చేయడం దుర్మార్గం”, “ప్రజలంతా శాంతి సౌభాగ్యాలతో విలసిల్లడానికి పరిపాలకులు తగిన చర్యలు, ప్రణాళికలు ఏర్పరచుకుని ముందుకు సాగాలి” అనే వ్యాఖ్యలతో అనుసంధానించవచ్చు.

శీల మున్నట్టి కవికృతుల్ చిత్త మందు

నిలిపి పఠియించి విలువలన్ నేర్చు కొనుచు

వ్యాప్తి చేయాలి భువిపై వంద నముగ

దారి చూపించు నట్టిది దార్ల మాట!” (118)

శీలవంతులైన కవులు రచించిన మంచి కవితలను చదివి, అందులోని విలువలను నేర్చుకోవాలని కవి సూచిస్తున్నాడు. సాహిత్య పఠనం వ్యక్తి ఆలోచనలను, ప్రవర్తనను ప్రభావితం చేయగలదనే విశ్వాసం ఇందులో కనిపిస్తుంది. నేర్చుకున్న మంచి విలువలను తనకే పరిమితం చేయకుండా సమాజంలోకి వ్యాప్తి చేయాలని చెప్పడం ద్వారా సాహిత్యానికి సామాజిక బాధ్యత ఉందని కవి సూచిస్తున్నాడు. 

వంశ గౌరవ మన్నది వాక్కు తోడ

సత్య మెప్పుడు వీడక సాగ వలెను

మాట తప్పని వానికి మన్ననబ్బు

దారి చూపించు నట్టిది దార్ల మాట!” (పద్యం 11)

మాట నిలబెట్టుకోవడం ద్వారా వ్యక్తిగత గౌరవమే కాకుండా కుటుంబ గౌరవం కూడా నిలుస్తుందని కవి చెబుతున్నారు. ఈ పద్యాన్ని ‘డి. సాయినాథ్ రెడ్డి’ గారు రామాయణంలోని శ్రీరాముని ఏకవాక్యతతో అనుసంధానించారు. ఆయన వ్యాఖ్యలో...''ఇది రామాయణంలోని శ్రీరాముని ‘ఏక వాక్య’ పరిపాలనకు నిదర్శనం.” అని పేర్కొన్నారు. అంటే పౌరాణిక విలువను ఆధునిక జీవన నైతికతకు అనుసంధానించడం ఈ శతకంలోని ఒక ముఖ్యమైన పద్ధతి.

భరత భూమిని నమ్ముచు భావ మెంచి

కలిసి మెలిసియు నుండుట ఘనత నిచ్చు

జాతి గౌరవ మెప్పుడు చాట వలెను

దారి చూపించు నట్టిది దార్ల మాట!” (216)

ఇది శతకానికి అంకిత పద్యంగా ఇచ్చిన ముగింపు భావన. భారతదేశంపై విశ్వాసం, ప్రజల మధ్య ఐక్యత, జాతి గౌరవం అనే అంశాలను కవి ప్రతిపాదించాడు. “కలిసి మెలిసియు నుండుట” అనే భావం మొత్తం శతకంలో కనిపించే మానవతా, సామాజిక ఐక్యతా దృక్పథానికి ముగింపుగా నిలుస్తుంది.

‘దార్ల మాట’ శతకంలోని ముఖ్యమైన ప్రత్యేకత సంప్రదాయ విలువలను ఆధునిక సమస్యలతో కలపడం. ఒకవైపు తల్లిదండ్రుల సేవ, గురుభక్తి, దైవభక్తి, కుటుంబ బంధాలు, సత్యం, ధర్మం వంటి సంప్రదాయ విలువలను కవి సమర్థిస్తారు. మరోవైపు కులమత భేదాల నిర్మూలన, పర్యావరణ పరిరక్షణ, మద్యపాన వ్యతిరేకత, హెల్మెట్ వినియోగం, ఫోన్ దుష్ప్రభావం, సమయపాలన వంటి ఆధునిక సమస్యలను ప్రస్తావిస్తారు.

ఈ వైవిధ్యాన్ని ఒక ముందుమాటలో “ఒకవైపు అస్తిత్వ ఉద్యమానికి చేయూతనిస్తూ దళిత కవిత్వం రాస్తున్న ఈయన మరోవైపు సంప్రదాయ విలువలని కాపాడుకొంటూ రావడం అనేది ఈయనలో ఉన్న వైవిధ్యం” అని విశ్లేషించారు.అందువల్ల దార్ల మాటలో సంప్రదాయం అనేది మూఢానుసరణగా కాకుండా, సమాజానికి ఉపయోగపడే విలువలను స్వీకరించడంగా కనిపిస్తుంది. ఆధునికత కూడా పాతదాన్ని పూర్తిగా తిరస్కరించడం కాకుండా, మానవీయ విలువలను సమకాలీన అవసరాలకు అన్వయించుకోవడంగా వ్యక్తమవుతుంది.గోవిందు గోవర్ధన్ గారు తన సహృదయ స్పందనలో ఈ శతకంలోని సామాజిక ప్రయోజనాన్ని కూడా స్పష్టంగా వివరించారు. ఆయన ప్రకారం, ఇందులో “ఆధునిక సమాజంలో కొనసాగుతున్న కొంతమంది జీవన విధానంలో ఉన్న లోటుపాట్లను ఎత్తిచూపారు”. యువత ప్రవర్తన, సోమరితనం, క్రమశిక్షణారాహిత్యం, తల్లిదండ్రులు–గురువు–దైవం పట్ల నిర్లక్ష్యం, ధనార్జనలో నీతి నియమాలను విస్మరించడం వంటి అనేక సమస్యలను కవి పద్యాల్లో పొందుపరిచారు.

అంతేకాకుండా ఆయన “ఈ శతకాన్ని సాహితీప్రియులు చదివి తప్పకుండా తమలో ఉన్న మంచిచెడులు బేరీజు వేసుకుని తప్పకుండా మార్పు కోరుకుంటారని ఆశిస్తున్నాను” అని పేర్కొన్నారు.

ఇది ‘దార్ల మాట’ యొక్క అసలు లక్ష్యాన్ని సూచించే ముఖ్యమైన వ్యాఖ్య. కవి పాఠకుడికి బోధించడమే లక్ష్యంగా పెట్టుకోలేదు; తనలోని మంచిచెడులను పాఠకుడు తానే పరిశీలించుకోవాలని కోరుకున్నారు.

ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు గారి ‘దార్ల మాట’ తేటగీతి శతకంను సమగ్రంగా పరిశీలించినప్పుడు ఇది కేవలం శతక ప్రక్రియలో మరో కృతి మాత్రమే కాదని స్పష్టమవుతుంది. ఇది సంప్రదాయ నైతిక విలువలను సమకాలీన సామాజిక సమస్యలతో అనుసంధానించిన ఆధునిక నీతి శతకంగా రూపుదిద్దుకుంది.

తల్లిదండ్రుల సేవ నుంచి కులమత భేదాల నిర్మూలన వరకు, గురువు–విద్య నుంచి మాతృభాష వరకు, కుటుంబ అనుబంధాల నుంచి మానవత్వం వరకు, చెట్ల సంరక్షణ నుంచి జీవవైవిధ్యం వరకు, అత్యాశ నిరాకరణ నుంచి కష్టపడి పనిచేయడం వరకు, సమయపాలన నుంచి రహదారి భద్రత వరకు, సెల్‌ఫోన్ దుష్ప్రభావం నుంచి పొరుగు సంబంధాల వరకు విస్తరించిన జీవన అంశాలను కవి పద్యాల్లో ప్రతిబింబించారు.

ఈ శతకానికి సంబంధించిన ఒక ముందుమాటలో చెప్పినట్లుగా “జీవన విలువలను, నైతిక సందేశాలను, సామాజిక బాధ్యతలను సరళమైన పద్యరూపంలో ప్రజల హృదయాల్లో నాటే శక్తి శతకాలకు ఉంది.” ‘దార్ల మాట’ ఈ లక్షణాన్ని సమకాలీన సందర్భంలో సార్థకం చేస్తుంది. అదేవిధంగా సాహిత్య విమర్శకులు డా. బండారు విజయ్ కుమార్ గారు చేసిన “మానవత్వ పరిమళాలను వెదజల్లుతున్న అక్షర కుసుమమే ఈ ‘దార్ల మాట’” అనే వ్యాఖ్య ఈ శతక స్వభావాన్ని సంక్షిప్తంగా ప్రతిబింబిస్తుంది.

‘ దార్ల మాట’లోని “దారి చూపించు నట్టిది దార్ల మాట!” అనే మకుటం ప్రతి పద్యానికీ ముగింపు మాత్రమే కాదు; మొత్తం శతకానికి ఒక నైతిక దిక్సూచి. కులం, మతం, స్వార్థం, అత్యాశ, అజ్ఞానం, సోమరితనం, పర్యావరణ నిర్లక్ష్యం, సాంకేతికత దుర్వినియోగం వంటి సమకాలీన సమస్యల మధ్య మనిషి ఏ విలువలతో జీవించాలో ఈ మకుటం నిరంతరం గుర్తుచేస్తుంది. అందువల్ల ‘దార్ల మాట’ను డి సాయినాథ్ రెడ్డి గారు “ఆధునిక మానవుడిని సంస్కరించే ఒక మానవీయ మ్యానిఫెస్టో” గా పేర్కొన్న ముందుమాటలోని వ్యాఖ్య ఎంతో ఔచిత్యవంతమైనది. కుటుంబం నుంచి సమాజం వరకు, వ్యక్తి నుంచి మానవాళి వరకు, సంప్రదాయం నుంచి ఆధునికత వరకు విస్తరించిన విలువల సమన్వయం ఈ శతకానికి ప్రత్యేకతను కల్పించింది.

ముఖ్యంగా “కులము మతభేద ములనెల్ల కూల్చివేసి / మనిషి మనిషిగా బ్రతికిన మనుగడౌను / సమత మమతలు పంచెడి సత్యమిదియె” అనే 123వ పద్యం నుంచి “వింట విడిచిన బాణము వెడలు నట్లు / నోట వచ్చిన మాటయు నొచ్చు” అనే 209వ పద్యం వరకు విస్తరించే విలువల దృక్పథం, వ్యక్తిగత సంస్కారం నుంచి సామాజిక సంస్కరణ వరకు కవి ఆలోచనను తీసుకెళ్తుంది.కాబట్టి తెలుగు శతక సాహిత్య పరిణామంలో ‘దార్ల మాట’ తేటగీతి శతకం సమకాలీన జీవన సమస్యలను నీతి, మానవత్వం, సామాజిక బాధ్యత, పర్యావరణ స్పృహ, కుటుంబ విలువలు, విద్య, సమానత్వం వంటి అంశాలతో అనుసంధానించిన ఆధునిక శతకంగా గుర్తించదగినది. దాని ప్రతి పద్యం ఒక చిన్న జీవనసూత్రంగా, ప్రతి మకుటం ఒక నైతిక సూచనగా, మొత్తం శతకం ఒక సమగ్ర మానవీయ జీవన దృక్పథంగా పాఠకుడి ముందుకు వస్తుంది.ధర్మం వైపు నడిచే ప్రతి అడుగుకూ, మానవత్వాన్ని నిలబెట్టే ప్రతి ఆలోచనకూ, సమాజాన్ని మంచివైపు నడిపించే ప్రతి ప్రయత్నానికీ... “దారి చూపించు నట్టిది దార్ల మాట!”

ఈ శతకాన్ని చదువుతున్నప్పుడు ఒక పరిశోధక విద్యార్థిగా, యువకుడిగా నాలాంటి విద్యార్థులు నేర్చుకోవలసిన అనేక విద్యాబోధనలు, సమాజం పట్ల నైతిక విలువలు, జీవితం పట్ల బాధ్యతలు పద్యరూపంలో కనిపిస్తాయి. పూర్వకాలపు శతక సాహిత్య కవులైన ఏనుగు లక్ష్మణకవి, ప్రజాకవి వేమన వంటి కవుల నీతి శతకాలలో కనిపించే జీవనబోధ, సామాజిక చైతన్యం ఈ శతకంలోనూ ఆధునిక కాలానుగుణంగా దర్శనమిస్తుంది. ఈ అత్యాధునిక కాలానికి ఆచార్య దార్ల వేంకటేశ్వరరావు గారిని ఒక ‘సుభాషిత కవి’గా చెప్పాలి. ఎందుకంటే తెలుగు ఛందస్సును ఈ కాలపు సామాన్య పాఠకులకు అందించి, నాలాంటి విద్యార్థులకు కూడా పద్యవిద్యను అలవాటు చేస్తున్న ఆచార్య దార్ల వారి సాహిత్యాన్ని తెలుగు సాహిత్య విద్యార్థులు, పాఠకులు ఆదర్శప్రాయంగా తీసుకొని, అందులోని విలువలను నిత్యజీవితంలో అలవరచుకోవాలి.

పండితుల పద్యసాహిత్యం సాధారణ ప్రజల జీవనానుభవాలకు దూరంగా ఉంటుందనే అభిప్రాయానికి భిన్నంగా, ఆచార్య దార్ల వేంకటేశ్వరరావు గారి శతకాల్లో ప్రజల భాష, పేద సామాన్య ప్రజల జీవితం, వారి అనుభవాలు ప్రతిఫలిస్తాయి. ప్రాచీన, ఆధునిక పద్య సాహిత్యాల మధ్య వారధిగా నిలుస్తూ, ఛందస్సును సామాన్య పాఠకులకు చేరువ చేస్తున్న వారి కృషి అభినందనీయం. తెలుగు సాహిత్య విద్యార్థులు, పాఠకులు వారి సాహిత్యాన్ని చదివి, అందులోని జీవన విలువలను అవగాహన చేసుకొని నిత్యజీవితంలో ఆచరించాలి. అప్పుడే ప్రాచీన పద్య సంప్రదాయానికి, ఆధునిక పద్య సాహిత్యానికి సరైన స్థానం దక్కుతుంది. ఈ భావానికి నా గురుభావాన్ని జోడిస్తూ నేను రాసిన కంద పద్యం.

కం . గురువై కల్పక తరువై

ధరువై వరమై నగమయి దార్లా నెరవై!

సిరులై సద్గుణ నిధివై

నరుడై వచ్చిన హరివయి నాకై గురువా!

ఆచార్య దార్ల వేంకటేశ్వరరావు గారి సాహిత్య కృషి

కి శుభాభివందనాలు.

దాసరి శ్రీనివాస్, నినాదం దినపత్రిక, సాహిత్య అనుబంధం 20.9.2026 సౌజన్యంతో 

ఆరుద్ర సాహిత్యం పై ఆచార్య దార్లతో ఇంటర్వ్యూ

 

నినాదం దినపత్రిక సాహిత్య అనుబంధం 'సాహితీ లహరి'20.9.2026 సౌజన్యంతో ... 

సాహితీ లోకానికి చిరస్మరణీయమైన అంజలి — 'నూరు శరత్తులు' (ఆరుద్ర శత జయంతి సంచిక)

మహాకవి, బహుముఖ ప్రజ్ఞాశాలి ఆరుద్ర శత జయంతి ఉత్సవాల సందర్భాన్ని పురస్కరించుకుని, ప్రముఖ రచయిత డా. హెచ్.ఎస్.వి.కె. రంగారావు గారు ('లహరి') అత్యంత ప్రతిష్టాత్మకంగా తన సంపాదకత్వం, సంకలనంలో  'నూరు శరత్తులు' (ఆరుద్ర శత జయంతి జ్ఞాపక) పేరుతో ఒక విశిష్ట ప్రత్యేక సంచికను వెలువరించారు. దీనికి సహాయ సంపాదకులుగా సి.ఎం.వి.చంద్రకుమార్ వ్యవహరించారు. ఆరుద్ర అరుదైన లేఖలు, ఆయన సాహిత్యంపై వచ్చిన విమర్శనాత్మక దృక్పథాలు, లోతైన పరిశోధనా పత్రాలు, అంతఃరంగిక ఇంటర్వ్యూలు, విశ్లేషణాత్మక వ్యాసాల సమాహారంగా రూపుదిద్దుకున్న ఈ సంచిక అక్షర లోకానికి ఒక అపురూప నిధిగా నిలుస్తుంది.

ఈ ప్రత్యేక సంచికలో  హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ తెలుగు శాఖలో 'పరిశోధకుడుగా ఆరుద్ర' అనే అంశంపై 2003లో పీహెచ్.డీ. చేసి డాక్టరేట్ పట్టా అందుకున్న ఆచార్య డాక్టర్ దార్ల వెంకటేశ్వరరావు గారిని, ఆ ప్రత్యేక సంచిక సంపాదకులు హెచ్.ఎస్.వి.కె. రంగారావు గారు  ఇంటర్వ్యూ చేశారు. ఆరుద్ర గారి సాహిత్య దృక్పథం, ఆయన పరిశోధనా విశేషాలు, ఆయన అవలంబించిన పరిశోధనా పద్ధతులు,  సాహిత్య విమర్శలో ఆయన చేసిన అసాధారణ కృషితో పాటు అనేక అంశాలను డాక్టర్ దార్ల ఈ ఇంటర్వ్యూలో ఎంతో లోతుగా, విశ్లేషణాత్మకంగా ప్రస్తావించారు. 

ఆరుద్ర శతజయంతి ఉత్సవాల సందర్భంగా సాహిత్య ప్రియుల కోసం ఈ విశేష ఇంటర్వ్యూను 'నినాదం' సాహిత్య అనుబంధం ప్రత్యేకంగా పాఠకులకు అందిస్తోంది.

— సంపాదకులు, నినాదం


పరిశోధకుడుగా ఆరుద్ర

(ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు గారితో 'లహరి' ఇంటర్వ్యూ)

లహరి: నమస్తే సార్.

డా. దార్ల వెంకటేశ్వరరావు: నమస్తే.

లహరి: పరిశోధకుడుగా ఆరుద్రపై మీ పరిశోధనకు అభినందనలు. ఎంతో విలువైన సిద్ధాంత వ్యాస రచన అది.

డా. దార్ల: ఓహ్! ధన్యవాదాలండీ.

లహరి: ఆరుద్రది చాలా విస్తృతమైన కృషి, వైపుల్యమూ, వైవిధ్యమూ కూడా ఎక్కువే. తనది అభ్యుదయ దృక్పథమనీ, తాను ప్రధానంగా మార్క్సిస్టునని ఆరుద్ర ప్రకటించుకున్నారు. కవిగా సరే, ఈ దృక్పథం ఆయన పరిశోధనా రంగంలోనూ కనిపిస్తుందంటారా?

డా. దార్ల: చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సందేహాలు అవసరం లేదు. అయితే అనేక ఆధునిక శాస్త్రాలతో, కళా ప్రక్రియలతో, తత్త్వచింతనలతో ఆ దృక్పథాన్ని విశాలం చేసుకున్నారు. ఆయనది ప్రజా దృక్పథం. పరిశీలనలు, పరిశోధనలు, విమర్శలూ, ఆలోచనలూ సామాన్య మానవుడికి అందుబాటులో ఉండాలనే తత్త్వం ఆయనది. అందుకనే ఎంత క్లిష్టమైన విషయాన్నయినా ఆరుద్ర చాలా తేలిక ధోరణిలో, అత్యంత సరళంగా ప్రకటిస్తారు. ఆయనది మార్క్సిస్టు దృక్పథమే! సరళత్వం ఆరుద్ర సృజనాత్మకతకు, పరిశోధనను జనరంజకంగా తీర్చిదిద్దాలనే ఆయన దృక్పథానికీ నిదర్శనాలు. ఈ దృక్పథం ప్రధానంగా ఆయన 'గురజాడ గురుపీఠం', 'వేమన', 'రాముడికి సీత ఏమవుతుంది?', 'ప్రజాకళలు ప్రగతివాదులు', 'వ్యాసపీఠం', 'గుడిలో సెక్స్' రచనలలో స్పష్టంగా కనిపిస్తుంది. ఇతర రచనలూ ఉన్నాయి.


లహరి: వేమన మీద ఆరుద్ర పరిశీలన ఏమిటి?

డా. దార్ల: వేమన తాను అభ్యుదయ ప్రవక్తగా మారి సమాజాన్ని మార్చడానికి ప్రయత్నించారు. వేమన జన్మతః శైవుడైనా శైవమతంలో కన్పించే దురాచారాల్ని ఖండిస్తూ ఆటవెలది పద్యాలు చెప్పాడని ఆరుద్ర నిరూపించారు. వీటిలో కొన్ని భావాలు బాల్యం నుంచే వేమన మీద తీవ్ర ప్రభావం చూపించి ఉంటాయనీ, ఆస్తికుల తత్త్వాల కన్నా నాస్తికుల దర్శనాలే ఆదర్శవంతంగా ఉన్నట్లు వేమనకు అనిపించిందన్నది ఆరుద్ర భావన. చార్వాకులతోటి, లోకాయతశాస్త్రంతోటీ ప్రగాఢ పరిచయం ఏర్పరచుకోవడం వల్ల వేమనలో భౌతికదృష్టి ఏర్పడిందంటారు ఆరుద్ర. ఈ దృష్టి కలగడం వల్లనే వేమన పరలోకాన్ని ఖండించాడనీ, ధనం మనిషి జీవన స్థితిగతులకు మూలమవుతుందని వేమన గ్రహించాడంటారు. ఈ దృక్పథం వల్లనే ధనిక, పేదల మధ్య వ్యత్యాసాల్ని గుర్తించడమే కాకుండా పేదవాడికి ధనాన్ని పంచి పెట్టడానికి కీడుతలపెట్టయినా, ముచ్చటించైనా, కపటం చేతనైనా, తెగింపు చేతనైనా ధనవంతుడి సిరిని చేజిక్కించుకుని నిరుపేదకు పంచి పెట్టడం మంచిదనే విప్లవ ధోరణి వరకూ వేమన తత్త్వ చింతన వెళ్ళిందని ఆరుద్ర భావన.

లహరి: అయితే వేమనవి వేల కొద్దీ పద్యాలు చెలామణిలో ఉన్నాయి. ఆయన ప్రస్తావించని విషయం లేదు. తను చెప్పడానికి అనువైన పద్యాలనే ఆరుద్ర వ్యాఖ్యానానికి ఎంచుకున్నారని స్పష్టం. అది కూడా ఆరుద్ర దృక్పథాన్ని తెలుపుతుంది కదా!

డా. దార్ల: వేమన ఒక పద్యానికి ఆరుద్ర వ్యాఖ్యానం ఇది- 

"బాపడనగనేమి? భక్తుడనగనేమి? 

భోగియనగనేమి సొంపులేక 

 ఎన్నిపేరులైన ఇనజుడు పనితీర్చు 

విశ్వదాభిరామ వినురవేమ". తమ కులాలకు ఎన్ని పేర్లు పెట్టుకున్నా అందరి పనీ యముడు పడతాడు. లోకమంతా ఒకే కుటుంబం, లోకులంతా ఒకే కుటుంబంలోని వ్యక్తులు. ఎవరూ పంక్తి బాహ్యులు కారు. అందరూ ఒక్క కంచాన తింటే అన్ని బాధలకూ హేతువైన కులభేదం రూపుమాసిపోతుంది. సఖ్యత ఉంటుంది. ఈ సత్యాన్ని లోకులు విశ్వసించేటట్టు తలమీద చేయివేసి ప్రమాణపూర్వకంగా చెప్పరా? అని ఆదేశం. (ఇటీవల కాలంలో సామ్యవాద సాధకులైన వామపక్షాలవారు కూడా తమ పార్టీ సభ్యులు ఒకే కమ్యూన్లో ఆరగించాలని నియమం పెట్టుకున్నారు) అని బ్రాకెట్టుల్లో కూడా తన వైయుక్తిక అభిప్రాయాన్ని వ్యాఖ్యానంలో చెప్పటం ఆరుద్ర విమర్శలో మార్క్సిస్టు దృక్పథం కన్పించడం సందేహాలకు చోటు లేకుండా చేస్తోంది.

'సమగ్ర ఆంధ్ర సాహిత్య చరిత్ర'లో కూడా వేమనను చారిత్రక, సామాజిక దృక్పథాల నుండి పరిశీలించినా, తులనాత్మక పరిశీలన కన్పిస్తున్నా అవన్నీ మార్క్సిస్టు విమర్శనా దృక్పథానికి అంతర్భాగంగానే కొనసాగాయి. 

'వ్యాసపీఠం'లో ఆరుద్ర భగవద్గీత మీద చేసిన వ్యాఖ్యానాలూ ఆయన మార్క్సిస్టు దృక్పథాన్ని స్పష్టం చేస్తాయి.

'భగవద్గీత' వర్ణ వ్యవస్థను సంరక్షించే గ్రంథమని, దీనివల్ల సమసమాజ నిర్మాణం సాధ్యం కాదనీ వ్యాఖ్యానించారు. ఇప్పుడు ప్రచారంలో ఉన్న భగవద్గీతను ముగ్గురు వ్యక్తులు వేర్వేరు కాలాలలో రచించారని ఆరుద్ర అభిప్రాయం. ఆ ముగ్గురు ఎవరో పేర్లు ప్రకటించలేదు. ప్రథమాచార్యుడు, ద్వితీయాచార్యుడు, తృతీయాచార్యుడు అనే అన్నారు. కొన్ని చారిత్రక కారణాల వల్ల ప్రథమాచార్యుడు ఉన్నత వర్గాల ప్రయోజనం కోసం 'గీత' రచన చేస్తే, రెండవ ఆచార్యుడు తాత్త్వికుల కోసం, మూడవ ఆచార్యుడు ఆర్తులకోసం, జిజ్ఞాసువుల కోసం ఈ గీత రచన చేసి అన్యదేవతా భక్తులను తన దైవానికి భక్తులను చేయదలిచాడని ఆరుద్ర వివరణ.

ప్రథమాచార్యుడు క్రీ.పూ. 600 కు పూర్వుడనీ, ద్వితీయాచార్యుడు క్రీ.పూ. 600-500 మధ్యకాలాలకు చెందినట్లు పేర్కొన్నారు. వర్గ, వర్ణరహిత సమాజం తృతీయాచార్యుడు క్రీ.పూ. 300-200 మధ్యకాలాలకు రావాలనే దృక్పథమే ఈ వ్యాసంలో ప్రధాన ప్రతిపాదన.

లహరి: గురజాడ మీద ఆరుద్ర దృక్పథంలోని ప్రత్యేకత ఏమిటి?

డా. దార్ల: జీవితం పట్ల, సాహిత్యం పట్ల గురజాడకున్న గంభీరమైన దృష్టి, సాహిత్య శిల్పకళా దృక్పథం, ఆయన సువిశాల మానవీయత ఎందరో ప్రతిభావంతులను ఆకర్షించింది. శెట్టి ఈశ్వరరావు, శ్రీశ్రీ, డాక్టర్ సి. నారాయణరెడ్డి - నవ్యాంధ్ర సాహిత్యానికి ఇద్దరు యుగకర్తలుగా గురజాడతో బాటు రాయప్రోలునూ భావించినా - కె.వి.ఆర్., గురజాడ మీద ఎంతో విలువైన ఆలోచనలు అందించారు. అగ్రశ్రేణి పరిశోధనలు విమర్శనాత్మకంగా, పరిశోధనగా కొనసాగించారు. గురజాడ జీవితాన్ని, రచనలనూ ఆరుద్ర చారిత్రక, తులనాత్మక విమర్శనా పద్ధతులను ఉపయోగించుకొని, గురజాడ అప్పారావు రచనల్లో కన్పించే అభ్యుదయ దృక్పథాన్ని, లక్ష్యాన్నీ నిరూపించారు.

గురజాడలో వేమన ప్రభావంతో బాటు పింగళి సూరన కళాసిద్ధాంత ప్రభావం కూడా కనిపిస్తుందంటారు ఆరుద్ర. గురజాడ చేసిన స్వతంత్ర రచనలో కళాసిద్ధాంతాల్ని, వేమన సామాజిక స్పృహనీ ఆకళింపు చేసుకున్నాడని నిక్షిప్తం చేయడంలో ఆరుద్ర పరిశీలన లోతైనది.

గురజాడ కంటే ముందుగా తెలుగు సాహిత్యంలో సామాజిక స్పృహ గల కవులుగా వేమన, వీరేశలింగం గార్లు కన్పిస్తున్నా వేమనను సంస్కరణవాదిగా, వీరేశలింగంగారిని ఆధునికాంధ్ర సాహిత్య నిర్మాతగా, గురజాడను 'ఆధునికాంధ్ర సాహిత్య జనకుడు'గా, శ్రీశ్రీని అభ్యుదయ సాహిత్య యుగకర్తగా ప్రకటించడం ఆరుద్రకు తెలుగు సాహిత్యం పట్ల గల లోతైన అవగాహనను తెలుపుతుంది.

లహరి: ఆరుద్ర తరంలో కె.వి.ఆర్., రా.రా., త్రిపురనేని మధుసూదనరావు గార్లు శక్తివంతమైన విమర్శకులుగా పేరు పొందారు. సోమసుందర్ విమర్శనాత్మక రచనలు విరివిగా చేశారు. ఆరుద్ర ప్రధానంగా పరిశోధకుడా? విమర్శకుడా? ఈ రెండింటికీ తేడా ఏమిటి?

డా. దార్ల: 'పరిశోధన' అనే పదానికి చాలా విస్తృతమైన పరిధి ఉంది. సత్యాన్వేషణ దీని ప్రధాన లక్ష్యం. పరిశోధనలో అనేక స్థాయిలు కూడా ఉన్నాయి. సేకరణ, వర్గీకరణ, విశ్లేషణ, సిద్ధాంతీకరణ, నూతన సిద్ధాంత స్థాపన, తులనాత్మక అధ్యయనం వంటి స్థాయిలన్నీ పరిశోధనలో ఉంటాయి.

దీంట్లో శాస్త్రపరిశోధన, కళాపరిశోధన రెండూ విలువైనవే ఉన్నాయి. సాహిత్య పరిశోధన కళాపరిశోధనల పరిధి కిందకే వస్తుంది. శాస్త్ర పరిశోధనలలో భౌతిక సత్యానికీ, కళా పరిశోధనలలో దార్శనిక సత్యానికీ ప్రాధాన్యత ఉంటుంది. అయితే కళా రంగంలో పరిశోధనలు చేసే వారికి కొన్ని కొన్ని ‘దృక్పథాలు' ఉంటాయి. ఆ దృక్పథాల ననుసరించి వారి పరిశోధనలలో భిన్న ఫలితాలు వస్తాయి. శాస్త్ర పరిశోధనలలో భిన్న ఫలితాలు రావు. అయితే పరిశోధనలలో పరిశోధకుడి వైయుక్తిక దృక్పథం కన్నా ఆ రచన వెలువడడానికి కారణమైన అన్ని పరిస్థితులనూ చూడగలిగే, పరిశీలించగలిగే మార్గమే ముఖ్యం.

విమర్శలో నాలుగు ప్రధానాంశాలు కనిపిస్తాయి. విశ్లేషణ, తులనాత్మక పరిశీలన, వ్యాఖ్యానం, నిర్ణయం. దీంట్లో విమర్శకుని 'అభిరుచి' కూడా ఉంటుంది.

ఆరుద్ర పరిశోధకుడు, విమర్శకుడు రెండూ. ఆయన దృక్పథం మార్క్సిస్టు విమర్శనా దృక్పథమే అని ఆయన రచనలను పరిశీలించిన ఎవరికైనా సులభంగా అర్థమవుతుంది. అయితే నిర్మొహమాటంగా చెప్పవలసినది తత్త్వంగా, లేదా బాగా అలవాటు చేసుకున్నదిగా కనిపిస్తుంది.

లహరి: ఆరుద్ర సమగ్రాంధ్ర సాహిత్య చరిత్ర రచనలో 'సమగ్రత' విషయం ఏమిటి? చిన్న సన్నాయి నొక్కుడు ఉంది కదా!

డా. దార్ల: (నవ్వారు). ఉంటుంది. దేనికైనా ఆ నొక్కుడు మంగళకరమే. సమగ్రత అంటే ఒక కాలంలో అవతరించిన ప్రతి రచననూ తెచ్చి కుక్కటం కాదు. సాహిత్యం ప్రారంభమైంది మొదలుకొని సంపుటాలు వెలువడినంతవరకున్న సాహిత్యం అంతటినీ అందించేదని భావించకూడదు. ఆరంభం నుండి, అన్ని సంపుటాలు వెలువడిన నాటి వరకూ సాహిత్యంలో గుర్తించదలచిన వాటిని విస్మరించకుండా రచన కొనసాగించగలగడం. ఆనాటి సాహిత్య స్పృహను, అవగాహన కల్పించడానికి ప్రయత్నించడం ఒక స్వరూపాన్ని, అవగాహనను కల్పించడంగా భావించాలి. ఆరుద్రే పదమూడవ సంపుటిని ముగిస్తూ 'స్వస్తివాచకం'లో చెప్పుకున్నట్లు సాహిత్య చరిత్రకు ముగింపు అంటూ ఉండదు. 'సమగ్రత' అంటే తెలుగు సాహిత్య ఆరంభవికాసాల్ని అవగతం చేసుకోవడానికి జరిగిన ప్రయత్నంగా గుర్తించాలి. సమగ్ర ఆంధ్ర సాహిత్య చరిత్ర తొలిముద్రణల పీఠికలో గిడుగు సీతాపతిరావు గారు వెలుబుచ్చిన అభిప్రాయం- "ఆరుద్ర రచించిన గ్రంథాల్లో అన్ని విషయాలు సమగ్రంగా చర్చించడానికి అవకాశం కలిగింది. '... సమగ్ర శబ్దము సాపేక్షము' ఒక దృష్టిలో చూసినట్లయితే ఎంత విపులంగా రాసినా ఏదీ సమగ్రమవ్వదు. పదమూడు సంపుటాల్లో ఎంత వరకు సాధ్యం కాగలదో అంతవరకూ వీరి సాహిత్య చరిత్ర రాశారని" అన్నారు.

లహరి: కొందరు కవులను ఉటంకిస్తూ ఆరుద్ర వీరిని వదిలిపెట్టాడని ఆరుద్ర 'సమగ్రత'ను విమర్శించిన వారు పరిశోధక పరమేశ్వరుడు శ్రీ నిడదవోలు వెంకటరావు గారు.

డా. దార్ల: అది తొందరపడి చేసిన విమర్శే. అయినా నిడదవోలు వారో, మరొకరో పేర్కొన్న కవుల్ని అందర్నీ సాహిత్య చరిత్రకారుడు పేర్కొనాలనేది ఏమీ లేదు. కావ్య విలువల్ని బట్టి ఆ రచనను సాహిత్య చరిత్రలో ఉటంకించాలో వద్దో రచయిత విచక్షణ నిర్ణయిస్తుంది. ఈ విషయాన్ని మరింత విపులంగా నా థీసిస్ లో చర్చించాను.

లహరి: ఆరుద్ర సమగ్రాంధ్ర సాహిత్య చరిత్ర అనుసరించిన యుగ విభజన పద్ధతి...

డా. దార్ల: అబ్బా! ఇది చాలా పెద్ద విషయం. ఎందరెందరో దిగ్దంతులు ఎన్నెన్నో వ్యాఖ్యలు చేశారు. వాటినన్నిటినీ పేర్కొని, ఒక్కొక్క ఆక్షేపణను నా సిద్ధాంత వ్యాసంలో చర్చించి ఆరుద్ర దృక్పథాన్ని వివరించే ప్రయత్నం చేశాను. ఆరుద్ర చాలా వివేచించుకున్నాక తన సాహిత్య చరిత్రలో రాజుల, పోషకుల పేర్లను అనుసరించే యుగవిభజన చేశారు. ఆంగ్ల సాహిత్య చరిత్రలో యుగ విభజన కాలాన్ని అనుసరించి, చారిత్రక పరిస్థితుల్ని క్రమంగా అధ్యయనం చేయడానికి వీలుగా రాజుల, పోషకుల్ని అనుసరించి చేశారు. అయితే ఈ విభజనలో ఆయన ఏకసూత్రతను పాటించలేదు. ఉజ్జాయింపు ప్రణాళిక అనీ, మరికొన్ని మార్పులు చేసిన యుగవిభజన అనీ, మొదట్లో వేసుకున్న ప్రణాళిక అనీ చాలాసార్లు యుగవిభజనని మార్పు చేశారు.

చరిత్రకైనా, సాహిత్య చరిత్రకైనా కాల స్పష్టత, కాలం చాలా ముఖ్యమైంది. ఆరుద్ర సమగ్రాంధ్ర సాహిత్య చరిత్రలో కాలానుసరణమని, చారిత్రక సామాజిక అంశాల్ని మిళితం చేసి సాహిత్య చరిత్రని రచించినా కాలాన్ని స్పష్టంగా చెప్పకుండా, రాజుల పాలనా కాలాన్ని పేర్కొని, యుగవిభజన చేసి రచన కొనసాగించారు. కాల నిర్దేశంలో వివిధ రాజుల పాలనా కాలాలు కలిసిపోవడం వల్ల స్పష్టంగా గీతగీసినట్లు చెప్పకుండా తప్పించుకున్నారు. కానీ, సురవరం ప్రతాపరెడ్డి చేసిన యుగవిభజన ప్రభావం ఆరుద్రలో కన్పిస్తుంది. ఒక కాలంలోని ఒక ప్రసిద్ధ కవి పేరును బట్టి యుగవిభజన చేసినవారు ఉన్నారు. ఇది వైయుక్తిక దృష్టికోణమే. ఇలాంటి యుగ విభజన కూడా విమర్శల పాలైంది. యుగ విభజన సమంజసంగా ఉండడమనేది కూడా ఒక్కొక్క చరిత్రకారునికి ఒక్కో ప్రణాళిక ఆధారంగా ఉంటుంది.

లహరి: చాలా థాంక్స్ సార్. మీ అమూల్య సమయం వెచ్చించి ఆరుద్ర గురించి ఎన్నో విలువైన విషయాలు మాకు అందించారు. చివరగా ఒక ప్రశ్న: ఒక పరిశోధకుడుగా ఆరుద్ర చాలా విలువైన వ్యక్తి. అది ఇంకా మనం అంటే మేం గుర్తించదగినంతగా గుర్తించడం జరగలేదు. ఆ కోణంలో ఆరుద్ర గురించి మీ పరిశోధన ఎన్నో విలువైన అంశాలను పరిశీలించి, విశ్లేషించి సమన్వయ పరచింది. ఇది చాలా శ్రమతో కూడుకున్నది. ఇంత విలువైన సిద్ధాంత వ్యాసాన్ని మీరెందుకు విస్తృత పాఠకుల దృష్టికి తీసుకురాలేదు? సిద్ధాంత వ్యాసాన్ని మీరెందుకు ప్రచురించలేదు?

డా. దార్ల: అంటే నేను ఎందుకు ప్రచురించలేదు? అని మీరు అడుగుతున్నారు. పుస్తక ప్రచురణ అనేది చాలా కాంప్లికేటెడ్ వ్యవహారం. అది నా చేతుల్లోని విషయం కాదు. దాని మీదకు ఎందుకో నాకు మనసు పోలేదు. కానీ, ఆరుద్ర మనకు అవసరం. ఆరుద్రకీ మనం అవసరం. సమాజం మీద ప్రభావం కలిగించగల రచయిత ఆరుద్ర.

లహరి: నమస్తే. మీ కృషికి విస్తృత పాఠకలోకాదరణ కలగాలని ఆశిస్తాను.

డా. దార్ల: థ్యాంక్యూ సర్! చూద్దాం.


14 సెప్టెంబర్, 2026

మత్సరం

 మత్సరం 



ఎన్నిసార్లు చూసినా

 కన్నీళ్ళాపుకోలేనంత ఉద్వేగం!

స్వరాలు

 తెరమీద కదులుతుంటే

 నా లోపల

 ఏదో పాత గాయం

 మళ్లీ తెరుచుకుంటుంది.

గురువు

 శిష్యుడి గొంతులో

 తన నేర్పిన స్వరాన్ని విని

 మురిసిపోవాలి...

తన స్వరాన్నే మించి

 ఒక కొత్త స్వరం పుడితే

 ఆనందంతో

 ఆకాశాన్ని చూపించాలి...

అక్కడే

 ఒక మనసు

 తన నీడకే

 భయపడుతుంది!

శిష్యుడి గొంతులో

 సూర్యుడు ఉదయిస్తుంటే

 గురువు కళ్లలో

 సాయంత్రం ఎందుకు కమ్ముకుంటుంది?

తాను నాటిన చెట్టు

 తనకంటే ఎత్తుగా ఎదిగితే

 ఆ చెట్టు నీడలో

 సేదతీరాల్సిన మనసు

 దాని కొమ్మలనే

 విరిచేయాలని ఎందుకు చూస్తుంది?

తన చేతిలో పెట్టిన

 స్వరమే

 తన చేతిని దాటి

 ఆకాశాన్ని తాకుతుంటే

గురువు

 చప్పట్లకు బదులు

 చేతులను ఎందుకు బిగిస్తాడు?

ఇది ఓటమి కాదు...

 ఇది

 తనలోని చిన్నదనాన్ని

 తన శిష్యుడి మహత్తులో

 చూసుకోలేని విషాదం!

నిజమైన గురువు

 తనను మించిన శిష్యుడిని

 చూసిన రోజే

 తన గురుత్వానికి

 పూర్ణత్వం పొందుతాడు.

తనకంటే ఎత్తుగా

 శిష్యుడిని నిలబెట్టగలిగినవాడే

 నిజమైన గురువు!

స్వాతికిరణం

 నన్నెప్పుడూ కదిలిస్తుంది

శిష్యుడి విజయాన్ని

 తన విజయంగా చేసుకోలేని

 ఒక గురువు అంతర్మథనంతో!

తెర దిగిపోయింది...

స్వరాలు ఆగిపోయాయి...

ఆ మౌనంలో మాత్రం

 ఒక ప్రశ్న

 ఇంకా వినిపిస్తూనే ఉంది

డా.దార్ల వెంకటేశ్వరరావు 14.9.2026


( స్వాతి కిరణం చలనచిత్రం చూసినప్పుడల్లా కలిగే ఓ ఉద్వేగం…)


08 సెప్టెంబర్, 2026

కాళోజీ కవిత్వంలో పాశ్చాత్య కవుల ప్రభావం

 కాళోజీ  కవిత్వంలో పాశ్చాత్య కవుల ప్రభావం

ప్రజాకవి, పద్మ విభూషణ్ కాళోజీ నారాయణ రావు న్యాయవాదిగా పనిచేశారు. అందువల్ల తెలుగుతో పాటు ఆంగ్లం, ఉర్దూ, హిందీ, మరాఠీ, కన్నడ, ఇంగ్లీషు భాషలు తెలుసు. అందువల్ల ఆయన కవిత్వంలో స్వదేశీ, ప్రాంతీయ ఉద్యమాలతో పాటు ప్రపంచ మానవతా దృక్పథం బలంగా ప్రతిఫలిస్తుంది. తెలంగాణ మట్టి వాసనలను అలికిన ఆయన గొంతులో, సమకాలీన సామాజిక మార్పును కాంక్షించే క్రమంలో విశ్వసాహిత్య పరిచయం కూడా ప్రముఖ పాత్ర పోషించింది. ప్రత్యక్షంగా పాశ్చాత్య సాహిత్య పద్ధతులను యథాతథంగా అనుకరించకపోయినా, పీడితుల పక్షాన నిలబడే తిరుగుబాటు తత్వం, స్వేచ్ఛా పిపాస, మానవ హక్కుల పరిరక్షణ వంటి భావనల్లో ఫ్రెంచ్ విప్లవ స్ఫూర్తి, పాశ్చాత్య విప్లవ కవుల ప్రభావం ఆయన కవిత్వంలో అంతర్లీనంగా కనిపిస్తుంది. సామాజిక అసమానతలను ఎదిరించడంలో ఆయన ఎంచుకున్న నిప్పులు చెరిగే ధిక్కార స్వరం ప్రపంచ సాహిత్యాంలోని ఆధునిక ధోరణులతో మేళవిస్తూ, తెలుగు కవిత్వానికి సరికొత్త అర్ధాన్ని తెచ్చిపెట్టింది.

కాళోజీ అనగానే తెలంగాణలో వివిధ సమస్యలపై ఉద్యమాలు చేయడం గురించే ఎక్కువగా మాట్లాడుకుంటాం. కానీ ఆయన తెలంగాణ భాష, సాహిత్యం పట్ల ప్రత్యేకమైన అభిమానంతో తనదైన శైలిలో కవిత్వం రాశారు. ఆయన కవిత్వంలో తెలంగాణ సజీవ భాష, ప్రజల నిత్య వ్యావహారిక  భాష ప్రాణం పోసుకున్నాయి. పండితులకే పరిమితమవుతున్న గ్రాంథిక భాషను పక్కనపెట్టి, సామాన్యుడు మాట్లాడుకునే నుడికారాన్ని, పలుకుబడిని తన కవిత్వానికి అద్దారు. 'నా భాష, నా యాస' అంటూ తెలంగాణ మాండలికానికి ఉన్నతమైనస్థాయి సాహిత్య గౌరవాన్ని దక్కించిన తొలితరం కవుల్లో ఆయన అగ్రగణ్యులు. అన్యభాషల వ్యామోహంలో పడి మాతృభాషను విస్మరించే వారిని చూసి "అన్యభాషలు నేర్చి ఆంధ్రంబు రాదంచు సకిలించు ఆంధ్రుడా చావవెందుకురా" అని నిలదీసిన అచ్చమైన భాషాభిమాని కాళోజీ. ఆయన కవితలు ‘నాగొడవ’ పేరుతో పుస్తకంగా వచ్చాయి. 


కాళోజీ ఫౌండేషన్ వారు 2004లో ‘కాళోజీ నాగొడవ విశిష్ఠకవితలు’ పేరుతో పునర్ముద్రించారు. తొలి ప్రచురణకు 1.1.1953 వ తేదీన కాళోజీ రాసుకున్న పీఠిక ‘ నా గొడవ పడక ముందు’లో కవిత్వం పట్ల తన అభిప్రాయాల్ని ఇలా చెప్పుకున్నారు. ‘’ఆనందమో, ఆవేదనో కలిగినప్పుడు వచ్చిన భావాన్ని వెలిబుచ్చడం జరిగింది. అది యితరులకు కాకున్నా వెలిబుచ్చిన వానికి బాగా నచ్చింది. ఇతరులకు కూడా నచ్చుతే విశేషం. ఈ విశేషధర్మం కైతకే మాత్రం ఆధారం కాదు. దానికి మూలం ప్రాణం కవికి అప్పుడప్పుడు కలిగిన ఆవేదన, ఆనందం మాత్రమే.’’ అని తన కవిత్వానికి గల ప్రేరణను స్పష్టంగా ప్రకటించారు. 

కాళోజీ  తన కవితా సంపుటికి 'నా గొడవ' అని పేరు పెట్టడం వెనుక అత్యంత లోతైన సామాజిక తాత్వికత దాగి ఉంది. ‘నేను-నా గొడవ’ పేరుతో ఒక కవితలో ఆయన ఇలా అంటాడు.

నేనంటే నేడు

నా గొడవంటే నాడు

నిజమో కాదోకల రుజువు

నీవూ నేనూ వాడూ

నేనంటె నేటి మనం

నా గొడవ మనస్థితి వైనం

నేనంటే భారత పౌరుడు

నా గొడవ ఆ, పౌరుని స్థితి

నేనంటే ఒక వోటరు

నా గొడవ వోటేసేవారు

నేనంటే తిరుగుబాటు దారు

నా గొడవ మన తిరుగుబాటు’

దీనిలో "నేను" అంటే కేవలం ఒక వ్యక్తి కాదు, ఈ దేశంలో బతుకుతున్న సజీవ ప్రజుల సామూహిక చైతన్యం; "నా గొడవ" అంటే ఆ ప్రజల దైనందిన వేదన, అణచివేతపై సాగే నిరసన స్వరం. వ్యక్తిగత అస్తిత్వాన్ని భారతీయ పౌరుడిగా, బాధ్యత గల ఓటరుగా విస్తరింపజేస్తూనే, అన్యాయాలను ప్రశ్నించే క్రమంలో అదే పౌరుడిని ఒక తిరుగుబాటుదారుడిగా మార్చారు. ఇక్కడ కాళోజీ తన గొడవను కేవలం తన సొంత ఇబ్బందిగా కాక, దేశంలోని ప్రతి పీడితుడి స్థితిగతులకు, సామూహిక ధిక్కారానికి అద్దం పట్టే ప్రజా చైతన్య ప్రస్థానంగా ఈ కవిత ద్వారా సార్థకం చేసుకున్నారు.



పైకి ఇది ఆయన వ్యక్తిగత సమస్యగా లేదా ఆవేదనగా ధ్వనించినా, వాస్తవానికి ఇందులో ఉన్న 'నేను' సమాజానికి ప్రతీక. లోకంలో ఎక్కడ అన్యాయం జరిగినా, ఎవరికి కష్టం వచ్చినా కాళోజీ తన సొంత బాధగా అల్లాడిపోయేవారు. సమాజంలో జరుగుతున్న అవకతవకలను, దోపిడీని, అణచివేతను చూసి తన మనసు పడుతున్న క్షోభనే ఆయన 'నా గొడవ'గా అభివర్ణించారు. ‘సమాజపు గొడవే తన గొడవ’ అనే ఆలోచనతో ఈ పేరు పెట్టి ఉండొచ్చు.తన కవిత్వం అంతిమ లక్ష్యం ఏమిటో, ఈ 'గొడవ' ఎప్పుడు తీరుతుందో కాళోజీ స్వయంగా ఈ వాక్యాల్లో ప్రకటించారు."అన్యాయాన్నెదిరిస్తే నా గొడవకు సంతృప్తి,అన్యాయం అంతరిస్తే నా గొడవకు ముక్తి ప్రాప్తి.అన్యాయాన్నెదిరించిన వాడే నాకు ఆరాధ్యుడు.”


1942 ప్రాంతంలో కాళోజీ ఒక వ్యాసం చదివాడు. అది Gold Smith 'City night Peace’. దీని ప్రేరణతో ‘‘ఎందుకో నా హృదిని ఇన్ని ఆవేదనలు?’ అనే గేయాన్నిలా రాశారు.

‘‘అవనిపై జరిగేటి అవకతవకలు జూచి 

ఎందుకో నా హృదిని ఇన్ని ఆవేదనలు? 

పరుల కష్టము జూచి కరిగిపోవును గుండె 

మాయ మోసము జూచి మండిపోవును 

ఒళ్లు పతిత మానవుజూచి 

చితికి పోవును మనసు 

ఎందుకో నా హృదిని ఇన్ని ఆవేదనలు? 

తప్పుదిద్దగలేను దారి జూపగ లేను 

తప్పు చేసిన వాని దండింపగా లేను 

కష్టపడువారలను కాపాడగా లేను 

ఎందుకో నా హృదిని ఇన్ని ఆవేదనలు? 

అవకతవకతలు నేను సవరింపలేనపుడు '

పరుల కష్టాలతో పనియేమి మాక'నెడు 

అన్యులను గనియైన హాయిగా మనలేను 

ఎందుకో నా హృదిని ఇన్ని ఆవేదనలు’’

కాళోజీ ఈ గేయం ఆయనలోని అపారమైన మానవతావాదానికి, సామాజిక బాధ్యతకు సజీవ రూపం. సమాజంలో జరిగే అక్రమాలను, అన్యాయాలను చూసి ఏ మాత్రం తట్టుకోలేకపోయే సున్నితమైన మనస్తత్వం ఆయనది. 

"అవనిపై జరిగేటి అవకతవకలు జూచి

ఎందుకో నా హృదిని ఇన్ని ఆవేదనలు?" అని ఆయన తన ఆవేదనను వ్యక్తం చేస్తూనే, 

"పరుల కష్టము జూచి కరిగిపోవును గుండె 

 మాయ మోసము జూచి మండిపోవును ఒళ్లు 

 పతిత మానవుజూచి చితికి పోవును మనసు" అంటూ సాటి మనుషుల పట్ల తనకు గల గాఢమైన సానుభూతిని చాటుకున్నారు. తోటివారి బాధలను తన సొంత బాధలుగా భావించే ఈ విశాల హృదయమే ఆయనను నిత్యం కవిత్వం వైపు నడిపించింది. అయితే, సమాజంలోని సమస్యలను చూసి కేవలం బాధపడటమే కాకుండా, వాటిని తాను స్వయంగా సరిదిద్దలేకపోతున్నాననే నిస్సహాయత ఆయనను మరింత కుమిలిపోయేలా చేసింది. 

"తప్పుదిద్దగలేను దారి జూపగ లేను

తప్పు చేసిన వాని దండింపగా లేను 

 కష్టపడువారలను కాపాడగా లేను" అంటూ తన అశక్తతను ఆయన ఎంతో నిజాయితీగా వెల్లడించారు. గోల్డ్‌స్మిత్ రాసిన "ది సిటీ నైట్ పీస్" (The City Night Piece) వ్యాసానికి, ప్రజాకవి కాళోజీ నారాయణరావు రాసిన "ఎందుకో నా హృదిని ఇన్ని ఆవేదనలు?" గేయానికి మధ్య అద్భుతమైన భావసారూప్యత ఉంది. లండన్ నగర వీధుల్లో అర్ధరాత్రి పూట అణగారిన వర్గాల దీనావస్థను, నిరాశ్రయుల ఆకలిని, ధనవంతుల అహంకారాన్ని చూసి చలించిపోయిన గోల్డ్‌స్మిత్... తన చుట్టూ సమాజంలో జరిగే అన్యాయాలను, అసమానతలను చూసి తలవంచని కాళోజీకి గొప్ప ప్రేరణగా నిలిచారు. గోల్డ్‌స్మిత్ రచనలోని ఆర్ద్రత, సమాజంలోని వికృత రూపాన్ని చూసి కలిగిన వేదన కాళోజీ కవితలో అణువణువునా ప్రతిఫలించాయి. గోల్డ్‌స్మిత్ తన వ్యాసంలో రాత్రివేళ లండన్ వీధుల్లో ఆకలితో అల్లాడుతున్న నిరాశ్రయులను, మోసపోయిన మహిళలను, సమాజంలో ఎవరూ పట్టించుకోని పేదలను చూసి తన శక్తిహీనతను తలచుకుని బాధపడతారు. సరిగ్గా ఇదే మానసిక స్థితిని కాళోజీ తన గేయంలో “పరుల కష్టము జూచి కరిగిపోవును గుండె, మాయ మోసము జూచి మండిపోవును ఒళ్లు, పతిత మానవుజూచి చితికి పోవును మనసు” అంటూ అద్భుతంగా ఆవిష్కరించారు. సమాజంలో జరిగే అవకతవకలను, అక్రమాలను చూసి తట్టుకోలేకపోయే సున్నితమైన హృదయం, పరుల బాధలను తన సొంత బాధగా భావించే తత్వం ఇద్దరు రచయితలలోనూ సమానంగా కనిపిస్తుంది. గోల్డ్‌స్మిత్ లండన్ వీధుల్లో ఏ దృశ్యాలైతే చూసి వేదన చెందారో, అవే దృశ్యాలు తాను జీవిస్తున్న సమాజంలో కనిపించడం వల్ల అవి కాళోజీని నిత్యం కలచివేసుంటాయి.ఈ కవితలో కాళోజీ వ్యక్తం చేసిన నిస్సహాయత పూర్తిగా గోల్డ్‌స్మిత్ పడిన ఆవేదనను పోలి ఉంటుంది. “తప్పుదిద్దగలేను దారి జూపగ లేను... కష్టపడువారలను కాపాడగా లేను” అంటూ సమాజంలోని అన్యాయాలను ఎత్తిచూపుతూనే, వాటిని మార్చలేకపోతున్నాననే బాధ ఇద్దరిలోనూ స్పష్టంగా గోచరిస్తుంది. గోల్డ్‌స్మిత్ పేదల కష్టాలను తీర్చే శక్తి తనకు లేదని భావించి ఎలా కుమిలిపోయారో, కాళోజీ కూడా తాను వాటిని సవరించలేకపోతున్నానని ఆవేదన చెందారు. అయితే, లోకంలో ఎక్కడో ఏడుపులు వినిపిస్తుంటే తాము మాత్రం ‘పరుల కష్టాలతో పనియేమి మాక’ని మిగతా వారిలా హాయిగా జీవించలేమని ఇద్దరూ నిరూపించారు. సాటి మనుషుల వేదనకు చలించే ఈ మానవతా దృక్పథమే కాళోజీని గోల్డ్‌స్మిత్ రచన వైపు ఆకర్షితులుగా చేసి, ఈ గొప్ప కవితను సృష్టించేలా ప్రేరేపించింది.

‘‘నేను ఒక మనిషిగా ఎందుకు పుట్టాను, సహాయం చేయలేని అభాగ్యుల కష్టాలను ఎందుకు చూడాల్సి వస్తోంది! అయ్యో ఇళ్లు లేని అభాగ్యులారా, ప్రపంచం మిమ్మల్ని నిందిస్తుంది కానీ ఆదరించదు! ధనవంతుల అత్యంత చిన్న చిన్న దురదృష్టాలు, వారి ఊహాజనిత అసౌకర్యాలు కూడా వాక్చాతుర్యంతో పెద్దవి చేసి చూపబడతాయి, మన దృష్టిని, సానుభూతితో కూడిన విచారాన్ని ఆకర్షించడానికి వాటిని ముందుకు తెస్తారు. కానీ పేదవాడు ఎవరికీ పట్టించుకోకుండా ఏడుస్తాడు, ప్రతి చిన్నపాటి అణచివేత చేత వేధించబడుతున్నాడు; ఇతరులకు భద్రతను ఇచ్చే ప్రతి చట్టం వారికి శత్రువుగా మారుతుంది. ’’ (Why, why was I born a man, and yet see the sufferings of wretches I cannot relieve! Poor houseless creatures! the world will give you reproaches, but will not give you relief. The slightest misfortunes of the great, the most imaginary un easinesses of the rich, are aggravated with all the power of eloquence, and held up to engage our attention and sympathetic sorrow. The poor weep unheeded, persecuted by every subordinate species of tyranny; and every law, which gives others security, becomes an enemy to them. ) ఈ భావాల్ని కాళోజీ తన కవితలో  కొన్ని భావాలను ఇలా పెట్టారనిపిస్తుంది. .

‘‘ఎందుకో నా హృదిని ఇన్ని ఆవేదనలు? 

తప్పుదిద్దగలేను దారి జూపగ లేను 

తప్పు చేసిన వాని దండింపగా లేను 

కష్టపడువారలను కాపాడగా లేను 

ఎందుకో నా హృదిని ఇన్ని ఆవేదనలు?  

‘Justice without power is Impotence, Power without Justice is tyranny' అన్న ఇంగ్లీష్ సామెతను దృష్టిలో పెట్టుకొని 1951 వ సంవత్సరంలో ‘వ్యర్థం’ అనే గేయం రాశారు.  ఈ సామెతను తెలుగులో "న్యాయం లేని అధికారం బలహీనత, అధికారం లేని న్యాయం నిరంకుశత్వం." అని అనువాదం చేసుకోవచ్చు.

టక్కరితనమెప్పుడుండదు పొంగక? 

బిక్కమొగా లెప్పుడుండవు లొంగక? 

అనాదిగా రుజువగుచుండ నీ మాట 

ఎందులకో కవి వ్రాయుట ఈ పాట?

బలం తోడుగా లేని న్యాయం 

కవి కనిపెట్టిన గొప్ప ఉపాయం 

'ఊరడి' పోసిన పందిపిల్ల అరుపు 

పూజారికి చేయగలదా చెరుపు? 

గంటములెన్నియో అరిగెను 

కంటకము లేమాత్రము తరిగెను? 

మిన్నుముట్ట మున్ను బెట్టిన కేకలు 

వక్రతలకు వేయజాలెనా బ్రేకులు?

ఎలుగెత్తి పాడిన కంఠాలు

ఏపాటి తీర్చె లోకుల తంటాలు?

ఇకపై చెల్లవని శ్రీశ్రీ అనినంత 

మోసం, దౌర్జన్యం తగ్గినదెంత? 

'ఇంకానా! ఇకపై చెల్లవు' 

ఏమైనది ఎందుకు చెల్లవు?

'కవులకసలు లేదు బుద్ధి' 

అన్నవాడు మహాసుబుద్ధి 

వ్యవహారజ్ఞాన శూన్యులు 

అలౌకిక శిఖామణులు 

ఆకాశహర్మ్య నిర్మాతలు 

గగన కుసుమ ఆఘ్రాతలు’’

కాళోజీ రాసిన 'వ్యర్థం' కవితలో ఆయన ప్రయోగించిన పదునైన కవితా పాదాలు ఈ సత్యాన్ని స్పష్టం చేస్తాయి. బలం లేని న్యాయం ఎంత నిస్సహాయంగా ఉంటుందో చెబుతూ, "బలం తోడుగా లేని న్యాయం / కవి కనిపెట్టిన గొప్ప ఉపాయం" అంటూ కవిత్వం కేవలం ఒక భ్రమగా మిగిలిపోతుందనే వాస్తవాన్ని అద్దం పట్టారు. అలాగే, సమాజంలో అన్యాయాలను చూసి కవులు ఎన్నిసార్లు గళం ఎత్తినా దోపిడీ వ్యవస్థ మారడం లేదనే నిజాన్ని వివరిస్తూ, "గంటములెన్నియో అరిగెను 

కంటకము లేమాత్రము తరిగెను?" అని ప్రశ్నించారు. శ్రీశ్రీ లాంటి మహాకవులు విప్లవ నినాదాలు ఇచ్చినా మార్పు రాలేదనే సందర్భాన్ని వివరిస్తూ ...

"ఇకపై చెల్లవని శ్రీశ్రీ అనినంత 

 మోసం, దౌర్జన్యం తగ్గినదెంత? 

'ఇంకానా! ఇకపై చెల్లవు' 

 ఏమైనది ఎందుకు చెల్లవు?" అని నిలదీశారు. కేవలం మాటలకే పరిమితమై, ఆచరణాత్మక శక్తి లేని కవుల వైఖరిని కాళోజీ ఎంతో వ్యంగ్యంగా, ఆత్మవిమర్శనాత్మకంగా ఈ కవితా పాదాల ద్వారా విమర్శించారు. కేవలం కవితలతో సమాజాన్ని మార్చాలనుకోవడం ఎంత నిరర్థకమో చెబుతూ, అది 

"‘నేనంటే నేడు

నా గొడవంటే నాడు

నిజమో కాదోకల రుజువు

నీవూ నేనూ వాడూ

నేనంటె నేటి మనం

నా గొడవ మనస్థితి వైనం

నేనంటే భారత పౌరుడు

నా గొడవ ఆ, పౌరుని స్థితి

నేనంటే ఒక వోటరు

నా గొడవ వోటేసేవారు

నేనంటే తిరుగుబాటు దారు

నా గొడవ మన తిరుగుబాటు’

అంటూ సూటిగా ప్రశ్నించారు. వాస్తవ ప్రపంచంతో సంబంధం లేకుండా, కేవలం కల్పనా లోకంలో విహరించే కవులను ఉద్దేశించి...

"కవులకసలు లేదు బుద్ధి 

 అన్నవాడు మహాసుబుద్ధి 

 వ్యవహారజ్ఞాన శూన్యులు 

అలౌకిక శిఖామణులు 

 ఆకాశహర్మ్య నిర్మాతలు 

గగన కుసుమ ఆఘ్రాతలు" అంటూ తనదైన శైలిలో తీవ్రంగా విమర్శించుకున్నారు. ఈ కవితా పాదాల ద్వారా కేవలం పదాల గారడీతో సరిపెట్టే కవిత్వం కన్నా, బలంతో కూడిన వాస్తవ పోరాటమే సమాజాన్ని మారుస్తుందనే ఆయన ప్రగతిశీల దృక్పథం స్పష్టమవుతుంది.

‘సిరాచుక్క’ పేరుతో రాసిన కవితలోని ‘‘ఒకే ఒక్క సిరాచుక్క లక్ష మెదళ్ళకు కదలిక ’’ అనే భాగాన్నే చాలామంది కోట్ చేస్తారు. కానీ పూర్తి కవిత ఇలా ఉంటుంది.  

A Single drop of Ink that make the millions to think" BYRON.

ఒకే ఒక్క సిరాచుక్క 

లక్ష మెదళ్ళకు కదలిక 

అన్నాడు బైరన్ 

నిజమేనా అది?

మరి నేను ఒలక బోసిన 

సిరా సీసాల కొద్ది గాదు

పీపాల కొద్ది 

ఏ ఒక్క మెదడు కదిలినట్టు లేదు 

మొదట నా మెదడులో ఉంటేగా కదలిక

 మరోడ్ని కదిలించ’’ 

ఇది 23-11-1975 వ తేదీ ఎమర్జెన్సీ సందర్భంలో రాసిన కవిత. ప్రఖ్యాత ఆంగ్ల కవి లార్డ్ బైరన్ "ఒకే ఒక్క సిరాచుక్క లక్ష మెదళ్లను ఆలోచింపజేస్తుంది" అన్న మాటలను ఉటంకిస్తూ ఎమర్జెన్సీ కాలం (1975 నవంబర్ 23) నాటి పరిస్థితుల నేపథ్యంలో కాళోజీ రాసిన ఈ కవిత ఆయన నిష్కల్మషమైన ఆత్మవిమర్శకు, కవితా నిజాతికి అద్దం పడుతుంది. ఇతరులను మేల్కొలపడానికి తాను పీపాల కొద్దీ సిరా ఒలకబోసినా ఎవరి మెదడూ కదలలేదని ఆవేదన చెందుతూనే, ఇతరులలో కదలిక రావాలంటే ముందుగా తన స్వంత మెదడే చైతన్యవంతం కావాలనే కఠిన సత్యాన్ని ఆయన ఈ కవితలో ఆవిష్కరించారు. నియంతృత్వపు చీకట్లను ఎదిరించడంలో కేవలం అక్షరాల ప్రసక్తే కాకుండా, రచయిత అంతర్మథనం, ఆత్మపరిశీలన ఎంత ముఖ్యమో ఈ కవిత ద్వారా కాళోజీ అత్యంత నిజాయితీగా ప్రశ్నించుకున్నారు.

    కాళోజీ కవితా శైలి అత్యంత విలక్షణమైనది. ఛందస్సు, వ్యాకరణాల ఇనుప సంకెళ్లకు కట్టుబడకుండా, సూటిగా ఉండే భావ ప్రకటనకే ఆయన పెద్దపీట వేశారు. పదునైన పదాలు, సునిశిత వ్యంగ్యం, సామాజిక ఆగ్రహం ఆయన కవిత్వ లక్షణాలు. సామాన్యుల కన్నీళ్లను, దైనందిన కష్టాలను కవిత్వంగా మలచడంలో ఆయనది అందెవేసిన చేయి. క్లిష్టమైన పదజాలం లేకుండా, పామరులకు సైతం సూటిగా గుండెకు హత్తుకునేలా రాయడం ఆయన ప్రత్యేకత. అందుకే ఆయన రచనలు గ్రంథాలయాలకే పరిమితం కాకుండా ప్రజల నాల్కలపై పాటలై, నినాదాలై మార్మోగాయి. నిత్య అన్వేషిగా, నిర్భయ కవిగా తెలంగాణ సాహిత్య చరిత్రలో తనదైన చెరగని ముద్ర వేశారు. తెలంగాణ సామాజిక చైతన్యానికి, ధిక్కార స్వరానికి ఒక నిలువెత్తు రూపంగా 'ప్రజాకవి' కాళోజీ నారాయణరావు కనిపిస్తారు. సమాజంలో జరుగుతున్న అన్యాయాలపై, అసమానతలపై తన ఆగ్రహాన్ని 'నా గొడవ' పేరుతో అక్షరబద్ధం చేసి, కలాన్ని ఒక సామాజిక ఆయుధంగా మలిచారు. నిజాం నిరంకుశత్వం మీద, అణచివేత మీద ఆయన ఎక్కుపెట్టిన కవితాస్త్రాలు ప్రజల్లో విప్లవాగ్నిని రగిలించేలా ఉన్నాయి. కాళోజీ కవిత్వం  అణగారిన వర్గాల ఆత్మఘోషకు, తెలంగాణ పోరాట ఆకాంక్షలకు సజీవ సాక్ష్యం. ఈ కవితా సంపుటి మొదటి ముద్రణకు 2.1-1-1953 వ తేదీన రాసుకున్న పీఠికలో ఇలా తన కవిత్వ ఆవిర్భావానికి గల కారణాలను చెప్పుకున్నారు.


‘‘ఆనందమో, ఆవేదనో కలిగినప్పుడు వచ్చిన భావాన్ని వెలిబుచ్చడం జరిగింది. అది యితరులకు కాకున్నా వెలిబుచ్చిన వానికి బాగా నచ్చింది. ఇతరులకు కూడా నచ్చుతే విశేషం. ఈ విశేషధర్మం కైతకే మాత్రం ఆధారం కాదు. దానికి మూలం ప్రాణం కవికి అప్పుడప్పుడు కలిగిన ఆవేదన, ఆనందం మాత్రమే.ఎన్నో సంఘటనలు జరుగుతుంటవి మన చుట్టుపట్టు. ఒకే సంఘటన అందరినీ ప్రభావితుల చేయదు, ఒకే రీతిగ అసలే చేయదు.ప్రసార యంత్రం ఒకటే అయినా స్వీకరించే యంత్రాలు తమ తమ శక్తితో దానిని గ్రహిస్తవి. యంత్రాలలో అన్ని విధాల సమాన శక్తిగల పరికరాలను నిర్మించవచ్చు. మానవుల నిర్మాణం అట్లా జరగలేదు. మనకు ఏదైనా "శక్తిని బట్టి సాక్షాత్కారం, భావానుగుణ్యం రూపం”.

దీన్ని బట్టి చూస్తే, ఆయన అంతరంగానికి, సమాజ స్పందనకు మధ్య జరిగే సత్యమైన సంభాషణ. సమాజంలో ఎన్నో సంఘటనలు జరుగుతున్నప్పటికీ, ప్రతి ఒక్కరూ వాటికి ఒకేలా స్పందించలేరని, ఎవరి మనస్తత్వాన్ని బట్టి వారు వాటిని గ్రహిస్తారని కాళోజీ నమ్ముతారు. మానవ మెదడు ఒకేలా ఉండదు కాబట్టి, చూసే దృక్పథం, స్పందించే తీరు మనుషుల అనుభవాలు, మనస్తత్వాల ఆధారంగా మారుతుంటాయి. ఈ సూత్రం ఆధారంగానే, సాటి మనుషుల కష్టాలను, అన్యాయాలను చూసి చలించిపోయే సున్నితమైన హృదయం నుండి ఉద్భవించిన ఆవేదనే ఆయన కవిత్వానికి అసలైన ప్రాణంగా నిలిచింది. పరుల బాధలను తన సొంత బాధగా భావించి అక్షరరూపం ఇవ్వడమే కాళోజీ కవిత్వ లక్ష్యం. 

కాళోజీ  ఇంగ్లీష్ సాహిత్యంతో పాటు ప్రపంచ సాహిత్య విశేషాలను కూలంకషంగా అధ్యయనం చేసిన విశాల దృక్పథం గల మేధావిగా ఈ కొన్ని అంశాల్ని చూసినా అర్థమవుతుంది.. పాశ్చాత్య కవులను, సాహిత్యాన్ని, దాని అంతరార్థాన్ని ఆయన ఎంతగానో ఆకళింపు చేసుకున్నారని తెలుస్తుంది. ఇతర భాషలలోని ఈ గొప్ప తాత్విక భావాలను, సామాజిక సత్యాలను కేవలం చదివి వదిలేయకుండా, తన మేధస్సును పదునుపెట్టడానికి మాత్రమే కాకుండా, లోకంలోని రుగ్మతలను విశ్లేషించడానికి ఒక కొలబద్ధగా మలచుకున్నారు. ఇలా ప్రపంచ సాహిత్యం ద్వారా తాను గ్రహించిన విశాలమైన సామాజిక స్పృహను, తన చుట్టూ ఉన్న తెలుగు నేల ప్రజల కన్నీళ్లకు, బతుకుపోరాటాలకు అద్దం పట్టే సాహిత్య వస్తువుగా కాళోజీ విజయవంతంగా మార్చారు. లండన్ వీధుల్లోని పేదల దైన్యాన్ని చూసి గోల్డ్‌స్మిత్ ఎలా చలించిపోయారో, అదేవిధంగా తన తెలంగాణ సమాజంలో అణచివేతకు గురవుతున్న నిస్సహాయుల కష్టాలను చూసి ఆయన హృదయం పరితపించింది. పరుల కష్టాలకు కరిగిపోయే సున్నితమైన మనస్తత్వాన్ని, బలం లేని న్యాయం ఎంత నిస్సహాయంగా ఉంటుందనే వాస్తవాన్ని తన కవితల్లో మేళవించారు. విదేశీ సాహిత్య పరిజ్ఞానాన్ని, స్వదేశీ ప్రజల వ్యథలతో అనుసంధానించడం ద్వారానే ఆయన కేవలం ఒక రచయితగా కాకుండా, ప్రజల గొంతుకగా నిలిచారు.అన్యాయాన్ని ఎదిరించడమే పరమావధిగా, పరుల కష్టాలను తన కష్టాలుగా భావిస్తూ 'నా గొడవ' ద్వారా సామాజిక చైతన్యానికి ప్రతీకగా నిలిచారు. అక్షరాన్ని కేవలం అలంకారంగా కాక, పీడితుల పక్షాన ఆయుధంగా మలిచి, తెలుగు సాహిత్యంలో ఎప్పటికీ చెరగని ప్రజాస్వామిక ముద్ర వేసిన అజరామరమైన కవిగా కాళోజీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారు.

డా.దార్ల వెంకటేశ్వరరావు 5.9.2026.

(కాళోజీ ప్రత్యేక సంచిక, సాహిత్య లహరి సాహిత్య అనుబంధం, నినాదం దినపత్రిక 9.9.2026 సౌజన్యంతో)


07 సెప్టెంబర్, 2026

అరసం ఆధ్వర్యంలో ఎండ్లూరి సుధాకర్ గారి కావ్య త్రయం పై ఆచార్య దార్ల ప్రసంగం

 ఆచార్య ఎండ్లూరి  ‘కావ్యత్రయం’దళిత చైతన్య పరిణామానికి ప్రతీక

- ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు వ్యాఖ్య.

ఆంధ్రజ్యోతి దినపత్రిక 7.9.2026 సౌజన్యంతో 
ప్రభంజనం దినపత్రిక 7.9.2026 సౌజన్యంతో 

మాట్లాడుతున్న ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు 

మాట్లాడుతున్న ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు 

 సమాజంలో మూడు తరాల దళితుల సామాజిక అస్తిత్వానికి దర్పణంగా ఎండ్లూరి సుధాకర్ గారి కావ్య త్రయం (కొత్త గబ్బిలం, వర్గీకరణీయం, గోసంగి దీర్ఘకావ్యాలు) నిదర్శనంగా నిలుస్తుందనిహెచ్ సీయు తెలుగు శాఖ పూర్వ అధ్యక్షులు, ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం వారి వారం వారం అంతర్జాల ప్రసంగ పరంపరలో భాగంగా ఆదివారం ఉదయం (6.9.2026) ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు ప్రత్యేక ప్రసంగం చేశారు. ఈ సమావేశానికి అరసం రాష్ట్ర అధ్యక్షులు ఆచార్య రాచపాళెం చంద్రశేఖర రెడ్డి అధ్యక్షత వహించారు.ఈ మూడు దీర్ఘకావ్యాలను సమగ్రంగా పరిశీలిస్తే దళిత అస్తిత్వం, హక్కులు, చారిత్రక గుర్తింపు అనే మూడు కీలక దశలుగా అవి కనిపిస్తాయని ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. దళిత జీవితానుభవాన్ని కేవలం వ్యక్తిగత వేదనగా కాకుండా సామాజిక చరిత్రగా, సామాజిక చరిత్రను అస్తిత్వ ప్రశ్నగా, అస్తిత్వ ప్రశ్నను హక్కుల పోరాటంగా సుధాకర్‌ తన కావ్యాల్లో మలిచారని దార్ల వివరించారు. ‘కొత్త గబ్బిలం’లో దళిత స్వరం కోసం అన్వేషణ, ‘వర్గీకరణీయం’లో హక్కు కోసం వాదన, ‘గోసంగి’లో చరిత్రలో అస్తిత్వాన్ని పునఃస్థాపించుకునే ప్రయత్నం కనిపిస్తుందని చెప్పారు.

దిశ దినపత్రిక 7.9.2026 సౌజన్యంతో 
విశాలాంధ్ర దినపత్రిక 7.9.2026 సౌజన్యంతో 
నినాదం దినపత్రిక 7.9.2026 సౌజన్యంతో 



సాక్షి దినపత్రిక 7.9.2026 సౌజన్యంతో 

విశ్వవిద్యాలయంలో పనిచేసే ఆచార్యులు చేయాల్సిన పనులన్నీ ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు చేస్తున్నారని, ఎండ్లూరు సుధాకర్ గారి కావ్యత్రయాన్ని చక్కటి విశ్లేషణాత్మక ప్రసంగం ద్వారా మూడు దీర్ఘ కావ్యాల్లోని సాహిత్య, సామాజిక, చారిత్రక పరిణామాలను శాస్త్రీయంగా విశ్లేషించారని సభాధ్యక్షులు ఆచార్య రాచపాళెం చంద్రశేఖర్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఆ ప్రసంగంపై చర్చ జరిగింది. ఈ కార్యక్రమంలో అరసం కార్యదర్శి ఆనంద్,  ఆచార్య ఎన్.ఈశ్వరరెడ్డి, రచయిత డా.వంకిరెడ్డి రెడ్డప్పరెడ్డి,  టి.రమణయ్య, లెనిన్ బాబు, గోవింద్, అధిక సంఖ్యలో సాహితీవేత్తలు, పరిశోధకులు, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.


03 సెప్టెంబర్, 2026

కన్నీటికి విలువ కట్టగలమా!

 కన్నీటికి విలువ కట్టగలమా! 



కన్నీటికి 

రంగు లేదు, రుచి లేదు, శబ్దం లేదు 

అయినా అది

పలకలేనంత ఓ జీవిత చరిత్ర!

కళ్ల నుంచి జారిన కన్నీరు

నేలలో కలిసిపోతుంది;

మనసులో దాచుకున్న కన్నీరు

మనిషిలోనే మిగిలిపోతుంది!

కొన్ని కన్నీళ్లు

కళ్లను దాటి రావు

గుండె గోడలపై గాట్లుగా మిగిలిపోతాయి!

కొన్ని కన్నీళ్లు

చెంపల మీదకు రాకముందే

పెదవుల దగ్గర

నవ్వులై రాలిపోతాయి!

కొన్ని కన్నీళ్లు

దిండు మీద పడవు

నిద్రలేని రాత్రులుగా

కళ్లలోనే మెలకువగా ఉండిపోతాయి!

కొన్ని కన్నీళ్లు

ఎవరినీ తడపవు

ఒంటరి గదిలో

మనిషిని లోపల్లపలే తడిపేస్తుంటాయి!

కొన్ని కన్నీళ్లు

జ్ఞాపకాలను తుడిచెయ్యలేవు

మరింత స్పష్టంగా

మనసు గోడలపై బాధల గాథల్ని చెక్కుతాయి!

ఏడ్చినవాడికి కన్నీరు తేలిక చేస్తుందేమో ఏడవలేనివాడికి మౌనమే భారమవుతుంది!

చివరికి కన్నీరు ఎండిపోతుంది,

కళ్లు కూడా ఎండిపోతాయి

కన్నీరు పుట్టించిన కారణం మాత్రం

మనిషిలో ఎప్పటికీ ఎండిపోదు!

-దార్ల వెంకటేశ్వరరావు 3.9.2026


01 సెప్టెంబర్, 2026

మిగిలిన వెలుగు

 మిగిలిన వెలుగు


నన్ను నేను

వెతుక్కుంటూ పోతే

ప్రతిచోటా

ఒక మూసిన తలుపే కనిపిస్తుంది!


తలుపు అవతల

ఎవరో పిలుస్తున్నట్టుంటుంది,

తెరవాలంటే

చేతులు మాత్రం

గతకాలపు తాళాలతో నిండిపోతాయి.


జీవితం

కొన్నిసార్లు

దారి చూపదు—

మన అడుగుల కింద

దారిని తయారుచేసుకుంటుంది!


పడిపోయిన చోటే

ఒక గుర్తు మిగులుతుంది,

ఆ గుర్తే

మరో అడుగుకు

చిన్న దీపమవుతుంది.


నిన్నటి నొప్పిని

ఈరోజు మోసుకెళ్లడం

ఎంతకాలం?


కొన్ని జ్ఞాపకాలను

సామానుల్లా సర్దుకుని

మనసు గదిలోనే

దాచేయాలి;


మూసిన పెట్టెల్లో

శ్వాస ఆగిపోకుండా

కిటికీ మాత్రం తెరిచి ఉంచాలి!


రాత్రి

ఎంత పొడవుగా ఉన్నా

ఉదయం గురించి

ఆకాశం ఎప్పుడూ

మాట్లాడుతూనే ఉంటుంది.


మనలో మిగిలిన

చిన్న వెలుగును

ఎవ్వరూ చూడకపోయినా

మనమే కాపాడుకోవాలి.


ఎందుకంటే—


చీకటిని జయించేది

పెద్ద సూర్యుడు కాదు,

ఆరిపోకుండా ఉన్న

ఒక చిన్న దీపమే!


ఆ దీపం

మనలో వెలుగుతున్నంతకాలం

జీవితం

ఇంకా ముగియలేదు.

- దార్ల వెంకటేశ్వరరావు 1.9.2026

సాంస్కృతిక ఔన్నత్యాన్ని ప్రతిఫలించే 'మాదిగ కొలువు'


 సాంస్కృతిక ఔన్నత్యాన్ని ప్రతిఫలించే 'మాదిగ కొలువు'

- ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు,

తెలుగు శాఖ,

యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్,

 హైదరాబాద్ - 500046.

ఫోన్: 9989628049

తెలుగు సాహిత్యంలో వచన సాహిత్య ప్రక్రియలు సామాన్యుల్ని కూడా సొంతంగా చదువుకునే అవకాశాన్ని కలిగాయి. వీటిలో కథానిక, నవలా సాహిత్యం మధ్యతరగతి, సామాన్యుల జీవితాలను వర్ణించడంలో ప్రధానమైన భూమికను నిర్వహిస్తున్నాయి. ఆ తరగతుల పాఠకులను ఇవి బాగానే ఆకట్టుకుంటున్నాయి. సుమారు 150 సంవత్సరాల నవలా సాహిత్య చరిత్రలో దళిత జీవితాలను చిత్రించిన నవలలు ఎన్నో వచ్చాయి. అలాంటి వాటిలో దళితేతరులు, దళితులు రాసిన నవలలు కూడా ఉన్నాయి. హేలావతి (1913) మొదలుకొని మాలపల్లి (1922) నవల వరకు దళితేతర రచయితలు దళిత జీవితాలను చిత్రించిన నవలలు అనేకం ఉన్నాయి. వీటితోపాటు దళిత రచయితలే రాసిన దళిత నవలల్లో ఖాకీ బ్రతుకులు (1980-82), గద్దలాడతాండాయి (1996), అద్దంలో చందమామ (1988), పంచమం (1998), కక్క (2000), సిద్ధి (2006), అంటరాని వసంతం (2000), చంద్రవంక.. దాని తర్వాత మరలా అంత గొప్ప నవలగా 'మాదిగ కొలుపు'ను చెప్పుకోవచ్చు. ఈ నవలల పరిణామాలన్నీ గమనించిన తర్వాత 'మాదిగ కొలుపు' నవల స్థానం ఎక్కడ అని గుర్తించడంలోనే దీని ప్రత్యేకతను మనం అర్థం చేసుకున్నట్లవుతుంది.

తెలంగాణ ప్రాంతంలోని మాదిగలు, వారి సంస్కృతిని కేంద్రంగా చేసుకొని వచ్చిన నవలల్లో 'కక్క', 'సిద్ధి' తర్వాత మరలా 'మాదిగ కొలుపు'ను ప్రధానంగా చెప్పుకోవాలి. మిగతా నవలల్లో, ముఖ్యంగా 'అంటరాని వసంతం' నవలలో మాలలను కేంద్రంగా చేసుకొని, సాయుధ పోరాటం , మార్క్సిజాన్ని దళిత సమస్యకు పరిష్కారంగా చూపారు. 'అద్దంలో చందమామ' దళితుల భూమి సమస్యను చిత్రిస్తే, 'పంచమం' నవల కమ్యూనిజం, అంబేద్కర్ భావజాలాల్లో దళితులు దేన్ని ఆచరించాలో విమర్శనాత్మకంగా చర్చించింది. ఆచార్య పులికొండ సుబ్బాచారి గారు 'మాదిగ కొలుపు' పేరుతో 2022 సంవత్సరంలో ఈ నవలను రాశారు.

మాదిగ కొలుపు నవల వస్తువు:

భారతీయ గ్రామీణ సమాజాల్లో, ముఖ్యంగా దక్షిణ భారతదేశంలోని తెలుగు సమాజాల్లో అస్పృశ్యులుగా, నిమ్న కులస్తులుగా పరిగణించబడే వారికి (మాదిగలకు) , అగ్రవర్ణాలుగా వ్యవహరించే ఆధిపత్య వర్గాల వారికి మధ్య గల పరస్పర అవసరాలను, వాటిలో సందర్భోచితంగా బహిర్గతమయ్యే సంఘర్షణలను, సామాజిక అంతస్తుల తీరుతెన్నులను, సాంస్కృతిక వారసత్వాలను వివరించడమే దీనిలోని ప్రధానమైన వస్తువు.తెలంగాణ రాష్ట్రం, ఖమ్మం దగ్గర్లోని ఒక గ్రామం 'మర్లపోలు'. ఆ గ్రామంలో సాధారణంగా అంటువ్యాధులు ప్రబలినప్పుడు ఊరు బాగుండాలని ఐదు రోజుల పాటు 'అంకమ్మ జాతర' జరపడం ఆచారం. దాన్ని పర్యవేక్షించేవాళ్ళు ఆ ఊరి సర్పంచ్, భూస్వాములు , కొందరు పెద్దలు. ఆ జాతరలో భాగంగా అంకమ్మకు కొలుపులు చేస్తారు. అంటే ఆ ఐదు రోజుల్లో చివరిరోజు కొలువుల్లో ఒక దున్నను బలిస్తారు. ఆ దున్నను ఊరి మాదిగలే బలివ్వాలి. ఆ సందర్భంలో మాదిగల్లోని ఉపకులాలకు చెందిన కొమ్ములవాళ్ళు, బైండ్ల, డక్కలివారు అమ్మవారి కథ చెప్పడం, డప్పులు మ్రోగించడం, కొలువుల్లో చేసే ఇతర పనులు చేయడం వంటివన్నీ చేస్తారు. అలా చేసినందుకు గ్రామ పెత్తందారులు ఆ మాదిగలకు కొన్ని బస్తాల జొన్నలు, ఐదు వందల రూపాయలు ఇస్తారు.

ఒకసారి అలా మాదిగలకు ఇవ్వవలసినవి ఇవ్వకపోగా, ఆ ఊరి పెత్తందారుల్లో రెడ్లు, తెలగాలు మాదిగలను కొడతారు. అందువల్ల వాళ్ళు కొలుపులు చేయడానికి రాకపోతే, ఏదోలా నచ్చచెప్పి వాళ్ళను తీసుకొచ్చే బాధ్యతను పెత్తందారులు ఆ గ్రామం పెద్దమాదిగ 'హనుమంతు' మీద పెడతారు. మొత్తం మీద తగిన హామీ తీసుకొని ఆ కొమ్ములవాళ్ళను తీసుకొస్తాడు హనుమంతు. కొలువులు మొదలవుతాయి.

దున్నను అమ్మవారికి బలిచ్చి, ఆ రక్తాన్ని తడిపిన అన్నాన్ని తమతమ గ్రామాల్లోను, పొలాల్లోను చల్లుకుంటే ఎలాంటి అంటురోగాలు రావనీ, పంటలు బాగా పండుతాయని నమ్ముతారు. ఆ సందర్భం కూడా వస్తుంది. ఊరి వాళ్ళంతా గుడి దగ్గరకు రావడం, పెద్దావిడ, వాళ్ళ కుటుంబ సభ్యులు కొలుపు నిర్వహించడానికి వస్తారు. హనుమంతుకి ఇద్దరు కొడుకులు ఉంటారు. ఒకడికి పెళ్ళైంది. రెండోవాడు కోటేశ్వరరావు డిగ్రీ చదువుతుంటాడు. వాళ్ళకిష్టం లేకపోయినా తండ్రికి సహాయంగా వెళ్తారు. దున్నను నరికి బలిచ్చేటప్పుడు ఒక సంప్రదాయం ఉంది; ఒకే వేటుకు దున్న తల తెగిపడాలి. అలా నరకడంలో హనుమంతు నిష్ణాతుడు. పెద్ద కత్తితో నరికేటప్పుడు ఒకరు దున్న మెడను గట్టిగా సాగదీసి పట్టుకుంటారు. పెదకాపు వేమిరెడ్డి నారాయణ కొడుకు వీరయ్య ఆ పలుపు పట్టుకుంటాడు. ఇంక హనుమంతు కత్తి పైకెత్తి నరుకుతుండగా దున్నను పట్టుకున్న వీరయ్య కాలునెవరో తొక్కుతారు. దానితో తాడు లూజై, దున్న మెడ కదలడంతో ఒక్క వేటుకి దాని మెడ తెగిపడదు.

వెంటనే అక్కడ పొన్నుకర్రలతో నిలబడి చూస్తున్న గ్రామ పెత్తందారు తల్లరెడ్డి పెద్ద కోటయ్య "మాదిగనా కొడకా కత్తినొదిలేత్తావురా" అని తిడుతూ పొన్నుకర్రతో హనుమంతుని కొడతాడు. ఆ సంఘటనకు తన తండ్రిని కాపాడుకోవడానికి తన బలమైన ఇద్దరు కొడుకుల్లో కాటయ్య అడ్డొస్తే రెండో దెబ్బ అతనిపై పడుతుంది. వెంటనే రెండో కొడుకు కోటేశ్వరరావు వచ్చి తండ్రిని కాపాడుకొని, వాళ్ళపై తిరగబడి, తాము కొలుపు చేయమని వచ్చేస్తారు. డప్పులు కొట్టడం ఆపేస్తారు. కొలువులు చేయడానికి వచ్చిన బైండ్ల, కొమ్ముల వాళ్ళు కూడా తాము ఆ పని చేయడం కుదరదని హనుమంతుతో కలిసి వెళ్ళిపోతారు.అర్థాంతరంగా అలా కొలుపులు ఆగిపోవడం గ్రామానికి అనర్థమనీ, అలా సగంలో వాళ్ళు వెళ్ళిపోవడానికి పెత్తందారులు చేసిన తప్పువల్లేనని ఊరు వాళ్ళంతా అనుకుంటారు. అందువల్ల మరలా గ్రామ సర్పంచ్, పెద్దలు, కొట్టిన పెత్తందారు కోటయ్య అంతా కలిసి మాదిగ పెద్ద హనుమంతు ఇంటికెళ్ళి, తమ తప్పు ఒప్పుకొని బ్రతిమలాడి తీసుకొస్తారు. కొలువులు పూర్తి చేయిస్తారు.కొలువులు పూర్తయినా, జరిగిన సంఘటన వల్ల హనుమంతు, వాళ్ళ పిల్లలు, యావత్తూ ఆ కులస్తులపై కక్షపెట్టుకుంటారు. కానీ కోటయ్య ఇంటిలో పెరుగుతున్న అన్నపూర్ణ తన మేనమామలనే తప్పుపడుతుంది. అన్నపూర్ణ, హనుమంతు కొడుకు కోటేశ్వరరావు ఖమ్మంలో ఒక కాలేజీలో చదువుకుంటున్నారు. అన్నపూర్ణ అభ్యుదయ భావాలు గల యువతి. కోటేశ్వరరావుని అభిమానిస్తుంది. కోటేశ్వరరావు ఉస్మానియా యూనివర్సిటీలో ఎం.ఎస్సీ పూర్తి చేసి, పిహెచ్.డి చేస్తూనే పోటీ పరీక్షలకు సిద్ధమవుతుంటాడు. అతణ్ణి కలెక్టర్ కావాలని ఆమె ప్రోత్సహిస్తుంది. తర్వాత అన్నపూర్ణ టీచర్ ట్రైనింగ్ చేస్తూ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతుంది.



ఈలోగా ఊరిలో సారా పాపయ్య ప్రభుత్వం దగ్గర లైసెన్స్ తెచ్చుకొని రెండవ సారా కొట్టుకూడా పెడతాడు. అతని కొడుకు ఓబులు నాయుడు అల్లరిచిల్లరగా తిరుగుతుంటాడు. అతనికి పెళ్ళి చేసుకోవడానికి పిల్లలు కూడా దొరకరు. ఊరిలో చాలామంది ఆడవాళ్ళను, పొలం పనికి వచ్చిన వాళ్ళను తనకున్న డబ్బుతో వశపరుచుకుంటుంటాడు. ఒకసారి హనుమంతు వాళ్ళ కుటుంబానికి చెందిన ఒకామెపై సారా పాపయ్య అత్యాచారం చేయబోయాడు. కానీ ఆమె తప్పించుకొని వచ్చి తన భర్తకు, ఇంట్లో అందరికీ చెప్తుంది. అయితే పోలీస్ కేసు పెడితే మరలా తమ మీదే ఏదో ఒక కేసు పెడతారని తెలిసి, పగతీర్చుకోవడానికి ఎదురు చూస్తూ ఉంటారు. మాదిగ యువకుడు ఒక అగ్రవర్ణానికి చెందిన వాళ్ళ ఇంటిదగ్గర పాలేరుగా చేరగా, ఆ పాలేరు మీద యజమాని భార్య మోజుపడి కొన్నాళ్ళు లేచిపోతారు. ఆ విషయాన్ని దాచిపెట్టి, తన భర్త ఊరికి వెళ్ళిందని ఆ యజమాని అందరికీ చెప్తాడు. కొన్నాళ్ల తర్వాత మరలా వాళ్ళిద్దరూ తిరిగి వస్తారు. ఏమీ జరగనట్లుగానే భర్త ఆమెతో కాపురం చేసుకుంటూ ఉంటాడు. మరొక వైపు మాదిగ యువతి మాత్రం తన భర్త ఇంకొక ఆమెతో లేచిపోవడాన్ని సహించలేక అతనితో కలవడానికి ఇష్టపడదు. కేవలం భార్యగా మాత్రమే ఉంటానంటుంది. అలా కొన్నాళ్ళ తర్వాత తన భార్యతో లేచిపోయిన ఆ పాలేరుని అగ్రవర్ణానికి చెందినవాళ్ళు మందు పెట్టి చంపేస్తారు. ఆ మాదిగామె వయసులో ఉంటుంది, అందమైనది. మరలా వివాహం చేసుకోకుండా ఆమె అలాగే ఉండిపోతుంది. ఆమెపై ఓబులు నాయుడు కన్ను పడుతుంది. ఆ అవకాశాన్ని హనుమంతు కొడుకులు, మాదిగ యువకులు ఉపయోగించుకుని రెడ్ హ్యాండెడ్ గా ఓబులు నాయుడుని పట్టుకునేలా చేస్తారు. అతన్ని యువకులు గట్టిగా కొడతారు. ఆమె తాను అందరిలాంటి ఆడదాన్ని కాదనీ, తనకు నీతి నిజాయితీ ఉన్నాయని చెప్తుంది. దానితో అతను మాట్లాడకుండా వెళ్ళిపోతాడు. తర్వాత కొన్నాళ్లకు కోటేశ్వరరావు తమ్ముడు కాటయ్య చనిపోతాడు. కారణం ఓబులు నాయుడు, రెడ్డి కోటయ్య కొడుకులు కక్షకట్టి తన సారా కొట్టులోనే నల్లమందు కలిపి విషం పెట్టి చంపేయడమే.ఈ విషయాలన్నీ పట్టణంలో చదువుకుంటున్న కోటేశ్వరరావుకు తెలుస్తాయి. కోటేశ్వరరావు ఊరికి వచ్చిన తర్వాత అన్నపూర్ణతో సహా వెళ్ళి నిందితులపై పోలీస్ కేసు పెడతారు. ఆ కేసు నడుస్తూ ఉంటుంది. అన్నపూర్ణ కోటేశ్వరరావుని తనను పెళ్లి చేసుకోమని అడగగా, అతను అన్నీ చర్చించిన తర్వాత ఒప్పుకుంటాడు. ఈలోగా కోటేశ్వరరావు డిప్యూటీ కలెక్టర్ గా ఎంపిక అవుతాడు. ఇద్దరూ ఊరికి వచ్చి ఆ ఊరి సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకుని ఊరేగుతారు. డిప్యూటీ కలెక్టర్ గా ఎంపికైన కోటేశ్వరరావుకు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో పెద్ద సన్మానం చేస్తారు. ఆ సన్మానం తాను చిన్నప్పుడు చదువుకున్న ప్రాథమిక పాఠశాలలోనే జరుగుతుంది. తనకు సహకరించిన వారందరికీ కోటేశ్వరరావు కృతజ్ఞతలు చెప్తాడు. అప్పటికి రిజర్వేషన్ కోటాలో హనుమంతు ఆ గ్రామానికి ప్రెసిడెంట్ అవుతాడు.

మరలా మా ఊరిలో మామూలు కొలుపు జరిగినప్పుడు తన కొడుకుని అధికారికంగా తీసుకొచ్చి అంకమ్మ గుడి దగ్గర పూజ చేయించి ఒక ప్రెసిడెంట్ గా ఉన్నతమైన హోదాలో ఆత్మగౌరవంతో అందరితోపాటు హనుమంతు కూర్చుంటాడు. ఈలోగా సాక్షాలన్నీ సేకరించిన పోలీసులు న్యాయస్థానంలో సమర్పిస్తారు. హనుమంతు కుమారుడు కాటయ్యను చంపిన ఓబులేసు నాయుడుకు , కోటయ్య కొడుకులకు శిక్ష పడడంతో నవల ముగుస్తుంది.



నవలా విశేషాలు:

ఉన్నవ లక్ష్మీనారాయణ గారు 'మాలపల్లి' పేరుతో నవల రాసిన సరిగ్గా వంద సంవత్సరాల తర్వాత ఆచార్య పులికొండ సుబ్బాచారి గారు 'మాదిగ కొలుపు' నవలను రాశారు. ఉన్నవ వారు మాలలను, వారి సాంస్కృతిక అంశాలను కేంద్రంగా చేసుకొని నవల రాస్తే, సుబ్బాచారి గారు మాదిగలను, మాదిగ ఉపకులాల సాంస్కృతికతను కేంద్రంగా చేసుకొని ఈ నవల రాశారు. ఈ నవల రాయాలంటే కేవలం సృజనాత్మక శక్తి ఉంటే సరిపోదు, దాని వెనుక ఎంతో పరిశోధన ఉంది. ఆచార్య పులికొండ సుబ్బాచారి గారు తన జీవితాంతం జానపద విజ్ఞానం, కులవృత్తులు, ముఖ్యంగా మాదిగల సాంస్కృతిక జీవనంతో ముడిపడిన అనేక పరిశోధనలు చేశారు. ఆ పరిశోధన ఫలితాలను సామాన్యులకు కూడా అర్థమయ్యేలా సృజనానుభవంగా మార్చి నవలగా అందించడంలో ఆయన నూటికి నూరుపాళ్ళు విజయవంతమయ్యారు.

ఈ నవలను చదవడం ద్వారా రెండు రకాల అధ్యయన అనుభవాలను పొందవచ్చు.

 భారతీయ సమాజ నిర్మాణం, దళితులు, దళితుల్లో మాదిగలు, మాదిగ ఉప కులాలు, వారి సాంస్కృతిక నిర్మాణాన్ని ఒక పరిశోధకుడిగా అధ్యయనం చేసిన వారు దీన్ని చదివితే కార్యకారణ సంబంధాలు, శాస్త్రీయతలతో కూడిన శాశ్వతమైన ఆనందాన్ని పొందుతారు.

 ఈ నవలలోని వస్తువును తమ జీవితంలో ప్రత్యక్షంగా అనుభవించిన సామాన్యులు దీన్ని చదివినప్పుడు తమ జీవితమే ఇందులో ఉందని భావిస్తారు. ఇందులో కేవలం అనుభవం మాత్రమే ఉంటుంది.

ఈ నవలలో రచయిత చక్కని తెలుగు భాషను తన నవలా కథనానికి ఉపయోగించారు. మరుగున పడిపోతున్న అనేక తెలుగు భాషా పదాలను సహజంగా ప్రయోగించి భాషా సంపదను పరిరక్షించారు. అస్తిత్వ ఉద్యమాలు ఇంత పతాక స్థాయిలో ఉన్న తరుణంలో, ఇతరుల బాధలను తన బాధగా ఆత్మీకరించుకొని రాయడానికి రచయిత చేసిన ప్రయత్నం ఒక సాహసంగా భావించాలి. ఒక కులం లేదా వృత్తి సమాజానికి ఎంత అవసరమో, ఇతర కులాల వారి అవసరం కూడా అంతే ఉంటుందని చెప్పడానికి గ్రామీణ జీవనంలో 'కొలుపులు'కున్న ప్రాధాన్యాన్ని వస్తువుగా స్వీకరించడం రచయిత సమయస్ఫూర్తికి నిదర్శనం.

సమాజంలో ఆచార సంప్రదాయాల పయనం, శాస్త్రిపైన ఆధారపడిన పయనం అనే రెండు భిన్న దృక్పథాలు రైలు పట్టాల మాదిరిగా సమాంతరంగా పయనిస్తుంటాయి. విద్యావంతులు కూడా కొన్ని అంశాలతో రాజీపడక తప్పదని, అయినంత మాత్రాన ఆ మూఢనమ్మకాలను పూర్తిగా అనుసరిస్తున్నట్లు కాదనే సూత్రాన్ని ఈ నవల శక్తివంతంగా నిరూపించింది. ఈ నవల్లో సాధారణంగా ఉపయోగించే ఫ్లాష్‌బ్యాక్ వంటి శిల్పాలు కాకుండా, వస్తువును బట్టి శిల్పాన్ని రూపొందించుకుంటూ రూపం కంటే సారానికే అధిక ప్రాధాన్యం ఇవ్వడం రచయిత విశేష దృక్పథాన్ని తెలియజేస్తుంది.గ్రామీణ సమాజంలోని వర్గ, కుల సంబంధాల సంక్లిష్టతను 'మాదిగ కొలుపు' నవల అత్యంత వాస్తవికంగా ఆవిష్కరిస్తుంది. ముఖ్యంగా, అగ్రవర్ణాల ఆధిపత్య ధోరణులు, పెత్తందారీ పోకడలు మాదిగల ఆత్మగౌరవాన్ని ఏ విధంగా దెబ్బతీస్తాయో ఈ నవలు స్పష్టంగా కళ్లకు కడుతుంది. జాతరలు, సాంప్రదాయాల పేరుతో శ్రమదోపిడీకి గురిచేసే వర్గాలు, ఆచారాల ముసుగులో తమ అధికారాన్ని నిలబెట్టుకోవాలని చూసే విధానాన్ని రచయిత ఈ నవలలో కళ్ళకు కట్టినట్లు చూపారు. ఒక్క వేటుతో దున్న తల తెగలేదన్న సాకుతో, గ్రామ పెత్తందారు కోటయ్య మాదిగ పెద్ద హనుమంతుని కర్రతో కొట్టడం వంటి సంఘటనలు అగ్రవర్ణాల అహంకారానికి, నిమ్న కులాలపై వారికున్న చిన్నచూపుకు ప్రతీకగా నిలుస్తాయి. ఏ చిన్న తప్పు జరిగినా దాన్ని సహించలేక, భౌతిక దాడికి దిగడం ద్వారా తమ వర్గ ఆధిపత్యాన్ని శాశ్వతం చేయాలని చూసే సామాజిక రుగ్మతను ఈ నవల నిశితంగా విశ్లేషిస్తుంది. అయితే, ఈ ఆధిపత్య ధోరణులకు వ్యతిరేకంగా మాదిగలు తిరగబడటం, కొలుపులను బహిష్కరించడం, చదువు, చట్టపరమైన మార్గాల ద్వారా తమ హక్కుల కోసం పోరాడటం వంటి పరిణామాలు మారుతున్న కాలంలో వస్తున్న చైతన్యానికి, ఆత్మగౌరవ పోరాటాలకు అద్దం పడుతాయి.

ఈ నవలలో కులాంతర వివాహాల గురించి జాగ్రత్తగా ఆలోచిస్తే, ఇవి కేవలం వ్యక్తిగతంగా మాదిగ – అగ్రవర్ణాల మధ్య జరుగుతున్న వాటికి సంబంధించినవి మాత్రమే కాకుండా, సమాజంలో పేరుకుపోయిన కుల అడ్డంకులను బద్దలు కొట్టే బలమైన సామాజిక పరిణామాలుగా ఆవిష్కరించే ప్రయత్నంగా అర్థం చేసుకోవాలి. అగ్రవర్ణాల ఆధిపత్యం, పాతకాలపు కట్టుబాట్లు బలంగా వేళ్లూనుకున్న గ్రామీణ వాతావరణంలో చదువుకున్న యువత తీసుకునే ఇటువంటి నిర్ణయాలు సాంప్రదాయక భావజాలానికి గట్టి సవాల్ విసురుతాయి. అభ్యుదయ భావాలు గల అన్నపూర్ణ, కోటేశ్వరరావును కేవలం వ్యక్తిగతంగా ప్రేమించడమే కాకుండా, అతనిని ఒక ఉన్నతమైన కలెక్టర్ స్థాయికి చేర్చడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఆ తర్వాత, గ్రామంలోని సంప్రదాయ పద్ధతిలోనే ఇద్దరూ పెళ్లి చేసుకొని ఊరేగడం ద్వారా, నిమ్న కులాల నుండి ఎదిగిన యువతకు సమాజంలో దక్కాల్సిన గౌరవాన్ని, గుర్తింపును తమ వివాహం ద్వారా సముచితంగా పునరుద్ఘాటించారు. ఇది ఆత్మగౌరవాన్ని కలగనడంగానే భావించాలి.

ఈ తరహా కులాంతర వివాహాలు సమాజంలో సమూల మార్పులకు, భావజాల సంఘర్షణలకు అద్దం పడతాయి. ఒకప్పుడు పెత్తందారులు, అగ్రవర్ణాల గుప్పెట్లో అణగారిపోయిన మాదిగ కుటుంబం నుంచి వచ్చిన యువకుడు డిప్యూటీ కలెక్టర్‌గా ఎంపికై, అదే ఊరిలో ఘనమైన సన్మానాలు అందుకోవడం, రిజర్వేషన్ కోటాలో హనుమంతు గ్రామ ప్రెసిడెంట్ పీఠాన్ని అధిరోహించడం కేవలం రాజకీయ అధికార మార్పు మాత్రమే కాదు; అది ఆత్మగౌరవ పోరాటాల ఫలితంగా సామాజిక నిర్మాణంలో వచ్చిన పెద్ద ఎత్తున మార్పు. కులాల సరిహద్దులను చెరిపేస్తూ, విద్యా విజ్ఞానాల ద్వారా వచ్చిన చైతన్యం సమాజాన్ని కొత్త దిశగా నడిపిస్తుందనడానికి, పాత రుగ్మతలను అధిగమించి ప్రజాస్వామ్య విలువలు ఎలా బలపడుతున్నాయో చెప్పడానికి ఈ నవలా పరిణామాలు సజీవ సాక్ష్యంగా నిలుస్తాయి.తెలుగు దళిత సాహిత్య చరిత్రలో ఒక అత్యంత విషాదకరమైన, చైతన్యవంతమైన మైలురాయి 'కంచికచర్ల కోటేశు' హత్యోదంతం. 1968 ఫిబ్రవరి 24న కృష్ణా జిల్లా కంచికచర్ల గ్రామంలో అరుకుట్ల కోటేశు అనే దళిత యువకుడిని అగ్రకులాలవారు సజీవదహనం చేసిన ఒక దారుణమైన సంఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. చారిత్రక పరంగా చూస్తే, కంచికచర్ల కోటేశు సంఘటనలో అగ్రవర్ణాల వారు ఆయనపై 'ఇత్తడి చెంబు దొంగతనం చేశాడనే' నెపాన్ని మోపారు. ఆ బూటకపు దొంగతనం ఆరోపణను అడ్డం పెట్టుకుని, ఆ యువకుడిని చేతులు కట్టేసి, ఒంటిపై కిరోసిన్ పోసి సజీవదహనం చేశారు. అయితే, సమాజంలో అణగారిన వర్గాలపై జరిగే దాడులు, హత్యల వెనుక కేవలం బహిరంగంగా చెప్పే చిన్నపాటి కారణాలు మాత్రమే ఉండవని, వాటికి లోలోపల ఉన్న సామాజిక, లైంగిక సంబంధాల ఘర్షణలు లేదా కుల దురహంకారపు నిగూఢ కారణాలు బలమైన నేపథ్యంగా ఉంటాయని ప్రజల్లో లోతుగా చర్చించుకుంటూ ఉంటారు.

 'మాదిగ కొలుపు' నవలలోని సంఘటనలను పరిశీలిస్తే, రచయిత పులికొండ సుబ్బాచారి గారు ఈ చారిత్రక కోటేశు ఉదంతం తాలూకు స్పూర్తిని, ధ్వనిని నవలలో అత్యంత శక్తివంతంగా ఇమిడ్చారనిపిస్తుంది. నవలలో హనుమంతు చిన్న కొడుకు కాటయ్యను, ఓబులు నాయుడు, రెడ్డి కోటయ్య కుమారులు కక్షకట్టి సారా కొట్టులో నల్లమందు కలిపి విషం పెట్టి హత్య చేయడం, నాటి కంచికచర్ల కోటేశు హత్యను పాఠకులకు గుర్తుకు తెస్తుంది. కుల అహంకారానికి ఎదురునిలిచిన లేదా ఎదుగుతున్న నిమ్న కులాల యువకుల ప్రాణాలను అగ్రవర్ణ పెత్తందారులు ఏవిధంగా బలిగొంటారో చెప్పడానికి ఈ రెండు ఘటనలు ప్రతీకగా నిలుస్తాయి. కంచికచర్ల ఘటన ఎలాగైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో దళితులను సంఘటితం చేసిందో, నవలలో కాటయ్య హత్య, హనుమంతు కుటుంబం చేసే పోరాటం మాదిగలలో ఒక కొత్త ఆత్మగౌరవ చైతన్యాన్ని తీసుకువస్తుంది. అణచివేతకు గురైన శ్రామిక వర్గాల శోకం, అగ్రవర్ణాల క్రూరమైన కుల దురహంకారం ఎప్పుడూ ఒకే కోణంలో సాగుతాయనడానికి ఈ నవలా చిత్రణ ఒక సజీవ దర్పణం. చారిత్రక సంచలనం సృష్టించిన కంచికచర్ల కోటేశు హత్యోదంతాన్ని, దాని వెనుక ఉన్న సామాజిక-లైంగిక సంఘర్షణల నేపథ్యాన్ని రచయిత పులికొండ సుబ్బాచారి గారు 'మాదిగ కొలుపు' నవలలో ఒక నిర్దిష్టమైన ఉదంతానికి మాత్రమే పరిమితం చేయకుండా, గ్రామీణ కుల వ్యవస్థలోని అంతర్గత హింసకు ప్రతీకగా అత్యంత సహజంగా సాధారణీకరించారు. అగ్రవర్ణాల ఆధిపత్యాన్ని ధిక్కరించే నిమ్న కులాల యువకులపై కక్షకట్టి, వారిపై అక్రమ సంబంధాల ముసుగులోనో లేక బూటకపు కారణాలతోనో దాడులు చేయడం, అంతిమంగా ప్రాణాలు తీయడం అనే అమానుషత్వాన్ని నవలలోని కాటయ్య హత్య ద్వారా రచయిత కళ్లకు కట్టినట్లువర్ణించారు.

అగ్రవర్ణ స్త్రీతో లేచిపోయిన తన భర్తను క్షమించి కాపురం చేయడానికి నిరాకరించిన మాదిగ యువతి పాత్ర చిత్రణ ద్వారా, నిమ్న కులాల (కింది వర్ణాల) స్త్రీల యొక్క అసాధారణ ఆత్మగౌరవాన్ని, నైతిక దృఢత్వాన్ని రచయిత అత్యంత ఉన్నతంగా ఆవిష్కరించారు. సమాజంలో సాధారణంగా ఆర్థికంగా లేదా సామాజికంగా అణగారిన వర్గాల మహిళలు తమ జీవితంలో ఎంతటి మోసాన్ని ఎదుర్కొన్నా, కుటుంబ పరువు లేదా భయంతో సర్దుకుపోవాలని సమాజం ఆశిస్తుంది. కానీ ఈ నవలలోని మాదిగ యువతి ఆ సాంప్రదాయక బలహీనతకు తలవంచదు. తన భర్త వేరొకరితో సంబంధం పెట్టుకుని వెళ్ళిపోవడాన్ని ఆమె తీవ్రమైన ద్రోహంగా భావిస్తుంది. అతను తిరిగి వచ్చినా, తన భర్తగా అంగీకరించేది లేదని, కేవలం చట్టపరమైన భార్యగా మాత్రమే ఉండిపోతానని తెగేసి చెప్పడం ఆమెలోని గట్టి ఆత్మగౌరవానికి, రాజీపడని తత్వానికి నిదర్శనం. ఈ పాత్ర ద్వారా కింది వర్ణాల స్త్రీలు కేవలం బాధితులుగా మాత్రమే ఉండరనీ, వారికి సొంతమైన నైతిక స్పష్టత, వ్యక్తిగత విలువలు, దేనినీ గుడ్డిగా అంగీకరించని ధిక్కార స్వభావం ఉంటాయని రచయిత బలంగా చాటిచెప్పారు. అగ్రవర్ణాల ఆధిపత్య పోకడలు, పురుషాధిక్య ధోరణులు శ్రామిక వర్గాల జీవితాలను కదిలించినప్పటికీ, ఆ వర్గాల మహిళల అంతర్గత మనోైధైర్యం, ఆత్మగౌరవం ఎంత చెక్కుచెదరనివిగా ఉంటాయో ఈ పాత్ర రూపంలో రచయిత ఎంతో ఔచిత్యంతో చిత్రీకరించారు.

నేటి సమాజంలో రిజర్వేషన్లు ఉన్నప్పటికీ దళితులు ఉన్నత ఉద్యోగాలు సాధించడం కష్టతరంగా ఉంటుందనేది వాస్తవమే అయినప్పటికీ, అసాధ్యాలను సుసాధ్యం చేసే చైతన్య కేంద్రాలుగా విద్య మారాలనే ఒక బలమైన సామాజిక సందేశాన్ని రచయిత ఈ ముగింపు ద్వారా ఇదమిత్థంగా చెప్పదలుచుకున్నారు. గ్రామంలో అణచివేతకు గురైన ఒక మాదిగ కుటుంబం నుంచి వచ్చిన యువకుడు కష్టపడి చదివి డిప్యూటీ కలెక్టర్ కావడమూ, అగ్రవర్ణ పెత్తందారీ కుటుంబానికి చెందిన అభ్యుదయ భావాలున్న యువతి అతనిని ప్రేమించి వివాహం చేసుకోవడమూ అనేది కేవలం కాల్పనిక సంతోషం కోసం సృష్టించినదనుకోకూడదు. ఇది సమాజంలో పాత కుల వ్యవస్థ బీటలువారుతోందనడానికి, చదువు ద్వారా మాత్రమే ఆత్మగౌరవం, అధికార మార్పిడి సాధ్యమవుతాయనడానికి ఒక ప్రతీక. అదే గ్రామంలో, తాను చిన్నప్పుడు అవమానాలు ఎదుర్కొన్న చోటే జిల్లా కలెక్టర్ చేత ఘన సన్మానం పొందడం, తండ్రి హనుమంతు రిజర్వేషన్ కోటాలో గ్రామ ప్రెసిడెంట్ పీఠాన్ని అధిరోహించి ఆత్మగౌరవంతో అందరితో పాటు సమానంగా కూర్చోవడం వంటి పరిణామాలు కేవలం ఒక సినిమాటిక్ హ్యాపీ ఎండింగ్ కాదు; అది దళిత ఉద్యమాలు సాధించవలసి ఉన్న రాజకీయ, సామాజిక విజయాల తాలూకు అత్యున్నత స్వప్నం. అందువల్ల, ఈ నవలా ముగింపును కేవలం ఒక కట్టుకథలా కాకుండా, రాబోయే సమాజం ఎలా ఉండాలనే ఒక అభ్యుదయ ఆశయానికి, అంబేద్కర్ ఆశించిన సమసమాజ నిర్మాణానికి ప్రతీకగా రచయిత చెప్పవచ్చు.



 


29 ఆగస్టు, 2026

తేనెతుట్టె

తేనె తుట్ట



ఒళ్ళంతా మకరందాన్ని

గుట్టుగా దాచి

ఎవరికోసమో వేచిచూస్తూ

మురిపిస్తూనే

ముట్టుకుంటే కుట్టినట్లుండే

గయ్యాలితనం!


పెదవుల అంచున

తేనె చుక్కలా నవ్వు,

కళ్ల లోతుల్లో

తుమ్మెదలకు తెలియని రహస్యం!


దగ్గరకు వస్తే

దూరం జరిగే బెరుకు,

దూరంగా ఉంటే

చూపులతో పిలిచే చిలిపితనం!


ఆ మనసంతా

ఓ తేనె తుట్టే

బయటంతా తేనెటీగల సందడి,

లోపలంతా

మకరందపు మౌనం!


తాకాలని చూస్తే

ముళ్లతో నిలువరించి,

మనసారా చేరితే

తేనెలా కరిగిపోయే

వింతైన గయ్యాళితనం!

దార్ల వెంకటేశ్వరరావు 29.8.2026


28 ఆగస్టు, 2026

గిడుగు’ వారు తెలుగు భాషకు ఏం చేశారు?

 ‘గిడుగు’ వారు తెలుగు భాషకు ఏం చేశారు? 

పల్లె పలుకే

భాషకు ప్రాణమని

పల్లె మాటకు

పట్టం కట్టిన

ఒక జీవనది ‘గిడుగు’!


పుస్తకాల పుటల్లో

బందీ అయిన తెలుగు అక్షరాలకు

పల్లె గడప దాటి

ప్రజల పెదవులపై

పలకరింపజేసినవాడు ‘గిడుగు’!


‘ఎలా మాట్లాడుతున్నారో

అలా రాయాలి’ అని

వ్యావహారిక భాషకు

వెలుగు చూపిన

భాషా విప్లవకారుడు ‘గిడుగు’!


తెలుగు భాషకు గిడుగు వేంకట రామమూర్తి పంతులు గారు చేసిన సేవ అసమాన్యమైంది. ఆయనను 'తెలుగు వ్యావహారిక భాషా పితామహుడు' అని కీర్తిస్తారు. తెలుగు భాషాభివృద్ధికి, సామాన్యులకు విద్యను చేరువ చేయడానికి ఆయనెంతో  కృషి చేశారు. 

గిడుగు రామమూర్తి పంతులు గారు పర్లాకిమిడి కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేస్తున్నప్పుడు, పాఠ్యపుస్తకాల్లోని కఠినమైన గ్రాంథిక భాషను అర్థం చేసుకోలేక విద్యార్థులు పడుతున్న అవస్థలను ప్రత్యక్షంగా చూసి చలించిపోయారు. పుస్తకాల్లోని భాషకు, ప్రజలు నిత్యం మాట్లాడుకునే వాడుక భాషకు మధ్య ఉన్న విపరీతమైన అంతరం వల్ల చదువు కేవలం కొద్దిమంది పండితులకే పరిమితమై, సామాన్యులకు దూరమవుతోందని ఆయన గ్రహించారు. జ్ఞానం, విద్య అందరికీ సులభంగా అందాలంటే అది వారు మాట్లాడుకునే సహజమైన వ్యావహారిక భాషలోనే ఉండాలని, భాష ప్రాచీన వ్యాకరణ సంకెళ్లలో బందీ అయితే అది క్రమంగా అంతరించిపోతుందని ఆయన భావించారు. అందుకే, భాషను ప్రజల వద్దకు చేర్చి, విద్యాబోధనను, సాహిత్యాన్ని సామాన్యులందరికీ అందుబాటులోకి తేవాలనే ఒక సామాజిక, ప్రజాస్వామిక బాధ్యతతోనే ఆయన ఈ మహత్తరమైన వ్యావహారిక భాషా ఉద్యమాన్ని భుజానికెత్తుకున్నారు.


ఆ కాలంలో పుస్తకాలు, పత్రికలు, పాఠ్యాంశాలు అన్నీ పండితులకు మాత్రమే అర్థమయ్యే గ్రాంథిక భాషలో ఉండేవి. దీనివల్ల సామాన్య ప్రజలకు విద్య దూరమవుతోందని గిడుగు వారు గ్రహించారు. ప్రజలు మాట్లాడుకునే వాడుక భాషలోనే విద్యాబోధన జరగాలని, అప్పుడే జ్ఞానం అందరికీ అందుతుందని ఆయన బలంగా వాదించారు. ఎందరో సంప్రదాయ పండితుల వ్యతిరేకతను తట్టుకుని ఆయన ఈ ఉద్యమాన్ని నడిపారు.

ఉత్తరాంధ్రలోని సవర గిరిజనుల భాషను అధ్యయనం చేయడానికి ఆయన ఎంతో కృషి చేశారు. సవర భాషకు లిపి లేదు, కాబట్టి స్వయంగా ఆ భాష నేర్చుకుని, దానికి ఒక వ్యాకరణాన్ని, నిఘంటువును (సవర-ఇంగ్లీష్ డిక్షనరీ) రూపొందించారు. గిరిజనుల విద్య కోసం స్వంత ఖర్చులతో పాఠశాలలు నడిపారు.

వ్యావహారిక భాష ఆవశ్యకతను తెలియజేయడానికి 'తెలుగు' అనే పత్రికను స్థాపించారు. గ్రాంథిక వాదుల వాదనలను తిప్పికొడుతూ ప్రాచీన కావ్యాలలో కూడా వ్యావహారిక పదాలు ఉన్నాయని నిరూపించడానికి తీవ్రమైన పరిశోధన చేశారు. 'ఆంధ్ర పండిత భిషక్కుల భేషజం', 'బాలకవి శరణ్యం' వంటి అద్భుతమైన గ్రంథాలు రచించి, గ్రాంథిక భాషలోని లోపాలను, వాడుక భాషలోని సహజత్వాన్ని సోదాహరణంగా నిరూపించారు.


'ఆంధ్ర పండిత భిషక్కుల భేషజం' గ్రంథం ద్వారా గిడుగు రామమూర్తి గారు నాటి గ్రాంథిక భాషా పండితుల అహంకారాన్ని, వారి వాదనల్లోని డొల్లతను ఆధారాలతో సహా ఎండగట్టారు. నన్నయ, తిక్కన, శ్రీనాథుడు వంటి మహాకవులు సైతం తమ కావ్యాల్లో అప్పట్లో వాడుకలో ఉన్న ఎన్నో వ్యావహారిక పదాలను ప్రయోగించారని శాసన, సాహిత్య నిదర్శనాలతో సహా నిరూపించారు. కేవలం కఠినమైన ప్రాచీన వ్యాకరణ నియమాలకు కట్టుబడి మాత్రమే రాస్తామని గర్వించే పండితుల సొంత రచనల్లోనే ఎన్ని వ్యాకరణ దోషాలు, అపప్రయోగాలు ఉన్నాయో చూపించి వారి 'భేషజాన్ని' (గర్వాన్ని) వదిలించారు. భాషను కృత్రిమ నియమాల పేరుతో బంధించడం ఎంత అశాస్త్రీయమో, దానివల్ల భావవ్యక్తీకరణ ఎంత అసహజంగా మారుతుందో ఈ గ్రంథం సోదాహరణంగా స్పష్టం చేసింది.

'బాలకవి శరణ్యం' గ్రంథం నవతరం రచయితలకు, యువ కవులకు ఒక మార్గదర్శిగా, అభయారణ్యంగా నిలిచింది. పండితులు విధించే కఠినమైన పాతతరం వ్యాకరణ సూత్రాలకు భయపడి సహజమైన భావవ్యక్తీకరణను చంపుకోవాల్సిన అవసరం లేదని గిడుగు వారు యువతకు ధైర్యం చెప్పారు. ప్రజల వాడుక భాషలో ఉండే జీవం, సహజత్వం, సొగసు గ్రాంథికంలో ఉండవని వివరిస్తూ, ఎన్నో ఉదాహరణలతో వాడుక భాష గొప్పదనాన్ని చాటారు. భాష అనేది నిరంతరం పారే ప్రవాహం లాంటిదని, సామాన్యులకు అర్థమయ్యే వ్యావహారికంలో రాసినప్పుడే సాహిత్యానికి సార్థకత చేకూరుతుందని ఆయన ఈ గ్రంథం ద్వారా యువ కవులకు దిశానిర్దేశం చేశారు.



గిడుగు రామమూర్తి పంతులు గారి వ్యావహారిక భాషా ఉద్యమానికి గురజాడ అప్పారావు గారు వెన్నెముకలా నిలిచారు. గిడుగు వారు వ్యావహారిక భాషకు వ్యాకరణ, చారిత్రక ఆధారాలు చూపిస్తూ సిద్ధాంతపరమైన పోరాటం చేస్తే, గురజాడ వారు ఆ భాషలోనే అద్భుతమైన సాహిత్యాన్ని సృష్టించి దానికి ప్రాణం పోశారు. వీరిద్దరి సమన్వయాన్ని ఈ కింది ఉదాహరణల ద్వారా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు.

 

సామాన్య ప్రజల భాషలో గొప్ప సాహిత్యం రాలేదని, అది కేవలం వీధి నాటకాలకే పరిమితమని గ్రాంథిక వాదులు విమర్శిస్తున్న సమయం అది. దానికి సమాధానంగా గురజాడ వారు 'కన్యాశుల్కం' నాటకాన్ని పూర్తిగా వాడుక భాషలోనే రాశారు. ఆ నాటకం సాధించిన అఖండ విజయం, ప్రజల భాషలో ఎంతటి గంభీరమైన భావాన్నైనా, హాస్యాన్నైనా పండించవచ్చని నిరూపించి గిడుగు వారి ఉద్యమానికి కొండంత బలాన్నిచ్చింది.

మద్రాసు విశ్వవిద్యాలయంలో వ్యావహారిక భాషను పాఠ్యాంశంగా ప్రవేశపెట్టాలా వద్దా అనే విషయంపై ఒక కమిటీ ఏర్పడింది. అందులో సభ్యుడిగా ఉన్న గురజాడ అప్పారావు గారు, గిడుగు వారి వాదనలతో పూర్తిగా ఏకీభవిస్తూ గ్రాంథిక భాషా వాదులను ధైర్యంగా వ్యతిరేకించారు. అప్పట్లో ఆయన రాసిన 'డిసెంట్ నోట్' (భిన్నాభిప్రాయ పత్రం) వ్యావహారిక భాషా ఉద్యమానికి ఒక చారిత్రక ఆధారంగా, గొప్ప అస్త్రంగా మిగిలిపోయింది. అదే 'మినిట్ ఆఫ్ డిసెంట్' (Minute of Dissent) గ్రంథం. పండితులు మాత్రమే అర్థం చేసుకోగలిగే కఠినమైన పద్యాలను, పాత ఛందస్సులను కాదని, సామాన్యుల నాలుకల మీద నాట్యం చేసేలా 'ముత్యాల సరాలు' అనే కొత్త ఛందస్సును గురజాడ సృష్టించారు. "దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్" అంటూ ఆయన రాసిన గేయాలు గిడుగు వారు కలలుగన్న సామాన్యుల భాషా వికాసానికి అద్దం పట్టాయి.

గిడుగు వారు ఒక యోధుడిలా పండితులతో పోరాడితే, గురజాడ వారు తన కలంతో ఆ పోరాటానికి పదునైన ఆయుధాలు అందించారు.


ఎవరెవరీ గ్రాంథిక భాషావాదులు?


వాళ్ళ దృష్టిలో 

భాషంటే

వ్యాకరణపు గోడల మధ్య

నడిచే పదాలయాత్ర !

ప్రజల పలుకులు

ప్రవాహాలై మనసులను కలుపుతుంటే

వాళ్ళు భాషకు ఒక ఆనకట్ట కట్టారు

దానిపేరే గ్రాంథికం.


వాళ్ళ దృష్టిలో

భాష ఒక నది కాదు

తరతరాలుగా సంరక్షించిన

ఒక శిలాశాసనం.


అక్షరానికి 

అలంకారం ఉండాలి,

వాక్యానికి

వైభవం ఉండాలి,

పదానికి

పరిమళమే ప్రవహించాలంటే

ప్రజల వాడుకలోనే సాధ్యమని 

గుర్తించడానికి  వాళ్ళు నిరాకరించారు.

గిడుగు రామమూర్తి పంతులు గారి 'వ్యావహారిక భాషోద్యమాన్ని' వ్యతిరేకించి, ప్రాచీన కావ్య భాష లేదా 'గ్రాంథిక భాష' మాత్రమే పాఠ్యపుస్తకాలకు, సాహిత్యానికి ప్రమాణంగా ఉండాలని బలంగా వాదించిన పండితులను "గ్రాంథిక భాషా వాదులు" అంటారు. ఆ కాలంలో గ్రాంథిక భాష పక్షాన నిలబడిన వారిలో ఎంతో మంది ఉద్దండ పండితులు ఉన్నారు. వాళ్ళలో ముఖ్యులు. జయంతి రామయ్య పంతులు గ్రాంథిక వాదులలో అత్యంత ముఖ్యులు, ఈ వాదానికి నాయకుడు. గిడుగు వారి ఉద్యమాన్ని అడ్డుకోవడానికి, గ్రాంథిక భాషను రక్షించడానికి వీరు 1911లో మద్రాసులో 'ఆంధ్ర సాహిత్య పరిషత్తు' అనే సంస్థను స్థాపించి వ్యావహారిక వాదులపై తీవ్రంగా పోరాటం చేశారు.

వేదం వేంకటరాయ శాస్త్రి గొప్ప పండితులు, విమర్శకులు. విద్యాబోధనలో, ఉన్నత సాహిత్యంలో కచ్చితంగా గ్రాంథికమే ఉండాలని వీరు వాదించారు. అయితే, నాటకాల్లో ఉన్నత పాత్రలు గ్రాంథికం మాట్లాడినా, నీచ/సామాన్య పాత్రలకు వాడుక భాషను వాడొచ్చని ఆయన ఒక సడలింపు ఇచ్చారు. కొక్కొండ వేంకటరత్నం పంతులు కరడుగట్టిన గ్రాంథిక వాది. అచ్చమైన, కఠినమైన వ్యాకరణ నియమాలు కలిగిన భాషనే ఉపయోగించాలని పట్టుబట్టారు. పత్రికల్లో సైతం ఆయన అత్యంత కఠినమైన భాషను వాడేవారు. బిక్షగాడితో కూడా గ్రాంథికంలో మాట్లాడేవారు.  కందుకూరి వీరేశలింగం పంతులు గొప్ప సంఘ సంస్కర్త అయినప్పటికీ, భాషా పరంగా వీరు ఉపయోగించింది 'సరళ గ్రాంథికం' (కొద్దిగా సులభంగా అర్థమయ్యే గ్రాంథిక భాష). పాఠ్యపుస్తకాల్లో పూర్తిగా వాడుక భాషను ప్రవేశపెట్టడాన్ని ప్రారంభంలో వీరు కూడా వ్యతిరేకించి జయంతి రామయ్య పంతులు గారి పక్షాన నిలిచారు. (కానీ చివర్లో ఆయన అభిప్రాయం కొంత మెత్తబడింది). వావిలికొలను సుబ్బారావు, శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి మొదలైన వాళ్ళను గ్రాంథిక భాషా వాదులని అంటారు.

      ఈ పండితులంతా భాష పట్ల అపారమైన గౌరవం, ప్రాచీన సాహిత్యం పట్ల వల్లమాలిన ప్రేమ ఉన్నవారే. అయితే, కాలక్రమంలో సమాజంలో వస్తున్న మార్పులను, సామాన్యుల అవసరాలను వారు అంగీకరించలేకపోయారు. వ్యాకరణ నియమాలను ఉల్లంఘిస్తే తెలుగు భాష నాశనం అయిపోతుంది అనేది వాళ్ళ ఆందోళన. కానీ భాష ఒక సజీవ నది లాంటిది. నిత్య వ్యవహారం వల్ల మాత్రమే భాష సజీవంగా నిలుస్తుందని గిడుగు రామమూర్తి పంతులు గురజాడ అప్పారావు తదితరులు భావించారు. 

గిడుగు వేంకట రామమూర్తి పంతులు గారి నాయకత్వంలో, సామాన్య ప్రజలు మాట్లాడుకునే "వ్యావహారిక భాష విద్యా, సాహిత్య రంగాలకు ప్రమాణంగా ఉండాలని పోరాడిన వారిని "వ్యావహారిక వాదులు" అంటారు. పండితుల వ్యతిరేకతను తట్టుకుని గిడుగు వారికి అండగా నిలిచిన ముఖ్యులుగా పేర్కొనదగినవారు.గురజాడ అప్పారావు వ్యావహారిక భాషోద్యమానికి  సాహిత్యపరంగా ఊపిరి పోసిన మహాకవి. గిడుగు వారు వ్యాకరణ, చారిత్రక వాదనలు చేస్తే, గురజాడ తన రచనల  ద్వారా వ్యావహారిక భాష గొప్పదనాన్ని ఆచరణలో చూపించారు. జె. ఏ. యేట్స్ (J. A. Yates) ఆంగ్లేయుడైనప్పటికీ, వాడుక భాషా ఉద్యమానికి ప్రేరకుడు అని చెప్పవచ్చు. అప్పట్లో పాఠశాలల ఇన్స్పెక్టర్ గా ఉన్న యేట్స్, పిల్లలకు పండితుల కఠిన భాష అర్థం కావడం లేదని గుర్తించి, ప్రజల వాడుక భాషలో పాఠ్యపుస్తకాలు రూపొందించాలని గిడుగు, గురజాడలను ప్రోత్సహించారు.పి.టి. శ్రీనివాస అయ్యంగార్ విశాఖపట్నంలోని ఏ.వి.ఎన్. కళాశాల ప్రిన్సిపాల్ అయిన వీరు, గిడుగు వారికి విద్యాపరమైన, నైతికపరమైన గొప్ప మద్దతునిచ్చారు. మద్రాసు విశ్వవిద్యాలయం బోర్డులో ఉంటూ వ్యావహారిక భాష కోసం గట్టిగా వాదించారు. కందుకూరి వీరేశలింగం పంతులు  తన చివరి రోజుల్లో గిడుగు వారి వాదనల్లోని శాస్త్రీయతను, సత్యాన్ని గ్రహించారు. తన చివరి రోజుల్లో రాజమండ్రిలో గిడుగు వారు స్థాపించిన "వర్తమానాంధ్ర భాషా ప్రవర్తక సమాజం" (1919) నకు అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించి వ్యావహారిక వాదానికి సంపూర్ణ మద్దతు పలికారు. ఇది ఉద్యమానికి లభించిన అతిపెద్ద విజయాల్లో ఒకటి. చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి ప్రసిద్ధ జంట కవులైన 'తిరుపతి వేంకట కవుల'లో ఒకరు. వీరు గొప్ప సంప్రదాయ పండితుడు. అయినప్పటికీ, కాలానుగుణంగా వస్తున్న మార్పును స్వీకరించి, "వాడుక భాషలో రాయడం నేరం కాదు" అని బహిరంగంగా ప్రకటించి వ్యావహారిక వాదులకు బలాన్నిచ్చారు.పంచాగ్నుల ఆదినారాయణ శాస్త్రి & తల్లావజ్ఝల శివశంకర శాస్త్రి గార్లు కూడా ఉద్దండ సంప్రదాయ పండితులే అయినా, గిడుగు వారి ప్రభావంతో వాడుక భాషా ఉద్యమానికి గట్టి మద్దతుదారులుగా మారారు. నవతరం కవులను వాడుక భాషలో రాసేలా ప్రోత్సహించారు. గిడుగు వేంకట సీతాపతి గిడుగు రామమూర్తి పంతులు గారి కుమారుడు. తండ్రి ఆశయాలను, పరిశోధనలను ముందుకు తీసుకెళ్లి, ఉద్యమాన్ని సమర్థవంతంగా కొనసాగించారు.

పర్లాకిమిడి ప్రాంతంలో అజ్ఞానం, నిరక్షరాస్యతతో మగ్గుతున్న సవర గిరిజనులకు విద్యను చేరువ చేయాలనే ఉదాత్తమైన లక్ష్యంతోనే గిడుగు రామమూర్తి గారు సవర భాషలో కథలు రాశారు. ఆ గిరిజనులకు తెలుగు లేదా ఇతర భాషలు రాకపోవడంతో, వారి మాతృభాషలోనే విద్యాబోధన చేస్తేనే వారు సులభంగా జ్ఞానాన్ని గ్రహించగలుగుతారని ఆయన గుర్తించారు. అందుకే లిపి లేని ఆ భాషను ఆయన స్వయంగా నేర్చుకుని, దానికి అక్షరరూపం కల్పించి వ్యాకరణం రాయడమే కాకుండా, గిరిజన పిల్లల్లో చదువు పట్ల ఆసక్తిని, ఉత్సాహాన్ని పెంపొందించడానికి వారి జీవనవిధానానికి, సంస్కృతికి అద్దం పట్టేలా చిన్న చిన్న కథలు, గేయాలను ఆ భాషలోనే స్వయంగా రచించి పాఠ్యపుస్తకాలుగా రూపొందించారు. అట్టడుగు వర్గాల విద్యాభివృద్ధి పట్ల ఆయనకున్న అపారమైన మానవతా దృక్పథానికి, అంకితభావానికి ఈ కృషే సజీవ సాక్ష్యం.

    వీరందరి సమష్టి కృషితోనే నేడు తెలుగు భాష పండితుల సంకెళ్లు తెంచుకుని, ఆధునిక అవసరాలకు తగినట్లుగా, సజీవ స్రవంతిలా ప్రవహిస్తోంది.గిడుగు వేంకట రామమూర్తి పంతులు గారు చేసిన అలుపెరగని పోరాటం వల్లనే నేడు మనం పత్రికల్లో, టీవీల్లో, పాఠ్యపుస్తకాల్లో, సాహిత్యంలో సులభమైన వాడుక భాషను చూడగలుగుతున్నాము. భాష అనేది పండితుల సొత్తు కాదని, అది ప్రజలందరిదని ఆయన నిరూపించారు. కాలం మాత్రం తనదైన రీతిలో భాషకు కొత్త తలుపులు తెరిచింది.

గ్రంథం నుంచి గుండెకు,

పండితుడి నుంచి ప్రజకు,

శాసనం నుంచి జీవనానికి

తెలుగు నడక మార్చుకుంది

భాష పరమార్థం 

ఒకర్నొకరు ఆలింగనం చేసుకోవడానికి 

ఒక సజీవ సాధనమని నిరూపించింది!

ఆయన చేసిన ఈ నిస్వార్థ సేవకు గుర్తుగానే, గిడుగు వేంకట రామమూర్తి పంతులు గారి పుట్టినరోజైన ఆగస్టు 29ని "తెలుగు భాషా దినోత్సవం" గా మనం ఘనంగా జరుపుకుంటున్నాం.

గిడుగు వేంకట రామమూర్తి పంతులు గారు అక్షరాలను పండితుల సంకెళ్ళ నుండి విడిపించి, సామాన్యుల నాలుకలపై నాట్యం చేయించిన అక్షర యోధుడు. భాష అనేది చట్టాల చట్రంలో బందీ అయిన శిలాశాసనం కాదని, అది నిరంతరం ప్రవహించే జీవనది అని తన పోరాటం ద్వారా నిరూపించారు. ఆయన ఆచరించిన, ప్రాణం పోసిన వ్యావహారిక భాషా విప్లవమే నేడు ఆధునిక తెలుగు సాహిత్యానికీ, పత్రికారంగానికీ, మన నిత్య వ్యవహారానికీ ప్రాణవాయువుగా మారింది. తెలుగు భాష ఎప్పటికప్పుడు కొత్త పుంతలు తొక్కుతూ సజీవంగా ఉన్నంత కాలం... 'పల్లె పలుకుకు పట్టం కట్టిన' గిడుగు వారి పేరు తెలుగు వారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతుంది.

నేటి ఆంగ్ల ప్రభావాన్ని, నాటి గ్రాంథిక భాషా వాదంతో పోల్చడం సముచితం కాదు. ఆ రెండు పరిణామాల వెనుక ఉన్న కారణాలు, భాషపై అవి చూపే ప్రభావం పూర్తిగా భిన్నమైనవి. ఆ వ్యత్యాసాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవాలి.

గ్రాంథిక-వ్యావహారిక వివాదం అనేది తెలుగు భాషకు సంబంధించిన ఒక అంతర్గత సమస్య. కఠినమైన పాత తెలుగు వాడాలా? లేక సామాన్యులు మాట్లాడే సజీవమైన వాడుక తెలుగు వాడాలా? అన్నది అప్పటి ప్రధానాంశం. అందులో భాషకు ఎటువంటి ముప్పు లేదు, కేవలం 'శైలి' గురించిన ఘర్షణ మాత్రమే. కానీ, నేటి ఆంగ్ల ప్రభావం అనేది ఒక పరాయి భాష మన మాతృభాషను క్రమంగా ఆక్రమిస్తూ, దాన్ని కనుమరుగు చేస్తున్న పరిణామం.

గ్రాంథిక వాదాన్ని కేవలం కొద్దిమంది ఉద్దండ పండితులు తమ ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడానికి, చదువును సామాన్యులకు దూరం చేయడానికి ప్రయోగించారు. ఇది పైనుండి కిందికి రుద్దబడిన నియమం (Top-down approach) కానీ,నేడు ఆంగ్ల భాష పట్ల ఉన్న మోజు పండితుల వల్ల రాలేదు. అది ప్రపంచీకరణ, ఉపాధి అవకాశాలు, సామాజిక హోదా కోసం సామాన్య ప్రజలే స్వచ్ఛందంగా ఎంచుకుంటున్న మార్గం (Bottom-up approach). అప్పట్లో పండితులు ప్రజల భాషను తిరస్కరిస్తే, ఇప్పుడు ప్రజలే తమ మాతృభాషను పక్కనపెడుతున్నారు.

గ్రాంథిక వాదులు తెలుగు భాషకు ఎలాంటి వ్యాకరణ దోషాలు ఉండకూడదని, ప్రాచీన నియమాలతో అత్యంత స్వచ్ఛంగా ఉండాలని పట్టుబట్టారు. కానీ, నేటి ఆంగ్ల ప్రభావం వల్ల తెలుగు 'టెంగ్లిష్' గా మారిపోయి ఒక సంకర భాషలా తయారవుతోంది. తెలుగు వాక్య నిర్మాణం, సహజమైన నుడికారం, భాషా సౌందర్యం పూర్తిగా దెబ్బతింటున్నాయి.


గ్రాంథిక భాష కఠినంగా ఉండటం వల్ల సామాన్యులు చదువుకోలేకపోయారు, అదొక అవరోధంగా నిలిచింది. కానీ, ఆంగ్ల ప్రభావం అనేది భాషను చంపడమే కాకుండా, మన ఆలోచనా విధానాన్ని, సంస్కృతిని కూడా మార్చేస్తోందనే ఆందోళన వ్యక్తమవుతోంది. మాతృభాషలో ఆలోచించే శక్తిని దూరం చేస్తోంది. గ్రాంథిక భాష అనేది తెలుగు అనే జీవనదికి అడ్డుపడిన ఒక పెద్ద 'బండరాయి' లాంటిది. గిడుగు వేంకట రామమూర్తి గారు ఆ బండరాయిని తొలగించి నదిని సాఫీగా ప్రవహించేలా చేశారు. కానీ, నేటి మితిమీరిన ఆంగ్ల ప్రభావం అనేది ఆ నది ప్రవాహాన్నే వేరేవైపు మళ్లించే లేదా పూర్తిగా ఎండగట్టేసే ఒక ప్రమాదకరమైన 'కట్ట' లాంటిది. గ్రాంథిక వాదం భాష సహజ ఎదుగుదలను కొన్నాళ్లు ఆపితే, నేటి ఆంగ్ల ఆధిపత్యం అసలు తెలుగు భాష అస్తిత్వాన్నే ప్రశ్నిస్తోంది. కాబట్టి ఈ రెండూ ఏమాత్రం ఒక లాంటివి కావు.

ఈనాటి మారుతున్న పరిస్థితుల్లో ఆంగ్ల పదాలు మన నిత్య వ్యవహారంలో కలిసిపోవడం వాడుక తెలుగు వ్యాప్తికి పూర్తిగా అడ్డంకి కాకపోవచ్చు; ఒకరకంగా అవసరమైన సాంకేతిక, ఆధునిక పదాలను స్వీకరించడం ద్వారా మన వ్యావహారిక భాష మరింత సౌకర్యవంతంగా విస్తరిస్తుంది. అయితే, ఈ కలయికకు ఎక్కడ హద్దులు గీసుకోవాలో, ఏది పరిమితులో స్పష్టంగా గుర్తించకపోతే మాత్రం అది మన మాతృభాషకే తీరని ముప్పుగా పరిణమిస్తుందనేది ఒక తీవ్రమైన హెచ్చరిక. ప్రాథమిక భావోద్వేగాలకు, నిత్యకృత్యాలకు, అందమైన దేశీయ పదాలకు సైతం ఆంగ్లాన్నే ఆశ్రయించడం వల్ల తెలుగు భాష తన సహజ నుడికారాన్ని కోల్పోయి, కేవలం ఒక 'అనువాద భాష'గా మిగిలిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి, ఆంగ్లాన్ని కేవలం ఒక వృత్తిపరమైన, సమాచార మార్పిడి సాధనంగా మాత్రమే పరిమితం చేసుకుంటూ, మన సంస్కృతికి, ఆలోచనలకు, ఆత్మకు ప్రతిరూపమైన తెలుగు భాషా స్వభావాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యతను ప్రతి ఒక్కరూ గుర్తించాలి.


  • డా.దార్ల వెంకటేశ్వరరావు, 26.8.2026

సాహిత్య లహరి వారి గిడుగు వేంకట రామమూర్తి పంతులు గారి ప్రత్యేక సంచిక 2026 సౌజన్యంతో