"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. మీ డిసర్టేషన్ కోసం అంశాన్ని త్వరగా ఎంపిక చేసుకోవాలి

24 December, 2016

కుసుమ ధర్మన్న రచనల ఆవిష్కరణ (24 డిసెంబరు 2016) సభ విశేషాలు

చరిత్రలో విస్మరణకు గురైన తొలితరం దళిత కవి కుసుమ ధర్మన్న రచనలను ప్రచురించి, ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చిన నవ తెలంగాణ (ప్రజాశక్తి) పబ్లిషింగ్ హౌస్ వారు అభినందనీయులని వక్తలు ప్రశంసించారు.
హైదరాబాదులో నిర్వహిస్తున్న ‘ 30వ హైదరాబాదు నేషనల్ బుక్ ఫెయిర్ 2016’ లో   శుక్రవారం సాయంత్రం  5 గంటలకు ‘కుసుమధర్మన్న రచనలు’ ఆవిష్కరణ సభ జరిగింది. సభకు నవతెలంగాణ జనరల్ మేనేజర్ లక్ష్మయ్య ఆహ్వానం పలికిన ఈ సభకు కె.చంద్రమోహన్ అధ్యక్షత వహించారు.


ముఖ్యఅతిథిగా విచ్చేసిన బుద్దపూర్ణిమ ప్రాజెక్టు ప్రత్యేకాధికారి, ప్రముఖ దళిత మేథావి మల్లేపల్లి లక్ష్మయ్య పుస్తకాలను ఆవిష్కరించి మాట్లాడుతూ చరిత్రలో విస్మరణకు గురైన కుసుమ ధర్మన్నజీవితాన్ని సమాజానికి తెలిపి, ఆయన రచనలను ప్రచురించిన ప్రజాశక్తి ప్రచురణల సంస్థను అభినందిస్తున్నానన్నారు. కుసుమ ధర్మన్న గానీ, ఒక దళిత నాయకుడు, సాహితీ వేత్తను గాని చరిత్ర చాలా పాక్షిక దృష్టితోనే చూస్తుందని, అది అంబేద్కర్ నుండి కుసుమ ధర్మన్న దాకా, ఇప్పుడున్న వ్యక్తుల దాకా అది కొనసాగుతూనే ఉందని పేర్కొన్నారు. ఒక వ్యక్తిని చరిత్రకారులు అంచనావేసేటప్పుడు ఆ వ్యక్తి కులం, మతం, భావజాలాలల్నే పరిగణనలోకి తీసుకుంటున్నారు తప్ప, దళిత సమస్యల కోసం సందర్భానుసారంగా కృషిచేస్తున్నారని గమనించడం లేదన్నారు. కుసుమ ధర్మన్న హిందూమతంలో అంతర్భాగంగా ఉంటూనే దానిలోని లోపాల్ని వ్యతిరేకించాడనీ, దానికి నిజామ్ కాలంలో హైదరాబాదు లో గల భాగ్యరెడ్డివర్మ, శ్యామ్ సుందర్, వెంకట్రావు మొదలైన వారితో కలిసిపనిచేయాల్సిన సందర్భాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఒకవైపు గాంధీజీ భావాలకు ప్రభావితుడైనా అంబేద్కర్ భావాలకే ప్రాముఖ్యాన్నిచ్చాడని వ్యాఖ్యానించారు. ఆనాడు కుసుమ ధర్మన్న ‘‘హరిజన’’ అనే పదాన్ని వాడటమే నాడున్న గాంధీజీ తాత్త్విక చింతన ప్రభావం తెలుస్తుందని చెప్పారు.

ప్రముఖ సాహితీవేత్త, ప్రజాశక్తి మాజీ సంపాదకుడు తెలకపల్లి రవి మాట్లాడుతూ నేడు ఆవిష్కరించిన కుసుమధర్మన్న రచనల్ని చూస్తే, చరిత్ర ఇతిహాసపు చీకటికోణాల్ని చీల్చుకొంటూ వెలుగుని విరజిమ్మిన రచనలుగా వీటిని పేర్కొనవచ్చునని అభివర్ణించారు. చరిత్రలెప్పుడూ విజేతల కథనాల నుండే రాస్తారనీ, అందువల్ల పరాజితుల జీవితాలు విస్మరణకు గురవుతుంటాయని, దానికి పాలకుల ప్రభావమే ప్రధాన కారణమని విశ్లేషించారు. బ్రౌన్ మహాశయుడు రాకుంటే మనకు వేమన దక్కుండేవాడుకాదు. , కుసుమ ధర్మన్న రచనల విషయంలోను జరిగిందని, ఆధిపత్య వర్గాలెప్పుడూ తమకు హాని జరిగేవాటికి ప్రాధాన్యం లేకుండా చేస్తుంటారు. అలా ఎంతోమంది చరిత్రలు కాలగర్భంలో కలిసిపోయాయి. కుసుమ ధర్మన్న ధర్మం కోసం పోరాడిన కవి, సామాజిక సంఘసంస్కర్త. సుమారు నూరేళ్ళ క్రితం అంటే 1917 వ సంవత్సరంలో ఆదిఆంధ్రమహాసభ విజయవాడలో జరిగింది. కుసుమ ధర్మన్న అధ్యక్షులుగా ఆ సభను విజయవంతం చేశారు. నేడు మరలా కుసుమ ధర్మన్న రచనలను 2016లో మనం ఒకచోటకు తెచ్చి ఆవిష్కరించుకుంటున్నామంటే, ఆ రచనల్లోని ప్రాసంగికతను అర్ధం చేసుకోవాల్సి ఉంటుందన్నారు. ఆరుద్ర గారంటే తనకెంతో అభిమానమనీ, అయినా ఆయన రాసిన సమగ్ర ఆంధ్ర సాహిత్యంలో కూడా కొంతమందిని విస్మరించారనీ, అలా విస్మరించిన వారిలో కుసుమధర్మన్న కవికూడా ఉన్నారని తెలిపారు. భారతీయ సమాజంలో కుల, మత, వర్గ వైరుధ్యాల వల్ల ఇలాంటి చారిత్రక తప్పిదాలు జరిగిపోతుంటాయని, వాటిని తర్వాత వచ్చేవారు సరిదిద్ధుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని, దానిలో భాగంగానే నేడు కుసుమ ధర్మన్న రచనలను తీసుకొస్తున్నందుకు, వాటిని పుస్తకరూపంలో ఆవిష్కరించడం సంతోషదాయకమని అన్నారు.  

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటి అసోసియేట్ ప్రొఫెసర్ డా.దార్ల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కుసుమ ధర్మన్న జీవితాన్ని, రచనలను, భావజాల వైరుధ్యాలను సోదాహరణంగా విశ్లేషించారు. ఒక ఆయుర్వేద వైద్యునిగా జీవిస్తూ, తన కులం వల్ల కలిగే సంఘర్షణలను గుర్తించి వాటిని పరిష్కరించడానికి తనవంతు కృషిచేసిన సామాజిక వేత్త, సాహితీవేత్తగా కుసుమ ధర్మన్న కవిని గుర్తించాల్సిన అవసరం ఉందన వ్యాఖ్యానించారు. ఆయన రచనలను ఒక చోటకు తీసుకురావడంలో విశేషమైన కృషిచేసిన ప్రజాశక్తి బుక్ హౌస్ వారిని అభినందించారు. ఈ పుస్తకాలను తొలిసారిగా రాజమహేంద్రవరంలో ఆవిష్కరించారని, అప్పుడు తనకు విశ్వవిద్యాలయంలో ఒక అర్జెంటు పనివల్ల ఆ సభకు హాజరు కాలేకపోయానని, అయితే హైదరాబాదు బుక్ ఫెయిర్ లో ఆవిష్కరించే సమయంలో తనకు అవకాశం కల్గించిన 
నిర్వాహకులకు ధన్యవాదాలు తెలిపారు. కుసుమ ధర్మన్న జీవితాన్ని చరిత్రీకరించడంలో ప్రజాశక్తి వారు విశేషమైన కృషి చేసి ఆ జీవితాన్ని, ఆ రచనలను సేకరించి, వాటన్నింటినీ ఆకర్షణీయంగా ముద్రించి, అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చినందుకు ప్రచురణ కర్తలను అభినందించారు. గతంలో ఎండ్లూరి సుధాకర్ గారి పర్యవేక్షణలో కుసుమధర్మన్న రచనలపై పరిశోధన చేసిన మద్దుకూరి సత్యనారాయణ పరిశోధన పుస్తకాన్ని కూడా ప్రచురించడం అభినందనీయమన్నారు. ఆ పుస్తకంలో చరిత్ర రచనకు సంబంధించిన కొన్ని చక్కని పద్ధతులున్నాయని, వాటిని దళిత నాయకులు, సాహితీవేత్తల గురించి చరిత్ర రాసేవారు దృష్టిలో పెట్టుకోవాలన్నారు. కుసుమ ధర్మన్న రాసిన ‘హరిజనశతకం’ పై నల్గొండలోని మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం, దూరవిద్య లో చదివే విద్యార్థుల కోసం సరళంగా ఒక పాఠాన్ని రాశానని తెలిపారు. నేడు విశ్వవిద్యాలయ స్థాయిలో పరిశోధన చేసేవారికి ఇప్పుడు ప్రచురించిన పుస్తకాలు ఒక చక్కని ఆకరాలుగా ఉపయోగపడతాయని, ఆ కృషి చేసినందుకు ఒక విశ్వవిద్యాలయ అధ్యాపకుడిగా సంతోషిస్తున్నానని, ప్రచురించిన వారిని అభినందిస్తున్నానని అన్నారు. కుసుమ ధర్మన్న పుట్టిన తేదీ విషయంలో భేదాభిప్రాయలున్నాయనీ, కొంతమంది ఆయన 1894లో పుట్టి, 1948 వరకు జీవించినట్లు పేర్కొనగా, మరికొంతమంది 1900లో పుట్టి 1946 వరకు జీవించినట్లు పేర్కొంటున్నారని దీనికి  చరిత్రకారులు దళిత సాహితీవేత్తలను విస్మరించడం ఒక ప్రధాన కారణమన్నారు. దీనితో పాటు ఆయన చేస్తున్న కార్యక్రమాల పట్ల ఆధిపత్య అగ్రవర్ణాల వారు ఆయన గృహాన్ని దహనం చేయడం వల్ల బహుశా ఆయన రచనలు కూడా కోల్పోయి ఉండవచ్చునన్నారు. తాను చదువుకున్నది తక్కువే అయినప్పటికీ తన జీవితానుభవంలో కులం వల్ల ఎదుర్కొంటున్న అవమానాలను, వాటికి కారణమైన వాటిని గుర్తించడం వల్లనే సంఘసంస్కరణకు పూనుకున్నారని వ్యాఖ్యానించారు. తన జీవిక కోసం ఆయుర్వేద వైద్యునిగా పనిచేస్తూనే, మరొక వైపు తన జాతి అభ్యున్నతికి కృషిచేయడంలో భాగంగానే ‘జయభేరి’ వంటి పత్రికను కొన్నాళ్ళపాటు ప్రచురించారన్నారు. కుసుమ ధర్మన్న భావజాలంలో వివిధ పరిణామాలు కనిపిస్తాయని, ఆయనపై గాంధీజీ ప్రభావం అత్యధికంగా ఉందనీ, అందువల్లనే తన కుమారులకు గాంధీజీ పేరు కలిసి వచ్చేటట్లు కూడా పెట్టుకున్నారని వివరించారు.
గాంధీజీ సంస్కరణోద్యమ ప్రభావంతో పాటు అప్పటికి బలంగా ఉన్న జస్టీస్ పార్టీ ప్రభావం, దానితో పాటు మద్రాసులో జరిగిన ఆది ద్రావిడ ఉద్యమం ప్రభావం కుసుమ ధర్మన్నలో కనిపిస్తుందన్నారు. అందువల్లనే దళితులు ఈ దేశ మూలవాసులనే స్ఫృహతో ‘ఆదిఆంధ్ర ఉద్యమా’నికి నాయకత్వం వహించారని, తర్వాత కాలంలో అంబేద్కర్ తో సంబంధాలు ఏర్పడ్డాయని వివరించారు. అయినప్పటికీ, కుసుమ ధర్మన్నలో హిందూ మతంలో భాగంగా భావించే వాల్మీకి, వేదవ్యాసుడు, అరుంధతి మొదలైనవారు తమవారనే ఆలోచనలు ఆయన రచనల్లో కనిపిస్తాయని చెప్పారు. తొలితరం దళిత కవుల్లో ముఖ్యంగా బోయి భీమన్న తదితరుల్లో కూడా ఈ రకమైన ఆలోచనలు ఉన్నాయని వివరించారు. ఆ విధంగా భావజాల తాత్త్విక సంఘర్షణ కుసుమ ధర్మన్నలో కనిపిస్తుందనీ, దాన్ని లోతుగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. 
ప్రముఖ విమర్శకుడు డా.ద్వానాశాస్త్రి మాట్లాడుతూ, తాను కుసుమ ధర్మన్నపై ఒక చిన్న పుస్తకాన్ని ఈ పుస్తకాలేవీ లేనప్పుడే ప్రచురించానని చెప్పారు. కుసుమ ధర్మన్నను తొలి దళిత కవిగా గుర్తించాలన్నారు. సభలో నవతెలంగాణ జనరల్ మేనేజర్ లక్ష్మయ్య సభను పరిచయం చేస్తూ, మరలా హైదరాబాదులో కుసుమధర్మన్న రచనలను ఆవిష్కరించాల్సిన అవసరమేమిటో వివరించారు. సభలో ప్రముఖ కవి తంగిరాల చక్రవర్తి తదితరులు పాల్లొన్నారు. 
















No comments: