"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. మీ డిసర్టేషన్ కోసం అంశాన్ని త్వరగా ఎంపిక చేసుకోవాలి

17 February, 2017

తెలంగాణ భాష ( డా.చింతం ప్రవీణ్ కుమార్, మనతెలంగాణ, Oct 03, 2016 సౌజన్యంతో)

“తెలుగు రాష్రాల్లో నాలుగు మాండలికాలున్నా తెలంగాణ భాష అంతా ఒకే మాండలికంగా (ఉత్తర మండలం) పరిగణించ బడుతుంది. అయితే తెలంగాణ తెలుగు భాష తెలంగాణ ప్రజల వ్యావహారిక జీవన విధానానికి దగ్గరగా ఉంటూనే కావ్యభాషకు, గ్రాంధిక భాషకు చాలా దగ్గరగా ఉండడం విశేషం. ద్రావిడ భాషా పదాలు, ఉర్దూ పదాలు, ఆంగ్ల పదాలను, ముఖ్యంగా తమిళ భాషా సంబంధ పదాలను చాలా చక్కగా తనలో ఇముడ్చుకున్న  తెలంగాణ భాషా పదాలు నిత్యజీవిత, వ్యవహారిక జీవనానికి దగ్గరగా ఉండి ఇక్కడి శ్రామిక, బహుజన, అణగారినవర్గాల, పల్లీయుల జీవితాలను ప్రతిబింబింపచేస్తాయ్. “
తెలంగాణ మట్టి మనుష్యుల బోలాతనం అంతా వారు మాట్లాడే భాషలోనే దాగుంది. ఎలాంటి కల్మషంలేని తెరచిన పుస్తకంలాంటి వాళ్ళ జీవితాల్లాగే వాళ్ళ భాష కూడా తెరచిన పుస్తకంలాగా నది దుంకినట్టు జలపాతపు పరుగులా గలగలా ఉంటది.తెలంగాణ పదకోశ పితామహుడు డా.నలిమెల భాస్కర్ గారు అన్నట్టు తెలంగాణ తెలుగు భాషకు ‘ ధ్వని ’యే జీవం.తెలంగాణీయుల సంభాష ణల్లో నిశ్శబ్దం తక్కువ. నినాదమిచ్చినా నిమ్మళ పడమని చెప్పినా ధ్వనిలో చెప్పడం ఇక్కడి భాషా సహజత్వం. ఈ భాషలోని పదాల అర్థాల కోసం ఏడిండ్ల పిల్లి కూనోలే గ్రంధాలయాల చుట్టూ తిరుగుతూ నిఘంటువుల్లోకి పరకాయ ప్రవేశం చేయాల్సిన పని లేదు. అరుగుల మీద మన తాతమ్మల నాయనమ్మల దగ్గర కూసోని కొంచెం సేపు ముచ్చట పెడితే తెలిసిపోతది ఇది పక్కా మట్టిమనుష్యుల భాష అనే విషయం. వింటూ వింటూనే గుండెలో గూడు కట్టుకుని మనల్ని చెక్కిలిగిలి పెడుతూనే ఉంటదీ డబల్ కా మీటా భాష.వింటూ వింటూడగానే మనిషికి మనిషితనానికి సోల్తి ఐతదీ భాష. గిట్లనే మాట్లాడాలని నియమాలు,హద్దులు గీసుకోకుండా బొక్కముదరని పోరల నుండి ముసలోల్లు ముడిగోల్ల వరకు తంతె తంతెకు మధ్య ప్రవహిస్తూ పెదాలపై ఆడుతూ నాలుకలపై నాట్యమాడే జాన్ జిగ్రీ భాష. మొక్కేది బండ తొక్కేది బండలాంటి పదాలతో తాత్వికతను తెలుపుతూనే సచ్చినోని ముడ్డి కిందికయితేంది మీదికయితేందంటూ జీవనతత్వాన్ని చెప్పగలదీ భాష. పెదాలపై ఉషారుగా వెలుగుజిలుగులతో చమ్కాయించే భాష. తెలంగాణ భాష జీవ భాష.ఆశు భాష.జోర్దారైన భాష. మొత్తంగా మానవీయ భాష.
ఆవేశమైనా ఆక్రందనైనా ఆప్యాయతైనా తెలంగాణ తెలుగు భాష నిత్య చైతన్యపు ధారతో ప్రవహిస్తది. ముఖ్యంగా తెలంగాణ భాషను నాదమయం చేయడంలో ‘పూర్ణానుస్వారం’ పాత్ర కూడా గొప్పదన్న డా.నలిమెల భాస్కర్ గారి మాటలు అక్షర సత్యాలు. తెలంగాణ పదంలోనే పూర్ణానుస్వారం ఉంది. వరంగల్,కరీంనగురం,నల్లగొండ,ఖమ్మం లాంటి జిల్లాల పేర్లే కాకుండా జిల్లాల్లోని ఊర్ల పేర్లలో కూడా చాలామట్టుకు పూర్ణానుస్వారం ఉంటుంది. ఉదా: మంథని, ఖమ్మంపల్లి, బెల్లంపల్లి, జనగాం, చంద్రుగొండ, సంగారెడ్డి… మొదలైనవి. పదాల్లో కూడా పూర్ణానుస్వారం చేరి మాటలే సంగీతపు పాటల్లాగా నాట్యమాడతాయ్. ఉదా. నాగుంబాము, లచ్చిందేవి, తెల్లందాకా, గోంగూర మొదలైనవెన్నో పదాలు పూర్ణానుస్వారం కలిగి విసనొంపుగా ఉంటాయ్. చాలా మట్టుకు తెలంగాణ భాషా పదాల్లో పూర్ణానుస్వారం చేరి పదాలకు నిండుదనం చేకూర్చి సంభాషణలకు జవం జీవం కలిగిస్తాయి.కేవలం మాట్లాడే మాటల్లో శబ్దాన్ని బట్టి ‘తెలంగాణోడు’అని గుర్తుపట్టవచ్చు. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక ప్రత్యేకతలు కలిగి ఉన్న తెలంగాణ భాషలో అన్నింటికన్నా చక్కనైన విషయం ఈ భాషలో దాగి ఉన్న ‘మానవీయ సంభాషణ’. ఒక్కో పదం ఒక్కో మానవీయ స్పందనను కలిగి ఉండి సాటి మనిషిని తట్టి లేపుతుంది. ‘ఎట్లున్నవే ’ ‘ అట్ల గాదే ’, ‘ ఇట్ల గాదే ’ ‘కొంచెం ఏసుకోరాదే’ అంటూ ఆప్యాయతల్లో స్త్రీ లింగం పు:లింగం ఉండదని మానవీయత మాత్రమే ఉంటుందని తేల్చిచెప్పిన మానవీయ భాష తెలంగాణ తెలుగు భాష. గొంతులోంచి పలికే ప్రతీ మాట ఎదుటి వ్యక్తి చెవుల్లో నుండి సరాసరి హృదయంలోకి చేరే నాధమాధుర్యం కలది తెలంగాణ భాష.మాట్లాడుతూనే ఎదుటి వారిని తమలో కలుపుకోగల ఆప్యాయమైన వాక్యాలు,వావి వరుసలు ఈ భాష సహజ గుణాలు.మాట్లాడుతూనే సాటి మనిషి మోములో చిల్కనవ్వులు పూయించగల రామసక్కదనాల భాష తెలంగాణ భాష. గుడ్డి కొంగలోలె బతుకుతూ గొడగొడ ఏడుస్తునోళ్ళకు గుండె ధైర్యం చెప్పి భాసటగా నిలబడే భాష. ఏడ్సి మొత్తుకునే ఏడ్పుగొట్టోళ్ళను కూడా ఖుషీ ఖుషీ మాటలతో కిచ్చర కిచ్చర నవ్వించే భాష తెలంగాణ భాష. తెలిసీ తెలవనోడు ఒక మాట అన్నా చల్‌నేదో బాల్ కిషన్ అంటూ సాటి మనిషిని క్షమించే నిండుకుండలాంటి భాష. మొత్తంగా కడుపుల ఇసం లేని భాష తెలంగాణ తెలుగు భాష. కలగల్ల మొకం గల తెలంగాణ వాసుల్లాగే కలగల్ల భాష తెలంగాణ తెలుగు భాష.
తెలుగు రాష్రాల్లో నాలుగు మాండలికాలున్నా తెలంగాణ భాష అంతా ఒకే మాండలికంగా (ఉత్తర మండలం) పరిగణించబడుతుంది. అయితే తెలంగాణ తెలుగు భాష తెలంగాణ ప్రజల వ్యావహారిక జీవన విధానానికి దగ్గరగా ఉంటూనే కావ్యభాషకు,గ్రాంధిక భాషకు చాలా దగ్గరగా ఉండడం విశేషం. ద్రావిడ భాషా పదాలు,ఉర్దూ పదాలు,ఆంగ్ల పదాలను,ముఖ్యంగా తమిళ భాషా సంబంధ పదాలను చాలా చక్కగా తనలో ఇముడ్చుకున్న తెలంగాణ భాషా పదాలు నిత్యజీవిత,వ్యవహారిక జీవనానికి దగ్గరగా ఉండి ఇక్కడి శ్రామిక,బహుజన,అణగారిన వర్గాల,పల్లీయుల జీవితాలను ప్రతిబింబింపచేస్తాయ్. చాలా మట్టుకు పదాల్లో జానపద బాణీల సొగసును నిండా నింపుకుని డమడమ మ్రోగే డమరుకంలా నిత్య జీవచైతన్యాన్ని కలిగి ఉంటుంది తెలంగాణ భాష. కాస్తంత ఎటకారం,ఇంకాస్త మమకారం,ఇంకొంత చతురత,మరికొంత మోటు సరసపు పదాలు అలవోకగా తెలంగాణ తెలుగు భాషలో పలుకుతాయ్. ఇక్కడి మాటల్లోని సంభాషణలు కథ చెబుతున్నట్టుగా వినసొంపుగా ఉన్నచోటే స్తంభింపచేస్తాయ్. ఉప్పుతో తొమ్మిది పప్పుతో పది అయిన సంసారపు తత్వాన్ని ‘ఉపాసముంటే అప్పుదీరది…ఊపిరి వడ్తె బొర్ర నిండదని’ గొప్పగా పట్టిస్తుంది తెలంగాణ భాష.అమ్ముడు బోయినా సరే చేసిన బాకీ కట్టాలనే ఇజ్జత్‌ని నేర్పించే సామాజిక భాష ఇది. ఎవల ముందు పర్వ తక్కువ కాకూడదని భోదించే ఆత్మగౌరవ భాష. ఏరు పడితే మేలు పొత్తుంటే పోరు మొగడా’ అని మొత్తుకునే ఆడోళ్ళకు కండ్ల సలువ చేసేటట్టు ఎయ్యి ఏండ్లున్నా ఏరు తప్పది నూరేండ్లున్నా సావు ’ తప్పదనే గొప్ప తత్వాన్ని భోదిస్తూనే కడుప లోపలున్న సుకం కాశికిపోయినా దొరకదు’ జాగ్రత్త అని హెచ్చరిస్తూనే ఉంటుందీ భాష.
అన్నింటికంటే ముఖ్యమైన అంశం ఏమిటంటే…తెలంగాణ తెలుగు భాష సంగీత సౌందర్యం అత్యద్భుతం. ఇక్కడ భాషలో మాట పాట వేర్వేరు కాదు మాటను కాస్తంత ఒత్తి పలికితే పాట అయ్యేటంత సృజనాత్మకత ఈ భాష సొంతం.మొత్తంగా ఇక్కడి సమాజంలో ప్రవహించే మనిషి గొంతుకలో జీవ ప్రవాహంలా గళగళలాడుతూ కణకణలాడే పదాలతో బాధ, సంతోషం, సంబురం, ఉత్సవం అన్నింటిని తనలో ఇముడ్చుకునే జీవనది తెలంగాణ తెలుగు భాష.ముఖ్యంగా తెలంగాణ భాషలో ఉన్న అతి ముఖ్యమైన అంశం నిజాయితీతో కూడిన సంభాషణ. సూటిగా సక్కగా మాట్లాడడం తెలంగాణ తెలుగు భాషలో కనిపిస్తుంటుంది. తెలంగాణ భాషలో గుసగుసలు తక్కువ. ఉసురుతీసే ఉల్ట మాటలు తక్కువ. ఏం మాట్లాడినా బాజాప్తానే మాట్లాడే గుణం తెలంగాణ భాష సహజ గుణం. కోపమొచ్చి ఇయ్యర మయ్యర తిట్టినా కడుపుల ఇసం పెట్టుకునే భాష కాదు తెలంగాణ భాష. అలాగని ఊ అనక ఉప్పు రాయనక ఉల్కుపల్కు లేకుండా కూసోదు. ఈపుల ముల్లు పెరిగినోళ్ళను మాత్రం ఒకే ఒక్క మాటతో కండ్లపొరలు తీసే భాష తెలంగాణ తెలుగు భాష. అమాయకులను ఇబ్బంది పెట్టే భాష కాదు. ఎంత చెడు చేసిన వాళ్ళనయినా తిట్టాలనుకుంటే ‘ ఎవ్వల్ పున్నెం గట్టుకున్నరో గని ’ అని బాధ పడడమే తెలుసు ఈ భాషకి ‘ఎంటికి తెంపి పారేస్తే కొసా మొదలు తెల్వనోళ్ళతోని వాదులాట ఈ భాషలో ఉండదు. కానీ ఎడ్డెం అంటె తెడ్డెం అనేటోళ్ళ మీదనే ఇర్సుకపడ్తదీ భాష. అలాగని మరీ మూగదయ్యం పట్టదీ భాష… మోసం చేయాలనుకునోళ్ళ విషయంలో ఏడాకులు ఎక్కువనే సదువుకున్న భాష రేషగొండి భాష. ఇట్టం లేని మొగని మీద తల్వాలు పోసినట్టుండదీ భాష. నచ్చుతనే కలుపుగోలుగా నాలుగు మాటలెక్కువ మాట్లాడి…నచ్చకుంటే అస్సల్ మాట్లాడని భాష తెలంగాణ భాష. మొత్తంగా మాటతోనే మనిషిని పట్టిచ్చే సాఫ్ సీదా భాష. మానవీయ సంభాషణల కలపోత. మట్టిమనుష్యుల అసల్ సిసల్ భాష తెలంగాణ తెలుగు భాష.
డా.చింతం ప్రవీణ్‌కుమార్
9346 886 143

No comments: