అనేక సంవత్సరాలుగా నలుగుతున్న ఎస్సీ వర్గీకరణ సమస్యకు మాల-మాదిగ పెద్దలంతా కలిసి కూర్చొని ఒక ఒప్పందానికి రావడం ద్వారానే ఆ సమస్య పరిష్కారమవుతుందని పద్మశ్రీ పురస్కార గ్రహీత, శ్రీవేంకటేశ్వరవిశ్వవిద్యాలయం మాజీ ఉపాధ్యక్షుడు ఆచార్య కొలకలూరి ఇనాక్ సూచించారు. సోమవారం సాయంత్రం (2 మే 2016) హైదరాబాదులోని సుందరయ్యవిజ్ఞాన భవనంలో జరిగిన ‘కువ్వ’ వర్గీకరణోద్యమ సంఘీభావ కవితా సంకలన ఆవిష్కరణ సభలో ఆచార్య కొలకలూరి ఇనాక్ ముఖ్యఅతిథిగా పాల్గొని, పుస్తకాన్ని ఆవిష్కరించి మాట్లాడారు.
కువ్వ కవితాసంకలనాన్ని ఆవిష్కరిస్తున్న దృశ్యం
మాదిగలు తమకు న్యాయంగా రావాల్సిన రిజర్వేషన్ భాగాలు తమకు దక్కడంలేని కారణంగా కొంత ఆవేశానికి లోనవ్వడం సహజంగా జరిగినప్పటికీ, ఆవేశం కంటే ఆలోచనతో పరిష్కరించుకోవడానికి ప్రయత్నించాలని హితవు పలికారు. రెచ్చగొట్టే ధోరణికంటే తమ వాదనలోని సామంజస్యాన్ని తమ సోదరులకు అర్థమయ్యేలా వివరించడానికి ప్రయత్నించాలన్నారు. అదే సమయంలో మాల సోదరులు కూడా మాదిగలకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించడంలో ఆవేశం వెల్లడవడమనేది ఆవేదనే తప్ప, అవరోధంగా పరిణమించాలనే ఆలోచనకాదని గుర్తించాలని, దాన్ని అర్థం చేసుకొని మాల పెద్దలు ఈ ఎస్సీ వర్గీకరణ సమస్యకు సహకరించాలని వివరించారు. అప్పుడే రాజకీయ పార్టీల వాళ్ళు ఎస్సీ, ఎస్టీలను పావులుగా వాడుకోలేరనీ, తద్వారా తాము సాధించాల్సిన సమైక్య లక్ష్యాల్ని సాధించుకోవచ్చునని పేర్కొన్నారు. ఈ ఆలోచనలకు అక్షరరూపంగానే ఈ ‘కువ్వ’ కవితాసంకలనం వెలువడిందనీ, దీనిలో కవిత్వం రాసిన వాళ్ళంతా ప్రతిభావంతులనీ ప్రశంసించారు.
కువ్వ పుస్తకాన్ని అంకితం తీసుకున్న కీ.శే. మాతంగి మాణిక్ రావు గారి కుటుంబసభ్యులకు తొలిప్రతినిస్తున్న దృశ్యం
పుస్తకాన్ని తీసుకొని రావడంలో సంపాదకుడు డప్పోల్ల రమేశ్ లోని ఉద్యమస్ఫూర్తి, నిబద్ధత కనిపిస్తుందని వ్యాఖ్యానించారు. పుస్తకానికి ఆర్థికంగా సహకరించి ప్రచురించిన మాతంగి చిరంజీవి తండ్రి దండోరా ఉద్యమంలో చైతన్యాన్ని నింపిన కీ.శే. మాతంగి మాణిక్ రావుగారికి పుస్తకాన్ని అంకితమివ్వడం ఔచిత్యవంతంగా ఉందని అన్నారు. ఈ సందర్భంగా ఆ కుటుంబసభ్యుల్ని ఆచార్య కొలకలూరి ఇనాక్ గారు వేదికపై గౌరవించి, తొలిప్రతులను ఆ కుటుంబసభ్యులకు అందించారు.
‘కువ్వ’ కవితాసంకలన ఆవిష్కరణ సభకు సెంట్రల్ యూనివర్సిటి తెలుగు శాఖ అసోసియేట్ ప్రొఫెసర్ డా.దార్ల వెంకటేశ్వరరావు అధ్యక్షత వహించారు. ‘కువ్వ’ కవితాసంకలనంలో మూడు రకాల ధోరణులతో కూడిన కవితలు ఉన్నాయని అవి మాదిగ, అనుబంధ కులాలు వర్గీకరణ కోరుతూ, వారి చరిత్ర, సాంస్కృతికాంశాలను ప్రతిఫలించే కవితలుగాను, మాల, అనుబంధ కులాలు ఎస్సీవర్గీకరణను సమర్థిస్తూ రాసిన కవితలు, అలాగే ఇతరులంతా ఇంటి సమస్య బయటి సమస్యగా మారిన తరుణంలో ఎస్సీవర్గీకరణలోని న్యాయాన్ని సమర్థిస్తూ రాసిన కవితాధోరణులున్నట్లు విశ్లేషించారు.
సభాధ్యక్షత వహించి మాట్లాడుతున్న డా. దార్ల వెంకటేశ్వరరావు
ఎస్సీ వర్గీకరణ జరగకపోవడంలో మాల, మాల అనుబంధ కులాల వారి ఉద్యమం ఎంతగా అడ్డుకుందో, అలాగే సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా బలపడిన మాదిగ, మాదిగ అనుబంధ కులాలవారి పాత్ర కూడా విస్మరించలేనిదనీ, దీనికి అనేక కారణాలున్నాయని డా. దార్ల వెంకటేశ్వరరావు వివిరించారు. జస్టీస్ రామచంద్రరాజు కమీషన్ చేసిన పొరపాటు నిర్ణయాల ప్రభావం వల్ల మాల, మాదిగల్లోని కొన్ని వర్గాలు కోస్తా ప్రాంతంలో ఆదిఆంధ్రులుగా ఉన్నారనీ, వారికి రిజర్వేషన్ శాతాన్ని కేటాయించడంలో జరిగిన పొరపాటు నిర్ణయాల వల్ల ఎదిగిన మాదిగ వర్గాలు కూడా పరోక్షంగా ఎస్సీవర్గీకరణకు ఆటంకంగా నిలిచారనీ, వీళ్ళంతా వ్యవస్థీకృతనియంతృత్వాన్ని పాటించారని విశ్లేషించారు. వ్యవస్థీకృత నియంతృత్వమనేది శాసన, న్యాయ వ్యవస్థల్ని కూడా ప్రభావితం చేయగలిగే శక్తిని కలిగి ఉంటుందన్నారు. అది ప్రత్యక్షంగా కనిపించకుండా పరోక్షంగా తన పాత్రను నిర్వహిస్తుంటుందనీ, దీనివల్ల సామాన్యులకు ఈ సమస్య మూలాలు అర్థం కావడం అంతసులభం కాదన్నారు. దీనికి పాలవర్గాలు, రాజకీయ పార్టీలు వంతపాడటం సహజంగా జరుగుతుందనీ అన్నారు. ఈ సైద్ధాంతిక భావనను అర్థం చేసుకుంటేనే ఎస్సీవర్గీకరణ సమస్య అవగాహనకు వస్తుందని వివరించారు. మూడు సార్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎస్సీ వర్గీకరణను శాసన సభ ద్వారా ఆమోదించినప్పటికీ ఈ సమస్య ఇలాగే ఉండటానికి గానీ, ఎస్సీవర్గీకరణ జీవోని కోర్టు కొట్టేయడంలో గానీ కొద్దిమంది మేధావుల వర్గం చేసిన వ్యవస్థీకృతనియంతృత్వ ఫలితమేనని అర్థం చేసుకోవాలన్నారు. మాల, మాలల్లోని ఉపకులాల వారు కూడా ఎస్సీ వర్గీకరణకు సానుకూలంగా ఉన్నారనీ, అది ఎస్సీ వర్గీకరణ జీవో వచ్చినప్పుడు క్రమేపీ ఆ జీవో ప్రకారమే స్థిరపడిపోవడానికి సిద్ధమైన తరుణంలో మాల-మాదిగలు ఏకమై మహాజనపార్టీ పెట్టి రాజకీయాధికారానికి ప్రయత్నించిన తర్వాతనే మళ్ళీ ఈ విభేదాలు ఎందుకు బహిర్గతమయ్యాయో లోతుగా ఆలోచించాలన్నారు.
ఆంధ్రజ్యోతి, 3 మే 2016
ఈ సభలో పాల్గొన్న ప్రముఖ కవి, విమర్శకుడు జి.లక్ష్మీనరసయ్య రెండు పాటలను పాడారు. తర్వాత సుదీర్ఘమైన ప్రసంగాన్ని చేశారు. ‘కువ్వ’ కవితాసంకలనంలో శక్తివంతమైన భావాలను, భావుకతను కవులు ప్రదర్శించారని సోదాహరణంగా విశ్లేషించారు. తొలిదశలో వచ్చిన దళిత కవిత్వంలాగే, ఎస్సీవర్గీకరణ సంఘీభావ కవిత్వంలో కొంత ఆవేశం కనపడేది. కానీ, నేడీ కవితా సంకలనంలో ఎంతో పరిణతి కనిపిస్తుందన్నారు. ‘కువ్వ’ కవితాసంకలనంలోని కవితలను విశ్లేషిస్తుంటే ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా విన్నారు.
సభలో మాట్లాడుతున్న జి.లక్ష్మీనరసయ్య
ఆయన ఈ సభలో పాడిన ‘ఉందర్రామాలపేట..’ సభను ఉర్రూతలూగించింది. ఒకప్పుడు ‘మాల’ పదం యావత్తు దళిత, అస్పృశ్యతకు ప్రతీకగా ఉందని గుర్తుచేసి, దాన్ని నేటి ‘మాల’ ఉపకులానికే పరిమితం చేసుకోకూడదనీ అంటూ ఆ పాటను పాడారు. ఒకవేళ మనం అలాగే అర్థం చేసుకున్నా ఈ సమావేశం గొప్ప ప్రజాస్వామిక పంథాలో నడిచినట్లుగా భావించుకోవడానికీ నిదర్శనంగా నిలుస్తుందన్నారు. కువ్వ కవితాసంకలనంలో వస్తువైవిధ్యాన్ని రెండు రకాలుగా చూడొచ్చుననీ, అది ఐక్యతను రెండు కోణాల్లో వర్ణించారని విశ్లేషించారు. ఐక్యతను కోరుకుంటూనే, ఆ ఐక్యత నిజమైన సమైక్యతగా మారాలనే ఆకాంక్ష వ్యక్తమవుతుందనీ వివరించారు.
సభలో మాట్లాడుతున్న ప్రముఖ కవయిత్రి జూపాక సుభద్ర
సభలో మాట్లాడిన ప్రముఖ కవయిత్రి జూపాక సుభద్ర ఎస్సీ వర్గీకరణ ఆవశ్యకతను తెలుపుతూనే, మాలలు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సమయంలో ‘కావడి కుండలు’ ప్రచురించారనీ, అలాంటి మద్ధతుని ఎస్సీ వర్గీకరణకు ఇవ్వకపోవడం విచారకరమన్నారు.
మరో వక్త ప్రముఖ పరిశోధకురాలు గోగుశ్యామల ‘కువ్వ’ కవితాసంకలనంలో గల కవిత్వవస్తువుని వివరించారు.సాహిత్య ఉద్యమం, ప్రజాఉద్యమం కలిస్తే ఆ ఉద్యమం
శక్తివంతంగా ముందుకొచ్చి, విజయవంతమవుతుందన్నారు. ప్రభుత్వపరంగా చూసినట్లయితే
అణచివేత, నిరాశా కనిపిస్తుంది. మరోవైపు ఉద్యమం రకరకాల సమస్యల్ని ముందుకి
తీసుకొస్తూ విజయవంతమవుతుందనే ఆశను కనిపిస్తుంది. ప్రభుత్వానికి దళితుల్ని విభజించి
పాలించడమెలాగో బాగా తెలుసు. అయితే దీన్ని గుర్తించి ఉద్యమకారులు సరైనరీతిలో
పనిచేయడంలేదని నా కనిపిస్తుంది. ఈ సందర్భంలో ‘కువ్వ’ ఎస్సీవర్గీకరణ ఉద్యమ
సంఘీభావకవిత్వ సంకలనం రావడం ఉద్యమానికి కొత్త శక్తినిస్తుందని ఆకాంక్షించారు. ఈ
పుస్తకంలోని కవితల్ని పరిశీలిస్తే కేవలం ఒక వర్గీకరణ ఉద్యమం కోసమే కాకుండా రకరకాల
సమస్యల్ని, సాంస్కృతికాంశాల్ని మనముందుకి తెస్తున్నారు. అందువల్ల కేవలం ఈ పుస్తకం
ఎస్సీ వర్గీకరణ సంఘీభావం కోసమే కాకుండా జాతి సాంస్కృతిక విశేషాల్ని చరిత్రీకరించి,
జాతిని మేల్కొలిపేలా ఉందని పేర్కొన్నారు.
సభలో మాట్లాడుతున్న గోగుశ్యామల
ఈనాడు దినపత్రిక (ముషీరాబాద్ జోన్), 3 మే 2016, పుట:1
సభలో మరో వక్త ఎం.మల్లయ్య మాట్లాడుతూ అన్యాయం చేస్తున్న మాల, మాల అనుబంధ కులాల దగ్గరకెళ్ళి తమకు న్యాయం చేయండని ఎలా అడుగుతారనీ, అలా అడిగే పరిస్థితులెక్కడున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి సామరస్య పూరిత వాతావరణమే ఉంటే ఎస్సీ వర్గీకరణ ఉద్యమమే వచ్చేది కాదనీ, మాట్లాడుకున్నంత సులభంగా మాల-మాదిగల మధ్య ఐక్యత వాస్తవంలో కనిపించడంలేదనీ అన్నారు.
సభలో మాట్లాడుతున్న ఎం.మల్లయ్య
సభలో వక్తగా పాల్గొన్న ప్రముఖ కవి, కథారచయిత డా. పసునూరి రవీందర్ మాట్లాడుతూ ‘కువ్వ’ కవితాసంకలనం గురించి మాట్లాడుకోవడమంటే, ఎస్సీవర్గీకరణ సమస్య గురించి మరోసారి మాట్లాడుకోవడమేననీ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మరలా మరో ఉద్యమానికి డప్పోల్ల రమేశ్ శ్రీకారం చుట్టాడనీ ప్రశంసించారు.
సభలో మాట్లాడుతున్న డా. పసునూరి రవీందర్
సంస్కృతాంధ్ర శ్లోకాలు, పద్యాలతో సభలో రంజింపజేస్తూ డా.కోయి కోటేశ్వరరావు మాట్లాడారు. మాల వర్గానికి చెందిన తాను ఎస్సీవర్గీకరణకు సంఘీభావంగా కవిత్వం రాసినప్పుడు తన వర్గం నుండి ఎదుర్కొన్న ఒత్తిడులను వివరించారు.
సభలో మాట్లాడుతున్న డా.కోయి కోటేశ్వరరావు
అయినప్పటికీ తానొక అంబేడ్కరిస్టుగా తన కర్తవ్యాన్ని తాను నిర్వర్తించాననీ, తానేదో ఎస్సీవర్గీకరణకోసం కవిత్వం రాసానని చెప్పుకోవడానికి రాయలేదనీ స్ఫష్టం చేశారు. సెంట్రల్ యూనివర్సిటీలో నాగప్పగారి సుందర రాజుతో తనకున్న సాన్నిహిత్యాన్ని వివరించారు. 1996 నాటికే ‘మాదిగోడు’ కథా సంపుటికి తాను ముందుమాట రాశాననీ, మాదిగ సాహిత్యంలో కనిపించే అనేక విశిష్టకోణాల్ని నాడే వివరించాననీ అన్నారు. భారతీయ దళిత సాహిత్యంలో తెలుగు దళిత సాహిత్యం మొనాటమీకి గురికాకుండా ఉండడానికి మాదిగ సాహిత్యం ఎంతగానో తోడ్పడిందనీ వ్యాఖ్యానించారు. తెలుగు సాహిత్యంలో మాదిగ సాహిత్యం, విమర్శను సిద్ధాంతీకరించడంలో డా. దార్ల వెంకటేశ్వరరావు కృషిని ప్రశంసించారు. ‘కువ్వ’ కవితాసంకలనంలో గల కవిత్వాన్నీ, ముందుమాటల్లోని విశిష్టతలనీ ప్రస్తావించారు. తానీ సభలో పాల్గొనడం తన కుటుంబంతో కలిసినంత సంబరంగా ఉందనీ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు.
‘కువ్వ’ కవితాసంకలనం గ్రంథ సంపాదకుడు డప్పోల్ల రమేశ్ మాట్లాడుతూ పుస్తకాన్ని తీసుకురావడంలో గల సాధక బాధకాలను వివరించారు. పుస్తకానికి కవితలను రాసిచ్చిన వారికీ, పుస్త ప్రచురణకు సహకరించిన వారికీ, సభలో పాల్గొన్నవారందరికీ కృతజ్ఞతలను తెలిపారు.
సభలో కవులు మాతంగి చిరంజీవి, అమృత్ బండారి, డా. పొనుగోటి రవికుమార్, బడిగె ఉమేశ్, డా.ఎం.మంజుశ్రీ, వలీ, డా. నాళేశ్వరం శంకరం తదితరులు పాల్గొన్నారు.
( దీనికి సంబందించిన ఫోటోలను తీసిన వారు పరిశోధక విద్యార్థి బడిగె ఉమేశ్ కి కృతజ్ఙతలు తెలియజేస్తున్నాను)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి