"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL-426: Indian Literature క్లాసులు మధ్యాహ్నం 12.00 గంటల నుండి 1.00 వరకు జరుగుతాయి.

గణేష్ పత్రిక లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
గణేష్ పత్రిక లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

05 మే, 2019

జగన్నాటకం


26 ఏప్రిల్, 2019 గణేష్ దినపత్రిక 






జగన్నాటకం!


నాపై ఒక పసిపాప పాదంలా 
ఆకాశగంగ కేరింతలు కొట్టినప్పుడు
హృదయమంతా మాతృత్వపు పలకరింపు!
నాపై ఒకప్రియురాలి కౌగిలా
శరన్మేఘం చేతులు చాచినప్పుడు
మనసంతా మన్మధపరిమళపు పులకరింత!
నాపై ఒక మోసకత్తె బాణంలా
వడగండ్ల చూపులు విసిరినప్పుడు
తనువంతా రక్తసిక్తమైన పలవరింపు!
నాపై ఒక అవకాశవాది వలపులా
వడిగానో, వరదగానో తుఫానులైనప్పుడు
ప్రాణమంతా విలవిలలాడుతూ కలవరింత!
నాపై  తుంపర్లే పడినా 
నాపై వర్షమే కురిసినా  వరదలే పారినా
అన్నింటినీ హత్తుకున్నట్లున్నా
అంతాజగన్నాటకం!
నేనొక తామరాకుని! !
-ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, హైదరాబాద్
29.4.2019

వీళ్ళు నా బిడ్డలు



గణేష్ దినపత్రిక, 5 మే 2019 సౌజన్యంతో

వీళ్ళు నా బిడ్డలు
కానీ నా బిడ్డలు మాత్రమే కాదు!
ఈ తోటలో మొక్కలు నావి
కానీ ఈ మొక్కలు నాకు మాత్రమే కాదు!

అమ్మా నాన్నా ...
మీరు కూడా నా గురించి  ఇలాగే అనుకున్నారేమో
నేనిలా పెరగడానికి
నాతో మీరెంతగా పెనవేసుకున్నారో!
మీరు లేని నేను లేను
కానీ, నేను మీతో లేనెందుకు?
నడకనేర్పిన మీతో రాలేకపోయానెందుకు?

నా చుట్టూ మీరెన్ని కలల నిచ్చెనలు వేశారో
ఏనిచ్చెనైనా ఎక్కానోలేదో
ఆ నిచ్చెనలన్నీ తన్నేసి కొత్తనిచ్చెనే తెచ్చుకున్నానో
మీరనుకున్నదారిని నడుస్తున్నానో
ఆ దారినే విస్మరించానో...
మీరిప్పుడు మళ్ళీ నాకళ్ళముందు కదులుతున్నారు
మీరిప్పుడు మళ్ళీ నా ఒడిలో కేరింతలు కొడుతున్నారు
మీరిప్పుడు మళ్ళీ నా కనురెప్పల్లో
ఆనందభాష్పాలవుతున్నారు
నాకిచ్చిన స్వేచ్ఛను
మళ్ళీ మీకివ్వాలనుకుంటున్నాను
నా వేళ్ళుపట్టుకొన్పందుకే మురిసిపోయిన
ఆ మురిపాలన్నీ మళ్ళీ మీకివ్వాలనుకుంపున్నాను
నా ప్రతికదలికా కథలు కథలుగా సాగిన
ఆ నిరంతర ప్రవాహాన్ని
మళ్ళీ మీకివ్వాలనుకుంటున్నాను
నా నడకకు మీరొక సాధమమైయ్యీ
పరుగందుకోవడానికి మార్గమయ్యీ
మీరక్కడే ఓడిపోయిన
  విజయాన్ని మళ్ళీ మీకివ్వాలనుకుంటున్నాను


వీళ్ళు నా బిడ్డలు
కానీ నా బిడ్డలు మాత్రమే కాదు
ఈ తోటలో మొక్కలు నావి
కానీ ఈ మొక్కలు నాకు మాత్రమే కాదు!
-ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, హైదరాబాద్
(ఖలీల్ జిబ్రాన్ On Can అనే  కవిత చదివాక!)

19 మార్చి, 2019

సాధారణ ప్రజల కోణంలో సత్యమ్ కవిత్వం ( సత్యమ్ చెప్పిన సత్యాలు’ గంథావిష్కరణ సభ వార్తలు






'సామాన్యుణ్ణి సైతం మెప్పించేదే సిసలైన కవిత్వం'

సామాన్యుణ్ణి కేంద్రం చేసుకోవడంతో పాటు సామాన్యుడికి కూడా అర్ధమయ్యేలా కవిత్వాన్ని రాసిన కొత్తూరు సత్యనారాయణ గుప్త అభినందనీయుడని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ స్టూడెంట్స్ వెల్ఫేర్ డిప్యూటీ డీన్ ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు అన్నారు. భావన సాహితీ సంస్ధ మరియు జనతా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం కర్నూలు ప్రభుత్వ అతిధి గృహంలో  కొత్తూరు సత్యనారాయణ గుప్త 'సత్యం చెప్పిన సత్యాలుకవితాసంపుటి ఆవిష్కరణ సభలో ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.
సాధారణంగా కవి తనజీవితానుభవాల్ని కవిత్వం ద్వారా సత్యాలుగా చెప్పడం ఒక ప్రయోగంగా వ్యాఖ్యానించారు.  కథలునవలల్లో కనిపించే ఆత్మకథనాత్మక ధోరణిని ఒక ప్రత్యేకంగా కవిత్వంలో చెప్పడం ఈయన కవిత్వంలో కనిపించే ఓ విశేషమని ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు అన్నారు.  కవి తాను అనుభవించిన దాన్నే కవిత్వం చేయడం సర్వసాధారణంగా జరిగే రచనాశైలి ప్రతికవిలోనూ కనిపిస్తుంది. కానీ అది అతని జీవితమేనంటే ఏ కవీ ఒప్పుకోడు. అలాగని దానిలో అతని జీవితమే లేదన్నా ఒప్పుకోడు. అలా రాయడమే కళాత్మకత. సమస్యల్ని సాధారణీకరించడం వల్ల వాస్తవం కళాత్మకమై కవిత్వంలో అందరి సత్యంగా కనిపిస్తుంది. సత్యనారాయణ గుప్త కవిత్వంలో కూడా ఇలా  సాధారణీకరించే స్థితిని కూడా కొత్త పద్ధతిలో చెప్పారు. కథల్లో కనిపించే ఆత్మకథనాత్మక పద్ధతిలా అంటే ఉత్తమ పురుష కథనంలో సంభాషణాత్మకంగా రాస్తుంటాడని వెంకటేశ్వరరావు విశ్లేషించారు.
 గణేష్ పత్రిక సంపాదకుడిగా, యాజమానిగా ఉండటం వల్ల తానొక కవులసేనను పోషిస్తూ సమకాలీన అభినవ శ్రీ కృష్ణ దేవరాయల వంటి పాత్రను పోషిస్తున్నాడనిపిస్తాడు. గణేష్ దినపత్రిక ప్రతిదినం ఒక పూర్తి పేజీని కవులకే కేటాయిస్తూ అష్టదిక్కులకు వ్యాప్తి చేస్తున్న సమకాలీన భువనవిజయంగా ఆ పత్రికను ఆయన అభివర్ణించారు. సత్యం కవిత్వం గురించి రాసిన ముందుమాటలో కవి ఆశయాన్నికవి లక్ష్యాన్ని వివరించారని అన్నారు. ఆంధ్రదేశానికి 1953 నుండి 1956వరకూ రాష్ట్ర రాజధానిగా ఉన్న ఈ కర్నూలు పట్టణంలో జరుగుతున్న ఈ సాహిత్య సభకు చారిత్రక ప్రాధాన్యం ఉందన్నారు. సుమారు 78 శాతం అక్షరాస్యులు కలిగిన ఈ కర్నూలు పట్టణంలో ఈ సాహిత్య సభ జరగడం కూడా ఒక చారిత్రక పరిణామంగా వ్యాఖ్యానించారు. కవికి రాయలసీమ ప్రాంతం పై అభిమానం ఉన్నాఇతర ప్రాంతాల పై ద్వేషం లేకుండాఆ ఆధిపత్యాన్నే నిరసిస్తూనేఅన్ని ప్రాంతాలకు చెందిన కవులు శ్రీశ్రీకాళోజి మొదలైనవారితోపాటురామాయణం రాసిన కవయిత్రి మొల్ల చిత్రపటాలను కూడా పత్రికల్లో నిత్యం ప్రకటిస్తూ తెలుగు సాహిత్యాన్నిసంస్కృతినీ కాపాడ్డంతో పాటుసాంస్కృతిక సమన్వయాన్ని సాధిస్తున్న గణేష్ పత్రికదాని సంపాదకుడుకవి కొత్తూరు సత్యనారాయణ గుప్త ని అభినందించకుండా ఉండలేమని వెంకటేశ్వరరావు తన హర్షాన్ని వెల్లడించిదుశ్శాలువాతో కవిని ఘనంగా సత్కరించారు.
ఈ సభకు అధ్యక్షత వహించిన సాహితీ స్రవంతి కార్యదర్శి జంధ్యాల రఘుబాబు మాట్లాడుతూ ఊహాలోకాలనుండి సామాజిక వాస్తవికతను ప్రతిబింబించే దిశగా,సామాన్య మానవుడి దగ్గరకు తీసుకొచ్చిన కవిత్వ దశ 'సత్యమ్ చెప్పిన సత్యాలు'లో కనిపిస్తుందన్నారు. చిన్న చిన్న మాటలతోమనమాటలే మనకు కవిత్వంగా రాయడమెలాగో తాను రాసిన కవిత్వం ద్వారా తెలుసుకోవచ్చునని గ్రంథసమీక్ష చేసిన సంగారెడ్డి జిల్లా తారా ప్రభుత్వ డిగ్రీ కళాశాల తెలుగు ఉపన్యాసకురాలు, ప్రముఖ కవయిత్రి శ్రీమతి సంధ్య పేర్కొన్నారు. కవితా సంపుటిలో కవి రాసిన కవితలను సమగ్రంగా చర్చించారు. తానేవో కొన్ని మంచి వాక్యాలు రాస్తూఅప్పుడప్పుడూ కొందరితో మాట్లాడిన సంభాషణలను కూడా సత్యనారాయణ గుప్త కవిత్వంగా రాస్తుంటారనినేడు ఒక పుస్తకమే తీసుకురావడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని శ్రీమతి సంధ్య పేర్కొన్నారు.  పుస్తకంలోని కొన్ని కవితలను చదివి వాటిని విశ్లేషించారు. ఈ కవితా సంపుటిలో స్త్రీ పట్లతన భార్య పట్లతన తండ్రి పట్ల రాసిన కవితలు తనకెంతగానో నచ్చాయని శ్రీమతి సంధ్య పేర్కొన్నారు. సమాజంలో కనిపించే అనేక రుగ్మతలపై కవిత్వం రాసిన ఈ గ్రంథం ఔత్సాహిక రచయితలకు ప్రేరణనిస్తుందనీరాబోయే కాలంలో మరింత బలమైన కవిత్వాన్ని రాస్తారని తాను ఆశిస్తున్నట్లు ఆమె చెప్పారు. ఈ సందర్భంగా కవిని శ్రీమతి సంధ్య ఘనంగా సత్కరించారు.
 తెలంగాణ రచయితల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడుప్రముఖకవి కోట్ల వెంకటేశ్వరరెడ్డి మాట్లాడుతూ  గుండెలనుండి సూటిగా దూసుకొచ్చే ప్రతిజీవితానుభవమూ కవిత్వమేనని వ్యాఖ్యానించారు. కవి సత్యనారాయణ గుప్త కవిత్వాన్నిఆయన కృషిని వర్ణిస్తూ ఆయన చదివిన కవిత పాఠకుల్ని ఆకట్టుకుంది. తెలంగాణ రాష్ట్రంలో ఒక రెండువేల మంది ఉన్న సాహిత్య సభలో గణేష్ పత్రిక సంపాదకులను పరిచయం చేయడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు.
నేడు పత్రికల్లో సెంటీమీటర్ల చొప్పున ప్రకటనల వ్యాపారం జరుగుతుంటేఅనేక కష్టనష్టాలను భరిస్తూ కూడా గణేష్ పత్రికను నడపడంఒక పూర్తి పేజీని సాహిత్యానికే కేటాయించడం సామాన్య విషయం కాదని పుస్తకాన్ని ఆవిష్కరించిన నగరూరు సుబ్రహ్మణ్యం చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షురాలుగ్రంథాన్ని ఆవిష్కరించిన శ్రీమతి శమంతకమణి  పేర్కొన్నారు. వెనుకబడిన ప్రాంతమైన కర్నూలు కేంద్రంగా పత్రికను నడపడం చాలా కష్టమని, ఆ కష్టనష్టాలను లెక్కచేయకుండా ముందుకుసాగుతూ వివిధ అంశాలతో కూడిన ప్రత్యేక కథనాలు రాస్తూ పాఠకులకు చేరవేసేలా పత్రికను తీసుకొస్తున్న సత్యనారాయణ గుప్తను అభింనందించారు. పత్రికను క్రమం తప్పకుండా తీసుకొని రావడంతో పాటు సాహిత్య సభలు, సమావేశాలు, కవిసమ్మేళనాలు నిర్వహించడం నాకెంతో ఆశ్చర్యంగాను, ఆనందంగాను, అది కర్నూలు పట్టణంలో జరగడం గర్వకారణంగాను ఉందని శ్రీమతి శమంతకమణి తన సంతోషాన్ని వ్యక్తం చేశారు.  తెలంగాణరాయలసీమఆంధ్ర కవులందరినీ ఒకే వేదికపై తీసుకొస్తున్న ఘనత గణేష్ పత్రికకే చెందుతుందన్నారు. ప్రధాన స్రవంతిలో ఉన్న పత్రికలు విలువైన కార్యక్రమాల్ని కూడా రకరకాల కారణాలవల్ల వార్తలుగా ప్రచురించలేకపోయినాగణేష్ పత్రిక స్ధానిక వార్తలకు అత్యంత ప్రాధాన్యతనివ్వడం సంతోషించదగిన అంశమన్నారు. సాహిత్యంలో ప్రఖ్యాతలను సభకు పిలిచి, వారితో పాటు తనను అతిథిగా పెట్టి ఆయన పుస్తకాన్ని తనచేత ఆవిష్కిరింపజేయడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు.
సభలో మరొక అతిథిగా పాల్గొన్న కరీంనగర్ జిల్లా నుండి వచ్చిన ప్రముఖ కవి సబ్బని లక్ష్మీనారాయణ మాట్లాడుతూ జీవిత సత్యాలే కవిత్వమనీ,  సత్యవాక్యం ఒక్కటున్నా అది గొప్ప కవిత్వంగానే భావించాలన్నారు. ఆంగ్ల కవి వర్డ్స్ వర్త్ చెప్పిన కవిత్వ నిర్వచనాల్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. కొన్ని సార్లు ఆవేశం కూడా కవిత్వం అవుతుందన్నారు. సత్యం ఎప్పుడూ మారదనీ, అది తెలంగాణ, రాయలసీమ, ఆంధ్ర లేదా మరే ప్రాంతమైన సత్యం ఎప్పుడూ సత్యమేనని అది సత్యనారాయణ గుప్త కవిత్వంలో కనిపిస్తుందన్నారు. ఈసందర్భంగా తెలంగాణలో జరిగిన దోపిడీ, దాని నుండి విముక్తి పొందడం ఒక చారిత్రక సత్యమనీ, దానిపై రాసిన ‘సత్యం’ కవితను చదివి వినిపించారు. ప్రధాన జీవన స్రవంతిలో ఉన్న పెద్ద పత్రికల్లో తమరచనలకు చోటు పెద్దపెద్దవాళ్ళకే లభించడంలేదనీ, ఆ పరిస్థితుల్లో గణేష్ పత్రిక ఫోను చేసి మరీ కవిత్వాన్ని రాయించి, ప్రచురించి ప్రోత్సహించడం గొప్పవిషయమన్నారు.
ప్రముఖ సాహితీవేత్త డా.హరికిషన్ మాట్లాడుతూ సత్యంగారి కవిత్వాన్ని చదివి తన కూతురు కూడా కవిత్వం రాస్తానన్నదని చెప్పారు. అంత చిన్నపిల్లలకు కూడా అవగాహన అయ్యేలా కవిత్వం రాసిన సత్యంగారు తన గణేష్ పత్రిక ద్వారా సామాజిక మాధ్యమాల్లో విస్తృత ప్రచారం వల్లనే తనకీ పత్రిక తెలిసిందన్నారు. గణేష్ పత్రిక బాలసాహిత్యాన్ని కూడా ప్రోత్సహిస్తున్నందుకు తనకు సంతోషంగా ఉందన్నారు.
ప్రముఖ సాహితీ వేత్త గౌరెడ్డి హరిశ్చంద్రరెడ్డి మాట్లాడుతూ సంస్కృత, తెలుగు కావ్యాల్లోని వివిధ శ్లోకాలు, పద్యాలను చదివి, అంతటి గొప్ప విషయాల్ని కూడా సరళమైన శైలిలో, తాత్త్వికంగా చెప్పడం సామాన్యమైన విషయం కాదనీ, అందువల్లనే ఈ పుస్తకం నిజంగా సత్యం కనిపిస్తుందన్నారు.
ప్రముఖ సాహితీవేత్తలు కెంగర మోహన్,  ఎఆర్ కె శర్మ , ఎలమర్తి రమణయ్య, గంగస్వామి, డా.బాలిరెడ్డి తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
సమావేశంలో తన పుస్తకావిష్కరణానంతరం, అతిథులు మాట్లాడిన తర్వాత ‘సత్యమ్ చెప్పిన సత్యం భావాలు’ గ్రంథ రచయిత, గణేష్ పత్రిక సంపాదకుడు కొత్తూరు సత్యనారాయణగుప్త (సత్యమ్) మాట్లాడుతూ, తన పత్రిక తొమ్మిదొవ వసంతంలోకి అడుగిడిన రోజునే నా పుస్తకాన్ని ఆవిష్కరించుకోవడం యాదృచ్ఛికంగా జరిగిన సంఘటనగా చెప్పారు. తన తండ్రి ఆశయాలు, లక్ష్యాలు, వారి భావజాలం తననెంతగానో ప్రేరేపించి నడిపిస్తున్నాయనీ, అందువల్లనే తానెన్ని అప్పుల్లో కూరుకుపోయినా పత్రికను నడుపుతున్నానని చెప్పారు. సమాజంలో కవిని గౌరవించుకున్న సమాజమే నిజమైన సంస్కృతిగల సమాజంగా తాను తన తండ్రి మాటల వల్ల నేర్చుకున్న జీవిత సత్యమన్ని తన పత్రికా నిర్వహణా, కవిత్వం రాయడంలో గల నేపథ్యాన్ని సోదాహరణంగా వివరించారు. చిన్న వాళ్ళ నుండి వృద్ధుల వరకూ తన పత్రికలో స్థానం ఇచ్చి ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు. సాహిత్య ప్రమాణాల కంటే సహృదయత, స్పందన ముఖ్యమనీ ఈ రెండూ ఉంటూ సాహిత్య ప్రమాణాలు వాటంతట అవే వస్తాయని భావిస్తూ కవులను గౌరవిస్తున్నానని అన్నారు. తనకు తెలంగాణలో వేలాది మంది ముంద జరిగిన గౌరవానికి కారణం నా పత్రికేనని, తానొక సామాన్యమానవుడిగానే భావిస్తూ ఒక సభకు వెళితే తనని గౌరవఅతిథిగా వేదికపైకి పిలిచినప్పుడు ఆ సభలోని జనం కొట్టిన తప్పట్లు తనకింకా చెవుల్లో మారుమ్రోగుతున్నాయని గుర్తుచేసుకున్నారు. తానెవరికీ తెలియకపోయినా తనపత్రిక వివిధ మాధ్యమాల ద్వారా చేరవలసిన ప్రజలకు చేరుతుందని ఆ రోజు తనకి అర్థమై, ఆనందభాష్పాలు రాలాయని గుర్తుచేసుకున్నారు. తనపై అనేకమంది కవిత్వం రాసారు. తనపై అనేకమంది పద్యాలు రాశారు. తానొక సామాన్యుడినైనా తననింతగా గౌరవిస్తున్నారంటే సామాన్యుణ్ణి తాను దగ్గరకు తీసుకోవడమే కారణమని నమ్ముతున్నానని సత్యమ్ అన్నారు.
ఈ సందర్భంగా సమావేశంలో పాల్గొన్న ముఖ్యఅతిథులు, విశిష్ట అతిథులు, ప్రత్యేక అతిధులు, స్నేహ అతిథులు, సహృదయులకు దుశ్శాలువా, జ్ఞాపికతో గణేష్ పత్రిక సంపాదకుడు, కవి కొత్తూరు సత్యనారాయణ గుప్త ఘనంగా సత్కరించారు. తాను పెద్ద సభగా తన పుస్తకావిష్కరణను పెట్టగలిగినా, తన వ్యక్తిగత విషయానికి తాను ఆర్భాటాలు చేయకుండా కుటుంబంలాంటి కొంతమంది మిత్రులతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నానని సత్యమ్ వివరించారు. 

18 మార్చి, 2019

సత్యమ్ చెప్పిన సత్యాలు ’ పుస్తకావిష్కరణ సభ (17.3.2019)



సత్యమ్ చెప్పిన సత్యాలు ’ పుస్తకావిష్కరణ సభ, కర్నూలు, 17.3.2019


సామాన్యుణ్ణి కేంద్రం చేసుకోవడంతో పాటు సామాన్యుడికి కూడా అర్ధమయ్యేలా కవిత్వాన్ని రాసిన కొత్తూరు సత్యనారాయణ గుప్త అభినందనీయమని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ స్టూడెంట్స్ వెల్ఫేర్ డిప్యూటీ డీన్ ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు అన్నారు. భావన సాహితీ సంస్ధ మరియు జనతా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం కర్నూలు ప్రభుత్వ అతిధి గృహంలో  కొత్తూరు సత్యనారాయణ గుప్త 'సత్యం చెప్పిన సత్యాలు' కవిత్వం ఆవిష్కరణ సభలో ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.

 కవి తనజీవితానుభవాల్ని కవిత్వ సత్యాలుగా చెప్పడం ఒక ప్రయోగంగా వ్యాఖ్యానించారు. తానొక కవులసేనను పోషిస్తూ అభినవ శ్రీ కృష్ణ దేవరాయలుగా పనిచేస్తూ, గణేష్ దినపత్రిక ప్రతిదినం ఒక పూర్తి పేజీని కవులకే కేటాయిస్తూ అష్టదిక్కులకు వ్యాప్తి చేస్తున్న సమకాలీన భువనవిజయంగా ఆయన అభివర్ణించారు. ఈ సభకు అధ్యక్షత వహించిన సాహితీ స్రవంతి కార్యదర్శి జంధ్యాల రఘుబాబు మాట్లాడుతూ ఊహాలోకాలనుండి సామాజిక వాస్తవికతను ప్రతిబింబించే దిశగా, సామాన్య మానవుడి దగ్గరకు తీసుకొచ్చిన కవిత్వ దశ 'సత్యమ్ చెప్పిన సత్యాలు'లో కనిపిస్తుందన్నారు.

 చిన్న చిన్న మాటలతో, మనమాటలే మనకు కవిత్వంగా రాయడమెలాగో కవిత్వం ద్వారా తెలుసుకోవచ్చునని గ్రంథసమీక్ష చేసిన శ్రీమతి సంధ్య పేర్కొన్నారు. తెలంగాణ రచయితల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోట్ల వెంకటేశ్వరరెడ్డి మాట్లాడుతూ  గుండెలనుండి సూటిగా దూసుకొచ్చే ప్రతిజీవితానుభవమూ కవిత్వమేనని వ్యాఖ్యానించారు.

 నేడు పత్రికల్లో సెంటీమీటర్ల చొప్పున ప్రకటనల వ్యాపారం జరుగుతుంటే, అనేక కష్టనష్టాలను భరిస్తూ కూడా గణేష్ పత్రికను నడపడం, ఒక పూర్తి పేజీని సాహిత్యానికే కేటాయించడం సామాన్య విషయం కాదని పుస్తకాన్ని ఆవిష్కరించిన నగరూరు సుబ్రహ్మణ్యం చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షురాలు శ్రీమతి శమంతకమణి  పేర్కొన్నారు. తెలంగాణ, రాయలసీమ, ఆంధ్ర కవులందరినీ ఒకే వేదికపై తీసుకొస్తున్న ఘనత గణేష్ పత్రికకే చెందుతుందన్నారు.





21 ఆగస్టు, 2018

పద్యాలు

ఎక్కడైనగానిచక్కగాదేవుళ్ళు
కొండలెక్కియేలకొలువునుండు?
అందరంతరంగమవలోకమగుటకు!
దారి పూల తోట దార్ల మాట!


స్వేచ్ఛకాంక్షవలనవచ్చినకవితయు
బంధనంబునందు బంధితంబు
వచనకవితతత్త్వవాస్తవేముండురా
దారి పూల తోట దార్ల మాట!


గోగినేనిబాబు గొప్పగా చెప్పిరే
బిగ్గుబాసుమనము నెగ్గవచ్చు
ఓడవచ్చుగాని ఓటుకంతపతనమా?
దారి పూల తోట దార్ల మాట!


సెలవుదినములందు వలస వచ్చినరీతి
బుల్లితెరలమీద బుద్ధిగాను
తెల్లబోయిచూడు దెయ్యములుండురా 
దారి పూల తోట దార్ల మాట!

-దార్ల వెంకటేశ్వరరావు,
హైదరాబాదు

గుడికేల పోవలె?



సీసము:
కొండలనెక్కితి కోనలు తిరిగితి 
           చెట్లనీ పుట్లనీ చేరిపిలిచి
అక్కడా యిక్కడా యెక్కడ చూడగ
          నైననూ నీవునేనైన యట్లు
నేనునీ వైనున్న నేనుగాన కనగ
          మనుచుందువెప్పుడుమనిషినెపుడు
యెంతయెత్తుకివెళ్ళినే మగును మనకు
           నేలయేకనపడునెరుగమనుదు
తే.గీ:
గుడికి ముందు నిలిచియడుగుబడుగౌను
ఇంటి ముందునాడుకొనెడి శిశువుయౌను
జగమె తనదనుచుతిరుగు యోగియౌను
సర్వజీవసృష్టి లయల చలనమౌను!


-దార్ల వెంకటేశ్వరరావు, హైదరాబాదు

(గణేష్ దినపత్రిక, ది 21 ఆగస్టు 2018) 

17 ఆగస్టు, 2018

సహృదయసాహితీవేత్త'బేతవోలు'

సహృదయసాహితీవేత్త'బేతవోలు'

ప్రాకృతంబునందుపాండిత్యచరితుఁడు
సంస్కృతాంధ్రపద్య సవ్యసాచి
వెలుగుచున్నతెలుగుబేతవోలునిలుచు
వీరిపలుకులెల్ల విలువనుండు!

సంప్రదాయియైన సహృదయసాహితీ
వేత్త, ఆధునికత నేర్పునెరుగు
నవ్యదృష్టికలిగినట్టిదివ్యుడతడు 
పేరుతెలుసుమనకు 'బేతవోలు'!

మేత కూతలవ్రాతలు మేలునిచ్చు 
విశ్వవిద్యాలయమునందు వీటినెపుడు
మురిపెమునచూచుకొనుమని మురిసిపోయి
చెప్పుచుండెమరువకని చెలిమి కలిగి!

నిత్యసాహిత్యపరిశీలనిష్టపడుచు
నిత్యసాహిత్యపఠనంబుకృత్యమైన
కులమతప్రాంతములతడికుండవయ్య
మెచ్చుకొను 'బేతవోలు' యే మేలుయనుచు!
-దార్ల వెంకటేశ్వరరావు,

(ఆచార్య బేతవోలు రామబ్రహ్మం గార్కి తెలుగు సాహిత్యవిభాగంలో భారత రాష్ట్రపతి పురస్కారాన్ని ప్రకటించిన సందర్భంగా శుభాకాంక్షలతో... ఆచార్య దార్ల వేంకటేశ్వరరావు, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్)

ప్రేమ- ఫలం! ( నేటి నిజం, 18 ఆగస్టు 2018 సౌజన్యంతో..)

నేటినిజం, సాహిత్యానుబంధం 17 ఆగస్టు 2018

ప్రేమ- ఫలం!

నువ్వు నాపక్కనున్నా-నీపక్కను నేనున్నా 

నాకేంటో కాలాన్ని కట్టేయాలనిపిస్తుంది
కులమతగీతల్ని చెరిగిపోయినట్లనిపిస్తుంది
నెర్రబారిన నేలేదో  కొత్తబీజాలకు 

యెద వాకిళ్ళు తెరచినట్లనిపిస్తుంది
నీళ్ళల్లోకి చూస్తున్నంత సేపూ 

నల్లమల అడవుల్లో వెదురువనం
కురిపించే మెరుపు సంగీతాన్నేదో 

మనసుమైదానంలో 

కొత్త చిగుళ్ళేస్తున్నట్లనిపిస్తుంది
నువ్వూ-నేనూ కలిసున్నంతసేపూ
శబ్దామృతాన్ని నిశ్శబ్దంగా భోంచేస్తామో
జఠరాగ్నుల శత్రుదాడుల్ని జయిస్తామో
విందుభోజనం చేసినంత సంతసిస్తాం!
నువ్వున్నంతసేపూ 

పూలపరిమళల జల్లుల్లో తడుస్తున్నట్లు-
నా హృదయాకాశంనిండా నింపిన
వేలాది  నిండుపౌర్ణమి చంద్రికలు

నీళ్ళల్లో సల్లగా ఏరుకుంటున్నాను...
ఒక్కోసారి ఆనందమో అంతులేని భారమో
నీదగ్గరకుమ్మరించేయాలనుకున్నప్పుడల్లా
మాటలమూటల్ని విప్పలేనప్పుడు 

తలపై నిమిరేస్పర్శనై పసిశిశువులా లాలించే 

ఆ నులివెచ్చని మదినో వీడలేక 

లైలా మజ్నూలైపోవాలనిపిస్తుంది.
మనసుల మరుమల్లెల్నిగుర్తించక 

కర్కశంగా బండరాళ్లతో 

కులసమాధుల్లో పూడ్చిపెట్టినా
ప్రేమ వృక్షానికి ఎరువుగా మారిపోయైనా
కొత్త చిగురునీ
కొత్త పూవునీ, కొత్త ఫలాన్నన్వాలనిపిస్తుంది.

-దార్ల వెంకటేశ్వరరావు,
9182685231

01 ఆగస్టు, 2018

ఇంటర్నెట్టు వీడియోల వెతుకులాట (పద్యాలు)


దారి పూల తోట!


అంతుపంతులేని ఆశ్చర్యకథనాలు
వెతుకవద్దు నెట్టు వెగటు పుట్టు
నేతిబీరకాయనెయ్యినిచ్చునటయ్య!
దారి పూల తోట దార్ల మాట!




చిరుతబోలునట్టి పరుగుపెట్టునడక
చీమచావనట్టిసిన్నినడక
నడకనడకచూడనలుబదితీర్లయా
దారి పూల తోట దార్ల మాట!




మనసుతేలిపోయెమబ్బుకదిలినట్లు
కనులుతడిపిపోయెచినుకులన్ని
బాధతీరిపోయెబరువేలనుండురా!
దారి పూల తోట దార్ల మాట!!



అమ్మ మాటవోలెనమృతంబుకురిపించు
కవన మధురిమలకు గగన గంగ
తెలుగు భాష భువిని దిక్కులంతట నిలుపు
దారి పూల తోట దార్ల మాట!



కులముకన్నమిన్నగుణమనుచుందురు
ఆచరించునపుడు అదియునిజము
వానచినుకుతెలుపు వర్ణ ధర్మంబురా!
దారి పూల తోట దార్ల మాట!

-దార్ల వెంకటేశ్వరరావు, హైదరాబాదు



 గణేష్ దినపత్రిక, 1 ఆగస్టు, 2018
సౌందర్యం!
రసముకురిసికురిసిరంజిల్లునొక్కటి

మేధకింతమేతపెట్టునొకటి 
సమముగున్నరెండుసహృదయుడగునయా
దారి పూల తోట దార్ల మాట!



నూనెకావలయుననుస్పృహమనకున్న
నారికేళ మైన నలగగలదు
మనిషియునటులేనుమారుగలుగునయ్య
దారి పూల తోట దార్ల మాట!



సాగరంబులోతు సాధకులకెఱుక
రసముతీరులన్ని రసికులెరుగు  
కన్యమనసుతండ్రికన్నవరుడెరుగు
దారి పూల తోట దార్ల మాట!



పారవశ్యమున్న ప్రకృతేపలకరించు
అందుయిందునేమియెందునైన
అందమందుకొనునుసుందరహృదయుండు
దారి పూల తోట దార్ల మాట!

-దార్ల వెంకటేశ్వరరావు, హైదరాబాదు


 గణేష్ దినపత్రిక, 12 ఆగస్టు, 2018
 గణేష్ దినపత్రిక, 12 ఆగస్టు, 2018