"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., Ph.D., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL 801 Research Methodology ఉదయం11.00 నుండి12.00 గంటల వరకు, TL-426: Indian Literature క్లాసులు మధ్యాహ్నం 2.00 గంటల నుండి 3.00 గంటల వరకు జరుగుతాయి.

నాలో మిగిలిన నేను లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
నాలో మిగిలిన నేను లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

11 ఆగస్టు, 2026

నాలో మిగిలిన నేను- 7

 నాలో మిగిలిన నేను



(దీర్ఘ కావ్యం)

7. నీడ

నడుస్తున్నది నేనొక్కడినే

నా వెంటమరొక నడక

అది అడుగుల శబ్దం చేయదు

 నేను ఆగితే ఆగుతుంది

 నేను కదిలితే కదులుతుంది

ఉదయం

 అది నా వెనుకే ఉంది.

సూర్యుడు

 నా ముందుకు వచ్చేకొద్దీ

 అది నన్ను అనుసరిస్తూనే ఉంది.

మధ్యాహ్నం

 నా పాదాల కింద

 ముడుచుకుంది.

నా అడుగుల మధ్య చిన్నదైపోయింది.

అప్పుడు

 దాని ఉనికి

 దాదాపు కనిపించలేదు.

మనిషి జీవితంలో కూడా

 కొన్ని బంధాలు

 అలానే ఉంటాయేమో!

దూరంగా ఉన్నప్పుడు

 పెద్దవిగా కనిపిస్తాయి.

చాలా దగ్గరగా వచ్చినప్పుడు

 తమను తాము

 చిన్నవి చేసుకుంటాయి.

సాయంత్రం

 నన్ను దాటి ముందుకు వెళ్లింది.

నేను వెనుక నడుస్తున్నట్టు,

 అది ముందుగా

 నా దారిని చూసుకుంటున్నట్టు

ఎండ దిశను మార్చింది

నీడ నిశ్శబ్దాన్ని మార్చింది

చిన్నప్పుడు దాన్ని ఆటగా చూశాను

నా చేతులను పైకెత్తితే

 అది కూడా పైకెత్తేది

నేను పరుగెత్తితే

 అది నా వెంటే పరుగెత్తేది

నేను ఒక్కసారిగా ఆగితే

 అది కూడా ఆగేది.

అది నన్ను అనుకరిస్తుందని

 అనుకున్నాను

అది నన్ను

 ఎప్పటినుంచో చదువుతోందని

 అప్పుడు నాకు తెలియదు

యవ్వనంలో

 దాని ఉనికిని నేను పట్టించుకోలేదు.

నా ముందు

 ప్రపంచం పెద్దగా కనిపించింది

నా వెనుక

 ఏమి నడుస్తుందో

 చూడడానికి అప్పుడు నాకు సమయం లేదు

వెలుగు వైపేపరుగెత్తాను

నీడ మాత్రం నా వెనుకే వచ్చింది.

ఎత్తులకు వెళ్లాను

అది కూడా

 నా వెంట ఎక్కింది

జనం మధ్య నిలబడ్డాను

అది

 నా పాదాల దగ్గర

 ఒంటరిగానే నిలబడింది

చప్పట్ల మధ్య

 నేను నా పేరును విన్నాను

నీడ

 ఏమీ విననట్టు

 నిశ్శబ్దంగా ఉంది

అవమానాల మధ్య

 నేను నా మౌనాన్ని మోశాను

నీడ

 ఆ మౌనానికి

 మరో రూపమై నిలిచింది

గోడ మీద

 అది నాకంటే

 పెద్దగా కనిపించింది

నేను చిన్నగా అనిపించాను

నా నీడ

 నా కంటే పెద్దదిగా కనిపించింది 

అప్పుడు అనిపించింది

మనిషి తన జీవితాన్ని

 తాను చూసుకున్నంత చిన్నగా

 తన నీడ

 ఎప్పుడూ చూడదేమో!

గోడ మీద

 నా భుజాలు విస్తరించాయి

నా తల

 అసాధారణంగా పొడవైంది

నా చేతులు

 నాకు తెలియని దూరాల వరకు

 చేరుకున్నాయి

వెలుగు మారగానే

 నా ఆకారం కూడా మారింది

అప్పుడు తెలిసింది

రూపం

ఎప్పుడూ మనది కాదు

వెలుగు మారితే

 మన గురించి

 ప్రపంచం చూసే విధానం కూడా మారుతుంది

నీళ్లలో

 నా నీడ

 అలలతో పాటు విరిగిపోయింది

నేను

 నీళ్లలోకి వంగి చూశాను

నా ముఖంచెదిరిపోయింది

నా ఆకారంముక్కలైపోయింది

నీడకు

 ముఖం ఉండదని

 అప్పుడే గుర్తొచ్చింది.

అది

 నా రూపాన్ని మాత్రమే మోస్తుంది

నా వయసును కాదు

నా పేరు కాదు

నా పదవిని కాదు

నా మీద

 ఇతరులు పెట్టిన

 ఏ పేరునూ కాదు

దుమ్ము దారిలో

 అది నా అడుగుల ఆకారాన్ని

 ధరించింది

ప్రతి అడుగుకీ ఒక నీడ.

ప్రతి మలుపుకీ ఒక మార్పు

నేను ఎక్కడ ఆగానో

 అది కూడా అక్కడే నిలిచింది

నేను ఎక్కడ తిరిగానో

 అది కూడా నాతోనే తిరిగింది

నేను తప్పిపోయినప్పుడు

 అది మాత్రమే

 నా వెంట ఉంది.

దారి చూపలేదు

దారి తప్పుపట్టలేదు

నా గురించి

 ఒక్క ప్రశ్నా అడగలేదు

నేను ఎందుకు వచ్చానని

 అడగలేదు

ఎక్కడికి వెళ్తున్నావని

 అడగలేదు

ఎందుకు ఆగిపోయావని

 అడగలేదు

ఎందుకు తిరిగి చూశావని

 అడగలేదు

నా మౌనాన్ని

 ఎప్పుడూ అడ్డుకోలేదు

నా కన్నీటిని

 ఎప్పుడూ తుడవలేదు

నా నవ్వును

 ఎప్పుడూ తనదిగా చేసుకోలేదు

నేను ఎలా ఉన్నానో

 అలానే

 నన్ను వెంట తీసుకెళ్లింది

అది

 నా జీవితంలో

 ఏమీ మార్చలేదు

నా జీవితాన్ని

 వదిలిపెట్టలేదు కూడా

అచ్చం నా సహచరిలాగే!

