'సామాన్యుణ్ణి సైతం మెప్పించేదే సిసలైన కవిత్వం'
సామాన్యుణ్ణి కేంద్రం చేసుకోవడంతో పాటు సామాన్యుడికి కూడా అర్ధమయ్యేలా కవిత్వాన్ని రాసిన కొత్తూరు సత్యనారాయణ గుప్త అభినందనీయుడని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ స్టూడెంట్స్ వెల్ఫేర్ డిప్యూటీ డీన్ ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు అన్నారు. భావన సాహితీ సంస్ధ మరియు జనతా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం కర్నూలు ప్రభుత్వ అతిధి గృహంలో కొత్తూరు సత్యనారాయణ గుప్త 'సత్యం చెప్పిన సత్యాలు' కవితాసంపుటి ఆవిష్కరణ సభలో ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.
సాధారణంగా కవి తనజీవితానుభవాల్ని కవిత్వం ద్వారా సత్యాలుగా చెప్పడం ఒక ప్రయోగంగా వ్యాఖ్యానించారు. కథలు, నవలల్లో కనిపించే ఆత్మకథనాత్మక ధోరణిని ఒక ప్రత్యేకంగా కవిత్వంలో చెప్పడం ఈయన కవిత్వంలో కనిపించే ఓ విశేషమని ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు అన్నారు. కవి తాను అనుభవించిన దాన్నే కవిత్వం చేయడం సర్వసాధారణంగా జరిగే రచనాశైలి ప్రతికవిలోనూ కనిపిస్తుంది. కానీ అది అతని జీవితమేనంటే ఏ కవీ ఒప్పుకోడు. అలాగని దానిలో అతని జీవితమే లేదన్నా ఒప్పుకోడు. అలా రాయడమే కళాత్మకత. సమస్యల్ని సాధారణీకరించడం వల్ల వాస్తవం కళాత్మకమై కవిత్వంలో అందరి సత్యంగా కనిపిస్తుంది. సత్యనారాయణ గుప్త కవిత్వంలో కూడా ఇలా సాధారణీకరించే స్థితిని కూడా కొత్త పద్ధతిలో చెప్పారు. కథల్లో కనిపించే ఆత్మకథనాత్మక పద్ధతిలా అంటే ఉత్తమ పురుష కథనంలో సంభాషణాత్మకంగా రాస్తుంటాడని వెంకటేశ్వరరావు విశ్లేషించారు.
గణేష్ పత్రిక సంపాదకుడిగా, యాజమానిగా ఉండటం వల్ల తానొక కవులసేనను పోషిస్తూ సమకాలీన అభినవ శ్రీ కృష్ణ దేవరాయల వంటి పాత్రను పోషిస్తున్నాడనిపిస్తాడు. గణేష్ దినపత్రిక ప్రతిదినం ఒక పూర్తి పేజీని కవులకే కేటాయిస్తూ అష్టదిక్కులకు వ్యాప్తి చేస్తున్న సమకాలీన భువనవిజయంగా ఆ పత్రికను ఆయన అభివర్ణించారు. సత్యం కవిత్వం గురించి రాసిన ముందుమాటలో కవి ఆశయాన్ని, కవి లక్ష్యాన్ని వివరించారని అన్నారు. ఆంధ్రదేశానికి 1953 నుండి 1956వరకూ రాష్ట్ర రాజధానిగా ఉన్న ఈ కర్నూలు పట్టణంలో జరుగుతున్న ఈ సాహిత్య సభకు చారిత్రక ప్రాధాన్యం ఉందన్నారు. సుమారు 78 శాతం అక్షరాస్యులు కలిగిన ఈ కర్నూలు పట్టణంలో ఈ సాహిత్య సభ జరగడం కూడా ఒక చారిత్రక పరిణామంగా వ్యాఖ్యానించారు. కవికి రాయలసీమ ప్రాంతం పై అభిమానం ఉన్నా, ఇతర ప్రాంతాల పై ద్వేషం లేకుండా, ఆ ఆధిపత్యాన్నే నిరసిస్తూనే, అన్ని ప్రాంతాలకు చెందిన కవులు శ్రీశ్రీ, కాళోజి మొదలైనవారితోపాటు, రామాయణం రాసిన కవయిత్రి మొల్ల చిత్రపటాలను కూడా పత్రికల్లో నిత్యం ప్రకటిస్తూ తెలుగు సాహిత్యాన్ని, సంస్కృతినీ కాపాడ్డంతో పాటు, సాంస్కృతిక సమన్వయాన్ని సాధిస్తున్న గణేష్ పత్రిక, దాని సంపాదకుడు, కవి కొత్తూరు సత్యనారాయణ గుప్త ని అభినందించకుండా ఉండలేమని వెంకటేశ్వరరావు తన హర్షాన్ని వెల్లడించి, దుశ్శాలువాతో కవిని ఘనంగా సత్కరించారు.
ఈ సభకు అధ్యక్షత వహించిన సాహితీ స్రవంతి కార్యదర్శి జంధ్యాల రఘుబాబు మాట్లాడుతూ ఊహాలోకాలనుండి సామాజిక వాస్తవికతను ప్రతిబింబించే దిశగా,సామాన్య మానవుడి దగ్గరకు తీసుకొచ్చిన కవిత్వ దశ 'సత్యమ్ చెప్పిన సత్యాలు'లో కనిపిస్తుందన్నారు. చిన్న చిన్న మాటలతో, మనమాటలే మనకు కవిత్వంగా రాయడమెలాగో తాను రాసిన కవిత్వం ద్వారా తెలుసుకోవచ్చునని గ్రంథసమీక్ష చేసిన సంగారెడ్డి జిల్లా తారా ప్రభుత్వ డిగ్రీ కళాశాల తెలుగు ఉపన్యాసకురాలు, ప్రముఖ కవయిత్రి శ్రీమతి సంధ్య పేర్కొన్నారు. కవితా సంపుటిలో కవి రాసిన కవితలను సమగ్రంగా చర్చించారు. తానేవో కొన్ని మంచి వాక్యాలు రాస్తూ, అప్పుడప్పుడూ కొందరితో మాట్లాడిన సంభాషణలను కూడా సత్యనారాయణ గుప్త కవిత్వంగా రాస్తుంటారని, నేడు ఒక పుస్తకమే తీసుకురావడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని శ్రీమతి సంధ్య పేర్కొన్నారు. పుస్తకంలోని కొన్ని కవితలను చదివి వాటిని విశ్లేషించారు. ఈ కవితా సంపుటిలో స్త్రీ పట్ల, తన భార్య పట్ల, తన తండ్రి పట్ల రాసిన కవితలు తనకెంతగానో నచ్చాయని శ్రీమతి సంధ్య పేర్కొన్నారు. సమాజంలో కనిపించే అనేక రుగ్మతలపై కవిత్వం రాసిన ఈ గ్రంథం ఔత్సాహిక రచయితలకు ప్రేరణనిస్తుందనీ, రాబోయే కాలంలో మరింత బలమైన కవిత్వాన్ని రాస్తారని తాను ఆశిస్తున్నట్లు ఆమె చెప్పారు. ఈ సందర్భంగా కవిని శ్రీమతి సంధ్య ఘనంగా సత్కరించారు.
తెలంగాణ రచయితల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు, ప్రముఖకవి కోట్ల వెంకటేశ్వరరెడ్డి మాట్లాడుతూ గుండెలనుండి సూటిగా దూసుకొచ్చే ప్రతిజీవితానుభవమూ కవిత్వమేనని వ్యాఖ్యానించారు. కవి సత్యనారాయణ గుప్త కవిత్వాన్ని, ఆయన కృషిని వర్ణిస్తూ ఆయన చదివిన కవిత పాఠకుల్ని ఆకట్టుకుంది. తెలంగాణ రాష్ట్రంలో ఒక రెండువేల మంది ఉన్న సాహిత్య సభలో గణేష్ పత్రిక సంపాదకులను పరిచయం చేయడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు.
నేడు పత్రికల్లో సెంటీమీటర్ల చొప్పున ప్రకటనల వ్యాపారం జరుగుతుంటే, అనేక కష్టనష్టాలను భరిస్తూ కూడా గణేష్ పత్రికను నడపడం, ఒక పూర్తి పేజీని సాహిత్యానికే కేటాయించడం సామాన్య విషయం కాదని పుస్తకాన్ని ఆవిష్కరించిన నగరూరు సుబ్రహ్మణ్యం చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షురాలు, గ్రంథాన్ని ఆవిష్కరించిన శ్రీమతి శమంతకమణి పేర్కొన్నారు. వెనుకబడిన ప్రాంతమైన కర్నూలు కేంద్రంగా పత్రికను నడపడం చాలా కష్టమని, ఆ కష్టనష్టాలను లెక్కచేయకుండా ముందుకుసాగుతూ వివిధ అంశాలతో కూడిన ప్రత్యేక కథనాలు రాస్తూ పాఠకులకు చేరవేసేలా పత్రికను తీసుకొస్తున్న సత్యనారాయణ గుప్తను అభింనందించారు. పత్రికను క్రమం తప్పకుండా తీసుకొని రావడంతో పాటు సాహిత్య సభలు, సమావేశాలు, కవిసమ్మేళనాలు నిర్వహించడం నాకెంతో ఆశ్చర్యంగాను, ఆనందంగాను, అది కర్నూలు పట్టణంలో జరగడం గర్వకారణంగాను ఉందని శ్రీమతి శమంతకమణి తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. తెలంగాణ, రాయలసీమ, ఆంధ్ర కవులందరినీ ఒకే వేదికపై తీసుకొస్తున్న ఘనత గణేష్ పత్రికకే చెందుతుందన్నారు. ప్రధాన స్రవంతిలో ఉన్న పత్రికలు విలువైన కార్యక్రమాల్ని కూడా రకరకాల కారణాలవల్ల వార్తలుగా ప్రచురించలేకపోయినా, గణేష్ పత్రిక స్ధానిక వార్తలకు అత్యంత ప్రాధాన్యతనివ్వడం సంతోషించదగిన అంశమన్నారు. సాహిత్యంలో ప్రఖ్యాతలను సభకు పిలిచి, వారితో పాటు తనను అతిథిగా పెట్టి ఆయన పుస్తకాన్ని తనచేత ఆవిష్కిరింపజేయడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు.
సభలో మరొక అతిథిగా పాల్గొన్న కరీంనగర్ జిల్లా నుండి వచ్చిన ప్రముఖ కవి సబ్బని లక్ష్మీనారాయణ మాట్లాడుతూ జీవిత సత్యాలే కవిత్వమనీ, సత్యవాక్యం ఒక్కటున్నా అది గొప్ప కవిత్వంగానే భావించాలన్నారు. ఆంగ్ల కవి వర్డ్స్ వర్త్ చెప్పిన కవిత్వ నిర్వచనాల్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. కొన్ని సార్లు ఆవేశం కూడా కవిత్వం అవుతుందన్నారు. సత్యం ఎప్పుడూ మారదనీ, అది తెలంగాణ, రాయలసీమ, ఆంధ్ర లేదా మరే ప్రాంతమైన సత్యం ఎప్పుడూ సత్యమేనని అది సత్యనారాయణ గుప్త కవిత్వంలో కనిపిస్తుందన్నారు. ఈసందర్భంగా తెలంగాణలో జరిగిన దోపిడీ, దాని నుండి విముక్తి పొందడం ఒక చారిత్రక సత్యమనీ, దానిపై రాసిన ‘సత్యం’ కవితను చదివి వినిపించారు. ప్రధాన జీవన స్రవంతిలో ఉన్న పెద్ద పత్రికల్లో తమరచనలకు చోటు పెద్దపెద్దవాళ్ళకే లభించడంలేదనీ, ఆ పరిస్థితుల్లో గణేష్ పత్రిక ఫోను చేసి మరీ కవిత్వాన్ని రాయించి, ప్రచురించి ప్రోత్సహించడం గొప్పవిషయమన్నారు.
ప్రముఖ సాహితీవేత్త డా.హరికిషన్ మాట్లాడుతూ సత్యంగారి కవిత్వాన్ని చదివి తన కూతురు కూడా కవిత్వం రాస్తానన్నదని చెప్పారు. అంత చిన్నపిల్లలకు కూడా అవగాహన అయ్యేలా కవిత్వం రాసిన సత్యంగారు తన గణేష్ పత్రిక ద్వారా సామాజిక మాధ్యమాల్లో విస్తృత ప్రచారం వల్లనే తనకీ పత్రిక తెలిసిందన్నారు. గణేష్ పత్రిక బాలసాహిత్యాన్ని కూడా ప్రోత్సహిస్తున్నందుకు తనకు సంతోషంగా ఉందన్నారు.
ప్రముఖ సాహితీ వేత్త గౌరెడ్డి హరిశ్చంద్రరెడ్డి మాట్లాడుతూ సంస్కృత, తెలుగు కావ్యాల్లోని వివిధ శ్లోకాలు, పద్యాలను చదివి, అంతటి గొప్ప విషయాల్ని కూడా సరళమైన శైలిలో, తాత్త్వికంగా చెప్పడం సామాన్యమైన విషయం కాదనీ, అందువల్లనే ఈ పుస్తకం నిజంగా సత్యం కనిపిస్తుందన్నారు.
ప్రముఖ సాహితీవేత్తలు కెంగర మోహన్, ఎఆర్ కె శర్మ , ఎలమర్తి రమణయ్య, గంగస్వామి, డా.బాలిరెడ్డి తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
సమావేశంలో తన పుస్తకావిష్కరణానంతరం, అతిథులు మాట్లాడిన తర్వాత ‘సత్యమ్ చెప్పిన సత్యం భావాలు’ గ్రంథ రచయిత, గణేష్ పత్రిక సంపాదకుడు కొత్తూరు సత్యనారాయణగుప్త (సత్యమ్) మాట్లాడుతూ, తన పత్రిక తొమ్మిదొవ వసంతంలోకి అడుగిడిన రోజునే నా పుస్తకాన్ని ఆవిష్కరించుకోవడం యాదృచ్ఛికంగా జరిగిన సంఘటనగా చెప్పారు. తన తండ్రి ఆశయాలు, లక్ష్యాలు, వారి భావజాలం తననెంతగానో ప్రేరేపించి నడిపిస్తున్నాయనీ, అందువల్లనే తానెన్ని అప్పుల్లో కూరుకుపోయినా పత్రికను నడుపుతున్నానని చెప్పారు. సమాజంలో కవిని గౌరవించుకున్న సమాజమే నిజమైన సంస్కృతిగల సమాజంగా తాను తన తండ్రి మాటల వల్ల నేర్చుకున్న జీవిత సత్యమన్ని తన పత్రికా నిర్వహణా, కవిత్వం రాయడంలో గల నేపథ్యాన్ని సోదాహరణంగా వివరించారు. చిన్న వాళ్ళ నుండి వృద్ధుల వరకూ తన పత్రికలో స్థానం ఇచ్చి ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు. సాహిత్య ప్రమాణాల కంటే సహృదయత, స్పందన ముఖ్యమనీ ఈ రెండూ ఉంటూ సాహిత్య ప్రమాణాలు వాటంతట అవే వస్తాయని భావిస్తూ కవులను గౌరవిస్తున్నానని అన్నారు. తనకు తెలంగాణలో వేలాది మంది ముంద జరిగిన గౌరవానికి కారణం నా పత్రికేనని, తానొక సామాన్యమానవుడిగానే భావిస్తూ ఒక సభకు వెళితే తనని గౌరవఅతిథిగా వేదికపైకి పిలిచినప్పుడు ఆ సభలోని జనం కొట్టిన తప్పట్లు తనకింకా చెవుల్లో మారుమ్రోగుతున్నాయని గుర్తుచేసుకున్నారు. తానెవరికీ తెలియకపోయినా తనపత్రిక వివిధ మాధ్యమాల ద్వారా చేరవలసిన ప్రజలకు చేరుతుందని ఆ రోజు తనకి అర్థమై, ఆనందభాష్పాలు రాలాయని గుర్తుచేసుకున్నారు. తనపై అనేకమంది కవిత్వం రాసారు. తనపై అనేకమంది పద్యాలు రాశారు. తానొక సామాన్యుడినైనా తననింతగా గౌరవిస్తున్నారంటే సామాన్యుణ్ణి తాను దగ్గరకు తీసుకోవడమే కారణమని నమ్ముతున్నానని సత్యమ్ అన్నారు.
ఈ సందర్భంగా సమావేశంలో పాల్గొన్న ముఖ్యఅతిథులు, విశిష్ట అతిథులు, ప్రత్యేక అతిధులు, స్నేహ అతిథులు, సహృదయులకు దుశ్శాలువా, జ్ఞాపికతో గణేష్ పత్రిక సంపాదకుడు, కవి కొత్తూరు సత్యనారాయణ గుప్త ఘనంగా సత్కరించారు. తాను పెద్ద సభగా తన పుస్తకావిష్కరణను పెట్టగలిగినా, తన వ్యక్తిగత విషయానికి తాను ఆర్భాటాలు చేయకుండా కుటుంబంలాంటి కొంతమంది మిత్రులతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నానని సత్యమ్ వివరించారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి