"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., Ph.D., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL 801 Research Methodology ఉదయం11.00 నుండి12.00 గంటల వరకు, TL-426: Indian Literature క్లాసులు మధ్యాహ్నం 2.00 గంటల నుండి 3.00 గంటల వరకు జరుగుతాయి.

ఆత్మకథ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
ఆత్మకథ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

22 మార్చి, 2026

ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు 'నెమలి కన్నులు(ఆత్మకథ)' పై డాక్టర్ కొత్వాలు అమరేంద్ర వ్యాసం

 ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు 'నెమలి కన్నులు(ఆత్మకథ)' మీద సృజన క్రాంతి దినపత్రిక(17-5-26)లో  ప్రత్యేక వ్యాసం..... డాక్టర్ కొత్వాలు అమరేంద్ర 

#############₹###₹#



 సంక్షుభిత జీవన పార్శ్వాల ఆత్మకథ



గతాన్ని తలచుకుంటూ ఆ గతం కల్పించిన వెన్నెల దారుల్లోనూ, ముళ్ల దారుల్లోనూ సాగించిన నడకల్లోని ఒడిదుడుకుల్ని చర్వితచరణం చేసుకోవడమే కాక తనలో ఆత్మస్థైర్యాన్ని, ఆత్మగౌరవాన్ని, ఆత్మవిశ్వాసాన్ని ప్రేరేపించే తనకు ఎదురైన ఎన్నో సంఘటనల్నీ, మరెన్నో సందర్భాల్నీ తన భావోద్వేగాలతో సంలీనం చేయడమే అసలైన ఆత్మకథ అవుతుంది. బాల్యపు నోస్టాల్జియా జ్ఞాపకాల్లో భాగంగా అలాంటి జీవనసంఘర్షణ తాలూకు విభిన్న పార్శ్వాలు కల్పించిన ఎన్నో ఒడిదుడుకులకు అక్షరరూపం కల్పిస్తూ, సామాజిక సంక్షోభంలో ఎదురైన ఎన్నెన్నో ఆటపోట్లను ఎదుర్కొంటూ తాను ఎదిగిన క్రమాన్ని వివరిస్తూ ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు వెలువరించిన ఆత్మకథే ‘నెమలి కన్నులు’ 

తెలుగులో తొలి ఆత్మకథ 1911లో కందుకూరి వీరేశలింగం ‘స్వీయచరిత్రము’తో పారంభమైనా ఒక నిర్దిష్టమైన లక్ష్యంతో సామాజిక ప్రయోజనాన్ని కలిగించే స్ఫూర్తిదాయక స్వీయచరిత్రలు 1934లో ఏడిదము సత్యవతి వెలువరించిన ‘ఆత్మచరితము’(భర్త చనిపోయాక ఆత్మవిశ్వాసంతో కుటుంబాన్ని నెట్టుకొచ్చిన తీరును వివరించడం) గ్రంథంతో ప్రారంభమైందని చెప్పవచ్చు. 20వ శతాబ్దంలోనే తెలుగులో స్వీయచరిత్ర ప్రక్రియ విభిన్న సామాజిక పార్శ్వాలతో, సామాజిక సందేశాలతో పుజుకోవడం ప్రారంభమైంది. చిలకమర్తి లక్ష్మీనరసింహం ‘మాబడి’(తాను అంధుడైనప్పటికీ సాహిత్యంలో తాను ఒక్కోమెట్టు అధిగమించిన విధాన్ని చెప్పడం), ఆదిభట్ల నారాయణదాసు ‘ఎరుక’(ఆత్మగౌరవాన్ని చాటుకుంటూ హరికథాపితామహునిగా తాను ఎదిగిన క్రమాన్ని వివరించడం), కొండపల్లి కోటేశ్వరమ్మ ‘నిర్జనవారథి’( తాను నమ్ముకున్నఉద్యమంలో ఆత్మస్థైర్యంతో తాను ఎదుర్కొన్న అడ్డంకుల్ని వివరించడం), గుర్రం జాషువా ‘నాకథ’(తన సాహిత్యప్రస్థానంలో తాను ఎదుర్కొన్న అనేక వివక్షలను పద్యరూపంలో వివరించడం), ఎన్నో సామాజిక కట్టుబాట్లను ధిక్కరిస్తూ చలం రాసుకున్న ‘స్వీయచరిత్ర’, భోయి హైమవతి ‘పాలేరు నుంచి పద్మశ్రీ వరకు’(తన భర్త భోయి భీమన్న ఎగుడుదిగుడుల జీవనపోరాటాన్ని ఆయన సతీమణి తన ఆత్మకథలో నిక్షిప్తం చేయడం)..వంటి ఆత్మకథలు ఎంతో స్ఫూర్తిదాయకంగా కనిపిస్తాయి. ఇప్పుడు వీటన్నింటి స్ఫూర్తితో దార్ల  ఒక సామాజిక లక్ష్యంతో తన ఆత్మకథను తీర్చిదిద్దారు. 

బాల్యంలోని నోస్టాల్జియా జ్ఞాపకాలు కొందరికి ఎంతో అపురూపంగా కనిపిస్తే మరికొందరికి జీవన సంఘర్శణతో మిళితమైన ఎన్నో ఒడిదుడుకులుగా కనిపిస్తాయి. అలాంటి జీవనసంఘర్షణలతోనే ఈ రచయిత ఆత్మకథ సాగుతూ సామాజిక సంవేదనను వినిపిస్తుంది. ఎన్నెన్నో ప్రశ్నలను సంధిస్తుంది. ఆ ప్రశ్నలకు సమాధానాలను అన్వేషిస్తూ ముందుకు సాగింది ఈ రచయిత జీవితపయనం. తన జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూనే తన కుటుంబనేపథ్యంలో చోటుచేసుకున్న సామాజిక సంక్షోభాన్ని వివరించడమే ఈ రచయిత ప్రధాన ఉద్దేశం. ఆధిపత్యం, వివక్షల మధ్య విలవిలలాడిన తన కుటుంబం తనలో కలిగించిన సంఘర్షణలను తన బాల్యంలోని వివిధ దశల్లో అంటే చిన్నతనం నుంచి పదవ తరగతి దశవరకు 39 అధ్యాయాల్లో వివరించుకుంటూ వేళతాడు. తన కుటుంబాన్ని నెట్టుకురావడంలో తల్లిదండ్రులు పడిన కష్టాలను వివరిస్తూ వారి ప్రేమాభిమానాలకు అక్షరాభిషేకం చేశాడు. ఈ ఆత్మకథ 25 వారాలపాటు భూమిపుత్ర దినపత్రికలో ధారావాహికంగా ప్రచురితమైంది. 

ఈ ఆత్మకథలో రచయిత చెప్పుకున్న బాల్యజ్ఞపకాలు విని మురిసిపోయేంత అపురూపమైన ముచ్చట్లు కావు. తన పసిమనసును గాయపరచిన విభిన్న సామాజిక సంఘర్షణల తాలూకు ఆటుపోట్లుగానూ, సామాజిక చైతన్యానికి దోహదపడే సామాజిక గాట్లుగానూ అవి కనిపిస్తాయి. తన తండ్రితోబాటు పొలం పనులకెళ్లినా, బోర్లు వేసే పనులకెళ్లినా తాను విద్యార్థిగా ఎదిగిన క్రమాన్ని వివరించిన విదానం స్ఫూర్తిదాయకంగా కనిపిస్తుంది. ఈ ఆత్మకథలో ముఖ్యంగా చెప్పుకోదగ్గది రచయిత కథనాత్మక శైలి. ‘పొద్దున్నే ఆ నల్లని మేఘాలెంత వేగంగా నడిచేవో, అంతకంటే వేగంగా అనేకసార్లు దూరపు ఊళ్లలో పనికోసం మా వాళ్లతోపాటునేనూ నడిచేవాణ్ణి కదా అనిపించేది..’. ఇలాంటి శైలే ఈ రచనను చివరివరకూ సుసంపన్నం చేసింది. ఎప్పుడూ పచ్చని పోలాలతో కళకళలాడే కోనసీమ మారుమూల నున్న తమ ఊరిలోని దళిత సౌందర్యాన్ని వివరిస్తూనే తమ వూరిలోని విభిన్న కులాల మధ్య చోటుచేసుకున్న వివక్షలనూ ప్రస్తావిస్తాడు. అది వివరించే క్రమంలో ‘స్మశానం కాని స్మశానంలో కూడా కులం వదలిపెట్టని స్థితిని నేను మా వూరిలో చూశాను’ అంటాడొకచోట. తాను చదువుకునే పాఠశాల గురించి చెప్పే సందర్భంలో స్కూలు రిజిస్టర్ లో తమ పేర్లను తమ అభీష్టానికి అతీతంగా ఉపాధ్యాయులే నిర్ణయిస్తారని చెప్పడం వివక్షలోని ఒక కోణాన్ని చూపిస్తుంది. అందుకే ‘మా పేర్లు మా ఊహల్లోనుంచి వచ్చినవి కాదు. మా అభిరుచులనుంచి ఏర్పడినవి కాదు. వాళ్లకు నచ్చితే మంచి పేరు. వాళ్లకు నచ్చకపోతే వాళ్లిష్టమొచ్చిన పేరే మా పేరుగా మారిపోయేది’..అంటాడింకొక చోట. స్కూలులో ఎప్పుడూ పిల్లల ముందుభాగంలో నిలుచుకునే తనను జెండా పండుగ వందనం రోజున వెనుకవైపున నిలబెట్టడం ఈ రచయితలో తీవ్ర అంతర్మథనాన్ని రేకెత్తించి ఎన్నో ప్రశ్నలను లేవదీస్తుంది. ఈ అతర్మథనమూ స్ఫూర్తిదాయకమే. 

 రచయితకు ఎదురైన పలుసంఘటనల్లోనూ, పలు సందర్భాల్లోనూ వివక్ష అనేక రకాలుగా కనిపిస్తుంది. ఉదాహరణకు జుట్టు కటింగ్, బట్టల ఇస్త్రీ విషయాల్లోనూ చోటుచేసుకునే వివక్షను ఒక అధ్యాయంలో విడమరచి చెబుతాడు. ‘మనకి మంగలాయన కటింగ్ వెయ్యడానికి రారు. అందుకనే నేను మీకు చేస్తున్నా’ అంటూ తనకు జుట్టు కత్తిరించే తండ్రి ‘అదంతే మనకి చెయ్యరు. ఎవరైనా మనకి కటింగ్ చేసినట్టు తెలిస్తే ఊరంతా ఆ మంగలిని వెలివేస్తారు. అందుకే చెయ్యరు’ అని చెప్పడం ఈ రచయితలోని ఆత్మగౌరవాన్ని ప్రశ్నింపజేస్తుంది. అలాగే తమ గేదెపాల విక్రయంలోనూ అగ్రకులాల వారినుంచి ఎదురయ్యే ఇక్కట్లనూ వివరిస్తాడు. ఈ ఆత్మకథలో రచయిత ముఖ్యంగా పాలేరుతనం గురించి వివరించేటప్పుడు ఆ పాలేరుతనం తమ కుటుంబం లాంటి ఎన్నో కుటుంబాలకు ఎంత సంక్షోభాన్ని మిగిల్చిందో విశదీకరిస్తాడు. తాను కూడా ఒకరోజు పాలేరుగా వెళ్లినప్పుడు తనకు పాచిపోయిన అన్నం పెట్టిన యజమానురాలి వివక్షకు గురై తాను అనుభవించిన మానసికక్షోభను వర్ణిస్తాడు. పాలేరుతనంలో మగ్గిపోయే కుటుంబాల దుర్భరస్థితిని తనకు కలగా వచ్చిన తుఫానుతో ఇలా పోలుస్తాడు... ‘ఒక పెద్ద తుపాన్...వేగంగా వస్తున్న గాలులు... పెద్దపెద్ద చెట్లు కూలుతున్నాయి.. మేమంతా వాటినుంచి తప్పించుకోవాలని పరుగు పెడుతున్నాం.. అంతలోనే పెద్ద వరద. ముచుకొచ్చేస్తున్ననీట చేలన్నీ మునిగిపోయాయి. మా రోడ్లన్నీ మునిగిపోయి దారులన్నీ తెగిపోయాయి. ఎటుచూసినా చీకటి. నీళ్లు మా ఇంటి ముంగిటకొచ్చేశాయి’.... పాలేరుతనం రూపంలో వికటాట్టహాసం చేసే కులవివక్ష అనే ఒక సామాజిక సంక్షోభాన్ని సూచిస్తుంది ఈ సన్నివేశం... ఈ ఆత్మకథలోని ఆత్మ అంతా ఈ సన్నివేశంలోనే కనిపిస్తుంది.

ఈ ఆత్మకథలోని మరో ప్రత్యేకత ఈ రచయిత ప్రతి అధ్యాయంలోనూ కవిగా కూడా కనిపించడమే. ఆయా సందర్బాలకూ, సంఘటనలకూ తగినట్టు తాను తన నోస్టాల్జియా జ్ఞాపకాలతో కలబోసి వెలువరించిన కవితాపంక్తుల్నీ ఉదహరించడం ఈ అధ్యాయాలకు నిండుదనాన్ని ఇచ్చిందని చెప్పవచ్చు. ‘బాల్యం కొంతమందికీ ఆటల పల్లకీ/బాల్యం కొంతమందికి పూలపరిమళం/కానీ నా బాల్యం అలా సాగలేదు/ఒక్కోసారి నిప్పుల కుంపటి/ ఒక్కోసారి ముళ్లకిరీటం’.. అని తన బాల్యాన్ని కవిత్వీకరిస్తాడు. తన కవితాపంక్తుల్నే ఆత్మకథగా మార్చాడు. చివరి అధ్యాయంలో యుద్ధం ప్రారంభమైందని ఆశావాదాన్ని వ్యక్తం చేస్తూ.. ‘ఇది ప్రత్యక్షంగా జరిగే యుద్ధం/రక్తం కారని యుద్ధం/ఆయుధాలు లేని యుద్ధం/ఆధిపత్యాన్ని చెలాయించే యుద్ధం’... అంటూ ఈ రచయిత తన ఆత్మకథ ద్వారా మనసారా ఆకాంక్షిస్తున్నాడు. 

(‘నెమలికన్నులు’ పుస్తకానికి సబ్బని నాగమ్మ- మల్లేశం స్మారక పురస్కారం లభించిన సందర్భంగా...)

                   - డాక్టర్ కొత్వాలు అమరేంద్ర, 

                      9177732414

16 జూన్, 2025

ఆత్మ‌గౌర‌వపు ఆత్మక‌థ‌ 'నెమలికన్నులు, ( డా.తిరునగరి శ్రీనివాస్ గారి వ్యాసం)

 ఆత్మ‌గౌర‌వపు ఆత్మక‌థ‌ 'నెమలికన్నులు'

 విమలసాహితీ సాహిత్య e- వారపత్రిక, 15.6.2025 సౌజన్యంతో 



అత్యంత ప‌రిణ‌తి, ఎంతో ఆత్మ‌విశ్వాసం ఏర్ప‌డిన త‌రువాత అక్ష‌రీక‌రించాల్సిన బృహ‌త్త‌ర బాధ్య‌త‌నే ఆత్మ‌క‌థ‌. స్ప‌ష్ట‌మైన  అవ‌గాహ‌న‌, గురుత‌ర బాధ్య‌త‌తో స‌మాజానికి త‌న జీవితం నుంచి అందించ‌వ‌ల‌సిన విష‌యాల‌తో రాసే ఆత్మ‌క‌థ భ‌విష్య‌త్తు త‌రాల వారికి త‌ప్ప‌నిస‌రిగా స్ఫూర్తిదాయ‌కంగా నిల‌వాలి. ఆత్మ‌క‌థ‌లో అస‌మగ్ర‌త‌కు చోటుండ‌దు. జీవితంలోని ప్ర‌తి అంశాన్ని నిజాయితీగా వ్య‌క్తీక‌రించే ధైర్యం ఉండి తీరాలి. ఆత్మ‌క‌థ స‌మాజానికి ఆద‌ర్శ‌ప్రాయ‌మైన మార్గాన్ని చూపాలి. ఎంతో మంది ఆత్మ‌క‌థ‌లు రాయ‌డానికి వెన‌క‌డుగు వేస్తుంటారు. అన్ని అంశాల‌ను ప‌రిణ‌తితో త‌మ ఆత్మ‌క‌థ‌గా రాసేవాళ్ళు స‌మాజానికి దిశానిర్దేశం త‌ప్ప‌క అందించ‌డ‌మే కాదు ఆద‌ర్శ‌ప్రాయంగా కూడా నిలుస్తారు. ప‌రిణ‌తి, ఆత్మ‌విశ్వాసాల మార్గంలో అనేక  అంశాల‌ను విస్ప‌ష్టంగా వెల్ల‌డిస్తూ నెమ‌లి క‌న్నులు పేరుతో ఆచార్య దార్ల వెంక‌టేశ్వ‌ర‌రావు త‌న ఆత్మ‌క‌థ‌ను  రాశారు. చ‌దివే వారిని నిశితంగా ఆలోచింప‌జేసే  ఎన్నో సామాజిక సంద‌ర్భాలు, సంఘ‌ట‌న‌లు ఈ ఆత్మ‌క‌థ‌లో నిక్షిప్త‌మై ఉన్నాయి.

         దాదాపు ఆరు త‌రాల చ‌రిత్ర‌ను, ప‌రిణామాల‌ను అక్ష‌రీక‌రించిన తీరు దార్ల వెంకటేశ్వరరావు గారి 'నెమలికన్నులు' ఆత్మ‌క‌థ‌లో క‌న‌బ‌డుతుంది. జీవితంలో జ‌రిగిన అనేక మ‌లుపుల‌ను మాట‌ల్లో రాయాలంటే ఎంత మ‌ధ‌నం జ‌రుగుతుందోన‌ని ఊహించ‌డానికి ఇందులోని ప్ర‌తివాక్యం సాక్షీభూత‌మ‌వుతుంది.

 '' ముత్తాత చెప్పులు

 కుట్టేవాడు

  మా తాత‌

  కూలికెళ్ళేవాడు

మా అయ్యేమో

  అక్ష‌రం కోసం

 ఆశ‌గా ఎదురు చూసేవాడు

  నేనిప్పుడు క‌విత్వం రాస్తున్నాను

  రేపు

 నా కొడుకు

  ప్రొఫెస‌ర‌వుతాడు'' అన్న కవితాతాత్మక వాక్యాల‌ను జాగ్ర‌త్త‌గా గ‌మ‌నిస్తే తరాల చ‌రిత్ర‌గా సాగిన జీవ‌న‌పు నడ‌క అవ‌గ‌త‌మ‌వుతుంది. మొత్తం 37 అంశాల‌తో సాగిన ఈ ఆత్మ‌క‌థ దార్ల వారి బాల్యంతో ఆరంభ‌మై, ప్ర‌దేశాలు, ప‌ల్లెలు, త‌నింటి వాళ్ల‌తో, త‌న చుట్టూరా జీవించే మ‌నుషుల‌తో అల్లుకున్న అవ్యాజానుబంధాల బ‌లిమిని ఆవిష్క‌రించింది. ప్ర‌తివాక్యం ఏదో ఒక అపురూప అనుబంధాన్ని మోసుకొచ్చే ప్ర‌తిబింబంగా క‌న్పిస్తుంది. శాశ్వ‌తానుబంధాల పందిళ్ల‌కు ఇందులోని ఎన్నో వాక్యాలు ప్ర‌తీక‌లుగా మెరిశాయి. ద‌ళితులలోని అపార‌మైన మ‌నో విజ్ఞానాన్ని, అప్ప‌టి స‌మాజ‌పు స్థితిగ‌తుల దొంత‌రల‌ను, వెలివాడ‌ల జీవితాల‌లోకి వ్య‌ధాభ‌రిత దృక్కోణాల‌ను, దీన‌త్వంతో సాగిన జీవ‌న యానాల్ని ఈ ఆత్మ‌క‌థ ఎంతో సుస్ప‌ష్టంగా ఆవిష్క‌రించింది. ఆత్మ‌క‌థ రాస్తున్నానంటే న‌వ్విన వాళ్ళు ఉన్నారు అన్న ఇందులోని దార్ల వారి ఇంట‌ర్వ్యూ 37 అంశాలుగా రాసిన లోతైన‌ జీవితానుభ‌వాల‌కు వెన్నుద‌న్నుగా నిలిచింది.

       త‌న బాల్యాన్ని చ‌ల్ల‌ని ఓ చ‌ల‌మ‌, స‌ముద్రం విశాల‌మైన ఆకాశంతో పోల్చారు. అమ్మా, నాన్న‌, అన్న‌య్య‌ల మ‌ధ్య పెరిగి ఇంటి నుండి నేర్చుకున్న క్ర‌మ‌శిక్ష‌ణ‌, అప్పుడ‌ప్పుడు పెద్ద‌లు చేసే మంద‌లింపులే జీవితానికి గొప్ప మార్గ‌ద‌ర్శ‌న‌మైన ప‌రిస్థితుల‌ను విశ్లేషించి చ‌దివే వారిలో ఎంతో ఆస‌క్తిని ర‌గిలించేలా విశ‌దీక‌రించారు. త‌న బాల్యం నాటి ద‌ళిత జీవితాన్ని ఈ ఆత్మ‌క‌థ‌లో ఎంతో స్ప‌ష్టంగా, తేట‌తెల్లంగా వివ‌రించారు. ద‌ళిత ఉప‌కులంలో వాళ్ళు పొందే అవ‌మానాల్ని దాటుకుని ఎంతో కృషితో  కేంద్రీయ విశ్వ‌విద్యాల‌యంలో ప్రొఫెస‌ర్ వంటి ఒక ఉన్న‌త స్థాయికి తాను ఎదిగిన క్ర‌మాన్ని తెలిపారు. ద‌ళితుల జీవితాల‌ను లోతుగా అధ్య‌య‌నం చేస్తున్న అనుభూతిని ఈ ఆత్మ‌క‌థ క‌లిగిస్తుంది. బాల్యం నాటి విష‌యాల‌ను రాస్తూ ద‌ళితుల‌కు ఆనాడు గ్రామాల‌లో క్ష‌వ‌రం చేయ‌ని, బ‌ట్ట‌లు ఉత‌క‌ని సామాజిక అస‌మాన‌త‌లు పేరుకున్నఅవ‌స్థ‌ల‌ వ్య‌వ‌స్థ‌ను గురించి ఎంతో వేద‌న‌తో చెప్పారు. ప‌రిస్థితులెలా ఉన్నా ఆత్మ‌ధైర్యంతో అడుగేస్తూ స్వీయ అస్తిత్వ గౌర‌వాన్ని స‌గ‌ర్వంగా నిలుపుకున్న ప‌రిస్థితికి ఈ ర‌చ‌యిత ఆత్మ‌క‌థ అద్దం ప‌ట్టింది. పాలేరుల వెట్టి వెత‌ల్ని భిన్న సంఘ‌ట‌న‌ల‌ను క్రోడీక‌రిస్తూ దృశ్యాలుగా క‌ళ్ళ‌ముందుంచారు. ఊరిలో త‌ల‌లో నాలుక‌లా ఉండే తండ్రి త‌మ‌కు  జ‌రిగిన అవ‌మానానికి త‌గిన బుద్ధి చెప్పించి పాలేరు త‌నానికి శాశ్వ‌తంగా ముగింపు ప‌లికిన విధాన్ని గొప్ప సంఘ‌ట‌న‌గా చెప్పొచ్చు. స‌మ‌స్య‌ల‌పై స్పందించే స్పంద‌నాశీల‌త్వం ర‌చ‌యిత‌కు బాల్యం నుండే అల‌వ‌డి ఉంద‌న్న విష‌యాన్ని ఈ ఆత్మ‌క‌థ చెప్పింది. గ్రామంలోని రోడ్లు, విద్యుత్, త‌పాలా, పెన్ష‌న్ వంటి స‌మ‌స్య‌ల‌ను ప్ర‌స్తావించ‌డం, పత్రిక‌ల‌ను చ‌ద‌వ‌డం వంటి అంశాలు ఎదిగే క్ర‌మంలో ర‌చ‌యిత‌లోని స‌మాజ అవ‌గాహ‌నా దృక్ప‌థాన్ని తెలిపాయి. ప‌ద‌వ త‌ర‌గ‌తిలో లెక్క‌ల్లో రెండు మార్కుల‌తో త‌ప్పాన‌ని చెప్పుకున్న ర‌చ‌యిత నిజాయితీకి నిగ్గుట‌ద్ద‌మే కాకుండా ఆత్మ‌క‌థా సూత్రాల‌కు  నిద‌ర్శ‌నంగా నిలిచింది. ఆత్మ‌క‌థ‌లో భాగంగా తీవ్ర‌త‌ను క‌లిగించే విష‌యాల‌ను, సంఘ‌ర్ష‌ణ‌ను చెప్పే క్ర‌మంలో రాసిన వాక్యాలు క‌వితాత్మ‌కంగా ఉండి ఆ  స్థితి ప్ర‌బ‌ల‌త‌ను చాటాయి. ఆత్మ‌క‌థ ఒక వ్య‌క్తికి సంబంధించిందే అనిపించినా ఆనాటి సామాజిక‌, కాల‌మాన స్థితిగతుల‌కు ప్ర‌తిరూప‌మ‌న్న‌ది ఈ ర‌చ‌యిత ఆత్మ‌క‌థ చెప్పింది.

         ''కొన్ని వృత్తుల‌కే ద‌ళితులు ప‌రిమిత‌మ‌వుతార‌న్న ఒక భావ‌జాలాన్ని నిష్క‌ర్ష‌గా ఖండించి సామాజిక వాస్త‌విక‌త‌ను ర‌చ‌యిత‌ దృశ్య‌మానం చేశారు. కోన‌సీమ సౌంద‌ర్యం మాటున దాగిన ద‌ళిత ఉప‌కులాల వారు భ‌రించిన అవ‌మానాలు, తెగించి జ‌రిపిన ఆత్మ‌గౌర‌వ పోరాటాల‌ను ఈ ఆత్మ‌క‌థ  ప్ర‌తిబింబించింది. నిజాయితీ అన్నదే అంత‌సూత్రంగా ఈ  ర‌చ‌యిత ఆత్మ‌క‌థ స్ప‌ష్ట‌త‌తో అనేక సంఘ‌ట‌న‌ల‌ను పూస‌గుచ్చిన‌ట్టు విడ‌మ‌ర్చి చెప్పింది.''

 స్వచ్ఛమైన అమాయ‌క‌త్వం ఒక వైపు, పోరాట శీల‌త క‌లిగిన ఆత్మ‌గౌర‌వం మ‌రోవైపు రెండు కోణాలై నడచిన ఆలోచ‌నాత్మ‌క‌మైన ఆత్మ‌క‌థ ఇది. అస‌మాన‌త‌ల వ‌ల్ల గుండెకు త‌గిలిన గాయాల్ని, అవ‌మాన‌పు కంట‌కాల్ని పేద‌రికంతో కుటుంబం గ‌డ‌వ‌క ప‌స్తులుండే ప‌రిస్థితుల నుండి నిరంత‌ర శ్ర‌మ‌తో పూల దారులుగా మార్చుకుని బాబా సాహెబ్ అంబేద్క‌ర్ అందించిన ధైర్యంతో తానాశించిన గ‌మ్యాన్ని చేరుకున్న ల‌క్ష్య సాధ‌కునిగా, ద‌ళితుల ధైర్య‌సాహ‌సాల‌కు ప్ర‌తినిధిగా, విజేత‌గా  ఈ ఆత్మ‌క‌థను  చ‌దివే పాఠ‌కుల‌కు  ర‌చ‌యిత ఆవిష్కృత‌మ‌వుతారు. పేరాశ‌ల‌కు పోకుండా ఉన్న‌దాంట్లోనే తృప్తి చెందాల‌న్న‌ది కుటుంబం నుండి అల‌వ‌ర్చుకున్న త‌త్వం కాగా, ఆరుగాలం క‌ష్ట‌ప‌డే రైత‌న్న నోటికి అన్నం ముద్ద అంది ఆక‌లి లేని రైతు శ్రేయోరాజ్యం విక‌సించాల‌న్న త‌ప‌న‌తో శ్ర‌మ జీవుల ప‌ట్ల ఉన్న‌ గౌర‌వ భావ‌న ర‌చ‌యిత ప్ర‌త్యేక‌త‌ను నిలిపింది. అంట‌రానితం, అనాలోచితం, అమానవీయత ప‌ట్ల ఆంత‌రిక ఆగ్ర‌హ జ్వ‌ల‌నం, సామాజిక మార్పు కోసం ఆలోచ‌నాశీల‌త‌తో, సంయ‌మ‌నంతో, ప‌రిణతతో సాగే ర‌చ‌యిత దృక్ప‌థాన్ని ఈ ఆత్మ‌క‌థ సూటిగా వెల్ల‌డించింది.

         ర‌చ‌యిత త‌మ ఊరు చెయ్యేరు అగ్ర‌హారంలో బాల్య‌పు రోజుల్లో రేడియో వంటి ప్ర‌సార సాధ‌నాలలో ప్ర‌సార‌మ‌య్యే నాట‌కాలు, ధారావాహిక‌లు విన‌డం, ఎంతో క‌ష్టంతో ప‌త్రిక‌ల‌ను స‌మ‌కూర్చుకుని చ‌ద‌వ‌డం వ‌ల్ల క్ర‌మంగా స‌మాజంపై అవ‌గాహ‌న పెరిగిన తీరును ప్ర‌స్తావించారు. బాల్యంలోని స్వ‌చ్ఛ‌మైన అమాయ‌క‌త్వాన్ని ఎంతో స‌హజంగా అభివ‌ర్ణించారు. కుల వివ‌క్ష, ఆధిప‌త్య‌పు అభిజాత్యాన్ని, వేధింపులు, అవ‌మానాల‌ను త‌ట్టుకోలేని వ‌ర్గాల ఆక్రోశాన్ని ర‌చ‌యిత త‌న మేధో మ‌ధ‌నంతో అక్ష‌ర‌బ‌ద్ధం చేసి ఘాటుగా చుర‌క‌లంటించారు. ఇంట్లో తిన్న అరిసెలు, పోకుండ‌లు, బూరెల గురించి, తాత, మామ్మ (నాయ‌న‌మ్మ‌), ర‌జ‌కులు, నాయీబ్రాహ్మ‌ణులు, నాట‌కాలు, బుర్ర క‌థ‌లు,  పెద్ద‌న్న‌య్య‌, స్నేహితులు, తోబుట్టువులు, కేస్ట్ స‌ర్టిఫికెట్ పొందేందుకు ప‌డ్డ బాధ‌ల గురించి వివ‌రిస్తూ జీవితంలోని ఎగుడు దిగుళ్ల‌ను, కుటుంబాలు, స‌మాజం చుట్టూ అల్లుకున్న విడ‌దీయ‌లేని అనుబంధాలను వివ‌రించారు.

  ''నన్ను నీటిలోకి తోసేసామ‌నుకున్నారు, 

నాకు ముత్యాలు దొరుకుతాయ‌ని వాళ్ళ‌కు తెలియ‌దు

న‌న్ను పాతాళం  లోకితొక్కేద్దామ‌నుకున్నారు

 నేనొక మ‌హావృక్షాన్నై మొలుచుకొస్తాన‌ని వాళ్ళ‌కు తెలియ‌దు

 నన్ను ఆకాశంలోకి విసిరేద్దామ‌నుకున్నారు, 

ఆ శూన్యం నుండే నేనంద‌రి దాహాన్ని తీర్చే ఓ నీటి చుక్క‌నై కురుస్తాన‌ని వాళ్ళ‌కు తెలియ‌దు'' 

అని ర‌చ‌యిత రాసిన ఈ వాక్యాలు అత‌నిలోని అప్ర‌తిహ‌త‌మైన ఆత్మ‌విశ్వాసం, ధృడ‌మైన ప‌ట్టుద‌ల‌, అంత‌కుమించిన కృషి, న‌మ్మ‌కాన్ని బ‌ల‌ప‌రిచాయి. ఉన్న‌తీక‌రించిన మ‌హామ‌నిషిగా రూపొంద‌డానికి, గొప్ప సంఘ‌ట‌న‌లు పురుడు పోసుకోవ‌డానికి  ప్ర‌కృతి ఎంత‌గా స‌హ‌క‌రిస్తుందో తెలుసుకోవ‌డానికి ఈ ర‌చ‌యిత జీవిత‌మే ప్ర‌త్య‌క్ష ఉదాహ‌ర‌ణ‌గా నిలిచింది. వ‌సంతాలు, శ‌ర‌త్తులు    స‌మంగా వెలిగేదే మ‌నిషి జీవిత‌మ‌ని ఈ ఆత్మ‌క‌థ సందేశించింది. అక్ష‌రం ప‌ట్ల ర‌చ‌యిత‌కు ఉన్న అవ్యాజ‌మైన అనుర‌క్తి ఆత్మక‌థా ర‌చ‌న‌ను ప‌రిపుష్టంగా న‌డిపించి ప‌రిపూర్ణ‌త‌ను చేకూర్చింది. సౌహార్ద్రం, సౌభ్యాతృత్వం, ప్ర‌కృతి ప్రేమ‌తో పాటు త‌దేక దీక్ష‌తో అఖండ‌ విజ‌యాన్ని సాధించి తిరుగులేని శ‌క్తిగా స‌మాజంలో నిలిచిన వ్య‌క్తి శ్ర‌మ‌ విరాట్ స్వ‌రూపాన్ని ఆవిష్కరించిన విశిష్ట ర‌చ‌న‌ ఇది.

  - డా. తిరున‌గ‌రి శ్రీ‌నివాస్

                        Phone :  9441464764

06 డిసెంబర్, 2024

ఆత్మకథ ఒక్కరోజులోనే చదివేశాను .

 Good evening sir 

మీ 'ఆత్మకథ' నెమలి కన్నులు ఒక్క రోజులో చదివేశాను. మీకు బెల్లం జీళ్లపై ఉన్న ప్రేమ వాటిని తయారు చేయడాన్ని గమనించడం, క్లాస్ మధ్యలో లో  టీచర్ కి తెలియకుండా తినాలనే లాలస చూస్తే చాలా నవ్వొచ్చింది. కానీ మున్ముందు చదువుతున్న కొలది కన్నీళ్లు. ఈ స్థాయికి రావడానికి ఎంత కష్టం దాగివుందో!.  అని అనుకునేదాన్ని కానీ ఇంత కష్టం ఉందని ఊహించలేదు! 



మీరు కూడా కూలి పనులు చేస్తూ చదువుకోవడం, పాలేరు గా వెళ్తుంటే సినిమాలో కూడా కథానాయకుడు కష్టాలు పడుతుంటే చూడలేక అయ్యో వెళ్లకుండా ఉంటే బాగుండనే.. ఆలోచనతో పేజీలు తిప్పుతున్నలోపే మీ ధిక్కారంతో ఆ పాచిపోయిన అన్నాన్ని ఆమె ముఖాన కొట్టినపుడు వారెవ్వా అనిపించింది . చాలా తెలివిగా ఆవులను ఇప్పి వాటితో పాటే పరుగెత్తి తప్పించుకోవడం ఆశ్చర్యం వేసింది. తల్లిదండ్రులు చేసిన మంచే బిడ్డలను కాపాడుతుంది అంటారు పెద్దలు. అది నిజమని మీ కుటుంబాన్ని చూస్తే అర్థమవుతుంది. తల్లిదండ్రులకు పిల్లలు ఎప్పుడూ బరువు కాదు. బయట వారెందుకో ఎక్కువ సంతానం అనేసరికి వాళ్ళ కష్టార్జితం మనం తినేస్తున్నట్లు మాట విరుపులు. మా అమ్మా నాన్న గారు కూడా మేం ఆరుగురు ఆడపిల్లలం అయినా ఏరోజు భారం అనుకోలేదు . నాన్నగారు ఐతే నాకేమీ లక్ష్మీ దేవులు పుట్టారు అనేవారట. (మొన్న మీరు అన్నారు కదా.. నేను లక్ష్మీదేవిలా ఉన్నానని.. ఆ మాటలే గుర్తు వచ్చాయి సర్) మీ ఊరిని, గోదావరిని వర్ణిస్తుంటే నాకు కూడా ఆ ప్రదేశాలను చూడాలనిపించింది. పల్లె వాతావరణం, ముగ్గులు, హరిదాసు, పిండి వంటలు నా చిన్నప్పుడు మా తాతగారు ఊరిని గుర్తు చేసింది.  సమాజాన్ని గమనిస్తూ పెరిగిన వారు మీరు... అప్పటి పరిస్థితులను అద్దంలో చూపించే ప్రయత్నం చేశారు..

నీళ్ళు పుష్కలంగా ఉన్న మీ జీవన పరిస్థితులకు, మెరక ప్రాంతాల్లో ఉన్న దళితుల జీవన ప్రమాణాలలో చాలా వ్యత్యాసం ఉంది. నేను కళ్ళారా చూసాను. 

నేను కూడా  నెమలి కన్నులపై ఒక వ్యాసం రాద్దామని అనుకుంటున్నాను. అందుకే మిగతా విషయాలు చర్చించడం లేదు.. బాల్య దశ ఆత్మ కథలోనే ఇంత విషయం ఉంటే తరువాత భాగాలలో ఇంకెంత దాగి ఉందని!ఎప్పుడు చదువుతానా అని ఎదురు చూస్తున్నాను.

ఈ స్థాయికి రావడానికి మీరు చేసిన కృషికి ఎంత చెప్పినా తక్కువే ‌... 🙏🙏

Good night sir...

- Mamatha, 5.12.2024

27 నవంబర్, 2024

నెమలి కన్నులు ఆత్మకథపై డా.సబ్బని లక్ష్మీనారాయణ గారి వ్యాసం (27.11.2024)

 

నేటినిజం దినపత్రిక, 27.11.2024 సౌజన్యంతో 


దళిత జీవన స్రవంతి దార్ల వారి “నెమలి కన్నులు”


 ఆత్మకథాత్మక కావ్యాలు ఎందుకు పుడుతాయి అంటే అవి బతుకు యొక్క వేదనని బయటికి తెలియజేస్తాయి. మనిషిని బాధల నుండి విముక్తిని చేస్తాయి.కళారూపాలుగా, కావ్యాలుగా వస్తాయి . దీనినే అరిస్టాటిల్ భాషలో కెథారసిస్ అంటారు. అలా జీవన వేదన నుండి కళారూపాలుగా పుట్టినవే గొప్ప పుస్తకాలుగా మనగలుగుతాయి. రచనా ప్రక్రియ యొక్క ఒక ముఖ్యమైన రూపము స్వీయ చరిత్ర . మన గమనింపులోకి వస్తే కందుకూరి వారి స్వీయ చరిత్ర ఆనాటి సామాజిక ఆర్థిక పరిస్థితులు, కందుకూరి యొక్క జీవనాన్ని, సమాజిక సేవని, సాహితీసేవను మనము అవగతం చేసుకోవచ్చు . మహాకవి జాషువా తన స్వీయ చరిత్రను పద్య రూపంలో రాశారు ‘నా కథ ‘ పేరా . అలానే శ్రీశ్రీ తన స్వీయ చరిత్రను’ అనంతము ‘అని రాశారు. కాళోజీ తన స్వీయ చరిత్రను ,’ఇది నా గొడవ ‘ అని రాసుకున్నారు. గాంధీ జీ తన ఆత్మకథను ‘మై ఎక్స్పరిమెంట్స్ విత్ ట్రూత్’ అనే పేర రాశారు. ఇవి ఆయా రచయితల జీవన పరిస్థితులలో ఆనాటి సాంఘిక సామాజిక ఆర్థిక పరిస్థితులను తెలుసుకోవడానికి మనకు దోహదపడుతాయి, అక్కరకు వస్తాయి. అలానే “వెయిటింగ్ ఫర్ ఏ వీసా'' పేరుతో అంబేద్కర్ తన ఆత్మకథను కొంత భాగం మాత్రమే రాసుకున్నారు. కానీ, ఆయన ప్రతి పని లిఖితపూర్వకంగా వచ్చింది. అందువల్ల ఆయన ప్రతి రచన ఒక స్వీయ చరిత్రలో భాగమే అనొచ్చు . అలా స్వీయ చరిత్రల వలన ఆయా రచయితలు తమ జీవితంలో పొందిన అవమాన సన్మానాల విశేషాలను, ఆనాటి సామాజిక ఆర్థిక పరిస్థితులను కూడా మనం వాటిని చదువుకోవడం వల్ల తెలుస్తాయి. ఆయా కవుల, రచయితల మనోగతములు వారు పొందిన అనుభూతులు కష్టనష్టాలు భావోద్వేగాలు కూడా మనకు తెలుస్తాయి. సాధారణంగా స్వీయ చరిత్రలను రచయితలు తమ జీవిత చరమ దశలో అనగా 60 దాటిన వయసులో రాస్తుంటారు. కానీ, ఇక్కడ దార్ల వెంకటేశ్వరరావుగారు తమ స్వీయ చరిత్రను తన 50 ఏళ్ల ప్రాయంలోనే రాయడం ఒక సాహసం మొదటి భాగంగా. అలా రాయడం వలన తన జీవితము పదుగురికి మార్గదర్శకంగా ఉండబోతుందేమో అనీ, అందుకనే రాశారేమో అనిపిస్తూ ఉంటుంది. దార్లవారు నాకు యాదృచ్ఛికంగా ఒక సాహితీ సభలో కర్నూలులో పరిచయమయ్యారు. అది 2020 సంవత్సరంలో జరిగింది. ఇప్పటికి నాలుగేళ్లు దాటింది . అక్కడ కొన్ని గంటలు వారితో కలిసి గడపడం మళ్లీ రాత్రంతా వారితో హైదరాబాదుకు బస్సులో ప్రయాణం చేయడం అలా వారు నాకు మరింత సన్నిహితులు అయ్యారు, అలా సహజంగా పరిచయమై నాకు దగ్గరైన వారు శ్రీదార్ల వెంకటేశ్వర రావుగారు. ఆ పరిచయంతో వారు నా యొక్క పుస్తకం ‘సబ్బని సాహిత్య వ్యాసములు’కు ముందుమాట కూడా రాశారు. దాని ఆవిష్కరణ కార్యక్రమంలో హైదరాబాదులో పాల్గొన్నారు. చదువక ముందు దార్లవారు స్వీయ చరిత్రను ఇంత చిన్న వయసులో ఎందుకు రాశారో అనుకున్నాను. కానీ, చదివిన తర్వాత తెలిసింది. వారు వారి స్వీయచరిత్రను రాయడం ఒక అవసరమని తెలిసింది . సామాజిక వ్యవస్థలో అంచెలంచల కుల వ్యవస్థలో తాను పొందిన అవమానాలు, ఎదుర్కొన్న కష్టాలు, ఆయన చెప్పిన కొన్ని విషయాలను వారు తన స్వీయ చరిత్రలో మన కండ్ల ముందు ఉంచారు. 14 ఏప్రిల్ 1891 నాడు అనగా 133 ఏళ్ల క్రితం పుట్టిన అంబేద్కర్ తను అంటరాని కులంలో పుట్టినందుకు 
ఎన్ని అవమానాలు పొందాడు. 
వాటినెలా భరించాడో కానీ, 
తర్వాత తాను చదువుకొని ఉన్నత విద్యాధికుడైయ్యారు. దళిత జాతులకు మార్గదర్శకుడై నిలబడ్డారు. 
అలానే 49 ఏళ్ల క్రితం దార్ల వారు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని కోనసీమ జిల్లాలోని చెయ్యేరు అగ్రహారంలో అంటరాని కులంలో పుట్టారు. ఎన్నో అవమానాలు, కష్టాలు ఎదుర్కొన్నారు. కష్టపడి పట్టుదలతో చదువుకొని, నేడు ఒక కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఆచార్యుడయ్యారు. 
అలా వెలుగొందుతున్న ఈ దళిత బిడ్డ ఆత్మకథ కూడా మామూలుది కాదని నెమలి కన్నులు (మొదటి భాగం) ద్వారా తెలుస్తుంది. ఆ లెక్కన దార్ల వారిని అభినవ అంబేద్కర్ అని అనవచ్చు; పాలేరు నుండి పద్మశ్రీ వరకు ఎదిగిన మరో బోయి భీమన్న అనీ అనవచ్చు. దార్లవారు ప్రతిభావంతులు.గర్వం లేని వారు సహృదయులు. 
 ఈ సమాజం ఏమి మారింది? 
ఎందుకు మారాలి? అనే విషయం ఈ ఆత్మకథ చదువుకుంటే తెలుస్తుంది. ఈ పుస్తకానికి వారు ‘నెమలి కన్నులు’ అనే పేరు పెట్టుకున్నారు. బహుశా వారు తన చిన్న కన్నులతో నెమలిలా ఈ జీవితాన్ని చూసింది చూసినట్లు చెప్పడానికి ఈ ఆత్మకథకు ‘నెమలి కన్నులు’ అనే పేరు పెట్టుకున్నారేమో ! 
నెమలి కన్నులకు మరొక అర్థం కూడా ఉంది. 
అందమైన నెమలి ఈకలను ఏరుకొని చిన్నపిల్లలు తమ పుస్తకాల్లో పెట్టుకుంటారు. అవి మరలా పిల్లలు పెడతాయని వాళ్ళకు అదో సరదా! వాటిని నెమలి కన్నులు అంటారు. ఆ నెమలి కన్నులు పేరుని బహుశా బాల్యం ఎవరికైనా అందంగానే ఉంటుంది. దాన్ని అంతే వాస్తవంగా చిత్రించి, ఆ బాల్యంలో నెమలి కన్నులు దాచుకున్న ప్లే, నాటి జ్ఞాపకాలను దాచుకున్నట్లు నెమలి కన్నులు అని పేరు పెట్టుకున్నారనుకుంటాను.
 ఇక, దార్ల వారి జీవిత కథలోకి మరింత లోతుగా వెళితే వారు బాల్యంలో ఎన్నో కష్టనష్టాలు ఎదుర్కొన్నారు. 
ఎన్నో అవమానాలు చవిచూశారు. 
ఆ విషయం ఈ పుస్తకం చదివిన వారికి తేటతెల్లమవుతుంది. కొన్ని కులాలను అంటరానివనీ, మరికొన్ని అంటుకున్నా ఎలాంటి లోపం లేదని నిర్ణయించడం, దాన్నే ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఆ భావనలే కొనసాగుతున్నాయి. అలా ‘అంటరాని కులం’లో పుట్టినందుకు, ఆ కులం పేరుతో జరిగే అవమానాలు ఎదురైనప్పుడల్లా, దాన్ని బయటికి చెప్పుకోలేని మానసిక సంఘర్షణ సామాన్యమైనది కాదు. ఆ బాధ, ఆ ఆవేదనను, ఎందరో దళిత జాతుల బిడ్డల ఆవేదనగా వారు తన జీవితాన్ని గ్రంథస్థం చేశారు ఆత్మకథ రూపేనా ఈ మొదటి భాగంగా. వారు సెప్టెంబర్ 5, 1973 వ సంవత్సరంలో జన్మించారు. స్కూల్ రికార్డుల ప్రకారం. అలనాడు దళిత కులాల వారి బిడ్డలు పాఠశాలలో చదువుకుంటామంటే వారి పుట్టిన తేదీని అందాజాగానే వేసేవారు గురువులు. అలా వేసిన వారి గురువులు తనకు ఒక మంచి తేదీనే వేశారుని అంటారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సెప్టెంబర్ 5. ఆ తేదీనే దార్ల వారి పుట్టిన రోజుగా వేశారు. అంతేకాదు,  మంచి పేరు కూడా పెట్టారు. అది దార్ల ‘వెంకటేశ్వర రావు’ అని. నిజానికి వాళ్ల అమ్మగారి కోరిక అది. దార్ల వారి జీవిత చరిత్ర మొదటి భాగం బాల్యం గురించి రాసేనాటికి వారు వయసు సుమారు 50. వీరు ఇంత చిన్న వయసులో ఎందుకు ఆత్మకథ రాశారు అంటే వారు కవితాత్మకంగా ఇలా చెప్పారు. 
‘’ఊరి చివరి గుడిసెలో బతికే వాళ్ళం 
కులం అంటగట్టిన అవమానాలు ఇంకా మోయక తప్పని వాళ్ళం 
చూపులతో మాటలతో
నేటికీ నిత్యం నలిగిపోతున్న వాళ్ళం 
మనిషిని చూసినా
మాట విన్నా 
ఏమాత్రం స్పందన కలగని హీనత్వం 
మా కులం పేరు చెప్పినప్పుడల్లా
వాళ్ళ కళ్ళల్లో చూస్తున్న వాళ్ళం 
తాత ముత్తాతల నాటి నుండీ
మడులూ మాన్యాలలూ 
మాకు ఏమీ లేకపోయినా 
తరతరాలుగా వెంటాడుతున్న వృత్తుల్ని 
నిస్సహాయంగా మోస్తున్న వాళ్ళం
 ఆ అవమానాల్ని అనుభవిస్తున్న వాళ్ళం' అని చెప్తూ అలానే ఇంకా అంటారు వారు. 
‘’ఓ మాదిగ కులం నుండి 
యూనివర్సిటీకి వచ్చిన వాణ్ణి
సెంట్రల్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ అయినవాణ్ణి
ఇక్కడే హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ అయిన వాణ్ణి
శ, ష , స ల స్పష్టతకెన్నోసార్లు 
నాలుక తిరగటం లేదని 
మా వాళ్ల గురించి మాట్లాడుతుంటే 
వాళ్ళలా మాట్లాడుతున్నప్పుడల్లా 
ఆ మాటలు సూదుల్లా గుచ్చుకుంటుంటే
భరించలేక వాళ్లకంటే బాగా పలకిన వాళ్ళెంతో మంది మాలో ఉన్నారని చూపించిన వాణ్ణి
ఆ భాషలోనే అధ్యాపకున్ని అయిన వాణ్ణి
అది చాలదానా కథ చెప్పడానికి అనిపించింది.’’అని చెప్పారు వారు ఈ పుస్తకం ప్రస్తావన మొదటి అధ్యాయంలో. 

 ‘మా ఊరి పేరు చెయ్యేరు అగ్రహారం అందులో మేముండేది ‘బ్రాహ్మణ చెరువుగట్టు ‘ . ఒకప్పుడు మా ఊళ్ళో బ్రాహ్మణులు ఎక్కువగా ఉండే వారట ‘ అని చెపుతారు వారు. రెండో అధ్యాయంలో’. ఆ చెరువుగట్టు ఊరికి దూరంగా ఉండేది. ఇంకా వారి ఇంటి పేరు ‘దార్ల’ వారు అని ఎందుకు వచ్చిందనే విషయాన్ని గురించి చెబుతూ ‘ అక్కడ దయ్యాలకు భయపడో ఊరికి దూరంగా ఉండాలనో , ఎందుకో కానీ ఎవ్వరు రాక పోయినా మా పూర్వీకులు ధైర్యం చేసి అక్కడికి వచ్చారు. దారీ తెన్నూ లేని ఆ బ్రాహ్మణ చెరువు గట్టును బాగు చేసి దారి చేసినందుకే వాళ్లకు ‘దార్ల’ వారు అనే ఇంటి పేరు వచ్చిందని చెబుతుంటారు’ అని వివరించారు. దార్ల వారు చాలా ఆత్మాభిమానం, ఆత్మ విశ్వాసం కలవారు. ఆ విషయాన్ని వారు ఇలా చెబుతారు , ఏమని అంటే , ‘మా ఊళ్లో మొట్టమొదటి పీహెచ్డీ చేసింది నేనే, యూనివర్సిటీలో ఉద్యోగం పొందింది నేనే, టీవీలలో మాట్లాడింది కూడా నేనే' అని ఇలా నేనే మొట్టమొదట అని చెప్పుకుంటే నాకు సాహిత్యంలో నేనే మొట్టమొదటి అని చెప్పుకున్న కందుకూరి వారు గుర్తుకు వస్తారు’ అని చెపుతారు వారు. దార్ల వారికి వారి ఊరు మీద అపారమైన ప్రేమ ‘కోనసీమ ప్రేమ కౌగిలిలో మా ఊరు ‘ అనే మూడవ అధ్యాయంలో కవితాత్మకంగా గొప్పగా చెబుతారు. 
ఇంకా దార్ల వారికి వారి నాన్నగారు శ్రమ జీవి అయిన దార్ల అబ్బాయి గారు అంటే అమితమైన అభిమానం , ప్రేమ. 
వారు వాళ్ళ నాన్న గారి గురించి జ్ఞాపకాలను ఇలా చెప్తారు.  
‘నాన్నా సాయంత్రం చేపల బుట్ట పట్టుకొని నీ వెనకాలే వచ్చేవాణ్ణి 
నువ్వు గబగబా నడుస్తుంటే నువ్వు గమనించావో లేదో గాని 
ఆ రంగరాజు కోడు కాలువ అంతా నీ అడుగుల్లో పరవశించేది 
 ఆ కాల్వలో ప్రవహించే నీరు కూడా నీ స్పర్శతో పునీతమయ్యేది 
 ఆ గట్టునుండే ముళ్లన్నీ నీ అడుగుల కింద మెత్తని పువ్వుల్లా మారిపోయేయి
 నువ్వేమీ వాటిని గమనించేవాడివి కాదు
 ఆ తెల్లని పువ్వుల బుగ్గలప్పుడప్పుడు సిగ్గుతో ఎర్రబడేవి / చేది పరిగెలు , కొర్రమీనులు, కట్టి చేపలు, మీసం మెలేసే పెద్ద రొయ్యలు 
 విషము ముళ్ళతో గుచ్చాలనుకునే ఇంగిలాలు
నీ చేతుల్లో పడేసరికే దొందుల్లాగో
బొమ్మిడాల్లాగో 
మెత్తగా మారిపోయేవి . 
“ అని చెబుతూ
 “నాన్నా , నాకిప్పుడు నువ్వు వలేసి 
పట్టిన ఆ తాజా చేపల్ని 
అమ్మ వర్షములోనే అమ్మేది కదా 
 దాన్ని ఇప్పుడు వండి
 నీకు తృప్తిగా తినిపించాలని ఉంది నాన్నా “ అని నాన్నతో చిన్నప్పుడు గడిపిన రోజులను నెమరేసుకుంటారు .


 అలాంటి తన నాన్నగారి పేరు మీద హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో తెలుగు విభాగంలో ‘దార్ల అబ్బాయిగారి పేరు మీద గోల్డ్ మెడల్’ ఇవ్వడం అనేది ఎంతో ఘనత వహించిన విషయం! ఇక, వారి కుటుంబం గురించి చెబుతూ నాన్న మీద ఆధారపడి ఐదుగురు పిల్లలు, అమ్మ. వాళ్ల నాన్న గురించి చెబుతూ ‘ ఇంట్లోకి కావాల్సినవన్నీ చూస్తూనే మా పేటలో ముందుగా తామే మట్టి గోడలు… తర్వాత ఇటుకలతో ఇల్లు… కట్టారని చెప్తారు. అంతే కాదు ఆ పేటలో మొదటిసారిగా ఇంట్లో కరెంటు వేయించారు. మొదటిసారిగా సైకిల్ కూడా కొన్నారు. మొదటిసారిగా టెలిఫోన్ పెట్టించారు. …. అమ్మకి నాన్న బంగారం కొనేవాడు కాసులపేరు, చెవులకు దిద్దులు , కాళ్ళకు వెండి కడియలు కూడా చేయించాడు . అలా జీవితంలో కష్టపడి పైకి వచ్చి అన్ని సాధించుకున్న మహానుభావుడు వాళ్ళ నాన్నగారు . ఇక, ఏడవ అధ్యాయంలో వారు ఇలా అంటారు” మా పేర్లు మా ఇష్టప్రకారం ఉండవు ! ” దార్ల వారి కుటుంబంలో వారి పెద్దన్నయ్య పేరు సామ్యూల్ రాజు చదువుకొని ఉద్యోగం చేసినాడు. రెండో అన్నయ్య పేరు సత్యనారాయణ చదువుకోలేదు, నేను మూడో వాడిని, నాకు తమ్ముడు ఉన్నాడు. వాడి పేరు రవికుమార్. చదువుకున్నాడు. బాగా డిగ్రీలు తెచ్చుకున్నాడు , ఇక వారి చెల్లి పేరు విజయ కుమారి . “ నా పేరు ఎలా రాశారో నా పుట్టిన తేది ఎంత వేశాలో, దేన్ని ఆధారంగా చేసుకుని నా పుట్టిన తేదీ ఎలా నిర్ణయించారో ఆనాటి మా బడి పంతుల్లకే తెలుసు ‘ అంటారు వారు. వారి ఆత్మకథలో ఎనిమిదో అధ్యాయంలో ఇలా ఉంటుంది “అరుంధతిదేవి మన ఆడపడుచే ! మహాభారతం రాసింది మీ తాతగారే ! “ అని వాళ్ల అమ్మ అనేక కథలు చెప్పేది అంటారు వారు . ఎలా అంటే, అరుంధతి వారి ఆడబిడ్డ ఆమెను పెళ్లి చేసుకున్న వాడు వశిష్ఠుడు, వీళ్లిద్దరికి వందమంది సంతానం. అందులో పెద్దవాడు శక్తి మహర్షి. శక్తి మహర్షి భార్య అదృశ్యంతి. వీళ్లిద్దరికి పుట్టిన వాడు పరాశరుడు. పరాశనుడికి సత్యవతికి పుట్టినవాడు వ్యాసుడు. ఆ వ్యాసుడే మహాభారతం రాసాడు . ఆ వంశానికి చెందిన వాళ్ళమే మనమంతా …..అందుకనే మీరు బాగా చదువుకోవాలి. అరుంధతి ఇలాగే మన పిల్లలంతా అంతే నీతిగా కూడా జీవించాలి. ఆమె అలా జీవించింది . కాబట్టే, ఋషులతో పాటు ఆమె కూడా ఆకాశంలో ఒక నక్షత్రములా మెరుస్తుంది . అందరి చేతా పూజించబడుతుంది “ అని మా అమ్మ మాకు కథ చెప్పేది అని వ్రాస్తారు . అలా దళిత జాతులకు అరుంధతి, వశిష్టులు, వ్యాసుడు గొప్ప స్ఫూర్తి. ఇక తొమ్మిదవ అధ్యాయంలో ఈ సమాజంలోని అంచలంచల కుల వ్యవస్థలోని దొంతరలను గురించి చెబుతూ , “ నాకు తెలిసినంత వరకూ గ్రామమంతా కులాల దొంతరగానే ఉంటుంది. ఫలానా వాళ్ళని గుర్తించాలన్నా ఆ కులంతోనే సూచిస్తారు. ఆ పూజారి గారబ్బాయనో, పంతులుగారనో పిలుస్తారు. ఆ రాజుగారనో, ఆ కోమటాయననో, ఆ కాపు గారనో, ఆ మంగలాయననో, ఆ మాలోడనో, ఆ మాదిగోడనో…….. ఇంకా కాస్త స్పష్టంగా తెలియడానికి పేర్లని కూడా జత చేస్తుంటారు. “ అని చెపుతారు. “నాగుండెల్లో బాకులు గుచ్చిన జెండా పండుగ’ అనే సంఘటన గురించి పదవ అధ్యాయములో చెపుతారు ఇలా.
“క్లాస్ లీడర్లంతా ముందు నిలబడినట్లే ఆరోజు నేనూ నిలబడ్డాను. కానీ ఎందుకు వెనక్కి వెళ్ళమన్నారు? నా బట్టలు బాగాలేవా? నేనేమైనా స్నానం చెయ్యలేదా? నేనేమైనా తల దువ్వుకోలేదా? నాకేమైనా మాట్లాడ్డం చేతకాలేదా? నా కేమైనా నత్తి ఉందా? నా కేమైనా అవయవాల లోపముందా? ఇలాంటి ప్రశ్నలెన్నో వేగంగా దూసుకొస్తూ బాణాల్లా నాకు గుచ్చుకుంటున్నట్లు అనిపించింది. “ అంటూ ఆవేదన చెందుతారు వారు. ఒక సందర్భంలో వారు ఇలా చెపుతారు. “ బాల్యం కొంత మందికి ఆటల పల్లకీ             
బాల్యం కొంతమందికి పూలపరిమళం. కానీ, నా బాల్యం అలా సాగలేదు. ఒక్కోసారి నిప్పుల కుంపటి ఒక్కోసారి ముళ్ల కిరీటం ” అంటారు వారు తాను అనుభవించిన జీవితాన్ని చూసి. చిన్నపుడు తను వాళ్ల ఊరిలో ఐదవ తరగతి చదువు అయిన తర్వాత, ఆరవ తరగతి కోసం పక్కూరు కాట్రేనికోన గ్రామానికి రోజు ఏడు ప్లస్ ఏడు కిలో మీటర్లు నడుచుకుంటూ వెళ్లి వచ్చేవారు. వాళ్ల బడిలో అందర్నీ వాళ్ల లెక్కల మాస్టర్ మొదటి రోజు మీరు భవిష్యత్తులో ఏమి అవుతారని అడిగితే దార్ల వారు ‘నేను ప్రొఫెసర్ ను అవుతా ‘ అంటాడు. అలా చెప్పినందుకు వాళ్ళ గురువు చిన్నారి దార్ల వారిని “ పప్పు సార్ “ అని వెటకారంగా పిలిచే వాడు హాజరు తీసూకునేటప్పుడు. చాలా మంది గురువులు దార్ల వారిని మెచ్చుకునే వారు , ప్రోత్సహించే వారు ఒకరిద్దరు తప్పా! వారు తన ఆవేదనని  ఆత్మ విశ్వాసాన్ని క్రింది విధంగా చెపుతారు.  
        
‘ వాళ్ళు నా ఆశల్ని మొగ్గలోనే తుంచేయాలనుకున్నారు.
నేనేమో నా ఆశల్ని ఆకాశమంత ఎత్తుకెగరేశాను.
వాళ్ళు నా జీవితాన్ని పాతాళంలోకి తొక్కెయ్యాలనుకున్నారు. 
నేనేమో నేలకు కొట్టిన బంతినై 
మరింత పైకెళ్ళేలా ప్రయత్నించాను. 
వాళ్ళు నన్ను లేవకుండా ముళ్ళపొదల్లోకి విసిరేయాలనుకున్నారు
 నేనేమో ఆ ముళ్ళ పొదల్నే. రక్షణకవచాలుగా చేసుకుని ఓ పూలమొక్కనై పరిమళించాను

 “ పదహారవ అధ్యాయంలో “ జుట్టు కటింగ్ - చెంబు ఇస్త్రీ “ గురించి చెప్పారు వారు. అంటరాని కులం లో పుట్టిన వారికి మంగలి కటింగ్ చేయడు, చాకలి బట్టలు ఉతికి ఇస్త్రీ చేసి ఇవ్వడు. ఇది అంచెలంచెల కుల వ్యవస్థ ఉన్న సమాజం. అంబేద్కర్ నుండి నేటి దార్ల వారి వరకు ప్రత్యక్షంగా చవి చూసిన విషయాలు ఇవన్నీ.. పదిహేడవ అధ్యాయంలో ‘ నేను ఒక సైకిల్ కు ఓనరయ్యాను’ అని సంబుర పడి చెపుతాడు. 
‘ఆదివారం గానీ, సెలవు రోజులు గానీ వస్తే, నేను కూడా పొలం పనికి వెళ్ళేవాడిని , నాకు కూడా కూలిపనికి జీతం ఇచ్చేవారు.’ అని చెపుతాడు. నా తోటి పేదింటి బిడ్డలకు కూడా అనుభవం లోని విషయాలు ఇవి. పద్దెనిమిదవ అధ్యాయంలో ‘ ఆ విషయంలో రజకులే నాకు ఆదర్శం ‘ అంటాడు.

 “ ఆ రజకులంటే
నిలువెత్తు శ్రమ సంకేతాలన్నట్లనిపించింది. 
వాళ్ళు పనిపట్ల చూపే అంకితభావం
నాలో గొప్ప ఆత్మవిశ్వాసానికి ప్రేరణ కలిగించింది.
పొద్దున్నే పొద్దుని లేచే
 వాళ్ళ సమయపాలన నాకో ఆదర్శాన్నిచ్చింది” అంటారు వారు.

 వాళ్ల అంకిత భావాన్ని , క్రమ శిక్షణను ఆచరణ లోకి తెచ్చుకొని. 
పందొమ్మిదవ అధ్యాయంలో “ మా యింటి కల్పవృక్షం” అని తాడిచెట్టు యొక్క వినియోగం పేదవారి జీవితలో ఎంతగా ఉంటుందో చెపుతాడు. ఇంకా ‘ పేదరికానికి కులం తోడైతే, అది కొంతమందికి సమాజంలో ఆత్మ గౌరవ సమస్యగా మారుతుంది. ఇంకొంతమందికి ఆత్మగౌరవాన్ని కాపాడు కుంటునే , ఆ కుటుంబాన్ని ముందుకి లాక్కెళ్ళాలంటే, వాళ్ళంతా ఏదో ఒకపని చేయక తప్పని పరిస్థితి. ……ఎలాగైనా రెండు పూటలా తినాలంటే ప్రతి రోజూ పని ఉండాలి ‘ అని చెపుతారు.  
బతుకులోని కష్టాలు, బతకడం లోని కష్టాలు తెలిసిన వారు దార్ల వారు. ఇరువైయ్యొకటవ అధ్యాయంలో వారు పాలేరు తనం గురించి చెపుతారు. దార్ల వారి చిన్న అన్నయ్య చదువుకోలేదు. కాబట్టి వాళ్ల ఊరిలోని ఒక కోమటి కుటుంబానికి పాలేరుగా ఉంటాడు. ఒక ఆదివారం నాడు వాళ్ళ చిన్నన్నయ్య పనికి పోలేక పోతే ఆనాడు అతనికి బదులుగా పాలేరు పనికి వెళ్తాడు చిన్నారి దార్ల. పాలేరుతనం అంటే పశువుల పెండ తియ్యాలి, దొడ్డి ఊడువాలి, వాటికి నీళ్ళు పెట్టాలి, పశువులను మేపుకొనిరావాలి, ఇంకా ఇంట్లో వాళ్ళు చెప్పిన పనులు చెయ్యాలి. ఇవన్నీ పనులు చేసి పశువుల మేపుకొని వచ్చే వరకు మధ్యాహ్నం అయ్యింది. బాగా ఆకలి అవుతుంది. కంచం కడుక్కోవడానికి కూడా మంచి నీళ్ళు కావాలంటే పొయ్యలేదు. పశువులు త్రాగే నీళ్ళ తోనే కంచం కడుక్కొమ్మన్నారు. వాళ్ల ఇంటి చూరు దగ్గర కూర్చోమన్నారు. నిన్నటిదో, మొన్నటిదో పాచి పోయిన అన్నం కూర పెట్టారు. అది తిని వెంటనే వాంతి చేసుకుంటాడు చిన్నారి దార్ల. “మామ్మగారూ... దీన్నే మీ మనవలకీ పెట్టారా? అని అడిగాను. అంతే అమ్ములుగారికి ఎక్కడలేని కోపం వచ్చేసింది. "మా వాళ్ళకంత కర్మేమొచ్చిందిరా. మీరంతా ఏ జన్మలోనో పాపం చేసుకున్నారు. కాబట్టే మాలాంటోళ్లకి సేవచేయాలని దేవుడే ఆదేశించాడు. మా దగ్గర పని చేస్తున్నారు. కనుకనే ఈ పాచి మెతుకులైనా దొరుకుతున్నాయి. లేకపోతే అవీ మీకు దిక్కులేదు. బళ్లోకెళ్తున్నావు కదా….. అందుకే నీకు ఈ గీర…ఆ గీర తీర్చడానికేరా నీకీ అన్నం పెట్టాను.. "ఇంకా ఏదేదో అంటూ మీది మీదికొచ్చేస్తుంది. కొట్టడానికే నా దగ్గరకు వస్తుందని అర్థమైపోయి ఆమె ఏమంటుందో నాకు ఇంకేమీ వినిపించడం లేదు. ఆ చుట్టూ ఎవరున్నారో కూడాపట్టించుకోలేదు. నా గిన్నె తీసుకున్నాను. ఏమైతే అయ్యిందనుకున్నాను. కంచంలోని అన్నంతో సహా ఆమె ముఖానికి తగిలేటట్టు గట్టిగా విసిరేశాను. గబగబా పాకలోకి వచ్చి ఆవునీ, గేదెనీ ఇప్పేశాను. అవి ఒక్కసారిగా బయటకు పరిగెట్టడం మొదలు పెట్టాయి. వాటి వెనుకే నేనూ పరుగు పెట్టుకుంటూ, కొంత దూరం వెళ్ళాక, వాటిని వదిలేసి, నేను మా ఇంటికొచ్చేశాను.” ఇది దార్ల వారి జీవితంలోని ఒక హృదయ విదారక మైన సన్నివేశం. 

చిన్నతనంలో దార్ల వారు వారి అమ్మకు చేదోడు వాదోడుగా ఉండాలని ఇంటి పనులు కూడా చేసే వారు.ఇరవై మూడో అధ్యాయం ‘హాస్టల్ - అంబేద్కర్ జయంతి’ లో తను హైస్కూల్లో చదువుకుంటున్నపుడు హాస్టల్ సెక్రెటరీగా ఉన్నపుడు ఏప్రిల్ 14 అంబేద్కర్ జయంతి నాడు తను వక్తలతో పాటు వేదికపై కూర్చుండి అంబేద్కర్ గురించి ఆ వక్తల ఉపన్యాసాలు విని గొప్పగా స్ఫూర్తిని పొందాను అని చెపుతారు. తన చిన్ననాడు విన్న బొబ్బిలి యుద్ధం, సత్య హరిశ్చంద్ర, అంబేద్కర్ బుర్ర కథలను నెమరేసుకుంటాడు , తనతో పాటు వాళ్ల ఇంటికి వచ్చి రాత్రి పూట చదువుకున్న మిత్రుల గూర్చి చెపుతాడు. ఆత్మ కథలోని తర్వాతి అధ్యాయంలలో తను కులం సర్టిఫికెట్ తహసీల్దార్ ఆఫిస్ నుండి పొందడానికి పడ్డ అగచాట్లు చెపుతాడు. తను పదవ తరగతిలో లెక్కల్లో రెండు మార్కులతో ఫెయిల్ అయినప్పుడు అందరూ తనను చిన్న చూపు చూసినపుడు తనకు ఎటైనా పారిపోవాలి అనిపిస్తుంది. అలాంటి సందర్భంలో ఎందుకు పారిపోయి వచ్చావు, మరొకటి మీది ఏ కులం? అనే ప్రశ్నలు వస్తాయి కదా అని తలుస్తాడు. దీనిలో కులం గురించి చెప్పినప్పుడు తను ఎంత క్షోభ పడవలసి వస్తుందో, సమాజం ఎంత చిన్న చూపు చూస్తుందో కదా అనే విషయాన్ని మన ముందు ఉంచుతాడు. తను హాస్టల్ లో ఉంటున్నప్పుడు అంబేద్కర్ గురించి తెలుసుకుంటున్నపుడు తను జీవితం గురించే తెలుసుకున్నట్లు అనిపించేదని చెపుతాడు. తను చిన్నప్పుడు ఉపన్యాసాలలో ఏమి మాట్లాడేవాడనే విషయాల్ని నెమరేసుకుంటూ ‘ … చాతుర్వర్ణ వ్యవస్థ గురించి, ఆస్తి అంతా కొంతమంది దగ్గరే కేంద్రీకృతం కావడానికి లేదా ఆస్తులు సంపాదించడానికి గల కారణాలని, దళితులు అభివృద్ధిలోకి రావాలంటే పాటించాల్సినవీ, పాటించకూడనివీ నాకు తెలిసిన వాటిని చెప్పి ఉంటాను. ‘ అంటాడు. ఇవి ఈ సమాజ మార్పునకు కావలసిన మౌలికమైన అంశాలు. వాటిని గురించి చిన్ననాడే ఆలోచించిన దార్ల వారు నిజంగా అభ్యుదయవాది. సమాజ శ్రేయోభిలాషి. చివరి అధ్యాయం “ యుద్ధం మొదలైంది” లో వారు. 'కులం మనిషిని ఏకం చేసినట్లు పైకి కనిపిస్తున్నా, అది కనిపించకుండా మనుషుల్ని విడదీస్తుంది. కులం, మతం విషబీజాలతో ప్రతి మనిషినీ విడదీస్తుంది. కులంనుండి మతాన్ని, మతంనుండి కులాన్నీ విడదీసి చూడ్డం అసాధ్యం.” అంటారు. ఇంకా “భారతదేశంలో హిందూమత మూల భావాలున్న వేదాలు, ఉపనిషత్తులు, పురాణేతిహాసాల ప్రభావంలేని మతమేదైనా ఉంటే, ఆ మతంపై హిందూమత ప్రభావం పనిచేయని, కులం లేని మతాన్ని చూడ్డం అసాధ్యం. వీటిని జయించి మనిషిగా నిలబడాలంటే హిందూ సమాజం నుండి వచ్చిన కొన్ని కులాల వారికి నిత్యం యుద్ధం చేయడం లాంటిదే.

అది ప్రత్యక్షంగా కనిపించకుండా జరిగే యుద్ధం.
రక్తం కారని యుద్ధం.
ఆయుధాలు లేని యుద్ధం.
మాటలతో, చేతలతో మానసికంగా చంపేసే యుద్ధం
ఆర్థికంగా నలిపేసే యుద్ధం.
 ఆధిపత్యాన్ని చెలాయించే యుద్ధం.
మనిషిగా బ్రతకడం కోసం చేసే యుద్ధం
ఆత్మగౌరవంతో నిలబడాలంటే నిత్యం యుద్ధం తప్పదు. జీవితం ఒక యుద్ధక్షేత్రం.
 ఆ క్షేత్రాన్ని మనం విడిచిపోలేం.
యుద్ధంలో విజేతలుగానో పరాజితలుగానో తేలేవరకూ
భారత దేశంలో కులం చేసే యుద్ధం
మనకు తెలియకుండానే సింహంపై కూర్చొని,
 దానితో చేసే యుద్ధంలాంటిదే! “ అంటారు. 

ఇవి రచయిత చెపుతున్న మాలిక మైన అంశాలు. పరిష్కారాలు కావలసిన ప్రశ్నలు ! 

పుస్తకం ముగింపులో బాల్యం గురించి అందంగా చెపుతాడు.      
   
“బాల్యం ఒక చెలమ లాంటిది.
నీళ్లు ఎన్నో లేవనిపిస్తుంది.
ఆ నీళ్లు తోడేయగానే మరలా నీళ్లు ఊరి పోతాయి.
జ్ఞాపకాలూ, ఆ బాల్య జీవితమూ అంతే.
ఇంకేముందని అనిపిస్తుంది.
గతంలోకి వెళ్ళగానే 
మళ్ళీ దొంతర దొంతరలుగా, 
అలలు అలలుగా,
పొరలు పొరలుగా 
కనిపించే జీవితంలా బయటకొస్తుంది.” అంటారు వారు తన ఆత్మకథ “ నెమలి కన్నులు “లోని మొదటి భాగంలో.                                                                         
దార్ల వారి ఆత్మకథ “ నెమలి కన్నులు” చదివిన వారికి వారిపై గౌరవ భావం పెరుగుతుంది. అతని జీవితం యువతకు ఆదర్శంగా నిలుస్తుంది. నిజంగా వారి జీవితంపై ఒక దృశ్య కావ్యం డాక్యుమెంటరీని నిర్మించవచ్చు. వారి పుస్తకాన్ని విశ్వ విద్యాలయాలు విద్యార్థులకు పఠనీయ గ్రంథంగా పెట్టవచ్చు. ప్రభుత్వాలు వారి పుస్తకానికి అవార్డులు ప్రకటించవచ్చు. దేన్నీ దాచుకోకుండా, నామోషీ పడకుండా, నిజాయితీగా వారి జీవిత బాల్యాన్ని రికార్డు చేశారు. అదొక పెద్ద సాహసం. అందాల కోనసీమ చెయ్యేరు అగ్రహారంలో దార్ల వారి ఇంటిలో పుట్టిన ఈ దార్లవారి అబ్బాయి అభినందనీయుడు ఎన్నో విషయాలకు. కవితాత్మకంగా ఎన్నో కవితావాక్యాలు, ఆత్మకథా భాగాలు ఈ పుస్తకంలో మనం చదువుకోవచ్చు . జీవితాన్ని నిశితంగా గమనించిన స్పురద్రూపి. జీవితాన్ని బాల్యంలో చేజారిపోకుండా ఒడుపుగా పట్టుకున్న ఒక సాహస బాలుడు. తన జీవిత లక్ష్యాలను చిన్ననాడే ఏర్పరచుకున్న ధీరుడు. తను అనుకున్నట్లు ఒక విశ్వద్యాలయ ఆచార్యుడై , వినయశీలిగా ఎందరో మన్ననలు పొంది ఉన్నాడు. అతని జీవిత కథ చదువుతూ ఎందరో పేదింటి బిడ్డలు తమ జీవితాన్ని దానిలో చూసుకునే సందర్భాలు కనిపిస్తాయి. జీవితాన్ని జయించిన ధీరుల్లా కనిపిస్తారు అత్మ విశ్వాసంతో కొందరు. అలాంటి కోవలోకి చెందిన వారు దార్ల వెంకటేశ్వరరావుగారు. వారి అత్మ కథను చక్కగా మలచిన దార్ల వారికి మనస్పూర్తిగా అభినందనలు.
 - డా.సబ్బని లక్ష్మీ నారాయణ.            


14 అక్టోబర్, 2024

నెమలి కన్నుల సొబగులు (ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు ఆత్మకథ పై డా.గూటం స్వామి సమీక్ష)

 (ప్రముఖ కవి, పరిశోధకులు, విమర్శకులు, ఆత్మీయ సోదరుడు డా.గూటం స్వామి చేసిన సమీక్షా వ్యాసం)


నెమలి కన్నుల సొబగులు 

(ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు ఆత్మకథ)

ఆత్మకథలు ఎన్నో చదువుతాం. కొన్ని కథలు చదివిస్తాయి. కొన్ని కథలు గుండెల్లో గూడు కొట్టుకుపోతాయి. కొన్ని ఆత్మకథలు గుండెలను పిండేస్తాయి. అసలు ఆత్మకథ అంటేనే హృదయగతమైంది. రచయిత వాస్తవ జీవితానికి ప్రతిబింబంగా నిలిచేది. ఇందులో కల్పనలు, కాలక్షేపాలు ఉండవు. జరిగిన సంఘటనలు కళ్ళముందు నిలుపుతుంది. పాఠకులను అందులోకి నడిపిస్తుంది.

విశ్వవిద్యాలయ ఆచార్యుడు దార్ల వెంకటేశ్వరరావు ఇటీవలే “నెమలి కన్నులు" పేరుతో తన ఆత్మకథను ప్రచురించారు. దీనిని నేను ఫేస్బుక్లో ఫాలో అయ్యే వాడిని. చదువుతున్నప్పుడే నన్ను విపరీతంగా ఆకర్షించింది. ఆయన గోల్డ్ స్పూన్ తో పుట్టిన వాడు కాదు. ఎన్నో డక్కా ముక్కీలు తిని ప్రొఫెసర్ స్థాయికి ఎదిగినవాడు. కోనసీమ ప్రాంతానికి చెందినవారు. ఆయన ఆత్మకథ చదువుతుంటే అద్దంలో నన్ను నేను చూసుకున్నట్టే ఉంది.

దళితుల బ్రతుకులు ఎలా ఉంటాయో నాకు ప్రత్యక్షంగా తెలుసు. సామాజిక, సాంఘిక పరిస్థితులు కడు దుర్లభం. అసమానతలు, అంటరానితనం, మర్యాద లేని బ్రతుకులు, ఒకరి మోచేతి నీళ్లు తాగవలసి వచ్చే పరిస్థితులు. వాటన్నింటిని అధిగమించి చెయ్యేరు గ్రామానికి చెందిన కుర్రోడు యూనివర్సిటీ ఆచార్య పీఠం ఎక్కి అగ్రతాంబూలం అందుకోవడం మాటలు కాదు. దాని వెనక ఎంతో కృషి, పట్టుదల, ఎన్నో అవమానాలు, అసమానతలు, అనుభవించి ఈ స్థాయికి రావడం నిజంగా గొప్ప విషయం.

బాల్యంలో 'చెయ్యేరు అగ్రహారం' ఎలా ఉండేదో కళ్లకు కట్టినట్లు చూపించారు. చదువుతుంటే మనం కూడా బాల్యంలోకి వెళ్ళిపోతాం. నేను హైస్కూల్లో చదివేటప్పుడు సెలవులు వస్తే పసుపురెల్లు వలచడానికి పనికి పోయేవాడిని. వాళ్ళు ఇచ్చే రూపాయి రెండు రూపాయలు కూలీతో చెప్పులు, బట్టలు కొనుక్కునేవాడిని. అదో ఆనందం. దార్లవారికి కూడా ఇలాంటి అనుభవాలు ఎన్నో ఉన్నాయి. వాటన్నింటినీ తన ఆత్మ కథలో మనకు అందించారు. అంతేకాదు 'మా ఊర్లో అన్ని రంగాల్లో నేనే మొదటి వాడిని'అని సగర్వంగా ప్రకటించారు. ఇది అహంకారంతో కాదు ఆత్మాభిమానంతో చెబుతున్నానని చెప్పడం దార్లకు ఉన్న ఆత్మవిశ్వాసాన్ని తెలుపుతుంది. చెయ్యేరు అగ్రహారం గురించి రచయిత అన్నింటికంటే పై చేయిగానే చెప్పారు. ఎక్కడ తగ్గలేదు. చెయ్యేరులో సామాజిక వ్యవస్థ, పొలాలు, వడ్డీ పేట, వెంకటేశ్వర స్వామి గుడి, చర్చిలు, కాలువగట్లు, ఇలా ఎన్నో విషయాలు కళ్ళకు కట్టినట్లు వర్ణించారు. నాన్న గురించి, అమ్మ గురించి ఎంత బాగా చెప్పారో ! ఆ విషయాలు చదువుతుంటే కళ్ళల్లో నీళ్లు ఆగవు. వారి సోదరుల గురించి, సోదరి గురించి చెప్పినప్పుడు కూడా అన్నదమ్ముల ప్రేమ ఎంత గొప్పదో తెలుస్తుంది. ఈ రోజుల్లో అలాంటి ప్రేమలు తక్కువ. బహుశా రచయిత చిన్నప్పటి నుంచి ఉమ్మడి కుటుంబం వ్యవస్థలో పెరగడం వల్ల అనుకుంటా బంధాలు ఇప్పటికీ చెక్కుచెదరకుండా నిలుపుకుంటూ వస్తున్నారు. నెమలి కన్నుల్లో ఎన్నో విషయాలు ఉన్నాయి. చదువరులకు ఆసక్తిని కలిగించే అంశాలు ఉంటాయి. అనాటి వారి జీవనం ఉంది. వారి జీవితం ఉంది.

బాల్యంలో రచయిత అనుభవించిన కష్టాలు ఉన్నాయి.పొలం పనుల సంబరాలు ఉన్నాయి. పల్లె సౌందర్యంఉంది. కుల వివక్ష ఆ రోజుల్లో ఎలా ఉండేదో తెలుసుకోవచ్చు. జెండా పండుగ నాడు జరిగిన సంఘటనరచయితను ఎంతటి ఆవేదనకు గురి చేసిందో ఇందులోచూడొచ్చు. రచయితకు జీళ్ళు అంటే ఎంతో ఇష్టం. ఆ విషయాన్ని చక్కగా ఆసక్తిగా రుచిగా వివరించారు. ఇందులో మూగవేదనల పేగు బంధాల వివరాలు ఉన్నాయి. నారింజ చెట్టు గుసగుసలు ఉన్నాయి. చెంబు ఇస్త్రీ - కథాకమామిషు ఉంటుంది. సైకిల్ కి ఓనర్ అయినప్పుడు - కలిగిన ఆనందం ఉంటుంది. తేగలు తిన్న అనుభవాలు ఉన్నాయి. పాలేరు తనంలో ఉండే కష్టాలు, పాలేరులు అనుభవించే జీవితాలు ఇందులో మనం చూడొచ్చు. బాల్యంలో - చేసిన చిలిపి పనులు, ఐస్ క్రీమ్ కోసం ట్రాన్సిల్స్ ఆపరేషన్ చేయించుకోవడం, బోర్లు వేసే కూలీలుగా వెళ్లడం, కొబ్బరి " నౌజు ప్రహసనం, ఆదివారం సెలవు దినాల్లో పొలం పనులకు 3 వెళ్లడం, అక్కడ బాధలు, దినపత్రిక చదవడానికి మూటలు - మోయడం, ఇలా ఎన్నో సంఘటనలు తన జీవితాన్ని ప్రభావితం చేసిన అనేక విషయాలు రచయిత పొందుపరిచారు.


ఈ ఆత్మకథలో ఎక్కడా అతిశయోక్తులు ఉండవు. ఉన్నది ' ఉన్నట్టు, భవిష్యత్ తరాలకు స్ఫూర్తిదాయకంగా ఉండేందుకు - అవసరమైన అనేక సంఘటనలను అక్షరబద్ధం చేశారు. - రచయిత కవి కూడా కావడం వల్ల చక్కటి కథనంతో వర్ణనాత్మకంగా, పాఠకులను చదివించే విధంగా రచన చేసారు. ఈ నెమలి కన్నులు ఆత్మకథ నన్నెంతో ఆకర్షించింది. చదువు తుంటే నన్ను నేను చూసుకున్నట్టే ఉంది. _ మరిన్ని మంచి రచనలు చేయాలని, మాలాంటి వాళ్లకు - ఆదర్శంగా నిలవాలని ఆశిస్తున్నాను.

-సమీక్ష: డా.గూటం స్వామి, రాజమహేంద్రవరం.

(14.10.2024, ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం వారు ప్రచురిస్తున్న ‘ నన్నయవాణి’ సౌజన్యంతో)


10 నవంబర్, 2023

నెమలి కన్నులు ఆత్మకథ అందుకుంటున్న ఆచార్య సర్రాజు, ఆచార్య కృష్ణ గార్లు

 సోమవారం (6.11.2023) ప్రజాశక్తి దినపత్రిక లో   నా ఆత్మకథ 'నెమలికన్నులు' (మొదటి భాగం -1 పై  డాక్టర్ సుంకరగోపాల్  సమీక్ష రాశారు. అది చదివిన తర్వాత మా యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ప్రొ-వైస్ ఛాన్సలర్ (రి)గారు,  మా డీన్, స్కూల్ ఆఫ్ హ్యూమానిటిస్  ఆచార్య వి కృష్ణ గారు ఆ పుస్తకాలను మరల చదవాలని తీసుకున్నారు. ఆ సందర్భంగా తీసుకున్న ఫోటో ఇది. దీనిలో ఆచార్య ఆర్ ఎస్ సర్రాజు గారు, ఆచార్య వి. కృష్ణ, ఆచార్య పిల్లలమర్రి రాములు గారు నేను ఉన్నాం. 






06 నవంబర్, 2023

నెమలికన్నులు ఆత్మకథ పై డా.సుంకరగోపాల్ సమీక్ష (6.11.2023)

 అగ్రహారంలో అగ్రభాగాన నిలిచిన"దార్ల"


ప్రేతాత్మ కథలు సినిమాలు గా తీసి సొమ్ములు చేసుకుంటున్న ఈ కాలంలో,  నిజాయితీతో కూడిన ఆత్మకథలు రాసే వారి సంఖ్య క్రమంగా తగ్గిపోతూ ఉంది. ఆత్మ కథలు ఒక కాలపు చరిత్రని, సమాజాన్ని, ఆ కాలపు ఆలోచనలను ప్రతిబింబిస్తాయి. ఒక యువకుడికి ఒక అనుభవజ్ఞుడు జీవితాన్ని ఎంత స్పష్టంగా చూపించగలడో, అంత పనిని ఆత్మకథలు చేయగలవనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆత్మకథలు దారి దీపాలుగా నిలుస్తుంటాయి. ఆత్మ కథలు మార్గదర్శనం చేయగలవు. ఆత్మ కథలు ఒక స్ఫూర్తిని అందించగలవు. ఆత్మకథలు కొన్ని సందర్భాల్లో ఎలా ఉండాలో  నిర్దేశిస్తాయి. మరికొన్ని సందర్భాల్లో ఎలా ఉండకూడదో తట్టి చూపుతాయి. 

ఆచార్య దార్ల వెంకటేశ్వరరావుగారి గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఆయన ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ముందుకు సాగుతున్నారు.


దార్ల, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాదులో చదువుకొని అదే విశ్వవిద్యాలయంలో పరిశోధన చేసి అక్కడే తెలుగు ఆచార్యులుగా, ఆ తర్వాత తెలుగు శాఖకు అధ్యక్షులుగా కూడా కొనసాగుతున్నారు. ఆయన అనేక జాతీయ అంతర్జాతీయ సదస్సుల్లో ప్రామాణికమైన పత్ర సమర్పణలుచేస్తూ ఉంటారు. కీలకోకన్యాసాలు చేస్తూ ఉంటారు.

మంచి కవిత్వం రాస్తుంటారు.

నిరంతరం సాహిత్యాన్ని వెలిగించే ప్రయత్నం ఆయన ఎప్పుడు విడవలేదు. ఆయన ఇటీవల వెలువరించిన ఆత్మకథ నెమలి కన్నులు

తన ఆత్మ కథను ప్రారంభిస్తూ రాసిన ప్రారంభ వాక్యాలు ఆయనలోని ఆత్మవిశ్వాసాన్ని ప్రకటిస్తున్నాయి. 

మా ముత్తాత చెప్పులు కుట్టేవాడు

మా తాత కూలికె ళ్ళేవాడు

మా అయ్యెమో అక్షరం కోసం ఆశగా ఎదురు చూసేవాడు.

నేనిప్పుడు కవిత్వం రాస్తున్నాను

రేపు నా కొడుకు ప్రొఫెసర్ అవుతాడు

పై వాక్యాల్లోనే ఆయన తన ఆత్మకథ ఆత్మను మొత్తం ఆవిష్కరించాడు. తన ముందు తరాల నుంచి రాబోయే తరాల వరకు ఏం జరగబోతుందో ఒక 

దార్శనికత తో వ్యక్తం చేశాడు.

ఈ ఆత్మకథలో బాల్యం నుండి  ఆయనలో ఉండే ఆత్మాభిమానం ఆశ్చర్యపరుస్తుంది.

ఈ ఆత్మకథ ద్వారా ఆయన తన అమ్మానాన్నల ప్రేమను,బాధ్యతను గుర్తు చేసుకున్నారు. తన చిన్ననాటి జీవితాన్ని మన కళ్ళ ముందు ప్రత్యక్ష ప్రసారం చేశారు. ఒకప్పటి సామాజిక అసమానతలను, వాస్తవిక జీవితాన్ని ఆవిష్కరించారు. తన ఇబ్బంది పడిన సందర్భాల్లో , తనను ఇబ్బంది పెట్టిన మనుషుల కోసం తను ఎలాంటి వాడు చెప్పుకోవడం కోసం రాసిన వాక్యాలు చూడండి

నన్ను నీటిలోకితే తోసేసామనుకున్నారు

నాకు ముత్యాలు దొరుకుతాయని వాళ్లకు తెలియదు

నన్ను పాతాళంలోకి తొక్కేద్దామనుకున్నారు

నేనొక మహా వృక్షమై మొలుచుకోస్తానని వాళ్లకు తెలియదు

నన్ను ఆకాశంలోకి విసిరేద్దామనుకున్నారు

ఆ శూన్యం నుండే నేను అందరి దాహాన్ని తీర్చే

ఓ నీటిచుక్కనై కురుస్తానని వాళ్లకు తెలియదు

ఈ ఆత్మ కథలో రచయిత తన సాయం చేసిన వారిని, తనకు గాయం చేసిన వారిని రికార్డు చేశాడు. సాయం చేసిన వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పాడు. గాయం చేసిన వాళ్ళకి క్షమాభిక్ష ప్రసాదించాడు.

ఆత్మ కథలో మొదటి భాగాన్ని ప్రారంభిస్తూనే ఆయన పెట్టిన శీర్షిక మా ఊరి పేరు అగ్రహారం ఈ శీర్షిక ద్వారానే ఆయన పరోక్షంగా ఏం చెప్పదలుచుకున్నారో మనకు తెలిసిపోతుంది. అయితే, ఆయన చెప్పాలనుకున్నది జరగని విషయాలు ఏమీ కావు. చిన్నప్పుడు నుంచి ఆయన ఎదుర్కొన్న అవమానాల కొన్ని, అనుమానాలు కొన్ని.

 వాటిని వ్యక్తం చేయడానికి ఆయన ఎక్కడా సందేహించలేదు. ఆయన పుట్టిన చేయ్యేరు అగ్రహారం,

ఆ చెరువుగట్టు

ఇప్పుడు అంబేద్కర్ ఆశయం ప్రతిఫలించిన

పూల తోట అని ఒకచోట ప్రకటించారు. అగ్రహారంలో పుట్టిన వెంకటేశ్వరరావు. 'ఆధిపత్య కులాల అధికారాలు చలామణి అవుతున్న రోజుల్లో అగ్రహారం నుండి మొట్టమొదటి పీహెచ్డీ చేసిందీ,యూనివర్సిటీలో ఉద్యోగం పొందిందీ, రేడియోలో టీవీలో మాట్లాడిందీ నేనే'అని అచంచల ఆత్మవిశ్వాసంతో ప్రకటించుకున్నారు. అయితే ఈ మాటలన్నీ వారు, అహంకారంతో చెప్పుకున్నవి కాదు. ఆత్మాభిమానంతో చెప్పుకున్న మాటలు. కోనసీమ ప్రేమ కౌగిలిలో మా ఊరు అనే శీర్షిక ద్వారా తన చిన్నప్పటి ఊరు, ఆ ఊర్లోని పరిస్థితులు చెప్తూనే తన ఊరు అంటే తనకు ఎంత ఇష్టమో రాసుకున్నారు. తన కులం వాళ్లు ఊరి చివర ఎందుకు ఇల్లు కట్టుకున్నారో ఆయనకు అర్థం అయ్యేది కాదు. ఊరి చివరకి ఎందుకు విసిరివేయబడ్డారో ఆయనకు ఎవరూ చెప్పేవాళ్ళు కాదు. 

తన ఊర్లో చివరి భాగాన ఉన్న రంగరాజు కోడు కాల్వ గట్టుకి తనకు ఉన్న అనుబంధాన్ని గురించి చెప్తున్న చోట

కాల్వ వంతెన పైనుండి కాలువలోకి దూకుతూ ఈత కొట్టిన వెంకటేశ్వరరావు కనిపిస్తారు, అక్కడ పశువుల్ని మేపుతూ నిలబడ్డ వెంకటేశ్వరరావు కనిపిస్తారు. కాల్వ గట్టుమీద శవాన్ని కాల్చినప్పుడు ఆ శవాల్ని వైద్యుడులా పరిశీలించిన వెంకటేశ్వరరావు గారి అల్లరి పనులు కనిపిస్తాయి.

దార్ల గారికి వాళ్ల నాన్న ఒకహీరో. ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి. ఈ ప్రజ్ఞ పుస్తకాలు చదివిన ప్రజ్ఞకాదు. జీవితాలను చదివిన ప్రజ్ఞ. బతకడానికి అనేక పనులు చేస్తూ పొందిన ప్రజ్ఞ. తన నాన్న చేసే అనేక పనులను చూసి వెంకటేశ్వరరావు ఆశ్చర్యపోయేవాడు. 'పొలంలో పనులు,కొబ్బరికాయ దించడం, తాటాకుల కొట్టడం, చేపలు పట్టడం, బుట్టలు అల్లడం, కల్లు గీయడం ఇన్ని పనులు ఆయన జీవనం కోసం కొనసాగించేవారు. తెగులు సోకి వడలిపోతున్న కొబ్బరి చెట్లను బతికించడం ఎలాగో , మా నాన్నకు తెలుస'ని సంబరపడిపోయే వెంకటేశ్వరరావు , తన నాన్నను హీరోగా చూడ్డంలో అతిశయోక్తి ఏమీ లేదు.

ఇక, ఆయన తల్లి గురించి చెప్పుకున్న మాటలు, అతని కుటుంబాన్ని నడిపిన తీరు, పొదుపు సూత్రాలు, పిల్లల అదుపు సూత్రాలు, వెంకటేశ్వరరావుగా తనకు పేరు పెట్టిన తీరు ఇవన్నీ దార్ల చెప్పుకున్నారు. అరుంధతి మన ఆడపడుచు మహాభారతం రాసింది మీ తాతగారే అంటూ తను తల్లి చెప్పిన కథలు తనలో ఎలా స్ఫూర్తి నింపాయో 

తెలిపారు. _అలాగే 'మనం జాగ్రత్త చేసుకునేటప్పుడు ఒక్కొక్క గింజను ఏరి సమకూర్చుకోవాలి_. _కానీ తినేటప్పుడు ముద్దగా తినాలి. మనం ఉన్నదని ఒకేసారి ఖర్చు చేసేకూడదు లేదని మానేయకూడదు. ఇలాంటివి ఎన్నో తన అమ్మ దగ్గర నుంచి దార్ల నేర్చుకున్నారు.

పనికి వెళ్లి పొద్దంతా పొలంలో పనిచేసి అలసిపోయి వచ్చి అమ్మకోసం, 

వెంకటేశ్వరరావు వాకిలి తుడిచేవాడు. కుండలు కడిగేవాడు. ఎసురు పెట్టేవాడు. అన్నం వచ్చేవాడు. తన చిట్టి చెల్లెలు ఆలనా పాలనా చూసుకునేవాడు. '

నా బాల్యమేమీ ఆటల పల్లకి కాదు

నా బాల్యం ఏమీ పూల పరిమళం కాదు,

నా బాల్యం నిప్పుల కుంపటి.

నా బాల్యం ఒక్కోసారి ముళ్ళ కిరీటం.

తీపి జ్ఞాపకాలతో పాటు బాధలు గాథలు ఉన్నాయి' అంటూ జెండా పండుగ రోజు తనను " నువ్వ క్కడినుండి వెనక్కి వెళ్ళు' అనే మాటలు ఎంత తీవ్రంగా గాయం చేశాయో, ఆ చిన్నతనంలో తను ఎంత సంఘర్షణ గురయ్యాడో అలాంటి సంఘటనలు చెబుతున్నప్పుడు మనకు కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి.

తను పాలేరు తనానికి వెళ్ళినప్పుడు, ఆ యజమానులు పాచిపోయిన అన్నం పెట్టిన సంఘటన, ఆ అన్నం కంటే వాళ్లు కులం పేరుతో దూషించడం, తక్కువగా చూడ్డం ఇలాంటివి ఆయనను ఎంతో బాధించాయి. ఆ బాధలను ఆయన ప్రశ్నలుగా ఎదుర్కొన్నాడు. వాటికి జవాబులు చూపే ప్రయత్నం చేశాడు. నెమలి కన్నులు ఆత్మకథ జీవితానుభవాల సంఘర్షణగా ఆత్మస్సాక్షి ప్రమాణంగా సాగిన ఆత్మ కథ.

దార్ల పొలాన్ని చూసినట్లయితే బడిని చూసేవాడు. బడిలో పిల్లలను చూసేవాడు. స్వచ్ఛమైన నవ్వులను చూసేవాడు. వాళ్ళతో ఆయన కూడా ఉండాలనుకున్నాడు. ఆ స్ఫూర్తి తనకు అక్షరాన్ని రుచి చూపించింది అమ్మానాన్న నిరంతరం పడే కష్టమే ఆయన అనేక పనుల్ని నేర్పింది. బోర్లు వేసే కూలీగా పనిచేసిన సంఘటన కూడా ఆయన రాసుకున్నారు. దినపత్రికలు చదవడం కోసం మూటలు మోయడం ఆయనలోని చదువువరని తెలుపుతుంది. అంబేద్కర్ ప్రభావం తనమీద ఎలాగా ఉండేదో కుడా చెప్తున్నారు .

ఈ ఆత్మ కథలో ఆయన బాధపడిన సంఘటనలు, ఆయనను బాధ పెట్టిన సంఘటనలు, వాటితో పాటు తన బాల్య జ్ఞాపకాలని, గొప్ప సంఘర్షణను చెప్పడం కోసం ఆయన అనేక సాక్ష్యాలు ఇచ్చారు. జీళ్ళ తయారీ, కొబ్బరి లవుజుఉండల ప్రహసనం, బెల్లం ముక్క కథ, వాయకుడం వండటం, తన అమ్మ నాన్నలు ఉండే అరిసెలు, పోకుండలు ఇలాంటి తినుబండారాల విషయము ఆయన సరదాగా రాసుకున్నప్పటికీ అందులో కూడా ఒక ఆంతర్యం ఉంది. ఇప్పుడు,

 హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖకు అధిపతిగా ఉన్న వెంకటేశ్వరరావు, ఆ నాడు పదో తరగతిలో లెక్కల్లో రెండు మార్కుల్లో తప్పిపోవడం అనే విషయం దగ్గర ఈ ఆత్మకథను ఆపేశారు. పరీక్షల్లో తప్పిపోవడం తో జీవితం ఆగిపోదనే విషయాన్ని ఇక్కడ స్పష్టంగా తెలుసుకోవచ్చు.

నెమలి కన్నులు పేరుతో మొదటి భాగంగా ప్రారంభమైన ఈ ఆత్మ కథలో దళిత జీవుల హృదయాల్లో ఎన్నో తరాలుగా నిక్షిప్తమైన విషయాన్ని తెలియజేస్తుంది. దార్ల వెంకటేశ్వరరావు గారు ఈ స్థాయిలో నిలబడడానికి గల కారణాలు మనకు తెలుస్తాయి. ఆయనను వెనక ఉండి ప్రేమతో  నడిపిన కుటుంబం మనల్ని పలకరిస్తుంది.

ఆయన ఒక చోట ఇలా అన్నారు

'భారతదేశంలో హిందూ మత మూల భావాలున్న వేదాలు, ఉపనిషత్తులు, పురాణేతిహాసాల ప్రభావం లేని మతమేదైన ఉంటే ఆ మతంపై హిందూ మత ప్రభావం పనిచేయని కులం లేని మతాన్ని చూడడం అసాధ్యం'

వీటిని జయించి మనిషిగా నిలబడాలంటే హిందూ సమాజం నుండి వచ్చిన కొన్ని కులాల వారికి నిత్యం  యుద్ధం చేయడం లాంటిదే.

ఆ యుద్ధం, ప్రత్యక్షంగా కనిపించకుండా జరిగే యుద్ధం

రక్తం కారకుండా జరిగే యుద్ధం

ఆయుధాలు లేని యుద్ధం

మాటలతో చేతలతో మానసికంగా చంపేసే యుద్ధం

ఆధిపత్యాన్ని చెలాయించే యుద్ధం

అందుకే దార్ల మనిషిగా బ్రతకడం కోసం యుద్ధం చేశాడు. ఆత్మగౌరవంతో నిలబడటం కోసం యుద్ధం చేశాడు. జీవితం ఒక యుద్ధక్షేత్రం అని చెప్తూనే ఈ యుద్ధంలో విజేతగా ఎలా నిలిచాడో రెండవ భాగం ఆత్మకథలో చెప్పబోతున్నట్టు సూచన చేశాడు. నెమలి కన్నులు  ఒక స్ఫూర్తివంతమైన ఆత్మ కథ. ఆ కాలపు చరిత్రను, సమాజాన్ని చిత్రీకరించిన ఆత్మకథ. అయితే ఈ ఆత్మకథలు రచయిత తనకు జ్ఞాపకం ఉన్నంత మేర తేదీలను గాని సంవత్సరాల గాని ప్రకటించి ఉంటే బాగుండేది. అయినప్పటికీ ఈ _నెమలి కన్నులు_ ఆత్మకథ ఒక వ్యక్తికి సంబంధించిన జీవితానుభవాల కాల పరిణామాన్ని, మంచి చెడులను, సంఘర్షణలను వాస్తవికంగా చెప్తూనే,తన కుటుంబ సభ్యులను, స్నేహితులను శత్రువులను, తనతో కలిసిన వారందరి వ్యక్తిత్వాలను అంచనా వేయడానికి దోహదం చేస్తుందని చెప్పొచ్చు. తాను ఆత్మకథ రాస్తున్నానంటే నవ్విన వాళ్లు ఉన్నారు, అలా నవ్విన వాళ్లకి ఈ *_నెమలి కన్నులు_* ఒక గొప్ప బహుమానం.

      -డాక్టర్ సుంకర గోపాల్

          9492638547


ప్రజాశక్తి దినపత్రిక, 6.11.2023 సౌజన్యంతో 

21 జులై, 2023

ఆచార్య దార్ల ఆత్మకథ గ్రంథావిష్కరణ

 


నమస్తే తెలంగాణ దినపత్రిక, 21.7.2023 సౌజన్యంతో 

నమస్తే న్యూస్ దినపత్రిక, 21.7.2023 సౌజన్యంతో



సాక్షి దినపత్రిక, 21.7.2023 సౌజన్యంతో


ఈనాడు దినపత్రిక, 21.7.2023 సౌజన్యంతో


మన తెలంగాణ దినపత్రిక, 21.7.2023 సౌజన్యంతో


నవ తెలంగాణ దినపత్రిక, 21.7.2023 సౌజన్యంతో


దిశ తెలంగాణ దినపత్రిక, 21.7.2023 సౌజన్యంతో
జన ప్రతిధ్వని  దినపత్రిక, 21.7.2023 సౌజన్యంతో

మన తెలంగాణ దినపత్రిక, 21.7.2023 సౌజన్యంతో

 భూమి పుత్ర దినపత్రిక, 21.7.2023 సౌజన్యంతో




 ఎంతోమందికి స్ఫూర్తినిచ్చే ఆచార్య దార్ల ఆత్మకథ 


అందరికీ కనిపించే కొన్ని బహిర్గతం కాని జీనవ సంఘర్షణలు, సంవేదనలను ఆత్మకథల్లో ప్రతిఫలింపజేస్తారని, అటువంటివెన్నో ఆచార్య దార్ల ఆత్మకథలో ప్రతిఫలించాయని ప్రముఖ సాహితీవేత్త, విమర్శకుడు, తెలంగాణ రాష్ట్ర విశ్వవిద్యాలయ ట్రైబల్ అధ్యాపక సంఘం కార్యదర్శి ఆచార్య ఎం.గోనానాయక్ వ్యాఖ్యానించారు.ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు రచించిన నెమలికన్నులు (ఆత్మకథ మొదటి భాగం) పుస్తకాన్ని గురువారం నాడు హెచ్.సి.యు తెలుగు శాఖలో ఆవిష్కరించి ఆయన మాట్లాడారు. ఆత్మకథ రాయడమనేది  ఒక సాహసంతో కూడిన పని అనీ, అటువంటిది దళిత ఆత్మకథ రాయడం మరింత కష్టమైందని ఈ సందర్భంగా ఆచార్య గోనానాయక్ పేర్కొన్నారు. సుమారు ఏభై సంవత్సరాల తెలుగు సమాజాన్ని, భారతీయ జీవనంలోని కొన్ని కొత్త కోణాలను ఈ ఆత్మకథలో ఆచార్య దార్ల కవితాత్మక శైలిలో రచించారని ఆయన సోదాహరణంగా వివరించారు. పుస్తకం, దానిలోని అక్షరాలు ఎంతో ఆకర్షణీయంగా, చదవడానికి సౌకర్యవంతంగా పుస్తకం అందంగా వచ్చిందని ప్రముఖ సాహితీ విమర్శకుడు, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ అధ్యాపక సంఘ పూర్వ అధ్యక్షులు ఆచార్య పిల్లలమర్రి రాములు అన్నారు. కవిగా, విమర్శకుడుగా, సహ అధ్యాపకులుగా ఉన్న ఆచార్య దార్ల తన ఆత్మకథలో ఒక దళితుడు విశ్వవిద్యాలయ స్థాయిలో ఉన్నతస్థిలోకి రావడానికి గల నేపథ్యం ఈ ఆత్మకథలో ఉందని, ఇది ఎంతోమందికి స్ఫూర్తిదాయకమనీ అన్నారు. ఈ ఆత్మకథ సీరియల్ గా వచ్చేటప్పుడు చదివామనీ, కోస్తాంధ్ర పలుకుబడి, దళిత జీవిత నేపథ్యాలతో తొలితరం దళితుడు సెంట్రల్ యూనివర్సిటీ లో చదువుకొని, అక్కడే ప్రొఫెసర్ గా, శాఖాధ్యక్షులు పనిచేయడం సామాన్యమైన విషయం కాదని సమావేశంలో పాల్గొన్న ఆచార్య పమ్మి పవన్ కుమార్, ఆచార్య డి. విజయలక్ష్మి, డా. భూక్యా తిరుపతి, డా.బాణాల భుజంగరెడ్డి, డా.డి.విజయకుమారి తదితరులు పేర్కొన్నారు. తన పుస్తకం వెలువడిన నేపథ్యాన్ని పుస్తక రచయిత, తెలుగు శాఖ అధ్యక్షులు ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు వివరించారు. ఈ కార్యక్రమంలో మధుసూదన్, తిరుమల సింగ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.