మాతృభాషలతోనే జాతి ఆత్మగౌరవం
మాతృభాషలతోనే జాతి ఆత్మగౌరవం నిండి ఉందని, మాతృభాషను కాపాడుకోవడం వల్లనే ఆ జాతి సాంస్కృతిక వారసత్వం నిలబడుతుందన ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు వ్యాఖ్యానించారు. గురువారం ( 20.02.2020) సాయంత్రం మాదాపూర్ ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం అవగాహనా కార్యక్రమంలో సెంట్రల్ యూనివర్సిటీ స్టూడెంట్స్ వెల్ఫేర్ డిప్యూటీ డీన్ ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు
. ప్రపంచ వ్యాప్తంగా కొన్ని భాషలు అంతరించిపోయే ప్రమాదముందని యునెస్కో ప్రకటించిందని, దానివల్ల కొన్ని జాతుల చరిత్ర, సంస్కృతి అంతరించిపోయే ప్రమాదం ఉంటుందని ఆయన వివరించారు. మాతృ భాషలను కాపాడుకోవడం కోసం ప్రాణాలర్పించిన బంగ్లాదేశ్ ప్రజలు త్యాగాల్ని, ఆ చరిత్రను సోదాహరణంగా వివరించారు. ఉపాధి అవకాశాల కోసం ఇంగ్లీష్, ఇతర భాషలను కూడా నేర్చుకోవాలని, కానీ మాతృ భాషను విస్మరించకూడదన్నారు.
భారతదేశంలో త్రిభాషా సూత్రాన్ని పాటించాలన్నారు. సభకు అధ్యక్షత వహించిన ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ మాట్లాడుతూ అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం ప్రాధాన్యాన్ని వివరించారు. అభివృద్ధి చెందిన దేశాల్లో శాస్త్ర, సాంకేతిక రంగాల్లోనే మాతృభాషను బోధిస్తున్నారని అన్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎం.బసవలింగం మాట్లాడుతూ మాతృభాషలను విస్మరించకుండా ఇతర భాషలను కూడా నేర్చుకోవాలని ఉద్బోధించారు.
సమావేశంలో ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు శివరామకృష్ణ, దిలీప్, తెలుగు అధ్యాపకుడు జి.కృష్ణయ్య, ఉపాధ్యాయులు శ్రీనివాసరావు, మధుసూదన్ రెడ్డి, మల్లికార్జున్, కృష్ణ, శ్రీమతి ఆర్.మంగ, కె.ఎం.లక్ష్మి తదితర అధ్యాపకులు, పెద్దసంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి