ప్రారంభమైన విద్యార్థి సదస్సు!

విశ్వనాథ వారి ఒక నవలపై మాట్లాడుతున్న అరుణ


ఎం.ఏ.. కోర్సు వర్కులో భాగంగా నిర్వహిస్తున్న సాహిత్య సమీక్ష - విద్యార్థి సదస్సు ఈ నెల 25 నుండి ప్రారంభమైంది. ఒక్కొక్క విద్యార్థి ఒక్కొక్క పుస్తకం పై మాట్లాడుతున్నారు. అది ఎలా మాట్లాడాలో ప్రారంభ సమావేశంలో నేను కొన్ని సూచనలు చేశాను. విద్యార్థులు చక్కగా మాట్లాడుతున్నారు.


విద్యార్థి సదస్సు నేడే

హైదరాబాదు విశ్వవిద్యాలయం, తెలుగు శాఖ ఎం. ఏ విద్యార్థుల సదస్సు ఉదయం పది గంటల నుండి సాయంత్రం అయిదు గంటల వరకూ జరుగుతుంది. ఇది కోర్సు వర్క్ లో భాగంగా జరుగుతున్న సదస్సు. ఒక్కో విద్యార్థి ఒక్కో పుస్తకం పై సమీక్ష చేయవలసి ఉంటుంది.
వేదిక: డా . అంబేద్కర్ ఆడిటోరియం

మాదార్ల

ప్రముఖ పద్య కవి మల్లవరపు రాజేశ్వరరావు గారు ఈ రోజు హైదరాబాదు విశ్వవిద్యాలయాన్ని సందర్శించారు. ఆయనను కలిసిన సందర్భంగా నా గురించి పద్య కవిత రాశారు.


మాదార్ల మనసువెన్నెల
ప్రాధాన్యతనిచ్చి కవుల పండితులను తా
నాదరము జూచి మమతా
మాధుర్యమొసంగిబ్రోచు మంజుల హృదితోన్

మధుర కవి మల్లవరపు జాన్ మధుర పద్య
కవన భావ సౌరభ్య వైభవము గాంచి
మెచ్చి మెండు సమీక్షల నిచ్చి కవుల
మనసు దోచుకున్నారు నమ్మకముగలుగ!
- మల్లవరపు రాజేశ్వరరావు
22-10-2009

బి.పి.కరుణాకర్ కథల సంపుటి ’ నిర్నిమిత్తం’ ఆవిష్కరణ దృశ్యాలు!

(ప్రముఖ కథరచయిత బి.పి. కరుణాకర్ రచించిన నిర్నిమిత్తం కథా సంపుటిని శుక్రవారం సాయంత్రం (17-10-2009) హైదరాబాదు లోని సుందరయ్య కళానిలయం, మినీ హాలు లో ఆవిష్కరించారు. నాటి సభలోని దృశ్యాలను పరిశోధక విద్యార్థి మద్దిరాల సిద్ధార్థ సౌజన్యంతో ఇలా అందిస్తున్నాను.. దార్ల )
మూడు తరాల జీవితాలకు ప్రాతినిథ్యం వహించే కథలుగా బి.పి.కరుణాకర్ కథల గురించి మాట్లాడుతున్న హైదరాబాదు విశ్వవిద్యాలయం అధ్యాపకుడు డా. దార్ల వెంకటేశ్వర రావు


సభాధ్యక్షత వహించి, కరుణాకర్ కథల్లో గల వస్తు, శిల్ప విశేషాలను వివరిస్తూ ఆహ్లాదభరితంగా సభను నిర్వహించిన పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, సాహిత్య పీఠాధిపతి ఆచార్య ఎండ్లూరి సుధాకర్.

నిర్మిమిత్తం కథాసంపుటిని ఆవిష్కరించిన డా.ధేనువకొండ శ్రీరామ మూర్తి
చక్కని తెలుగు వాక్యాలతో చిక్కని చిన్న కథను ఎలాంటి ఆర్భాటాలు లేకుండా బి.పి కరుణాకర్ కథలు రాశారని అభినందించిన శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం మాజీ ఉపాధ్యక్షులు ఆచార్య కోలకలూరి ఇనాక్

కథారచయిత బి.పి కరుణాకర్ తన కథల్లో గల కొన్ని అంశాలను డా. దార్ల తో ముచ్చటిస్తున్న రచయిత. వేదిక పై గుడిపాటి ఉన్నారు.



సభలో మాట్లాడుతున్న డా.దార్ల వెంకటేశ్వరరావు
నిర్నిమిత్తం కథాసంపుటిలో గల కథల గురించి ఒక సెమినార్ పత్రంలా శ్రద్దగా రాసుకొచ్చి ప్రసంగించిన కె.పి. అశోక్ కుమార్

కరుణాకర్ కథల్లో ఉన్న విషయాలన్నీ అందరూ మాట్లాడేసిన తర్వాత, ఈ సమయంలో ఆయన్ని అభినందించడమే నాకు ఆనందం... మనందరికీ ఆనందం అని వ్యాఖ్యానించిన కస్తూరి మురళీ కృష్ణ

పాలపిట్టల ప్రచురణల ద్వారా ఈ పుస్తకాన్ని తీసుకొచ్చి, అంబాలీసీ కథాసంపుటి తర్వాత శాస్త్ర సాంకేతికాంశాలపై కొత్త కోణంతో రాసిన కథలు ఇందులో ఉన్నాయని చెప్తూ వందన సమర్పరణ చేసిన ప్రచురణ కర్త గుడిపాటి
ఈ సభకు డా. పగడాల నాగేందర్ స్వాగతం పలికారు ( ఆయన ఫోటో అభించలేదు) . సభలో ప్రముఖ సాహితీవేత్తలు పాల్గొన్నారు.

రచయితకు సనానం

చిన్నకథ రాయడంలో ఆంగ్ల కథారచయితలు ఎంతో నైపుణ్యం సాధించారని, ఆ ప్రయత్నం తానూ చేస్తున్నాని, తనవి కథలని ప్రచురించి ప్రోత్సహించన వాళ్ళందరికీ రచయిత బి.పి. కరుణాకర్ ధన్యవాదాలు తెలుపుకున్నారు.

సభ ముగిసింది. ఎండ్లూరి, దార్ల వస్తున్నారు. రచయిత ఏదో చెప్తున్నారు
ఆచార్య ఎండ్లూరి వారికి రచయిత ధన్యవాదాలు తెలుపుతుంటే, బ్లాగు మిత్రుడు కస్తూరి కలిసినందుకు ఆనందంతో దార్ల

సభానంతరం వేదగిరి రాంబాబు గారితో దార్ల వారి సంభాషణ


సభ జరగడానికి ముందు శీలా వీర్రాజు గారి దగ్గర కూర్చొని క్షేమ సమాచారాలు అడుగుతూ దార్ల

..... ఇలా జరిగిందా ఆవిష్కరణ సభ! మర్నాడు వార్త పత్రిక ఫోటోతోనూ, సాక్షి కేవలం విషయాన్ని వార్తలుగా రాశాయి.

నేడే ... బి.పి.కరుణాకర్ కథల సంపుటి ’ నిర్నిమిత్తం’ ఆవిష్కరణ!

ఇంతకు ముందు అంబాలీస్ పేరుతో కథల సంపుటి వేసి కథారచయితగా మంచి పేరు పొందిన బి.పి.కరుణాకర్ రాసిన మరికొన్నికథలను "నిర్నిమిత్తం " పేరుతో ప్రచురించారు. ఈ పుస్తకాన్ని ఈ రోజు ( 16-10-2009 ) సుందరయ్య కళాభవ్ మినీహాల్ లో సాయంత్రం 6 గంటలకు జరుతుగుతుంది.

శ్రీశ్రీ శతజయంతి సభ శ్రీకాకుళంలో ..

శ్రీకాకుళంలో శ్రీ శ్రీ శతజయంతి సభ ఈ నెలలోనే జరుగుతుందని , అయితే ముందుగా నిర్ణయించిన తేదీ ప్రకా రం కాకుండా మరో తేదీని ఆ కార్యక్రమం ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. దీనికి సంబంధించిన కరపత్రాన్ని ఇక్కడ చదవవచ్చు.
Sri Sri Sabha Srikakulam

కీ.శే. గుంటూరు శేషేంద్ర శర్మ ద్వితీయ స్మారక ఉపన్యాసం

గుంటూరు శేషేంద్ర శర్మను గుంటూరు శేషేంద్ర శర్మతోనే పోల్చడం సరైన పోలిక అవుతుందని, ఆయనను ఎవరితోనూ పోల్చి చూపడం సాధ్యం కాదని ఆయన అంతటి ప్రతిభావంతుడని ప్రముఖ సాహితీవేత్త డా.పప్పు వేణుగోపాలరావు అన్నారు. హైదరాబాదు విశ్వవిద్యాలయం లో కీ.శే. గుంటూరు శేషేంద్ర శర్మ ద్వితీయ స్మారక ఉపన్యాసంలో భాగంగా శనివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డా.పప్పు వేణుగోపాలరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులు ఆచార్య సయ్యద్ ఇ హస్నైన్ అధ్యక్షతన జరిగిన ఈ కార్య క్రమంలో అతిధులను స్కూల్ ఆఫ్ హ్యమానిటీస్ డీన్ ఆచార్య మోహన్ జి, రమణన్ పరిచయం చేశారు. కార్యక్రమంలో ఆచార్య బేతవోలు రామబ్రహ్మం, శేషేంద్ర శర్మగారి సతీమణి ఇందిరాధన్ రాజ్ గిరి పాల్గొన్నారు.



డా. పప్పు వేణుగోపాలరావు గారి ప్రసంగం ఆధ్యంతం ఆసక్తి దాయకంగా సాగింది. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తో కొనసాగిన ప్రసంగం కవిగా, విమర్శకునిగా గుంటూరు శేషేంద్ర శర్మగారి సాహిత్య ప్రస్థానాన్ని సోదాహరణంగా వివరించిన తీరు అందర్నీ ఆకట్టుకుంది.
ఋతుఘోష కావ్యంలో శేషేంద్రశర్మ ప్రతిభను విశ్లేషించారు. తన కవితా ప్రస్థానం ఛందోబద్ద పద్యంతో ప్రారంభమైందని, సుదీర్ఘమైన సమాసాలను ప్రయోగించడంలో చిన్నప్పుడే గొప్పనైపుణ్యాన్ని ప్రదర్శించారని కొనియాడారు. ప్రాచీన కవుల్లో దండి, పెద్దన ల కవితానిర్మాణం శేషేంద్రలో కనిపిస్తుందని, వారిరువురూ క్రియతో శ్లోకం/ పద్యాలను ప్రారంభించి క్రియతో ముగించడం ఒక విశేషం అని విశ్లేషించారు.
పద్యం రాసినా, వచన కవిత్వం రాసినా యతిప్రాసలు తన మనసులో మెదులుతుంటాయని, ఆయన కవిత్వంలో రీతి కావ్య ఆత్మగా కనిపిస్తుందని అన్నారు. సందర్బోచిత శైలిని ప్రయోగించడంలో శేషేంద్ర శర్మ ఔచిత్యాన్ని పాటించి వాటి అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని సుదీర్ఘసమాసాలను, సరళమైన, మృదువైన పదాలను ప్రయోగించడంలో గొప్పనేర్పరి అని సోదాహరణంగా వివరించారు.
శేషేంద్ర శర్మ రాసిన సుమారు 50 రచనల్లో మండేసూర్యుడు, శేషజ్యోత్స్న, గొరిల్లా, నాదేశం నాప్రజలు, ఆధునిక కావ్యశాస్త్రమ్ , శోడషి మొదలైన రచనల్లో గల వివిధ అంశాలను వివరించారు. ముత్యాల ముగ్గు చలన చిత్రానికి శేషేంద్ర శర్మ రాసిన నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చిందీ.. అనే పాటను శ్రావ్యంగా పాడి వినిపించారు.
వేణుగోపాలరావుగారు ఎంతో ప్రణాళికా బద్దంగా తన ప్రసంగాన్ని పవర్ పాయింట్ ప్రజంటేషన్ గా సమకూర్చుకున్నారు. తెలుగు, ఇంగ్లీష్, హిందీ, ఉర్దూ భాషల్లో అనర్ఘళంగా ప్రసంగాన్ని కొనసాగించారు. తెలుగుకి ఇతర భాషల్లో గల అనువాదాన్ని ప్రజంట్ చేసిన తీరు చాలా ఆకట్టుకుంది. ఆయన ప్రసంగం ప్రణాళిక ఇలా కొనసాగింది.
మొదట ఉపోద్ఘాతంలో శర్మగారిని నాలుగైదు వాక్యాల్లో పరిచయం చేశారు.
తర్వాత ఒక్కోకావ్యంలోని అంశాలను వరుసగా పేర్కొంటూ మధ్యమధ్యలో వారి పద్యాలను/ వచన కవితలను/ వారి వచన భాగాలను అవసరమైతే స్కాన్ చేసి చిత్రాలుగా అందిస్తూ వివరించారు. కొంతమంది సమకాలికుల అభిప్రాయాలను స్కాన్ చేసి చూపించి వివరించారు. చివరిగా కొన్ని ఫోటోలను చూపించారు. తెలుగుని కంప్యూటర్ లో ఇంత బాగా ఉపయోగించుకోవచ్చా? అనేటట్లు ప్రసంగాన్ని రూపొందించుకున్నారు. ఈ ప్రసంగం విన్న తర్వాత గుంటూరు శేషేంద్ర శర్మ గారిని సంప్రదాయ, ఆలంకారిక మార్గాల్లో ఎలా అన్వయించుకోవచ్చో ఒక చక్కని మార్గాన్ని గుర్తించగలుగుతారు.