(ప్రముఖ కవి, పరిశోధకులు, విమర్శకులు, ఆత్మీయ సోదరుడు డా.గూటం స్వామి చేసిన సమీక్షా వ్యాసం)
నెమలి కన్నుల సొబగులు
(ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు ఆత్మకథ)
ఆత్మకథలు ఎన్నో చదువుతాం. కొన్ని కథలు చదివిస్తాయి. కొన్ని కథలు గుండెల్లో గూడు కొట్టుకుపోతాయి. కొన్ని ఆత్మకథలు గుండెలను పిండేస్తాయి. అసలు ఆత్మకథ అంటేనే హృదయగతమైంది. రచయిత వాస్తవ జీవితానికి ప్రతిబింబంగా నిలిచేది. ఇందులో కల్పనలు, కాలక్షేపాలు ఉండవు. జరిగిన సంఘటనలు కళ్ళముందు నిలుపుతుంది. పాఠకులను అందులోకి నడిపిస్తుంది.
విశ్వవిద్యాలయ ఆచార్యుడు దార్ల వెంకటేశ్వరరావు ఇటీవలే “నెమలి కన్నులు" పేరుతో తన ఆత్మకథను ప్రచురించారు. దీనిని నేను ఫేస్బుక్లో ఫాలో అయ్యే వాడిని. చదువుతున్నప్పుడే నన్ను విపరీతంగా ఆకర్షించింది. ఆయన గోల్డ్ స్పూన్ తో పుట్టిన వాడు కాదు. ఎన్నో డక్కా ముక్కీలు తిని ప్రొఫెసర్ స్థాయికి ఎదిగినవాడు. కోనసీమ ప్రాంతానికి చెందినవారు. ఆయన ఆత్మకథ చదువుతుంటే అద్దంలో నన్ను నేను చూసుకున్నట్టే ఉంది.
దళితుల బ్రతుకులు ఎలా ఉంటాయో నాకు ప్రత్యక్షంగా తెలుసు. సామాజిక, సాంఘిక పరిస్థితులు కడు దుర్లభం. అసమానతలు, అంటరానితనం, మర్యాద లేని బ్రతుకులు, ఒకరి మోచేతి నీళ్లు తాగవలసి వచ్చే పరిస్థితులు. వాటన్నింటిని అధిగమించి చెయ్యేరు గ్రామానికి చెందిన కుర్రోడు యూనివర్సిటీ ఆచార్య పీఠం ఎక్కి అగ్రతాంబూలం అందుకోవడం మాటలు కాదు. దాని వెనక ఎంతో కృషి, పట్టుదల, ఎన్నో అవమానాలు, అసమానతలు, అనుభవించి ఈ స్థాయికి రావడం నిజంగా గొప్ప విషయం.
బాల్యంలో 'చెయ్యేరు అగ్రహారం' ఎలా ఉండేదో కళ్లకు కట్టినట్లు చూపించారు. చదువుతుంటే మనం కూడా బాల్యంలోకి వెళ్ళిపోతాం. నేను హైస్కూల్లో చదివేటప్పుడు సెలవులు వస్తే పసుపురెల్లు వలచడానికి పనికి పోయేవాడిని. వాళ్ళు ఇచ్చే రూపాయి రెండు రూపాయలు కూలీతో చెప్పులు, బట్టలు కొనుక్కునేవాడిని. అదో ఆనందం. దార్లవారికి కూడా ఇలాంటి అనుభవాలు ఎన్నో ఉన్నాయి. వాటన్నింటినీ తన ఆత్మ కథలో మనకు అందించారు. అంతేకాదు 'మా ఊర్లో అన్ని రంగాల్లో నేనే మొదటి వాడిని'అని సగర్వంగా ప్రకటించారు. ఇది అహంకారంతో కాదు ఆత్మాభిమానంతో చెబుతున్నానని చెప్పడం దార్లకు ఉన్న ఆత్మవిశ్వాసాన్ని తెలుపుతుంది. చెయ్యేరు అగ్రహారం గురించి రచయిత అన్నింటికంటే పై చేయిగానే చెప్పారు. ఎక్కడ తగ్గలేదు. చెయ్యేరులో సామాజిక వ్యవస్థ, పొలాలు, వడ్డీ పేట, వెంకటేశ్వర స్వామి గుడి, చర్చిలు, కాలువగట్లు, ఇలా ఎన్నో విషయాలు కళ్ళకు కట్టినట్లు వర్ణించారు. నాన్న గురించి, అమ్మ గురించి ఎంత బాగా చెప్పారో ! ఆ విషయాలు చదువుతుంటే కళ్ళల్లో నీళ్లు ఆగవు. వారి సోదరుల గురించి, సోదరి గురించి చెప్పినప్పుడు కూడా అన్నదమ్ముల ప్రేమ ఎంత గొప్పదో తెలుస్తుంది. ఈ రోజుల్లో అలాంటి ప్రేమలు తక్కువ. బహుశా రచయిత చిన్నప్పటి నుంచి ఉమ్మడి కుటుంబం వ్యవస్థలో పెరగడం వల్ల అనుకుంటా బంధాలు ఇప్పటికీ చెక్కుచెదరకుండా నిలుపుకుంటూ వస్తున్నారు. నెమలి కన్నుల్లో ఎన్నో విషయాలు ఉన్నాయి. చదువరులకు ఆసక్తిని కలిగించే అంశాలు ఉంటాయి. అనాటి వారి జీవనం ఉంది. వారి జీవితం ఉంది.
బాల్యంలో రచయిత అనుభవించిన కష్టాలు ఉన్నాయి.పొలం పనుల సంబరాలు ఉన్నాయి. పల్లె సౌందర్యంఉంది. కుల వివక్ష ఆ రోజుల్లో ఎలా ఉండేదో తెలుసుకోవచ్చు. జెండా పండుగ నాడు జరిగిన సంఘటనరచయితను ఎంతటి ఆవేదనకు గురి చేసిందో ఇందులోచూడొచ్చు. రచయితకు జీళ్ళు అంటే ఎంతో ఇష్టం. ఆ విషయాన్ని చక్కగా ఆసక్తిగా రుచిగా వివరించారు. ఇందులో మూగవేదనల పేగు బంధాల వివరాలు ఉన్నాయి. నారింజ చెట్టు గుసగుసలు ఉన్నాయి. చెంబు ఇస్త్రీ - కథాకమామిషు ఉంటుంది. సైకిల్ కి ఓనర్ అయినప్పుడు - కలిగిన ఆనందం ఉంటుంది. తేగలు తిన్న అనుభవాలు ఉన్నాయి. పాలేరు తనంలో ఉండే కష్టాలు, పాలేరులు అనుభవించే జీవితాలు ఇందులో మనం చూడొచ్చు. బాల్యంలో - చేసిన చిలిపి పనులు, ఐస్ క్రీమ్ కోసం ట్రాన్సిల్స్ ఆపరేషన్ చేయించుకోవడం, బోర్లు వేసే కూలీలుగా వెళ్లడం, కొబ్బరి " నౌజు ప్రహసనం, ఆదివారం సెలవు దినాల్లో పొలం పనులకు 3 వెళ్లడం, అక్కడ బాధలు, దినపత్రిక చదవడానికి మూటలు - మోయడం, ఇలా ఎన్నో సంఘటనలు తన జీవితాన్ని ప్రభావితం చేసిన అనేక విషయాలు రచయిత పొందుపరిచారు.
ఈ ఆత్మకథలో ఎక్కడా అతిశయోక్తులు ఉండవు. ఉన్నది ' ఉన్నట్టు, భవిష్యత్ తరాలకు స్ఫూర్తిదాయకంగా ఉండేందుకు - అవసరమైన అనేక సంఘటనలను అక్షరబద్ధం చేశారు. - రచయిత కవి కూడా కావడం వల్ల చక్కటి కథనంతో వర్ణనాత్మకంగా, పాఠకులను చదివించే విధంగా రచన చేసారు. ఈ నెమలి కన్నులు ఆత్మకథ నన్నెంతో ఆకర్షించింది. చదువు తుంటే నన్ను నేను చూసుకున్నట్టే ఉంది. _ మరిన్ని మంచి రచనలు చేయాలని, మాలాంటి వాళ్లకు - ఆదర్శంగా నిలవాలని ఆశిస్తున్నాను.
-సమీక్ష: డా.గూటం స్వామి, రాజమహేంద్రవరం.
(14.10.2024, ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం వారు ప్రచురిస్తున్న ‘ నన్నయవాణి’ సౌజన్యంతో)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి