పద్యపారిజాతాలు
పరిమళింప చేసిన పూలతోట ‘దార్లమాట’
డా. పి. విజయకుమార్
వైస్ ప్రిన్సిపాల్ & తెలుగుశాఖాధ్యక్షులు ఎస్.ఎమ్.ఎల్. ప్రభుత్వ కళాశాల ఎమ్మిగనూరు, కర్నూలు జిల్లా.
పద్యవిద్యను సుజన హృద్యంబుగా చేయడానికి మాటలను పూలతోటగా మలచిన పద్యతోటమాలి దార్ల వెంకటేశ్వరరావు, శతకసాహిత్యవికాసంలో భాగంగా కొత్త దారిలో వెళ్లి పద్యపూలతోట పూయించిన శతకకారుడు దార్ల. 'దార్లమాట' శతకం ఆధునిక యువకవులకు పద్యం పట్ల అభిమానాన్ని పెంచిందనవచ్చు. పద్యం ఎంత హృద్యంగా చెప్పవచ్చో, ఆధునిక వ్యవహారంలో మనస్సుకు హత్తుకునేటట్లు ఎలా రాయవచ్చో 'దార్లమాట' శతకం ఒక మార్గదర్శిగా భావించవచ్చు. ఈ పద్యాలను పరిశీలిస్తే నవతరానికి పద్యం పట్ల ప్రోత్సాహాన్ని పెంచే విధంగా ఉన్నాయి. నిష్కల్మషంగా, ముక్కుసూటిగా, హుందాగా ప్రవర్తించే దార్ల వ్యక్తిత్వం ప్రతి పద్యంలో పరిమళించింది. శక్తి, ముక్తి కలగడానికి శతకం ఒకటే చాలు అంటూ 'శతక' సాహిత్యవిశిష్టతను తెలియజేసిన విశిష్ఠుడు దార్ల,
‘’త్రాగి కారు నడుప తప్పయినప్పుడు
ఓటు వేయునపుడు నోటు నిచ్చి
తనకు వేయుమనుట తప్పుకాదందురా
దార్ల పూలతోట దార్ల మాట’’
మద్యం తాగి కారు నడిపితే తనకే కాక ఇతర ప్రయాణికులకు పెనుప్రమాదం కల్గుతుంది. ప్రజాస్వామ్య పతాక ఓటును నోటుతో కొని తనకే ఓటు వేయమనడం తప్పుకాదా! అని ప్రశ్నిస్తూ హెచ్చరించడం పై పద్యంలో ప్రతిధ్వనించింది. సామాజిక కర్తవ్యబోధ ప్రధానంగా దార్ల ప్రతి పల్కులో ప్రస్ఫుటమవుతుంది.
అమ్మ యనెడు మాట అమృతంబు కురిపించు
అయ్య యనెడు మాట హాయి నిచ్చు
మమ్మి డాడి యనెడు మాటలింకేరా
దారిపూలతోట దార్లమాట
మాతృభాషను మాతృమూర్తి కంటె అమితంగా ప్రేమించే అమృతమూర్తి దార్ల, వేణియనాద వినోదంలా వీనులవిందైన అమృతభాష మన మాతృభాష, కాని నేడు అమృతవాక్కులైన, ఆత్మీయ వారధులైన అమ్మ, అయ్యలను వదలి మమ్మి, డాడీల సంస్కృతి పట్ల ఆవేదన వ్యక్తం చేయడం కనిపిస్తుంది.తి నకలిగిన నాడు తిండిదొరకని పరిస్థితి, తినడానికి ఉన్ననాడు తినలేని అనారోగ్యస్థితి. శివుడు బిచ్చమెత్తి ఆనాడే తిండి విలువ చెప్పాడంటాడు. పుణ్యఫలాలనిచ్చే పుణ్యభూమి రాయలసీమ అని, ఆ నేలలోనే తిరుమలలో శ్రీనివాసుడు, కాణిపాకంలో గణపతి సిరులు కురిపిస్తున్నారని నేలమహిమను కొనియాడాడు. లేపాక్షి బసవన్న లేచివచ్చునేమో అన్న విధంగా తరచిచూస్తే లేపాక్షిలో అద్భుతాలు కనిపిస్తాయి. లేపాక్షిలో వ్రేలాడే 'శిల' లాంటి అద్భుతాలను గూర్చి వ్యక్తం చేశాడు. రాయలసీమ కేవలం కరువునేల కాదు కళలకు పుట్టినిల్లంటాడు. బంగారు, వజ్రాలకు నెలవైన వనరులున్న ప్రాంతంగా అభివర్ణించాడు. ప్రత్యేకంగా చెప్పుకునే 'రాగి సంకటి' రుచి రాయలసీమదే అని గుర్తు చేస్తాడు. రాయలసీమ రాళ్ళసీమకాదు. రతనాలసీమ అని, తత్త్వజ్ఞాని ఊటలూరు పోతులూరి, రాజ్యమేలిన రాయలు, రాయలసీమ వారే అని రాయలసీమరాజసాన్ని వ్యక్తం చేశాడు.
సమకాలీన విషయాలను పద్యంలో అక్షరబద్ధం చేయగల నేర్పరి, కూర్పరి దార్ల, గుప్తనిధులు, ఘనులను గుర్తించగలిగినది గూగులమ్మ మాత్రమేనని ఇలాంటి పెద్ద మనుషులు మనసువిప్పి నిజం చెప్పరని, గూగుల్ని నిజం చెప్పే తల్లిగా గూగులమ్మగా పరిగణించి వాస్తవిక కోణాన్ని ఆవిష్కరించారు. ఈనాడు ప్రజలు వయసు పెరిగేకొద్ది అనారోగ్యం పాలవుతున్నారని, నిద్రలేచిన దగ్గర నుండి నిద్రపోయేంత వరకు మాత్రలు మింగుతూనే ఉంటున్నారని, మాత్రలతోనే బొజ్జనిండుతుందని వ్యంగ్య ధోరణిలో ప్రస్తుత జీవన స్థితిగతులను వ్యక్తం చేశారు. అవసానదశలో వరాలు వద్దు షుగర్ మానితే చాలు అని ప్రాధేయపడుతుంటారని, మనలను చంపేసఖి 'మధుమోహనాంగిరా' అని వ్యంగ్యంగా షుగర్ వ్యాధితో ఇబ్బంది పడుతున్న వైనాన్ని ఏకరవు పెట్టాడు. ‘మృత్యువు' అంటేనే మనిషి అనునిత్యం భయపడతాడని మనిషి ఏనాడైనా మరణించక తప్పదు కాని ముందే మనిషి ఏనాడైనా చనిపోతానని తెలిస్తే ముందుగానే నరకాన్ని అనుభవిస్తారంటాడు. మనిషికి 'కరుణ' సహజలక్షణంగా ఉండాలి. కాని, కార్పోరేట్'లో 'కరుణ' అనే మాట తరచిచూసిన కనపడదని వాపోతాడు.
ఇంటివద్ద చూడు ఇల్లాలి ముచ్చట్లు
ఇంటిచుట్టు కట్టు ఇంకు గుంత
ఇంటి పొదుపు తెలుపు ఇంకుడు గుంతలే
దారి పూలతోట దార్ల మాట
ఇంకుడు గుంతల విశిష్టతను చాకచక్యంగా తేటతెల్లం చేశాడు, రాయలసీమ నీకు నీళ్ల విలువ తెలుపుతుంది.
కోనసీమ నీకు కోరినంత ఇస్తుంది. "తెచ్చిపంచునెపుడదే భాగ్యనగరము" అంటాడు.
"విత్తనమును బట్టి వికసించు బుద్ధులు
మట్టి యొక్కటైన మానువేరు
మనుషులంత యొకటి మర్మంబువేరయా
దారి పూలతోట దార్ల మాట"
అంటాడు. మనుషుల్లోని మర్మం గురించి సూటిగానే ఆవిష్కరించిన తత్త్వం దార్ల వేంకటేశ్వరరావుది, మనకు తెలియకుండానే మన పేరు ప్రచురిస్తున్న వైనం సమాజంలో కనిపిస్తుంది. ఆ వివరాలను పరిశీలిస్తే విస్తుపోయే పరిస్థితి ఉందని వాపోతారు.
కులము, మతములన్ని కుత్సితబుద్ధులు
కలపవలయుగాని కలహమేల
మంచికన్న మించు మానవత్వము లేదు
దారి పూలతోట దార్ల
మంచి గంధంలాగే పరిమళించే మానవత్వం దార్ల వెంకటేశ్వరరావుకి సహజ అలంకారం, కులం, మతం పేరుతో కుత్సితబుద్ధుల్లాగా కొందరు వ్యవహరిస్తున్నారని, నిత్యం కలహాలతో విభేదించుకుంటున్నారని 'మంచి' కంటే మించిన మానవత్వమే లేదంటారు. మతం అంటే హితం, మంచి అనే భావన వెలిబుచ్చారు.కలిమిలేములన్ని కష్టసుఖాల్లాంటివని, కుటుంబాలలో రక్తబంధానికి సాటి మరేది లేదని ఆ విలువలు కాపాడుకోవాలని హితవు పలికాడు.
‘’ప్రక్కనున్న వారి పలుకుల కన్నను
ప్రొద్దుపోక చేయు ఫోనుముద్దు
దగ్గరున్న నేమి దౌర్భాగ్యమిద్దిరా
దారిపూలతోట దార్లమాట”
ప్రస్తుతం ఇల్లల్లో వింత పరిస్థితులు దర్శనమిస్తున్నాయి. ప్రక్కనున్న వారి పలుకులకన్నా ప్రొద్దుపోక చేసే ఫోను ముద్దుగా భావిస్తున్న దౌర్భాగ్యపరిస్థితులను దుయ్యబట్టాడు.
"శిలను చెక్కి శిల్పి శిల్పముగ మలుచు
కఠినహృదయమైన కరుగునట్లు
సహృదయతను నింపు సాహిత్య పఠనంబు
దారిపూలతోట దార్లమాట”
శిల్పి శిలను శిల్పంగా మలుస్తాడు. సాహిత్య పఠనం కఠిన హృదయాన్ని కరిగించి సహృదయతను నింపుతుందని, సత్త్వగుణం నేర్పుతుందని, సాహిత్య పఠనం యొక్క ఆవశ్యకతను, పరమార్థాన్ని నొక్కి వక్కాణించాడు.
'రచన' ఎవరిదైనా ఉన్నతంగా ఉంటే కీర్తించగలం, కాని మనవాడే కాబట్టి, మనసు చంపుకొని పొగడలేమని, మంచి రచన మనసులో చిరస్థాయిగా నిలిచిపోతుందని, అటువంటి రచనలను మరచిపోలేమంటాడు. సమాజంలో తెల్లదొరలు పోయి నల్లదొరలు వచ్చారని, మనిషి మనసు ముందు మారాలని హితవు పలికాడు.
జీవితం నీటిబుడగలాంటిదంటాడు. ఉన్నవాటి విలువ ఉన్నప్పుడు ఎరుగరు. లేనినాడే దాని విలువ తెలుస్తుంది. తిండిలేనినాడే తిండి విలువ తెలుస్తుంది. అరగనపుడే ఆరోగ్యం విలువ తెలుస్తుందంటాడు. మహనీయుడు ఎక్కడున్నా మంచి పుష్పంవలే పరిమళిస్తాడంటాడు. ఏదీ శాశ్వతం కాదు ఊపిరున్న వరకు సంతోషంగా ఉండమంటాడు. ఉన్నంతలో ఉన్నంతకాలం ఆనందంగా జీవించడమే ఉత్తమ జీవనధర్మం అని ప్రబోధిస్తాడు.. ఇలా సమకాలీన సమాజంలో ఎన్నో పార్శ్వాలను తన అనుభవాలతో వివేచించి పద్యపారిజాతాలను పరిమళింపజేసి కొత్తదారి వేసిన దీర్ఘదర్శి దార్శనికుడు దార్ల.
***