నిబద్ధతకు నిజమైన చిరునామా
శ్రీ వేల్పూరి కామేశ్వరరావు గారు
అవును...ఈ మాట నేనే కాదు, ఆయనతో పరిచయం
ఉన్నవాళ్ళంతా చెప్పేమాటనుకుంటాను. ఆయన చాలా కాలం పాటు రైల్వేలో పనిచేశారు.
అందువల్లనేనేమో రైల్వే కార్మికుల గురించి ఆయన సాధికారికంగా
రాయగలుగుతున్నారనుకుంటాను. ఆయన ఫేసుబుక్కులో రాసిన రచనల్ని ‘అగ్నిగోళం’
పేరుతో ప్రచురించారు. దాన్ని చదివిన తర్వాత ఆ పుస్తకం, దానితో పాటు ఆయన పట్ల
నాగున్న కొన్ని అభిప్రాయాల్ని మీతో పంచుకోవాలనిపించింది.
ఇదిలా ఉండగా ఈ మధ్య సోషల్ మీడియా
ప్రాధాన్యం బాగా పెరిగింది. పత్రికల్లో రాస్తే, వాటికి వచ్చే స్పందన ఎలా ఉంటుందో
తెలియడం వెంటనే సాధ్యమైయ్యే అవకాశం తక్కువ. సోషల్ మీడియా- ఫేసుబుక్, వాట్సాప్,
ట్విట్టర్, బ్లాగు... ఇలా రకరకాల రూపంలో సోషల్ మీడియాలో వెంటవెంటనే పాఠకుల
స్పందనలు బహిర్గతమౌతున్నాయి. శ్రీ వేల్పూరి కామేశ్వరరావుగారు ఒక భారతీయ పౌరుడిగా,
ఒక పార్టీ అధ్యక్షుడిగా, ఒక బాధ్యత కలిగిన రచయితగా, సామాజిక కార్యకర్తగా తన
అభిప్రాయాల్ని స్వేచ్ఛగా ‘ఫేసుబుక్’లో రాస్తుంటారు. వాటిని అలాగే
వదిలేయకుండా, వాటిని ఒక పుస్తకరూపంలో తీసుకొచ్చారు. అందుకు ముందుగా ఆయన్ని
అభినందిస్తున్నాను. ఆ పుస్తకానికి పెట్టిన‘అగ్నిగోళాలు’’ అనే
పేరులాగే, దానిలో ఆయన ఆలోచనల్లోని వేడినీ, వాడినీ, ఆయన గుండె కొట్టుకునే సామాజిక
బాధ్యతనూ, ఏమీ చేయలేకపోతున్న నిస్సహాయతలో నుండి వెలువడిన విమర్శనా వాడినీ
ప్రదర్శించారనిపించింది. దీన్ని సెప్టెంబర్,2019లో ప్రచురించారు. ప్రతి నెలా
రైలుశక్తి పత్రికను ఇంటికి తీసుకొచ్చి ఇచ్చే క్రమంలోనే ఈ పుస్తకాన్నీ నాకిచ్చి, నా
అభిప్రాయాన్ని చెప్పమన్నారు. పత్రికను చదివినంత వేగంగా, దానిపై నా అభిప్రాయాల్ని
చెప్పలేకపోయాను. నాకు కొన్ని పరిమితులున్నాయి. ఆయన విమర్శించినంత ‘వేడిగా’ నేను చెప్పలేను. వ్యక్తిగతంగా
కొంతమందిని పేరు పెట్టి నిందించడాన్ని నేను అంగీకరించలేను. అంతే కాదు, కొన్ని
భావాలతో అంగీకరించలేననీ భావిస్తున్నాను.
కానీ, ఆయన అంత ‘వేడిగా’ చెప్పడంలో ఆయన ఆవేదనను అర్థంచేసుకోవాల్సిన అవసరం
ఉందనిపించింది. ఈ పుస్తకం చదివిన తర్వాత కామేశ్వరరావు గారికి ఉన్న భావజాలం, వివిధ
భావజాలాల పట్ల ఆయన పడుతున్న సంఘర్షణను అర్థం చేసుకునే ప్రయత్నం చేయవచ్చు.
‘అగ్నిగోళాలు’ పుస్తకంలో ప్రకటించిన భావాల్ని
గమనిస్తే, ప్రజాస్వామ్యం పట్ల ఆయనకెంతో నమ్మకం ఉందని తెలుస్తుంది. కానీ, దాన్ని
రాజకీయ పార్టీలు దుర్వినియోగం చేస్తున్నాయని ఆవేదన చెందుతారు. దేశ స్వాతంత్ర్యం
కోసం, ప్రజాస్వామ్యం కోసం పాటుపడిన వారి పేరు చెప్పినంతగా, ఆచరణలో వారి ఆశయాల్ని
నెరవేర్చలేకపోతున్నారని ఆయన ఆవేదన చెందుతారు. ‘స్వాతంత్ర్య దినోత్సవం కోసం’
(పుట:17), దేశం కోసం ప్రేమలత పోరాటం
(పుట:26), ప్రజాస్వామ్యం కోసం భరతమాత తపన
(పుట: 33), అపహాస్యం పాలవుతున్న ప్రజాస్వామ్యం (పుట: 35), అప్రజాస్వామిక
పార్టీలకు, శక్తులకు వ్యతిరేకంగా పోరాడాలి (పుట:97) మొదలైన వ్యాసాలన్నీ ఆయన
ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పడే ఆవేదనను తెలియజేస్తున్నాయి. ఆ ఆవేదన ఆవేశంగా మారిన
వ్యాసాలు కొంతమంది పాఠకుల్ని ఆలోచన కంటే ఆవేశాన్ని కల్గించేలా ఉన్నాయి. కానీ,
ఆలోచనాత్మక ప్రణాళిక తనకుందని నిరూపించేవిషయాలు ‘ఇండియన్ లేబర్ పార్టీ తీర్మానాలు’
(పుటలు:67-68) చదివితే తెలుస్తుంది.
తన జీవితంలో సాధించిన వాటిని చూసి, నాడు ఉద్యమాలు చేస్తే మంచి ఫలితాలు
వచ్చేవని, కానీ నేడు ఆ పరిస్థితి కనిపించడంలేదనే అసంతృప్తీ తన రచనల్లో తీవ్రతకు ఒక
కారణమేమో అనిపిస్తుంది.
‘స్కూలు కోసం ఆందోళన’ పేరుతో రాసిన అనుభవాత్మక ఉద్యమాన్ని (పుట:13), మా దుద్దుకూరు స్కూలు (పుట: ), మా టీచర్సుకు
నమస్సులు (పుట: 50), ఐలయ్యగారికి సంఘీభావంగా... (పుట: 80) మొదలైనవన్నీ ఆత్మాశ్రయ పద్ధతిలో రాసిన
వ్యాసాలు. ముఖ్యంగా 1987లో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు కోసం జరిగిన ఉద్యమాల్లో
తాను సస్పెన్షన్ కి గురైనా, ఆ ఉద్యమం ఫలితం ఇచ్చిందనే సంతృప్తి ఒక మధురమైన
జ్ఞాపకంగా నెమరువేసుకుంటారాయన. ఆ
దుద్దుకూరు ఆచార్య రంగా జిల్లా పరిషత్ స్కూలు హెడ్మాస్టర్ కి తన ‘జిజ్ఞాసతరంగాలు’
పుస్తకం ఇచ్చినప్పుడు, ఆ హెడ్మాస్టర్ కళ్ళల్లో వెలిగిన వెలుగో, తానింత
వాడినయ్యానని గురువుగార్కి చెప్పినట్లయ్యిందో గానీ అదొక మరిచిపోలేని అనుభూతిగా
భావిస్తారాయన.
కామేశ్వరరావుగారితో మాట్లాడినా, ఆయన రచనలు చదివినా
వాటన్నింటిలోనూ మార్క్సిజం పట్ల ప్రేమా, అంబేద్కరిజం ప్రదర్శించే వాస్తవికత పట్ల
ఆత్మీయతా, బహుజనులు, శ్రామికుల పట్ల తాదాత్మ్యం మనం గమనించగలుగుతాం. కుహనా
మార్క్సిస్టుల పట్ల వ్యతిరేకత ఉందే తప్ప, కారల్ మార్స్క్ సిద్ధాంతాల పట్ల ఆయనకు
వ్యతిరేకత కనిపించదు. ఆయన భౌతికవాదిగా కనిపిస్తారు. అయినా, పోతులూరి
వీరబ్రహ్మంగారి తత్త్వాల్లోని కొన్ని విషయాల పట్ల సానుకూలమైన ఆలోచనా దృక్పథాన్ని
ప్రదర్శిస్తారు. ఆనాడే వీరబ్రహ్మంగారి బోధనల్లో సమానత్వ భావనలు ఉన్నాయంటారు.
ఆయనకున్న ప్రాపంచిక దృక్పథం, సమకాలీన రాజకీయాలు, వాటి ఆచరణ మొదలైన అంశాలతో పాటు,
ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశపెట్టిన ఆంగ్లమాధ్యమం పేదలకెంతగానో సహకరించే చర్య అని
దాన్ని సమర్థించడం వంటి వన్నీ తెలియాలంటే MAP TV కి ఇచ్చిన ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూని వినాలి. కుండబద్దలు కొట్టినల్లు తన
అభిప్రాయాల్ని ఆ ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. తన జీవితం, విద్యాభ్యాసం, ఉద్యమం,
ఉద్యోగం, ప్రస్తుతం పనిచేస్తున్న రాజకీయ పార్టీ అనుభవాలు వంటివెన్నో దీనిలో
చెప్పారు.
ఇంత పటిష్టమైన సైద్ధాంతిక అవగాహన
ఉన్న కామేశ్వరరావుగారు, సైద్ధాంతికత కోసం తాను చేసినవాటిని దాచేసి రాయకుండా, తాను
చేసిందాన్ని చేసినట్లు సెప్టెంబరు, 19
వతేదీ, 2015న ‘‘ మా అమ్మకోసం’’ (పుట: 15-16) అని రాసిన ఒక జ్ఞాపకాన్ని చదివి
తీరాల్సిందే. తన తల్లి ఆంజనేయస్వామినీ, వీరబ్రహ్మేంద్రస్వామినీ మ్రొక్కే వారట.
‘‘బహుశ మా అమ్మ తను చనిపోయిన, నా చుట్టూ ఎల్లప్పుడు ఉంటూ కాపాడుతుందని అనిపిస్తోంది’’ అని రాసుకున్నారు.
తన అభివృద్ధికి తన అమ్మగారెంత విడదీయనంతగా కలిసిపోయారో చెప్పడమే దీని ఆంతర్యం
కావచ్చు. అంతే కాదు, తన కుమార్తె రూపంలో పుట్టిందేమోనంటారాయన. ఇక్కడ ఆయన
కర్మసిద్ధాంతాన్ని నమ్ముతున్నారనిపిస్తుంది. కానీ, తన తల్లిపట్ల తనకున్న
తాదాత్మభావాన్నిలా వ్యక్తం చేశారు. ఎంతో నిజాయితీగా, ఆత్మీయంగా రాసుకున్న ఈ రైటప్
నాకెంతో నచ్చింది. బహుశా మీకూ నచ్చవచ్చు. చదవండి.
ఇక, ముగించే ముందు రెండు విషయాలు
చెప్పాలనుకుంటున్నాను. ఆయనకు పెత్తందారులు, భూస్వాములు, పాలకుల పట్ల ఎంతో
వ్యతిరేకత ఉన్నట్లు అనిపించడానికి కారణం, బహుశా వాళ్ళలో కొంతమంది చేసే పనులు.
ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల్ని తమ రాజకీయాలకు వాడుకోవడాన్ని నిరసించడం ఆ విషయాన్నే
తెలుపుతుందనుకుంటున్నాను. మరో విషయం- తన భావాల్ని, అవీ కెరటాల్లా ఉరికొచ్చే
భావాల్ని అంతే ఉద్వేగంతో కవిత్వీకరించడం, వాటిని ఈ పుస్తకంలో అక్కడక్కడా
ప్రచురించడం పాఠకులెవరూ విస్మరించలేరు. ఈయన కవిత్వంలో ఆవేశం ఉంటుంది. ఆ ఆవేశం
కేవలం ఆవేశం కాదు, అది ధర్మాగ్రహం అని ఆలోచిస్తే తెలుస్తుంది. దాన్ని
వ్యక్తీకరించడంలో సౌందర్యానికంటే, సూటితనానికే అధిక ప్రాధాన్యానిస్తారు. కొన్ని
పదాల్ని వాడ్డంలో కట్టలు తెంచుకున్న ఆవేశం కొంతమంది పాఠకుల్ని ఇబ్బందుల్లో
పడేస్తుంది. దానివల్ల ప్రవక్తలా చెప్పిన మంచి వాక్యాలు కూడా ఆ పదాల వల్ల మరుగున
పడే అవకాశం ఉందేమననిపిస్తుంది. MAP TVలో ప్రసారమైన ఇంటర్వ్యూలో ఆయన నోటి
నుండి చదివే కవిత్వాన్ని వెంటే, వినేవాళ్ళు కూడా ఆయన్నే సమర్థిస్తారేమోనని కూడా
అనిపిస్తుంది. 15 వచన కవితలు, ఒక పాట దీనిలో ఉన్నాయి. చివరిలో ఆయన రాసిన
కవిత్వపంక్తులు శాశ్వతంగా నిలిచిపోయే ప్రవక్త వచనల్లా ఉన్నాయి. వీటితో పాటు
శ్రీశ్రీ, శివసాగర్ తదితరులను ప్రస్తావిస్తూ రాసిన వ్యాసాల్లో ఆయన సాహిత్యాభిరుచి
కనిపిస్తుంది.
‘‘గోడమీద
ప్రపంచపటం
చూసినప్పుడల్లా
నాకు శ్రమజీవుల
కన్నీళ్ళే
మహాసముద్రాలుగా
కనిపిస్తాయి’’ అని ముగింపులో కొన్ని
కవితాపంక్తుల్ని రాసిన ఆయన తన ‘అగ్నిగోళాలు’ గ్రంథాన్ని శ్రామికులకే అంకితం
చేశారు. సాధారణంగా మన తెలుగు సమాజంలో ఉగాది వస్తుందంటే ముందే కోయిల కూసినట్లు
కవులు తమ సాంస్కృతిక ఔన్నత్యాన్ని
కీర్తిస్తూ కవిత్వమైపోతుంటారు. ఆచరణలో ఆ సంస్కృతిని దగ్గరుండి చూసేవాళ్ళకి
వాళ్ళలో ఉండే హిపోక్రసీ తెలిసి ఎంతో చిరాకనిపిస్తుంది. తమ కీర్తి కండూతి కోసం
కవిత్వం రాయడం కంటే మానేయడమే మంచిది. కామేశ్వరరావు గారు ఉగాది కవికాదు,
కామేశ్వరరావుగారు ఒక్క మాటలో చెప్పాలంటే పండుగలకు మాత్రమే స్పందించే కవికాదు.
అందుకే ఉగాది వస్తుంటే, అందరూ కవిత్వం రాస్తున్నా, ‘‘నాకు రాయాలని ఉండదు’’ అంటారు.
ఒకవేళ రాద్దామనుకుంటే ఆత్మహత్యల ఘోషలు, హంతకుల హత్యలు...’’ (పుట:24)
కళ్ళముందుకొస్తాయంటాడాయన. వాటినన్నింటినీ కప్పిపుచ్చుకొని తమ గొప్పతనాన్ని
పొగుడుకోవడం ఒక హిపోక్రసీ అవుతుందని భావిస్తాడాయన.
సమాజంలో సినిమా చూపే ప్రభావం
సామాన్యమైంది కాదు. కానీ, దాన్ని తీసే దర్శకులు, మాటలు, పాటలు రాసే రచయితలు బాధ్యత
లేకుండా వ్యవహరిస్తుంటే, వాటి ప్రభావం పడిన పిల్లలెలా తయారౌతారని మరో కవితలో
వాళ్ళని ‘సినీ క్రిమినల్స్ గా అభివర్ణిస్తూ, ప్రశ్నిస్తాడాయన. అలాగే,
మనుధర్మశాస్త్రం ప్రభావం కూడా సామాన్యమైందికాదు. అది తరతరాలుగా నరనరాల్లో ఇంకిపోయింది.
అది చివరికి చారిత్రక, గతితార్కిక
భౌతికవాదాన్ని కూడా మింగేసేస్థితికొచ్చిందని ‘వివేక్ కిసంతాపం’లో
బాధపడతాడాయన. తాను చేస్తున్న పనికి ‘చెట్లు ఆనందంతో పులకించిపోతున్నాయి’ అని
ప్రారంభం చూసి అద్భుతమైన కవిత్వం కదా అనిపిస్తుంది. కానీ, తర్వాత నినాదప్రాయమైపోయింది.
జీవితమంటే ఒక సంఘర్షణ అని గుర్తించాలి. సంఘర్షణ
అభివృద్ధికి మూలమని చెప్తూ, జీవితంమంటే పూలపాన్పులా ఉండదంటాడాయన.
చిన్నచిన్న కారణాలకే చనిపోయే వాళ్ళను చూసిన చలించిపోయిన ఈ కవి బ్రతుకుని ఒక
పోరాటంగా భావించాలనీ, బ్రతకడానికి రకరకాల పనులున్నాయని, డిగ్నిటీ ఆఫ్ లేబర్
అనేదేమిటో తెలుసుకుంటే ఎలాగైనా బ్రతకవచ్చునంటారాయన. అందుకోసమే దీన్ని రాస్తే
ఏముంది? ఒక వేళ చనిపోవాల్సివస్తే, భగత్ సింగ్, రాజగురు, సుఖ్ దేవ్ వంటి త్యాగాలు
చేసి చనిపోవాలని ప్రబోధిస్తాడాయన. ప్రతి మనిషి పుట్టుకకు ఒక కార్యకారణ సంబంధం
ఉందని గుర్తించమనే గొప్ప ప్రబోధాత్మక కవితనొకటి రాశారు. ఇలా కవిత్వంలో తన అంతరంగాన్నీ,
ఆత్మస్థైర్యాన్నీ, పోరాటపటిమనీ అభివ్యక్తీకరించిన కామేశ్వరరావుగారి మరొక్క కవితను
పరిచయం చేస్తూ దీన్ని ముగిస్తాను. కామేశ్వరరావుగారు ‘‘చైతన్యమూర్తి’’ అనే పేరుతో
ఒక కవితను రాశారు. దానిలో తన దృక్పథం, తన తాత్త్వికతను వెల్లడించారు.
‘‘నేను
నా బొటను వ్రేలు
కోల్పోయిన ఏకలవ్యుడిని
తలకాయ తీయబడిన
శంబూకుడ్ని
దొంగదెబ్బతో
చంపబడిన వాలిని
ముక్కు చెవులు
కోల్పోయిన శూర్పణకను
చదువుకు దూరంగా
నెట్టబడిన బహుజనుడ్ని...’’ ఇలా కృత యుగం నుండి కలియుగం అని
చెప్పుకునే నేటివరకూ జరిగిన దుర్మార్గాల్నీ, కుట్రల్నీ, కుతంత్రాల్నీ కవిత్వంగా
మార్చి, యుగయుగాలుగా అణచివేతకు గురైన వారి స్వరాన్నవుతానని ప్రకటిస్తారాయన. తమపై
కొనసాగుతున్న అధర్మాన్ని ప్రశ్నిస్తే, తమపై జరుగుతున్న అణచివేతలను ఎదుర్కోవడం కోసం
తిరగబడితే, అటువంటి వాళ్ళను విప్లవకారులుగా, ఉగ్రవాదులుగా భావిస్తున్నారనీ
చెప్తూ...
‘‘మీ ఆధిపత్య
కళ్ళకి
నేనొక
ఉగ్రవాదిని
అవును నేనొక
ఉగ్రవాదిని’’ అని అంగీకరించైనా తమ హక్కుల్ని సాధించుకోవడానికి తమ
మార్గాల్ని వీడని వాళ్ళతోనే తన పయనమని ప్రకటిస్తాడాయన. తమ ఆవేదన సరిగ్గా అర్థం
చేసుకుంటే తానెవరో తెలుసుకోగలుగుతారంటూ...
‘‘కానీ, నేనొక
మార్పుని
మావి కన్నీళ్ళు
కావు
తుపాకీ గుండ్లు
మావి ఆవేదనలు
కావు
అణుబాంబులు’’ అని మీకు స్పష్టమవుతుందంటాడాయన. ఈ కవిత ‘నేను’’ అని ప్రారంభమౌతుంది. ఈ నేను
ఒక కోణంలో కామేశ్వరరావుగారు. అంటే ఆయన తాత్త్విక దృక్పథం. రెండోది ‘‘నేను’’ అంటే
భారతదేశంలో తరతరాలుగా అణచివేతకు గురౌతున్న కుల, వర్గ, లింగ పీడితులందరికీ
ప్రాతినిథ్యం వహించడం. తనకు గౌతమబుద్ధుడు, పోతులూరి వీరబ్రహ్మం, కారల్ మార్క్స్, జ్యోతిరావు
ఫూలే, సావిత్రిబాయి ఫూలే, భగత్ సింగ్, రాజగురు, డాక్టర్ బాబాసాహెబ్
అంబేద్కర్ మొదలైనవారి తాత్త్విక చింతన పట్ల స్పష్టత ఉందని ఈ కవిత, ఈ వ్యాసాలన్నీ
తెలుపుతాయి. శ్రీ వేల్పూరి కామేశ్వరరావు గారు తానేది మాట్లాడతారో, అదే రాస్తారు.
తానేది రాస్తారో, అదే ఆచరణలో చూపిస్తారు. తానే సిద్ధాంతాన్ని నమ్ముతారో, అదే
సిద్ధాంతం కోసం నిబద్ధతతో జీవిస్తున్నారు. అందుకే ఆయన రాసిన ఈ గ్రంథాన్ని
చదవాలనిపించింది. చదివిన కొన్ని అంశాల్ని మీతో పంచుకోవాలనిపించింది. ఎవరైనా తాను
సోషల్ మీడియాలో రాసినవి కూడా ఏదో ఉబుసుపోక రాయరనీ, రాసినవాటిని ఒకచోట ఇలా భద్రం
చేసుకుంటే ఏ యే సమయాల్లో మనమెలా ప్రవర్తించామో, ఎలా మన ఆలోచనలు కొనసాగాయో తెలియడానికి
పుస్తకరూపంలో వస్తే అవి భవిష్యత్తులో ఎంతో ఉపయోగం.
ఈ కాలానికి కావల్సిన మనిషి
వేల్పూరి కామేశ్వరరావుగారు.
ఆయనకు నమస్కరిస్తున్నాను.
-
ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు,
ప్రొఫెసర్, తెలుగు శాఖ, సెంట్రల్ యూనివర్సిటి, హైదరాబాదు. 4.4.2020
( ఈ వ్యాసాన్ని ‘రైలుశక్తి’ మే,
2020 ప్రత్యేక సంచిక ( సంపుటి.20, సంచిక.5.), పుట: 32-38)
సంపాదకులకు నా ప్రత్యేక ధన్యవాదాలు)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి