"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. మీ డిసర్టేషన్ కోసం అంశాన్ని త్వరగా ఎంపిక చేసుకోవాలి

15 March, 2010

ఇది నిరంతర గెలుపు - ఓటమిల అన్వేషణ తత్వం

-డా.దార్ల వెంకటేశ్వరరావు

అసిస్టెంటు ప్రొఫెసరు, తెలుగు శాఖ,

హైదరాబాదు విశ్వవిద్యాలయం, హైదరాబాదు.

ఫోను: 9989628049, 2313 3563 ( ఆఫీసు)

Email: vrdarla@gmail.com

కొన్ని రచనలు మనల్ని వెంటాడుతుంటాయి. అలాంటి వాటిలో డా. కేశవరెడ్డి రాసిన " అతడు అడవిని జయించాడు'నవలిక ఒకటి. అది చదివిన తర్వాత అతడు ఓడిపోతే విజయం సాధించినట్లుగా పేరు పెట్టారేమిటనిపిస్తుంటుంది. దాన్ని లోతుగా ఆలోచిస్తే గాని తెలిసేవిషయం కాదనిపిస్తుంది. ఇప్పటికే దీనిపై అనేక వ్యాసాలు వచ్చినా, దీన్ని చదివినప్పుడల్లా మళ్ళీ మళ్ళీ ఏదో చెప్పాలనే అనిపిస్తుంటుంది. రచనలో, శైలిలో అలాంటిదేదో ఉంది.

ఆదిమ సమాజం నుండీ నేటి ఆధునిక సమాజం వరకూ మానవుడు ప్రకృతితో విడదీయరాని అనుబంధాన్ని పెనవేసుకున్నాడు. తన జననం, మరణం, తర్వాత జీవితం ఉంటుందా? లేదా? మొదలైన వాటిని అన్నింటినీ నేటి వరకూ మానవుడు ఆధ్యాత్మిక, గతి తార్కిక భౌతిక వాద మార్గాల్లో అన్వేషిస్తూనే ఉన్నాడు. అన్వేషణలో అనేక సంఘర్షణలకు గురవుతూనే ఉన్నాడు. ఇలాంటి సంఘర్షణను కేవలం మనుష్యుల నుండే కాకుండా పశుపక్ష్యాదులు, ప్రకృతి బీభత్సాల నుండీ ఎదుర్కొంటున్నాడు. డా.కేశవరెడ్డి (b.1946) అతడు అడవిని జయించాడు (1984) నవలికలో ఒక గిరిజనుణ్ణి కేంద్రంగా చేసి మానవుడు తన అస్తిత్త్వం కోసం చేసిన పోరాటాన్నీ, అతను సాగించే జీవితాన్వేషణ లక్ష్యాన్నీ అందించే ప్రయత్నం చేశాడు.

ఆంగ్లంలో Hemingway (1899 - 1961) రాసిన ""The Old Man And The Sea'' (1952) నవలికలో కథా నాయకుడు చేపలు పట్టే వృత్తికి చెందిన ఒక ముసలివాడు. సముద్రం, చేప, ఒక బాలుడు నవలా కథనంలో కనిపిస్తారు.

అతడు అడవిని జయించాడులో తన మనవడు అడవిలో మేపుకొచ్చిన పందుల్లో నెలలు నిండిన ఒక సుక్క పంది తిరిగిరాలేదని ఒక ముసలివాడు గమనిస్తాడు. ఈనబోయే పంది అడవిలోకి వెళ్ళి ఏటో మాయమైపోతుంది. పందిని, దాని పిల్లల్నీ గుంట నక్కలు, రాబందుల నుండి రక్షించడానికి చేసిన ప్రయత్నమే నవలిక నిండా కనిపిస్తుంది.

పైన పేర్కొన్న ఆంగ్ల నవలికను అంతకు ముందే చదివిన వాళ్ళకు ఇది అనుసరణేమో అనే అభిప్రాయం కలుగుతుంది.

డా.కేశవరెడ్డి తన నవలిక రాయడానికి ఆంగ్ల ""నవలా శిల్పాన్ని తీసుకున్నానని'' చెప్పుకున్నాడు. (ముందుమాట. 1985 : iv ) అంటే, వస్తువు అందులోది కాదని చెప్పినట్లయ్యింది.

రెండు నవలికల్లోనూ మానవ సంఘర్షణ, జీవితాన్వేషణ, ప్రకృతితో మమేకమవుతూనే అవసరమైనంత వరకూ దానితోనూ సంఘర్షణ పడటమే కనిపిస్తుంది. అయితే, వీటిని సృజనీకరించడంలో, కథను నడపడంలో రెండింటిలోనూ చాలా వ్యత్యాసాలు ఉన్నాయి. కానీ, సన్నివేశాల్ని చిత్రించడంలో, కథానాయకుణ్ణి ఎన్నుకోవడంలో డా. కేశవరెడ్డి ప్రతిభ ప్రత్యేకంగా కనిపిస్తుంది. కథానాయకుడు

గిరిజనులలోని ఎరుకల తెగకు చెందినవాడు. అతని వృత్తి, ప్రవృత్తి పందుల్ని మేపుకోవడమే. అతనికి పందులతో విడదీయరాని అనుబంధం ఉంది.

భారతీయ కావ్యశాస్త్రం ( Indian Poetics) లో కింది వర్గం లేదా కులానికి చెందిన వ్యక్తిని కావ్య నాయకుడిగా చేసిన లక్షణాలు కనపడవు. నవలిక భారతీయ కావ్య శాస్త్ర లక్షణ పరిధుల్ని దాటి ఆధునిక సాహిత్య లక్షణాల్ని సంతరించుకున్న ప్రక్రియ. అయినప్పటికీ కథానాయకుడిగా భారతీయ సమాజంలో అత్యంత దిగువ స్థాయిలో ఉన్న వ్యక్తిని ఎన్నుకోవడంలోనే రచయితలో కనిపించే సామాజిక చైతన్యాన్ని తెలుపుతుంది. ఇది నవలికలో కనిపించే ఒక ప్రత్యేక అంశం. దీన్నినేటివిటి అంటారు.

నవలిక గురించి రాస్తూ ఎమ్‌. శ్రీధర్హేమింగ్వే రాసిన రచనలో పురుష దృక్పథానికి ప్రాధాన్యత ఉంటే, దీనిలో స్త్రీమనస్తత్వం ఉందన్నారు. అలాగే ప్రకృతితో మమేకమైన మానవుని సంఘర్షణ, అడివి స్వభావాన్ని గుర్తించడంలో కనిపించే అనేకాంశాల్ని బట్టి eco touched novel గా చెప్పవచ్చని అన్నారు. కానీ, వాటిని తన పత్రంలో భిన్నంగా వివరించారు.

"" రెండు నవలికల్లో కొట్టొచ్చినట్లు కబడే ఒక ముఖ్య విషయం ఇద్దరు రచయితలూ తమ ప్రధాన పాత్రల లింగస్వరూపాల్ని తీర్చిదిద్దడంలో కనబడుతుంది. హెమింగ్వే మగచేపను సృష్టిస్తాడు....సముద్రానికి ఆడతనాన్ని ఆపాదిస్తాడు.. నక్కలు చెరొక పందినీ నోటకరిపించుకుని పరుగులిడుతున్న నక్కలను చూడగానే ముసలివాడు కడుపు మీద రోకలిపోటు తగిలిన నిండు చూలాలి వలె ఆరిచాడ''ని నవలలోని వర్ణను ఉదాహరించారు. ( చూడు: "" కేశవరెడ్డి హెమింగ్వే ను ఇంగ్లీషులో చదవడమా' ' ఆదివారం వార్త, 23-1-2000, పుట: 26)

కానీ, నా అభిప్రాయంలో ముసలివాడిలో కంటే, సుక్క పందిలోనే స్త్రీ మనస్తత్త్వాన్ని చూడవచ్చనిపిస్తుంది. పంది తన పిల్లల్ని కాపాడుకోవడంలో అది కనిపిస్తుందనిపించింది. తన పిల్లల్ని కాపాడుకునే ప్రయత్నంలో తననెంతగానో ఇష్టపడి, తనని రక్షించాలని వచ్చిన యజమానిని కూడా దగ్గరకు రానివ్వలేదు. మానవ సంబంధాల్లోనూ ప్రవృత్తి కనిపిస్తుంది.

ఒకప్పటి పిల్లలే కొన్నాళ్ళ తర్వాత తల్లిదండ్రులవుతారు. దానితో వారి ప్రాధాన్యతా క్రమాలు మారిపోతుంటాయి. అలాగని అంతకు ముందున్న సంబంధాలు తెగిపోయినట్లు కాదు. పంది యజమానిపై తిరగబడ్డంలో కనిపించే వైరుధ్యం ఇటువంటిదే. దీన్ని సహజమైన మాతృవాత్సల్యంలో కనిపించే స్త్రీమనస్తత్వంగా చెప్పడం రచయిత డా.కేశవరెడ్డి ప్రత్యేకత. హెమింగ్వే చేప ద్వారా చెప్పలేని విషయాన్ని ఇక్కడ ఒక సుక్కపంది ద్వారా స్ఫురింపచేయగలిగాడు.

ఇది తర్వాత డా. కేశవరెడ్డి రాసిన "" మునెమ్మ'' (2008) నవలికలో ఒక సాధారణ స్త్రీ అసాధారణ శక్తిని ప్రదర్శించే పరిణామానికి దారితీసేలా పరిణమించిందనవచ్చేమో. అయితే మునెమ్మ మాతృత్వం రూపంలో కాకుండా శక్తి స్వరూపిణిగా కనిపిస్తుంది. సుక్క పంది తన పిల్లల్ని కాపాడుకునే క్రమంలో అడవిలోకి పారిపోయింది. దాన్ని రక్షించాల్ని వెళ్ళిన ముసలివాడు దాన్నీ చంపేసి, కనీసం పిల్లల్నైనా కాపాడాలనుకుంటాడు. మునెమ్మ నవలికలో తన భర్తను చంపిన వాళ్ళను ఒక పరిశోధకురాలిలా అన్వేషిస్తుంది.రచయితకు తెలిసో తెలియకో సుక్కపందిగా సాధించలేని స్త్రీ శక్తిని మునెమ్మలో చూపేలా చేశాడనిపిస్తుంది. రచయిత నవలికల్లో అన్నింటిలో కొన్ని కొనసాగుతూ ఉంటాయి. అందువల్ల దీన్ని ఇలా ఊహించే అవకాశం ఉంది.

ఇక మరో అంశం ఇకో టచ్డ్నవలిక గా నిరూపించడం.

1872లో నరహరి గోపాల కృష్ణమ శెట్టి (1833 - 1885 ) రాసిన " "శ్రీరంగరాజ చరిత్ర (సోనాబాయి పరిణయము)'' లో కొంత వరకు గిరిజన జీవితాన్ని చిత్రించినా, అడవికి సంబంధించిన విషయాల్ని వివరించడంలో "" అతడు అడవిని జయించాడు '' నవలికలో ఉన్నంత లోతైన పరిశీలన లేదు.

"" బండల వంటి అతని పాదాలను బలసముండ్లు బాధించడం లేదు. కాసేరాకు దురదకలిగించడం లేదు'' ( HBT ప్రచురణ, 2009: 22) అనడంలో అడవిలో ఉండే ముళ్ళ పొదల్నీ, రకరకాలైన ఆకుల్నీ వివరిస్తూనే, వాటి స్వభావాన్ని తన అన్వేషణ అధిగమిస్తున్నట్లు వివరించాడు రచయిత.

ఇలాంటివే మరికొన్ని గమనించవచ్చు.

"" తీగలెయ్యటం నేను చూడలా. ఈత పొదలో పడుకుని మూలగతా కొంచేపుండి లేసొచ్చేసింది. పైగా నువ్వే సెప్తా ఉంటివి గదా - పవర్నం నాటికో పవర్నం ముందు నాటికో ఈనేస్తాదని'' ( HBT ప్రచురణ, 2009 : 11)

""ఇక నేను జాగ్రత్తగా ఉండాలి. అడవిలో క్రూర మృగాలు వేటకు బయలు దేరే సమయమయింది. పైగా ఇది చిత్రి నెల'' ( HBT ప్రచురణ, 2009 : 47)

"" నక్కలు, తోడేళ్ళు మొదలైన వాటికి వేసవి ఈత కాలం... మగ నక్కలు ఋతువులో రెట్టింపు ఆహారాన్వేషణ సాగిస్తాయి. అన్వేషణలో అవి ఎంత సాహసానికైనా పూనుకుంటాయి'' ( HBT ప్రచురణ, 2009: 47)

కేవలం పర్యావరణ విషయాల్ని ప్రస్తావించడమే కాకుండా, వాటితో మానవుడు మమేకమైన స్థితినీ, దాన్ని కథతో విడదీయరానంత పటిష్టమైన నిర్మాణంగానూ రచనలో పొందుపరిచాడు. పంది పాదముద్రల్ని గుర్తించేటప్పుడూ, తోటి గువ్వ అరుపుల్లోనూ, కుందేలు, నక్కల్ని చంపడంలోనూ, పంది స్వభావాన్ని అర్థం చేసుకోవడంలోనూ ఇటువంటి లోతైన పర్యావరణ జ్ఞానం కనిపిస్తుంది. అందువల్ల దీన్ని eco touched novel గా చెప్పుకోవడం సమంజసమే అనిపిస్తుంది.

దీన్నిక్కడ నవల అని పేర్కొన్నా, అది ప్రధానంగా సైజుని, తీసుకునే పాత్రల చిత్రణని బట్టి నిర్ణయిస్తుటారు. కానీ, నవల, నవలికకు తెలుగులో పెద్ద వ్యత్సాసాన్ని చూపిస్తున్న వాళ్ళు చాలా అరుదు. అందువల్ల దీన్ని నవల అని కూడా అనవచ్చు.

వినుకొండ నాగరాజు రాసిన "" ఊబిలో దున్న '' ( 1970) (యం.శేషాచలం అండ్కో, మచిలీపట్నం, మద్రాసు, సికింద్రాబాదు) నవలలో వివిధ జంతువుల్నీ, పర్యావరణ విషయాల్ని ప్రస్తావించినా, వాటిని వివరించడంలో నవలికకు పోటీ రాదు. ఒక్క మాటలో చెప్పాలంటే తెలుగు నవలా సాహిత్యంలో ప్రకృతిని ఇంత లోతుగా పరిశీలించిన నవల లేదు. అందువల్ల దీన్ని మొట్టమొదటి echo touched novel గా అభివర్ణించుకోవడం మరో విశేషమే అవుతుంది.

వీటితో పాటు నవలికలో ప్రస్తావించిన ""చెట్లు'' అన్నీ ఒకేరకంగా అర్థం చేసుకునే చెట్లు కాదు. కొన్నింటిని చెట్లని పిలిచినా, అవి చిన్న చిన్న మొక్కలు మాత్రమే. అటువంటి వాటిలో వెంపలి చెట్లు ( HBT ప్రచురణ, 2009: 12), కిచ్చిలి చెట్లు ( HBT ప్రచురణ, 2009: 25), సుంక్రేసు చెట్లు ( HBT ప్రచురణ, 2009: 33) మొదలైన వన్నీ ఒకే రకమైన స్వరూప స్వభావానికి చెందినవి కాదు.

రచయిత మొదటి ప్రచురణకు ముందు మాటలో వివరిస్తాడు "" అతడు ఎక్కి కూర్చున్న చెట్టు సుంక్రేసు చెట్టు. దాని కొమ్మలు చాలా పెళుసుగా ఉంటాయి'' ( మొదటి ముద్రణ, 1985 : V)

నవలిక పర భాషల్లోకి అనువాదమైనా ఇవన్నీ భారతీయతను, తెలుగు తనాన్నీ నిలిపే ప్రత్యేక నేటివిటీకి సంబంధించిన అంశాలు. అందువల్ల హెమింగ్వే నవల కంటే ఇది భిన్నమైందే అవుతుంది. ముసలివాడు స్నానం చేయకపోవడం, కుందేలు మాంసాన్ని తిన్న తర్వాత వాటి దుమ్ముల్ని పక్కకి పడేయడం, చేతుల్ని తన శరీరానికే తుడిసేసుకోవడం, అన్నింటికీ మించి గుడిసె నిర్మాణం వంటి వన్నీ గిరిజన సంస్కృతి రూపంలో నేటివిటీని పట్టిచ్చే అంశాలే.

కథాగమనంలో తన మనవడు అడవిలో పందుల్ని మేపి, గుడిసెకు వాటిని తోలుకొస్తాడు. అందులో సుక్కపంది కనిపించదు. అది రెండు మూడు రోజుల్లో ఈనబోయే సమయం. సమయంలో దాన్ని కనిపెట్టుకుని ఉండకపోతే అది ఎక్కడికైనా వెళ్ళిపోతుందని ముసలివాడికి తెలుసు. అందుకనే అతడు సుక్క పందికోసం ఆందోళన పడ్డాడు. మనవణ్ణి గుడిసె దగ్గర ఉండమని పందిని వెతకడానికి బయలు దేరతాడు.

సాయంత్రం తన నడకను ప్రారంభించి, రాత్రంతా దాన్ని వెతికి, అది ఉన్న పొదల్ని గుర్తించి, అడవిలోని క్రూర జంతువులు, రాబంధుల నుండి పందినీ, దాని పిల్లల్నీ కాపాడే ప్రయత్నం చేస్తాడు. నక్కల నుండీ, రాబంధుల నుండీ పందినీ, దాని పిల్లల్నీ కాపాడాలని విశ్వప్రయత్నం చేసి విఫలం చెందుతాడు. తాను ఓడిపోయానని అనుకుంటూనే, తాను సాధించవలసింది ఇంకా ఉందనుకుంటూ, తెల్లవారగట్లకి తన గుడిసెకు చేరుకుంటాడు. మనవడు తన కోసం చూసి చూసి నిద్రపోయాడనుకుంటాడు. పిల్లవాడిని లేపకుండా గుడిసెలోకెళ్ళి నేలపై ఒరిగిపోతాడు.

బండి చప్పుడికి పిల్లాడు లేచి, ఏడుస్తూ తన తాత కాళ్ళదగ్గర కూర్చుంటాడు. కథని ఇలా ముగిస్తే, దీనిలో అతడు ఆడవిని ఎలా జయించినట్లవుతుంది?

ఇందులో తాను ఓడిపోయానని ముసలివాడు స్పష్టంగా చెప్తుంటే, దాన్ని అతని విజయంగా భావించేదెలా అనేది పాఠకులకు వచ్చే సందేహం. ఇది సీరియల్గానూ, పుస్తకరూపంలోనూ వస్తున్నప్పుడే పాఠకుల నుండి విశేషమైన స్పందన వచ్చింది.

వీరపల్లె వీణావాణి అనే పాఠకుని అభిప్రాయం ప్రకారం ""తన చుట్టూ ఆవరించిన శక్తులతో మానవుడు నిర్విరామంగా సాగించే పోరాటంలో గెలుపు, ఓటములనేవి నిజంగా పోరాట మార్గాన్ని బట్టి నిర్ణయింపబడతాయి తప్ప పోరాట ఫలితాన్ని బట్టి నిర్ణయింపబడవు. సంకల్ప బలంతో, చిత్తశుద్ధితో పరిపూర్ణమైన పట్టుదలతో ధర్మబద్ధంగా సాగించిన పోరాటంలో మనిషి ఓడిపోయినా విజేత క్రిందే పరిగణింపబడతాడు. ముసలివాడు చిత్తశుద్ధితో, సంకల్పబలంతో పట్టుదలంగా పోరాటం సాగించారు. అందుకే అతడు అడవితో ఓడిపోలేదు. అతడు అడవిని జయించాడు'' (మొదటి ముద్రణ, 1985 : 79)

మానవ జీవన బంధం కొనసాగాలంటే చక్రం కొనసాగాలి.

కథను జాగ్రత్తగా పరిశీలిస్తే నవలిక నిండా ?0అస్తిత్వ పోరాటం?0 కనిపిస్తుంది.

తన ఆకలి తీర్చుకోవడం కోసం ముసలివాడు ఆడవిలో మొదట ఒక కుందేలుని చంపి, దాన్ని ఆహారంగా మార్చుకున్నాడు. ఇది తన మనుగడ కోసం పోరాడే క్రమంలో భాగమే.

నక్కలు తన ఆహారం కోసం పంది దగ్గర కొచ్చి ప్రాణాలు కోల్పోయాయి.

రాబంధులు కూడా తాము బతకడం కోసమే పంది పిల్లల్ని ముక్కులతో పొడిచేశాయి. పంది పిల్లలు చనిపోతే, అవి తమకి ఆహారమవుతాయి.

ముసలివాడు తన మనవడి దగ్గర పంగ?లి కర్ర, జోలె, దానిలో కొన్ని పక్షుల్ని గమనించినట్లు రచయిత నవలిక ప్రారంభంలోనే వర్ణించారు.

ఆహారాన్వేషణతోనే మానవ మనుగడ మొదలైంది. తాను బతకాలంటే, తానెదొకటి తినకతప్పదు. అప్పటికప్పడు ముసలివాడు తన ఆహారాన్ని సమకూర్చుకోవడానికి ఆదిమ సమాజంలోని మానవుడిలా మారిపోతాడు. కుందేలుని తన తెలివితేటలతో బంధించి, తన దగ్గరున్న ఈటెతో చంపుతాడు. అగ్గిని

అప్పటికప్పుడు పుట్టించి దానిలో కాల్చుకుంటాడు.

ఇది మానవుని భౌతిక జీవన పరిణామ దశ.

ఇదే ఆధ్యాత్మిక దృష్టితో రచన కొనసాగి ఉంటే మరోలా ఉండేది.

తప్పస్సు చేసేవాడు. భగవంతుడే అమాంతంగా ఒక బాటసారి రూపంలో ప్రత్యక్షమయ్యేవాడు. ఆహారాన్నిచ్చేసి మాయమైపోయేవాడు.

ఇక్కడ అలా జరగలేదు. మానవ జీవన పరిణామాన్ని వాస్తవిక దృక్పథంలో చిత్రించాడు రచయిత.

జీవనపరిణామ దశలో మనిషి గానీ పశుపక్ష్యాదులు గానీ కేవలం తినడానికే బతుకుతున్నారనుకోలేం. అంతర్లీనంగా తామేదో సాధించాలనుకోవడం సహజం. సాధించాల్సిందేమిటో తెలిసిపోతే ఇక అన్వేషణే ఆగిపోతుంది. అదే నవలిక నిండా పరుచుకుని ఉంది. అంశమే నవలికను సార్వజనీనం చేస్తుంది. అలాగని దేశీయత లేదని కాదు. ఊహల్లోని వ్యక్తిని తీసుకొచ్చి కథను నడిపించలేదు.

కథను భారతీయ సమాజం నుండి నడిపిస్తూ విశ్వజనీనం చేశాడు. కుల, వర్గాలతో నిండిన భారతీయ సమాజంలోనే గిరిజనులు లేరు. ప్రపంచ వ్యాప్తంగా గిరిజనులు ఉన్నారు. కానీ, భారతదేశంలోని అనేక గిరిజన తెగల్లో గల ఎరుకల తెగను ఎన్నుకున్నాడు. కథలో సుగాలీలు, చెంచు తెగల్ని కూడా ప్రస్తావించడం కనిపిస్తుంది. పందుల్ని పెంచడం వృత్తిగా గల వాళ్ళు ఎరుకల వాళ్ళే. వీరితో పాటు మరికొంత మంది వాటిని పెంచినా, అది వారి వంశ పారంపర్య సంక్రమిత వృత్తి కాదు. ఇలా ఎరుకలను ఎన్నుకోవడంలో రచయిత తన రచనలో నేటివిటీని సాధించగలిగాడు.

నేటివిటీ ముసలివాడి పాత్రగతంగా కొటేషన్ల రూపంలో చెప్పిన కొన్ని అభిప్రాయాల్లో కనిపించదు. అటువంటప్పుడు అక్కడ కనిపించేది రచయిత ప్రతిపాదించే అన్వేషణ తత్త్వమే అయివుంటుంది. వీటితో పాటు అప్పుడప్పుడూ మహాభారతంలో సైరంద్రీ, భీముడు, కురుక్షేత్ర యుద్ధం ( HBT ప్రచురణ, 2009 : 26, 54, 74) వంటి వాటి గురించి ముసలివాడి ఆలోచనా ధారగా రచయిత చెప్తుంటాడు. పందుల్ని మేపుకొచ్చిన మనవడు గోపాల్తో ముసలివాడు ఇలా అంటాడు.

"" ఇంటికి యాడొచ్చింది. ఇంతసేపు ఇంటి కాడనే ఉండినా. చూసి చూసి సాలైపోయి యలబారి ఇట్టోచ్చినా '' ( HBT ప్రచురణ, 2009: 11) ముసలివాడి మాటల్లో సహజత్వం కనిపిస్తుంది.

ముసలివాడు తనలో తానుగా అనుకున్నట్లు రచయిత రాసిన కింది కొటేషన్స్లో చెప్పిన అభిప్రాయాల్లో జీవిత సారాన్ని పిండినట్లుంది.

"" అడవి నిగూఢమైనది. అనుభవానికీ, మేధస్సుకీ అంతు చిక్కని రహస్యాలు ఇక్కడ చాలా ఉన్నాయి '' ( HBT ప్రచురణ, 2009: 16)

"" నాగరికుడైన ఒక మానవుని సుఖ దు:ఖాలు ఒక మొరటు జంతువుపై ఆధారపడి ఉండడం ఎంత విచిత్రం! జీవితం నానా విధాలైన వైరుధ్యాలతో నిండి ఉంది'' ( HBT ప్రచురణ, 2009: 61)

"" మానవుడూ పరిపూర్ణంగా అదృష్టవంతుడు కాదు. మానవుడూ తను వేలు పెట్టిన చోటల్లా విజయుడై రాలేడు. జయాపజయాల సమన్వయ భావమే జీవితం. కన్నీళ్ళు దు: భారాన్ని తగ్గించినట్టుగా సమన్వయ భావం ఓటమిలో ఊరటనిస్తుంది '' ( HBT ప్రచురణ, 2009: 78, 79) పై కొటేషన్స్లో భాష, భావం ఒక గిరిజన వ్యక్తి మాట్లాడుతున్నట్లు లేవు. ఒక ఫిలాసఫర్మాట్లాడుతున్నట్లున్నాయి.

నవలికలో రచయిత ప్రయోగించిన కొటేషన్ల గురించి సంజీవ్దేవ్ఇలా అభిప్రాయ పడ్డారు.

"" కొటేషన్మార్కుల మధ్య ఉన్న మాటలు రచయితవి అయి వుండవు, ముసలివాడివి అయి వుండాలి... అక్షరజ్ఞానం లేని ఆటవిక స్వభావి అయిన ముసలివాడికి అటువంటి మాటలు తెలుసా అని!''

విషయంలో గిరిజనుడికి అన్ని తెలివి తేటలు ఉండవా? అనీ, అది గిరిజనుడి ఫిలాసఫీగా నే గుర్తించాలని పత్ర సమర్పణ సందర్భంలో జరిగిన చర్చలో కొందరు అభిప్రాయపడ్డారు.

గిరిజనుడి జ్ఞానాన్ని తక్కువ చేయడంగా కాకుండా, అది రచయిత ఒక లక్ష్యం కోసం చెప్పిన తాత్త్వక విషయాలుగానే గుర్తించాలని నా అభిప్రాయం. ( చూడు: దీనిపై జరిగిన చర్చను వ్యాసానికి కింద ఇస్తున్నాను)

నవలికకు ముందుమాట ( HBT ప్రచురణ, 2009: vii) గా ప్రచురించిన వ్యాసంలో శ్రీనివాస ప్రసాద్ఇలా వ్యాఖ్యానించారు.

""వృద్ధాప్యం - బాల్యం; జంతువు-మనిషి; ప్రకృతి- సంస్కృతి; నాగరికం-ఆటవికం; మృత్యువు- జననం; సౌందర్యం - నైచ్యం; వాత్యల్యం - క్రౌర్యం; అస్వస్థత - ఉత్సాహం; జడత్వం - చైతన్యం; మౌనం - శబ్దం; విజయం - అపజయం.... మొదలైన జంట వైరుధ్యాలు, ద్వైదీభావాలు, మనిషి జీవితం తాలుకు సంక్లిష్ట మార్మికతను ఆవిష్కరిస్తాయి'' ( HBT ప్రచురణ, 2009 : )

పరిణామాన్ని, సంఘర్షణనూ భావవాదంతో కాకుండా, గతితార్కిక భౌతిక వాదంతో అందించే ప్రయత్నంగా నవలికను రాశాడు. అందువల్లనే "" చలనము, పరిణామము జీవగర్రలుగా మనిన సృష్టి, చివరకు శూన్యంలో లీనమైనట్లు అత్యంత ప్రచండమైన అనుభవ పరంపరలతో నడిచిన జీవితం గూడా చివరకు జడత్వానికి లోనుగాక తప్పదేమో'' (HBT ప్రచురణ, 2009 : vii ) అని ముసలివాడిలోని ప్రత్యణువు తడిమిందని రచయితే చెప్తాడు.

దీన్ని బట్టి కూడా నవలికలో మానవ జీవితాన్వేషణను అందించే ప్రయత్నం చేసినట్లు భావించవచ్చు.

మానవుడు తన లక్ష్యాన్ని చేరుకోవడానికి నిత్యం చైతన్యవంతుడై ఉండాలి. కష్టనష్టాలకు కుమిలిపోకుండా గతంలో తాను సాధించిన విజయాలను తలచుకుంటూ ముందుకు పోవాలి. ముసలివాడిలో అదే ప్రతీ సన్నివేశంలోనూ చిత్రించాడు. తాను యువకుడిగా ఉన్నప్పుడు, మంచి బలమై శరీర పటుత్వంలో ఉన్నప్పుడు సాధించిన విజయాలను నిరంతరం తలచుకుంటుండేవాడు. తాను కొన్నాళ్ళ పాటు ఒంటరిగా అడవిలో జంతువులతో సహజీవనం చేస్తూ పశువుల్ని మేపిన విజయగాథల్ని గుర్తుచేసుకునేవాడు. వాటితో పోలిస్తే ఒక అర్థ రాత్రి పందిని వెతకడం, దాన్ని వెతికే క్రమంలో క్రూర జంతువులు ఎదురైనా పోరాడ్డానికి శక్తిని కూడబెట్టుకోగలగడం గొప్ప విషయమే కాదనుకున్నాడు. కానీ, చివరికి యుద్ధంలో తాను ఓడిపోయానని భావించాడు. అది నిజంగ? ఓడిపోవడం కాదు.

ఆదిమ సమాజం నుండీ మానవుడు సాధించిన పురోభివృద్ధిలో ఎన్ని ఆటుపోట్లకు గురికాలేదు.

శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఒకటి రెండు అపజయాలు ఎదురైనా, వాటితో కుంగిపోకుండా గతకాలంలో మానవుడు సాధించిన విజయాలను తలచుకుంటూనే, భవిష్యత్తులోకి దూసుకుపోవాలి. దాన్ని సాధించడంలో అనేక అపజయాలు ఎదురుకావచ్చు. అయినంత మాత్రం చేత మొత్తం మనిషి పరాజయం పొందినట్లు కాదు. తాను సాధించలేనిది. తన తర్వాత తరం సాధిస్తుందనే నమ్మకం ఉండాలి. నమ్మకమే ముసలివాడిలో తాను ఓడిపోయాననుకుని కూడా, ఇంకా తాను సాధించాల్సింది ఉందని గుడిసెకు బయలుదేరడంలో కనిపించింది.

నవలికలో ప్రారంభంలో పంగలి కర్ర, భుజం మీద వేలాడుతున్న జోలెలో పిట్టలను వీటికి సూచనగా సన్నివేశాన్ని చిత్రించాడనిపిస్తుంది. పందిపై దాడి చేయడానికి వస్తున్న నక్కల గుంపుని చూసినప్పుడు తన పంగల కర్రను, కొన్ని గులకరాళ్ళనీ తెచ్చుకోవాల్సిందనుకున్నాడు.

వెంటనే మనవడు జ్ఞాపకం వచ్చాడు. " "వాడు పంగల కర్రను ప్రయోగించడంలో అఖండుడు. వానికి గురినేర్పింది నేనే అనుకున్నాడు గర్వంగా. ఇంకాస్త కండ పట్టాక వానికి ఈటె నేర్పాలి..'' అనుకున్నాడతడు. ( HBT ప్రచురణ, 2009 : 68)

మానవుడు తాను నేర్చుకున్న విద్యను, తాను సంపాదించిన ఆస్తినీ తన తర్వాత తరం వాళ్ళకివ్వాలనుకుంటారు. వాటితో వాళ్ళు మరింతపురోగతిని సాధించగలుగుతారు. మానవ సమాజం అనుభవిస్తున్న అభివృద్ధి అంతా ఒక్కసారిగా జరిగింది కాదు. అనేక ఆటుపోట్లకు, అనేక కష్టనష్టాలకు గురైన తర్వాతనే సాధించ గలిగాం. తమ వైఫల్యాల్ని సరిచేసుకుంటూ, తాము సాధించిన విజయాల స్ఫూర్తితో ముందుకి వెళ్ళగలగాలి. ఇది ఆశావాదమే. ముసలి వాడు నక్కల్ని కొట్టడానికి పంగలి కర్ర, రాళ్ళు మర్చిపోవడం వైఫల్యం. దాన్ని తన మనవడికి తన అనుభవంగా తెలియజేసి, లక్ష్యసాధనకు ప్రేరేపిస్తాడనే సూచన ఉంది. తాను సాధించాల్సింది ఇంకా ఉందనడంలో గల అంతరార్థం అదే! అది కేవలం ముసలివాడు తన మనవడికి చెప్పేదే కాదు. మానవ సమాజానికి అంతటికీ చెప్పేది.

ముసలివాడి ఆస్తి తన కున్న విద్య. తనకు తెలిసిన వేట రహస్యాలు. అవి తన మనవడికి ఇవ్వాలనుకున్నాడు. అందుకే తాను ఓడిపోయాననుకున్నా, గుడిసెకు వేగంగా చేరుకోవాలనుకున్నాడు.

మానవ సమాజ పరిణామంలో ఇదే జరుగుతుంది. దీన్ని చెప్పడానికే అడవిని ఒక ప్రతీకగా తీసుకొని అతడు అడవిని జయించాడు నవలికను రాశాడు.

అందుకే ఇది మానవ జీవితాన్వేషణను గతితార్కిక భౌతిక దృక్పథంతో, భారతీయాత్మతో చెప్పిన నవలిక అవుతుంది.

" మహా ప్రపంచం అంతా అడవి. ఇందులో మనిషి అంతరాంతరాల్లో ఒంటరివాడు. ఆహారం, నిద్ర, భయం ఇత్యాదులు సర్వప్రాణి కోటికీ సమానంగా కావలసినవే. కాని వాటిని పొందడానికి మనిషి పడే అవస్థ ఒక్కొక్కరికి ఒక్కోలాగ వుంటుంది. జయాపజయాలు, కామ క్రోధాలు. లోభ మోహ మద మాత్సర్యాదులు, సుఖదు:ఖాలు అన్నీ మనిషి అనుభవించాల్సిందే. జీవన సంఘర్షణని, జీవనావసరాన్ని చెబుతూ, జీవనతత్వాన్ని ఒక భాష్యకారుడిలా, వేదాంతిలా, నిర్మోహమాటంగా, నిశ్చలంగా చెప్పడమే యీ "అతడు అడవిని జయించాడు'' ( ముందుమాట, మొదటి ముద్రణ, 1985) నవలికలో కనిపిస్తుంది అనే పురాణం సుబ్రహ్మణ్యశర్మ వ్యాఖ్య జీవత వాస్తవానికెంతో దగ్గరగా ఉంది.

తాను పందినీ, పంది పిల్లల్నీ రక్షించడం కోసం పడిన తపనే అతను సాధించిన విజయం; ఇంకా చెప్పాలంటే, అతను చేసిన జీవన పోరాటమంతా అతని విజయమే. అతని మనోసంకల్పంలో మానవ అస్తిత్వం వ్యక్తమయ్యింది. దానితో పాటు మానవ జీవనాన్వేషణలో కనిపించే ఆకాంక్షలకు ప్రతిఫలనమే చివరికి తన మనవడు దగ్గర వ్రాలిపోవడం. ముగింపులో ముసలివాడు జడత్వానికి చేరుకోగా, పిల్లాడు లేచి కాళ్ళ దగ్గర నిలబడడం వల్ల మళ్ళీ ముసలాడిలాగే జీవితాన్వేషణనను కొత్తగా ప్రారంభించబోతున్నాడనే సూచన ఉంది. కాబట్టి అతడు ఓడిపోలేదు. అతడు విజయం సాధించినట్లే భావించాలి. అతను విజయం సాధించడమంటే విశ్వమానవుడు లక్ష్యసాధనకు నిరంతరం అన్వేషిస్తున్నట్లే!

మొతం మీద నవలికలో ముసలివాడు మానవుని నిరంతరాన్వేషణకు ప్రతీక. అనుభవం రంగరించిన మానవుడి సామూహిక ఆలోచనకు అక్షరరూపంగా అనేక సార్లు రచయిత కొటేషన్స్రూపంలో అక్కడక్కడా అందించాడా? కనుక, కథలో చిత్రించిన ""అడవి'' ని కేవలం వాచ్యార్థంలోనే అర్థం చేసుకుంటే సరిపోదు. రచయిత ఒక నిగూఢమైన అర్థాన్ని ఆశించి ఉంటాడు.

మానవ పరిణామాన్ని అంతటినీ దీనిలో సూచించాలనుకున్నాడు. అందుకనే ప్రపంచాన్ని అంతటినీ""అడవి'' గాను; ముసలివాడు మానవుని అన్వేషణ జీవిగాను; పంది, దాని పిల్లల్ని మానవుడి సాధించాలనుకున్న లక్ష్యాలుగాను; అవి అందకుండా అడ్డుకున్న నక్కలు, రాబందులు ప్రకృతితో ఎదురయ్యే ఆటంకాలుగాను; అయినా తన ఆశయాన్ని విడవని బంధంగా మనవడినీ సమన్వయించుకోవచ్చు.

రిఫరెన్స్‌ :

1. కేశవ రెడ్డి. అతడు అడవిని జయించాడు . హైదరాబాదు: రీతిక పబ్లికేషన్స్‌.1985.

2. కేశవ రెడ్డి. అతడు అడవిని జయించాడు, మూగవాని పిల్లనగ్రోవి. ఆర్మూర్‌: నందిని పబ్లికేషన్స్‌. 2003

3. కేశవ రెడ్డి. అతడు అడవిని జయించాడు, హైదరాబాదు బుక్ట్రస్ట్, 2009

4. సుబ్రహ్మణ్యం శర్మ, పురాణం. " "కరక్కాయ పీఠిక''

(ముందుమాట, అతడు అడవిని జయించాడు ) హైదరాబాదు: రీతిక పబ్లికేషన్స్‌.1985.

5.సంజీవదేవ్‌. "" సింహావలోకనం'' (ముందుమాట, అతడు అడవిని జయించాడు) ,

హైదరాబాదు: రీతిక పబ్లికేషన్స్‌.1985.

6. ఎం.శ్రీధర్, కేశవరెడ్డి ""హెమింగ్వే ను ఇంగ్లీషులో చదవడమా?'' ( వ్యాసం),

అదివారం వార్త, 23 -1-2000, పుట: 26.

7. Hemingway,Ernest. 'The Old Man And The Sea'.

Penguion Books(N.Z.)Ltd, New Zealand.1952.

-------------

నా పరిశోధన పత్రం పై జరిగిన చర్చ:

అతడు అడవిని జయించాడు నవలలో ముసలివాడి మాటలుగా కొటేషన్స్లో కొన్ని వాక్యాలు ముసలివాడి

నేటివిటీకి చెందినవిగానూ, మరికొన్ని రచయిత చెప్పదలచుకున్న ఫిలాసఫీకి సంబంధించినవిగానూ ప్రతిపాదించాను. కానీ ఇంగ్లీష్అండ్ఫారిన్లాంగ్వేజెస్యూనివర్సిటికి చెందిన ఒక అసిస్టెంటు ప్రొఫెసర్‌ ..... మాట్లాడుతూ "" నవల్లో కథానాయకుడి సంభాషణల్ని అన్నీ అతనివిగానే భావించాలి. గిరిజనునికి అంత ఫిలాసఫీ ఉండదా?'' అని ప్రశ్నించారు.

కొన్ని సార్లు సామాన్య మానవుడు కూడా వేదాంత ధోరణిలో మాట్లాడతాడు. అది అతనికి వేదాంతం అని తెలియదు. మరి కొంతమంది లోతుల్ని తెలుసుకుని మాట్లాడతారు. వాళ్ళు మాట్లాడేది వేదాంతమో కాదో తెలిసి మాట్లాడతారు. ఇది చిన్నపిల్లాడు తెలియక పట్టుకున్న నిప్పు లాంటిది ఒకటైతే, మరొక పెద్దవాడు అది నిప్పని తెలిసి పట్టుకున్నట్లు ఉంటుందా ఫిలాసఫీ! అని చెప్పాను.

ఆచార్య బేతవోలు రామబ్రహ్మం గారు మాట్లాడుతూ కొటేషన్స్లో పెట్టి పాలిష్డ్లాంగ్వేజ్మాట్లాడిన వాటిని రచయిత ఫిలాసఫీగానే భావించాలి. అలాగని గిరిజనుని ఫిలాసఫీనీ తక్కువ చేసినట్లు కాదన్నారు.

వెంటనే జి.కళ్యాణరావు గారు చర్చలో కల్పించుకుంటూ, అసలైన పాలిష్డ్లాంగ్వేజ్గిరిజనుడిదే! మన లాంగ్వేజే అన్పాలిష్డ్‌. వాళ్ళదే స్వచ్ఛ మైన లాంగ్వేజ్అనే భావనతో మాట్లాడారు. అప్పుడే నా వైపుకి తిరిగి మనం ""గిరిజనుల ఫిలాసఫీని అలా వ్యాఖ్యానించకూడదు. మీరు దాన్ని మార్చుకోవాలి'' అన్నారు. ఇంకా ఆయనే కొనసాగిస్తూ ఫిలాసఫీ అన్నప్పుడు అందరిదీ ఫిలాసఫీగానే చూడాలి. ఫిలాసఫీ ఏదైనా ఫిలాసఫే అవుతుందన్నారు.

నాకు జి. కళ్యాణరావు గారి మీద చాలా గౌరవం పెరిగింది. కింది వర్గాలు, వర్ణాల ఆత్మగౌరవాన్ని నిలబెట్టేక్రమాన్ని వ్యాఖ్యాతలు, చరిత్రకారులు, విమర్శకుల పాత్ర చాలా ఉందనిపించింది.

ఇంకా చర్చలో ఓల్గా పాల్గొన్నారు. కొటేషన్స్లో ముసలివాడి రూపంలో చెప్పిన వాఖ్యాలు ఆలోచించదగినవి. వాటిని కేవలం గిరిజనుడివి గానో, రచయితవిగానో చూసేటప్పుడు నిశితపరిశీలన అవసరమన్నారు.

ఆచార్య కేతు విశ్వనాథరెడ్డి చర్చలో పాల్గొంటూ, వాటిని కేవలం రచయితగానో, గిరిజనుని మాటలు గానో మాత్రమే చెప్పేవీల్లేదు. అవి జీవితాన్వేషణకు చెందినవి''అని సమన్వయించారు.

అవి గిరిజనుని మాటలుగా చెప్పనంతమాత్రం చేత గిరిజనుల విజ్ఞానాన్ని తక్కువగా అంచనా వేసినట్లు కాదనీ, కానీ, ఒక విమర్శకుడిగా సత్యాన్ని విశదీకరించేటప్పుడు దానిలో ఉన్న సత్యాన్నే చెప్పేప్రయత్నం చేయాలి. అదే నేను నా పత్రంలో సమన్వయించే ప్రయత్నం చేశానని చెప్పాను.

( దీని సంక్షిప్త రూపం సూర్య దినపత్రిక 15-3-2010 న ప్రచురితమైంది.)


http://www.suryaa.com/main/showLiterature.asp?cat=6&subCat=1&ContentId=38400

2 comments:

Anonymous said...

నేను ౧౯౯౬లొ ఆ పుస్తకాన్ని చదువుతున్నప్పుడు నన్ను నేనే మరచిపోయాను, మొత్తం ఏకబిగిన చదివాను, ఆ కథలో ముసలి హీరోని నేనే అయిపోయాను.

జాన్‌హైడ్ కనుమూరి said...

అతడు అడవిని జయించాడో లేదో, రచయిత యేమి జయించాడో తెలియదు గాని, నేను అడవి లాంటి నా జీవిత పరిస్తిలను జయించాను. నేను మద్యపానాన్ని మానాలని ప్రయ్త్నం చేస్తున్న సమయంలో నేను ఈ పుస్తకాన్ని చ్దవటం జరిగింది. నలుగైదు సార్లు నేను ఈ నవలను చదివాను. అందులోని సంఘటనలను నాజీవితానికి అన్వయించుకున్నను. కొన్ని సార్లు ముసలివాని అనుభవాలు, కొన్నిసార్లు మూర్ఖపు పందిలాంటి పరిస్థితులలో నేను ఉన్నాననిపించింది. వాటినుంచి బయట పడటానికి నన్ను నేను పోరాటానికి సిద్దం చేసుకోవటం ఒక్కటే మార్గం కనిపించింది. చాలా సార్లు ఇలాంటి పరిస్థితి ఎదుర్కనటానికి చాలినంత ధైర్యం లేకపోవటంవల్ల ఆత్మహత్య చేసుకుంటుంటారు చాలామంది.
సాహిత్యంలో ఆత్మ కథను రాయగలిగినవారు ఏ రకమైన ప్రక్రియనైనా రాయగలరు అని ఎక్కడో చదివాను. అసలు ఆత్మకథ రాయటమంటే జరిగిపోయిన విషయాలను మననం చేసుకుని ముందుపరచుకోవడమే. అలా విషయాలను ముందు పరచుకున్నప్పుడు ఒక ప్రక్షాలన జరుగుతుంది. అందులోనుంచి కొత్త జవసత్వం పుట్టుకొస్తుంది. అలాంటిదే కొన్ని సన్నివేసాలు ఇందులో కనిపిస్తాయి. వాటిని ఆధరంచేసుకొని నేను కొంత ప్రక్షాలన పొందాను.
ఒక పుస్తకానికి ఇంతకన్నా సార్థకత ఏముంటుంది?