సాహిత్యంలో బహుజన దృక్పథం


సాహిత్యం విశ్వజనీనమైంది. తీసుకున్న వస్తువు ఒక వర్గానికో, ఒక కులానికో, ఒక ప్రాంతానికో, ఒక మతానికో, ఒక జెండర్‌కో చెందినట్లు పైకి కనిపించినా, దానిలో చెప్పే సత్యం మాత్రం విశ్వజనీనం కావాలి. అలా కానప్పుడు అది అందరి సాహిత్యంగా కాకుండా, కొందరి సాహిత్యంగానే మిగిలిపోయే ప్రమాదం ఉంది. ఏ సమాజంలో జీవిస్తున్న రచయితైనా తన దృక్పథాన్ని బట్టి రచన కొనసాగిస్తాడు. తీసుకొనే వస్తువేదైనా, దాన్ని ఏ లక్ష్యం వైపు తీసుకెళ్తున్నాడో ఆ మార్గమే ఆ రచనా తత్త్వాన్ని, ఆ రచయిత దృక్పథాన్నీ తెలుపుతుంది. అయినా, సర్వమానవాళికి చెందిన ఒక సామూహిక అనుభవమేదో ప్రతిఫలించగలిగినప్పుడే అది సాహిత్యమై పరిమళిస్తుంది.
ప్రపంచసాహిత్యమంతా ప్రధానంగా రెండు మార్గాల్లో నడుస్తుంది.ఒకటి, సమాజాన్ని కొన్ని ఆధిపత్య వర్గాలకు అనుకూలంగా మార్చుకోవడానికి సాహిత్యాన్ని ఒక సాధనంగా వాడుకునే దృక్పథం. దీన్ని భావవాద దృక్పథం అని అంటారు. సమాజంలో అపరిష్కృతంగా కనిపించే అనేక క్లిష్ట సమస్యలకు పరిష్కారాల్ని సూచిస్తున్నట్లుంటుంది. దైవాన్ని నమ్ముకోవడం వల్ల, యజ్ఞయాగాదులు, పూజలు చేయడం వల్ల ఆ సమస్యలన్న్లీ తీరిపోతాయని ఈ సాహిత్యం బోధిస్తుంది.తెలుగులో ప్రాచీన సాహిత్యమంతా ఇంచు మించు ఈ భావవాద ధోరణిలోనే నడిచింది.
మానవుడే అన్నింటికీ కేంద్రమంటూ, అన్ని వర్గాలకూ ప్రాధాన్యాన్నిచ్చే దిశలో, సామాజిక వాస్తవిక దృష్టితో  కొనసాగేది ఆధునిక సాహిత్యం. కాలాన్నీ, సాహిత్య తత్త్వాన్నీ పరిశీలించడం వల్ల నిజమైనఆధునిక సాహిత్యమేంటో తెలుస్తుంది.భావవాద ఛాయలున్న సాహిత్యం కొంత వెలువడుతున్నా, దానికి మూడురెట్లు అధికంగా భౌతికవాద దృక్పథంతోనే ఆధునిక సాహిత్యం వస్తోంది. సామాజిక వాస్తవిక వాదులు భావవాద దృక్పథంతో వెలువడే సాహిత్యాన్ని తిరోగమన సాహిత్యమనీ, భౌతికవాద దృక్పథంతో వెలువడే సాహిత్యాన్ని పురోగమన సాహిత్యమనీ వ్యాఖ్యానిస్తారు.
భౌతికవాద దృక్పథంతో సాహిత్యాన్ని పరిశీలించే ధోరణి మార్క్సిజంలో కనిపిస్తుండడం వల్ల కేవలం దీన్నే ఒక ప్రధాన దృక్పథంగా భావించడం జరుగుతోంది. దీనిలో వర్గం పునాదిగా ఉంటుంది. ఉపరితలాంశాలన్నీ, సాహిత్య, కళారూపాలతో సహా వర్గ సమస్య పరిష్కృతమైతే, మిగతా అన్ని సమస్యలూ పరిష్కారమైపోతాయని భావిస్తుండడం సర్వసాధారణంగా కనిపిస్తుంది.
బహుజన దృక్పథంలో వర్గ సమస్యలున్నా, దేశీయవాస్తవిక సామాజిక దృష్టి వల్ల కులం ప్రాధాన్యాన్ని వహిస్తుంది. వర్గ వివక్షనీ, కులవివక్షనీ పక్క పక్కనే పెట్టి చూస్తే, కుల వివక్ష మానసిక క్షోభను కలిగిస్తూ, ఆత్మగౌరవ సమస్యని ముందుకి తెస్తుంది. అందువల్ల కేవలం వర్గ సమస్యతో మాత్రమే సాహిత్యాన్ని చూస్తే, దాంట్లోనూ భౌతికదృష్టి ఉన్నా, సాహిత్యం సమాజ వాస్తవికతను ప్రదర్శించడంలో పాక్షికకోణమే ప్రదర్శితమౌతుంది. అందు వల్ల వర్గ, కుల సమస్యల సమ్మేళనంతో సాహిత్యాన్ని విశ్లేషించేది సాహిత్యంలో బహుజనదృక్పథమవుతుంది.
కేవలం తెలుగు సాహిత్యం వరకే చూసినా, మన సాహిత్య చరిత్రకారులు అత్యధికులు నన్నయతోనే సాహిత్య యుగాన్ని ప్రారంభించారు. అంతకుముందు సాహిత్యం ఉన్నా, గాసట బీసటగా ఉందనీ, లిఖితసాహిత్యం కావ్య రూపంలో కనిపించడమనేది నన్నయతోనే మొదలైందని సిద్ధాంతీకరిస్తున్నారు. అందు వల్ల నన్నయకు ముందున్న సాహిత్నాన్ని ప్రాజ్ఞన్నయ యుగం అంటున్నారు. నన్నయ సంస్కృత మహాభారతాన్ని తెలుగులోకి అనుసృజన ( ట్రాన్స్‌క్రియేషన్‌ ) చేశాడు.  పద్యంలో ఆంధ్రమహాభారతాన్ని రమణీయంగా వర్ణించాడు.
పద్య రూపంలో ఒక కావ్యం వెలువడాలంటే, నాటి సాహిత్యవేత్తలు పద్యాన్ని అర్ధం చేసుకునే సామర్ధ్యానికి సంసిద్ధులై ఉండాలనే కదా. అంటే అప్పటికే సాహిత్యం చాలా ఉంది. అది పద్య, గద్య, గేయ, వచన రూపాల్లో ఉండే అవకాశం ఉందన్నమాట. దీన్ని శోధించడంతోనే తెలుగు సాహిత్యంలో బహుజన దృక్పథానికి ద్వారాలు తెరిచే అవకాశం ఉంది.
సమాజంలో చాతుర్వర్ణ వ్యవస్థను బలంగా ఆచరించడానికి ఉపయోగపడే భావజాలాన్ని భావవాదం ప్రోత్సహిస్తుంది. రాజులు, పోషకుల ఆధారంగా సాహిత్య సృజన జరిగిందని నిరూపించే దిశగా ఆరుద్ర తన సమగ్రాంధ్ర సాహిత్యాన్ని రాశారు. అభ్యుదయయుగం వరకే రాసి, తర్వాత సాహిత్య చరిత్రను కొనసాగించకపోవడానికి కుల అస్తిత్త్వ చైతన్యాన్ని గుర్తించక తప్పని పరిస్థితి రావడం ఒక బలమైన కారణం. అందుకే 13వ సంపుటి రాసే నాటికే స్త్రీ, దళిత సాహిత్య ఉద్యమాలు వచ్చినా, వాటిని చాలా జాగ్రత్తగా పక్కకు పెట్టేశాడు. ఇక్కడ నుండి మళ్ళీ సాహిత్య చరిత్రను రాయాల్సిన అవసరం ఉంది.అదెవరు రాసినా దానిలో బహుజనదృక్పథం తప్పకుండా ప్రతిఫలించాలి.
పన్నెండో శతాబ్దం నాటి శివకవులలో కూడా కులాన్ని యెడబాయలేమని ప్రకటించినవాళ్ళున్నారు. శివకవులు కొన్ని కింది వర్ణాలకీ స్థానం కల్పించినట్లనిపిస్తున్నా, వారినీ తమ మతానికి అనుకూలంగా మార్చుకోవడానికే ఆ భావాల్ని ఉపయోగించుకున్నారనేది బహుజనసాహిత్య దృక్పథం గుర్తిస్తుంది.
16 వ శతాబ్దంలో మొల్ల రామాయణం, శ్రీకృష్ణదేవరాయలు ఆముక్తమాల్యదరాశారనే విషయాల్లోని వివాదాల్ని కుల దృష్టితో పరిశీలించాల్సిన అవసరం ఉంది. వసుచరిత్ర కారుడి పేరు గురించిన వివాదం, శూద్రుడు రాసిన కావ్యం కాకి ఎంగిలితో సమానమనీ, దాన్ని చదవకూడదనీ లక్షణాల్ని నిర్దేశించిన 17 వ శతాబ్దం నాటి అప్పకవిని గురించి ఆలోచించాలి. బ్రౌన్‌ వెలికితీసిన వేమననూ, వేమన పద్యాలుగా చెలామణీలో ఉన్న ఆధ్యాత్మిక పద్యాల్నీ విశ్లేషించుకోవాలి. వీరబ్రహ్మేంద్రస్వామి సాహిత్యం కూడా ఆధ్యాత్మికమైనా, ఆ సాహిత్యంలో కనిపించే ప్రజాస్వామిక భావాల్ని మూల్యాంకన చేసే పద్ధతికీ, సంప్రదాయ సాహిత్యాన్ని విశ్లేషించే దానికీ తేడా ఉంది. 17, 18 శతాబ్దాల నాటి తెలుగు  సాహిత్యాన్ని క్షీణ ప్రబంధయుగంగా సంభావించడంలోని ఆంతర్యాన్నీ గమనించాలి.
సాహిత్యం కులాన్ని పట్టించుకుని వెలువడిన విధానాన్ని బహుజన సాహిత్య దృక్పథం తెలుపుతుంది తప్ప, కులాన్ని ప్రోత్సహించదు. కులాన్ని ఆధారంగా చేసుకుని వ్యక్తిగత ప్రతిభను, సమాజాన్ని విచ్ఛిన్నం చేసిన విధ్వంసాన్ని విశ్లేషిస్తూ, కుల నిర్మూలనకు ప్రయత్నిస్తుంది.అందుకనే సాహిత్య సృజన కూడా ఒక బాధ్యతాయుతంగా, సామాజిక ప్రయోజక సాధనంగా ఉపయోగపడాలని భావిస్తుంటుంది. కళ కళకోసం కాదు, కళ ప్రజల కోసమన్న రీతిలో అవగాహన చేసుకోమంటుంది. అందుకే బహుజనసాహిత్యం అవధాన, చిత్ర కవిత్వ పాండిత్య ప్రదర్శనలకు అంతగా ప్రాధాన్యానివ్వదు.     
తీసుకునే వస్తువుతో పాటు, ఆ వస్తువుకి ఎన్నుకునే రూపాన్ని కూడా జాగ్రత్తగా ఎన్నుకోవాలనేది బహుజన దృక్పథంలో గమనించాల్సిన మరో ముఖ్యమైన అంశం. మన తెలుగు సాహిత్యంలో పద్యానికి ఒక విశిష్టస్థానం ఉన్నా, ఆ పద్యం సంస్కృత సమాసభూయిష్టంగా ఉండటాన్నీ గమనించాలి. పద్య కవులు తమ పాండిత్య నిరూపణ కోసం రాస్తున్నారో, పండిత పామర జనరంజకంగా పద్యాన్ని నిర్మిస్తున్నారో పరిశీలించి, పద్యం ఎంతవరకూ ఆదరణీయమో తేల్చుకోవాలి.
గేయం, వచనం కలిగించినంత సత్వంచైతన్యం పద్యం కలిగించలేదు. కానీ, ఒక శాశ్వతమైన అనుభూతిని ఒకటి రెండు వాక్యాల్లో కూడా అందించగల శక్తి పద్యానికి ఉందనీ గుర్తించాలి.వచన సాహిత్యంలో కూడా చిన్న చిన్న వాక్యాలు, సంభాషణలు, సన్నివేశకల్పనలు  ఉంటాయి. అవి పాఠకుల మనస్సుల్లో శాశ్వతంగా గుర్తుంటాయి. పద్యమా, వచనమా అనేదానికంటే, శక్తివంతమైన వాక్యం ముఖ్యం. అది వచనానికి కూడా ఉంది.

రూపకాల్లో వివిధ వస్తువుల్ని తీసుకున్నా, సంభాషణలు, సన్నివేశ కల్పనలు శక్తివంతంగా వర్ణించి,ప్రదర్శించగలిగితే ఈ సాహిత్యరూపాలు కూడా ప్రజల్ని ఆలోచింపజేయగలుగుతాయి. సమాజ పురోభివృద్ధికి తోడ్పడాలనుకునే రచయితలు తీసుకునే వస్తువుతో పాటు, సాహిత్య రూపాల్ని కూడా జాగ్రత్తగా ఎన్నుకోవాలి.
సాహిత్యంలో వస్తువు, రూపం, శిల్పం, ప్రక్రియల పట్ల ఉన్న కొంత అస్పష్టత వల్ల వీటిని సమర్థవంతంగా ఉపయోగించుకోలేని కొంతమంది రచయితలు కూడా కనిపిస్తున్నారు.
ఇప్పటికే మార్క్సిస్టుశిబిరాల్లో సాహిత్యపాఠశాలలు కొనసాగిస్తూ, సాహిత్యాన్ని చారిత్రక, భౌతికవాద దృష్టితో చూడ్డం నేర్పారు. దాన్నింకా కొనసాగిస్తూ, ప్రజాకళారూపాల్ని వాడుకోవడానికీ శిక్షణలిస్తున్నట్లు తెలుస్తోంది.ఇటువంటి శిక్షణనే దళిత సాహిత్యానికి కేంద్రస్థానంగా, మూలస్థానంగా పేర్గాంచిన హైదరాబాదు సెంట్రల్‌ యూనివర్సిటీలో సాహిత్య పాఠశాలలో తరగతుల్ని డా బి.ఆర్‌. అంబేద్కర్‌ అసోషియేషన్‌ ఆరంభించింది. దీనిలో ఎంపిక చేసిన కొంతమందికి  రాజకీయ, ఆర్థిక, సాహిత్య, సాంస్కృతిక అంశాల్ని బహుజనదృక్పథంతో అధ్యయనం చేయడమెలాగో శిక్షణనిస్తుంది. ఇటువంటి అవగాహనా తరగతుల్ని అన్ని చోట్లా కొనసాగించగలిగితే బహుజనదృక్పథం మరింత వేగవంతంగా ముందుకు రాగలుగుతుంది.
- డా దార్ల వెంకటేశ్వరరావు
అసిస్టెంటు ప్రొఫెసరు, తెలుగు శాఖ,
సెంట్రల్‌ యూనివర్సిటీ, గచ్చిబౌలి, హైదరాబాదు` 46
ఫోను: 09989628049

మన రాజకీయ వ్యవస్థను బాగు చేయడం ఎలా? ( వీక్షణం లో నా వ్యాసం )


-డా॥ దార్ల వెంకటేశ్వరరావు, అసిస్టెంటు ప్రొఫెసర్‌,
తెలుగు శాఖ, సెంట్రల్‌ యూనివర్సిటి,
గచ్చిబౌలి, హైదరాబాదు `46, మొబైల్‌ : 9989628949,
ఈ మెయిల్‌: vrdarla@gmail.com
ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడం అంత సులువైందేమీ కాదు. ‘రాజకీయం’ ఒక వ్యవస్థగా మారుతున్నప్పుడే దానిలో కొంత రహస్య ఎజెండా కూడా దాగి ఉంటుంది. అది బయటకు కనిపించే ఎజెండా కాదు. తమ ఆస్తుల్ని కాపాడుకోవడం లేదా పెంచుకోవడం కోసం లేదా తమ అధికారాన్ని ఏదొకరకంగా నిలుపుకోవడం కోసం గానీ ఒక వారసత్వ సంపదగా మారాలనే రహస్య ఎజెండా, ప్రజా సేవ పేరుతో రాజకీయంగా ముందుకొస్తుంది. దీనితో పాటు సమాజంలో జరుగుతున్న అవ్యవస్థను సరిదిద్దాలనో, సమూలంగా మార్చాలనే ప్రయత్నంతో కూడా రాజకీయవ్యవస్థ ఏర్పడేఅవకాశం ఉంది.
మొదట ప్రస్తావించుకున్న ఇటువంటి రాజకీయ వ్యవస్థ ప్రజాస్వామ్యంలో చాలా సులువుగా అమలులోకి రాగలుగుతుంది. ముఖ్యంగా మన భారతదేశంలో సాంఘిక హోదా అనేది ప్రాథమిక స్థాయిలో కులాన్నే ఆశ్రయించుకొని ఉండడం వల్ల వంశపారంపర్యతలకు అవకాశం ఏర్పడుతుంది. అది బాగా బలం పుంజుకున్నప్పుడు రకరకాల సమీకరణాలు ఏకీకృతమై రాజకీయవ్యవస్థగా గానీ, లేదా అప్పటికే ఉన్న ఏదో  ఒక రాజకీయపక్షంలో గాని చేరి తమ ఆధిక్యతను ప్రదర్శించుకోవడం ప్రారంభిస్తుంది. కనుక, రాజకీయ వ్యవస్థ అనేది కేవలం ఒక పార్టీగా పైకి కనిపించినా, అది ఏర్పడిన లక్ష్యాలు, ఏర్పరిచిన వ్యక్తుల మూర్తిమత్వం కూడా పరిగణనలోకి తీసుకోవాల్సిఉంటుంది. రాజకీయ వ్యవస్థ  ఒక్కోప్రాంతంలో ఒక్కొక్క రూపంలో ఉండి, అది శాసనబద్దంగా పాలించే లేదా పాలించాలనే ఆకాంక్షను వ్యక్తీకరించే కొంతమంది వ్యక్తుల సమష్టిరూపం ఒక పార్టీగా కనిపిస్తుంది. కానీ ఆ పార్టీ ప్రభావితమైయ్యేది ఆ ప్రాంతంలో ‘‘ ప్రభావిత’’ వ్యక్తుల నుండే అనేది సామాన్యులకు వెంటనే కనిపించకపోవచ్చు. దాన్ని పార్టీ నిర్ణయంగానో, ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా తటస్థంగా ఉండిపోవడంగానో అమలులోకి వస్తుంటుంది. ఈ అవగాహనతో ‘రాజకీయ వ్యవస్థ’ను చూసినప్పుడు దాన్ని బాగు చేయడానికి ప్రయత్నించి సఫలీకృతులు కావడానికి అవకాశం ఉంది.
రాజకీయవ్యవస్థ అనేది కేవలం ఒక ప్రాంతానికో, ఒక రాష్ట్రానికో, ఒక దేశానికో మాత్రమే పరిమితమైంది కాదు. కానీ ప్రతీ దేశానికీ  రాజకీయ వ్యవస్థ అనేది మాత్రం ఉంటుంది. అది ఆ భౌగోళిక ప్రయోజనాలను ఆకాంక్షించే వ్యవస్థగానే వ్యవహరిస్తుంది. ఈ అవగాహనతోనే దాని గురించి మాట్లాడవలసి ఉంటుంది.  అలా కాకుండా అన్ని ప్రాంతాల్నీ పరిగణనలోకి తీసుకుని మొత్తం రాజకీయ వ్యవస్థే చెడిపోయిందని గానీ, సక్రమంగా పనిచేస్తుందని గానీ ఘంటాపథంగా చెప్పగలమా? ఎవరో కొంత మంది అలా చెప్పినా వాటిలో  పరికల్పనలే ( హైపోథీసిస్‌) ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే మనం చూసేవీ, వినేవీ  వాస్తవంలో అలా ఉన్నాయో లేవో తెలియని అయోమయ సమాచార వ్యవస్థలో ఉన్నాం. నిజంగా క్షేత్రాన్ని దర్శించి వాస్తవాల్ని విశ్లేషించగలిగే సమయం, అవకాశం లభించడం అంతసులభమేమీ కాదు. అందువల్ల సాధ్యమైనంత వరకూ అందుబాటులో ఉన్న పరిశోధనల్ని, మీడియానీ ఆశ్రయించక తప్పదు. ఇలాంటప్పుడు మీడియాని కొన్ని పరిమితుల దృష్ట్యా పక్కకు పెట్టినా, మరి పరిశోధనలు సత్యాన్నే అన్వేషిస్తున్నాయా? పరిశోధకులు నిజంగా క్షేత్ర పర్యటన చేసి, నిష్పాక్షికంగా కుల, మత, వర్గ, లింగ, ప్రాంతీయ అభిమానాలకు అతీతంగా సమాచారాన్ని సేకరిస్తున్నారా? సేకరించిన సమాచారాన్ని శాస్త్రీయంగా విశ్లేషిస్తున్నారా? ఫలితాలను ముందే ఊహించి అంటే ఏవో కొన్ని పార్టీల లేదా కొన్ని ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని సిద్ధాంతీకరించేటప్పుడు తమ పరికల్పనలే వాస్తవాలుగా, ఫలితాంశాలుగా ప్రకటిస్తున్నారా? అనే వాటిని పరిగణనలోకి తీసుకోకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న రాజకీయ వ్యవస్థను సాధారణీకరించి వాటన్నింటికీ ఒకే సూత్రాన్నో, పరిష్కారాన్నో సూచించడం కూడా సాధ్యం కాదు. కానీ, ఒక ప్రాంతాన్నో, ఒక దేశాన్నో కేంద్రంగా చేసుకుని ఆ రాజకీయ వ్యవస్థ బాగుపడడానికి సూచించే పరిష్కారాల్ని ఇతర ప్రాంతాలు, దేశాల్లోని రాజకీయ వ్యవస్థలకు కూడా అనువర్తితం కావచ్చు. కనుక, మనదేశం నుండి రాజకీయవ్యవస్థ స్వరూపాన్ని విశ్లేషించడానికి ప్రయత్నిస్తాను.
అనేక సంవత్సరాల పాటు వివిధ రాజవంశాలు, పరదేశీయుల పాలనలో భారతరాజకీయ వ్యవస్థ కొనసాగింది.స్వాతంత్య్రోద్యమకాలం నుండీ సామాన్యులకు కూడా దానిలో పాల్గోగలిగే, దాన్ని ప్రభావితం చేయగలిగే అవకాశం కలిగింది.స్వాతంత్య్రానంతరం  ప్రాబల్యపూరితమైన రాజకీయవ్యవస్థ మళ్ళీ పరోక్షంగా కులాధిక్యాన్ని ప్రదర్శించుకునే, బలమైన ఆర్థిక పునాదుల గల వారి చేతుల్లోకే వెళ్ళిపోయింది. నైతికవిలువలు, సామాజిక సంక్షేమ దృష్టి గల రాజకీయ పార్టీలు కుల, ధన ప్రాబల్యాల ముందు నిలవలేకపోయినా, తమ ఆశయాల్ని అధికార పార్టీగా మారిన రాజకీయవ్యవస్థ ద్వారా సాధించుకోవడానికి ప్రయత్నాలు జరిగాయి.అందు వల్లనే ప్రజాశ్రేయస్సుని ఆకాంక్షించే కొన్ని పథకాలనైనా శాసనబద్దంగా అమలులోకి తేగలిగారు. వాటికి రాజ్యాంగరక్షణనీ కలిగించగలిగారు. ఇదే స్ఫూర్తి నేడు కూడా రావాల్సిన అవసరం ఉంది.
రాజకీయవ్యవస్థ రాజ్యాంగ బద్దంగా అధికారాన్ని చేపట్టినా, చేపట్టకపోయినా అధికారంలో ఉన్న వాళ్ళని అదుపులో ఉంచగలుగుతుంది. అందువల్లనే అధికారాన్ని చేజిక్కుంచుకున్న వాళ్ళ ఆశ్రితపక్షపాతం రక్తసంబంధ బంధుజన హితంగా మారిపోతున్నప్పుడు, దాన్ని నిలదీయగలుగుతున్నాం. ఇప్పటికే కొన్ని రాజకీయ పార్టీలు ప్రత్యక్షంగానూ, మరికొన్ని పరోక్షంగానూ ప్రింట్‌ అండ్‌ ఎలక్ట్రానిక్‌ మీడియాల్ని స్వంతంగా ఏర్పాటు చేసుకుని తమ తమ కార్యకలాపాల్ని కొనసాగిస్తున్నాయి.వీటిని ప్రభుత్వ రంగ నిర్వహణలో ఉన్నవి సమర్థవంతంగా ఎదుర్కోలేకపోగా, అవినీతి, అక్రమాల్ని వెలికితీయడంలో నత్తనడక నడుస్తున్నాయని కూడా చెప్పలేని స్థితికి చేరుకున్నాయి. ఒక విధంగా చెప్పాలంటే ప్రభుత్వ పథకాల్ని ప్రచారం చేయడానికీ, స్వాతంత్య్రోద్యమ, రిపబ్లిక్‌ దినోత్సవాల్ని, సంస్కృతి పేరుతో కొన్ని మతకార్యక్రమాల్ని విధిగా ప్రసారం చేయడానికీ ఉద్దేశించబడినట్లుగా వ్యవహరిస్తున్నాయి. దీనితో ప్రైవేటు మీడియా ప్రజల్లోకి వేగంగా, శక్తివంతంగా చొచ్చుకుపోగలుగుతోంది. అప్పుడు ఆ మీడియా యాజమాన్యం ప్రజాభిప్రాయాల్ని తమకి అనుకూలంగా మార్చుకునే పనిలో నిమగ్నమవుతుంది. ఇక్కడే అవినీతి రాచబాటపరుచుకుంటుంది. అన్నింటికీ మీడియా కేంద్రంగా మారిపోతుంది. రాజకీయ వ్యవస్థని కూడా శాసించగలుగుతుంది. కనుక, మీడియా విధివిధానాలపై ముందుగా మేధావులు, ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించి దాన్ని ఒకగాడిలో పెట్టాలి. అప్పుడే ప్రజాస్వామ్య రాజకీయవ్యవస్థ సక్రమంగా నడవడానికి ఒక చక్కని మార్గాన్ని సూచించినట్లవుతుంది.
మీడియాని నియంత్రించడానికి లేదా కొన్ని విధివిధానాల్ని రూపొందించడానికి శాసనవ్యవస్థ సక్రమంగా పనిచేయాలికదా అనే అనుమానం వస్తుంది. నిజమే, ఇటు రాష్ట్రస్థాయిలో శాసనసభ, కేంద్రస్థాయిలో లోక్‌సభ వివిధ చట్టాల్ని రూపొందించేందుకు వినియోగించాల్సిన సమయం వైయక్తిక ధూషణలకే పోయేట్లు కావాలనే రాజకీయ గూఢుపుఠాణం ఏదైనా జరుగుతుందేమోననేది ఆధారాలతో సహాప్రజలకు తెలిసేటట్లు చేయగలగాలి. ప్రభుత్వం కూడా అసెంబ్లీ, పార్లమెంటు శాసనాల రూపకల్పనలో, ప్రజాసమస్యల చర్చలో ఆ యా ప్రాతినిథ్య సభ్యులు వినియోగించుకున్న సమయాల్ని ప్రకటించాలి. శాసనసభ సమావేశాల్లో కేవలం రాజకీయపార్టీ నాయకులకే మాట్లాడే సమయం అత్యధికంగా కేటాయించడం, ఆ యా నియోజకవర్గాలకు ప్రాతినిథ్యం వహించేవారికి తగినంత సమయం కేటాయించకపోవడం, రాజకీయపార్టీలు వారి స్వేచ్చను హరించేయడం కూడా రాజకీయవ్యవస్థ భ్రష్టుపట్టడానికి కారణమౌతుంది. ఈ వ్యవస్థను సరిదిద్ది, స్వేచ్చగా ప్రతిసభ్యుడూ పార్టీ కనుసన్నల్లోనే మాట్లాడాలనే కఠిననియమాల్ని సంస్కరించగలిగినప్పుడు రాజకీయవ్యవస్థలో మంచిఫలితాల్ని ఆశించవచ్చు.
శాసనసభ పనితీరుని విశ్లేషించుకునేటప్పుడే, రాష్ట్రంలోను, కేంద్రంలోను వివిధ రంగాల్లో నిష్ణాతులైన వారి ప్రాతినిథ్యం కోసం ఉద్దేశించిన విధానమండలి, రాజ్యసభ సభ్యుల ఎంపికపట్ల మౌలికమైనమార్పులు రావాలి. వారిని ఎంపికచేయడంలో గవర్నర్‌, రాష్ట్రపతులకు రాజకీయపార్టీల ప్రమేయాన్ని మించిన స్వేచ్చ ఉంటే బాగుంటుంది. ఒకవేళ అలాగే జరిగి మేధావుల్నే ఎంపిక చేసినా, వారి అభిప్రాయాల్ని ఆ యా సభల్లో వినిపించగలిగినా, వాటిని ఆచరణలోకి తీసుకోవాలనేమీ లేనప్పుడు ప్రయోజనమేమి ఉంటుందనుకోవచ్చు. కానీ, నేడు ప్రత్యక్షప్రసారాల వ్యవస్థలో మీడియా పోటీపడుతోంది. దేన్ని ప్రసారం చేస్తుంది, దేన్ని చేయడం లేదనే విషయంలో కొన్ని అనుమానాలున్నా, అన్ని వేళలా అలాగే జరుగుతుందనే నిరాశ కూడా మంచిది కాదు. అందువల్ల ఆ యా సభల్లో మేధావులు చర్చించిన ప్రజోపయోగ విషయాల పట్ల ప్రజలు చైతన్యవంతమౌతారు. కనుక, రాజకీయపార్టీలే మేధావుల్ని ఎంపికచేసే ప్రక్రియలోనే మార్పు రావడం రాజకీయవ్యవస్థ బాగుపడడానికి కనిపించే మరో అవకాశం.
రాజకీయవ్యవస్థ సక్రమంగా ఉండాలన్నా, అక్రమమార్గంలో పోతుందన్నా దానికి మేధావులే ప్రధాన బాధ్యులని చెప్పుకుంటున్నాం. అయినా వారి అభిప్రాయాల అమలుకి కూడా రాజకీయపార్టీలతో కూడిన ప్రభుత్వమే ఆధారం కావల్సి రావడం వల్ల మేధావులు కూడా వక్రమార్గానికి పోతున్నారనిపిస్తుంది. దర్యాప్తు సంఘాలు, ప్రత్యేక కమిటీల్లో మేధావులు ఉంటున్నారు. కానీ, రాజకీయ పార్టీలు, వ్యక్తుల ప్రభావాలకు లోనైయ్యేవాళ్ళు వాళ్ళకు అనుగుణంగా సత్యాన్ని ఆవిష్కరిస్తున్నారు. ఆ కమిటీలో ఒకరిద్దరు నిజాయితీ పరులున్నా, నిస్సహాయ స్థితిలో వాళ్ళకి అనుకూలంగా మారిపోవడమో, దానిలో ఇమడక బయటపడటమో జరుగుతుందనిపిస్తుంది. అటువంటి వాళ్ళు తమ తెలివితేటల్ని ఉపయోగించి వ్యవస్థ ని బాగుచేయాలనే అన్వేషణలో నిరాశా నిస్పృలకులోనైయ్యే వాళ్ళు, తమకు తోచిన మార్గంలో పనిచేసేవాళ్ళు ఉన్నారు. అలాంటివాళ్ళు ప్రజాసంఘాలు, విప్లవ సంఘాలతో మమేకమైపోతున్నారనిపిస్తుంది. అక్కడ  తమ భావాల్ని కొన్ని వ్యవస్థాపరమైన ఇబ్బందులున్నా స్వేచ్చగా వ్యక్తీకరించగలుగుతున్నారు.వ్యక్తిగత ఆస్తుల్ని రద్దుచేయాలనీ, ఆర్థికవ్యవస్థలో లోపాల్ని సరిదిద్ది, మిశ్రమ ఆర్థిక వ్యవస్థ పేరుతో జరుగుతున్న దోపిడీని అరికట్టాలని ఎన్నాళ్ళగానో మొత్తుకుంటున్నారు. నిజానికి ఆచరణలోకి రాగలిగితే రాజకీయ వ్యవస్థ వెంటనే సక్రమవ్యవస్థగా రూపొందగలుగుతుంది. కార్పోరేట్‌ మెంటాలిటీ గల వ్యక్తులు అఖిలభారత సర్వీసుల్లో చేరి, రాజకీయనాయకులకు ఇచ్చే సలహాలు ప్రజా సంక్షేమ దృష్టితో కాకుండా, అధికారంలో ఉన్న లేదా ప్రాభల్యంలో ఉన్న అతికొద్దిమంది ప్రయోజనాలకు అనుగుణంగా విధానాల రూపకల్పన జరగకుండా ఆదిలోనే అడ్డుకట్టవేయడం సాధ్యమౌతుంది. ప్రస్తుతం ప్రజాస్వామ్యంలో అత్యంతముఖ్యమైన సంక్షేమానికి సంబంధించిన విధానాలను రూపొందిస్తున్నట్లు కూడా కనబడుతున్నా వాటిలోనూ వివిధ కాంట్రాక్టుల రూపంలో రాజకీయ నాయకులకు, వారి అనుచరగణానికి ఉపయోగపడేటట్లు ఉండడాన్ని గమనించాల్సి ఉంది. దీన్ని నియంత్రించగలిగే వ్యవస్థకూడా ఏర్పడుతుంది.
ప్రజాస్వామ్యం ద్వారా అధికారాన్ని సాధించే క్రమంలో ఏర్పడిన కొన్ని ప్రధాన రాజకీయ పార్టీల్లో అధ్యక్ష స్థానం కోసం జరిగే సంస్థాగత ఎన్నికలు కేవలం ఒక నామమాత్రపుతంతుగా నిర్వహిస్తూ, ప్రజాస్వామ్యభావనకే కళంకం తెచ్చేటట్లు నియంత్రంగా వ్యవహరిస్తున్నాయి. వంశపారంపర్యతను, కుటుంబ, బంధువుల, కుల వారసత్వాలను వ్యవస్థీకృతం చేస్తున్న రాజకీయపార్టీలను బాగుచేయాలని భావించడం నేతిబీరకాయలో నెయ్యివెతికినట్లేనేమో! అందువల్ల చిన్న పార్టీలు అంటే ఓటింగ్‌ శాతం తక్కువ రావడం వల్ల అలా పిలవబడుతున్నవీ, భావసారూప్యం గల రాజకీయపార్టీలు ఒక ఫ్రంట్‌గా ఏర్పడి రాజకీయ ప్రక్షాళనకు ప్రయత్నిస్తే మంచి ఫలితాలు రాగలుగుతాయంటే, అందులోనూ ప్రాంతం, కులం, భాష తమ తమ ఆధిక్యాన్ని ప్రదర్శించడం జరుగుతోంది. మరోవైపు ఇలాంటి పార్టీలన్నీ ఏకం కాకుండా అడ్డుకునే ప్రయత్నాలు, ఆకర్షణలు విరివిగానే జరుగుతున్నాయి. దీనితో పాటు ఏవో కొన్ని ప్రత్యేక మినహాయింపులు, రాయితీల ఒప్పందంతో ఏకమైనా, అధికారంలోకి రాగానే కుమ్ములాటలు బయలుదేరడంతో ప్రజలు మళ్ళీ ‘‘స్థిరత్వం’’ పేరు చెప్పుకునే రాజకీయపక్షాల వైపే మొగ్గుచూడవలసిన నిస్సహాయ స్థితిలోకెళ్ళిపోతున్నారు. వటవృక్షంలా అల్లుకుపోయిన రాజకీయవ్యవస్థను చిన్న చిన్న పార్టీలని పిలవబడుతున్నవీ, సామాజిక ఉన్నత లక్ష్యమనే భావ సారూప్యం గల పార్టీలు ఒక ఫ్రంట్‌గా ఏర్పడి, కేవలం అధికారం కోసమే కాకుండా, అధికారం పేరుతో చెలాయిస్తున్న అవ్యవస్థను ప్రజల ముంగిటకు తెచ్చి, ప్రజల్ని చైతన్యవంతం చేయడమే మన ప్రజాస్వామ్య రాజకీయవ్యవస్థను బాగు చేయడానికి ఉన్న గొప్ప ఆయుధం అనుకుంటున్నాను. దీనికి మేధావులే ముందో, వెనుకో ఉండి నడిపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
  

“సత్యం” మీద ప్రమాణం చేసి…నిజమే చెప్పాలి…

కులమెత్తి తిట్టే సుజనుల గడ్డమీద
మలమెత్తినోళ్ళ సంతతి నుదుటిమీద
మరణశాసనాలే  లిఖిస్తున్నప్పుడు..
దళితవాడ  బతుకు
కారంచేడు మహిళామండలి  మేడంత
అందంగా వుండదురా బాబూ !


కామాంధుల కథలో
కూటికుండల వీధిదొంగను తెచ్చి
కాటికి వకాలతునామా రాసినప్పుడే తెలుసు
ఈ సత్యోద్యుల మధ్య
సత్యాభి సంధుల మధ్య
ఈ ‘సత్యం’ బతికి బట్ట కట్టడం మిధ్యనీ ..


‘సత్యమేవ జయతే’
ఒకే భూగ్రహం కింద
ఒకే జాతీయ జెండా కింద
ఎన్ని సత్యోపదేశా
లెన్ని సమైక్యగీతా
లెన్ని ప్రభోధగీతా
లెన్ని జాతీయగానా
లెన్నెన్ని పంగనామాలు …


ఆకలిని
జాతీయగానంగా మార్చుకున్నచోట
ఈకలకోసమే పెంచే నిప్పుకోళ్ళకథ విన్నావా !
ఆకలికేకల పాప్ సంగీతంలో
సెగబారిన  రెక్కలడొక్కలమీద
చిర్ర చిటికెన పుల్లతో తాటిస్తే
ఐక్యరాజ్య సమితి కర్ణభేరి పగిలి
‘ఆలివర్ ట్విస్ట్’ కథ కర్ణపిశాచై వెంటబడదా !
నర్తిస్తున్న నల్లకోటుల వక్తృత్వంలో
చెలగువేస్తున్న దేవనాగరి రాక్షస సంగీతంలో
రాసలీలల భువనవిజయం కలవాళ్ళదే కదా !
చెప్పండి మిలార్డ్ !
ఈ సత్యాసత్యాల విచికిత్సలో
ఒక బలహీనుడి వెన్నెపూసని
బలంగా తుంచి పారెయ్యమని
ఏ పౌరనీతి శాస్త్రం భోదించిందో
ఏ భారతీయ శిక్షాస్మృతి ఆదేశించిందో
“సత్యం ”  మీద ప్రమాణం చేసి
ఈ ఒక్క నిజమైనా  చెప్పాలి
అబద్దం చెప్పకూడదు..
- తుల్లిమల్లి విల్సన్ సుధాకర్
డైరెక్టర్, ఇండియా టూరిజం, భారత ప్రభుత్వం, పశ్చిమాసియా & ఆఫ్రికా
wilsonsudhakar@hotmail.com

‘పునర్మూల్యాంకనం‘ ఆవిష్కరణ

డా.దార్ల వెంకటేశ్వరరావు రాసిన పరిశోధన పత్రాల సంపుటి ‘పునర్మూల్యాంకనం‘ గ్రంథాన్ని హైదరాబాదు విశ్వవిద్యాలయం  వైస్ ఛాన్సలర్ ఆచార్య సయ్యద్ హస్నైన్ గురువారం (8.12.2010 ) ఆవిష్కరించారు. ఈ కార్యక్రమమంలో హ్యుమానిటీస్ డీన్ ఆచార్య రమణన్, ప్రొ.వైస్ ఛాన్సలర్ సారంగి తదితరులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో మొత్తం మూడు పుస్తకాలను ఆవిష్కరించారు. ఆచార్య బేతవోలు రామబ్రహ్మం గారి గ్రంథం  ‘‘ ఉత్తరరామచరిత్రము ‘ వ్యాఖ్యానం, డా. అద్దంకి శ్రీనివాస్ 9 సంస్క్రత నాటకాల పరిచయం అనే గ్రంథాలను ఆవిష్కరించారు. ఆచార్య రామబ్రహ్మం గారు తన గ్రంథాన్ని వైస్ ఛాన్సలర్ ఆచార్య సయ్యద్ హస్నైన్ గార్కి అంకితం చేశారు. 
 మాట్లాడు తున్న వైస్ ఛాన్సలర్ ఆచార్య సయ్యద్ హస్నైన్
 గ్రంథాన్ని అంకితం తీసుకుంటున్న వైస్ ఛాన్సలర్ ఆచార్య సయ్యద్ హస్నైన్
 ఢా. అద్దంకి శ్రీనివాస్ రచించిన గ్రంథాన్ని ఆవిష్కరిస్తున్న వైస్ ఛాన్సలర్ ఆచార్య సయ్యద్ హస్నైన్
డా.దార్ల వెంకటేశ్వరరావు రాసిన పరిశోధన పత్రాల సంపుటి ‘పునర్మూల్యాంకనం‘ గ్రంథాన్ని ఆవిష్కరిస్తున్న వైస్ ఛాన్సలర్ ఆచార్య సయ్యద్ హస్నైన్



జానపదమా? ఆధునికమా?


ఒకవైపు మానవుడెంత శాస్త్రీయంగా ఆలోచిస్తున్నా, మరోవైపు శాస్త్రాలకు లంగని అనేక అంశాలు మానవుడ్ని సత్యాన్వేషణ వైపు నడిపిస్తున్నాయి. ఇవన్నీ వివిధ అధ్యయనాంశాలవ్వడం కూడా గమనిస్తూనే ఉన్నాం. అలాంటి వాటిలో జానపదవిజ్ఞానం ఒకటి. దీనిలో ఒక భాగమే జానపదసాహిత్యం. ఈ సాహిత్యాన్ని లోతుగా అధ్యయనం చేసే వాళ్ళకి మౌఖికసాహిత్యాన్నే జానపదసాహిత్యంగా భావించాలేమో అనే అనుమానం కలుగుతుంది.దీనికి కారణాలనేకం. మౌఖిక సాహిత్యం లిఖితసాహిత్యంగా మారితే అప్పుడూ దాన్ని జానపదసాహిత్యంగానే పిలవాలా? కేవలం సాహిత్యంగానే పిలవాలా? అనేదొక చర్చనీయాంశం.
కట్టమంచి రామలింగారెడ్డి ముసలమ్మమరణంఇతివృత్తం జానపదానికి సంబంధించింది. అనంతపురం సమీపంలో బుక్కరాయసముద్రం అనే గ్రామంలో ఒక చెరువు ఉంది. అది ఒకసారి పొంగి దాని కట్టతెగిపోయింది. ఆ నీళ్ళు ఊరంతా ముంచేస్తున్న సమయంలో ప్రజలంతా గ్రామదేవత పోలేరమ్మని ప్రార్ధిస్తారు. ఆ ఊరిలో ఉన్న ముసలమ్మని చెరువుకట్టకి బలిస్తే, ఊరు రక్షింపబడుతుందని ఆకాశవాణి చెప్తుంది.  ఆ ప్రజలందరినీ రక్షించడానికి ముసలమ్మ ప్రాణత్యాగం చేస్తుంది. ఈ కథ బ్రౌన్‌ ప్రకటించిన ‘‘అనంతపుర చరిత్రము’’ అనే గ్రంథంలోది. లోకనానుడి నుండే సేకరించి దీన్ని ఆ పుస్తకంలో కథగా కూర్చారు. కట్టమంచి వారు దీన్ని తీసుకుని కావ్యంగా రాయనంత వరకూ జానపదగాథగానే ప్రచారంలో ఉంది.  ‘‘జానపదకథ’’ కావ్యత్వం పొందిన తర్వాత క్లాసికల్‌ అయిపోయింది. ఇరవయ్యో శతాబ్ది సారస్వతాకాశంలో నవ్యకాంతులతో ఆవిర్భవించిన నూతన ఆంధ్రకావ్యంగా  దీన్ని ఆచార్య పింగళిలక్ష్మీకాంతం వంటి సాహితీవేత్తలు ప్రశంసించారు. ఈ కావ్యంలో ముసలమ్మ త్యాగం పాఠకుల హృదయాల్ని కరుణ రస తరంగాల్లో తేలియాడేలా చేస్తుంది.  ఇటువంటి జానపదేతివృత్తాలే తర్వాత కావ్యాలుగా మారిన వాటిలో దువ్వూరి రామిరెడ్డి రాసిన ‘‘ నలజారమ్మ’, ముదివర్తి కొండమాచార్యులు రాసిన ‘‘నారాయణమ్మ’’, నాగభైరవ కోటేశ్వరరావు రాసిన ‘‘ గుండ్లకమ్మ చెప్పిన కథ’’ ప్రముఖమైనవి. నిజానికి వీటిని ఆధునిక కావ్యాలుగా  భావిస్తున్నా, ఆధునికతకు సంబంధించిన లక్షణాల్ని కలిగి ఉన్నాయో లేదో చూడాల్సిన అవసరం కూడా ఉంది. మానవాతీతశక్తుల్ని నమ్మడం ఆధునిక సాహిత్య లక్షణం కాదు. అలాగే స్వేచ్చకూ, సమానత్వానికీ, మానవుడి శక్తి సామర్థ్యాలకీ ప్రాధాన్యాన్నిచ్చేది ఆధునిక సాహిత్యమవుతుంది. కేవలం కాలాన్ని మాత్రమే ఆధారంగా చేసుకుని ఆధునికతను నిర్ణయించలేం. మనం ఆధునిక సాహిత్యంగా చదువుకుంటున్నవీ, భావిస్తున్నవీ నిజంగా ఆధునికమా? కాదా? అనేది మరో చర్చనీయాంశం. ఇక్కడ జానపద సాహిత్యంలో మౌలికతనూ, జానపదసాహిత్యంగా చెలామణి అవుతున్న సాహిత్యంలో ఉండే అంశాల్నే ఇప్పుడు చర్చిద్దాం. 
ఆకాశవాణి పలుకులు అనగానే చాలామందికి మహాభారతంలో శకుంతల పాత్ర గుర్తుకొస్తుంది. దుష్యంతుడు ఆమెను గాంధర్వవివాహం చేసుకుని ఒక కుమారుని జన్మకు కారణమవుతాడు. తననీ, తన కుమారుణ్నీ గుర్తించమని దుష్యంతుణ్ని అడిగితే, ఆమె ఎవరో తనకు తెలియదన్నప్పుడు ఆకాశవాణి పలుకులే సాక్ష్యమవుతాయి. మహాభారతంలో ఇలాంటి జానపదత్వ అంశాలెన్నో ఉన్నాయి. ఇటువంటివన్నీ కవి సన్నివేశకల్పనకు, రసత్వ సిద్ధికి ఉపయోగించుకుని, దాని ద్వారా ఒక సత్యాన్నేదో ప్రబోధించాలనుకుంటాడు.
కవి ధ్వన్యాత్మకంగా చెప్పేవాటిలో లోకానికి అద్భుతమనిపించేవిగా ఉండొచ్చు. లోకంలో ఉన్నది గానీ, లేనిది గానీ పాఠకుల హృదయాలకు ఆహ్లాదాన్ని కలిగించడానికి కవెన్నో ఊహల్ని చేస్తాడు. అలాంటివి కొన్ని కాలక్రమంలో యాదృచ్ఛికంగా సైన్స్‌ ద్వారా నిరూపితం కావచ్చు. అయినంత మాత్రం చేత తనకావ్యంలో ప్రస్తావించినవన్నీ వాస్తవాలుగానో, భౌతికంగా కవి చూసినవే అనో చెప్పలేం. కవి ప్రతిభకు వాటిని నిదర్శనంగా భావించాలి. నిజమైన కవిప్రతిభ గొప్ప ఊహల్లోనే ఉంటుంది. దీన్నే భావుకత అని భారతీయులు, ఇమాజినేషన్‌ అని పాశ్చాత్యులు పిలిచారు. రామాయణ, మహాభారతాల్లో ఇలాంటి అద్భుత భావుకతను  పట్టిచ్చే కథలెన్నో ఉన్నాయి. కానీ ఇలాంటి వాటికేదో శాస్త్రీయతను కల్పించడానికి ‘‘పురాణాల్లో సైన్స్‌’’ అంటూ గ్రంథాలు రాసిన వాళ్ళూ ఉన్నారు. ‘‘అన్నీ వేదాల్లోనే ఉన్నాయిష’’ అనేవ్యంగ్య వ్యాఖ్య రావడానికిలాంటివే కారణం.
 రాముడికి సీత ఏమవుతుంది? అనే గ్రంథంలో ఆరుద్ర రామాయణ సంబంధంగా అనిపించే కథలెన్నింటినో ప్రస్తావించారు.క్లాసిక్స్‌గా పేరొచ్చిన కావ్యాల్లోని అంశాల్ని విశ్లేషించేటప్పుడు జాగ్రత్త వహించకపోతే వచ్చే విమర్శలెలా ఉంటాయో తెలియాలంటే ఆరుద్ర ఈ రచన చేసినప్పుడు వచ్చిన విమర్శలే నిదర్శనం. అందుకనే కల్పనైనా అది ఔచిత్యవంతంగా ఉందని పాఠకులు భావిస్తేనే అది కవి ప్రతిభగా వెలుగొందుతుంది. క్షేమేంద్రుడు ‘‘ఔచిత్యవిచారచర్చ’’ లక్షణగ్రంథంలో వివరించిన ఔచిత్యానౌచిత్యాలతో జానపపదులకు సంబంధం లేదు.రామాయణంలో లంక నుండి వస్తూ రావణుని పటాన్ని సీతాదేవి కూడా తెచ్చుకుందని జానపదులు పాడుకుంటారు. దీనికి అభ్యంతరం తెలిపిన వాళ్ళు, రాముడి పాదాలు సోకిన రాయి ఒక స్త్రీగా మారిందన్నప్పుడు సంతోషించారు.
ఇలాగే పురాణ సాహిత్యం ఉంది. కొన్ని పురాణాలు ప్రాచీన సాహిత్యంగా చెలామణీ అవుతుంటే, మరికొన్ని జానపద పురాణాలుగా ప్రచారంలో ఉన్నాయి. అష్టాదశపురాణాల్ని శిష్టసాహిత్యంగా పిలుస్తున్నారు. అటువంటి లక్షణాలే ఉన్న కింది వర్ణాలు లేదా కులాలనబడుతున్న వాళ్ళ గురించి వివరించే పురాణాల్ని మాత్రం జానపద పురాణాలుగా వ్యవహరిస్తున్నారు. అంటే కేవలం మౌఖికంగా ప్రచారంలో ఉండడమే జానపదత్వాన్ని నిర్ణయించే అంశం కాదన్నమాట. మౌఖికంగా ప్రాచుర్యంలో ఉన్నాయా? లిఖితరూపం పొందాయా? అనే దానికంటే మరికొన్ని లక్షణాలేవో ఆ సాహిత్యాన్ని జానపదసాహిత్యమో, కాదో నిర్ణయిస్తున్నాయని అర్థమవుతుంది.
కొంతమంది భాషాశాస్త్రవేత్తలు మాండలిక భాషలో ఉచ్చారణను నిర్ణయిస్తూ శిష్ట, జానపద ఉచ్చారణ అని రెండురకాలుగా వర్గీకరించారు. జానపదత్వానికి భాషాసంస్కరణ ఒక లక్షణమైందన్నమాట. శిష్ట, శిష్టేతర, జానపద అనే పారిభాషిక పదాలతో ఉచ్చారణను బట్టి వ్యవహర్తల్ని నిర్ణయించడం సమంజసమేనా? దీని ప్రకారమే ఒత్తుల్ని, అల్పప్రాణాల్నీ సరిచేసి రాసేస్తే  శిష్టభాష అయిపోతుందా? అనే ప్రశ్నలు ఉత్పన్నమైయ్యాయి. మరోవైపు లక్ష్యం నుండి లక్షణమా? లక్షణం నుండి లక్ష్యమా అనే చర్చ కూడా బయలు దేరింది. అందుకే రెండు వైపుల నుండీ అధ్యయనం కొనసాగుతోంది.భాషాశాస్త్రంలో సోషియోలింగ్విస్టిక్స్‌ అనే శాఖ మరొకటి ఏర్పడిరది. భాష నిర్మాణాన్ని శాస్త్రీయదృష్టితో పరిశీలించడానికి ప్రయత్నించడమన్నమాట. భాషలో శాస్త్రీయ పరిశీలన అనేది సహజసౌందర్యాన్ని కాపాడే దృష్టితో సాగుతుంది. సహజత్వాన్ని కాపాడాల్సిన అవసరాన్ని ఒక సినిమాలో ఎంతచక్కగా చూపించారో చూడండి.
ఆ సినిమాలో చదువుకున్న కథానాయిక, పడవనడుపుకునే వ్యక్తిని ఒక పాట నేర్పమంటుంది.‘‘నాపాట నీనోట పలకాల సిలకా...’’  అని కథానాయకుడు పాడితే, ‘‘ నాపాట నీ నోట పలకాల చిలకా...’’ అని కథానాయిక  సిని చిగా మార్చుకుని పాడుతుంది. మళ్ళీ పాత పాటనే పాడి వినిపిస్తాడు. ఆమె మళ్ళీ దాన్ని గమనించనట్లు తన పంథాలోనే పాడుతుంది.అతడి ఉచ్చారణలో తప్పుందనుకున్నట్లు ఆమె భావించి ఉండొచ్చు.అప్పుడతడు ‘‘ఎహె... చికాదు, ‘సి’...‘సిఅని పలకాలంటాడు. అలా పలికితేనే దాని సహజ సౌందర్యం అభివ్యక్తమవుతుంది. ఈ సహజ సౌందర్యమే జానపద సాహిత్యానికి జీవగర్ర! కాబట్టి భాషని బట్టి కూడా జానపదత్వం ఉంటుంది.కొన్ని సార్లు సహజత్వం పేరుతో మితిమీరిన పదాల్ని ప్రయోగించడం కనిపిస్తుంది.
జానపదత్వానికి మౌఖిక సంప్రదాయం, సహజత్వం, రసపరిపూర్ణత వంటి లక్షణాలెంత ముఖ్యమో కర్తృత్వం అంటే గేయాన్ని లేదా కథకి కర్తను తానే అనే పేటెంటుకి ప్రయత్నించకపోవడం అంతేముఖ్యం. అందువల్లనేమో దీన్ని ప్రజావాఙ్మయమని కూడా పిలిచారు.అయితే జానపద గేయ, కథాసాహిత్యంలో రసభరిత వర్ణనలుంటాయి.వీటిని భావుకతగానూ, స్థానిక సమస్యల్ని స్థల, కాలాలకు అనుగుణంగా మలుచుకునే జానపదుల నైపుణ్యంగా చెప్పుకోవచ్చు. కానీ, జానపద విజ్ఞానం పేరుతో అనేక నమ్మకాల్ని అధ్యయనం చేస్తున్నాం. వీటిపట్ల జాగురూకతతో  వ్యవహరించాల్సిన అవసరముంది.
కొంతమంది దీన్ని మన సంస్కృతిగా కూడా ప్రచారం చేస్తున్నారు. వీటిని నమ్మించడానికి రకరకాల వ్యాఖ్యానాల్ని చేస్తున్నారు. సంస్కృతికి చాలా విస్తృతమైన పరిధి ఉంది. జానపద సంస్కృతిని తెలుసుకోవాలంటే, జానపదులంటే ఎవరో స్పష్టంగా వివరించుకోవాల్సిన అవసరం ఉంది. దీన్ని నిర్వచిస్తూ డా ఆర్వీయస్‌.సుందరం ‘‘ జనపదమంటే ఒకప్పుడు కేవలం పల్లెటూరుఅనే అర్థం వుండి వుండవచ్చు. నేడు ఫోక్‌అనే పదానికి సమానార్థకంగా మనం వాడుతున్న గ్రామీణులనే పరిమితార్థంలో ఊహించడం సబబు కాదు... సమాన సంప్రదాయాలు కలిగిన ఆటవికులైనా, గిరిజనులైనా, గ్రామీణులైనా, నగరవాసులైనా జానపదులే అవుతార’’ని అంటున్నారు. ఇందులో సంప్రదాయం అనే మాట కనిపిస్తుంది. సంప్రదాయం అనేది పరంపరగా వస్తుంది. నిరూపణ కంటే తరతరాలుగా ఆచరించడమే దీనిలో ముఖ్యం. ఆచార, సంప్రదాయాలు కొన్నిసార్లు ఒకే అర్థంలో వ్యవహరింపబడటం కూడా చూస్తుంటాం. దేవుణ్ని నమ్మడం, నమ్మిన దేవుణ్ని లేదా దేవతని పూజించడం ఒక సంప్రదాయం.తమ సంతోషాల్ని అందరితో పంచుకోవడానికి చేసుకునే కార్యక్రమాల్ని పండుగలుగా ఆచరిస్తుంటాం. ఆ పండగలకి కొన్ని ఐతిహ్యాల్ని కల్పించుకుంటాం. వాటి పరమార్ధం ఏదైనా, వాటిని నిర్దేశించుకున్న దాని ప్రకారమే జరగాలి. అలా జరగకపోతే ఆచారానికి లోపం వస్తుంది. సంప్రదాయం దెబ్బతింటుందని అంటారు. ఇవి క్రమేపీ సంస్కృతిలో భాగమైపోతాయి. వీటిని ప్రశ్నించడం కంటే ఆచరించడమే ముఖ్యం. ఇక్కడే మూఢత్వానికి బీజం పడుతుంది. అది కొన్నాళ్ళకు ముదిరి పాకాన పడి డాక్టర్లు, శాస్త్రవేత్తల మనసుల్నీ లాగేసుకుంటుంది. ఇలా మానవుల ఆచారాలు, సంప్రదాయాలు, మొత్తం జీవన విధానమంతా ఒక సంస్కృతిగా ప్రచారమౌతుంది.
‘‘సంస్కృతి’’ పేరుతో జానపదులు ఆచరించే వాటిలో హేతువుల్ని అన్వేషిస్తే చాలా చిత్రంగా అనిపిస్తాయి. తమకు తెలిసో తెలియకో కొన్నింటిని ఆచరిస్తుంటారు. కొన్ని పండగల్ని చూస్తే వాటికేవో కథల్ని చెప్తుంటారు. వాటిలోని శాస్త్రీయతను నిర్ధారించమన్నా, వాటి హేతువుల్ని చెప్పమన్నా సరిగ్గా చెప్పరు సరికదా, అలా అడిగే వాళ్ళని హేతువాదులుగానో, నాస్తికులు గానో ముద్రవేస్తుంటారు. సంప్రదాయం పేరుతో పండుగల్ని నిర్వహించే వాళ్ళైతే వాటిని మరింత క్లిష్టం చేసి వివరిస్తుంటారు. వీటిపట్ల జాగురూకులై ఉండకపోతే జానపదవిజ్ఞానం పేరుతో మనం బోధించేవి మూఢవిశ్వాసాలే అవుతాయి. ఇవే ఈ శాస్త్ర అస్తిత్వాన్ని ప్రశ్నార్థకం చేస్తుంటాయనీ గుర్తించాలి. 

                                                                                                                                                               -డా దార్ల వెంకటేశ్వరరావు
1-12-2010
అసిస్టెంటు ప్రొఫెసరు, తెలుగు శాఖ,
సెంట్రల్‌ యూనివర్సిటి, గచ్చిబౌలి, హైదరాబాదు ` 46
ఫోను: 09989628049