గణేష్ దినపత్రిక, 5 మే 2019 సౌజన్యంతో
వీళ్ళు నా
బిడ్డలు
కానీ నా బిడ్డలు
మాత్రమే కాదు!
ఈ తోటలో మొక్కలు
నావి
కానీ ఈ మొక్కలు
నాకు మాత్రమే కాదు!
అమ్మా నాన్నా ...
మీరు కూడా నా
గురించి ఇలాగే అనుకున్నారేమో
నేనిలా
పెరగడానికి
నాతో మీరెంతగా
పెనవేసుకున్నారో!
మీరు లేని నేను
లేను
కానీ, నేను మీతో లేనెందుకు?
నడకనేర్పిన మీతో
రాలేకపోయానెందుకు?
నా చుట్టూ
మీరెన్ని కలల నిచ్చెనలు వేశారో
ఏనిచ్చెనైనా
ఎక్కానోలేదో
ఆ నిచ్చెనలన్నీ
తన్నేసి కొత్తనిచ్చెనే తెచ్చుకున్నానో
మీరనుకున్నదారిని
నడుస్తున్నానో
ఆ దారినే
విస్మరించానో...
మీరిప్పుడు మళ్ళీ
నాకళ్ళముందు కదులుతున్నారు
మీరిప్పుడు మళ్ళీ నా ఒడిలో కేరింతలు
కొడుతున్నారు
మీరిప్పుడు మళ్ళీ
నా కనురెప్పల్లో
ఆనందభాష్పాలవుతున్నారు
నాకిచ్చిన
స్వేచ్ఛను
మళ్ళీ
మీకివ్వాలనుకుంటున్నాను
నా
వేళ్ళుపట్టుకొన్పందుకే మురిసిపోయిన
ఆ మురిపాలన్నీ
మళ్ళీ మీకివ్వాలనుకుంపున్నాను
నా ప్రతికదలికా
కథలు కథలుగా సాగిన
ఆ నిరంతర
ప్రవాహాన్ని
మళ్ళీ
మీకివ్వాలనుకుంటున్నాను
నా నడకకు మీరొక
సాధమమైయ్యీ
పరుగందుకోవడానికి
మార్గమయ్యీ
మీరక్కడే
ఓడిపోయిన
ఆ విజయాన్ని మళ్ళీ మీకివ్వాలనుకుంటున్నాను
వీళ్ళు నా
బిడ్డలు
కానీ నా బిడ్డలు
మాత్రమే కాదు
ఈ తోటలో మొక్కలు
నావి
కానీ ఈ మొక్కలు
నాకు మాత్రమే కాదు!
-ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, హైదరాబాద్
(ఖలీల్ జిబ్రాన్ On Can అనే కవిత చదివాక!)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి