"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL-426: Indian Literature క్లాసులు మధ్యాహ్నం 12.00 గంటల నుండి 1.00 వరకు జరుగుతాయి.

దార్ల ఇంటర్వ్యూ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
దార్ల ఇంటర్వ్యూ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

31 ఆగస్టు, 2025

ఆరుద్ర రచనలపై ఆచార్య దార్ల ఇంటర్వ్యూ ( భూమిపుత్రి దినపత్రిక, 31.8.2025 సౌజన్యంతో....)

 


భూమిపుత్రి దినపత్రిక, 31.8.2025 సౌజన్యంతో....


ఆరుద్ర అత్యుత్తమ రచన సమగ్ర ఆంధ్ర సాహిత్యం

తెలుగు సాహిత్యంలో కవిగా, సినీగేయ రచయితగా, నవలా రచయితగా, పరిశోధకుడుగా, సాహిత్య విమర్శకుడుగా, నాటకకర్తగా ఆరుద్ర ఒక శాశ్వతమైన ముద్రను వేశారు. ఆరుద్ర పూర్తి పేరు భాగవతుల సదాశివశకంకరశాస్త్రి. ఆయన కళాశాలలో చదువుకున్నది ఇంటర్మీడియట్ వరకు మాత్రమే. కానీ, ప్రత్యేక ఆసక్తితో తెలుగు, ఆంగ్ల సాహిత్యాన్ని ఔపోసనపట్టారు. జీవిక కోసం రకరకాల ఉద్యోగాలు చేసినా, మిలటరీలో కూడా పనిచేసి, చివరికి పాత్రికేయునిగా తన ప్రస్థానం కొనసాగి బహురూపాలుగా విస్తరించుకొంది. ఆయన 31 ఆగస్టు 1925 వ తేదీన జన్మించారు. త్వమేవాహమ్, సినీవాలి, కూనలమ్మపదాలు, ఇంటింటి పజ్యాలు, గాయాలు-గేయాలు, పైలా పచ్చీసు మొదలైన కవిత సంపుటాలు ప్రచురించారు. ఆరుద్ర తన జీవిత సహచరి రామలక్ష్మితో కలిసి ఏటికేడాది అనే కవితాసంపుటి ప్రచురించారు. ఆ తర్వాత ఆయన వందలాది సినీగీతాలు రచించారు. వాటిని ఆరుద్ర రామలక్ష్మిగారు సంపాదకులుగా ఐదుసంపుటాలుగా వచ్చాయి. నేను చెప్పానుగా, ఆరుద్ర కథలు, డిటెక్టివ్ కథలు, రాశారు. వీటితో పాటు పలకల వెండిగ్లాసు, రెండు రెళ్ళు ఆరు, ఆనకట్టమీద ఆత్మహత్య, గ్రామాయణం వంటి నవలల్ని రచించారు. పన్నెండు దృశ్యనాటికలు, తొమ్మిది శ్రవ్యనాటికలు, రాదారి బంగళా వంటి ప్రసిద్ధ నాటకాల్ని రచించారు. శ్రీకృష్ణదేవరాయలు అనే రూపవాణి నాటకాన్ని కూడా రచించారు.ఆంగ్ల, తమిళ భాషల నుండి కొన్ని అనువాదాలు కూడా చేశారు. 
    శ్రీవేంకటేశ్వరవిశ్వవిద్యాలయం. తెలుగు విశ్వవిద్యాలయం వారు గౌరవ డాక్టరేట్ ని ఇచ్చి ఆరుద్రను సత్కరించాయి. ఆంధ్ర విశ్వకళాపరిషత్ ‘కళాప్రపూర్ణ’తో గౌరవించింది. తెలుగు విశ్వవిద్యాలయం వారు ఉత్తమ సాహిత్య విమర్శకుడుగా బహుమతినిచ్చి సత్కరించింది. వీటితో పాటు రాముడుకి సీత ఏమవుతుంది. గుడిలో సెక్స్, గురజాడ గురుపీఠం, చదరంగం, దక్షిణవేదం, ప్రజాకళలూ- ప్రగతి వాదులూ, మహనీయులు, మనవేమన, వ్యాసపీఠం, సమగ్ర ఆంధ్ర సాహిత్యం వంటి అనేక పరిశోధన, సాహిత్య విమర్శ గ్రంథాలను రచించిన ఆరుద్ర 4 జూన్1998 న మరణించారు. 
    ఆయన రచించిన సమగ్ర ఆంధ్ర సాహిత్యానికి గాను నాటి ఉభయ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆరుద్రగారి కుటుంబానికి పెద్దమొత్తంలో డబ్బు ఇచ్చి, వాటిని తెలుగు అకాడమీ ప్రచురించింది.  ఉభయ రాష్ట్రాలలోను ఆగష్టు నుండి ఆరుద్ర శతజయంతి (1925-2025) వేడుకలు ప్రారంభమవుతున్న  సందర్భంగా ఆయనపై పరిశోధన చేసిన సెంట్రల్ యూనివర్సిటీ తెలుగుశాఖ పూర్వ శాఖాధ్యక్షలు ఆచార్య దార్ల వెంకటేశ్వరరావుగారితో ముఖాముఖీ.

నమస్కారం సర్, మీరు ఆరుద్ర మీద పరిశోధన చేశారు కదా. ఆరుద్ర శతజయంతి సందర్భంగా మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలని అనుకొంటున్నాను. ఆయన రచనలపైనే పరిశోధన చేయాలని మీరెందుకు అనుకున్నారు?

ఆచార్య దార్ల: నేను ఎం.ఫిల్., డా.యస్.టి. జ్ఞానానందకవిగారి ఆమ్రపాలి కావ్యంపై పూర్తి చేసి పిహెచ్డి కోసం సిద్ధమవుతున్నాను. మా సూపర్వైజర్ గారేమో ఎం.ఫిల్  చేసిన టాపిక్ నే పొడిగించి, అంటే డా.యస్.టి. జ్ఞానానందకవి గారి అన్ని రచనలపైనే పరిశోధన చేయమని అంటున్నారు. అప్పటికే ఆయనపై పరిశోధనలు జరుగుతున్నాయి. నా దృష్టిలో మరలా ఆయనపై డాక్టరేట్ చేసేటంతటి సాహిత్యం లేదనిపించింది. ఈ పరిస్థితుల్లో మాకు పాఠాలు చెప్పిన, నాకిష్టమైన గురువుల్లో ఒకరైన ఆచార్య కే.కే. రంగనాథచార్యులు గారి దగ్గరికి వెళ్లి, నా భవిష్యత్తుకు సంబంధించి ఎలాంటి టాపిక్ తీసుకుంటే బాగుంటుందో చెప్పమని సలహా అడిగాను. నేను అకాడమిక్ రంగంలో స్థిరపడాలనే నా లక్ష్యాన్ని చెప్పడంతో ఆయన నన్ను ఆరుద్ర పై పరిశోధన చేస్తే బాగుంటుందని చెప్పారు. అప్పుడు కవుల చరిత్రలు, సాహిత్య చరిత్రలు అన్నీ చదివే అవకాశం ఉంటుందని, అది భవిష్యత్తులో విద్యాబోధనకు ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. ఆ విధంగా ఆరుద్ర రచనలపై, ప్రత్యేకించి సమగ్ర ఆంధ్ర సాహిత్యం, ఆయన పరిశోధనలపై ‘ పరిశోధకుడిగా  ఆరుద్ర’ అనే అంశంపై నా పరిశోధన దృష్టిని కేంద్రీకరించాను. ఆరుద్ర గారి ‘గురజాడ గురుపీఠం’ అనే గ్రంథానికి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారు ఉత్తమ విమర్శకుడు పురస్కారాన్ని ఇచ్చారు.  సమగ్ర ఆంధ్ర సాహిత్యంలో కూడా పరిశోధన, విమర్శ మిళితమై ఉన్నాయి. ఆరుద్ర అనగానే సమగ్ర ఆంధ్ర సాహిత్యమే ప్రధానంగా చెప్పుకోవాలి. కానీ దానిపై పరిశోధన నాకు తెలిసినంతవరకు జరగలేదు. అందువల్ల దానిపై పరిశోధన చేయాలనుకున్నాను.

అంతకుముందు ఆరుద్ర పై ఎవరూ పరిశోధన చేయలేదా చెప్పండి? 

నాకు తెలిసి కొన్ని పరిశోధనలు జరిగాయి. కె.చంద్రారెడ్డి గారు ‘ఆరుద్ర కవితానుశీలన’(1979), కె. భీమేశ్వరరావుగారు ‘ఆరుద్ర కవిత్వంలో అన్యదేశ్యాల పరిశీలన’(1983), వి. రామిరెడ్డిగారు ‘ఆరుద్ర త్వమేవాహమ్ - పరిశీలన’(1987), ఎం. సుబ్బారావుగారు ‘త్వమేవాహమ్ పరిశీలన’ (1989), ఎల్. సంగయ్యగారు ‘ఆరుద్ర జీవితం - రచనలు: సమగ్ర పరిశీలన’ (1991),  ఆర్. నరసింహారావుగారు ‘అభ్యుదయ కవిత్వంలో ఆరుద్రత’ (1992),  కానీ, ఆరుద్ర సాహిత్య విమర్శ పరిశోధనలపై ప్రత్యేకమైన పరిశోధన జరగలేదు. 

ఆచార్య మేడిపల్లి రవికుమార్ గారు సాహిత్య అకాడమీ వారి భారతీయ సాహిత్య నిర్మాతలు సిరీస్ లో భాగంగా ఆరుద్రపై ఒక మంచి పుస్తకం రాశారు. 

మీరు ఆరుద్ర పై ఏ సంవత్సరంలో పరిశోధన మొదలుపెట్టి, ఎప్పటికి పూర్తి చేశారు? మీరు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో  అసిస్టెంట్ ప్రొఫెసర్ గా ఎప్పుడు చేరారు?

నా ఎం.ఫిల్ 1997లో పూర్తి చేశాను. 1998లో పిహెచ్.డి.లో చేరాను. ఆరుద్ర గారు కూడా 4 జూన్ 1998లో మరణించారు. ఆ సందర్భంగానే చాలా మంది  సమగ్ర ఆంధ్ర సాహిత్యంపై ఆరుద్ర పరిశోధన చేశారని ప్రస్తావించడమే తప్ప, ఎలాంటి పరిశోధన చేశారనేది చెప్పేవారు కాదు. ఆ విషయాలు కూడా ఆచార్య కే.కే. రంగనాథచార్యులు గారితో చర్చించినప్పుడు ఒక నవ్వు నవ్వి అందుకే ‘నువ్వు పరిశోధన చేసి చెప్పు’ అన్నారు. అలా నా పరిశోధనను ప్రారంభించి జూలై, 2003 నాటికి పూర్తి చేశాను. నా పిహెచ్.డి. పూర్తి కాకముందే అంటే 2001లో డిగ్రీ కళాశాలలో తెలుగు ఉపన్యాసకుడుగా ఉద్యోగం వచ్చింది. రెండేళ్లపాటు రెగ్యులర్ గా రీసెర్చ్ మెథడాలజీతో పార్ట్ -1 పూర్తి చేస్తే, ఆ లోగా పర్మినెంట్ ప్రాతిపదికన ఉద్యోగం వస్తే, పిహెచ్.డి ని పార్ట్ టైమ్ గా మార్చుకొనే సౌలభ్యం ఉంది. దాని వల్ల ఆ ఉద్యోగంలో చేరి, ఆ బోధనానుభవం, అధ్యయన అనుభవాలతో 2003లో నా సిద్థాంత గ్రంథాన్ని పూర్తి చేశాను. అది అయిన వెంటనే సెంట్రల్ యూనివర్సిటీ లో నోటిఫికేషన్ రావడం, అసిస్టెంట్ ప్రొఫెసర్ గా సెలెక్ట్ కావడంతో 2004 లో యూనివర్సిటీ లో చేరాను. 

కవిత్వం, సినిమా పాటలు, నాటకాలు ఎన్నింటిలోనో బిజీ బిజీగా ఉండే ఆరుద్ర పరిశోధనలోకి ఎలా వచ్చారు? 

 నిజానికి ఆరుద్ర గారు ఒక సినిమా కథ డిస్కషన్ లో భాగంగా పరిశోధనలోకి దిగారు. ఆయనకు కవి తిక్కన, ఖడ్గ తిక్కన ఒక్కడా? వేర్వేరా?  అనే సందేహం వచ్చింది. దాన్ని ఆ సందేహాన్ని తీర్చుకోవడం కోసం అన్వేషణ మొదలైంది. ఆ విషయాన్ని ఆయన తన వ్యాసపీఠం అనే గ్రంథంలో స్పష్టంగా చెప్పుకున్నారు. అప్పటికి (1948) ఆరుద్ర కు తెలుగు సాహిత్య చరిత్రతోనే పరిచయం లేదట. దీన్ని అన్వేషించడం కోసం కొన్ని గ్రంథాలను అధ్యయనం చేశాడు. తిక్కన అనే పేరుతో సంబంధం ఉన్న కొన్ని పుస్తకాలను ఆరుద్ర చదివాడు.  కేతన తన దశకుమార చరిత్రను తిక్కనకు అంకితం ఇచ్చాడు. కాకతీయ రాజుల చరిత్రను ముఖ్యంగా ప్రతాప రుద్రుని చరిత్రను తెలియజేసే కాసె సర్వప్ప రచించిన శ్రీ సిద్దేశ్వర చరిత్ర అనే ద్విపదకావ్యం, తిక్కన రచించిన నిర్వచనం రామాయణం వంటి రచనలను పరిశీలించాడు. వీటితోపాటు కాటమరాజు కథలో తిక్కన ప్రస్తావన ఒకటి వస్తుంది. కనుక వాటిని కూడా అధ్యయనం చేశాడు. కాటమరాజు తో జరిగిన యుద్ధంలో తిక్కన మరణిస్తాడు అతన్నే ఖడ్గ తిక్కన, రణతిక్కన అని పిలుస్తారు. వీరిద్దరూ ఒక్కరా, వేర్వేరా అనేది తెలుసుకోవడం కోసం మల్లంపల్లి సోమశేఖర శర్మ, వేటూరి ప్రభాకర శాస్త్రి తదితరుల పరిశోధనా అంశాలను కూడా అధ్యయనం చేశారు. మొత్తం మీద ఇద్దరు వేర్వేరని అయితే ఇద్దరికీ బంధుత్వం ఉందని తేల్చాడు ఆరుద్ర. వీటన్నింటినీ పరిశీలించిన తర్వాత ఆరుద్ర ఒక వంశ వృక్షాన్ని కూడా తయారు చేశాడు. కాటమరామరాజు కథ అనే పేరుతో ఒక స్టేజి నాటకాన్ని కూడా రచించారు. 

   సారకవితాభిరాముడు, గుంటూరు విభుడు అయిన కొట్టరపు భాస్కరమంత్రికి నలుగురు కొడుకులు. మూడవ కుమారుడైన సిద్ధనమంత్రికి ఏడుగురు కొడుకులు. వీళ్ళలో పెద్దవాడు ఖడ్గతిక్కన. భాస్కరమంత్రి నాలుగో కుమారుడైన కొమ్మన దండ నాథునికి ఒక్కడే కొడుకు. అతడే కవితిక్కన అని ఆరుద్ర నిరూపించి, సాహిత్య పరిశోధన వడ్డించిన విస్తరికాదన్నారు. ఆరుద్ర అలా పరిశోధనలోకి ప్రవేశించారు.

గురజాడ గురుపీఠం  గ్రంథాన్ని ఆధారం చేసుకుని ఆరుద్రకు ఉత్తమ విమర్శకుడు పురస్కారం ఇచ్చారు కదా. ఆ గ్రంథం ప్రత్యేకత ఏమిటి? 

ఔను.  ప్రధానంగా ఈ గ్రంథాన్ని ఆధారంగా చేసుకునే ఆరుద్ర పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారు ఉత్తమ విమర్శకులు పురస్కారాన్ని ఇచ్చి గౌరవించారు. గురజాడ చేసిన భాషా సాహిత్యాల కృషిని, అభ్యుదయ దృక్పథాన్ని ఆ గ్రంథంలో ఆరుద్ర ఎంతో శాస్త్రీయంగా విశ్లేషించారు. గురజాడ తన కవిత్వంలో చేసిన ప్రయోగాలు, ఆ ప్రయోగాల్లోని సామాజిక అభ్యుదయ ఆకాంక్ష, ఆయన ప్రదర్శించిన వ్యావహారిక భాషా దృక్పథం, కన్యాశుల్కంలోని పాత్రల విశిష్టత వంటివన్నీ అనేక మంది సాహితీవేత్తలతో, అనేక గ్రంథాలతో పోల్చి చెప్పడం ఆ గ్రంథంలో కనిపించి ఒక విశిష్టత. 

     గురజాడ జీవిత దృక్పథం, రచనల పరిణామం ఆరుద్ర ‘గురజాడ గురుపీఠం’ లోనూ, ‘సమగ్ర ఆంధ్ర సాహిత్యం’ (11వ సంపుటి) లోనూ, ప్రత్యేక సంచికల్లో, పత్రికల్లో, వివిధ పుస్తకాలకు రాసిన ‘ముందుమాట’ ల్లోనూ ప్రకటించారు. అయితే, వీటన్నింటిలో కంటే, ‘గురజాడ గురుపీఠం’ గ్రంథంలో గల వ్యాసాల్లోనే ఆరుద్ర విమర్శనా దృక్పథం బాగా వ్యక్తమవుతుంది. గురజాడ కన్యాశుల్కం రచన చేయడంలో గానీ పూర్ణమ్మలో బాల్యవివాహాల సమస్యల్ని కరుణ రస ప్రధానం చేయడంలో గానీ, సోషల్ రిఫార్మ్, స్పోకెన్ తెలుగు అనే వాటినే మనసులో పెట్టుకున్నారని ఆరుద్ర చెప్పారు. 

  ఆయన అన్ని పుస్తకాల కంటే ఆ పుస్తకంలో  ఉత్తమ విమర్శకుడికి ఉండవలసిన లక్షణాలన్నీ ఆరుద్రలో చూడాలంటే ఆ పుస్తకం చూడాలి. మిగతా అన్ని రచనల్లోనూ విషయాన్ని సాగదీసి చెప్తారు. కానీ, ఈ గ్రంథంలో తాను చెప్పవలసిన అంశాలన్నీ సూటిగా చెప్పారు.  ‘వేమన్న వేదం’ లో ఆరుద్ర వ్యాఖ్యానం మార్క్సిస్టు విమర్శనా దృక్పథాన్ని కలిగి ఉందనే కంటే, ఆ దృక్పథానికి వీలయ్యే పద్యాలకే వ్యాఖ్యానాన్ని కొనసాగించారనడం సమంజసం. వేలకొలదీ ఉన్న వేమన పద్యాలన్నింటినీ వ్యాఖ్యానిస్తే, భిన్నదృక్పథాలు వెలువడవచ్చు. ఈ విషయంలో పరిశోధకులు వేమన పద్యాల గురించి ఎన్నో చర్చోపచర్చలు జరుపుతూనే ఉన్నారు. ఆరుద్ర తనది అభ్యుదయ దృక్పథమని చెప్పుకోవడమే కాకుండా, ఈ గ్రంథానికి “ఆముఖం’’ రాస్తూ ఆచార్య జి.వి. సుబ్రహ్మణ్యంగారు “వేమన కవిత అభ్యుదయ భావ ప్రచారానికి అభినవ సాధనంగా సమాదరింప బడుతున్నది. సామాజిక వ్యవస్థను సామ్యవాద దృక్పథంతో సమక్షించి సౌమ్యశీలంతో సత్యాన్ని విశ్వజనీనంగా ప్రతిపాదించగలిగిన ప్రతిభావంతులు’’ గా ఆరుద్రను ప్రశంసించారు.

గురజాడను కొంత మంది మార్క్సిస్టు అనీ, హేతువాది అనీ, నాస్తికుడు అనీ రకరకాలుగా వ్యాఖ్యానించారు. ఇలాంటి అభిప్రాయాల నేపథ్యంలో గురజాడను ఆరుద్ర ఎలా నిరూపించారు?

గురజాడను కొన్ని సందర్భాలలో అభ్యుదయ ఆకాంక్ష సామాజిక స్పృహ ఉన్న సంస్కరణ వాదిగా, మానవతావాదిగా ఆరుద్ర వ్యాఖ్యానించారు. కన్యాశుల్కం నాటకంలో ఆయన భాషా దృక్పథం ప్రజా దృక్పథమన్నారు. ఆ నాటకంలో సౌజన్యరావు పంతులు మధురవాణికి భగవద్గీత ఇవ్వడాన్ని ఆధారంగా చేసుకుని గురజాడను పూర్తిగా మాక్సిస్టు భావజాలం ఉన్న వ్యక్తిగా చెప్పలేమని అన్నారు. ఈ ఆధారంతోపాటు పూర్ణమ్మ, కన్యక వంటి కావ్యాలను, గురజాడ లేఖలను కూడా పరిగణనలోకి తీసుకున్నారు.   గురజాడ మొత్తం సాహిత్యాన్ని మూల్యాంకన చేస్తూ అక్కడక్కడా కొన్ని మార్క్సిస్టు ధోరణులు కనిపిస్తున్నా, అప్పారావుగారు హేతువాదే గాని, నాస్తికులు కాదని కూడా ఆరుద్ర తన నిర్ణయాన్ని ప్రకటించారు. 

కవిగా, సినీరచయితగా ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్న సమయంలో ఆరుద్ర సమగ్ర ఆంధ్ర సాహిత్యం రాయాలనుకోవడానికి వెనుక గల కారణాలు ఏమిటి?

ఆరుద్ర మొదటి పాత్రికేయుడు. తర్వాతే ఆయన కవి, రచయిత, పరిశోధకుడు. కొంతమంది పాత్రికేయులకు సమాజంలో ఏం జరుగుతుందనే విషయాన్ని చెప్పడం మాత్రమే కాకుండా, తమ చరిత్రను, సంస్కృతిని, సాహిత్య స్థితిగతులను అందించాలనే తపన కూడా ఉంటుంది. తద్వారా సామాజిక మార్పుకి చాలామంది పాత్రికేయులు శక్తివంచన లేకుండా కృషి చేస్తారు. వార్తలకు మాత్రమే పరిమితం కాకుండా జీవవంతమైన సామాజిక నిర్మాణంలో భాగస్వాములు అవుతుంటారు. అదే ఆరుద్రను అనేక పత్రికల్లో రకరకాల శీర్షికలు నిర్వహించేలా చేసింది. అలా ఆయన సినిమాలకే అంకితం కావచ్చు. కానీ, ఆయన ఆత్మ అంతా సాహిత్యంతోనే ముడిపడి ఉంది. ఆ సమయంలో అంటే 1965 ఏప్రిల్ లో మొదటి సంపుటి వెలువరించేటప్పుడు తమ లక్ష్యాలను స్పష్టంగా ప్రకటించారు. నెల నెలా సమగ్ర ఆంధ్ర సాహిత్యం 12 పుస్తకాలుగా విడుదల చేయాలని భావించారు. 

ఆరుద్ర సమగ్ర ఆంధ్ర సాహిత్యంలో రాజులు పోషకుల ఆధారంగా యుగ విభజన చేయడానికి గల కారణాలు ఏమిటి?

సమగ్ర ఆంధ్ర సాహిత్యంలో రాజుల, పోషకులను ఆధారంగా యుగ విభజన చేసినా, చరిత్ర, కాలనిర్ణయాలను స్పష్టంగా విశదీకరించే ఆలోచన ఆరుద్ర సత్యాన్యేషణను ప్రతిబింబిస్తుంది. వివిధ కాలాల్లో రాజులు, పోషకులు కవుల్ని పోషించారనీ, కవులు, రాజుల పోషణకు అర్రులు చాచారనీ, ఆ కార్యకారణ సంబంధాల్లో ఉన్న రాజకీయ, సామాజిక, ఆర్థిక పరిస్థితుల్ని గతి తార్కిక ‘చారిత్రక’ భౌతిక విశ్లేషణలతో సత్యాన్యేషణతోనే ఆరుద్ర ఆ యుగవిభజనను ఎంపికచేసుకున్నారు. కేవలం పోషకుల ఆధారంగానే యుగవిభజన చేయలేదు. ప్రక్రియల వారీగా కూడా విభజన చేశారు. ఆధునిక సాహిత్యాన్ని అంతా అలాగే విభజించారు. ‘కవిత్వవేది’ కల్లూరి వేంకట నారాయణరావు గారి ‘ఆంధ్రవాజ్మయ చరిత్ర సంగ్రహం’లోని  యుగవిభజనకు సురవరం ప్రతాపరెడ్డిగారి ‘ఆంధ్రుల సాంఘిక చరిత్ర’ ప్రభావంతోను ఆరుద్ర చేసిన యుగవిభజన ఉంటుంది. చారిత్రక పరిస్థితుల్ని ఆధారంగా చేసుకొని ఒక క్రమపద్ధతిలో అధ్యయనం చేయడానికి బాగుంటుందని ఆరుద్రదీన్ని ఎన్నుకొని ఉంటారు.

సమగ్ర ఆంధ్ర సాహిత్యంలో ఎంతమంది కవుల్ని, వారి రచనల్ని ఆధారంగా చేసుకుని సమగ్ర ఆంధ్ర సాహిత్యాన్ని రచించారో ఒక అంచనాగా చెప్తారా?

ఆరుద్ర తన సమగ్ర ఆంధ్ర సాహిత్యంలో దాదాపు వెయ్యి మందికి పైగానే తెలుగు కవుల్ని వారి రచనల్ని విశ్లేషణ చేస్తూ తనదైన శైలిలో విమర్శనాత్మక, పరిశోధనాత్మక దృక్పథాల్ని తెలియజేశారు. ఆ కవులను మాత్రమే కాకుండా గ్రంథాలను వివరించేటప్పుడు మరి కొంతమంది రచనలు కూడా పేర్కొన్నారు. వాటిని తొలి, మలి ముద్రణలలో చేసిన మార్పులు చేర్పులను, ఆ కవుల వివరాలను ఒక పట్టికగా నా డాక్టరేట్ సిద్ధాంత గ్రంథం అనుబంధంలో వేశాను. అయితే, ఇంచుమించు అదే పద్ధతిలో తెలుగు అకాడమీ వారు కూడా ఇటీవల ఆరుద్ర పేర్కొన్న కవులు కాలాలను తెలుపుతూ ఒక పుస్తకంగా  ప్రచురించారు. 

తనకు బంధుత్వం ఉన్నప్పటికీ  శ్రీశ్రీ పై ఆరుద్ర వైయక్తికమైన విమర్శ చేశాడని అంటారు. ఆ విషయాలేమైన సమగ్ర ఆంధ్ర సాహిత్యంలో గమనించారా ? 

తన సాహిత్య అభిలాషకు కారణంగా చెప్పిన అనేకమంది సాహితీవేత్తలలో శ్రీశ్రీ కూడా ఒకరు. స్వయంగా ఆయనకు బంధువు అవుతాడు కూడా.  అంటే శ్రీశ్రీకి మేనల్లుడు ఆరుద్ర.  అబ్బూరి రామకృష్ణారావు, పింగళి లక్ష్మీకాంతం, నారాయణ బాబు, రావిశాస్త్రి, చాసో, రోణంకి అప్పలస్వామి మొదలైన వారితో ఆరుద్ర నిరంతరం కలుస్తుండేవాడు. శ్రీశ్రీ, పఠాభి, కొడవటిగంటి కుటుంబరావు, సెట్టి ఈశ్వరరావు, కోగంటి గోపాలకృష్ణయ్య మొదలైన వారి వల్ల ఆయనకు అభ్యుదయ భావజాలం అలవడింది. ఆరుద్ర  నిరుద్యోగ ఉన్నప్పుడు శ్రీశ్రీ దగ్గరకు చేరుకొని ఉద్యోగ ప్రయత్నాలు కూడా చేశాడు. క్రమేపీ శ్రీశ్రీకి ఆరుద్రకు ఏవో వ్యక్తిగతమైన వివాదాలు వచ్చాయి. వాటికి నా సిద్ధాంత గ్రంథంలో ఎక్కువ ప్రాధాన్యాన్ని ఇవ్వలేదు.  సమగ్ర సాహిత్యంలో ఆయన రాసిన అంశాలకు మాత్రం పరిమితం అయ్యాను.
 ‘రెండు శ్రీలు ధరించి
 రెండు పెగ్స్ బిగించి 
 వెలుగు శబ్ద విరించి 
 ఓకూనలమ్మ’’ అని తన కూనలమ్మ పదాల్లో శ్రీశ్రీని అభివర్ణించారు ఆరుద్ర. 

తనతో సంబంధబాంధవ్యాలు సక్రమంగా కొనసాగినంత కాలమూ ఒక పద్ధతిలోనూ, తర్వాత మరొక రకంగానూ విమర్శను కొనసాగించడం ఒక విమర్శకుని దృక్పథాన్ని పట్టి చూసినప్పుడు సద్విమర్శను కొనసాగించలేదని నిరూపితం కావడం తప్పుదు. ఆరుద్రలో శ్రీశ్రీ పట్ల ఇలాంటి విమర్శనా దృక్పథం కనిపిస్తుంది. సమగ్రాంధ్ర సాహిత్యంలో కొన్ని విషయాల్లో ఆరుద్ర వ్యాఖ్యానాలు ఈ విషయాన్ని నిరూపిస్తున్నాయి. ఆరుద్ర, శ్రీశ్రీపై వ్యక్తీకరించిన కొన్ని అభిప్రాయాల్ని యధాతథంగా  పేర్కొనడం ద్వారా ఆరుద్ర దక్పథం స్పష్టమవుతుంది. "శ్రీశ్రీ ఆరవింద ఘోష్‌ను ఎప్పుడూ అరవింద ఘూస్టు అని పేర్కొనేవాడు'' (స. ఆ. సా. 13 సం. పు. 96). "మహాప్రస్థానం గీతానికి నజ్రల్‌ ఇస్లామ్‌ కవితా, హరీన్‌ రాసిన 'షురూ హువా హై జంగ్‌' అనే పాటా, శిష్ట్లా రచించిన 'మారో - మారో - మారో' అనే పాటా ప్రోద్బలాలని, అయినీత తన గీతరచనకు ఉత్తేజితమచ్చినవేవో 'చిరకాలం' దాకా శ్రీశ్రీ చెప్పలేదు'' (స. ఆం. సా., 13 సం. పు. 146). దీన్ని ఇటీవల పునర్ముద్రణ చేసిన తెలుగు అకాడమీ (నాల్గవ సంపుటి పు. 764) కూడా మార్చకుండానే ప్రచురించింది."శ్రీశ్రీ సాహిత్య జీవితంలో పరిస్థితులకు వ్యక్తిగత జీవితంలో పరిస్థితులకు సమన్వయం సైకాలజిస్టులే చేయగల ప్రయత్నం" (స. ఆం. సా. 13వ సం. పు. 264).

ఇవన్నీ సమగ్ర ఆంధ్ర సాహిత్య 13వ సంపుటిలో శ్రీశ్రీ పట్ల ఆరుద్ర చేసిన వ్యాఖ్యలు. ఆరుద్ర తన 'గురజాడ గురుపీఠం'లో 'సంకల్పం' శీర్షికతో ముందు మాట రాసుకొంటూ... "జాఢ్యం ముదిరినవాడు తానే ఆద్యుడనుకొంటాడు. 1972లో నేనూ ఈ పాతికేళ్ల సాహిత్యం అనే వ్యాసంలో ఇతగాడు 1939 దాకా తెలుగు సాహిత్యం నన్ను నడపించింది. ఆ తర్వాత నుంచీ దాన్ని నేను నడిపిస్తున్నానని నిస్సార స్వోత్కర్ష చేసుకున్నాడు. బండిచక్రం మీదనున్న ఈగ ఆ బండిని తానే కదిలిస్తాననుకొంటుంది. చారిత్రక, భౌతికవాది ఎవరూ యిలా అనుకోరు. 1930 నుంచీ తెలుగు సాహిత్య చరిత్ర శ్రీశ్రీ స్వీయ చరిత్ర అని కూడా ఆ ప్రబుద్ధుడు నొక్కి వక్కాణించాడు" అని అన్నారు.

అభ్యుదయవాదిగా భావించే ఆరుద్ర సమగ్ర ఆంధ్ర సాహిత్యంలో గానీ, విడిగా గానీ స్త్రీవాద, దళిత, ప్రాంతీయ అస్తిత్వవాద ఉద్యమాల గురించి ఏమైనా రాశారా?

ఆరుద్ర తన సమగ్ర ఆంధ్ర సాహిత్యం 13వ సంపుటి పూర్తి చేసే నాటికి తెలుగు సాహిత్యం లో స్త్రీవాద, దళిత ఉద్యమాలు ఇంచుమించు ప్రాచుర్యంలోకి వచ్చేశాయనే చెప్పాలి. ఆ ప్రభావం వల్లనే ఇండియా టుడే వార్షిక సాహిత్య సంచిక(1995)లో ‘మనిషి- ఆడమనిషి’ (ఆధునిక మహాకావ్యం) అనే పేరుతో కొన్ని భాగాల్ని ‘స్త్రీ పురాణం’ పేర్కొన్నారు. అయినా గాని దీన్ని ఒక స్త్రీవాద కావ్యంగా పూర్తి చేయలేదు. ఇది అసంపూర్ణంగానే మిగిలిపోయింది. గుర్రం జాషువాని కూడా ఒక కవికోకిలగా చూశారే తప్ప దళితుల ఆర్తిని శక్తివంతంగా వ్యక్తీకరించిన దళిత ప్రాతినిథ్య కవిగా చూడలేదు. అనేక మంచి దళిత కవులను ప్రస్తావించలేదు. తెలంగాణ ప్రాంతానికి చెందిన కవులను ఇతర సాహిత్య చరిత్రలతో పోలిస్తే అనేకమందిని ఆరుద్ర తన గ్రంథంలో పేర్కొన్నారు. 

      కవుల చరిత్ర, సాహిత్య చరిత్రలను ఎవరు రాసినప్పటికీ అందరినీ లేదా అన్ని ఉద్యమాలను రాయలేకపోవచ్చు. అందుకనే ముందుగా ఆ జిల్లాకు చెందిన కవుల, సాహిత్య చరిత్రలు వెలువడాలి. అటువంటి పరిశోధనలు ఈ మధ్యకాలంలో మొదలయ్యాయి. కవుల చరిత్ర, సాహిత్య చరిత్ర రచన అనేది నిరంతరం కొనసాగే ఒక ప్రక్రియ. ఆచార్య ఎస్వీ రామారావు, డాక్టర్ ద్వా.నా.శాస్త్రి, ఆచార్య వెలమల సిమ్మన్నగార్ల రచించిన సాహిత్య చరిత్రలు అనేకమంది కవులను,  ఉద్యమాలను ప్రస్తావించాయి. 

మన తెలుగులో కవుల చరిత్రలు, సాహిత్య చరిత్రలు, వికాస చరిత్రలు అనే సంప్రదాయం ఉంది కదా!  ఆరుద్ర సమగ్ర ఆంధ్ర సాహిత్యం వీటిలో దేనికి చెందుతుంది? 

మూడింటికీ చెందుతుంది. కానీ, ఎక్కువగా  సాహిత్య చరిత్ర, వికాస చరిత్రల స్వభావాన్ని కలిగి ఉంటుంది. కవుల పుట్టుపూర్వోత్తరాలు, రచనల వివరాలు, కర్తృత్వ వివాదాలు చర్చించేటప్పుడు కవుల చరిత్రలు చదువుతున్నట్లు అనిపిస్తుంది. కానీ రచనలను వివరించేటప్పుడు ఆశ్వాసాంత కథలను, వస్తు వైవిధ్యాన్ని ఇతర కావ్యాలతో తులనాత్మకంగా పరిశీలించడం కావ్య లేదా రచనల మూలాల్ని వివరించడం, కవి లేదా రచయిత దృక్పథాల్ని అంచనా వేయడం వంటివాటిని వివరించేటప్పుడు సాహిత్య చరిత్రలా అనిపిస్తుంది. కవి ప్రభావాలను, యుగ విభజనలను పక్రియా పరిణామ స్థితి గతులను వివరించేటప్పుడు వికాస చరిత్రలా స్ఫురిస్తుంది. కానీ, మూడింటిలో దేనిగా నిర్ణయించాలో చెప్పమంటే మాత్రం సాహిత్య చరిత్ర వికాసచరిత్రల సమ్మిళిత రూపంగా ఆరుద్ర గారి సమగ్ర ఆంధ్ర సాహిత్యాన్ని వ్యాఖ్యానించవచ్చు. 

ఆరుద్ర సమగ్ర ఆంధ్ర సాహిత్యంలోను, ఇతర రచనల్లోను, భాషా శైలిలో కనిపించే ప్రత్యేకతల్ని తెలపండి?

ఏ విషయాన్నైనా సృజనాత్మకంగా చెప్పడం ఆయన శైలిలో కనిపించే ప్రత్యేకతే! నిజానికి సృజనాత్మక సాహిత్యం -  కవిత, కథ, నవల, నాటకం వంటి వాటిలో సృజనాత్మక ఉండాలి. దానితో పాటు భావుకత, అభివ్యక్తి వైవిధ్యం రచనను ఆసక్తిగా చదివించేలా చేస్తాయి. జ్ఞానమే ప్రధానమైన విమర్శ, పరిశోధన వ్యాసాలలో సృజనాత్మక శైలి కంటే విషయాన్ని సూటిగా, స్పష్టంగా అర్ధమయ్యేలా చెప్పాలి. కానీ, ఆరుద్ర విమర్శ, పరిశోధనల్లో కూడా సృజనాత్మకతను  ప్రదర్శించేవారు. దానివల్ల రెండు మూడు సార్లు చదివితే తప్ప ఆయన చెప్పే విషయం స్పష్టంగా బోధపడటం సాధ్యం కాదు. 

తెలుగులో వచ్చిన సాహిత్య చరిత్రల్లో మీకు నచ్చిన రచన ఏది?

తొలితరంలో పింగళి లక్ష్మీకాంతంగారి ‘తెలుగు సాహిత్య చరిత్ర’, ‘కవిత్వవేది’ కె.వి. నారాయణరావు ‘ఆంధ్ర వాజ్మయ చరిత్ర సంగ్రహము’ చాలా బాగుంటాయి. ఆ తర్వాత ఆధునిక కాలంలో సుంకిరెడ్డి నారాయణరెడ్డిగారి ‘ముంగిలి’ (తెలంగాణ ప్రాచీన సాహిత్య చరిత్ర) ఆ స్వరూప స్వభావాలను విస్మరించకుండా, విషయాన్ని సూటిగా, స్పష్టంగా చెప్పిన రచనలు. వాటితో పాటు కె.కె. రంగనాథాచార్యులు గారి ‘తెలుగు సాహిత్యం - చారిత్రక భూమిక’, ‘తెలుగు సాహిత్యంలో మరో చూపు’, జి.వి. సుబ్రహ్మణ్యంగారి ‘సాహిత్య చరిత్రలో చర్చనీయాంశాలు’, పిల్లి జాన్సన్ గారి ‘దళిత సాహిత్య చరిత్ర’ సంగిశెట్టి శ్రీనివాస్ ‘తెలంగాణ దళితోద్యమ చరిత్ర’ మొదలైనవి కూడా మౌలిక రచనలే. 

పాత్రికేయునిగా, కవిగా, సినీగేయ రచయితగా, కథకుడిగా, నవలా రచయితగా, విమర్శకుడిగా, పరిశోధకుడిగా, చరిత్రకారుడిగా ఆరుద్ర దేనిలో సక్సెస్ అయ్యారని భావిస్తారు?

 వీటిలో ఆయన కొన్ని జీవిక కోసం చేసినవి. మరికొన్ని తన భావోద్వేగాల్ని సామాజిక స్పృహను వ్యక్తీకరించేవి. ఇంకొన్ని తనకు వచ్చిన అవకాశాల్ని వినియోగించుకోవడానికి విమర్శ, పరిశోధన సాహిత్యచరిత్ర పరిశోధన తన జ్ఞానాన్వేషణతో జ్ఞానతృష్ణను తీర్చుకోవడంలో భాగంగా చూడాలి. ఇవన్నీ ఆ కాలం, ఆ వయస్సు దృష్టితో చూసినప్పుడు అన్నీంటిలోను ఆయన సక్సెస్ అయ్యినట్లే. అయినప్పటికీ సినీవాలి, త్వమేవాహం, ఇంటింటి పద్యాలు, ఆయన్ని కవిగా గుర్తించేలా చేశాయి. కొన్ని సినీగీతాలు ఆయణ్ణి చలనచిత్ర రంగంతో విడదీయరాని బంధాన్ని కలిగించాయి. వీటన్నింటినీ కంటే గురజాడ గురుపీఠం ఆయణ్ణి విమర్శకుడిగా రాముడికి సీత ఏమవుతుంది, సమగ్ర ఆంధ్ర సాహిత్యం వంటి గ్రంథాలు ఆయణ్ణి పరిశోధకులు చిత్రకారుడిగా ఒక విశిష్ట స్థానంలో నిలబెట్టాయి. 

ఆరుద్ర పై పరిశోధన చేసి డాక్టరేట్ పొందిన సిద్ధాంత గ్రంథాన్ని ప్రచురించారా ?  

 ప్రస్తుతం పిహెచ్. డి సిద్ధాంత గ్రంథాల్ని  ప్రత్యేకించి ప్రచురించాల్సిన పని లేదు. అవన్నీ యూ.జి.సి శోద్ గంగా అనే వెబ్ సైట్ ద్వారా పబ్లిక్ డొమైన్ లో పెడుతుంది. అంతేకాకుండా ఆయా యూనివర్సిటీలు కూడా వెబ్ సైట్ లో అందుబాటులో పెడతారు.  నా గ్రంథం కూడా అలా  అందుబాటులో ఉంది. నిజానికి ఆ సిద్ధాంత గ్రంథం కొన్ని పరిశోధనా పద్ధతులతో ఆ నియమాల్ని పాటిస్తూ రాయాల్సి ఉంటుంది. దాన్నే మళ్ళీ ప్రచురించే కంటే ఆ గ్రంథంతో పాటు మరికొన్ని అంశాల్ని అందించగలిగే అడ్వాన్స్ రీసెర్చ్ తో కూడిన గ్రంథాల్ని ప్రచురిస్తే బాగుంటుంది. అంతర్జాలంలో నా సిద్ధాంత గ్రంథం ప్రజలకు అందుబాటులోనే ఉండడం వల్ల మళ్ళీ ప్రచురించలేదు. ఎవరైనా పబ్లిషర్ ముందుకొచ్చి ప్రచురిస్తానంటే ఇవ్వడానికి నాకు అభ్యుంతరం లేదు. 

తెలుగు భాషా సాహిత్య పరిశోధనల్లో క్రమేపీ ప్రమాణాలు తగ్గిపోతున్నాయనే అభిప్రాయం తరచుగా వినిపిస్తోంది. దీనిపై మీ అభిప్రాయం ? 

ఇటువంటి అభిప్రాయాలు పరిశోధనలు మొదలైన నాటి నుండి నేటి వరకు వస్తూనే ఉన్నాయి. నిజానికి యూనివర్సిటీ స్థాయిలో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగం పొందడానికి పిహెచ్.డి (డాక్టరేట్) ఉండాలనే నియమం సరైనది కాదు. పరిశోధన చేయడానికి ఆ విధానాల్ని, పద్ధతుల్ని అవగాహన చేసుకోవడానికి ప్రత్యేక కోర్సు ఉత్తీర్ణులై ఉండాలని పెట్టాలి. దీనికి కారణం అత్యధిక శాతం పరిశోధకులు ఒకవైపు ఉద్యోగం కోసం అన్వేషణలో ఉంటారు. అందువల్ల ఆ పోటీ పరీక్షలకు సిద్ధమవ్వాలి. మరో వైపు సిద్ధాంత గ్రంథాలను సకాలంలో పూర్తి చేయాలి. ఆ గ్రంథాన్ని రాసే నైపుణ్యం ఆ సిద్ధాంతాల అవగాహన ఆ వయసులో ఉన్నవారికి బోధనా అనుభవం, పరిశోధన అనుభవం లేని వాళ్ళకి సరిపోవు. అందువల్ల డాక్టరేట్ తో సంబంధం లేకుండా పి.జి తరువాత ఒక రీసెర్చ్ మెథడాలజీ పూర్తి చేసిన వారికి అవకాశం కల్పించాలి. అప్పుడు ఇంక్రీమెంట్లు, ప్రమోషన్లో వారు చేసే పరిశోధనలను ఆధారంగా ఇవ్వాలి. అప్పుడు వారికి ఆ రంగంలో అనుభవం ఉంటుంది. పరిశోధన ప్రమాణాలు పడిపోతున్నాయనే అభిప్రాయాలు కూడా తగ్గుముఖంపడతాయి. 


మరి అలా అయితే, విశ్వ విద్యాలయాల్లో అధ్యాపకులు కేవలం బోధనకే పరిమితం అవ్వాలా ? అప్పుడు డిగ్రీ కళాశాల అధ్యాపకులకు, విశ్వవిద్యాలయ అధ్యాపకులకు తేడా ఏమీ అవసరం లేదా?

విశ్వవిద్యాలయంలో చేరిన వాళ్ళకు కూడా కొన్నాళ్ళ పాటు అధ్యయనం, అధ్యాపనమే ప్రధానం అవుతుంది. అవి చేస్తూనే పరిశోధన పత్రాలు రాయాలి.అందులో నిష్ణాతులైన వారే పరిశోధనలకు, పర్యవేక్షణకు అర్హత అవుతారు.  వారికే ప్రమోషన్లు, కీలకమైన పదవులు ఇవ్వాలి. ఇప్పుడు కూడా కొన్ని ప్రమోషన్లకు, కీలకమైన పదవులకు కొన్ని పరిశోధనా పత్రాలు రాయడంతో పాటు పర్యవేక్షణ అనుభవం ఉండడం వంటి వాటిని ప్రమాణాలుగా తీసుకుంటున్నారు. డిగ్రీ కళాశాలలో చేరినా, యూనివర్సిటీ గ్రాంట్స్ కమీషన్ వారి గుర్తింపు పొందిన నెట్, స్లెట్ వంటి పరీక్షలు ఉత్తీర్ణులైన వారికి యుజిసి శాలరీ, ఆ నియమాలే వర్తిస్తాయి. విశ్వవిద్యాలయంలో పనిచేసేవారికి కూడా ఆ శాలరీ స్లాబ్ వర్తించినా, టీచింగ్ అవర్స్ తక్కువగా ఉండి, రీసెర్చ్ అవర్స్ పెరుగుతాయి. ఇప్పుడు క్రమేపీ డాక్టరేట్ డిగ్రీతో పాటు కొన్ని నియమ, నిబంధనలు సరిపోతే వాళ్ళు కూడా రీసెర్చ్ గైడ్ గా వ్యవహరించే అవకాశాలు ఉన్నాయి. అయినప్పటికీ డాక్టరేట్ డిగ్రీ విషయంలో కొన్ని సంస్కరణలు రావాలి. అప్పుడు పరిశోధనల్లో ప్రమాణాలు పడిపోతున్నాయనే అభిప్రాయాలు క్రమేపీ తగ్గుతాయి.  
ఆరుద్ర సినీగేయాల పై మీ అభిప్రాయం? 

ఆరుద్ర సినీ గేయాల్లో కూడా అనేక అభ్యుదయ భావాలు ఉన్నాయి. అయితే అది నా పరిశోధన పరిధిలోకి రాదు. వాటిపై ప్రత్యేకంగా పరిశోధన చేయడానికి అవకాశం ఉంది.  యూనివర్సిటీలల్లో  తెలుగు సినీగేయ సాహిత్యం గురించి పరిశోధనలు చేశారు. అటువంటివారిలో ఆత్రేయ, శ్రీశ్రీ, ఘంటసాల, సి.నా.రె, శ్రీ వేటూరి సుందర రామమూర్తి, దాశరథి, సిరివెన్నెల సీతారామశాస్త్రి వంటి సినీ గేయాల్లోని భాషాశైలి, అభివ్యక్తి,కథా కథనం, ఆధ్యాత్మికత, భక్తి పాటలు, లాలి పాటలు, దేశభక్తి పాటలు, పిల్లల పాటలు, జానపద పాటలు, ఇలా  విభిన్న అంశాలపై పరిశోధనలు  చేశారు. కానీ ఆరుద్ర సినీ గేయ సాహిత్యం గురించి ప్రత్యేకంగా పరిశోధనలు చేసే అవకాశం ఉంది. ఈ విషయాలన్నింటినీ కె. రామలక్ష్మీ ‘ఆరుద్ర సినీ గీతాలు’ అనే సంకలనాల్ని ఐదింటికి తీసుకొచ్చారు. వీటిని విశాలాంధ్ర వారు పబ్లిష్ చేశారు. సినీ గీతాలు ఎవరు రాసినా, ఆ సినిమా సన్నివేశానికి అనుగుణంగా రాాయాలి. అలాంటి వారే ఆ సినీరంగంలో నిలబడగలుగుతారు. ఆ సినీ నిర్మాతలు, డైరెక్టర్లు, మ్యూజిక్ డైరెక్టర్లతో సర్ధుకుపోవాలి. వాళ్ళు చెప్పినట్లు రాయాలి. కాబట్టి సినీగీతాల ద్వారా వారి భావజాలాన్ని నిర్ణయించడం కుదురదు. ఆరుద్ర కూడా దీనికి అతీతుడు కాదనుకొంటాను. కాకపోతే, తన భావజాలాన్ని చెప్పగలిగే అవకాశం వచ్చినప్పుడు అభ్యుదయ భావజాలాన్ని పలికించిన అనేక గీతాలను రచించారు.
ఆరుద్ర పై భవిష్యత్తులో ఇంకా ఏ యే కోణంలో పరిశోధనలు చేసే అవకాశం ఉంది?

ఆయన సినీ గీతాలు మీద ప్రత్యేకించి పరిశోధన చేయవచ్చు. సమగ్ర ఆంధ్ర సాహిత్యంలో ఆరుద్ర ప్రతిపాదించిన కొన్ని ప్రతిపాదనలపై ప్రత్యేకంగా పరిశోధన చేయవచ్చు. తెలుగులో ప్రబంధాలు, తెలుగులో పురాణాలు, తెలుగులో కథా కావ్యాలు, అష్టదిగ్గజ కవులు, రాముడికి సీత ఏమవుతుంది అనే గ్రంథంలో ఆయన చేసిన ప్రతిపాదనలు, సంప్రదాయ నృత్యాలకు జానపద విజ్ఞానంలో మాతృకలు ఉన్నాయనీ, అవే భరతుని నాట్యశాస్త్రంలో కనిపిస్తున్నాయనీ చేసిన ప్రతిపాదనలు, తెలుగులో కథానిక, నవల, నాటకం మొదలైన ప్రక్రియలలో తొలి రచనగా దేన్ని గుర్తించాలనే అంశాలు ఇలా ఎన్నో సమగ్రహాంతర సాహిత్యం నుండి తీసుకొని భవిష్యత్తులో పరిశోధన చేయవచ్చు.

తెలుగు సాహిత్యాన్ని చదివేవారికి, పరిశోధనలు చేసేవారికి, ఆరుద్ర సమగ్ర ఆంధ్ర సాహిత్యం అధ్యయనం చేయడం వలన కలిగే ప్రయోజనాలు చెప్పండి?

సృజనాత్మక పరిశోధకుడిగా ఆరుద్ర తన సమగ్ర ఆంధ్ర సాహిత్యాన్ని రచించాడని చెప్పుకున్నాం. సాహిత్య చరిత్రలు అంటే కేవలం పండితులకే కాదు, అందరూ చదువుకోవచ్చనీ,  దాని ద్వారా తెలుగు సాహిత్యంలో గల వివిధ కోణాలను, ఆ భాషా సాహిత్యాలమాధుర్యాన్ని అనుభవించగలుగుతారు. కొరుకుడు పడని పద్యాలుగా ఉన్న అనేక కావ్యాల్లోని మూల విషయాలను సులభంగా అర్థం చేసుకోవడానికి సమగ్ర ఆంధ్ర సాహిత్యం దారి చూపిస్తుంది. పేరు వినడం తప్ప ఆ కావ్యంలో ఏముందో కనీసం తెలియని వారికి ఆ కావ్యంలో ఉన్న విషయాన్ని పరిచయం చేసుకోగలుగుతారు. మూల గ్రంథాలను చదవడానికి ప్రేరణ పొందుతారు. సాహిత్య చరిత్రకారులు తమ సాహిత్య చరిత్ర, వికాస చరిత్రలకు కొత్త సూత్రీకరణలను ఈ గ్రంథం నుండి స్వీకరించవచ్చు. సాహిత్య చరిత్రలతో  ముడిపడిన విమర్శ తీరును ఈ గ్రంథంలో గమనించవచ్చు.  తెలుగు అకాడమీ వాళ్ళు నాలుగు సంపుటాలుగా ప్రచురించిన సమగ్ర సాహిత్యం ఎంతో ఆకర్షణీయంగా ఉంది. కానీ, అంత పెద్ద పుస్తకాలుగా ప్రచురించె కంటే చిన్న పుస్తకాలుగా ప్రచురించటమే మంచిది.  

ఆరుద్ర శతజయంతి సందర్భంగా ఇంటర్వ్యూ చేసిన మీకు, ప్రచురించిన పత్రిక సంపాదకులకు నా కృతజ్ఞతలు.

డా.నలసాని రామ్ ప్రసాద్, 

తెలుగుశాఖ, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, 

హైదరాబాద్. ఫోన్: 9502847494





  


27 ఆగస్టు, 2025

"దళితులు ప్రధాన జీవన స్రవంతిలోకి రావాలి !" దళిత శక్తి పత్రికకు ఆచార్య ‘దార్ల’ప్రత్యేక ఇంటర్వ్యూ. ( September, 2025. Dalita Shakti Monthly)

 దళితులు  ప్రధాన జీవన స్రవంతిలోకి రావాలి !

దళిత శక్తి పత్రికకు ఆచార్య ‘దార్ల’ప్రత్యేక 

ఇంటర్వ్యూ.  దీన్ని సెప్టెంబరు, 2025 సంచికలో ప్రచురించారు.


ఒక నిరుపేద దళిత కుటుంబంలో పుట్టి, చదువుకున్న వాళ్లలో తొలితరం విద్యార్థిగా అనేక ఒడిదుడుకులను ఎదుర్కొంటూ సెంట్రల్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా నిలిచారు. ప్రముఖ దిన, వారమాస పత్రికలలో కవిత్వం, కథలు, వ్యాసాలు రచించారు. తన కవిత్వాన్ని ‘దళిత తాత్వికుడు’ ‘నెమలి కన్నులు’ పేరుతో ప్రచురించారు.  ఇటీవలే తన ఆత్మకథ మొదటి భాగం ‘నెమలి కన్నులు’ పేరుతో కూడా ప్రకటించారు. దీనిపై మంచి సమీక్షలు వ్యాసాలు విరివిగా వచ్చాయి. దళిత విద్యార్థులకు ఇదొక ఆదర్శనీయమైన గ్రంథంగా ఆ సమీక్షలు వ్యాఖ్యానించాయి. ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తొమ్మిదవ తరగతి తెలుగు పాఠ్యాంశానికి ప్రధాన సంపాదకులలో ఒకరిగా వ్యవహరించారు. బెనారస్, కృష్ణా, మద్రాస్ విశ్వవిద్యాలయ బోర్డ్ ఆఫ్ స్టడీస్ లలో సభ్యులుగా ఉన్నారు. వీటితోపాటు ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని అన్ని కళాశాలల తెలుగు శాఖల్లో బోర్డ్ ఆఫ్ స్టడీస్ సభ్యులుగా ఉన్నారు. ప్రకాశిక త్రైమాస పత్రికకు కార్యనిర్వహక సంపాదకులుగా, ఔచిత్యం, భావవీణ, ప్రజామణిపూస, రాయలసీమ జాగృతి తదితర పరిశోధన పత్రికల  సంపాదకవర్గ సభ్యులుగా ఉన్నారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారి కీర్తి పురస్కారంతోపాటు, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ వారి ఛాన్సలర్ అవార్డు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి ఉగాది పురస్కారం (2025) వంటి వాటిని ఎన్నింటినో అందుకున్నారు.హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ తెలుగు శాఖలో 'దళిత సాహిత్యం' ఒక ఆప్షనల్ కోర్సుగా పెట్టారు. దీని ద్వారా దళిత కవులు, రచయితలు, రచనలను అధ్యయనం చేయడం, పరిశోధనలకు ప్రేరణపొందడం జరుగుతోంది. తాను చదువుకున్న విద్యాసంస్థలోనే అధ్యాపకుడుగా చేరారు. తాను బోధనలోకి ప్రవేశించి ఇరవై ఐదు సంవత్సరాలవుతున్న సందర్భంగా ఆచార్య దార్ల వెంకటేశ్వరరావుగారితో ‘దళితశక్తి’ పత్రిక చేసిన ప్రత్యేక ఇంటర్వ్యూ. 




దళితశక్తి మాసపత్రిక, సెప్టెంబరు 2025 ముఖచిత్రంగా ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు చిత్రం






  • నమస్కారం సార్. ఒక సాధారణ కుటుంబంలో పుట్టి, అత్యున్నతమైన సెంట్రల్ యూనివర్సిటీ లో శాఖాధ్యక్షులు, ప్రొఫెసర్ స్థాయి వరకు వచ్చారు. ఈ పయనంలో మీరెలాంటి ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు?  

మన భారతీయ సమాజంలో ఒక దళితుడు, ఒక పేదవాడు ఈ స్థాయిలోకి రావడం చాలా కష్టమే. కానీ, ఒక సామాన్యుడు ఈ స్థాయికి రావాలంటే అనేక కష్టనష్టాలను భరించతప్పదు. కానీ, పరిస్థితులను మనకు అనుకూలంగా మార్చుకోవాలంటే నిరంతరం కష్టపడాలి. క్రమశిక్షణ ఉండాలి. అనేకాంశాలపై నియంత్రణ ఉండాలి. తాత్కాలిక సంతోషాల్ని, ఆనందాల్ని త్యాగం చేయాల్సి ఉంటుంది. మన చుట్టూ మన ఉండే వాతావరణాన్ని ఎప్పటికప్పుడు గమనించుకొంటూ ముందుకెళ్ళాలి. అలా నా కంటే మరింత కష్టాల్లో ఉన్నవాళ్ళు కూడా ఉన్నతమైన స్థాయిలోకొచ్చారు. ఇలాంటి వన్నీ అదృష్టాన్ని బట్టి జరిగేవి కాదు. తమకొక లక్ష్యం పెట్టుకోవాలి. దాన్ని సాధించడానికి కావాల్సినవన్నీ సమకూర్చుకొంటూ ముందుకెళ్ళాలి. ఆ మార్గంలో అనేక ఆటంకాలు ఎదురుకావచ్చు. వాటితో పాటే సహకారాన్ని అందించడానికి కూడా సిద్ధంగా ఉండే వాళ్ళు ఉంటారు. సంతోషకరమైనవి కావచ్చు, బాధపెట్టేవైనాకావచ్చు. అటువంటి వాటిని అంటే ఆ ఉద్వేగాలను అదుపులో  పెట్టుకోగలగాలి.

నేను ఒక సాధారణ, పేద దళిత కుటుంబంలో జన్మించాను. ఆర్థిక ఇబ్బందులు, సామాజిక అడ్డంకులు,  విద్యావకాశాల కొరత వంటి ఒడిదుడుకులు ఈ ప్రయాణంలో ఎదురయ్యాయి. భారతీయ సమాజంలో కులం ఆధారిత వివక్ష, అవమానాలు కొన్నిసార్లు నన్ను కుంగదీశాయి, కానీ, నేను వాటిని సవాళ్లుగా తీసుకుని ముందుకు సాగాను. విద్య నా జీవితాన్ని మార్చే సాధనంగా నేను భావించాను. నా తల్లిదండ్రులు, గురువులు, కొంతమంది స్నేహితులు నాకు నిరంతరం ప్రోత్సాహాన్ని అందించారు. ప్రభుత్వస్కాలర్‌షిప్‌లు, రిజర్వేషన్ విధానాలు వంటి అవకాశాలు నాకు మార్గాన్ని సుగమం చేశాయి. నా పట్టుదల, కష్టపడే తత్వం,  ఏ పరిస్థితిలోనూ వెనక్కి తగ్గకపోవడం నన్ను ఈ సెంట్రల్ యూనివర్సిటీలో శాఖాధ్యక్షుడిగా, ప్రొఫెసర్‌గా నిలబెట్టాయి.ఈ విజయం నాకు కేవలం వ్యక్తిగతమైనది కాదు; ఇది నా కుటుంబానికి, సమాజానికి ఒక స్ఫూర్తి. నా లాంటి నేపథ్యం నుండి వచ్చిన యువతకు, కలలు కనడం, వాటిని సాధించడం సాధ్యమని నా ప్రయాణం చూపిస్తుందని నేను నమ్ముతున్నాను.

  • మీరు పల్లె నుండి పల్లెటూరు వరకు, పాఠశాల నుంచి విశ్వవిద్యాలయం వరకు అనేకమందిని చూసి ఉంటారు. కలిసిమెలిసి చదువుకున్న దళిత, దళితేతర విద్యార్థులలో మీరు బయటకు వెళ్ళినప్పుడు ఎవరితో మీరు ఎక్కువ సన్నిహితంగా ఉంటారు? లేదా  మీతో ఎవరు  సన్నిహితంగా ఉంటారు? 


నా జీవిత ప్రయాణంలో, పల్లె నుండి పట్టణం, నగరం, విశ్వవిద్యాలయం వరకు, నేను దళిత, దళితేతర విద్యార్థులతో కలిసిమెలిసి చదువుకున్నాను. కలిసి అనేక సందర్భాల్లో పనిచేశాను. మనం కలిసి మెలిసి సత్సంబంధాలు కొనసాగించాలనే భావిస్తాం. నేను  అందరినీ సమానంగా గౌరవిస్తాను. అయితే ఇతరులంతా నన్ను అంతే గౌరవం ఇస్తున్నారని చెప్పలేను. 

 బయటకు వెళ్ళినప్పుడు, నేను విశ్వవిద్యాలయంలో లేదా వృత్తిపరమైన వాతావరణంలో అనేక ఆలోచనల్లో, లక్ష్యాలలో సమానమైన ఆసక్తి ఉన్నవాళ్ళతో ఎక్కువ సన్నిహితంగా ఉండటం సహజం.  దళిత, దళితేతర అనే తేడా నా సంబంధాలలో పెద్దగా ప్రభావం చూపదు, ఎందుకంటే నేను సమానత్వం, ఉమ్మడి లక్ష్యాలపై నమ్మకం ఉంచుతాను. అయితే, కొన్నిసార్లు దళిత నేపథ్యం నుండి వచ్చిన వారితో నాకున్న భాగస్వామ్య అనుభవాల వల్ల ఒక ప్రత్యేక అనుబంధం ఏర్పడుతుంది. ఎందుకంటే మేము సమాజంలో సమానమైన సవాళ్లను ఎదుర్కొన్నాం. అందువల్ల దళితుల ఇళ్ళకు వెళ్ళడానికే మొదటి ప్రాధాన్యతనిస్తాను. ఇతర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు దళితేతరులు తమ ఇంటికి ఆహ్వానించడం జరుగుతుంది. వెళతాను కూడా. కానీ, వాళ్ళలో కలిసిపోవడం అనున్నంత సులభంకాదు. వాళ్ళేమైనా కొద్దిగా చిన్నచూపు చూసినా, అలా అనిపించినా అదొక అవమానంలా అనిపించే అవకాశం ఉంది. అందువల్ల సాధ్యమైనంత వరకు వాళ్ళిళ్లళ్ళో ఉండే కంటే, ఏదైనా ఒక హోటల్ లేదా గెస్ట్ హౌస్ లో ఉండడానికే ఇష్టపడతాను. 

  • మీ జీవితంలో ఇలాంటి సందర్భాల్లో ఏదైనా చెప్పుకోదగిన అనుభవం మాతో పంచుకుంటారా? 

నేను కాలేజీలో చదివేటప్పుడు నా స్నేహితుల్లో  కొంతమంది బ్రాహ్మణ మిత్రులు కూడా ఉండేవారు. నేను సెలవుల్లో   పొలం పనికి వెళుతూ ఉండేవాడిని. ఏదో పనిమీద మా ఊరు వచ్చిన ఒక మిత్రుడు నన్ను కలుసుకోవాలని నేను పనిచేస్తున్న మా పొలం దగ్గరకే వచ్చాడు. ఇద్దరం కలిసి మా ఇంటికి బయలుదేరాం. మా ఇద్దరం ఒకరిమీద మరొకరు చేతులు వేసుకొని మాట్లాడుంటూ నడుచుకొంటూ వస్తున్నాం. వీధిలో ఒక ఇంటి దరిదాపుల్లోకి వస్తున్నామనుకొనేసరికి నా మీద చేతులు తీసేశాడు. నన్ను కూడా తన మెడమీద ఉన్న చేతులు తీసేస్తూ ‘ మనం వచ్చే రెండిళ్ళ తర్వాత మాకు తెలిసిన మా బంధువులున్నారు. ఇలా చూస్తే మా పెద్దగొడవైపోద్ది’ అని చెప్పాడు ఏదో చెప్పలేని ఇబ్బంది పడుతున్నట్లు! ఇక నేను వాళ్ళ పరిస్థితిని అర్థం చేసుకున్నాను. ఇవన్నీ మాకు మామూలే కదా అనుకున్నాను. ఇలాంటి సంఘటనలు నా జీవితంలో చాలా జరిగాయి. 


  •   తెలుగు సాహిత్యంలో వస్తున్న వివిధ భావజాలాలపై గత మూడు దశాబ్దాలుగా రచనలు చేస్తున్నారు. ప్రత్యేకించి దళిత, బహుజనులు కేంద్రంగా మీ రచనా ప్రస్థానం కొనసాగుతోంది? దీనికి గల ప్రత్యేక కారణాలను తెలుసుకోవచ్చా? 

నన్ను మరొకసారి సమీక్షించుకునేలా అడిగిన మీ ప్రశ్నకు నా హృదయపూర్వక ధన్యవాదాలు.  ప్రతీ కవి లేదా రచయితకు ఒక భావజాలం ఉంటుంది. ఈ ప్రపంచాన్ని మనం ఎలా అర్థం చేసుకుంటున్నామో ఆ భావజాలం తెలుపుతుంది. దీన్నే మార్క్సిస్టులు ప్రాపంచిక దృక్పథం అన్నారు. ఆ ప్రాపంచిక దృక్పథం ఏర్పడడానికి ఆ కవి వచ్చిన సమాజం, ఆ సమాజంలో తన ఆస్తిత్వం, తనని అలా  ఆలోచింపజేసేలా చేస్తాయి. తాను ఎవరికోసం రచనలు చేయాలో కూడా ఆ పరిస్థితులే తెలియజేస్తాయి. అలా నేను కూడా దళితులు, బహుజనుల గురించి ఎక్కువగా రాయవలసిన అవసరం ఉందని గుర్తించాను. అందువల్ల నా రచనలకు ప్రధాన కేంద్రంగా దళిత, బహుజనలే ఉంటారు.  దళిత కవులు, రచయితలు తమకు జరుగుతున్న అవమానాలను, కష్టనష్టాలను దళితులు చెప్పకపోతే ఇంకెవరు చెప్తారు.

  • మీరు ఒక కవిగా, రచయితగా ఎంత పేరు తెచ్చుకున్నారో,  ఒక యూనివర్సిటీ ప్రొఫెసర్ గా అంతే పేరు తెచ్చుకున్నారని నా అభిప్రాయం. దీనికి మీరు ఏమంటారు?

నేను కవిగా, రచయితగా కంటే ముందు ఒక అధ్యాపకుడిగానే ఇష్టపడతాను. అది నాకు ఎంతో ఇష్టమైన ప్రొఫెషన్. ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ ఎంతోమందికి సహాయపడగలిగిన గొప్ప వృత్తి అది. అక్కడ ఎంతోమందిని ప్రభావితం చేయగలిగే అవకాశం ఉంది. అక్కడ మనం తీసుకునే నిర్ణయాలు కొన్ని సంవత్సరాలపాటు, కొన్ని లక్షల మందికి ప్రత్యక్షంగా ఉపయోగపడేలా చేస్తుంది. అలా వ్యవస్థీకృత నిర్మాణంలో భాగస్వామ్యం కావచ్చు. మనం సెలెక్ట్ చేసినవాళ్లు కొన్ని సంవత్సరాలపాటు ఆ వ్యవస్థలను తీర్చిదిద్దుతారు. కవులు, రచయితలు  రచనలు రాసినప్పటికీ, వాటిలో ఎలాంటివి పాఠ్యాంశాలుగా ఉండాలని నిర్ణయించడంలో కూడా అధ్యాపకులే ప్రధానమైన పాత్రను నిర్వహిస్తారు. ఇటువంటి వాటిలో భాగస్వామ్యం కావడం వల్ల ఒక ప్రొఫెసర్ గా మీరన్నట్లు గౌరవనీయమైన స్థానం దక్కినందుకు సంతోషంగా ఉంది. 

ఇక, కవి, రచయితగా నా పాత్ర అనేదాన్ని రెండు పార్శ్వాలుగా చూడాలి. నా ప్రధాన వృత్తి పాఠాల్ని బోధించడం, పరిశోధకులు చేయడం, చేయించడంతో పాటు సమాజంలో వారసత్వంగా, చారిత్రకంగా, సాంప్రదాయకంగా కొనసాగుతున్న విజ్ఞానంతో పాటు సమకాలీన సామాజిక వాస్తవికతను, భవిష్యత్తుకి అనుగుణంగా అవసరమయ్యే జ్ఞానాన్ని తెలుగు భాషా, సాహిత్య దృక్పథం నుండి అవగాహన కల్పించాలి. దానికి అనుగుణమైన మేధోపరమైన చర్చల్లో, సమావేశాల్లో, సదస్సుల్లో పాల్గోవాలి. దీనికోసం విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ గా చేరతాం. ఆ కృషిని బట్టే పదోన్నతులు, పదవులు, గౌరవమర్యాదలు వస్తుంటాయి. ఇలా కృషి చేసే నేపథ్యంలో కూడా భిన్న పార్శ్వాలను జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకోవాలి. కొన్ని మనకి ఇష్టమున్నా లేకపోయినా, నమ్మినా నమ్మక పోయినా బోధించాల్సి వస్తుంది. కానీ, దాన్ని అవగాహన చేసుకొనే బహుళపార్శ్వాలను వివరించి, ఆలోచింపజేయగలగాలి. అక్కడ మన ఆత్మీయతాముద్రకంటే ఆలోచనల విస్పోటనంగానే కొనసాగాలి. చేసే పరిశోధనల్లో, రాసే రచనల్లో శాస్త్రీయంగా మనదైన దృక్పథం ప్రదర్శించు కోవచ్చు. 

  • బహుశా, ఇదంతా పాఠాలు చెప్పే ప్రొఫెసర్ గా, పరిశోధకుడుగా, విమర్శకుడుగా ఉన్న కోణాల్ని వివరించారనుకుంటున్నాను. ప్రొఫెసర్ గా ఉంటూనే సృజనాత్మక రచనలు చేస్తుంటారు కదా! దీని గురించి వివరించండి.

నేను ముందే చెప్పినట్లు, విశ్వవిద్యాలయ అధ్యాపకులలో కొంతమందికి సృజనాత్మక రచనలు చేసే మరోపార్శ్వం కూడా ఉంటుంది. సాధారణంగా ఇటువంటి సృజనాత్మక రచనా నైపుణ్యం భాషా, సాహిత్యాలను బోధించే అధ్యాపకుల్లోనే ఉంటుందనుకుంటారు. కానీ, ఇతర సబ్జెక్టులను బోధించేవారు కూడా మంచి సృజనాత్మక రచనలు చేస్తుంటారు. అయితే, సాహిత్య, భాషా బోధకులకు సృజనాత్మక రచన చేయడం ఒక ప్రత్యేక సౌకర్యం. కవిత్వం, సినిమా పాటలు, సీరియల్స్, కథలు, నవలలు, నాటకాలు… ఇలా రకరకాల ప్రక్రియల్లో రచనలను చేసేవారిని చూస్తే, కేవలం భాషా, సాహిత్య శాస్త్ర బోధకులే కాకపోయినా, అత్యధిక శాతం వాళ్ళే ఉంటారు. ఇతర శాస్త్రాల్లో ఉన్నా విస్తృతమైన అధ్యయనం వాళ్ళను రచయితలుగా మార్చవచ్చు.

సాధారణంగా ఉపాధ్యాయులు, ఉపన్యాసకులు లేదా విశ్వవిద్యాలయ బోధకులు  సృజనాత్మక సాహిత్యాన్ని సృష్టించడం కంటే అప్పటికే ఉన్న ఆ రచనల్లోని విజ్ఞానాన్ని విద్యార్థులకు అందించటం ముఖ్యం. అవి ఏ ప్రక్రియకు చెందుతాయి? ఆ ప్రక్రియకు సంబంధించిన లక్షణాలు ఏమిటి? దానిలో వస్తువంటే ఏమిటి? శిల్పమంటే ఏమిటి? రూపమంటే ఏమిటి? ఒక రచనను సామాజిక, చారిత్రక, ఆర్థిక, సామాజిక, మనోవైజ్ఞానిక దృక్పథాలతో అధ్యయనం చేయడం ఎలాగో నేర్పాలి. ఆ రచనలు సామాజిక వాస్తవికతను, కళాత్మక విలువలను ప్రతిఫలింపజేస్తున్నాయో లేదో, ఆ విశేషాంశాలను వివరించగలగాలి. ముఖ్యంగా ఆ రచనల తత్వాన్ని తెలిసేలా బోధించగలగాలి. 

  • ఇలాంటి పరిస్థితుల్లో సృజనాత్మక రచన గొప్పదంటారా? ఆ రచనలను వివరించే శాస్త్రం గొప్పదంటారా?

జీవితంలో నుండి రచనలు ఉద్భవించాలి. అవి ఉన్నవి ఉన్నట్లుగా వెలువడితే కొన్ని ప్రమాదాలు వచ్చే అవకాశం ఉంది. అందువల్ల వాటికి కళాత్మకతను జోడించాలి. అప్పుడు అది సృజనాత్మకత రచన అవుతుంది. ఆ సృజనాత్మకతలో భావుకత, ఆదర్శనీయత, రమ్యత, నైతిక విలువలు/నైతికతను ప్రశ్నించే ఆలోచనలు ఉంటాయి. ఆ అంశాలను శాస్త్రీయంగా వివరించేది శాస్త్రం అవుతుంది. శాస్త్రం ఒకరు ఒప్పుకున్నా,  ఒప్పుకోకపోయినా ప్రమాణాలను నిర్దేశిస్తుంది. కానీ, సృజనాత్మక రచన మాత్రం, హృదయ అహ్లాదాన్ని కేంద్రంగా చేసుకుంటుంది. ఆ ఆనందం అన్నివేళలా సమాజానికి మంచిది చేసేదే అయి ఉండాలని ఏమీ ఉండదు. సృజనాత్మక రచయిత నైతిక విలువలు పాటించవచ్చు; పాటించకపోవచ్చు. కానీ శాస్త్రవేత్త మాత్రం ఖచ్చితంగా వాటిని తార్కికంగా చూపిస్తాడు. సృజనాత్మక రచన సంఖ్యాపరంగా అత్యధికమైన ఆనందపరచవచ్చు. కానీ, శాస్త్రాన్ని చదివేది తక్కువ మందే ఉండొచ్చు. సంఖ్యా బలాన్ని బట్టి ఉత్తమత్వాన్ని నిర్ణయించలేం.

  • మీరు ఒక ప్రధాన జీవన స్రవంతిలో ఉండి, ఒక ప్రఖ్యాత విశ్వవిద్యాలయంలో సాహిత్యాన్ని బోధిస్తున్నారు; పరిశోధనలు చేస్తున్నారు.  ప్రధాన జీవన స్రవంతిలోని సాహిత్యానికీ, దళిత సాహిత్యానికి మధ్య గల వ్యత్యాసాన్ని ఎలా గుర్తించాలి?

రెండు రకాల సాహిత్యాలు పైకి ఒకలాగే లేదా కలిసి పయనిస్తున్నట్లే అనిపిస్తాయి. కానీ, ప్రధాన జీవన స్రవంతి సాహిత్యం (Mainstream Literature), దళిత సాహిత్యం (Dalit Literature) మధ్య వ్యత్యాసాన్ని గుర్తించాలంటే కొన్ని ముఖ్యమైన అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. ఈ రెండు సాహిత్య రూపాలు వాటి లక్ష్యాలు, దృక్పథాలు, ఇతివృత్తాలు, భాష, మరియు సామాజిక సందర్భంలో భిన్నంగా ఉంటాయి. 

ప్రధాన జీవన స్రవంతి సాహిత్యం అందరి సాహిత్యం అంటూ తమ ఆధిపత్యాన్ని నిలబెట్టుకునేలా ప్రయత్నిస్తుంది. దీన్ని లోతుగా పరిశీలిస్తే తప్ప గుర్తించడం కష్టం. 

ప్రధాన జీవన స్రవంతిలో ఉన్న సాహిత్యం సామాజికంగా ఆధిపత్య వర్గాల అనుభవాలను ఉన్నతీకరించేలా ప్రతిబింబిస్తుంది. సామాజిక మార్పు కంటే వినోదం లేదా సాహిత్య సౌందర్యంపై ఎక్కువ దృష్టి పెడుతుంది. అంతే కాదు, ప్రచురణరంగం తమ అధిపత్యంలోనే ఉండడం వల్ల వాణిజ్యపరంగా కూడా విజయవంతమవుతుంది. అటువంటి సాహిత్యాన్నే విస్తృత పాఠక వర్గాన్ని ఆకర్షిస్తుందని ప్రకటిస్తుంది కూడా! కానీ, ఇలాంటి అవకాశాలు దళిత సాహిత్యానికి చాలా అరుదుగా లభిస్తాయి. తరచుగా చిన్న ప్రచురణ సంస్థలు, స్వతంత్ర ప్రచురణలు, లేదా సామాజిక ఉద్యమాల ద్వారా దళిత సాహిత్యం ప్రచురించబడుతుంది. తాము ప్రచురించిన గ్రంథాలను ప్రధాన విక్రయ సంస్థల్లో పెట్టమని ఇచ్చినప్పటికీ వాటిని ప్రదర్శనలలో ఉంచడానికి ఇష్టపడరు. ఆ కవి లేదా రచయితే అడిగినా, అవి అమ్ముడవడం లేదని పంపేశారనీ, త్వరలోనే అందుతాయనీ చెప్తుంటారు. 


సమకాలీన దళిత సాహిత్యం స్థితి గతులు ఎలా ఉన్నాయి? 

సమకాలీన దళిత సాహిత్యం సామాజిక మార్పు కోసం శక్తివంతమైన సాధనంగా కొనసాగుతోంది. ఇది కొత్త రచయితలు, ఆధునిక మాధ్యమాలు,  విస్తృత అంశాలతో విస్తరిస్తున్నప్పటికీ, దళిత సాహిత్యానికి ప్రధాన స్రవంతి గుర్తింపు తక్కువగా ఉంటుంది. దీనికి అనేక కారణాలు కనిపిస్తున్నాయి. దళితులు నిర్వహించగలిగే పత్రికలు చాలా తక్కువ సంఖ్యలో ఉన్నాయి. వాటిని నిర్వహించగలిగే ఆర్థిక శక్తి సరిపోవడం లేదు. దీనికి తోడు ఎస్సీ వర్గీకరణ ఉద్యమం వల్ల దళితులలో ఎవరి గురించి ఎవరు రాయాలనే ఆలోచనలో పడ్డారు. దళిత సాహిత్యం విస్తృతంగా వెలువడ్డడానికి ఇవన్నీ  అడ్డంకులుగా ఉన్నాయి. అయినప్పటికీ వస్తున్న దళిత సాహిత్యంలో లింగ వివక్ష, ఆర్థిక అసమానతలు, గ్లోబలైజేషన్ ప్రభావం వంటివన్నీ  ప్రతిఫలిస్తున్నాయి. సోషల్ మీడియా, ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా దళిత రచయితలు తమ రచనలను విస్తృత పాఠకులకు చేరవేసే అవకాశాలు ఉన్నాయి. కానీ, దాన్ని శక్తివంతంగా ఉపయోగించుకొనేవాళ్ళు తక్కువగానే కనిపిస్తున్నారు. తెలుగు దళిత సాహిత్యం ఇతర భాషలలోకి అనువదించబడుతూ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందుతోంది. కానీ, ఆ అనువాదాలు వ్యక్తిగత ప్రాధాన్యాన్ని బట్టి కొనసాగుతున్నాయి. 

  • దళిత అనే పదం వాడకూడదనే వాదనలు ఉన్నాయి కదా మీరు ఏమంటారు?

 కొన్ని రాష్ట్రాల్లో భారత రాజ్యాంగం గుర్తించిన షెడ్యూల్డు కులాల వారిని ‘దళితులు’ అనే పదంతో ప్రయోగించడం సరైనది కాదనే ఆలోచనలు ఉన్నాయి. కొందరు ఈ పదం సమాజంలో ఉన్న కుల విభజనను మరింత బలపరుస్తుందని, లేదా ఈ పదం వాడకం వల్ల కొన్ని సమూహాలు అవమానకరంగా భావించవచ్చని అంటారు. కానీ, దళిత అనేది ప్రస్తుతం ఒక ఆత్మగౌరవ చైతన్యానికి ప్రతీకగా మారింది. సంప్రదాయ సాహిత్యానికి ప్రత్యామ్నాయ సాహిత్యంగా కూడా ఎదుగుతుంది. షెడ్యూల్డు కులాలు, షెడ్యూల్డు తెగలకు చెందినవారు తమలో తాము ఆత్మగౌరవ చిహ్నంగా దళితులని పిలుచుకోవడంలో తప్పు లేదని భావిస్తున్నారు. ఇది ఎలాంటిదంటే, షెడ్యూల్డ్ కులాలలోని మాల, మాదిగ వంటి పదాలతో నిందార్థంతో, నీచార్ధంతో పిలిస్తే అది నేరమవుతుంది. అలాగే, ‘దళిత’ అనే పదం కూడా అవమానించడానికీ లేదా  అగౌరవపరచడానికో నిందించడానికో ఉపయోగిస్తే అది నేరమవుతుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా దళిత సాహిత్యం వీళ్ళందర్నీ ఒక ఆలోచన ధారతో పయనించేటట్లు చేస్తుంది.‌ అందువల్ల దళితులు, దళిత సాహిత్యం అని ఆత్మగౌరవ చైతన్యంతో పిలుచుకోవడంలో తప్పులేదు. 

  • నిత్య వ్యవహారంలో ‘చండాల’ వంటి పదాలను ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా సినిమాలు, టీవీ సీరియల్స్ లో ఈ పదప్రయోగం ఎక్కువగా కనిపిస్తుంది. ఇలా ఉపయోగించడం పట్ల మీ అభిప్రాయం?

భారత రాజ్యాంగం గుర్తించిన షెడ్యూల్డ్ కులాలలోని ఒక ఉప కులం పేరు చండాల. ఆ కులం పేరుని నీచార్థంలో నిత్య వ్యవహారంలో గాని, సినిమాలు, సీరియల్స్, ఎలాగైనా సరే ఉపయోగిస్తే అది నేరం. అయితే, దీన్ని చట్టపరంగా ఉపయోగించకుండా చేయడానికి ప్రయత్నం చేయాలి. నేను ఇప్పటికే నా ‘బహుజన సాహిత్య దృక్పథం’, ‘పునర్మూల్యాంకనం’ అనే సాహిత్య విమర్శ పుస్తకంలో దళిత, చండాల అనే పద ప్రయోగాల గురించి నా వ్యాసాల్లో పేర్కొన్నాను.  

  • ఎస్సీ వర్గీకరణ ఉద్యమం వల్ల దళితులలో ఎవరి గురించి ఎవరు రాయాలనే ఆలోచనలో పడ్డారు. ఈ పరిస్థితుల్లో దళిత సాహిత్య భవిష్యత్తు ఎలా ఉంటుంది?

ఎస్సీ వర్గీకరణ ఉద్యమం దళిత సాహిత్యంలో వైవిధ్యాన్ని తీసుకొచ్చింది. దళిత ఉపకులాల్లోని అనేక అంశాలు వీళ్ళందరినీ సమైక్యంగా పోరాడవలసిన అవసరాన్ని తెలుపుతున్నాయి. అందరూ ముఖ్యంగా కుల వివక్షను చెప్పుకోవాలి. దీనితోపాటు ఆర్థికపరమైన వెనుకబాటుతనం కూడా మరొక ప్రధాన కారణం కావడం వల్ల దళితులకు పీడన ఎక్కువగా ఉంటుంది. దీన్ని సమైక్యంగా మాత్రమే ఎదుర్కోగలుగుతారు.  దళిత సమాజం యొక్క సమగ్ర గుర్తింపును బలోపేతం చేసే రచనలపై దృష్టి పెట్టాలి. దళిత సాహిత్య సమావేశాల ద్వారా వివిధ ఉప-కులాల రచయితలను ఒకచోట చేర్చడం ద్వారా సంఘీభావాన్ని పెంపొందించాలి.  ఎవరికి రావాల్సినవి వారు పొందుతూనే కలిసి పోరాడాల్సి అంశాల్ని ఆ సమావేశాల్లో వివరించగలగాలి. ఈలోగా ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంటుంది. దళితుల్ల మళ్ళ ఉపకుల అస్తిత్వం, ప్రత్యేక సాహిత్య సృజన పెరుగుతుంది. ఈ సమయంలో సాహిత్య సృజన జరుగుతున్నప్పటికీ ఇరు వర్గాల మధ్య వాదోపవాదాలు, అసత్య ప్రచారాలు జరిగే అవకాశాలు మెండుగా ఉంటాయి. అంతవరకు కేవలం మాల మాదిగల సాహిత్యాన్నే దళిత సాహిత్యంగా భావించేవారు తమ తమ అస్తిత్వాల కోసం, తమ తమ జాతి చైతన్యం కోసం అన్వేషించే ప్రయత్నం చేస్తారు. కొత్త కొత్త ఆలోచనలు కొత్త కొత్త చారిత్రక ఆధారాలు లభ్యమయ్యే అవకాశం కూడా ఉంది. అంతవరకు దళిత ముసుగు వేసుకొని సాహిత్యాన్ని సృజించేవాళ్లు, మాట్లాడేవాళ్ల అసలు స్వభావం బహిర్గతం అవకాశం ఉంది. దీనికి కారణం - దళిత సాహిత్యంలో భాష తరచుగా స్థానిక, ప్రాంతీయ, దళిత సముదాయాల సామాజిక వాస్తవికతను ప్రతిబింబించేలా ఉంటుంది. శైలి సూటిగా, నిరసనాత్మకంగా, భావోద్వేగం ఆగ్రహ వ్యక్తీకరణలా  ఉంటుంది. ఆత్మకథాత్మక రచనలు, కవిత్వం, స్పోకెన్ వర్డ్ శైలులు సాధారణంగా అనుసరిస్తుంటారు. సాంస్కృతికంగా ఆధిపత్య భాషా నిర్మాణాలను సవాలు చేస్తూ, దళిత సాంస్కృతిక భాషను ఉపయోగిస్తుంది. ప్రధాన జీవన స్రవంతి సాహిత్యాన్ని చదవడానికి అలవాటు పడే వారికి ఇవన్నీ ఇష్టపడడం చాలా కష్టం. అందుకే దళిత, బహుజన, మైనార్టీ వర్గాలకు సంబంధించిన ప్రత్యేక అధ్యయనాలు కావాలని మేధావులు కోరుతున్నారు. 

  • దళిత సాహిత్యాన్ని  ఎం.ఏ. స్థాయిలో ప్రత్యేకంగా ఒక ఆప్షనల్ కోర్సుగా పెట్టడానికి ఇలాంటివే కారణాలు అంటారా? 

 అవును,ఇటువంటివి కూడా కారణమే. మనం చదువుతున్న ఆరో తరగతి నుండి.పి.జి.వరకు ఉన్న పాఠాల్ని మరింత లోతుగా, విశ్లేషణత్మంగా చదవాలనే ఆలోచనతో  పై తరగతుల్లోనూ అవే పాఠాలు  కొనసాగుతూ ఉంటాయి. సాధారణంగా దళితులకు సంబంధించిన పాఠాల్ని పాఠ్య పుస్తకానికి చివర్లో పెడతారు. ఒకవేళ మధ్యలో గానీ మొదట్లో పెట్టినా, చాలామంది వాటిని చెప్పకుండా ముందు అందరికీ ఉపయోగపడే ముఖ్యమైన పాఠాలంటూ కొన్నింటినే  చెప్తుంటారు.  అలాంటప్పుడు దళిత కవులు, రచనల వంటి పాఠాలు చెప్పకుండా ‘మీరు చదువుకోండి’ అని వదిలేస్తుంటారు. చాలా మంది ఉన్నత విద్యలో కూడా ఆధునిక సాహిత్యం పేరుతో ప్రత్యేకంగా ఒక కోర్సు ఉన్నప్పటికీ దానిలో  దళిత, బహుజన, మైనారిటీ సాహిత్యాలను నామమాత్రంగా ప్రస్తావిస్తుంటారు. అంతే. అలాంటప్పుడు ఆ సాహిత్య ధోరణులపై తగినంత అవగాహన కల్పించరు. పాఠాలే కాదు, తెలుగు సాహిత్య చరిత్రల్లో కూడా అలాగే ఆ అంశాలను కొద్దిగా ప్రస్తావించి వదిలేస్తుంటారు. అందుకనే ప్రత్యేకించి డా.పిల్లి జాన్సన్ దళిత సాహిత్య చరిత్రను రచించారు. ఆ తర్వాత చాలామంది ఆ బాటలోనే పయనించారు. 

  • దళిత సాహిత్యాన్ని ఒక ప్రత్యేక ఆప్షనల్ కోర్సుగా పెట్టాలని ప్రతిపాదించినప్పుడు మీరు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సి వచ్చింది? 

నేను ఎం.ఏ.తెలుగులో 2005 నుండి దళిత సాహిత్యం ఒక ఆప్షనల్ గా పెట్టేటట్లు చేశాను. నేను 2004 లో సెంట్రల్ యూనివర్సిటీ తెలుగు శాఖలో అధ్యాపకుడుగా చేరాను. ఆ సంవత్సరమే బోర్డు ఆఫ్ స్టడీస్ లో అప్పటి శాఖాధ్యక్షులు ఆచార్య పరిమి రామనరసింహంగారి సహకారంతో దళిత సాహిత్యం ఒక కోర్సుగా ప్రతిపాదించాను. విచిత్రం ఏమిటంటే ఆనాడు ఉన్న దళితేతర ప్రొఫెసర్లు ఎవరూ  ఆ కోర్సు పెట్టడానికి వ్యతిరేకించలేదు. కానీ ఒక దళిత ప్రొఫెసర్ మాత్రం ఆధునిక సాహిత్యం అంతర్భాగంగా చెబుతున్నప్పుడు ప్రత్యేకించి  అవసరం లేదని వాదించారు. అప్పటికే ఆంధ్ర విశ్వవిద్యాలయం, వాల్తేరులో దళిత సాహిత్యం ఒక కోర్సుగా ప్రత్యేకించి చెప్తున్నారని నాకు తెలుసు. ఆ విషయాన్నే ఆ సమావేశంలో చెప్పాను. అంతేకాకుండా దళిత సాహిత్యం ప్రధాన జీవన స్రవంతిలోగల  సాహిత్యానికి మధ్య గల తేడాలను వివరంగా చెప్పాను. ఆ దళిత ప్రొఫెసర్ తప్ప మిగతా వాళ్ళంతా  ఆమోదించారు. ఆ తర్వాత దళిత సాహిత్యం పై ప్రత్యేక పరిశోధనలు విస్తృతమయ్యాయి. 

  • దళితులను చైతన్యం చేసి దళితులను, ఆ సాహిత్యాన్ని ప్రధాన జీవన స్రవంతిలోకి తీసుకొని రావాలంటే ఏం చేయాలి? 

ముందు దళితులను చైతన్యవంతం చేయాలి. ఆ తర్వాత దళిత సాహిత్యం కూడా చైతన్యవంతం అవుతుంది. దళిత విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు, ఉచిత విద్య,  ఉన్నత విద్యా సంస్థల్లో రిజర్వేషన్ల ద్వారా విద్యా అవకాశాలను విస్తరించడానికి గల మార్గాలన్నింటినీ ఉపయోగించుకోవాలి. 

దళితుల్లోని త్యాగశీలతను, కరుణార్ద్రహృదయాన్ని తెలియజేసే రచనలను విస్తృతంగా చేయాలి. ఆ దళిత చరిత్ర,  అంబేద్కర్ సిద్ధాంతాలు,  సామాజిక న్యాయం గురించి పాఠశాలలు, కళాశాలల్లో ప్రవేశపెట్టాలి. వివిధ విద్యా కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా ప్రజలను చైతన్య పరచాలి.  ఉపాధి అవకాశాలను పెంచేందుకు సమాజానికి సత్వరం కావాల్సిన వృత్తి నైపుణ్య శిక్షణా కార్యక్రమాలను అందించాలి. 

దళితులకు ప్రభుత్వ,  ప్రైవేటు రంగాల్లో ఉద్యోగ అవకాశాలను పెంచడానికి చట్టపరంగా ఉండే రిజర్వేషన్లను సమర్థవంతంగా అమలు చేయడానికి మేధావులు కృషి చేయాలి. 

   దళిత పారిశ్రామికవేత్తలకు స్టార్టప్‌ల కోసం రుణాలు, గ్రాంట్‌లు,  శిక్షణ కార్యక్రమాలను అందించాలి. ఆర్థిక సాక్షరత కార్యక్రమాల ద్వారా దళిత గ్రూపులకు బ్యాంకింగ్, పొదుపు,  పెట్టుబడి గురించి అవగాహన కల్పించాలి. దళిత సాహిత్యాన్ని పాఠశాలలు, కళాశాలలు,  సామాజిక వేదికలలో ప్రోత్సహించడం ద్వారా దళిత గ్రూపుల్లో ఆత్మగౌరవం కలిగించే కథనాలను, స్ఫూర్తిదాయకమైన రచనలను, విజయగాథలను ప్రచారం చేస్తూ చైతన్యం పెంపొందించాలి. 

కేవలం దళిత రాజకీయాలు,  దళిత సాహిత్యం మాత్రమే సరిపోదు. బహుజన భావజాలంతో పయనించాలి. అంబేద్కర్ భావజాలాన్ని వీడకుండా అవసరమైనంతమేరకు మార్క్సిస్టు సంస్థలతో కలిసి పని చేయాల్సిన అవసరం ఉంది. 

దళితుల సమస్యలను సానుకూల దృక్పథంతో చిత్రీకరించేందుకు సినిమాలు, డాక్యుమెంటరీలు,  డిజిటల్ కంటెంట్‌ను ప్రోత్సహించాలి. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో దళిత అవగాహన కార్యక్రమాలను విస్తృతం చేయడం ద్వారా యువతను చైతన్యవంతం చేయవచ్చు. దళితులకు రాజకీయంగా ఎక్కువ అవకాశాలు కల్పించుకోవాలి, స్థానిక స్వపరిపాలన నుండి జాతీయ స్థాయి వరకు వారి ప్రాతినిధ్యాన్ని పెంచుకోగలగాలి.

దళితులను ప్రధాన స్రవంతిలోకి తీసుకురావడానికి విద్య, ఆర్థిక సాధికారత, సామాజిక చైతన్యం,  రాజకీయ భాగస్వామ్యం పెరగాలి. ఈ ప్రక్రియలో ప్రభుత్వం, సముదాయ సంస్థలు, మరియు సమాజం మొత్తం సమన్వయంతో పనిచేయడం కీలకమని గుర్తించాలి. 

  • తెలంగాణాలో కొన్నాళ్ళ పాటు కొనసాగిన దళిత బంధు పథకం పై మీ అభిప్రాయం? 

దళితుల అభివృద్ధి కోసం ప్రవేశపెట్టిన ఏ పథకాన్ని అయినా దాన్ని ఉపయోగించుకునే పద్ధతిలోనే దాని ప్రయోజనం ఉంటుంది. దళితబంధు అనేది కొన్ని గ్రామాలకు, ఆ గ్రామాల్లో కొంతమందికే పరిమితమైనప్పటికీ ఆ డబ్బుతో దళితులందరికీ ఉపయోగపడే పని చేయడం ద్వారా ఆ పథకాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. దురదృష్టవశాత్తు అది అనుకున్న లక్ష్యాలకు చేరలేదు. దళితులు పారిశ్రామికవేత్తలు కావాలనే ఆశయం, దానికొక లక్ష్యం లేకపోతే అటువంటి పథకాలు ఎన్ని పెట్టినా ప్రయోజనం ఉండదు.  దళితులు విదేశాలలో  చదువుకోడానికి కొన్ని లక్షల రూపాయలను ఆర్థిక సహాయంగా అందించే పథకాలు కూడా ఉన్నాయి. అయితే వాటిని అందుకున్న లబ్ధిదారులు మరలా దళితులకు సహాయం చేయాలని ఆలోచన ఉండాలి. దళితుల అందరి పేరు చెప్పుకొని పొందే ఆ సహాయం వ్యక్తిగతమైన అభివృద్ధికి లేదా ఒకటి రెండు కుటుంబాల ఉన్నతికి ఉపయోగపడితే ఇలాంటి పథకాలు ఎప్పటికీ దళితుల అందరికీ ఉపయోగపడతాయని చెప్పలేం. అందుకనే ముందుగా ఆ దళిత చైతన్యాన్ని అందుకోవాల్సింది దళితులే. 

  • ప్రైవేటు విద్యాసంస్థలు, కంపెనీలలో దళితులకు రిజర్వేషన్ల పట్ల మీ అభిప్రాయం.

ప్రభుత్వానికి సంబంధించిన అనేక అవకాశాలను ఉపయోగించుకుంటున్న ప్రైవేట్ సంస్థలు కూడా దళితులకు రిజర్వేషన్లు కల్పించాలి. సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది వాళ్లకు కూడా ఉంటుంది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 15(5) ప్రైవేటు విద్యాసంస్థలలో (మైనారిటీ సంస్థలు మినహా) SC, ST, మరియు OBCలకు రిజర్వేషన్లను అనుమతిస్తుంది, ఇది సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన వర్గాల అభివృద్ధిని ప్రోత్సహిస్తుంది. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో 93వ రాజ్యాంగ సవరణ (2005) ప్రైవేటు విద్యాసంస్థలలో రిజర్వేషన్లను చట్టబద్ధం చేసింది. అయినప్పటికీ అవి సరిగ్గా‌ కూడా 

ప్రైవేటు విద్యాసంస్థలు, ముఖ్యంగా IITలు, IIMలు, మరియు ఇతర ప్రముఖ సంస్థలు, ఉన్నత విద్య మరియు ఉపాధి అవకాశాలకు ద్వారాలుగా పనిచేస్తాయి. ఈ సంస్థలలో రిజర్వేషన్లు లేకపోతే, దళితులు ఈ అవకాశాల నుండి మినహాయించబడే ప్రమాదం ఉంది, ఇది సామాజిక అసమానతలను మరింత పెంచుతుంది. దీనివల్ల భవిష్యత్తులో అనేక సామాజిక సమస్యలు ఉత్పన్నమవుతాయి. ప్రైవేటు రంగంలో రిజర్వేషన్ల కోసం కూడా రాజకీయ మరియు సామాజిక ఉద్యమాలు ఊపందుకుంటున్నాయి. 

  •  ఉభయ తెలుగు రాష్ట్రాలలో గల పత్రికలు,  వాటిలో దళిత పత్రికల పట్ల మీ అభిప్రాయాలను తెలియజేస్తారా?  

నాకు తెలిసినంతవరకు దళితుల ఆధ్వర్యంలో నడుస్తున్న ప్రధాన జీవన స్రవంతిలో ఉన్న పత్రికలు లేవనుకుంటున్నాను. కానీ, కొన్ని పత్రికలు దళిత అంశాలపై కేంద్రీకరించి ప్రచురించాలనే ఉద్దేశంతో వెలువడుతున్నాయి. దీనిపై కూడా నా పుస్తకాల్లో ప్రత్యేక వ్యాసం రాశాను. వీటితోపాటు  డిజిటల్ పత్రికలు వస్తున్నాయి. ఈ దిశగా దళితులు బాగా ఆలోచించాలి. 

  • మీ అభిప్రాయంలో మీడియా — ముఖ్యంగా దళిత మీడియా — సామాజిక మార్పును ఎలా ప్రభావితం చేయగలదు?

అక్షరానికి గొప్ప శక్తి ఉంది. అందుకే కాళోజీ అనే మహాకవి ‘అక్షర రూపం దాల్చిన సిరా చుక్క లక్ష మెదళ్ళకు కదలిక’ అన్నాడు. ‘పత్రికొక్కటున్న పదివేల సైన్యము/పత్రికొక్కటున్న మిత్రకోటి/ప్రజలకు రక్షలేదు పత్రిక లేనిచో!!’ అని ప్రముఖ పత్రిక సంపాదకుడు నార్ల వెంకటేశ్వరరావు చెప్పారు. ఇలా ఎంతోమంది పత్రికల ప్రభావం గురించి చెప్పారు. పత్రికలు కూడా మీడియాలో భాగం కాబట్టి మీడియా కూడా అనువర్తించుకోవచ్చు. పత్రికలతో పాటు రేడియో, టీవీ, యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, లింక్డన్ మొదలైన సామాజిక మాధ్యమాలు కూడా మీడియాలో అంతర్భాగమే.  కానీ సాధారణంగా మీడియా అంటే పత్రికలు, టీవీలుగానే ప్రచారంలో ఉన్నాయి. వీటి గురించి మాట్లాడుకున్నా, వీటి ప్రభావం సామాన్యమైనది కాదు. అవి తలచుకుంటే ఏదైనా చేయడానికి సాధ్యమే. 


  •  Dalitha Shakthi మేగజైన్ వంటి ప్రచురణలు యువతను ఎలా ప్రభావితం చేయాలన్నది మీ అభిప్రాయం ఏమిటి?

దళిత శక్తి మ్యాగజైన్ దళిత సమస్యలను ప్రజల దృష్టికి తీసుకువెళ్లి ప్రజలందరినీ ఆలోచింప చేయడంతో పాటు, ముఖ్యంగా దళితులను  చైతన్యవంతం చేయడానికి కృషి చేస్తుంది. ప్రధాన జీవన స్రవంతిలో ఉన్న పత్రికలు, టీవీలు వంటివన్నీ దళితేతరుల చిన్న విజయాన్ని కూడా అదొక గొప్ప విజయంక ప్రచారం చేస్తూ ఉంటాయ్. దళితులు పెద్ద విజయాన్ని సాధించినప్పటికీ, దేశం కోసం త్యాగం చేస్తూ ప్రాణాలు అర్పించినప్పటికీ వాటిని పెద్దగా పట్టించుకోవు. ఒకవేళ పట్టించుకోవలసి వచ్చిన అది చాలా ప్రాధాన్యం లేని చిన్న వార్తగా మిగిలిపోతుంది. ఇటువంటి పరిస్థితులలో దళిత శక్తి పత్రిక దళితులలో ఉన్న ఆణిముత్యాలు లాంటి వారందరినీ పరిచయం, ప్రశంసించడం, వారి ప్రతిభను ప్రచారం చేయడంలో విప్లవాత్మకమైన పాత్రను పోషిస్తుంది. దళితులు కవర్ పేజీకి కూడా అర్హులని చాటి చెప్తూ ఆ కవర్ పేజీగా కూడా వారి ఫోటోలు ప్రచురిస్తుంది. దళితులతో పాటు వికలాంగులను కూడా ఎంతగానో ప్రోత్సహిస్తుంది. ఇదంతా దళితులు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవడానికి మరి ఎంతో మందికి స్ఫూర్తినిస్తుంది. ఇప్పటికే యువకులపై దృష్టి కేంద్రీకరించింది. ఆర్థికంగా కొంచెం నిలబడగలిగితే దళితులలోని సృజనాత్మక శక్తినీ, వారి విజయాలను దళితుల చేతే రాయించగలిగితే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు విజయాలు సాధించడమే కాదు వాటిని రాయగలిగినటువంటి శక్తివంతమైన కవులు రచయితలు కూడా ఉన్నారు. ఆర్థికంగా ఉన్నత స్థానంలో ఉన్న ప్రజా ప్రతినిథులు, దళిత వ్యాపారస్తులు, ఉన్నత ఉద్యోగులు ఇటువంటి పత్రికలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. 


  • అడిగిన ప్రశ్నలన్నింటికీ ఓపిగ్గా సమాధానాలు చెప్పినందుకు ధన్యవాదాలు సర్.

 నా అభిప్రాయాలను వ్యక్తీకరించే అవకాశం కల్పించినందుకు మీకు ప్రత్యేక కృతజ్ఞతలు. 

***