"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL-502: Techniques of writing a Dissertation క్లాసులు సోమ, మంగళ, గురు, శుక్రవారం మధ్యాహ్నం 12.00 గంటల నుండి 1.00 వరకు డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ భవనంలో జరుగుతాయి.

తెలంగాణ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
తెలంగాణ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

17 ఫిబ్రవరి, 2017

తెలంగాణ భాష ( డా.చింతం ప్రవీణ్ కుమార్, మనతెలంగాణ, Oct 03, 2016 సౌజన్యంతో)

“తెలుగు రాష్రాల్లో నాలుగు మాండలికాలున్నా తెలంగాణ భాష అంతా ఒకే మాండలికంగా (ఉత్తర మండలం) పరిగణించ బడుతుంది. అయితే తెలంగాణ తెలుగు భాష తెలంగాణ ప్రజల వ్యావహారిక జీవన విధానానికి దగ్గరగా ఉంటూనే కావ్యభాషకు, గ్రాంధిక భాషకు చాలా దగ్గరగా ఉండడం విశేషం. ద్రావిడ భాషా పదాలు, ఉర్దూ పదాలు, ఆంగ్ల పదాలను, ముఖ్యంగా తమిళ భాషా సంబంధ పదాలను చాలా చక్కగా తనలో ఇముడ్చుకున్న  తెలంగాణ భాషా పదాలు నిత్యజీవిత, వ్యవహారిక జీవనానికి దగ్గరగా ఉండి ఇక్కడి శ్రామిక, బహుజన, అణగారినవర్గాల, పల్లీయుల జీవితాలను ప్రతిబింబింపచేస్తాయ్. “
తెలంగాణ మట్టి మనుష్యుల బోలాతనం అంతా వారు మాట్లాడే భాషలోనే దాగుంది. ఎలాంటి కల్మషంలేని తెరచిన పుస్తకంలాంటి వాళ్ళ జీవితాల్లాగే వాళ్ళ భాష కూడా తెరచిన పుస్తకంలాగా నది దుంకినట్టు జలపాతపు పరుగులా గలగలా ఉంటది.తెలంగాణ పదకోశ పితామహుడు డా.నలిమెల భాస్కర్ గారు అన్నట్టు తెలంగాణ తెలుగు భాషకు ‘ ధ్వని ’యే జీవం.తెలంగాణీయుల సంభాష ణల్లో నిశ్శబ్దం తక్కువ. నినాదమిచ్చినా నిమ్మళ పడమని చెప్పినా ధ్వనిలో చెప్పడం ఇక్కడి భాషా సహజత్వం. ఈ భాషలోని పదాల అర్థాల కోసం ఏడిండ్ల పిల్లి కూనోలే గ్రంధాలయాల చుట్టూ తిరుగుతూ నిఘంటువుల్లోకి పరకాయ ప్రవేశం చేయాల్సిన పని లేదు. అరుగుల మీద మన తాతమ్మల నాయనమ్మల దగ్గర కూసోని కొంచెం సేపు ముచ్చట పెడితే తెలిసిపోతది ఇది పక్కా మట్టిమనుష్యుల భాష అనే విషయం. వింటూ వింటూనే గుండెలో గూడు కట్టుకుని మనల్ని చెక్కిలిగిలి పెడుతూనే ఉంటదీ డబల్ కా మీటా భాష.వింటూ వింటూడగానే మనిషికి మనిషితనానికి సోల్తి ఐతదీ భాష. గిట్లనే మాట్లాడాలని నియమాలు,హద్దులు గీసుకోకుండా బొక్కముదరని పోరల నుండి ముసలోల్లు ముడిగోల్ల వరకు తంతె తంతెకు మధ్య ప్రవహిస్తూ పెదాలపై ఆడుతూ నాలుకలపై నాట్యమాడే జాన్ జిగ్రీ భాష. మొక్కేది బండ తొక్కేది బండలాంటి పదాలతో తాత్వికతను తెలుపుతూనే సచ్చినోని ముడ్డి కిందికయితేంది మీదికయితేందంటూ జీవనతత్వాన్ని చెప్పగలదీ భాష. పెదాలపై ఉషారుగా వెలుగుజిలుగులతో చమ్కాయించే భాష. తెలంగాణ భాష జీవ భాష.ఆశు భాష.జోర్దారైన భాష. మొత్తంగా మానవీయ భాష.
ఆవేశమైనా ఆక్రందనైనా ఆప్యాయతైనా తెలంగాణ తెలుగు భాష నిత్య చైతన్యపు ధారతో ప్రవహిస్తది. ముఖ్యంగా తెలంగాణ భాషను నాదమయం చేయడంలో ‘పూర్ణానుస్వారం’ పాత్ర కూడా గొప్పదన్న డా.నలిమెల భాస్కర్ గారి మాటలు అక్షర సత్యాలు. తెలంగాణ పదంలోనే పూర్ణానుస్వారం ఉంది. వరంగల్,కరీంనగురం,నల్లగొండ,ఖమ్మం లాంటి జిల్లాల పేర్లే కాకుండా జిల్లాల్లోని ఊర్ల పేర్లలో కూడా చాలామట్టుకు పూర్ణానుస్వారం ఉంటుంది. ఉదా: మంథని, ఖమ్మంపల్లి, బెల్లంపల్లి, జనగాం, చంద్రుగొండ, సంగారెడ్డి… మొదలైనవి. పదాల్లో కూడా పూర్ణానుస్వారం చేరి మాటలే సంగీతపు పాటల్లాగా నాట్యమాడతాయ్. ఉదా. నాగుంబాము, లచ్చిందేవి, తెల్లందాకా, గోంగూర మొదలైనవెన్నో పదాలు పూర్ణానుస్వారం కలిగి విసనొంపుగా ఉంటాయ్. చాలా మట్టుకు తెలంగాణ భాషా పదాల్లో పూర్ణానుస్వారం చేరి పదాలకు నిండుదనం చేకూర్చి సంభాషణలకు జవం జీవం కలిగిస్తాయి.కేవలం మాట్లాడే మాటల్లో శబ్దాన్ని బట్టి ‘తెలంగాణోడు’అని గుర్తుపట్టవచ్చు. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక ప్రత్యేకతలు కలిగి ఉన్న తెలంగాణ భాషలో అన్నింటికన్నా చక్కనైన విషయం ఈ భాషలో దాగి ఉన్న ‘మానవీయ సంభాషణ’. ఒక్కో పదం ఒక్కో మానవీయ స్పందనను కలిగి ఉండి సాటి మనిషిని తట్టి లేపుతుంది. ‘ఎట్లున్నవే ’ ‘ అట్ల గాదే ’, ‘ ఇట్ల గాదే ’ ‘కొంచెం ఏసుకోరాదే’ అంటూ ఆప్యాయతల్లో స్త్రీ లింగం పు:లింగం ఉండదని మానవీయత మాత్రమే ఉంటుందని తేల్చిచెప్పిన మానవీయ భాష తెలంగాణ తెలుగు భాష. గొంతులోంచి పలికే ప్రతీ మాట ఎదుటి వ్యక్తి చెవుల్లో నుండి సరాసరి హృదయంలోకి చేరే నాధమాధుర్యం కలది తెలంగాణ భాష.మాట్లాడుతూనే ఎదుటి వారిని తమలో కలుపుకోగల ఆప్యాయమైన వాక్యాలు,వావి వరుసలు ఈ భాష సహజ గుణాలు.మాట్లాడుతూనే సాటి మనిషి మోములో చిల్కనవ్వులు పూయించగల రామసక్కదనాల భాష తెలంగాణ భాష. గుడ్డి కొంగలోలె బతుకుతూ గొడగొడ ఏడుస్తునోళ్ళకు గుండె ధైర్యం చెప్పి భాసటగా నిలబడే భాష. ఏడ్సి మొత్తుకునే ఏడ్పుగొట్టోళ్ళను కూడా ఖుషీ ఖుషీ మాటలతో కిచ్చర కిచ్చర నవ్వించే భాష తెలంగాణ భాష. తెలిసీ తెలవనోడు ఒక మాట అన్నా చల్‌నేదో బాల్ కిషన్ అంటూ సాటి మనిషిని క్షమించే నిండుకుండలాంటి భాష. మొత్తంగా కడుపుల ఇసం లేని భాష తెలంగాణ తెలుగు భాష. కలగల్ల మొకం గల తెలంగాణ వాసుల్లాగే కలగల్ల భాష తెలంగాణ తెలుగు భాష.
తెలుగు రాష్రాల్లో నాలుగు మాండలికాలున్నా తెలంగాణ భాష అంతా ఒకే మాండలికంగా (ఉత్తర మండలం) పరిగణించబడుతుంది. అయితే తెలంగాణ తెలుగు భాష తెలంగాణ ప్రజల వ్యావహారిక జీవన విధానానికి దగ్గరగా ఉంటూనే కావ్యభాషకు,గ్రాంధిక భాషకు చాలా దగ్గరగా ఉండడం విశేషం. ద్రావిడ భాషా పదాలు,ఉర్దూ పదాలు,ఆంగ్ల పదాలను,ముఖ్యంగా తమిళ భాషా సంబంధ పదాలను చాలా చక్కగా తనలో ఇముడ్చుకున్న తెలంగాణ భాషా పదాలు నిత్యజీవిత,వ్యవహారిక జీవనానికి దగ్గరగా ఉండి ఇక్కడి శ్రామిక,బహుజన,అణగారిన వర్గాల,పల్లీయుల జీవితాలను ప్రతిబింబింపచేస్తాయ్. చాలా మట్టుకు పదాల్లో జానపద బాణీల సొగసును నిండా నింపుకుని డమడమ మ్రోగే డమరుకంలా నిత్య జీవచైతన్యాన్ని కలిగి ఉంటుంది తెలంగాణ భాష. కాస్తంత ఎటకారం,ఇంకాస్త మమకారం,ఇంకొంత చతురత,మరికొంత మోటు సరసపు పదాలు అలవోకగా తెలంగాణ తెలుగు భాషలో పలుకుతాయ్. ఇక్కడి మాటల్లోని సంభాషణలు కథ చెబుతున్నట్టుగా వినసొంపుగా ఉన్నచోటే స్తంభింపచేస్తాయ్. ఉప్పుతో తొమ్మిది పప్పుతో పది అయిన సంసారపు తత్వాన్ని ‘ఉపాసముంటే అప్పుదీరది…ఊపిరి వడ్తె బొర్ర నిండదని’ గొప్పగా పట్టిస్తుంది తెలంగాణ భాష.అమ్ముడు బోయినా సరే చేసిన బాకీ కట్టాలనే ఇజ్జత్‌ని నేర్పించే సామాజిక భాష ఇది. ఎవల ముందు పర్వ తక్కువ కాకూడదని భోదించే ఆత్మగౌరవ భాష. ఏరు పడితే మేలు పొత్తుంటే పోరు మొగడా’ అని మొత్తుకునే ఆడోళ్ళకు కండ్ల సలువ చేసేటట్టు ఎయ్యి ఏండ్లున్నా ఏరు తప్పది నూరేండ్లున్నా సావు ’ తప్పదనే గొప్ప తత్వాన్ని భోదిస్తూనే కడుప లోపలున్న సుకం కాశికిపోయినా దొరకదు’ జాగ్రత్త అని హెచ్చరిస్తూనే ఉంటుందీ భాష.
అన్నింటికంటే ముఖ్యమైన అంశం ఏమిటంటే…తెలంగాణ తెలుగు భాష సంగీత సౌందర్యం అత్యద్భుతం. ఇక్కడ భాషలో మాట పాట వేర్వేరు కాదు మాటను కాస్తంత ఒత్తి పలికితే పాట అయ్యేటంత సృజనాత్మకత ఈ భాష సొంతం.మొత్తంగా ఇక్కడి సమాజంలో ప్రవహించే మనిషి గొంతుకలో జీవ ప్రవాహంలా గళగళలాడుతూ కణకణలాడే పదాలతో బాధ, సంతోషం, సంబురం, ఉత్సవం అన్నింటిని తనలో ఇముడ్చుకునే జీవనది తెలంగాణ తెలుగు భాష.ముఖ్యంగా తెలంగాణ భాషలో ఉన్న అతి ముఖ్యమైన అంశం నిజాయితీతో కూడిన సంభాషణ. సూటిగా సక్కగా మాట్లాడడం తెలంగాణ తెలుగు భాషలో కనిపిస్తుంటుంది. తెలంగాణ భాషలో గుసగుసలు తక్కువ. ఉసురుతీసే ఉల్ట మాటలు తక్కువ. ఏం మాట్లాడినా బాజాప్తానే మాట్లాడే గుణం తెలంగాణ భాష సహజ గుణం. కోపమొచ్చి ఇయ్యర మయ్యర తిట్టినా కడుపుల ఇసం పెట్టుకునే భాష కాదు తెలంగాణ భాష. అలాగని ఊ అనక ఉప్పు రాయనక ఉల్కుపల్కు లేకుండా కూసోదు. ఈపుల ముల్లు పెరిగినోళ్ళను మాత్రం ఒకే ఒక్క మాటతో కండ్లపొరలు తీసే భాష తెలంగాణ తెలుగు భాష. అమాయకులను ఇబ్బంది పెట్టే భాష కాదు. ఎంత చెడు చేసిన వాళ్ళనయినా తిట్టాలనుకుంటే ‘ ఎవ్వల్ పున్నెం గట్టుకున్నరో గని ’ అని బాధ పడడమే తెలుసు ఈ భాషకి ‘ఎంటికి తెంపి పారేస్తే కొసా మొదలు తెల్వనోళ్ళతోని వాదులాట ఈ భాషలో ఉండదు. కానీ ఎడ్డెం అంటె తెడ్డెం అనేటోళ్ళ మీదనే ఇర్సుకపడ్తదీ భాష. అలాగని మరీ మూగదయ్యం పట్టదీ భాష… మోసం చేయాలనుకునోళ్ళ విషయంలో ఏడాకులు ఎక్కువనే సదువుకున్న భాష రేషగొండి భాష. ఇట్టం లేని మొగని మీద తల్వాలు పోసినట్టుండదీ భాష. నచ్చుతనే కలుపుగోలుగా నాలుగు మాటలెక్కువ మాట్లాడి…నచ్చకుంటే అస్సల్ మాట్లాడని భాష తెలంగాణ భాష. మొత్తంగా మాటతోనే మనిషిని పట్టిచ్చే సాఫ్ సీదా భాష. మానవీయ సంభాషణల కలపోత. మట్టిమనుష్యుల అసల్ సిసల్ భాష తెలంగాణ తెలుగు భాష.
డా.చింతం ప్రవీణ్‌కుమార్
9346 886 143

తెలంగాణ భాష – ప్రామాణిక రూపం (మన తెలంగాణా పత్రిక, Aug 08, 2016 సౌజన్యంతొో...)

దాదాపు రెండు వందల సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం కుతుబ్‌షాహి ఆసఫ్‌జాహి వంశాల ముస్లింల పాలనలో వుండటం చేత సీమాంధ్రలోని సామాన్య జనులతో ఆదాన ప్రదానాలు తేలిపోవటం చేత భాష సంస్కృతులలో విలక్షణతలు కలిగి ఉంది. పారశీ ఉర్దూలు అధికార భాషలుగా వుండేవి. ఉర్దూ విద్యామాధ్యంగా వుండేది. దాంతో తెలంగాణ తెలుగులో ఉర్దూ పదాలు ప్రవేశించాయి. ఉర్దూ భాషలోని నుడికారాలు, భావ ప్రకటనలోని రీతులు తెలంగాణ తెలుగులో చోటు చేసుకున్నాయి. పాలకుల భాషనేకాక జీవన విధానం పండుగలు, పండగలు జరపుకునే పద్ధతులు తెలంగాణ సంస్కృతిలోకి చొచ్చుకొని పోయాయి. ముస్లిం సంస్కృతిలోని మర్యాద మన్ననలలు స్నిగ్ధత సౌజన్య సౌకుమార్యాలు తెలంగాణ ప్రజా సంస్కృతిలో చోటు చేసుకున్నాయి. దాంతో తెలంగాణ ఒక విభిన్న మైన భాషా సంస్కృతులతో కూడిన ప్రాంతంగా మారింది. బ్రిటిషు పాలనలో తమిళ సంస్కృతి ప్రభావంతో తలమునకలైన సీమాంధ్రులచే తెలంగాణ భాషా సంస్కృతులు పరాయికరణకు గురయ్యాయి. వాటిని అర్థం చేసుకొని అక్కున చేర్చుకోకపోవటమే గాక ఉపేక్ష, వివక్షత, వెక్కిరింతలకు గురి చేయటంతో తెలంగాణ ఎప్పుడూ పరాయిగానే ఉండిపోయింది. తెలంగాణ ప్రజల్లో అవి మాయని గాయంలా వుండిపోయింది. క్రమంగా అదే విభజనకు దారి తీసింది. పోకిరి పిల్లవాడు అమాయకురాలయిన అమ్మాయి మధ్య సంబంధం తెగతెంపులై ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాలు అవతరించాయి. అయినా వాళ్ళువీళ్ళు తెలుగు ప్రజలే! వారి భాష తెలుగు భాషే!
తెలంగాణ భాష హైదరాబాద్ నగరంలానే ఎక్కువగా ఉర్దూ పదాలు చేరి మణి ప్రవాళ భాషగా మారింది. కాని పట్టణ పల్లె ప్రాంతాల్లో తెలంగాణ భాష తన దైన నుడికారాన్ని పదజాలాన్ని కోల్పోలేదు. సీమాంధ్రలో ముఖ్యంగా ఆంధ్ర ప్రాంతంలో ప్రజలు తెలుగు ఇంగ్లీషు తమిళ భాషల ప్రభావంతో తమ అచ్చమైన స్వచ్ఛమైన తెలుగు నుడికారాన్ని మరచిపోయారు. అంతేకాదు ప్రాచీన కావ్యాల్లో వున్న ఎన్నో అచ్చ తెనుగు పదాలను ఆంధ్రులు విస్మరించారు. అచ్చమైన తెలుగు కవి తిక్కన ప్రయోగించిన అచ్ఛమైన తెలుగు పదాలు నుడికారాలను, శుక సప్తతి హంసవిశంతి సింహాసన ద్వాత్రింశిక వంటి ఎన్నో కావ్యాల్లో చోటు చేసుకున్న అచ్చమైన తెలుగు పదాలను ఆంధ్ర ప్రాంతాల వారు విస్మరించారు. వాళ్ళ నిత్య జీవితంలో అవి ప్రయోగంలో లేకుండా పోయాయి. ‘పోవటం’ కు బదులుగా ‘వెళ్ళటం’ ‘విసుర్రాయి’ బదులుగా ‘తిరుగలి’ అని ఇట్లా ఎన్నో అచ్చ తెలుగు పదాల స్థానంలో పరాయి పదాలను చేర్చి మాట్లాడటం నేర్చుకొని మాదే అచ్చమైన మంచి తెలుగు అని డబ్బా కొట్టుకున్నారు. తెలంగాణలోని అచ్చమైన తెలుగు పదాలను నుడికారాలను పట్టించుకోకుండ హేళన చేశారు. బ్రిటిషు పాలనకు, ముందు ముస్లిం పాలనలో ఆంధ్రప్రాంతంలో పరిపాలనా పరంగా కోర్టులు వ్యవహారాల్లో ఎన్నో ఉర్దూ పదాలు చేరాయి. అది వాళ్ళ దృష్టికి ఎక్కలేదు. షికారు, తమాషా, ఖాతరు, పేచీ, మరమ్మతు వంటి ఎన్నో ఎన్నో ఉర్దూ పదాలు తెలుగు పదాలే అనే భ్రమలో వుండిపోయారు. హైదరాబాద్‌లోని భాష విని తెలంగాణ తెలుగులో అన్ని ఉర్దూ పదాలే అని అనుకున్నారు. పల్లె ప్రాంతాల్లోని అచ్చమైన తెలుగు “ఫాసిల్‌” లాగా నిలిచిపోయి ఉన్న విషయం ఏ భాషావేత్తల దృష్టికి రాలేదు.
తెలంగాణ తెలుగులో సీమాంధ్రలో కన్పించని పదజాలం ప్రజల భాషలో కన్పిస్తుంది. ఉదా॥కు ఆంధ్రలో “చొక్కా” అనే పదానికి ‘అంగి’ అనే పదాన్ని తెలంగాణలో వాడుతారు. అసలయితే ‘అంగి’ ‘అంగము’ లకు సంబంధించిందని సంస్కృత మూలంగల పదమే. అదే విధంగా తెలంగాణలో “సంచకారి” పదాన్ని ‘అడ్వాన్స్’ గా ఇచ్చే డబ్బు అనే అర్థంలో వాడుతారు. విచిత్రంగా ‘సంచకారి’ పదం సంస్కృత పదం. సంస్కృతంలో అదే అర్థంలో వుంది. అదే విధంగా తెలంగాణలో ‘అజ్జకారి’ అని తిడుతారు. “ఆజ్ఞాకారి” ఆజ్ఞను పాలించేది (వాడు) అని ఆ పదానికి అర్థం. ఆజ్ఞాకారి ప్రాకృతంలో “అజ్జకారి” అయి తెలుగులో వెటకారంతో కూడిన తిట్టుగా మారి చేరిపోయింది. “మా చేసినవులే! అంటారు. ‘మా అనేది మహా” సంస్కృత పదానికి మారు రూపమే. “గడెగడెకు” అంటారు. ఇది ఘడియఘడియకు ’ అనే సంస్కృత పదానికి వికృత రూపమే. ఆపతి (ఆపద) సోపతి(స్నేహం), సోయి (స్పృహ) వంటి సంస్కృతం నుంచి వచ్చిన వికృత రూపాలు ‘లగ్నం’ అనే సంస్కృత పదం తెలంగాణ తెలుగులో ‘లగ్గం’ అయింది. వర్తి = వత్తి, బత్తి అయింది. ఈ విధంగా ప్రాకృత భాషాదుల నుంచి వచ్చిన పదాలు తెలంగాణ సామాన్య జనుల వాడుకలో కన్పిస్తాయి. ఇట్లా ఎన్నో సంస్కృత పదాల ప్రాకృత రూపాలు వికృతి రూపాలు తెలంగాణ ప్రజల ప్రతి నిత్యం భాషలో వ్యాప్తిలో ఉన్నాయి. తెలంగాణ తెలుగులో ఉర్దూ పదాలు ఎక్కువ అని భ్రమ. కాని ఒక విచిత్రమేమంటే తిక్కన వాడిన ‘తరాజు’, శ్రీనాథుడు ప్రయోగించిన ‘సామాన్లు’, పెద్దన పద్యంలోని “అలకని” (హల్కా) ఉర్దూ పదాలు ఆంధ్రుల వాడుకలో లేవు కాని తెలంగాణ ప్రజలు నిత్యం మాట్లాడుకునే భాషలో వున్నాయి. తెలంగాణ తెలుగులో దుకాణం, పోక్తా, రొట్టె (రోటి) వంటి ఉర్దూ పదాలు తెలుగు పదాలే అనిపించేంతగా వాడుకలో వున్నాయి.
“నాటగోలె”, “నాపొంటె” లోని “గోలె, పొంటె” వంటి నన్న యాది కవులు విభక్తి ప్రత్యయాలుగా వాడిన పదాలు తెలంగాణలో ఇప్పటికి ప్రజల భాషలో నిలిచివున్నాయి. గోలె = నుంచి, పొండె = వెంట అని నా పొంటె, నావైపు అని అర్థాలు. “అటెనుక” లేదా “అటెన్క” (అటు+వెనుక) అన్న పదానికి అటు తర్వాత అని అర్థం. కావ్యాల్లో కనిపించే ఈ పదం తెలంగాణలో ఇప్పటికి వాడుకలో ఉంది. ఇంతకుముందు అనటానికి “ఇది వరకు” అని తెలంగాణలో ప్రయోగం. ఆ విధంగా తెలంగాణలో కన్పించే పదజాలాలు, నుడికారాలు ఎన్నో అచ్చమైన తెలుగు భాషకు చెందినయి వున్నాయి. ఉదా॥కు అడపదడప, ఉత్తుత్తి, ఉత్తగా, ఎరుక లేదు, ఎరుకేనా, ఎల్లం, ఏగిరం, ఏట, ఒర్లటం, ఏతులు, ఏతుల మారి, కయ్యం, మొత్తుకొనుడు, వంకపెట్టటం, ఎనుకట, కొస (చివరి), పదిలం, జప్పున, కయ్యాల మారి, మలగటం, మర్లబడు, అనపకాయ, గోంగూర, గదుమ, బొక్క, బిరాన, పైలం, వైనం, బర్రె, బొర్ర, ఎత్తగొట్టటం, పిల్వనంపు, తోలుకొని పోవటం, పెండ, నీతోటి పని వడి వచ్చిన, నూకుడు, తంతెలు, యారాలు, ముంగల, ముందల, ముందల పడరు (పైకిరారు) అటకాయించటం, మస్తుగ, పోరి, పోరడు, పొల్ల, పొల్లగాడు, (పొల్ల నుంచే పిల్ల వచ్చిందేమో), సందు దొరకలేదు.
అండ లేదు. (సహాయం లేదు) ముందల (భవిష్యత్తు), ఇంటి కాడికి (ఇంటి దగ్గరికి), బక్కగయ్యిండు (చిక్కిపోయాడు), ఉరకటం, లొల్లి (గొడవ), కుతి లేసింది, నెగలటం, ఒకరి తెరువుకు పోడు, పొట్ట, పైసలు (డబ్బు) తెర్లు (వినాశం), అంత ఘనం (అంతగా), రంధి, సుత (కూడా), దూగడం ( ముందుకు రావటం) ముట్టజెప్పటం, లాశిగ (పెద్దగా), పొతం, కతలు, పుట్టిస్తరు, సాన్పి (పేడనీళ్లు), ఎగేసింది ( పురికొల్పింది), ఎడ్డి (అమాయకులు), బాసిండ్లు (గిన్నెలు), తపుకు (ప్లేటు), ఉడుకు (వేడి), పుణ్యానికి రావు (డబ్బుల్లేకుండా రావు లేదా కష్టపడకుండారావు) ఈ విధంగా ఎన్నో అచ్చ తెనుగు పదాలు తెలంగాణ భాషలో ఇతర ప్రాంతాల్లో లేకుండా పోయినయి కేవలం కావ్యాల్లో మాత్రమే లభించేవి. ప్రజల వాడుక భాషలో వ్యాప్తిలో ఇప్పటికీ ఉన్నాయి. తెలుగు పదాలను ఆ విధంగా రక్షించి నిలిపిన ఘనత తెలంగాణకే దక్కుతుంది.
తెలంగాణ భాషలో క్రియాపదాలు ప్రాచీన తెలుగు కావ్య భాషలోని ప్రయోగాలకు దగ్గరగా వుంటాయి. ఆంధ్ర ప్రాంతంలోని రూపాలకు భిన్నంగా కన్పిస్తాయి. ఈ క్రియాపదాలు తెలంగాణ సామాన్య జనుల వాడుకలో వున్నాయి. ఆంధ్రలో “వచ్చిం తర్వాత, పోయిం తర్వాత” అని వాడితే తెలంగాణలో ‘వచ్చినంక, పోయినంక’ అని వాడుతారు. “పరీక్షలయిన తర్వాత” అంటె తెలంగాణలో “పరీక్షలయినంక” అంటారు. “లాక్కొని వెళ్లాడు”కు తెలంగాణలో “గుంజుక పోయిండు” అని వాడుతారు. చెప్పించాడు, చేరాము వంటి ఆంధ్ర ప్రాంతంలోని క్రియాపదాలను “చెప్పించిండు, చేరినం”గా తెలంగాణ ప్రజలు వాడుతారు. “ఆలోచించడానికి” అని ఆంధ్రలో వుంటె తెలంగాణలో “ఆలోచించేటందుకు” అన్న క్రియా రూపాన్ని వాడుతారు. ‘మాయమవుతారు, బయల్దేరాను వంటి ఆంధ్రలోని క్రియా రూపాలు తెలంగాణాలో మాయమైతరు, బయల్దేరిన” రూపాలుగా వుంటాయి. చెయ్యడానికి, నియమించడానికి, బదులుగా తెలంగాణలో “చేసేటందుకు, నియమించేటందుకు” రూపాలు వాడుకలో వున్నాయి. “విసుక్కోవడం, వెళ్తుండగా” రూపాలు ఆంధ్రలో వుంటె తెలంగాణలో “విసుక్కునుడు, పోతుంటె” అన్న రూపాలు వున్నాయి.
నా ఇంటిపై వచ్చాడు, నా వైపు వచ్చాడు అని ఆంధ్రలో ఉంటే “నా ఇంటి మీదికి వచ్చిండు, నా దిక్కు వచ్చిండు” తెలంగాణలోని క్రియా రూపాలు ఉన్నాయి. ‘రానివ్వటం లేదు’, ‘అంత దాకా’ రూపాలు ఆంధ్రలో వుంటె తెలంగాణలో ‘రానియ్యటం లేదు’, ‘రానిస్త లేరు’ అంత దనుక అన్న రూపాలు జనుల వాడుకలో వున్నాయి. “తెలుసుకోవటం కష్టం” అన్న రూపం ఆంధ్రలో వుంటె, తెలంగాణలో “తెలుసుకొనుడు కష్టం” అని వాడుకలో వున్న రూపం. ఆ విధంగా ఆంధ్ర ప్రాంతాల్లో జనుల ప్రయోగంలోనూ, ప్రామాణిక భాషలోనూ ప్రయోగంలో వున్న కొన్ని క్రియా రూపాలు, పద రూపాలు. అవే తెలంగాణలో జనుల వాడుకలో తెలంగాణ రచయితల కథలు, కవిత్వం వంటి సాహిత్య ప్రక్రియల్లోను విభిన్న రూపంలో వున్నాయి. అంటే పదజాలంలో కన్నా క్రియా పదాల స్వరూపంలో చాలా విభిన్నత కన్పిస్తున్నది. ఈ క్రియా పద రూపాలను, తెలంగాణకే పరిమితమైన పదజాలాన్ని ప్రయోగిస్తూ రచన చేసినట్లయితే తెలంగాణ భాష ఒక ప్రత్యేక స్వరూపంతో కన్పిస్తుంది. తెలంగాణ భాషకు విలక్షతను తెచ్చిపెట్టేవి.
తెలంగాణలోని వేరువేరు జిల్లాల్లో క్రియా పదాలు వేరువేరు రూపాల్లో ఉచ్చారణలలో వాడుకలో వున్నాయి. ఉదా॥కు ‘వచ్చిండు’ క్రియాపదాన్ని తీసుకుంటె వచ్చిండు, ఒచ్చిండు, అచ్చిండు, అత్తాండు అని వేరువేరు రూపాలు కన్పిస్తున్నాయి. ఇక , “వచ్చారు” అని, బహువచన రూపాన్ని తీసుకుంటె, వచ్చిండ్రు, వచ్చిన్రు, అచ్చిన్రు, అచ్చిండ్రు అని వేరువేరు రూపాలు కనిస్తున్నాయి. “వచ్చింది” అనే స్త్రీ వాచక ఏకవచన క్రియ తెలుగులో అన్ని ప్రాంతాల్లో సమానంగా ఉంది. కాని పురుష వాచక ఏకవచన క్రియ తెలంగాణలో ‘వచ్చిండు’ అని వుండగా వేరే ప్రాంతాల్లో ‘వచ్చాడు’గా వుంది. కాళోజి వచ్చింది అన్న క్రియ ఏకవచనం పురుష వాచకంలో ప్రత్యయం చేరి “వచ్చిండు” అని కావటం సరిగ్గా వుంది. కాని ‘వచ్చాడు’ అని ఎట్లా అవుతుంది? అని ప్రశ్నించాడు. నిజంగానే ఏకవచనంలో స్త్రీ వాచకం ‘వచ్చింది’ అయితే పురుష వాచకంలో ‘వచ్చాడు’ అని కాక ‘వచ్చిండు’ అని అనటమే శాస్త్రీయంగా, వ్యాకరణ బద్దంగా వుంది. అదే విధంగా బహువచనంలో “వచ్చారు” కన్నా వచ్చి+ను+రు = ఈ విధంగా వచ్చిన్రు అవుతుంది. ఈ రూపంను నుగాగమం చేరి వాకరణ బద్దంగా సరయిన రూపం అవుతున్నది. వచ్చిన్రు రూపమే “వచ్చిండ్రు” గా కూడా వుంది. వచ్చి+ం+డు+రు= వచ్చిండ్రుగా ఏర్పడుతున్నది. కాని వచ్చిన్రు, వచ్చిండ్రు రెండు రూపాల్లో ఒక్క రూపాన్ని ప్రామాణిక భాషలో గ్రహించాలి. తెలంగాణ భాషలో పదాలను, జాతీయాలను, నుడికా రాలను వున్నదున్నట్లుగా వాడుకోవాలి. తెలుగు భాషను సుసంపన్నం చేసుకోవాలి. కాని ఆ పదాలను నుడికారాలను సరయిన అక్షర క్రమంతో సరయిన రూపంలో వాడుకోవాలి.
అంటె ఉదా॥కు ‘బర్రెలు’ శబ్దాన్ని కొన్ని ప్రాంతాల్లో కొన్ని వర్గాల్లో ‘బల్రు’ అని ఉచ్చరిస్తారు. అప్పుడు ‘బల్రు’ కాక ‘బర్రెలు’ అనే రూపాన్ని తెలంగా ణ ప్రామాణిక భాషలో వాడాలి. ‘ఇక్కడ’కు బదులు జనుల వాడుకలో ‘గిక్కడ’ అని వుంది. అప్పుడు ‘గిక్కడ’ కాక ‘ఇక్కడ’ను ప్రామాణిక రూపంగా తీసుకోవాలి. ‘చూడబోతె’ క్రియా పదం వాడుకలో ‘సూడబోతె’ అని వుంది. ‘చూడబోతె’ క్రియా పదాన్ని ప్రామాణిక రూపంగా గ్రహించాలి. ‘విసుర్రాయి’ పదం తెలంగాణ లోనే వాడుకలో వుంది. కాని అశిక్షితులు ‘ఇసుర్రాయి’ అంటారు. అప్పుడు “ విసుర్రాయి” నే రూపాన్నే ప్రామాణిక భాషలో చేర్చుకో వాలి. ఇక క్రియా పదాలకు వస్తే “వచ్చింది, వచ్చిండు, వచ్చిన్రు” రూపాలను, ప్రామాణికంగా గ్రహించి “అచ్చిండు, అచ్చిండ్లు” రూపాలను పరిహరించాలి. కథలు, నవలలు వంటి సృజనాత్మక రచనల్లో పాత్రోచితభాషగా అటువంటి పదాలను వాడితే వాడవచ్చు ను. కాని తెలంగాణ ప్రామాణిక తెలుగు భాషను ఏర్పరుచు కున్నప్పుడు అటువంటి అశిక్షితుల, వర్గ, కుల మాండలిక రూపాల ను పరిహరించాలి. కాని ప్రజల వాడుక భాషలో వున్న అరుదైన పదాలను మాత్రం ప్రామాణిక భాషలో చేర్చుకొని తెలంగాణ ప్రామాణిక భాషను ఒక వినూత్న రీతిలో మలచుకోవలసిన అవసరం వుంది. ఈ అరుదైన పదాలను సీమాంధ్రులు కూడా తీసుకొని తమ భాషను సుసంపన్నం చేసుకోవచ్చును!
SUJATHA-REDDY
డా.ముదిగంటి సుజాతా రెడ్డి
9963431606

25 ఆగస్టు, 2010

'సవర్ణ' ..దీర్ఘ సంది

Courtesy by Andhra Jyothy

'సవర్ణ' ..దీర్ఘ సంది

మేము కూర్చున్న కుర్చీని
గంగాజలంతో 'శుద్ధి' చేసే కులగాన గంధర్వులున్న చోట
ద్వేషించడాన్ని ప్రేమించడమే నేర్చుకున్నచోట
అరవై వత్సరాల స్వాతంత్య్ర తంత్రంలో
అరవీసం పరతంత్రాన్ని పారద్రోలనిచోట
వివక్షకు సామ్రాజ్యాలే నిర్మితమౌతాయ్
ద్రావిడ భూమిలో దళితులకవమానాలే మిగులుతాయ్...

కులపిచ్చగాళ్లకు దేశమొక ఎలమావితోట...
కుల దూషణ పర్వాన్ని
కుబుసంలా విప్పిన మిస్టర్ ఇండియా ఎవడోగానీ
వినమ్రంగా వీధులూడ్చి
వెలివాడల్లో బతుకులీడ్చి
ఈ జాతికి జవ్వనాశ్వంలా మేము శ్రమదానం చేస్తున్నా
కుల ఓంకారాన్ని ప్రణవాక్షరం చేసుకున్న
దేశపౌరుల గుండెలోతులు తెలుసుకోగలమా!

దేశ నాయకుడు చస్తే
దేశీయులకు శోక సంగీతం వినిపించినట్లు
హస్తిన వీధుల్లో ఒక 'సవర్ణ' ఎన్టీఆర్ తొడగొడితే
ఆస్సీల దేశంలో దేశబాలలు తిరగబడితే
ఆత్మగౌరవ వీణను మీటిన తెలుంగునేల
గాంధీ పేరు పెట్టుకున్న ఎస్సీ అధికారిని
బ్రాందీ తాగి బస్సులు నడిపే సవర్ణుడొకడు మెడపడితే
నోరు మెదపదేల ఓ తెలుగు బాలా!
ఓ విశ్వదాభిరామా! మేము తెలుగువాళ్లం కామా!!
మలేసియా తెలుగోళ్ల కన్నా అడుగంటిపోయామా!
మేమేం శంకరాచార్యపీఠం అడుగుతున్నామా!

అండర్సన్‌ను అప్పనగా అప్పగించినట్లు
'ప్రతిభ' బూచితో 'శ్రమను' దోచుకుపోయేవాళ్ల మీదా
జాతీయుల్ని అస్పృశ్యులుగా చూసేవాళ్ల మీదా
కులానికి 'పరిశుద్ధతను' చేకూర్చిన రాతల మీదా
మనుషులెవ్వరు మాట్లాడని 'దేవభాష'లో
అస్పృశ్యతకు 'గీత'లిచ్చిన వాళ్లమీదా
దళితుల ప్రాణాలకన్నా ఆవులే మిన్నన్నవాళ్లమీదా
ఈ గండుకోయిలలు కూయవెందుకో
ఈ కవికుల గురువుల మౌనమెందుకో!

దేశం సర్వసత్తాక 'సంక్షేమ రాజ్యం' గనక
ప్రతిఏటా గణతంత్ర రాజ్య దినోత్సవమొస్తుంది గనక
ఎవడు దేశభక్తుడో ఎవడు సవర్ణుడో
సమాజం 'ఆక్టోపస్ పాల్'ఐ చెప్పేస్తుంది గనక
బడుగులపై అడుగడుగునా విషం కక్కినా ఫర్లేదు గనక
భారత మాత ముద్దుబిడ్డల అమృత హస్తాల్లో
అవర్ణులకు శాశ్వతావమానం తప్పదిక...

మిత్రులారా! కులం రాడార్ మీద
దేశీయ దళిత బతుకుల్ని మసకబార్చారెవరో!
దేశీయ చిత్రపటంపై కుల అసంతృప్త ద్రావకాన్ని పోసేసి
రాజ్యాంగ ఉ్రద్గంధంలో
సామాజిక న్యాయపుటల్ని చించుకుపోయారెవరో!

తెలుగు ప్రిటోరియాలో ఇహ నుంచి
వీధికో అపార్తైడ్ మ్యూజియంలే కనిపిస్తాయ్...
హైనాలే మానవ హక్కుల కోసం విలపిస్తాయ్...
-తుల్లిమల్లి విల్సన్ సుధాకర్
(ఆంధ్రాలో ఒక దళిత జాయింటు కలెక్టర్‌ను కులం పేరుతో దూషించారని తెలిసి ఆవేదనతో..)

21 జనవరి, 2010

నేను తెలంగాణ ప్రత్యేక రాష్ట్రానికి వ్యతిరేకం కాదు! ఆపార్థం చేసుకోకండి!!

డియర్ ఫ్రెండ్స్, బ్లాగర్స్ అండ్ తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ కార్యకర్తలారా!
నా బ్లాగులో తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని ఎప్పుడూ తక్కువ భావంతో చూడలేదు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం రావాలని మనస్స్పూర్తిగా కోరుకుంటున్న వాణ్ణి. నేనూ అనేక అణచి వేతలకు గరవుతున్న వర్గం నుండి వచ్చిన వాణ్ణే. పీడన ఎలా ఉంటుందో తెలిసిన వాణ్ణి. ఒక రచయితగా, ఒక కవిగా, ఒక పౌరుడిగా సమాజంలో జరుగుతున్న అనేక అంశాల పట్ల మన స్పందనలు వ్యక్తం చేస్తుంటాం. అలాగే నేనూ తెలంగాణ ప్రాంతంలో జరుగుతున్న ఉద్యమానికి సంబంధించి మొదటి నుండీ నేటి వరకూ ఆ ఉద్యమం పట్ల సానుభూతి ఉన్నవాణ్ణే. దీనికి ఉదాహరణగా నెట్ లో నేటికీ ఉన్న నా అనేక అభిప్రాయాలే నిదర్శనం.

ఆంధ్రప్రదేశ్ విభజన విషయంలో మీ ఆకాంక్షలు, ఆలోచనలేమిటి? పేరుతో నా బ్లాగులో ఒక పోస్టు రాశాను. ఆంధ్రప్రదేశ్ విభజనకు ముందూ, తర్వాతా మన అభిప్రాయాలూ, ఆకాంక్షలు ఎలా ఉంటాయో, మనం సమాజాన్ని ఎలా అర్థం చేసుకుంటున్నామో తెలుసుకొనే విధంగా ఒక బ్లాగరుగా కొన్ని ప్రశ్నలతో ఒక పోస్టు రాశాను. దాన్నిఒకరిద్దరికి కలిగిన అపార్థం చేసుకున్నారు. అందువల్ల మరింత మంది అపార్థం చేసుకోకుండా నా బ్లాగు నుండి దాన్ని తొలగిస్తున్నాను.

ఇదే బ్లాగులో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ప్రక్రియ త్వరితగతిని మొదలు పెట్టాలి! అని 12/23/09 రాశాను.

హైదరాబాదుతో కూడిన తెలంగాణా రాష్ట్రం కావాలి!
అని12/2/09 నాడే యూనివర్సిటీలో జరిగిన సంఘీభావ ప్రకటన అనంతరం ఒక పోస్టు రాశాను. తెలంగాణ రాష్ట్రం కోసం జరుగుతున్న ఉద్యమాన్ని సమర్థిస్తూ రాసిన ఇలాంటి అనేకమైన నా పోస్టులు ఉన్నాయి.
కొన్ని పోస్టులు రాసినప్పుడు ఎంతమంది స్పందించారు. అప్పుడు ప్రతిస్పందించని వారు కూడా ఇప్పుడు ప్రతిస్పందించడానికి కారణం, బహుశా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పట్ల నా అలోచనలో ఏమైనా మార్పు వచ్చిందని అపోహ పడి ఉండవచ్చునని అనుకుంటున్నాను. అందువల్ల వీరందరికీ స్పష్టంగా వివరించడానికే ఈ సవరణ ప్రకటన చేస్తున్నాను. ఎప్పటికీ వివక్ష, పీడనలకు వ్యతిరేకంగానే నా అలోచనలు, నా రచనలు కొనసాగుతాయణీ గమనించవలసిందిగా కోరుతున్నాను.






02 జనవరి, 2010

ఏమిటీ పెద్ద మనుషుల ఒప్పందం ?


(తెలంగాణ ఉద్యమం చరిత్రలో అందరూ తెలుసుకోవలసిన లేదా తెలుసుకోవాలనిపించేది ’పెద్దమనుషుల ఒప్పందం’ ఒకటి. దీని గురించి ఆంధ్రజ్యోతి ( 2- 1-2010) లో ప్రచురించారు. విద్యార్థులకు అందుబాటులో ఉంటుందని భావించి ఆ పత్రిక సౌజన్యంతో దీన్ని ఇక్కడ ప్రచురిస్తున్నాను)


ఆంధ్ర రాష్ట్రంలో తెలంగాణ విలీనాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన మౌలానా ఆజా ద్‌ కూడా పండిట్‌ నెహ్రూ నచ్చచెప్పిన మీదట 1956 ఫిబ్రవరిలో విశాలాంధ్ర ఏర్పాటునకు సుముఖుడయ్యారు. ఆ తరువాత తెలంగాణ నాయకులను ఒప్పించే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. ఫిబ్రవరి 15న తనను కలిసిన తెలంగాణ నాయకులకు ఆంధ్రలో తెలంగాణ విలీనానికి అంగీకరిస్తే తెలంగాణకు ఒక ప్రాంతీ య కమిటీ నేర్పాటు చేయడం జరుగుతుందని కేంద్ర హోంమంత్రి జి.బి.పంత్‌ సూచించారు.

అయినప్పటికీ వారు తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా ఉంచాలనే తమ డిమాండ్‌ ను పునరుద్ఘాటించారు. కాదూ అంటే ప్రత్యామ్నాయంగా ఆంధ్ర, తెలంగాణ, ప్రతిపాదిత మైసూరు రాష్ట్రంతో కలిపి ఒక ద్విభాషా రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని వారు కోరారు.

అప్పటికే కేరళ, ప్రతిపాదిత మైసూరు రాష్ట్ర విలీనం గురించిన ప్రతిపాదన ఉన్నందున ఆంధ్ర, తెలంగాణ, మైసూరులతో పెద్ద ద్విభాషా రాష్ట్ర ఏర్పాటును పరిగణనలోకి తీసుకొనే ప్రసక్తి లేదని పంత్‌ స్పష్టం చేశారు. విశాలాంధ్ర ఏర్పాటుకే కాంగ్రెస్‌ అధిష్ఠానం మొగ్గు చూపుతుందని గ్రహించిన తెలంగాణ నేతలు ప్రాంతీయ కమిటీతో పాటు తమకు అనేక రక్షణలు కల్పించాలని అడిగారు.

విశాలాంధ్ర ఏర్పాటయినచో తలెత్తే సమస్యల గురించి ఆంధ్ర, హైదరాబాద్‌ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పిసిసి అధ్యక్షులు, కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ప్రముఖ నాయకులు ఢిల్లీలోని హైదరాబాద్‌ హౌస్‌లో సమావేశమై చర్చలు జరిపారు. ఆంధ్ర రాష్ట్రం తరఫున బెజవాడ గోపాలరెడ్డి, నీలం సంజీవరెడ్డి, గౌతు లచ్చన్న, అల్లూరి సత్యనారాయణ రాజు; తెలంగాణ తరఫున బూర్గుల రామకృష్ణరావు, కొండా వెంకట రంగారెడ్డి, జె.వి.నరసింగరావు, డాక్టర్‌ మర్రి చెన్నారెడ్డి ఈ చర్చల్లో పాల్గొన్నారు.

1956 ఫిబ్రవరి20న జరిగిన ఆ సమావేశంలో వారు అంగీకారానికి వచ్చిన ఒప్పందంలో కొన్ని ప్రధానాంశాలు:
(1) రాష్ట్రానికి చెందిన కేంద్రీయ, సాధారణ పరిపాలన వ్యయాన్ని ఉభయ ప్రాంతాలు నిష్పత్తి ప్రకారం భరించాలి; తెలంగాణ నుంచి లభించే ఆదాయంలో ని మిగులును తెలంగాణ ప్రాంతాల అభివృద్ధికే వ్యయ పరిచేందుకు కేటాయించాలి. ఈ ఏర్పాటు ఐదేళ్ల తరువాత సమీక్షకు వస్తుంది. శాసనసభలోని తెలంగా ణ సభ్యులు కోరినట్లయితే ఈ ఏర్పాటును మరో ఐదేళ్ళు పొడిగించవచ్చు;
(2) తెలంగాణలో ఉన్న విద్యా సౌకర్యాలు తెలంగాణ విద్యార్థులకు లభింపజేసి, ఇంకా అభివృద్ధిపరచాలి. తెలంగాణ ప్రాంతంలో ఉన్న సాంకేతిక విద్యా సంస్థల తో సహా అన్ని కళాశాలల్లోనూ ప్రవేశాలు తెలంగాణ విద్యార్థులకే నియమితం చేయాలి లేదా రాష్ట్రము మొత్తం మీద ఉండే ప్రదేశాల్లో మూడో వం తు ప్రవేశాలు తెలంగాణ విద్యార్థులకు వారికి ప్రయోజనకరమైన కోర్సులకుగాను లభించాలి;
(4) ఏకీకరణ వల్ల తప్పనిసరి అయినప్పుడు ఉద్యోగాల్లో రిట్రెంచిమెంటు ఉభయ ప్రాంతాల నుంచి నిష్పత్తి ప్రకారము జరగాలి;
(5) ఇక ముందు ఉద్యోగాలకు చేర్చుకోవడం ఉభయ ప్రాంతాల జనాభా ప్రాతిపదికపై ఉంటుంది;
(6) తెలంగాణ ప్రాంతంలోని ఉద్యోగాలను నిర్ణీత నిష్పత్తి ప్రకార మే పొందడానికి ఒక పద్ధతి నివాస నిబంధనల్ని ఉంచాలి.
(7) తెలంగాణ ప్రాంతంలోని వ్యవసాయ భూముల అమ్మకము ప్రాంతీయ మండలి అధీనములో ఉండాలి;
(8) తెలంగాణ ప్రాంతపు అవసరాలు ఆవశ్యకతల దృష్ట్యా సర్వతోముఖాభివృద్ధి సాధించుకొనేందుకు ఒక ప్రాంతీయ మండలి ఏర్పాటు కావాలి;
(9) ప్రాంతీయ మండలిలో దిగువ పేర్కొ న్న ప్రకారం 20 మంది సభ్యులుంటారు. తెలంగాణ తొమ్మిది జిల్లాలకు ప్రాతినిధ్యం వహించే 9 మంది తెలంగాణ శాసనసభ్యులు; తెలంగాణ జిల్లాల నుంచి విడివిడిగా వీరిని శాసనసభ్యులు ఎన్నుకోవాలి;
(10) ప్రాంతీయ మండలి చట్టబద్ధమైన సంస్థగా ఉంటుంది. పైన పేర్కొన్న వివిధాంశాల విషయాలు పరిశీలించి నిర్ణయించే అధికారం దానికి ఉంటుంది. ఇంతేకాక ప్రణాళికా రచన, అభివృద్ధి వ్యవహారాలు, నీటిపారుదల, ఇతర వ్యవసాయ పథకాలు, పారిశ్రామికాభివృద్ధి. తెలంగాణ ప్రాంతానికి సంబంధించినంతవరకు ఉద్యోగ వ్యవహారాలను కూడా ప్రాంతీయమండలి పరిశీలించి నిర్ణయా లు గైకొంటుంది. ప్రాంతీయ మండలి అభిప్రాయానికి, రాష్ట్ర ప్రభుత్వం అభిప్రాయానికి మధ్య తేడా వచ్చినట్లయితే అంతిమ నిర్ణయం కోసం ఆ సమస్యలను భారత ప్రభుత్వానికి నివేదించాలి.
(11) మంత్రివర్గంలో ఆంధ్ర ప్రాంతం నుండి 60 శాతం, తెలంగాణ ప్రాంతం నుండి 40 శాతం మేరకు మంత్రులు ఉండాలి. 40 శాతం తెలంగాణ మంత్రులలో ఒకరు తెలంగాణకు చెందిన ముస్లిం మంత్రి అయివుండాలి;
(12) ముఖ్యమంత్రి ఆంధ్ర ప్రాంతము నుంచి అయితే, ఉప ముఖ్యమంత్రి తెలంగాణ నుంచి ఉండాలి. అలాగే ముఖ్యమంత్రి తెలంగాణ నుండి అయితే ఉప ముఖ్యమంత్రి ఆంధ్ర ప్రాంతము నుండి ఉండాలి, హోం, ఆర్థిక, రెవిన్యూ, ప్రణాళికలు, అభివృద్ధి వ్యవహారాలు, వాణిజ్య, పరిశ్రమల శాఖలలో రెంటిని తెలంగాణ మంత్రులకు అప్పగించాలి;
(13) 1962 సంవత్సరాంతం వరకూ తెలంగాణకు ప్రత్యేకంగా ప్రదేశ్‌ కాంగ్రెస్‌ సంఘము ఉండాలని హైదరాబాద్‌ ప్రదేశ్‌ కాంగ్రెసు సంఘము అధ్యక్షుడు అభిలషిస్తున్నారు. ఇందుకు ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ సంఘము అధ్యక్షునికి అభ్యంతరము లేదు.

- కె.వి.నారాయణరావు
('ది ఎమర్జెన్స్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌' నుంచి)

1956 ఆగస్టు 14న ఆంధ్ర, తెలంగాణ నాయకులు మళ్ళీ సమావేశమై పైన పేర్కొన్న అంశాలతో కూడిన తుది ఒడంబడికపై సంతకాలు చేశారు. 'పెద్ద మనుషుల ఒప్పందం'గా ప్రసిద్ధి కెక్కిన ఈ ఒప్పందం ఆంధ్ర ప్రదేశ్‌ ఆవిర్భావానికి దారిని సుగమమం చేసింది. 1956 నవంబర్‌ 1న ప్రధాని నెహ్రూ తొలి భాషా ప్రయుక్త రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌ను ప్రారంభించారు.