31.8.2020, సాయంత్రం 5 గంటలు
ఒక కవిసమ్మేళనం... నాకుఎదురైన ఒక మధురమైన సన్నివేశం గురించి
రాయాలనిపించింది.
ప్రపంచం ఎదుర్కొంటున్న కరోనా గురించి చాలామంది కవితలు చదివారు. దాన్ని ఒక నిశ్శబ్ద తృతీయ
ప్రపంచ సంగ్రామం గా అభివర్ణించారు. మరికొంతమంది కరోనాను అనేక పార్శ్వాల్లో చూడవలసి
ఉందని రాశారు. మనలో ఉన్న
అహంభావం పోయేలా మనం సాటి మనుషులతో వ్యవహరించవలసిన మానవ సంబంధాలను కరోనా తెలిపిందని
కొంతమంది కవులు వర్ణించారు. పాంచభౌతిక జీవితం పంచభూతాలతో ఉన్న సంబంధాన్ని
తెలియజేసిందని తాత్వికంగా కూడా కొంతమంది కవిత్వం రాశారు. కరువు సమయంలో మనుషులు
ఎదుర్కొన్న ఇబ్బందులను ఆ సమయంలో కొంతమంది చూపిన సహకారాన్ని కూడా కొంతమంది కవులు
వర్ణించారు. కొంతమంది కవులు కరోనాకు ముందు ఈ ప్రకృతితో మానవుడు ఎంత సంతోషంగా తన
ఆనందాన్ని పెనవేసుకుని జీవించేవాడో, అది కోల్పోయిన తర్వాత
గాని దాని విలువ తెలుసుకోలేకపోయారని మరలా అటువంటి చక్కని వాతావరణం సమాజంలో
ఎప్పుడొస్తుందోనని ప్రజలంతా ఎదురుచూస్తున్నారని వర్ణించారు.
ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు చేస్తున్న వివిధ కవితలకు తనదైన విశ్లేషణ చేయడం బాగుందని, శ్రోతలు, కవులు బాగా ఆనందిస్తున్నారని మధ్య మధ్యలో ఆచార్య కృపాచారి గారు నాలో కొత్త ఉత్సాహాన్ని నింపేవారు.
నన్ను కూడా ఒక కవిత చదవమన్నారు. గతంలో రాసుకున్న నా కవిత నాలో నీలో - నాన్న చదివి వినిపించాను. తండ్రి ప్రాధాన్యాన్ని వివరించే ఆ కవితను ప్రజెంటేషన్ ద్వారా చదివి వినిపించాను. ప్రతి ఒక్కరికి తల్లిదండ్రుల నిజమైన విలువ పిల్లలు పుట్టినప్పుడు తెలుస్తుందని వాళ్లను పెంచడంలో, సుఖసంతోషాలతో పాలుపంచుకోవడంలో ఉన్న ఆనందం మరలా తన తల్లిదండ్రులను గుర్తు చేసేలా ఉంటుందని ఆ కవిత సారాంశం. ఆ కవితను మరోసారి ఇక్కడ పెడుతున్నాను.
నువ్వు భయాన్నవతలకు విసరేసి
విశ్వాసాన్నంతా పరుచుకొని
నా యెదపై అలా గంతులేస్తుంటే
నీ గొంతు పలికే కేరింతలన్నీ
మా నాన్న కళ్ళ నుండి రాలిపడుతున్న
ఆనందభాష్పాలనిపిస్తున్నాయి
నువ్వు నా భుజమ్మీద నిలబడి
నీ రెండు చేతుల్నీ ఆకాశం వైపు
చూపిస్తున్నప్పుడల్లా
మళ్ళీ మా నాన్న చేతుల్నే ప్రే
మగా తాకుతున్నట్లనిపిస్తుంది
నువ్వు నా ఒడిలో గువ్వలా ఒదిగిపోతున్నప్పుడల్లా
మా నాన్న మా కోసమెలాకరిగిపోయాడోనంటూ
గుండె మరింత గట్టిగా కొట్టుకుంటున్నట్లనిపిస్తుంది
నువ్వు నా చుట్టూ అలా ఆడుకుంటుంటే
మా నాన్నే నాతో ఆడుకుంటున్నట్లనిపిస్తుంది
నాన్నా!
నువ్వు నాకో ఆత్మవిశ్వాసపు ఆకాశం
నువ్వు నాకో నిత్య పరిమళాల ఆనందపు జల్లు
నువ్వు నాకో రంగురంగుల ఇంద్రధనస్సు
నీలోని నేనే
నాలోని నువ్వు
నీతో మళ్ళీ ఆడుకోవడమంటే
నవ్వుల పూదోటలో విహరించడమే!
-ఆచార్య
దార్ల వెంకటేశ్వరరావు,
దీనితో పాటు తెలుగు భాష
ఔన్నత్యాన్ని చాలామంది కవులు కవిత్వం ద్వారా వినిపించారని చెబుతూ, సౌత్ ఆఫ్రికా తెలుగు సమాఖ్య వారు 29వ తేదీ ఆగస్టు 20 20 న అంతర్జాలం ద్వారా జరిగిన ఒక
సమావేశంలో నేను ప్రసంగిస్తూ ఒక పద్యం చెప్పానని ఆ పద్యాన్ని ఈ సందర్భంగా చదివి
వినిపించాను.
అమ్మమాటవోలె అమృతంబు కురిపించె
గగన గంగవోలె కవనమయ్యె
తెలుగు భాష భువిని వెలుగించు చుండెరా
దారి పూల తోట దార్ల మాట!
...ఇలా ఆయన ప్రశంసలు కురిపిస్తుంటే నాకు తెలియకుండా ఆనందభాష్పాలు రాపిపోయాయి.,
ఇది నిజంగా నా జీవితంలో
అనూహ్యంగా ఎదురైన ఒక మధురమైన సన్నివేశం.
ఆ మాటలకు ధన్యవాదాలు తెలియజేసి,
నేనిలా ఉండడానికి ఆచార్య కృపాచారిగారు లాంటి వారు ఎంతోమంది కారణమని, జీవితంలో
క్రమశిక్షణ, వినయం, నిరంతరం శ్రమించడం పెద్దవాళ్లనుండి నేర్చుకున్నానని, మీ లాంటి
సహృదయుల తోడ్పాటే నన్ను ఈ స్థితిలో ఉంచిందని కృతజ్ఞతలు చెప్తూ గొప్ప రిలీఫ్ గా
ఫీలయ్యాను.
కరోనా సమయంలో, ఇంటికే
పరిమితమైనా, తమ భావాలు ఏదొకలా విస్తరిస్తున్న కవులను, సాహితీ వేత్తలను
అభినందిస్తున్నాను.
-ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, 1.9.2020
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి