"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL-502: Techniques of writing a Dissertation క్లాసులు సోమ, మంగళ, గురు, శుక్రవారం మధ్యాహ్నం 12.00 గంటల నుండి 1.00 వరకు డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ భవనంలో జరుగుతాయి.

06 నవంబర్, 2023

నెమలికన్నులు ఆత్మకథ పై డా.సుంకరగోపాల్ సమీక్ష (6.11.2023)

 అగ్రహారంలో అగ్రభాగాన నిలిచిన"దార్ల"


ప్రేతాత్మ కథలు సినిమాలు గా తీసి సొమ్ములు చేసుకుంటున్న ఈ కాలంలో,  నిజాయితీతో కూడిన ఆత్మకథలు రాసే వారి సంఖ్య క్రమంగా తగ్గిపోతూ ఉంది. ఆత్మ కథలు ఒక కాలపు చరిత్రని, సమాజాన్ని, ఆ కాలపు ఆలోచనలను ప్రతిబింబిస్తాయి. ఒక యువకుడికి ఒక అనుభవజ్ఞుడు జీవితాన్ని ఎంత స్పష్టంగా చూపించగలడో, అంత పనిని ఆత్మకథలు చేయగలవనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆత్మకథలు దారి దీపాలుగా నిలుస్తుంటాయి. ఆత్మ కథలు మార్గదర్శనం చేయగలవు. ఆత్మ కథలు ఒక స్ఫూర్తిని అందించగలవు. ఆత్మకథలు కొన్ని సందర్భాల్లో ఎలా ఉండాలో  నిర్దేశిస్తాయి. మరికొన్ని సందర్భాల్లో ఎలా ఉండకూడదో తట్టి చూపుతాయి. 

ఆచార్య దార్ల వెంకటేశ్వరరావుగారి గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఆయన ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ముందుకు సాగుతున్నారు.


దార్ల, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాదులో చదువుకొని అదే విశ్వవిద్యాలయంలో పరిశోధన చేసి అక్కడే తెలుగు ఆచార్యులుగా, ఆ తర్వాత తెలుగు శాఖకు అధ్యక్షులుగా కూడా కొనసాగుతున్నారు. ఆయన అనేక జాతీయ అంతర్జాతీయ సదస్సుల్లో ప్రామాణికమైన పత్ర సమర్పణలుచేస్తూ ఉంటారు. కీలకోకన్యాసాలు చేస్తూ ఉంటారు.

మంచి కవిత్వం రాస్తుంటారు.

నిరంతరం సాహిత్యాన్ని వెలిగించే ప్రయత్నం ఆయన ఎప్పుడు విడవలేదు. ఆయన ఇటీవల వెలువరించిన ఆత్మకథ నెమలి కన్నులు

తన ఆత్మ కథను ప్రారంభిస్తూ రాసిన ప్రారంభ వాక్యాలు ఆయనలోని ఆత్మవిశ్వాసాన్ని ప్రకటిస్తున్నాయి. 

మా ముత్తాత చెప్పులు కుట్టేవాడు

మా తాత కూలికె ళ్ళేవాడు

మా అయ్యెమో అక్షరం కోసం ఆశగా ఎదురు చూసేవాడు.

నేనిప్పుడు కవిత్వం రాస్తున్నాను

రేపు నా కొడుకు ప్రొఫెసర్ అవుతాడు

పై వాక్యాల్లోనే ఆయన తన ఆత్మకథ ఆత్మను మొత్తం ఆవిష్కరించాడు. తన ముందు తరాల నుంచి రాబోయే తరాల వరకు ఏం జరగబోతుందో ఒక 

దార్శనికత తో వ్యక్తం చేశాడు.

ఈ ఆత్మకథలో బాల్యం నుండి  ఆయనలో ఉండే ఆత్మాభిమానం ఆశ్చర్యపరుస్తుంది.

ఈ ఆత్మకథ ద్వారా ఆయన తన అమ్మానాన్నల ప్రేమను,బాధ్యతను గుర్తు చేసుకున్నారు. తన చిన్ననాటి జీవితాన్ని మన కళ్ళ ముందు ప్రత్యక్ష ప్రసారం చేశారు. ఒకప్పటి సామాజిక అసమానతలను, వాస్తవిక జీవితాన్ని ఆవిష్కరించారు. తన ఇబ్బంది పడిన సందర్భాల్లో , తనను ఇబ్బంది పెట్టిన మనుషుల కోసం తను ఎలాంటి వాడు చెప్పుకోవడం కోసం రాసిన వాక్యాలు చూడండి

నన్ను నీటిలోకితే తోసేసామనుకున్నారు

నాకు ముత్యాలు దొరుకుతాయని వాళ్లకు తెలియదు

నన్ను పాతాళంలోకి తొక్కేద్దామనుకున్నారు

నేనొక మహా వృక్షమై మొలుచుకోస్తానని వాళ్లకు తెలియదు

నన్ను ఆకాశంలోకి విసిరేద్దామనుకున్నారు

ఆ శూన్యం నుండే నేను అందరి దాహాన్ని తీర్చే

ఓ నీటిచుక్కనై కురుస్తానని వాళ్లకు తెలియదు

ఈ ఆత్మ కథలో రచయిత తన సాయం చేసిన వారిని, తనకు గాయం చేసిన వారిని రికార్డు చేశాడు. సాయం చేసిన వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పాడు. గాయం చేసిన వాళ్ళకి క్షమాభిక్ష ప్రసాదించాడు.

ఆత్మ కథలో మొదటి భాగాన్ని ప్రారంభిస్తూనే ఆయన పెట్టిన శీర్షిక మా ఊరి పేరు అగ్రహారం ఈ శీర్షిక ద్వారానే ఆయన పరోక్షంగా ఏం చెప్పదలుచుకున్నారో మనకు తెలిసిపోతుంది. అయితే, ఆయన చెప్పాలనుకున్నది జరగని విషయాలు ఏమీ కావు. చిన్నప్పుడు నుంచి ఆయన ఎదుర్కొన్న అవమానాల కొన్ని, అనుమానాలు కొన్ని.

 వాటిని వ్యక్తం చేయడానికి ఆయన ఎక్కడా సందేహించలేదు. ఆయన పుట్టిన చేయ్యేరు అగ్రహారం,

ఆ చెరువుగట్టు

ఇప్పుడు అంబేద్కర్ ఆశయం ప్రతిఫలించిన

పూల తోట అని ఒకచోట ప్రకటించారు. అగ్రహారంలో పుట్టిన వెంకటేశ్వరరావు. 'ఆధిపత్య కులాల అధికారాలు చలామణి అవుతున్న రోజుల్లో అగ్రహారం నుండి మొట్టమొదటి పీహెచ్డీ చేసిందీ,యూనివర్సిటీలో ఉద్యోగం పొందిందీ, రేడియోలో టీవీలో మాట్లాడిందీ నేనే'అని అచంచల ఆత్మవిశ్వాసంతో ప్రకటించుకున్నారు. అయితే ఈ మాటలన్నీ వారు, అహంకారంతో చెప్పుకున్నవి కాదు. ఆత్మాభిమానంతో చెప్పుకున్న మాటలు. కోనసీమ ప్రేమ కౌగిలిలో మా ఊరు అనే శీర్షిక ద్వారా తన చిన్నప్పటి ఊరు, ఆ ఊర్లోని పరిస్థితులు చెప్తూనే తన ఊరు అంటే తనకు ఎంత ఇష్టమో రాసుకున్నారు. తన కులం వాళ్లు ఊరి చివర ఎందుకు ఇల్లు కట్టుకున్నారో ఆయనకు అర్థం అయ్యేది కాదు. ఊరి చివరకి ఎందుకు విసిరివేయబడ్డారో ఆయనకు ఎవరూ చెప్పేవాళ్ళు కాదు. 

తన ఊర్లో చివరి భాగాన ఉన్న రంగరాజు కోడు కాల్వ గట్టుకి తనకు ఉన్న అనుబంధాన్ని గురించి చెప్తున్న చోట

కాల్వ వంతెన పైనుండి కాలువలోకి దూకుతూ ఈత కొట్టిన వెంకటేశ్వరరావు కనిపిస్తారు, అక్కడ పశువుల్ని మేపుతూ నిలబడ్డ వెంకటేశ్వరరావు కనిపిస్తారు. కాల్వ గట్టుమీద శవాన్ని కాల్చినప్పుడు ఆ శవాల్ని వైద్యుడులా పరిశీలించిన వెంకటేశ్వరరావు గారి అల్లరి పనులు కనిపిస్తాయి.

దార్ల గారికి వాళ్ల నాన్న ఒకహీరో. ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి. ఈ ప్రజ్ఞ పుస్తకాలు చదివిన ప్రజ్ఞకాదు. జీవితాలను చదివిన ప్రజ్ఞ. బతకడానికి అనేక పనులు చేస్తూ పొందిన ప్రజ్ఞ. తన నాన్న చేసే అనేక పనులను చూసి వెంకటేశ్వరరావు ఆశ్చర్యపోయేవాడు. 'పొలంలో పనులు,కొబ్బరికాయ దించడం, తాటాకుల కొట్టడం, చేపలు పట్టడం, బుట్టలు అల్లడం, కల్లు గీయడం ఇన్ని పనులు ఆయన జీవనం కోసం కొనసాగించేవారు. తెగులు సోకి వడలిపోతున్న కొబ్బరి చెట్లను బతికించడం ఎలాగో , మా నాన్నకు తెలుస'ని సంబరపడిపోయే వెంకటేశ్వరరావు , తన నాన్నను హీరోగా చూడ్డంలో అతిశయోక్తి ఏమీ లేదు.

ఇక, ఆయన తల్లి గురించి చెప్పుకున్న మాటలు, అతని కుటుంబాన్ని నడిపిన తీరు, పొదుపు సూత్రాలు, పిల్లల అదుపు సూత్రాలు, వెంకటేశ్వరరావుగా తనకు పేరు పెట్టిన తీరు ఇవన్నీ దార్ల చెప్పుకున్నారు. అరుంధతి మన ఆడపడుచు మహాభారతం రాసింది మీ తాతగారే అంటూ తను తల్లి చెప్పిన కథలు తనలో ఎలా స్ఫూర్తి నింపాయో 

తెలిపారు. _అలాగే 'మనం జాగ్రత్త చేసుకునేటప్పుడు ఒక్కొక్క గింజను ఏరి సమకూర్చుకోవాలి_. _కానీ తినేటప్పుడు ముద్దగా తినాలి. మనం ఉన్నదని ఒకేసారి ఖర్చు చేసేకూడదు లేదని మానేయకూడదు. ఇలాంటివి ఎన్నో తన అమ్మ దగ్గర నుంచి దార్ల నేర్చుకున్నారు.

పనికి వెళ్లి పొద్దంతా పొలంలో పనిచేసి అలసిపోయి వచ్చి అమ్మకోసం, 

వెంకటేశ్వరరావు వాకిలి తుడిచేవాడు. కుండలు కడిగేవాడు. ఎసురు పెట్టేవాడు. అన్నం వచ్చేవాడు. తన చిట్టి చెల్లెలు ఆలనా పాలనా చూసుకునేవాడు. '

నా బాల్యమేమీ ఆటల పల్లకి కాదు

నా బాల్యం ఏమీ పూల పరిమళం కాదు,

నా బాల్యం నిప్పుల కుంపటి.

నా బాల్యం ఒక్కోసారి ముళ్ళ కిరీటం.

తీపి జ్ఞాపకాలతో పాటు బాధలు గాథలు ఉన్నాయి' అంటూ జెండా పండుగ రోజు తనను " నువ్వ క్కడినుండి వెనక్కి వెళ్ళు' అనే మాటలు ఎంత తీవ్రంగా గాయం చేశాయో, ఆ చిన్నతనంలో తను ఎంత సంఘర్షణ గురయ్యాడో అలాంటి సంఘటనలు చెబుతున్నప్పుడు మనకు కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి.

తను పాలేరు తనానికి వెళ్ళినప్పుడు, ఆ యజమానులు పాచిపోయిన అన్నం పెట్టిన సంఘటన, ఆ అన్నం కంటే వాళ్లు కులం పేరుతో దూషించడం, తక్కువగా చూడ్డం ఇలాంటివి ఆయనను ఎంతో బాధించాయి. ఆ బాధలను ఆయన ప్రశ్నలుగా ఎదుర్కొన్నాడు. వాటికి జవాబులు చూపే ప్రయత్నం చేశాడు. నెమలి కన్నులు ఆత్మకథ జీవితానుభవాల సంఘర్షణగా ఆత్మస్సాక్షి ప్రమాణంగా సాగిన ఆత్మ కథ.

దార్ల పొలాన్ని చూసినట్లయితే బడిని చూసేవాడు. బడిలో పిల్లలను చూసేవాడు. స్వచ్ఛమైన నవ్వులను చూసేవాడు. వాళ్ళతో ఆయన కూడా ఉండాలనుకున్నాడు. ఆ స్ఫూర్తి తనకు అక్షరాన్ని రుచి చూపించింది అమ్మానాన్న నిరంతరం పడే కష్టమే ఆయన అనేక పనుల్ని నేర్పింది. బోర్లు వేసే కూలీగా పనిచేసిన సంఘటన కూడా ఆయన రాసుకున్నారు. దినపత్రికలు చదవడం కోసం మూటలు మోయడం ఆయనలోని చదువువరని తెలుపుతుంది. అంబేద్కర్ ప్రభావం తనమీద ఎలాగా ఉండేదో కుడా చెప్తున్నారు .

ఈ ఆత్మ కథలో ఆయన బాధపడిన సంఘటనలు, ఆయనను బాధ పెట్టిన సంఘటనలు, వాటితో పాటు తన బాల్య జ్ఞాపకాలని, గొప్ప సంఘర్షణను చెప్పడం కోసం ఆయన అనేక సాక్ష్యాలు ఇచ్చారు. జీళ్ళ తయారీ, కొబ్బరి లవుజుఉండల ప్రహసనం, బెల్లం ముక్క కథ, వాయకుడం వండటం, తన అమ్మ నాన్నలు ఉండే అరిసెలు, పోకుండలు ఇలాంటి తినుబండారాల విషయము ఆయన సరదాగా రాసుకున్నప్పటికీ అందులో కూడా ఒక ఆంతర్యం ఉంది. ఇప్పుడు,

 హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖకు అధిపతిగా ఉన్న వెంకటేశ్వరరావు, ఆ నాడు పదో తరగతిలో లెక్కల్లో రెండు మార్కుల్లో తప్పిపోవడం అనే విషయం దగ్గర ఈ ఆత్మకథను ఆపేశారు. పరీక్షల్లో తప్పిపోవడం తో జీవితం ఆగిపోదనే విషయాన్ని ఇక్కడ స్పష్టంగా తెలుసుకోవచ్చు.

నెమలి కన్నులు పేరుతో మొదటి భాగంగా ప్రారంభమైన ఈ ఆత్మ కథలో దళిత జీవుల హృదయాల్లో ఎన్నో తరాలుగా నిక్షిప్తమైన విషయాన్ని తెలియజేస్తుంది. దార్ల వెంకటేశ్వరరావు గారు ఈ స్థాయిలో నిలబడడానికి గల కారణాలు మనకు తెలుస్తాయి. ఆయనను వెనక ఉండి ప్రేమతో  నడిపిన కుటుంబం మనల్ని పలకరిస్తుంది.

ఆయన ఒక చోట ఇలా అన్నారు

'భారతదేశంలో హిందూ మత మూల భావాలున్న వేదాలు, ఉపనిషత్తులు, పురాణేతిహాసాల ప్రభావం లేని మతమేదైన ఉంటే ఆ మతంపై హిందూ మత ప్రభావం పనిచేయని కులం లేని మతాన్ని చూడడం అసాధ్యం'

వీటిని జయించి మనిషిగా నిలబడాలంటే హిందూ సమాజం నుండి వచ్చిన కొన్ని కులాల వారికి నిత్యం  యుద్ధం చేయడం లాంటిదే.

ఆ యుద్ధం, ప్రత్యక్షంగా కనిపించకుండా జరిగే యుద్ధం

రక్తం కారకుండా జరిగే యుద్ధం

ఆయుధాలు లేని యుద్ధం

మాటలతో చేతలతో మానసికంగా చంపేసే యుద్ధం

ఆధిపత్యాన్ని చెలాయించే యుద్ధం

అందుకే దార్ల మనిషిగా బ్రతకడం కోసం యుద్ధం చేశాడు. ఆత్మగౌరవంతో నిలబడటం కోసం యుద్ధం చేశాడు. జీవితం ఒక యుద్ధక్షేత్రం అని చెప్తూనే ఈ యుద్ధంలో విజేతగా ఎలా నిలిచాడో రెండవ భాగం ఆత్మకథలో చెప్పబోతున్నట్టు సూచన చేశాడు. నెమలి కన్నులు  ఒక స్ఫూర్తివంతమైన ఆత్మ కథ. ఆ కాలపు చరిత్రను, సమాజాన్ని చిత్రీకరించిన ఆత్మకథ. అయితే ఈ ఆత్మకథలు రచయిత తనకు జ్ఞాపకం ఉన్నంత మేర తేదీలను గాని సంవత్సరాల గాని ప్రకటించి ఉంటే బాగుండేది. అయినప్పటికీ ఈ _నెమలి కన్నులు_ ఆత్మకథ ఒక వ్యక్తికి సంబంధించిన జీవితానుభవాల కాల పరిణామాన్ని, మంచి చెడులను, సంఘర్షణలను వాస్తవికంగా చెప్తూనే,తన కుటుంబ సభ్యులను, స్నేహితులను శత్రువులను, తనతో కలిసిన వారందరి వ్యక్తిత్వాలను అంచనా వేయడానికి దోహదం చేస్తుందని చెప్పొచ్చు. తాను ఆత్మకథ రాస్తున్నానంటే నవ్విన వాళ్లు ఉన్నారు, అలా నవ్విన వాళ్లకి ఈ *_నెమలి కన్నులు_* ఒక గొప్ప బహుమానం.

      -డాక్టర్ సుంకర గోపాల్

          9492638547


ప్రజాశక్తి దినపత్రిక, 6.11.2023 సౌజన్యంతో 

కామెంట్‌లు లేవు: