నాలో మిగిలిన నేను
(దీర్ఘకావ్యం)
3. శరీరం
ఈ శరీరాన్ని ఎప్పుడూ
నా వెంట నడిచే ఒక చెట్టులా చూస్తున్నాను.
ప్రతి ఉదయం
దాని మీద కొత్త వెలుగు పడుతోంది.
ప్రతి సాయంత్రం
కొంచెం నీడ పెరుగుతోంది.
చిన్నప్పుడు
మోకాళ్ల మీద పడిన గాయాలు
త్వరగా మానిపోయేవి.
ఇప్పుడు
ఒక చిన్న నొప్పి
చాలా రోజుల పాటు నాతోనే ఉంటుంది.
చేతుల మీద
నరాలు నెమ్మదిగా
నదుల్లా కనిపిస్తున్నాయి.
వేళ్లు
పుస్తకాల పేజీలను
తిప్పిన జ్ఞాపకాన్ని ఇంకా మర్చిపోలేదు.
భుజాలు
ఎంత బరువును మోశాయో లెక్కపెట్టలేదు.
తల
ఎన్ని ఆలోచనలకు
ఆకాశమైందో నాకే తెలియదు.
కళ్లలో ఇప్పటికీ
కొన్ని దారులు నిలిచే ఉన్నాయి.
ఆ దారులన్నీ ఎక్కడికో తీసుకెళ్లాయి.
తిరిగి వచ్చినది నానడక మాత్రమే.
అద్దం ముందు నిలబడిన ప్రతిసారీ
నా ముఖం మారుతోంది.
చూపు తన వయసును నెమ్మదిగా ధరిస్తోంది.
ఒక చెట్టు బెరడును మార్చుకోదు.
దాని మీద
కాలం తన వేలిముద్రలను వదిలి వెళ్ళిపోతుంది.
నా చర్మం మీద అలాంటివే కొన్ని రేఖలు.
వాటిని ముడతలని పిలిచారు.
నేను వాటిలో నడిచిన రోజుల్ని చదువుతున్నాను.
నా గుండె ఇప్పటికీ అదే తలుపు తడుతోంది.
లోపల ఎవరో
నిశ్శబ్దంగా తలుపు తీస్తున్నారు.
ఆ అడుగుల శబ్దం నాకే వినిపిస్తోంది.
నా శరీరం
నాతో పాటే .
ప్రతి రోజూ నన్ను కొంచెం కొంచెంగా చదువుతోంది.
దార్ల వెంకటేశ్వరరావు 6.8.2026

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి