"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., Ph.D., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL 801 Research Methodology ఉదయం11.00 నుండి12.00 గంటల వరకు, TL-426: Indian Literature క్లాసులు మధ్యాహ్నం 2.00 గంటల నుండి 3.00 గంటల వరకు జరుగుతాయి.

తుల్లిమల్లి విల్సన్ సుధాకర్ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
తుల్లిమల్లి విల్సన్ సుధాకర్ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

06 జులై, 2012

లక్ష్మింపేట దళితుల ఊచకోతను నిరసిస్తూ కవితాసంపుటి ’నిమాషి‘

లక్ష్మింపేట దళితుల ఊచకోతను నిరసిస్తూ  ’నిమాషి‘  పేరుతో గుంపుసాహితీ సంస్థ ఒక కవితాసంపుటి వెలువరించింది. దీనికి సంపాదకులుగా వేముల ఎల్లయ్య, కొమ్ము సుధాకర్ వ్యవహరించారు. దీనిలో పదిహేను కవితలు ఉన్నాయి. వేముల ఎల్లయ్య, కొమ్ముసుధాకర్, భూతం ముత్యాలు, వరకుమార్ గుండె పంగు, పిట్టల శ్రీనివాస్ ల కవితలు ఉన్నాయి. దీనికి కలేకూరి ప్రసాద్ రాసిన కవితను ముందుమాటగా ప్రచురించారు.  కింద
ముఖచిత్రం 


14 డిసెంబర్, 2010

“సత్యం” మీద ప్రమాణం చేసి…నిజమే చెప్పాలి…

కులమెత్తి తిట్టే సుజనుల గడ్డమీద
మలమెత్తినోళ్ళ సంతతి నుదుటిమీద
మరణశాసనాలే  లిఖిస్తున్నప్పుడు..
దళితవాడ  బతుకు
కారంచేడు మహిళామండలి  మేడంత
అందంగా వుండదురా బాబూ !


కామాంధుల కథలో
కూటికుండల వీధిదొంగను తెచ్చి
కాటికి వకాలతునామా రాసినప్పుడే తెలుసు
ఈ సత్యోద్యుల మధ్య
సత్యాభి సంధుల మధ్య
ఈ ‘సత్యం’ బతికి బట్ట కట్టడం మిధ్యనీ ..


‘సత్యమేవ జయతే’
ఒకే భూగ్రహం కింద
ఒకే జాతీయ జెండా కింద
ఎన్ని సత్యోపదేశా
లెన్ని సమైక్యగీతా
లెన్ని ప్రభోధగీతా
లెన్ని జాతీయగానా
లెన్నెన్ని పంగనామాలు …


ఆకలిని
జాతీయగానంగా మార్చుకున్నచోట
ఈకలకోసమే పెంచే నిప్పుకోళ్ళకథ విన్నావా !
ఆకలికేకల పాప్ సంగీతంలో
సెగబారిన  రెక్కలడొక్కలమీద
చిర్ర చిటికెన పుల్లతో తాటిస్తే
ఐక్యరాజ్య సమితి కర్ణభేరి పగిలి
‘ఆలివర్ ట్విస్ట్’ కథ కర్ణపిశాచై వెంటబడదా !
నర్తిస్తున్న నల్లకోటుల వక్తృత్వంలో
చెలగువేస్తున్న దేవనాగరి రాక్షస సంగీతంలో
రాసలీలల భువనవిజయం కలవాళ్ళదే కదా !
చెప్పండి మిలార్డ్ !
ఈ సత్యాసత్యాల విచికిత్సలో
ఒక బలహీనుడి వెన్నెపూసని
బలంగా తుంచి పారెయ్యమని
ఏ పౌరనీతి శాస్త్రం భోదించిందో
ఏ భారతీయ శిక్షాస్మృతి ఆదేశించిందో
“సత్యం ”  మీద ప్రమాణం చేసి
ఈ ఒక్క నిజమైనా  చెప్పాలి
అబద్దం చెప్పకూడదు..
- తుల్లిమల్లి విల్సన్ సుధాకర్
డైరెక్టర్, ఇండియా టూరిజం, భారత ప్రభుత్వం, పశ్చిమాసియా & ఆఫ్రికా
wilsonsudhakar@hotmail.com

18 అక్టోబర్, 2010

బతుకమ్మ - దసరాపండుగ - దళితులు


18`10` 2010
ఎప్పడికప్పుడు అనుకుంటూనే ఉంటాను.
మనసుని కదిలించిన వాటన్నింటినీ భద్రపరుచుకోవాలని.
కానీ, కుదరదు. ఏదో బద్దకం. ఏదో భయం.
కొన్ని రాయాలనిపిస్తుంది. 
మరికొన్ని రాస్తే ఏమవుతాదో అనిపిస్తుంది. అనుభవాన్ని అక్షరీకరించేటప్పుడు, దాన్ని ఆలోచన మింగేస్తుందన్నమాట.
నిజమే. అన్నీ రాయలేం. అదీ కొన్ని పదవుల్లో, కొన్ని బాధ్యతల్లో ఉన్నప్పుడు అనుకున్నవన్నీ రాయలేం. కానీ రాయగలిగేవి కూడా రాయకపోతే ఎలా?
ఇప్పటికే డైరీలు రాయడం మానేస్తున్నాం.
మనం కలిసిన వ్యక్తుల నుండి మనమెన్నో నేర్చుకోవాల్సినవుంటాయి. వాటిని గుర్తు పెట్టుకోవాలి. కొన్ని కేవలం మనకి మాత్రమే కాదు. మనం కలిసిన వ్యక్తుల గురించి ఇతర్లూ తెలుసుకోవాల్నినవుంటాయి. అది మన దృష్టి కోణమే కావచ్చు. అది కొంతమందికి నచ్చొచ్చు. మరికొంతమందికి నచ్చకపోవచ్చు కూడా!
దీనివల్లేమొస్తుంది?
మన మనసు తేలిక పడుతుంది.
ఆ మధ్య ఆచార్య కోవెల సంపత్కుమారాచార్య చనిపోయారు. మన తెలుగు సాహిత్య విమర్శకుల్లో ఆయన కూడా చాలా గొప్పవాడు. నేనాయన గురించి ఒక నివాళి వ్యాసం రాయాలనుకున్నాను.
సరిగ్గా అప్పుడే నాకు కొంత అనారోగ్యం. తగ్గేసరికి కొన్ని రోజులు పట్టింది. దీనితో ఆయన గురించి అప్పుటికే పత్రికల్లో కొంతమంది రాసేశారు. అయినా మరెక్కడైనా రాయాలనిపించింది. రాయలేకపోయాను. అది నేటికీ నాకు తీరని వేదనను కలిగిస్తుంది. అయినా ఎప్పుడోకప్పుడు రాయాలనుకుంటున్నాను. 
ఇలాంటి సమయంలో ఒకరోజున అఫ్సర్‌ అమెరికా నుండి ఫోను చేశారు. అప్పుడప్పుడూ ఆయనే ఫోను చేసి పలకరిస్తుంటారు. ఆయన్ని నేను గురువుతో సమానంగా భావిస్తాను. ఆయన పత్రికల్లో ఉండగా నన్నెంతగానో ప్రోత్సహించారు.
ఫోను చేసినప్పుడల్లా అక్కడి సాహిత్య విషయాల్ని నాకు చెప్తంటారు. ఇక్కడెలా ఉందని అడుగుతుంటారు. నిజానికి ఇక్కడే సాహిత్య ధోరణులు కొనసాగుతున్నాయో, ఇక్కడి సాహిత్య వాతావరణమెలా ఉందో ఆసక్తి కలిగిన అక్కడి వారికే బాగా తెలుసనిపిస్తుంది.
ఆ మాటల సందర్భంలో కోవెల సంపత్కుమారాచార్య గురించి ప్రస్తావించాను. ఆయన గురించి రాయాలనున్నా రాయలేని స్థితిలో ఉన్నానన్నాను.
 ‘కొంతమందిని కొన్ని భావజాలాల్తో కట్టిపడేస్తుంటాం. కానీ వాళ్ళ వ్యక్తిత్వాల్ని కూడా చూడాలి. కోవెల వారి భావజాలం విషయంలో విభేదాలున్నా ఆయన వ్యక్తిత్వం చాలా గొప్పదండీ’ అన్నాను.
దానికీ అఫ్సర్‌ ఔననీ, కోవెలతో తనకున్న పరిచయాన్ని చెప్పారు.
నిజానికిలాంటివన్నీ మనం రాసుకుంటుండాలి. మనం అనేకమంది సాహితీవేత్తల్ని కలుస్తుంటాం. అనేకమందితో మాట్లాడుతుంటాం. వాళ్ళ గురించి అనేక విషయాల్ని గమనిస్తుంటాం. ఇలాంటివన్నీ మనమెక్కడొకచోట రాసుకుంటుండా’లన్నారు.
ఆ మాటలు నన్ను ఆలోచింపజేశాయి. రాయాలనిపించింది.
ఆ ప్రేరణతోనే ఈ శీర్షికను ప్రారంభిస్తున్నాను. 
కనీసం నెలలో ఒకసారైనా రాయాలనుకుంటున్నాను. కుదిరితే మరిన్ని రాసే అవకాశం కూడా ఉంది. కానీ, నిర్ధిష్టమైన రోజుకో, తేదీకో రాసేయాలనుకోవడం లేదు. నాకున్న వీలుని బట్టి దీన్ని రాయాలనుకుంటున్నాను. కానీ, నన్ను కదిలించిన సంఘటన అనిపించినప్పుడు దాన్ని విస్మరించకూడదనీ భావిస్తున్నాను.
    నిన్న ( 17 `10`2010) తుల్లిమల్లి విల్సన్‌ సుధాకర్‌ ఫోను చేశారు.
కవిగానే ఆయన నాకు పరిచయం.
తర్వాత తెలిసింది ఆయన వెస్ట్‌ ఆసియా - సౌతాఫ్రికాకు, ఇండియన్‌ టూరిజమ్‌ తరపున రీజనల్‌ డైరెక్టర్‌ అని!
అయినా నేనాయన్ని కవిగానే భావిస్తాను. ఆయన ‘‘ దళిత వ్యాకరణం’’ కవితా సంపుటిని 2007 లో ప్రచురించారు. ఆ కవితలు వివిధ పత్రికల్లో అచ్చైనప్పుడే నన్నెంతగానో ఆకట్టుకునేవి. ఇప్పటికీ సమకాలీన సమస్యల పట్ల, ముఖ్యంగా దళిత క్రైస్తవ సంఘటనల గురించి ఆయన రాస్తున్న కవిత్వంలో నాకేదో నిజాయితీ కనిపిస్తుంది. ఆయనకి చాలా విషయాల పట్ల స్పష్టమైన అభిప్రాయాలున్నాయి. వాటిలో చాలా వాటితో నేనేకీభవించలేనివీ ఉన్నాయి.
     ఇంతకీ అసలు విషయం ఏమిటంటే, బతుకమ్మ పండుగ విషయంలో నాబ్లాగులో ఈ మధ్య నేనొక  పోస్టుపెట్టాను. దాని సారాంశమేమిటంటే, తెలంగాణాలోని ప్రజలందరి పండుగగా బతుకమ్మను కొంతమంది చెప్తున్నారు. మరికొంతమందేమో, దాన్ని కొందరిపండుగగా చెప్తున్నారు.అందులో దళితులకు కూడా అవకాశం కలిగించాలని కోరుతూ తెలంగాణలోని అన్ని జిల్లాల్లోనూ దీనికి సంబంధించిన ప్రతినిథుల్ని ఎంపికచేశామని శ్రీ బి.జయరామ్‌ మాదిగ ( ఆంధ్రప్రదేశ్‌ మాదిగ దండోరా సంక్షేమ సమితి అధ్యక్షుడు) ఒక ప్రకటనను మీడియాకు విడుదల చేశారు. దాన్ని నాకు కూడా పంపారు.దాన్ని యథాతధంగా నేను నా బ్లాగులో పెట్టాను.

     గతంలో ఒక పుస్తకాన్ని ( పొన్నాల బాలయ్య, ‘‘ ఎగిలివారంగ ’’ ) సమీక్షిస్తూ కొన్నిచోట్ల దళితుల్ని బతుకమ్మ ఆడనివ్వరని రాశాను. ఆ అభిప్రాయం సరైందికాదని ఒకరు వాదించారు. దానికోసం ఎదురు చూస్తుంటే నేను గతంలో రాసింది సరైనదేనని ఉద్యమప్రాయంగా వచ్చిన అభిప్రాయాలు నాకెంతగానో సంతోషం కలిగింది.
దీన్ని చదివి విల్సన్‌ సుధాకర్‌ ఫోను చేశారు. నిజానికి నేను ఇక్కడ నేపథ్యగాయని సుశీల గారి ప్రోగ్రామ్‌ కి అతిథిగా వెళ్తున్నాను. వచ్చేటప్పటికి టైమెంతవుతుందో తెలియదు. అందువల్ల మీతే బతకమ్మ గురించి మాట్లాడేద్దామనిపించిందన్నారు. తెలంగాణలో తాను చాలా రోజులున్నానీ, బతుకమ్మ దళితుల పండుగ కాదనీ సుధాకర్‌ అన్నారు.
    ఆ సందర్భంలోనే ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడిప్పుడే దళితుల్లో బాగా చైతన్యం వస్తుందనీ, అదీ సాంస్కృతిక చైతన్యం కావడం మరింత సంతోషించదగిందనీ మాట్లాడుకున్నాం. అదేమిటంటే, ఇటీవల రావణాసురుడు, మహిసాసురుల గురించి టీ.వీల్లో చర్చలు జరుగుతున్నాయి. వీటిలో ప్రొఫెసర్‌ ఘంటాచక్రపాణి, కత్తిపద్మారావు వంటి ప్రముఖులు పాల్గన్నారు.  స్థానికులైన పాలకుల్ని ఆర్యులు తమ ఆయుధశక్తితో ఓడిరచి, యుద్ధఖైదీలుగా చేసుకుని, వారినే దళితులుగా మార్చారనీ, విజయం సాధించిన వాళ్ళు ఆర్యులైనా, ఆ భావజాలాన్ని జీర్ణించుకున్న ఇక్కడి హిందువులు దాన్ని తమ సాంస్కృతిక వారసత్వంగా భావించుకుంటున్నారని వాదించారు. ఈ చర్చనీయాంశాన్ని ప్రధాన వార్తల్లో కూడా ప్రముఖంగా టి.వి.9లో చూపించారు. అది అంతకు ముందు టి.వి.9లోనే చర్చలో భాగంగా కొనసాగిందే.  కాబట్టి ఇప్పుడు మన దసరాపండుగతో ప్రారంభమైన సాంస్కృతిక ఆధిపత్య నిరసన మరెన్ని కొత్తకోణాల్ని చూపిస్తుందో చూడాలి కదా అనుకున్నాం.
నిన్న Sunday Times of India , లో“Dalit seeks non-Brahmin judge for justice  అనే పేరుతో ఒక వార్తొచ్చింది. తమకు జరిగిన అన్యాయాన్ని నివేదించుకుంటూ బ్రాహ్మణులకు వ్యతిరేకంగా కోర్టు కెళితే అక్కడా వాళ్ళే న్యాయమూర్తులుగా ఉండటాన్ని వ్యతిరేకించిన వార్త అది.
దీనిలో ముఖ్యవిషయాన్ని ఇలా హైలెట్‌ చేశారు “ The dalit, who wanted to complain about the discrimination against his caste in junagadh district court found his plea being heard by justice RR Tripathi When he heard the judge’s name he said “I cannot expect justice from you because you are a brahmin”  దీన్ని బట్టి వివక్షను ఎదుర్కోవడంలో దళితులు చైతన్యవంతం అవుతున్నారనిపించింది. జడ్జి బ్రాహ్మణుడైనంత మాత్రం చేత వాళ్ళకే న్యాయం చేస్తాడని అనుకోలేం. దళితుడున్నంత మాత్రం చేత కూడా దళితులకేదో న్యాయం జరిగిపోతుందనీ అనుకోలేం. కానీ, ఇక్కడ మనం చూడాల్సింది వాళ్ళలో వచ్చిన ఆలోచన. దానికి అనేక కారణాలున్నాయి. అనేక అనుభవాలున్నాయి. అందుకే ఇది ఒక శుభపరిణామం.
ఇలాంటి విషయాలెన్నింటినో విల్సన్‌ సుధాకర్‌ గారితో చర్చించాను.

    


25 ఆగస్టు, 2010

'సవర్ణ' ..దీర్ఘ సంది

Courtesy by Andhra Jyothy

'సవర్ణ' ..దీర్ఘ సంది

మేము కూర్చున్న కుర్చీని
గంగాజలంతో 'శుద్ధి' చేసే కులగాన గంధర్వులున్న చోట
ద్వేషించడాన్ని ప్రేమించడమే నేర్చుకున్నచోట
అరవై వత్సరాల స్వాతంత్య్ర తంత్రంలో
అరవీసం పరతంత్రాన్ని పారద్రోలనిచోట
వివక్షకు సామ్రాజ్యాలే నిర్మితమౌతాయ్
ద్రావిడ భూమిలో దళితులకవమానాలే మిగులుతాయ్...

కులపిచ్చగాళ్లకు దేశమొక ఎలమావితోట...
కుల దూషణ పర్వాన్ని
కుబుసంలా విప్పిన మిస్టర్ ఇండియా ఎవడోగానీ
వినమ్రంగా వీధులూడ్చి
వెలివాడల్లో బతుకులీడ్చి
ఈ జాతికి జవ్వనాశ్వంలా మేము శ్రమదానం చేస్తున్నా
కుల ఓంకారాన్ని ప్రణవాక్షరం చేసుకున్న
దేశపౌరుల గుండెలోతులు తెలుసుకోగలమా!

దేశ నాయకుడు చస్తే
దేశీయులకు శోక సంగీతం వినిపించినట్లు
హస్తిన వీధుల్లో ఒక 'సవర్ణ' ఎన్టీఆర్ తొడగొడితే
ఆస్సీల దేశంలో దేశబాలలు తిరగబడితే
ఆత్మగౌరవ వీణను మీటిన తెలుంగునేల
గాంధీ పేరు పెట్టుకున్న ఎస్సీ అధికారిని
బ్రాందీ తాగి బస్సులు నడిపే సవర్ణుడొకడు మెడపడితే
నోరు మెదపదేల ఓ తెలుగు బాలా!
ఓ విశ్వదాభిరామా! మేము తెలుగువాళ్లం కామా!!
మలేసియా తెలుగోళ్ల కన్నా అడుగంటిపోయామా!
మేమేం శంకరాచార్యపీఠం అడుగుతున్నామా!

అండర్సన్‌ను అప్పనగా అప్పగించినట్లు
'ప్రతిభ' బూచితో 'శ్రమను' దోచుకుపోయేవాళ్ల మీదా
జాతీయుల్ని అస్పృశ్యులుగా చూసేవాళ్ల మీదా
కులానికి 'పరిశుద్ధతను' చేకూర్చిన రాతల మీదా
మనుషులెవ్వరు మాట్లాడని 'దేవభాష'లో
అస్పృశ్యతకు 'గీత'లిచ్చిన వాళ్లమీదా
దళితుల ప్రాణాలకన్నా ఆవులే మిన్నన్నవాళ్లమీదా
ఈ గండుకోయిలలు కూయవెందుకో
ఈ కవికుల గురువుల మౌనమెందుకో!

దేశం సర్వసత్తాక 'సంక్షేమ రాజ్యం' గనక
ప్రతిఏటా గణతంత్ర రాజ్య దినోత్సవమొస్తుంది గనక
ఎవడు దేశభక్తుడో ఎవడు సవర్ణుడో
సమాజం 'ఆక్టోపస్ పాల్'ఐ చెప్పేస్తుంది గనక
బడుగులపై అడుగడుగునా విషం కక్కినా ఫర్లేదు గనక
భారత మాత ముద్దుబిడ్డల అమృత హస్తాల్లో
అవర్ణులకు శాశ్వతావమానం తప్పదిక...

మిత్రులారా! కులం రాడార్ మీద
దేశీయ దళిత బతుకుల్ని మసకబార్చారెవరో!
దేశీయ చిత్రపటంపై కుల అసంతృప్త ద్రావకాన్ని పోసేసి
రాజ్యాంగ ఉ్రద్గంధంలో
సామాజిక న్యాయపుటల్ని చించుకుపోయారెవరో!

తెలుగు ప్రిటోరియాలో ఇహ నుంచి
వీధికో అపార్తైడ్ మ్యూజియంలే కనిపిస్తాయ్...
హైనాలే మానవ హక్కుల కోసం విలపిస్తాయ్...
-తుల్లిమల్లి విల్సన్ సుధాకర్
(ఆంధ్రాలో ఒక దళిత జాయింటు కలెక్టర్‌ను కులం పేరుతో దూషించారని తెలిసి ఆవేదనతో..)

16 ఫిబ్రవరి, 2010

యూదులరాజే బీదలరాజు

ఇది అకాండపాతం కాదు
మీ పారిచూపులెప్పుడూ అబద్ధం కాదు
నూరు మనువులూ-నూటొక్క ఋగ్వేదాలెన్ని చెప్పినా
మనమంతా ఒకటేననీ మీరొక్కమాట చెప్పినా
వేదం మాకొద్దనేవాళ్లం కాదు
సత్యవేదం కావాలనుకునేవాళ్లం కాదు
ఒకధర్మం అస్ప్రుశ్యతా కళ్లాపిని
కన్న బిడ్డలమీదే అధర్మంగా చల్లిందని తెలిసి
కులమత వర్ణ వివక్షతల వైకుంఠపాళిలో విసిగి
యోగాఆయుర్వేదాలూ ఒప్పుకున్న సజ్జనం
మా నిమజ్జనాన్ని కూడా ఒప్పుకోరని కినిసి
ఒక మంచి కాపరికోసం ఎదురుచూసీ చూసీ
మీ మతానికి మరణవాక్యం పలికాం..
ముక్కోటి దేవతామూర్తులు
అంటరానివైపోయాయన్నప్పుడు మా పాకలు
ఆత్మగౌరవ అన్వేషణలో-సమానత్వ గవేషణలో
ఓడలు దిగిన ఇవాంజెలికల్ గుంపుల నుంచి
వూడలు దిగేలా విదేశీ మతాన్ని
అరువు దెచ్చుకున్నది నిజమే!
ప్రేమామయుడేసును దేుడన్నది వాస్తవమే!
కోతపండుగలకు పాలిగింజలు ఇచ్చి
ఈతకొమ్మలకు మందారాలు గుచ్చి
యూదులరాజే మా బీదల రాజంటూ
జ్ఞానదంతాలు రాకముందే జ్ఞానస్నానమాచరించి
జ్ఞానజ్యోతిని వెలిగించుకున్నాం...
దేశీయ సంస్కృతీ సంచిని తగిలించుకుని
తద్భవ భాషలోనే సువార్త చదువుకుని
త్యాగరాజ కీర్తనల బాణీల్లోనే
ఆంధ్ర క్రైస్తవ కీర్తనల్ని పాడుకుని
పరమ గీతాల్ని తెలుగునేలకు తెచ్చుకుని
మదరిండియాలో చంకలు గుద్దుకున్నాం..
రిజర్వేషన్ల భిక్షాపాత్ర దగ్గర
కుక్కబిస్కెట్లయినా దొరకని కిరస్తానీవాళ్లని
కుక్కల్ని కసిరినట్లు సర్కారు 'ఛీ'కొడితే
ఆకలి బేయేల్జిబూనై భయపెడితే
జీవాహారం పైనుంచి కురుస్తుందని చర్చి జోకొడితే
రోగాలకు పరలోకమే పరమవైద్యమని చిచ్చుకొడితే
హల్లెలూయల ఊహలలో ఊగివూరేగి
స్వస్థత కూటాల్లో మురిసిముక్కలయ్యాం
ఈ సువార్తలో మాత్రం అసమానత్వం లేిదెక్కడ!
వాగ్దానం చేసిన సమానత్వ మెక్కడ!
సవర్ణ క్రైస్తవ శ్మశానాల్లో మా శవాలకూ చోటెక్కడ!
ప్రపంచ ధనిక దేవుని వాకిట్లో-వాటికన్ మత చావిట్లో
దళితుడు పీఠాధిపతి అయ్యేదెక్కడ!
దేశపౌరుల గుండె లోతులు తెలిసేదెక్కడ!
మా పోరాటమిప్పుడు
ఈ దేశ రాజ్యాంగం కన్నా పాతది...
మా విశ్వాసమిప్పుడు
ఈ జాతి సాంస్కృతిక వారసత్వం కన్నా గొప్పది..
శకపురుషుని జననమంత మహోన్నతమైనది..
హే ప్రభూ!
ఏ దేశం పేరు చెబితే ప్రేమాశాంతులు గుర్తుకొస్తాయో
ఏ దేశం పేరు చెబితే తాజ్ మహళ్లు జ్ఞప్తికొస్తాయో
ఇప్పుడా దేశంలో కంధమాళ్లే నృత్యమాడతాయి...

- తుల్లిమల్లి విల్సన్ సుధాకర్
బేయేల్జిబూన్ : దెయ్యాల రాజు

( ఆంధ్రజ్యోతి సౌజన్యంతో...)


29 జనవరి, 2010

మాకూ ఒక భాషకావాలి

(''మాకూ ఒక భాషకావాలి'' పేరుతో తుల్లిమల్లి విల్సన్‌ సుధాకర్‌ గారు ఆంధ్రజ్యోతి (http://www.andhrajyothy.com/editshow.asp?qry=/2008/jun/23vividha2) లో ఒక కవిత రాశారు. దీన్ని ఇప్పటికే చాలా మంది చదివి ఉంటారు. అయ్యినా నాకు నచ్చడం వల్ల ఆ కవితను ఆంధ్రజ్యోతి వారి సౌజన్యంతో ఇక్కడ పునర్ముద్రిసున్నాను..దార్ల )

మ్లేచ్ఛితమన్నా సరే
మమ్మల్ని మ్లేచ్ఛులన్నా సరే
మెకాలేకు వందనాలు చెప్తాం
పుట్టిన మా పసిపిల్లల చెవుల్లో
ఏబిసిడిలే ఉచ్చరిస్తాం......

అంగ్రేజీ దేవతకు వేనవేల వందనాలు
లండన్‌ మాది కాదు
ఇంగ్లీషు మాకు రాదు
పౌండ్లకోసం ఇంగ్లండు వెళ్లిన
జాతి మాదికానేకాదు
మేమేమీ ఇవాంజిలికల్‌ క్రైస్తవులమూకాదు
ఆంగ్లీకరించుకున్నంత మాత్రాన
మేము మార్టిన్‌ లూథర్‌లమూ కాదు....

సూపర్‌ కంప్యూటర్‌ నిర్మించిన
నిరుపేదల దేశంలో
బోధనాలయాల
ఆంగ్లీకరణల కుంభమేళాలో
ఐటి, ఐఐటి సాఫ్ట్‌వేర్లు
దేశమంతా వేర్లొచ్చిన
ఆదిశంకరుడి పీఠాలైతే
ఆధిపత్య వర్ణాలు
ఆనందంగా జరుపుకొనే
డాలర్‌ కార్నివాల్‌లో
'టామీ' అని పిలిస్తే కుక్కలు
కూడా ఇంగ్లీషు నేర్చుకుంటున్నాయి

జీన్‌ ప్యాంట్లు వేసుకునేవాళ్ళ దగ్గర
దేశాభిమానం మీద
నిక్కర్లతో చక్కర్లు కొట్టే వాళ్ల దగ్గర
సంస్కృతీ సంప్రదాయాలమీద
లెక్చర్లే వినాల్సిన ఖర్మపడితే
అమెరికా ఎంబసీల ముందు
ఆనందంగా బారులు తీరిన
భారతీయ సోదరుల సుందర
వదనాల మీద
దమ్ముంటే ఉమ్మేసే
దేవ భాషల పేర్లేమిటో!

నమ్మశక్యంకాని ఆర్యభట్టలూ......
నమ్మశక్యంకాని పుష్పకవిమానాలూ.......
నిజమైన భారతాన్నెప్పుడు చూశాం
గాడిద పేడతో
డిటర్జెంట్లు చేసే రజకుల మేధస్సుని
గొడ్డుటావుల చర్మాన్ని
గంటలో ఒలిచే చర్మకారుల నైపుణ్యాన్నీ
వాంతి చేసుకోకుండా
దేశీయుల మలాన్ని చేతులతో పట్టుకెళ్ళే
దౌర్భాగ్యుల సహనాన్నీ
గుర్తించని ఈ భాషాజాతులు
ఎవరికి ట్రోజన్‌ హార్సులు!

జాతిలో సమైక్యం కాలేనప్పుడూ
నీతిలో సమతుల్యం లేనప్పుడూ
వాచకాల్లో ఒక్క గౌరవ పదమూ
దళితుల గౌరవం కోసం వ్రాయనప్పుడూ
సగౌరవంగా వీధులూడ్చే వాళ్ల పిల్లల్ని
సమానత్వం ఫ్లాట్‌పారాల మీద
సివంగిలా తరిమికొట్టేదెవడిభాష!

దేశమంటే కులమే
దేశీయ భాషల Äౌగికమే
ఒకడు చెండాలుడట............
మరొకడు ఆగ్నిహోత్రావధానుడట.....
ఏం భాషలురా ఇవీ
అంటరాని తల్లిని ఆమ్మన్నా తప్పు
అష్టావధానంలో నీ యమ్మన్నా ఒప్పు
ఆ రబ్బీలు
అర్థంకాని అరబ్బీలు నేర్పినా
సఖ్యతలు నేర్పే
వాళ్ల మదరాసాలే నయంకదూ

ఖర్మ!
కపటం జాతీయ అజెండా అయింది
అస్పృశ్యత సారూప్యతలో
బానిసత్వం ఒక పిక్నిక్‌ అయింది
పంచాయితీ బళ్ళు మాకై
అంగ్రేజీ బళ్ళు వాళ్ళకై
కార్పొరేట్లు దొంగసచ్చినోళ్ళకై
సైనిక్‌ స్కూళ్ళూ సెంట్రల్‌ స్కూళ్ళూ
కలగా పులగమై
మాపై మీకు
సానుభూతెప్పుడో చచ్చిందిగదా!

ఈ నుడికారాల్నింక మ్యూజియంలోకీ
ఈ భాషాదెయ్యాల్నింక గురుకులాల్లోకీ
సర్కారు భాషా సౌందర్యపు గోడౌన్లలోకీ
తరిమి పడెయ్యాలి..............

మాకిప్పుడొక కొత్త భాష కావాలి
అది మా హృదయ ఘోషకావాలి
కన్న బిడ్డల్నే అస్పృశ్యులంటూ
చేతులతో మలాన్నెతించిన భాష
సజీవ దహనం కావాలి..........
మ్లేచ్ఛితమన్నా సరే!
మమ్ముల్ని మ్లేచ్ఛులన్నా సరే!

26 నవంబర్, 2009

తుల్లిమల్లి విల్సన్ సుధాకర్ గారి ఒక కవిత ఆంధ్రజ్యోతి లో!

ఆంధ్రజ్యోతిలో తుల్లిమల్లి విల్సన్ సుధాకర్ గారు " మాకూ ఒక భాష కావాలి" పేరుతో ఒక చక్కని కవిత రాశారు. భాషను దళిత దృక్పథంతో అర్థం చేసుకొనేవాళ్ళు చదివి తీరాల్సిన కవిత. దీని లింక్ ఇక్కడ ఇస్తున్నాను.
http://www.andhrajyothy.com/editshow.asp?qry=/2008/jun/23vividha2
నిజానికి దీన్ని యూనికోడ్ లోకి మార్చి బ్లాగులో పెట్టాలి. ప్రస్తుతం ఎందుకో పద్మ కన్వర్టర్ పనిచేయడం లేదు. మేథ లో నాకు కుదరడంలేదు. అందువల్ల కవితను యూనికోడ్ లో అందించలేకపోతున్నాను. సమయం చూసుకొని పూర్తికవితను బ్లాగులో పెట్టాలి.
సుధాకర్ గారు " దళిత వ్యాకరణం’ పేరుతో ఒక కవితా సంపుటిని ఇంతకు ముందే ప్రచురించారు. ఆయన ఒక ఉన్నతోద్యోగిగా ఉంటూనే చక్కని కవిత్వాన్ని రాస్తున్న కవి.