కొన్ని తోడ్పాట్లు

 అలానే ఉంటాయేమో

మనిషిని మార్చకుండా

 అతనితో పాటు

 మారుతుంటాయి

ఒక రోజు

 నేను పరుగెత్తడం ఆపేశాను

నీడ కూడా

 నాతో పాటు

 నెమ్మదించింది

ఒక బెంచీ మీద

 కూర్చున్నాను

నా పక్కనెవరూ లేరు

నా ముందు పొడవైన దారి.

నా వెనుకచాలా సంవత్సరాలు

నేల మీదనా నీడ

దాన్ని చూస్తూ

 చాలాసేపు కూర్చున్నాను

మొదటిసారి

 దానిని

 నా సొంతం అనిపించలేదు

అది

 నన్ను అనుసరించినది కాదు

నేను

 దాన్ని అనుసరించినట్టనిపించింది

నా కదలికలన్నింటినీ

 అదే మౌనంగా సేకరించుకుంది.

నా బాల్యం

నా తొందర

నా కోపం

నా ప్రేమ

నా బాధ్యతలు

నా ఒంటరితనం

నా మాటలు

నా చెప్పని మాటలు

నేను మర్చిపోయిన

 అనేక దృశ్యాలు

 దాని నడకలో

 ఇంకా ఉన్నాయేమో!

సాయంత్రం

కొంచెం పొడవైంది

నీడ కూడా!

సూర్యుడు

 దూరంగా దిగుతున్నాడు

నా నీడ

 ముందుకు సాగుతోంది

ఇద్దరం

 మాట్లాడుకోలేదు

ఆ నిశ్శబ్దం

 చాలా దూరం నడిచింది

ఒక దశలో

 నీడ

 నా ముందే ఆగింది

నేను

 దాని దగ్గరకు వెళ్లాను

మా మధ్య

 వెలుగు మాత్రమే ఉంది

అది

 నన్ను తాకలేదు

నేను

 దాన్ని తాకలేకపోయాను

అయినా

 ఎన్నో సంవత్సరాలుగా

 మా మధ్య

 ఒక విడదీయలేని సంబంధమేదో ఉంది

అప్పుడు

 నాకు ఒక విషయం అర్థమైంది

మనిషి తనను తాను

 ఎప్పుడూ పూర్తిగా చూడలేడు

తన ముఖాన్ని అద్దంలో చూస్తాడు

తన శరీరాన్ని నీడలో చూస్తాడు

తన జీవితాన్నిజ్ఞాపకాల్లో చూస్తాడు

తన అసలు రూపాన్ని

 తన వెంట నడిచిన

 నిశ్శబ్దంలో మాత్రమే

 ఎప్పుడో ఒకసారి వింటాడు

ఇప్పుడు

 నేను నా నీడను చూడడం లేదు

దాని నడకలో నన్ను నేను వింటున్నాను

నా అడుగు పడకముందే

 అది నన్ను గుర్తుపడుతోంది

నేను తిరిగి చూడకపోయినా

 అది నా వెనుక ఉంది

నేను ముందుకు వెళ్లినా

 అది నా వెంట ఉంది

ఒకరోజు

 వెలుగు నన్ను దాటి

 ఎక్కడికో వెళ్లిపోతుంది

నా అడుగులుఆగిపోవచ్చు

నా స్వరం నిశ్శబ్దమైపోవచ్చు

నా పేరు

 ఎక్కడో ఒక పుస్తకంలో

 మిగిలిపోవచ్చు

అప్పుడు

 నా నీడకు ఏమవుతుందో

 నాకు తెలియదు!

బహుశా

 అది కూడా

 వెలుగులో కలిసిపోతుంది!

లేకపోతే

 ఎవరైనా ఒకరు

 నా దారిలో నడుస్తూ

 తన పక్కన పడిన

 ఒక పొడవైన నీడను చూసి

 తనను తాను

 గుర్తుపట్టుకోవచ్చు

అంతవరకూ

 నేను నడుస్తూనే ఉంటాను

నా వెంట

 నడిచే ఆ నిశ్శబ్దంతో.,.,

 దార్ల వెంకటేశ్వరరావు 11.8.2026


10 ఆగస్టు, 2026

నాలో మిగిలిన నేను- 6

 నాలో మిగిలిన నేను

(దీర్ఘ కావ్యం)



6. తలుపు

ప్రతి ఇంటికీ ఒక తలుపు.

ప్రతి మనసుకీ ఒక చప్పుడు.

నా తలుపు

ఎప్పటి నుంచో

నాలోనే ఉంది.

ఎన్నిసార్లు తెరిచానో గుర్తులేదు.

ఎన్నిసార్లు మూసుకున్నానో లెక్కలేదు.

తలుపు చప్పుడికి

ఒక వయసుంటుంది.

చిన్నప్పుడు

అది పరుగెత్తే కాళ్ల శబ్దం.

ఆ వయసులో

తలుపు అంటే బయటికి వెళ్లే దారి.

బయట అంటే తెలియని ప్రపంచం.

కొంచెం ఎదిగాక

తలుపు చప్పుడు

ఎదురుచూపుల శబ్దమైంది.

ఎవరో వస్తారని

చెవులు గుమ్మం వైపు తిరిగేవి.

ఒక అడుగు వినిపిస్తే

గుండె ముందుగా తలుపు తెరిచేది.


ఇప్పుడు

అది గాలి

నెమ్మదిగా లోపలికి వచ్చే శబ్దం

తెర కదిలినంత మాత్రమే.

వెలుగు

నేల మీదికి జారినంత మాత్రమే.

గది నిండా

ఎవరో కనిపించని మనిషి

నడిచినట్టుగా

ఒక మృదువైన అలికిడి.


ఒకప్పుడు

గుమ్మం దాటిన ప్రతి అడుగూ

కొత్తదనాన్ని తీసుకొచ్చేది.

ఇప్పుడు

అడుగులు

తమ ప్రతిధ్వనిని మాత్రమే తీసుకొస్తున్నాయి.

వెళ్లిపోయిన అడుగుల

చప్పుడు కూడాతలుపులకు గుర్తుంటుందేమో.

తలుపు గడియ ఇప్పటికీ అదే చోటుంది.

తిరిగింది మాత్రం నా చేయి.

మారింది మాత్రం ఆ స్పర్శ.

చిన్ననాటి చేతి వేళ్లు

గడియను పట్టుకున్నప్పుడు

అది ప్రపంచాన్ని తెరిచినట్టుండేది.


ఇప్పటి వేళ్లు

అదే గడియను తాకినప్పుడు

తెరుచుకునేది ఒక గది కాదు

ఒక కాలం.

గడియ చుట్టూ

చేతుల వయసు పేరుకుపోయింది.

ఎన్నో తొందరలు.

ఎన్నో నిరీక్షణలు.

ఎన్నో తిరిగివచ్చిన సాయంత్రాలు.

ఎన్నో వెళ్లిపోయిన ఉదయాలు.

కొన్ని రాకలు

ఇప్పటికీ

గుమ్మం దగ్గరే నిలిచిపోయాయి.

కొన్ని వెళ్లిపోవడాలు

ఇంకా

తలుపు చెక్కల్లోనే శ్వాసిస్తున్నాయి.

ఒకసారి

ఎవరో తలుపు మూసి వెళ్లారు

తలుపు మూసుకుంది.

ఇల్లు మాత్రం

ఆ చప్పుడిని

చాలా కాలం తెరిచే ఉంచింది

కొన్ని వీడ్కోళ్లు

తలుపు మూసుకున్న తర్వాతే

తమ అసలు అర్థాన్ని చెబుతాయి.

కొన్ని రాకలు

మనిషి వెళ్లిపోయిన తర్వాతే

గదిలో కనిపిస్తాయి.

ఒక కుర్చీపై మిగిలిన మడతలో.

ఒక గోడపై ఆగిపోయిన చూపులో.

ఒక గడియారం మధ్యలో నిలిచిపోయిన క్షణంలో.

ఈ మధ్య

తలుపు తెరవడం కంటే

వినడమే ఎక్కువైంది.

బయట ఎవ్వరూ లేరు.

లోపల

ఎవరో నెమ్మదిగా నడుస్తున్నారు.

ఆ అడుగుల లయనాకు తెలిసినట్టే ఉంది.


ఒకప్పుడు

ఈ గదులన్నీనన్ను గుర్తుపట్టేవి.

ఇప్పుడు

నేను వాటిని గుర్తుపట్టడానికి

కొంతసేపు నిలబడాలి.

గోడలపై

నా నీడల వయసు పెరిగింది.

నేలపై

నా అడుగుల దూరం మారింది.

కిటికీ దగ్గర

నేను నిలిచిన చోట వెలుగు మారిపోయింది.

తలుపు మాత్రం

అదే ప్రశ్నతో ఉంది

ఎక్కడికి?

నేను సమాధానం చెప్పలేదు.

ఇప్పుడు నాకు

వెళ్లాల్సిన దారి కంటే

తిరిగి రావాల్సిన చోటే ముఖ్యమైపోయింది.

నేనే

నా గుమ్మం దగ్గరకు వచ్చి నిలబడ్డానేమో.

బయట నుంచి

నన్ను నేను చూసుకున్నన్నట్టుంది.

లోపల

నన్ను ఎవరోఎదురుచూస్తున్నట్టుంది.

తలుపు మధ్యలో

ఒక పలుచని వెలుగు.

ఆ వెలుగులో నా చిన్ననాటి ముఖం.

దాని వెనుక యువకుడైన నేను.

మరో అడుగు లోపల

కుటుంబం కోసం పరుగెత్తిన నేను.

ఇంకొక గదిలో

పదాల కోసం వెతికిన నేను.

మరొక చీకటి మూలలో

ఎవరూ చూడని నా మౌనం.

అందరూ అక్కడే ఉన్నారు.

ఎవరూ నన్ను పిలవలేదు.

ఎవరూ నన్ను ఆపలేదు.

తలుపు వాళ్లందరి మధ్య

నిశ్శబ్దంగా నిలిచింది.

నేను

గడియపై చేయి పెట్టాను.

చెక్కలోంచి

ఒక వెచ్చదనం వచ్చింది.

అది

ఇంటి వెచ్చదనం కాదు.

ఎప్పుడో

నా చేతుల నుంచి

దానిలోకి వెళ్లిపోయిన నా జీవితం.

తలుపు

మెల్లగా తెరుచుకుంది.

లోపలికి వెళ్లింది నా శ్వాస.

నేను

ఇంకా గుమ్మం దగ్గరే నిలబడి ఉన్నాను.

ఆ క్షణంలో అర్థమైంది

తలుపులు

ఇళ్లను బయట నుంచి లోపలికి కలపవు.

మనిషిని

అతని గతంతో

అతని లోపలితో కలుపుతాయి.

కొన్ని తలుపులు

మనం తెరవము.

అవి

మన వయసు పెరిగినప్పుడు

మనలోనే తెరుచుకుంటాయి.

అప్పుడు

బయట ప్రపంచం అదే ఉంటుంది.

మారేది

గుమ్మం దాటే మనిషి మాత్రమే.

నేను

మరోసారి గడియను తాకాను.

ఈసారి

తలుపు తెరవడానికి కాదు.

లోపల ఉన్న నన్ను నేను వినడానికి.

అక్కడ

చాలా మెల్లగా

ఒక స్వరం వినిపించింది

“ఇంతకాలం ఎక్కడ ఉన్నావు?”

ఆ ప్రశ్నకు

నా దగ్గర ఏ జవాబూ లేదు.

నా దగ్గర ఉన్నది

ఒకే ఒక్క దీర్ఘ నిశ్శబ్దం.

ఆ నిశ్శబ్దాన్ని

రెండు చేతులతో పట్టుకుని

నేను మొదటిసారి

నా ఇంటి లోపలికి

 అడుగు పెట్టాను.

తలుపు

నా వెనుక మూసుకోలేదు.

అది తెరిచే ఉంది.నాలో మిగిలిన నేను

(దీర్ఘ కావ్యం)

6. తలుపు

ప్రతి ఇంటికీ ఒక తలుపు.

ప్రతి మనసుకీ ఒక చప్పుడు.

నా తలుపు

ఎప్పటి నుంచో

నాలోనే ఉంది.

ఎన్నిసార్లు తెరిచానో గుర్తులేదు.

ఎన్నిసార్లు మూసుకున్నానో లెక్కలేదు.

తలుపు చప్పుడికి

ఒక వయసుంటుంది.

చిన్నప్పుడు

అది పరుగెత్తే కాళ్ల శబ్దం.

ఆ వయసులో

తలుపు అంటే బయటికి వెళ్లే దారి.

బయట అంటే తెలియని ప్రపంచం.

కొంచెం ఎదిగాక

తలుపు చప్పుడు

ఎదురుచూపుల శబ్దమైంది.

ఎవరో వస్తారని

చెవులు గుమ్మం వైపు తిరిగేవి.

ఒక అడుగు వినిపిస్తే

గుండె ముందుగా తలుపు తెరిచేది.


ఇప్పుడు

అది గాలి

నెమ్మదిగా లోపలికి వచ్చే శబ్దం

తెర కదిలినంత మాత్రమే.

వెలుగు

నేల మీదికి జారినంత మాత్రమే.

గది నిండా

ఎవరో కనిపించని మనిషి

నడిచినట్టుగా

ఒక మృదువైన అలికిడి.


ఒకప్పుడు

గుమ్మం దాటిన ప్రతి అడుగూ

కొత్తదనాన్ని తీసుకొచ్చేది.

ఇప్పుడు

అడుగులు

తమ ప్రతిధ్వనిని మాత్రమే తీసుకొస్తున్నాయి.

వెళ్లిపోయిన అడుగుల

చప్పుడు కూడాతలుపులకు గుర్తుంటుందేమో.

తలుపు గడియ ఇప్పటికీ అదే చోటుంది.

తిరిగింది మాత్రం నా చేయి.

మారింది మాత్రం ఆ స్పర్శ.

చిన్ననాటి చేతి వేళ్లు

గడియను పట్టుకున్నప్పుడు

అది ప్రపంచాన్ని తెరిచినట్టుండేది.


ఇప్పటి వేళ్లు

అదే గడియను తాకినప్పుడు

తెరుచుకునేది ఒక గది కాదు

ఒక కాలం.

గడియ చుట్టూ

చేతుల వయసు పేరుకుపోయింది.

ఎన్నో తొందరలు.

ఎన్నో నిరీక్షణలు.

ఎన్నో తిరిగివచ్చిన సాయంత్రాలు.

ఎన్నో వెళ్లిపోయిన ఉదయాలు.

కొన్ని రాకలు

ఇప్పటికీ

గుమ్మం దగ్గరే నిలిచిపోయాయి.

కొన్ని వెళ్లిపోవడాలు

ఇంకా

తలుపు చెక్కల్లోనే శ్వాసిస్తున్నాయి.

ఒకసారి

ఎవరో తలుపు మూసి వెళ్లారు

తలుపు మూసుకుంది.

ఇల్లు మాత్రం

ఆ చప్పుడిని

చాలా కాలం తెరిచే ఉంచింది

కొన్ని వీడ్కోళ్లు

తలుపు మూసుకున్న తర్వాతే

తమ అసలు అర్థాన్ని చెబుతాయి.

కొన్ని రాకలు

మనిషి వెళ్లిపోయిన తర్వాతే

గదిలో కనిపిస్తాయి.

ఒక కుర్చీపై మిగిలిన మడతలో.

ఒక గోడపై ఆగిపోయిన చూపులో.

ఒక గడియారం మధ్యలో నిలిచిపోయిన క్షణంలో.

ఈ మధ్య

తలుపు తెరవడం కంటే

వినడమే ఎక్కువైంది.

బయట ఎవ్వరూ లేరు.

లోపల

ఎవరో నెమ్మదిగా నడుస్తున్నారు.

ఆ అడుగుల లయనాకు తెలిసినట్టే ఉంది.


ఒకప్పుడు

ఈ గదులన్నీనన్ను గుర్తుపట్టేవి.

ఇప్పుడు

నేను వాటిని గుర్తుపట్టడానికి

కొంతసేపు నిలబడాలి.

గోడలపై

నా నీడల వయసు పెరిగింది.

నేలపై

నా అడుగుల దూరం మారింది.

కిటికీ దగ్గర

నేను నిలిచిన చోట వెలుగు మారిపోయింది.

తలుపు మాత్రం

అదే ప్రశ్నతో ఉంది

ఎక్కడికి?

నేను సమాధానం చెప్పలేదు.

ఇప్పుడు నాకు

వెళ్లాల్సిన దారి కంటే

తిరిగి రావాల్సిన చోటే ముఖ్యమైపోయింది.

నేనే

నా గుమ్మం దగ్గరకు వచ్చి నిలబడ్డానేమో.

బయట నుంచి

నన్ను నేను చూసుకున్నన్నట్టుంది.

లోపల

నన్ను ఎవరోఎదురుచూస్తున్నట్టుంది.

తలుపు మధ్యలో

ఒక పలుచని వెలుగు.

ఆ వెలుగులో నా చిన్ననాటి ముఖం.

దాని వెనుక యువకుడైన నేను.

మరో అడుగు లోపల

కుటుంబం కోసం పరుగెత్తిన నేను.

ఇంకొక గదిలో

పదాల కోసం వెతికిన నేను.

మరొక చీకటి మూలలో

ఎవరూ చూడని నా మౌనం.

అందరూ అక్కడే ఉన్నారు.

ఎవరూ నన్ను పిలవలేదు.

ఎవరూ నన్ను ఆపలేదు.

తలుపు వాళ్లందరి మధ్య

నిశ్శబ్దంగా నిలిచింది.

నేను

గడియపై చేయి పెట్టాను.

చెక్కలోంచి

ఒక వెచ్చదనం వచ్చింది.

అది

ఇంటి వెచ్చదనం కాదు.

ఎప్పుడో

నా చేతుల నుంచి

దానిలోకి వెళ్లిపోయిన నా జీవితం.

తలుపు

మెల్లగా తెరుచుకుంది.

లోపలికి వెళ్లింది నా శ్వాస.

నేను

ఇంకా గుమ్మం దగ్గరే నిలబడి ఉన్నాను.

ఆ క్షణంలో అర్థమైంది

తలుపులు

ఇళ్లను బయట నుంచి లోపలికి కలపవు.

మనిషిని

అతని గతంతో

అతని లోపలితో కలుపుతాయి.

కొన్ని తలుపులు

మనం తెరవము.

అవి

మన వయసు పెరిగినప్పుడు

మనలోనే తెరుచుకుంటాయి.

అప్పుడు

బయట ప్రపంచం అదే ఉంటుంది.

మారేది

గుమ్మం దాటే మనిషి మాత్రమే.

నేను

మరోసారి గడియను తాకాను.

ఈసారి

తలుపు తెరవడానికి కాదు.

లోపల ఉన్న నన్ను నేను వినడానికి.

అక్కడ

చాలా మెల్లగా

ఒక స్వరం వినిపించింది

“ఇంతకాలం ఎక్కడ ఉన్నావు?”

ఆ ప్రశ్నకు

నా దగ్గర ఏ జవాబూ లేదు.

నా దగ్గర ఉన్నది

ఒకే ఒక్క దీర్ఘ నిశ్శబ్దం.

ఆ నిశ్శబ్దాన్ని

రెండు చేతులతో పట్టుకుని

నేను మొదటిసారి

నా ఇంటి లోపలికి అడుగు పెట్టాను.

తలుపు

నా వెనుక మూసుకోలేదు.

అది తెరిచే ఉంది.


ఇక

బయటికి వెళ్లాల్సిన మనిషి నేను కాదు.

లోపల మిగిలిపోయిన

నన్ను కలవాల్సిన మనిషిని!

దార్ల వెంకటేశ్వరరావు 10.8.2026



ఇక

బయటికి వెళ్లాల్సిన మనిషి నేను కాదు.

లోపల మిగిలిపోయిన

నన్ను కలవాల్సిన మనిషిని!

దార్ల వెంకటేశ్వరరావు 10.8.2026

09 ఆగస్టు, 2026

నాలో మిగిలిన నేను- 6

 నాలో మిగిలిన నేను


(దీర్ఘ కావ్యం)


5. మడతలు



ఒక పాత పుస్తకం తెరిచాను.

పేజీల మధ్య

ఎండిపోయిన ఒక ఆకు.


ఆ ఆకును

వేళ్లతో తాకలేదు.

అది విరిగిపోతుందనే కాదు—

దాని నిశ్శబ్దం

చెదిరిపోతుందేమో.


ఎప్పుడో

ఎవరో పెట్టిన ఆకు అది.

పుస్తకం మూసుకున్న రోజే

దాని ఋతువు కూడా

మూసుకుపోయిందేమో.


ఆకుపచ్చగా ఉన్న రోజుల్ని

అది గుర్తుపెట్టుకుందో లేదో

తెలియదు.

నేను మాత్రం

దాన్ని చూసిన క్షణంలో

ఒక వేసవి సాయంత్రాన్ని గుర్తుపట్టాను.


ఆ సాయంత్రం

ఎవరి నవ్వు వినిపించిందో

ఇప్పుడు గుర్తులేదు.

ఎవరి కోసం

ఆ ఆకు పుస్తకంలోకి వచ్చిందో

అది కూడా తెలియదు.


జ్ఞాపకాలకు

పేర్లు అవసరం ఉండవు.

ఒక రంగు చాలు.

ఒక వాసన చాలు.

ఒక మడత చాలు.


పాత అలమారలో ఇంకా

నాఫ్తలీన్ వాసనే.


బట్టలు

వయసును ధరిస్తాయేమో.

వాసనలు

కాలాన్ని ధరిస్తాయి.


ఎప్పుడో వేసుకున్న

ఒక చొక్కా

ఇప్పటికీ మడతల్లో

నా భుజాల ఆకారాన్ని దాచుకుంది.


కాలం

బట్టల మీద పడిన ముడతలను

తీసుకెళ్లలేదు.

వాటిని మరింత లోతుగా చేసింది.


ఒక కప్పు.


పెదవుల వేడి

ఎప్పుడో వదిలిపోయింది.

చేతి ముద్ర మాత్రం

ఇంకా అంచునే ఉంది.


ఆ కప్పును

ఎత్తి చూశాను.


అందులో ఏమీ లేదు.

అయినా

ఒక ఉదయం

దాని అడుగున

మిగిలిపోయినట్టనిపించింది.


చెక్క బల్ల మీద

ఒక చిన్న వలయం.


కప్పు ఎన్నిసార్లు అక్కడ

కూర్చుందో

ఆ వలయానికి తెలుసు.


మనుషులు వెళ్లిపోయాక

వస్తువులు

వారి తరఫున

సాక్ష్యమిస్తాయేమో.


ఒక కలం.


సిరా ఎండిపోయింది.

వేళ్ల ఒత్తిడి

ఇంకా దానిమీదే ఉంది.


ఎన్ని వాక్యాలు

దాని గుండా నడిచాయో

దాని నల్లటి శరీరానికి తెలుసు.


కొన్ని అక్షరాలు

కాగితం మీదే మిగిలాయి.

కొన్ని

చేతి కదలికల్లోనే ఆగిపోయాయి.


రాయాలని అనుకున్న

ఒక వాక్యం

ఎప్పుడూ రాయబడకపోవడం కూడా

ఒక జ్ఞాపకమే.


బల్ల సొరుగులో

ఒక పాత రబ్బరు.


దాని మీద

ఎర్రబడిన వేళ్ల గుర్తులు.


తుడిచిన అక్షరాలు

కనిపించవు.

వాటిని తుడిచిన మనసు మాత్రం

ఎక్కడో మిగిలి ఉంటుంది.


చదవని ఒక ఉత్తరం.


మడతలే ముందు కనిపించాయి.

అక్షరాలు తర్వాత.


ఎవరికి రాసారో

చదవకముందే తెలిసినట్టుంది.

ఎవరి చేతుల నుంచి వచ్చిందో

కాగితానికే తెలిసినట్టుంది.


కొన్ని మాటలు

చేరేలోపే

పాతబడిపోతాయి.


కొన్ని మౌనాలు

ఇప్పటికీ

కొత్తగానే ఉన్నాయి.


ఉత్తరాన్ని

తెరిచి మళ్లీ మూసేశాను.


అక్షరాలను చదవడం కంటే

వాటి మధ్య ఉన్న ఖాళీలను

చూడాలనిపించింది.


అక్కడ

ఎవరూ రాయని మాటలు ఉన్నాయి.


ఎక్కడో ఒకచోట

సిరా కొద్దిగా చెదిరింది.


అది వర్షమా

కన్నీళ్లా

కాలమా

చెప్పలేకపోయింది ఆ కాగితం.


పాత వస్తువులన్నీ

తమలో ఒక ప్రశ్నను దాచుకుంటాయి.


వాటిని వదిలేసిన మనిషి

ఎక్కడికి వెళ్లాడు?


అతను మారిపోయాడా?


లేక

అతనిలోంచి ఏదో ఒకటి

ఇక్కడే మిగిలిపోయిందా?


గదిలోకి

సాయంత్రం నెమ్మదిగా వచ్చింది.


కిటికీ అద్దం మీద

చెట్ల నీడలు

మడతలు పడిన జ్ఞాపకాల్లా

కదిలాయి.


ఒక పాత ఫొటో

పుస్తకాల మధ్యనుంచి జారింది.


ముఖాలు ఉన్నాయి.

నవ్వులు ఉన్నాయి.

భుజాలకు భుజాలు తగిలించుకున్న

కొన్ని మనుషులు ఉన్నారు.


ఫొటోలో

అందరూ ఒకే వయసులో ఉన్నారు.


బయట

కాలం మాత్రం

ఎవరినీ ఒకే వయసులో ఉంచలేదు.


ఆ ఫొటోను

చేతిలో పట్టుకుని

చాలాసేపు చూశాను.


అందులోని ఒక మనిషి

నా వైపు చూస్తున్నాడు.


అతని కళ్లలో

నాకు తెలియని ఒక నమ్మకం.


అతను

నేనేనా?


లేక

నేను అతనిలోంచి

నెమ్మదిగా బయటికి వచ్చిన

మరో మనిషినా?


జవాబు

ఫొటో వెనుక లేదు.


అక్కడ

ఒక తేదీ మాత్రమే ఉంది.


తేదీలు

జీవితాన్ని కొలవగలవు.

జీవించిన క్షణాన్ని

కొలవలేవు.


గోడకు వేలాడుతున్న గడియారం

ఆగిపోయింది.


సూది

ఒకే చోట నిలిచిపోయింది.


అది ఆగిన సమయమే

ఇంట్లో ఎవరో

చివరిసారి నవ్వి ఉండవచ్చు.


ఎవరో తలుపు మూసి ఉండవచ్చు.


ఎవరో

తిరిగి వస్తానని చెప్పి ఉండవచ్చు.


గడియారం మాత్రం

ఆ మాట దగ్గరే ఆగిపోయింది.


కాలం

అలా ఆగిపోదని నాకు తెలుసు.


మనిషి లోపల

ఒక చోట మాత్రం

కాలం ఎప్పుడో నిలిచిపోతుంది.


అక్కడి నుంచి

ఎన్ని సంవత్సరాలు గడిచినా

ఒక శబ్దం

అదే వయసులో వినిపిస్తుంది.


ఒక పిలుపు.


ఒక నవ్వు.


ఒక తలుపు చప్పుడు.


ఒక అడుగు.


నా పేరు

ఎవరో పిలిచినట్టైంది.


వెనక్కి తిరిగి చూశాను.


గాలి

తెరను మెల్లగా కదిలించింది.


ఇంట్లో

నేను ఒక్కడినే.


ఆ పిలుపు మాత్రం

ఇంకా

రెండు అడుగుల

దూరంలోనే ఉంది.


నేను చేతిని చాపలేదు.


అది

అక్కడే ఉండాలని అనిపించింది.


కొన్ని జ్ఞాపకాలను

తిరిగి తీసుకురావడం కంటే

వాటి దూరాన్ని కాపాడుకోవడమే

వాటికి ఇచ్చే చివరి గౌరవం.


తెరిచి ఉన్న పుస్తకాన్ని

మెల్లగా మూసేశాను.


ఆ ఆకు

మళ్లీ రెండు పేజీల మధ్య

చీకటిలోకి వెళ్లిపోయింది.


కప్పు

బల్ల మీదే ఉంది.


కలం

సిరా లేని చేతితో

ఇంకా ఏదో రాయడానికి సిద్ధంగా ఉంది.


ఉత్తరం

మళ్లీ తన మడతల్లోకి వెళ్లింది.


ఫొటో

పుస్తకాల మధ్య

ముఖాలను దాచుకుంది.


గడియారం

తన ఆగిపోయిన క్షణాన్ని

వదల్లేదు.


గది అంతా

వస్తువుల నిశ్శబ్దంతో నిండిపోయింది.


నేను

ఆ నిశ్శబ్దం మధ్య

కూర్చున్నాను.


అప్పుడు అర్థమైంది—


జ్ఞాపకం అంటే

గతాన్ని తిరిగి తెచ్చుకోవడం కాదు.


మనలోంచి వెళ్లిపోయిన

ఒక కాలం

తన మడతల్లో

మనల్ని మనమే

దాచుకుని ఉండటం.


మనిషి వయసు

ముఖం మీద మాత్రమే కనిపించదు.


అతను తాకకుండా వదిలిన

వస్తువుల మీద కనిపిస్తుంది.


తెరవకుండా ఉంచిన

ఉత్తరాల మీద కనిపిస్తుంది.


చదవకుండా మూసిన

పుస్తకాల మీద కనిపిస్తుంది.


చెప్పకుండా మిగిలిన

మాటల మధ్య కనిపిస్తుంది.


కొన్ని మడతలు

బట్టల్లో ఉంటాయి.


కొన్ని కాగితాల్లో.


కొన్ని జ్ఞాపకాల్లో.


కొన్ని మనిషి లోపల.


చేతితో విప్పలేని

ఆ చివరి మడతలోనే

ఎప్పుడో

నేను నన్ను నేను దాచుకున్నానేమో.

- దార్ల వెంకటేశ్వరరావు 9.8.2026

08 ఆగస్టు, 2026

నాలో మిగిలిన నేను - 5

 నాలో మిగిలిన నేను 

(దీర్ఘ కావ్యం)


5. ఒక ఋతువు




కొన్ని రోజులు

మనిషి బయట ఏమీ కోల్పోడు.

అయినా

లోపల ఏదో ఒకటి

నెమ్మదిగా ఖాళీ అవుతుంది.


చేతిలో ఉన్న గడియారం

సమయాన్ని చూపిస్తూనే ఉంటుంది,

మనసులో మాత్రం

ఒక గంట

ఎప్పుడో ఆగిపోయి ఉంటుంది.


పాత ఇంటి మేడ మీద

ఎండిపోయిన తులసి కుండీ ఉంది.

నీళ్లు పోయడం మానేశారని కాదు,

ఎంత పోసినా

దాని ఆకులు

మునుపటి పచ్చదనాన్ని

గుర్తు చేసుకోలేకపోతున్నాయి.

మన సంబంధాలూ

అలాగే ఉంటాయేమో!


మనిషి ఎదురుగా ఉంటాడు,

అతని కళ్లలో

మన కోసం స్థలం ఉండదు.

మాటలు ఉంటాయి,

వాటి వెనుక మనసు ఉండదు.

చిరునవ్వు ఉంటుంది,

దాని లోపలఎవరూ నివసించరు.

కొన్నిసార్లు

మనమే మనకుఅతిథులమైపోతాం.


అద్దం ముందు నిలబడితే

ముఖం కనిపిస్తుంది,

ఆ ముఖం వెనుక

ఎన్నో సంవత్సరాలుగా

ఎవరో తలుపు తడుతున్నారు.

తీయడానికి

చేతులు ముందుకు రావు.

తలుపు తెరిస్తే

బయట ఎవరో కాదు,

మనమే

మనల్ని కలుసుకోవాల్సి వస్తుంది.

అది అంత సులభమైన

సమావేశం కాదు.

అక్కడ

మన తప్పులకు ఇతరుల పేర్లు పెట్టలేం.

మన మౌనానికి కాలాన్ని నిందించలేం.

మన దూరాలకు

ప్రపంచాన్ని కారణం చేయలేం

కొన్ని రాత్రులు నిద్ర రావడం లేదు

చీకటి వల్ల కాదు

లోపల

ఎప్పుడో రాలిపోయిన

ఒక ఆకు

ఇంకా నేలను వెతుకుతూనే ఉంది.

ఉదయం

కిటికీ మీదఒక పిట్ట వాలుతుంది.

అదిఏమీ అడగదు.

కొద్దిసేపులోపలికి చూస్తుంది.

తర్వాతఎగిరిపోతుంది.

అది వెళ్లిపోయిన తర్వాత

నాకు అర్థమవుతుంది

ఇల్లు ఖాళీ కాలేదు.

నేనే నాలోంచి

కొంచెం కొంచెంగా

బయటికి వెళ్లిపోయాను.

ఇప్పుడు

తిరిగి రావడం దారి కోసం కాదు,

నాలో

ఇంకా మిగిలి ఉన్న

ఆ చిన్న వెలుగు కోసమే వెతుకుతున్నాను.

దార్ల వెంకటేశ్వరరావు 8.8.2026

07 ఆగస్టు, 2026

నాలో మిగిలిన నేను -4


 నాలో మిగిలిన నేను



(దీర్ఘకావ్యం)

4. ఇల్లు

తలుపు 

ఇప్పటికీ అదే శబ్దంతో 

తెరుచుకుంటుంది.

లోపలికి వచ్చేది నేను మాత్రమే.

గోడలు 

నన్ను చూసి పలకరించవు.

వాటి నిశ్శబ్దం 

నాకు ఎప్పటి నుంచో తెలిసిన భాష.

మూలలో ఒక కుర్చీ.

ఎవరో లేచి వెళ్లిన ఆకారం 

ఇంకా దానిమీదే ఉంది.

కిటికీ గుండా వచ్చే గాలి 

ప్రతి గదినీ

పేరుపెట్టి పిలుస్తోంది.

వంటింట్లో పసుపు, 

పొగ, వేడి అన్నం...

వాసనలు ఇప్పటికీ 

ఇంటిని వదిలిపెట్టలేదు.

ముంగిట చెప్పులు లేవు.

అడుగులు మాత్రం అక్కడే ఉన్నాయి.

అలమార నెమ్మదిగా తెరిచాను.

మడతపెట్టిన బట్టల మధ్య 

ఒక పాత రోజు.

చదవని ఒక ఉత్తరం.

తెగిపోయిన ఒక బొత్తాం.

పిలవని కొన్ని పేర్లు.

ఇల్లు వస్తువులను దాచుకోదు.

కాలాన్ని మడతపెడుతుంది.

నేను ఒక్కో గదిలో నడుస్తున్నాను.

నా అడుగులు 

నన్ను గుర్తుపడుతున్నాయి.

ఇల్లు 

నా కోసం 

ఎదురు చూడలేదు.

నేనే 

ఇంటి లోపల 

మిగిలిపోయాను.

దార్ల వెంకటేశ్వరరావు 7.8.2026

06 ఆగస్టు, 2026

నాలో మిగిలిన నేను -3

 

నాలో మిగిలిన నేను

(దీర్ఘకావ్యం)

3. శరీరం

ఈ శరీరాన్ని ఎప్పుడూ 

నా వెంట నడిచే ఒక చెట్టులా చూస్తున్నాను.

ప్రతి ఉదయం

 దాని మీద కొత్త వెలుగు పడుతోంది.

ప్రతి సాయంత్రం 

కొంచెం నీడ పెరుగుతోంది.

చిన్నప్పుడు 

మోకాళ్ల మీద పడిన గాయాలు 

త్వరగా మానిపోయేవి.

ఇప్పుడు 

ఒక చిన్న నొప్పి 

చాలా రోజుల పాటు నాతోనే ఉంటుంది.

చేతుల మీద 

నరాలు నెమ్మదిగా

 నదుల్లా కనిపిస్తున్నాయి.

వేళ్లు 

పుస్తకాల పేజీలను 

తిప్పిన జ్ఞాపకాన్ని ఇంకా మర్చిపోలేదు.

భుజాలు 

ఎంత బరువును మోశాయో లెక్కపెట్టలేదు.

తల 

ఎన్ని ఆలోచనలకు 

ఆకాశమైందో నాకే తెలియదు.

కళ్లలో ఇప్పటికీ 

కొన్ని దారులు నిలిచే ఉన్నాయి.

ఆ దారులన్నీ ఎక్కడికో తీసుకెళ్లాయి.

తిరిగి వచ్చినది నానడక మాత్రమే.

అద్దం ముందు నిలబడిన ప్రతిసారీ 

నా ముఖం మారుతోంది.

చూపు తన వయసును నెమ్మదిగా ధరిస్తోంది.

ఒక చెట్టు బెరడును మార్చుకోదు.

దాని మీద

 కాలం తన వేలిముద్రలను వదిలి వెళ్ళిపోతుంది.

నా చర్మం మీద అలాంటివే కొన్ని రేఖలు.

వాటిని ముడతలని పిలిచారు.

నేను వాటిలో నడిచిన రోజుల్ని చదువుతున్నాను.

నా గుండె ఇప్పటికీ అదే తలుపు తడుతోంది.

లోపల ఎవరో 

నిశ్శబ్దంగా తలుపు తీస్తున్నారు.

ఆ అడుగుల శబ్దం నాకే వినిపిస్తోంది.

నా శరీరం 

నాతో పాటే  .

ప్రతి రోజూ నన్ను కొంచెం కొంచెంగా చదువుతోంది.

దార్ల వెంకటేశ్వరరావు 6.8.2026


05 ఆగస్టు, 2026

నాలో మిగిలిన నేను- 2

 నాలో మిగిలిన నేను 

(దీర్ఘ కావ్యం)



2. కాలం

నాలోకి మరొక అడుగు వేశాను.

ఎదురుగా ఎవరూ లేరు.

నా శ్వాస నా వెంట నడుస్తోంది.

గోడమీద వేలాడుతున్న గడియారం 

నన్ను చూసి ఏమాత్రం ఆశ్చర్యపడలేదు.

అది ఎప్పటిలాగే నడుస్తూనే ఉంది.

చిన్నప్పుడు దాని ముళ్లను 

ముందుకు నెట్టాలనిపించేది.

ఇప్పుడు అవి ఎక్కడికి చేరుతున్నాయో 

చూస్తూ కూర్చుంటున్నాను.

పాత ఇంటి వసారాలో

ఒక చెక్క కుర్చీ ఉండేది.

నాన్న దానిమీద కూర్చొని 

సాయంత్రాన్ని నెమ్మదిగా తాగేవాడు.

ఆ కుర్చీ ఇప్పుడు 

నా కోసం ఎదురు చూస్తోంది.

దానిమీద నేను కూర్చుంటే

చెక్క సన్నగా మూలుగుతోంది.

ఆ మూలుగులో

నాన్న గొంతు చిన్నగా వినిపిస్తుంది.

ఆయన ఏమీ మాట్లాడడు.

నేనూ ఏమీ అడగను.

మధ్యలో ఎన్నేళ్లు కూర్చుని ఉంటాయి.

అమ్మ పిలిచిన నా పేరు

ఇప్పటికీ అదే వయసులో ఉంది.

నా వయసే దూరం నడిచింది.

ఒక పాత చొక్కా అలమారలో 

మడతపడి ఉంది.

దాన్ని తాకగానే 

వేళ్లకు దుమ్ము అంటుకోలేదు.

ఒక కాలం తగిగినట్లుంది

పాఠశాల బెల్లు, 

పుస్తకాల వాసన, 

వానలో తడిసిన దారి, 

స్నేహితుల నవ్వులు...

అన్నీ ఆ మడతల్లోనే ఇప్పటికీ ఉన్నాయి.

నేను ఒక్కడినే ముసలివాడిని అయ్యాను.

వాటికి వయసు పెరగలేదు.

నా చేతిని చూసుకున్నాను.

గీతలు మరింత లోతయ్యాయి.

ఒక్క గీతా తన దారిని మరచిపోలేదు.

నా నడక నెమ్మదించింది.

నా చూపు ఆగడం నేర్చుకుంది.

ముందు దూరాన్ని చూసేది.

ఇప్పుడు దగ్గరగా పడిన 

ఒక ఆకు కూడా 

నా దృష్టిని ఎక్కువసేపు పట్టుకుంటోంది.

ఆ ఆకులో రాలిపోవడం లేదు.

ఒక చెట్టు నిశ్శబ్దంగా కొనసాగుతోంది.

నాలో కూడా ఏదో కొనసాగుతూనే ఉంది.

దానికి రోజుల లెక్క తెలియదు.

ఋతువుల పేర్లు తెలియవు.

నా గుండె చప్పుడు అది వినే ఒకే గడియారం.

ఒకప్పుడు ఎత్తు కొలవడానికి 

గోడ మీద గీతలు గీసేవాళ్లం.

ఇప్పుడు అదే గోడ 

నా జ్ఞాపకాల ఎత్తును కొలుస్తోంది.

ఇంటి ముంగిట నాటిన మామిడి మొక్క 

నన్ను దాటి ఆకాశాన్ని చూస్తోంది.

దాని నీడలో నేను 

నా వయసును కూర్చోబెట్టుకున్నాను.

ఒక పాత పుస్తకం తెరిచాను.

పుటల మధ్య ఎండిపోయిన ఒక ఆకు.

ఆ ఆకుకు 

ఆ చెట్టు ఇప్పటికీ గుర్తుండి ఉంటుందా?

ఆ చెట్టుకు

ఆ ఆకు గుర్తుండి ఉంటుందా?

నా జ్ఞాపకాలు 

ఇలాంటి ప్రశ్నలతోనే 

ఇప్పటికీ నడుస్తున్నాయి.

కొన్ని ముఖాలు పేర్లు మరచిపోయాయి.

కొన్ని పేర్లు ముఖాలను వెతుకుతున్నాయి.

కాలం ఏదీ తీసుకుపోలేదు.

ప్రతి దానికీ మరో చోటు కల్పించింది.

బాల్యం ఒక మూలలో కూర్చుంది.

యవ్వనం ఇంకో కిటికీ దగ్గర గాలిని చూస్తోంది.

ఈ వయసు వాటి మధ్య నెమ్మదిగా నడుస్తోంది.

గోడ మీద గడియారం

ఇంకా అదే శబ్దంతో ఉంది.

ఆ శబ్దం ఇప్పుడు నాలోంచి వినిపిస్తోంది.

దార్ల వెంకటేశ్వరరావు

5.8.2026


04 ఆగస్టు, 2026

నాలో మిగిలిన నేను -1

 

నాలో మిగిలిన నేను

(దీర్ఘ కావ్యం)

దార్ల వెంకటేశ్వరరావు 

1. ఏకాంతం


వయసు పెరిగేకొద్దీ 

నేను

ఏకాంతాన్నే 

ఇష్టపడుతున్నానేమో

గతం అప్పుడప్పుడూ నా తలుపు తడుతోంది.

రేపు దూరం నుంచే నా వైపు చూస్తోంది.

నేను మాత్రం ఈ క్షణంలో

నిశ్శబ్దంలా కూర్చుని ఉన్నాను.

జీవితమంతా శబ్దాల మధ్యే నడిచాను.

చప్పట్లు నా చెవులను తాకాయి.

చీవాట్లు నా గుండెను దాటాయి.

ప్రశంసలు కొన్ని రోజులు నాతో నడిచాయి.

అవమానాలు

కొన్ని రాత్రులు 

నాలో మేల్కొనే ఉన్నాయి.

నా స్వరం నా చెవులకే ఆలస్యంగా చేరింది.

ఎన్నో పేర్లతో నన్ను పిలిచారు.

ప్రతి పిలుపూ నా వైపు తిరిగొచ్చింది.

కొడుకని పిలిచారు.

స్నేహితుడని చేరువయ్యారు.

భర్తనని చేతులు పట్టుకున్నారు.

తండ్రినని కళ్లలో నిలిపారు.

గురువని గౌరవించారు.

కవినని చదివారు.

ఆ పిలుపులన్నీ నాలో వేర్వేరు గదులయ్యాయి.

నేను ఏ గదిలో ఉన్నానో 

చాలా కాలం నాకు గుర్తే రాలేదు.

ఒక రోజు అద్దం ముందు నిలబడ్డాను.

అద్దంలో నా చూపునే అనుమానించాను.

నా కళ్లలో ఎన్నో ఋతువులు గడిచిపోయాయి.

కొన్ని నవ్వులు అక్కడే ఎండిపోయాయి.

కొన్ని కన్నీళ్లు ఇంకా తడి ఆరలేదు.

నా చేతులను నెమ్మదిగా చూసుకున్నాను.

ఎన్నో చేతులు వచ్చి వెళ్లిపోయాయి.

నా భుజాల మీద 

కొన్ని జ్ఞాపకాలు 

ఇప్పటికీ 

తలవాల్చే ఉన్నాయి.

నా గుండె చప్పుడు నన్ను పేరుపెట్టి పిలిచింది.

ఆ పిలుపు ఎన్నేళ్ల నుంచో 

నా కోసమే ఎదురు చూస్తున్నట్టుంది.

సాయంత్రాలు ఇప్పుడు నాకు దగ్గరవుతున్నాయి.

నా నీడ నా ముందే నడుస్తోంది.

నా అడుగుల శబ్దం నన్ను వెంబడించడం లేదు.

నాతో పాటు నడుస్తోంది.

నేను నెమ్మదిగా నాలోకి నేను ప్రవేశిస్తున్నాను.

నాలో మిగిలిన నేను 

నిశ్శబ్దంగా నా కోసమే నేను ఎదురు చూస్తున్నాను.

దార్ల వెంకటేశ్వరరావు 4.8.2026