దారి పూల తోట!
అంతుపంతులేని ఆశ్చర్యకథనాలు
వెతుకవద్దు నెట్టు వెగటు పుట్టు
నేతిబీరకాయనెయ్యినిచ్చునటయ్య!
దారి పూల తోట దార్ల మాట!
చిరుతబోలునట్టి పరుగుపెట్టునడక
చీమచావనట్టిసిన్నినడక
నడకనడకచూడనలుబదితీర్లయా
దారి పూల తోట దార్ల మాట!
మనసుతేలిపోయెమబ్బుకదిలినట్లు
కనులుతడిపిపోయెచినుకులన్ని
బాధతీరిపోయెబరువేలనుండురా!
దారి పూల తోట దార్ల మాట!!
అమ్మ మాటవోలెనమృతంబుకురిపించు
కవన మధురిమలకు గగన గంగ
తెలుగు భాష భువిని దిక్కులంతట నిలుపు
దారి పూల తోట దార్ల మాట!
కులముకన్నమిన్నగుణమనుచుందురు
ఆచరించునపుడు అదియునిజము
వానచినుకుతెలుపు వర్ణ ధర్మంబురా!
దారి పూల తోట దార్ల మాట!
-దార్ల వెంకటేశ్వరరావు, హైదరాబాదు
సౌందర్యం!
రసముకురిసికురిసిరంజిల్లునొక్కటి
మేధకింతమేతపెట్టునొకటి
సమముగున్నరెండుసహృదయుడగునయా
దారి పూల తోట దార్ల మాట!
నూనెకావలయుననుస్పృహమనకున్న
నారికేళ మైన నలగగలదు
మనిషియునటులేనుమారుగలుగునయ్య
దారి పూల తోట దార్ల మాట!
సాగరంబులోతు సాధకులకెఱుక
రసముతీరులన్ని రసికులెరుగు
కన్యమనసుతండ్రికన్నవరుడెరుగు
దారి పూల తోట దార్ల మాట!
పారవశ్యమున్న ప్రకృతేపలకరించు
అందుయిందునేమియెందునైన
అందమందుకొనునుసుందరహృదయుండు
దారి పూల తోట దార్ల మాట!
-దార్ల వెంకటేశ్వరరావు, హైదరాబాదు
గణేష్ దినపత్రిక, 12 ఆగస్టు, 2018
గణేష్ దినపత్రిక, 12 ఆగస్టు, 2018
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి