Friday, September 19, 2008

దళిత సమస్యలపై ప్రజాసాహితి దృక్పథం

డా// దార్ల వేంకటేశ్వర రావు

ప్రజాసాహితి సాహిత్య, సాంస్కృతికోద్యమ మాసపత్రిక. ఆగస్టు 1977 నుండి నేటి వరకూ నిరంతరాయంగా వెలువడుతున్న పత్రిక. అదీ పీడితుల పక్షాన నిలబడుతున్న పత్రిక. సమాజంలో జరిగే అనేక సంఘటనలకు తనదైన దృక్పథంతో కొనసాగుతున్న పత్రిక. అలాంటి పత్రిక దళితులకు జరుగుతున్న అన్యాయాలను ఎలా అర్థం చేసుకుంది? దళిత సమస్యలను, సంఘర్షణలను ఎలా వ్యాఖ్యానించింది? కొన్నిసార్లు రెండు, మూడు నెలలకు కలిపి ప్రచురించినా మూడు వందల సంచికకు చేరువయ్యింది. ఇది మూడు వందలవ సంచిక. ఈ సందర్భంగా గత ప్రజాసాహితి సంచికల్లో దళిత సమస్యలపై ఆ పత్రిక దృక్పథాన్ని స్థాలీపులాక న్యాయంగా అంచనా వేసే ప్రయత్నమే ఈ వ్యాసం!
సంపాదకీయాలు:
ప్రతి పత్రికకు ప్రాణం వంటిది సంపాదకీయం. పత్రిక దృక్పథం ప్రధానంగా సంపాదకీయాన్ని బట్టే తెలుస్తుంది. ప్రజాసాహితి ఒకోసారి రెండేసి, మూడేసి సంపాదకీయాలను కూడా ప్రచురించింది. ప్రతి సంపాదకీయం ఒక మ్యానిఫెస్టో వంటిదే! ప్రతి వాక్యం చాలా జాగ్రత్తగా ప్రయోగించటం చెప్పుకోదగిన ఒక ప్రత్యేకత. సంపాదకీయాలు 'జనసాహితి' ప్రణాళిక, నిబంధనలు, కర్తవ్యాలను సమన్వయిస్తునట్లే ఉంటాయి. 'కులం' గురించి ప్రస్తావిస్తున్నా, దానితో వర్గాన్ని, భూస్వామ్య వ్యవస్థ వికృత రూపాన్ని, అర్థ వలస పాలనా ప్రభావాన్ని సమన్వయిస్తూనే సంపాదకీయాలు కొనసాగాయి. దళితులు స్వతంత్రంగా పోరాటం చేయటం కంటే, సమష్టి పోరాటం చేయటం ద్వారానే నిజమైన విముక్తి లభిస్తుందనే దృక్పథంతో ఆ సంపాదకీయాలు వెలువడ్డాయి. 'కులం' మరింత విభజనల మయమనీ, విభజన - విభజనతోనే అంతం కాదనీ, అన్ని వర్గాల సమైక్య పోరాటంతోనే అంతమవుతుందనీ స్పష్టం చేస్తుంటాయి. ఇంచుమించు అన్ని ప్రజాసాహితి సంపాదకీయాలు కూడా ఇదే దృక్పథంతో కొనసాగాయి. కనుక, పత్రిక మౌలిక దృక్పథం కొన్ని ముఖ్యమైన సంచికలను పరిశీలించటం ద్వారా కూడా తెలిసే అవకాశం ఉంది.
దళిత నాయకులపై ప్రత్యేక సంచికలు:
ప్రజాసాహితి పత్రికలో దళిత సమస్యల గురించి సంపాదకీయాలు రాయడమే కాదు. అప్పుడప్పుడు చారిత్రక సందర్భానుసారంగా డా// బి.ఆర్.అంబేద్కర్, జ్యోతిరావ్ పూలేల గురించి ప్రత్యేక సంచికలను ప్రచురించారు. దళిత కవి గుర్రం జాషువాపై కూడా ప్రత్యేక సంచికను వెలువరించారు. నిజానికి దళితులకు, దళిత సాహిత్యానికి పై ముగ్గురూ సిద్ధాంతకర్తలు వంటివారు. వాళ్ళ గురించి ప్రత్యేక సంచికలు ప్రచురించటమంటే, ప్రజాసాహితి దళిత మౌలిక సిద్ధాంతాలను, సిద్ధాంతకర్తలను గుర్తించినట్లే! అయితే ఆ సిద్ధాంతాన్నీ, ఆ సిద్ధాంత కర్తలను వర్గ దృక్పథంతో సమన్వయించటం మరంత గుర్తించదగింది!
జ్యోతిరావ్ పూలే, డా// బి.ఆర్.అంబేద్కర్ ముఖచిత్రాలతో వెలువడిన ఏప్రిల్, 1992 (127వ) సంచికలో "దళితుల పోరాటం - నూతన ప్రజాస్వామిక విప్లవంలో అంతర్భాగం" పేరుతో ఒక సంపాదకీయం ఉంది. దీనిలో కింది వ్యాఖ్యలు గమనించదగినవి.
"భూస్వామ్య వవస్థను బద్దలుకొట్టకుండా, దాని యొక్క విభిన్న దోపిడీ పీడనల రూపాన్ని అంతమొందించలేం. దాని తోడుదొంగైన సామ్రాజ్యవాదాన్ని, వీరి అక్రమ సంతానమైన దళారీ పాలకులను ఓడించలేం. కుల వ్యవస్థతో సహా సమస్త అణచివేతలకూ మూలమైన ధనిక, అగ్రవర్ణ రాజ్యాంగ యంత్రాంగాన్ని రూపుమాపలేం. అందుకే దళితుల పోరాటాలు నూతన ప్రజాస్వామిక విప్లవంలో భాగం కావాలి.''
"వర్గమూ - కులమూ! విప్లవమూ - సంస్కరణా!" పేరుతో ఏప్రిల్ 1995 (162వ) సంచిక ఒక సంపాదకీయం వెలువడింది. దీనిలో డా// బి.ఆర్.అంబేద్కర్ కులనిర్మూలన పోరాట సైద్ధాంతిక విషయాలపై చర్చనీయాంశాలు ఉన్నాయి.
డా// బి.ఆర్.అంబేద్కర్ జయంతి సందర్భంగా వెలువడిన ఈ సంపాదకీయం ఆధునిక భారతంలో డా// బి.ఆర్.అంబేద్కర్ మహాభారతంలోని కర్ణుడితో పోల్చటం కూడా దళితులకు ఎంత వరకూ అంగీకారయోగ్యమో ఆలోచించవలసిందే! రాజ్యాంగ నిర్ణాయక సభ డ్రాప్టింగ్ కమిటీ ఛైర్మన్గా పనిచేయటంలో డా// బి.ఆర్.అంబేద్కర్ మేథోపరమైన కృషిని రాజ్యాంగ పరిషత్తు గుర్తించి, ఆ పరిస్థితుల్లో అంతటి పరిశ్రమ చేసి, భారత రాజ్యాంగాన్ని రూపొందించే శక్తి ఆయనకే ఉందని గుర్తించింది. నెహ్రూ క్యాబినెట్లో మంత్రిగా పనిచేసినా, అది ఎలా నిర్వహించారో, దానిలో ఎంతకాలం ఉన్నారో, ఆ సమయంలో ఎలాంటి సమస్యలకై పనిచేశారో లోతుగా విశ్లేషించవలసిన అవసరం ఉంది. అయినా వీటిని స్పృశించకుండానే, 'ప్రజాసాహితి' సంపాదకీయంలో "ఆయన చేసిన పోరాటాలు, పడిన రాజీలు - కులనిర్మూలనకు ఏదో రూపంలో తోడ్పడతాయన్న అవగాహన తోను, ఆవేదనతోను అమలు జరిపారు" అని వ్యాఖ్యానించారు. డా// బి.ఆర్.అంబేద్కర్ కృషిపై ఈ వ్యాఖ్యలను బట్టి ఆయన కులనిర్మూలనకే పరిమితమయిన వానిగా ప్రజాసాహితి భావించినట్లుంది.
ఈ సంపాదకీయంలోనే మరో విశేషం ఉంది.
1857 ప్రథమ భారత స్వాతంత్ర్య సంగ్రామం నుండి 1925 వరకు (అది డా// బి.ఆర్.అంబేద్కర్, కమ్యూనిస్టు పార్టీలు సామాజిక రాజకీయ రంగ ప్రవేశం చేయటాన్ని హద్దుగా పెట్టుకుని ) జరిగిన ముఖ్యమైన తిరుగుబాట్లూ, గిరిజన గిరిజనేతర రైతాంగ పోరాటాలూ, సాంఘిక వ్యవస్థపైనా సాంస్కృతికాంశాలపైనా సాగిన ఉద్యమాలూ పేర్కొని, మొదటివి వ్యవస్థ మూలాలపై ఎక్కుపెట్టిన విప్లవ స్వభావం గలవిగా, రెండవవి ఉపరితలాంశాలకు చెందిన సంస్కరణ స్వభావం గలవిగా విశ్లేషించారు. సామాజిక విప్లవానికి ప్రధాన చోదకశక్తి (ప్రింసిపల్ మోటివ్ ఫోర్స్) వర్గ పోరాటమేనన్నారు. ఈ పునాది వర్గాల పోరాటానికి అనుబంధంగా మిగిలిన సమస్త రంగాలలో కూడా పోరాటం సాగిస్తూ సమన్వయించుకోవాలన్నారు. ఇది పాత వ్యవస్థను ధ్వంసం చేసి కొత్తదాన్ని నిర్మించుకునే దిశగా వుండాలని చెప్పారు. దీనినే విప్లవాత్మక వర్గ పోరాటంగా పేర్కొన్నారు. అమలులో వున్న వ్యవస్థలో మరిన్ని అవకాశాలూ, ఉపశమనాలూ కలిగించే సంస్కరణల కొరకు సాగించేదీ, లక్ష్య పెట్టేదీ సంస్కరణవాదమన్నారు. సారాంశంలో 5 పేజీల ఈ సంపాదకీయం మార్క్సిజాన్ని విప్లవకర సిద్ధాంతమనీ అంబేద్కరిజం సంస్కరణవాదమనీ తేల్చింది. మార్క్సిజం బోధించే వర్గ పోరాట సిద్ధాంతంపై కొన్ని రకాల దాడుల్ని సంపాదకీయం ఖండించింది. అదే సమయంలో అంబేద్కరిజంను చర్చనీయాంశమంది.
ముగింపుగా - "దళితులలో అత్యధికులు గ్రామీణ ప్రాంతాల్లో వున్నారు. భూస్వామ్య వ్యవస్థ యొక్క ఆర్థిక, సాంఘిక, దోపిడీ పీడనలకు వారు గురవుతున్నారు. కులవ్యవస్థ పాలక వర్గాల దోపిడీ సాధనంగా వుంది. కాలం చెల్లిన భూస్వామ్య విధానానికి వ్యతిరేకంగా సాగించే వ్యవసాయిక విప్లవం కులనిర్మూలనా పోరాటానికి ప్రధాన ఆధారంగా వుండగలుగుతుంది. పెరుగుతున్న సామ్రాజ్యవాద దోపిడీ, భూస్వామ్య అగ్రకుల పెత్తందార్లను మరింత బలోపేతం చేస్తోంది.
"డా//బి.ఆర్.అంబేద్కర్ జీవితాశయమైన 'కులనిర్మూలన' పట్ల చిత్తశుద్ధి గలవారు భావోద్వేగాలను విడిచిపెట్టి, కులానికి పునాదిగా వున్న అర్థవలస - అర్థఫ్యూడల్ ఆర్థిక వ్యవస్థతోనూ, దాని నిరంకుశ రాజ్యంతోనూ పోరాడటానికి అధిక ప్రాముఖ్యత నిస్తారని ఆశిద్దామ"నే లక్ష్యాన్ని ఈ సంపాదకీయంలో సూచించారు.
గుర్రం జాషువా ప్రత్యేక సంచిక:
జాషువా ముఖచిత్రంతో, ఆయన శతజయంతి (1895 - 1995) సందర్భంగా అక్టోబరు, 1995 (168వ) సంచికను 'గుర్రం జాషువా శతజయంతి సంచిక'గా ప్రకటించారు. 95 శాతం రచనలన్నీ జాషువా సాహిత్య దృక్పథాన్ని విశ్లేషిస్తూ ఉన్నాయి. 'విశిష్ట సాహితీ స్రష్ట గుర్రం జాషువా" పేరుతో సంపాదకీయం ప్రచురించారు. ఆయన కవిత్వంలో కుల వివక్షకు వ్యతిరేకంగా, తీవ్ర ఆవేదనా ఆగ్రహమూ వ్యక్తమయ్యాయని అన్నారు.
గురజాడ, జాషువా సమకాలికులైన అభ్యుదయ కవులు, శ్రీశ్రీ వంటి వారంతా పద్యాన్ని వదిలేసి కొత్తదారుల్లో కవిత్వం రాస్తున్నా, జాషువా మాత్రం పద్య రూపాన్ని మార్చుకోలేకపోయారని వ్యాఖ్యానించారు. అగ్రకులాల సొత్తుగా వున్న కవిత్వంపై పట్టు సాధించి, వారికంటే మెరుగ్గా కవిత్వం రాయగలగాలనేది జాషువా పరమ ఆశయాల్లో ఒకటి అన్నారు.
"జాషువాను దళితకవి అనటం వరకు తప్పులేదు. కానీ, ఆయన దళితవాదికాదు. వర్ణకుల వ్యవస్థలను ఆయన తీవ్రంగా ద్వేషించాడు. ఫ్యూడల్ సంస్కృతి పెంచి పోషిస్తున్న మూఢ (దైవ) విశ్వాసాన్ని, అంటరానితనాన్ని వ్యాప్తి చేసే హిందూ పూజారి వ్యవస్థనూ తనదైన శైలిలో విమర్శించాడని" జాషువాను అంచనా వేశారు.
"జాషువాది సమాజ దళిత స్పృహ. గాంధీయిజం ద్వారా సమాజంలో మార్పులు వస్తాయని భ్రమించాడు. గాంధీ హిందూమతాన్ని, వర్ణ వ్యవస్థనూ పొగుడుతూ కేవలం అస్పృశ్యతను మాత్రమే వ్యతిరేకించాడు. ధర్మకర్తృత్వాన్నీ, అనువంశిక వ్యవస్థలను సమర్థించి, పరోక్షంగా భూస్వామ్య ధనస్వామ్య వ్యవస్థను బలపరిచాడు. జాషువా దీనిని అర్థం చేసుకునేంత తాత్త్విక భావావేశ తీవ్రత కలవాడు కాదు. అయివుంటే గాంధీ సామాజిక అవగాహనలోని లోపాల్ని విమర్శించగలిగేవాడు."
"దళిత స్పృహ, దళిత చైతన్యం ప్రజాస్వామ్య స్వభావం గలవి. అవి వర్గ పోరాటంతో అనుసంధానమైతే నూతన ప్రజాస్వామిక విప్లవ చైతన్యంగానూ, మార్క్సిజంతో మమేకమైతే సోషలిస్టు చైతన్యంగానూ గుణాత్మక మార్పులని తీసుకుంటాయి. లేకుంటే బూర్జువా తాత్త్విక చైతన్యంగానే మిగిలిపోతాయి. తెలుగు దళితవాదులలో ఎక్కువమంది చైతన్యం తిరోగమన పథంలోకి ప్రయాణిస్తోంది."
ఈ సంపాదకీయంలోని పై వ్యాఖ్యలను గమనిస్తే జాషువా సాహిత్యం సమకాలీన వస్తువుని అందుకున్నా, సమకాలీన రూపాన్నీ అందిపుచ్చుకోవటంలో వెనుకబడి ఉందనే స్పృహ కలుగుతుంది. భావజాలం విషయంలోనూ జాషువాకు సమగ్ర దృక్పథం లేదనీ, ఎలక్ట్రానిక్ మీడియా, నాటకాలను ఆదరించే సామాన్య ప్రజలను వీరి పద్యాలు బాగా ఆకర్షించాయనీ, కులదృక్పథం వల్లనే దళితులు జాషువాని వెనుకేసుకొస్తున్నారనే ఆలోచన కూడా కలిగిస్తుందీ సంపాదకీయం. అయితే, జనవరి, 2007 (290వ) సంచికలో జనసాహితి 10వ మహాసభల కరపత్రాన్నే సంపాదకీయం - 1గా ప్రచురించారు. దీనిలో ప్రగతిశీల రచయితగా జాషువాను కూడా పేర్కొన్నారు. అలాగే, జనసాహితి ప్రధాన కార్యదర్శి దివికుమార్ అధ్యక్షత వహించే జాషువా సభను వివరిస్తూ ఒక కరపత్రం వెలువడింది. ఆ సభ అక్టోబరు 21, 2007 న విజయవాడలో జరిగింది. ఆ కరపత్రంలో దళిత కవి, విశ్వనరుడు జాషువాపై సాహిత్య సభ నిర్వహిస్తున్నట్లు పేర్కొని, జాషువాను ఒక దళిత మేధావిగా అభివర్ణించారు. ఈ కరపత్రంలోని కొంత భాగాన్ని నవంబరు, 2007 (299వ) సంచికలో కూడా ప్రచురించారు.
అలాంటి "దళిత మేధావి"కి సమగ్ర దృక్పథం లేదా? అనిపించకమానదు! ఏది ఏమైనా, చాలా మంది జాషువాను, ఆయన సాహిత్యాన్ని అర్థం చేసుకోవడంలో భిన్న వైరుధ్యాలునాయి. జాషువాను చదివేవాళ్ళు వాళ్ళ దృక్పథం నుండే అర్థం చేసుకుంటారని ఈ సంచికలోని మిగతా వ్యాసాలు కూడా నిరూపిస్తున్నాయి. అలాగే జాషువాని వర్గ దృక్పథం నుండే ప్రజాసాహితి అవగాహన కలిగించే ప్రయత్నం చేసింది.
దళిత రిజర్వేషన్స్ పట్ల ప్రజాసాహితి దృక్పథం:
"వ్యవస్థ పరిమితిని బహిర్గతపరిచిన సుప్రీం తీర్పు" పేరుతో నవంబరు, 2006 (288వ) సంచికలో ఒక సంపాదకీయం ఉంది. దళితుల రిజర్వేషన్స్ గురించి చర్చించింది. ఎస్.సి., ఎస్.టి., ఒ.బి.సి.లలో సంపన్నవర్గాలకు రిజర్వేషన్ చెల్లదని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని ఆధారం చేసుకొని, దళితులకు రిజర్వేషన్స్ వల్ల ఒనగూరిన ప్రయోజనాలను విశ్లేషించారు. ఈ సంపాదకీయంలో చట్టబద్ధ రిజర్వేషన్స్, వ్యవస్థీకృత రిజర్వేషన్స్ అని రెండు రకాలుగా రిజర్వేషన్స్ ని వర్గీకరించారు. వంశపారంపర్యంగా వస్తున్న ఆస్తులను, అధికార హోదాలను, ఆ వర్గం వాళ్ళే మళ్ళీ అధికారాన్ని చెలాయించటాన్నీ గుర్తించకుండా, అణచివేతకు గురవుతున్న వర్గాలకు రిజర్వేషన్స్ కల్పించినత మాత్రాన ఉపశమనానికి మించిన ప్రయోజనం ఉండదనీ, అందువల్ల దోపిడీ పాలకవర్గాల దృష్టిలో భిక్షగా వున్నప్పటికీ రిజర్వేషన్స్ ను దళితులు హక్కుగా పొందటంతో కాకుండా, వ్యవస్థీకృత రిజర్వేషన్స్ ని రద్దుపరిచేలా సమైక్యపోరాటం చేయాలన్నారు. అప్పుడు మాత్రమే దళితులకు, సమస్త పీడిత వర్గాలకూ విముక్తి లభించగలదని నమ్ముతున్నారు. దళితులలో కూడా అంతర్గతంగా వివిధ స్థాయిలు తయారవుతున్నాయని వింగడించారు. పైకెదుగుతున్నవారూ 2) వ్యవస్థ అందించే చిట్టిపొట్టి అవకాశాలతో నిలబడాలని చూసేవారూ, 3) వ్యవస్థలోని అవినీతితో సర్దుబాటు చేసుకొంటూ, వ్యవస్థ స్వరూప స్వభావాల్ని వర్గ - కుల దృక్పథంతో అవగాహన చేసుకొని సమైక్య పోరాటానికి సమాయత్తమవుతున్న వాళ్ళు. మూడవ వర్గమే దళితులకు నిజమైన ఆశాదీపంగా ఈ సంపాదకీయంలో అభివర్ణించారు.
జనసాహితి 10వ రాష్ట్ర మహాసభ (తరిమెల)లో చర్చించి ఆమోదించిన 'ప్రజాసాహితీ' సాంస్కృతికోద్యమం - దళితులపై కొనసాగుతున్న కులపరమైన వివక్ష రిజర్వేషన్స్ తో సమసిపోదనీ, దళిత సమస్యను రిజర్వేషన్స్ కే పరిమితం చేయటం - భూస్వామ్య వ్యవస్థ రద్దులాంటి మౌలిక మార్పులు లేకుండా చేయటం పాలక వర్గాల కుట్రలో భాగమన్నారు.
రిజర్వేషన్స్ దళితుల అభివృద్ధికి తోడ్పడుతున్నట్లనిపించినా, అవి కొద్ది మందికే తప్ప, వ్యవస్థ సమగ్ర అభివృద్ధి తోడ్పడకపోగా పాలకవర్గాలు దాన్ని తమ ఓట్ల రాజకీయంలో పావులుగా ఉపయోగించుకుంటున్నారనే దృక్పథాన్ని ప్రజాసాహితి ప్రదర్శించినట్లు స్పష్టమవుతుంది. 60 ఏళ్ల సంస్కరణవాదంపై భ్రమలు వీడమంటోంది. "చైతన్యవంతమైన దళిత యువకుల నాయకత్వం కోసం సమస్త పీడిత జనవాహిని ఎదురు చూస్తోందం'టున్నారు. న్స్
దళితుల భూమి సమస్య:
డిసెంబరు, 2006 (289వ) సంచికలో "ఖైర్లాంజీ అవమానాల దురాగతాల జీవితాలింకెన్నాళ్ళు'' అనే పేరుతో సంపాదకీయం ప్రచురించారు. ఎదుగుతున్న ఒక దళిత కుటుంబాన్ని చూసి భరించలేని ఆధిపత్యతత్త్వంతో, ఆర్థిక, రాజకీయ వనరులు గుప్పెట్లో పెట్టుకున్న వారి నాయకత్వంలో ఖైర్లాంజీ దుస్సంఘటన జరిగిందన్నారు. ఆ సంఘటన పూర్వాపరాలను విశ్లేషించారు.
"2006 సెప్టెంబరు 29న భయ్యాలాల్ బోత్మాంగ్ అనే దళిత కుటుంబ సభ్యులను, భార్య కూతురు, ఇద్దరు కొడుకులను దారుణాతి దారుణంగా హింసిస్తూ, వివస్త్రలను గావించి, గ్రామమంతా నగ్నంగా తిప్పి మానభంగం చేసి, మర్మావయాల్లో కర్రలు దూర్చి శరీరాలు ఛిద్రం చేసి, చివరకు దారుణంగా హత్య గావించి శవాలను ఊరవతల కాలువలో పారేశారు" అంటూ, అక్కడ ఏమి జరిగి ఉంటుందో సమగ్ర కథనంలా వివరిస్తూనే ఆ సమస్యను లోతుగా చర్చించారు.
"ఆర్థికంగా నిలదొక్కుకున్న దళితులు విద్యాపరంగా ఎదిగిన దళితులు సాంఘిక సమానత్వాన్ని కోరుకుంటే భరించలేనితనం మన కులవ్యవస్థ సృష్టించిన సంస్కృతినిండా ఇంకా వైదొలగలేదు సరికదా, పెచ్చురిల్లిపోతోందనడానికిదొక ప్రత్యక్ష నిదర్శనం."
"భయ్యాలాల్ హిందూ సామాజిక వ్యవస్థ నుండి విముక్తి కావటానికి, బౌద్ధాన్ని స్వీకరించాడు. ఏ సంస్కృతిక ధర్మమూ అతన్ని కాపాడలేదు."
"ఎన్నికల రాజకీయ వ్యవస్థ దళితులను ఓటు బ్యాంకుగా మాత్రమే మిగుల్చుకొని, విభజించి పాలించే సంస్కృతిని అమలుపర్చుకుంటూ, ఇంకా ఉపకులాలుగా చీల్చుతూ తమ ప్రయోజనాలకు వినియోగించుకొంటోంది."
"చిట్టి పొట్టి సంస్కరణలతో, వోటు బ్యాంకు రాజకీయాలతో, మతమార్పిడులతో సాటిమనిషిపట్ల దయా, జాలీ కలిగించని చదువులతో, సామాజిక న్యాయాన్నివ్వలేని వ్యవస్థలో ఎంతకాలం మరింకెన్ని తరాలు ఇలా జీవించాలో ఆత్మపరిశీలన చేసుకోమని ఖైర్లాంజీ ఘోషిస్తోంది. సంపన్నులను కాపాడే కులవ్యవస్థను సృష్టించిన 'చట్రం' బద్దలు చేయకుండా దానిలో యిమిడే ప్రయత్నాలన్నీ అంతిమ సారంలో అశేష దళిత ప్రజానీకానికి ఆకలీ, దారిద్ర్యం అణచివేతలనే కొనసాగిస్తుందని ఎలుగెత్తి చాటుతోంది. సమస్త దోపిడీ పీడనలకు వ్యతిరేకంగా శ్రమజీవుల సంఘటిత పోరాటాలు సాగించాల్సిన, చైతన్యాన్ని పెంపొందించాల్సిన చారిత్రక సందర్భం గడప ముందుకొచ్చి నిలిచిందని బోధిస్తోంది."
ఈ సంపాదకీయంలో కులాని గుర్తిస్తూనే, దానివల్ల ఉత్పన్నమయ్యే సంఘర్షణలను గుర్తిస్తూనే అది భూస్వామ్య, పాలకవర్గాల దోపిడీ, పీడనల కనువైన వ్యవస్థగా వ్యాఖ్యానించింది. దళితులు నిజమైన అస్తిత్వం భూమిని సాధించుకొనేటప్పుడే బయటపడుతుందనడానికి ఈ ఖైర్లాంజీ సంఘటన సజీవ సాక్ష్యం అని వివరించారు. ఒకటి, రెండు దళిత కుటుంబాలు కొద్దిపాటి భూమిని సంపాదించుకోవటంతోనో, భూమిపై హక్కుని సాధించటంతోనో కులసమస్య తీరిపోదనీ, సమష్టిగా భూమిపై సమస్త పీడితజనం హక్కుని సాధించగలిగినప్పుడే నిజమైన విముక్తి లభించి, స్వేచ్ఛగా బతకగలుగుతారనే దృక్పథాన్ని వెల్లడించారు. భయ్యాలాల్ వంటి ఒకటి, రెండు కుటుంబాలు భూమిపై హక్కుని సాధించినా, భూమి దక్కనివాళ్ళు ఎక్కువగా దళితుల్లో ఉన్నారు. ఖైర్లాంజీ దుస్సంఘటన వెలుగులోకి రావడానికే చాలా కాలం పట్టిందనీ, అది వైయక్తిక చైతన్యంగా, వైయక్తిక అభివృద్ధిగా కాకుండా, దళిత, సమస్త పీడిత ప్రజా చైతన్యంగా సామాజిక అవగాహన, సాహితీ దృక్పథం అనే పత్రాన్ని వెలువరించారు. అభివృద్ధి చెందాల్సిన చారిత్రక సందర్భం గడప" ముందు కొచ్చిందని వ్యాఖ్యానించారు.
ఇలాంటి సమస్యనే "ఓ రిజర్వు పంచాయితీ కథ" "కులం - వర్గం" సంబంధాలను శక్తివంతంగా నిరూపించగలిగింది. ఆ కథను బొల్లిముంత నాగేశ్వరరావు రాశారు. దాన్ని ప్రజాసాహితి అక్టోబరు, నవంబరు, 1981 (43వ) సంచికలోనే ప్రచురించింది.
గిరిజన దళిత పదాలు:
విశాఖజిల్లా వాకపల్లి గ్రామంలో 2006 ఆగస్టు 20 వ తేదీన 21 మంది పోలిసులు, 11 మంది గిరిజన మహిళలపై అత్యాచారం చేశారనే సంఘటనను ఖండిస్తూ "వాకపల్లి ఆదివాసీ స్త్రీలపై అత్యాచారాలు: నిస్పాక్షిక న్యాయవిచారణ జరిపించాలి" పేరుతో సంపాదకీయం ప్రచురించారు. ఈ సంపాదకీయంలో గిరిజన, ఆదివాసీ లాంటి పారిభాషిక పదాలే తప్ప, దళిత అనే శబ్దాన్ని ప్రయోగించలేదు. ఇందులోనేకాదు, ఇంచుమించు ప్రస్తావించిన ప్రతి సంపాదకీయంలోనూ "దళిత, గిరిజన" వంటి శబ్దాలనే ఒక స్పష్టమైన అవగాహనతో ప్రయోగిస్తున్నారు. గిరిజనులకు దళితులకు లాగా అస్పృశ్య సమస్య లేదు. జన్మత ఏర్పడిన అస్పృశ్య సమస్య అంటరానితనం కుల సమస్యలు దళితులనే ఎక్కువగా బాధిస్తున్నాయి. గిరిజనులను కూడా విశాలమైన అర్థంలో 'దళితులు' గా చాలా మంది సంభావించడంలో లోతైన అవగాహన మరింత రావలసి ఉంది. ఈ రెండూ వేరు వేరు సాంఘిక సమూహాలనే అవగాహనతోనే 'దళిత', 'గిరిజన' పారిభాషిక పదాలను 'ప్రజాసాహితి' తన సంపాదకీయ వ్యాసాల్లో ప్రయోగించింది. కనుక, దళితులకు, గిరిజనులకు ఉన్న సమస్యలలో వైవిధ్యం గలదనే ఆలోచనలు ప్రజాసాహితికి ఉన్నాయని అర్థం చేసుకోవాలి.
దళిత సాహిత్యకారులు: సామాజిక రచనలు
దళిత సమస్యలను దళితులే రాయాలనే వాదన దళిత రచయితలను సామాజిక విప్లవ రచయితలుగా ఎదగనివ్వకుండా చేసే ప్రయత్నమనీ, దళిత జీవన సంఘర్షణ, దళిత జీవితానుభవం ఉన్నవాళ్ళే గాఢంగా చిత్రించగలుగుతారనే దానికి అనుభవ జ్ఞానం ఒక్కటే సరిపోదనీ శాస్త్రీయమైన ఆలోచనలను ముందుకు తీసుకెళ్ళాలని పదవ మహాసభ పత్రంలో వ్యాఖ్యానించారు. పాటిబండ్ల ఆనందరావులా దళితేతర శ్రామికుల జీవన సంఘర్షణను కూడా చిత్రించగలిగేవారుగా దళిత రచయితలు ఎదగాలని జనసాహితి కోరుకుంటోందని నేను అభిప్రాయపడుతున్నాను.
దళితుల ఎ,బి,సి,డి వర్గీకరణ :
దళితులను విభజించటం పాలకవర్గాల కుట్రగా, దళితులను మరింత అనైక్యతను గురిచేయటంగా ఖైర్లాంజీ సంఘటన గురించి రాసిన సంపాదకీయంలోను, జనసాహితి 10వ రాష్ట్ర మహాసభలు ఆమోదించిన పత్రంలోనూ వివరించారు. అయితే ఎ,బి,సి,డి, వర్గీకరణ ఉద్యమంలో న్యాయం ఉందనీ వ్యాఖ్యానించారు. మాల, మాదిగల వివాదాన్ని తెలిపే ఒక కరపత్రాన్ని నవంబరు, 1998 (202వ) సంచికలో ప్రచురించారు.ఆ కరపత్రాన్ని ఎస్.ఆర్.శంకరన్ రాసింది.
"ఎబిసిడిల విభజనలో మెరుగైన న్యాయం వుండినా పాలక గ్రూపులూ, రకరకాల సంస్కరణవాదులూ, రిజర్వేషన్ల విభజనే కాక దళిత ప్రజల విభజనకు కూడా దాన్ని వినియోగిస్తున్నారు.'' అని 10వ మహాసభ పత్రంలో వ్యాఖ్యానించారు.
ఇలా వివిధ సమస్యలపై 'ప్రజాసాహితి' తనదైన పీడిత ప్రజలందరి ఐక్యతా దృక్పథాన్ని ప్రదర్శించింది. ఈ విషయాలకు కళాత్మక అభివ్యక్తిగానే సాహిత్య ప్రక్రియల్లోనూ ప్రతిఫలించింది.
'ప్రజాసాహితి': దళిత సాహిత్య దృక్పథం:
ప్రజాసాహితి పత్రికల్లో దళితుల గురించి రాసిన కవితలు, కథలు, వ్యాసాలు కూడా ప్రచురించారు. "మాలోల్లమంటావు మాదిగలమంటావు, మాట మాటాడితే దూరముండంటావు" అనే చాలా ప్రాచుర్యం పొందిన పాట ప్రజాసాహితి 3వ సంచిక 1977 అక్టోబరులో వచ్చింది. అక్టోబరు, నవంబరు 1981 (43వ) సంచికలో బొల్లిముంత నాగేశ్వరరావు రాసిన "ఓ రిజర్వు పంచాయితీ కథ" (పుట. 18-28)ను ప్రచురించారు. భూమిపై హక్కు లేకుండా, చట్టాలు రిజర్వేషన్స్ పేరుతో అధికారం ఇచ్చినా అది పెత్తందారుల చేతిలో చిక్కి దళితులకు మరెన్నో చిక్కులకు కారణమవుతుందని తెలిపే కథ. భూస్వామ్య పెత్తందార్లు వెంకునాయుడు, అంకిరెడ్డుల తరతరాల గ్రామ సర్పంచ్ గిరీకి "రిజర్వేషన్" అడ్డంకి అవుతుంది. ఎస్.టి.లకు ఆ పంచాయితీ కేటాయించడం, నిరక్షరాస్యుడైన, తినడానికే తిండిలేని యానాది 'బుర్రోడు'ని సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం, తరువాత, తన ప్రాణానికీ గ్రామంలో తన జాతివారందరికీ ఆ రిజర్వేషన్ వల్ల వచ్చిన పదవి తమని కాపాడకపోగా, తమ అస్తిత్వానికే ప్రమాదకారిగా మారుతుందని నిరూపించే కథ.
భూమిలేకుండా, ఆర్థిక పరిస్థితి బాగుపడకుండా చట్టాలు దళిత, గిరిజనులకు ఎన్ని రిజర్వేషన్స్ కల్పించినా, వాటిని పాలక వర్గాలే వాడుకుంటాయి తప్ప, దళిత, గిరిజనుల జీవితంలో మౌలిక మార్పులు చేయలేవని స్పష్టం చేసే కథ.
జూలై, 1995 (165వ) సంచికలో అడివి బాపిరాజు కథను ప్రచురించారు. 1945లో రాసిన 'నరసన్న పాపాయి' కథలో దళితులపై దళితేతరులకు ఉన్న భిన్న దృక్పథాలను సృజనీకరించిన కథ. ఒక దళితుడు (నరసన్న) దేవాలయంలోకి ప్రవేశించబోతే ఒక దళితేతర పెత్తందారుడు తీవ్రంగా కొడతాడు. నరసన్న భార్య రత్తాలు పెత్తందారుల ఇంట్లో పనిచేస్తూ ఉంటుంది. ఆమె గర్భంతో ఉండగా, ఆ ఇంటి యజమానురాలు అగ్రవర్ణ స్త్రీ అయినప్పటికీ రత్తాలుతో సన్నిహితంగా ఉండటమే కాకుండా, ఒక రోజు రత్తాలు కూతురికి పాలు కూడా ఇస్తుంది. దళిత - దళితేతురుల సంబంధాలను ఒక వాస్తవిక దృష్టితో రాసినా, ఊహాత్మకత ఎక్కువగా ఉందీ కథలో! అగ్రవర్ణాలవారంతా మంచివాళ్ళు కాదు, అలాగని అందరూ చెడ్డవాళ్ళు కాదని చెప్పే కథ! అయితే, కులం వల్ల కలిగే వ్యధలను హృద్యంగా వర్ణించారు. ఇదే సంచికలో అడవి బాపిరాజు గారి 'దీపావళి కథ' దళిత కథ అని ఎ.బి.సుందరరావు సమీక్షా వ్యాసంలో పేర్కొన్నారు. దాదా హయత్ రాసిన "సెగమంటలు" కథ కూడా దీనిలోనే ప్రచురించారు.
ఎన్నికల మాయాజాలంలో తాగుబోతైన మాల ఓబులేసు దొంగ ఓటు వేయవలసిన దుస్థితి, ప్రజాస్వామ్యంలో ఓట్లను కొనే పద్ధతినీ, దొంగ ఓటు వేయకపోతే దళితులకు కలిగే అనర్థాలను వర్ణించిన కథ. భూస్వామ్య పెత్తందారీ వ్యవస్థలో దళితులెలా నలిగిపోతున్నారో ఆర్థిక, సాంఘిక పరిస్థితులెలా ఉన్నాయో స్పష్టం చేసే కథ. ఆర్థిక దృష్టే ప్రధానంగా ఉన్న ఈ కథలో ఓబులేసుని మాలగా, డప్పుకొట్టేవానిగా చిత్రించారు రచయిత. మాలలు డప్పుని కొడతారా? ఒకవేళ ఒకటి, రెండు ప్రాంతాల్లో అలా జరిగినా అది మాలల వృత్తిగా పరిగణించలేం! కనుక, ఓబులేసు వృత్తి విషయంలో ఇంకొంచెం జాగ్రత్త తీసుకుని వుంటే బాగుండేది.
అక్టోబరు, 1995 (168వ) సంచికలో జాషువా గురించి చాలామంది రాసిన వ్యాసాలు ప్రచురించారు. ఆచార్య వి.రామకృష్ణ 'జాషువా సాహిత్యం - సాంఘిక నేపథ్యం'లో ప్రజాసాహితీ వేత్తలకూ సమకాలీనతే అతని సాహిత్య అస్తిత్వాన్ని నిర్ణయిస్తుందనీ, అలాగే జాషువా రచనల్లోనూ కొనసాగిందన్నారు. దానికి కవి సామాజిక నేపథ్యం నిర్ణయాత్మకంగా పనిచేసిందన్నారు. దానిలోని భావాలు చాలావరకూ ఈ సంచిక సంపాదకీయంలో కనిపిస్తున్నాయి. జాషువాది మానవతావాదమనీ మార్క్సిజం కూడా గొప్ప మానవతావాదమేననీ పేర్కొన్నారు. జాషువా ప్రాపంచిక దృక్పథంపై ఎన్.అంజయ్య రాసిన వ్యాసంలో చర్చించవలసిన అంశాలు ఎన్నో ఉన్నాయి. జాషువా వర్గదృష్టిని అద్దేపల్లి రామమోహనరావు; 'గబ్బిలం' ఆత్మ కథాత్మకావ్యం అంటూ డా// కఠెవరపు వెంకట్రామయ్య ; కులాల కతీతుడైన దళిత కవిగా క్రాంతికిరణ్,; జాషువా - ముద్దుకృష్ణల వివాదం గురించి రవిబాబు మొదలైనవాళ్ళంతా వ్యాసాలను ఈ సంచికలో ప్రచురించారు. ముద్దుకృష్ణలోనూ సంస్కరణాభిలాష వుందనీ, ఆయన నడిపిన జ్వాలపత్రిక (1933-3వ సంచిక)లో అలాంటి భావాల్ని వ్యక్తం చేసే కవిత ఉందనీ, కొన్ని సాంకేతిక కారణాల వల్ల కొన్ని పరిమితుల వల్ల జాషువా కవితను 'వైతాళికులు'లో చేర్చకపోయి ఉండవచ్చునన్నారు. అలా చేర్చకపోవడం వల్ల అది జాషువాకు జరిగిన హానిగానో, కుట్రగానో వాపోవడం" పరమ ఆశ్చర్యంగానూ, అసహ్యం గానూ" ఉందని ఆ వ్యాసంలో రవిబాబు వ్యాఖ్యానించారు. ఈ వ్యాసాన్నే ప్రధానంగా మెచ్చుకుంటూ ద్వా.నా.శాస్త్రి ఓ ఉత్తరాన్ని రాస్తే, దాన్ని నవంబరు, 1995 సంచికలో ప్రచురించారు.
ఎస్.అంజయ్య జాషువా వ్యాసాన్ని విమర్శిస్తూ గుంటూరు నుండి టి.రవిచంద్ రాసిన ఉత్తరం ఉంది. జాషువా అభ్యుదయ కవి అనీ, ఆయన కవిత్వంలో ఆధునిక కవిత్వం ఎలాంటిదో ఆధారాలతో చూపే విధంగా ఈ ఉత్తరం ఉంది. అలాగే ఎస్.అంజయ్య రాసిన వ్యాసంపై కూడా టి.రవిచంద్ విమర్శనాత్మక లేఖాంశాలు ఉన్నాయి. డిసెంబరు, 1995 నాటి సంచికలోనూ జాషువా ఆర్థిక - కుల దృక్పథాన్ని విశ్లేషిస్తూ అంజయ్య గారు రాసిన వ్యాసాన్ని తులనాత్మకంగా పరిశీలిస్తూ టి.రవిచంద్ గారి సుదీర్ఘ ఉత్తరాన్ని ప్రచురించారు.
ఇదంతా చర్చలకు అవకాశమిచ్చే ప్రజాస్వామిక పద్ధతి. జాషువా సాహిత్య దృక్పథంపై 'ప్రజాసాహితి' చర్చను ఆహ్వానించింది. ఇలాంటి చర్చనే 'ప్రజాసాహితి' 'కులవృత్తి కథ'పై కుడా కొనసాగించింది.
సెప్టెంబరు, 2006 (286వ) సంచికలో ఆచార్య కొలకలూరి ఇనాక్ గారు రాసిన 'కులవృత్తి' కథను ప్రచురించారు. కులవృత్తులన్నింటికీ గౌరవం లభిస్తున్నా, మాదిగలు చేసే చర్మకారవృత్తికుండే సరైన గుర్తింపు, వారికి ఆత్మగౌరవం లభించడం లేదనే దృష్టితో నిర్మితమైన కథ 'కులవృత్తి' ఇంకా చెప్పాలంటే చిత్తవృత్తికి భౌతిక వాస్తవికతను శాస్త్రీయ పద్ధతిలో వివరించే కథ ఇది.
అక్టోబరు, 2006 (287వ) సంచికలో ఈ కథపై వివిధ స్పందనలను ప్రచురించారు. డా// శాంతికుమార్, పి.నాసరయ్య, నండూరి రాజగోపాల్లు ఈ కథను తీవ్రంగా విమర్శిస్తూ ఉత్తరాలు రాశారు. అలాగే నవంబరు, 2006 సంచికలో మరికొన్ని ఉత్తరాలను ప్రచురించారు. కథా రచయిత వివరణను కూడా ప్రచురించారు.
'కులవృత్తి' కథను 'ప్రజాసాహితి' ప్రచురించటం సరైందికాదని కొంతమంది, ప్రచురించి చర్చకు అవకాశం ఇవ్వడం ప్రజాస్వామ్య పద్ధతని మరొకరూ, అది ఒక వితండవాదాన్ని ప్రతిపాదిస్తూ, కళ కళ కోసమేననే దృక్పథంతో రాసిన కథ అనీ ఇలా రకరకాల అభిప్రాయాలను వ్యక్తం చేసేటట్లు చర్చ కొనసాగింది.
దివికుమార్ దీనికొక ముగింపునిస్తూ చక్కని సమన్వయాన్నిచ్చారు -
'ఒక అసహజమైన, అమానుషమైన, దుర్మార్గమైన, నీచమైన అస్పృశ్యతతో కూడిన దుష్టకుల వ్యవస్థను తీవ్రాతితీవ్రంగా ద్వేషించలేకపోతున్నాం. కొనసాగుతున్న యథాతథస్థితికి అలవాటుపడిపోయి వున్నాం.... ఇక్కడ రచయిత ఒక అసహజమైన కోర్కెతో సహజమైపోయినదన్నట్టుగా వున్న కులవ్యవస్థపైన ఆగ్రహాన్ని తీవ్రంగా ప్రకటింపజేస్తున్నాడు.... ఉద్దేశ్యం మంచిదే. కంటిని బాగా విప్పారుకునేట్లు చూపాలనే ప్రయత్నంలో కొద్దిగా కాటుక ఎక్కువయ్యింది. అంతే'' అని దివికుమార్ రాశారు.
మొత్తం మీద కులవృత్తి కథపై శాస్త్రీయ దృక్పథంతో చర్చకు అవకాశం కలిగించింది. 'ప్రజాసాహితి'. వీటిని అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని డా// దార్ల వెంకటేశ్వరరావు గారు, 'చిత్తవృత్తికి భౌతిక వాస్తవికతను నేర్పే కథ కులవృత్తి' అంటూ ఒక సుదీర్ఘమైన వ్యాసాన్ని 'ప్రజాకళ' ఇంటర్నెట్ పత్రికలో రాశారు. (జూన్, 2007)
'21వ శతాబ్దంలో సాహితీ విమర్శ' గురించి డా// మేడిపల్లి రవికుమార్ గారి ప్రసంగ వ్యాసాన్ని ఏప్రిల్ 2006 (281వ) సంచికలో ప్రచురించారు.
'ఈ రోజున అనేక కులాల్లో విభజన రావడం, విభజన తారాస్థాయికి వెళ్ళడం, అనేకమైన గ్రూపులలో అస్తిత్వానికి సంబంధించిన చైతన్యం, దళితవాదం, స్త్రీవాదం, మైనారిటీ వాదంలాంటివి రావడం - ఇవన్నీ ప్రపంచీకరణ ఫలితాలే'' అయినా అవన్నీ సంఘటిత రూపానికి దారితీస్తాయనీ, అలాంటి వాదాల నోరు నొక్కేయడం అశాస్త్రీయమని పేర్కొన్నారు. కులపరంగా ఉన్న వర్గాల సమైక్యత గురించి వ్యాఖ్యానిస్తూ ఈ రచయిత ఒక స్వీయానుభవాన్ని జోడిస్తూ ఒక కళాకారుడు కోలాటం నేర్పుతుంటే రానంత జనం, ప్రదర్శనకొచ్చారనీ, ఆ కళారూపాలే ఆ జనం పాటలే ఆ ఊరివారినంతా శాశ్వతంగా కలిపేసిందని చెప్పుకొన్నారు. దీన్ని కుల, వర్గ సమైక్య పోరాటానికి సాధారణీకరించలేం నీ, కళారూపానికి గొప్ప శక్తి ఉందని మాత్రం రచయిత ఉద్దేశ్యమై ఉంటుంది." ఇదే సంచికలో 'వర్గ' సమస్యలో 'కుల' సమస్యను జోడించి పోరాడవలసిన అవసరాన్ని చెప్పే విధంగా ఉన్న డా// దార్ల వెంకటేశ్వరరావు గారు రాసిన 'ఇప్పుడు కావల్సింది!'' కవితను ప్రచురించారు.
'దళిత సమస్యపై రెండు నాటికలు - ఒక పరిశీలన' పేరుతో కె.పాల్రాజ్ రాసిన తులనాత్మక వ్యాసంలో బోయి భీమన్నల 'పాలేరు' చూపిందనీ, విప్లవం ఉదయకుమార్సోని, 'నరమేథం' నాటికల గురించి విశ్లేషించారు. చుండూరు సంఘటనకు వేగంగా ప్రతిస్పందించిన రూపొందించిన నాటిక 'నరమేథం' (ప్రచురణ: అక్టోబరు, 91) దళితులు ఒకరిద్దరుగా పాలేర్ల నుండి ఉద్యోగులుగా మారడాన్ని 'పాలేరు' నాటకం, భూమి సమస్యతో కలిపిన కుల సమస్యను కుల సంఘర్షణకున్న వర్గకోణాన్ని 'నరమేథం' నాటికలో ఉన్నదని, వాటిలో 'నరమేథం విప్లవ దృక్పథాన్నివ్వ గలిగిందన్నారు.
ఇలా కొనసాగిన రచనలన్నింటిలోనూ వర్గదృక్పథం, అదీ దళితులను పీడితవర్గంలో భాగంగా చేసుకున్న దృక్పథంలోనే సృజనాత్మక అభివ్యక్తి జరిగిన రచనలు 'ప్రజాసాహితి'లో కనిపిస్తున్నాయి. దళిత సమస్యలపై వర్గ, భౌతిక దృక్పథంతో శాస్త్రీయమైన చర్చ జరగడానికి అవకాశం కలిగించేటట్లు ఉన్నాయి.
మొత్తం మీద 'ప్రజాసాహితి' జనసాహితి ప్రణాళికలో పేర్కొన్న "భూస్వామ్య - సామ్రాజ్య వాద ఆర్థిక వ్యవస్థ పునాదిగా గల భూస్వామ్య సామ్రాజ్యవాద సంస్కృతిని పూర్తిగా నిర్మూలించకుండా నూతన సంస్కృతి నిర్మాణం జరగదు" అన్నట్లే దళిత సాహిత్యాన్ని ప్రచురిస్తూ, దళిత సమస్యలను విశ్లేషించారు. జనసాహితి కర్తవ్యాలలో 3వదైన "అగ్రకుల దురహంకారులకు వ్యతిరేకంగా దళితులూ, ఇతర ప్రజారాశులూ సాగించే కులోన్మాద వ్యతిరేక పోరాటాలకూ మద్దతునిచ్చే'' దిశగానే 'ప్రజాసాహితి' దళిత దృక్పథాన్ని ప్రదర్శించింది.

No comments: