Monday, February 15, 2010

యూదులరాజే బీదలరాజు

ఇది అకాండపాతం కాదు
మీ పారిచూపులెప్పుడూ అబద్ధం కాదు
నూరు మనువులూ-నూటొక్క ఋగ్వేదాలెన్ని చెప్పినా
మనమంతా ఒకటేననీ మీరొక్కమాట చెప్పినా
వేదం మాకొద్దనేవాళ్లం కాదు
సత్యవేదం కావాలనుకునేవాళ్లం కాదు
ఒకధర్మం అస్ప్రుశ్యతా కళ్లాపిని
కన్న బిడ్డలమీదే అధర్మంగా చల్లిందని తెలిసి
కులమత వర్ణ వివక్షతల వైకుంఠపాళిలో విసిగి
యోగాఆయుర్వేదాలూ ఒప్పుకున్న సజ్జనం
మా నిమజ్జనాన్ని కూడా ఒప్పుకోరని కినిసి
ఒక మంచి కాపరికోసం ఎదురుచూసీ చూసీ
మీ మతానికి మరణవాక్యం పలికాం..
ముక్కోటి దేవతామూర్తులు
అంటరానివైపోయాయన్నప్పుడు మా పాకలు
ఆత్మగౌరవ అన్వేషణలో-సమానత్వ గవేషణలో
ఓడలు దిగిన ఇవాంజెలికల్ గుంపుల నుంచి
వూడలు దిగేలా విదేశీ మతాన్ని
అరువు దెచ్చుకున్నది నిజమే!
ప్రేమామయుడేసును దేుడన్నది వాస్తవమే!
కోతపండుగలకు పాలిగింజలు ఇచ్చి
ఈతకొమ్మలకు మందారాలు గుచ్చి
యూదులరాజే మా బీదల రాజంటూ
జ్ఞానదంతాలు రాకముందే జ్ఞానస్నానమాచరించి
జ్ఞానజ్యోతిని వెలిగించుకున్నాం...
దేశీయ సంస్కృతీ సంచిని తగిలించుకుని
తద్భవ భాషలోనే సువార్త చదువుకుని
త్యాగరాజ కీర్తనల బాణీల్లోనే
ఆంధ్ర క్రైస్తవ కీర్తనల్ని పాడుకుని
పరమ గీతాల్ని తెలుగునేలకు తెచ్చుకుని
మదరిండియాలో చంకలు గుద్దుకున్నాం..
రిజర్వేషన్ల భిక్షాపాత్ర దగ్గర
కుక్కబిస్కెట్లయినా దొరకని కిరస్తానీవాళ్లని
కుక్కల్ని కసిరినట్లు సర్కారు 'ఛీ'కొడితే
ఆకలి బేయేల్జిబూనై భయపెడితే
జీవాహారం పైనుంచి కురుస్తుందని చర్చి జోకొడితే
రోగాలకు పరలోకమే పరమవైద్యమని చిచ్చుకొడితే
హల్లెలూయల ఊహలలో ఊగివూరేగి
స్వస్థత కూటాల్లో మురిసిముక్కలయ్యాం
ఈ సువార్తలో మాత్రం అసమానత్వం లేిదెక్కడ!
వాగ్దానం చేసిన సమానత్వ మెక్కడ!
సవర్ణ క్రైస్తవ శ్మశానాల్లో మా శవాలకూ చోటెక్కడ!
ప్రపంచ ధనిక దేవుని వాకిట్లో-వాటికన్ మత చావిట్లో
దళితుడు పీఠాధిపతి అయ్యేదెక్కడ!
దేశపౌరుల గుండె లోతులు తెలిసేదెక్కడ!
మా పోరాటమిప్పుడు
ఈ దేశ రాజ్యాంగం కన్నా పాతది...
మా విశ్వాసమిప్పుడు
ఈ జాతి సాంస్కృతిక వారసత్వం కన్నా గొప్పది..
శకపురుషుని జననమంత మహోన్నతమైనది..
హే ప్రభూ!
ఏ దేశం పేరు చెబితే ప్రేమాశాంతులు గుర్తుకొస్తాయో
ఏ దేశం పేరు చెబితే తాజ్ మహళ్లు జ్ఞప్తికొస్తాయో
ఇప్పుడా దేశంలో కంధమాళ్లే నృత్యమాడతాయి...

- తుల్లిమల్లి విల్సన్ సుధాకర్
బేయేల్జిబూన్ : దెయ్యాల రాజు

( ఆంధ్రజ్యోతి సౌజన్యంతో...)


2 comments:

రమణ said...

నిజం

Anonymous said...

Read this article

http://www.tehelka.com/story_main.asp?filename=ts013004shashi.asp