సత్యమ్ చెప్పిన సత్యాలు ’ పుస్తకావిష్కరణ సభ, కర్నూలు, 17.3.2019
సామాన్యుణ్ణి కేంద్రం చేసుకోవడంతో పాటు సామాన్యుడికి కూడా అర్ధమయ్యేలా కవిత్వాన్ని రాసిన కొత్తూరు సత్యనారాయణ గుప్త అభినందనీయమని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ స్టూడెంట్స్ వెల్ఫేర్ డిప్యూటీ డీన్ ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు అన్నారు. భావన సాహితీ సంస్ధ మరియు జనతా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం కర్నూలు ప్రభుత్వ అతిధి గృహంలో కొత్తూరు సత్యనారాయణ గుప్త 'సత్యం చెప్పిన సత్యాలు' కవిత్వం ఆవిష్కరణ సభలో ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.
కవి తనజీవితానుభవాల్ని కవిత్వ సత్యాలుగా చెప్పడం ఒక ప్రయోగంగా వ్యాఖ్యానించారు. తానొక కవులసేనను పోషిస్తూ అభినవ శ్రీ కృష్ణ దేవరాయలుగా పనిచేస్తూ, గణేష్ దినపత్రిక ప్రతిదినం ఒక పూర్తి పేజీని కవులకే కేటాయిస్తూ అష్టదిక్కులకు వ్యాప్తి చేస్తున్న సమకాలీన భువనవిజయంగా ఆయన అభివర్ణించారు. ఈ సభకు అధ్యక్షత వహించిన సాహితీ స్రవంతి కార్యదర్శి జంధ్యాల రఘుబాబు మాట్లాడుతూ ఊహాలోకాలనుండి సామాజిక వాస్తవికతను ప్రతిబింబించే దిశగా, సామాన్య మానవుడి దగ్గరకు తీసుకొచ్చిన కవిత్వ దశ 'సత్యమ్ చెప్పిన సత్యాలు'లో కనిపిస్తుందన్నారు.
చిన్న చిన్న మాటలతో, మనమాటలే మనకు కవిత్వంగా రాయడమెలాగో కవిత్వం ద్వారా తెలుసుకోవచ్చునని గ్రంథసమీక్ష చేసిన శ్రీమతి సంధ్య పేర్కొన్నారు. తెలంగాణ రచయితల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోట్ల వెంకటేశ్వరరెడ్డి మాట్లాడుతూ గుండెలనుండి సూటిగా దూసుకొచ్చే ప్రతిజీవితానుభవమూ కవిత్వమేనని వ్యాఖ్యానించారు.
నేడు పత్రికల్లో సెంటీమీటర్ల చొప్పున ప్రకటనల వ్యాపారం జరుగుతుంటే, అనేక కష్టనష్టాలను భరిస్తూ కూడా గణేష్ పత్రికను నడపడం, ఒక పూర్తి పేజీని సాహిత్యానికే కేటాయించడం సామాన్య విషయం కాదని పుస్తకాన్ని ఆవిష్కరించిన నగరూరు సుబ్రహ్మణ్యం చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షురాలు శ్రీమతి శమంతకమణి పేర్కొన్నారు. తెలంగాణ, రాయలసీమ, ఆంధ్ర కవులందరినీ ఒకే వేదికపై తీసుకొస్తున్న ఘనత గణేష్ పత్రికకే చెందుతుందన్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి