"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL-502: Techniques of writing a Dissertation క్లాసులు సోమ, మంగళ, గురు, శుక్రవారం మధ్యాహ్నం 12.00 గంటల నుండి 1.00 వరకు డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ భవనంలో జరుగుతాయి.

10 ఫిబ్రవరి, 2025

మానవత్వ విలువల మూట దార్ల మాట శతకం - (అనిల్ కుమార్ దారివేముల, 9.2.2025 సృజనక్రాంతి దినపత్రిక సౌజన్యంతో)


 మానవత్వ విలువల మూట దార్ల మాట శతకం



మనిషి అనుభవాలను, భావోద్వేగాలను మరియు సమాజాన్ని ప్రతిబింబిస్తుంది కనుకనే సాహిత్యం నిత్య నూతనంగా ఉంటుంది. మనుషుల ఆలోచనలు, జీవన విధానం మరియు సమాజం కాలానుగుణంగా ఎప్పటికప్పుడు మారుతుంది. ప్రతి కాలంలో సాహిత్యం సమకాలీన జీవనశైలిని, సమస్యలను ప్రతిబింబిస్తుంది. కవులు, రచయితలు తమ భావజాలాన్ని, అనుభవాలను సమకాలీనతతో ముడిపెట్టి మానవతా పరిమళాలను పాఠకులు ఆస్వాదించేలా చేసుకునేలా తన పద్యాల్ని వ్యక్తీ కరిస్తారు. 

   కాలానుగుణంగా తెలుగు సాహిత్యంలో అనేక ప్రక్రియలు పురుడు పోసుకున్నప్పటికీ పద్య ప్రక్రియ మాత్రం ప్రత్యేకమైనదని, నిత్య నూతనమైనదని చెప్పవచ్చు. కవులు, రచయితలు రకరకాల ప్రక్రియలలో రచనలు చేసినప్పటికీ పద్య ప్రక్రియలో రచన చేయాలన్న జిజ్ఞాస ఎక్కువమందిలో ఉంటుంది. అలాంటి ప్రత్యేకమైన ఆసక్తితో ఆటవెలది ఛందస్సులో సమకాలీన సమాజాన్ని ప్రతిబింబిస్తూ శతక సాహిత్యాన్ని రాసిన వారిలో ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు ఒకరు.

  “దారి పూల తోట దార్ల మాట” అనే మకుటంతో 165 పద్యాలతో దార్ల మాట శతకాన్ని రచించి, గణేష్ దినపత్రిక సంపాదకులు శ్రీ కొత్తూరు సత్యనారాయణ గుప్తకు అంకితమిచ్చారు.ఈ శతకంలో తెలుగు భాష ప్రాధాన్యాన్ని, సమకాలీన సామాజిక వాస్తవికతను ప్రతిఫలించే విధంగా అనేక పద్యాలు వర్ణించారు కవి. వాటిలో కొన్నింటిని ఈ వ్యాసంలో విశ్లేషించాలనుకుంటున్నాను.


   అవసరమైనప్పుడు ఇతర భాషలు మాట్లాడవచ్చు కానీ మాతృభాషను మర్చిపోరాదని, మాతృభాష అమ్మ మాటలా అమృతంలా ఉంటుందని, తెలుగు భాష ప్రపంచం నలుమూలల వ్యాపించిందని తెలుగు భాష గొప్పతనాన్ని కొనియాడారు. 


మాతృభాష కొరకు మరణించి వీరులు

మాతృభాష మహిమ మనకు తెలిపె

మాతృభాష నెపుడు మరువకు సోదరా!

దారి పూలతోట దార్ల మాట’’ అని హితవు పలికారు. దీనిలో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ నేపథ్యాన్ని కూడా గుర్తుచేస్తున్నారు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటికి  పాకిస్థాన్ రెండు భాగాలుగా ఉండేది. పశ్చిమ పాకిస్థాన్, తూర్పు పాకిస్థాన్ లుగా ఉండేది.  పశ్చిమ పాకిస్థాన్ లో ఉర్దూ, తూర్పు పాకిస్థాన్ లో బెంగాలీ భాషలను ప్రజలు అత్యధికంగా మాట్లాడేవారు. కానీ రెండు చోట్లా ఉర్దూనే అధికార భాషగా ప్రకటించారు. తూర్పు పాకిస్థాన్ ప్రజలు తమ బెంగాలీ భాషను కనీసం రెండు జాతీయ భాషగానైనా ప్రకటించాలని కోరారు. పాకిస్థాన్ ప్రభుత్వం అంగీకరించలేదు. దానితో ఢాకా విశ్వవిద్యాలయంలో తమ మాతృభాష బెంగాలీ కోసం ఉద్యమాలు చేస్తుండగా, ప్రభుత్వం కాల్పులు జరిపింది. ఆ కాల్పుల్లో నలుగురు మరణించగా, అనేకమంది గాయపడ్డారు. ఉద్యమ ఉధృతిని గమనించి బెంగాలీ భాషను తమ రాజ్యాంగంలో ఒక జాతీయ భాషగా గుర్తించింది. ఈ ఉద్యమాన్ని ఆధారంగా చేసుకునే యునెస్కో ప్రతి యేడాది ఫిబ్రవరి 21 వ తేదీన అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని ప్రకటించింది. ఇంత నేపథ్యమున్న మాతృభాషను మరిచిపోవద్దని అంటున్నాడుకవి. అయితే ప్రపంచవ్యాప్తంగా వస్తున్న మార్పులను అనుసరించి ఆంగ్ల భాష నేర్చుకోవాల్సిన అవసరాన్ని చెబుతూ ఆంగ్ల భాష మంచినీరు వంటిదని, తెలుగు భాష తేనె వంటిదని తెలుపుతూ మంచినీళ్లతోనే మనకు దాహం తీరుతుందని చెబుతూ నేటి సమాజంలో ఆంగ్ల భాష ప్రాముఖ్యతను కూడా మరొక పద్యంలో తెలిపారు.


మనిషి మనుగడకు సహజవాయువు ఎంత అవసరమో నీరు కూడా అంతే అవసరమని, నీటిని వృధా చేయకుండా ఇంకుడు గుంటల ద్వారా పరిరక్షించు కోవాలని తెలిపారు. మన దైనందిన జీవితంలో నిద్ర లేచింది మొదలు పడుకునే వరకు నీటిని వాడటంతోపాటు, నీటిని వృధా చేయవద్దని తెలుపుతూ ఒక పద్యంలో వర్ణించారు.

గడ్డమెపుడు గీయ నడ్డదిడ్డంబుగాను

వ్యర్థముగను నీళ్లు వదులు చుంద్రు

కొద్ది నీళ్ళె కోట్ల గొంతు తడిపె చూడు” అని నీటి ఎద్దడి వల్ల కొన్ని ప్రాంతాల్లో తాగడానికి నీళ్లు కూడా ఉండవు. నీరు పుష్కలంగా దొరికే వాళ్ళు నీటిని అనవసరంగా వృధా చేయవద్దని కవి ప్రబోధించారు. కొన్ని నీళ్ళేఅనుకుంటారు. కానీ ఇలా చిన్న చిన్న పనుల్లో చేసే నీటి వృధాసామాన్యమైందికాదు.


మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే. ఈ నాగరిక రోజుల్లో కుటుంబ బంధాలు, అనుబంధాలను గురించి అమ్మానాన్న, అక్క, చెల్లి ,తమ్ముడు…ఇలా రక్తసంబంధాల మధ్య ఆర్థిక సంబంధాలే కంటే, మమతానుబంధాలకు అత్యధిక ప్రాధాన్యం ఉంటే ఆ ఇల్లు ఎంతో చక్కగా ఉంటుందని తెలుపుతూ…

కలిమి లేములన్ని కష్ట సుఖములట్లు

తల్లి దండ్రి యన్న దమ్ములుంద్రు

రక్త బంధ మదియె రాదేదియును సాటి” రక్తసంబంధం యొక్క గొప్పతనాన్ని, ఆవశ్యకతను నొక్కి చెప్పారు. జన్మనిచ్చిన తల్లిదండ్రులను ఆదరించాలని, వారి నుండి అన్నీ దక్కిన తర్వాత విడిచి పెట్టే లోకి రీతిని తప్పు పట్టారు.

ఎంతటి వారి కైనా మరణం తప్పదని మట్టి నుండి పుట్టిన మనిషి మట్టిలోకి చేరిపోతాడనే తాత్విక స్పర్శను వివరిస్తూ…

ఏరులన్ని పారి ఎచ్చట కలియును?

సాగరమున చేరి శాంతి నొందు

మానవుండు మరల మట్టి నటులె చేరు” అని దార్ల కవి పలికారు. ఈలోకంలో మానవుని జీవితమెంతబుద్భధప్రాయమో గుర్తు చేస్తూ, ఈ లోకంలో ఉన్నంతవరకు అందరూ సుఖసంతోషాలతో జీవించాలని ప్రబోధిస్తున్నాడు.


విలువ గురించి తెలియజేస్తూ వ్యక్తులు గాని, వస్తువులు గాని అవి ఉన్నప్పుడు వాటి విలువ తెలియదని, అవి లేనప్పుడే వాటి విలువ తెలుస్తుందని, తినడానికి తిండి లేనివాడికి భోజనం విలువ తెలుస్తుందని, అరగని వాడికి ఆరోగ్యం విలువ తెలుస్తుందని చక్కని సామ్యాన్ని ప్రబోధించారు. నేటి నాగరిక జీవనంలో ఆరోగ్యం కోసం తినే తిండి కంటే మింగే మాత్రలే ఎక్కువ ఉన్నాయని, చక్కెర వ్యాధి ముదిరిన తర్వాత మనిషి తీసుకునే చికిత్స గురించి చెప్తూ…

తినక ముందు నొకటి తిన్న ప్పుడొక్కటి

పొడుచుకొనవలయును జడుచుకొనక

మనల జంపు సఖియె మధుమోహనాంగిరా" అని ఆ బాధలు వర్ణనాతీతమని పలికారు. నేడు పరిశోధనలు ఎన్ని జరుగుతున్నా, కొన్ని వ్యాధులను శాశ్వతంగా నయం చేయలేని స్థితిని వివరిస్తున్నారు. 


సాహిత్య పఠనం మనిషిలో సహృదయతను నింపుతూ మనిషిని సంస్కరిస్తుందని సాహిత్య ప్రయోజనాన్ని చెప్తారు. పాఠకులు మంచి రచనను మరువలేరని అంటారు. దీన్నిలా వర్ణిస్తూ…

‘’కలిమి లేములన్ని కావడికుండలు

ఒడిదుడుకులు తెలిపి ఓర్పు నిచ్చి

సత్వ గుణము నేర్పు సాహిత్యపఠనంబు” అని సాహిత్యపఠనం యొక్క ఆవశ్యకతను దార్ల కవి తెలియజేశారు.

రాయలసీమ సాహిత్యానికి, కళలకు మరియు ఆధ్యాత్మికతకు పుట్టినిల్లని తిరుపతిలో శ్రీ వేంకటేశ్వర స్వామి, కాణిపాకం లో గణపతి సిరులు కురిపిస్తున్నారని, లేపాక్షి బసవన్నను చూడడానికి దేశ విదేశాల నుండి భక్తులు తరలి వస్తారని, అందువల్ల అది  కరువు నేల కాదు  కళలకు పుట్టినిల్లని అభివర్ణిస్తూ…

ఊటలూరు పోతులూరి తత్వ జ్ఞాని,

రాజ్య మేలినట్టి రాయలుండె

రాళ్ల సీమ కాదు రతనాలసీమ రా” అని రాయలసీమ గొప్పతనాన్ని ప్రశంసించారు కవి.

మారుతున్న కాలానుగుణంగా అన్ని రంగాలలో కార్పొరేట్ సెక్టార్ వ్యాప్తి చెందిందని దయాదాక్షిణ్యాలు ఈ రంగంలో ఉండట్లేదని వాపోతూ…

సంతకంబు పెట్టు సర్జరీకనుచుండు

కథల కథల గుట్ట కార్పొరేటు 

జబ్బు మాట కన్న డబ్బుదే మాటరా” అన్నారు. ఈ పద్యంలో కార్పొరేట్ వైద్యాన్ని గురించి ఎంతో వాస్తవికంగా వర్ణించారు కవి.


తెలుగు సాహిత్యంలో విశ్వకవి గుర్రం జాషువా ప్రభావం సామాన్యమైందికాదు. ఆయన కాలంనాటి వాళ్ళను మాత్రమే కాకుండా తరువాత అనేక తరాల వాళ్ళను కూడా ఆయన ప్రభావితం చేస్తున్నాడు. ఆయన రచించిన సాహిత్య  విశిష్టత అంత గొప్పది. జాషువా సాహిత్యాన్ని గురించి వర్ణిస్తూ…

కవిత పద్యమైన కమనీయ భావంబు

వస్తువేది యన్న, వాస్తవమ్ము

జాతి మేలుకొలుపు జాషువా కవనంబు” అని జాషువా పద్యంలోని సమకాలీన సామాజిక వాస్తవికతను ఈ పద్యంలో దార్ల కవి వర్ణించారు. సాహిత్యంలో రూపం ప్రధానమా? సారం ప్రధానమా అని ఒక చర్చ విస్తృతంగా జరిగింది. ఛందోబద్ధమైన పద్యంలోనే  తన సాహిత్యాన్ని అత్యధికంగా రచించినప్పటికీ సారంలో చూస్తే సామాజిక వాస్తవికతే జాషువా సాహిత్యానికి ఆత్మ.

ఇంతే కాకుండా, నాగరిక జీవనాన్ని, కుల జాడ్యాన్ని, స్త్రీ గొప్పతనాన్ని, సమాజంలో రోజు రోజుకీ మరింతగా వ్యాపిస్తున్న కులాన్నీ, ఆ వివక్షతను కొన్ని పద్యాల్లో వర్ణించారు. సమకాలీన నాగరిక జీవన విధానాన్ని, కనిపించి కనిపించని సామాజిక పొరలలో ఓటుకు నోటు, నోట్ల రద్దు నాటి అవస్థలు, నల్లధనం, లోనుల పేరుతో బడా బాబుల బ్యాంక్ దోపిడిలు, ఎన్నికల సమయంలో హడావిడి వంటి అనేక సామాజిక అంశాలను కవి ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు తన పద్యాలలో ప్రస్తావించి ప్రశ్నించారు. తాను ఛందోబద్ధమైన పద్యంలోనే  రచన చేస్తున్నప్పటికీ ఆధునిక వచన కవిత్వం కంటే సరళ సుందరంగా పద్యాలు కొనసాగడం ఈ కవి రచనాశైలిలోని విశిష్టత. తన పద్యంలో అలవోకగా ఇంగ్లీషు పదాలు కూడా కలిసిపోయి, నిత్య వ్యవహారంలో కనిపించే తెలుగు భాషా సౌందర్యాన్ని తనపద్యంలో నిక్షిప్తం చేశారు కవి. దార్ల మాట శతకం నిండా మన చుట్టూ ఉండే అనేక సమస్యలతోపాటు, మన మానసిక సంఘర్షణలు పద్య రూపంలో కనిపిస్తాయి. కవి సామాజిక ప్రయోజనాన్ని కూడా తన రచనలో చూపించాలని అనుకున్నప్పుడు  ఏ రూపంలో రచనను కొనసాగించి నా, దానిలోనూ తన దృక్పథాన్ని ప్రదర్శించవచ్చు. ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు సాహిత్య విమర్శకుడిగా, పరిశోధకుడిగా ప్రసిద్ధి. ఆ తర్వాత వచన కవిగా కూడా అనేక కవితలు రచించారు. కానీ ఆధునిక కాలంలో పద్యాన్ని కూడా ఇంత సరళంగా రాయడం ఈ శతకంలో కనిపించే ప్రత్యేకత. ఒకవైపు పరిశోధన, సాహిత్య విమర్శను విస్తృతంగా రాస్తూనే, మరొకవైపు వచనకవిత్వంతో పాటు పద్యాన్ని కూడా రాయడం అభినందనీయం. ఇలాంటి సామాజిక ప్రయోజనం కలిగే మరెన్నో రచనలు ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు కలం నుండి జాలువారాలని ఆశిస్తూ.....


అనిల్ కుమార్ దారివేముల

మాచర్ల, పల్నాడు జిల్లా,

ఫోన్: 9951244718.


కామెంట్‌లు లేవు: