"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL-502: Techniques of writing a Dissertation క్లాసులు సోమ, మంగళ, గురు, శుక్రవారం మధ్యాహ్నం 12.00 గంటల నుండి 1.00 వరకు డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ భవనంలో జరుగుతాయి.

17 ఫిబ్రవరి, 2017

తెలంగాణ భాష – ప్రామాణిక రూపం (మన తెలంగాణా పత్రిక, Aug 08, 2016 సౌజన్యంతొో...)

దాదాపు రెండు వందల సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం కుతుబ్‌షాహి ఆసఫ్‌జాహి వంశాల ముస్లింల పాలనలో వుండటం చేత సీమాంధ్రలోని సామాన్య జనులతో ఆదాన ప్రదానాలు తేలిపోవటం చేత భాష సంస్కృతులలో విలక్షణతలు కలిగి ఉంది. పారశీ ఉర్దూలు అధికార భాషలుగా వుండేవి. ఉర్దూ విద్యామాధ్యంగా వుండేది. దాంతో తెలంగాణ తెలుగులో ఉర్దూ పదాలు ప్రవేశించాయి. ఉర్దూ భాషలోని నుడికారాలు, భావ ప్రకటనలోని రీతులు తెలంగాణ తెలుగులో చోటు చేసుకున్నాయి. పాలకుల భాషనేకాక జీవన విధానం పండుగలు, పండగలు జరపుకునే పద్ధతులు తెలంగాణ సంస్కృతిలోకి చొచ్చుకొని పోయాయి. ముస్లిం సంస్కృతిలోని మర్యాద మన్ననలలు స్నిగ్ధత సౌజన్య సౌకుమార్యాలు తెలంగాణ ప్రజా సంస్కృతిలో చోటు చేసుకున్నాయి. దాంతో తెలంగాణ ఒక విభిన్న మైన భాషా సంస్కృతులతో కూడిన ప్రాంతంగా మారింది. బ్రిటిషు పాలనలో తమిళ సంస్కృతి ప్రభావంతో తలమునకలైన సీమాంధ్రులచే తెలంగాణ భాషా సంస్కృతులు పరాయికరణకు గురయ్యాయి. వాటిని అర్థం చేసుకొని అక్కున చేర్చుకోకపోవటమే గాక ఉపేక్ష, వివక్షత, వెక్కిరింతలకు గురి చేయటంతో తెలంగాణ ఎప్పుడూ పరాయిగానే ఉండిపోయింది. తెలంగాణ ప్రజల్లో అవి మాయని గాయంలా వుండిపోయింది. క్రమంగా అదే విభజనకు దారి తీసింది. పోకిరి పిల్లవాడు అమాయకురాలయిన అమ్మాయి మధ్య సంబంధం తెగతెంపులై ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాలు అవతరించాయి. అయినా వాళ్ళువీళ్ళు తెలుగు ప్రజలే! వారి భాష తెలుగు భాషే!
తెలంగాణ భాష హైదరాబాద్ నగరంలానే ఎక్కువగా ఉర్దూ పదాలు చేరి మణి ప్రవాళ భాషగా మారింది. కాని పట్టణ పల్లె ప్రాంతాల్లో తెలంగాణ భాష తన దైన నుడికారాన్ని పదజాలాన్ని కోల్పోలేదు. సీమాంధ్రలో ముఖ్యంగా ఆంధ్ర ప్రాంతంలో ప్రజలు తెలుగు ఇంగ్లీషు తమిళ భాషల ప్రభావంతో తమ అచ్చమైన స్వచ్ఛమైన తెలుగు నుడికారాన్ని మరచిపోయారు. అంతేకాదు ప్రాచీన కావ్యాల్లో వున్న ఎన్నో అచ్చ తెనుగు పదాలను ఆంధ్రులు విస్మరించారు. అచ్చమైన తెలుగు కవి తిక్కన ప్రయోగించిన అచ్ఛమైన తెలుగు పదాలు నుడికారాలను, శుక సప్తతి హంసవిశంతి సింహాసన ద్వాత్రింశిక వంటి ఎన్నో కావ్యాల్లో చోటు చేసుకున్న అచ్చమైన తెలుగు పదాలను ఆంధ్ర ప్రాంతాల వారు విస్మరించారు. వాళ్ళ నిత్య జీవితంలో అవి ప్రయోగంలో లేకుండా పోయాయి. ‘పోవటం’ కు బదులుగా ‘వెళ్ళటం’ ‘విసుర్రాయి’ బదులుగా ‘తిరుగలి’ అని ఇట్లా ఎన్నో అచ్చ తెలుగు పదాల స్థానంలో పరాయి పదాలను చేర్చి మాట్లాడటం నేర్చుకొని మాదే అచ్చమైన మంచి తెలుగు అని డబ్బా కొట్టుకున్నారు. తెలంగాణలోని అచ్చమైన తెలుగు పదాలను నుడికారాలను పట్టించుకోకుండ హేళన చేశారు. బ్రిటిషు పాలనకు, ముందు ముస్లిం పాలనలో ఆంధ్రప్రాంతంలో పరిపాలనా పరంగా కోర్టులు వ్యవహారాల్లో ఎన్నో ఉర్దూ పదాలు చేరాయి. అది వాళ్ళ దృష్టికి ఎక్కలేదు. షికారు, తమాషా, ఖాతరు, పేచీ, మరమ్మతు వంటి ఎన్నో ఎన్నో ఉర్దూ పదాలు తెలుగు పదాలే అనే భ్రమలో వుండిపోయారు. హైదరాబాద్‌లోని భాష విని తెలంగాణ తెలుగులో అన్ని ఉర్దూ పదాలే అని అనుకున్నారు. పల్లె ప్రాంతాల్లోని అచ్చమైన తెలుగు “ఫాసిల్‌” లాగా నిలిచిపోయి ఉన్న విషయం ఏ భాషావేత్తల దృష్టికి రాలేదు.
తెలంగాణ తెలుగులో సీమాంధ్రలో కన్పించని పదజాలం ప్రజల భాషలో కన్పిస్తుంది. ఉదా॥కు ఆంధ్రలో “చొక్కా” అనే పదానికి ‘అంగి’ అనే పదాన్ని తెలంగాణలో వాడుతారు. అసలయితే ‘అంగి’ ‘అంగము’ లకు సంబంధించిందని సంస్కృత మూలంగల పదమే. అదే విధంగా తెలంగాణలో “సంచకారి” పదాన్ని ‘అడ్వాన్స్’ గా ఇచ్చే డబ్బు అనే అర్థంలో వాడుతారు. విచిత్రంగా ‘సంచకారి’ పదం సంస్కృత పదం. సంస్కృతంలో అదే అర్థంలో వుంది. అదే విధంగా తెలంగాణలో ‘అజ్జకారి’ అని తిడుతారు. “ఆజ్ఞాకారి” ఆజ్ఞను పాలించేది (వాడు) అని ఆ పదానికి అర్థం. ఆజ్ఞాకారి ప్రాకృతంలో “అజ్జకారి” అయి తెలుగులో వెటకారంతో కూడిన తిట్టుగా మారి చేరిపోయింది. “మా చేసినవులే! అంటారు. ‘మా అనేది మహా” సంస్కృత పదానికి మారు రూపమే. “గడెగడెకు” అంటారు. ఇది ఘడియఘడియకు ’ అనే సంస్కృత పదానికి వికృత రూపమే. ఆపతి (ఆపద) సోపతి(స్నేహం), సోయి (స్పృహ) వంటి సంస్కృతం నుంచి వచ్చిన వికృత రూపాలు ‘లగ్నం’ అనే సంస్కృత పదం తెలంగాణ తెలుగులో ‘లగ్గం’ అయింది. వర్తి = వత్తి, బత్తి అయింది. ఈ విధంగా ప్రాకృత భాషాదుల నుంచి వచ్చిన పదాలు తెలంగాణ సామాన్య జనుల వాడుకలో కన్పిస్తాయి. ఇట్లా ఎన్నో సంస్కృత పదాల ప్రాకృత రూపాలు వికృతి రూపాలు తెలంగాణ ప్రజల ప్రతి నిత్యం భాషలో వ్యాప్తిలో ఉన్నాయి. తెలంగాణ తెలుగులో ఉర్దూ పదాలు ఎక్కువ అని భ్రమ. కాని ఒక విచిత్రమేమంటే తిక్కన వాడిన ‘తరాజు’, శ్రీనాథుడు ప్రయోగించిన ‘సామాన్లు’, పెద్దన పద్యంలోని “అలకని” (హల్కా) ఉర్దూ పదాలు ఆంధ్రుల వాడుకలో లేవు కాని తెలంగాణ ప్రజలు నిత్యం మాట్లాడుకునే భాషలో వున్నాయి. తెలంగాణ తెలుగులో దుకాణం, పోక్తా, రొట్టె (రోటి) వంటి ఉర్దూ పదాలు తెలుగు పదాలే అనిపించేంతగా వాడుకలో వున్నాయి.
“నాటగోలె”, “నాపొంటె” లోని “గోలె, పొంటె” వంటి నన్న యాది కవులు విభక్తి ప్రత్యయాలుగా వాడిన పదాలు తెలంగాణలో ఇప్పటికి ప్రజల భాషలో నిలిచివున్నాయి. గోలె = నుంచి, పొండె = వెంట అని నా పొంటె, నావైపు అని అర్థాలు. “అటెనుక” లేదా “అటెన్క” (అటు+వెనుక) అన్న పదానికి అటు తర్వాత అని అర్థం. కావ్యాల్లో కనిపించే ఈ పదం తెలంగాణలో ఇప్పటికి వాడుకలో ఉంది. ఇంతకుముందు అనటానికి “ఇది వరకు” అని తెలంగాణలో ప్రయోగం. ఆ విధంగా తెలంగాణలో కన్పించే పదజాలాలు, నుడికారాలు ఎన్నో అచ్చమైన తెలుగు భాషకు చెందినయి వున్నాయి. ఉదా॥కు అడపదడప, ఉత్తుత్తి, ఉత్తగా, ఎరుక లేదు, ఎరుకేనా, ఎల్లం, ఏగిరం, ఏట, ఒర్లటం, ఏతులు, ఏతుల మారి, కయ్యం, మొత్తుకొనుడు, వంకపెట్టటం, ఎనుకట, కొస (చివరి), పదిలం, జప్పున, కయ్యాల మారి, మలగటం, మర్లబడు, అనపకాయ, గోంగూర, గదుమ, బొక్క, బిరాన, పైలం, వైనం, బర్రె, బొర్ర, ఎత్తగొట్టటం, పిల్వనంపు, తోలుకొని పోవటం, పెండ, నీతోటి పని వడి వచ్చిన, నూకుడు, తంతెలు, యారాలు, ముంగల, ముందల, ముందల పడరు (పైకిరారు) అటకాయించటం, మస్తుగ, పోరి, పోరడు, పొల్ల, పొల్లగాడు, (పొల్ల నుంచే పిల్ల వచ్చిందేమో), సందు దొరకలేదు.
అండ లేదు. (సహాయం లేదు) ముందల (భవిష్యత్తు), ఇంటి కాడికి (ఇంటి దగ్గరికి), బక్కగయ్యిండు (చిక్కిపోయాడు), ఉరకటం, లొల్లి (గొడవ), కుతి లేసింది, నెగలటం, ఒకరి తెరువుకు పోడు, పొట్ట, పైసలు (డబ్బు) తెర్లు (వినాశం), అంత ఘనం (అంతగా), రంధి, సుత (కూడా), దూగడం ( ముందుకు రావటం) ముట్టజెప్పటం, లాశిగ (పెద్దగా), పొతం, కతలు, పుట్టిస్తరు, సాన్పి (పేడనీళ్లు), ఎగేసింది ( పురికొల్పింది), ఎడ్డి (అమాయకులు), బాసిండ్లు (గిన్నెలు), తపుకు (ప్లేటు), ఉడుకు (వేడి), పుణ్యానికి రావు (డబ్బుల్లేకుండా రావు లేదా కష్టపడకుండారావు) ఈ విధంగా ఎన్నో అచ్చ తెనుగు పదాలు తెలంగాణ భాషలో ఇతర ప్రాంతాల్లో లేకుండా పోయినయి కేవలం కావ్యాల్లో మాత్రమే లభించేవి. ప్రజల వాడుక భాషలో వ్యాప్తిలో ఇప్పటికీ ఉన్నాయి. తెలుగు పదాలను ఆ విధంగా రక్షించి నిలిపిన ఘనత తెలంగాణకే దక్కుతుంది.
తెలంగాణ భాషలో క్రియాపదాలు ప్రాచీన తెలుగు కావ్య భాషలోని ప్రయోగాలకు దగ్గరగా వుంటాయి. ఆంధ్ర ప్రాంతంలోని రూపాలకు భిన్నంగా కన్పిస్తాయి. ఈ క్రియాపదాలు తెలంగాణ సామాన్య జనుల వాడుకలో వున్నాయి. ఆంధ్రలో “వచ్చిం తర్వాత, పోయిం తర్వాత” అని వాడితే తెలంగాణలో ‘వచ్చినంక, పోయినంక’ అని వాడుతారు. “పరీక్షలయిన తర్వాత” అంటె తెలంగాణలో “పరీక్షలయినంక” అంటారు. “లాక్కొని వెళ్లాడు”కు తెలంగాణలో “గుంజుక పోయిండు” అని వాడుతారు. చెప్పించాడు, చేరాము వంటి ఆంధ్ర ప్రాంతంలోని క్రియాపదాలను “చెప్పించిండు, చేరినం”గా తెలంగాణ ప్రజలు వాడుతారు. “ఆలోచించడానికి” అని ఆంధ్రలో వుంటె తెలంగాణలో “ఆలోచించేటందుకు” అన్న క్రియా రూపాన్ని వాడుతారు. ‘మాయమవుతారు, బయల్దేరాను వంటి ఆంధ్రలోని క్రియా రూపాలు తెలంగాణాలో మాయమైతరు, బయల్దేరిన” రూపాలుగా వుంటాయి. చెయ్యడానికి, నియమించడానికి, బదులుగా తెలంగాణలో “చేసేటందుకు, నియమించేటందుకు” రూపాలు వాడుకలో వున్నాయి. “విసుక్కోవడం, వెళ్తుండగా” రూపాలు ఆంధ్రలో వుంటె తెలంగాణలో “విసుక్కునుడు, పోతుంటె” అన్న రూపాలు వున్నాయి.
నా ఇంటిపై వచ్చాడు, నా వైపు వచ్చాడు అని ఆంధ్రలో ఉంటే “నా ఇంటి మీదికి వచ్చిండు, నా దిక్కు వచ్చిండు” తెలంగాణలోని క్రియా రూపాలు ఉన్నాయి. ‘రానివ్వటం లేదు’, ‘అంత దాకా’ రూపాలు ఆంధ్రలో వుంటె తెలంగాణలో ‘రానియ్యటం లేదు’, ‘రానిస్త లేరు’ అంత దనుక అన్న రూపాలు జనుల వాడుకలో వున్నాయి. “తెలుసుకోవటం కష్టం” అన్న రూపం ఆంధ్రలో వుంటె, తెలంగాణలో “తెలుసుకొనుడు కష్టం” అని వాడుకలో వున్న రూపం. ఆ విధంగా ఆంధ్ర ప్రాంతాల్లో జనుల ప్రయోగంలోనూ, ప్రామాణిక భాషలోనూ ప్రయోగంలో వున్న కొన్ని క్రియా రూపాలు, పద రూపాలు. అవే తెలంగాణలో జనుల వాడుకలో తెలంగాణ రచయితల కథలు, కవిత్వం వంటి సాహిత్య ప్రక్రియల్లోను విభిన్న రూపంలో వున్నాయి. అంటే పదజాలంలో కన్నా క్రియా పదాల స్వరూపంలో చాలా విభిన్నత కన్పిస్తున్నది. ఈ క్రియా పద రూపాలను, తెలంగాణకే పరిమితమైన పదజాలాన్ని ప్రయోగిస్తూ రచన చేసినట్లయితే తెలంగాణ భాష ఒక ప్రత్యేక స్వరూపంతో కన్పిస్తుంది. తెలంగాణ భాషకు విలక్షతను తెచ్చిపెట్టేవి.
తెలంగాణలోని వేరువేరు జిల్లాల్లో క్రియా పదాలు వేరువేరు రూపాల్లో ఉచ్చారణలలో వాడుకలో వున్నాయి. ఉదా॥కు ‘వచ్చిండు’ క్రియాపదాన్ని తీసుకుంటె వచ్చిండు, ఒచ్చిండు, అచ్చిండు, అత్తాండు అని వేరువేరు రూపాలు కన్పిస్తున్నాయి. ఇక , “వచ్చారు” అని, బహువచన రూపాన్ని తీసుకుంటె, వచ్చిండ్రు, వచ్చిన్రు, అచ్చిన్రు, అచ్చిండ్రు అని వేరువేరు రూపాలు కనిస్తున్నాయి. “వచ్చింది” అనే స్త్రీ వాచక ఏకవచన క్రియ తెలుగులో అన్ని ప్రాంతాల్లో సమానంగా ఉంది. కాని పురుష వాచక ఏకవచన క్రియ తెలంగాణలో ‘వచ్చిండు’ అని వుండగా వేరే ప్రాంతాల్లో ‘వచ్చాడు’గా వుంది. కాళోజి వచ్చింది అన్న క్రియ ఏకవచనం పురుష వాచకంలో ప్రత్యయం చేరి “వచ్చిండు” అని కావటం సరిగ్గా వుంది. కాని ‘వచ్చాడు’ అని ఎట్లా అవుతుంది? అని ప్రశ్నించాడు. నిజంగానే ఏకవచనంలో స్త్రీ వాచకం ‘వచ్చింది’ అయితే పురుష వాచకంలో ‘వచ్చాడు’ అని కాక ‘వచ్చిండు’ అని అనటమే శాస్త్రీయంగా, వ్యాకరణ బద్దంగా వుంది. అదే విధంగా బహువచనంలో “వచ్చారు” కన్నా వచ్చి+ను+రు = ఈ విధంగా వచ్చిన్రు అవుతుంది. ఈ రూపంను నుగాగమం చేరి వాకరణ బద్దంగా సరయిన రూపం అవుతున్నది. వచ్చిన్రు రూపమే “వచ్చిండ్రు” గా కూడా వుంది. వచ్చి+ం+డు+రు= వచ్చిండ్రుగా ఏర్పడుతున్నది. కాని వచ్చిన్రు, వచ్చిండ్రు రెండు రూపాల్లో ఒక్క రూపాన్ని ప్రామాణిక భాషలో గ్రహించాలి. తెలంగాణ భాషలో పదాలను, జాతీయాలను, నుడికా రాలను వున్నదున్నట్లుగా వాడుకోవాలి. తెలుగు భాషను సుసంపన్నం చేసుకోవాలి. కాని ఆ పదాలను నుడికారాలను సరయిన అక్షర క్రమంతో సరయిన రూపంలో వాడుకోవాలి.
అంటె ఉదా॥కు ‘బర్రెలు’ శబ్దాన్ని కొన్ని ప్రాంతాల్లో కొన్ని వర్గాల్లో ‘బల్రు’ అని ఉచ్చరిస్తారు. అప్పుడు ‘బల్రు’ కాక ‘బర్రెలు’ అనే రూపాన్ని తెలంగా ణ ప్రామాణిక భాషలో వాడాలి. ‘ఇక్కడ’కు బదులు జనుల వాడుకలో ‘గిక్కడ’ అని వుంది. అప్పుడు ‘గిక్కడ’ కాక ‘ఇక్కడ’ను ప్రామాణిక రూపంగా తీసుకోవాలి. ‘చూడబోతె’ క్రియా పదం వాడుకలో ‘సూడబోతె’ అని వుంది. ‘చూడబోతె’ క్రియా పదాన్ని ప్రామాణిక రూపంగా గ్రహించాలి. ‘విసుర్రాయి’ పదం తెలంగాణ లోనే వాడుకలో వుంది. కాని అశిక్షితులు ‘ఇసుర్రాయి’ అంటారు. అప్పుడు “ విసుర్రాయి” నే రూపాన్నే ప్రామాణిక భాషలో చేర్చుకో వాలి. ఇక క్రియా పదాలకు వస్తే “వచ్చింది, వచ్చిండు, వచ్చిన్రు” రూపాలను, ప్రామాణికంగా గ్రహించి “అచ్చిండు, అచ్చిండ్లు” రూపాలను పరిహరించాలి. కథలు, నవలలు వంటి సృజనాత్మక రచనల్లో పాత్రోచితభాషగా అటువంటి పదాలను వాడితే వాడవచ్చు ను. కాని తెలంగాణ ప్రామాణిక తెలుగు భాషను ఏర్పరుచు కున్నప్పుడు అటువంటి అశిక్షితుల, వర్గ, కుల మాండలిక రూపాల ను పరిహరించాలి. కాని ప్రజల వాడుక భాషలో వున్న అరుదైన పదాలను మాత్రం ప్రామాణిక భాషలో చేర్చుకొని తెలంగాణ ప్రామాణిక భాషను ఒక వినూత్న రీతిలో మలచుకోవలసిన అవసరం వుంది. ఈ అరుదైన పదాలను సీమాంధ్రులు కూడా తీసుకొని తమ భాషను సుసంపన్నం చేసుకోవచ్చును!
SUJATHA-REDDY
డా.ముదిగంటి సుజాతా రెడ్డి
9963431606

కామెంట్‌లు లేవు: