ఒకవైపు మానవుడెంత శాస్త్రీయంగా ఆలోచిస్తున్నా, మరోవైపు శాస్త్రాలకు లంగని అనేక అంశాలు మానవుడ్ని సత్యాన్వేషణ వైపు నడిపిస్తున్నాయి. ఇవన్నీ వివిధ అధ్యయనాంశాలవ్వడం కూడా గమనిస్తూనే ఉన్నాం. అలాంటి వాటిలో జానపదవిజ్ఞానం ఒకటి. దీనిలో ఒక భాగమే జానపదసాహిత్యం. ఈ సాహిత్యాన్ని లోతుగా అధ్యయనం చేసే వాళ్ళకి మౌఖికసాహిత్యాన్నే జానపదసాహిత్యంగా భావించాలేమో అనే అనుమానం కలుగుతుంది.దీనికి కారణాలనేకం. మౌఖిక సాహిత్యం లిఖితసాహిత్యంగా మారితే అప్పుడూ దాన్ని జానపదసాహిత్యంగానే పిలవాలా? కేవలం సాహిత్యంగానే పిలవాలా? అనేదొక చర్చనీయాంశం.
కట్టమంచి రామలింగారెడ్డి ‘ముసలమ్మమరణం’ ఇతివృత్తం జానపదానికి సంబంధించింది. అనంతపురం సమీపంలో బుక్కరాయసముద్రం అనే గ్రామంలో ఒక చెరువు ఉంది. అది ఒకసారి పొంగి దాని కట్టతెగిపోయింది. ఆ నీళ్ళు ఊరంతా ముంచేస్తున్న సమయంలో ప్రజలంతా గ్రామదేవత పోలేరమ్మని ప్రార్ధిస్తారు. ఆ ఊరిలో ఉన్న ముసలమ్మని చెరువుకట్టకి బలిస్తే, ఊరు రక్షింపబడుతుందని ఆకాశవాణి చెప్తుంది. ఆ ప్రజలందరినీ రక్షించడానికి ముసలమ్మ ప్రాణత్యాగం చేస్తుంది. ఈ కథ బ్రౌన్ ప్రకటించిన ‘‘అనంతపుర చరిత్రము’’ అనే గ్రంథంలోది. లోకనానుడి నుండే సేకరించి దీన్ని ఆ పుస్తకంలో కథగా కూర్చారు. కట్టమంచి వారు దీన్ని తీసుకుని కావ్యంగా రాయనంత వరకూ జానపదగాథగానే ప్రచారంలో ఉంది. ‘‘జానపదకథ’’ కావ్యత్వం పొందిన తర్వాత క్లాసికల్ అయిపోయింది. ఇరవయ్యో శతాబ్ది సారస్వతాకాశంలో నవ్యకాంతులతో ఆవిర్భవించిన నూతన ఆంధ్రకావ్యంగా దీన్ని ఆచార్య పింగళిలక్ష్మీకాంతం వంటి సాహితీవేత్తలు ప్రశంసించారు. ఈ కావ్యంలో ముసలమ్మ త్యాగం పాఠకుల హృదయాల్ని కరుణ రస తరంగాల్లో తేలియాడేలా చేస్తుంది. ఇటువంటి జానపదేతివృత్తాలే తర్వాత కావ్యాలుగా మారిన వాటిలో దువ్వూరి రామిరెడ్డి రాసిన ‘‘ నలజారమ్మ’, ముదివర్తి కొండమాచార్యులు రాసిన ‘‘నారాయణమ్మ’’, నాగభైరవ కోటేశ్వరరావు రాసిన ‘‘ గుండ్లకమ్మ చెప్పిన కథ’’ ప్రముఖమైనవి. నిజానికి వీటిని ఆధునిక కావ్యాలుగా భావిస్తున్నా, ఆధునికతకు సంబంధించిన లక్షణాల్ని కలిగి ఉన్నాయో లేదో చూడాల్సిన అవసరం కూడా ఉంది. మానవాతీతశక్తుల్ని నమ్మడం ఆధునిక సాహిత్య లక్షణం కాదు. అలాగే స్వేచ్చకూ, సమానత్వానికీ, మానవుడి శక్తి సామర్థ్యాలకీ ప్రాధాన్యాన్నిచ్చేది ఆధునిక సాహిత్యమవుతుంది. కేవలం కాలాన్ని మాత్రమే ఆధారంగా చేసుకుని ఆధునికతను నిర్ణయించలేం. మనం ఆధునిక సాహిత్యంగా చదువుకుంటున్నవీ, భావిస్తున్నవీ నిజంగా ఆధునికమా? కాదా? అనేది మరో చర్చనీయాంశం. ఇక్కడ జానపద సాహిత్యంలో మౌలికతనూ, జానపదసాహిత్యంగా చెలామణి అవుతున్న సాహిత్యంలో ఉండే అంశాల్నే ఇప్పుడు చర్చిద్దాం.
ఆకాశవాణి పలుకులు అనగానే చాలామందికి మహాభారతంలో శకుంతల పాత్ర గుర్తుకొస్తుంది. దుష్యంతుడు ఆమెను గాంధర్వవివాహం చేసుకుని ఒక కుమారుని జన్మకు కారణమవుతాడు. తననీ, తన కుమారుణ్నీ గుర్తించమని దుష్యంతుణ్ని అడిగితే, ఆమె ఎవరో తనకు తెలియదన్నప్పుడు ఆకాశవాణి పలుకులే సాక్ష్యమవుతాయి. మహాభారతంలో ఇలాంటి జానపదత్వ అంశాలెన్నో ఉన్నాయి. ఇటువంటివన్నీ కవి సన్నివేశకల్పనకు, రసత్వ సిద్ధికి ఉపయోగించుకుని, దాని ద్వారా ఒక సత్యాన్నేదో ప్రబోధించాలనుకుంటాడు.
కవి ధ్వన్యాత్మకంగా చెప్పేవాటిలో లోకానికి అద్భుతమనిపించేవిగా ఉండొచ్చు. లోకంలో ఉన్నది గానీ, లేనిది గానీ పాఠకుల హృదయాలకు ఆహ్లాదాన్ని కలిగించడానికి కవెన్నో ఊహల్ని చేస్తాడు. అలాంటివి కొన్ని కాలక్రమంలో యాదృచ్ఛికంగా సైన్స్ ద్వారా నిరూపితం కావచ్చు. అయినంత మాత్రం చేత తనకావ్యంలో ప్రస్తావించినవన్నీ వాస్తవాలుగానో, భౌతికంగా కవి చూసినవే అనో చెప్పలేం. కవి ప్రతిభకు వాటిని నిదర్శనంగా భావించాలి. నిజమైన కవిప్రతిభ గొప్ప ఊహల్లోనే ఉంటుంది. దీన్నే భావుకత అని భారతీయులు, ఇమాజినేషన్ అని పాశ్చాత్యులు పిలిచారు. రామాయణ, మహాభారతాల్లో ఇలాంటి అద్భుత భావుకతను పట్టిచ్చే కథలెన్నో ఉన్నాయి. కానీ ఇలాంటి వాటికేదో శాస్త్రీయతను కల్పించడానికి ‘‘పురాణాల్లో సైన్స్’’ అంటూ గ్రంథాలు రాసిన వాళ్ళూ ఉన్నారు. ‘‘అన్నీ వేదాల్లోనే ఉన్నాయిష’’ అనేవ్యంగ్య వ్యాఖ్య రావడానికిలాంటివే కారణం.
రాముడికి సీత ఏమవుతుంది? అనే గ్రంథంలో ఆరుద్ర రామాయణ సంబంధంగా అనిపించే కథలెన్నింటినో ప్రస్తావించారు.క్లాసిక్స్‌గా పేరొచ్చిన కావ్యాల్లోని అంశాల్ని విశ్లేషించేటప్పుడు జాగ్రత్త వహించకపోతే వచ్చే విమర్శలెలా ఉంటాయో తెలియాలంటే ఆరుద్ర ఈ రచన చేసినప్పుడు వచ్చిన విమర్శలే నిదర్శనం. అందుకనే కల్పనైనా అది ఔచిత్యవంతంగా ఉందని పాఠకులు భావిస్తేనే అది కవి ప్రతిభగా వెలుగొందుతుంది. క్షేమేంద్రుడు ‘‘ఔచిత్యవిచారచర్చ’’ లక్షణగ్రంథంలో వివరించిన ఔచిత్యానౌచిత్యాలతో జానపపదులకు సంబంధం లేదు.రామాయణంలో లంక నుండి వస్తూ రావణుని పటాన్ని సీతాదేవి కూడా తెచ్చుకుందని జానపదులు పాడుకుంటారు. దీనికి అభ్యంతరం తెలిపిన వాళ్ళు, రాముడి పాదాలు సోకిన రాయి ఒక స్త్రీగా మారిందన్నప్పుడు సంతోషించారు.
ఇలాగే పురాణ సాహిత్యం ఉంది. కొన్ని పురాణాలు ప్రాచీన సాహిత్యంగా చెలామణీ అవుతుంటే, మరికొన్ని జానపద పురాణాలుగా ప్రచారంలో ఉన్నాయి. అష్టాదశపురాణాల్ని శిష్టసాహిత్యంగా పిలుస్తున్నారు. అటువంటి లక్షణాలే ఉన్న కింది వర్ణాలు లేదా కులాలనబడుతున్న వాళ్ళ గురించి వివరించే పురాణాల్ని మాత్రం జానపద పురాణాలుగా వ్యవహరిస్తున్నారు. అంటే కేవలం మౌఖికంగా ప్రచారంలో ఉండడమే జానపదత్వాన్ని నిర్ణయించే అంశం కాదన్నమాట. మౌఖికంగా ప్రాచుర్యంలో ఉన్నాయా? లిఖితరూపం పొందాయా? అనే దానికంటే మరికొన్ని లక్షణాలేవో ఆ సాహిత్యాన్ని జానపదసాహిత్యమో, కాదో నిర్ణయిస్తున్నాయని అర్థమవుతుంది.
కొంతమంది భాషాశాస్త్రవేత్తలు మాండలిక భాషలో ఉచ్చారణను నిర్ణయిస్తూ శిష్ట, జానపద ఉచ్చారణ అని రెండురకాలుగా వర్గీకరించారు. జానపదత్వానికి భాషాసంస్కరణ ఒక లక్షణమైందన్నమాట. శిష్ట, శిష్టేతర, జానపద అనే పారిభాషిక పదాలతో ఉచ్చారణను బట్టి వ్యవహర్తల్ని నిర్ణయించడం సమంజసమేనా? దీని ప్రకారమే ఒత్తుల్ని, అల్పప్రాణాల్నీ సరిచేసి రాసేస్తే శిష్టభాష అయిపోతుందా? అనే ప్రశ్నలు ఉత్పన్నమైయ్యాయి. మరోవైపు లక్ష్యం నుండి లక్షణమా? లక్షణం నుండి లక్ష్యమా అనే చర్చ కూడా బయలు దేరింది. అందుకే రెండు వైపుల నుండీ అధ్యయనం కొనసాగుతోంది.భాషాశాస్త్రంలో సోషియోలింగ్విస్టిక్స్ అనే శాఖ మరొకటి ఏర్పడిరది. భాష నిర్మాణాన్ని శాస్త్రీయదృష్టితో పరిశీలించడానికి ప్రయత్నించడమన్నమాట. భాషలో శాస్త్రీయ పరిశీలన అనేది సహజసౌందర్యాన్ని కాపాడే దృష్టితో సాగుతుంది. సహజత్వాన్ని కాపాడాల్సిన అవసరాన్ని ఒక సినిమాలో ఎంతచక్కగా చూపించారో చూడండి.
ఆ సినిమాలో చదువుకున్న కథానాయిక, పడవనడుపుకునే వ్యక్తిని ఒక పాట నేర్పమంటుంది.‘‘నాపాట నీనోట పలకాల సిలకా...’’ అని కథానాయకుడు పాడితే, ‘‘ నాపాట నీ నోట పలకాల చిలకా...’’ అని కథానాయిక ‘సి’ ని ‘చి’గా మార్చుకుని పాడుతుంది. మళ్ళీ పాత పాటనే పాడి వినిపిస్తాడు. ఆమె మళ్ళీ దాన్ని గమనించనట్లు తన పంథాలోనే పాడుతుంది.అతడి ఉచ్చారణలో తప్పుందనుకున్నట్లు ఆమె భావించి ఉండొచ్చు.అప్పుడతడు ‘‘ఎహె... ‘చి’ కాదు, ‘సి’...‘సి’ అని పలకాలంటాడు. అలా పలికితేనే దాని సహజ సౌందర్యం అభివ్యక్తమవుతుంది. ఈ సహజ సౌందర్యమే జానపద సాహిత్యానికి జీవగర్ర! కాబట్టి భాషని బట్టి కూడా జానపదత్వం ఉంటుంది.కొన్ని సార్లు సహజత్వం పేరుతో మితిమీరిన పదాల్ని ప్రయోగించడం కనిపిస్తుంది.
జానపదత్వానికి మౌఖిక సంప్రదాయం, సహజత్వం, రసపరిపూర్ణత వంటి లక్షణాలెంత ముఖ్యమో కర్తృత్వం అంటే గేయాన్ని లేదా కథకి కర్తను తానే అనే పేటెంటుకి ప్రయత్నించకపోవడం అంతేముఖ్యం. అందువల్లనేమో దీన్ని ప్రజావాఙ్మయమని కూడా పిలిచారు.అయితే జానపద గేయ, కథాసాహిత్యంలో రసభరిత వర్ణనలుంటాయి.వీటిని భావుకతగానూ, స్థానిక సమస్యల్ని స్థల, కాలాలకు అనుగుణంగా మలుచుకునే జానపదుల నైపుణ్యంగా చెప్పుకోవచ్చు. కానీ, జానపద విజ్ఞానం పేరుతో అనేక నమ్మకాల్ని అధ్యయనం చేస్తున్నాం. వీటిపట్ల జాగురూకతతో వ్యవహరించాల్సిన అవసరముంది.
కొంతమంది దీన్ని మన సంస్కృతిగా కూడా ప్రచారం చేస్తున్నారు. వీటిని నమ్మించడానికి రకరకాల వ్యాఖ్యానాల్ని చేస్తున్నారు. సంస్కృతికి చాలా విస్తృతమైన పరిధి ఉంది. జానపద సంస్కృతిని తెలుసుకోవాలంటే, జానపదులంటే ఎవరో స్పష్టంగా వివరించుకోవాల్సిన అవసరం ఉంది. దీన్ని నిర్వచిస్తూ డా॥ ఆర్వీయస్.సుందరం ‘‘ జనపదమంటే ఒకప్పుడు కేవలం ‘పల్లెటూరు’ అనే అర్థం వుండి వుండవచ్చు. నేడు ‘ఫోక్’ అనే పదానికి సమానార్థకంగా మనం వాడుతున్న గ్రామీణులనే పరిమితార్థంలో ఊహించడం సబబు కాదు... సమాన సంప్రదాయాలు కలిగిన ఆటవికులైనా, గిరిజనులైనా, గ్రామీణులైనా, నగరవాసులైనా జానపదులే అవుతార’’ని అంటున్నారు. ఇందులో సంప్రదాయం అనే మాట కనిపిస్తుంది. సంప్రదాయం అనేది పరంపరగా వస్తుంది. నిరూపణ కంటే తరతరాలుగా ఆచరించడమే దీనిలో ముఖ్యం. ఆచార, సంప్రదాయాలు కొన్నిసార్లు ఒకే అర్థంలో వ్యవహరింపబడటం కూడా చూస్తుంటాం. దేవుణ్ని నమ్మడం, నమ్మిన దేవుణ్ని లేదా దేవతని పూజించడం ఒక సంప్రదాయం.తమ సంతోషాల్ని అందరితో పంచుకోవడానికి చేసుకునే కార్యక్రమాల్ని పండుగలుగా ఆచరిస్తుంటాం. ఆ పండగలకి కొన్ని ఐతిహ్యాల్ని కల్పించుకుంటాం. వాటి పరమార్ధం ఏదైనా, వాటిని నిర్దేశించుకున్న దాని ప్రకారమే జరగాలి. అలా జరగకపోతే ఆచారానికి లోపం వస్తుంది. సంప్రదాయం దెబ్బతింటుందని అంటారు. ఇవి క్రమేపీ సంస్కృతిలో భాగమైపోతాయి. వీటిని ప్రశ్నించడం కంటే ఆచరించడమే ముఖ్యం. ఇక్కడే మూఢత్వానికి బీజం పడుతుంది. అది కొన్నాళ్ళకు ముదిరి పాకాన పడి డాక్టర్లు, శాస్త్రవేత్తల మనసుల్నీ లాగేసుకుంటుంది. ఇలా మానవుల ఆచారాలు, సంప్రదాయాలు, మొత్తం జీవన విధానమంతా ఒక సంస్కృతిగా ప్రచారమౌతుంది.
‘‘సంస్కృతి’’ పేరుతో జానపదులు ఆచరించే వాటిలో హేతువుల్ని అన్వేషిస్తే చాలా చిత్రంగా అనిపిస్తాయి. తమకు తెలిసో తెలియకో కొన్నింటిని ఆచరిస్తుంటారు. కొన్ని పండగల్ని చూస్తే వాటికేవో కథల్ని చెప్తుంటారు. వాటిలోని శాస్త్రీయతను నిర్ధారించమన్నా, వాటి హేతువుల్ని చెప్పమన్నా సరిగ్గా చెప్పరు సరికదా, అలా అడిగే వాళ్ళని హేతువాదులుగానో, నాస్తికులు గానో ముద్రవేస్తుంటారు. సంప్రదాయం పేరుతో పండుగల్ని నిర్వహించే వాళ్ళైతే వాటిని మరింత క్లిష్టం చేసి వివరిస్తుంటారు. వీటిపట్ల జాగురూకులై ఉండకపోతే జానపదవిజ్ఞానం పేరుతో మనం బోధించేవి మూఢవిశ్వాసాలే అవుతాయి. ఇవే ఈ శాస్త్ర అస్తిత్వాన్ని ప్రశ్నార్థకం చేస్తుంటాయనీ గుర్తించాలి.
-డా॥ దార్ల వెంకటేశ్వరరావు
1-12-2010
అసిస్టెంటు ప్రొఫెసరు, తెలుగు శాఖ,
సెంట్రల్ యూనివర్సిటి, గచ్చిబౌలి, హైదరాబాదు ` 46
ఫోను: 09989628049
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి