(''మాకూ ఒక భాషకావాలి'' పేరుతో తుల్లిమల్లి విల్సన్ సుధాకర్ గారు ఆంధ్రజ్యోతి (http://www.andhrajyothy.com/editshow.asp?qry=/2008/jun/23vividha2) లో ఒక కవిత రాశారు. దీన్ని ఇప్పటికే చాలా మంది చదివి ఉంటారు. అయ్యినా నాకు నచ్చడం వల్ల ఆ కవితను ఆంధ్రజ్యోతి వారి సౌజన్యంతో ఇక్కడ పునర్ముద్రిసున్నాను..దార్ల )
మ్లేచ్ఛితమన్నా సరే
మమ్మల్ని మ్లేచ్ఛులన్నా సరే
మెకాలేకు వందనాలు చెప్తాం
పుట్టిన మా పసిపిల్లల చెవుల్లో
ఏబిసిడిలే ఉచ్చరిస్తాం......
అంగ్రేజీ దేవతకు వేనవేల వందనాలు
లండన్ మాది కాదు
ఇంగ్లీషు మాకు రాదు
పౌండ్లకోసం ఇంగ్లండు వెళ్లిన
జాతి మాదికానేకాదు
మేమేమీ ఇవాంజిలికల్ క్రైస్తవులమూకాదు
ఆంగ్లీకరించుకున్నంత మాత్రాన
మేము మార్టిన్ లూథర్‌లమూ కాదు....
సూపర్ కంప్యూటర్ నిర్మించిన
నిరుపేదల దేశంలో
బోధనాలయాల
ఆంగ్లీకరణల కుంభమేళాలో
ఐటి, ఐఐటి సాఫ్ట్‌వేర్లు
దేశమంతా వేర్లొచ్చిన
ఆదిశంకరుడి పీఠాలైతే
ఆధిపత్య వర్ణాలు
ఆనందంగా జరుపుకొనే
డాలర్ కార్నివాల్‌లో
'టామీ' అని పిలిస్తే కుక్కలు
కూడా ఇంగ్లీషు నేర్చుకుంటున్నాయి
జీన్ ప్యాంట్లు వేసుకునేవాళ్ళ దగ్గర
దేశాభిమానం మీద
నిక్కర్లతో చక్కర్లు కొట్టే వాళ్ల దగ్గర
సంస్కృతీ సంప్రదాయాలమీద
లెక్చర్లే వినాల్సిన ఖర్మపడితే
అమెరికా ఎంబసీల ముందు
ఆనందంగా బారులు తీరిన
భారతీయ సోదరుల సుందర
వదనాల మీద
దమ్ముంటే ఉమ్మేసే
దేవ భాషల పేర్లేమిటో!
నమ్మశక్యంకాని ఆర్యభట్టలూ......
నమ్మశక్యంకాని పుష్పకవిమానాలూ.......
నిజమైన భారతాన్నెప్పుడు చూశాం
గాడిద పేడతో
డిటర్జెంట్లు చేసే రజకుల మేధస్సుని
గొడ్డుటావుల చర్మాన్ని
గంటలో ఒలిచే చర్మకారుల నైపుణ్యాన్నీ
వాంతి చేసుకోకుండా
దేశీయుల మలాన్ని చేతులతో పట్టుకెళ్ళే
దౌర్భాగ్యుల సహనాన్నీ
గుర్తించని ఈ భాషాజాతులు
ఎవరికి ట్రోజన్ హార్సులు!
జాతిలో సమైక్యం కాలేనప్పుడూ
నీతిలో సమతుల్యం లేనప్పుడూ
వాచకాల్లో ఒక్క గౌరవ పదమూ
దళితుల గౌరవం కోసం వ్రాయనప్పుడూ
సగౌరవంగా వీధులూడ్చే వాళ్ల పిల్లల్ని
సమానత్వం ఫ్లాట్‌పారాల మీద
సివంగిలా తరిమికొట్టేదెవడిభాష!
దేశమంటే కులమే
దేశీయ భాషల Äౌగికమే
ఒకడు చెండాలుడట............
మరొకడు ఆగ్నిహోత్రావధానుడట.....
ఏం భాషలురా ఇవీ
అంటరాని తల్లిని ఆమ్మన్నా తప్పు
అష్టావధానంలో నీ యమ్మన్నా ఒప్పు
ఆ రబ్బీలు
అర్థంకాని అరబ్బీలు నేర్పినా
సఖ్యతలు నేర్పే
వాళ్ల మదరాసాలే నయంకదూ
ఖర్మ!
కపటం జాతీయ అజెండా అయింది
అస్పృశ్యత సారూప్యతలో
బానిసత్వం ఒక పిక్నిక్ అయింది
పంచాయితీ బళ్ళు మాకై
అంగ్రేజీ బళ్ళు వాళ్ళకై
కార్పొరేట్లు దొంగసచ్చినోళ్ళకై
సైనిక్ స్కూళ్ళూ సెంట్రల్ స్కూళ్ళూ
కలగా పులగమై
మాపై మీకు
సానుభూతెప్పుడో చచ్చిందిగదా!
ఈ నుడికారాల్నింక మ్యూజియంలోకీ
ఈ భాషాదెయ్యాల్నింక గురుకులాల్లోకీ
సర్కారు భాషా సౌందర్యపు గోడౌన్లలోకీ
తరిమి పడెయ్యాలి..............
మాకిప్పుడొక కొత్త భాష కావాలి
అది మా హృదయ ఘోషకావాలి
కన్న బిడ్డల్నే అస్పృశ్యులంటూ
చేతులతో మలాన్నెతించిన భాష
సజీవ దహనం కావాలి..........
మ్లేచ్ఛితమన్నా సరే!
మమ్ముల్ని మ్లేచ్ఛులన్నా సరే!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి