"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., Ph.D., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL 801 Research Methodology ఉదయం11.00 నుండి12.00 గంటల వరకు, TL-426: Indian Literature క్లాసులు మధ్యాహ్నం 2.00 గంటల నుండి 3.00 గంటల వరకు జరుగుతాయి.

ప్రజాకళ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
ప్రజాకళ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

31 అక్టోబర్, 2008

తెలంగాణా దళిత అంతర్మథన కవిత్వం ‘ఎగిలివారంగ’

(ఈ సమీక్ష ప్రజాకళ అక్టోబరు 2008 సంచికలో ప్రచురించింది. ఈ సమీక్ష పై కొంత మంది స్పందించారు. వాటిని కూడా ప్రజాకళ సౌజన్యంతోనే పాఠకుల సౌకర్యం కోసం సమీక్ష చివర పునర్ముద్రిస్తున్నాను.
సీతారాం గారు ఒక వాక్యాన్ని ప్రయోగించారు. "బతుకమ్మ పండగ మీద రచయతకు, సమీక్షకుడీకి అవగాహన లెదనుకుంతటాను" అనేది ఆయన వ్యాఖ్య. దీన్నే మరోలా చెప్తే బాగుండేది. "రచయితకూ, సమీక్షకుడికీ మరింత అవగాహన ఉంటే బాగుండేది" అని వాక్యాన్ని రాసుంటే సహృదయ వ్యాఖ్య అయ్యుండేది. అయినా ఆ ఉద్దేశంతోనే అలా రాసి ఉంటారని భావిస్తున్నాను. ఈ సమీక్షకుడిగా నా అవగాహనను ప్రశ్నించిన మీదట నేను దానికి సమాధానం అక్కడే ఇచ్చాను. తెలంగాణాలో జరిగే బతకమ్మ పండగ పట్ల నాకు అవగాహన ఉందనుకుంటున్నాను. దాని గురించి ఒక పరిశోధనే చేశాను. దళిత దృక్పథంతో రాశాను. అయినా నాది తెలంగాణా ప్రాంతం కాదు. కనుక, ఆ ప్రాంతానికి చెందిన వారి అనుభవాలను చెప్పినప్పుడు నేనెప్పుడూ వాటిని గౌరవిస్తాను. అలాగే మిగతా ప్రాంతాలవారి అభిప్రాయాలనూ గౌరవిస్తాను. మనం ఏ టోన్‌ తో చెప్తున్నామో గమనించి మన అభిప్రాయాన్ని వ్యక్తీకరించాలి. సీతారామ్‌ నాకు వ్యక్తి గతంగా తెలుసు. అలాంటి వ్యక్తి "అవగాహన " గురించి రాసేటప్పుడు ఇలాంటి వాక్యం రాయడంలో గల హడావిడిని అర్ధం చేసుకోవాలనిపిస్తుంది. స్పందించిన అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. ప్రజాకళకు మరీ ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే ఈ సమీక్షలో మార్క్సిస్టుల పట్ల తీవ్రమైన విమర్ష ఉంది. అయినా సమీక్ష కుడి అభిప్రాయాలను ప్రజాస్వామిక వాతావరణంగా గౌరవించి దీన్ని ప్రచురించారు. దీన్ని నాబ్లాగు ద్వారా కూడా నెట్ లో ప్రచురించుకోగలను. కానీ, ప్రజాకళ ద్వారా ప్రచురింపబడటం మరింత గౌరవంగా భావిస్తాను. ఆ హూందాతనాన్ని మరింతగా పెంచిన ప్రజాకళకు అభినందనలు తెలుపుతున్నాను. -దార్ల )





ఎగిలివారంగ కవి : పొన్నాల బాలయ్య



-డా//దార్ల వెంకటేశ్వరరావు
గతంలో తెలంగాణా ప్రాంతం నుండి వచ్చిన దళిత కవుల్లో కూడా అంబేద్కర్ భావజాలం కంటే, మార్క్సిస్టు భావాల పట్లే ఎక్కువ మమేకత్వం కనపడేది. కానీ, ఈ మధ్య కాలంలో ఆ ధోరణి కొంచెం కొంచెంగా తగ్గుముఖం పడుతుంది. అంబేద్కరిజమ్పై ఆసక్తి పెరుగుతుంది. స్థానీయతను ఆకాంక్షిస్తూనే, దళితుల ఆత్మగౌరవం అంబేద్కరిజమ్లోనే అంతర్భూతంగా ఉందనే సంగతిని గుర్తిస్తున్నారు.
ఈ నేపథ్యంతో పరిశీలిస్తే, చాలామంది తెలంగాణా దళిత కవులు పరిణామం ఈ దిశగా కొనసాగుతుందని స్పష్టమవుతుంది. ఇటీవల పొన్నాల బాలయ్య ‘ఎగిలి వారంగ’ పేరుతో తన కవితలన్నీ ఒక సంపుటిగా తెచ్చాడు. ‘పొద్దు పొడవాల’నేది ఆ కవితా సంపుటికి పెట్టిన పేరులోని అర్థం. దళిత సమస్యలెలా పరిష్కరించబడాలో, తెలంగాణా సమస్యనెలా పరిష్కరించుకోవాలో, వర్గీకరణ సమస్యనెలా అర్థం చేసుకోవాలో, మార్క్సిస్టు పోరాటాల్ని, ఆ పోరాటాల్లో బలైపోతున్న దళితుల జీవితాన్ని ఎలా బాగుచేసుకోవాలో, ప్రపంచీకరణ నుండి ఎలా రక్షించుకోవాలో, అన్నింటికీ మించి సంస్కృతినెలా కాపాడుకోవాలో వివరించే దిశగా ఆలోచించి ఒక కొత్త ‘పొద్దు పొడవాల’నే ఆకాంక్షను కవి ‘ఎగిలి వారంగ’ లో వ్యక్తం చేశాడు.
శక్తివంతమైన భావాన్ని, అంతేశక్తివంతంగా అందించగలగడమే కవిత్వం చేయడంలో కనిపించే శిల్పం. పొన్నాల బాలయ్య దాన్నింకా సాధన చేయవలసి ఉన్నా, తెలంగాణా పట్ల, ఆ ప్రాంతంలోని దళితుల పట్ల, మొత్తంగా ప్రజల ఆశల పట్ల స్పష్టమైన భావాలున్న కవి. వృత్తిరీత్యా హిందీ పండితుడైనా, తెలుగులో కవిత్వం రాస్తున్నందుకు ముందుగా ఆయన్ని అభినందించాలి. అలాగే, ఆ తెలుగులో కలిసిపోయిన మణి ప్రవాళ భాష గురించీ ఆలోచించమనాలి.
‘ఎగిలి వారంగ’ లో చిన్నప్పుడే చనిపోయిన తండ్రి స్మృతితో కవిత్వం ప్రారంభమౌతుంది. తన బాల్యమెంత విషాదకరంగా సాగిందో ‘ఎగిలివారంగ’ కవిత అనేక దృశ్య చిత్రాలతో చూపిస్తుంది. కవిత అంతా విడివిడిగా పదాలున్నట్లు ఉంటుంది. ఒకదానితో మరొక దానికి సంబంధం లేనట్లుంటుంది. తన బాల్యం కూడా ఒక పద్ధతి ప్రకారం కొనసాగలేదనీ, తనలాంటి వాళ్ళ బాల్యం కూడా అలాగే ఉందని కవి శిల్ప నైపుణ్యంతో చెప్తున్నాడు. ఒక అస్తవ్యస్థత ఆ కవిత నిండా ఉన్నట్లు ఉంటుంది. ఆయన రాసుకున్న జీవిత నేపథ్యం చదివితే, ఆ కవిత బాగా అర్థమవుతుంది. బహుశా దాన్ని అలా చెప్తేనే బాగుంటుందనుకున్నాడేమో!
“అయ్య కొట్టిన తంగెడు కట్ట
సోయి తప్పిన అవ్వ
ఆనిగపు బుర్ర నీళ్ళు….” ఇలా సాగిపోతుందీ కవిత.
తెలంగాణాకే ప్రత్యేకతను తెచ్చే పండగల్లో ఒకటి “బతుకమ్మ”. దీన్నితెలంగాణాలోని కొన్ని ప్రాంతాల్లో దళితులు ఆడడానికి లేదు. ఆ పండగల్లో భాగస్వామ్యం కాలేని అలాంటి తెలంగాణా దళిత బాల్యాన్ని వర్ణిస్తూ…
“అందరు పండుగ మోజులవుంటే
నేను పశుల గాస్తుంటే
డప్పుల చప్పుళ్ళతో
బతుకమ్మను తెచ్చి ఆడుతావుంటే
ఆవలుండి చూసుటే తప్ప
పండుగ జరుపుకున్న పాపాన పోలేదు” (పుట: 20) అని ఆనాడు అందుకోలేని అందమైన బాల్యాన్ని, చేజారిన సంతోషాన్ని గుర్తు చేసుకుంటున్నాడు కవి.
మొదట్లో దళితుల్ని గుర్తించిందీ, చైతన్యం నింపిందీ ఖచ్చితంగా మార్క్సిస్టు సాహిత్యమే. నేటికీ దానిలో అదే మౌలిక భావన ఉంది. అయితే అది పీడిత వర్గదృక్పథంతో చూస్తుంది తప్ప, కుల స్పృహను ప్రధానంగా గుర్తించదు. కానీ, భారతదేశంలో కులమే ప్రధానమవుతుందని దళిత మేథావులు భావిస్తున్నారు. అదే అనేక సమస్యలకికారణమవుతుందని దళిత మేధావుల వాదన. ఆ పునాదిని గుర్తించకుండా కులాన్ని ఉపరితల అంశంగానే వర్గవాదులు గుర్తించడం జరుగుతోంది. మొదట్లో పీడిత వర్గ చైతన్యంతోనే తెలంగాణాలోనూ దళితులు ఆ భావజాల పార్టీల్లో పనిచేశారు. తర్వాత కాలంలో అంబేద్కర్ భావజాలంపై అవగాహన కొస్తున్నారు. దాన్ని కవి వర్ణిస్తూ…
“పగలనక రాత్రనక పశులుగాసి
ప్రపంచానికీ దూరంగా పస్తులుండి
కారడవిలో వింత పశువునై
అడవే నాకు అవ్వ - అయ్య
ఆత్మీయతతో అడవితల్లి ఆదరించింద’నీ గుర్తు చేసుకుంటాడు. అయితే, తర్వాత కాలంలో జరిగిన మోసాన్ని కూడా గుర్తించమంటున్నాడు కవి.
“చెమట చుక్కలతో చెలకదున్నిన
ఎగిలి వారంగ యాతం బోసిన
అలసట ఎరగక అన్ని పండించిన
…………………………………
ఊరు బయటనే అంటరానోన్ని జేసిండ్రు” అని అక్కడ కులాన్ని ఆధారం చేసుకుంటున్నారని, అంతర్గతంగా మార్క్సిస్టుల విధానాన్ని ప్రశ్నిస్తున్నాడు. దళితులకు నాయకత్వాన్ని అందనివ్వని స్థితిని గుర్తు చేస్తున్నాడు. అక్కడా హిందూ భావజాలమే మార్క్సిస్టుల్లో అంతర్భూతంగా పనిచేస్తుందంటాడు. అందుకే దళితులకు“కనులు తెరిపించే కాంతొకటి వచ్చిందిఅంబేద్కరే ఆ కాంతి ” ( పుట: 34) అని స్పష్టంగా అంబేద్కరిజాన్ని ఎలుగెత్తి చాటుతున్నాడు కవి. భూములిప్పిస్తామంటూ పోరాటాలు చేస్తుంటే, పోలిసులు జరిపే కాల్పుల్లో దళితులే ఎందుకు బలవుతున్నారో, ఆ పోరాటానికి నాయకత్వం వహించే వాళ్ళనెందుకు ఆ తూటాలు తాకలేక పోతున్నాయో గుర్తించగలిగామని కూడా స్పష్టంగా ప్రకటిస్తున్నాడు కవి…
“ఎగేసుడు, సగేసుడు ఎనుకనే నిల్చుండుడు
ముందుండి… ముదిగొండలో
అసువులు బాసింది…. అణగారిన వారే” (పుట: 29) అని ముదిగొండలో దళితుల్నే ఎందుకు కాల్చారో, ఆ పోరాటానికి నాయకత్వం వహించిన వారెలా తప్పించుకోగలిగారో చెప్తున్నాడు.
తాను పుట్టి పెరిగిన తెలంగాణా ప్రాంతాన్ని ఒక ప్రత్యేక రాష్ట్రంగా చేసుకుంటే తప్ప, నిజమైన పరిష్కారాలు లభించవనీ, అందుకే అందరూ కలిసికట్టుగా పోరాడమంటూ ప్రత్యేక రాష్ట్రం, ‘తల్లి తెలంగాణా’ కవితల్లో తెలంగాణాలో పాలకుల నిర్లక్ష్యం, స్వార్ధం వల్ల నిస్సారమై పోయిన స్థితిని వర్ణించాడు. “చావు తప్పి లొట్టబోయిన సంస్కృతిని, అస్తి పంజరంలా తయారైన గ్రామాల్ని నేపధ్యంగా చెప్పి, తేనెటీగల్లా కదిలి తెలంగాణా సాధించుకోవాలంటున్నాడు…
‘తెలంగాణ’ కవితలో!
“వలస పిట్టలు వాలకుండా
వడిశెలందుకుందాం
పర పాలకులు పొలిమేర పారంగ
తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకుందాం” అంటున్న పొన్నాల బాలయ్య తన నేలమీద నిలబడి, తన నిజమైన గొంతుతో, ఎలాంటి అస్పష్టతా లేకుండా కవిత్వం రాస్తున్నందుకు అభినందించవలసిందే!
దీనిపై ప్రజాకళలో వచ్చిన అభిప్రాయాలు :
9 అభిప్రాయాలు
# ramarao 06 అక్టోబర్ 2008 , 7:11 am
ఇది సదివిన సంది ఎగిలివారంగ సదవాలనుంది.ఇదెక్కడ దొరుకుతుంది?
# srinivas olle 06 అక్టోబర్ 2008 , 11:46 am
sar
# SRINIVAS O 15 అక్టోబర్ 2008 , 5:00 am
సార్ మీ వ్యాసాలు అన్నీ చధువుతాను చాల బాగుంటున్నాయి నాలాంటి విద్యార్టులకు చాలా ఉపయోగ కరంగా ఉంటున్నాయి. థాంక్యూ సర్
# vemuganti 15 అక్టోబర్ 2008 , 9:41 am
పొన్నల బాలయ్య కవిత్వము బాగున్నదీ బాలయ్య ఫొనె 9908906248 పుస్తకాలు కావలనుకునెవారు ఫొను చెయంది
# Pasunoori Ravinder 16 అక్టోబర్ 2008 , 6:53 am
మంచి సమీక్షకుడు ఎవరంటే…..?
ఎలాంటి పక్షపాతం లేకుండ, రచనలోని మంచి చెడుల్ని బేరీజు వేసేవాడు. అది మంచి రచన అయితే నలుగురు చేత ఆ పుస్తకాన్ని చదివించేలా నిగాఢమైన విషయాల్ని వెలికి తీసి దాన్ని అర్థం చేసుకునేందుకు కావాల్సిన చూపును అందించాలి. అలాంటి పనిని పరిపూర్ణంగా నిర్వహించిన డా.దార్ల గారికి అభినందనలు. కవి పొన్నాల బాలయ్యకు శుభాకాంక్షలు.
పసునూరి రవీందర్
# Dr.Darla 17 అక్టోబర్ 2008 , 2:59 am
సాహితీ మిత్రులారా!
అభిప్రాయాలు రాస్తున్న మీ అందరికీ అభినందనలు. అలాగేఈ పుస్తకం కావలసిన వారు : పొన్నాల బాలయ్య, ఆరేపల్లి, బస్వాపూర్ పోస్టు,కోహెడ మండలం,కరీంనగర్ జిల్లా,ఫోను: 09908906248పుస్తకం వివరాలు: పుటలు:90,దీనిలో 36 కవితలున్నాయి.జూలూరి గౌరీశంకర్ ముందుమాట రాశారు.అన్నింటికంటే కవి రాసుకున్న ప్రవేశిక చదివి తీరాల్సిందే!పుస్తకం వెల రూ50/-ఈ పుస్తకం నవోదయ, విశాలాంధ్ర,ప్రజాశక్తి బుక్ హౌస్ లలో కూడా లభిస్తుంది
.–మీ
దార్ల
# GURRAM SEETARAMULU 27 అక్టోబర్ 2008 , 9:05 am
ఆవలుండి చూసుటే తప్పపండుగ జరుపుకున్న పాపాన పోలేదు” ……………
కవితా స0కలన0 చదివాను
దార్ల సమీక్ష బాగుంది
కాకుంటే బతుకమ్మ పండగ మీద రచయతకు, సమీక్షకుడీకి అవగాహనలెదనుకుంతటాను, బతుకమ్మ దలితులు చెసుకొరు అనెది అ వాస్తవముపండగ అనెది సామాజిక ఆర్దిక స్తితి బట్టీ ఉంటూ0ది ఈ విసయమ మీద 2 దసాబ్దాలుపరిశోదన చెసిన భరతబుసన గారితొ సుదీర్గ0 గా చ ర్చించానుఅది తప్పుప్రప0చము లొతెలగాన లొ స బ్బండ వర్నా లు జరుపు కొనె ప0డగ బతకమ్మఅనెది సత్య0
# GURRAM SEETARAMULU 27 అక్టోబర్ 2008 , 9:09 am
కవితా స0కలన0 చదివాను
దార్ల సమీక్ష బాగుంది
కాకుంటే బతుకమ్మ పండగ మీద రచయతకు, సమీక్షకుడీకి అవగాహనలెదనుకుంతటాను, బతుకమ్మ దలితులు చెసుకొరు అనెది అ వాస్తవముపండగ అనెది సామాజిక ఆర్దిక స్తితి బట్టీ ఉంటూ0ది ఈ విసయమ మీద 2 దసాబ్దాలుపరిశోదన చెసిన భరతబుసన గారితొ సుదీర్గ0 గా చ ర్చించానుఅది తప్పుప్రప0చము లొతెలగాన లొ స బ్బండ వర్నా లు జరుపు కొనె ప0డగ బతకమ్మఅనెది సత్య0
# vrdarla 29 అక్టోబర్ 2008 , 8:51 am
సీతారాం గారూ!
సంతోషం… నా సమీక్ష మీకు నచ్చినందుకూ… అంతకు మించి ఒరిజినల్ పుస్తకం చదివినందుకూ!ఇక తెలంగాణాలో బతకమ్మ ఆన్ని వర్ణాల వాళ్ళూ ఆడతారా లేదా అనేది ఆ ప్రాంతం, అదీ కింది వర్ణాలుగా ముద్ర వేయబడిన వారిని ఆ యా పండగల్లో పరిశీలించ వలసి ఉంది. నేను చేసిన సర్వే ప్రకారం, నా పరిశీలన ప్రకారం కొన్ని ప్రాంతాల్లో కింది వర్ణాల వాళ్ళూ బతకమ్మ ఆడరు. అంతేకాక, అది అన్ని వర్ణాల వారి పండగ కాదు. ఇప్పుడు …ప్రజాస్వామ్యం అందించిన స్వేచ్చ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే భావనల వల్ల, తెలంగాణా ప్రజలంతా ఒకటి కావాలనే భావాలు విస్తరింపబడుతున్న తరుణంలో అందరూ ఆడినా అశ్చర్య పోనవసరం లేదు. ఒకవేళ అది అందరి పండగా అయితే అంతకంటే సంతోషం ఏముంది.మీ అభిప్రాయానికి ధన్యవాదాలు
మీ
దార్ల

19 సెప్టెంబర్, 2008

దళిత సమస్యలపై ప్రజాసాహితి దృక్పథం

డా// దార్ల వేంకటేశ్వర రావు

ప్రజాసాహితి సాహిత్య, సాంస్కృతికోద్యమ మాసపత్రిక. ఆగస్టు 1977 నుండి నేటి వరకూ నిరంతరాయంగా వెలువడుతున్న పత్రిక. అదీ పీడితుల పక్షాన నిలబడుతున్న పత్రిక. సమాజంలో జరిగే అనేక సంఘటనలకు తనదైన దృక్పథంతో కొనసాగుతున్న పత్రిక. అలాంటి పత్రిక దళితులకు జరుగుతున్న అన్యాయాలను ఎలా అర్థం చేసుకుంది? దళిత సమస్యలను, సంఘర్షణలను ఎలా వ్యాఖ్యానించింది? కొన్నిసార్లు రెండు, మూడు నెలలకు కలిపి ప్రచురించినా మూడు వందల సంచికకు చేరువయ్యింది. ఇది మూడు వందలవ సంచిక. ఈ సందర్భంగా గత ప్రజాసాహితి సంచికల్లో దళిత సమస్యలపై ఆ పత్రిక దృక్పథాన్ని స్థాలీపులాక న్యాయంగా అంచనా వేసే ప్రయత్నమే ఈ వ్యాసం!
సంపాదకీయాలు:
ప్రతి పత్రికకు ప్రాణం వంటిది సంపాదకీయం. పత్రిక దృక్పథం ప్రధానంగా సంపాదకీయాన్ని బట్టే తెలుస్తుంది. ప్రజాసాహితి ఒకోసారి రెండేసి, మూడేసి సంపాదకీయాలను కూడా ప్రచురించింది. ప్రతి సంపాదకీయం ఒక మ్యానిఫెస్టో వంటిదే! ప్రతి వాక్యం చాలా జాగ్రత్తగా ప్రయోగించటం చెప్పుకోదగిన ఒక ప్రత్యేకత. సంపాదకీయాలు 'జనసాహితి' ప్రణాళిక, నిబంధనలు, కర్తవ్యాలను సమన్వయిస్తునట్లే ఉంటాయి. 'కులం' గురించి ప్రస్తావిస్తున్నా, దానితో వర్గాన్ని, భూస్వామ్య వ్యవస్థ వికృత రూపాన్ని, అర్థ వలస పాలనా ప్రభావాన్ని సమన్వయిస్తూనే సంపాదకీయాలు కొనసాగాయి. దళితులు స్వతంత్రంగా పోరాటం చేయటం కంటే, సమష్టి పోరాటం చేయటం ద్వారానే నిజమైన విముక్తి లభిస్తుందనే దృక్పథంతో ఆ సంపాదకీయాలు వెలువడ్డాయి. 'కులం' మరింత విభజనల మయమనీ, విభజన - విభజనతోనే అంతం కాదనీ, అన్ని వర్గాల సమైక్య పోరాటంతోనే అంతమవుతుందనీ స్పష్టం చేస్తుంటాయి. ఇంచుమించు అన్ని ప్రజాసాహితి సంపాదకీయాలు కూడా ఇదే దృక్పథంతో కొనసాగాయి. కనుక, పత్రిక మౌలిక దృక్పథం కొన్ని ముఖ్యమైన సంచికలను పరిశీలించటం ద్వారా కూడా తెలిసే అవకాశం ఉంది.
దళిత నాయకులపై ప్రత్యేక సంచికలు:
ప్రజాసాహితి పత్రికలో దళిత సమస్యల గురించి సంపాదకీయాలు రాయడమే కాదు. అప్పుడప్పుడు చారిత్రక సందర్భానుసారంగా డా// బి.ఆర్.అంబేద్కర్, జ్యోతిరావ్ పూలేల గురించి ప్రత్యేక సంచికలను ప్రచురించారు. దళిత కవి గుర్రం జాషువాపై కూడా ప్రత్యేక సంచికను వెలువరించారు. నిజానికి దళితులకు, దళిత సాహిత్యానికి పై ముగ్గురూ సిద్ధాంతకర్తలు వంటివారు. వాళ్ళ గురించి ప్రత్యేక సంచికలు ప్రచురించటమంటే, ప్రజాసాహితి దళిత మౌలిక సిద్ధాంతాలను, సిద్ధాంతకర్తలను గుర్తించినట్లే! అయితే ఆ సిద్ధాంతాన్నీ, ఆ సిద్ధాంత కర్తలను వర్గ దృక్పథంతో సమన్వయించటం మరంత గుర్తించదగింది!
జ్యోతిరావ్ పూలే, డా// బి.ఆర్.అంబేద్కర్ ముఖచిత్రాలతో వెలువడిన ఏప్రిల్, 1992 (127వ) సంచికలో "దళితుల పోరాటం - నూతన ప్రజాస్వామిక విప్లవంలో అంతర్భాగం" పేరుతో ఒక సంపాదకీయం ఉంది. దీనిలో కింది వ్యాఖ్యలు గమనించదగినవి.
"భూస్వామ్య వవస్థను బద్దలుకొట్టకుండా, దాని యొక్క విభిన్న దోపిడీ పీడనల రూపాన్ని అంతమొందించలేం. దాని తోడుదొంగైన సామ్రాజ్యవాదాన్ని, వీరి అక్రమ సంతానమైన దళారీ పాలకులను ఓడించలేం. కుల వ్యవస్థతో సహా సమస్త అణచివేతలకూ మూలమైన ధనిక, అగ్రవర్ణ రాజ్యాంగ యంత్రాంగాన్ని రూపుమాపలేం. అందుకే దళితుల పోరాటాలు నూతన ప్రజాస్వామిక విప్లవంలో భాగం కావాలి.''
"వర్గమూ - కులమూ! విప్లవమూ - సంస్కరణా!" పేరుతో ఏప్రిల్ 1995 (162వ) సంచిక ఒక సంపాదకీయం వెలువడింది. దీనిలో డా// బి.ఆర్.అంబేద్కర్ కులనిర్మూలన పోరాట సైద్ధాంతిక విషయాలపై చర్చనీయాంశాలు ఉన్నాయి.
డా// బి.ఆర్.అంబేద్కర్ జయంతి సందర్భంగా వెలువడిన ఈ సంపాదకీయం ఆధునిక భారతంలో డా// బి.ఆర్.అంబేద్కర్ మహాభారతంలోని కర్ణుడితో పోల్చటం కూడా దళితులకు ఎంత వరకూ అంగీకారయోగ్యమో ఆలోచించవలసిందే! రాజ్యాంగ నిర్ణాయక సభ డ్రాప్టింగ్ కమిటీ ఛైర్మన్గా పనిచేయటంలో డా// బి.ఆర్.అంబేద్కర్ మేథోపరమైన కృషిని రాజ్యాంగ పరిషత్తు గుర్తించి, ఆ పరిస్థితుల్లో అంతటి పరిశ్రమ చేసి, భారత రాజ్యాంగాన్ని రూపొందించే శక్తి ఆయనకే ఉందని గుర్తించింది. నెహ్రూ క్యాబినెట్లో మంత్రిగా పనిచేసినా, అది ఎలా నిర్వహించారో, దానిలో ఎంతకాలం ఉన్నారో, ఆ సమయంలో ఎలాంటి సమస్యలకై పనిచేశారో లోతుగా విశ్లేషించవలసిన అవసరం ఉంది. అయినా వీటిని స్పృశించకుండానే, 'ప్రజాసాహితి' సంపాదకీయంలో "ఆయన చేసిన పోరాటాలు, పడిన రాజీలు - కులనిర్మూలనకు ఏదో రూపంలో తోడ్పడతాయన్న అవగాహన తోను, ఆవేదనతోను అమలు జరిపారు" అని వ్యాఖ్యానించారు. డా// బి.ఆర్.అంబేద్కర్ కృషిపై ఈ వ్యాఖ్యలను బట్టి ఆయన కులనిర్మూలనకే పరిమితమయిన వానిగా ప్రజాసాహితి భావించినట్లుంది.
ఈ సంపాదకీయంలోనే మరో విశేషం ఉంది.
1857 ప్రథమ భారత స్వాతంత్ర్య సంగ్రామం నుండి 1925 వరకు (అది డా// బి.ఆర్.అంబేద్కర్, కమ్యూనిస్టు పార్టీలు సామాజిక రాజకీయ రంగ ప్రవేశం చేయటాన్ని హద్దుగా పెట్టుకుని ) జరిగిన ముఖ్యమైన తిరుగుబాట్లూ, గిరిజన గిరిజనేతర రైతాంగ పోరాటాలూ, సాంఘిక వ్యవస్థపైనా సాంస్కృతికాంశాలపైనా సాగిన ఉద్యమాలూ పేర్కొని, మొదటివి వ్యవస్థ మూలాలపై ఎక్కుపెట్టిన విప్లవ స్వభావం గలవిగా, రెండవవి ఉపరితలాంశాలకు చెందిన సంస్కరణ స్వభావం గలవిగా విశ్లేషించారు. సామాజిక విప్లవానికి ప్రధాన చోదకశక్తి (ప్రింసిపల్ మోటివ్ ఫోర్స్) వర్గ పోరాటమేనన్నారు. ఈ పునాది వర్గాల పోరాటానికి అనుబంధంగా మిగిలిన సమస్త రంగాలలో కూడా పోరాటం సాగిస్తూ సమన్వయించుకోవాలన్నారు. ఇది పాత వ్యవస్థను ధ్వంసం చేసి కొత్తదాన్ని నిర్మించుకునే దిశగా వుండాలని చెప్పారు. దీనినే విప్లవాత్మక వర్గ పోరాటంగా పేర్కొన్నారు. అమలులో వున్న వ్యవస్థలో మరిన్ని అవకాశాలూ, ఉపశమనాలూ కలిగించే సంస్కరణల కొరకు సాగించేదీ, లక్ష్య పెట్టేదీ సంస్కరణవాదమన్నారు. సారాంశంలో 5 పేజీల ఈ సంపాదకీయం మార్క్సిజాన్ని విప్లవకర సిద్ధాంతమనీ అంబేద్కరిజం సంస్కరణవాదమనీ తేల్చింది. మార్క్సిజం బోధించే వర్గ పోరాట సిద్ధాంతంపై కొన్ని రకాల దాడుల్ని సంపాదకీయం ఖండించింది. అదే సమయంలో అంబేద్కరిజంను చర్చనీయాంశమంది.
ముగింపుగా - "దళితులలో అత్యధికులు గ్రామీణ ప్రాంతాల్లో వున్నారు. భూస్వామ్య వ్యవస్థ యొక్క ఆర్థిక, సాంఘిక, దోపిడీ పీడనలకు వారు గురవుతున్నారు. కులవ్యవస్థ పాలక వర్గాల దోపిడీ సాధనంగా వుంది. కాలం చెల్లిన భూస్వామ్య విధానానికి వ్యతిరేకంగా సాగించే వ్యవసాయిక విప్లవం కులనిర్మూలనా పోరాటానికి ప్రధాన ఆధారంగా వుండగలుగుతుంది. పెరుగుతున్న సామ్రాజ్యవాద దోపిడీ, భూస్వామ్య అగ్రకుల పెత్తందార్లను మరింత బలోపేతం చేస్తోంది.
"డా//బి.ఆర్.అంబేద్కర్ జీవితాశయమైన 'కులనిర్మూలన' పట్ల చిత్తశుద్ధి గలవారు భావోద్వేగాలను విడిచిపెట్టి, కులానికి పునాదిగా వున్న అర్థవలస - అర్థఫ్యూడల్ ఆర్థిక వ్యవస్థతోనూ, దాని నిరంకుశ రాజ్యంతోనూ పోరాడటానికి అధిక ప్రాముఖ్యత నిస్తారని ఆశిద్దామ"నే లక్ష్యాన్ని ఈ సంపాదకీయంలో సూచించారు.
గుర్రం జాషువా ప్రత్యేక సంచిక:
జాషువా ముఖచిత్రంతో, ఆయన శతజయంతి (1895 - 1995) సందర్భంగా అక్టోబరు, 1995 (168వ) సంచికను 'గుర్రం జాషువా శతజయంతి సంచిక'గా ప్రకటించారు. 95 శాతం రచనలన్నీ జాషువా సాహిత్య దృక్పథాన్ని విశ్లేషిస్తూ ఉన్నాయి. 'విశిష్ట సాహితీ స్రష్ట గుర్రం జాషువా" పేరుతో సంపాదకీయం ప్రచురించారు. ఆయన కవిత్వంలో కుల వివక్షకు వ్యతిరేకంగా, తీవ్ర ఆవేదనా ఆగ్రహమూ వ్యక్తమయ్యాయని అన్నారు.
గురజాడ, జాషువా సమకాలికులైన అభ్యుదయ కవులు, శ్రీశ్రీ వంటి వారంతా పద్యాన్ని వదిలేసి కొత్తదారుల్లో కవిత్వం రాస్తున్నా, జాషువా మాత్రం పద్య రూపాన్ని మార్చుకోలేకపోయారని వ్యాఖ్యానించారు. అగ్రకులాల సొత్తుగా వున్న కవిత్వంపై పట్టు సాధించి, వారికంటే మెరుగ్గా కవిత్వం రాయగలగాలనేది జాషువా పరమ ఆశయాల్లో ఒకటి అన్నారు.
"జాషువాను దళితకవి అనటం వరకు తప్పులేదు. కానీ, ఆయన దళితవాదికాదు. వర్ణకుల వ్యవస్థలను ఆయన తీవ్రంగా ద్వేషించాడు. ఫ్యూడల్ సంస్కృతి పెంచి పోషిస్తున్న మూఢ (దైవ) విశ్వాసాన్ని, అంటరానితనాన్ని వ్యాప్తి చేసే హిందూ పూజారి వ్యవస్థనూ తనదైన శైలిలో విమర్శించాడని" జాషువాను అంచనా వేశారు.
"జాషువాది సమాజ దళిత స్పృహ. గాంధీయిజం ద్వారా సమాజంలో మార్పులు వస్తాయని భ్రమించాడు. గాంధీ హిందూమతాన్ని, వర్ణ వ్యవస్థనూ పొగుడుతూ కేవలం అస్పృశ్యతను మాత్రమే వ్యతిరేకించాడు. ధర్మకర్తృత్వాన్నీ, అనువంశిక వ్యవస్థలను సమర్థించి, పరోక్షంగా భూస్వామ్య ధనస్వామ్య వ్యవస్థను బలపరిచాడు. జాషువా దీనిని అర్థం చేసుకునేంత తాత్త్విక భావావేశ తీవ్రత కలవాడు కాదు. అయివుంటే గాంధీ సామాజిక అవగాహనలోని లోపాల్ని విమర్శించగలిగేవాడు."
"దళిత స్పృహ, దళిత చైతన్యం ప్రజాస్వామ్య స్వభావం గలవి. అవి వర్గ పోరాటంతో అనుసంధానమైతే నూతన ప్రజాస్వామిక విప్లవ చైతన్యంగానూ, మార్క్సిజంతో మమేకమైతే సోషలిస్టు చైతన్యంగానూ గుణాత్మక మార్పులని తీసుకుంటాయి. లేకుంటే బూర్జువా తాత్త్విక చైతన్యంగానే మిగిలిపోతాయి. తెలుగు దళితవాదులలో ఎక్కువమంది చైతన్యం తిరోగమన పథంలోకి ప్రయాణిస్తోంది."
ఈ సంపాదకీయంలోని పై వ్యాఖ్యలను గమనిస్తే జాషువా సాహిత్యం సమకాలీన వస్తువుని అందుకున్నా, సమకాలీన రూపాన్నీ అందిపుచ్చుకోవటంలో వెనుకబడి ఉందనే స్పృహ కలుగుతుంది. భావజాలం విషయంలోనూ జాషువాకు సమగ్ర దృక్పథం లేదనీ, ఎలక్ట్రానిక్ మీడియా, నాటకాలను ఆదరించే సామాన్య ప్రజలను వీరి పద్యాలు బాగా ఆకర్షించాయనీ, కులదృక్పథం వల్లనే దళితులు జాషువాని వెనుకేసుకొస్తున్నారనే ఆలోచన కూడా కలిగిస్తుందీ సంపాదకీయం. అయితే, జనవరి, 2007 (290వ) సంచికలో జనసాహితి 10వ మహాసభల కరపత్రాన్నే సంపాదకీయం - 1గా ప్రచురించారు. దీనిలో ప్రగతిశీల రచయితగా జాషువాను కూడా పేర్కొన్నారు. అలాగే, జనసాహితి ప్రధాన కార్యదర్శి దివికుమార్ అధ్యక్షత వహించే జాషువా సభను వివరిస్తూ ఒక కరపత్రం వెలువడింది. ఆ సభ అక్టోబరు 21, 2007 న విజయవాడలో జరిగింది. ఆ కరపత్రంలో దళిత కవి, విశ్వనరుడు జాషువాపై సాహిత్య సభ నిర్వహిస్తున్నట్లు పేర్కొని, జాషువాను ఒక దళిత మేధావిగా అభివర్ణించారు. ఈ కరపత్రంలోని కొంత భాగాన్ని నవంబరు, 2007 (299వ) సంచికలో కూడా ప్రచురించారు.
అలాంటి "దళిత మేధావి"కి సమగ్ర దృక్పథం లేదా? అనిపించకమానదు! ఏది ఏమైనా, చాలా మంది జాషువాను, ఆయన సాహిత్యాన్ని అర్థం చేసుకోవడంలో భిన్న వైరుధ్యాలునాయి. జాషువాను చదివేవాళ్ళు వాళ్ళ దృక్పథం నుండే అర్థం చేసుకుంటారని ఈ సంచికలోని మిగతా వ్యాసాలు కూడా నిరూపిస్తున్నాయి. అలాగే జాషువాని వర్గ దృక్పథం నుండే ప్రజాసాహితి అవగాహన కలిగించే ప్రయత్నం చేసింది.
దళిత రిజర్వేషన్స్ పట్ల ప్రజాసాహితి దృక్పథం:
"వ్యవస్థ పరిమితిని బహిర్గతపరిచిన సుప్రీం తీర్పు" పేరుతో నవంబరు, 2006 (288వ) సంచికలో ఒక సంపాదకీయం ఉంది. దళితుల రిజర్వేషన్స్ గురించి చర్చించింది. ఎస్.సి., ఎస్.టి., ఒ.బి.సి.లలో సంపన్నవర్గాలకు రిజర్వేషన్ చెల్లదని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని ఆధారం చేసుకొని, దళితులకు రిజర్వేషన్స్ వల్ల ఒనగూరిన ప్రయోజనాలను విశ్లేషించారు. ఈ సంపాదకీయంలో చట్టబద్ధ రిజర్వేషన్స్, వ్యవస్థీకృత రిజర్వేషన్స్ అని రెండు రకాలుగా రిజర్వేషన్స్ ని వర్గీకరించారు. వంశపారంపర్యంగా వస్తున్న ఆస్తులను, అధికార హోదాలను, ఆ వర్గం వాళ్ళే మళ్ళీ అధికారాన్ని చెలాయించటాన్నీ గుర్తించకుండా, అణచివేతకు గురవుతున్న వర్గాలకు రిజర్వేషన్స్ కల్పించినత మాత్రాన ఉపశమనానికి మించిన ప్రయోజనం ఉండదనీ, అందువల్ల దోపిడీ పాలకవర్గాల దృష్టిలో భిక్షగా వున్నప్పటికీ రిజర్వేషన్స్ ను దళితులు హక్కుగా పొందటంతో కాకుండా, వ్యవస్థీకృత రిజర్వేషన్స్ ని రద్దుపరిచేలా సమైక్యపోరాటం చేయాలన్నారు. అప్పుడు మాత్రమే దళితులకు, సమస్త పీడిత వర్గాలకూ విముక్తి లభించగలదని నమ్ముతున్నారు. దళితులలో కూడా అంతర్గతంగా వివిధ స్థాయిలు తయారవుతున్నాయని వింగడించారు. పైకెదుగుతున్నవారూ 2) వ్యవస్థ అందించే చిట్టిపొట్టి అవకాశాలతో నిలబడాలని చూసేవారూ, 3) వ్యవస్థలోని అవినీతితో సర్దుబాటు చేసుకొంటూ, వ్యవస్థ స్వరూప స్వభావాల్ని వర్గ - కుల దృక్పథంతో అవగాహన చేసుకొని సమైక్య పోరాటానికి సమాయత్తమవుతున్న వాళ్ళు. మూడవ వర్గమే దళితులకు నిజమైన ఆశాదీపంగా ఈ సంపాదకీయంలో అభివర్ణించారు.
జనసాహితి 10వ రాష్ట్ర మహాసభ (తరిమెల)లో చర్చించి ఆమోదించిన 'ప్రజాసాహితీ' సాంస్కృతికోద్యమం - దళితులపై కొనసాగుతున్న కులపరమైన వివక్ష రిజర్వేషన్స్ తో సమసిపోదనీ, దళిత సమస్యను రిజర్వేషన్స్ కే పరిమితం చేయటం - భూస్వామ్య వ్యవస్థ రద్దులాంటి మౌలిక మార్పులు లేకుండా చేయటం పాలక వర్గాల కుట్రలో భాగమన్నారు.
రిజర్వేషన్స్ దళితుల అభివృద్ధికి తోడ్పడుతున్నట్లనిపించినా, అవి కొద్ది మందికే తప్ప, వ్యవస్థ సమగ్ర అభివృద్ధి తోడ్పడకపోగా పాలకవర్గాలు దాన్ని తమ ఓట్ల రాజకీయంలో పావులుగా ఉపయోగించుకుంటున్నారనే దృక్పథాన్ని ప్రజాసాహితి ప్రదర్శించినట్లు స్పష్టమవుతుంది. 60 ఏళ్ల సంస్కరణవాదంపై భ్రమలు వీడమంటోంది. "చైతన్యవంతమైన దళిత యువకుల నాయకత్వం కోసం సమస్త పీడిత జనవాహిని ఎదురు చూస్తోందం'టున్నారు. న్స్
దళితుల భూమి సమస్య:
డిసెంబరు, 2006 (289వ) సంచికలో "ఖైర్లాంజీ అవమానాల దురాగతాల జీవితాలింకెన్నాళ్ళు'' అనే పేరుతో సంపాదకీయం ప్రచురించారు. ఎదుగుతున్న ఒక దళిత కుటుంబాన్ని చూసి భరించలేని ఆధిపత్యతత్త్వంతో, ఆర్థిక, రాజకీయ వనరులు గుప్పెట్లో పెట్టుకున్న వారి నాయకత్వంలో ఖైర్లాంజీ దుస్సంఘటన జరిగిందన్నారు. ఆ సంఘటన పూర్వాపరాలను విశ్లేషించారు.
"2006 సెప్టెంబరు 29న భయ్యాలాల్ బోత్మాంగ్ అనే దళిత కుటుంబ సభ్యులను, భార్య కూతురు, ఇద్దరు కొడుకులను దారుణాతి దారుణంగా హింసిస్తూ, వివస్త్రలను గావించి, గ్రామమంతా నగ్నంగా తిప్పి మానభంగం చేసి, మర్మావయాల్లో కర్రలు దూర్చి శరీరాలు ఛిద్రం చేసి, చివరకు దారుణంగా హత్య గావించి శవాలను ఊరవతల కాలువలో పారేశారు" అంటూ, అక్కడ ఏమి జరిగి ఉంటుందో సమగ్ర కథనంలా వివరిస్తూనే ఆ సమస్యను లోతుగా చర్చించారు.
"ఆర్థికంగా నిలదొక్కుకున్న దళితులు విద్యాపరంగా ఎదిగిన దళితులు సాంఘిక సమానత్వాన్ని కోరుకుంటే భరించలేనితనం మన కులవ్యవస్థ సృష్టించిన సంస్కృతినిండా ఇంకా వైదొలగలేదు సరికదా, పెచ్చురిల్లిపోతోందనడానికిదొక ప్రత్యక్ష నిదర్శనం."
"భయ్యాలాల్ హిందూ సామాజిక వ్యవస్థ నుండి విముక్తి కావటానికి, బౌద్ధాన్ని స్వీకరించాడు. ఏ సంస్కృతిక ధర్మమూ అతన్ని కాపాడలేదు."
"ఎన్నికల రాజకీయ వ్యవస్థ దళితులను ఓటు బ్యాంకుగా మాత్రమే మిగుల్చుకొని, విభజించి పాలించే సంస్కృతిని అమలుపర్చుకుంటూ, ఇంకా ఉపకులాలుగా చీల్చుతూ తమ ప్రయోజనాలకు వినియోగించుకొంటోంది."
"చిట్టి పొట్టి సంస్కరణలతో, వోటు బ్యాంకు రాజకీయాలతో, మతమార్పిడులతో సాటిమనిషిపట్ల దయా, జాలీ కలిగించని చదువులతో, సామాజిక న్యాయాన్నివ్వలేని వ్యవస్థలో ఎంతకాలం మరింకెన్ని తరాలు ఇలా జీవించాలో ఆత్మపరిశీలన చేసుకోమని ఖైర్లాంజీ ఘోషిస్తోంది. సంపన్నులను కాపాడే కులవ్యవస్థను సృష్టించిన 'చట్రం' బద్దలు చేయకుండా దానిలో యిమిడే ప్రయత్నాలన్నీ అంతిమ సారంలో అశేష దళిత ప్రజానీకానికి ఆకలీ, దారిద్ర్యం అణచివేతలనే కొనసాగిస్తుందని ఎలుగెత్తి చాటుతోంది. సమస్త దోపిడీ పీడనలకు వ్యతిరేకంగా శ్రమజీవుల సంఘటిత పోరాటాలు సాగించాల్సిన, చైతన్యాన్ని పెంపొందించాల్సిన చారిత్రక సందర్భం గడప ముందుకొచ్చి నిలిచిందని బోధిస్తోంది."
ఈ సంపాదకీయంలో కులాని గుర్తిస్తూనే, దానివల్ల ఉత్పన్నమయ్యే సంఘర్షణలను గుర్తిస్తూనే అది భూస్వామ్య, పాలకవర్గాల దోపిడీ, పీడనల కనువైన వ్యవస్థగా వ్యాఖ్యానించింది. దళితులు నిజమైన అస్తిత్వం భూమిని సాధించుకొనేటప్పుడే బయటపడుతుందనడానికి ఈ ఖైర్లాంజీ సంఘటన సజీవ సాక్ష్యం అని వివరించారు. ఒకటి, రెండు దళిత కుటుంబాలు కొద్దిపాటి భూమిని సంపాదించుకోవటంతోనో, భూమిపై హక్కుని సాధించటంతోనో కులసమస్య తీరిపోదనీ, సమష్టిగా భూమిపై సమస్త పీడితజనం హక్కుని సాధించగలిగినప్పుడే నిజమైన విముక్తి లభించి, స్వేచ్ఛగా బతకగలుగుతారనే దృక్పథాన్ని వెల్లడించారు. భయ్యాలాల్ వంటి ఒకటి, రెండు కుటుంబాలు భూమిపై హక్కుని సాధించినా, భూమి దక్కనివాళ్ళు ఎక్కువగా దళితుల్లో ఉన్నారు. ఖైర్లాంజీ దుస్సంఘటన వెలుగులోకి రావడానికే చాలా కాలం పట్టిందనీ, అది వైయక్తిక చైతన్యంగా, వైయక్తిక అభివృద్ధిగా కాకుండా, దళిత, సమస్త పీడిత ప్రజా చైతన్యంగా సామాజిక అవగాహన, సాహితీ దృక్పథం అనే పత్రాన్ని వెలువరించారు. అభివృద్ధి చెందాల్సిన చారిత్రక సందర్భం గడప" ముందు కొచ్చిందని వ్యాఖ్యానించారు.
ఇలాంటి సమస్యనే "ఓ రిజర్వు పంచాయితీ కథ" "కులం - వర్గం" సంబంధాలను శక్తివంతంగా నిరూపించగలిగింది. ఆ కథను బొల్లిముంత నాగేశ్వరరావు రాశారు. దాన్ని ప్రజాసాహితి అక్టోబరు, నవంబరు, 1981 (43వ) సంచికలోనే ప్రచురించింది.
గిరిజన దళిత పదాలు:
విశాఖజిల్లా వాకపల్లి గ్రామంలో 2006 ఆగస్టు 20 వ తేదీన 21 మంది పోలిసులు, 11 మంది గిరిజన మహిళలపై అత్యాచారం చేశారనే సంఘటనను ఖండిస్తూ "వాకపల్లి ఆదివాసీ స్త్రీలపై అత్యాచారాలు: నిస్పాక్షిక న్యాయవిచారణ జరిపించాలి" పేరుతో సంపాదకీయం ప్రచురించారు. ఈ సంపాదకీయంలో గిరిజన, ఆదివాసీ లాంటి పారిభాషిక పదాలే తప్ప, దళిత అనే శబ్దాన్ని ప్రయోగించలేదు. ఇందులోనేకాదు, ఇంచుమించు ప్రస్తావించిన ప్రతి సంపాదకీయంలోనూ "దళిత, గిరిజన" వంటి శబ్దాలనే ఒక స్పష్టమైన అవగాహనతో ప్రయోగిస్తున్నారు. గిరిజనులకు దళితులకు లాగా అస్పృశ్య సమస్య లేదు. జన్మత ఏర్పడిన అస్పృశ్య సమస్య అంటరానితనం కుల సమస్యలు దళితులనే ఎక్కువగా బాధిస్తున్నాయి. గిరిజనులను కూడా విశాలమైన అర్థంలో 'దళితులు' గా చాలా మంది సంభావించడంలో లోతైన అవగాహన మరింత రావలసి ఉంది. ఈ రెండూ వేరు వేరు సాంఘిక సమూహాలనే అవగాహనతోనే 'దళిత', 'గిరిజన' పారిభాషిక పదాలను 'ప్రజాసాహితి' తన సంపాదకీయ వ్యాసాల్లో ప్రయోగించింది. కనుక, దళితులకు, గిరిజనులకు ఉన్న సమస్యలలో వైవిధ్యం గలదనే ఆలోచనలు ప్రజాసాహితికి ఉన్నాయని అర్థం చేసుకోవాలి.
దళిత సాహిత్యకారులు: సామాజిక రచనలు
దళిత సమస్యలను దళితులే రాయాలనే వాదన దళిత రచయితలను సామాజిక విప్లవ రచయితలుగా ఎదగనివ్వకుండా చేసే ప్రయత్నమనీ, దళిత జీవన సంఘర్షణ, దళిత జీవితానుభవం ఉన్నవాళ్ళే గాఢంగా చిత్రించగలుగుతారనే దానికి అనుభవ జ్ఞానం ఒక్కటే సరిపోదనీ శాస్త్రీయమైన ఆలోచనలను ముందుకు తీసుకెళ్ళాలని పదవ మహాసభ పత్రంలో వ్యాఖ్యానించారు. పాటిబండ్ల ఆనందరావులా దళితేతర శ్రామికుల జీవన సంఘర్షణను కూడా చిత్రించగలిగేవారుగా దళిత రచయితలు ఎదగాలని జనసాహితి కోరుకుంటోందని నేను అభిప్రాయపడుతున్నాను.
దళితుల ఎ,బి,సి,డి వర్గీకరణ :
దళితులను విభజించటం పాలకవర్గాల కుట్రగా, దళితులను మరింత అనైక్యతను గురిచేయటంగా ఖైర్లాంజీ సంఘటన గురించి రాసిన సంపాదకీయంలోను, జనసాహితి 10వ రాష్ట్ర మహాసభలు ఆమోదించిన పత్రంలోనూ వివరించారు. అయితే ఎ,బి,సి,డి, వర్గీకరణ ఉద్యమంలో న్యాయం ఉందనీ వ్యాఖ్యానించారు. మాల, మాదిగల వివాదాన్ని తెలిపే ఒక కరపత్రాన్ని నవంబరు, 1998 (202వ) సంచికలో ప్రచురించారు.ఆ కరపత్రాన్ని ఎస్.ఆర్.శంకరన్ రాసింది.
"ఎబిసిడిల విభజనలో మెరుగైన న్యాయం వుండినా పాలక గ్రూపులూ, రకరకాల సంస్కరణవాదులూ, రిజర్వేషన్ల విభజనే కాక దళిత ప్రజల విభజనకు కూడా దాన్ని వినియోగిస్తున్నారు.'' అని 10వ మహాసభ పత్రంలో వ్యాఖ్యానించారు.
ఇలా వివిధ సమస్యలపై 'ప్రజాసాహితి' తనదైన పీడిత ప్రజలందరి ఐక్యతా దృక్పథాన్ని ప్రదర్శించింది. ఈ విషయాలకు కళాత్మక అభివ్యక్తిగానే సాహిత్య ప్రక్రియల్లోనూ ప్రతిఫలించింది.
'ప్రజాసాహితి': దళిత సాహిత్య దృక్పథం:
ప్రజాసాహితి పత్రికల్లో దళితుల గురించి రాసిన కవితలు, కథలు, వ్యాసాలు కూడా ప్రచురించారు. "మాలోల్లమంటావు మాదిగలమంటావు, మాట మాటాడితే దూరముండంటావు" అనే చాలా ప్రాచుర్యం పొందిన పాట ప్రజాసాహితి 3వ సంచిక 1977 అక్టోబరులో వచ్చింది. అక్టోబరు, నవంబరు 1981 (43వ) సంచికలో బొల్లిముంత నాగేశ్వరరావు రాసిన "ఓ రిజర్వు పంచాయితీ కథ" (పుట. 18-28)ను ప్రచురించారు. భూమిపై హక్కు లేకుండా, చట్టాలు రిజర్వేషన్స్ పేరుతో అధికారం ఇచ్చినా అది పెత్తందారుల చేతిలో చిక్కి దళితులకు మరెన్నో చిక్కులకు కారణమవుతుందని తెలిపే కథ. భూస్వామ్య పెత్తందార్లు వెంకునాయుడు, అంకిరెడ్డుల తరతరాల గ్రామ సర్పంచ్ గిరీకి "రిజర్వేషన్" అడ్డంకి అవుతుంది. ఎస్.టి.లకు ఆ పంచాయితీ కేటాయించడం, నిరక్షరాస్యుడైన, తినడానికే తిండిలేని యానాది 'బుర్రోడు'ని సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం, తరువాత, తన ప్రాణానికీ గ్రామంలో తన జాతివారందరికీ ఆ రిజర్వేషన్ వల్ల వచ్చిన పదవి తమని కాపాడకపోగా, తమ అస్తిత్వానికే ప్రమాదకారిగా మారుతుందని నిరూపించే కథ.
భూమిలేకుండా, ఆర్థిక పరిస్థితి బాగుపడకుండా చట్టాలు దళిత, గిరిజనులకు ఎన్ని రిజర్వేషన్స్ కల్పించినా, వాటిని పాలక వర్గాలే వాడుకుంటాయి తప్ప, దళిత, గిరిజనుల జీవితంలో మౌలిక మార్పులు చేయలేవని స్పష్టం చేసే కథ.
జూలై, 1995 (165వ) సంచికలో అడివి బాపిరాజు కథను ప్రచురించారు. 1945లో రాసిన 'నరసన్న పాపాయి' కథలో దళితులపై దళితేతరులకు ఉన్న భిన్న దృక్పథాలను సృజనీకరించిన కథ. ఒక దళితుడు (నరసన్న) దేవాలయంలోకి ప్రవేశించబోతే ఒక దళితేతర పెత్తందారుడు తీవ్రంగా కొడతాడు. నరసన్న భార్య రత్తాలు పెత్తందారుల ఇంట్లో పనిచేస్తూ ఉంటుంది. ఆమె గర్భంతో ఉండగా, ఆ ఇంటి యజమానురాలు అగ్రవర్ణ స్త్రీ అయినప్పటికీ రత్తాలుతో సన్నిహితంగా ఉండటమే కాకుండా, ఒక రోజు రత్తాలు కూతురికి పాలు కూడా ఇస్తుంది. దళిత - దళితేతురుల సంబంధాలను ఒక వాస్తవిక దృష్టితో రాసినా, ఊహాత్మకత ఎక్కువగా ఉందీ కథలో! అగ్రవర్ణాలవారంతా మంచివాళ్ళు కాదు, అలాగని అందరూ చెడ్డవాళ్ళు కాదని చెప్పే కథ! అయితే, కులం వల్ల కలిగే వ్యధలను హృద్యంగా వర్ణించారు. ఇదే సంచికలో అడవి బాపిరాజు గారి 'దీపావళి కథ' దళిత కథ అని ఎ.బి.సుందరరావు సమీక్షా వ్యాసంలో పేర్కొన్నారు. దాదా హయత్ రాసిన "సెగమంటలు" కథ కూడా దీనిలోనే ప్రచురించారు.
ఎన్నికల మాయాజాలంలో తాగుబోతైన మాల ఓబులేసు దొంగ ఓటు వేయవలసిన దుస్థితి, ప్రజాస్వామ్యంలో ఓట్లను కొనే పద్ధతినీ, దొంగ ఓటు వేయకపోతే దళితులకు కలిగే అనర్థాలను వర్ణించిన కథ. భూస్వామ్య పెత్తందారీ వ్యవస్థలో దళితులెలా నలిగిపోతున్నారో ఆర్థిక, సాంఘిక పరిస్థితులెలా ఉన్నాయో స్పష్టం చేసే కథ. ఆర్థిక దృష్టే ప్రధానంగా ఉన్న ఈ కథలో ఓబులేసుని మాలగా, డప్పుకొట్టేవానిగా చిత్రించారు రచయిత. మాలలు డప్పుని కొడతారా? ఒకవేళ ఒకటి, రెండు ప్రాంతాల్లో అలా జరిగినా అది మాలల వృత్తిగా పరిగణించలేం! కనుక, ఓబులేసు వృత్తి విషయంలో ఇంకొంచెం జాగ్రత్త తీసుకుని వుంటే బాగుండేది.
అక్టోబరు, 1995 (168వ) సంచికలో జాషువా గురించి చాలామంది రాసిన వ్యాసాలు ప్రచురించారు. ఆచార్య వి.రామకృష్ణ 'జాషువా సాహిత్యం - సాంఘిక నేపథ్యం'లో ప్రజాసాహితీ వేత్తలకూ సమకాలీనతే అతని సాహిత్య అస్తిత్వాన్ని నిర్ణయిస్తుందనీ, అలాగే జాషువా రచనల్లోనూ కొనసాగిందన్నారు. దానికి కవి సామాజిక నేపథ్యం నిర్ణయాత్మకంగా పనిచేసిందన్నారు. దానిలోని భావాలు చాలావరకూ ఈ సంచిక సంపాదకీయంలో కనిపిస్తున్నాయి. జాషువాది మానవతావాదమనీ మార్క్సిజం కూడా గొప్ప మానవతావాదమేననీ పేర్కొన్నారు. జాషువా ప్రాపంచిక దృక్పథంపై ఎన్.అంజయ్య రాసిన వ్యాసంలో చర్చించవలసిన అంశాలు ఎన్నో ఉన్నాయి. జాషువా వర్గదృష్టిని అద్దేపల్లి రామమోహనరావు; 'గబ్బిలం' ఆత్మ కథాత్మకావ్యం అంటూ డా// కఠెవరపు వెంకట్రామయ్య ; కులాల కతీతుడైన దళిత కవిగా క్రాంతికిరణ్,; జాషువా - ముద్దుకృష్ణల వివాదం గురించి రవిబాబు మొదలైనవాళ్ళంతా వ్యాసాలను ఈ సంచికలో ప్రచురించారు. ముద్దుకృష్ణలోనూ సంస్కరణాభిలాష వుందనీ, ఆయన నడిపిన జ్వాలపత్రిక (1933-3వ సంచిక)లో అలాంటి భావాల్ని వ్యక్తం చేసే కవిత ఉందనీ, కొన్ని సాంకేతిక కారణాల వల్ల కొన్ని పరిమితుల వల్ల జాషువా కవితను 'వైతాళికులు'లో చేర్చకపోయి ఉండవచ్చునన్నారు. అలా చేర్చకపోవడం వల్ల అది జాషువాకు జరిగిన హానిగానో, కుట్రగానో వాపోవడం" పరమ ఆశ్చర్యంగానూ, అసహ్యం గానూ" ఉందని ఆ వ్యాసంలో రవిబాబు వ్యాఖ్యానించారు. ఈ వ్యాసాన్నే ప్రధానంగా మెచ్చుకుంటూ ద్వా.నా.శాస్త్రి ఓ ఉత్తరాన్ని రాస్తే, దాన్ని నవంబరు, 1995 సంచికలో ప్రచురించారు.
ఎస్.అంజయ్య జాషువా వ్యాసాన్ని విమర్శిస్తూ గుంటూరు నుండి టి.రవిచంద్ రాసిన ఉత్తరం ఉంది. జాషువా అభ్యుదయ కవి అనీ, ఆయన కవిత్వంలో ఆధునిక కవిత్వం ఎలాంటిదో ఆధారాలతో చూపే విధంగా ఈ ఉత్తరం ఉంది. అలాగే ఎస్.అంజయ్య రాసిన వ్యాసంపై కూడా టి.రవిచంద్ విమర్శనాత్మక లేఖాంశాలు ఉన్నాయి. డిసెంబరు, 1995 నాటి సంచికలోనూ జాషువా ఆర్థిక - కుల దృక్పథాన్ని విశ్లేషిస్తూ అంజయ్య గారు రాసిన వ్యాసాన్ని తులనాత్మకంగా పరిశీలిస్తూ టి.రవిచంద్ గారి సుదీర్ఘ ఉత్తరాన్ని ప్రచురించారు.
ఇదంతా చర్చలకు అవకాశమిచ్చే ప్రజాస్వామిక పద్ధతి. జాషువా సాహిత్య దృక్పథంపై 'ప్రజాసాహితి' చర్చను ఆహ్వానించింది. ఇలాంటి చర్చనే 'ప్రజాసాహితి' 'కులవృత్తి కథ'పై కుడా కొనసాగించింది.
సెప్టెంబరు, 2006 (286వ) సంచికలో ఆచార్య కొలకలూరి ఇనాక్ గారు రాసిన 'కులవృత్తి' కథను ప్రచురించారు. కులవృత్తులన్నింటికీ గౌరవం లభిస్తున్నా, మాదిగలు చేసే చర్మకారవృత్తికుండే సరైన గుర్తింపు, వారికి ఆత్మగౌరవం లభించడం లేదనే దృష్టితో నిర్మితమైన కథ 'కులవృత్తి' ఇంకా చెప్పాలంటే చిత్తవృత్తికి భౌతిక వాస్తవికతను శాస్త్రీయ పద్ధతిలో వివరించే కథ ఇది.
అక్టోబరు, 2006 (287వ) సంచికలో ఈ కథపై వివిధ స్పందనలను ప్రచురించారు. డా// శాంతికుమార్, పి.నాసరయ్య, నండూరి రాజగోపాల్లు ఈ కథను తీవ్రంగా విమర్శిస్తూ ఉత్తరాలు రాశారు. అలాగే నవంబరు, 2006 సంచికలో మరికొన్ని ఉత్తరాలను ప్రచురించారు. కథా రచయిత వివరణను కూడా ప్రచురించారు.
'కులవృత్తి' కథను 'ప్రజాసాహితి' ప్రచురించటం సరైందికాదని కొంతమంది, ప్రచురించి చర్చకు అవకాశం ఇవ్వడం ప్రజాస్వామ్య పద్ధతని మరొకరూ, అది ఒక వితండవాదాన్ని ప్రతిపాదిస్తూ, కళ కళ కోసమేననే దృక్పథంతో రాసిన కథ అనీ ఇలా రకరకాల అభిప్రాయాలను వ్యక్తం చేసేటట్లు చర్చ కొనసాగింది.
దివికుమార్ దీనికొక ముగింపునిస్తూ చక్కని సమన్వయాన్నిచ్చారు -
'ఒక అసహజమైన, అమానుషమైన, దుర్మార్గమైన, నీచమైన అస్పృశ్యతతో కూడిన దుష్టకుల వ్యవస్థను తీవ్రాతితీవ్రంగా ద్వేషించలేకపోతున్నాం. కొనసాగుతున్న యథాతథస్థితికి అలవాటుపడిపోయి వున్నాం.... ఇక్కడ రచయిత ఒక అసహజమైన కోర్కెతో సహజమైపోయినదన్నట్టుగా వున్న కులవ్యవస్థపైన ఆగ్రహాన్ని తీవ్రంగా ప్రకటింపజేస్తున్నాడు.... ఉద్దేశ్యం మంచిదే. కంటిని బాగా విప్పారుకునేట్లు చూపాలనే ప్రయత్నంలో కొద్దిగా కాటుక ఎక్కువయ్యింది. అంతే'' అని దివికుమార్ రాశారు.
మొత్తం మీద కులవృత్తి కథపై శాస్త్రీయ దృక్పథంతో చర్చకు అవకాశం కలిగించింది. 'ప్రజాసాహితి'. వీటిని అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని డా// దార్ల వెంకటేశ్వరరావు గారు, 'చిత్తవృత్తికి భౌతిక వాస్తవికతను నేర్పే కథ కులవృత్తి' అంటూ ఒక సుదీర్ఘమైన వ్యాసాన్ని 'ప్రజాకళ' ఇంటర్నెట్ పత్రికలో రాశారు. (జూన్, 2007)
'21వ శతాబ్దంలో సాహితీ విమర్శ' గురించి డా// మేడిపల్లి రవికుమార్ గారి ప్రసంగ వ్యాసాన్ని ఏప్రిల్ 2006 (281వ) సంచికలో ప్రచురించారు.
'ఈ రోజున అనేక కులాల్లో విభజన రావడం, విభజన తారాస్థాయికి వెళ్ళడం, అనేకమైన గ్రూపులలో అస్తిత్వానికి సంబంధించిన చైతన్యం, దళితవాదం, స్త్రీవాదం, మైనారిటీ వాదంలాంటివి రావడం - ఇవన్నీ ప్రపంచీకరణ ఫలితాలే'' అయినా అవన్నీ సంఘటిత రూపానికి దారితీస్తాయనీ, అలాంటి వాదాల నోరు నొక్కేయడం అశాస్త్రీయమని పేర్కొన్నారు. కులపరంగా ఉన్న వర్గాల సమైక్యత గురించి వ్యాఖ్యానిస్తూ ఈ రచయిత ఒక స్వీయానుభవాన్ని జోడిస్తూ ఒక కళాకారుడు కోలాటం నేర్పుతుంటే రానంత జనం, ప్రదర్శనకొచ్చారనీ, ఆ కళారూపాలే ఆ జనం పాటలే ఆ ఊరివారినంతా శాశ్వతంగా కలిపేసిందని చెప్పుకొన్నారు. దీన్ని కుల, వర్గ సమైక్య పోరాటానికి సాధారణీకరించలేం నీ, కళారూపానికి గొప్ప శక్తి ఉందని మాత్రం రచయిత ఉద్దేశ్యమై ఉంటుంది." ఇదే సంచికలో 'వర్గ' సమస్యలో 'కుల' సమస్యను జోడించి పోరాడవలసిన అవసరాన్ని చెప్పే విధంగా ఉన్న డా// దార్ల వెంకటేశ్వరరావు గారు రాసిన 'ఇప్పుడు కావల్సింది!'' కవితను ప్రచురించారు.
'దళిత సమస్యపై రెండు నాటికలు - ఒక పరిశీలన' పేరుతో కె.పాల్రాజ్ రాసిన తులనాత్మక వ్యాసంలో బోయి భీమన్నల 'పాలేరు' చూపిందనీ, విప్లవం ఉదయకుమార్సోని, 'నరమేథం' నాటికల గురించి విశ్లేషించారు. చుండూరు సంఘటనకు వేగంగా ప్రతిస్పందించిన రూపొందించిన నాటిక 'నరమేథం' (ప్రచురణ: అక్టోబరు, 91) దళితులు ఒకరిద్దరుగా పాలేర్ల నుండి ఉద్యోగులుగా మారడాన్ని 'పాలేరు' నాటకం, భూమి సమస్యతో కలిపిన కుల సమస్యను కుల సంఘర్షణకున్న వర్గకోణాన్ని 'నరమేథం' నాటికలో ఉన్నదని, వాటిలో 'నరమేథం విప్లవ దృక్పథాన్నివ్వ గలిగిందన్నారు.
ఇలా కొనసాగిన రచనలన్నింటిలోనూ వర్గదృక్పథం, అదీ దళితులను పీడితవర్గంలో భాగంగా చేసుకున్న దృక్పథంలోనే సృజనాత్మక అభివ్యక్తి జరిగిన రచనలు 'ప్రజాసాహితి'లో కనిపిస్తున్నాయి. దళిత సమస్యలపై వర్గ, భౌతిక దృక్పథంతో శాస్త్రీయమైన చర్చ జరగడానికి అవకాశం కలిగించేటట్లు ఉన్నాయి.
మొత్తం మీద 'ప్రజాసాహితి' జనసాహితి ప్రణాళికలో పేర్కొన్న "భూస్వామ్య - సామ్రాజ్య వాద ఆర్థిక వ్యవస్థ పునాదిగా గల భూస్వామ్య సామ్రాజ్యవాద సంస్కృతిని పూర్తిగా నిర్మూలించకుండా నూతన సంస్కృతి నిర్మాణం జరగదు" అన్నట్లే దళిత సాహిత్యాన్ని ప్రచురిస్తూ, దళిత సమస్యలను విశ్లేషించారు. జనసాహితి కర్తవ్యాలలో 3వదైన "అగ్రకుల దురహంకారులకు వ్యతిరేకంగా దళితులూ, ఇతర ప్రజారాశులూ సాగించే కులోన్మాద వ్యతిరేక పోరాటాలకూ మద్దతునిచ్చే'' దిశగానే 'ప్రజాసాహితి' దళిత దృక్పథాన్ని ప్రదర్శించింది.

"వెంటాడిన అవమానం" కథ : దళిత వాస్తవిక జీవితం




- డా దార్ల వెంకటేశ్వరరావు ,
1.0. ప్రస్తావన :
సమాజం వ్యక్తుల సమూహం. వ్యక్తుల మధ్య వైరుధ్యాలు కనిపిస్తుంటాయి. భారతీయ సమాజంలో వ్యక్తుల మధ్య ఏర్పడే వైరుధ్యాల్లో "కులం" ఒక అనివార్య సందర్భమయిపోయింది. క్రమానుగతి (Hierarchy), వేరుగా ఉండటం (Separation), పరస్పర ఆధారం (Interdependence) వంటి సూత్రాల ఆధారంగా కులం నిర్మితమవుతుంది. ఒకే మూలపురుషుడు కలిగి, ఒకే ఆనువంశిక వృత్తిని పాటిస్తూ, అంతర్వివాహాలు చేసుకుంటూ ఒకే పేరుతో చెలామణి అయ్యే కుటుంబాల లేదా బంధుత్వ సమూహాల స్వాధర్మ్య "కులం" అని సామాజిక శాస్త్ర వేత్తలు నిర్వచించారు. కులం వ్యక్తులకు శుద్ధి (Purity ), అశుద్ధి (Pollution) అనే గుణాన్ని ఆపాదిస్తుంది. తెగ (Tribe)కీ , కులాని (Caste)కీ కొన్ని సమాన లక్షణాల్లో ఉన్నా, "కులం" లో అశుద్ధి, అపవిత్రత వంశ పారంపర్యంగా మారి, అది వారిని శాశ్వతంగా అస్పృశ్యుల్ని చేస్తుంది. అంతే కాకుండా, అస్పృశ్యత అనేది భౌతిక, మానసికపరమైనది. వివిధ పనులు చేయటం వల్ల అది ఏర్పడుతుంది. దాన్ని "సంస్కారాల" రూపంలో తొలంగించుకునే అవకాశం ఉంది. కానీ, మానసికంగా ఏర్పడిన "భావన" మాత్రం అలాగే ఉండిపోయి 'అస్పృశ్యత' కొందరికి "అవమానం"గా పరిణమిస్తుంది. అది జీవితాంతం వెంటాడుతుంది. వంశపారంపర్యంగా వెంటాడుతుంది. కాసుల ప్రతాపరెడ్డిగారు "వెంటాడే అవమానం" పేరుతో ఓ కథ రాశారు. ఒక సామాజిక వాస్తవాన్ని తెలిపేది ఈ కథ. దళితుడికి జరిగే అవమానాన్ని సామాజిక ఉన్నత అంతస్తు (Ascribed Status)లో ఉన్న వాళ్ళు, సామాజిక నిమ్న అంతస్తు (Lowest Social Status) లో ఉన్న వాళ్ళని తమతో సమానంగా చూడటానికి ప్రయత్నిస్తే కలిగే ఆటంకాలను ఈ కథలో వర్ణించారు. దళితులను, దళితేతరులను ఆలోచింపజేసే అనుభూతి ఐక్యత (Unity of Impression) గల కథగా దీన్ని చెప్పుకోవచ్చు.
1.1. కథా సారాంశం :
ప్రశాంత్ రెడ్డి ఓ జర్నలిస్ట్. ఉద్యోగరీత్యా తన భార్యతో పాటు ఊరునుండి వచ్చేసి హైదరాబాదులో నివశిస్తుంటారు. వీళ్ళని చూడ్డానికి ప్రశాంత్ రెడ్డి తల్లి లక్ష్మమ్మ వస్తుంది. ఆ రోజు ఎందుకో తల్లిని తొందరగా తన సొంత ఊరుకి పంపేయాలనుకుంటాడు. అతని అంతరంగం భార్యకే తెలియక అత్తగారిని ఇంకొన్ని రోజులు ఉండమంటుంది. ఆ మాటనే అతన్ని కూడా చెప్పమంటుంది. ఆ మాటని పట్టించుకోకుండా ఆఫీసుకి వెళ్తున్నానీ, ఎండ ముదరకముందే బయలుదేరమనీ తల్లికి చెప్పి ఓ వంద రూపాయలు చేతిలో పెట్టి ఆఫీసుకు వెల్లిపోతాడు. ఆతని తల్లి ఆ ఇంట్లో ఉండటం ఇష్టం లేకనో, ప్రేమ లేకనో కాదు. దానికి ఓ కారణం ఉంది.
ఆ సాయంత్రం భోజనానికి ప్రశాంత్ రెడ్డి ఇంటికి వస్తానని రాహుల్ చెపుతాడు. రాహుల్ది అతని ఊరే. వాళ్ళిద్దరూ ఒకే బడిలో చదువుకున్నారు. ఊరవతల గుట్టల్లో గంటలు గంటలు కూర్చొని మాట్లాడుకునే వారు. "ఎల్లయ్య" అనే పేరుని "రాహుల్" గా మార్చుకుంటాడు. బాగా చదువుకొని హైదరాబాదులోనే ఓ ఉద్యమంలో పనిచేస్తూ, ఈ మధ్యకాలంలో తనకి మళ్ళీ దగ్గరవుతాడు. అతడిని ప్రశాంత్ రెడ్డి ఎన్నోసార్లు భోజనానికి పిలిచేవాడు. రాహుల్ మాత్రం తర్వాత వస్తాననేవాడు. అలాంటి రాహుల్ ఆ రోజు భోజనానికి రావడానికి అంగీకరిస్తాడు. అతని తల్లిగానీ, తండ్రిగానీ ప్రశాంత్ రెడ్డికి ఎదురయితే "దండాలు దొరా" అని కాలు మొక్కుతుంటారు.
ప్రశాంత్ రెడ్డి తన భార్య వీణతో మాట్లాడేటప్పుడు , అప్పుడప్పుడూ రాహుల్ ప్రస్తావన వస్తుండేది. ఆమెకి కూడా రాహుల్ పట్ల జాలీ, సానుభూతి ఏర్పడిందని అతనికి అనిపించేది. ఆ ధైర్యంతోనే రాహుల్‌ని భోజనానికి రమ్మని పిలిచేవాడు. ఆ రోజు రాహుల్ వచ్చేటపటికి తల్లి తన ఇంటి దగ్గర లేకపోతే చాలనుకుంటాడు ప్రశాంత్ రెడ్డి. భార్య తనని అర్థం చేసుకుంటుందనుకుంటాడు. కానీ, "నీకు బుద్ధి లేదు కాబట్టే మాదిగోడికి మంచంలో తిండి పెడతానంటున్నావు" అంటుంది వీణ. "అడ్డమైన వాళ్ళకీ వండి పెట్టనంటుంది. వండి పెడితే ఊరుకోనంటుంది".
ఇప్పుడేం చేయాలి? తన భార్యతో ఘర్షణ తప్పదా? తప్పలేదు. రాహుల్ వచ్చే టైమవుతుంది. రాత్రి ఏడున్నర తర్వాత వస్తాడు రాహుల్ . వచ్చీ రాగానే "అక్క" కనిపించటం లేదేమిటని అడుగుతాడు. "జ్వరం వచ్చింది. పడుకుంది." అని ప్రశాంత్ రెడ్డి సమాధానం చెప్తాడు. "అయ్యో డాక్టర్‌కి చూపించావా" అంటాడు రాహుల్. తలూపి, ఆ తర్వాత కాసేపటికి "హోటల్‌ కెళ్దాం పద" అంటాడు ప్రశాంత్ రెడ్డి. "చెప్పటం మరిచాను దారిలో పాత ఫ్రెండ్ ఒకతను కలిసి బలవంతంగా వాళ్ళింటికి తీసుకెళ్ళాడు. భోజనం చేసిందాకా ఊరుకోలేదు. అందుకే రావటం ఆలస్యమయింది" అని రాహుల్ సమాధానమిస్తాడు. ప్రశాంత్ రెడ్డికి ఏమి మాట్లాడాలో పాలుపోదు. "సారీ" అని మాత్రం అనగలుగుతాడు. రాహుల్ చేతిని దగ్గరగా తీసుకొని ప్రేమగా నొక్కుతాడు. "ఎందుకింత ఇదయి పోతావు, మరోసారి తప్పకుండా "అక్క" చేతి వంట తింటా కదా!" అంటూ, తనకేమీ జరగనట్లే కాసేపు ఉండి, బయలుదేరతాడు. అతనితో పాటు బయటిదాకా వచ్చి సాగనంపేస్తూ, రాహుల్ ఓ వ్యాసంలో రాసిన వాక్యాల్ని గుర్తుచేసుకుంటూ, అతను వెళ్ళే దారిని చూస్తూ నిలబడిపోతాడు ప్రశాంత్ రెడ్డి.
దీన్ని కింది విధంగా విశ్లేషించుకునే అవకాశం ఉంది.
1.2. దళిత వాస్తవిక జీవిత చిత్రణ :
"అంటరానితనం, సాంఘిక అణచివేత, ఆర్థిక పీడన, రాజకీయ అణచివేత, మనుషులుగా పరిగణింప బడకపోవటం, పశువులకన్నా హీనంగా చూడబడటాన్ని 'దళిత వాస్తవికత' " అని డా.ఎస్వీ. సత్యనారాయణగారి అభిప్రాయం. కట్టుబాట్లు, నమ్మకాలు వంటివి దళితేతరుల జీవిత వాస్తవికతగా ఆయనే వివరించారు. వల్లంపాటి వెంకట సుబ్బయ్యగారు కథకు 'జీవితం ముడి సరుకు' అవుతుందని అంటారు. కథా వస్తువు రచయిత జీవితంలోనుంచి కానీ లేదా రచయితకు తెలిసిన ఇతరుల జీవితంలోనుంచి కానీ పుట్టవచ్చు (పు : 21 : కథా శిల్పం - 2000) అనీ, "కథలోని జీవితానికి ప్రాతినిథ్యం వహించగల పాత్రలని అదే జీవితానికి ప్రాతినిథ్యం వహించగలిగిన సంఘటనల్లో పెట్టి వాటి అంతరంగ, బహిరంగ జీవితాలనూ వాటి మధ్య ఉన్నసంబంధాన్నీ లేదా వైరుధ్యాన్నీ చిత్రించుటమే వాస్తవిక కథనం" (పు : 54) అవుతుందన్నారు. అలాగే " పాత్ర మానసిక జీవితానికీ, భౌతిక జీవితానికీ మధ్య ఉన్న సంబంధాన్నీ లేదా వైరుధ్యాన్నీ చిత్రించుటమే నిజమైన వాస్తవికతా వాదం అవుతుందని" (కథాశిల్పం : పు : 54) చెప్పారు.
ఈ అభిప్రాయాలతో పరిశీలించినా, "వెంటాడే అవమానం" వాస్తవిక దళిత జీవితం ప్రతిఫలించే కథే అవుతుంది. మారుతున్న సామజిక పరిస్థితులు, విద్యాఉద్యోగ అవసరాల వల్ల దళిత, దళితేతరుల మధ్య సంబంధాలు తప్పనిసరవుతున్నాయి. అయితే, ఈ బంధం అవసరార్థం ఏర్పడుతున్నా, యాంత్రిక మానవ సంబంధాలుగా కొనసాగుతున్నాయి. అంతే తప్ప భౌతిక , మానసిక అంతరాల్లో భేదాలు తొలగించుకుని కలిసి పోయే మానవ సంబంధాలు కాలేకపోతున్నాయి. దీని వల్ల దళితుల పట్ల జాలీ, సానుభూతీ, అర్థం చేసుకునే పరిస్థితి ఒక వ్యక్తికి కలిగినా, ఆ వ్యక్తికి కుటుంబంతో, సంఘంతో, సమాజంతో కొనసాగవలసిన పటిష్ట బంధానికి ఆటంకాలుగానే ఉనాయి. ఈ విషయాలను కథలో సృజనీకరించి వాస్తవికతను ప్రతిబింబించేటట్లు రాశారు. అందుకనే " వెంటాడే అవమానం" కథలో దళిత, దళితేతరుల మధ్య ఉండే సంబంధాలను కథలో పాత్రల మధ్య ఉండే గాఢతను పరిశీలిస్తే "అనుభూతి ఐక్యత" (Unity of Impression) అనే గొప్ప కథకుండే లక్షణం కనిపిస్తుంది. అంతే కాదు, కథా విమర్శకులు ఆశించినట్లు కథలో సంఘర్షణ ఉంది. " ఇద్దరు వ్యక్తుల మధ్య, ఒకే వ్యక్తిలోని రెండు వ్యక్తుల మధ్యా, రెండు భావాల మధ్యా, రెండు వర్గాల మధ్యా, రెండు సిద్ధాంతాల మధ్యా, రెండు జీవిత దృక్పథాల మధ్యా ..." ఇలా ఎన్నింటి మధ్యనైనా సంఘర్షణ ఉండాలని విమర్శకులు అంటుంటారు (కథాశిల్పం - 2005 : 15). ఈ కథలో కింది విధంగా ఆ సంఘర్షణను వింగడించుకోవచ్చు.
1. దళితులు - దళితేతరుల మధ్య సాంఘిక అసమానతల వల్ల సంఘర్షణ.
2. కలిసి మెలిసి జీవించే విషయంలో సాంస్కృతిక సంఘర్షణ.
3. దళితులు - దళితేతరలు కలిసి మెలిసి జీవిస్తే భౌతిక, భావనావాద సిద్ధాంతాల్లో వారు దేన్ని అనుసరించి జీవించటంలో నిర్ణయించుకునే సంఘర్షణ.
పై మూడింటిలో మొదటిది సాంఘిక, ఆర్థిక కోణాలకు చెందిన సంఘర్షణ. మిగిలిన రెండు అన్ని వర్గాలూ కలిసి మెలిసి బతకటంలో కలిగే సంఘర్షణ ఈ కథలో ప్రశాంత్ రెడ్డికి - కుటుంబంలో తల్లి, భార్యకి మధ్య సైద్ధాంతిక, సాంస్కృతిక ఘర్షణ కనిపిస్తుంది. అది వీణ - ప్రశాంత్ రెడ్డిల సంభాషణల్లో వ్యక్తమయింది. దీనివల్ల "వీణ"లో భావవాదం, గతానుభవాల వల్ల వచ్చింది. రాహుల్ జీవితంలో భౌతికవాదం కనిపించటానికీ గతానుభవాలే కారణమవుతున్నా, పూర్తిగా "భౌతికవాది"గా కనిపించకపోయినా, కత్తి పద్మారావు వంటి వారు అంబేడ్కర్ ఆలోచనా విధానంగా ప్రచారం చేస్తున్న "ప్రత్యామ్నాయ సంస్కృతి" లో భాగంగానే హిందూ కుల సమాజంలో కనిపించే పేరు "ఎల్లయ్య"ను తల్లితండ్రులు పెడితే, అతడు రాహుల్ అని మార్చుకుంటాడు. రాహుల్ అనేది అంబేడ్కర్ నమ్మిన భౌద్దిజానికి సంబంధించింది. కుల నిర్మూలనకు భౌద్ధ దీక్షను తీసుకుంటాడు డా.బి.ఆర్. అంబేడ్కర్. ఇవన్నీ దళితుల ప్రత్యామ్నాయ సంస్కృతికి జరిగే ప్రయత్నాల్లో కొన్ని. "సాధారణంగా నిత్య జీవితానికి పాత్ర ఎంత దగ్గరగా ఉంటే అంతం నమ్మకం కలుగుతుంది. మార్పు లేకుండా ఉండటం (Constitastincy) కథలోని పాత్రలకు ఉండవలసిన మొదటి లక్షణం" (కథాశిల్పం : పు :28). ఈ కథలో ప్రశాంత్ రెడ్డి - వీణ పాత్రలు నిత్య జీవితానికి దగ్గరలో ఉన్నాయి. సంఘర్షణ కూడా దగ్గరగానే ఉంది.
ఈ కథలో ప్రశాంత్ రెడ్డికి భయపడో, సర్ది చెప్పటం వల్లనో తన భార్య "వీణ" మనస్తత్వం మారిపోతే కథలో సంఘర్షణ బయటకు రాదు. అప్పుడు కథ పేలవం అయిపోతుంది. "వీణ" మారలేదు. చివరకు ఒకే సైద్ధాంతిక దృక్పథానికి కట్టుబడి ఉండటం వల్లనే, కథలో రచయిత చెప్పదలచిన "సమస్య" పట్ల, పరిష్కారం పట్ల పాఠకుడు లోతుగా ఆలోచిస్తాడు. ఇదే కథకు ప్రాణం వంటిది. కథలో సాధరణంగా ఒక నేపథ్యం చిత్రితమవుతుంది. స్థలం (Place ), కాలాల (Time) చిత్రణే కథాసాహిత్యంలో నేపథ్య (Setting) చిత్రణ ( కథాశిల్పం : పు : 34) అవుతుంది. దీన్ని బట్టే రచయిత చిత్రించవలసిన "సమస్య" తీవ్రత అర్థమవుతుంది.
1.3. కథా నేపథ్య చిత్రణ - సమయ తీవ్రత :
ఒకరోజులో ఈ కథ జరిగినట్లుగా రచయిత వర్ణించారు. ఒక్కరోజులో కులనిర్మూలన, అస్పృశ్యతా నిర్మూలన అనే జరిగేవి కాదు. పొద్దున్నే ప్రశాంత్ రెడ్డి స్నానం చేయడానికి వెళ్తుండగా ప్రారంభమైన కథ రాత్రికి ముగిసింది. కథలో పగలు అంతా ఉన్నది తానూ, తన భార్య. చీకటిలో వచ్చి, చీకటిలోనే ఒంటరిగా కలిసిపోయినవాడు రాహుల్. తాను అనుభవిస్తున్న వెలుగుని, తన తోటివారికి పంచాలనో, ఆదుకోవాలనో ఆశించటంవల్లనే "రాహుల్"తో కాసేపయినా చీకటిలో ప్రశాంత్ రెడ్డి నిలబడ్డాడు. వెలుతురు కోసం చీకటిలో కలిసిన వాడికోసం చూస్తూ నిలబడ్డాడు. ఈ కథలో వెలుతురు ఉండగా కనిపించిన పాత్రలు మూడు. చీకటిలో వచ్చి చీకటిలోనే వెళ్ళిపోయిన పాత్ర ఒకటి. మూడింటిలో ఒక వర్గం, ఒంటరివాడి తోడు కావాలంటే, తాను తన వ్యవస్థ నుండి బయటకు వచ్చేయాలి. అప్పుడూ రెండు వేరు వేరు సమాజలవుతాయి తప్ప మూడు + ఒకటి = నాలుగు (3+1=4) పాత్రలూ కలిసిన సమాజం కాదు. రాహుల్‌లో ఆశావాదంగా "అక్క చేతివంట తప్పకుండా మరోసారి తింటానని" అనుకుంటూనే, తాత్కాలికంగా అవమానం వెంటాడినా దాన్ని జయించి, అందరిలో కలిసే రోజు వస్తుందనే ఆకాంక్ష కనిపిస్తుంది. దానికి ఏమీ చేయాలని ప్రశాంత్ రెడ్డి ఆలోచించటమే ప్రశాంత్ రెడ్డి మనసులో రాహు రాసిన వ్యాసంలో వాక్యాల్ని గుర్తు చేసుకుంటూ నిలబడటం. కనుక నాలుగు వర్ణాల వాళ్ళు కలిసి మెలిసి బతకడం ఎలాగో పాత్రానుగుణంగా, సంఘర్షణాత్మక సన్నివేశాలతో ఈ కథ నిర్మిత మయిందని స్పష్టమవుతుంది.
1.4. సమస్య తీవ్రతకు కారణం - అస్పృశ్యత :
భారతదేశంలో కులం అస్పృశ్యతలో అంతర్భాగమయిపోయింది. అస్పృశ్యత అనేది భౌతిక, మానసికమైన మైల (Imupurity) వల్ల ప్రపంచ దేశాల్లో ఉందని "అస్పృశ్యులెవరు?" అనే గ్రంథంలో డా. బి.ఆర్. అంబేడ్కర్ పరిశోధనాత్మకంగా చర్చించారు. "అశుచి, మైల, కళంకం, అపవిత్ర్త, అంటు, అపరిశుభ్రత, మురికి అనే భావాలు అస్పృశ్యతకు దారి తీస్తాయనీ, ఈ కళంకం నుండి తప్పించుకుని బయట పడే మార్గాలు కూడా ఈ భావనలో ఇమిడి ఉంటుందని" డా. బి.ఆర్. అంబేడ్కర్ భావించారు (అస్పృశ్యులెవరు? 1992 : 235) "ఆదిమ సమాజం కేవలం మైల (Pulltion) పడడం అనే భావన పట్ల నమ్మకం కలిగి ఉండటమే కాదు, నిర్దిష్టమైన కర్మకాండలు, ఆచార వ్యవహారాలు అనుసరించే ఒక జీవన విధానం ఆవిర్భావానికి కూడా ఈ అస్పృశ్యత అనే భావన దారి తీసింది. "వస్తువుల్ని తాకడం ద్వారా ద్వారా సంక్రమించే "మైల" విషయానికొస్తే, ఆదిమ మానవుడు కొన్ని వస్తువుల్ని పవిత్రమైనవిగా, మరికొన్ని అపవిత్రమైనవిగా పరిగణించటం అలవర్చుకున్నాడు. పవిత్రత అనే భావన కేవలం వస్తువులకు మాత్రమే తప్పనిసరిగా పరిమితం కానక్కరలేదు. కొన్ని తరగతుల మనుషులు కూడా పవిత్రులుగా పవిత్రులుగా పరిగణించబడ్డారు" (పు: 237).
పొలినేషియన్‌ తెగల్లో, 'ఉగాండా' దేవాలయంలో, దక్షిణాప్రికాలో, న్యూజిలాండ్‌లో, ఈజిప్టు గ్రీకు రోమన్‌లలో కూడా మైలపడటం అనే భావన ఉన్నట్లు అంబేడ్కర్ వివరించారు. ఈ మైల భౌతికమైనదిగానూ, భావనాత్మకం (నమ్మకం) గానూ ఉంటుందని మనువు చెప్పిన ఆంశాన్నీ అంబేడ్కర్ పేర్కొన్నారు (పు : 243). అయితే మైల నుండి కొంతమంది మాత్రమే సంస్కారాల రూపంలో తొలగించుకోవచ్చు అనే నిబంధనలను భారతదేశంలో పటిష్టంగా అమలు చేశారు. మరికొంత మందికి మాత్రం సంస్కారాల రూపంలో కూడా అపవిత్రతను తొలగించుకునే అవకాశమే లేకుండా చేశారు.
హిందువులు పాటించే మరొక రకమైన అస్పృశ్యత ఉన్నది. ఇది కొన్ని జాతులకు వంశపారంపర్యంగా సంక్రమిస్తున్నది. ఇది కొన్ని జాతులకు వంశ పారంపర్యంగా సంక్రమిస్తుంది. 1935 భారత ప్రభుత్వ చట్టం జారీ చేసిన ప్రభుత్వ ఉత్తర్వుల్లోనే 9 భాగాలుగా విభజించి, మైల పడే కులాల వాళ్ళుగా 50 నుండి 60 మిలియన్ల ప్రజలు ఉన్నారనీ, సుమారు 429 అస్పృశ్య కులాలు ప్రభావితమవుతున్నాయనీ అంబేడ్కర్ సోదాహరణంగా నిరూపించారు (పు : 245, 246, 256).
పై వివరణలన్నీ అస్పృశ్యత అనేక దేశాల్లో ఉన్నా, భారత దేశంలో అస్పృశ్యత కులంతో మిళితమైందనీ స్పష్టమవుతుంది. అంతే కాకుండా భౌతిక, మానసిక భావనగా ఇది గాఢమైన ముద్రను వేస్తుంది. కనుకనే, "వెంటాడే అవమానం" కథలో ఊరికి తల్లిని త్వరగా పంపేయటం, తల్లి ఉంటే ఊరిలోనూ తెలిసిపోతుందనీ ప్రశాంత్ రెడ్డి భయపడటం, తన భార్యలో ఆ భావాలు స్పష్టంగా ప్రకటితం కావడం అనే నేపథ్య చిత్రణ కథలో సమస్య తీవ్రతను బాగా చూపగలిగింది. ప్రశాంత్ రెడ్డి స్నానానికి వెళ్ళటం, దళితుల్లో కలిసి పోవాలనుకోవటం, దళితులను తమతో కలిసిపోవమనటానికో, సంస్కరణగానో తరతరాల అస్పృశ్యతను సంస్కరించే ప్రయత్నాన్ని చేశారు రచయిత. అలాగే ప్రశాంత్ రెడ్డి భార్య అంట్లు తోమడం, కడగటంలో కూడా ఆమెలో భౌతికంగా, మానసికంగా రావలిసిన మార్పుని ప్రతీకాత్మకంగా పాత్ర వర్ణన, సన్నివేశ కల్పనలలో సృజనీకరించారు. కథలోని సమస్య సంఘర్షణకు పరిష్కారాన్ని తప్పకుండా చూపించాలనిగానీ లేదా చూపించకూడదని గానీ వాదించటం మొరటువాదంగా విమర్శకులు భావిస్తున్నారు. పరిష్కారం అనేది కథలోనించే సహజంగా రూపొందాలి. పరిష్కారాన్ని బలవంతగా కథ మీద రుద్దటం శిల్ప పరంగా బాధ్యతా రాహిత్యం మాత్రమే అని కథా విమర్శకులు (కథా శిల్పం: పు : 16) చెప్పారు. అయితే, కథలో ముగింపు విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ విషయాన్నే కథాశిల్పం రాసిన విమర్శకుడు వివరిస్తూ " కథ రాయటం పూర్తి చేశాక ప్రారంభాన్నీ, ముగింపునీ తీసేయాలని అంటే వాటిని అదృశ్యంగా ఉంచాలని వాటిని పాఠకుని ఊహా శక్తికి పదును పెట్టాలని" అన్నారు. దీనికి వెంటాడిన అవమానం కథ సరిగ్గా అతుకుతుంది.
1.5. కథకుడిచ్చిన పరిష్కారం:
"వెంటాడిన అవమానం" కథలో పరిష్కారాన్ని ఎక్కడా వాచ్యంగా చెప్పలేదు. అయితే దాన్ని suggestive గా పరిష్కారాన్ని స్ఫురింపజేసి మంచి నైపుణ్యంతో ముగించారు. పాఠుకుని ఊహా శక్తిని బట్టే పరిష్కరాలు వెలువడాలని ఆకాంక్షించారు. అస్పృశ్యతగా పరిణమించి వ్యక్తుల మధ్య భౌతిక, మానసిక అంతరాలకు కారణమవుతున్న ఈ సమస్యను పరిష్కరించుకోవటం దళిత - దళితేతరుల మధ్యే ఉంది. అది ప్రత్యామ్నాయ సంస్కృతి వలన సాధ్యమా? సాంస్కృతికీకరణా వలన సాధ్యమా? లేక ఆ రెండింటినీ మించిన ఉదాత్త జీవన విధానమా? అనేది "అందరూ కలిసి మెలిసి ఉండే ఆలోచనగా" దళిత - దళితేతర మేధావులు చేయగలగాలి. అది భావ, భౌతిక వాదుల కలయికతో ఏర్పడేదై ఉండాలి. అస్పృశ్యత అనే భావన తొలగిపోయిన తర్వాత భావ భౌతిక వాదాల సంఘర్షణలో ఏదో ఒకటి లేదా ఒక కొత్త శక్తి పుట్టుకొచ్చి మానవులందరినీ కలిసి మెలిసేటట్లు చేయగలుగుతుంది.
1.6. ముగింపు :
"వెంటాడిన అవమానం" కథలో రచయిత కాసుల ప్రతాప రెడ్డి తరతరాలుగా ఉన్న అనేక రకాలైన అస్పృశ్యతలకు సంబంధించిన భౌతిక, మానసిక భావనలను స్పృశించారు. అలాంటి అస్పృశ్యత కొన్ని వందల సంవత్సరాలుగా కులంలో కలిసిపోయింది. అంబేడ్కర్ కూడా భౌతిక, భావవాదాల కలయికగా అస్పృశ్య భావనను చూడగలిగి, భౌతిక దృష్టి వైపు పయనించమనే ఆలోచనను అందించారు. భావవాదం, అదీ భారదేశంలో మతం, కర్మకాండలు, విశ్వాసాలతో ముడి పడి ఉండటం వల్ల ఆ వాదాన్ని నమ్మే, ఆచరించే, ప్రోత్సహించేవాళ్ళ సంఖ్య అధికంగానే ఉంటుంది. అందువల్లనే భావవాదం మాసిపోవడమో, నశించడమో, రూపుమాపటమో సులభమైన మార్గమైతే అంత దగ్గరలో లేదు. శాస్త్ర సాంకేతిక రంగాలు బాగా అభివృద్ధి చెందాలి. శాస్త్రీయ దృక్పథం అలవడాలి. సాంఘికీకరణ ప్రక్రియలు శాస్త్రీయ కోణంలో అమలు జరగాలి. అంతే కాదు, నేటికీ సమాజంలో శాస్త్రీయంగా ఋజువుకానివి ఎన్నో ఉన్నాయి. శాస్త్రానికి అందని వాటిని శాస్త్రీయంగా నిరూపించటానికి కేవలం ఇప్పుడున్న పరిశోధనల మీదనే ఆధారపడితే సరిపోదు. కానీ, శాస్త్రీయ దృక్పథం ఏర్పడాలని మాత్రం "వెంటాడిన అవమానం" కథ ప్రబోధిస్తుంది. దళిత వాస్తవిక జీవితాన్ని విశదీకరిస్తుంది.

13 నవంబర్, 2007

సాహిత్యం లో స్త్రీ జీవిత చిత్రణ: భావజాల ప్రభావం











- డా//దార్ల వెంకటేశ్వర రావు

మన ప్రాచీన తెలుగు సాహిత్యం స్త్రీని ఒక భోగ వస్తువుగా చిత్రించటంలో భావజాలం ప్రాత్ర చాలా ఉంది. రామాయణం, మహా భారతం, భాగవతం, ప్రబంధాలు, శతకాలు మొదలైన వాటిన్నింటిలోనూ ఈ భావజాల ప్రభావం ఉంది.సర్వ సాధారణంగా భావజాలం దేశ , కాలానుగుణంగా రూపొందుతుంది. మన భారత దేశంలో వేదాలు, స్మృతులు, పురాణాల రూపంలో హిందూభావజాలం ఉంది .

ఇది తరువాత కాలంలో ” హిందూ ధర్మ సూత్రాలు” గా ప్రచారం పొందింది. ఈ భావజాలం ప్రధానంగా వర్ణ,లింగభేధాలతో రూపొందింది. కొన్ని వర్ణాలవారిని కర్మపేరుతో ఇంచుమించు బానిసలుగానే మార్చుకున్నారు.రామాయణకాలంలో కర్మ సిధ్ధాంతాన్ని వ్యతిరేకించినందుకు శంబూకుడు మొదలైన వార్ని మరణశిక్షవిధించటానికీ వెనుకాడకపోవటానికీ ఈ భావజాల ప్రభావమే ప్రధాన కారణం. ఈ భావజాల ప్రభావమే ‘ ఆదర్శం’ పేరుతో సీతాదేవిని అగ్నిప్రవేశం చేసేలా పురిగొల్పింది. అన్ని చేసినా శ్రీరాముడ్నే సీతాదేవి ‘ తన దైవం’గా భావించటంలోనూ భావజాల ప్రభావం ఉంది. పరిశోధన దృష్టితో చూస్తే హిందూ భావజాలాన్ని ఆధారంగా చేసుకొని స్త్ర్రీని పురుషుడు తనబానిసగా ఎలా మార్చుకున్నాడో స్పష్టమవుతుంది.
హిందూభావజాలంలో జెండర్ సమస్య సామాన్యమైనదికాదు. స్త్రీని శూద్రురాలుగా పరిగణించారు. ఒకప్పుడు మహోన్నతమైన సింధూనాగరికతా కాలం నాటికి మాతృస్వామ్య వ్యవస్థ ఉండగా, ఆర్యులు భారత దేశంలో ప్రవేశించిన తరువాత,నెమ్మదినెమ్మదిగా పితృస్వామిక వ్యవస్థకు పయనించేటట్లు చేయగలిగారని పరిశోధనలు తెలుపుతున్నాయి.కారల్ మార్క్స్,ఏంగిల్స్ , డి.డి.కోశాంబి, రోమిల్లాథాపర్ , ఆర్ . ఎస్. శర్మ తదితరుల పరిశోధనలు ఈ విషయాన్ని స్పష్టంచేస్తున్నాయి. ఆనాటి సమాజంలో అధిక సంఖ్యలో స్త్ర్రీదేవతలు పూజింపబడినా , క్రమేపీ పురుష దేవుళ్ళు పూజలందుకోవటం ప్రారంభించిన తరువాత స్త్ర్రీ దేవతల స్థానం అధమస్థాయికి పోవటం లోనూ ఈ భావజాలం పాత్ర ఎంతో ఉంది.
మన తెలుగులో నీతిశతకాలు పేరుతో కొన్నిశతకాలను పిలుస్తున్నారు . అంతే కాకుండా” నీతి శతకములు సర్వజన హితకరములైనవి…విషయ బాహుళ్యమును బట్టి నీతి శతకములు సర్వజనపఠనీయములగుచున్నవి” ( డా. జి. నాగయ్య ‘ తెలుగు సాహిత్య సమీక్ష , రెండవ సంపుటి. 1996: 568) అనే అభిప్రాయంలో ఈ శతకాలు ప్రచారం లో ఉన్నాయి. శతకాల్లో నీతి లేక పోలేదు. కానీ , ఆ నీతి అందరికీ సంబంధించిందికాదు. అది ప్రధానంగా పురుష దృక్పథం నుండి రూపొందింది.
నీతి శతకాల్లో ఒక విశేషమేమిటంటే , వాటిలో కొన్ని సార్వ జన ,సార్వకాలిక నీతులుంటాయి . వాటిని చూపుతూ తమభావజాలాన్ని చాలా జాగ్రత్తగా అందరిలో ఇంజెక్ట్ చేస్తుంటాయి . 16, 17 శతాబ్దాల్లోనే అనేక అభ్యుదయభావాలను వివిధ పద్యాలుగా వెదజల్లిన వేమన పద్యాల్లోనూ స్త్రీ పట్ల చాలా నిరసన భావాలు కనిపిస్తాయి. అయితే , అందులో వేమన చెప్పిన అసలు పద్యాలెన్ని అనేది నేటికీ పరిశోధనాంశాల్లో నలుగుతునే ఉంది. ఆ పరిశోధన ఫలితాలు తెలిసే వరకూ మాత్రం స్త్రీ పట్ల వ్యక్తమైన వేమన భావాలు స్త్రీని అవమానించే విధంగానే ఉన్నాయని భావించక తప్పదు. “నీతి శతకాల్లో ఎడనెడ కొంత నీతి కనిపిస్తున్నప్పటికీ స్త్రీల విషయంలో చాలా తప్పుడు భావాలను కలిగి ఉన్నాయి… సుమతీ, వేమన శతకాల్లో చాలా వరకు సంస్కృత శతకాల ప్రభావం ఉంది” అని కత్తి పద్మారావు గారు (భారతీయ సంస్కృతిలో స్త్రీ 1993: 172) అనటంలోనూ భావజాల ప్రభావం శతక కర్తల పై ఉందని తెలుస్తుంది.
సాధారణంగా ప్రతి సాహిత్యం ,సాహిత్య ప్రక్రియా ఆ సమాజ పరిస్థితులకు అణుగుణంగానే రూపొందుతుంది. అలాగే మన తెలుగు సాహిత్యం కూడా సృజనీకరించబడింది. కనక, ఆనాటి సమాజ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఆ సాహిత్యాన్ని విమర్శించాలనే ఒక నియమం విమర్శకుల్లో ఉంది. ఆ పద్ధతిలో సాహిత్యాన్ని అంచనా వేయటమే సద్విమర్శ అవుతుంది . ప్రాచీన సాహిత్యమంతా పాతచింతకాయ పచ్చడని కోట్టేయడానికీ వీల్లేదు. కానీ , ‘గతకాలము మేలు వచ్చుకాలము కంటెన్’ అంటే మాత్రం ఒప్పుకోలేరు! ఎప్పుడూ ఒక కాలం లో వచ్చిన సాహిత్యం నుండిఅందరూ గ్రహించవలసినవి కొన్ని మాత్రమే ఉంటాయి. ఎప్పుడూ సర్వజన హితం, సర్వకాలయోగ్యంగా ఉంటాయని భ్రమించటం మాత్రం అవగాహన రాహిత్యమే అవుతుంది. ఆ అవగాహననే అందరిపై రుద్దాలనుకున్నప్పుడు సమస్యలు ఉత్పన్నం అవుతుంటాయి. ప్రాథమిక పాఠశాలల్లో నీతి పద్యాలు పెట్టాలనుకుంటున్నారు. మంచిదే. కానీ, ఎలాంటి పద్యాలు పెడతారో గమనించవలసి ఉంది. లేక పోతే చిన్న నాటి నుండే బాలబాలికల్లో విష భీజాలను నాటడానికి ప్రయత్నించడమే అవుతుంది. అది పెరిగి పెద్ద జెండర్ సమస్యగా మారుతుంది.



( ప్రజాకళ మార్చి 2007 సౌ జన్యంతో... పునర్ముద్రితం )

12 నవంబర్, 2007

ఎవరీ ఆమ్రపాలి ?


ఆమ్రపాలి కథ రసభరితమయినది. దీన్ని సినిమాలుగా కూడా తీశారు. ఇంకా తీస్తున్నారు. ఆ కథలో అంత ఆకర్షించిన అంశాలేమిటి? ఇలా ఆలోచిస్తూ మన తెలుగులో ఎవరైనా ఆమ్రపాలి కథను రాశారా? అనుకుంటూ చూశాను.తెలుగులో చాలామంది బౌద్ధ మతేతివృత్తంతో వివిధ కావ్యాలను రాశారు.
గౌతమబుద్ధుని బోధనలకు ఆకర్షితులైన వాళ్ళలో వేశ్యలు కూడా ఉన్నారు. వేశ్యగా మారడానికి కారణాలెన్ని ఉన్నా, మరలా సాధారణ స్త్రీగా ఆమె తన జీవితాన్ని గడపాలనుకుంటే, ఈ సమాజం ఎంతవరకూ అంగీకరిస్తుందనేది ఒక పెద్ద ప్రశ్న! ఆ ప్రశ్నకు సరైన సమాధానమే బుద్ధుడు ఆమ్రపాలిని బౌద్ధమతంలోకి ఆహ్వానించడం. బౌద్ధ హిందూమతంలో అనాచారులుగా కనిపించే చాలా వాటిని సంస్కరించే ప్రయత్నం కనిపిస్తుంది. సమాజ నిరాదరణకు గురయిన వాళ్ళనెంతోమందిని దరి చేర్చుకొని, తక్కువ కాలంలోనే విస్తృతంగా వ్యాపించ గలిగింది. సామాజిక నిర్బంధాల కారణంగా గణభోగ్యగా మారిన ఆమ్రపాలి కథ ఇంచుమించు అన్ని భారతీయ భాషలలోను ఎంతో ప్రాచుర్యం పొందింది. తెలుగులో చాలామంది ఈ కథను రాశారు. ఈ వ్యాసంలో ఇద్దరు రాసిన కావ్యాలను, మరొకరు రాసిన నవలను తీసుకొని, ఆ కథను ఆయా రచయితలు ఎలా తీర్చిదిద్దారో పరిశీలించే ప్రయత్నం చేస్తాను.‘ఆమ్రపాలి’ బౌద్ధ జాతక కథను యస్.టి.జ్ఞానానంద కవిగారు ఎనిమిది ఆశ్వాసాలుగాను, కరటూరి సత్యనారాయణగారు ఏడు సర్గలుగాను విభజించి ‘ఆమ్రపాలి’ అనే పేర్లతో కావ్యాలుగా రాశారు. జ్ఞానానందకవిగారు శాంతాన్నీ, కరటూరి వారు ‘కరుణ’ను ప్రధాన రసాలుగా పోషించారు.
ఇరువురు కవులూ ఆమ్రవనంలో ‘ఆమ్రపాలి’ అనాధగానే దొరికినట్లు పేర్కొన్నారు. లల్లాదేవి మాత్రం పూర్తి భిన్నంగా కథను సామాజిక అంశాలతో పరిశీలించి రచించారు. ఆమ్రపాలి అసలు పేరు ‘ఉదాయి’గా మార్పు చేసి, ఆమ్రవనంలో నివసించటం వల్ల ‘ఆమ్రపాలి’గా మారినట్లు, ఆ పిల్ల పుట్టిన తరువాత తల్లిదండ్రులు చనిపోయినట్లు లల్లాదేవి మార్పులు చేశారు.యస్.టి. జ్ఞానానందకవిగారు తన కావ్యంలో పిల్లలు లేని మహానామునికి (శాక్య ధనికునికి) ‘ఆమ్రపాలి’ దొరకగా, కరటూరి వారి కావ్యంలో ఆనందుడనే కొడుకు కలిగిన శాక్యధనికునికి ఆ పసిపిల్ల దొరికినట్లు చిత్రించారు.
ఆడపిల్ల పెళ్ళీడుకొస్తుంటే, పెళ్ళి చేయాలనే తపన తండ్రికి ఎలా పెరుగుతుందో అది జ్ఞానానందకవిగారి కావ్యంలో బాగా కనిపిస్తుంది. కానీ, కరటూరివారు, ‘తండ్రి రాజ్య నిర్వహణా భారంలో పడి కూతురికి వివాహం చేయటం మరచిపోయినట్లు రాశారు. ఇటువంటి ప్రయత్నమేదీ లల్లాదేవి నవలలో కనిపించలేదు. ఆమ్రపాలి తండ్రి లిచ్ఛవుల మనస్తత్వాన్ని ఎప్పటికప్పుడు గమనిస్తూ, వారి వల్ల కూతురికి ఏ ముప్పు వాటిల్లుతుందోననే భయంతో ఉండేవాడనీ, కనుక సరియైన సమయంలో తగిన వరుణ్ణి చూసి వివాహం చేయాలని భావించి స్వయంవర సభను ఏర్పాటు చేసినట్లు జ్ఞానానందకవిగారు వివరించారు.గణతంత్ర రాజ్యాలలో అందమైన యువతి కనిపిస్తే, ఆ దేశ పాలకులు గణభోగ్యగా చేసుకొనే ఆచారం ఉంది. శాక్యధనికుడు గణతంత్ర రాజ్యానికి చక్రవర్తి అయినా, పాలకులంతా ఏకమయి తీర్మానిస్తే తన కూతురినయినా గణభోగ్యగా చేయవలసిందే! కానీ, ‘స్వయంవరం’ అనేది ఒక సంప్రదాయం మాత్రం ఉంది. స్వయంవరంలో యువతికి నచ్చిన యువరాజుని పెళ్ళి చేసుకొనే స్వేచ్ఛ ఉన్నా, అది గణనాయకుడైన చక్రవర్తి చేతిలో ఉండదు. గణరాజ్యాలలో ఒక గణ పరిషత్తు ఉంటుంది. విధి, విధానాలను అన్నింటినీ ఆ గణపరిషత్తే నిర్ణయిస్తుంది.
అందుకనే స్వయంవర సభలో గణపరిషత్తులో సభ్యులైన లిచ్ఛవ రాజులు అందగత్తె అయిన ఆమ్రపాలి తమకే చెందాలని, ఇతరులకు చెందకూడదనీ పట్టుపడతారు. గణనాయకుడైన శాక్యధనికుణ్ణి, లిచ్ఛవులు తమ అభిప్రాయం ప్రకారం జరగకపోతే తీవ్ర పరిణామాలు ఎదురౌతాయని హెచ్చరిస్తారు. గణనాయకుడైనా తండ్రికి నామమాత్రమైన అధికారాలే ఉన్నాయని ఆ పరిస్థితిని గమనించి సభలోనే ఉన్న ఆమ్రపాలి ‘గణభోగ్య’గా ఉండటానికి అంగీకరిస్తుంది. అందుకుగాను కొన్ని నియమ నిబంధనలను విధిస్తుంది. తనతోపాటు మొదటినుండీ సభల్లోనూ, రాచకార్యాల్లోనూ పాల్గొన్నట్లు జాగ్రత్తపడ్డారు జ్ఞానానంద కవిగారు.
కరటూరివారు లిచ్ఛవుల్లో ‘అభయుడు’ అనే బలవంతుడైన మూర్ఖుడు ఆమ్రపాలి పట్ల వ్యామోహం పెంచుకుని, లిచ్ఛవులను రెచ్చగొట్టి, ఆమ్రపాలికి పెళ్ళి చేయకపోవటం వల్లనే రాకుమారులు రాజ్యంలో అశాంతిని సృష్టిస్తూ, ఒకరినొకరు చంపుకుంటున్నారని రాజైన శాక్యధనికునికి నివేదించినట్లు వర్ణించారు.
సభలో మహానాముడిని ‘గణభోగ్య’గా ఆమ్రపాలిని చేయమని పట్టుపట్టడం తనకో ధర్మం, పరులకో ధర్మం పని చేయదని లిచ్ఛవులు రాజుని వ్యతిరేకించటం వల్ల మహానాముడే ఆమ్రపాలిని, ఆమె అంగీకారాన్ని కూడా తెలుసుకోకుండా ‘గణభోగ్య’గా ప్రకటించాడు. ఆ విషయాన్ని, కూతురైన ఆమ్రపాలికి చెప్పటానికి బాధాతప్త హృదయుడై ఆమె భవనానికి వెళతాడు. వెళ్ళి కూడా అక్కడే మాట్లాడకుండా కూర్చుండిపోతాడు. తండ్రిని చూసి, ఆమ్రపాలి బింబిసారుని వల్ల మోసగింపబడిన విషయం ఎక్కడ తెలిసిపోయిందోనని, అందుకే ఎంతో ప్రేమగా పిలిచి ఆదరించే తండ్రి తాను చేసిన పనికి బాధపడుతున్నాడనుకొంటుంది. ఈ సన్నివేశం చక్కని నాటకీయతతో సాగింది. జరిగిన విషయాన్ని అంతటినీ తండ్రికి చెప్పేసి, శత్రురాజైన బింబిసారుడని తెలియదనీ, దేశద్రోహం చేయననీ, క్షమించమనీ ప్రాధేయపడుతుంది.
తండ్రి ఆమ్రపాలిని సముదాయించి, అనివార్యమైన పరిస్థితుల్లో గణభోగ్యగా చేయవలసి వచ్చిందని, సభా విషయాలను ఆమెకు తెలుపుతాడు. ఆ సందర్భంలోనే ఆమ్రపాలి తనకు ఆమ్రవనంలో దొరికిందనీ, స్వంత కుమారుడైన ఆనందుడినీ నిన్నూ ఒకేలా పెంచాననీ చెపుతాడు.తెలిసిన విషయాలు ఇరువురికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఆమ్రపాలి దేశభక్తి (దేశంలో అల్లకల్లోలాలను ఆపడం కూడా దేశభక్తిగానే భావిస్తుంది.) దేశం కోసం దేనికైనా సిద్ధమవుతాననీ, బింబిసారుని చేతిలో మోసపోయినందుకు క్షమించమని చెపుతుంది.
ఇది జరిగిన తర్వాత కూతురు గురించి బెంగ పెట్టుకొని తండ్రి కొన్నాళ్ళకు చనిపోతాడు. ఆనందుడు బౌద్ధ సన్యాసిగా మారిపోతాడు. ఆమ్రపాలికి పుట్టిన కొడుకు ‘విమలకొండ’ను వేశ్య బిడ్డగా సమాజం గౌరవించదని ఆనందుడు చెప్పటం వల్ల బౌద్ధ సంఘంలో చేరటానికి తల్లి అంగీకరిస్తుంది. కానీ కొడుకు పట్ల పుత్ర వాత్సల్యం వీడలేకపోతుంది. ఏదో ఒక నెపంతో పుత్రుణ్ణి చూడాలనే బుద్ధుని దగ్గరకు వెళ్ళి, బుద్ధుణ్ణి, ‘కొడుకుని తల్లి నుండి విడదీయడం ధర్మమేనా?’ అని నిలదీస్తుంది. బుద్ధుడు జీవిత సత్యాన్ని, దుఃఖ నివారణను చెప్పటం వల్ల ఆమె బౌద్ధ సంఘంలో చేరగలుగుతుంది.
లల్లాదేవి రాసిన ‘ఆమ్రపాలి’ నవలలో కథను పరిశీలిస్తే ‘ఉదాయి’కి తల్లిదండ్రులు చనిపోవడంతో, వైశాలినీ రాజ్యంలో ఉన్న బంధువుల ఇంటికి మేనమామ ఆ పిల్లను తీసుకొని వెళుతుంటాడు. మార్గమధ్యంలో దొంగలబారిన పడటంతో మేనమామ చనిపోతాడు. భైరవుడనే మంచి దొంగ ఆ పసిపిల్లను చేరదీసి వైశాలినీ నగరానికి చేర్చి యశోదేవి దగ్గర విద్యాభ్యాసం కొనసాగేలా దోహదపడతాడు. గురువుగారి దగ్గర విద్యాభ్యాసం అభ్యసిస్తూ రాజుగారి అనుగ్రహం పొంది, వారి ఆదరణకు పాత్రమవుతుంది. ఆమె చేసిన నాట్యానికి మెచ్చి, నర్తకి పదవినిచ్చి ఒక ఆమ్రవనాన్ని కేటాయించి, దానిలో చక్కని భవనాన్ని నిర్మించాలని రాజు చేతనుడు ఆదేశిస్తాడు. ఆమె ఆమ్రవనంలో ఉండటం వల్ల ‘ఆమ్రపాలిక’గా, తర్వాత ‘ఆమ్రపాలి’గా పిలువబడుతుంది.
భవన నిర్మాణానికి వినియోగించిన శిల్పులలో లౌకిక విషయాలను పట్టించుకోని ‘ఉదయుడు’ అనే శిల్పి ఏకాగ్రతతతో శిల్పాలను చెక్కుతుంటాడు. అతని శిల్ప నైపుణ్యాన్ని ఆమ్రపాలి అభిమానిస్తుంది. అతని దగ్గరే ఎక్కువసేపు గడుపుతుండేది. ఆమె కూర్చున్న భంగిమను ఒకసారి ‘ఉదయుడు’ చూసి చక్కని శిల్పాన్ని చెక్కుతాడు. ఆ శిల్పంతోపాటు, బుద్ధుని ప్రశాంతమైన విగ్రహాన్ని కూడా ఆమెకు బహూకరిస్తాడు. ఉదయునుడి పట్ల ఆసక్తిని పెంచుకోవడం గమనించిన రాజు ఆ శిల్పిని మరొక చోటికి పంపాలనుకొంటాడు. ఉదయునుడు ఒక స్వేచ్ఛాజీవి. ఎవరి నియమ నిబంధనలకు తలొగ్గనివాడు. రాజుగారి ఆజ్ఞ ప్రకారం మరోచోటికి శిల్పాలను చెక్కటానికి వెళ్ళమంటే ఇష్టపడక ఆ రాజ్యమే వదిలిపోతాడు.
బుద్ధుని ప్రశాంతమైన శిల్పాన్ని చూస్తూ బుద్ధుని గురించి, అతని ఆశయాలు, ధర్మాలను గురువుగారి సహాయంతో తెలుసుకొని, బుద్ధుణ్ణి దర్శించాలని తహతహలాడుతుంటుంది ఆమ్రపాలి. అదే సమయంలో ఒక బౌద్ధ భిక్షువు ఆ రాజ్యం వచ్చాడని తెలిసి తన భిక్షను స్వీకరించమని ప్రార్థిస్తుంది. ఆ బౌద్ధ భిక్షువు మొదట అంగీకరించి ఆమె ఇంటికి వెళ్ళి భిక్షను స్వీకరించాలనుకొంటాడు. అంతలో ఒక ధనస్వామి అనే ధనవంతుడు ఆ విషయాన్ని తెలుసుకొని ఆ బౌద్ధ భిక్షువుతో, ‘ఆమె ఒక వేశ్య’ అనీ, ఆ భిక్షను స్వీకరించవద్దనీ, మా ధనవంతుల దగ్గర స్వీకరించమనీ చెపుతాడు. ఆ బౌద్ధ సన్యాసి వెంటనే ఆమె పెట్టే భిక్షను తిరస్కరిస్తాడు. దానితో ఆమె ఎంతో బాధపడుతుంది. వేశ్య అంటే ఏమిటో, ఆ జీవితం ఎలా ఉంటుందో అని ఆలోచిస్తూ, తనకి తెలియకుండానే ఒక వేశ్యావాడలోని ఒక ఇంటికి నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. అక్కడ ‘ఆమ్రపాలి’ని కొంతమంది పట్టుకొని వేశ్యగా ముద్రవేసి, రాజు చేత ఆమెను నర్తకి పదవి నుండి తప్పించి, రాజ్య బహిష్కార శిక్ష వేస్తారు. బుద్ధుడు ఆ నగరం వచ్చేవరకూ ఏ తిండీ బట్టా పట్టించుకోకుండా నిరీక్షించి, బుద్ధుని కరుణ వల్ల బౌద్ధ సన్యాసినిగా మారటంతో కథ ముగుస్తుంది.
ముగ్గురు రచయితలూ మూడు విధాలుగా ‘ఆమ్రపాలి’ కథను తీర్చిదిద్దారు.జ్ఞానానందకవిగారు తండ్రి పాత్రను పోషించటంలో ఔన్నత్యాన్ని, నైతిక విలువలను పాటిస్తూ సమయోచితంగా, సందర్భోచితంగా వర్ణించినట్లు అవగతమవుతుంది. దీనికి ముందు నుండే కథను చక్కని ప్రణాళిక వేసుకొన్నారనిపిస్తుంది. రాచకార్యాల్లో పాల్గొనడం, ఆమ్రపాలికి ఏర్పాటుచేసిన ‘స్వయంవర సభ’లోనే గణభోగ్య నిర్ణయం జరిగినట్లూ రాశారు.కరటూరి వారి కావ్యంలో అప్పటికే తప్పు చేసి ఉండటం వల్ల, తండ్రి అప్పటికే ఆమెను గణభోగ్యగా అంగీకరించటం వల్ల ‘గణభోగ్య’గా ఆమె అంగీకరిస్తూ, పైకి దేశభక్తి పూత పూసినట్లు అనుకోవడానికి అవకాశం కలుగుతుంది. కానీ, కావ్యాన్ని చదువుతున్న పాఠకునికి ఆ నాటకీయత అబ్బురపరుస్తుంది.
జ్ఞానానందకవీ, కరటూరి వారూ ఇద్దరూ కూడా ‘ఆమ్రపాలి’ గణభోగ్యగా మారిన తర్వాత తండ్రి పాత్రను బాగా చిత్రించారు. జ్ఞానానందకవిగారు, ఆమ్రపాలి తండ్రి పాత్రను కావ్యంలో మరలా ప్రవేశపెట్టకుండానూ, కరటూరివారు, ఆమ్రపాలి తండ్రి బెంగ పెట్టుకొని మరణించినట్లు బాగా రాశారు. జ్ఞానానందకవిగారు ‘ఆమ్రపాలి’ గణభోగ్యగా మారిన తర్వాత కథను ఆమె నుండే చూశారు. పెంచిన తల్లిదండ్రుల కోణం నుంచి చూడలేదు. ఇది చక్కని కథన శిల్పం.లల్లాదేవిగారి నవలలో ‘ఆమ్రపాలి’ వేశ్యగా ముద్ర వేయబడుతుంది. ఆమెకు తెలియకుండానే వేశ్యావాడకు పోతుంది. అక్కడకొంతమంది యువకులు ఆమెను నిర్బంధించి వేశ్యగా మార్చినట్లు రాశారు. అక్కడ వేశ్య జీవితచిత్రణను వర్ణించటంలో లల్లాదేవి పరిశీలన చక్కగా వ్యక్తమవుతుంది. దొంగల గుంపుకి దొరికిన ఉదాయి అడవిలో పాడుపడిన దేవాలయం మీద ఉన్న నాట్యభంగిమలను చూసి, ఆమె నాట్యాన్ని అభ్యసించాలనుకొన్నది. సాధన వలన నాట్యాన్ని సాధించింది. ఆ నాట్యమే ఆమ్రవనాన్ని, నర్తకి పదవిని వచ్చేలా చేసింది. అదే ఆమెను ‘వేశ్య’గా అనుమానించేలా చేసింది. ఆ అనుమానంలో నుండి వచ్చిన అవమానమే ఆమెను బౌద్ధభిక్షువుగా మార్చి, సన్మార్గంవైపు పోయేటట్లు చేసింది.
యస్.టి. జ్ఞానానందకవిగారి ‘ఆమ్రపాలి’ బింబిసారుణ్ణి ప్రేమించింది. బింబిసారుడూ ఆమెను కోరుకున్నాడు. తర్వాత ఇరువురిలో ఎవరిని ఎవరూ ద్వేషించుకోలేదు. బింబిసారుడు మాత్రం ఆరురోజులు ఆమె భవనంలో ఉండి, దొంగచాటుగా వచ్చిన అతని రాకను లిచ్ఛవులు పసిట్టడం, అతడిని జాగ్రత్తగా దాచటం, ఆమెను విడిచి వెళ్ళిపోయేటపుడు ఒక ఉంగరాన్ని ఇవ్వటం, ఒకవేళ కొడుకు పుడితే, ఉంగరమిచ్చి పంపమని చెప్పి వెళ్ళిపోతాడు. తన కోసం చిత్రించిన చిత్రపటంలో బింబిసారుణ్ణి ఆకర్షించి, ఆలోచిస్తుండగా చెలికత్తె ఆమె హృదయాన్ని పసిగట్టడం, రాయబారం నడపడం వంటివన్నీ చేస్తుంది. బింబిసారుని పాత్రను కావాలనే కావ్యనాయకునిగా, కవి తీర్చిదిద్దలేదేమో ననిపిస్తుంది. ఆమెను బింబిసారుడు అనుభవించటానికే ప్రయత్నించినట్లు తేలుతుంది. అయితే ఉంగరాన్ని ఇచ్చి, కొడుకు పుడితే, ఉంగరం చూపితే తన పుత్రునిగా స్వీకరిస్తానని చెప్పటం అతని స్వభావాన్ని తేటపరిచే విషయాలుగా గమనించే వీలుంది.
‘గణభోగ్య’గా జీవితాన్ని గడుపుతున్న ఆమ్రపాలి తనలో తాను తీవ్ర సంఘర్షణకు లోనై ఒకసారి తాను దొరికిన ఆమ్రవనానికి ప్రశాంతత కోసం రావటంతో, అక్కడ తొలిసారిగా బుద్ధుని దర్శనమవుతుంది. ఆనాటి నుండే ఆమెలో బుద్ధుని ప్రవచనాలు లౌకిక విషయాల పట్ల కోరికను తగ్గించి, అలౌకిక విషయాల పట్ల ఆసక్తిని కలిగిస్తాయి. బుద్ధుని రాక కోసం నిరీక్షిస్తూ, తీరా బుద్ధునికి భిక్షను పెట్టాలని ప్రయత్నించినపుడు ఆ నగరంలోని ధనవంతులు వ్యతిరేకిస్తారు. బుద్ధుని దర్శనాన్నీ బుద్ధుని శిష్యుడు కూడా అడ్డుకుంటాడు. కానీ బుద్ధుని జోక్యం వల్ల ఆమెకు అతని దర్శనం కలగటం, ఆమె పూర్వజన్మలో నెమలి అనీ, ఇంద్రుని శాపం వల్ల ‘ఆమ్రపాలి’గా జన్మించిందని, ఆమె జన్మ వృత్తాంతాన్ని బుద్ధుడు వివరించటంతో ప్రజల్లో ఎక్కడలేని ఆదరణ కలుగుతుంది. బుద్ధునికి భిక్షను పెట్టి, తన సర్వవిద్యలనూ బౌద్ధ సంఘ వ్యాప్తికే వినియోగిస్తూ జీవితాన్ని గడపాలని నిర్ణయించుకొంటుంది.
జ్ఞానానందకవిగారు ‘ఆమ్రపాలి’ కావ్యాన్ని చారిత్రక తత్త్వకావ్య లక్షణాలతో చక్కగా అన్వయించే ప్రయత్నం చేశారు. జ్ఞానానందకవిగారి ‘ఆమ్రపాలి’ కావ్యంలో బుద్ధుని బోధనలు అడుగడుగునా కన్పిస్తుంటాయి. మరో విశేషమేమంటే, ఈ కావ్యంలో అన్ని పాత్రలూ ఆమ్రపాలి వైపు నడవగా, ఆమ్రపాలి బుద్ధుని ధర్మాలవైపు, బుద్ధుని వైపు పయనిస్తుంది. బౌద్ధమతంలోని ఆర్యసత్యాలనూ, త్రిరత్నాలనూ, అష్టాంగమార్గాన్ని కావ్యానికి అన్వయించి బౌద్ధ ధర్మేతిహాసంగా మలచగలిగారు.
జ్ఞానానందకవిగారి ‘ఆమ్రపాలి’ కావ్యంలో మరికొన్ని విశేషాలు ఉన్నాయి.ఆమ్రపాలి గణభోగ్యగా జీవితాన్ని గడుపుతూ మానసిక ప్రశాంతత కోల్పోయి, సంఘర్షణ పడుతూ, తీవ్రవ్యధకు లోనై గుండెల్లో దుఃఖాన్ని పోగొట్టు కోవాలని తాను దొరికిన ఆమ్రవనంలోకి వస్తుంది. కరుణ హృదయుడైన బుద్ధుడు అక్కడ తపస్సు చేసుకుంటూ కనిపిస్తాడు. అతడిని ఆమె ఎవరో ముని అనుకొని ఆమెలో తీరని కోరికను నర్మగర్భితంగా వ్యక్తీకరించి అతనిని తన ఇంటికి రమ్మనమనీ, సర్వసౌఖ్యాలనూ సమకూరుస్తానంటుంది.బుద్ధుడు ఆమె మనోవాంఛను గమనిస్తాడు.
చాలా మృదువుగా, ప్రశాంతంగా, జీవిత సత్యాలను వివరిస్తాడు. అంతేకాక ఆమె బౌద్ధ భిక్షువుగా మారిన తరువాత ఆమెతోపాటు బౌద్ధారామానికి వచ్చిన మిగిలిన ప్రజలకు నాలుగు ఆర్యసత్యాలను వివరిస్తాడు.బౌద్ధధర్మ మూలసూత్రాలలో సర్వమూ క్షణికమనేది ఒక మూల సూత్రం.ఇది ప్రపంచం దుఃఖమయమనే దాన్ని స్పష్టం చేస్తుంది. పుట్టిన ప్రతివారికీ మరణం తప్పదు. అయినా ఆశలు పెంచుకుంటారు. ప్రపంచంలో దుఃఖం లేకపోవటంగాని, పుట్టిన జీవి మరణించకపోవటమనేది కనిపిస్తే ఎంతో సంతోషం కదా! అని బుద్ధుడు చెబుతాడు.
మానవుని శరీరం వయః పరిణామాన్ని అనుసరించి క్షణక్షణం మారుతూ మట్టిలో కలిసిపోతుందనే విషయాన్ని కవి ‘నాల్గు దశల మధ్య నవయుచు నున్నటి’ అని వర్ణించారు. దృశ్యమాన ప్రపంచంలోని సర్వమూ అనిత్యమేనని దానివల్ల తెలుస్తుంది.దుఃఖానికి కారణం కోరికలు అనేది బుద్ధుడు బోధించిన నాలుగు ఆర్య సత్యాల్లో రెండవది.ఇంద్రియాలకు ప్రియమైన విషయ సంపర్కం, వాటి స్మృతి, కోరిక (తృష్ణ)లకు కారణమవుతుంది. ఆ కోరికలు పూర్తి కాగా త్యజించగలిగినపుడు దుఃఖం నివారింపబడుతుంది. ఇది మూడవ ఆర్యసత్యం.ఆమ్రపాలి ఎన్నో కోర్కెలతో రగిలిపోతూనే బుద్ధుని ప్రథమ దర్శనం చేసుకొన్నది. బుద్ధుడు జీవితం క్షణికమైనదనే జీవిత సత్యాన్ని బోధించడం, తన తపస్సు పూర్తయిన తరువాత భిక్షను స్వీకరించటానికి వస్తానని చెప్పి పంపితే బుద్ధుని పునరాగమనం వరకూ భిక్షను సమర్పించటానికి ఎదురుచూస్తూనే ఉంది. అప్పటికి ఆమెలో కోరికలు నశించిపోయాయి. తాత్కాలికమైన లౌకిక భోగాల నుండి శాశ్వతమైన విముక్తి మార్గానికి సిద్ధమై ఉంది. దీనికంతటికీ కారణం ఆమెలో వివాహం చేసుకోవాలనీ, సర్వసౌఖ్యాలను అనుభవించాలనీ ఉన్న కోర్కెలన్నీ నశించటమే. కొడుకుని, తండ్రిని, సర్వస్వాన్నీ వదిలి బుద్ధుని శిష్యగణంలో చేరిపోతుంది. ఆమె దుఃఖం నుండి విముక్తి పొందుతుంది. ఈ విధంగా చారిత్రక తత్త్వ కావ్యంగా జ్ఞానానందకవిగారు ‘ఆమ్రపాలి’ కావ్యాన్ని తీర్చిదిద్దారు.
బుద్ధుని బోధనలు సమాజం మీద ఎంత ప్రభావాన్ని చూపాయనేది తెలియజేసే కథలు ఎన్నో వస్తున్న నేపథ్యంలోనే ‘ఆమ్రపాలి’ కావ్యాలు, నాటకాలు, నవలలు కూడా వెలువడ్డాయి. మానవ విలువలను, మానవ సంబంధాలను పటిష్టపరచడంలో బౌద్ధేతివృత్త కావ్యాలు చాలావరకూ తోడ్పడ్డాయి. అలా నిరూపించే బౌద్ధజాతక కథలలో ఆమ్రపాలి కథ ఉత్తమమోత్తమ కథ. ఇంకా చాలామంది తెలుగు రచయితలు కూడా ఆమ్రపాలి కథను తీసుకొని వివిధ ప్రక్రియలలో రచనలు చేసినవారు ఉండవచ్చు.
సౌజన్యంతో
( సెఫ్టెంబర్ 2007 సంచిక, ప్రజాకళలోఈ నా వ్యాసంప్రచురితమైనది. )

05 నవంబర్, 2007

ప్రజాకళ ( నవంబర్ 2007)లో "ముస్లిం మైనారిటీ కవిత్వం లో స్త్రీవాద దృక్పథం" వ్యాసం!

మిత్రులారా!
సమకాలీన తెలుగు సాహిత్యంలో ముస్లిం మైనారిటీ కవిత్వం శక్తి వంతంగా వస్తోంది. దీనిపై నేను రాసిన ఒక వ్యాసాన్ని ప్రజాకళలో ప్రచురించారు. ఆసక్తి ఉన్నవాళ్ళు అది చదివి మీ అభిప్రాయాలను నాతో పంచుకోమని కోరుతున్నాను.

06 సెప్టెంబర్, 2007

ప్రజాకళలో నావ్యాసం

ప్రజాకళ మాస పత్రిక ( సెప్టెంబరు 2007)లో నావ్యాసం అధికారం, ఆప్యాయతల మధ్య నలిగిన స్త్రీ జీవితమే ‘ఆమ్రపాలి’ కథ ప్రచురితమైంది.
దీనిలో ముగ్గురు రాసిన మూడు రచనలలో ఉన్న ఆమ్ర పాలి కథను తులనాత్మకంగా విశ్లేషించే ప్రయత్నం చేశాను.
దీనిపై మీ అభిప్రాయాలను కోరుతున్నాను.
మీ
దార్ల