"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL-502: Techniques of writing a Dissertation క్లాసులు సోమ, మంగళ, గురు, శుక్రవారం మధ్యాహ్నం 12.00 గంటల నుండి 1.00 వరకు డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ భవనంలో జరుగుతాయి.

27 నవంబర్, 2024

నెమలి కన్నులు ఆత్మకథపై డా.సబ్బని లక్ష్మీనారాయణ గారి వ్యాసం (27.11.2024)

 

నేటినిజం దినపత్రిక, 27.11.2024 సౌజన్యంతో 


దళిత జీవన స్రవంతి దార్ల వారి “నెమలి కన్నులు”


 ఆత్మకథాత్మక కావ్యాలు ఎందుకు పుడుతాయి అంటే అవి బతుకు యొక్క వేదనని బయటికి తెలియజేస్తాయి. మనిషిని బాధల నుండి విముక్తిని చేస్తాయి.కళారూపాలుగా, కావ్యాలుగా వస్తాయి . దీనినే అరిస్టాటిల్ భాషలో కెథారసిస్ అంటారు. అలా జీవన వేదన నుండి కళారూపాలుగా పుట్టినవే గొప్ప పుస్తకాలుగా మనగలుగుతాయి. రచనా ప్రక్రియ యొక్క ఒక ముఖ్యమైన రూపము స్వీయ చరిత్ర . మన గమనింపులోకి వస్తే కందుకూరి వారి స్వీయ చరిత్ర ఆనాటి సామాజిక ఆర్థిక పరిస్థితులు, కందుకూరి యొక్క జీవనాన్ని, సమాజిక సేవని, సాహితీసేవను మనము అవగతం చేసుకోవచ్చు . మహాకవి జాషువా తన స్వీయ చరిత్రను పద్య రూపంలో రాశారు ‘నా కథ ‘ పేరా . అలానే శ్రీశ్రీ తన స్వీయ చరిత్రను’ అనంతము ‘అని రాశారు. కాళోజీ తన స్వీయ చరిత్రను ,’ఇది నా గొడవ ‘ అని రాసుకున్నారు. గాంధీ జీ తన ఆత్మకథను ‘మై ఎక్స్పరిమెంట్స్ విత్ ట్రూత్’ అనే పేర రాశారు. ఇవి ఆయా రచయితల జీవన పరిస్థితులలో ఆనాటి సాంఘిక సామాజిక ఆర్థిక పరిస్థితులను తెలుసుకోవడానికి మనకు దోహదపడుతాయి, అక్కరకు వస్తాయి. అలానే “వెయిటింగ్ ఫర్ ఏ వీసా'' పేరుతో అంబేద్కర్ తన ఆత్మకథను కొంత భాగం మాత్రమే రాసుకున్నారు. కానీ, ఆయన ప్రతి పని లిఖితపూర్వకంగా వచ్చింది. అందువల్ల ఆయన ప్రతి రచన ఒక స్వీయ చరిత్రలో భాగమే అనొచ్చు . అలా స్వీయ చరిత్రల వలన ఆయా రచయితలు తమ జీవితంలో పొందిన అవమాన సన్మానాల విశేషాలను, ఆనాటి సామాజిక ఆర్థిక పరిస్థితులను కూడా మనం వాటిని చదువుకోవడం వల్ల తెలుస్తాయి. ఆయా కవుల, రచయితల మనోగతములు వారు పొందిన అనుభూతులు కష్టనష్టాలు భావోద్వేగాలు కూడా మనకు తెలుస్తాయి. సాధారణంగా స్వీయ చరిత్రలను రచయితలు తమ జీవిత చరమ దశలో అనగా 60 దాటిన వయసులో రాస్తుంటారు. కానీ, ఇక్కడ దార్ల వెంకటేశ్వరరావుగారు తమ స్వీయ చరిత్రను తన 50 ఏళ్ల ప్రాయంలోనే రాయడం ఒక సాహసం మొదటి భాగంగా. అలా రాయడం వలన తన జీవితము పదుగురికి మార్గదర్శకంగా ఉండబోతుందేమో అనీ, అందుకనే రాశారేమో అనిపిస్తూ ఉంటుంది. దార్లవారు నాకు యాదృచ్ఛికంగా ఒక సాహితీ సభలో కర్నూలులో పరిచయమయ్యారు. అది 2020 సంవత్సరంలో జరిగింది. ఇప్పటికి నాలుగేళ్లు దాటింది . అక్కడ కొన్ని గంటలు వారితో కలిసి గడపడం మళ్లీ రాత్రంతా వారితో హైదరాబాదుకు బస్సులో ప్రయాణం చేయడం అలా వారు నాకు మరింత సన్నిహితులు అయ్యారు, అలా సహజంగా పరిచయమై నాకు దగ్గరైన వారు శ్రీదార్ల వెంకటేశ్వర రావుగారు. ఆ పరిచయంతో వారు నా యొక్క పుస్తకం ‘సబ్బని సాహిత్య వ్యాసములు’కు ముందుమాట కూడా రాశారు. దాని ఆవిష్కరణ కార్యక్రమంలో హైదరాబాదులో పాల్గొన్నారు. చదువక ముందు దార్లవారు స్వీయ చరిత్రను ఇంత చిన్న వయసులో ఎందుకు రాశారో అనుకున్నాను. కానీ, చదివిన తర్వాత తెలిసింది. వారు వారి స్వీయచరిత్రను రాయడం ఒక అవసరమని తెలిసింది . సామాజిక వ్యవస్థలో అంచెలంచల కుల వ్యవస్థలో తాను పొందిన అవమానాలు, ఎదుర్కొన్న కష్టాలు, ఆయన చెప్పిన కొన్ని విషయాలను వారు తన స్వీయ చరిత్రలో మన కండ్ల ముందు ఉంచారు. 14 ఏప్రిల్ 1891 నాడు అనగా 133 ఏళ్ల క్రితం పుట్టిన అంబేద్కర్ తను అంటరాని కులంలో పుట్టినందుకు 
ఎన్ని అవమానాలు పొందాడు. 
వాటినెలా భరించాడో కానీ, 
తర్వాత తాను చదువుకొని ఉన్నత విద్యాధికుడైయ్యారు. దళిత జాతులకు మార్గదర్శకుడై నిలబడ్డారు. 
అలానే 49 ఏళ్ల క్రితం దార్ల వారు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని కోనసీమ జిల్లాలోని చెయ్యేరు అగ్రహారంలో అంటరాని కులంలో పుట్టారు. ఎన్నో అవమానాలు, కష్టాలు ఎదుర్కొన్నారు. కష్టపడి పట్టుదలతో చదువుకొని, నేడు ఒక కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఆచార్యుడయ్యారు. 
అలా వెలుగొందుతున్న ఈ దళిత బిడ్డ ఆత్మకథ కూడా మామూలుది కాదని నెమలి కన్నులు (మొదటి భాగం) ద్వారా తెలుస్తుంది. ఆ లెక్కన దార్ల వారిని అభినవ అంబేద్కర్ అని అనవచ్చు; పాలేరు నుండి పద్మశ్రీ వరకు ఎదిగిన మరో బోయి భీమన్న అనీ అనవచ్చు. దార్లవారు ప్రతిభావంతులు.గర్వం లేని వారు సహృదయులు. 
 ఈ సమాజం ఏమి మారింది? 
ఎందుకు మారాలి? అనే విషయం ఈ ఆత్మకథ చదువుకుంటే తెలుస్తుంది. ఈ పుస్తకానికి వారు ‘నెమలి కన్నులు’ అనే పేరు పెట్టుకున్నారు. బహుశా వారు తన చిన్న కన్నులతో నెమలిలా ఈ జీవితాన్ని చూసింది చూసినట్లు చెప్పడానికి ఈ ఆత్మకథకు ‘నెమలి కన్నులు’ అనే పేరు పెట్టుకున్నారేమో ! 
నెమలి కన్నులకు మరొక అర్థం కూడా ఉంది. 
అందమైన నెమలి ఈకలను ఏరుకొని చిన్నపిల్లలు తమ పుస్తకాల్లో పెట్టుకుంటారు. అవి మరలా పిల్లలు పెడతాయని వాళ్ళకు అదో సరదా! వాటిని నెమలి కన్నులు అంటారు. ఆ నెమలి కన్నులు పేరుని బహుశా బాల్యం ఎవరికైనా అందంగానే ఉంటుంది. దాన్ని అంతే వాస్తవంగా చిత్రించి, ఆ బాల్యంలో నెమలి కన్నులు దాచుకున్న ప్లే, నాటి జ్ఞాపకాలను దాచుకున్నట్లు నెమలి కన్నులు అని పేరు పెట్టుకున్నారనుకుంటాను.
 ఇక, దార్ల వారి జీవిత కథలోకి మరింత లోతుగా వెళితే వారు బాల్యంలో ఎన్నో కష్టనష్టాలు ఎదుర్కొన్నారు. 
ఎన్నో అవమానాలు చవిచూశారు. 
ఆ విషయం ఈ పుస్తకం చదివిన వారికి తేటతెల్లమవుతుంది. కొన్ని కులాలను అంటరానివనీ, మరికొన్ని అంటుకున్నా ఎలాంటి లోపం లేదని నిర్ణయించడం, దాన్నే ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఆ భావనలే కొనసాగుతున్నాయి. అలా ‘అంటరాని కులం’లో పుట్టినందుకు, ఆ కులం పేరుతో జరిగే అవమానాలు ఎదురైనప్పుడల్లా, దాన్ని బయటికి చెప్పుకోలేని మానసిక సంఘర్షణ సామాన్యమైనది కాదు. ఆ బాధ, ఆ ఆవేదనను, ఎందరో దళిత జాతుల బిడ్డల ఆవేదనగా వారు తన జీవితాన్ని గ్రంథస్థం చేశారు ఆత్మకథ రూపేనా ఈ మొదటి భాగంగా. వారు సెప్టెంబర్ 5, 1973 వ సంవత్సరంలో జన్మించారు. స్కూల్ రికార్డుల ప్రకారం. అలనాడు దళిత కులాల వారి బిడ్డలు పాఠశాలలో చదువుకుంటామంటే వారి పుట్టిన తేదీని అందాజాగానే వేసేవారు గురువులు. అలా వేసిన వారి గురువులు తనకు ఒక మంచి తేదీనే వేశారుని అంటారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సెప్టెంబర్ 5. ఆ తేదీనే దార్ల వారి పుట్టిన రోజుగా వేశారు. అంతేకాదు,  మంచి పేరు కూడా పెట్టారు. అది దార్ల ‘వెంకటేశ్వర రావు’ అని. నిజానికి వాళ్ల అమ్మగారి కోరిక అది. దార్ల వారి జీవిత చరిత్ర మొదటి భాగం బాల్యం గురించి రాసేనాటికి వారు వయసు సుమారు 50. వీరు ఇంత చిన్న వయసులో ఎందుకు ఆత్మకథ రాశారు అంటే వారు కవితాత్మకంగా ఇలా చెప్పారు. 
‘’ఊరి చివరి గుడిసెలో బతికే వాళ్ళం 
కులం అంటగట్టిన అవమానాలు ఇంకా మోయక తప్పని వాళ్ళం 
చూపులతో మాటలతో
నేటికీ నిత్యం నలిగిపోతున్న వాళ్ళం 
మనిషిని చూసినా
మాట విన్నా 
ఏమాత్రం స్పందన కలగని హీనత్వం 
మా కులం పేరు చెప్పినప్పుడల్లా
వాళ్ళ కళ్ళల్లో చూస్తున్న వాళ్ళం 
తాత ముత్తాతల నాటి నుండీ
మడులూ మాన్యాలలూ 
మాకు ఏమీ లేకపోయినా 
తరతరాలుగా వెంటాడుతున్న వృత్తుల్ని 
నిస్సహాయంగా మోస్తున్న వాళ్ళం
 ఆ అవమానాల్ని అనుభవిస్తున్న వాళ్ళం' అని చెప్తూ అలానే ఇంకా అంటారు వారు. 
‘’ఓ మాదిగ కులం నుండి 
యూనివర్సిటీకి వచ్చిన వాణ్ణి
సెంట్రల్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ అయినవాణ్ణి
ఇక్కడే హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ అయిన వాణ్ణి
శ, ష , స ల స్పష్టతకెన్నోసార్లు 
నాలుక తిరగటం లేదని 
మా వాళ్ల గురించి మాట్లాడుతుంటే 
వాళ్ళలా మాట్లాడుతున్నప్పుడల్లా 
ఆ మాటలు సూదుల్లా గుచ్చుకుంటుంటే
భరించలేక వాళ్లకంటే బాగా పలకిన వాళ్ళెంతో మంది మాలో ఉన్నారని చూపించిన వాణ్ణి
ఆ భాషలోనే అధ్యాపకున్ని అయిన వాణ్ణి
అది చాలదానా కథ చెప్పడానికి అనిపించింది.’’అని చెప్పారు వారు ఈ పుస్తకం ప్రస్తావన మొదటి అధ్యాయంలో. 

 ‘మా ఊరి పేరు చెయ్యేరు అగ్రహారం అందులో మేముండేది ‘బ్రాహ్మణ చెరువుగట్టు ‘ . ఒకప్పుడు మా ఊళ్ళో బ్రాహ్మణులు ఎక్కువగా ఉండే వారట ‘ అని చెపుతారు వారు. రెండో అధ్యాయంలో’. ఆ చెరువుగట్టు ఊరికి దూరంగా ఉండేది. ఇంకా వారి ఇంటి పేరు ‘దార్ల’ వారు అని ఎందుకు వచ్చిందనే విషయాన్ని గురించి చెబుతూ ‘ అక్కడ దయ్యాలకు భయపడో ఊరికి దూరంగా ఉండాలనో , ఎందుకో కానీ ఎవ్వరు రాక పోయినా మా పూర్వీకులు ధైర్యం చేసి అక్కడికి వచ్చారు. దారీ తెన్నూ లేని ఆ బ్రాహ్మణ చెరువు గట్టును బాగు చేసి దారి చేసినందుకే వాళ్లకు ‘దార్ల’ వారు అనే ఇంటి పేరు వచ్చిందని చెబుతుంటారు’ అని వివరించారు. దార్ల వారు చాలా ఆత్మాభిమానం, ఆత్మ విశ్వాసం కలవారు. ఆ విషయాన్ని వారు ఇలా చెబుతారు , ఏమని అంటే , ‘మా ఊళ్లో మొట్టమొదటి పీహెచ్డీ చేసింది నేనే, యూనివర్సిటీలో ఉద్యోగం పొందింది నేనే, టీవీలలో మాట్లాడింది కూడా నేనే' అని ఇలా నేనే మొట్టమొదట అని చెప్పుకుంటే నాకు సాహిత్యంలో నేనే మొట్టమొదటి అని చెప్పుకున్న కందుకూరి వారు గుర్తుకు వస్తారు’ అని చెపుతారు వారు. దార్ల వారికి వారి ఊరు మీద అపారమైన ప్రేమ ‘కోనసీమ ప్రేమ కౌగిలిలో మా ఊరు ‘ అనే మూడవ అధ్యాయంలో కవితాత్మకంగా గొప్పగా చెబుతారు. 
ఇంకా దార్ల వారికి వారి నాన్నగారు శ్రమ జీవి అయిన దార్ల అబ్బాయి గారు అంటే అమితమైన అభిమానం , ప్రేమ. 
వారు వాళ్ళ నాన్న గారి గురించి జ్ఞాపకాలను ఇలా చెప్తారు.  
నాన్నా సాయంత్రం చేపల బుట్ట పట్టుకొని నీ వెనకాలే వచ్చేవాణ్ణి 
నువ్వు గబగబా నడుస్తుంటే నువ్వు గమనించావో లేదో గాని 
ఆ రంగరాజు కోడు కాలువ అంతా నీ అడుగుల్లో పరవశించేది 
 ఆ కాల్వలో ప్రవహించే నీరు కూడా నీ స్పర్శతో పునీతమయ్యేది 
 ఆ గట్టునుండే ముళ్లన్నీ నీ అడుగుల కింద మెత్తని పువ్వుల్లా మారిపోయేయి
 నువ్వేమీ వాటిని గమనించేవాడివి కాదు
 ఆ తెల్లని పువ్వుల బుగ్గలప్పుడప్పుడు సిగ్గుతో ఎర్రబడేవి / చేది పరిగెలు , కొర్రమీనులు, కట్టి చేపలు, మీసం మెలేసే పెద్ద రొయ్యలు 
 విషము ముళ్ళతో గుచ్చాలనుకునే ఇంగిలాలు
నీ చేతుల్లో పడేసరికే దొందుల్లాగో
బొమ్మిడాల్లాగో 
మెత్తగా మారిపోయేవి . 
“ అని చెబుతూ
 “నాన్నా , నాకిప్పుడు నువ్వు వలేసి 
పట్టిన ఆ తాజా చేపల్ని 
అమ్మ వర్షములోనే అమ్మేది కదా 
 దాన్ని ఇప్పుడు వండి
 నీకు తృప్తిగా తినిపించాలని ఉంది నాన్నా “ అని నాన్నతో చిన్నప్పుడు గడిపిన రోజులను నెమరేసుకుంటారు .


 అలాంటి తన నాన్నగారి పేరు మీద హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో తెలుగు విభాగంలో ‘దార్ల అబ్బాయిగారి పేరు మీద గోల్డ్ మెడల్’ ఇవ్వడం అనేది ఎంతో ఘనత వహించిన విషయం! ఇక, వారి కుటుంబం గురించి చెబుతూ నాన్న మీద ఆధారపడి ఐదుగురు పిల్లలు, అమ్మ. వాళ్ల నాన్న గురించి చెబుతూ ‘ ఇంట్లోకి కావాల్సినవన్నీ చూస్తూనే మా పేటలో ముందుగా తామే మట్టి గోడలు… తర్వాత ఇటుకలతో ఇల్లు… కట్టారని చెప్తారు. అంతే కాదు ఆ పేటలో మొదటిసారిగా ఇంట్లో కరెంటు వేయించారు. మొదటిసారిగా సైకిల్ కూడా కొన్నారు. మొదటిసారిగా టెలిఫోన్ పెట్టించారు. …. అమ్మకి నాన్న బంగారం కొనేవాడు కాసులపేరు, చెవులకు దిద్దులు , కాళ్ళకు వెండి కడియలు కూడా చేయించాడు . అలా జీవితంలో కష్టపడి పైకి వచ్చి అన్ని సాధించుకున్న మహానుభావుడు వాళ్ళ నాన్నగారు . ఇక, ఏడవ అధ్యాయంలో వారు ఇలా అంటారు” మా పేర్లు మా ఇష్టప్రకారం ఉండవు ! ” దార్ల వారి కుటుంబంలో వారి పెద్దన్నయ్య పేరు సామ్యూల్ రాజు చదువుకొని ఉద్యోగం చేసినాడు. రెండో అన్నయ్య పేరు సత్యనారాయణ చదువుకోలేదు, నేను మూడో వాడిని, నాకు తమ్ముడు ఉన్నాడు. వాడి పేరు రవికుమార్. చదువుకున్నాడు. బాగా డిగ్రీలు తెచ్చుకున్నాడు , ఇక వారి చెల్లి పేరు విజయ కుమారి . “ నా పేరు ఎలా రాశారో నా పుట్టిన తేది ఎంత వేశాలో, దేన్ని ఆధారంగా చేసుకుని నా పుట్టిన తేదీ ఎలా నిర్ణయించారో ఆనాటి మా బడి పంతుల్లకే తెలుసు ‘ అంటారు వారు. వారి ఆత్మకథలో ఎనిమిదో అధ్యాయంలో ఇలా ఉంటుంది “అరుంధతిదేవి మన ఆడపడుచే ! మహాభారతం రాసింది మీ తాతగారే ! “ అని వాళ్ల అమ్మ అనేక కథలు చెప్పేది అంటారు వారు . ఎలా అంటే, అరుంధతి వారి ఆడబిడ్డ ఆమెను పెళ్లి చేసుకున్న వాడు వశిష్ఠుడు, వీళ్లిద్దరికి వందమంది సంతానం. అందులో పెద్దవాడు శక్తి మహర్షి. శక్తి మహర్షి భార్య అదృశ్యంతి. వీళ్లిద్దరికి పుట్టిన వాడు పరాశరుడు. పరాశనుడికి సత్యవతికి పుట్టినవాడు వ్యాసుడు. ఆ వ్యాసుడే మహాభారతం రాసాడు . ఆ వంశానికి చెందిన వాళ్ళమే మనమంతా …..అందుకనే మీరు బాగా చదువుకోవాలి. అరుంధతి ఇలాగే మన పిల్లలంతా అంతే నీతిగా కూడా జీవించాలి. ఆమె అలా జీవించింది . కాబట్టే, ఋషులతో పాటు ఆమె కూడా ఆకాశంలో ఒక నక్షత్రములా మెరుస్తుంది . అందరి చేతా పూజించబడుతుంది “ అని మా అమ్మ మాకు కథ చెప్పేది అని వ్రాస్తారు . అలా దళిత జాతులకు అరుంధతి, వశిష్టులు, వ్యాసుడు గొప్ప స్ఫూర్తి. ఇక తొమ్మిదవ అధ్యాయంలో ఈ సమాజంలోని అంచలంచల కుల వ్యవస్థలోని దొంతరలను గురించి చెబుతూ , “ నాకు తెలిసినంత వరకూ గ్రామమంతా కులాల దొంతరగానే ఉంటుంది. ఫలానా వాళ్ళని గుర్తించాలన్నా ఆ కులంతోనే సూచిస్తారు. ఆ పూజారి గారబ్బాయనో, పంతులుగారనో పిలుస్తారు. ఆ రాజుగారనో, ఆ కోమటాయననో, ఆ కాపు గారనో, ఆ మంగలాయననో, ఆ మాలోడనో, ఆ మాదిగోడనో…….. ఇంకా కాస్త స్పష్టంగా తెలియడానికి పేర్లని కూడా జత చేస్తుంటారు. “ అని చెపుతారు. “నాగుండెల్లో బాకులు గుచ్చిన జెండా పండుగ’ అనే సంఘటన గురించి పదవ అధ్యాయములో చెపుతారు ఇలా.
“క్లాస్ లీడర్లంతా ముందు నిలబడినట్లే ఆరోజు నేనూ నిలబడ్డాను. కానీ ఎందుకు వెనక్కి వెళ్ళమన్నారు? నా బట్టలు బాగాలేవా? నేనేమైనా స్నానం చెయ్యలేదా? నేనేమైనా తల దువ్వుకోలేదా? నాకేమైనా మాట్లాడ్డం చేతకాలేదా? నా కేమైనా నత్తి ఉందా? నా కేమైనా అవయవాల లోపముందా? ఇలాంటి ప్రశ్నలెన్నో వేగంగా దూసుకొస్తూ బాణాల్లా నాకు గుచ్చుకుంటున్నట్లు అనిపించింది. “ అంటూ ఆవేదన చెందుతారు వారు. ఒక సందర్భంలో వారు ఇలా చెపుతారు. “ బాల్యం కొంత మందికి ఆటల పల్లకీ             
బాల్యం కొంతమందికి పూలపరిమళం. కానీ, నా బాల్యం అలా సాగలేదు. ఒక్కోసారి నిప్పుల కుంపటి ఒక్కోసారి ముళ్ల కిరీటం ” అంటారు వారు తాను అనుభవించిన జీవితాన్ని చూసి. చిన్నపుడు తను వాళ్ల ఊరిలో ఐదవ తరగతి చదువు అయిన తర్వాత, ఆరవ తరగతి కోసం పక్కూరు కాట్రేనికోన గ్రామానికి రోజు ఏడు ప్లస్ ఏడు కిలో మీటర్లు నడుచుకుంటూ వెళ్లి వచ్చేవారు. వాళ్ల బడిలో అందర్నీ వాళ్ల లెక్కల మాస్టర్ మొదటి రోజు మీరు భవిష్యత్తులో ఏమి అవుతారని అడిగితే దార్ల వారు ‘నేను ప్రొఫెసర్ ను అవుతా ‘ అంటాడు. అలా చెప్పినందుకు వాళ్ళ గురువు చిన్నారి దార్ల వారిని “ పప్పు సార్ “ అని వెటకారంగా పిలిచే వాడు హాజరు తీసూకునేటప్పుడు. చాలా మంది గురువులు దార్ల వారిని మెచ్చుకునే వారు , ప్రోత్సహించే వారు ఒకరిద్దరు తప్పా! వారు తన ఆవేదనని  ఆత్మ విశ్వాసాన్ని క్రింది విధంగా చెపుతారు.  
        
‘ వాళ్ళు నా ఆశల్ని మొగ్గలోనే తుంచేయాలనుకున్నారు.
నేనేమో నా ఆశల్ని ఆకాశమంత ఎత్తుకెగరేశాను.
వాళ్ళు నా జీవితాన్ని పాతాళంలోకి తొక్కెయ్యాలనుకున్నారు. 
నేనేమో నేలకు కొట్టిన బంతినై 
మరింత పైకెళ్ళేలా ప్రయత్నించాను. 
వాళ్ళు నన్ను లేవకుండా ముళ్ళపొదల్లోకి విసిరేయాలనుకున్నారు
 నేనేమో ఆ ముళ్ళ పొదల్నే. రక్షణకవచాలుగా చేసుకుని ఓ పూలమొక్కనై పరిమళించాను

 “ పదహారవ అధ్యాయంలో “ జుట్టు కటింగ్ - చెంబు ఇస్త్రీ “ గురించి చెప్పారు వారు. అంటరాని కులం లో పుట్టిన వారికి మంగలి కటింగ్ చేయడు, చాకలి బట్టలు ఉతికి ఇస్త్రీ చేసి ఇవ్వడు. ఇది అంచెలంచెల కుల వ్యవస్థ ఉన్న సమాజం. అంబేద్కర్ నుండి నేటి దార్ల వారి వరకు ప్రత్యక్షంగా చవి చూసిన విషయాలు ఇవన్నీ.. పదిహేడవ అధ్యాయంలో ‘ నేను ఒక సైకిల్ కు ఓనరయ్యాను’ అని సంబుర పడి చెపుతాడు. 
‘ఆదివారం గానీ, సెలవు రోజులు గానీ వస్తే, నేను కూడా పొలం పనికి వెళ్ళేవాడిని , నాకు కూడా కూలిపనికి జీతం ఇచ్చేవారు.’ అని చెపుతాడు. నా తోటి పేదింటి బిడ్డలకు కూడా అనుభవం లోని విషయాలు ఇవి. పద్దెనిమిదవ అధ్యాయంలో ‘ ఆ విషయంలో రజకులే నాకు ఆదర్శం ‘ అంటాడు.

 “ ఆ రజకులంటే
నిలువెత్తు శ్రమ సంకేతాలన్నట్లనిపించింది. 
వాళ్ళు పనిపట్ల చూపే అంకితభావం
నాలో గొప్ప ఆత్మవిశ్వాసానికి ప్రేరణ కలిగించింది.
పొద్దున్నే పొద్దుని లేచే
 వాళ్ళ సమయపాలన నాకో ఆదర్శాన్నిచ్చింది” అంటారు వారు.

 వాళ్ల అంకిత భావాన్ని , క్రమ శిక్షణను ఆచరణ లోకి తెచ్చుకొని. 
పందొమ్మిదవ అధ్యాయంలో “ మా యింటి కల్పవృక్షం” అని తాడిచెట్టు యొక్క వినియోగం పేదవారి జీవితలో ఎంతగా ఉంటుందో చెపుతాడు. ఇంకా ‘ పేదరికానికి కులం తోడైతే, అది కొంతమందికి సమాజంలో ఆత్మ గౌరవ సమస్యగా మారుతుంది. ఇంకొంతమందికి ఆత్మగౌరవాన్ని కాపాడు కుంటునే , ఆ కుటుంబాన్ని ముందుకి లాక్కెళ్ళాలంటే, వాళ్ళంతా ఏదో ఒకపని చేయక తప్పని పరిస్థితి. ……ఎలాగైనా రెండు పూటలా తినాలంటే ప్రతి రోజూ పని ఉండాలి ‘ అని చెపుతారు.  
బతుకులోని కష్టాలు, బతకడం లోని కష్టాలు తెలిసిన వారు దార్ల వారు. ఇరువైయ్యొకటవ అధ్యాయంలో వారు పాలేరు తనం గురించి చెపుతారు. దార్ల వారి చిన్న అన్నయ్య చదువుకోలేదు. కాబట్టి వాళ్ల ఊరిలోని ఒక కోమటి కుటుంబానికి పాలేరుగా ఉంటాడు. ఒక ఆదివారం నాడు వాళ్ళ చిన్నన్నయ్య పనికి పోలేక పోతే ఆనాడు అతనికి బదులుగా పాలేరు పనికి వెళ్తాడు చిన్నారి దార్ల. పాలేరుతనం అంటే పశువుల పెండ తియ్యాలి, దొడ్డి ఊడువాలి, వాటికి నీళ్ళు పెట్టాలి, పశువులను మేపుకొనిరావాలి, ఇంకా ఇంట్లో వాళ్ళు చెప్పిన పనులు చెయ్యాలి. ఇవన్నీ పనులు చేసి పశువుల మేపుకొని వచ్చే వరకు మధ్యాహ్నం అయ్యింది. బాగా ఆకలి అవుతుంది. కంచం కడుక్కోవడానికి కూడా మంచి నీళ్ళు కావాలంటే పొయ్యలేదు. పశువులు త్రాగే నీళ్ళ తోనే కంచం కడుక్కొమ్మన్నారు. వాళ్ల ఇంటి చూరు దగ్గర కూర్చోమన్నారు. నిన్నటిదో, మొన్నటిదో పాచి పోయిన అన్నం కూర పెట్టారు. అది తిని వెంటనే వాంతి చేసుకుంటాడు చిన్నారి దార్ల. “మామ్మగారూ... దీన్నే మీ మనవలకీ పెట్టారా? అని అడిగాను. అంతే అమ్ములుగారికి ఎక్కడలేని కోపం వచ్చేసింది. "మా వాళ్ళకంత కర్మేమొచ్చిందిరా. మీరంతా ఏ జన్మలోనో పాపం చేసుకున్నారు. కాబట్టే మాలాంటోళ్లకి సేవచేయాలని దేవుడే ఆదేశించాడు. మా దగ్గర పని చేస్తున్నారు. కనుకనే ఈ పాచి మెతుకులైనా దొరుకుతున్నాయి. లేకపోతే అవీ మీకు దిక్కులేదు. బళ్లోకెళ్తున్నావు కదా….. అందుకే నీకు ఈ గీర…ఆ గీర తీర్చడానికేరా నీకీ అన్నం పెట్టాను.. "ఇంకా ఏదేదో అంటూ మీది మీదికొచ్చేస్తుంది. కొట్టడానికే నా దగ్గరకు వస్తుందని అర్థమైపోయి ఆమె ఏమంటుందో నాకు ఇంకేమీ వినిపించడం లేదు. ఆ చుట్టూ ఎవరున్నారో కూడాపట్టించుకోలేదు. నా గిన్నె తీసుకున్నాను. ఏమైతే అయ్యిందనుకున్నాను. కంచంలోని అన్నంతో సహా ఆమె ముఖానికి తగిలేటట్టు గట్టిగా విసిరేశాను. గబగబా పాకలోకి వచ్చి ఆవునీ, గేదెనీ ఇప్పేశాను. అవి ఒక్కసారిగా బయటకు పరిగెట్టడం మొదలు పెట్టాయి. వాటి వెనుకే నేనూ పరుగు పెట్టుకుంటూ, కొంత దూరం వెళ్ళాక, వాటిని వదిలేసి, నేను మా ఇంటికొచ్చేశాను.” ఇది దార్ల వారి జీవితంలోని ఒక హృదయ విదారక మైన సన్నివేశం. 

చిన్నతనంలో దార్ల వారు వారి అమ్మకు చేదోడు వాదోడుగా ఉండాలని ఇంటి పనులు కూడా చేసే వారు.ఇరవై మూడో అధ్యాయం ‘హాస్టల్ - అంబేద్కర్ జయంతి’ లో తను హైస్కూల్లో చదువుకుంటున్నపుడు హాస్టల్ సెక్రెటరీగా ఉన్నపుడు ఏప్రిల్ 14 అంబేద్కర్ జయంతి నాడు తను వక్తలతో పాటు వేదికపై కూర్చుండి అంబేద్కర్ గురించి ఆ వక్తల ఉపన్యాసాలు విని గొప్పగా స్ఫూర్తిని పొందాను అని చెపుతారు. తన చిన్ననాడు విన్న బొబ్బిలి యుద్ధం, సత్య హరిశ్చంద్ర, అంబేద్కర్ బుర్ర కథలను నెమరేసుకుంటాడు , తనతో పాటు వాళ్ల ఇంటికి వచ్చి రాత్రి పూట చదువుకున్న మిత్రుల గూర్చి చెపుతాడు. ఆత్మ కథలోని తర్వాతి అధ్యాయంలలో తను కులం సర్టిఫికెట్ తహసీల్దార్ ఆఫిస్ నుండి పొందడానికి పడ్డ అగచాట్లు చెపుతాడు. తను పదవ తరగతిలో లెక్కల్లో రెండు మార్కులతో ఫెయిల్ అయినప్పుడు అందరూ తనను చిన్న చూపు చూసినపుడు తనకు ఎటైనా పారిపోవాలి అనిపిస్తుంది. అలాంటి సందర్భంలో ఎందుకు పారిపోయి వచ్చావు, మరొకటి మీది ఏ కులం? అనే ప్రశ్నలు వస్తాయి కదా అని తలుస్తాడు. దీనిలో కులం గురించి చెప్పినప్పుడు తను ఎంత క్షోభ పడవలసి వస్తుందో, సమాజం ఎంత చిన్న చూపు చూస్తుందో కదా అనే విషయాన్ని మన ముందు ఉంచుతాడు. తను హాస్టల్ లో ఉంటున్నప్పుడు అంబేద్కర్ గురించి తెలుసుకుంటున్నపుడు తను జీవితం గురించే తెలుసుకున్నట్లు అనిపించేదని చెపుతాడు. తను చిన్నప్పుడు ఉపన్యాసాలలో ఏమి మాట్లాడేవాడనే విషయాల్ని నెమరేసుకుంటూ ‘ … చాతుర్వర్ణ వ్యవస్థ గురించి, ఆస్తి అంతా కొంతమంది దగ్గరే కేంద్రీకృతం కావడానికి లేదా ఆస్తులు సంపాదించడానికి గల కారణాలని, దళితులు అభివృద్ధిలోకి రావాలంటే పాటించాల్సినవీ, పాటించకూడనివీ నాకు తెలిసిన వాటిని చెప్పి ఉంటాను. ‘ అంటాడు. ఇవి ఈ సమాజ మార్పునకు కావలసిన మౌలికమైన అంశాలు. వాటిని గురించి చిన్ననాడే ఆలోచించిన దార్ల వారు నిజంగా అభ్యుదయవాది. సమాజ శ్రేయోభిలాషి. చివరి అధ్యాయం “ యుద్ధం మొదలైంది” లో వారు. 'కులం మనిషిని ఏకం చేసినట్లు పైకి కనిపిస్తున్నా, అది కనిపించకుండా మనుషుల్ని విడదీస్తుంది. కులం, మతం విషబీజాలతో ప్రతి మనిషినీ విడదీస్తుంది. కులంనుండి మతాన్ని, మతంనుండి కులాన్నీ విడదీసి చూడ్డం అసాధ్యం.” అంటారు. ఇంకా “భారతదేశంలో హిందూమత మూల భావాలున్న వేదాలు, ఉపనిషత్తులు, పురాణేతిహాసాల ప్రభావంలేని మతమేదైనా ఉంటే, ఆ మతంపై హిందూమత ప్రభావం పనిచేయని, కులం లేని మతాన్ని చూడ్డం అసాధ్యం. వీటిని జయించి మనిషిగా నిలబడాలంటే హిందూ సమాజం నుండి వచ్చిన కొన్ని కులాల వారికి నిత్యం యుద్ధం చేయడం లాంటిదే.

అది ప్రత్యక్షంగా కనిపించకుండా జరిగే యుద్ధం.
రక్తం కారని యుద్ధం.
ఆయుధాలు లేని యుద్ధం.
మాటలతో, చేతలతో మానసికంగా చంపేసే యుద్ధం
ఆర్థికంగా నలిపేసే యుద్ధం.
 ఆధిపత్యాన్ని చెలాయించే యుద్ధం.
మనిషిగా బ్రతకడం కోసం చేసే యుద్ధం
ఆత్మగౌరవంతో నిలబడాలంటే నిత్యం యుద్ధం తప్పదు. జీవితం ఒక యుద్ధక్షేత్రం.
 ఆ క్షేత్రాన్ని మనం విడిచిపోలేం.
యుద్ధంలో విజేతలుగానో పరాజితలుగానో తేలేవరకూ
భారత దేశంలో కులం చేసే యుద్ధం
మనకు తెలియకుండానే సింహంపై కూర్చొని,
 దానితో చేసే యుద్ధంలాంటిదే! “ అంటారు

ఇవి రచయిత చెపుతున్న మాలిక మైన అంశాలు. పరిష్కారాలు కావలసిన ప్రశ్నలు ! 

పుస్తకం ముగింపులో బాల్యం గురించి అందంగా చెపుతాడు.      
   
బాల్యం ఒక చెలమ లాంటిది.
నీళ్లు ఎన్నో లేవనిపిస్తుంది.
ఆ నీళ్లు తోడేయగానే మరలా నీళ్లు ఊరి పోతాయి.
జ్ఞాపకాలూ, ఆ బాల్య జీవితమూ అంతే.
ఇంకేముందని అనిపిస్తుంది.
గతంలోకి వెళ్ళగానే 
మళ్ళీ దొంతర దొంతరలుగా, 
అలలు అలలుగా,
పొరలు పొరలుగా 
కనిపించే జీవితంలా బయటకొస్తుంది.” అంటారు వారు తన ఆత్మకథ “ నెమలి కన్నులు “లోని మొదటి భాగంలో.                                                                         
దార్ల వారి ఆత్మకథ “ నెమలి కన్నులు” చదివిన వారికి వారిపై గౌరవ భావం పెరుగుతుంది. అతని జీవితం యువతకు ఆదర్శంగా నిలుస్తుంది. నిజంగా వారి జీవితంపై ఒక దృశ్య కావ్యం డాక్యుమెంటరీని నిర్మించవచ్చు. వారి పుస్తకాన్ని విశ్వ విద్యాలయాలు విద్యార్థులకు పఠనీయ గ్రంథంగా పెట్టవచ్చు. ప్రభుత్వాలు వారి పుస్తకానికి అవార్డులు ప్రకటించవచ్చు. దేన్నీ దాచుకోకుండా, నామోషీ పడకుండా, నిజాయితీగా వారి జీవిత బాల్యాన్ని రికార్డు చేశారు. అదొక పెద్ద సాహసం. అందాల కోనసీమ చెయ్యేరు అగ్రహారంలో దార్ల వారి ఇంటిలో పుట్టిన ఈ దార్లవారి అబ్బాయి అభినందనీయుడు ఎన్నో విషయాలకు. కవితాత్మకంగా ఎన్నో కవితావాక్యాలు, ఆత్మకథా భాగాలు ఈ పుస్తకంలో మనం చదువుకోవచ్చు . జీవితాన్ని నిశితంగా గమనించిన స్పురద్రూపి. జీవితాన్ని బాల్యంలో చేజారిపోకుండా ఒడుపుగా పట్టుకున్న ఒక సాహస బాలుడు. తన జీవిత లక్ష్యాలను చిన్ననాడే ఏర్పరచుకున్న ధీరుడు. తను అనుకున్నట్లు ఒక విశ్వద్యాలయ ఆచార్యుడై , వినయశీలిగా ఎందరో మన్ననలు పొంది ఉన్నాడు. అతని జీవిత కథ చదువుతూ ఎందరో పేదింటి బిడ్డలు తమ జీవితాన్ని దానిలో చూసుకునే సందర్భాలు కనిపిస్తాయి. జీవితాన్ని జయించిన ధీరుల్లా కనిపిస్తారు అత్మ విశ్వాసంతో కొందరు. అలాంటి కోవలోకి చెందిన వారు దార్ల వెంకటేశ్వరరావుగారు. వారి అత్మ కథను చక్కగా మలచిన దార్ల వారికి మనస్పూర్తిగా అభినందనలు.
 - డా.సబ్బని లక్ష్మీ నారాయణ.            


కామెంట్‌లు లేవు: