మేము కూర్చున్న కుర్చీని
గంగాజలంతో 'శుద్ధి' చేసే కులగాన గంధర్వులున్న చోట
ద్వేషించడాన్ని ప్రేమించడమే నేర్చుకున్నచోట
అరవై వత్సరాల స్వాతంత్య్ర తంత్రంలో
అరవీసం పరతంత్రాన్ని పారద్రోలనిచోట
వివక్షకు సామ్రాజ్యాలే నిర్మితమౌతాయ్
ద్రావిడ భూమిలో దళితులకవమానాలే మిగులుతాయ్...
కులపిచ్చగాళ్లకు దేశమొక ఎలమావితోట...
కుల దూషణ పర్వాన్ని
కుబుసంలా విప్పిన మిస్టర్ ఇండియా ఎవడోగానీ
వినమ్రంగా వీధులూడ్చి
వెలివాడల్లో బతుకులీడ్చి
ఈ జాతికి జవ్వనాశ్వంలా మేము శ్రమదానం చేస్తున్నా
కుల ఓంకారాన్ని ప్రణవాక్షరం చేసుకున్న
దేశపౌరుల గుండెలోతులు తెలుసుకోగలమా!
దేశ నాయకుడు చస్తే
దేశీయులకు శోక సంగీతం వినిపించినట్లు
హస్తిన వీధుల్లో ఒక 'సవర్ణ' ఎన్టీఆర్ తొడగొడితే
ఆస్సీల దేశంలో దేశబాలలు తిరగబడితే
ఆత్మగౌరవ వీణను మీటిన తెలుంగునేల
గాంధీ పేరు పెట్టుకున్న ఎస్సీ అధికారిని
బ్రాందీ తాగి బస్సులు నడిపే సవర్ణుడొకడు మెడపడితే
నోరు మెదపదేల ఓ తెలుగు బాలా!
ఓ విశ్వదాభిరామా! మేము తెలుగువాళ్లం కామా!!
మలేసియా తెలుగోళ్ల కన్నా అడుగంటిపోయామా!
మేమేం శంకరాచార్యపీఠం అడుగుతున్నామా!
అండర్సన్‌ను అప్పనగా అప్పగించినట్లు
'ప్రతిభ' బూచితో 'శ్రమను' దోచుకుపోయేవాళ్ల మీదా
జాతీయుల్ని అస్పృశ్యులుగా చూసేవాళ్ల మీదా
కులానికి 'పరిశుద్ధతను' చేకూర్చిన రాతల మీదా
మనుషులెవ్వరు మాట్లాడని 'దేవభాష'లో
అస్పృశ్యతకు 'గీత'లిచ్చిన వాళ్లమీదా
దళితుల ప్రాణాలకన్నా ఆవులే మిన్నన్నవాళ్లమీదా
ఈ గండుకోయిలలు కూయవెందుకో
ఈ కవికుల గురువుల మౌనమెందుకో!
దేశం సర్వసత్తాక 'సంక్షేమ రాజ్యం' గనక
ప్రతిఏటా గణతంత్ర రాజ్య దినోత్సవమొస్తుంది గనక
ఎవడు దేశభక్తుడో ఎవడు సవర్ణుడో
సమాజం 'ఆక్టోపస్ పాల్'ఐ చెప్పేస్తుంది గనక
బడుగులపై అడుగడుగునా విషం కక్కినా ఫర్లేదు గనక
భారత మాత ముద్దుబిడ్డల అమృత హస్తాల్లో
అవర్ణులకు శాశ్వతావమానం తప్పదిక...
మిత్రులారా! కులం రాడార్ మీద
దేశీయ దళిత బతుకుల్ని మసకబార్చారెవరో!
దేశీయ చిత్రపటంపై కుల అసంతృప్త ద్రావకాన్ని పోసేసి
రాజ్యాంగ ఉ్రద్గంధంలో
సామాజిక న్యాయపుటల్ని చించుకుపోయారెవరో!
తెలుగు ప్రిటోరియాలో ఇహ నుంచి
వీధికో అపార్తైడ్ మ్యూజియంలే కనిపిస్తాయ్...
హైనాలే మానవ హక్కుల కోసం విలపిస్తాయ్...
-తుల్లిమల్లి విల్సన్ సుధాకర్
(ఆంధ్రాలో ఒక దళిత జాయింటు కలెక్టర్‌ను కులం పేరుతో దూషించారని తెలిసి ఆవేదనతో..)
25 ఆగస్టు, 2010
'సవర్ణ' ..దీర్ఘ సంది
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి