హైదరాబాదు విశ్వవిద్యాలయం తెలుగు శాఖాధ్యక్షులైన ఆచార్య దార్ల వెంకటేశ్వర రావు గారిచే విరచితమైన "దార్లమాట"శతకాన్ని ఆంధ్రప్రదేశ్ హోం శాఖామంత్రి గారైన శ్రీమతి మేకతోటి సుచరిత గారు, తెలంగాణ రాష్ట్ర ఐ. ఆర్.యస్. శ్రీ మేకతోటి దయాసాగర్ గారి చేతుల మీదగా ఈ రోజు అనగా 11-07-2021 న, హోంమంత్రి క్యాంపు కార్యాలయం, గుంటూరులో ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో అనేకమంది అధ్యాపకులు, టీచర్లు, అనేకమంది సాహిత్యాభిలాషులు పాల్గొన్నారు.
సభాధ్యాక్షులైన VSR & NVR కళాశాల తెలుగు శాఖాదక్షులైన శ్రీమతి కె. వి. పద్మావతి గారు "దార్లమాట" శతకాన్ని పరిచయం చేసి వేదిక మీదకు ఆహ్వానితులను ఆహ్వానించారు.
ముందుగా స్టేట్ అకడమిక్ కో-ఆర్డినేటర్ శ్రీమతి రాయబారం శోభారాణి గారు ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు గారు రచించిన "దార్లమాట" శతకాన్ని సభికులకు సవివరంగా వివరించారు.
అనంతరం సుచరితమ్మ గారు మాట్లాడుతూ "సమకాలీన సమాజంలో కనిపిస్తున్న వివిధ అంశాలను సరళమైన పదాలతో పద్యాల్లో శతకగుచ్ఛంగా సాహిత్య లోకానికి అందిస్తున్నందుకు ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు గారిని మనసారా ఆశీర్వదిస్తున్నాను అన్నారు.
తదనంతరం మద్రాసు విశ్వవిద్యాలయం తెలుగు శాఖాధ్యక్షులైన ఆచార్య విస్తాలి శంకర రావు గారు మాట్లాడుతూ... "పద్యం రాయాలంటే, అందులోను శతక పద్యం
రాయడమంటే కత్తిమీద సామే. ఎలా అంటే పరిధి తక్కువ, స్పష్టత ఎక్కువ,
అంకుశం లాంటి సూటిదనం, విశేషమైన భాషా పరిజ్ఞానం, సందర్భోచిత
చమత్కారం. అన్నింటికీ మించి సమస్య పట్ల పరిపూర్ణ అవగాహన ఇవన్నీ
సమృద్ధిగా ఉంటేనే శతక పద్యం పాఠకులకు హత్తుకుంటుంది. ఈ 'దారి
పూలతోట దార్లమాట' అనే దార్ల మాట శతకం చదివిన తరువాత ఈ లక్షణాలన్నీ
ఆచార్య దార్లలో పుష్కలంగా ఉన్నాయని తెలిసింది. ఈ శతక ప్రక్రియ అనేది
పాతదే అయినా అందులోని అంశం సమకాలీన సమాజం లోనిది. ప్రక్రియ
ఏదైనా సమకాలీన సమాజానికి దర్పణంగా నిలువగలిగితేనే ఆ ప్రక్రియ ప్రజల
హృదయాలలో శాశ్వతమైన స్థానం దక్కించుకుంటుంది. అందుకు చక్కని
నిదర్శనం ఈ 'దారి పూలతోట దార్లమాట' శతకమే... అన్నారు.
తదనంతరం DACTA ప్రధాన కార్యదర్శి, SS&N కళాశాల తెలుగుశాఖాధ్యక్షులు ఆచార్యులు శ్రీ కాకాని సుధాకర్ గారు మాట్లాడుతూ... నా ప్రియమైన తమ్ముడు దార్ల వెంకటేశ్వరరావు గారు సమకాలీన విమర్శ రచనలో తనదైన వాదంతో సాహితీ ప్రియుల అభిమానాన్ని పొందారు. ఇప్పుడు పద్య రచనతో తన ప్రతిభను చాటుకుంటున్నందుకు ఆనందంగా ఉందన్నారు.
అనంతరం ఈ కార్యక్రమ నిర్వాహకులు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ యస్.సి., యస్.టి. ఉద్యోగ సంఘాల ప్రతినిధి (JAC) డాక్టర్. చుక్కా నాగభూషణం గారు మాట్లాడుతూ... దార్ల అంటే ఒక గొప్ప కవి. ఒక మంచి విమర్శకుడు. లోతైన విశ్లేషణలు చేయగలిగిన విశ్లేషకుడు. విద్యార్థులకు మార్గదర్శకంగా నిలుస్తూ వారిని నిరంతరం చైతన్య పరుస్తూ వారిని ఉన్నతులుగా తీర్చిదిద్దటం అనేవి వీరి సహజ గుణాలుగా చెప్పవచ్చునని కొనియాడారు.
తదనంతరం యస్.జి.వి. ఓరియంటల్ కళాశాల తెలుగు శాఖాధ్యక్షులు శ్రీమతి పిల్లి ఉషారాణి గారి వందన సమర్పణతో "దార్లమాట" శతకము పుస్తక ఆవిష్కరణ కార్యక్రమము విజయవంతంగా ముగిసింది.
ఈ కార్యక్రమంలో టి. అశోక్ గారు (DRDA), డా. సి. బాలకృష్ణ, డా. బండారు విజయ్ కుమార్, కిరణ్ గారు (జే.సీ. పి.ఎ.) అనేక మంది అధ్యాపకులు, పరిశోధక విద్యార్థులు పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు...
కార్యక్రమానంతరం కె.వి. పద్మావతి గారు అతిధులందరికీ ఆత్మీయ విందును ఏర్పాటు చేశారు...









కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి