"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL-426: Indian Literature క్లాసులు మధ్యాహ్నం 12.00 గంటల నుండి 1.00 వరకు జరుగుతాయి.

26 అక్టోబర్, 2020

తిలక్ సాహిత్యం అంతర్జాల అంతర్జాతీయ సదస్సు ( 26.10.2020) సదస్సులో దార్ల

 
ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం, రాజమహేంద్రవరం మరియు మహర్షి సాత్యవతేయ విజ్ఞాన పరిషత్ వారు సంయుక్తంగా ‘‘ఆధునిక తెలుగు సాహిత్యం- తిలక్ వైశిష్ట్యం’’ పేరుతో గత మూడు రోజులుగా నిర్వహిస్తున్న అంతర్జాల అంతర్జాతీయ సదస్సు సమాపనోత్సవంలో గౌరవ అతిథిగా ఆచార్య దార్లవెంకటేశ్వరరావు పాల్గొన్నారు. దేవరగొండ బాలగంగాధర్ తిలక్ గారి కవిత్వంలో ‘‘త్రిమూర్తులు’’ కవితలో విశ్వనాథ, దేవులపల్లి కృష్ణశాస్త్రి, శ్రీశ్రీల గురించి వర్ణించారని, దాని ద్వారా తిలక్ సాహిత్య లోతులు, వారి దృక్పథాన్ని అవగాహన చేసుకోవచ్చునని అన్నారు. చాలా మంది కవితిలక్ గురించీ, స్వాతంత్ర్య ఉద్యమకారుడు తిలక్ కీ తేడాలేకుండా కూడా కొంతమంది మాట్లాడుతున్నప్పుడు చాలాబాధ అనిపిస్తుందన్నారు. తిలక్ కవిత్వం గురించి పరిశీలన చేసేటప్పుడు గుంటూరు  శేషేంద్ర శర్మ గారి కవిసేనమేనిఫెస్టో తో తులనాత్మకంగా పరిశీలన చేయవచ్చనని అన్నారు. 


సా



 సదస్సులో మాట్లాడుతున్న ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు 

 

24 అక్టోబర్, 2020

Benaras Hindu University లో కీలకోపన్యాసం స్పందనలు

అనేక సందర్భాలలో నన్ను వెన్నుతట్టి  ప్రోత్సహించి  ధైర్యం నింపి ఆశావహదృక్పథం కలిగించిన  గురువర్యులు ఆచార్య  దార్ల వేంకటేశ్వరరావు గారికి నమస్కారాలు.  ఇవ్వేళ శతకంసాహిత్యం గురించి మీరు చేసిన కీలకప్రసంగం   చాలా బాగుంది.  కాలానుగుణంగా వదిలించుకోవాల్సినవి, విదిలించుకోవాల్సినవి ఉన్నాయని, వాటిని పునర్మూల్యాంకనం చెయ్యవలసిన అవసరాన్ని  నిర్దేశించారు. ఇతరులు నొచ్చుకునేలా రచనలు చేయరాదన్నారు. ఇదే కదా పరేంగిత సారం ఎంత సూక్ష్మంగా చెప్పారు అనిపిస్తుంది. వ్యాకరణం, ఛందస్సు క్రమతని నేర్పేవే కాని సంకెళ్ళు కావని, వాటి బోధనలో జాగ్రత్తవహించాలని అన్నారు. ఈ రంగంలో పరిశ్రమిస్తున్న నాకు ఉపదేశంగా ఉంది. ఈ అంతస్సూత్రాన్ని ఎప్పుడూ పాటిస్తాను గురువు గారు. మీరు కీలకప్రసంగం చేసిన వేదికలో తరువాత పత్రసమర్పణ చేయటం భాగ్యంగా భావిస్తున్నాను. ధన్యవాదాలు. అంతేవాసి. లక్ష్మీనారాయణ🙏🙏🙏

ఆంధ్ర జ్యోతి దినపత్రిక, 24.10.2020 సౌజన్యంతో


 

23 అక్టోబర్, 2020

ఈరోజు (23.10.2020) జరిగిన వెయ్యేళ్ళ తెలుగు శతక సాహిత్యం-సమాలోచనం అనే అంతర్జాతీయ అంతర్జాల సదస్సు లో కీలకోపన్యాసం చేసిన ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు


ఆంధ్ర జ్యోతి దినపత్రిక, 24.10.2020 సౌజన్యంతో


 ఈరోజు (23.10.2020) జరిగిన వెయ్యేళ్ళ తెలుగు శతక సాహిత్యం-సమాలోచనం అనే అంతర్జాతీయ అంతర్జాల సదస్సు లో కీలకోపన్యాసం చేసిన ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు



22 అక్టోబర్, 2020

వెయ్యేళ్ళ తెలుగు శతక సాహిత్యం-సమాలోచన ( BHU లో 23 అక్టోబర్ 2020 నుండి 24 అక్టోబర్ 2020 వరకు)

 వారణాశిలోని బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం వారు, జానుడి- సెంటర్ ఫర్ లిటరేచర్ అండ్ ఆర్ట్స్ మల్లవరపు మధుర సాహిత్య భారతి ఒంగోలు వారు సంయుక్తంగా ది 23 అక్టోబర్ 2020 నుండి 24 అక్టోబర్ 2020 వరకు రెండు రోజుల పాటు వెయ్యేళ్ళ తెలుగు శతక సాహిత్యం-సమాలోచన అంతర్జాల అంతర్జాతీయ సదస్సుని నిర్వహిస్తున్నారు.

Prof Ch Sreeramachandramurthy is inviting you to a scheduled Zoom meeting.


Topic: తెలుగు శాఖ- బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం మరియు  జానుడి సెంటర్ ఫర్ లిటరేచర్  & ఆర్ట్స్ (ఒంగోలు ) సంయుక్త ఆధ్వర్యం లో వెయ్యేళ్ళ తెలుగు శతక సాహిత్యం -సమాలోచన అనే అంతర్జాల అంతర్జాతీయ వెబినార్

Time: Oct 23 & 24 , 2020 11:00 AM India


Join Zoom Meeting

https://us02web.zoom.us/j/88366097803?pwd=akFYZUpmS05aRDF0dThrL2t4bmg0UT09


Meeting ID: 883 6609 7803

Passcode: telugubhu





21 అక్టోబర్, 2020

పరిశోధనల్లో ప్రవేశాల కోసం అంతర్జాలం ద్వారా ఇంటర్వ్యూలు

 గత మూడు రోజులుగా (19.10.2020 to 21.10.2020) జరుగుతున్న ఎం.ఫిల్,  పి హెచ్. డీ. తెలుగు ప్రవేశాల కోసం ఇంటర్వ్యూలు ఈరోజుతో పూర్తయ్యాయి.


 తెలుగు శాఖ అధ్యాపకులు అడ్మిషన్ కమిటీలో మెంబర్స్ గా ఉన్నారు. తెలుగుశాఖ అధ్యక్షులు ఆచార్య జి.అరుణ కుమారి ఈ కమిటీకి ఛైర్ పర్సన్ గా ఉన్నారు. అంతర్జాలంలో జరిగిన ఈ ఇంటర్వ్యూ లకు ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు సాంకేతిక సహకారం ఇతర అంశాలను చూడడానికి కోఆర్డినేటర్ గా సహకారాన్ని అందించారు. గ్రామీణ ప్రాంతాలలో  ఇంటర్నెట్ అనేక సమస్యలు సృష్టించినప్పటికీ అభ్యర్థులు అంతర్జాలం ద్వారా హాజరయ్యారు. అంతర్జాలం ద్వారా జరిగిన ఈ ఇంటర్వ్యూల్లో అనేక సార్లు 'మీకు వినిపిస్తుందా?' అని మేము- మీకు వినిపిస్తుందా అని అభ్యర్థులు ఒకరినొకరు చెప్పుకోవడం బలే వింతగా అనిపించేది. సాధ్యమైనంత వరకు యూనివర్సిటీలో ఇంటర్నెట్ సమస్య రాలేదు కానీ, స్పీకర్స్ సరిగ్గా పనిచేసేవి కాదు.మిగతా అన్నీ బాగానే జరిగాయి. మొదటి సారి ఇంటర్వ్యూలన్నీ రికార్డు చేశారు. గూగుల్ మీట్ ద్వారా ఈ ఇంటర్వ్యూలు జరిగాయి. 

17 అక్టోబర్, 2020

ముత్యాల రఘుపతి గారి ‘‘ముత్యాల కైతికాలు’’ పుస్తకావిష్కరణ 17.10.20120

సాహిత్యం ద్వారా కూడా సమాజంలో వివిధ సమస్యల పట్ల ఆలోచించేలా చేయవచ్చునని, సామాన్య ప్రజలను కూడా చైతన్య పరుస్తూ కవిత్వం రాసిన కవి ముత్యాల రఘుపతి అని  సెంట్రల్ యూనివర్సిటీ తెలుగు ప్రొఫెసర్ దార్ల వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. ముత్యాలు రఘుపతి రాసిన 'ముత్యాల కైతికాలు' గ్రంథావిష్కరణను శనివారం సాయంత్రం అంతర్జాల వేదిక ద్వారా వరంగల్ అర్బన్ జిల్లా భువన సాహిత్య విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో నిర్వహించారు. జక్కు కృష్ణ మూర్తి అధ్యక్షతన జరిగిన ఈ సాహిత్య సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని, గ్రంథాన్ని ఆవిష్కరించిన ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ముత్యాల రఘుపతి అభ్యుదయ దృక్పథంతో, సామాజిక ప్రయోజనాన్ని ఆకాంక్షిస్తూ కైతికాలు రాశారని వివరించారు. రఘుపతి గారి కవిత్వంలో కొన్ని చోట్ల బయోగ్రాఫికల్ స్టైల్ కనిపిస్తుందని, అటువంటి ఖండికలు భవిష్యత్తులో పాఠశాల స్ధాయిలో విద్యార్థులకు పాఠ్యాంశాలయ్యే అవకాశం ఉందని ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు వ్యాఖ్యానించారు.
 ఈనాడు దినపత్రిక 19.10.2020 సౌజన్యంతో


గాంధీ, అంబేద్కర్ ల గురించి రాసిన కైతికాల్లో ఈ శైలిని చూడొచ్చని సోదాహరణంగా ఆయన  వివరించారు. పాలపిట్టను చూస్తే మంచిదనుకోవడం ఒక మూఢవిశ్వాసమని, అన్ని పక్షులూ విలువైనవేనని అనడం ద్వారా సాహిత్యం శాస్త్రీయంగా ఆలోచించేలా చేయాలనే కవిత ప్రగతిశీల భావాలకు నిదర్శనమని వ్యాఖ్యానించారు.
                                   సాక్షి దినపత్రిక 19.10.2020 సౌజన్యంతో
తన కవిత్వం పేదల, పీడితుల కోసమని రఘుపతి ముత్యాలు గారు స్పష్టంగా ప్రకటించారని వివిధ కైతికాలను ఆయన విశ్లేషించారు. ఆడపిల్లల్ని చదివిస్తూ, వాళ్ళలో శక్తిసామర్థ్యాలను ప్రోత్సహించే విధంగా వస్తువులో, శిల్పంలో నవ్యత్వాన్ని ప్రదర్శిస్తూ  రఘుపతి ముత్యాలు కవిత్వం రాశారని ఆయన ప్రశంసించారు. పుస్తకాన్ని బాగా సమీక్షించిన  గోస్కుల లత రమేశ్,  గడ్డం శంకర్ లను అభినందించారు. కైతికాల సృష్టికర్త గోస్కుల రమేశ్ ఒక  సాహిత్య ఉద్యమకారుడిలా కైతికాల కవిత్వ రూపానికి నాయకత్వం వహిస్తూ అనేకమంది చేత కైతికాల రాయిస్తున్నందుకు  ఆయన్ని కూడా అభినందించారు.
 జనం సాక్షి దినపత్రిక 19.10.2020 సౌజన్యంతో


 కైతికాలకు సాహిత్య చరిత్రలో ఒక సుస్థిరస్థానం కోసం మరింత మంచికవిత్వం రాయాలన్నారు. ఈ కార్యక్రమంలో కవులు, సాహితీవేత్తలు ముత్యాల రఘుపతి, ఈటెల సమ్మన్న, గోస్కుల రమేశ్, మంచికట్ల శ్రీనివాస్, కె.బి.ధర్మప్రకాశ్, వడ్డెబోయిన శ్రీనివాస్, గుండెబోయిన శ్రీనివాస్, నన్నెబోయిన తిరుపతి, వలబోజు సోమేశ్వరరావు, తాళ్ళ సత్య నారాయణ, ఐతా శ్రీనివాస్, పాత అశోక్,  పలువురు కవులు, సాహితీ వేత్తలూ పాల్గొన్నారు.
కార్యక్రమంలో పాల్గొన్న కవులు, సాహితీవేత్తలు
పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు 


సూర్య దినపత్రిక 19.10.2020 సౌజన్యంతో
నిదానం పత్రిక సౌజన్యంతో






 

12 అక్టోబర్, 2020

డైరీ

 

డైరీ రాయడమంటే
తేదీలు సమయాల కాలపట్టికలేనా...!
డైరీ
నీ మరచిపోని స్పందనల సమాహారం
నీ అనుభూతుల ఆలింగనం
నీ అనుభవాల లోగిలి!
నిన్ను నువ్వు చూసుకొనే నిలువుటద్దం!
నువ్వు స్వచ్ఛంగా ప్రవహించలేనప్పుడు
నువ్వు అక్షరం కాలేనప్పుడు
డైరీ రాయకపోతేనేమి
మనుష్యులున్న
ఖాళీ ఇళ్ళుగా మళ్ళీ మనసుని మార్చడమెందుకు?
బరువెక్కిన హృదయాన్ని
ముసుగుబండల్తో  మళ్ళీ బరువెక్కించడమెందుకు?
- ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు,10.10.2020
(అసంపూర్ణం ....ఒకరు ఫేస్ బుక్ లో డైరీ పేరుతో రాసిన కోవిద్ యాన్వువల్ రిపోర్ట్, దాన్ని ప్రశంసిస్తూ వచ్చిన కామెంట్స్ చూశాాా

07 అక్టోబర్, 2020

దళిత సాహిత్య చైతన్యం ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు (7.10.2020)


దళిత సాహిత్య చైతన్యం ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు

- డాక్టర్ బడిగె  ఉమేశ్

ఫోన్: 9494815854, 

దళితుల అభ్యున్నతి కోసం జ్యోతి రావు పూలే, డా॥ బి. ఆర్. అంబేద్కర్ వంటి మహనీయులు ఎంతో కృషి చేశారు. నాటి నుండి నేటి వరకు అనేక మంది కవులు, రచయితలు, ఉద్యమ కారులు ఈ రంగంలో విస్తృతంగా కృషి చేస్తూ వస్తున్నారు. అటువంటి వారిలో ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు కూడా ఒకరు. ఈయన ఇరవైయ్యొకటవ శతాబ్దపు తెలుగు సాహిత్య విమర్శకుల్లో గుర్తింపు పొందిన రచయిత. కవిత్వం, విమర్శనా రంగాల్లో సుప్రసిద్ధులు. వ్యాసాలు రాయడంలోనూ, ఉపన్యాసాలు ఇవ్వడంలోనూ తమదైన ప్రత్యేకత చాటుకున్నారు. నిత్యం తన పాఠాల ద్వారా విద్యార్థులను చైతన్య పరుస్తుంటారు. అనునిత్యం సృజనాత్మకంగా ఆలోచిస్తూ, ఎన్నో కవితలు, పద్యాలు రాస్తుంటారు. సాహిత్యం సామాజిక ప్రయోజనాన్ని కలిగించేది కావాలనీ, సామాజికాంశాలు సాహిత్యంలో చర్చించాలని పరితపిస్తుంటారు. సామాజిక శాస్త్ర దృష్టి వీరి సాహిత్య కృషిలో అత్యధికంగా కనిపిస్తుంది. నాలుగు పదుల వయసులోనే ఈయన పదహారు పుస్తకాలను రాసి ప్రచురించడం విశేషం. ఆచార్య దార్ల వారి రచనలు కొన్ని హిందీ, ఇంగ్లీషు భాషల్లోకి అనువాదమయ్యాయి. మరెన్నో అముద్రిత కవితలు, పద్యాలు, వ్యాసాలు గ్రంథస్థం కావడానికి సిద్ధంగా ఉన్నాయి.  

 

ఆచార్య దార్ల వారు  దళిత, బహుజన, నవల, కథ, నాటకం, వ్యక్తులు, పరిశోధన, విమర్శ, తులనాత్మకం, ఉద్యమాలు – వాదాలు మొదలైన విభాగాల్లో పరిశోధన వ్యాసాలు విస్తృతంగా రాశారు. విస్తారమైన అధ్యయనం, సూక్ష్మమైన పరిశీలన, శాస్త్రీయమైన వివేచన, స్పష్టమైన వ్యక్తీకరణ, ఆసక్తికరమైన శైలి, తులనాత్మక దృష్టి వంటి మౌలిక లక్షణాలతో దార్ల వారు వ్యాసం రాయడం గమనార్హం. వీరి వ్యాసాలు సాహిత్య, సామాజిక విలువలకు నిలయాలు. దళిత సాహిత్యానికి సంబంధించిన అంశాల పట్ల  వీరు ఎంతో బాధ్యత వహించారు. వీటిలో ప్రధానంగా కుల, వర్గీకరణ సమస్యలు, దళితులపై దాడులు, దళిత సాహిత్య ధోరణులు, దండోరా ఉద్యమం, జాంబవపురాణం, శంబుక దృక్పథం, మాలదాసరి కథ, ఆది ఆంధ్రుడు, దళిత పత్రికలు, కులవృత్తి, మాష్టార్జీ సాహిత్యం – బహుజనవాదం, అన్నమయ్య సాహిత్యంలో దళిత దృక్పథం, బోయి భీమన్న సాహిత్యం- అంబేద్కర్ దృక్పథం వంటివి పేర్కొనదగినవి. సాహిత్యాన్ని ఆధారంగా చేసుకొని  దళిత, బహుజనుల మనుగడకోసం ఈయన ఎంతో కృషి చేస్తున్నారనడానికి ఈ వ్యాసాల్లోని విశేషాలే తార్కాణాలు.      

 ‘‘తెలుగు దళిత సాహిత్యం సాంస్కృతిక రంగాలు: భవిష్యత్ సవాళ్లు’’ (https://vrdarla.blogspot.com/search?) అనే సదస్సుకోసం తన బ్లాగులో ప్రచురించిన కరపత్రంలో దళిత సాహిత్యం మునుముందుకు ఎదగాల్సిన ఆవశ్యకతను దార్లవారు స్పష్టంచేశారు. ఈ నేపథ్యంలో పూర్వం పెద్దలు చేసిన కృషిని స్ఫూర్తిగా తీసుకోవాలని కోరారు. గతాన్ని స్మరించుకొని, వర్తమానంలో ఆచరించి, భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలన్నారు. వీరి ఆలోచనలు దళితుల అభ్యున్నతికి అద్దం పడతాయి.  

కుల పురాణాల్లో జాంబవపురాణం గొప్పదని అందులోని మాదిగ జాతి జీవితం మరింత ఆదర్శమైందని ఆచార్య దార్ల వేంకటేశ్వరరావు ‘‘కుల పురాణాలు అధ్యయనం – జాంబవపురాణం’ (బహుజన సాహిత్య దృక్పథం, పుటలు: 34-44) అనే వ్యాసంలో గుర్తుచేశారు. మాదిగ జాతి పురోభివృద్ధిని చాలా స్పష్టంగా చూపించారు. అష్టాదశ పురాణాల్లో ఉండే కొన్ని అంశాల్ని ఆధారంగా చేసుకొని ‘జాంబవపురాణం’ పరిణామాన్ని పరిశీలించారు. ఈ పురాణ లక్ష్యాలు, లక్షణాలు చాలా విలువైనవన్నారు. సమాజంలో ఆధిపత్య కులాలు జాంబవపురాణం మూలాల్ని బయటికి రానీయలేదని వాపోయారు. వ్యాసంలో ఝాన్సీ లక్ష్మీబాయి, సద్దాం హుస్సేన్ ల వృత్తాంతాలను పేర్కొంటూ, పెత్తందారు దేశాల దౌష్ట్యాన్ని ఖండించారు. చారిత్రక వక్రీకరణలను, దళితులను నాశనం చేసే కుట్రలను ఈ వ్యాసం లో ఆలోచనాత్మకంగా విశ్లేషించారు.  జాంబవపురాణంలో మాదిగ జాతి  సామాజిక, సాంస్కృతిక జీవన విధానం ఎంతో ప్రశంసనీయమైందన్నారు. కానీ దళితుల్లో రానురాను తమ జాతిని తామే తక్కువ చేసుకునే ధోరణికి రావడాన్ని వ్యాసకర్త నిరసించారు. మాదిగ మేధావులు తమ జాతి మూలాల్నీ కాపాడుకోవాలని ఆకాంక్షించారు. 

‘దళిత వాద పత్రికలు – దళిత చైతన్యం' (పునర్మూల్యాంకనం, పుటలు: 50-59) అనే వ్యాసంలో తెలుగులో వచ్చిన పత్రికల కథాకమామీషునీ, వాటి ఆవశ్యకతలనూ స్థూలంగా పరిచయం చేశారు. సామాజిక సమస్యలపై పత్రికలు కథనాలు రాయడం తక్షణ సంస్కరణకు నిదర్శనమన్నారు. దళిత పత్రికలు 1870లో దేశవ్యాప్తంగా ప్రారంభమైనవని చెప్పారు. ముఖ్యంగా జ్యోతి రావు ఫులే, డా॥ బి. ఆర్. అంబేద్కర్ వంటి మహనీయుల కృషి అనన్య సామాన్యమైందని కొనియాడుతూ, వీరు అందించిన చైతన్యాన్ని భావితరాలు స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. తెలుగు రాష్ట్రాల్లో వెలువడే దళిత పత్రికలను, వాటి స్వరూప స్వభావాలను సమీక్షించారు. ఈ సమాజంలో ప్రముఖ వ్యక్తుల తత్వాలనూ, ఆయా వాదాల నేపథ్యాలనూ దళిత పత్రికలు ప్రచురించడం గొప్ప ఆదర్శమన్నారు. సాహిత్య పరంగా వివిధ పత్రికల్లో ప్రక్రియ పర రచనలు రావడం ఆహ్వానించదగిందన్నారు. దళిత మేధావులు ఈ పత్రికలను ఆధారంగా చేసుకొని అనేక సమస్యలను వెల్లడించవచ్చని ఉగ్గడించారు. దళిత పత్రికలపై విశేష కృషిచేసిన గౌరీశ్వర రావు, యాగాటి చిన్నారావులూ తమ బాధ్యతను చక్కగా నిర్వహించారని చెప్పారు. పత్రికల్లో  విషయ నాణ్యతపై రచయిత స్పష్టమైన అభిప్రాయాలను వెల్లడించారు. రాష్ట్రంలో దళిత పత్రికలు ఏ మూల నుండి వచ్చాయన్న సంగతుల్ని కాలక్రమంగా తెలపడం వ్యాసకర్త పరిశోధన పటిమకు సంకేతం. ఆచార్య దార్ల వేంకటేశ్వరరావు దళిత పత్రికల్లోని అంశాలను చర్చిస్తూ, సంపూర్ణమైన నిష్పాక్షిక ధోరణితో వాటిని ప్రోత్సహించారు. పత్రికల్లో స్థానిక, రాష్ట్ర, జాతీయ దళిత సమస్యలను కూలంకషంగా చర్చించాలని ఆకాంక్షించారు. ప్రముఖ ఇంగ్లీషు అధ్యాపకులు ఆచార్య జె. భీమయ్య ‘దళిత సాహిత్యం- మాదిగ దృక్పథం’ అనే గ్రంథానికి రాసిన ముందుమాటలో ‘దార్ల కులం, వర్గం, మిళితమైన సమాజాన్ని శాస్త్రీయంగా విశ్లేషించే ప్రయత్నం చేశా’రని అన్నారు. (దళిత సాహిత్యం మాదిగ దృక్పథం, పుట: 11)

ఆచార్య దార్ల వేంకటేశ్వరరావు చాలా నవలలపై వ్యాసాలు వెలయించారు. వాటిలో ‘పంచమం’, ఎన్నెల నవ్వు, అతడు అడవిని జయించాడు’  చెప్పుకోదగినవి. తెలుగు మాండలిక నవలలపై, ఆచార్య కొలకలూరి ఇనాక్ నవలపై కూడా వీరు వ్యాసాల్ని రాశారు. ‘పంచమం’  తొలి దళిత ఉద్యమ నవలా ? (పునర్మూల్యాంకనం, పుటలు: 66-73) అనే వ్యాసంలో కొన్ని విషయాలిలా ఉన్నాయి.  తొలుత వ్యాసకర్త నవలా సాహిత్యంలో దళితుల ప్రస్తావనను స్థూలంగా  పరిశీలించారు. ఈ నవల్లో ప్రజ్వరిల్లిన దళిత ఉద్యమాన్ని ఆధారాలతో పరిచయం చేసి, ఇది ఎంతో సుదీర్ఘమైందని నిరూపించారు. నవ భారతంలో దళితులపై జరిగే దాడులను నిర్ద్వంద్వంగా ఖండించారు. ‘పంచమం’  నవల తొలి దళిత నవలా కాదా? అనే వివరాల్ని నిగ్గు తేల్చి, దీని కంటే ముందు కొన్ని నవలలుండటం గమనార్హమన్నారు. అయితే ఈ నవల్లో ఉండే దళిత ఉద్యమం అత్యంత ప్రేరణతో కూడిందని నొక్కి వక్కాణించారు. ఈ విధంగా రచయిత మిగతా నవలలపై రాసిన వ్యాసాల్లోనూ ఎన్నో ఆసక్తికర అంశాల్ని పేర్కొన్నారు.  

 ‘వెంటాడే అవమానం’, తెలుగు కథ దళిత వాదం, గిరిజన కథలు, ఆచార్య ఇనాక్ కథల్లో వస్తు వైవిధ్యం, కులవృత్తి కథలు, దళిత క్రైస్తవ కథలు మొదలైన వాటిపై ఆచార్య దార్ల వేంకటేశ్వరరావు ప్రత్యేకంగా వ్యాసాలు రాశారు. ఇందులో ‘తెలుగు దళిత కథా పరిణామం’’ (దళిత సాహిత్యం మాదిగ దృక్పథం.' పుటలు: 26 -31) అనే వ్యాసంలోని  కొన్ని అంశాలను చూద్దాం. దళిత సాహిత్యం తెలుగు ప్రక్రియల్లో ఎలా ప్రయాణిస్తూన్న విషయాల్ని చక్కగా తెలిపారు. దళిత వాదానికి, ఉద్యమానికి గల భేదాలను స్పష్టీకరించారు. ప్రత్యేకించి దళిత కథలు ఏయే గ్రంథాల్లో ప్రచురితమయ్యాయన్న దాన్ని వెల్లడించారు. కథ సాహిత్యంలో గురజాడ అప్పారావు, శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి, చలం, అడవి బాపిరాజు లాంటి ప్రభృతులు దళిత సమస్యలపై ఎన్నో కథలు రాశారని గుర్తుచేశారు. ‘తెలుగు కథా – దళిత వాదం’ (1963) గ్రంథం ద్వారా  నిఖిలేశ్వర్ సంపాదకత్వంలో ఎన్నో దళిత కథలు వెలుగు చూడడాన్ని అభినందించారు. ఆచార్య ఎండ్లూరి సుధాకర్ ‘మల్లె మొగ్గల గొడుగు’, నాగప్పగారి సుందర్రాజు ‘మాదిగోడు’ పుస్తకాలను తొలి దళిత ఆత్మకథలుగా ఈయన పేర్కొన్నారు. గుండె డప్పు కనకయ్య, కొలకలూరి ఇనాక్, పైడి తెరీష్ బాబు, జూపాక సుభద్ర, జాజుల గౌరి, బోయ జంగయ్య, కాలువ మల్లయ్య మొదలైనవారు విస్తృతంగా కథలు రాస్తున్నారని వ్యాసంలో తెలిపారు. ముస్లిం కవి యాకూబ్ ఇటీవలే ప్రచురించిన తన సిద్ధాంత గ్రంథంలో‘ ‘దార్ల వేంకటేశ్వరరావు నాగార్జున విశ్వవిద్యాలయం, కేంద్ర సాహిత్య అకాడమీ సంయుక్తంగా నిర్వహించిన సదస్సులో కాసుల ప్రతాపరెడ్డి రచించిన ‘వెంటాడే అవమానం’ కథపై సమర్పించిన వ్యాసం దళిత కథా విమర్శకు నమూనాలాంటిది.’’ (ఆధునిక తెలుగు సాహిత్య విమర్శ, పుట: 178) అన్న మాటలు స్మరణీయాలు. ఈవిధంగా ఆచార్య దార్ల వేంకటేశ్వరరావు ఉత్తరాంధ్ర, తెలంగాణా, రాయలసీమ ప్రాంతాల్లో వచ్చే దళిత కథలను చక్కగా విశ్లేషించారు. 

బోయి భీమన్న ‘రాగవాశిష్ఠం’, ఆచార్య కొలకలూరి ఇనాక్ ‘మునివాహనుడు' నాటకాలపై ఈయన విశిష్టమైన వ్యాసాలు రాశారు. రాగవాశిష్ఠం- నాటక వైశిష్ట్యాం’ (దళిత సాహిత్యం మాదిగ దృక్పథం' పుట: 13 -25) అనే వ్యాసం చాలా సుదీర్ఘమైంది. బోయి భీమన్న గారి దళిత దృక్పథాన్ని ఇందులో  హృద్యంగా చెప్పారు. వ్యాసంలో ముందుగా నాటక పూర్వాపరాల్ని క్షుణ్ణంగా పరిశీలించారు. తర్వాత  కుల సమస్య నిరసన నాటకంగా దీన్ని అభివర్ణించారు. భీమన్న గారు సమాజంలో పాతుకుపోయిన ఛాందస భావాలను రూపుమాపడానికే ఈ నాటకం రాశారని తెలిపారు. ఇందులో గొప్ప సామాజిక దృష్టిని చూశారు. వివాహ వ్యవస్థలో అరుంధతీ దేవి, వశిష్టులు ఆదర్శ దంపతులని భీమన్న నాటకం ద్వారా వ్యక్తం చేయడం కుల నిర్మూలనకు నిదర్శనమని చాటి చెప్పారు. ఈ నాటకంలో పాత్రలు వేటికవే ఒదిగి పోవడం గమనార్హమన్నారు. నాటకంలో సుదీర్ఘమైన కథను చిన్న చిన్న పేరాలుగా విడగొట్టి, వశిష్టుడు, ప్రాచీనుల సిద్ధాంతాలను తులనాత్మకంగా పరిశీలించారు. అరుంధతి దేవి కథను తెలుసుకొని ప్రాచీనుడు లాంటి ఛాందసులు ఎలా మారారన్న అంశాల్ని చక్కగా విశ్లేషించారు. భీమన్న అరుంధతి దేవి పాత్రను సంప్రదాయానికి నిదర్శనంగా తీర్చిదిద్దడం మార్పునకు గుర్తని ఆచార్య దార్ల వేంకటేశ్వరరావు అభిప్రాయపడ్డారు. పన్నెండు రంగాలుగల ఈ దృశ్య కావ్యాన్ని భీమన్నగారు అద్భుతంగా, ఆదర్శంగా తీర్చిదిద్దడం వారి నిశిత పరిశీలన దృష్టికి గొప్ప నిలయమన్నారు. నాటకంలో శిల్ప, సన్నివేశాలు, వర్ణనలు సందర్భానుగుణంగా ఇమిడి పోవడం చెప్పుకోదగిందన్నారు. అంతేకాదు ఈ నాటకంపై అంబేద్కర్ ప్రభావం విశిష్టంగా కనబడుతుందన్న విషయాన్ని వ్యాసకర్త సోదాహరణంగా నిరూపించారు. 

గురజాడ అప్పారావు, దాసు శ్రీరాములు, శంకరం బాడి సుందరాచారి, బాబు జగ్ జ్జీవన్ రామ్, కేశవరెడ్డి, నామ్ దేవ్ ఢసాల్,  నాగప్పగారి సుందర్రాజు వంటి ప్రముఖుల జీవితం, వ్యక్తిత్వం, సాహిత్య విశేషాలను దార్ల వేంకటేశ్వరరావు లోతుగా అధ్యయనం చేశారు. వీటిలో సుందర్రాజుగారిపై చేసిన పరిశోధన దళిత దృక్పథానికి కేంద్రంగా భావించవచ్చు. ‘ఒక మాదిగ స్మృతి : నాగప్పగారి సుందర్రాజు’ (2007) గ్రంథంలో సుందర్రాజుగారి జీవితాన్ని, ఆయన రచనల్నీ, పరిశోధనను, ఉద్యమాలను పరిశోధనాత్మకంగా పొందుపరిచారు. సుందర్రాజు దళితుల హక్కుల కోసం పోరాడిన విధానాన్ని పుస్తకంలో విశదీకరించారు. సుందర్రాజు రాసిన లేఖలు, కవితలు, కథలను, పరిశోధనలోని ముఖ్యాంశాలను, ఆయన ఆలోచనా దృక్పథాన్ని బయటపెట్టారు. సుందర్రాజుతో తనకున్న గాఢమైన అనుబంధాన్ని ఇలా గుర్తుచేసుకున్నారు. ‘‘అతనిని గుర్తుచేసుకోవడం అంటే మాదిగల్ని, మాదిగ సాహిత్యాన్ని గుర్తు చేసుకోవడమే. మాదిగ సాహిత్యాన్ని గుర్తు చేసుకోవడం అంటే నాగప్పగారి సుందర్రాజుని కూడా తప్పని సరిగా గుర్తుచేసుకోవడమే.’ (ఒక మాదిగ స్మృతి - నాగప్పగారి సుందర్రాజు, పుట:11) సుందర్రాజుగారు మరణించినప్పుడు ఆచార్య దార్ల వేంకటేశ్వరరావు హైదరాబాదు విశ్వవిద్యాలయం నుంచి మిత్రులతో కలిసి వారి దహన కార్యక్రమాలకు హాజరైన విషయాల్ని ఆర్ద్రంగా తెలిపారు. 

ఆచార్య దార్ల వేంకటేశ్వరరావు ప్రధాన క్షేత్రం విమర్శ. ముఖ్యంగా దళిత సాహిత్య విమర్శలో ఈయన ప్రశంసనీయమైన కృషి చేశారు.  ఆచార్య కొలకలూరి ఇనాక్ సాహిత్యంపై ‘‘*విమర్శకుడిగా కొలకలూరి ఇనాక్*’’ (సాహితీ మూర్తులు స్ఫూర్తులు, పుటలు: 162 -172) అనే వ్యాసం రాశారు. ఇందులో ఇనాక్ గారి సమీక్షలో గొప్ప సాహిత్య విమర్శాంశాలున్నాయని తెలిపారు. ‘మాలవాండ్ర పాట’ ను దళితుడే రాశాడన్న ఇనాక్ గారి అభిప్రాయాన్ని పరిశీలించాల్సిన అవసరం ఉందని దార్లవారు అన్నారు. ఎందుకంటే ఆనాటి కాంగ్రెస్ పార్టీ హరిజనుల్ని తమవైపు తిప్పుకోవడానికి నానా ప్రయత్నాలు చేసింది. అందులో భాగంగానే ఈ మాలవాండ్ర పాట ముందుకు తెచ్చారనే కారణాన్ని సూచించారు. విమర్శలో ఇనాక్ గారి సూత్రాలైన ‘నిబద్ధత, నిమగ్నత, నిబిడత’లు ఉత్తమమైన సిద్ధాంతాలని అభివర్ణించారు. ఇనాక్ గారి విమర్శ దృక్పథంలో ‘‘సమాజ పరిణామంతో పయనించిన విమర్శ పరిణామం గోచరిస్తుంది. అన్నింటినీ మించి సాహిత్యానికున్న ప్రయోజనాన్ని వివరించాలనే ఆకాంక్ష వెల్లడవుతుం’’దని (సాహితీ మూర్తులు స్ఫూర్తులు' పుట: 163) రచయిత అన్నారు. ఇనాక్ గారిపై వచ్చిన వ్యాసాలను లోతుగా పరిశీలించి వీరు సైద్ధాంతిక దళిత, బహుజన సాహిత్య విమర్శను విరివిగా కొనసాగించారని ఆచార్య దార్ల వారు అన్నారు.  

దార్ల వేంకటేశ్వరరావు దళిత సాహిత్య విమర్శకే  పరిమితం కాలేదు. తెలుగు సాహిత్య విమర్శ క్షేత్రంలోనూ వీరి స్థానం పదిలమనీ చెప్పవచ్చు. ఉదాహరణకు ‘‘తెలుగులో పునర్మూల్యాంకనం*’’ (*బహుజన సాహిత్య దృక్పథం' పుటలు: 147 – 157) అనే వ్యాసంలో తెలుగు సాహిత్య విమర్శ పరిణామ క్రమాన్ని అంచన వేయడం నిశిత పరిశీలనకు నిదర్శనం. పూర్వ విమర్శకుల అభిప్రాయాలను సూక్ష్మంగా పరిశీలించి సాహిత్యాన్ని పునర్మూల్యాంకనం చేసుకోవాలని ఉద్ఘాటించారు. ప్రధానంగా సృజన, అను సృజన రంగాల్లో జరిగిన కృషి చెప్పుకోదగిందని, ఆయా విషయాల్ని ప్రక్షాళనం చేసుకుంటే బాగుంటుందన్నారు. 1914 కి పూర్వ  విమర్శకు ఆ తర్వాత కొనసాగిన విమర్శకు చాలా తేడాలున్నాయన్నారు. ముఖ్యంగా కట్టమంచి రామలింగారెడ్డి గారి కృషివల్ల ఆధునిక విమర్శ కొత్త పుంతలు తొక్కిందని వ్యాసకర్త అన్నారు. పునర్మూల్యాంకనం విమర్శలో అట్టడుగు వర్గాల సాహిత్యాన్ని ప్రత్యేకంగా గుర్తించాలని వీరి వాదన. ‘సాహిత్య విలువలతోపాటు, అప్పటికే నిర్ణయించిన విలువల్ని పునః సమీక్ష చేసే దిశగా పునర్మూల్యాంకన విమర్శ కొనసాగుతుం’’దని (బహుజన సాహిత్య దృక్పథం, పుట:155) వ్యాసంలో పేర్కొన్నారు. రచయిత ఈ వ్యాసాన్ని గొప్ప తాత్త్విక చింతనతో రాశారు. ఉనికి కోల్పోతున్న సాహిత్యాలను కాపాడుకోవాలనీ, సాహిత్య మౌలిక సూత్రాల్ని , విలువల్ని రక్షించుకోవాల్సిన ఆవశ్యకత నేటి పరిశోధకులపై ఉందని పునరుద్ఘాటించారు. ఎప్పటికప్పుడు సంస్కరణాత్మక దృక్పథంతో సాహిత్యాన్ని మార్పు చేసుకొంటే మంచిదని చెప్పారు.

కేశవరెడ్డి ‘చివరి గుడిసె', యేకుల వెంకటేశ్వరులు ‘ఎన్నెల నవ్వు' నవలల్నీ, కన్నడ కవి కువెంపు  ‘శూద్ర తపస్వి’,  త్రిపురనేని ‘శంబుక వధ’  నాటకాల్నీ దార్లవారు తులనాత్మకంగా పరిశీలించారు. వీటిలో ‘చివరిగుడిసె’, ‘ఎన్నెల నవ్వు’  నవలలపై రాసిన వ్యాసం ఆకట్టుకుంటుంది. ముందుగా రచయితల వివరాలను పరిచయం చేసి,  తర్వాత ఈ రెండు నవలల్లోని వస్తువుల్ని సంక్షిప్తీకరించారు. నవలను తులనాత్మకంగా అధ్యయనం చేసి పలు అంశాలను వెల్లడించారు. కేశవరెడ్డి ‘చివరిగుడిసె’ లో నల్లమల అడవుల్లోని యానాదుల జీవితాల్ని, ఏకుల వెంకటేశ్వరులు ‘ఎన్నెల నవ్వు’ ఆంధ్రప్రదేశ్ లో వివిధ ప్రాంతాల్లో ఉన్న యానాదుల జీవన సుఖ దుఃఖాలను పరిచయం చేయడం కనిపిస్తుందన్నారు.  కేశవరెడ్డి యానాదుల్లో నేరస్థులు లేరని చెప్తే, వెంకటేశ్వరులు యానాదుల బతుకు వెతలను చెప్పారనీ దార్ల వేంకటేశ్వరరావు అన్నారు. ఇక పాత్ర చిత్రణ రెండు నవలల్లో హృదయానికి హత్తుకునేలా ఉన్నాయని తెలిపారు. ఇందులో రచయితలిద్దరూ కుల వృత్తుల్ని పరిచయం చేయడంలో ఔచిత్యం చూపారన్నారు. ఇలా ఈ రెండు నవల్లో కనిపించే తులనాత్మకాంశాలను సూక్ష్మంగా పరిశీలించారు. ముఖ్యంగా నాటకాల దృక్పథాలను రచయిత అభివర్ణించిన తీరును చూడండి. ‘మొత్తం మీద చివరిగుడిసెలో మార్క్సిస్టు ప్రభావం కనిపిస్తుంటే, ఎన్నెలనవ్వులో మార్క్సిస్టు బహుజన ప్రభావం వ్యక్తమవుతుంది.’’ (కేశవరెడ్డి ‘చివరిగుడిసె’- ఏకుల వెంకటేశ్వర్లు ‘ఎన్నెల నవ్వు’ నవలల్లో గిరిజన జీవిత చిత్రణ : తులనాత్మక పరిశీలన, అముద్రిత వ్యాసం, పుట: 5) అంటారు.

దార్ల వేంకటేశ్వరరావు దళిత బహుజనుల ఉద్యమాల్లో క్రియా శీలకంగా పాల్గొన్నారు. ఆ సందర్భంగా వెలువరించిన వ్యాసాల్లో తన అభిప్రాయాలను స్పష్టంగా వెల్లడించారు. రాజ్యాంగ పరంగా దళిత ఉప కులాలకు ప్రభుత్వాలు న్యాయం చేయడం లేదన్నారు. సమాజంలో ముస్లిం స్త్రీలు అనుభవిస్తున్న దుర్భర జీవితాల్ని ‘స్త్రీవాదంలో ముస్లిం మైనారిటీ సాహిత్యం' (వీచిక, పుటలు: 98 – 103) అనే వ్యాసంలో సవివరంగా తెలిపారు. ఇందులో ముస్లిం మైనారిటీ కవిత్వంలోని స్త్రీవాద దృక్పథాన్ని చాలా చక్కగా తెలిపారు. ఈ ముస్లిం సాహిత్యాన్ని స్త్రీలే కాకుండా పురుషులు కూడా రాయడాన్ని ప్రశంసించారు. ముస్లిం సాహిత్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఎంతో దార్శనికంగా 2009లోనే భవిష్యత్తులో జరగబోయే విషయాల్ని ఈ వ్యాసంలో తెలిపారు. ముఖ్యంగా ఈ కమ్యూనిటీలో స్త్రీలు పడే బాధలు బయటకు చెప్పుకోలేనివని అన్నారు. ఈ నేపథ్యంతో రచనలు చేస్తున్నా పలువురి కవితల్ని ఉదహరిస్తూ కొన్ని అంశాల్ని బయటపెట్టారు. ప్రధానంగా స్త్రీలలో షాజహానా, మున్వీరున్నీసా, మహజబీన్, ఫాతిమా మొదలైనవారూ. పురుషుల్లో ఖాదర్ మొహియుద్దిన్, యాకుబ్, అఫ్సర్, స్కై బాబా, సలీం వంటి వారు ముస్లిం వాదాన్ని బలంగా వినిపిస్తున్నారని తెలిపారు. 

దార్ల వేంకటేశ్వరరావుగారు పైన పేర్కొన్న ప్రక్రియల్లోనే కాకుండా ఇతర అంశాలపై ఎన్నో వ్యాసాలను రాశారు. అవి తెలుగు సాహిత్యంలో సామాజిక దృక్పథం, డయాస్పోర సాహిత్యం, ప్రపంచీకరణ సాహిత్యం, అంతర్జాలంలోని సాహిత్యం, అనువాద సాహిత్యం మొదలైన వాటిని ప్రధానంగా పేర్కొనవచ్చు. డయాస్పోర సాహిత్యాన్ని ప్రోత్సహిస్తున్నవారిలో ఆచార్య దార్లవారు ఒకరు. హైదరాబాదు విశ్వవిద్యాలయంలో ఎం. ఏ తెలుగు విద్యార్థులకు ఒక పాఠ్యాంశంగా కూడా ప్రవేశపెట్టారు. దీనిపై భావి పరిశోధకులకు సైతం ఆసక్తిని కలిగిస్తున్నారు. ఈ సాహిత్యాన్ని పరిచయం చేయడానికి ‘తెలుగు డయాస్పోర సాహిత్యం ఒక పరిచయం’ (బహుజన సాహిత్యం దృక్పథం, పుటలు: 99-107) అనే వ్యాసం రాశారు. ఇందులో ప్రపంచంలో వివిధ ప్రాంతాల్లో ఉన్న తెలుగువారు రాస్తున్న సాహిత్యాన్ని స్థూలంగా పరిచయం చేశారు. డయాస్పోర సాహిత్యం అంటే అర్థ వివరణలు చెప్పారు. అనేక వెబ్ సైట్లలో ఉన్న సమాచారాన్ని సేకరించి అందించారు. ఈ డయాస్పోర సాహిత్యం 1998 నుండి బాగా ప్రాచుర్యంలోకి వచ్చిందని గుర్తుచేశారు. పత్రికలు ఈ సాహిత్యాన్ని విరివిగా ప్రచురించాయని తెలిపారు. అంతర్జాలంలో వివిధ బ్లాగుల్లో దీని గురించి విస్తృతంగా సమాచారముందన్నారు. మన తెలుగు ప్రాంతాల్లో వెలువడే సృజన సాహిత్యాన్ని ప్రపంచానికి తెలిసేటట్లు చేయడాన్ని కొనియాడారు. డయాస్పోర సాహిత్యంపై ఆచార్య వేంకటేశ్వరరావు చెప్పిన మాటలు ఈ సందర్భంగా స్మరించుకోదగినవి. ‘డయాస్పోరా రచయితలే తమ మాతృ దేశంలో తమ అస్తిత్త్వాన్ని, నాటి గతాన్ని తలచుకుని, వర్తమాన స్థితిగతులను సమీక్షించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఒంటరి తనం నుంచి సామూహిక జీవనం వైపు పయనించాలనే ఆకాంక్ష ఉన్నా, దాన్ని జీవితానుభవంలో పాటించలేకపోతున్నారు’. (బహుజన సాహిత్య దృక్పథం, పుట:106) అని అభిప్రాయపడ్డారు. డయాస్పోర సాహిత్యంలో ఉండే లోటుపాట్లను నిష్కర్షగా ఎండగట్టారు. 

ఆచార్య దార్ల వేంకటేశ్వరరావు ఇచ్చిన ఉపన్యాసాలలో ప్రధానంగా  కారంచేడు సంఘటన, ఎస్సీ వర్గీకరణ, డా॥ బాబు జగ్ జ్జీవన్ రామ్ జయంతి, నాగప్పగారి సుందర్రాజు వర్ధంతి, దళిత సాహిత్య సవాళ్లు, అంబేద్కరిజం, ముస్లిం సాహిత్యం మొదలైనవి దళిత సాహిత్యంలోకి వస్తాయి. 

‘‘దళిత సాహిత్య సవాళ్లు’ అనే అంశంపై మాట్లాడుతూ... ఎస్సీ వర్గీకరణ జరగాల్సిన ఆవశ్యకతను ఆచార్య దార్ల వేంకటేశ్వరరావు వివరంగా తెలియజేశారు. రాజ్యాంగం కల్పించిన హక్కులు అందరికీ సమానం కాబట్టి ఎస్సీ వర్గీకరణ కచ్చితంగా జరగాలని అన్నారు. బ్రాహ్మణీయ భావజాలాన్ని నిర్ద్వంద్వంగా ఖండించారు. ఎస్సీలో అరవై ఒక్క ఉప కులాలు ఉన్నాయి. వీరిలో ఒక్కొక్కరికి ఒక్కో విధంగా రిజర్వేషన్లు కేటాయించడాన్ని ఖండించారు. తెలంగాణా, ఆంధ్ర ప్రాంతాలు భౌగోళికంగా విడిపోయినప్పటికీ మానసికంగా కలిసి ఉన్నాయని గుర్తుచేశారు. ఎస్సీల్లో మాల, మాదిగలు అధిక శాతం ఉన్నారు. వీరిలో మాలలకు  రిజర్వేషన్స్ ఎక్కువ ఉండడం వల్ల మిగతా ఉప కులాలకు నష్టం జరుగుతుందని వాపోయారు. ఈ పరిస్థితిని కవులు, రచయితలు గమనించాలని చెప్పారు. ఈ విషయంపై కవితలు, కథలు, వ్యాసాలు రాసి అందరికీ అవగాహన కలిగించాలని పేర్కొన్నారు.

ఈ విధంగా ఆచార్య దార్ల వేంకటేశ్వరరావు రాసిన వ్యాసాల్లో, ఉపన్యాసాల్లో దళితుల అభ్యున్నతిని కాంక్షించే అంశాల్ని స్పృశించడం జరిగింది. కేవలం వ్యాసాలూ, ఉపన్యాసాల్లోనే కాకుండా సృజనాత్మక రచనల్లోనూ దళిత సాహిత్య దృక్పథాన్ని ముందుకు నడిపిస్తున్న దీశానిర్దేశి ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు. 

(భూమి పుత్ర దినపత్రిక 7.10.2020)

06 అక్టోబర్, 2020

workshop on Research Methodology

workshop on Research Methodology, 27.2.2020  in the University of Hyderabad Darla Venkateswara Rao, Bhujanga Reddy and Others are participated  
 
 

రావినూతల ప్రేమకిషోర్ గార్కి నివాళి

ఈ తప్పెలా చేశారు?

తెలుగు సాహిత్యం- మాదిగ జీవిత ప్రతిఫలనం పేరు నేను రాసిన పరిశోధన వ్యాసాన్ని నా పేరు తొలగించి, ఆ వ్యాసాన్ని ఈ మధ్య ఒక బ్లాగులో యథాతధంగా ప్రచురించుకున్నారు. ఎంత దారుణమో చూడండి. ఈ వ్యాసం దగ్గరే నా పేరు వివరాలు కూడా రాశాను. ఈ వ్యాసం ప్రజాకళ అంతర్జాల పత్రికలో  http://prajakala.org/mag/2008/06/darla_june08_essay వచ్చింది. తర్వాత తెలుగు అకాడమీ, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారి వాఙ్మయి లో కూడా వచ్చింది. అయినా సరే https://welcometonagsblog.blogspot.com/ లో నా వ్యాసాన్ని ప్రచురించుకున్నారు. నా పేరు తీసేసి వ్యాసాన్ని ప్రచురించుకోవడం కాపీరైట్ చట్టం కింద నేరం అవుతుంది. కనీసం నన్ను సంప్రదించకుండా నా వ్యాసాన్ని పునర్ముద్రించుకున్నప్పుడు నాపేరు తొలగించడం సరైంది కాదు. ఈ విషయాన్ని ఆ బ్లాగులో కామెంట్ బాక్స్ లో రాస్లే, అప్రోవల్ తర్వాతనే దాన్ని ప్రచురిస్తారనే సాంకేతిక విషయం తెలిసిన వారు, ఈ తప్పెలా  చేశారు? 
ఆ మధ్య ఏకంగా నా వ్యాసాన్ని యథాతధంగా ప్రస్థానం పత్రికలో శీర్షిక కూడా మార్చకుండా వ్యాసకర్త పేరు మార్చుకొని ప్రచురించుకున్నాడు. ఈ విషయాన్ని సంపాదకులకు తెలిపితే, మరలా సంచికలో ఆ విషయాన్ని ప్రచురించి, వ్యాసకర్తను హెచ్చరించి, అతని నుండి వివరణ తీసుకున్నామని, ఇలా జరిగినందుకు విచారిస్తున్నామని, నాకు ఈమెయిల్ పెట్టి, అదే విషయాన్ని ఆ పత్రికలో ప్రముఖంగా ప్రచురించారు. 


నా వ్యాసం గురించి  ఆ బ్లాగులో ఇలా రాశాను. సమాధానం ఏమి వస్తుందో చూసి,తగిన చర్యలు తీసుకుంటాను. 

‘‘ఈ బ్లాగు మాదిగ జాతి గొప్పతనం గురించి మాదిగల గురించి వచ్చిన సాహిత్యాన్ని, చరిత్రను, సంబంధిత విషయాల్ని ఒక చోటకు చేర్చుతున్న తీరు బాగుంది. కానీ మీరు ఎవరి వ్యాసమైనా తీసుకున్నప్పుడు వారి పేరుని ఆ వ్యాసం దగ్గర రాయాలి. అది మీరు ఎక్కడ నుండి తీసుకున్నారో కూడా రాయాలి. అలా కానప్పుడు అది భావచౌర్యం కిందికివస్తుంది. కాపీరైట్ చట్టం ప్రకారం అది నేరం కూడా అవుతుంది. ఉదాహరణకు నేను మాదిగల పై రాసిన పరిశోధన వ్యాసాన్ని యథాతధంగా August 03, 2018 తేదీన మీ బ్లాగులో https://welcometonagsblog.blogspot.com/2018/08/blog-post_15.html ప్రచురించుకున్నారు. కనీసం నా పేరు ఎక్కడా రాయలేదు. ఇది యూనివర్సిటి గ్రాంట్స్ కమీషన్ వారి ఆధ్వర్యంలో చేసిన మేజర్ రీసెర్చ్ ప్రాజెక్టులో భాగంగా రాసిన వ్యాసం. దీన్ని మీరు ఇలా చేయడం సరైనది కాదు. నా అనుమతి తీసుకొని మీరు పునర్ముద్రిస్తున్నానని ముద్రించుకోవచ్చు. కానీ మీరు అలాచేయలేదు. వెంటనే మీరు నన్ను సంప్రదించి, పాటించవలసిన నియమాలను పాటించవలసినదిగా కోరుతున్నాను. 

మీ

ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, తెలుగుశాఖ, సెంట్రల్ యూనివర్సిటి, హైదరాబాద్ ఈమెయిల్ darlahcu@gmail.com / ఫోను: 9182685231 ’’



01 అక్టోబర్, 2020

దళితనవల-మరిచిపోలేనిపాత్రలు



ఒక రచనలో చిత్రమైన వ్యక్తుల మానసిక చిత్రణను మనం సాధారణంగా పాత్ర చిత్రణ అంటాం.
ఆ పాత్రల్ని కథ నడిపించే కథారచయిత ఒక సమాజానికి ప్రాతినిథ్యం వహించేటట్లు పాత్రలను సృష్టిస్తాడు. 
పాత్ర లేకుండా  కథ గానీ, నవల గానీ ఉండదు. అయితే వాటిలో శాశ్వతమైన ప్రభావాన్ని వేయగలిగినట్లుగా ఆ పాత్రను తీర్చిదిద్దారా? లేదా అనేదే ముఖ్యం. అలా ప్రభావం చూపిన కొన్ని పాత్రలు మన తెలుగు నవలల్లో ఉన్నాయి.
అసమర్థుని జీవ యాత్రలో సీతారామారావు, చివరికి మిగిలేది లో దయానిధి , అంపశయ్య లో రవి మొదలైన పాత్రలు పేర్కొనబడినది.చలం నవలల్లో రాజేశ్వరి, అమీర్, మీరా , అమీనా...కేశవరెడ్డి అతడు అడవిని జయించాడు లో ముసలివాడు, మునెమ్మ లో మునెమ్మ...
చిలుకూరి దేవపుత్ర...పంచమంలో...శివయ్య, పురుషోత్తం, అందులో చందమామ లో చిన్నోడు...
ఈ పాత్రలో ప్రధాన పాత్ర లేదా కథానాయకుడు, కథానాయిక, ప్రతినాయకుడు తర్వాత సహాయక పాత్రలు అనేవి సర్వసాధారణంగా ఉంటాయి. మన విమర్శకులు పాత్రలను ఇంగ్లీషులో  ఫ్లాట్ క్యారెక్టర్స్ అనీ, అంటే మార్పు లేని పాత్రలు,  రౌండ్ క్యారెక్టర్స్ అంటే మార్పు చెందే పాత్రలు అని ప్రధానంగా రెండు రకాలుగా విభజించారు. ఈ పాత్రలను మనం జాగ్రత్తగా గమనిస్తే ఆ పాత్రల స్వరూప స్వభావాలు వచ్చినటువంటి మార్పులను బట్టి ఈ లక్షణాలను గుర్తించారు. నిజానికి పాత్ర అనేది రచయిత ఆలోచనా విధానం లేదా రచయిత చెప్పదలచుకున్న  భావజాలాన్ని బట్టి రూపొందుతుందని అహమనం పాత్రల రూపకల్పనను బట్టి చెప్పవచ్చు. అందుకని  పద్యంలో కనిపించే పాత్రలన మూడు రకాలుగా విభజించుకునే అవకాశం ఉంది. మొదటి రకం పాత్రలలలో రచయితలే ఆ పాత్రల స్వరూప స్వభావాలు వర్ణిస్తూ ఆ పాత్రలను ప్రవేశ పెడుతూ ఉంటారు. రెండవ రకం పాత్రలలో రచయితలే ఆ స్వరూప స్వభావాలను ఎక్కడా వర్ణించకుండా పాఠకులే వాటి స్వరూప స్వభావాలను తెలుసుకునేలా సంభాషణల ద్వారా లేదా పాత్రలు నడిచిన తీరుతెన్నుల ద్వారా అవగాహన చేసుకునేటట్లుగా చేస్తారు. మూడో రకం పాత్రలు ఈ రెండు స్వభావాలను మిళితం చేసుకుని రూపొందుతూ ఉంటాయి. మొదటి రకం పాత్రలు ఎక్కువగా విశ్వనాథ సత్యనారాయణ నవల లో కనిపిస్తాయి. రెండవ రకం పాత్రలు నవలలో ముఖ్యంగా చిలుకూరి దేవపుత్ర రాసిన నవలలో ఒక కనిపిస్తాయి. మూడో రకం పాత్రలు ఇంచుమించు అందరూ రచనల్లోనూ సహజం గా కనిపిస్తూ ఉంటాయి. 
పాత్రల గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తాను. అంటరాని వసంతం లో భూదేవి పాత్ర గురించి చదువుతున్నప్పుడు అటువంటి ఒక అత్తగారు లేదా మేనత్త ఒకరు మనకు కూడా ఉంటే బాగుంటుందనిపిస్తుంది. ఆమెకు దళితుల ఆడపడుచులల్లో కనిపించే తెగువ, ఆదరించే గుణం ఆ ప్రేమానురాగాలు పాఠకులను గుర్తుంచుకొనేలా చేస్తాయి. కళ్యాణ్ రావు గారు అంటరాని వసంతంలో మాలల సంస్కృతిని ప్రధాన కేంద్రంగా వర్ణించినా, మాలలు మాదిగలు క్రైస్తవీకరణ పొందిన విధానం దాంట్లో కనిపిస్తుంది. దీనిలో భూదేవి పాత్ర జాజుల గౌరి నవలలో నీలమ్మలో పరిపూర్ణం పొందినట్లనిపిస్తుంది. అలాగే ఎజ్రా శాస్త్రి గారు రాసిన మా ఎర్ర ఓబన్నపల్లి లో ముత్యాల పాత్ర కూడా ఒక మరిచిపోలేని పాత్ర.  చిలుకూరి దేవపుత్ర రాసిన అద్దంలో చందమామ నవలలో చిన్నోడు పాత్ర ఆ తర్వాత తల్లి పాత్ర మరిచిపోలేని పాత్రలు. చిన్నోడు భార్య తన సుఖసంతోషాల కోసం అతన్ని వదిలేసి తన అమ్మగారింటికి వెళ్లి పోతుంది. అక్కడ ఒక అతను ఆమెను మాయమాటలు చెప్పి వేశ్యా గృహానికి అమ్మేస్తాడు. కొనుక్కోవడానికి చిన్నోడు ఒకరోజు పట్టణానికి వెళ్తాడు. అక్కడ ఒక రిక్షావాడి మాటల వల్ల వేశ్యా గృహానికి వెళడతాడు. ఆ వేశ్య గృహంలో తన భార్యను చూసి గుండె తరుక్కుపోయినంతపని అవుతుంది. ఆమె మరలా తన ఇంటికి తీసుకువస్తాడు. ఆమెని మరల ఆ కుటుంబం ముఖ్యంగా చంద్రుడు తల్లి అంటే లక్ష్యములు అత్తగారు ఎలాంటి కల్మషం లేకుండా ఆమెను మరలా దగ్గరకు చేర్చుకుని ఆదరిస్తుంది. ఈ పాత్రలను మనం మర్చిపోలేం. చిలుకూరి దేవపుత్ర అద్దంలో చందమామ రాసిన పది సంవత్సరాలకు కు పంచమం అనే నవల రాశారు. దానిలో ప్రధాన కథానాయకుడు ఒక మాదిగ కులానికి చెందిన శివయ్య ఎంతో కష్టపడి చదివి గ్రూప్ వన్ ఆఫీసర్ అవుతాడు. కానీ నిజాయితీగా పని చేసినా రాజకీయ అండదండలు లేక తన ఉద్యోగం కోల్పోతాడు. ఉప ముఖ్యమంత్రిగా మాదిగ కులానికి చెందిన వ్యక్తి ఉన్నప్పటికీ తన పదవిని కాపాడుకోలేక పోతాడు. దళితులు చైతన్యవంతం కాకుండా వారికి రాజ్యాధికారం వచ్చినప్పటికీ దాన్ని నిలుపుకోవడం ఎంత కష్టమో ఈ నవలలో చిలుకూరి దేవపుత్ర వాస్తవికంగా వివరించారు. దీనిలో శివయ్య ఎదగడానికి దళితుడైన పురుషోత్తం పాత్ర మనం మరిచిపోలేని పాత్ర. ఇలా దళిత నవలలో చిరస్మరణీయమైనటువంటి కొన్ని పాత్రలు ఉన్నాయి. ఇవన్నీ తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేశాయి. ఈ రచనలు, ఈ రచనల్లో ఉన్న ఈ పాత్రల సృష్టి తెలుగు నవలా సాహిత్యానికి కొత్త శక్తినిచ్చిందని చెప్పవచ్చు. 
( ఢిల్లీ విశ్వవిద్యాలయం వారు 30.9. 20 20 వ తేదీన నిర్వహించిన అంతర్జాతీయ అంతర్జాల సదస్సు లో ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు మాట్లాడిన ప్రసంగం లోని ముఖ్య విషయాలు.   ఈ సదస్సు నిర్వహించిన సంచాలకులు ఢిల్లీ విశ్వవిద్యాలయం అధ్యాపకులు డాక్టర్ వి వెంకట్రామయ్య గారికి ప్రత్యేక ధన్యవాదాలు)

దళితనవలల్లో మరిచిపోలేనిపాత్రలు (ఆచార్య దార్ల 30.9.2020 ప్రసంగం)

https://youtu.be/yowJwdsS2bM


ఒక రచనలో చిత్రమైన వ్యక్తుల మానసిక చిత్రణను మనం సాధారణంగా పాత్ర చిత్రణ అంటాం.
ఆ పాత్రల్ని కథ నడిపించే కథారచయిత ఒక సమాజానికి ప్రాతినిథ్యం వహించేటట్లు పాత్రలను సృష్టిస్తాడు. 
పాత్ర లేకుండా  కథ గానీ, నవల గానీ ఉండదు. అయితే వాటిలో శాశ్వతమైన ప్రభావాన్ని వేయగలిగినట్లుగా ఆ పాత్రను తీర్చిదిద్దారా? లేదా అనేదే ముఖ్యం. అలా ప్రభావం చూపిన కొన్ని పాత్రలు మన తెలుగు నవలల్లో ఉన్నాయి.
అసమర్థుని జీవ యాత్రలో సీతారామారావు, చివరికి మిగిలేది లో దయానిధి , అంపశయ్య లో రవి మొదలైన పాత్రలు పేర్కొనబడినది.చలం నవలల్లో రాజేశ్వరి, అమీర్, మీరా , అమీనా...కేశవరెడ్డి అతడు అడవిని జయించాడు లో ముసలివాడు, మునెమ్మ లో మునెమ్మ...
చిలుకూరి దేవపుత్ర...పంచమంలో...శివయ్య, పురుషోత్తం, అందులో చందమామ లో చిన్నోడు...
ఈ పాత్రలో ప్రధాన పాత్ర లేదా కథానాయకుడు, కథానాయిక, ప్రతినాయకుడు తర్వాత సహాయక పాత్రలు అనేవి సర్వసాధారణంగా ఉంటాయి. మన విమర్శకులు పాత్రలను ఇంగ్లీషులో  ఫ్లాట్ క్యారెక్టర్స్ అనీ, అంటే మార్పు లేని పాత్రలు,  రౌండ్ క్యారెక్టర్స్ అంటే మార్పు చెందే పాత్రలు అని ప్రధానంగా రెండు రకాలుగా విభజించారు. ఈ పాత్రలను మనం జాగ్రత్తగా గమనిస్తే ఆ పాత్రల స్వరూప స్వభావాలు వచ్చినటువంటి మార్పులను బట్టి ఈ లక్షణాలను గుర్తించారు. నిజానికి పాత్ర అనేది రచయిత ఆలోచనా విధానం లేదా రచయిత చెప్పదలచుకున్న  భావజాలాన్ని బట్టి రూపొందుతుందని అహమనం పాత్రల రూపకల్పనను బట్టి చెప్పవచ్చు. అందుకని  పద్యంలో కనిపించే పాత్రలన మూడు రకాలుగా విభజించుకునే అవకాశం ఉంది. మొదటి రకం పాత్రలలలో రచయితలే ఆ పాత్రల స్వరూప స్వభావాలు వర్ణిస్తూ ఆ పాత్రలను ప్రవేశ పెడుతూ ఉంటారు. రెండవ రకం పాత్రలలో రచయితలే ఆ స్వరూప స్వభావాలను ఎక్కడా వర్ణించకుండా పాఠకులే వాటి స్వరూప స్వభావాలను తెలుసుకునేలా సంభాషణల ద్వారా లేదా పాత్రలు నడిచిన తీరుతెన్నుల ద్వారా అవగాహన చేసుకునేటట్లుగా చేస్తారు. మూడో రకం పాత్రలు ఈ రెండు స్వభావాలను మిళితం చేసుకుని రూపొందుతూ ఉంటాయి. మొదటి రకం పాత్రలు ఎక్కువగా విశ్వనాథ సత్యనారాయణ నవల లో కనిపిస్తాయి. రెండవ రకం పాత్రలు నవలలో ముఖ్యంగా చిలుకూరి దేవపుత్ర రాసిన నవలలో ఒక కనిపిస్తాయి. మూడో రకం పాత్రలు ఇంచుమించు అందరూ రచనల్లోనూ సహజం గా కనిపిస్తూ ఉంటాయి. 
పాత్రల గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తాను. అంటరాని వసంతం లో భూదేవి పాత్ర గురించి చదువుతున్నప్పుడు అటువంటి ఒక అత్తగారు లేదా మేనత్త ఒకరు మనకు కూడా ఉంటే బాగుంటుందనిపిస్తుంది. ఆమెకు దళితుల ఆడపడుచులల్లో కనిపించే తెగువ, ఆదరించే గుణం ఆ ప్రేమానురాగాలు పాఠకులను గుర్తుంచుకొనేలా చేస్తాయి. కళ్యాణ్ రావు గారు అంటరాని వసంతంలో మాలల సంస్కృతిని ప్రధాన కేంద్రంగా వర్ణించినా, మాలలు మాదిగలు క్రైస్తవీకరణ పొందిన విధానం దాంట్లో కనిపిస్తుంది. దీనిలో భూదేవి పాత్ర జాజుల గౌరి నవలలో నీలమ్మలో పరిపూర్ణం పొందినట్లనిపిస్తుంది. అలాగే ఎజ్రా శాస్త్రి గారు రాసిన మా ఎర్ర ఓబన్నపల్లి లో ముత్యాల పాత్ర కూడా ఒక మరిచిపోలేని పాత్ర.  చిలుకూరి దేవపుత్ర రాసిన అద్దంలో చందమామ నవలలో చిన్నోడు పాత్ర ఆ తర్వాత తల్లి పాత్ర మరిచిపోలేని పాత్రలు. చిన్నోడు భార్య తన సుఖసంతోషాల కోసం అతన్ని వదిలేసి తన అమ్మగారింటికి వెళ్లి పోతుంది. అక్కడ ఒక అతను ఆమెను మాయమాటలు చెప్పి వేశ్యా గృహానికి అమ్మేస్తాడు. కొనుక్కోవడానికి చిన్నోడు ఒకరోజు పట్టణానికి వెళ్తాడు. అక్కడ ఒక రిక్షావాడి మాటల వల్ల వేశ్యా గృహానికి వెళడతాడు. ఆ వేశ్య గృహంలో తన భార్యను చూసి గుండె తరుక్కుపోయినంతపని అవుతుంది. ఆమె మరలా తన ఇంటికి తీసుకువస్తాడు. ఆమెని మరల ఆ కుటుంబం ముఖ్యంగా చంద్రుడు తల్లి అంటే లక్ష్యములు అత్తగారు ఎలాంటి కల్మషం లేకుండా ఆమెను మరలా దగ్గరకు చేర్చుకుని ఆదరిస్తుంది. ఈ పాత్రలను మనం మర్చిపోలేం. చిలుకూరి దేవపుత్ర అద్దంలో చందమామ రాసిన పది సంవత్సరాలకు కు పంచమం అనే నవల రాశారు. దానిలో ప్రధాన కథానాయకుడు ఒక మాదిగ కులానికి చెందిన శివయ్య ఎంతో కష్టపడి చదివి గ్రూప్ వన్ ఆఫీసర్ అవుతాడు. కానీ నిజాయితీగా పని చేసినా రాజకీయ అండదండలు లేక తన ఉద్యోగం కోల్పోతాడు. ఉప ముఖ్యమంత్రిగా మాదిగ కులానికి చెందిన వ్యక్తి ఉన్నప్పటికీ తన పదవిని కాపాడుకోలేక పోతాడు. దళితులు చైతన్యవంతం కాకుండా వారికి రాజ్యాధికారం వచ్చినప్పటికీ దాన్ని నిలుపుకోవడం ఎంత కష్టమో ఈ నవలలో చిలుకూరి దేవపుత్ర వాస్తవికంగా వివరించారు. దీనిలో శివయ్య ఎదగడానికి దళితుడైన పురుషోత్తం పాత్ర మనం మరిచిపోలేని పాత్ర. ఇలా దళిత నవలలో చిరస్మరణీయమైనటువంటి కొన్ని పాత్రలు ఉన్నాయి. ఇవన్నీ తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేశాయి. ఈ రచనలు, ఈ రచనల్లో ఉన్న ఈ పాత్రల సృష్టి తెలుగు నవలా సాహిత్యానికి కొత్త శక్తినిచ్చిందని చెప్పవచ్చు. 
( ఢిల్లీ విశ్వవిద్యాలయం వారు 30.9. 20 20 వ తేదీన నిర్వహించిన అంతర్జాతీయ అంతర్జాల సదస్సు లో ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు మాట్లాడిన ప్రసంగం లోని ముఖ్య విషయాలు.   ఈ సదస్సు నిర్వహించిన సంచాలకులు ఢిల్లీ విశ్వవిద్యాలయం అధ్యాపకులు డాక్టర్ వి వెంకట్రామయ్య గారికి ప్రత్యేక ధన్యవాదాలు)