"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., Ph.D., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL 801 Research Methodology ఉదయం11.00 నుండి12.00 గంటల వరకు, TL-426: Indian Literature క్లాసులు మధ్యాహ్నం 2.00 గంటల నుండి 3.00 గంటల వరకు జరుగుతాయి.

దళిత లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
దళిత లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

27 మార్చి, 2022

దళిత సాహిత్యంపై సాహిత్య అకాడమీ సదస్సులో పాల్గొన్న ఆచార్య దార్ల (26.3.2022)

ఆంధ్రజ్యోతి దినపత్రిక, 27.3.2022 సౌజన్యంతో



వరుసగా ఆచార్య గుండెడప్పు కనకయ్య, ఆచార్య దార్ల వెెంకటేశ్వరరావు, ఆచార్య బన్న అయిలయ్య, ఆచార్య మేడిపల్లిరవికుమార్, డా. కోయికోటేశ్వరరావు, ఆచార్య ఏ.జ్యోతి
భూమిపుత్ర దినపత్రిక, 27.3.2022 సౌజన్యంతో



మాట్లాడుతున్న డా.యస్.రఘు, వేదికపై ఆచార్య కనకయ్య, ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు



 నిన్న (26.3.2022) కాకతీయ విశ్వవిద్యాలయం, తెలుగుశాఖలో సాహిత్య అకాడమీ ప్రాంతీయ కార్యాలయం, బెంగుళూరు వారి ఆధ్వర్యంలో జరిగిన ‘తెలుగు దళిత సాహిత్యం’ ఒకరోజు సదస్సులో పాల్గొని, దళిత దీర్ఘకావ్యాలు అనే అంశంపై పరిశోధన పత్రాన్ని సమర్పించాను. 

ఆచార్య బన్న అయిలయ్యగారు నన్ను ఆహ్వానించారు. గత రెండు, మూడు నెలల క్రితం దీన్ని ప్రణాళిక వేశారు. కరోనా తగ్గిన తర్వాత బయటకు వెళ్ళి ఒక సదస్సులో పాల్గొనడం ఇదే ప్రథమం.  

నమస్తే తెలంగాణ దినపత్రిక, 27.3.2022 సౌజన్యంతో

మాట్లాడుతున్న ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు

వేదికపై ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు



మాట్లాడుతున్న ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు

ఫోటోలో వరుసగా ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, వి.ఆర్. విద్యార్థి, ఆచార్య బన్న అయిలయ్య, డా. ఎస్. రఘు, వాసిరెడ్డి నవీన్, ఆచార్య పి కనకయ్య, ఆచార్య మేడిపల్లి రవికుమార్ తదితరులు



వేదికపై మాట్లాడుతున్న ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు



మన తెలంగాణ దినపత్రిక, 27.3.2022 సౌజన్యంతో





10 జనవరి, 2022

ఆచార్య కొలకలూరి ఇనాక్ గార్కి ‘‘పద్మశ్రీ’’ - నా శుభాకాంక్షలు

(ఆచార్య కొలకలూరి ఇనాక్ గార్కి భారత ప్రభుత్వం ‘పద్మశ్రీ’ ప్రకటించిన సందర్భంగా ఆయనకు నా హృదయపూర్వకశుభాకాంక్షలు తెలియజేస్తూ... ఆయన జీవితం,సాహిత్యాన్ని పరిచయం చేసే ఈ వ్యాసాన్ని ప్రచురిస్తున్నాను. దార్ల)

:






తెలుగు సాహిత్యంలో
మహోన్నత శిఖరం ఆచార్య కొలకలూరి ఇనాక్‌
-డా దార్ల వెంకటేశ్వరరావు
ప్రొఫెసరు, తెలుగు శాఖ,
సెంట్రల్‌ యూనివర్సిటి, హైదరాబాదు ` 500 046.



                సృజన, పరిశోధన, విమర్శన రంగాల్లో తనదైన ముద్రవేసిన గొప్ప సాహితీవేత్త ఆచార్య కొలకలూరి ఇనాక్‌ గారికి సి.పి.బ్రౌన్‌ అకాడమీ పురస్కారాన్ని ప్రకటించి, సాహిత్య విలువల్ని పెంపొందించడంలో ముందువరుసలో నిలిచే ప్రయత్నం చేసింది. తెలుగు భాషా,సాహిత్యాలకు సి.పి.బ్రౌన్‌ చేసిన సేవ అభ్యుదయమార్గంలో సాగింది. అంతవరకూ నిర్లక్ష్యానికి గురైన వేమన సాహితీ ప్రపంచానికి తెలిసాడంటే దానిక్కారణం సి.పి.బ్రౌన్‌. నిఘంటువుల్ని రూపొందించడంలోను, తెలుగు ప్రబంధాల్ని సంపాదించి, వాటికి వ్యాఖ్యానాల్ని రాయించి, అందరికీ అందించడంలోను ఆయన చేసిన సేవ విస్మరించలేనిది. అలాంటి మార్గంలోనే పయనించిన వారు ఆచార్య కొలకలూరి ఇనాక్‌.
సి.పి.బ్రౌన్‌ పుట్టుకతోనే ధనవంతుడైతే, ఆచార్య ఇనాక్‌ దీనికి పూర్తి వ్యతిరేకమైన ఆర్థిక, సామాజిక పరిస్థితుల నుండి వచ్చినా, ఇరువురూ క్రైస్తవమతం భావాల్ని ఆచరించే కుటుంబం నుండి రావడం విశేషం. అందుకేనేమో తాము చేసే ప్రతి పనినీ దైవసమానంగా భావించటం ఇరువురిలోను కనిపిస్తుంది.
బ్రౌన్‌ కాలేజీ గా పండితుల్ని ఒక బృందంగా పరిశోధన చేయించడం, తానూ చేయడం సి.పి.బ్రౌన్‌లో కనిపించినట్లే, ఆచార్య ఇనాక్‌ గారిలోనూ ఇలాంటి పరిశోధక లక్షణం కనిపిస్తుంది. వీరి పర్యవేక్షణలో సుమారు 24 మంది పిహెచ్‌.డి., 18 ఎం.ఫిల్‌., పరిశోధనలు చేసి, డిగ్రీలు తీసుకున్నారు. సుమారు 198 జాతీయ, అంతర్జాతీయ సదస్సుల్లో పరిశోధన పత్రాల్ని సమర్పించారు. సమారు 180 పరిశోధన పత్రాలు ప్రచురించారు. శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ‘‘ తెలుగు వ్యాస పరిణామం’’ పై పరిశోధన చేశారు. అదే విశ్వవిద్యాలయానకి వైస్‌ ఛాన్స్‌లర్‌గా పదవీ బాధ్యతలు నిర్వహించడం ఒక చారిత్రక సన్నివేశం. నన్నయ నుండి ఆధునిక పత్రికా రచయితల వరకూ తెలుగు వ్యాసపరిణామం కొనసాగిన తీరు తెన్నుల్ని విశ్లేషిస్తూ,వ్యాసాల్ని రాయడంలో సాహిత్య విషయాలకే మన రచయితలు అధిక ప్రాధాన్యాన్నిచ్చారని సూత్రీకరించారు. వ్యాసం ఆలోచన కలించడంతో పాటు, అనుభూతిని రగిలించడానికి సహకరించినప్పుడు అందరినీ అలరించగలుగుతుందని, దానికెలాంటి లక్షణాలను కలిగి ఉండాలో వేలాది వ్యాసాల్ని పరిశీలించిన అనుభవంతో సిద్ధాంతీకరించారు.నేటికీ చాలా మందికి దొరకలేదంటున్న పురాణం సూరిశాస్త్రి లాంటి వారు రాసిన వ్యాసాల్ని కూడా ఆనాటికే సంపాదించి, వాటిపై కూడా నిర్ణయాల్ని ప్రకటించడం పరిశోధకునిగా ఆచార్య ఇనాక్‌ గారికున్న అన్వేషణ, శాస్త్రీయ దృక్పథాలకు ఈ పరిశోధన నిదర్శనం.

డాక్టరేట్‌ సాధించిన గ్రంథం రిఫరెన్సు గ్రంథం కావడం పరిశోధనకు నిజమైన గుర్తింపనుకోవచ్చు. అలాంటి గుర్తింపు వీరి తెలుగు వ్యాసపరిణామం గ్రంథానికి లభించింది. ఈయన చేసిన మౌలికమైన పరిశోథనలో కలికితురాయిగా చెప్పుకోదగింది వసుచరిత్ర ప్రబంధాన్ని రాసిన శుభమూర్తిపై చేసిన పరిశోధన. ఇది పరిశోధన గ్రంథమైనా, విమర్శక దృక్పథం ఉండటం వల్ల దీని పరిశోధనాత్మక విమర్శ గ్రంథంగా పిలవడం సమంజసం.                   
పరిశోథనలో అన్వేషణ, కొత్తవిషయాల్ని బయటపెట్టడం, సిద్ధాంతాన్ని స్థాపించడం లేదా ఒక విషయాన్ని సూత్రీకరించడం ముఖ్యం. వీటిలో అంతర్భాగంగానే కనిపిస్తున్నా, గుణ,దోష విశ్లేషణ, నిర్ణయ ప్రకటన విమర్శలో ప్రధానంగా చూడాలి. పరిశోధనలో కనిపించే అన్వేషణ, సమాచార సేకరణ వంటివి విమర్శలో అంతగా కనిపించవు. లభించిన సమాచారాన్ని విశ్లేషించి, తులనాత్మకంగా పరిశీలించి, తనదైన దృష్టితో వ్యాఖ్యానించి, అది గుణమో, దోషమో ఒక నిర్ణయాన్ని ప్రకటించడం విమర్శ స్వభావం. ఈ రెండు స్వభావాలు సంతరించుకుంటే దాన్ని పరిశోధనాత్మక విమర్శ అనొచ్చు. అలా రెండు లక్షణాల్ని సంతరించుకున్న గ్రంథం ‘‘శూద్రకవి శుభమూర్తి వసుచరిత్ర వైశిష్ట్యం’’. తన పేరు శుభమూర్తి, మూర్తికవి అని వసుచరిత్రకారుడు చెప్పుకున్నా, అతణ్ణి భట్టుమూర్తి, రామరాజభూషణుడు అని నాటి నుండి నేటి వరకూ పండితలోకం పిలవడంలో ఒక శూద్రుణ్ని కవిగా గాని, అతని పేరుతో గాని పిలవడానికిష్టపడని వర్ణాధిక్యాన్ని సోదాహరణంగా నిరూపించారు. శుభమూర్తిలో కవిలోకం పట్ల దళిత, బహుజనులు అలవరుచుకోవలసిన ప్రతిఘటన చైతన్యాన్ని గుర్తించేలా గ్రంథాన్ని సాధికారికంగా రాశారు. ఇంతవరకూ దీన్నెవరూ ఖండిరచకపోవడం దీనిలో ప్రతిపాదించిన పరిశోధనాంశాల్లోని శాస్త్రీయతకు మరో నిదర్శనం.

ఇటువంటి పరిశోధనాత్మక స్పర్శతో  రాసిన విమర్శ గ్రంథం ‘‘ఆధునిక విమర్శ సాహిత్య సూత్రం’’   తెలుగు వ్యాసం గురించెవరైనా ప్రస్తావిస్తే, ఈ రంగంలో చేసిన ఇనాక్‌ గారి వ్యాసపరిణామాన్ని ఎలా పేర్కొంటారో, అలాగే ఆధునిక సాహిత్యాన్ని విమర్శించేందుకున్న నూతన సూత్రాల్ని ప్రతిపాదించిన గ్రంథమిది.  అటు పూర్తిగా మార్క్సిజం గాని, ఇటు మానవతావాదంతో గాని విమర్శించడానికి వీల్లేని పూర్తి దేశీయ విమర్శ పద్ధతిలో మాత్రమే విమర్శించదగినవి దిగంబర, స్త్రీవాద, దళితసాహిత్య ధోరణులు. వీటిని చాలా శ్రద్ధగా తాను పరిశోధన చేస్తూనే, విద్యార్థుల చేత పరిశోధన చేయిస్తూ వస్తున్న క్రమంలో వెలువడిన ఆణిముత్యాల్లాంటి విమర్శపద్ధతుల్ని దీనిలో  ప్రతిపాదించారు. సాహిత్యవిమర్శకు తెలుగు సాహిత్యం అందించిన మహోన్నత వారసత్వసంపదగా చెప్పుకోవడానికి వీలున్న విమర్శపద్ధతులివి.
సాహిత్య విమర్శలో ఆంగ్ల సాహితీవేత్తలు ప్రతిభకు నిదర్శనంగా చెప్పే ఇమేజినేషన్‌ నే తనదైన పద్ధతిలో సమన్వయించి, దానికి సామాజిక కోణాన్ని అందించి కట్టమంచి రామలింగారెడ్డి తెలుగు సాహిత్య విమర్శకు ఆధునికతను ఇచ్చాడు. మళ్ళీ తెలుగు సాహిత్య విమర్శకు అంతటి గౌరవాన్నిచ్చిన పరిస్థితి ఆచార్య ఇనాక్‌ గారికే చెందుతుంది. మార్క్సిజంలోని ఆర్థికాంశాల్ని, దేశీయతాభూమికతో రూపొందిన అంబేద్కర్‌ కులనిర్మూలనా చైతన్యాన్నీ మేళవించి సాహిత్యాన్ని సమన్వయించినప్పుడే స్త్రీవాద, దళిత సాహిత్య విలువల్ని శాస్త్రీయంగా అంచెనా వేయగలమని నిరూపించారు.
అంతవరకూ చర్చలో కొచ్చిన వస్తు, రూపాలు, నిబద్ధతలతో పాటు నిమగ్నత, నిబిడితలను కలిపి ప్రతిపాదించారు. తాను రాసే రచనల్లోని జీవితానికి వ్యతిరేకమైన జీవితం ఉంటే రచయితకు నిబద్దత ఉన్నట్లు కాదు. రాసే వస్తువుతో తాదాత్మం చెందడమనే నిమగ్నత సాహిత్యానికి విలువల్ని అందిస్తుంది. తాను రాసే వస్తువుకీ, తన జీవితానికీ అవినాభావ సంబంధమున్నట్లైతేనే ఆ సాహిత్యం నిబిడితతో కూడినట్లవుతుంది. ఈ మూడు లక్షణాల సమ్మేళనంతో సాహిత్య విమర్శ చేయడమనేది ఇనాక్‌ గారితోనే ప్రారంభమైంది.                           ఆ సూత్రాన్నే ప్రధానకేంద్రంగా చేసుకుని స్త్రీవాద, దళిత సాహిత్య విమర్శ చేయగలిగితేనే అది శాస్త్రీయమైన విమర్శపద్ధతి అవుతుంది. లేకపోతే స్త్రీవాద, దళిత సాహిత్యాల్ని సంస్కరణ, మానవతావాద, మార్క్సిస్టు పద్ధతుల్లో విమర్శించించినట్లేనని గుర్తించాలి. ఇదొక్కటి చాలు తెలుగు సాహిత్య విమర్శలో ఆయన చిరస్థాయిగా నిలిచిపోవడానికి. ఇలాంటి ఎంతో కృషిని ఆచార్య ఇనాక్‌ గారు చేశారు.
ఇలా పరిశోధనలోను, విమర్శలోను ఒక మైలురాయిగా నిలవదగిన స్థాయిలో కృషిచేసిన ఇనాక్‌ గారు సృజనాత్మక సాహిత్యంలోనూ తనదైన ముద్ర వేయగలిగారు. తెలుగులో చక్కని, చిక్కని, చిన్న చిన్న వాక్యాల్లో అందంగా రాయడమెలాగో తెలుసుకోవాలంటే, ఇనాక్‌గారి వచనం చూడాల్సిందే. సృజనాత్మక రచనల్లో మునివాహనుడు, ఊరబావి, తలలేనోడు, కులవృత్తి వంటి రచనలు ఆయన తప్ప మరెవరూ రాయలేరనిపిస్తుంది. మొత్తం మీద రచనలన్నింటిలోనూ ఉండే గుణం మానవీయ విలువల్ని  ఉన్నతీకరించాలనే మహోన్నత సాహితీ శిఖరం ఆచార్య కొలకలూరి ఇనాక్‌.
 

( ఆచార్య కొలకలూరి ఇనాక్‌ గార్కి భారతప్రభుత్వం పద్మశ్రీఅవార్డు ప్రకటించిన సందర్భంగా.....)


               

24 అక్టోబర్, 2018

‘‘ఆధునిక తెలుగు సాహిత్యంలో దళిత స్త్రీవాదం’’ 24 అక్టోబరు 2018

24 అక్టోబరు 2018 వతేదీన సాహిత్య అకాడమీ, శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయం, తెలుగు అధ్యయన శాఖ, తిరుపతి వారు కొలకలూరి మధుజ్యోతి ఆధ్వర్యంలో సంయుక్తంగా ‘‘ఆధునిక తెలుగు సాహిత్యంలో దళిత స్త్రీవాదం’’ అనే అంశంపై ఒకరోజు సదస్సుని నిర్వహించారు.

 డాక్టర్ వి.పోతన్న,  ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, సదస్సు సంచాలకురాలు ప్రముఖ పరిశోధకురాలు ఆచార్య కొలకలూరి మధుజ్యోతి,   డాక్టర్ కోయి కోటేశ్వరరావు,మహిళా విశ్వవిద్యాలయం తెలుగు అధ్యయన శాఖ అధ్యాపకులు డాక్టర్ యువశ్రీ, డాక్టర్ సుభాషిణి, డాక్టర్ లక్ష్మీప్రియ, వివిధ విభాగాల ఆచార్యులు, పరిశోధక విద్యార్థులు, విద్యార్థులు, పురసాహితీ ప్రియులు 

  ఆచార్య రాచపాళెం చంద్రశేఖరరెడ్డి, ఆచార్య వి. ఉమ, వంగలకుర్తి విద్యాసాగర్ (కవి, రచయిత, మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆం.ప్ర.), ఆచార్య మూలే విజయలక్ష్మి, ఆచార్య కొలకలూరి మధుజ్యోతి, పురుషోత్తం (సాహిత్య అకాడమీ రీజనల్ కో ఆర్డినేటర్) తదితరులు ప్రారంభ సమావేశంలో  అతిథులుగా పాల్గొని ప్రసంగించారు.

Sri.S,P,Mahalingeswar (Regional Secretary, Sahitya Akademi), Prof. Kolakaluri Enoch, Ex.Vice Chancellor, S.V.University, Tirupathi, and  Prof. Darla Venkateswara Rao, Dy.Dean, Students' Welfare, University of Hyderabad, Hyderabad. 

24 డిసెంబర్, 2016

కుసుమ ధర్మన్న రచనల ఆవిష్కరణ (24 డిసెంబరు 2016) సభ విశేషాలు

చరిత్రలో విస్మరణకు గురైన తొలితరం దళిత కవి కుసుమ ధర్మన్న రచనలను ప్రచురించి, ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చిన నవ తెలంగాణ (ప్రజాశక్తి) పబ్లిషింగ్ హౌస్ వారు అభినందనీయులని వక్తలు ప్రశంసించారు.
హైదరాబాదులో నిర్వహిస్తున్న ‘ 30వ హైదరాబాదు నేషనల్ బుక్ ఫెయిర్ 2016’ లో   శుక్రవారం సాయంత్రం  5 గంటలకు ‘కుసుమధర్మన్న రచనలు’ ఆవిష్కరణ సభ జరిగింది. సభకు నవతెలంగాణ జనరల్ మేనేజర్ లక్ష్మయ్య ఆహ్వానం పలికిన ఈ సభకు కె.చంద్రమోహన్ అధ్యక్షత వహించారు.


ముఖ్యఅతిథిగా విచ్చేసిన బుద్దపూర్ణిమ ప్రాజెక్టు ప్రత్యేకాధికారి, ప్రముఖ దళిత మేథావి మల్లేపల్లి లక్ష్మయ్య పుస్తకాలను ఆవిష్కరించి మాట్లాడుతూ చరిత్రలో విస్మరణకు గురైన కుసుమ ధర్మన్నజీవితాన్ని సమాజానికి తెలిపి, ఆయన రచనలను ప్రచురించిన ప్రజాశక్తి ప్రచురణల సంస్థను అభినందిస్తున్నానన్నారు. కుసుమ ధర్మన్న గానీ, ఒక దళిత నాయకుడు, సాహితీ వేత్తను గాని చరిత్ర చాలా పాక్షిక దృష్టితోనే చూస్తుందని, అది అంబేద్కర్ నుండి కుసుమ ధర్మన్న దాకా, ఇప్పుడున్న వ్యక్తుల దాకా అది కొనసాగుతూనే ఉందని పేర్కొన్నారు. ఒక వ్యక్తిని చరిత్రకారులు అంచనావేసేటప్పుడు ఆ వ్యక్తి కులం, మతం, భావజాలాలల్నే పరిగణనలోకి తీసుకుంటున్నారు తప్ప, దళిత సమస్యల కోసం సందర్భానుసారంగా కృషిచేస్తున్నారని గమనించడం లేదన్నారు. కుసుమ ధర్మన్న హిందూమతంలో అంతర్భాగంగా ఉంటూనే దానిలోని లోపాల్ని వ్యతిరేకించాడనీ, దానికి నిజామ్ కాలంలో హైదరాబాదు లో గల భాగ్యరెడ్డివర్మ, శ్యామ్ సుందర్, వెంకట్రావు మొదలైన వారితో కలిసిపనిచేయాల్సిన సందర్భాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఒకవైపు గాంధీజీ భావాలకు ప్రభావితుడైనా అంబేద్కర్ భావాలకే ప్రాముఖ్యాన్నిచ్చాడని వ్యాఖ్యానించారు. ఆనాడు కుసుమ ధర్మన్న ‘‘హరిజన’’ అనే పదాన్ని వాడటమే నాడున్న గాంధీజీ తాత్త్విక చింతన ప్రభావం తెలుస్తుందని చెప్పారు.

ప్రముఖ సాహితీవేత్త, ప్రజాశక్తి మాజీ సంపాదకుడు తెలకపల్లి రవి మాట్లాడుతూ నేడు ఆవిష్కరించిన కుసుమధర్మన్న రచనల్ని చూస్తే, చరిత్ర ఇతిహాసపు చీకటికోణాల్ని చీల్చుకొంటూ వెలుగుని విరజిమ్మిన రచనలుగా వీటిని పేర్కొనవచ్చునని అభివర్ణించారు. చరిత్రలెప్పుడూ విజేతల కథనాల నుండే రాస్తారనీ, అందువల్ల పరాజితుల జీవితాలు విస్మరణకు గురవుతుంటాయని, దానికి పాలకుల ప్రభావమే ప్రధాన కారణమని విశ్లేషించారు. బ్రౌన్ మహాశయుడు రాకుంటే మనకు వేమన దక్కుండేవాడుకాదు. , కుసుమ ధర్మన్న రచనల విషయంలోను జరిగిందని, ఆధిపత్య వర్గాలెప్పుడూ తమకు హాని జరిగేవాటికి ప్రాధాన్యం లేకుండా చేస్తుంటారు. అలా ఎంతోమంది చరిత్రలు కాలగర్భంలో కలిసిపోయాయి. కుసుమ ధర్మన్న ధర్మం కోసం పోరాడిన కవి, సామాజిక సంఘసంస్కర్త. సుమారు నూరేళ్ళ క్రితం అంటే 1917 వ సంవత్సరంలో ఆదిఆంధ్రమహాసభ విజయవాడలో జరిగింది. కుసుమ ధర్మన్న అధ్యక్షులుగా ఆ సభను విజయవంతం చేశారు. నేడు మరలా కుసుమ ధర్మన్న రచనలను 2016లో మనం ఒకచోటకు తెచ్చి ఆవిష్కరించుకుంటున్నామంటే, ఆ రచనల్లోని ప్రాసంగికతను అర్ధం చేసుకోవాల్సి ఉంటుందన్నారు. ఆరుద్ర గారంటే తనకెంతో అభిమానమనీ, అయినా ఆయన రాసిన సమగ్ర ఆంధ్ర సాహిత్యంలో కూడా కొంతమందిని విస్మరించారనీ, అలా విస్మరించిన వారిలో కుసుమధర్మన్న కవికూడా ఉన్నారని తెలిపారు. భారతీయ సమాజంలో కుల, మత, వర్గ వైరుధ్యాల వల్ల ఇలాంటి చారిత్రక తప్పిదాలు జరిగిపోతుంటాయని, వాటిని తర్వాత వచ్చేవారు సరిదిద్ధుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని, దానిలో భాగంగానే నేడు కుసుమ ధర్మన్న రచనలను తీసుకొస్తున్నందుకు, వాటిని పుస్తకరూపంలో ఆవిష్కరించడం సంతోషదాయకమని అన్నారు.  

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటి అసోసియేట్ ప్రొఫెసర్ డా.దార్ల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కుసుమ ధర్మన్న జీవితాన్ని, రచనలను, భావజాల వైరుధ్యాలను సోదాహరణంగా విశ్లేషించారు. ఒక ఆయుర్వేద వైద్యునిగా జీవిస్తూ, తన కులం వల్ల కలిగే సంఘర్షణలను గుర్తించి వాటిని పరిష్కరించడానికి తనవంతు కృషిచేసిన సామాజిక వేత్త, సాహితీవేత్తగా కుసుమ ధర్మన్న కవిని గుర్తించాల్సిన అవసరం ఉందన వ్యాఖ్యానించారు. ఆయన రచనలను ఒక చోటకు తీసుకురావడంలో విశేషమైన కృషిచేసిన ప్రజాశక్తి బుక్ హౌస్ వారిని అభినందించారు. ఈ పుస్తకాలను తొలిసారిగా రాజమహేంద్రవరంలో ఆవిష్కరించారని, అప్పుడు తనకు విశ్వవిద్యాలయంలో ఒక అర్జెంటు పనివల్ల ఆ సభకు హాజరు కాలేకపోయానని, అయితే హైదరాబాదు బుక్ ఫెయిర్ లో ఆవిష్కరించే సమయంలో తనకు అవకాశం కల్గించిన 
నిర్వాహకులకు ధన్యవాదాలు తెలిపారు. కుసుమ ధర్మన్న జీవితాన్ని చరిత్రీకరించడంలో ప్రజాశక్తి వారు విశేషమైన కృషి చేసి ఆ జీవితాన్ని, ఆ రచనలను సేకరించి, వాటన్నింటినీ ఆకర్షణీయంగా ముద్రించి, అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చినందుకు ప్రచురణ కర్తలను అభినందించారు. గతంలో ఎండ్లూరి సుధాకర్ గారి పర్యవేక్షణలో కుసుమధర్మన్న రచనలపై పరిశోధన చేసిన మద్దుకూరి సత్యనారాయణ పరిశోధన పుస్తకాన్ని కూడా ప్రచురించడం అభినందనీయమన్నారు. ఆ పుస్తకంలో చరిత్ర రచనకు సంబంధించిన కొన్ని చక్కని పద్ధతులున్నాయని, వాటిని దళిత నాయకులు, సాహితీవేత్తల గురించి చరిత్ర రాసేవారు దృష్టిలో పెట్టుకోవాలన్నారు. కుసుమ ధర్మన్న రాసిన ‘హరిజనశతకం’ పై నల్గొండలోని మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం, దూరవిద్య లో చదివే విద్యార్థుల కోసం సరళంగా ఒక పాఠాన్ని రాశానని తెలిపారు. నేడు విశ్వవిద్యాలయ స్థాయిలో పరిశోధన చేసేవారికి ఇప్పుడు ప్రచురించిన పుస్తకాలు ఒక చక్కని ఆకరాలుగా ఉపయోగపడతాయని, ఆ కృషి చేసినందుకు ఒక విశ్వవిద్యాలయ అధ్యాపకుడిగా సంతోషిస్తున్నానని, ప్రచురించిన వారిని అభినందిస్తున్నానని అన్నారు. కుసుమ ధర్మన్న పుట్టిన తేదీ విషయంలో భేదాభిప్రాయలున్నాయనీ, కొంతమంది ఆయన 1894లో పుట్టి, 1948 వరకు జీవించినట్లు పేర్కొనగా, మరికొంతమంది 1900లో పుట్టి 1946 వరకు జీవించినట్లు పేర్కొంటున్నారని దీనికి  చరిత్రకారులు దళిత సాహితీవేత్తలను విస్మరించడం ఒక ప్రధాన కారణమన్నారు. దీనితో పాటు ఆయన చేస్తున్న కార్యక్రమాల పట్ల ఆధిపత్య అగ్రవర్ణాల వారు ఆయన గృహాన్ని దహనం చేయడం వల్ల బహుశా ఆయన రచనలు కూడా కోల్పోయి ఉండవచ్చునన్నారు. తాను చదువుకున్నది తక్కువే అయినప్పటికీ తన జీవితానుభవంలో కులం వల్ల ఎదుర్కొంటున్న అవమానాలను, వాటికి కారణమైన వాటిని గుర్తించడం వల్లనే సంఘసంస్కరణకు పూనుకున్నారని వ్యాఖ్యానించారు. తన జీవిక కోసం ఆయుర్వేద వైద్యునిగా పనిచేస్తూనే, మరొక వైపు తన జాతి అభ్యున్నతికి కృషిచేయడంలో భాగంగానే ‘జయభేరి’ వంటి పత్రికను కొన్నాళ్ళపాటు ప్రచురించారన్నారు. కుసుమ ధర్మన్న భావజాలంలో వివిధ పరిణామాలు కనిపిస్తాయని, ఆయనపై గాంధీజీ ప్రభావం అత్యధికంగా ఉందనీ, అందువల్లనే తన కుమారులకు గాంధీజీ పేరు కలిసి వచ్చేటట్లు కూడా పెట్టుకున్నారని వివరించారు.
గాంధీజీ సంస్కరణోద్యమ ప్రభావంతో పాటు అప్పటికి బలంగా ఉన్న జస్టీస్ పార్టీ ప్రభావం, దానితో పాటు మద్రాసులో జరిగిన ఆది ద్రావిడ ఉద్యమం ప్రభావం కుసుమ ధర్మన్నలో కనిపిస్తుందన్నారు. అందువల్లనే దళితులు ఈ దేశ మూలవాసులనే స్ఫృహతో ‘ఆదిఆంధ్ర ఉద్యమా’నికి నాయకత్వం వహించారని, తర్వాత కాలంలో అంబేద్కర్ తో సంబంధాలు ఏర్పడ్డాయని వివరించారు. అయినప్పటికీ, కుసుమ ధర్మన్నలో హిందూ మతంలో భాగంగా భావించే వాల్మీకి, వేదవ్యాసుడు, అరుంధతి మొదలైనవారు తమవారనే ఆలోచనలు ఆయన రచనల్లో కనిపిస్తాయని చెప్పారు. తొలితరం దళిత కవుల్లో ముఖ్యంగా బోయి భీమన్న తదితరుల్లో కూడా ఈ రకమైన ఆలోచనలు ఉన్నాయని వివరించారు. ఆ విధంగా భావజాల తాత్త్విక సంఘర్షణ కుసుమ ధర్మన్నలో కనిపిస్తుందనీ, దాన్ని లోతుగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. 
ప్రముఖ విమర్శకుడు డా.ద్వానాశాస్త్రి మాట్లాడుతూ, తాను కుసుమ ధర్మన్నపై ఒక చిన్న పుస్తకాన్ని ఈ పుస్తకాలేవీ లేనప్పుడే ప్రచురించానని చెప్పారు. కుసుమ ధర్మన్నను తొలి దళిత కవిగా గుర్తించాలన్నారు. సభలో నవతెలంగాణ జనరల్ మేనేజర్ లక్ష్మయ్య సభను పరిచయం చేస్తూ, మరలా హైదరాబాదులో కుసుమధర్మన్న రచనలను ఆవిష్కరించాల్సిన అవసరమేమిటో వివరించారు. సభలో ప్రముఖ కవి తంగిరాల చక్రవర్తి తదితరులు పాల్లొన్నారు. 
















09 నవంబర్, 2016

డా.దార్ల వెంకటేశ్వరరావుగారికి జాషువ జాతీయ పురస్కారం -2016

డా.దార్ల వెంకటేశ్వరరావుగారికి జాషువ జాతీయ పురస్కారం -2016 తో  ది: 6 నవంబర్స 2016 న సత్కరిస్తున్న డా.బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ఆచార్య ఆర్.సీతారామారావు, ది యునైటెడ్ ఫ్రంట్ ఫర్ ఎస్.సి., ఎస్.టి ఎంప్లాయీస్, సాహితీ విభాగం వరంగల్లు జాతీయ అధ్యక్షులు కుమారస్వామి, జిల్లా అధ్యక్షులు సాధుమహేందర్ తదితరులు చిత్రంలో ఉన్నారు. 

పద్మభూషణ్ గుర్రం జాషువా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పిస్తున్న దృశ్యం

పద్మభూషణ్ గుర్రం జాషువా, డా.బి.ఆర్. అంబేద్కర  చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులు అర్పిస్తున్న దృశ్యం

సభలో పాల్గొన్న ప్రజలు, సాహిత్యాభిమానులు 

 ఆహ్వాన పత్రం



డా.దార్ల వెంకటేశ్వరరావుగారికి జాషువ జాతీయ పురస్కారం -2016 తో ప్రదానోత్సవ సభలో డా.బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ఆచార్య ఆర్.సీతారామారావు, ది యునైటెడ్ ఫ్రంట్ ఫర్ ఎస్.సి., ఎస్.టి ఎంప్లాయీస్, సాహితీ విభాగం వరంగల్లు జాతీయ అధ్యక్షులు కుమారస్వామి, జిల్లా అధ్యక్షులు సాధుమహేందర్ తదితరులు చిత్రంలో ఉన్నారు.

ఈనాడు, వరంగల్ 7 నవంబర్ 2016 నాటి న్యూస్
అవార్డు గ్రహీతలకు అందించిన ఆహ్వాన పత్రం 

30 ఆగస్టు, 2016

కుసుమ ధర్మన్న సాహితీ సమాలోచన (18 సెప్టెంబరు 2016)

ప్రసిద్ధ కవి, ఉద్యమకారుడు కుసుమ ధర్మన్న సాహిత్యంపై ఒకరోజు సదస్సుని సాహితీ స్రవంతి వారు ఆనం కళాకేంద్రం, రాజమహేంద్రవరం, తూర్పుగోదావరి జిలాలో   నిర్వహించబోతున్నారు. ఈ సదస్సు 18 సెప్టెంబరు 2016న ఉదయం నుండి సాయంత్రం వరకు జరుపుతున్నట్లు సాహితీస్రవంతి వారు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సదస్సులో కుసుమధర్మన్న రాసిన పుస్తకాలను, ఆయనపై రాసిన వ్యాసాల పుస్తకాలను ఆవిష్కరించనున్నారు. వ్యాసాలు రాసిన వారి స్పందనలతో పాటు వివిధ కుసుమధర్మన్న గారి వివిధ భావాలపై సదస్సులో సాహితీవేత్తలు మాట్లాడతారు. నేను కూడా ఒక కుసుమధర్మన్న గారి గురించి ఒక వ్యాసం రాశాను. అందువల్ల నన్ను కూడా సభకు రమ్మని ఆహ్వానించారు.  

03 మే, 2016

పెద్దమనుషుల ఒప్పందమే వర్గీకరణ సమస్యకు పరిష్కారమార్గం... ఆచార్య కొలకలూరి ఇనాక్

అనేక సంవత్సరాలుగా నలుగుతున్న ఎస్సీ వర్గీకరణ సమస్యకు మాల-మాదిగ పెద్దలంతా కలిసి కూర్చొని ఒక ఒప్పందానికి రావడం ద్వారానే ఆ సమస్య పరిష్కారమవుతుందని పద్మశ్రీ పురస్కార గ్రహీత, శ్రీవేంకటేశ్వరవిశ్వవిద్యాలయం మాజీ ఉపాధ్యక్షుడు ఆచార్య కొలకలూరి ఇనాక్ సూచించారు. సోమవారం సాయంత్రం  (2 మే 2016) హైదరాబాదులోని సుందరయ్యవిజ్ఞాన భవనంలో జరిగిన ‘కువ్వ’ వర్గీకరణోద్యమ సంఘీభావ కవితా సంకలన ఆవిష్కరణ సభలో ఆచార్య కొలకలూరి ఇనాక్ ముఖ్యఅతిథిగా పాల్గొని, పుస్తకాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. 
కువ్వ కవితాసంకలనాన్ని ఆవిష్కరిస్తున్న దృశ్యం
మాదిగలు తమకు న్యాయంగా రావాల్సిన రిజర్వేషన్ భాగాలు తమకు దక్కడంలేని కారణంగా కొంత ఆవేశానికి లోనవ్వడం సహజంగా జరిగినప్పటికీ, ఆవేశం కంటే ఆలోచనతో పరిష్కరించుకోవడానికి ప్రయత్నించాలని హితవు పలికారు. రెచ్చగొట్టే ధోరణికంటే తమ వాదనలోని సామంజస్యాన్ని తమ సోదరులకు అర్థమయ్యేలా వివరించడానికి ప్రయత్నించాలన్నారు. అదే సమయంలో మాల సోదరులు కూడా మాదిగలకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించడంలో ఆవేశం వెల్లడవడమనేది ఆవేదనే తప్ప, అవరోధంగా పరిణమించాలనే ఆలోచనకాదని గుర్తించాలని, దాన్ని అర్థం చేసుకొని మాల పెద్దలు ఈ ఎస్సీ     వర్గీకరణ సమస్యకు సహకరించాలని వివరించారు. అప్పుడే రాజకీయ పార్టీల వాళ్ళు ఎస్సీ, ఎస్టీలను పావులుగా వాడుకోలేరనీ, తద్వారా తాము సాధించాల్సిన సమైక్య లక్ష్యాల్ని సాధించుకోవచ్చునని పేర్కొన్నారు. ఈ ఆలోచనలకు అక్షరరూపంగానే ఈ ‘కువ్వ’ కవితాసంకలనం వెలువడిందనీ, దీనిలో కవిత్వం రాసిన వాళ్ళంతా ప్రతిభావంతులనీ ప్రశంసించారు. 
కువ్వ పుస్తకాన్ని అంకితం తీసుకున్న కీ.శే. మాతంగి మాణిక్ రావు గారి కుటుంబసభ్యులకు తొలిప్రతినిస్తున్న దృశ్యం

పుస్తకాన్ని తీసుకొని రావడంలో సంపాదకుడు డప్పోల్ల రమేశ్ లోని ఉద్యమస్ఫూర్తి, నిబద్ధత కనిపిస్తుందని వ్యాఖ్యానించారు. పుస్తకానికి ఆర్థికంగా సహకరించి ప్రచురించిన మాతంగి చిరంజీవి  తండ్రి  దండోరా ఉద్యమంలో చైతన్యాన్ని నింపిన కీ.శే. మాతంగి మాణిక్ రావుగారికి పుస్తకాన్ని అంకితమివ్వడం ఔచిత్యవంతంగా ఉందని అన్నారు. ఈ సందర్భంగా ఆ కుటుంబసభ్యుల్ని ఆచార్య కొలకలూరి ఇనాక్ గారు వేదికపై గౌరవించి, తొలిప్రతులను ఆ కుటుంబసభ్యులకు అందించారు. 

‘కువ్వ’ కవితాసంకలన ఆవిష్కరణ సభకు సెంట్రల్ యూనివర్సిటి తెలుగు శాఖ అసోసియేట్ ప్రొఫెసర్ డా.దార్ల వెంకటేశ్వరరావు అధ్యక్షత వహించారు.  ‘కువ్వ’ కవితాసంకలనంలో మూడు రకాల ధోరణులతో కూడిన కవితలు ఉన్నాయని అవి మాదిగ, అనుబంధ కులాలు వర్గీకరణ కోరుతూ, వారి చరిత్ర, సాంస్కృతికాంశాలను ప్రతిఫలించే కవితలుగాను, మాల, అనుబంధ కులాలు ఎస్సీవర్గీకరణను సమర్థిస్తూ రాసిన కవితలు, అలాగే ఇతరులంతా ఇంటి సమస్య బయటి సమస్యగా మారిన తరుణంలో ఎస్సీవర్గీకరణలోని న్యాయాన్ని సమర్థిస్తూ రాసిన కవితాధోరణులున్నట్లు విశ్లేషించారు. 
సభాధ్యక్షత వహించి మాట్లాడుతున్న డా. దార్ల వెంకటేశ్వరరావు

ఎస్సీ వర్గీకరణ జరగకపోవడంలో మాల, మాల అనుబంధ కులాల వారి ఉద్యమం ఎంతగా అడ్డుకుందో, అలాగే సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా బలపడిన మాదిగ, మాదిగ అనుబంధ కులాలవారి పాత్ర కూడా విస్మరించలేనిదనీ, దీనికి అనేక కారణాలున్నాయని డా. దార్ల వెంకటేశ్వరరావు వివిరించారు. జస్టీస్ రామచంద్రరాజు కమీషన్ చేసిన పొరపాటు నిర్ణయాల ప్రభావం వల్ల మాల, మాదిగల్లోని కొన్ని వర్గాలు కోస్తా ప్రాంతంలో ఆదిఆంధ్రులుగా  ఉన్నారనీ, వారికి రిజర్వేషన్ శాతాన్ని కేటాయించడంలో జరిగిన పొరపాటు నిర్ణయాల వల్ల ఎదిగిన మాదిగ వర్గాలు కూడా పరోక్షంగా ఎస్సీవర్గీకరణకు ఆటంకంగా నిలిచారనీ, వీళ్ళంతా వ్యవస్థీకృతనియంతృత్వాన్ని పాటించారని విశ్లేషించారు. వ్యవస్థీకృత నియంతృత్వమనేది శాసన, న్యాయ వ్యవస్థల్ని కూడా ప్రభావితం చేయగలిగే శక్తిని కలిగి ఉంటుందన్నారు. అది ప్రత్యక్షంగా కనిపించకుండా పరోక్షంగా తన పాత్రను నిర్వహిస్తుంటుందనీ, దీనివల్ల సామాన్యులకు ఈ సమస్య మూలాలు అర్థం కావడం అంతసులభం  కాదన్నారు. దీనికి పాలవర్గాలు, రాజకీయ పార్టీలు వంతపాడటం సహజంగా జరుగుతుందనీ అన్నారు. ఈ సైద్ధాంతిక భావనను అర్థం చేసుకుంటేనే ఎస్సీవర్గీకరణ సమస్య అవగాహనకు వస్తుందని వివరించారు. మూడు సార్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎస్సీ వర్గీకరణను శాసన సభ ద్వారా ఆమోదించినప్పటికీ ఈ సమస్య ఇలాగే ఉండటానికి గానీ, ఎస్సీవర్గీకరణ జీవోని కోర్టు కొట్టేయడంలో గానీ కొద్దిమంది మేధావుల వర్గం చేసిన వ్యవస్థీకృతనియంతృత్వ ఫలితమేనని అర్థం చేసుకోవాలన్నారు. మాల, మాలల్లోని ఉపకులాల వారు కూడా ఎస్సీ వర్గీకరణకు సానుకూలంగా ఉన్నారనీ, అది ఎస్సీ వర్గీకరణ జీవో వచ్చినప్పుడు క్రమేపీ ఆ జీవో  ప్రకారమే స్థిరపడిపోవడానికి సిద్ధమైన తరుణంలో మాల-మాదిగలు ఏకమై మహాజనపార్టీ పెట్టి రాజకీయాధికారానికి ప్రయత్నించిన తర్వాతనే మళ్ళీ ఈ విభేదాలు ఎందుకు బహిర్గతమయ్యాయో లోతుగా ఆలోచించాలన్నారు. 

ఆంధ్రజ్యోతి, 3 మే 2016 

ఈ సభలో పాల్గొన్న ప్రముఖ కవి, విమర్శకుడు జి.లక్ష్మీనరసయ్య రెండు పాటలను పాడారు. తర్వాత సుదీర్ఘమైన ప్రసంగాన్ని చేశారు. ‘కువ్వ’ కవితాసంకలనంలో శక్తివంతమైన భావాలను, భావుకతను కవులు ప్రదర్శించారని సోదాహరణంగా విశ్లేషించారు. తొలిదశలో వచ్చిన దళిత కవిత్వంలాగే, ఎస్సీవర్గీకరణ సంఘీభావ కవిత్వంలో కొంత ఆవేశం కనపడేది. కానీ, నేడీ కవితా సంకలనంలో ఎంతో పరిణతి కనిపిస్తుందన్నారు. ‘కువ్వ’ కవితాసంకలనంలోని కవితలను విశ్లేషిస్తుంటే ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా విన్నారు. 
సభలో మాట్లాడుతున్న జి.లక్ష్మీనరసయ్య

ఆయన ఈ సభలో పాడిన ‘ఉందర్రామాలపేట..’ సభను ఉర్రూతలూగించింది. ఒకప్పుడు ‘మాల’ పదం యావత్తు దళిత, అస్పృశ్యతకు ప్రతీకగా ఉందని గుర్తుచేసి, దాన్ని నేటి ‘మాల’ ఉపకులానికే పరిమితం చేసుకోకూడదనీ అంటూ ఆ పాటను పాడారు. ఒకవేళ మనం అలాగే అర్థం చేసుకున్నా ఈ సమావేశం గొప్ప ప్రజాస్వామిక పంథాలో నడిచినట్లుగా భావించుకోవడానికీ నిదర్శనంగా నిలుస్తుందన్నారు. కువ్వ కవితాసంకలనంలో వస్తువైవిధ్యాన్ని రెండు రకాలుగా చూడొచ్చుననీ, అది ఐక్యతను రెండు కోణాల్లో వర్ణించారని విశ్లేషించారు. ఐక్యతను కోరుకుంటూనే, ఆ ఐక్యత నిజమైన సమైక్యతగా మారాలనే ఆకాంక్ష వ్యక్తమవుతుందనీ వివరించారు. 
సభలో మాట్లాడుతున్న ప్రముఖ కవయిత్రి జూపాక సుభద్ర 

సభలో మాట్లాడిన ప్రముఖ కవయిత్రి జూపాక సుభద్ర ఎస్సీ వర్గీకరణ ఆవశ్యకతను తెలుపుతూనే, మాలలు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సమయంలో ‘కావడి కుండలు’ ప్రచురించారనీ, అలాంటి మద్ధతుని ఎస్సీ వర్గీకరణకు ఇవ్వకపోవడం విచారకరమన్నారు. 


మరో వక్త ప్రముఖ పరిశోధకురాలు గోగుశ్యామల ‘కువ్వ’ కవితాసంకలనంలో గల కవిత్వవస్తువుని వివరించారు.సాహిత్య ఉద్యమం, ప్రజాఉద్యమం కలిస్తే ఆ ఉద్యమం శక్తివంతంగా ముందుకొచ్చి, విజయవంతమవుతుందన్నారు. ప్రభుత్వపరంగా చూసినట్లయితే అణచివేత, నిరాశా కనిపిస్తుంది. మరోవైపు ఉద్యమం రకరకాల సమస్యల్ని ముందుకి తీసుకొస్తూ విజయవంతమవుతుందనే ఆశను కనిపిస్తుంది. ప్రభుత్వానికి దళితుల్ని విభజించి పాలించడమెలాగో బాగా తెలుసు. అయితే దీన్ని గుర్తించి ఉద్యమకారులు సరైనరీతిలో పనిచేయడంలేదని నా కనిపిస్తుంది. ఈ సందర్భంలో ‘కువ్వ’ ఎస్సీవర్గీకరణ ఉద్యమ సంఘీభావకవిత్వ సంకలనం రావడం ఉద్యమానికి కొత్త శక్తినిస్తుందని ఆకాంక్షించారు. ఈ పుస్తకంలోని కవితల్ని పరిశీలిస్తే కేవలం ఒక వర్గీకరణ ఉద్యమం కోసమే కాకుండా రకరకాల సమస్యల్ని, సాంస్కృతికాంశాల్ని మనముందుకి తెస్తున్నారు. అందువల్ల కేవలం ఈ పుస్తకం ఎస్సీ వర్గీకరణ సంఘీభావం కోసమే కాకుండా జాతి సాంస్కృతిక విశేషాల్ని చరిత్రీకరించి, జాతిని మేల్కొలిపేలా ఉందని పేర్కొన్నారు.    
సభలో మాట్లాడుతున్న గోగుశ్యామల

ఈనాడు దినపత్రిక (ముషీరాబాద్ జోన్), 3 మే 2016, పుట:1
సభలో మరో వక్త ఎం.మల్లయ్య మాట్లాడుతూ అన్యాయం చేస్తున్న మాల, మాల అనుబంధ కులాల దగ్గరకెళ్ళి తమకు న్యాయం చేయండని ఎలా అడుగుతారనీ, అలా అడిగే పరిస్థితులెక్కడున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి సామరస్య పూరిత వాతావరణమే ఉంటే ఎస్సీ వర్గీకరణ ఉద్యమమే వచ్చేది కాదనీ, మాట్లాడుకున్నంత సులభంగా మాల-మాదిగల మధ్య ఐక్యత వాస్తవంలో కనిపించడంలేదనీ అన్నారు. 
సభలో మాట్లాడుతున్న ఎం.మల్లయ్య

                    సభలో వక్తగా పాల్గొన్న ప్రముఖ కవి, కథారచయిత డా. పసునూరి రవీందర్ మాట్లాడుతూ ‘కువ్వ’ కవితాసంకలనం గురించి మాట్లాడుకోవడమంటే, ఎస్సీవర్గీకరణ సమస్య గురించి మరోసారి మాట్లాడుకోవడమేననీ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మరలా మరో ఉద్యమానికి డప్పోల్ల రమేశ్ శ్రీకారం చుట్టాడనీ ప్రశంసించారు. 
సభలో మాట్లాడుతున్న డా. పసునూరి రవీందర్ 

                      సంస్కృతాంధ్ర శ్లోకాలు, పద్యాలతో సభలో రంజింపజేస్తూ డా.కోయి కోటేశ్వరరావు మాట్లాడారు. మాల వర్గానికి చెందిన తాను ఎస్సీవర్గీకరణకు సంఘీభావంగా కవిత్వం రాసినప్పుడు తన వర్గం నుండి ఎదుర్కొన్న ఒత్తిడులను వివరించారు. 
సభలో మాట్లాడుతున్న డా.కోయి కోటేశ్వరరావు
అయినప్పటికీ తానొక అంబేడ్కరిస్టుగా తన కర్తవ్యాన్ని తాను నిర్వర్తించాననీ, తానేదో ఎస్సీవర్గీకరణకోసం కవిత్వం రాసానని చెప్పుకోవడానికి రాయలేదనీ స్ఫష్టం చేశారు. సెంట్రల్ యూనివర్సిటీలో  నాగప్పగారి సుందర రాజుతో తనకున్న సాన్నిహిత్యాన్ని వివరించారు. 1996 నాటికే ‘మాదిగోడు’ కథా సంపుటికి తాను ముందుమాట రాశాననీ, మాదిగ సాహిత్యంలో కనిపించే అనేక విశిష్టకోణాల్ని నాడే వివరించాననీ అన్నారు. భారతీయ దళిత సాహిత్యంలో తెలుగు దళిత సాహిత్యం మొనాటమీకి గురికాకుండా ఉండడానికి మాదిగ సాహిత్యం ఎంతగానో తోడ్పడిందనీ వ్యాఖ్యానించారు. తెలుగు సాహిత్యంలో మాదిగ సాహిత్యం, విమర్శను సిద్ధాంతీకరించడంలో డా. దార్ల వెంకటేశ్వరరావు కృషిని ప్రశంసించారు. ‘కువ్వ’ కవితాసంకలనంలో గల కవిత్వాన్నీ, ముందుమాటల్లోని విశిష్టతలనీ ప్రస్తావించారు. తానీ సభలో పాల్గొనడం తన కుటుంబంతో కలిసినంత సంబరంగా ఉందనీ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. 
        ‘కువ్వ’ కవితాసంకలనం గ్రంథ సంపాదకుడు డప్పోల్ల రమేశ్ మాట్లాడుతూ పుస్తకాన్ని తీసుకురావడంలో గల సాధక బాధకాలను వివరించారు. పుస్తకానికి కవితలను రాసిచ్చిన వారికీ, పుస్త ప్రచురణకు సహకరించిన వారికీ, సభలో పాల్గొన్నవారందరికీ కృతజ్ఞతలను తెలిపారు. 
           సభలో కవులు మాతంగి చిరంజీవి, అమృత్ బండారి, డా. పొనుగోటి రవికుమార్, బడిగె ఉమేశ్, డా.ఎం.మంజుశ్రీ, వలీ, డా. నాళేశ్వరం శంకరం తదితరులు పాల్గొన్నారు. 
( దీనికి సంబందించిన ఫోటోలను తీసిన వారు పరిశోధక విద్యార్థి బడిగె ఉమేశ్ కి కృతజ్ఙతలు తెలియజేస్తున్నాను)