"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., Ph.D., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL 801 Research Methodology ఉదయం11.00 నుండి12.00 గంటల వరకు, TL-426: Indian Literature క్లాసులు మధ్యాహ్నం 2.00 గంటల నుండి 3.00 గంటల వరకు జరుగుతాయి.

04 ఆగస్టు, 2026

నాలో మిగిలిన నేను -1

 

నాలో మిగిలిన నేను

(దీర్ఘ కావ్యం)

దార్ల వెంకటేశ్వరరావు 

1. ఏకాంతం


వయసు పెరిగేకొద్దీ 

నేను

ఏకాంతాన్నే 

ఇష్టపడుతున్నానేమో

గతం అప్పుడప్పుడూ నా తలుపు తడుతోంది.

రేపు దూరం నుంచే నా వైపు చూస్తోంది.

నేను మాత్రం ఈ క్షణంలో

నిశ్శబ్దంలా కూర్చుని ఉన్నాను.

జీవితమంతా శబ్దాల మధ్యే నడిచాను.

చప్పట్లు నా చెవులను తాకాయి.

చీవాట్లు నా గుండెను దాటాయి.

ప్రశంసలు కొన్ని రోజులు నాతో నడిచాయి.

అవమానాలు

కొన్ని రాత్రులు 

నాలో మేల్కొనే ఉన్నాయి.

నా స్వరం నా చెవులకే ఆలస్యంగా చేరింది.

ఎన్నో పేర్లతో నన్ను పిలిచారు.

ప్రతి పిలుపూ నా వైపు తిరిగొచ్చింది.

కొడుకని పిలిచారు.

స్నేహితుడని చేరువయ్యారు.

భర్తనని చేతులు పట్టుకున్నారు.

తండ్రినని కళ్లలో నిలిపారు.

గురువని గౌరవించారు.

కవినని చదివారు.

ఆ పిలుపులన్నీ నాలో వేర్వేరు గదులయ్యాయి.

నేను ఏ గదిలో ఉన్నానో 

చాలా కాలం నాకు గుర్తే రాలేదు.

ఒక రోజు అద్దం ముందు నిలబడ్డాను.

అద్దంలో నా చూపునే అనుమానించాను.

నా కళ్లలో ఎన్నో ఋతువులు గడిచిపోయాయి.

కొన్ని నవ్వులు అక్కడే ఎండిపోయాయి.

కొన్ని కన్నీళ్లు ఇంకా తడి ఆరలేదు.

నా చేతులను నెమ్మదిగా చూసుకున్నాను.

ఎన్నో చేతులు వచ్చి వెళ్లిపోయాయి.

నా భుజాల మీద 

కొన్ని జ్ఞాపకాలు 

ఇప్పటికీ 

తలవాల్చే ఉన్నాయి.

నా గుండె చప్పుడు నన్ను పేరుపెట్టి పిలిచింది.

ఆ పిలుపు ఎన్నేళ్ల నుంచో 

నా కోసమే ఎదురు చూస్తున్నట్టుంది.

సాయంత్రాలు ఇప్పుడు నాకు దగ్గరవుతున్నాయి.

నా నీడ నా ముందే నడుస్తోంది.

నా అడుగుల శబ్దం నన్ను వెంబడించడం లేదు.

నాతో పాటు నడుస్తోంది.

నేను నెమ్మదిగా నాలోకి నేను ప్రవేశిస్తున్నాను.

నాలో మిగిలిన నేను 

నిశ్శబ్దంగా నా కోసమే నేను ఎదురు చూస్తున్నాను.

దార్ల వెంకటేశ్వరరావు 4.8.2026


కామెంట్‌లు లేవు: